Saturday, April 27, 2013

జనం పై సినీ భారం...

హైదరాబాద్, ఏప్రిల్ 27 :  సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను ప్రభుత్వం భారీగా  పెంచింది. అన్ని థియేటర్లలో కింది తరగతి టికెట్ రేటును రూ.10 మేర పెంచారు. బాల్కనీ టికెట్లు నాన్ ఏసీ థియేటర్లలో రూ.15, ఏసీ థియేటర్లలో రూ.20 చొప్పున పెరిగాయి.  కింది తరగతి, పై తరగతి మినహా మిగతా తరగతుల టికెట్ రేట్లను తాము అందించే సౌకర్యాలకు అనుగుణంగా పెంచుకునే అధికారం థియేటర్ యాజమాన్యాలకే కల్పించారు. ఒకవేళ యాజమాన్యాలు టికెట్లు ధరను తగ్గించాలనుకుంటే (సినిమాకు డిమాండ్ లేనిపక్షంలో) తగ్గించుకోవచ్చు. కానీ వినోదపు పన్నును మాత్రం నిర్ణీత టికెట్ రేటు మేరకే చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లను ఐదు కేటగిరీలుగా విభజించి రేట్లు నిర్ణయించారు.  

సెకండ్ ఇంటర్లో 65.36% ఉత్తీర్ణత

హైదరాబాద్, ఏప్రిల్ 27 :  ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సీనియర్ ఇంటర్ పరీక్షలలో   జనరల్ (రెగ్యులర్) లో 7,71587 మంది విద్యార్థులు హాజరుకాగా.. 5,04,300 (65.36%) మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఉత్తీర్ణత శాతం 6.93శాతం పెరిగింది.  మార్కుల ఆధారంగా  2,43,612 మంది 'ఎ' గ్రేడ్ సాధించారు. ఉత్తీర్ణతలో ఈ సారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలికల్లో 3,68,268 మంది పరీక్షలు రాయగా 2,54,258 (69.04%) మంది పాసయ్యారు. బాలురలో 4,03,319 మంది పరీక్షలు రాయగా 2,50,042 (62%) మంది పాసయ్యారు. జిల్లాలవారీగా ఫలితాలు చూస్తే జనరల్‌లో 82 శాతంతో కృష్ణా జిల్లా ముందుండగా.. 49 శాతంతో మహబూబ్‌నగర్ చివర్లో నిలిచింది. వొకేషనల్ ఫలితాల్లో శ్రీకాకుళం 68 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. మహబూబ్‌నగర్ 28 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికి మే 6 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. 

Thursday, April 25, 2013

బ్రాహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపులు రద్దు...

హైదరాబాద్, ఏప్రిల్ 25: కడప జిల్లాలోని బ్రాహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. . బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10,766 ఎకరాల భూమి కేటాయింపులకు సంబంధించిన అవగాహన పత్రంపై 2007 మే 21న సంతకాలు జరిగాయి. ఆ పనులు సకాలంలో పూర్తి కానందున ఇప్పుడు దీన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మండలం వేగుంటపల్లి, కొత్తగుంటపల్లి, పి. బొమ్మపల్లి, తూగుటపల్లి, ప్రాంతాలలో ఉన్న భూములను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించారు. ఆనాటి ఒప్పందం ప్రకారం మూడేళ్లలో పనులు పూర్తి కావాలి. లేదంటే ఒప్పందం ఉల్లంఘనకు గురైనట్టేనని కూడా ఆనాటి అవగాహన పత్రంలో పేర్కొన్నారు. ఈ అంశం ఆధారంగానే ఇప్పుడు కిరణ్ సర్కారు ఇప్పుడు ఈ భూముల కేటాయింపును రద్దు చేసింది. 

జంజీర్‌ రీమేక్ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25:  చిరంజీవి తనయుడు రాం చరణ్ తేజ హీరోగా బాలీవుడ్ కు పరిచయమవుతున్నజంజీర్‌ రీమేక్ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఆరు వారాలపాటు సినిమా విడుదలకు అంతరాయం కలిగింది. సినిమా హక్కుల విషయమై   తమకు పూర్తిగా డబ్బు చెల్లించలేదని అమిత్‌ మెహ్రా సోదరులు  కోర్టుకెక్కారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును అమిత్‌ సోదరులు ఆశ్రయించారు.

