Monday, January 28, 2013

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ఆరో నిందితుడు మైనర్-జువనైల్ జస్టిస్ బోర్డు

న్యూఢిల్లీ,జనవరి 28: ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ఆరో నిందితుడు మైనర్ అని జువనైల్ జస్టిస్ బోర్డు సోమవారం ప్రకటించింది. అందువల్ల అతనిపై విచారణ మైనర్‌ను విచారించే రీతిలోనే జరుగుతుంది. దాంతో ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులో అతనిపై విచారణ జరిగే అవకాశం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురు నిందితులపై విచారణ జరుపుతోంది. స్కూల్ సర్టిఫికెట్‌ను చూపుతూ ఆరో నిందితుడు 1995 జూన్ 4వ తేదీన జన్మించినట్లు జువనైల్ జస్టిస్ బోర్డు తెలిపింది. పోలీసులు అతనికి బోన్ ఆసిఫికేషన్ టెస్టు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పాఠశాల సర్టిఫికెట్ పట్ల బోర్డు విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, తాము ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తామని నిందితుడికి వ్యతిరేకంగా వాదిస్తున్న న్యాయవాది అంటున్నారు. మైనర్ అయినందున ఆరో నిందితుడిని జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద మాత్రమే విచారిస్తారు. దాని కింద అతనికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే  పడుతుంది.

40వ సారి రంజీ విజేత ముంబై

ముంబై,జనవరి 28:  ముంబై జట్టు 40వ సారి రంజీ ట్రోఫీని గెల్చుకుంది. ఫైనల్స్ లో  సౌరాష్ట్రపై ముంబై జట్టు  ఇన్నింగ్స్ 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్ర జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 148 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 82 పరుగులు చేసింది. ముంబై జట్టు మొదటి ఇన్నింగ్స్ లోనే 355 పరుగులు చేసింది.

Sunday, January 27, 2013

తెలంగాణపై అమెరికా అప్రమత్తం.

 హైదరాబాద్, జనవరి 26:  ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని అమెరికా దౌత్య కార్యాలయం సూచించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న దృష్ట్యా  అనిశ్చిత పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాలకు వెళ్లరాదని అమెరికన్లను హెచ్చరించింది. ఇందిరాపార్కు, లోయర్ ట్యాంక్‌బండ్, గన్‌పార్కు సమస్యాత్మక ప్రాంతాలని, ఉస్మానియా వర్సిటీ ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలకు కేంద్రమని పేర్కొంది.

Saturday, January 26, 2013

            వార్తాప్రపంచం వీక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు... 

Friday, January 25, 2013

రామానాయుడికి పద్మ భూషణ్,బాపుకు పద్మశ్రీ

న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ’అవార్డులను  ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కగా, 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. 80 మందికి పద్మశ్రీ అవార్డుల దక్కాయి. రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ నిర్మాత డి. రామానాయుడికి పద్మ భూషణ్ అవార్డు లభించగా, డా. చిట్టా వెంకట సుందరం, ఎం రామకృష్ణరాజులకు పద్మశీ పురస్కారాలు దక్కాయి. దర్శకుడు  బాపుకు తమిళనాడు కోటాలో పద్మశ్రీ పురస్కారం దక్కింది. నానాపటేకర్, డా. రాధిక, శ్రీదేవి, సురభి బాబ్జి, జి. అంజయ్య, రాహుల్ ద్రవిడ్‌లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. రాష్ట్రం నుంచి 8 మందికి 'పద్మ' పురస్కారాలు లభించాయి.  

Thursday, January 24, 2013

జగన్ బెయిల్‌ పిటీషన్ తిరస్కరణ

హైదరాబాద్ , జనవరి 24:  వైఎస్‌ జగన్‌కు హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. జగన్ రెగ్యులర్‌ బెయిల్‌ పిటీషన్ పై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేసు విచారణలో ఉన్నందున ఆయనకు  బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది. ఈ సమయంలో  బెయిల్ పిటిషన్ విచారణార్హం కాదని  కోర్టు వెల్లడించింది. 

ఉరి వద్దు--20 ఏళ్ళ జైలే సరి...

