Friday, October 31, 2014

గురువారం  మహారాష్ట్ర  సి.ఎమ్. గా ప్రమాణస్వీకారం చేసిన బిజె.పి.  నేత ఫద్నవిస్ 

తెలంగాణాకు శ్రీశైలం విద్యుతుద్పత్తికి అనుమతి

 హైదరాబాద్, అక్టోబర్ 31; తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నీటితో విద్యుదుత్పత్తి చేసే విషయంలో కృష్ణానది వాటర్ బోర్డు తన నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 2వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టులో 3 టీఎంసీ నీటిని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ అంశాన్ని నవంబర్ 15వ తేదీ తర్వాత మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. 

Thursday, October 30, 2014

మోడీ సర్కార్ పొదుపు మంత్రం...

 న్యూఢిల్లీ, అక్టోబర్ 30; విత్తలోటును తగ్గించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు పొదుపు చర్యల్ని ప్రకటించింది. ఉన్నతాధికారులు విమానాల్లో ప్రథమ శ్రేణిలో ప్రయాణాలు చేయవద్దనీ, అయిదు నక్షత్రాల హోటళ్లలో బస చేయవద్దనీ, సమావేశాల కోసం వీలైన చోట్ల వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలనీ ఆదేశించింది. కొత్త కార్ల కొనుగోలు, ఉద్యోగ నియామకాలపైనా ఆంక్షలు విధించింది. అత్యంత అవసరమైతే తప్పిస్తే సదస్సులు నిర్వహించవద్దని కేంద్రం చెప్పింది. వాణిజ్యం పెంచుకునేందుకు ఉద్దేశించినవి మినహా ఇతర ఎగ్జిబిషన్లేవీ విదేశాల్లో నిర్వహించడానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కొత్త పోస్టులపై ప్రభుత్వం పూర్తి నిషేధాన్ని విధించింది. ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న పోస్టులను అనివార్యమైతే తప్పిస్తే భర్తీ చేయరు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12.19 లక్షల కోట్లుగా ఉన్న ప్రణాళికేతర వ్యయంలో 10 శాతాన్ని తగ్గించడం, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో విత్తలోటును ఏడేళ్ల కనిష్ఠస్థాయికి (4.1 శాతానికి) తగ్గించడం కోసం ఈ చర్యలు చేపట్టారు. స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలకూ ఆంక్షలు వర్తిస్తాయి. వడ్డీలు, రుణాల చెల్లింపు, రక్షణ శాఖ అవసరాలు, జీతాలు, పింఛన్లు మాత్రం పొదుపు చర్యల వల్ల ప్రభావితం కావు. ఆయా శాఖల కార్యదర్శులు తాము చేపట్టిన పొదుపు చర్యలపై ప్రతీ మూడు నెలలకోసారి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 2012, 2013ల్లోయూపీఏ ప్రభుత్వం  కూడా ఇలాంటి చర్యలు తీసుకొంది. 

ఇక నుంచి జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

 విజయవాడ ,అక్టోబర్ 30; ఆంధ్రప్రదేశ్ అవతరణ తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం జల వివాదం గురించి కూడా మంత్రివర్గం చర్చించింది. రాజధాని భూ సమీకరణపై ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం సూచించింది. తిరుమలలో అన్యమత ప్రచారంపై మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తన సింగపూర్, జపాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి వివరించారు. 

మంగళగిరి, తుళ్ళూరు మండలాలలో భూ సమీకరణ .... వీజీటీఎం స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ

విజయవాడ, అక్టోబర్ 30; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు రైతుల నుంచి భూ సమీకరణకు సంబంధించిన ప్రభుత్వ విధానాన్ని మంత్రివర్గ ఉప సంఘం గురువారం నాడు ప్రకటించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తుళ్ళూరు మండలాలలోని 17 గ్రామాల్లో భూ సమీకరణ జరపనున్నారు.  రైతుల నుంచి భూమిని సమీకరించి ప్రజారాజధాని నిర్మిస్తామని  మంత్రులు తెలిపారు. ప్రస్తుతం వున్న వీజీటీఎం స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 

 రాజధాని నిర్మాణం కోసం గ్రామాలు, వాటిలోని ఇళ్ళ జోలికి వెళ్ళబోమని , భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఒప్పించడానికి కృషి చేస్తామని,  ప్రభుత్వ భూమి వున్న పట్టాదారులకు ప్రత్యేక విధానం అమలు చేస్తామని,  30 వేల ఎకరాలను ఆరు సెక్టార్లుగా అభివృద్ధి పరుస్తామని , లాటరీ విధానం ద్వారా రైతులకు అనుకూలంగా వున్న ప్రాంతంలో భూమి సేకరించి  రైతులకు పదేళ్ళపాటు ఎకరానికి 25 వేల రూపాయల అదనపు సాయం అందిస్తామని, ఈసాయం ఏటా ఎకరాకి 1250 పెరుగుతుందని మంత్రులు వివరించారు.
 కాగా, తుళ్లూరు మండలం పరిధిలోకి వచ్చే 21 గ్రామాల్లోనే రాజధానిని నిర్మించాలని ఏపీ సర్కార్‌ భావిస్తోంది ఇందుకు హరిశ్చంద్రపురం, బోరుపాలెం, లింగయ్యపాలెం, అబ్బరాజుపాలెం, రాయపాడు, దొండపాడు, పిచుకలపాలెం, ఉద్దండరాయుని పాలెం, మోదుగలంక పాలెం, తుళ్లూరు, వడ్డమాను, కొండరాజుపాలెం, మందడం, వెలగపూడి, మల్కాపురం, నేలపాడు, అనంతవరం, వెంకటపాలెం, నెక్కల్లు, శాఖమూరు, అయినవోలు, పెద్దపరిమి గ్రామాలను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు దీనిపై ముసాయిదా మ్యాప్‌ను కూడా సిద్ధం చేసారు. ఈ గ్రామాల్లో 30 వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది. వీటి పరిధిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులకు పంపింది. భూ సమీకరణలో ప్రాథమిక విధులను స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించింది. అవసరమైనప్పుడు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం రంగంలోకి దిగుతుంది.

Wednesday, October 29, 2014

నాసా ప్రయోగం విఫలం ..సరకు రవాణా రాకెట్ పతనం

Rocket Bound for Space Station Explodesవాషింగ్టన్‌, అక్టోబర్‌ 29: అమెరికా రోదసీ పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన ఒక ప్రయివేటు రాకెట్‌ ప్రయోగించిన ఏడు సెకండ్లలోనే పేలిపోయింది. ఈ ప్రయోగం ఫలితంగా ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదని నాసా ప్రకటించింది. ఈ ప్రయోగం ఒక రోజు ముందే జరగవలసి ఉంది. అయితే అనివార్య కారణాలవల్ల ఈ ప్రయోగాన్ని ఒక రోజు వాయిదా వేశారు. 

మంగళవారం సాయంత్రం అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకున్న సమయంలో ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రయోగం జరిగింది. కొన్ని వేల మంది ఈ ప్రయోగాన్ని చూస్తుండగానే ఆకాశంలో పెద్ద పేలుడు సంభవించింది. రాకెట్‌ ముక్కలు ముక్కలైపోయింది. రాకెట్‌లోని ఇంధనం మొత్తం ఒక్కసారిగా అంటుకోవడంతో ఆకాశంలో మంటలు వ్యాపించాయి. రాకెట్‌ శకలాలు శరవేగంగా నేలకూలాయి. 

ఈ రాకెట్‌లో మనుషులు ఎవ్వరూ లేరు. ఈ మానవ రహిత రాకెట్‌ ద్వారా దాదాపు 5000 పౌండ్ల బరువు ఉన్న రకరకాల సామగ్రిని ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ కేంద్రంలో పనిచేస్తున్న వ్యోమగాములకు కావలసిన సామగ్రి కూడా ఇందులో ఉంది. అయితే ఈ ప్రయోగం విఫలమైనంత మాత్రాన ఆ వ్యోమగాములకు ఎటువంటి నష్టమూ సంభవించదని, వారికి ఇప్పటికే కావలసినంత ఆహార సామగ్రి ఉందని అధికారులు తెలియజేశారు. ఆర్బిటల్‌ సైన్సెస్‌ కార్పొరేషన్‌కు చెందిన ఆంటరెస్‌ అనే రాకెట్‌, అందులోని సైనస్‌ ఉపగ్రహం ఈ ప్రయోగంలో తునాతునకలయ్యాయి.
 

