Monday, January 31, 2011

ఈజిప్టు నుంచి స్వదేశానికి భారతీయులు

ముంబై:,జనవరి 31 :  ఈజిప్టు నుంచి 300 మంది భారతీయులతో బయలుదేరిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం సోమవారం మధ్యాహ్నం ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. ఈజిప్టు దేశాధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఈజిప్టులో నివసిస్తున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రత్యేక విమానం ద్వారా ముందుగా 300 మందిని ఇక్కడకు తరలించింది.

మకరజ్యోతి మానవ సృష్టే !

తిరువనంతపురం,జనవరి 31 : శబరిమలలోని మకరజ్యోతి అంశంపై జరుగుతున్న చర్చలకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెరదించింది. మకరజ్యోతి మానవ సృష్టే అని, అయితే దీని వెనుక హిందూ విశ్వాసాలున్నాయని స్పష్టంచేసింది. ‘పొన్నబలమేడు వద్ద మనుషులు కాగడా పట్టుకొని ఉంటారన్న విషయం చాలామందికి తెలిసిoదేనని,  దీన్ని టీడీబీ కూడా గుర్తించిందని  బోర్డు అధ్యక్షుడు ఎం.రాజగోపాలన్ నాయర్ సోమవారమిక్కడ చెప్పారు. జ్యోతిపై మతపరమైన విశ్వాసాలున్నందున ఇది మానవ సృష్టేనంటూ బోర్డు ప్రచారం చేపట్టదన్నారు.ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 102 మంది మరణించిన నేపథ్యంలో మకరజ్యోతి మానవ సృష్టా లేక ఖగోళ అద్భుతమో స్పష్టం చేయాలని కేరళ హైకోర్టు టీడీబీని ఆదేశించడం తెలిసిందే. పూజలు, నిర్మాణం తదితర అంశాలపై బోర్డు సోమవారం సమావేశం నిర్వహించింది.    

' కిక్కు ' మరింత ప్రియం !

హైదరాబాద్,జనవరి 31: ఎక్సైజ్ సుంకం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీర్లు, దేశీయ మద్యంపై  సుంకం పెంచింది.దేశంలో తయారయ్యే చీఫ్ లిక్కర్'పై కూడా సుంకాన్ని పెంచారు. ఛీప్ లిక్కర్ క్వార్టర్ మూడు రూపాయల నుంచి అయిదు రూపాయలు, బీరు బాటిల్ అయిదు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు పెరగనున్నాయి. ఈ సుంకం పెంచినందున ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేశ్ ?

హైదరాబాద్,జనవరి  31: తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం ఊపందుకుంది.  ఇప్పటి వరకు ఆయన తెర వెనకే ఉంటూ వచ్చారు. ఇక ముందు తండ్రి వారసునిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆదివారం నాటి అవినీతి వ్యతిరేక ర్యాలీలో లోకేష్ ఆద్యంతం చురుగ్గా పాల్గొనడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఈ ర్యాలీ రాజకీయాలకు అతీతమని చంద్రబాబు  ప్రకటించినప్పటికీ,  గతం లో ఇలాంటి ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనని లోకేష్ ఆదివారం తెరముందుకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. లోకేష్ కొద్ది కాలంగా హెరిటేజ్ బాధ్యతలకే పరిమితమవుతూ వచ్చారు. తన తండ్రి నియోజకవర్గమైన కుప్పం వ్యవహారాలను మాత్రం అప్పుడప్పుడు పట్టించుకునేవారు.ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణుల సమన్వయానికే ఆయన పాత్ర పరిమితమయ్యేది. రైతు సమస్యల పరిష్కారానికి కొద్దిరోజుల కిందట చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష వేదికపై లోకేష్ బహిరంగంగా కనిపించారు. తండ్రి అరెస్టును తీవ్రంగా ప్రతిఘటించారు. అంతకుమించి రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు. 

కెసిఆర్‌ ' సిగ్గు మాలిన ' వ్యాఖ్యలపై కేసు

న్యూఢిల్లీ,జనవరి 31:  తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల సీమాంధ్ర ప్రజలపై చేసిన  వ్యాఖ్యలపై అడుసుమిల్లి జయప్రకాశ్ సుప్రీంకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీమాంధ్రులకు సిగ్గు లేదన్న వ్యాఖ్యలపై ఆయన పిటిషన్ వేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. చట్ట వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయనను శిక్షించాలన్నారు. కాగా కృష్ణా జిల్లాలో మరో న్యాయవాది కెసిఆర్‌పై మచిలీపట్టణం కోర్టులో కేసు వేశారు.   ఆయనపై 503ఏ, 503బి, 506 తదితర సెక్షన్‌లపై కేసు వేసినట్టుగా తెలుస్తోంది.

జగన్ వర్గానికి చెక్...చిరు కు కాంగ్రెస్ గొడుగు...!

* సోనియా  దూతగా చిరుతో ఆంటోనీ మంతనాలు
* ఢిల్లీకి  ఆహ్వానం
* రాష్ట్రంలో 4 మంత్రిపదవుల ఎర
* అరవింద్ కు రాజ్యసభ సీటు
* చిరు కు కూడా కెంద్రమంత్రి పదవి 
హైదరాబాద్,జనవరి 31: :బడ్జెట్ సమావేశాల కంటే ముందే రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రజారాజ్యం పార్టీని భాగస్వామి చేయడం పై కాంగ్రెస్ అథిస్టానం దౄష్టి పెట్టింది. సోనియా  దూతగా హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ  పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ను వెంటబెట్టుకుని నేరుగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇంటికి వెళ్ళి ఈ విషయం చర్చించినట్టు సమాచారం. చిరంజీవితో ఏకే ఆంటోని సుమారు గంటన్నర సేపు సమావేశమయ్యారు.  ముక్యంగా జగన్ వర్గం బెదిరింపులకు చెక్ పెట్టడానికే పి.ఆర్.పి. ని క్యాబినెట్‌లోకి ఆకర్షించాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా, చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించడానికే రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ హైదరాబాదు వచ్చారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చెప్పారు. సోనియాను కలవాలని ఆంటోనీ చిరంజీవికి చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆంటోనీ, చిరంజీవి భేటీలో రహస్యమేమీ లేదని ఆయన అన్నారు. మంత్రివర్గంలో చేరే విషయంపై చర్చ జరగలేదని, రెండు పార్టీలు కలిసి పనిచేయాలని అనుకున్నామని ఆయన చెప్పారు.సోనియా ఆహ్వానం మేరకు చిరంజీవి త్వరలోనే న్యూఢిల్లీకి వెళ్లనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీ, పీఆర్పీల మధ్య స్నేహం బలపడటానికి ఏఐసీసీ ప్రతినిధిగా చర్చలు జరిపానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని  మీడియాకు తెలిపారు.  చర్చల కోసం చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వనించామని తెలిపారు. మరోవైపు జగన్ వర్గానికి చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులపై వేటు వేసి ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురైదుగురు శానససభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేర్చుకునే  అవకాశాలున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. సి. రామచంద్రయ్య కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.

Sunday, January 30, 2011

వన్డే సిరీస్ అసీస్ కైవశం

బ్రిస్బేన్ ,జనవరి 30:  ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ ను   ఆస్ట్రేలియా గెలిచింది. ఇక్కడ జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 45.3 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది.  ఇరుజట్ల మధ్య ఆరో వన్డే బుధవారం సిడ్నీలో జరుగుతుంది. 

అదుపు తప్పిన ఈజిప్ట్

కైరో,జనవరి 30: ఈజిప్ట్ లో  దేశాధ్యక్షుడు హోస్నీ ముబారక్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా  చెలరేగిన  ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. సైన్యాధికారులు కూడా తమ యూనిఫాంలను త్యజించి ఉద్యమమార్గం పట్టారు. న్యాయాధిపతులు సైతం ముబారక్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. మరోవైపు, దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా తీసుకున్న ఆరాచకశక్తులు  గృహ దహనాలకు, బ్యాంకులు, స్వర్ణాభరణాల షాపులు, దుకాణ సముదాయాల లూటీలకు తెగబడ్డారు. 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కైరోలో ఉంటున్న భారత సంతతికి చెందిన వారిని భారతదేశానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనేకమంది భారత సంతతికి చెందినవారు విమానాశ్రయాలలో చిక్కుకున్నారు. పిరమిడ్ల సందర్శనకు వచ్చిన పర్యాటకులు కూడా  ఇబ్బందులు పడుతున్నారు

మంత్రి డీకే అరుణ హత్యకు కుట్ర !

హైదరాబాద్,జనవరి 30: రాష్ట్ర సమాచార శాఖా మంత్రి డీకే అరుణ హత్యకు కుట్ర జరిగింది. మంత్రి వెళ్లే దారిలో దుండగులు డిటోనేటర్లు అమర్చారు. అయితే మంత్రి సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మంత్రి డీకే అరుణకు కాల్ వచ్చింది. మహబూబ్‌నగర్ ఐజా వద్ద మిమ్మల్ని టార్గెట్ చేస్తారంటూ మంత్రి అరుణకు బెదిరింపు కాల్ రావడంతో మంత్రి వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంత్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఐజా వద్ద శనివారం రాత్రి పేలుడు పదార్థాలను గుర్తించి బాంబ్ స్క్వాడ్ తొలగించింది. అనంతరం జరిపిన విచారణలో కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి నుంచి కాయిన్ బాక్స్ ద్వారా  మంత్రికి ఫోన్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా దుండగులు అమర్చిన పేలుడు పదార్థాలతో ప్రమాదం లేదని ఎస్పీ తెలిపారు.

మహాత్మా...మనసా స్మరామి...

                        గాంధీజీ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లో అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి
                                                               ముఖ్యమంత్రి తదితరుల నివాళి 

ఫిలింఫేర్ అవార్డులు : ఉత్తమ చిత్రం ‘దబంగ్’

ఉత్తమ నటుడిగా షారుఖ్, ఉత్తమ నటిగా కాజోల్ 
 ‘దబంగ్’ లో  సల్మాన్ ఖాన్ 
ముంబై:,జనవరి 30:     సల్మాన్ ఖాన్ నటించిన ‘దబంగ్’ ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు సాధించింది. ‘మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన కరణ్ జోహార్ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, కాజోల్ ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. 56వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం రాత్రి ఇక్కడ జరిగింది. '‘వియార్ ఫ్యామిలీ' ’ చిత్రంలో నటనకు కరీనా కపూర్ ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది. ఆమె బాబాయి రిషి కపూర్ ‘దో దూనీ చార్’లో నటనకు ఉత్తమ నటుడిగా విమర్శకుల అవార్డు అందుకున్నారు. ‘ఉదాన్’లో నటనకు రోనిత్ రాయ్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు అందుకున్నారు. ‘ఇష్కియా’లో నటనకు విద్యా బాలన్ ఉత్తమ నటిగా విమర్శకుల అవార్డు పొందారు. ‘దబంగ్’ సంగీత దర్శకుడు సాజిద్ వాజిద్‌కు ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు, ‘తీస్ మార్ ఖాన్’లోని ‘షీలా కీ జవాన్’ పాటకు నృత్యం సమకూర్చిన ఫరా ఖాన్‌కు ఉత్తమ నృత్యదర్శకురాలి అవార్డు లభించాయి.‘ఉదాన్’ చిత్రానికి సంగీతం సమకూర్చిన అమిత్ త్రివేదీకి ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలో అవార్డు దక్కింది. సీనియర్ గేయరచయిత గుల్జార్‌కు ‘ఇష్కియా’లోని ‘ఇబ్న్ ఏ బటూటా’ పాటకు ఉత్తమ గీతరచయితగా అవార్డు లభించింది. ఉత్తమ నూతన నటిగా ‘దబంగ్’లో నటించిన సోనాక్షీ సిన్హా, ఉత్తమ నూతన నటుడుగా ‘బ్యాంగ్ బాజా బారాత్’లో నటనకు రణ్‌వీర్ సింగ్ ఎంపికయ్యారు. ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డును అందుకునేందుకు ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్ మధ్యప్రదేశ్ నుంచి ముంబై వచ్చారు. ఆయన నటిస్తున్న ‘ఆరక్షణ్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం భోపాల్‌లో కొనసాగుతోంది. సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌కు కూడా ప్రత్యేక అవార్డు దక్కింది. ‘దాదా ఫాల్కే’ అవార్డు గ్రహీత, సీనియర్ గాయకుడు మన్నాడేకు జీవితకాల సాఫల్య సత్కారం లభించింది. 

మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ లో జగన్ ‌!

న్యూఢిల్లీ,జనవరి 30:  దేశంలో అత్యంత శక్తిమంతులైన మొదటి 20 మంది వ్యక్తుల్లో  కడప మాజీ ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒకరిగా నిలిచారు. జాతీయ పత్రికల్లో ఒకటైన ఇండియన్  ఎక్స్ ప్రెస్ ప్రతి ఏటా దేశవ్యాప్తంగా భిన్న రంగాలను పరిశీలించి ‘ది మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్’ జాబితాను ప్రత్యేక సంచికగా రూపొందించి పాఠకులకు అందజేస్తోంది. ఈ ఏడాది రూపొందించిన జాబితాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం నాటి సంచికతోపాటు వెలువరించింది. ఈ వంద మంది మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ లో  జగన్‌ను 20వ స్థానంలో నిలిపింది. ఈ జాబితాలో.. ప్రథమ స్థానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా సొంతం చేసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (2), ప్రధాని మన్మోహన్ (3), ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ (4), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ (5) ఉన్నారు. వారి తర్వాత 15 స్థానాల్లో రాష్ట్రం నుంచి ఇద్దరు శక్తిమంతమైన వ్యక్తులుగా.. 11వ స్థానంలో ఆర్‌బీఐ గవర్నర్ డి.సుబ్బారావు, 20వ స్థానంలో వై.ఎస్.జగన్ ఉన్నారు. మొత్తంగా చూస్తే టాప్ ట్వంటీలో రాష్ట్ర రాజకీయాల నుంచి జగన్ ఒక్కరే ఉండటం గమనార్హం. మొత్తం వంద మంది మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాను పరిశీలిస్తే రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు రాజకీయ రంగం నుంచి, ఒకరు పాలనారంగం నుంచి, ఒకరు ఆర్థిక రంగం నుంచి, ఒకరు కార్పొరేట్ రంగం నుంచి.. వెరసి ఆరుగురే ఉన్నారు. రాజకీయ రంగం నుంచి జగన్ కాకుండా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 28వ స్థానంలో, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి 40వ స్థానంలో శక్తిమంతులైన వ్యక్తులుగా ఉన్నారు. పాలనా రంగం నుంచి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ 58వ స్థానంలో ఉన్నారు. ఆర్థిక రంగం నుంచి ఆర్‌బీఐ గవర్నర్ సుబ్బారావు 11వ స్థానంలో, కార్పొరేట్ రంగం నుంచి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు 49వ స్థానంలో నిలిచారు. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్: జోకోవిక్ కు పురుషుల టైటిల్

మెల్‌బోర్న్,జనవరి 30: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల ఛాంపియన్‌ను  సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిక్ గెలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్ కు చెందిన  ఆండీ ముర్రేపై జోకోవిక్ విజయం సాధించారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 6-2, 6-3 తేడాతో ముర్రేను జోకోవిక్ ఓడించాడు.  ఈ సంవత్సరం కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ముర్రేకు చక్కెదురైంది. 

Saturday, January 29, 2011

మే 8న ఎంసెట్

హైదరాబాద్,జనవరి 29:   ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్, డెంటల్, అగ్రికల్చర్ తదితర కోర్సులకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్-2011 మే 8వ తేదీన జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 10వ తేదీన పత్రికల్లో ప్రచురితమవుతుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి దరఖాస్తుల విక్రయం, స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఆలస్య రుసుము లేకుండా మార్చి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పోస్టాఫీసులు, ఆంధ్రా బ్యాంక్ బ్రాంచీలు, ఈ-సేవాకేంద్రాల్లో విక్రయిస్తారు.

ఉద్యమ పార్టీకి ఉనికేది !?

ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి  నాయకత్వం వహిస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పట్టు  తక్కువే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో కలుపుకుంటే తెలంగాణాలో పది జిల్లాలు ఉన్నాయి. అయితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గత దశాబ్దకాలంగా పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి  కేవలం మూడంటే.. మూడు జిల్లాల్లోనే చ్ప్పుకోదగ్గ  పట్టుంది. అదికూడా జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాల్లోనే ఈ పట్టు ఉండటం గమనార్హం. వీటిలో కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలను మాత్రమే చెప్పుకోవచ్చు. మిగిలిన జిల్లాల్లో ఈ పర్టీ గులాబీల ప్రభావం అంతంతమాత్రమే. పార్టీ  అధినేత కేసీఆర్ సొంత జిల్లాగా పేరొందిన కరీంనగర్‌లో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే తెరాసకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాలోని మిగిలిన సెగ్మెంట్‌లలో తెరాస ఉన్నా లేనట్టుగానే ఉంది. ఇక. ఆదిలాబాద్‌లో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉండగా, మూడింటికి మాత్రమే తెరాస ప్రాతినిథ్యం వహిస్తోంది. వరంగల్‌ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం ఒకే ఒక స్థానాన్ని కలిగివున్న తెరాస నిజామాబాద్ జిల్లాలోకూడా  ఒక స్థానాన్నే కలిగివుంది. ఇక మిగిలిన జిల్లాలకొస్తే  నల్గొండ జిల్లాల్లో 12 సీట్లుండగా, ఒక్కదానిలో కూడా తెరాస గెలవలేక పోయింది. మెదక్ పది ఉంటే ఒక స్థానం( -సీపేట-లో  గెలుపొందింది. తెలంగాణలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా చెప్పుకునే మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబీ సెగ్మెంట్లు ఉండగా తెరాసకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.  ఇక ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిస్థితిని సమీక్షిస్తే.. కనీసం ఎమ్మెల్యేలు కాదు కదా కనీసం మద్దతుదారులు కూడా లేకపోవడం గమనార్హం. తెరాస ఆవిర్భవించిన తర్వాత స్థానిక సంస్థల్లో మినహా సార్వత్రి క ఎన్నికల్లో ఒంటరిగా ఒక్కసారి కూడా పోటీ చేయలేదు, 2004లో కాంగ్రెస్ పార్టీతోనూ, 2009లో మహాకూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఈ పొత్తుల్లో భాగంగా 2004లోనే తెరాస 26 అసెంబ్లీ సీట్లను గెలుచుకోగా, 2009లో తెదేపా, సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ.. కేవలం పది స్థానాలకే పరిమితమైంది.  హైదరాబాద్ తమ సొత్తని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం సాహసం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న బలం, బలగాన్ని సులభంగానే  అంచనా వేయవచ్చు. 

సూరి హత్య కేసు: భాను ఇంకా పట్టుబడలేదు: పోలీసు కమిషనర్

హైదరాబాద్,జనవరి 29: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నలుగురు నిందితులను హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. భాను కిరణ్ గన్‌మన్ మన్మోహన్ సింగ్‌తో పాటు సుబ్బయ, ఆవుల వెంకటరమణ, బోయ వెంకట హరిబాబు అనే వ్యక్తులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అని, అతను పరారీలో ఉన్నాడని ఖాన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సూరిని భానుయే కాల్చి చంపాడని ఆయన చెప్పారు. భాను కోసం మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు.  ఆర్థిక లావాదేవీలు, భూ దందాలు, స్పర్థలు సూరి హత్యకు కారణమని అర్థమవుతోందని, భాను దొరికితే మరేదైనా కోణం వెలుగు చూస్తుందేమో చెప్పలేమని ఆయన అన్నారు. నిందితుల నుంచి సిమ్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సూరి హత్య కేసులో 30 మందిని విచారించామని, కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించామని ఆయన చెప్పారు. భాను, తదితరుల పేర్ల మీద 100కు పైగా ఆస్తులున్నాయని, భాను పేరు మీద 9 ఆస్తులున్నాయని ఆయన అన్నారు. వాటి నిగ్గు తేల్చడానికి సంబంధిత శాఖలకు, సంస్థలకు బాధ్యత  అప్పగించామని ఆయన చెప్పారు.

క్లియ్‌స్టర్స్ కు మహిళల సింగిల్స్ టైటిల్‌

మెల్‌బోర్న్,జనవరి 29: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళల  సింగిల్స్ టైటిల్‌ను బెల్జియంకు చెందిన  కిమ్ క్లియ్‌స్టర్స్ కైవసం చేసుకుంది. శనివారమిక్కడ జరిగిన ఫైనల్స్ లో  చైనాకు చెందిన లీ నాపై 3-6, 3-6, 3-6 తేడాతో గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనున్న లీ నా ఆశలపై క్లియ్‌స్టర్ నీళ్లు చల్లింది. వరుస సెట్లతో ఓడించి కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను క్లియ్‌స్టర్ సాధించింది.
ఫైనల్లో ఓడిన పేస్, భూపతి జోడి
 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ సిరీస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన లియాండర్ పేస్, మహేష్ భూపతి జోడి పరాజయం పాలయింది. బయాన్ బ్రదర్స్ చేతిలో 3-6, 4-6 తేడాతో పేస్, భూపతి జంట ఓడిపోయింది. 

Friday, January 28, 2011

ఈజిప్ట్ లో అశాంతి



కైరో,జనవరి 28: రాజకీయ, ఆర్ధిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ, ఈజిప్ట్ లో నిరసనలు వెల్లువెత్తాయి. కైరో, అలెగ్జాండ్రియా, సూయెజ్ మొదలైన చోట్ల ప్రదర్శకులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళన వల్ల ఇంటర్నెట్,మొబైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. అశాంతిని అణచివేయడానికి ప్రభుత్వం సుమారు 900  మందిని అరెస్ట్ చేసింది. 


                                                 గీతా ఆర్ట్స్ కొత్త చిత్రం లో నాగచైతన్య, తమన్నా

ఇండియాకు యాపిల్ ఐప్యాడ్

న్యూఢి ల్లీ,జనవరి 28: :యాపిల్ ఐప్యాడ్ ట్యాబ్లెట్ పీసీ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. శుక్రవారం దీన్ని దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్స్‌లో ఆరు వెర్షన్లలో ఐప్యాడ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 16జీబీ, 32జీబీ, 64జీబీ వెర్షన్స్ ఉంటాయి.ఐప్యాడ్ ప్రారంభ రేటు రూ.27,900 (వైఫై, 16జీబీ) కాగా గరిష్ట రేటు రూ.44,900 (వైఫై+3జీ+64జీబీ) ఉంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఐప్యాడ్ కోసం ప్రత్యేకంగా 3జీ ప్లాన్స్ను ప్రకటించింది. దీని ప్రకారం టారిఫ్‌లు రూ.99 (అన్‌లిమిటెడ్ డైలీ యూసేజ్), రూ. 599 (నెలకు 6జీబీ ఉచితం), రూ.999 (అన్‌లిమిటెడ్ మంత్లీ యూసేజ్) ఉంటాయి. ల్యాప్‌టాప్ లేదా నెట్‌బుక్ కన్నా కూడా సన్నగా, తేలికగా ఉండే ఐప్యాడ్‌లో 9.7 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. వైఫై నెట్ సర్ఫింగ్ చేయడానికి బ్యాటరీ 10 గంటల దాకా పనిచేస్తుంది. అదే 3జీ డేటా నెట్‌వర్క్‌లోనైతే 9 గంటల దాకా బ్యాటరీ పనిచేస్తుంది. ఇందులో మల్టీ టచ్ యూజర్ ఇంటర్‌ఫేస్, వెబ్ బ్రౌజింగ్, ఈ మెయిల్స్, ఫోటో షేరింగ్స్, హైడెఫినెషన్ వీడియోస్, మ్యూజిక్, గేమ్స్, ఈ-బుక్స్ వంటి ఎన్నో సదుపాయులు ఇందులో ఉన్నాయి. 9 నెలల క్రితం అమెరికాలో విడుదలైన ఐప్యాడ్ అతి తక్కువ సమయంలోనే దాదాపు 150 లక్షల ఐప్యాడ్‌లు అమ్ముడై రికార్డు సృష్టించాయి. 

ఈ ఏడాదికి హెచ్-1బీ వీసాలు అయిపోయాయి !