గ్యాంగ్‌రేప్ లపై వర్మ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ, జనవరి 23: సామూహిక అత్యాచారాలకు పాల్పడే కీచకులకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్షలు విధించాలని జస్టిస్ జె.ఎస్.వర్మ కమిటీ సిఫార్సు చేసింది. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు సూచించేందుకు ఏర్పాటైన ఈ కమిటీ బుధవారం తన 630 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దేశంలో మహిళలపై నేరాలు పెరగడానికి ప్రభుత్వ పాలనా వైఫల్యం, పోలీసుల స్పందనారాహిత్యం, లింగ వివక్ష కారణమని,   ప్రస్తుత చట్టాలను సరిగ్గా అమలు చేయడం ద్వారా మహిళలపై నేరాలను అరికట్టే అవకాశం ఉన్నా ప్రభుత్వ అసమర్థత వల్ల అది సాధ్యం కావడంలేదని  కమిటీ  విమర్శించింది.  అత్యాచారం, హత్యలకు పాల్పడే వారికి జీవితాంతం జైలు శిక్షలు విధించాలని సూచించింది. లైంగిక నేరాలకు పాల్పడే పోలీసు, ప్రజాప్రతినిధులు సహా అత్యాచార దోషులందరికీ కఠిన శిక్షలు విధించేలా క్రిమినల్ చట్టాలను సవరించాలని కోరింది. అయితే  అత్యాచార దోషులకు ఉరిశిక్షలు విధించడం సరైన విధానం కాదని...శరీర అవయవాలను గాయపరిచేందుకు రాజ్యాంగం అంగీకరించదని తెలిపింది.  బాల నేరస్థుల  వయసును ప్రస్తుతమున్న 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న డిమాండ్‌ను కూడా కమిటీ తోసిపుచ్చింది. వివిధ వర్గాల ప్రజల నుంచి అందిన సుమారు 80 వేల సూచనలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ కేవలం 29 రోజుల్లో ఈ నివేదికను రూపొందించింది.

గడువు లోపు నిర్ణయం కష్టం...తెలంగణా పై అజాద్

 న్యూఢిల్లీ, జనవరి 23: తెలంగాణపై నిర్ణయానికి నెల రోజుల డెడ్‌లైన్ ఏదీ లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. ‘నెల రోజుల గడువులో సమస్యకు పరిష్కారం లభించదు. సున్నితమైన సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ‘తెలంగాణపై చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో కూడా సంప్రదింపుల ద్వారా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. గణతంత్ర దినం, తర్వాత ఆదివారం.. ఇలా వరుసగా సెలవులొస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది’’ అని ఆయన తెలిపారు. 

మళ్ళీ మనమే నెంబర్ వన్...!

మొహాలి, జనవరి 23: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటూ ధోనిసేన వన్డే సిరీస్‌లో విజయ ఢంకా మోగించింది. మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలోనూ అలవోకగా నెగ్గి  ఐదు మ్యాచ్ ల సిరీస్ ను  3-1 తో కైవశం చేసుకుంది.  ఈ విజయంతో భారత్ నంబర్‌వన్ ర్యాంక్ పదిలమయింది. నామమాత్రపు ఆఖరి వన్డే ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో ఓడినా భారత్ నంబర్‌వన్ ర్యాంక్ పదిలం గానే ఉంటుంది.    బుధవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 258 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 257 పరుగులు చేసింది. రైనాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  

Saturday, January 19, 2013

ఇంగ్లండ్ ను ఇరగదీసిన ఇండియా...

రాంచీ,జనవరి 19:  ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.  156 పరుగుల లక్ష్యాన్ని ధోని సేన 28.1 ఓవర్లలోనే చేరుకుంది. కోహ్లి(77) అజేయ అర్థ సెంచరీకి తోడు గంభీర్(33), యువరాజ్ సింగ్(30) రాణించడంతో సునాయాసంగా గెలుపు సాధించింది. ధోని 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రహానే డకౌటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ట్రెడ్ వెల్ 2 వికెట్లు తీశాడు. ఫిన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌలయింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యం సాధించింది.

ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ

జైపూర్,జనవరి 19:  అందరూ ఊహించినట్టుగానే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి పార్టీలో ప్రముఖ పదవి దక్కింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ సాయంత్రం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి రాహుల్ పేరును ఏకే ఆంటోని ప్రతిపాదించగా సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాహుల్ నియమాకాన్ని జనార్దన్ ద్వివేది అధికారికంగా వెల్లడించారు. లక్షలాది మంది కార్యకర్తల ఆకాంక్ష మేరకు పార్టీలో రెండో స్థానానికి రాహుల్ ను ఎంపిక చేశామని తెలిపారు. యువనేత నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2014లో రాహుల్ సారథ్యంలో ఎన్నికలకు వెళతామని ద్వివేది అన్నారు.

