మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ లో జగన్ !
న్యూఢిల్లీ,జనవరి 30: దేశంలో అత్యంత శక్తిమంతులైన మొదటి 20 మంది వ్యక్తుల్లో కడప మాజీ ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒకరిగా నిలిచారు. జాతీయ పత్రికల్లో ఒకటైన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రతి ఏటా దేశవ్యాప్తంగా భిన్న రంగాలను పరిశీలించి ‘ది మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్’ జాబితాను ప్రత్యేక సంచికగా రూపొందించి పాఠకులకు అందజేస్తోంది. ఈ ఏడాది రూపొందించిన జాబితాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం నాటి సంచికతోపాటు వెలువరించింది. ఈ వంద మంది మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ లో జగన్‌ను 20వ స్థానంలో నిలిపింది. ఈ జాబితాలో.. ప్రథమ స్థానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా సొంతం చేసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (2), ప్రధాని మన్మోహన్ (3), ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ (4), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ (5) ఉన్నారు. వారి తర్వాత 15 స్థానాల్లో రాష్ట్రం నుంచి ఇద్దరు శక్తిమంతమైన వ్యక్తులుగా.. 11వ స్థానంలో ఆర్‌బీఐ గవర్నర్ డి.సుబ్బారావు, 20వ స్థానంలో వై.ఎస్.జగన్ ఉన్నారు. మొత్తంగా చూస్తే టాప్ ట్వంటీలో రాష్ట్ర రాజకీయాల నుంచి జగన్ ఒక్కరే ఉండటం గమనార్హం. మొత్తం వంద మంది మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాను పరిశీలిస్తే రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు రాజకీయ రంగం నుంచి, ఒకరు పాలనారంగం నుంచి, ఒకరు ఆర్థిక రంగం నుంచి, ఒకరు కార్పొరేట్ రంగం నుంచి.. వెరసి ఆరుగురే ఉన్నారు. రాజకీయ రంగం నుంచి జగన్ కాకుండా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 28వ స్థానంలో, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి 40వ స్థానంలో శక్తిమంతులైన వ్యక్తులుగా ఉన్నారు. పాలనా రంగం నుంచి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ 58వ స్థానంలో ఉన్నారు. ఆర్థిక రంగం నుంచి ఆర్‌బీఐ గవర్నర్ సుబ్బారావు 11వ స్థానంలో, కార్పొరేట్ రంగం నుంచి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు 49వ స్థానంలో నిలిచారు.
Comments