వాషింగ్టన్, జనవరి 28:    విదేశీ ఉద్యోగులకు అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాలు ఈ ఏడాదికి ఇక నిండుకున్నాయి. 2011 సంవత్సరానికి గానూ నిర్దేశించిన పరిమితి (65,000)కి మించి వీసా దరఖాస్తులు అందినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సీఐసీ) శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కనక జనవరి 26 తర్వాత అమెరికాలో ఉద్యోగ నియామకం పొందినవారు వీసా కోసం చేసుకునే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. గత ఏడాది చూస్తే డిసెంబర్ 21 నాటికి గానీ ఈ నిర్దేశిత పరిమితికి తగిన దరఖాస్తులు అందలేదు. ఎట్లాగో దరఖాస్తులు అందినా, వివిధ కారణాల వల్ల కొందరికి వీసాలు మంజూరు చేయలేదు. దీనితో 11,000 హెచ్-1బీ వీసాలు ఇంకా మిగిలేవున్నాయి. అయితే కొత్త ఏడాదికి ఐటీ రంగం పుంజుకుంది. ఫలితంగా నియామకాలు పెరిగి వీసాకు దరఖాస్తులు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. నెల తిరక్కుండానే నిర్దేశిత దరఖాస్తులు నిండుకున్నాయి. ఇకపై ఉద్యోగం పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. జనవరి 26లోపు నియామక పత్రం పొందిన వారు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి సంఖ్య అధికంగా ఉంటే డ్రా ద్వారా అదృష్ట వంతులను ఎంపిక చేస్తారు. 2008లో ఇదేవిధంగా ఏప్రిల్ మాసానికే దరఖాస్తులు నిండుకున్నాయి. అప్పుడు కూడా డ్రా ద్వారానే ఉద్యోగులకు ప్రవేశం కల్పించారు. 

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌: తొమ్మిది మంది నక్సల్స్ మృతి

రాంచి,జనవరి 28:  జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సబ్ జోనల్ కమాండర్ సహా తొమ్మిది మంది నక్సల్స్ మృతి చెందారు. లుహూర్ అటవీ ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల సంయుక్త బృందం అక్కడికి వెళ్ళడంతో  భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది నక్సల్స్ మృతి చెందారని, మృతదేహాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతుల్లో ఒకరిని సబ్ జోనల్ కమాండర్ బసంత్ యాదవ్‌గా గుర్తించామని చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఆరు రైఫిళ్లు, మూడు నాటు తుపాకులు, రూ. 2,800 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

తండ్రి బాటలో జగన్ పాదయాత్ర !

రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు 70 కిలోమీటర్లు... 

హైదరాబాద్,జనవరి 28:  హైదరాబాద్: తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పోలవరం సాధన కోసం జగన్ ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్  వెల్లడించారు. తొలి రోజు ఫిబ్రవరి 7వ తేదీన జగన్ తన యాత్రను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభించి ఆత్రేయపురం, బొబ్బర్లంక మీదుగా కాటన్ బ్యారేజి చేరుకుంటారు. రెండవ రోజు ఫిబ్రవరి 8వ తేదీన జగన్ పాదయాత్ర కాటన్ బ్యారేజి వద్ద ప్రారంభమై కొవ్వూరు మీదుగా వేగేశ్వరపురం చేరుకుంటుంది. రాత్రి వేగేశ్వరంలో ఆయన బస చేస్తారు. మూడోరోజు ఫిబ్రవరి 9 వేగేశ్వరపురంలో ప్రారంభమై పోలవరం చేరుకుంటుంది. 9వ తేదీ సాయంత్రం పోలవరంలో బహిరంగ సభ జరుగుతుంది.

తిరుమల ప్రసాదాల ధరల పెంపు

హైదరాబాద్,జనవరి 28:  తిరుమల స్వామి వారి  ప్రసాదాల ధరలను టీటీడీ భారీగా  పెంచింది.. రూ.25 ఉన్న జిలేబీ ప్రసాదాన్ని రూ.70కి, వడ ప్రసాదాన్ని రూ.4 నుంచి రూ.25కు, మురుకు ప్రసాదాన్ని రూ.4 నుంచి 30 రూపాయలకు పెంచింది. ప్రసాదాల ధరల పెంపులో ఒక్క లడ్డూకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.  ముడి సరుకుల ధరలు పెరిగినందువల్లే ధరల పెంచినట్లు టీటీడీ తెలిపింది.

తెలంగాణ నిరసనలకు భయపడం: ముఖ్యమంత్రి

హైదరాబాద్,జనవరి 28:  తెలంగాణ నిరసనలకు భయపడబోమని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా  తాము కట్టుబడి వుంటామని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సీఎం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. రచ్చబండను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదుల్ని, మహిళలని పోలీసులు బయటకు పంపించారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ముర్రే

మెల్‌బోర్న,జనవరి 28: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల ఫైనల్లో ఆండీ ముర్రే, నొవాక్ డోకోవిక్‌లు తలపడనున్నారు. సెమీఫైనల్లో డేవిడ్ ఫెరర్‌ప్రై ముర్రే 4-6, 7-6, 6-1, 7-6 తేడాతో గెలుపొందాడు. ఫెరర్‌తో  జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయినప్పటికి ముర్రే కోలుకొని వరస సెట్లలో విజయం సాధించాడు. 

Thursday, January 27, 2011

నిత్యానంద ఆశ్రమంలో రంజితకు ప్రధాన శిష్యురాలి హోదా!

చెన్నై,జనవరి 27 : ప్రముఖ నటి రంజితతో లైంగిక చర్యలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆమెకు తన ఆశ్రమంలో ప్రధాన శిష్యురాలి హోదాను కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గురువారం ఓ తమిళ పత్రిక వెల్లడించింది. ఈ విషయాన్ని త్వరలో ఆయనే స్వయంగా ప్రకటించనున్నట్టు పేర్కొంది. నిత్యానంద, రంజితల పడక గది దృశ్యాల సీడీలు వెలుగులోకి రావడంతో గత ఏడాది వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక సీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న రంజిత నెలరోజుల క్రితం బయటకు వచ్చారు. సీఐడీ విచారణకు హాజరైన ఆమె ఆ సీడీలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. మార్ఫింగ్ చేసిన సీడీతో తన పేరుకు కళంకం తెచ్చే రీతిలో కుట్ర పన్నిన లెనిన్ కరుప్పన్‌ను చట్టపరంగా ఎదుర్కొంటానని ప్రకటించారు.ఈ వ్యవహారం కారణంగా నిత్యానందకు రంజిత కాస్త దూరంగానే ఉంటారని అందరూ భావించారు. అయితే నిత్యానంద జన్మదిన వేడుకల్లో పాదపూజ చేస్తూ రంజిత కనిపించడం, రెండు రోజుల క్రితం బెంగళూ రు ఆశ్రమంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. 

ఒబామా ప్రభుత్వంలో మరో ఇద్దరు భారతీయులు

వాషింగ్టన్,జనవరి 27:  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతన ప్రభుత్వంలోని కీలక పదవుల్లో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లను నియమించారు. ‘ప్రివెన్షన్, హెల్త్ ప్రమోషన్ అండ్ ఇంటిగ్రేటివ్ అండ్ పబ్లిక్ హెల్త్’ సలహా సంఘ సభ్యుడిగా వివేక్ మూర్తి అనే ప్రఖ్యాత డాక్టర్‌ను నియమించారు. ప్రభుత్వం తరఫున వాణిజ్య చర్చల్లో పాల్గొనే బృందంలో ప్రధాన వ్యవసాయ రంగ ప్రతినిధి(చీఫ్ అగ్రికల్చరల్ నెగోషియేటర్)గా ఇస్లామ్ ఏ సిద్దిఖీ అనే వ్యవసాయ శాస్తవ్రేత్తను ఒబామా పునర్నియమించారు. ‘వారు తమ నైపుణ్యం, అనుభవాలతో మన దేశానికి ఎంతో సేవచేశారు.. వారితో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా ఒబామా పేర్కొన్నారు. డాక్టర్ వివేక్‌మూర్తి హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. 15 వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు సభ్యులుగా ఉన్న ‘డాక్టర్స్ ఫర్ అమెరికా’ సంస్థ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికాలో మెరుగైన వైద్యారోగ్య వ్యవస్థ రూపకల్పన కోసం ఆ సంస్థ కృషి చేస్తోంది. చీఫ్ అగ్రికల్చరల్ నెగోషియేటర్ పదవితో సిద్దిఖీకి అంబాసిడర్ హోదా లభిస్తుంది.  ఉత్తరాఖండ్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సిద్దిఖీ చదువుకున్నారు.

ప్రియాంకా చోప్రా వద్ద 6 కోట్ల అక్రమ ఆస్తులు

ముంబై,జనవరి 27: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నివాసంపై దాడులు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ఆమె వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు రూ. 6 కోట్ల వరకు కనుగొన్నట్లు గురువారం వెల్లడించారు. దాదాపు రూ. 6 కోట్ల విలువ చేసే ఆస్తులకు ఎలాంటి లెక్కా పత్రాలు లేవని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే అధికారులు ఆ ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. ఆదాయపు పన్ను అధికారులు సోమవారం ప్రియాంకాతో పాటు మరో నటి కత్రీనా కైఫ్, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్, టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు మ్యాట్రిక్స్, బ్లింగ్‌లపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా కార్యదర్శి చాంద్ మిశ్రా నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు.

తెలంగాణపై సంప్రదింపులు 'సాగు'తాయి:షకీల్ అహ్మద్

న్యూఢిల్లీ ,జనవరి 27:  తెలంగాణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే కాంగ్రెస్ స్పందిస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ మూడు, నాలుగు దశాబ్దాల నుంచి ఉందని దీనికి ఇప్పటికిప్పుడే పరిష్కారం ఎలా దొరుకుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై సంప్రదింపుల ప్రకియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమ్మతి గురించి తనకు తెలియదని మరో ప్రశ్నకు సమాధానంగా షకీల్ అహ్మద్  చెప్పారు.

సెమీస్ లో ఓడిన ఫెదరర్

మెల్‌బోర్న్,జనవరి 27: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నీస్ సిరీస్‌లో  సంచలనాలు నమోదవుతున్నాయి. స్టార్ ఆటగాడు రోజర్ ఫెడరర్ సెమీస్ లో ఓటమి పాలయ్యాడు.   గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జకోవిచ్ చేతిలో 6-7, 5-7,4-6తో ఫెడరర్ ఓటమి పాలయ్యాడు.

మార్చి 6న అల్లు అర్జున్ వివాహం...

హైదరాబాద్: అల్లు అర్జున్ వివాహానికి మార్చిలో ముహూర్తం ఖరారైంది. మార్చి 6వ తారీఖున హైదరాబాద్‌లోని హైటెక్స్లో  అర్జున్, స్నేహారెడ్డిల వివాహం జరుగుతుంది.  9వ తారీఖున పాలకొల్లులో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలకు అధిపతి అయిన శేఖరరెడ్డి కూతురు స్నేహారెడ్డితో ఇటీవలే అర్జున్ నిశ్చితార్థం జరిగింది. అయితే అల్లు అర్జున్ బద్రినాథ్ చిత్రీకరణ హడావుడిలో ఉండటంతో పెళ్లికి కాస్త సమయం పడుతుందని అప్పుడే రెండు కుటుంబాలు చెప్పాయి. స్నేహారెడ్డి అమెరికాలో ఎమ్మెస్ చేసింది. 

ఎమ్మెల్యేలు ' చే'జారకుండా సీ.ఎం. వ్యూహం!

హైదరాబాద్,జనవరి 27: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ కు వ్యతిరేకంగా  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బలమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులను వెనక్కి రప్పించేందుకు వారితో కౌన్సెలింగ్ ప్రారంభించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.  ఖమ్మం జిల్లా  కు చెందిన జగన్‌వర్గ ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు బుధవారం  ముఖ్యమంత్రిని కలిశారు. వారిని ఖమ్మం జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చారు. అదే విధంగా తన సొంత జిల్లా చిత్తూరులో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, రవిలను బుజ్జగించే బాధ్యతను మంత్రి రఘువీరారెడ్డి తన భుజానికెత్తుకున్నారు. కుతూహలమ్మ తనతో సీఎం నేరుగా మాట్లాడాలని డిమాండ్ చేస్తే రవి మాత్రం మెత్తపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Wednesday, January 26, 2011

సచిన్ కు పాండిచ్చేరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

చెన్నై, జనవరి 26: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు పాండిచ్చేరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. ఈ మేరకు పాండిచ్చేరి యూనివర్సిటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సచిన్ టెండూల్కర్‌తో పాటు నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్, వైద్య రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ చెళియన్‌లకు డాక్టరేట్‌లు అందజేయనున్నట్లు తెలిపింది. పాండిచ్చేరి యూనివర్సిటీ స్నాతకోత్సవం రోజున డాక్టరేట్‌లను అందజేయనున్నట్లు పేర్కొంది. స్నాతకోత్సవం మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని వెల్లడించింది. 