Tuesday, October 28, 2014

మహారాష్ట్రలో బిజెపి కి శివసేన మద్దతు...సి.ఎం. గా ఫడ్నవిస్

ముంబై, అక్టోబర్ 28; . మహారాష్ట్ర భాజపా శాసనసభా పక్షనేతగా అందరూ వూహించిన విధంగానే ఆ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీలో అధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా భాజపా అవతరించడంతో పాటు శివసేన కూడా మద్దతు ఇవ్వనుండటంతో ఆయన సీఎం పదవి చేపట్టనున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కేంద్ర కార్యాలయం వున్న నాగ్‌పూర్‌లోని అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎన్నికయ్యారు. మోదీకి అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు సంఘ్‌ ఆశీస్సులు కూడా వుండటంతో సీఎం పదవి ఆయనకు దక్కింది.  తాజా ఎన్నికల్లో విదర్భ నుంచి ఎక్కువ స్థానాలు సాధించడంతో పాటు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తాను సీఎం రేసులో లేనని ప్రకటించడంతో ఫడ్నవిస్‌కు సీఎం పీఠం దక్కేందుకు సానుకూల మార్గం ఏర్పడింది. 
22 జులై 1970లో దశాస్థ బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ జన్మించారు. తండ్రి  గంగాధర ఫడ్నవిస్‌ జనసంఘ్‌లో అనంతరం భాజపాలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. సంఘ్‌తో ఆయన కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. గంగాధర మరణాంతరం దేవేంద్ర ఫడ్నవిస్‌ రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 21 ఏళ్ల వయసులోనే నాగ్‌పూర్‌ కార్పోరేషన్‌కు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన క్రమక్రమంగా ఎదిగి సీఎం పీఠం వరకు చేరుకోనున్నారు.ఫడ్నవిస్‌కు మృదుభాషిగా పేరుంది. ఏటా కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత ఆయన నాగ్‌పూర్‌ పార్క్‌ వద్ద బడ్జెట్‌పై విశ్లేషణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి మంచి పేరుంది. 

జగన్ తో కొణతాల తె గతెంపులు..

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 : ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత కొంత కాలంగా పార్టీ అధినేత జగన్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్న కొణతాల రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. అంతేకాకుండా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జగన్‌కు కొణతాల ఘాటైన లేఖ రాశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. 
 
 నువ్వెవరినీ నమ్మవు...నిన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని జగన్‌నుద్దేశించి లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి తీవ్ర దోహం జరిగిందని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులెవరూ వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. 
 
గండి బాబ్జీ వ్యవహారమే జగన్‌-కొణతాల మధ్య విభేదాలకు కారణమని తెలుస్తోంది. కొణతాలకు సన్నిహితుడైన బాబ్జీని వారం క్రితం పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్‌ పదవి నుంచి తప్పించారు. దాన్ని అవమానకరంగా భావించిన కొణతాల సన్నిహితుల దగ్గర తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేసినట్లు సమాచారం.

భాజపా పంచన చేరిన కన్నా .....

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28: కాంగ్రెస్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ  మంగళవారంనాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా నేతృత్వంలో కన్నా ఢిల్లీలో బిజెపిలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఆంధ్రలో రానురాను కాంగ్రెస్‌ ప్రతిష్ఠ మరింతగా దిగజారుతూనే ఉండడంతో ఇక ఆ పార్టీ బ్రతికి బట్టకట్టే అవకాశం లేదని గుర్తించి ఆయన కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయం గురించి యోచిస్తున్నారని తెలుస్తున్నది. కన్నా ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతోనే ఉండి ఒక దశలో ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తారని భావించారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కూడా ఇతర కాంగ్రెస్‌ ఘనాపాటీలలాగానే ఓటమి చవిచూశారు. ఆయనపై ఎప్పటికపడు అవినీతి అస్త్రాలు సంధిస్తున్న రాయపాటి అప్పటికే కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన నరసారావుపేట నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.  విభజన సమయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధికి విశ్వాసపాత్రునిగా ఉండి, ఒక దశలో కిరణ్‌ స్థానంలో ముఖ్యంత్రి పీఠం అధిష్ఠించడానికి సైతం ఆమె ఆదేశాలకోసం ఎదురుచూసిన కన్నా ఇప్పుడు ఆకస్మికంగా బిజెపిలో చేరడం రాజకీయ పరిశీలకులను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఒక దశలో ఆయన వైఎస్సాఆర్‌ సీపీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా రఘువీరా రెడ్డిని పార్టీ ఎంపిక చేసినప్పటినుంచి కన్నాలో  పెరిగిన అసంప్త్రుప్తే ఈ నిర్ణయానికి కారణం అని ,తెలుస్తున్నది. 

Monday, October 27, 2014

తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత

హైదరాబాద్‌,అక్టోబర్ 27;  తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులను ఎత్తివేసింది. ఈ మేరకు న్యాయశాఖ ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల ఎత్తివేత ప్రక్రియ నెలరోజుల్లో పూర్తి  కాగలదని భావిస్తున్నారు. 



సియాటెల్ పాఠశాల కాల్పుల్లో ఇద్దరు బాలికల మృతి...


వాషింగ్టన్, అక్టోబర్ 27 : అమెరికాలోని సియాటెల్‌ నగరంలో మేరీస్‌విల్లే- పిల్‌ఛుక్‌ పాఠశాలలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 14ఏళ్ల గియా సోరియానో అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. పాఠశాల కేఫెటెరియాలో జైలెన్‌ ఫ్రేబర్గ్‌ అనే విద్యార్థి తుపాకితో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అనంతరం తనను తాను కాల్చుకొని మృతిచెందాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, తరువాత మరో బాలిక మరణించింది. గాయపడిన మరో ఇద్దరు బాలురు, ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Sunday, October 26, 2014

హర్యానా సి.ఎం. గా ఖట్టర్ ప్రమాణం...

చండీఘడ్ ,అక్టోబర్ 26; హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ నాయకుడు మనోహర్లాల్ ఖట్టర్ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని పంచ్కులలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖట్టర్ చేత హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అద్వానీతోపాటు బీజేపీ పాలిత రాష్త్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1966లో హర్యానా రాష్ట్రం ఏర్పాటైంది. ఇప్పుడు మనోహర్లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హర్యానా అసెంబ్లీకి మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 47 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనితో హర్యానాలో కొత్త శకం ప్రారంభమైంది. 

Friday, October 24, 2014

ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏకగ్రీవం ...వైసీపీ అభ్యర్థి అఖిలప్రియ ఎన్నిక

కర్నూలు, అక్టోబర్‌ 24 : కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో వైసీపీ అభ్యర్థి అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. టీడీపీ, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉండడంతో వైసీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆళ్టగడ్డ ఎమ్మెల్యేగా అఖిల ప్రయ ఎన్నికైనట్లు అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. తన ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. 

Thursday, October 23, 2014

గురువారం సియాచిన్ వద్ద భారత జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు చెబుతున్న ప్రధాని మోడీ 

Wednesday, October 22, 2014

అభినందన, నీరాజనం దర్శకుడు అశోక్ కుమార్ మృతి ...

హైదరాబాద్, అక్టోబర్ 22‘అభినందన’, ‘నీరాజనం’ చిత్రాల దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ (72) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన . బుధవారం నాడు చెన్నైలో మరణించారు. అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు  ఆయన సినిమాటో గ్రాఫర్ గా పనిచేశారు. అశోకే  కుమార్ దర్శకత్వం వహించిన ‘అభినందన’ చిత్రం మ్యూజికల్ హిట్ అయింది. అలాగే మరో చిత్రం ‘నీరాజనం’ సినిమా విజయం సాధించకపోయినప్పటికీ, ఆ సినిమా సంగీతం పెద్ద హిట్ అయింది. ఆయన దర్శకత్వం వహించిన ‘మంచుకురిసే వేళలో’ అనే మరో సినిమా నిర్మాణం పూర్తి కాకముందే ఆగిపోయింది. 

వచ్చే మే నాటికి ఎబోలా వ్యాక్సిన్...


న్యూ యార్క్, అక్టోబర్ 22;  ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఎబోలా వైరస్‌ నుంచి రక్షణ కోసం ప్రముఖ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వేక్సిన్‌లను సిద్ధం చేసింది. వచ్చే మే నాటికి 2,50,000 వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెస్తామని 2015 చివరి నాటికి ఒక మిలియన్‌ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. గత కొంత కాలంగా ఈ వైరస్‌తో వేల మంది మృత్యువాత పడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్‌లను తెచ్చే దిశగా దృష్టి సారించింది. యూఎస్‌ నేషనల్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఇచ్చిన సాంకేతిక సహకారంతో డెన్మార్క్‌కు చెందిన బావరిన్‌ నోర్డిక్‌ సంస్థ ఈ వ్యాక్సిన్‌ తయారు చేసింది. మొదట దీన్ని కోతులపై ప్రయోగించి ఎబోలా వైరస్‌ను నిరోధించడంలో మంచి ఫలితాలను ఇస్తోందని ధ్రువీకరించారు. దీంతో వ్యాక్సిన్ల తయారీమొదలయింది. జాన్సన్‌ అండ్‌ జన్సన్‌ సంస్థ ఈ వాక్సిన్‌ను తయారు చేయడం మొదలు పెట్టింది. 

