Saturday, March 30, 2013

కరెంట్ ఫూల్స్...!

హైదరాబాద్, మార్చి 30:  నిరసనలు, ఆందోళనలు లెక్క  చేయకుండా విద్యుత్ నియంత్రణ మండలి  జనాన్ని ఫూల్స్ ను చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు  పెంచుతోంది.   50 యూనిట్ల లోపు చార్జి  ప్రస్తుతం మాదిరిగానే యూనిట్ కు 1.45 రూపాయల ఛార్జీ కొనసాగుతుంది. 51-100 లోపు యూనిట్‌కు రూ.3.25, 101-150 లోపు యూనిట్‌కు రూ.4.88, 151-200లోపు యూనిట్‌కు రూ.5.63, 201-250లోపు యూనిట్‌కు రూ.6.38, 251-300లోపు యూనిట్‌కు రూ.6.88, 301-400లోపు యూనిట్‌కు రూ.7.38, 401-500లోపు యూనిట్‌కు రూ.7.88, 500 పైన యూనిట్లకు రూ.8.38 ఛార్జి వసూలు చేస్తారు. బిల్లుల విధానంలో టెలిస్కోపిక్ విధానాన్ని కొనసాగించనున్నారు. కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల  ప్రజలపై 6,500 కోట్ల రూపాయల భారం పడుతుంది.

Wednesday, March 27, 2013

హైదరాబాద్ రాజ్ భవన్ లో హోళీ వేడుకలలో పాల్గొన్న గవర్నర్ దంపతులు 

Tuesday, March 26, 2013

అసెంబ్లీ అయిపోయింది...

హైదరాబాద్, మార్చి 26 :   శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. మంగళవారం ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కూడా సభ ఆమోదముద్ర వేసింది.బడ్జెట్ పద్దులను చర్చించేందుకు త్వరలోనే స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది.

విద్యుత్ దీక్షలు భగ్నం... రాఘవులు, నారాయణ అరెస్టు

హైదరాబాద్, మార్చి 26 : విద్యుత్ బిల్లుల పెరుగుదల, విద్యుత్ సరఫరా సమస్యలపై గత నాలుగు రోజులుగా ఇందిరా పార్క్‌వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్న వామపక్ష నేతలను పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. దీక్షలో ఉన్న లెఫ్ట్ నేతలు బివి రాఘవులు, నారాయణలను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. కాగా సీపీఐ నేత నారాయణ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ తగ్గిపోవడంతో ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు తక్షణం నారాయణకు వైద్య సహాయం అందించాలని పోలీసులకు సూచించారు. దీంతో లెఫ్ట్ నేతలు నారాయణ, రాఘవులు సహా పలువురు కార్యకర్తలను  అరెస్టు చేశారు. నేతలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

విద్యుత్ పై ఇంతకంటే ఏం చేయలేం...సి.ఎం.