Thursday, January 17, 2013

జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన

న్యూఢిల్లీ, జనవరి 18: రాజకీయ సంక్షోభం నుంచి జార్ఖండ్ బయటపడకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించేందుకే కేంద్రం మొగ్గుచూపింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది.  82 మంది సభ్యులుగల జార్ఖండ్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ పంపిన నివేదికను కేబినెట్ ఈ భేటీలో ఆమోదించింది. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు ఉపసంహరించడం వల్ల తన ప్రభుత్వం మైనారిటీలో పడటంతో ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఇటీవల పదవికి రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరిన సంగతి తెలిసిందే.  2000 సంవత్సరంలో ఏర్పడిన జార్ఖండ్‌లో రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు.

డీజిల్ అంటుకుంది...

న్యూఢిల్లీ, జనవరి 18: పెట్రోలు తరహాలో డీజిల్ ధరలపైనా నియంత్రణను ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం గురువారం  నిర్ణయం తీసుకుంది. సమయానుకూలంగా డీజిల్ ధరలను పెంచుకునేందుకు చమురు కంపెనీలకు అవకాశమిచ్చింది. దీంతో రిటైల్‌లో కొనే వినియోగదారులకు ప్రతి నెలా 50 పైసల చొప్పున(స్థానిక పన్నులు కలిపి) డీజిల్ ధర పెరగనుంది. తొలి దశగా.. గురువారం అర్ధరాత్రి నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. అదేసమయంలో గంపగుత్తగా కొనే రైల్వే, ఆర్టీసీ లాంటి సంస్థలకు ఇలా దశలవారీ కాకుండా ఒకేసారి లీటరుకు దాదాపు రూ.10 చొప్పున పెంపు అమలు కానుంది.  దీంతో ప్రజా రవాణా చార్జీలు భారీగా పెరిగే అవకాశముంది.  కాగా ఇదే సమయంలో పెట్రోలు ధరలను లీటరుకు 25 పైసల చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించడం గమనార్హం. వ్యాట్‌తో కలుపుకొంటే మరో 5 పైసలు అదనంగా తగ్గే అవకాశముంది. డీజిల్‌పై ప్రస్తుతం ఇస్తున్న రూ.9.60 సబ్సిడీని( లీటరుకు) ఎత్తి వేయాలని, నెలకు రూ.1 చొప్పున పెంచడం ద్వారా ఈ సబ్సిడీ తొలగించాలని కొంతకాలం కిందట విజయ్ కేల్కర్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకునే క్యాబినెట్ కమిటీ.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
 
ఇక 9 సిలిండర్లు 

 గృహావసరాలకు ఉద్దేశించిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్య ను 6 నుంచి 9కి(ఏడాదికి) పెంచుతూ  ‘రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ’ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వెల రూ.410.50గా ఉంది. ఇకపై ఏడాదికి 9 సిలిండర్లు దాటితే.. మార్కెట్ ధరకే సిలిండర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 వరకు సామాన్య వినియోగదారుడు 3 సబ్సిడీ సిలిండర్లు పొందడానికి అవకాశముండగా.. తాజానిర్ణయం ప్రకారం 5 సిలిండర్లు తీసుకోవడానికి చాన్సుంది. మార్చి 31 ముగిసిన తర్వాత ఏడాదికి 9 సబ్సిడీ సిలిండర్లు పొందవచ్చు. 
 

Wednesday, January 16, 2013

హైదరాబాదు తెలుగు లలితకళా తోరణంలో బుధవారం ఉదయం మన బియ్యం పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతగా నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.  మన బియ్యం పథకంలో స్థానికంగా లభించే నాణ్యమైన బియ్యాన్నే రూపాయికి కిలో  చొప్పున రేషన్ దుకాణాల్లో విక్రయిస్తారు. 



Tuesday, January 15, 2013

మాయావతి తెలం 'గానం '...

న్యూఢిల్లీ , జనవరి 15: పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) మద్దతిస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి  అన్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని తాము తీర్మానం చేశామని చెప్పారు. అలాగే తెలంగాణకు తమ మద్దతు ఉంటుందని,  బిల్లు పెడితే సంపూర్ణ మద్దతిస్తామని అన్నారు. 