Tuesday, October 21, 2014

శ్రీలంకతో తొలి వన్డేకు భారత జట్టు ఖరారు.

న్యూఢిల్లీ ,అక్టోబర్ 21; నవంబర్  2 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే సిరీస్‌లో తొలి వన్డేకు బీసీసీఐ భారత జట్టును ఖరారు  చేసింది. శ్రీలంక సిరీస్ లో తొలి మూడు వన్డేలకు మహేంద్రసింగ్ ధోనీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ గా సాహాను తీసుకున్నారు. కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రహానే, రైనా, అంబటి రాయుడు, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేష్, ఇషాంత్, అమిత్, అజయ్, ఆరోన్, అక్షర్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. 
 కటక్, హైదరాబాద్, రాంచీ, కోల్‌కత, అహ్మదాబాదు లలో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. 

టి. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వ కానుక

హైదరాబాద్ ,అక్టోబర్ 21; తెలంగాణ ఉద్యోగులకు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దీపావళి కానుక   ప్రకటించారు. 
ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వైద్య ఖర్చులను ఎలాంటి పరిమితులు లేకుండా ప్రభుత్వమే భరిస్తుంది 
ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందన్న ముఖ్యమంత్రి, ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగులు మరింత కృషి చేయాలని కోరారు. 

Monday, October 20, 2014

ఆళ్ళగడ్డ పోటికి తెదాపా దూరం ...

కర్నూలు, అక్టోబర్ 20; వైసీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక లో తమ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని తెలుగుదేశం ప్రకటించింది . ఈ స్థానం నుంచి శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ వైసీపీ తరఫున బరిలో నిలిచారు. వైసీపీకి చెందిన మైసూరారెడ్డి తదితరులు తమను కలసి ఆళ్ళగడ్డలో అభ్యర్థిని పోటీకి నిలపరాదని అభ్యర్థించారని, అందుకే అక్కడి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించామని తెదాపా తెలిపింది 

తూ.గో. జిల్లాలో బాణసంచా పేలి 11 మంది మృతి..

విజయవాడ,అక్టోబర్ 20;  తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతుప్ప గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాదంలో 11 మంది మృతిచెందగా ఏడుగురు గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఐదుగురికి కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులలొ 9 మంది మహిళలు ఉన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అనుమతులు లేకుండా నడిపే బాణసంచా కేంద్రాలు మూసివేయాలని, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్ష ల పరిహారం   ప్రకటించారు. 

Sunday, October 19, 2014

మహారాష్ట్ర ,హర్యానా భాజపా పరం...

ముంబై, అక్టోబర్‌ 19 : మహారాష్ట్రలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. తొలిసారిగా శివసేనతో పొత్తు వీడి సాంతంగా పోటీచేసిన భాజపా మొత్తం 280 స్థానాల్లో పోటీచేసి 122 స్థానాల్లో విజయం సాధించి పూర్తి మెజార్టీకి అవసరమైన కొన్నిస్థానాలకు ముందు ఆగింది. 2009 ఎన్నికల్లో భాజపాకు 48 సీట్లు మాత్రమే వచ్చాయి. సీట్ల సర్దుబాటులో విఫలమై ఒంటరిపోరుకు మొగ్గుచూపిన శివసేన 63 స్థానాలతో సరిపెట్టుకోవలసివచ్చింది. గత ఎన్నికల్లో సేనకు లభించిన స్థానాలు 44 మాత్రమే కావడం గమనార్హం. మూడు పర్యాయాలు వరుసగా రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌,ఎన్సీపీలు కూటమినుంచి వేరుపడి ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేశాయి. కాంగ్రెస్‌కు గతంలో 82 స్థానాలుండగా ప్రస్తుత ఎన్నికల్లో 42కు పరిమితమయింది. మరోవైపు శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి గతంలో 62 స్థానాలు రాగా ఇప్పుడు 41 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎంఎన్‌ఎస్‌కు 1, ఇతరులకు 19 స్థానాలు లభించాయి.మహా ఎన్నికల్లో భాజపా విజయంతో ముఖ్యమంత్రి పీఠం భాజపాకే దక్కనుంది. మెజార్టీ రాకపోయినప్పటికీ శివసేన మద్దతు ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పొత్తు విఫలమయినప్పటికీ కేంద్రంలో శివసేన తరఫున అనంత్‌గీతే మంత్రిపదవిలో కొనసాగుతుండటం గమనార్హం. 

హర్యానాలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ

హర్యానాలో బీజేపీ స్పష్టమైన ఆధిపగ్యం కనబరిచింది. కనీస మెజారిటీ కంటే ఎక్కువ స్థానాలలో బీజేపీ విజయకేతనం ఎగురువేసింది. హర్యానా 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 47 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 45 స్థానాలు... అంతకంటే ఎక్కువ చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పగ్గాలు అందించారు.
 

Saturday, October 18, 2014

తెలంగాణకు చత్తీస్ ఘడ్ కరెంట్...?

హైదరాబాద్ ,అక్టోబర్  18; తెలంగాణ రాష్త్రానికి విద్యుత్ కష్టాలు తీరే మార్గం కనిపించింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇరు రాష్త్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా ఒప్పందం కుదిరితే విద్యుత్ వచ్చేందుకు వీలవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం సహా తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కోతలు తీవ్రంగా అమలవుతున్నాయి. నగరంలో 2 నుంచి 4 గంటలు, గ్రామాల్లో అయితే దాదాపు 8 గంటల మేర విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 7-8 రూపాయల చొప్పున కొంటున్నా, అది ఏమాత్రం సరిపోవట్లేదు.

దీంతో ప్రభుత్వం గతంలో ఛత్తీస ఘడ్ తో మొదలైన చర్చలను పునరుద్ధరించింది. ఆ ప్రభుత్వం కూడా విద్యుత్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా లైను (కారిడార్) లేకపోవడం ఓ సమస్యగా మారింది. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుని, కారిడార్ నిర్మించుకోవడం, లేదా మరేదైనా మార్గం ద్వారా విద్యుత్తు తెప్పించుకోవడం చేయాలని భావిస్తున్నారు. 

Friday, October 17, 2014

నాల్గవ వన్డేలో భారత్ గెలుపు...అర్ధంతరంగా విండీస్ టూర్ రద్దు


ధర్మశాల,అక్టోబర్ 17;  వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్   నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్‌ 48.1 ఓవర్లలో 271 పరుగులకు అలౌటైంది. వెస్టిండీస్‌ జట్టులో శ్యామూల్స్‌ (112)  మాత్రమే ఒంటరి పోరాటం చేసాడు.  భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, షమి, అక్షర్‌ పటేల్‌, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.దీంతో ఐదు వన్డేల సీరిస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యం సాధించింది.
అర్ధంతరంగా ముగిసిన విండీస్ టూర్ 
భారత్‌తో సిరీస్‌ను వెస్టిండీస్‌ రద్దు చేసుకుంది. థర్మశాలలో జరిగిన నాలుగే వన్డే యే చివరిదని విండీస్‌ బోర్డు తెలిపింది. విండీస్‌ క్రికెటర్లకు, బోర్డుకు మధ్య పారితోషికం విషయంలో విబేధాల కారణంగా  టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్లు విండీస్‌ బోర్డు బీసీసీఐకు తెలిపింది. ఐదో వన్డే ,టీ-20తోపాటు మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు రద్దయ్యాయి. విండీస్‌ తప్పుకోవడంతో శ్రీలంకతో సిరీస్‌ను ఆడించేందుకు బీసీసీఐ యత్నిస్తున్నట్లు సమాచారం 

నిర్భయ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

చాందిపూర్‌ (ఒడిషా), అక్టోబర్‌ 17 : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నిర్భయ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిషాలోని చాందిపూర్‌ నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఇది 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. భూమిమీద నుంచి, నౌకమీద నుంచి, వాయు మార్గం నుంచి ఎలాగైనా దీన్ని ప్రయోగించవచ్చు. దాడులను సైతం తప్పించుకుని లక్ష్యాలను సాధించగలిగే సత్తా  ఈ క్షిపణికి  ఉంది నిజానికి గత ఏడాదే నిర్భయ క్షిపణిని ప్రయోగించాల్సి ఉంది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. 

ఆళ్లగడ్డ నుంచి శోభ కుమార్తె పోటి ...

కర్నూలు,అక్టోబర్ 17;  
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట తండ్రి భూమా నాగిరెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం ఎన్నికలో గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. 

మృత్యువు తో పోరాడుతున్న పాపకు పవన్ పరామర్శ ..

ఖమ్మం, అక్టోబర్‌ 17 : మృత్యువుతో పోరాడుతున్న ఓ చిన్నారి కోరికను నటుడు పవన్‌ కల్యాణ్‌ తీర్చారు. శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను పవన్‌ పరామర్శించారు. అపస్మారకస్థితిలో ఉన్న శ్రీజను చూసి పవన్‌ చలించిపోయారు. శ్రీజ కోలుకున్న తర్వాత హైదరాబాద్‌ తీసుకురావాలని బాలిక తల్లిదండ్రులను కోరారు. శ్రీజ కుటుంబానికి పవన్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. రాజమండ్రిలో కొన్న బొమ్మలను పవన్‌ చిన్నారి శ్రీజకు అందజేశారు. 
 
ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీజ అనే బాలిక తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యం కోసం బాలికను జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. . ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంచడంతో తాము ఏమీ చేయలేమని వైద్యులు తేల్చిచెప్పారు. అయితే తనకు పవన్‌ కల్యాణ్‌ను చూడాలన్న శ్రీజ కోరికను తల్లిదండ్రులు మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌కు తెలియజేశారు. దీంతో పవన్‌ను మేక్‌ ఏ విష్‌ ప్రతినిధులు సంప్రదించి శ్రీజ కోరికను తెలిపారు. దీంతో పవన్‌ ఖమ్మం వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను పరామర్శించారు. 

అమెరికాలో భారతీయ ఇంజనీరుకు జైలు శిక్ష


వాషింగ్టన్, అక్టోబర్ 17; వాణిజ్య రహస్యాలను బయటపెట్టినందుకు అమెరికాలో నివసిస్తున్న 38ఏళ్ల భారతీయ ఇంజనీరుకు 18నెలల జైలు శిక్ష పడింది. న్యూజెర్సీలోని రెండు గ్లోబల్‌ మెడికల్‌ టెక్నాలజీ సంస్థలకు చెందిన వాణిజ్యపరమైన రహస్యాలను స్వలాభం కోసం బయటపెట్టాడని కేతన్‌కుమార్‌ మనియార్‌ అనే వ్యక్తికి అక్కడి కోర్టు 18 నెలల జైలు శిక్ష, 32వేల డాలర్ల జరిమానా విధించింది. 

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధి ...కె.సి.ఆర్.

నల్లొండ, అక్టోబర్‌ 17 : యాదగిరిగుట్టను మూడేళ్లలో తిరుమల మాదిరిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. ఆలయానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని ఆయన అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరి గుట్ల అభివృద్ధిపై సమీక్ష జరిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తల సహకారంతో గుట్టను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆలయానికి స్వర్ణగోపురం కట్టిస్తామని చెప్పారు.

లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి ఎత్తు పెంచుతామని, తిరుమల తరహాలో గుట్టపై కాజేజీలు నిర్మిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టపై ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మిస్తామని ఆయన అన్నారు. ఆలయంలో పనిచేస్తున్న 42 మంది ఎన్‌ఆర్‌ఎంలను రెగ్యులర్‌ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. గుట్ట చుట్టూ 2 వేల ఎకరాల భూమిని సేకరించి అభయారణ్యం, పవిత్ర విల్లాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గుట్టకు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా మంచినీటి వసతి కల్పిస్తామని, 250 ఎకరాలలో జైనులు నిర్మించనున్న ఆలయానికి ప్రభుత్వం సహకరిస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

జయకు షరతులతో సుప్రీం బెయిల్

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జయలలితకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. జయలలితతో పాటు మరో ముగ్గురు నిందితులు శశికళ, నటరాజన్‌, ఇలవరసికి ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. 
 
శుక్రవారం ఉదయం జయలలిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు సుమారు గంటకు పైగా బెయిల్‌పై విచారణ సాగింది. జయలలిత తరపున ప్రముఖ న్యాయవాది బాలి నారీమన్‌ వాదనలు వినిపించారు. 
 
జయలలిత తనకు బెయిల్‌ ఇవ్వటానికి నాలుగు ప్రధాన కారణాలను కోర్టు ముందు ఉంచారు. సీనియర్‌ సిటీజన్‌, అనారోగ్యం, మాజీ ముఖ్యమంత్రి, మహిళ అన్న కోణంలో ఆలోచించి తనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జయలలితకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 
 
అక్రమార్జన కేసులో గత నెల 27వ తేదీన కర్నాటకలోని పరపర అగ్రహారంలో ఉన్న ప్రత్యేక కోర్టు జయలలిత సహా నలుగురికి నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. తీర్పుపై కర్నాటక హైకోర్టు అప్పీలు చేసినప్పటకీ మెరిట్స్‌ను చూడకుండా బెయిల్‌ మంజూరు చేయకపోవడంతో జయలలిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 జయలలితకు  బెయిల్‌ మంజూరు చేయడంతో తమిళనాడులో సంబరాలు మిన్నంటాయి. చెన్నైలో అన్నాడిఎంకే కార్యకర్తలు, ఆమె అభిమానులు బాణాసంచా కాలుస్తూ, డాన్సులు చేస్తూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అమ్మకు జై అంటూ పెద్ద పెట్టున న్యాయవాదులు, ఆమె అభిమానులు నినాదాలు చేశారు 

Thursday, October 16, 2014

వంశధార, నాగావళి అనుసంధానం ....


విజయవాడ, అక్టోబర్ 16; శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ రాష్ట్ర మంత్రుల బృందం పేర్కొంది. గురువారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ఎన్‌.చినరాజప్ప, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నాగావళి, వంశధార నదుల నీటి సద్వినియోగానికి ఆ రెండింటిని అనుసంధానం చేస్తామన్నారు. వంశధార పరిధిలోని రిజర్వాయర్‌ నుంచి నాగావళి ఎగువ ప్రాంతమైన నారాయణపురం ఆనకట్ట వరకు అనుసంధానం చేయడం వల్ల జలవనరులు వినియోగంలోకి వస్తాయన్నారు. దీనిపై నిపుణుల కమిటీని నియమించి త్వరలో నివేదిక తెప్పించుకుంటామన్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం లభించిందని వివరించారు.వచ్చే రెండేళ్లలో శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన నదులైన వంశధార, నాగావళి నదులకు కరకట్టల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు  సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. 

ఐఫోన్‌ -6 కు యమ గిరాకి


హైదరాబాద్‌, అక్టోబర్ 16;  ఐఫోన్‌ -6, 6ప్లస్‌లు ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. భారత మార్కెట్ లో ఇవి శుక్రవారం విడుదల కానున్నాయి. ఎప్పుడూ లేనంతగా వీటి కోసం ముందుగానే 25000 మంది బుక్‌ చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే వినియోగదారులకు అందించడానికి రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా వంటి పెద్ద గొలుసు దుకాణాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్‌ఫీబీమ్‌ అనే ఆన్‌లైన్‌ స్టోర్‌లోనూ దీన్ని అందుబాటులో ఉంచనున్నారు. వీటి ధర భారత్‌లో రూ. 53,500-రూ.80,500రేంజ్‌లో ఉంది. దీన్ని సెప్టెంబరు తొమ్మిదిన అమెరికాలోని కాలిఫోర్నియాలో విడుదల చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా కోటి ఫోన్లు అమ్ముడయ్యాయి. 

Wednesday, October 15, 2014

ప్రముఖ రచయత్రి తురగా జానకి రాణి కన్నుమూత

'
హైదరాబాద్, అక్టోబర్ 15; 'రేడియో అక్కయ్య'గా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ రచయిత్రి తురగా జానకిరాణి బుధవారం సాయంత్రం పంజాగుట్టలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. జానకిరాణి స్వస్థలం మచిలీపట్నం సమీపంలోని మందపాకల గ్రామం. ప్రముఖ హాస్యరచయిత, పాత్రికేయుడు తురగా కృష్ణమోహన్‌రావు సహధర్మచారిణి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వర్ణపతకాలు, నిజాం కళాశాలలో ఏంఏ ఎకనామిక్స్‌్‌ డిగ్రీ, మద్రాసు నుంచి భరతనాట్యం, సామాజిక సేవా రంగంలో డిప్లొమాలు పొందారు. సెంట్రల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డులో సంక్షేమ అధికారిగా, 1975-1994 సంవత్సరాల్లో  ఆకాశవాణిలొ నిర్మాతగా, సహాయ సంచాలకులుగా పని చేసారు. అనే విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహించారు. రచయిత్రిగా మూడు కథా సంకలనాలు, రెండు నవలలు, రేడియో నాటకాల సంకలనం, 'చేతకాని నటి' కవితా సంకలనం, 'మా తాతయ్య చలం' లేఖా సాహిత్యం, అయిదు అనువాద గ్రంథాలు, 35 పిల్లల పుస్తకాలు, అనేక వ్యాసాలు మరి కొన్ని ప్రక్రియల్లో రచనలు చేశారు. నాలుగు సార్లు ఆకాశవాణి జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు రెండుసార్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, పింగళి వెంకయ్య స్మారక సత్కారం, అరవిందమ్మ మాతృమూర్తి అవార్డు, సుశీల నారాయణరెడ్డి సాహితీ పురస్కారం, ఆంధ్ర సారస్వత పరిషత్తులో పరిణతవాణి గౌరవం వంటి అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. సంఘసేవకురాలిగా ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర యువతీ మండలి, శ్రామిక విద్యా పీఠం సంస్థల్లో ప్రముఖ పాత్రను పోషించారు. సీడ్‌ సంస్థల్లో కార్యనిర్వాహక వర్గ సభ్యురాలుగా, మహిళా ఫెడరేషన్‌లో సలహాదారుగా, నవ్య సాహితీ సమితి ఉపాధ్యక్షురాలిగా, లోక్‌సత్తాలో క్రియాశీలక సభ్యురాలుగా అనేక సేవలను అందించారు. దేశ, విదేశాల్లో దాదాపు యాభై వరకు సదస్సుల్లో పాల్గొన్న ఘనత ఆమెకే దక్కింది. అలాగే యూనిసెఫ్‌, సేవ్‌ ది చిల్డ్రన్‌ యూకే, ఎన్‌సీఈఆర్‌టీ వంటి సంస్థలకు కమ్యూనికేషన్‌ సలహాదారు, ప్రచార సామగ్రి రూపకర్తగా పేరొందారు