హైదరాబాద్, మార్చి 26:  విద్యుత్ కు  ఇబ్బంది ఉందని, అయితే ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని, పార్టీలు  పరస్పరం బురద చల్లుకుంటే సమస్య పరిష్కారం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యుత్త్ పై జరిగిన చర్చకు ఆయన మంగళవారం శాసనసభలో సమాధానం ఇచ్చారు. జలవిద్యుదుత్పత్తి తగ్గడం వల్ల, తగినంత గ్యాస్ అందకపోవడం వల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా గ్యాస్ ద్వారానే విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని, విద్యుదుత్పత్తి తగ్గడం వల్ల వ్యయం పెరుగుతోందని ఆయన అన్నారు. ఇందన సర్దుబాటు కొత్తేమీ కాదని, 2003 నుంచి జరుగుతున్నదే అని ఆయన అన్నారు. 2006 - 2008 మధ్య కాలంలో ఇంధన సర్దుబాటు జరగలేదని, జలవిద్యుదుత్పత్తి బాగా జరిగినప్పుడు ఇంధన సర్దుబాటు జరగలేదని ఆయన వివరించారు.  గత 30 ఏళ్లలో ఇంత తక్కువ విద్యుదుత్పత్తి ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. గ్యాస్, నీటి ద్వారా 14 శాతం విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని, మిగతాది ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు. హర్యానా నుంచి 180 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు నీటి వసతి లేదు కాబట్టి ఈ ప్రాంతానికి ఎక్కువ విద్యుత్తు ఇస్తున్నామని, దీన్ని వేరే విధంగా చూడవద్దని ఆయన అన్నారు. విద్యుత్తు కొనుగోలులో అవినీతి ఏమీ లేదని ఆయన అన్నారు. ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా 6,045 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్న ఘనత తమదేనని ఆయన అన్నారు. రోజుకు 60 మిలియన్ యూనిట్ల కొరత ఉందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది అదనంగా 2 వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఏడాది 4500 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు గ్యాస్ ఎరువుల రంగానికి కాకుడా విద్యుత్తు రంగానికి ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు. రాష్ట్రానికి గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఈ ఏడాది ఆఖరులోగా అది అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. రైతులకు విద్యుత్తును అందించడంలో వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. కెజి బేసిన్ డి6 ద్వారా గ్యాస్ అందడం లేదని ఆయన చెప్పారు. దీని గురించి కేంద్రం విచారిస్తోందని చెప్పారు. ఎక్కడ వీలుంటే అక్కడి నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అదనపు విద్యుత్తు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన అన్నారు.

Monday, March 25, 2013

అమెరికాలో భారత సంతతి విద్యార్థి అదృశ్యం

వాషింగ్టన్, మార్చి 25: అమెరికాలో సునీల్ త్రిపాఠీ (22) అనే భారత సంతతి విద్యార్థి కొద్ది రోజులుగా అదృశ్యమయ్యాడు. రోడ్ ఐలాండ్ పోలీసులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నా, ఫలితం లేకపోవడంతో తాజాగా ఎఫ్‌బీఐ స్వయంగా రంగంలోకి దిగింది. బ్రౌన్ వర్సిటీలో చదువుకుంటున్న త్రిపాఠీ మార్చి 16 నుంచి కనిపించకుండా పోయాడు. పోలీసులతో పాటు అతడి మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆచూకీ కోసం పోస్టర్లు ముద్రించడంతో పాటు ‘ఫేస్‌బుక్’లో ప్రత్యేకంగా ఒక పేజీని కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు అతడి ఆచూకీపై గట్టి ఆధారాలేవీ లభించలేదని డిటెక్టివ్ బృందం అధినేత మార్క్ సాకో చెప్పారు. త్రిపాఠీ గదిలో అతడి గుర్తింపు కార్డు, సెల్‌ఫోన్, ఇతర వ్యక్తిగత వస్తువులు దొరికాయని తెలిపారు.

వర్కవుట్ అవుతుందా...?

హైదరాబాద్, మార్చి 25:   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర  ఆదివారంతో  వంద రోజులకు చేరింది.  గత  అక్టోబర్ 18వ తేదిన కడప జిల్లా ఇడుపులపాయ నుండి పాదయాత్రను ప్రారంభించిన షర్మిల. 58 రోజుల పాదయాత్ర తర్వాత మోకాలి గాయం కారణంగా విరామం ఇచ్చారు. చికిత్స అనంతరం ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్రను పునఃప్రారంభించారు. మొత్తం యాత్రలో భాగంగా షర్మిల ఇప్పటి వరకు 1,375 కిలోమీటర్లు నడిచారు.  ఏడు జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టారు. ప్రస్తుతం ఆమె గుంటూరు జిల్లా లో పాదయాత్ర చేస్తున్నారు.  జగన్ జైలుకు వెళ్లడంతో పార్టీ పటిష్టత కోసం ఆమె పాదయాత్ర చేపట్టారు.  అయితే ఎన్నికల రణరంగంలో ఈ యాత్ర ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