పాక్ ప్రధాని అరెస్ట్ కు ఆదేశం

ఇస్లామాబాద్ , జనవరి 15: పాకిస్థాన్‌ ప్రధాని పర్వేజ్‌ అష్రాఫ్‌ అరెస్ట్‌కు పాక్‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. పాక్‌ ప్రధాని సహా మరో 16మందిని అరెస్ట్‌ చేయాలని అధికారులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్‌ ప్రాజెక్టుల కేటాయింపుల్లో పాక్ ప్రధాని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  

రెండవ వన్డేలో భారత్ ఘన విజయం

కోచి, జనవరి 15:  ఇంగ్లాండ్ తో కోచిలో జరిగిన రెండవ వన్డేలో భారత జట్టు భారీ స్కోరు తేడాతో ఘన విజయం సాధించింది. 286 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లను భారత బౌలర్లు షమీ, భువనేశ్వర్ కుమార్. జడేజా, అశ్విన్ లు కట్టడి చేశారు. దాంతో ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడికి లోనై వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టు 36 ఓవర్లలోనే 158 పరుగులకు కుప్పకూలింది. దాంతో భారత్ కు 127 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది భువనేశ్వర్, అశ్విన్ లు మూడేసి, జడేజాకు రెండు వికెట్లు, షమీకి ఒక వికెట్ లభించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ధోని 72, జడేజా 61, రైనా 55, కోహ్లీ 37, యువరాజ్ 32 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్, డెర్న్ బాచ్ రెండేసి వికెట్లు, వోక్స్, ట్రెడ్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు.

Thursday, January 10, 2013

ఇక ' శవ ' బాంబులు...!

న్యూఢిల్లీ,జనవరి 11: మానవ బాంబులతో,  మందుపాతరలతో జనాన్ని చంపడం  మావోయిస్టులకు మొహమ్మొత్తినట్టు ఉంది. శవాలలో బాంబులు పెట్టి  మరణ మృదంగాన్ని మొదలెట్టారీ ముష్కరులు...  జార్ఖండ్‌లోని లాతెహార్ జిల్లాలో ఈనెల 7న మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో పదిమంది జవాన్లు మరణించారు. కానీ, ఆరుగురి మృతదేహాలే లభించాయి. మిగిలిన నలుగురి కోసం గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టారు. ఆ నాలుగూ బుధవారం సాయంత్రం కనిపించాయి. వాటిని రాంచీకి తరలిస్తుండగా ఒక మృతదేహంలో అమర్చిన బాంబు పేలింది. దాంతో, అక్కడే ఉన్న నలుగురు గ్రామస్తులు మరణించారు. మిగిలిన మూడు మృతదేహాలను హెలికాప్టర్లో రాంచీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో అలహాబాద్‌కు చెందిన బాబూలాల్ పటేల్ (29) పొట్ట ఉబ్బెత్తుగా ఉంది. దానిపై కుట్లు ఉన్నాయి. వాటిని చూసిన డాక్టర్లకు అనుమానం వచ్చింది. మృతదేహాన్ని ఆరుబయట ఉంచి ఎక్స్‌రే తీశారు. ఏదో లోహపు వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అందులో అత్యాధునిక పేలుడు పదార్థాలు (ఐఈడీ). ఒక్కొక్కటి కిలోన్నర బరువు ఉంది. ఆ వెంటనే ఢిల్లీ నుంచి ఎన్ఎస్‌జీలోని బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. ఆ బృందం బాంబును నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. . "ఎన్‌కౌంటర్ తర్వాత మృతదేహాలను ఎత్తుకుపోయి,  వాటి పొట్టను చీచి  అందులోని పేగులు, ప్లీహం తదితర అవయవాలను తీసి ఆ ఖాళీలో ప్లాస్టిక్ బాక్సులో కిలోన్నర బరువుండే జిలెటిన్ స్టిక్కులు, డిటోనేటర్, ఒక బ్యాటరీని ఉంచి ప్యాక్ చేశారని, ఆ తర్వాత  కుట్లు వేశారని అని పోలీసులు  వివరించారు. మావోయిస్టుల్లో ఎంతో నైపుణ్యం గల డాక్టర్ ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు.

Wednesday, January 9, 2013

హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యేకు జైలు...

గుంటూరు, జనవరి 9 : కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వున్నం నరేంద్ర హత్య కేసులో మూడో నిందితుడుగా ఉన్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కు  పిడుగురాళ్ల మేజ్రిస్టేట్  14 రోజులు రిమాండ్ విధించడంతో  ఆయనను  గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.  శ్రీనివాసరావును  పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.  ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ తనను కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం అక్రమంగా హత్య కేసులో ఇరికించిందన్నారు. పల్నాడు ప్రాంతంలో పార్టీకి అండగా ఉంటుండటంతో రాజకీయంగా అణగదొక్కాలనే దురుద్దేశంతో హత్య కేసులో ఇరికించారన్నారు. ఇటువంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు.