టెన్నిస్‌కు మళ్లీ గుడ్‌బై చె ప్పిన హెనిన్

బ్రస్సెల్స్, జనవరి 26:  బెల్జియం స్టార్ ప్లేయర్, మాజీ నెంబర్‌వన్ జస్టిన్ హెనిన్ అంతర్జాతీయ టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మోచేయి గాయం తిరగబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వివరించింది. ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన 28 ఏళ్ల హెనిన్ 2008 మే నెలలో తొలిసారి రిటైర్‌మెంట్ ప్రకటించింది. అయితే సహచరిణి కిమ్ క్లియ్‌స్టర్స్ పునరాగమనం చేసి యూఎస్ ఓపెన్ సాధించడంతో హెనిన్ ఆమెను స్ఫూర్తిగా తీసుకుంది. తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొని గత ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్ పట్టింది. అయితే క్లియ్‌స్టార్స్ స్థాయిలో రాణించకపోవడం... మోచేయి గాయం తిరగబెట్టడంతో ఏడాది తిరిగేలోపే హెనిన్ ఈసారి శాశ్వతంగా టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది.  

బీబీసీ హిందీ రేడియో బంద్...

లండన్ , జనవరి 26: :  వ్యయం తగ్గింపులో భాగంగా ప్రముఖ వార్తాప్రసారాల సంస్థ బీబీసీ మార్చి నుంచి తన హిందీ రేడియో సర్వీసును మూసివేయనుంది. వరల్డ్ సర్వీస్ విభాగంలోని ఈ రేడియోతోపాటు మాసిడోనియన్, అల్బేనియన్, సెర్బియన్, పోర్చుగీస్ రేడియోలకు కూడా స్వస్తి పలకనుంది. సంస్థ డెరైక్టర్ జనరల్ మార్క్ థాంప్సన్ బుధవారంమిక్కడ ఈ వివరాలు వెల్లడించారు. హిందీ షార్ట్‌వేవ్ రేడియో మూతపడినా ఆన్‌లైన్, ఇతర భాగస్వామ్య ఎఫ్‌ఎం రేడియోలలో ఆ భాషా ప్రసారాలను కొనసాగిస్తామన్నారు. ఈ ఐదు రేడియోలను మూసేయడం వల్ల 650 మంది ఉద్యోగాలు కోల్పోతారని, ఏడాదికి రూ.330 కోట్ల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. 3 కోట్ల మంది శ్రోతలు దూరమవుతారని చెప్పారు. 

గవర్నర్ 'శాంతి ' సందేశం

హైదరాబాద్, జనవరి 26: :  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మహనీయుల కలలు ఫలించేలా రాష్ట్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాక కవాతు బృందాలను ప్రత్యేక వాహనంలో తిలకించారు.  2004 నుంచి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలు, సాధించిన విజయాలను గుర్తు చేశారు.ప్రాంతీయ, సమైక్య ఉద్యమాలతో రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యాన్నిపరోక్షంగా  ప్రస్తావిస్తూ, శాంతిభద్రతల స్థాపనకు అంతా సహకరించాలని  పిలుపు పిలుపు ఇచ్చారు. ‘స్వాతంత్య్రానంతరం జాతి నిర్మాణంలో రాష్ట్రం గణనీయమైన పాత్ర పోషించింది. పారిశ్రామికంగా మంచి ప్రగతి సాధించింది. దీనితోనే తృప్తి చెందకూడదు. ప్రజలంతా పరిపక్వతతో వ్యవహరించాలి. అన్ని రకాల హింసా పద్ధతుల్నీ తరిమికొట్టాలి. ప్రజాజీవనం సాఫీగా సాగేందుకు సహకరించాలి. ఫిబ్రవరి 9-28 మధ్య చేపట్టే రెండో విడత జన గణనకు పూర్తి సమాచారమివ్వాలి’’ అని కోరారు. 

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

న్యూఢిల్లీ, జనవరి 26: :  గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ్మంతటా ఘనం గా జరిగాయి.  రాజధాని ఢిల్లీలోగణతంత్ర దినోత్సవ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించాయి. దేశ సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. రైసినా హిల్స్ నుంచి ఎరక్రోట వరకు ఎనిమది కిలోమీటర్ల మేర సాగిన సైనిక, పోలీసు బలగాల పరేడ్ భారత్ సత్తాను చాటింది. మేజర్ జనరల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలోని బలగాలు సైనిక వాద్యాలకు అనుగుణంగా రాజ్‌పథ్ మీదుగా కవాతు సాగించారు. రాజ్‌పథ్ వద్ద రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడ ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో సైనిక హెలికాప్టర్లు గగనతలం పైనుంచి వీక్షకులపై పూలవాన కురిపించాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇండోనేసియా అధ్యక్షుడు సుశీలో బంబాంగ్ యుధొయోనో, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ సహా పలువురు రాజకీయ, సైనిక ప్రముఖులు ఈ పరేడ్‌ను తిలకించారు.  సైనిక బలగాలు పరేడ్‌లో ప్రదర్శించిన బ్రహ్మోస్ లాంచర్ సిస్టమ్, మల్టీబారెల్ రాకెట్ సిస్టమ్ ‘పినాక’ వంటి ఆయుధ పరికరాలు దేశ సైనిక పాటవాన్ని చాటాయి. డీఆర్డీవో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీయే) ‘తేజస్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న రాయల్ ఎయిర్‌ఫోర్స్ మాజీ ఫ్లైయింగ్ ఆఫీసర్ ఎం.ఎం.శుక్లా (87) పెరేడ్‌లో మాజీ సైనికుల దళానికి నాయకత్వం వహించారు. బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, కోస్ట్‌గార్డ్ తదితర పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే 23 వాహనాలు దేశంలోని సాంస్కృతిక భిన్నత్వానికి అద్దం పట్టాయి.  వివిధ రాష్ట్రాల్లో కూడా  గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

లాల్‌చౌక్‌లో ఎగరని జెండా
ఏక్తా యాత్రలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ పతాకావిష్కరణ చేయాలన్న బీజేపీ ప్రయత్నం విఫలమైంది. శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చన్న అనుమానంతో కేంద్ర, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు బీజేపీ యాత్రకు అడ్డుకట్ట వేశాయి. మంగళవారం కాశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీజేపీ అగ్రనేతలు సహా 200 మందిని పోలీసులు అరెస్టు చేసి... జెండా వందన కార్యక్రమాలు ముగిశాక బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు.

Tuesday, January 25, 2011

మేరా భారత్ మహాన్...


                                       '  వార్తాప్రపంచం ' వీక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు... 

ఇస్రో, డీఆర్‌డీఓలపై ఆంక్షల్ని ఎత్తివేసిన అమెరికా

వాషింగ్టన్ ,,జనవరి 25:  భారత అంతరిక్ష సంస్థ -ఇస్రో, రక్షణ సంస్థ- డీఆర్‌డీఓలను ఎగుమతుల నియంత్రణ జాబితా నుంచి అమెరికా ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్‌లో భారత్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎగుమతుల నియంత్రణ జాబితా నుంచి తొలగిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత చేరువయ్యే అవకాశాలున్నాయి. భారత ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తివేయడంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేన్ (ఇస్రో) సంస్థల, అనుబంధ సంస్థల ఉత్పత్తులకు తప్పనిసరిగా లెసైన్స్లు తీసుకోనవసరం లేకుండా వెసులుబాటు కలిగింది. 1998 సంవత్సరంలో అణ్వాయుధాల పరీక్షలు నిర్వహించిన తర్వాత నుంచి భారతదేశంపై అమెరికా ఆంక్షలు విధించింది.  

సిలికాన్ వ్యాలీ వర్సిటీ అక్రమాలు:: భారత విధ్యార్ధుల కష్టాలు

వాషింగ్టన్ ,,జనవరి 25:   సిలికాన్ వ్యాలీలోని ఓ వర్సిటీ చేసిన అక్రమాల కారణంగా అందులో చదువుకుంటున్న వందలాది మంది భారతీయుల విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. అమెరికా అధికారులు వీరిని బలవంతంగా స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం ప్లీజంటన్ పట్టణంలోని ట్రై-వ్యాలీ యూనివ ర్సిటీ వలస నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంది. దీంతో ఇమ్మిగ్రేషన్- కస్టమ్స్ ఎన్‌ఫోర్స్మెంట్  అధికారులు గత వారంలో వర్సిటీపై దాడి చేసి, దాన్ని మూసేశారు. ఐసీఈ వెల్లడించిన వివరాల ప్రకారం.. వర్సిటీలో మొత్తం 1,555 మంది విద్యార్థులున్నారు. వీరిలో 95 శాతం మంది భారతీయులే. రెసిడెన్షియల్, ఆన్‌లైన్ కోర్సులు చదువుతున్న వీరిలో కొంతమంది కాలిఫోర్నియాలో నివసిస్తున్నట్లు రికార్డుల్లో ఉన్నా నిజానికి వీరు మేరీలాండ్, పెన్సిల్వేనియా, టెక్సాస్‌లలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారు. వర్సిటీ అధికారులు వీసా పర్మిట్లను ఉల్లంఘించి విదేశీ విద్యార్థులకు వలస హోదా పొందడానికి కావలసిన పత్రాలు ఇచ్చారు. వర్సిటీ కేవలం 30 మంది విద్యార్థులకు మాత్రమే వలస వీసాలు ఇవ్వాల్సి ఉండగా, గత ఏడాదిలో ఏకంగా 939 మందికి వీటిని ఇచ్చింది. వర్సిటీని మూసేయడంతో భారత విద్యార్థులు న్యాయ సహాయం కోరుతూ లా  సంస్థలను ఆశ్రయిస్తున్నారు. 

రిపబ్లిక్ డే పోలీస్ పతకాలు

హైదరాబాద్,,జనవరి 25:  రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డికి రాష్టపతి పోలీస్ పతకం (పీపీఎం) దక్కింది. పోలీసుశాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతకాలను ప్రకటించింది. ఉన్నతమైన రాష్టప్రతి పోలీస్ పతకానికి రాష్ట్ర పోలీసుశాఖ నుంచి మహేందర్‌రెడ్డితోపా టు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఎస్పీ చింతా రాంచందర్ ఎంపికయ్యారు. మరో 19 మంది ఇండియన్ పో లీస్ మెడల్ (ఐపీఎం), మరో ముగ్గురు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) పొందారు. 

ఫేస్‌బుక్‌పై ఎఫ్‌ఐఆర్ !

లక్నో,జనవరి 25: జాతిపిత మహాత్మాగాంధీని కించపరుస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అబితాబ్ ఠాకూర్ ఇటీవల గోమతి నగర్ పోలీస్‌స్టేషన్‌లో దీన్ని నమోదు చేశారు. ఫేస్‌బుక్‌లోని ‘ఐ హేట్ గాంధీ’ గ్రూప్ నెటిజన్లు మహాత్ముడిపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఠాకూర్ ఆరోపించారు. ఫేస్‌బుక్‌తోపాటు ఈ గ్రూప్‌లోని రాహుల్ దేవ్‌గన్, గౌరబ్ ఛటర్జీ, రోహన్ షిండే తదితరుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.   
                           బుధవారం రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొంటున్న జానపద కళాకారులకు ప్రధాని అబినందన...