ఏప్రిల్ 25 నుంచి ఎంసెట్ హాల్‌టిక్కెట్లు

      
హైదరాబాద్, మార్చి 25:  ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగుస్తుంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌లో 2.46 లక్షల దరఖాస్తులు వచ్చాయని, మెడికల్‌లో 89 వేల దరఖాస్తులు వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు.  ఏప్రిల్ 25 నుంచి హాల్‌టిక్కెట్ల పంపిణీ చేస్తామన్నారు.  సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు.


 

Sunday, March 24, 2013

క్లీన్ స్వీప్

న్యూఢిల్లీ, మార్చి 24:  టెస్టు క్రికెట్ లో టీమిండియా సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. షిరోజ్ షా కోట్లా మైదానంలో చిరస్మరణీయ విజయంతో అసీస్ ను  ఓడించి  గతేడాది ఆసీస్ గడ్డపై జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.  మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ముగించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో  నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 4-0 తేడాతో గెల్చుకుంది. చివరి టెస్టులో ఆసీస్ ను ఆరు వికెట్లతో ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని  31.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అధిగమించింది. పూజారా(82) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నాడు.

Saturday, March 23, 2013

అమితాబ్ కు ఎన్టీఆర్ జాతీయ అవార్డు


 హైదరాబాద్, మార్చి 23 : 2011 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు. బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును శ్యాం బెనగల్ కు, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డును ఆదిశేషగిరిరావుకు, రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డును కైకాల సత్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది.  ఉగాది రోజున ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆలిండియా సూపర్ స్టార్ గా రాణించిన అమితాబ్  జంజీర్, దీవార్, డాన్ వంటి చిత్రాలు.. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నిప్పులాంటి మనిషి, మగాడు, యుగందర్ గా రూపొంది ప్రేక్షకులను అలరించాయి. ఎన్నో విషయాల్లో ఎన్టీఆర్ అమితాబ్ లకు సామీప్యం ఉంది. ఎన్టీఆర్, అమితాబ్ ఇద్దరూ కృషిని నమ్ముకుని సూపర్ స్టార్ లుగా ఎదిగినవారే. ఇటీవలే అక్కినేని జాతీయ అవార్డును అందుకున్న ప్రఖ్యాత దర్శకుడు శ్యాంబెనెగల్ కు ప్రతిష్టాత్మక బి.ఎన్ రెడ్డి అవార్డు లభించింది. ప్శ్యాంబెనగల్ హైదరాబాద్ వాసి కావడం విశేషం. బెనెగల్ రూపొందించిన చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై తమదైన సత్తా చాటాయి.  నాగిరెడ్డి - చక్రపాణి జాతీయ అవార్డు అందుకున్న పద్మాలయా నిర్మాణ సారధుల్లో ఒకరైన జి.ఆదిశేషగిరిరావు  నిర్మాతగా తన అన్న హీరో కృష్ణతో పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు వంటి రజతోత్సవ చిత్రాలను నిర్మించారు. ఇక సిపాయి కూతురుతో కథానాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసి... ఆపైన ప్రతినాయకుడిగా తనదైన బాణి పలికించిన  కైకాల సత్యనారాయణ 2011 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అందుకోనున్నారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత అనితరసాధ్యమైన రీతిలో యముడు, దుర్యోదనుడు వంటి పౌరాణిక పాత్రలకు సైతం ప్రాణం పోశారు. 700 పైచిలుకు చిత్రాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. 