బడ్జెట్ కు ముందే రైల్వే బాదుడు...

న్యూఢిల్లీ, జనవరి 9 : రైల్వే బడ్జెట్ కు ముందే  రైల్వే చార్జీలు పెరిగాయి. రైల్వేలు నష్టాలలో ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ తెలిపారు. 
 అన్ని తరగతులకు 20 శాతం ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. ఆర్డినరి, సబర్బన్‌లలో కిలోమీటరుకు 2పైసలు, నాన్ సబర్బన్‌లో కిలోమీటరుకు 3పైసలు, స్లీపర్ క్లాస్‌లో కిలోమీటరుకు 6పైసలు, ఏసీ చైర్ కార్ కిలోమీటరుకు 10 పైసల చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు.  పెరిగిన  చార్జీలు ఈనెల 21 అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నట్లు బన్సాల్ తెలిపారు. ప్రతి టికెట్‌పై డెవలప్‌మెంట్ చార్జీ 5 రూపాయలు ఉంటుందని బన్సాల్ అన్నారు. చార్జీల పెంపు అనివార్యమనీ, ఇకపై బడ్జెట్‌లో చార్జీల పెంపు ఉండదని బన్సాల్ తెలియజేశారు. ఈ రైల్వే చార్జీల పెంపుతో కేంద్రానికి రూ. 6,600 కోట్ల ఆదాయం వస్తుంది.

ఆదిలాబాద్ జైల్ లో అక్బరుద్దీన్...

హైదరాబాద్, జనవరి 9 : ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ పై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన క్వాష్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అక్బరుద్దీన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. మన దేశంలో చట్టం అందరికీ సమానమేనని కోర్టు తెలిపింది.  అక్బరుద్దీన్‌పై దాడి జరిగినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని అన్ని మతాలకు చెందినవారు ప్రార్థనలు చేసిన విషయాన్ని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేసింది. కాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అరెస్ట్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని  ఈనెల 22 వరకు రిమాండ్ పై  ఆదిలాబద్ జిల్లా జైలుకు తరలించారు. కాగా, ఆరోగ్యం సరిగా లేనందున తనను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు లేదా వరంగల్ జైలుకు తరలించాలని అక్బర్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. అదిలాబాద్ జిల్లా కేంద్రం జైలులోనే ఉంచి, రిమ్స్‌లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోర్టు అదేశించింది.

Saturday, January 5, 2013

రికార్డు స్థాయిలో షిర్డీ ఆదాయం

షిర్డీ,జనవరి 5: మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథుని ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. కేవలం 10 రోజుల్లో రూ.13 కోట్లు కానుకల రూపంలో చేకూరాయని సంస్థాన్ వర్గాలు  వెల్లడించాయి. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 మధ్య సాయిని దర్శించుకున్న సుమారు 20 లక్షల మంది భక్తులు ఈ కానుకలు సమర్పించారని తెలిపారు. వీటిలో రూ.35 లక్షల విలువ చేసే బంగారం, వెండి కానుకలు కూడా ఉన్నట్టు చెప్పారు. గతేడాది ఇదే కాలంలో రూ.12.5 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 

Friday, January 4, 2013

సెనెట్ లో 'గీతా' ప్రమాణం ...

వాషింగ్టన్ ,జనవరి 5:  అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన  ఇండో- అమెరికన్ తులసీ గబార్డ్(31) భగవద్గీతపై ప్రమాణం చేశారు.  ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందువుగా తులసీ గబార్డ్ రికార్డుకెక్కారు. ప్రతినిధుల సభ సభ్యుల్లో ‘గీత’ పై ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. గీతలోని బోధనలు తనకు స్ఫూర్తినిచ్చాయని, సేవకురాలైన నాయకురాలిగా ఎదిగేందుకు దోహదపడ్డాయని,  అందుకే దానిపై ప్రమాణం చేశానని చెప్పారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన మరో  ఇండో- అమెరికన్ అమీ బెరా(47) కూడా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ బోనర్ వారితో ప్రమాణం చేయించారు. వైద్యుడైన బెరా ఈ సభకు ఎన్నికైన మూడో భారతీయ అమెరికన్‌. 