అంచనాకు అందని నష్టం...రెండు రోజుల్లోకేంద్ర బ్రందం

, అక్టోబర్‌ 15 : హుద్‌హుద్‌ తుఫాన్‌ నష్టం అంచనాలకు అందకుండా ఉన్నదని, అది అరవై వేల కోట్లా? డెబ్బై వేల కోట్లా...అంతకన్నా ఎక్కువా అన్నది త్వరలోనే ఒక అంచనాకు వస్తామని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు అన్నారు. తుఫాన్‌ నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే ఎన్యూమరేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ఇందుకోసం ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులను కూడా రంగంలోకి దించనున్నట్టు తెలిపారు. ఇది పూర్తయిన తర్వాతే నష్టాలపై అంచనా వేయగలమని సీఎం చెప్పారు.  విశాఖలో అన్ని రంగాలకు భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖతోపాటు ఇతర జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర బృందం రానున్నట్టు తెలిపారు. విశాఖలో తుఫాన్‌ సృష్టించిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఎదురైతే వాటిని అధిగమించేందుకు వీలుగా బ్లూ బుక్‌ను తెస్తామన్నారు. . ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తాగునీటి సమస్య, పెట్రోల్‌, డీజిల్‌ కొరతను కొంతవరకు పరిష్కరించామని ఆయన తెలిపారు. అదేమాదిరిగా గాజువాకలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని ఆయన చెప్పారు. విద్యుత్‌ వ్యవస్థ అంచనాలకు అందనంత విధ్వంసానికి లోనైందని ఆయన చెప్పారు. సుమారు 40 వేలకుపైగా స్తంభాలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు. 

తుఫాన్‌ బారినపడ్డ తొమ్మిది లక్షల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్‌, కిలో చక్కెర, మూడు కిలోల కంది పప్పు, బంగాళాదుంపలు, కిలో పామాయిల్‌, రెండు కిలోల ఉల్లి, ఆర కిలో కారం పొడిని చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. మత్స్యకార, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం ఇస్తామన్నారు. అవసరమైతే దీనికి కరపత్రాల ద్వారా ప్రచారం కల్పించి అందరూ వినియోగించుకునేలా చూస్తామన్నారు. కూరగాయలు సుమారు నాలుగు వందల టన్నులను తెప్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిలువ ఉండని కూరగాయలు కిలో మూడు, నిలవ ఉండే ఉల్లి, బంగాళాదుంపలు వంటి వాటిని ఐదు రూపాయలకు విక్రయిస్తా మని ఆయన వివరించారు. చివరి బాధితుడికి సహాయం అందే వరకు జిల్లాలోనే ఉంటానని ఆయన తెలిపారు.

దేశ చరిత్రలో అతి పెద్దదైన తుఫాన్‌పై నిరంతరం సమీక్షించడమే కాకుండా సానుకూలంగా స్పందించి తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు ప్రశంసించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్ని పనులున్నప్పటికీ ఈ విపత్తు సంభవించిన మూడవ రోజునే ప్రధాని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారన్నారు. 

మహారాష్త్ర, హర్యానాలలో బి.జె.పి. హవా ...ఎగ్జిట్ పోల్స్


ముంబై,అక్టోబర్ 15 : మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించనున్నట్టు ఏబీపీ ఎగ్జిట్‌పోల్‌ వెల్లడించింది. మొత్తం 288 అసెంబ్లీస్థానాలున్న మహారాష్ట్రలో భాజపాకు పూర్తి మెజార్టీ రాకపోయినా ఎక్కువస్థానాలు సాధించవచ్చని తెలిపింది. భాజపాకు 127, శివసేనకు 77, కాంగ్రెస్‌ 40, ఎన్సీపీ 34 , ఎంఎన్‌ఎస్‌ 5, ఇతరులకు 5 స్థానాలు రావచ్చని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. 

ఇక  టైమ్స్‌నౌ-సీ ఓటర్స్‌ ఎగ్జిట్‌పోల్ ప్రకారం 
మహారాష్ట్రలో మొత్తం స్థానాలు-288 : బీజేపీ-129, శివసేన-56, కాంగ్రెస్‌-43, ఎన్సీపీ-36, ఎంఎన్‌ఎస్‌-12, ఇతరులు-12
హర్యానాలో మొత్తం స్థానాలు-90: బీజేపీ-37, ఐఎన్‌ఎల్‌డీ-28, కాంగ్రెస్‌- 15, హెచ్‌జేసీ-06, ఇతరులు-04  వస్తాయని అంచనా. 


ఇబోలాపై పోరుకు ఫేస్ బుక్ భారీ విరాళం...


న్యూయార్క్, అక్టోబర్ 15; యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఇబోలా వ్యాధిపై పోరాటానికి ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ 150 కోట్ల రూపాయల (25 మిలియన్ డాలర్ల) భారీ విరాళాన్ని ప్రకటించారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్ఓల్ అండ్ ప్రివెన్షన్ సంస్థకు ఈ మొత్తం పంపారు. సాధ్యమైనంత త్వరగా మనం ఈ ఇబోలా వ్యాధిని అదుపు చేయాలి. లేకపోతే అది మరింతగా వ్యాప్తి చెంది దీర్ఘకాలంలో ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని, చివరకు హెచ్ఐవీ, పోలియోలలాగే ఇబోలా మీద కూడా కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వస్తుందని మార్క్ జుకర్బర్గ్ తన పేస్ బుక్ పోస్టులో తెలిపారు. 

Tuesday, October 14, 2014

వారం,పది రోజుల తర్వాతే ఉత్తరాంధ్రలో ఫోన్ ల పునరుద్ధరణ...

విజయవాడ,అక్టోబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లోని తుపాను ప్రభావిత విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మూగబోయిన ఫోన్లు పూర్తిస్థాయిలో పనిచేయడానికి మరో వారం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్లను పునరుద్ధరించడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. అవసరమైన కేబుల్స్‌, సామగ్రిని ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు పంపిస్తున్నారు. ఈ పనుల పర్యవేక్షణకు హైదరాబాద్‌ నుంచి పలువురు ఉన్నతాధికారులు విశాఖపట్టణం వెళ్లారు. ఈ మూడు జిల్లాల్లో ఉన్న మొత్తం సెల్‌టవర్లలో సగానికి పైగా విరిగిపోయాయని విశ్వసనీయ సమాచారం. విశాఖ నగరంలో గాలుల తీవ్రతకు 80శాతం సెల్‌టవర్లు నేలకొరిగాయని అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి మరమ్మతు అవసరమైన కొన్నింటిని బుధవారం సాయంత్రంలోగా మరమ్మతు చేసే అవకాశాలున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న వాటిని సరిచేయడానికి ఢిల్లీ నుంచి కొత్త పరికరాలు తెప్పించాల్సిన అవసరం ఉంది. దీనికి మరో వారం రోజులు పడుతుందని తెలిసింది.గ్రామీణ, మండల ప్రాంతాల్లో మరింత ఆలస్యం: మండల, గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్లు, సెల్‌టవర్ల పునరుద్ధరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. 

తానా విరాళం లక్ష డాలర్లు...


డల్లాస్‌, అక్టోబర్‌ 14 : ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్‌ తుపాన్‌ సృష్టించిన అల్లకల్లోలంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్పందించింది. సీఎం సహాయ నిధికి లక్ష డాలర్ల ప్రాథమిక విరాళం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తానా సెక్రటరీ సతీష్‌ వేమనతో కలిసి లక్ష డాలర్ల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేయనున్నట్లు  తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపపేని తెలిపారు.  
చిత్ర పరిశ్రమ  విరాళాలు
హుద్‌హుద్‌ తుపాన్‌ బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. జనసేన అధినేత, హీరో పవన్‌ కల్యాణ్‌ రూ. 50 లక్షలు, నిర్మాతల మండలి రూ. 25 లక్షలు, ప్రిన్స్‌ మహేష్‌బాబు రూ. 25 లక్షలు, జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ. 20 లక్షలు, అల్లు అర్జున్‌ రూ. 20 లక్షలు, రామ్‌చరణ్‌ తేజా రూ. 10 లక్షలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు మరో రూ. 5 లక్షలు సాయంగా ప్రకటించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ రూ. 15 లక్షలు, విజయనిర్మల రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు సంపూర్నేశ్ బాబు రు .లక్ష విరాళం ప్రకటించారు 
 
PM Narendra Modi Announces Rs 1,000 Crores for Andhra Pradesh
విశాఖలో ప్రధాని  మోడీ ఏరియల్  సర్వే 

బోరు బావిలో పడిన చిన్నారి గిరిజ మృతి...