యాక్సిస్ బ్యాంక్ లో ఘోర అగ్ని ప్రమాదం : నలుగురు మహిళా ఉద్యోగులు మృతి

చెన్నై,ఏప్రిల్ 25: : తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్ బ్యాంక్ లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యోగులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా  ఉదయం 10 గంటలకు భవనంలోని మూడో అంతస్తులు మంటలు చెలరేగినట్లు సమాచారం.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 యాక్సిస్ బ్యాంక్ లో  ఘోర అగ్ని ప్రమాదం :  నలుగురు మహిళా ఉద్యోగులు మృతి

Friday, April 19, 2013

భద్రాద్రిలో కళ్యాణ వైభోగం...

ఖమ్మం, ఏప్రిల్ 19 : శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి లోని మిథిలాస్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.  ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా స్టేడియంకు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  అభిజిత్ లగ్నంలో  వేదపండింతులు మాంగల్య ధారణ కావించారు. టీటీడీ తరపున చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకై రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రికి పోటెత్తారు.  కేంద్ర మంత్రి బలరాంనాయ్, మంత్రులు సి.రామచంద్రయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా హాజరయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Saturday, April 13, 2013

సీతమ్మ...ఏ చెట్టు కింద తలదాచుకున్నట్టు...!

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఐదు రోజుల పాటు కనబడకుండా పోయి నగరానికి తిరిగొచ్చిన అమ్మడు (అంజలి) కేవలం వ్యక్తిగతమైన సమస్యలవల్లే ఈ పరిస్థితి ఎదురైందని, ఇక ముందు ఇటువంటి సమస్యలు ఉండబోవని  కప్పదాటు సమాధానం ఇచ్చింది.   సోమవారంనుంచి షూటింగులకు హాజరవుతానని చెప్పుకొచ్చింది.   అనుకోని సంఘటనలు జరగడంతో నిర్మాతలను, దర్శకులను ఇబ్బంది పెట్టానని  విచారం వ్యక్తం చేసి, తనవల్ల కలిగిన ఇబ్బందికి అందరినీ క్షమించమని కోరుతున్నానని అంది. ఇక నుంచి తన జీవితం, సినిమా పాత్రలూ అన్నీ ఇక తన చేతిలోనే ఉంటాయని  అన్ని కమిట్‌మెంట్లనూ పూర్తి చేస్తానని అంటున్న ఈ సీతమ్మ ఈ ఐదు రోజులు ఏ సిరిమల్లె చెట్టు కింద తలదాచుకుందో మాత్రం చెప్పలేదు.

Friday, April 12, 2013

ప్రాణ్ కు పాల్కే అవార్డు

ముంబై, ఏప్రిల్ 12 : బాలీవుడ్ నటుడు ప్రాణ్ కు ప్రతిష్టాత్మక  దాదాసాహేబ్ పాల్కే అవార్డు ప్రకటించారు.  350కి పైగా చిత్రాల్లో నటించిన ప్రాణ్  ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి.  పలు చిత్రాలలో క్యారెక్టర్ యాక్టర్ గా కూడా నటించారు.  2001లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు బహూకరించింది.  92 ఏళ్ళ ప్రాణ్   1998 సంవత్సరం నుంచి  నటనకు విశ్రాంతినిచ్చారు. 1940లో 'యమలా జట్' చిత్రంలో బాలీవుడ్ చిత్ర కెరీర్‌ను ప్రారంభించిన ప్రాణ్... అనేక చిత్రాల్లో విలన్‌గా నటిస్తూనే.. క్లాసికల్ టచ్ ఉన్న "మిలాన్", "మధుమతి", "కాశ్మీర్ కి కాళి" చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత ఈయన క్యారెక్టర్ నటుడిగా, స్నేహితుడు, తండ్రి, తాత వంటి పాత్రల్లో నటిస్తూ వచ్చారు. అమితాబ్ నటించిన "జంజీర్", "ఉప్‌కార్", "పరిచయ్" చిత్రాల్లో వెరైటీ  పాత్రలను చేశారు. తెలుగులో కొదమ సింహం చిత్రంలో ప్రాణ్ విలన్ పాత్రలో నటించారు. 