రాష్ట్రానికి ' పద్మ ' వికాసం

న్యూఢిల్లీ,జనవరి 25:   2010 పద్మ పురస్కారాలకు 128 మందిని ఎంపిక చేశారు. వీరిలో 31 మంది మహిళలు ఉన్నారు. 13 మందికి పద్మ విభూషణ్ అవార్డులు, 31 మందికి పద్మభూషణ్, 84 మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. ఈ అవార్డులకు ఎంపికైన వారిలో ఆంధ్రప్రదేశ్'కు చెందినవారు  ఎక్కువమంది ఉన్నారు. పద్మవిభూషణ్ పొందినవారిలో  అక్కినేని నాగేశ్వరరావు, పల్లె రామారావు, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, చందాకోచ్చర్, కపిల వాత్సాయన, అజీమ్ ప్రేమ్'జీ, పద్మభూషణ్ పొందివారిలో  డాక్టర్ కె.అంజిరెడ్డి, డాక్టర్ జివికె రెడ్డి, వహిదా రెహ్మాన్, ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, శశికపూర్, ఖయ్యూమ్, వైసి దేవేశ్వర్. తమిళనాడులో కేటగిరిలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఈ అవార్డు ఇచ్చారు. పద్మశ్రీ పొందినవారిలో  కోనేరు రామకృష్ణారావు, పుల్లెల శ్రీరామ చంద్రుడు, వివిఎస్ లక్ష్మణ్, జి.గోవర్ధన్, సిద్దిఖ్, టబు, కాజోల్, ఇర్ఫాన్ ఖాన్, ఉషాఊతప్ప, గగన్ నారంగ్, సుశీల్ కుమార్, నారాయణ్ సింగ్ భాటి ఉన్నారు.   

రెపో, రివర్స్ రెపో రేట్లు పెంపు

ముంబై,జనవరి 25:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. వడ్డీ రేటు 25 బేసిక్ పాయింట్లకు పెంచింది. జీడీపీ వృద్ధిరేటును 8.5 శాతంగా రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అలాగే నగదు నిల్వల నిష్పత్తిని 6 శాతంగా ఉంచింది. రెపో రేటును 6.25 నుంచి6.5 శాతానికి. రివర్స్ రెపోను 5.25 నుంచి 5.5 శాతానికి పెంచింది. సీఆర్‌ఆర్ మాత్రం అలాగే ఉంచింది.

విదేశాలలోని నల్లదనం 20 లక్షల కోట్లు: ప్రణబ్

న్యూఢిల్లీ,జనవరి 25: దేశం దాటిన నల్లదనం 20 లక్షల కోట్ల రూపాయలేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. విదేశాలలోని నల్లధనాన్ని మన దేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయిదు అంచలలో అమలు చేసే ఈ పథకం ద్వారా విదేశాలలోని నల్లధనాన్ని మన దేశానికి తీసుకువస్తామని మంత్రి చెప్పారు.నల్లధనంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బ్లాక్‌మనీ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో భారత్ ఇప్పటికే 22 దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామని, మరో 65 దేశాలతో ఒప్పందాలకు రంగం సిద్ధం చేసామని ప్రణబ్ పేర్కొన్నారు. 

Monday, January 24, 2011

మాస్కో ఎయిర్‌పోర్టుపై ఆత్మాహుతి దాడి: 35మంది మృతి

మాస్కో,,జనవరి 24: : మాస్కోలోని దొమొదెదొవో అంతర్జాతీయ విమానాశ్రయంపై సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 7.02 గంటలకు జరిగిన ఈ సంఘటనలో 35 మంది మరణించగా, 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. లగేజీ తనిఖీచేసే ప్రాంతంలో పేలుడు సంభవించడంతో, విమానాశ్రయం దద్దరిల్లింది. అక్కడే ఉన్న విమానాశ్రయ ఉద్యోగులు తునాతునకలైపోయారు. విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి జరిగినట్లు బిజినెస్ ఎఫ్‌ఎం రేడియో ప్రకటించింది. డిపార్చర్ హాలు వద్ద ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు పేరు వెల్లడించని భద్రతా సిబ్బంది ఒకరు చెప్పినట్లు ‘ఇంటర్‌ఫాక్స్’ వార్తాసంస్థ వెల్లడించింది. ఇది ఉగ్రవాద చర్యేనని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని రష్యన్ దర్యాప్తు కమిటీ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు. 

క త్రినా, ప్రియాంక ఇళ్లపై ఐటీ దాడులు

ముంబై,జనవరి 24: ప్రముఖ బాలీవుడ్ నటీమణులు కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాలకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సోమవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వారి కార్యాలయాలు, కార్యదర్శుల ఇళ్లతోపాటు 17 చోట్ల ఉదయం 7.30 గంటలకు ఏకకాలంలో ప్రారంభమైన దాడులు సాయంత్రం దాకా కొనసాగాయి. ప్రకటనలు, విదేశీ ఒప్పందాలు, అతిథి పాత్రలు, వ్యక్తిగతంగా ఫంక్షన్‌లకు హాజరవడం ద్వారా వచ్చిన ఆదాయానికి వారు పన్ను చెల్లించలేదని అనుమానిస్తున్నట్లు ఓ ఐటీ అధికారి వెల్లడించారు. దాడులను  కూడా కొనసాగించనున్నట్లు తెలిపారు. నగరంలో బాంద్రాలోని గుల్‌దేవ్ సాగర్ బిల్డింగ్‌లో కత్రినా నివసిస్తున్న అపార్టుమెంటు, ఆంథేరీ వెస్ట్, వర్సోవాలోని రాజ్ క్లాసిక్ బిల్డింగ్‌లోని ప్రియాంక నివాసాలపై దాడులు కొనసాగినట్లు చెప్పారు. లోఖండ్‌వాలాలో ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా, ఆమె కార్యదర్శి చాంద్ మిశ్రా నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ ఇల్లు, ఆయన కంపెనీ ‘బ్లింగ్’ కార్యాలయంలో కూడా దాడులు జరిపినట్లు వెల్లడించారు.
                                    శ్రీకాకుళం జిల్లా రాజాం  మండలం డోలపేటలో రచ్చబండ కార్యక్రమంలో
                                    ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 

తెలంగాణలో 'రచ్చబండ' రచ్చరచ్చ

హైదరాబాద్, జనవరి 24 :ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో రచ్చరచ్చయింది. రచ్చబండను ఎక్కడికక్కడే స్థానికులు అడ్డుకున్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజాప్రతినిదులను, అధికారులను గ్రామాల పొలిమేరలనుంచే తెలంగాణవాదులు వెళ్లగొట్టారు. పలు చోట్ల రోకలిబండలు, చాటలు, కారంపొడి, చీపురు కట్టలతో గ్రామస్తులు నిరసన తెలిపారు. మరి కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు భయంతో గ్రామ శివార్లనుంచే వెనుదిరిగారు. తెలంగాణ తెచ్చాకే గ్రామాల్లోకి అడుగు పెట్టాలని ప్రజలు ఎక్కడికక్కడ నినాదాలు చేయడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు లకు  దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.  మెదక్‌ జిల్లాలో మంత్రి సునీతాలక్ష్మారెడ్డి వాహనంపై టమాటాలు, కోడిగుడ్లతో తెలంగాణవాదులు దాడి చేశారు. కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్‌బాబును స్థానికులు అడ్డుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి సుదర్శన్‌రెడ్డిని గ్రామస్తులు తెలంగాణపై నిలదీశారు. తమకు ప్రభుత్వ సహాయం అవసరం లేదని, తెలంగాణ ఇస్తే చాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని రచ్చబండ వద్దు వెళ్లిపొమ్మని చెప్పారు.సికింద్రాబాద్‌ బొల్లారంలో మంత్రి శంకర్రావును తెలంగాణవాదులు అడ్డుకాన్నారు. వరంగల్‌లో మంత్రి సారయ్యను దేశాయిపేట గ్రామస్తులు తెలంగాణ ఏదీ అని అడిగారు. వందలాది మంది గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేసినా సారయ్య రచ్చబండను నిర్వహించలేకపోయారు. చివరకు చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఇక ప్రజల ఆగ్రహాన్ని కళ్లారా చూసిన మంత్రి పొన్నాల రచ్చబండ కార్యక్రమానికి వెళ్లనేలేదు. ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో మంత్రి కోమట్‌రెడ్డిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. నల్గొండలో ఎమ్మెల్యే బిక్షంగౌడ్‌పై స్థానికులు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో రచ్చబండ వద్దంటూ ఎంపీటీసీ ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నాడు. 

జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, జనవరి 24 : ఎమ్మెల్యే శంకర్రరావు  లేఖను సూమోటోగా స్వీకరించిన హైకోర్టు జగన్‌ సహా ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ  నోటీసులు జారీ చేసింది. ఏడుగురు అధికారులు సహా 52 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్శితోపాటు కేంద్ర హోంశాఖ అధికారులు, పరిశ్రమల శాఖ ప్రధాన, ముఖ్య కార్యదర్శులు, ఏపీఐఐసీ ఎండీ రవెన్యూశాఖ కార్యదర్శులు ఇప్పటికే నోటీసులు అందుకున్నట్లు తెలిసింది. .

కల్మాడికి ఉద్వాసన

న్యూఢిల్లీ,జనవరి 24 : కామన్వెల్త్‌ క్రీడల  ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్ష పదవినుంచి సురేష్‌ కల్మాడిని ప్రభుత్వం
తొల గించింది. ఇందులో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతున్నందున ఆయనను తొలగించినట్లు సమాచారం. కల్మాడితోపాటు ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి భానోత్‌కూ ఉద్వాసన పలికింది. 

జయసుధ 'తెలంగా'నం' !

హైదరాబాద్,జనవరి 24:  సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు, సినీ నటి జయసుధ  తెలంగాణ  పాట అందుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే రచ్చబండ వంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలితం ఉండదని, కాంగ్రెసు ఉండదని ఆమె అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిందేనని, తెలంగాణ పోరాటం ఆగలేదని ఆమె అన్నారు. 

ఎమ్మెల్యే నీరజా రెడ్డిపై అరెస్ట్ వారెంట్

కర్నూలు,జనవరి 24 : కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే నీరజా రెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బెంగళూరులో జరిగిన అగ్రహారం ప్రభాకర రెడ్డి హత్య కేసులో నీరజా రెడ్డి నిందితురాలు. ఈ కేసుకు సంబంధించి  ఆమెకు ఆరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆమె కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు. ఆమె కనిపించడంలేదని ఆమె గన్'మెన్'లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె అయిదు రోజులుగా అదృశ్యమయ్యారని అంటున్నారు.  

తత్వవేత్త కొత్త సచ్చిదానంద మూర్తి కన్నుమూత

గుంటూరు,జనవరి 24 : ప్రముఖ తత్వవేత్త, దార్శనికుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కొత్త సచ్చిదానంద మూర్తి సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సెయింట్ జోసఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా సచ్చిదానందమూర్తి పనిచేశారు.

భారత రత్న భీమ్‌సేన్ జోషీ కన్నుమూత

పూనె,జనవరి 24: ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాన్సుడు భారత రత్న భీమ్‌సేన్ జోషీ సోమవారం ఉదయం కన్నుమూశారు. పూణేలోని సహ్యాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. డిసెంబర్ 31వ తేదీన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. గత కొంత కాలంగా వయస్సుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు 2008లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి.  కర్ణాటకకు చెందినభీమ్‌సేన్ జోషీ 1922 ఫిబ్రవరి 22వ తేదీన కర్ణాటకలోని గదగ్‌లో జన్మించారు. మిలే సుర్ మేరా తుమ్హారా అనే దేశభక్తి గీతంతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. ఆయన హిందీ, కన్నడ చిత్రాల్లో పాటలు కూడా పాడారు. హీందీలో సంగీత ప్రధానమైన బసంత్ బిహారీ వంటి సినిమాలకు పాటలు పాడారు.

Sunday, January 23, 2011

సామర్లకోట పవర్ ప్లాంటుకు అమెరికన్ జనరల్ ఎలక్ట్రిక్ టర్బైన్లు

న్యూయార్క్ ,జనవరి 23:    తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో అనిల్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన పవర్ ప్లాంటుకు అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) టర్బైన్లను సరఫరా చేసేందుకు  ఒప్పందం కుదిరింది. తద్వారా యూఎస్‌లో 1,600 ఉద్యోగాల కల్పన జరగనుంది.  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా  న్యూయార్క్ సమీపాన షెనెక్టాడీలో ఉన్న జీఈ ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు. ‘మీలో చాలా మంది సామర్లకోట గురించి విని ఉండరు. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే.. అక్కడి విద్యుత్ ప్లాంటుకే మీరు యంత్రాలు విక్రయించనున్నారు’ అని అమెరికన్లకు ఒబామా చెప్పారు. అడాగ్-జీఈ డీల్ వల్లే అమెరికాలో 1,200 తయారీ రంగ ఉద్యోగాలు, 400కు పైగా ఇంజినీరింగ్ ఉద్యోగాల కల్పన సాధ్యపడుతోందన్నారు. ఎగుమతుల ప్రాధాన్యానికి ఇది చక్కని ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. 