రంగారెడ్డి, అక్టోబర్‌ 14 : జిల్లాలోని మంచాలలో విషాదం నెలకొంది. బోరు బావిలో పడిన చిన్నారి గిరిజ మరణించింది. అయితే మృతదేహాన్ని బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం చిన్నారి గిరిజ బోరుబావిలో పడిపోవడంతో బాలికను రక్షించేందుకు దాదాపు 48 గంటల పాటు 
సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బోరుబావిలో 45 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. 45 అడుగుల సమాంతర కందకం తవ్వి గిరిజను బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. 

విశాఖకు మోడీ భరోసా... ఆంధ్రకు వెయ్యికోట్ల తుపాను సాయం

హైదరాబాద్‌, అక్టోబర్  14: తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు గాను తక్షణ సాయం కింద ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు రూ. వెయ్యికోట్లు ఆర్థికసాయం ప్రకటించారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ విశాఖవాసులకు, ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయనున్నట్లు ప్రధాని తెలిపారు. తుపాను విషయంలో ప్రాణనష్టాన్ని నివారించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నందుకు ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించారు. నష్ట తీవ్రత తగ్గించడంలో కలసి కట్టుగా పనిచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు మంచి ఫలితాలనిచ్చాయన్నారు. రెండు ప్రభుత్వాల సమన్వయం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నష్టనివారణకు నేవీ, కోస్ట్‌గార్డ్‌, ఆర్మీ కృషిచేశాయన్నారు. క్లిష్టపరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించారని ప్రధాని ప్రశంసించారు. తుపాను వల్ల చేతికి వచ్చిన పంటలు తీవ్రంగా నష్టపోయాయన్న ప్రధాని బీమా కంపెనీలతో తాను మాట్లాడతానన్నారు. విశాఖను స్మార్ట్‌ సిటీగా చేస్తానని అమెరికాలోనూ చెప్పానని, అలాంటిది వూహకందని రీతిలో ఈ ఉపద్రవం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. అంతమాత్రాన నిరుత్సాహపడనక్కరలేదని, త్వరలోనే పరిస్థితులు సాధారణస్థితికి చేరుకుంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తంచేశారు.మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ ముందుగా తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. తర్వాత  సి. ఎం. చంద్రబాబుతో కలసి నగరంలో తుపాను ప్రభావిత ప్రాంతాల ను. ఫరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వ సాయం...
హుదుద్‌ తుపాను ధాటికి అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తోంది. రూ. 18 కోట్ల విలువైన విద్యుత్‌ సామగ్రిని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకి పంపింది. 530 ట్రాన్స్‌ఫార్మర్లు, 28,500 స్తంభాలు, 900 కి.మీ. వైర్లు పంపినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 
విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగవంతం 
 తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఐదు ప్రత్యేక బృందాలతో పునరావాస చర్యలు వేగంవంతం చేశారు. ఉత్తరాంధ్రలో విద్యుత్‌ పునరుద్దరణకు చర్యలు చేపట్టారు. 100 మంది ఇంజనీర్లు, 500 మంది విద్యుత్‌ సిబ్బందితో విద్యుత్‌ పునరుద్దరణకు కృషి చేస్తున్నారు. ఒక్క నేవీకే రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లగా, విశాఖ ఉక్కుకు రూ. 340 కోట్లు, విశాఖ విమానాశ్రయానికి రూ. 500 కోట్ల నష్టం కలిగిందని  అంచనా. తుపాను ధాటికి మొత్తం 40వేల కరెంట్‌ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు చెప్పారు.  
అరకులో తుపాన్‌ బీభత్సంతో ధ్వంసమైన కేకే లైన్‌ 
తూర్పు కోస్తా రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న కొత్తవలస-కిరండుల్ (కేకే ) లైన్‌ హుద్‌హుద్‌ తుపాన్‌ బీభత్సానికి పూర్తిగా ధ్వంసమైంది. అనేక చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. 62,72,81 కిలోమీటర్ల వద్ద భారీగా కొండరాలు జారి పడడంతో లైన్‌ను పునరుద్ధరించడానికి సుమారు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.  కాగా, విశాఖకు రైలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. సికింద్రాబాద్‌- విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ యథాతథంగా నడుస్తుందని, విశాఖ, గరీబ్‌రథ్‌ రైళ్లు మినహా మిగతా సర్వీసులు యథాతథంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 


Monday, October 13, 2014

తెప్పరిల్లుతున్న ఉత్తరాంధ్ర ....రేపు విశాఖకు ప్రధాని

విశాఖ, అక్టోబర్‌ 13 : హుద్‌హుద్‌ తుపాన్‌ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా గాయపడినవారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడినవారికి రూ. 50 వేలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. వంట పాత్రలు, బట్టల కోసం రూ. 2 వేలు, బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్‌ పామాయిల్‌, అర కేజి కారం, కేజీ చక్కెర, 3 కేజీలు ఆలుగడ్డలు ఈ సాయంత్రమే అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే మత్స్యకారుల వలకు రూ. 5వేలు, బోటుకు రూ. 10 వేలు చొప్పన నష్ట పరిహారాన్ని చంద్రబాబు ప్రకటించారు. 

అలాగే దెబ్బతిన్న వరి, ఇతర పంటలకు రూ. 10 వేలు నష్టపరిహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పూర్తిగా దెబ్బతిన్న పక్కా ఇళ్లకు రూ. 50 వేలు, గుడిసెలకు రూ. 25 వేలు సాయం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. నేలకొరిగిన పైర్లను కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, మొత్తం నష్టాన్ని అంచనా వేస్తామని ఆయన చెప్పారు. విశాఖ జిల్లాలో వరద బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తుపాన్‌ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

ఇలావుండగా, 
హుద్‌ హుద్‌ తుపాన్‌ ప్రభావంతో విశాఖలో గత మూడు రోజులుగా ఆగిపోయిన సిటి బస్సులను సోమవారం సాయంత్రం నుంచి పునరుద్ధరించారు. హైదరాబాద్‌ నుంచి విశాఖకు మూడు ఏసీ బస్సులను నడుపుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించారు.  విశాఖలో 70 సిటీ బస్సులను పునరుద్ధరించారు.  సోమవారం సాయంత్రానికి చాలా చోట్లవిద్యుత్ ను పునరుద్ధరించారు. 


రేపు ప్రధాని రాక...
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విశాఖ సందర్శిస్తారు. 
విశాఖలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాను తెలుసుకుంటున్నానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఫోన్లో మాట్లడానని చెప్పారు. విశాఖ ప్రజలకు అండగా వుండటానికి మంగళవారం నాడు తాను విశాఖను సందర్శించనున్నానని నరేంద్ర మోడీ ట్విట్టర్లో తెలిపారు. 