Thursday, April 11, 2013

అన్నపూర్ణ స్టూడియో లో అవినీతి లేదు-నాగార్జున

హైదరాబాద్, ఏప్రిల్ 11:  కొండలను కరిగించి అన్నపూర్ణ స్టూడియోను నిర్మించామని, అప్పట్లో స్టూడియో నిర్మాణం కోసం భూమిని కూడా ఉచితంగా తీసుకోలేదని, మొత్తం డబ్బు చెల్లించే స్టూడియోకి భూమిని తీసుకుని స్టూడియో నిర్మించామని సినీ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో స్టూడియో తప్ప ఏమీ ఉండేదికాదని, ఎంతో కష్టపడి స్టూడియో నిర్మించామని ఆయన తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోపై విమర్శలు రావడంపై స్పందించిన  అక్కినేని నాగార్జున ఒక చానల్ తో  మాట్లాడుతూ స్టూడియోకు సంబంధించిన డాక్కుమెంట్లు ఉన్నాయని, ఎవరు చూడ్డానికి వచ్చినా డాక్యుమెంట్లు చూపించేందుకు తాము సిద్ధమని ఆయన తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకోసం నాన్న (డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ కు చెన్నై నుంచి వచ్చారని నాగ్ అన్నారు. యాక్టింగ్ స్కూల్ కమర్షియల్ కాదని, కొంతమంది తెలివైన విద్యార్థులకు రాయితీ ఇచ్చి చదివిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్‌కెన్వెన్షన్ ల్యాండ్ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై మాట్లాడడం సరికాదని నాగార్జున అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజంలేదని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, గత 70 సంవత్సరాలుగా కుటుంబానికి తెలిసింది సినిమాలేనని, నాన్న కూడా రాజకీయాల్లోకి వెళ్లమనలేదని నాగార్జున వ్యాఖ్యానించారు రాజకీయాల గురించి కలలోకూడా అనుకోనని, తమ కుటుంబం అంతా సినిమాల్లోనే ఉన్నాం, ఉండబోతున్నామని నాగార్జున స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నామని, అలాగే దివంగత వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కార్యక్రమంలో కూడా పాల్గొన్నామని నాగార్జున అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తాము ముందుకు వస్తామని, తమ వంతుగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొని చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తనకు స్నేహితుడని, ఆయనకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకే తాను చంచల్ గూడ జైలుకు వెళ్లి కలుస్తున్నానని నాగార్జున వివరణ ఇచ్చారు.

ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్న అమితాబ్

హైదరాబాద్, ఏప్రిల్ 11: బిగ్ బి అమితాబ్ బచ్చన్ 2011 వ సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. లలిత కళా తోరణంలో గురువారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి అమితాబ్ స్వయంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ అవార్డును అమితాబ్‌కు అందజేశారు. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అని తెలుగులో శుభాకాంక్షలు అందిస్తూ అమితాబ్ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఎన్టీఆర్ పేర నెలకొల్పిన జాతీయ అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు, ఎన్టీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అని శ్లాఘిస్తూ ఆయన బ్రతికి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవారమని ఆయన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. సినిమా అనేది దేశం మొత్తాన్ని ఏకం చేయగలిగినంత శక్తిమంతమైనదంటూ దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవాళ్లమంతా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా జోక్ వస్తే ఒకే రకంగా నవ్వుతామని, అలాగే హృదయాన్ని కదిలించే దృశ్యాలు వచ్చినప్పుడు అదే విధంగా కన్నీరు కారుస్తామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ అవార్డు ఇచ్చిన తెలుగువారికి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటానని ఆయన సినిమా అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు. కాగా, రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును కైకాల సత్యనారాయణకు ప్రదానం చేశారు.2011 సంవత్సరం  నంది అవార్డులను కూడా ప్రదానం చేశారు.  ఉత్తమ చిత్రంగా ఎంపికైన శ్రీరామరాజ్యం చిత్రానికి నిర్మాత యలమంచిలి సాయిబాబా అవార్డును అందుకోగా, ఉత్తమ నటుడి అవార్డును మహేశ్ బాబు, ఉత్తమ నటి అవార్డును నయనతార  అందుకున్నారు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...