శ్రీలంక నౌకాదళ దాడిలో మరో భారత మత్స్యకారుని మృతి

కొలంబో,జనవరి 23: శ్రీలంక నౌకాదళ సిబ్బంది జరిపిన దాడిలో మరో భారత మత్స్యకారుడు మరణించాడు. శనివారం పుష్పవనం తీర ప్రాంతంలో చేపలు పట్టుకుంటున్న ముగ్గురు భారత మత్స్యకారులపై లంక నేవీ దాడి చేసింది. వీరిలో ఒక వ్యక్తి మెడకు తాడుతో బిగించి సముద్రంలోకి తోసేయడంతో అతడు మరణించాడని సమాచారం. మరో ఇద్దరు మత్స్యకారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గత పక్షం రోజుల్లో లంక నేవీ ఇద్దరు భారత మత్స్యకారులను చంపింది. వీటిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఆదివారం ఈ విషయంపై అధికారులతో చర్చించారు. మత్స్యకారుల మృతిపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని తమిళనాడులోని నేవీ అధికారులను ఆదేశించారు.

                                             దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా
                                             చిన్నారులకు పొలియో చుక్కలు వేస్తున్న ద్రుశ్యాలు... 

ఉద్యోగుల డిమాండ్లకు ఆమోదం

హైదరాబాద్ ,జనవరి 23: పభుత్వ ఉద్యోగుల తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జరిపిన చర్చలు సఫలమైనాయి. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 2 శాతం పెంచడానికి  సీఎం అంగీకరించారు. టీచర్ల, పంచాయితీరాజ్‌లో తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణకు అంగీకారం తెలిపారు. గ్రాట్యూటి 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచడానికి సమ్మతించారు.  హెల్త్‌కార్డులు ఆరోగ్యశ్రీద్వారా ఇచ్చేందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.  

వన్డే సిరీస్‌ దక్షిణాఫ్రికా కైవసం

సెంచూరియన్,జనవరి 23: భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-2 తేడాతో గెల్చుకుంది. చివరి వన్డేలో టీమిండియాపై దక్షిణాఫ్రికా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. 268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 40.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటయింది. 74 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకున్న టీమిండియా యూసఫ్ పఠాన్ సెంచరీతో గౌరవప్రదమయిన స్కోరు సాధించింది. పఠాన్ విజృంభణతో విజయంపై ఆశలు చిగురించాయి. 70 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 పరుగులు చేసిన పఠాన్ అవుటవడంతో మ్యాచ్ సఫారీల వశయయింది. చివర్లో జహీర్‌ఖాన్ మునాఫ్ పటేల్ కొద్దిసేపు పోరాడిన ఫలితం లేకపోయింది. జహీర్ 24 పరుగులు చేసి చివరి వికెట్‌గా అవుటయ్యాడు.దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కల్ 4 వికెట్లు పడగొట్టాడు. స్టెయిన్, సాట్‌సోబ్ రెండేసి, బోదా, పీటర్సన్ ఒకోక వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఆమ్లా (116) సెంచరీతో రాణించాడు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 268 పరుగులుగా నిర్ణయించారు. ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మోర్కల్‌కు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డులు దక్కాయి. 

Saturday, January 22, 2011

                                       కర్నాటక గవర్నర్ చర్య కు నిరసనగా బంద్ పాటిస్తున్న బి.జె.పి. 

కాంగ్రెసు పాలనకు స్వస్తి పలకండి:జగన్

విశాఖపట్నం,,జనవరి 22‌:  కాంగ్రెసు పాలనకు స్వస్తి పలకాలని  మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ధరల పెరుగుదలపై నిర్వహించిన జనదీక్ష కార్యక్రమంలో ప్రసంగిస్తూ, మూడు రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే పట్టించుకునేవారు లేరని, వైయస్సార్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు. తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని, ఎన్డియేకు మద్దతిచ్చారని, పెట్రోల్ ధరలు పెంచినా పట్టించుకోలేదని, రాష్ట్రంలో పేద ప్రజల గురించి కూడా ఆలోచన చేయలేదని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు నాలుగు సార్లు, బస్సు చార్జీలు మూడు సార్లు చంద్రబాబు పెంచారని ఆయన అన్నారు.  అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనిషన్నవాడు ఒకే రకంగా ఉండాలని, అమ్మకం పన్నును చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా పెంచాడని, ఇప్పుడు అమ్మకం పన్ను తగ్గించాలని అంటున్నారని ఆయన అన్నారు. కృష్ణా - గోదావరి బేసిన గ్యాస్ విషయంలో చంద్రబాబు మోసం చేశారని, బిడ్డింగులో పాలుపంచుకోకపోవడమే చంద్రబాబు చేసిన అన్యాయమని ఆయన అన్నారు. బిడ్డింగులో పాల్గొని ఉంటే వంద రూపాయలకో వంద యాభై రూపాయలకో గ్యాస్ వచ్చి ఉండేదని ఆయన అన్నారు. మునుపటి చంద్రబాబు పాలన, ఇప్పటి కాంగ్రెసు పాలన దొందూ దొందేనని,  విశ్వసనీయత, విలువలపై ఏ ఒక్కరికీ పట్టడం లేదని ఆయన అన్నారు.

ధరల పెరుగుదలకు నిరసనగా చంద్రబాబు సైకిల్ యాత్ర

హైదరాబాద్,జనవరి 22‌: పెట్రోల్, నిత్యావసర వస్తువుల  ధరల పెరుగుదలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ  శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.  హైదరాబాదులో చంద్రబాబు సికింద్రాబాదులోని మోండా మార్కెట్‌లో వినియోగదారులను, వ్యాపారులను కలుసుకుని వారి కష్టాలు విన్నారు. అక్కడి నుంచి ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి చేరుకోవడానికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఐదు కిలో మీటర్ల మేర ఆయన సైకిల్ తొక్కారు. ఆయనతో పాటు వేయి సైకిళ్లపై నాయకులు, కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. ధరలను అదుపు చేయలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిపోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు నిరసనగా తమ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని, ధరలు తగ్గించేవరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.  ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలకు అధికారంలో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు.

రాజినామాలు చేసి వెళ్ళండి !

జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సి.ఎం. చురక

న్యూఢిల్లీ,జనవరి 22‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారు గెలిచిన తర్వాత చూద్దామని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోదలుచుకున్నవాళ్లు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం, తమ కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుంటాయని, సరైన సమయంలో ఆ నిర్ణయం వెలువడుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర విభజన అంశం చాలా జఠిలమైందని, అందుకే సమయం తీసుకుంటున్నారని ఆయన అన్నారు. 2014 వరకు తాము అధికారంలో ఉంటామని, 2014 ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరడానికి తాను ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, చిదంబరం, వీరప్ప మొయిలీ, మమతా బెనర్జీలను కలిసినట్లు ఆయన తెలిపారు.  రాష్ట్రానికి 19 కొత్త రైళ్లు ఇవ్వాలని, ఇతర ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలని తాను మమతా బెనర్జీని కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కూడా మమతను కోరినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తాను ప్రధానిని కోరానని ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తి స్థాయి నివేదికను పంపాల్సి ఉందని  చెప్పారు. ఉపాధ్యాయుల ఏకీకృత నిబంధనల సమస్యను పరిష్కారించాలని తాను ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక కింద ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలున్నాయని, ఈ ప్రణాళిక కిందికి వరంగల్, కరీంనగర్, శ్రీకాకుళం  , విజయనగరం, విశాఖపట్నం  , తూర్పు గోదావరి జిల్లాలను తేవాలని కోరానని ఆయన చెప్పారు. వరద, తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయానికి ప్రత్యేక ప్యాకేజీ అందించాలని కోరినట్లు ముఖ్యమంత్రి  తెలిపారు. 

నౌక మునక: నలుగురి గల్లంతు

అహ్మాదాబాద్, జనవరి 22 :  అహ్మాదాబాద్ సముద్ర తీరంలో శనివారం ఓ నౌక మునిగిపోయింది. నౌకలో ప్రయాణిస్తున్న 32మంది ప్రయాణికుల్లో 28మందిని నౌకాదళ సిబ్బంది కాపాడారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

హైకోర్టును ఆశ్రయించిన యడ్యూరప్ప

బెంగళూరు,జనవరి 22 : తనపై విచారణకు  గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని  సవాల్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప, హోం మంత్రి ఆర్.అశోక్‌ భూ కుంభకోణాలు, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, వారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కేఎన్. బాలరాజ్, సిరాజిన్ బాషాలు సమర్పించిన పిటిషన్‌ను గవర్నర్  భరద్వాజ్ మన్నించారు. దీంతో  యడ్యూరప్పను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. 

Friday, January 21, 2011

నాలుగో వన్డేలో భారత్ ఓటమి


పోర్ట్ ఎలిజబెత్,జనవరి 21: నాలుగో వన్డేలో భారత్  దక్షిణాఫ్రికా పై 48 పరుగుల తేడా తో ఓడింది.లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్‌ను కష్టాలతో పాటు వర్షం కూడా వెంటాడింది. రెండు సార్లు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 48 పరుగుల తేడా తో ఓడింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. వర్షంతో ఆటనిలిచే సమయానికి భారత్ 32.5 ఓవర్లలో 142/6 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (87 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ మూడు వికెట్లు, నెహ్రా ఓ వికెట్ తీశాడు.ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు కావడం విశేషం.


దర్శకుడు ఇ.వి.వి. ఇకలేరు...

కామెడీ చిత్రాలను రూపొందించడంలో తనదైన ప్రత్యేకతను ఏర్పరుచుకున్న సినీ దర్శకుడు, కథా రచయిత ఈవీవీ సత్యనారాయణ (54)శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రిలో మరణించారు. ఆయన కొద్దికాలంగా గొంతు క్యాన్సర్‌తో భాదపడుతున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో 1956 జూన్ 10వ తేదిన జన్మించిన  ఇ.వి.వి. 42 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో అమితాబ్ నటించిన సూర్యవంశానికి కూడా దర్శకుడు ఈవీవీనే. ఈవీవీ  తనయులు ఆర్యన్ రాజేశ్, నరేశ్ ఇద్దరూ సినీ హీరోలే. 1990లో ‘చెవిలో ఫువ్వు’ సినిమాతో దర్శకత్వ అరంగేట్రం చేసిన ఈవీవీ... అదే ఏడాది ప్రేమ ఖైదీ చిత్రంతో మెగా హిట్‌ను దక్కించుకున్నారు. చివరిగా గతేడాది తనయుడు నరేశ్ హీరోగా కత్తి కాంతారావు సినిమా తీశారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు శిష్యుడిగా పేరొందారు.జంధ్యాల వద్ద కొన్నాళ్లు సహాయకుడిగా పనిచేసిన ఈవీవీ... జంధ్యాల కంటే కొంచెం ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి చిత్రాలు తీశారు. జంబలకిడి పంబ, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది లాంటి చిత్రాల తరువాత మహిళలు మెచ్చిన తాళి, ఆమె వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అగ్ర నటులైన చిరంజీవితో బావగారూ-బాగున్నారా,,  నాగార్జునతో ఆవిడా-మా ఆవిడే, వెంకటేష్‌తో ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు చిత్రాలు తీశారు. తరువాత తన కుమారులిద్దరినీ హీరోలుగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. రంభ, ఊహ, రవళి వంటి నటీమణులను ఈవీవీ తెలుగు తెరకు పరిచయం చేశారు. 22 సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసిన ఈవీవీ... చాలా బాగుంది, అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ వంటి హిట్ చిత్రాలతో సహా మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.  ‘ఇంద్రుడు-చంద్రుడు’ సినిమాలో పోలీస్ అధికారి క్యారెక్టర్ వేశారు. వెరైటీ టైటిల్స్ పెట్టినా, గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నిటినీ వరసపెట్టి ఒకే సినిమాలో చూపించినా... అవన్నీ ఈవీవీకే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్.. బెండు అప్పారావు ఆర్‌ఎంపీ.. తొట్టిగ్యాంగ్.. దొంగల బండి.. ఎవడి గోల వాడిది.. వీడెక్కడి మొగుడండీ.. అదిరింది అల్లుడూ.. కితకితలు.. ఇలాంటి టైటిల్స్ పెట్టడం ఈవీవీ స్టైల్.  .