Sunday, October 12, 2014

విశాఖను దెబ్బ తీసిన హుద్ హుద్....సహాయ యంత్రాంగం సర్వసన్నద్ధం

విజయవాడ, అక్టోబర్ 12; ఆదివారం ఉదయం 10 గంటలకు విశాఖలోని కైలాసగిరి వద్ద తీరాన్ని తాకిన హుద్‌హుద్‌.. మధ్యాహ్నం 12:30- 1 గంట మధ్య పూడిమడక వద్ద తీరాన్ని దాటింది! ఈ రెండున్నరగంటల్లో హుద్‌హుద్‌ విలయతాండవానికి.. వైజాగ్‌ చిగురుటాకులా వణికిపోయింది. భూ, జల, వైమానిక రవాణా మార్గాలను కలిగి ఉన్న విశాఖకు ఇప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాల్లేవు. రోడ్లు తెగిపోయాయి. రైలు మార్గం ఆగిపోయింది. విమానాశ్రయం ధ్వంసమైంది. నేవీ నావిగేషన్‌ విచ్ఛిన్నమైంది. సాక్షాత్తూ తుపాను సమాచారాన్నిచ్చే రాడార్‌ వ్యవస్థే నీటమునిగింది. సెల్‌ టవర్లు కుప్పకూలాయి. కరెంటు లేదు. నగరంలోనే ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒకరి సమాచారం మరొకరికి తెలియదు. ఎవరి ఇళ్లలో వారు బందీ. ఒకదశలో 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలికి అపార్టుమెంట్లు నిలువునా ఊగిపోయాయి. 
తుపాను tiiraali దాటినా రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది!! పెనుగాలులు వీస్తూనే ఉన్నాయి!! విశాఖ, గంగవరం, భీమిలి పోర్టులలో తీవ్ర నష్టం సంభవించింది.
ఈ తీవ్ర పెను తుఫాను ప్రభావంతో ఉత్తరకోస్తా (విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు), తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా.. హుద్‌హుద్‌ దక్షిణ ఒడిసా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా పయనించి క్రమేణా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
కేటగిరి 4 తుపాను...
భూమి ఉత్తరార్థ గోళంలో గ్రీన్‌విచ్‌ రేఖ నుంచి తూర్పుగా 100-45 డిగ్రీల రేఖాంశాల మధ్యనున్న ప్రాంతం మొత్తంలో ఎక్కడ ఉష్ణమండల తుఫాను ఏర్పడినా దాన్ని ఢిల్లీలోని వాతావరణ విభాగానికి చెందిన ‘రీజనల్‌ స్పెషలైజ్‌డ్‌ మెటిరోలాజికల్‌ సెంటర్‌’ పర్యవేక్షిస్తుంది. తుఫాను వేగం, గాలుల తీవ్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇది తుఫానులను ఎలా వర్గీకరించాలో నిర్ణయించింది. దాని ప్రకారం.. 
గంటకు 51 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో గాలులు వీస్తే ’డిప్రెషన్‌‘గా వ్యవహరిస్తారు.
62 నుంచి 88 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే ‘తుఫాను’ అంటారు.
88 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే ‘పెను తుఫాను.’
118 నుంచి 221 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే ‘తీవ్ర పెను తుఫాను.’
222 కిలోమీటర్లకన్నా ఎక్కువ వేగంతో గాలులు వీస్తే ‘అత్యంత తీవ్రమైన పెను తుఫాన్‌’ అంటారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే.. ఏదో ఒక్క క్షణం అలా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలి వీయగానే దాన్ని తీవ్ర పెను తుఫానుగా పేర్కొనరు. వరుసగా 3 నిమిషాల పాటు గరిష్ఠంగా ఎంత గాలి వీస్తుందో దాన్ని బట్టి కేటగిరీని నిర్ణయిస్తారు. హుద్‌హుద్‌ విషయానికొస్తే మూడు నిమిషాలపాటు గరిష్ఠంగా వీచిన గాలి వేగం 175 కిలోమీటర్లు. అంటే ఇది తీవ్ర పెనుతుఫాను. సఫైర్‌ సింప్సన్‌ స్కేల్‌ ప్రకారమైతే హుద్‌హుద్‌ తుఫాను కేటగిరీ 4 కిందికు వస్తుంది.  

ఉదయం 10 నుంచి 12:30 దాకా: తుఫాను ఐ వాల్‌ (తుఫాను కేంద్ర భాగమైన కన్ను చుట్టూ క్యుములో నింబస్‌ మేఘాలు పరచుకుని ఉండే భాగం) విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కైలాసగిరి వద్ద తీరాన్ని తాకింది. దీంతో పెనుగాలులు, కుండపోత మొదలయ్యాయి. గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వాన కురవడంతో దాదాపు రెండున్నర గంటలపాటు వైజాగ్‌ చిగురుటాకులా వణికిపోయింది. 
మధ్యాహ్నం 12:30.. ఒంటిగంట మధ్యలో: తుఫాను కేంద్ర భాగం (కన్ను) పూడిమడక వద్ద తీరాన్ని తాకింది. దీంతో ఒకింత ప్రశాంతత నెలకొంది. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాని 
మధ్యాహ్నం 2:00-2:30: తుఫాను కన్ను భాగం తీరాన్ని దాటడం మొదలుపెట్టగానే దాని వెనుకనే ఐవాల్‌ అడుగుపెట్టింది. మళ్లీ భయంకరమైన హోరుగాలులు, భారీ వర్షం మొదలయ్యాయి. రాత్రి దాకా ఇదే పరిస్థితి నెలకొంది. పది దాటిన తర్వాత తుఫానుగా మారి వాయవ్య దిశగా పయనించి దక్షిణ ఒడిసా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కొనసాగింది..  





నేటి నుంచి సహాయ చర్యలు... 

సోమవారం నుంచి సహాయ పునరావాస చర్యలను ప్రారంభించి, మూడు నాలుగు రోజుల్లోనే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణం, మరమ్మతులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. నేలకొరిగిన విద్యుత్తుస్తంభాల స్థానంలో కొత్తవాటిని నెలకొల్పేందుకు 40 వేల విద్యుత్తుస్తంభాలను సిద్ధంగా ఉంచినట్లు ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. తొలుత బాధితులకు ఆహారం అందించే విషయంపై దృష్టి సారించాం. రాజమండ్రి, విజయవాడ నుంచి ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని బాబు చెప్పారు. సెల్‌ఫోన్‌ టవర్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలంటే డీజిల్‌ ట్యాంకర్లను తీసుకెళ్లేందుకు పోలీసుల సహకారం అవసరమని, దీనికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సీఎం డీజీపీని ఆదేశించారు. మండలానికో ఐఏఎస్‌, రెవెన్యూ డివిజన్‌కో మంత్రి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తుఫానును ఎదుర్కొనేందుకు ప్రజలను, అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు పూర్తిస్థాయిలో సాంకేతిక సహకారాన్ని వినియోగించుకున్నామన్నారు. 
కొన్నిచోట్ల కమ్యూనికేషన్‌ రాడార్‌ పతనమవడంతో నేవీ రాడార్‌ ద్వారా సమాచారం తీసుకున్నామన్నారు. తుఫాను కారణంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ముగ్గురు మరణించారని తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు సెల్‌ టవర్లన్నీ పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని సెల్‌ఫోన్‌ సంస్థలతో మాట్లాడామన్నారు. ప్రమాదాలు నివారించేందుకు వైజాగ్‌లో విద్యుత్తు సరఫరా నిలిపివేశామని, ట్రాఫిక్‌ను కూడా తగ్గించామన్నారు. ఎంత నష్టం జరిగిందనే సమాచారం రావాల్సి ఉందన్నారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో పూర్తిగా సమాచారం అందడం లేదన్నారు. సోమ, మంగళవారాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Saturday, October 11, 2014

ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా...రెండో వన్డేలో ఘనవిజయం...

న్యూఢిల్లీ,అక్టోబర్ 11; తొలి వన్డేలో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో  జరిగిన రెండో వన్డేలో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలమైన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు విశేషంగా రాణించి జయకేతనం ఎగురవేశారు. భారత్ విసిరిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ ఆటగాళ్లు తడబడి ఓటమి పాలైయ్యారు. విండీస్ ఆటగాళ్లలో స్మిత్ (97), బ్రేవో(26),పొలార్డ్ (40) పరుగులతో రాణించినా.. తరువాత ఆటగాళ్లు ఘోరంగా  టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 263 పరుగులు చేసింది.  ఓపెనర్లు రహానె (12),  శిఖర్ ధవన్ (1) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (62),  రైనా (62) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. అంబటి రాయుడు 32 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ (51 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు.

Friday, October 10, 2014

భారత్, పాక్ లకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి


స్లో,అక్టోబర్ 10; ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి ఈ ఏడాది ఇద్దరిని వరించింది. పాకిస్థాన్‌ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్‌, భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాస్‌ సత్యార్థిలకు ఈ బహుమతి లభించింది. విదీష ప్రాంతానికి చెందిన కైలాస్‌ సత్యార్థి బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు. బాలకార్మికులుగా పనిచేస్తున్న, వెట్టిచాకిరీ చేస్తున్న 80 వేల మంది బాలలను ఆయన రక్షించారు. కైలాస్‌ సత్యార్థి నోబెల్‌ బహుమతి అందుకోనున్న ఏడో భారతీయుడవుతారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా కైలాస్‌ గ్లోబల్‌ మార్చ్‌ కూడా నిర్వహించారు. ఆయన రుగ్మక్‌ అనే సంస్థను స్థాపించి బాలల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. 

కైలాస్‌ 1984లో జర్మనీ శాంతి పురస్కారం, 1995లో రాబర్డ్‌ కెనడి మానవ హక్కుల పురస్కారం, 2006లో అమెరికా ప్రభుత్వ స్వేచ్ఛా పురస్కారం అందుకున్నారు. అలాగే 2007లో ఇటాలియన్‌ సెనేట్‌ పతకం, 2009లో అమెరికా ప్రభుత్వ ప్రజాస్వామ్య పరిరక్షణ పురస్కారం లభించింది. 

పాకిస్థాన్‌కు చెందిన 17 ఏళ్ల మలాలా యూసుఫ్‌జాయ్‌ బాలికల విద్య కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్ల దాడికి గురైన ఆమెకు ఇంగ్లాండ్‌లో చికిత్స జరిగింది. అనంతరం ఆమె ఐక్యరాజ్యసమితిలో సైతం బాలికల విద్యాహక్కుపై ప్రసంగించారు.