మాజీ ఎమ్మెల్యే నడింపల్లి రాంభద్రరాజు మృతి

కాకినాడ,జనవరి 5:  స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే నడింపల్లి రాంభద్రరాజు (95) శనివారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అల్లవరం మండలం కోడూరుపాడులోని   తన నివాసంలో ఆయన   తుదిశ్వాస విడిచారు. ప్రజాపార్టీ నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమలాపురం నుంచి రాంభద్రరాజు నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

Thursday, January 3, 2013

గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురిపై చార్జిషీట్

 న్యూఢిల్లీ, జనవరి 4:  ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఐదుగురిపై సాకేత్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఐదుగురిపై హత్య, హత్యాప్రయత్నం, గ్యాంగ్ రేప్, అపహణ, దోపిడీ, సాక్ష్యాల మాయం కింద అభియోగాలు మోపారు. ఆరో నిందితుడిని మైనర్‌గా భావిస్తున్నారు. అతను మైనర్ అయితే విడిగా జువెనైల్ కోర్టులో అతనిపై విచారణ జరుగుతుంది. అతను మైనరా, కాదా  అనే విషయం తెలుసుకోవడానకి ఎముకల పరీక్ష నిర్వహించారు. దాని నివేదిక రావాల్సి ఉంది. అంతకు ముందు భారత ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ సాకేత్ కోర్టు సముదాయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రారంభించారు. ఈ కోర్టులో విచారణ జరిగే మొదటి కేసు గ్యాంగ్ రేప్ కేసులో ప్రాణాలు విడిచిన నిర్భయదే.

పాక్ కు పళ్ళెంలో పెట్టి...

కోల్ కతా, జనవరి 4: ఇక్కడి ఈడెన్ గార్డెన్ లో జరిగిన రెండో వన్డేలో భారత్‌పై 85 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ విజయం సాధించింది. మూడు వన్డేల సిరిస్ ను 2 -0 తో పాక్ కైవశం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 250 పరుగులకు  ఆలౌటైంది. ఆ తర్వాత 251 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన భారత జట్టు 165 పరుగులకు  ఆలౌటైంది. పాక్‌ జట్టులో జంషెడ్‌ 106, హఫీజ్‌ 76, మాలిక్‌ 24 చేశారు. భారత బౌలర్లలో జడేజా 3, ఇశాంత్‌ 3, భువనేశ్వర్‌, అశ్విన్‌, రైనాకు చెరో వికెట్‌ లభించింది. భారత ఆటగాళ్లలో ధోనీ 54 నాటౌట్‌, సెహ్వాగ్‌ 31, రైనా 18 చేశారు. అజ్మల్‌ 3, జునైద్‌ 3, ఉమర్‌గుల్‌ 2, హఫీజ్‌, మాలిక్‌కు చెరో వికెట్‌ దక్కింది.

Wednesday, January 2, 2013

రెండేళ్ల గరిష్ట స్థాయికి సెన్సెక్స్...

ముంబై, జనవరి  2: : భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ రెండు సంవత్సరాల గరిష్ట స్థాయిని చేరుకుంది. బుధవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో 19756 పాయింట్ల వద్ద ముగిసి.. 2011 జనవరి 6 నాటి స్థాయిని చేరుకుంది. ఇక నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 5993 వద్ద క్లోజైంది. ఓ దశలో నిఫ్టీ 6 వేల మార్కును చేరుకుంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బజాజ్ ఆటో, ఐడీఎఫ్ సీలు అత్యధికంగా మూడు శాతం పైగా లాభపడగా.. జయప్రకాశ్ అసోసియేట్స్, బీపీసీఎల్, మారుతి సుజుకీలు రెండు శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, విప్రో, పవర్ గ్రిడ్, ఐటీసీ, కోల్ ఇండియాలు స్వల్ప నష్టాల్లో ముగిసాయి.

శ్యామ్‌బెనెగల్‌కు అక్కినేని జాతీయ అవార్డు

హైదరాబాద్, జనవరి  2:  2012 సంవత్సరానికి  అక్కినేని జాతీయ అవార్డును ప్రముఖ దర్శకుడు శ్యామ్‌బెనెగల్‌కు ప్రకటించారు. భారత చలన చిత్ర రంగానికి అందించిన విశేష సేవలకు గుర్తుగా శ్యామ్ బెనెగల్ కు  ఈ అవర్డ్ ఇస్తున్నట్టు టి.సుబ్బిరామి రెడ్డి తెలిపారు. జనవరి 27న  జరిగే కార్యక్రమంలో శ్యామ్‌బెనెగల్‌కు అవార్డు ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు.  

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...