తెలంగాణపై మరింత 'నాన్పుడు '!


న్యూఢిల్లీ,జనవరి 21:   జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపైన అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేయతలపెట్టిన అఖిల పక్ష సమావేశం ఈ నెలలో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ అంశంపై కొంతకాలంపాటు సాచివేత ధోరణి అవలంభించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ముందుగా పార్టీలో ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోర్ కమిటీ సమావేశం ముగిసిన తరువాత చిదంబరం విలేకరులతో మాట్లాడుతూ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే ఈ ప్రకటనలో స్పష్టతలేదు. ఈ సంప్రదింపులనేవి కాంగ్రెస్ పార్టీలోనా? ఇతర పార్టీలతోనా? అనేది  ఆయన స్పష్టం చేయలేదు. కాగా,  డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్లు పార్టీలో పలువురు భావిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో ఆ పార్టీకి అర్ధం కావడంలేదు. అయితే దీనిని ఇలాగే నాన్సటం మంచిది కాదని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెలలో హొం మంత్రి చిదంబరం విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆ కారణంగానో   లేక మరో కారణం చేతనో  సంప్రదింపుల బాధ్యతలను ప్రణబ్ ముఖర్జీకి అప్పగించారు. చిదంబరం విదేశీ యాత్ర నుంచి తిరిగి వచ్చేలోపల ప్రణబ్ ముఖర్జీ సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలతో చర్చలు జరుపుతారు. చిదంబరం వచ్చిన తరువాతనే  అఖిలపక్షం సమావేశం జరిగే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి, గవర్నర్ల 'కర్ణాటకం' !


బెంగళూరు,జనవరి 21:  కర్ణాటక లో  ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య కుమ్ములాట తీవ్రస్థాయికి చేరింది. ఒక భూమి కుంభకోణం కేసులోముఖ్యమంత్రి విచారించేందుకు  గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ అనుమతించారు. ఈ కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్  నిలిపివేస్తూ మంత్రి వర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ తీరుకు నిరసనగా బిజెపి శనివారం నాడు  కర్ణాటక బంద్ కు పిలుపు ఇచ్చింది. గవర్నర్ ని రీకాల్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.

తెలంగాణ తెదేపా నేతల్లో విభేదాలు!

హైదరాబాద్,జనవరి 21: తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు కనబడుతోంది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌పై నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం. తమ ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు పార్టీ అధినేతను బ్లాక్‌మెయిల్ చేసేలా ప్రవర్తిస్తున్నారని నర్సింహులు ఆరోపించారు. వారు తెలంగాణ రాష్ట్ర సాధన కంటే నాయకత్వం కోసం వెంపర్లాడుతున్నట్టుగా ఉందని నర్సింహులు అన్నారు. ఇది పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు హాని కలిగిస్తుందన్నారు. అప్పుడే  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్టు, తెలంగాణకు తామే నాయకత్వం వహించనున్నట్టు కొంతమంది కలలుగంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడూ వ్యతిరేకించ లేదన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే చంద్రబాబే స్వయంగా ఆ ప్రాంత కమిటీని ఏర్పాటు చేసి, ఒకరికి నాయకత్వ బాధ్యతలు తప్పకుండా అప్పగిస్తారని మోత్కుపల్లి అన్నారు.  
                                          వాషింగ్టన్ నేషనల్ జూ లో బాల్ తో ఆడుతున్న ఆడ పాండా  

వ్యభిచారం నేరం కింద నటి యమున అరెస్ట్

బెంగళూరు,జనవరి 21 :  సినీ నటి యమున ను  వ్యభిచారం నేరం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడి ఐటిసి గార్డెన్ హొటల్లో గురువారం రాత్రి వ్యభిచారం నిర్వహిస్తుండగా సినీనటి యమునతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఒక సాఫ్టువేర్ కంపెనీ యజమాని కూడా ఉన్నారు. నటి యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు.  మౌనపోరాటం చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి ప్రవేశించారు. యమున అరెస్ట్ ను  నగర పోలీస్ కమిషనర్ కూడా ధృవీకరించారు.  

కేంద్ర మాజీ మంత్రి, సత్యనారాయణరావు మృతి

హైదరాబాద్,జనవరి 21 : కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ఎస్.పి.బి.కె సత్యనారాయణరావు మృతి చెందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణరావు హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం  ఉదయం మరణించారు. 

Thursday, January 20, 2011

‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టు రద్దు

తిరుమల,జనవరి 20 : వివాదాస్పద ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును యథావిధిగా అమలు చేయాలని తీర్మానించింది. ప్రాజెక్టు కోసం దాతలిచ్చిన 95 కేజీల బంగారాన్ని, రూ.12 కోట్లను వారు కోరితే వాపసు చేస్తారు. లేదంటే శ్రీవారికి అవసరమైన ఆభరణాల తయారీకి బంగారాన్ని వినియోగిస్తారు. నగదును ఇతర ట్రస్టులకు బదిలీ చేస్తారు. బంగారం, నగదు వాపసు తీసుకోకుంటే దాతలకు గతంలో ప్రకటించిన విధంగా బస, దర్శనం, ఇతర మర్యాదల వంటి సౌకర్యాలను యథావిధిగా అమలు చేస్తారు. అథారిటీ చైర్మన్ జె.సత్యనారాయణ, ఈవో కృష్ణారావు, సభ్యుడు నాగిరెడ్డి నేతృత్వంలో గురువారం జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.


‘మకరజ్యోతి’ మానవ కల్పితమా?


కొచి,జనవరి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తులకు దర్శనమిచ్చే ‘మకరజ్యోతి’ వెనక ఉన్న  నిజానిజాలను బయటపెట్టాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీఎస్)ను కేరళ హైకోర్టు గురువారం ఆదేశించింది. మకరజ్యోతి మానవ కల్పితమా, కాదా అనేది ప్రజలకు స్పష్టం చేయాలని జస్టిస్ బి. రాధాకృష్ణన్, జస్టిస్ పిఎస్ గోపీనాథ్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులిచ్చింది. శబరిమల సమీపంలోని పొలిమేడులో ఈనెల 14న జరిగిన తొక్కిసలాటలో 102 మంది భక్తులు మృతిచెందిన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. 

Wednesday, January 19, 2011

Gaganam movie photos (8)
'గగనం' లో నాగార్జున

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్: స్తంభించిన పాలన

హైదరాబాద్,జనవరి 19: పెండింగ్ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన పెన్, చాక్, టూల్ డౌన్‌తో భుధవారం నాడు పరిపాలన వ్యవస్థ స్తంభించింది. రాష్టవ్య్రాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు ఉద్యమ బాట పట్టడంతో  మండల స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. నల్లబ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలిరోజు నిరసన కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైందని జేఏసీ నేతలు తెలిపారు. గురు,శుక్ర వారాలలో కూడా నిరసన కొనసాగ నున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా వాణిజ్య పన్నులు, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, పరిశ్రమలు, ఖజానా, రవాణా, మున్సిపాలిటీలు తదితర శాఖల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. సుమారు  600 కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినట్లు అంచనా. సర్కారుకు రావాల్సిన ఆదాయం, వసూళ్లు ఆగిపోయాయి. గృహనిర్మాణశాఖ నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రోజువారీగా అందాల్సిన సిమెంటు, సొమ్ము నిలిచిపోయింది. దీంతో వీటి నిర్మాణాలకు బ్రేక్ పడింది. మండల రెవెన్యూ కేంద్రాల్లో జారీ కావాల్సిన ధ్రువపత్రాలు.. జిల్లా కలెక్టరేట్లలో బిల్లులు, ఇతరత్రా కీలకమైన పనులు ఆగిపోయాయి. అటెండర్ మొదలు గెజిటెడ్ అధికారి వరకు నిరసనలో పాల్గొంటున్నారు.  ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బోధనకు బ్రేక్ పడింది.  

కంచి పట్టు చీరకు పేటెంట్ హక్కు

చెన్నై,జనవరి 19: కంచి పట్టు చీరలకు పేటెంట్ హక్కులు కల్పిస్తూ జియోగ్రాఫికల్ సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ చీరలను వంశపారంపర్యంగా నేస్తున్న వారికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ 1999 చట్టం ప్రకారం పేటెంట్ హక్కులను కల్పించారు. దీనివల్ల నకిలీలకు అవకాశం లేదని జియోగ్రాఫికల్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ జి.ఎల్. వర్మ  ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పేటెంట్ హోదా పొందిన చీరలను ఇతరులెవరైనా నేసి, విక్రయిస్తే శిక్షార్హులుగా  పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అమెరికాలో ఆంథ్ర యువకుని మృతి

డల్లాస్,జనవరి 19: అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తెలుగు యువకుడు తాళ్లూరి శ్రీనివాస్ (38) అనారోగ్యంతో సోమవారం మరణించాడు. ఫోర్లిడాలోని తంపాలో అతడు కన్నుమూసినట్టు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలిపింది. న్యూమోనియా కారణంగా అతడు అనారోగ్యానికి గురయిన ట్టు ఫ్లోరిడాలోని జిఫర్‌హిల్స్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. గుంటూరు పట్టణంలోని ఆరండల్‌పేటకు చెందిన శ్రీనివాస్ ఎమ్‌సీఏ పూర్తి చేసిన తర్వాత 8 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చాడు. ఆస్టిన్‌లోని చార్లెస్ షావాబ్ ఫెనాన్షియల్ కంపెనీలో అతడు పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌కు భార్య ప్రసన్న (32), కొడుకు తేజ(12), కూతురు స్నేహ(9) ఉన్నారు.  శ్రీనివాస్ మృతదేహాన్ని స్వగ్రా మం  తరలించేందుకు తానా ఏర్పాట్లు చేస్తోంది.  

144వ సెక్షన్ తో ఒ.యు. పిజి పరీక్షలు

హైదరాబాద్ ,జనవరి 19:  ఉస్మానియా విశ్వవిద్యాలయం పిజి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.పరీక్షా కేంద్రాల వద్ద ఫిబ్రవరి 7వ తేదీ వరకు 144వ సెక్షన్ విధించారు. కాగా, తెలంగాణ ప్రకటించే వరకు తాము సెమిస్టర్ పరీక్షలు వ్రయ బోమని  ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.  ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. దీంతో  యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కొత్త మంత్రులు ఇద్దరే:మరో నలుగురికి ప్రమోషన్ : ఆంథ్ర నుంచి ఎవరూ లేరు...

జైపాల్ రెడ్డికి పెట్రోలియం శాఖ  

న్యూఢిల్లీ,జనవరి 19: కేంద్ర మంత్రి వర్గంలోకి కొత్తవారిని తీసుకోవడంతోపాటు కొందరి శాఖలను మార్చారు. మన రాష్ట్రానికి చెందిన ఎవరికీ కొత్తగా మంత్రి పదవులు దక్కలేదు. తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె పార్టీలకు స్థానం దక్కలేదు. మొత్తం ఆరుగురు ప్రమాణస్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రస్తుత సహాయ మంత్రులు  ప్రఫుల్ మనోహర్ బాయ్ పటేల్, శ్రీప్రకాష్ జైశ్వాల్, సల్మాన్ ఖుర్షీద్ ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తిగల సహాయ మంత్రిగా మరో ప్రస్తుత సహాయ మంత్రి  బేణీ ప్రసాద్ వర్మప్రమాణం చేశారు. కొత్త సహాయ మంత్రులుగా అశ్వని కుమార్, కె.సి.వేణుగోపాల్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ స్వల్ప స్థాయిలోనే జరిగిందని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. పరిమిత సంఖ్యలో మాత్రమే కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని ప్రధాని చెప్పారు. పులు కాగా మంత్రుల శాఖలలో కూడా మార్పులు చేశారు. పెట్రోలియం శాఖ జైపాల్ రెడ్డికి, పట్టణాభివృద్ది శాఖ కమల్ నాథ్ కు, భారీ పరిశ్రమల శాఖ ప్రఫుల్ల కుమార్కు, జలవనరుల శాఖ సల్మాన్ ఖుర్షీద్ కు కేటాయించారు. కపిల్ సిబాల్ కు టెలికం, మానవ వనరుల శాఖలను, మురళీదేవరాకు కార్పోరేట్ వ్యవహారాలను, సిపి జోషీకి , రోడ్లు, రవాణా శాఖ ను కేటాయించారు. వాయిలార్ రవికి పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. విలాస్ రావ్ దేశ్ ముఖ్ కు పంచాయతీ రాజ్ శాఖని కేటాయించారు. బేణీ ప్రసాద్ వర్మని ఉక్కు శాఖకు స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రిగా నియమించారు. కె.వి థామస్ కు స్వతంత్ర హొదా ఇచ్చారు. కెపి గిల్ కు గణాంక వ్యవహారాలను కేటాయించారు. జితిన్ ప్రసాద్ రవాణ శాఖ సహాయ మంత్రిగా, అజయ్ మాకెన్ క్రీడల శాఖ సహాయ మంత్రిగా, అశ్వని కుమార్ ప్లానింగ్, పార్టమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.