Wednesday, October 8, 2014

తొలి వన్డే లో వెస్టిండీస్‌ విజయం


 కొచి, అక్టోబర్ 8; భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన  తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. 321 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ 197 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

చిత్ర పరిశ్రమ భూ కేటాయింపు రద్దు ...

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 : ఏపీ చిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలికి కేటాయించిన 16 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో బంజారా హిల్స్ లో ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో నాలుగు ఎకరాలు గుడిసెల పేరిట ఆక్రమణలకు గురైంది. మిగిలిన 16 ఎకరాలు ఏపీ ఫిలం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఉంది. 
 
విభజన అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీవోలకు సంబంధించిన భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా ఏపీ ఎన్జీవోలు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో టీ. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 
 
తర్వాత ఏపీ పిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన 16 ఎకరాల భూమి నిరుపయోగంగా పడి ఉందని, దానిపై విచారణ జరిపిన అనంతరం ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని టీ. ప్రభుత్వం నిర్ణయించి,

ఆగని పాక్ కాల్పులు ....ఇద్దరు భారతీయుల మృతి

జమ్మూ కశ్మీర్‌, అక్టోబర్‌ 8 : జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లో బుధవారం ఉదయం కూడా పాక్‌ సైనికుల కాల్పులు కొనసాగాయి. అంతర్జాతీయ సరిహద్దు ఉన్న 192 కిలోమీటర్ల పొడవున గత రాత్రి నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 60కి పైగా బీఎస్‌ఎఫ్‌ చెక్‌పోస్టులు, సుమారు 40గ్రామాలు పాక్‌ సైనికుల కాల్పులతో దద్దరిల్లాయి. బుధవారం ఉదయం సాంబా సెక్టార్‌లో ఇద్దరు భారతీయ పౌరులు మరణించారు. ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లతోపాటు 17 మంది పౌరులు స్వల్పంగా గాయపడగా... మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ దాడులకు భయపడుతున్న సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు పాక్‌ కాల్పులను భారత జవాన్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్‌ భూభాగంలోని 73 సైనిక పోస్టులపై మోటార్‌సెల్స్‌లతో కాల్పులు జరిపారు. పాకిస్తాన్‌ సైన్యం కాల్పులు ఆపేవరకు పాక్‌తో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
ఇరు సైన్యాలు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్‌ ప్రతిపాదించినట్లు తెలియవచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీనరేక వెంబడి దాడులు ఆగేవరకు ఎలాంటి చర్చలకు ఒప్పుకోవద్దంటూ భారత సైన్యానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

షర్మిలకు తెలంగాణా వై.సి.పి. పగ్గాలు ....

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 : తెలంగాణలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన సోదరి షర్మిలకు అప్పగించారు. తెలంగాణలో ఓదార్పు యాత్రను కూడా షర్మిలానే చేస్తారని బుధవారం హైదరాబాద్‌లో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్‌ ప్రకటించారు. తెలంగాణ వైసీపీ వర్కింగ్‌ అధ్యక్షడుగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని నియమించారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని జగన్‌ అన్నారు. ప్రజా వ్యతిరేకతలో టీఆర్‌ఎస్‌ కొట్టుకుపోయే రోజు వస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో వైసీపీ పుంజుకుంటుందని జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో చివరికి మిగిలేది కాంగ్రెస్‌, బీజేపీ, వైసీపీయే అని జగన్‌ అన్నారు. తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. 

వైఎస్‌ను మించిన నాయకుడు తెలంగాణలో లేరని షర్మిల అన్నారు . తెలంగాణలో రైతులకు అత్యధిక ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతోనే వైఎస్‌ ఉచిత విద్యుత్‌ను అందించారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి నేను ఉన్నానని భరోసా కల్పించిన నాయకుడు వైఎస్‌ అని ఆమె అన్నారు.
 

Tuesday, October 7, 2014

తెలంగాణాలో సర్వే ఆధారంగా ప్రత్యేక గుర్తింపు కార్డులు....

హైదరాబాద్, అక్టోబర్ 7: 
సమగ్ర సర్వే ఆధారంగా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పథకాలకూ ఇకనుంచి రేషన్‌కార్డుతో సంబంధం ఉండదు అన్ని రకాల పింఛన్లకు ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 15 లోగా వీఆర్‌వోలకు పింఛన్ల దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొంది. వికలాంగులకు ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాలకుపైగా భూమి, వ్యాపారులకు కార్డుల నుంచి మినహాయింపు ఇస్తారు. దారిద్య్రరేఖ దిగువనున్న వారికి కుటుంబ ఆహారభద్రత కార్డులు జారీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. నిరుపేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తారు 

తెలంగాణాకు కరెంట్ తెగులు....

హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 :  తెలంగాణలో విద్యుత్ సమస్య రోజు రోజుకి   పెరుగుతోంది. పారిశ్రామికవాడల్లో బుధవారం నుంచి వారానికి రెండు రోజుల పాటు విద్యుత్‌ కోతలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 145 మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుత్‌ అవసరం వుండగా 125 నుంచి 130 వరకు మాత్రమే ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ కోతలు అనివార్యమవుతున్నాయి. 

హైదరాబాద్‌లో రోజుకు 6 గంటలు, గ్రామాల్లో 12 గంటల విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో గత నెల రోజులుగా తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నిటికి వారంలో ఒక రోజు పవర్‌ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు దీన్ని మరొక రోజుకు పెంచారు. వారంలో రెండు రోజులు పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటిస్తూ ప్రభుత్వం మజీవో జారీ చేసింది. 


జయలలితకు బెయిల్ నిరాకరణ

బెంగుళూరు, అక్టోబర్‌ 7 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం కర్నాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో అన్నాడిఎంకే కార్యకర్తల ఆశలు అడియాసలయ్యాయి. గత రెండు రోజులుగా అన్నాడిఎంకే నేతలు, కార్యకర్తలు అమ్మకు బెయిల్‌ రావాలని కోరుతూ పూజలు చేశారు. నాలుగేళ్లు జైలు శిక్ష పడినవారికి కోర్టు ఇప్పటి వరకు బెయిల్‌ ఇస్తూ వచ్చింది. జయకు కూడా ఈరోజు బెయిల్‌ వస్తుందని న్యాయనిపుణులు కూడా భావించారు. 
 
సీబీఐ తరఫు ప్రాసిక్యూషన్‌ లాయర్‌ కూడా జయలలితకు షరతులతో కూడిన బెయిల్‌ ఇవ్వడం తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి బెయిల్‌ ఇవ్వడానికి తగిన కారణాలు లేవంటూ బెయిల్‌ నిరాకరించారు. 
 
ప్రాసిక్యూషన్‌ తరఫున లాయర్‌ జయకు బెయిల్‌ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో ఆమెకు బెయిల్‌ వచ్చిందని మొదట అందరూ భావించారు. దీంతో తమిళనాడు, కర్నాటకలో అమ్మ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. దేశం మొత్తం మీద టెలివిజన్‌ ఛానళ్లు కూడా ఇదే విషయాన్ని ప్రసారం చేశాయి. జయ న్యాయవాదులలో ఒకరు హడావుడిగా బయటకు వచ్చి జయకు ఇక బెయిల్‌ వచ్చేసినట్టేనని చెప్పడంతో అన్ని టీవి ఛానళ్ల ప్రతినిధులు అదే నిజమని నమ్మారు. 
 
జయ కేసు వాదన తర్వాత శశికళ, సుధాకర్‌ల కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. అవినీతికి పాల్పడడమంటే మానవహక్కులను ఉల్లంఘించడమేనని, బెయిల్‌ ఇవ్వడానికి సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి భావంచి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. అమ్మ బయటకు వస్తారని ఆశించిన అన్నాడిఎంకె శ్రేణులంతా బెయిల్‌ రాలేదని తెలిసి.. భోరున ఏడ్చారు. అమ్మకు అన్యాయం జరిగిందంటూ ధర్నాకు దిగారు. 

Friday, October 3, 2014

పాట్నాలో రావణ దహనం లో తొక్కిసలాట:32మంది మృతి

పాట్నా,అక్టోబర్ 3 : పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన రావణ దహనం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 32మంది మృతి చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనం కార్యక్రమం నిర్వహించడం అలవాటు. అలాగే పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అయితే విద్యుత్ తీగలు తెగిపడినట్లు వదంతులతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.  మృతుల్లో ఐదుగురు చిన్నారులు సహా 23మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
 
కాగా తొక్కిసలాట దుర్ఘటనలో 32మంది దుర్మరణం చెందినట్లు బీహార్ హోంశాఖ కార్యదర్శి అమీర్ సుభాని ప్రకటన చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... బీహార్ ముఖ్యమంత్రితో మాంఝీతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...