Tuesday, January 18, 2011

ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు

న్యూఢిల్లీ,జనవరి 18: భూకంప ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి 1.55 ని.లకు ఉత్తర భారతం ఒక్క నిముషం పాటు వణికింది. బెలుచిస్తాన్ కేంద్రంగా భూమి కంపించడంతో దేశ రాజధానితో పాటు పలు నగరాలలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. న్యూఢిల్లీ,జైపూర్, నోయిడా, గుర్గావ్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. కాగా పాకిస్తాన్ , ఇరాన్‌లలో కూడా భూమి కంపించినట్లు సమాచారం.

బృందావనం ‘ స్వామి’ అరెస్ట్

మథుర,జనవరి 18:  మైనర్లతో సెక్స్ సినిమాలు రూపొందించారనే ఆరోపణలపై బృందావనానికి చెందిన ‘సెక్స్ స్వామి’ భాగవతాచార్యను పోలీసులు అరెస్టు చేశారు. పది రోజులుగా పరారీలో ఉన్న భాగవతాచార్య (రాజేంద్ర), అతడి భార్య పంకజ్‌లను సోమవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి సీడీలు, కెమెరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ నెల మొదట్లో స్వామి ‘లీలలు’ బయటపడటంతో హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. మథురలో అతడి దిష్టిబొమ్మలను దహనం చేసి, రాజేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ‘యమునా నది, దాని ఘాట్‌లు, మందిరాలు బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని ఇతడు తన విదేశీ శిష్యుల కోసం సెక్స్ సినిమాలు రూపొందించేవాడు. వారు వీటిని కొన్ని వెబ్‌సైట్ల ద్వారా మార్కెట్ చేసేవారు. కొందరు మైనర్లు, అతడి భార్య, విదేశీయులు పాల్గొన్న సెక్స్ సినిమాల సీడీలను మేం స్వాధీనం చేసుకున్నాం’ అని పోలీసులు తెలిపారు. పెయింటర్ కూడా అయిన రాజేంద్ర తన భార్య నగ్న చిత్రాలను తన సొంత పని కోసం తీశానని, అయితే.. వాటిని కొందరు దుర్వినియోగం చేశారని పేర్కొంటున్నాడు. కాగా, తన భర్త ల్యాప్‌టాప్ రిపేర్ చేసిన ఓ ఐటీ సంస్థ అందులో ఉన్న కొన్ని చిత్రాలను బయటకు విడుదల చేసిందని ఆరోపిస్తూ.. గతంలో పంకజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రాలను విడుదల చేయకుండా ఉండటానికి సదరు సంస్థ యజమాని రూ. 10 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 

మూడో వన్డేలో కూడా భారత్ విజయం: రాణించిన యూసుఫ్ పఠాన్

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ యూసుఫ్  పఠాన్
కేప్‌టౌన్,జనవరి 18: మూడో వన్డేలో కూడా భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ దక్షిణాఫ్రికాపై రెండు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌట్ అయింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన జహీర్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా, మునాఫ్ పటేల్, ఆశిష్ నెహ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో సారథి స్మిత్ 43, డుమిని 52, ప్లెసిస్ 60 పరుగులు చేశారు. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టాప్ ఆర్డర్ చెప్పుకోదగినట్లు ఆడకపోవడంతో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తు కష్టాల్లో పడింది. ఓపెనర్ మురళీ విజయ్ 1,విరాట్ కోహ్లి 28, రోహిత్ శర్మ 23,యువరాజ్ సింగ్ 16, మహేంద్రసింగ్ ధోనీ 5 పరుగలు చేసి అవుటయ్యారు.ఈ దశలో యూసుఫ్  పఠాన్, సురేష్ రైనాలు చక్కగా ఆడి జట్టును ఆదుకున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడిన యుసఫ్ జట్టు స్కోరును పరుగులెత్తించాడు. మూడు భారీ సిక్స్ ‌లు, ఆరు ఫోర్లతో 50 బంతుల్లో 59 పరుగులు చేశాడు. మరోవైపు నాలుగు ఫోర్లతో 37 పరుగులు చేసిన రైనా మోర్కెల్ బౌలింగ్‌లో డివిలీయర్స్‌కు చిక్కాడు. ఆ వెంటనే యుసఫ్ కూడా అవుటవ్వడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. అప్పటికీ జట్టు స్కోరు ఏడు వికెట్లకు 182 పరుగులు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన హర్ భజన్ రెన్డు భారీ సిక్సర్లతో 23 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జహీర్ ఖాన్(14), నెహ్రా(6)ల సాయంతో జట్టు విజయానికి కావాల్సిన పరుగులను సాధించాడు. ఆఖరికి ఫోరు కొట్టి నెహ్రా జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఐదు వన్డేల సీరిస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. యుసఫ్ పఠాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

మరో రాయబారిపై చర్య...

న్యూఢిల్లీ,జనవరి 18: ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన రాయబారి అలోక్ రంజన్ షా ను భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. ఈ సంఘటన ఈ నెల 7న జరిబింది. న్యూయార్క్ శాశ్వత మిషన్‌లో తొలి కార్యదర్శిగా రంజన్ షా నియమితులయ్యారు. రంజన్ 2002 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ క్యాడర్‌కు చెందిన వారు.ఇటీవలే భార్యపై దాడి చేసిన సంఘటనలో లండన్‌లోని భారతీయ హైకమిషన్‌కు చెందిన రాయబారి అనిల్ వర్మపై విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్య తీసుకున్న సంగతి తెలిసిందే.

మరో బలప్రదర్శనకు జగన్ రె 'ఢీ' !

పెట్రోల్ ధరల పెంపుపై  22న విశాఖలో భారీ ధర్నా

 హైదరాబాద్,జనవరి 18: కొత్త పార్టీ పెట్టబోతున్న  మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరో బలప్రదర్శనకు సిద్ధపడుతున్నారు.  వరుస తుఫానుల ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కృష్ణానదీ తీరం సాక్షిగా లక్ష్యదీక్షను,ఢిల్లీలో  జలదీక్షను విజయవంతంగా నిర్వహించిన జగన్ ముచ్చటగా మూడోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సవాల్ చేసేలా పెట్రోల్ ధరల పెంపుపై సమరశంఖం పూరించారు.పెట్రోల్ ధరల పెంపుపై  ఈనెల 22వ తేదీన విశాఖలో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు జగన్  ప్రకటించారు. ప్రస్తుతం అ విశాఖ్ జిల్లాలో సాగిస్తున్న ఓదార్పు యాత్రలో భాగంగా మంగళవారం పాయకరావుపేటలో  జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను సాగిస్తున్న ఓదార్పు యాత్రను 21వ తేదీ వరకు కొనసాగిస్తామని ప్రకటించారు. 

రాష్ట్రంలో 'గవర్నర్' పాలన !

హైదరాబాద్,జనవరి 18: రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి నుంచి బయటపడేందుకు అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి కొంతకాలం గవర్నర్ పాలన విథించడంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ స్వయంగా ఈ సూచనతో యూపీఎ ఛైర్ పర్సన్‌కు ఓ రహస్య నివేదికను అందజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగాజగన్ వైపు వెళుతున్న ఎమ్మెల్యేల తోకలు కత్తిరించేందుకే కాంగ్రెస్ హై కమాండ్ పలు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తొందని చెబుతున్నారు. కర్నాటకలో యడ్యూరప్ప సర్కార్‌ను కూలదోసేందుకు స్వపక్ష నేతలే విపక్షంతో కలిసి వ్యూహ రచన చేసిన సమతంలో యడ్యూరప్ప అత్యంత చాకచక్యంగా స్పీకర్ చేత విపక్షంతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలతోపాటు స్వతంత్ర అభ్యర్థులపై అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఎదురు తిరుగుతున్న 24 మంది ఎమ్మెల్యేలపై ప్రయోగించాలన్న ప్రత్యామ్నాయం కూడా పరిశీలనలో ఉందట. అయితే జగన్ వెనుక ఇపుడు కనబడుతున్న 24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాక మరో 70 మంది ఎమ్మెల్యేలున్నారని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి చెప్పడంతో హై కమాండ్ అయోమయంలో పడిందంటున్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: కె.సి.ఆర్.

హైదరాబాద్,జనవరి 18: లక్ష్య సాధన కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు యుద్ధానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. తెరాస కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ ఉద్యమానికి కార్యకర్తలు, ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేంద్రం వెనుకంజ వేయడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర వైఖరిలో మార్పురానంత వరకూ తమ వైఖరిలో మార్పు ఉండదని తేల్చి చెప్పారు. నివేదిక వ్యతిరేకంగా వస్తే రాజీనామా చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఇపుడు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. రచ్చబండను  రచ్చరచ్చ చేయాలని కోరారు. తెలంగాణ అంశం తేలేవరకు ప్రజల వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధుల భరతం పట్టాలని కోరారు.

Monday, January 17, 2011

స్విస్ ఖాతాల చిట్టా విప్పనున్న వికీలీక్స్!

లండన్,జనవరి 17: సంచలనాల వికీలీక్స్ ఇప్పుడు భారత్‌తో సహా వివిధ దేశాలకు చెందిన 2,000 మంది అక్రమార్కులు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాచుకున్న లక్షల కోట్ల రూపాయల గుట్టు రట్టుచేయడానికి సిద్ధపడుతోంది.మరికొన్ని వారాల్లో వెల్లడ య్యే ఈ చిట్టాలో మన దేశానికి చెందిన 40 మంది శ్రీమంతులున్నట్టు కొన్ని చానళ్ల కథనం. భారత్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు దాచిన నల్లడబ్బు ఎంతో ఆసక్తి నెలకొంది. స్విస్ బ్యాంకుల్లో దాదాపు 300 దేశాలనుంచి వచ్చిన నల్లధనం దాగుందని ఒక అంచనా. దేశదేశాల్లో ఎందరో పన్నులు ఎగ్గొట్టి, ముడుపులు మింగి అక్రమ మార్గాల ద్వారా స్విస్ బ్యాంకులకు చేర్చిన సొమ్ము వివరాలున్న రెండు సీడీలను స్విస్ బ్యాంక్ జూలియస్ బేయర్‌లో మాజీ ఉద్యోగి అయిన రుడాల్ఫ్ ఎల్మార్ సోమవారం లండన్‌లోని ఫ్రంట్‌లైన్ క్లబ్‌లో మీడియా సాక్షిగా వికీలీక్స్ అధినేత అసాంజేకు అందజేశారు. ఎల్మార్ రహస్య బ్యాంకింగ్ చట్టాలను ఉల్లంఘించాడంటూ అతను పనిచేసిన బ్యాంకు 19 ఆరోపణలతో లోగడే కేసు పెట్టింది. ఆ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఎల్మార్ మరో రెండురోజుల్లో స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉంది. తనకు అసాంజేపై అపారమైన విశ్వాసం ఉందని, అందుకే ఈ రెండు సీడీలనూ ఆయనకు అప్పగిస్తానని ఎల్మార్ ముందే ప్రకటించాడు. ఎల్మార్‌పై ఆరోపణలు రుజువైతే ఆయనకు మూడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది.కాగా, ఎల్మార్ అందజేసిన సీడీల్లోని డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని అసాంజే చెప్పారు. ప్రస్తుతం దౌత్యపరమైన 2,50,000 కేబుల్ సందేశాలపై వికీలీక్స్ దృష్టిపెట్టినందువల్ల ఈ రెండు సీడీలనూ చూసి తమ వెబ్‌సైట్‌లో పెట్టడానికి మరికొన్ని వారాలు పడుతుందని అసాంజే వివరించారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...