Thursday, March 21, 2013

ముంబయి పేలుళ్ల కేసులో 20 ఎళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ, మార్చి 21 :   1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో  20 ఎళ్ళ తర్వాత సుప్రీంకోర్టు  తీర్పు వెల్లడించింది. యాకూబ్, అబ్దుల్ రజాక్ మెమన్ లకు  ఉరి శిక్ష ఖరారు చేసింది. ఈకేసులో మరో పదిమంది నిందితులకు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్ తప్పించుకు తిరుగుతున్నాడని కోర్టు పేర్కొంది. పాక్ సైన్యం ఐఎస్ ఐ సహకారంతో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందని తెలిపింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను పాక్ ఉల్లంఘించిందని, ముంబయి నుంచి దుబాయ్ మీదగా ఉగ్రవాదులు ఇస్లామాబాద్ కు వెళ్లినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో కస్టమ్స్ అధికారుల పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించింది.  కాగా కేసు విచారణలో ఉండగా మాజీ కస్టమ్స్ అధికారి ఎస్.ఎన్. థాపా మృతి చెందగా, మరణశిక్ష పడిన మహమ్మద్ ఇక్బాల్ కూడా మృతి చెందాడు.
సంజయ్ దత్ కు అయిదేళ్ల జైలు
 బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఆయుధాలు కలిగిన కేసులో సుప్రీంకోర్టు  అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 16 నెలల జైలుశిక్ష అనుభవించిన సంజయ్ దత్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. కోర్టు తీర్పుతో ఆయన మరో మూడున్నరేళ్లు శిక్ష అనుభించాల్సి ఉంది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

రేప్ నిరోధక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ, మార్చి 21 :   మహిళలపై అత్యాచారాల  నిరోధక బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. అత్యాచారం, యాసిడ్ దాడులు తదితర నేరాలకు మరణశిక్ష, బతికున్నంత వరకు జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు ఇందులో పొందుపరిచారు. దేశ రాజధానిలో 'నిర్భయ'పై సామూహిక అత్యాచారం నేపథ్యంలో క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు-2013 పేరుతో ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. 

కోదండరాంకు 4వరకు రిమాండ్

హైదరాబాద్, మార్చి 21 : సడక్ బంద్ లో పాల్గొన్న కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జితేందర్‌రెడ్డిలపై మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 147, 148, 149, 348(3డి), పీపీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఏ-4గా కోదండరాం, ఏ-5గా శ్రీనివాస్‌గౌడ్, ఏ-6గా జూపల్లి, ఏ-7 ఈటెల, ఏ-8గా జితేందర్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. వీరికి అలంపూర్ కోర్టు ఏప్రిల్ 4వరకు రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్‌పై రేపు అలంపూర్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. దీంతో జేఏసీ నేతలు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మహబూబ్‌నగర్ పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు తరలించారు.

'సడక్ బంద్' సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత: అరెస్టులు

హైదరాబాద్, మార్చి 21 : తెలంగాణ పొలిటికల్ జేఏసీ కర్నూలు జిల్లా హైవే పై గురువారంనాడు నిర్వహించిన న 'సడక్ బంద్' సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  మహాబూబ్ నగర్ జిల్లా, ఆలంపూర్ టోల్ ప్లాజా వద్దభారీగా  టీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన తెలంగాణవాదులు వాహనాలపై రాళ్లతో దాడిచేసి, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణా రావును , తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ జెఏసి నేత శ్రీనివాస్ గౌడ్‌లను  అరెస్టు చేశారు. కొత్తకోటలో సడక్ బంద్ చేపట్టిన ఎమ్మెల్యేలు భిక్షపతి యాదవ్, రాజయ్య, సమ్మయ్యలను, షాద్‌నగర్‌లో సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావును పోలీసులు అరెస్టు చేశారు.  కాగా ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులతో పాటు, 40 వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు.

Wednesday, March 20, 2013

గుండెపోటును ముందే గుర్తించే పరికరం...!

లండన్ , మార్చి 21:  రక్తంలోని పదార్థాలను, జీవక్రియలను పసిగట్టడం ద్వారా గుండెపోటును కొన్ని గంటల ముందుగానే గుర్తించే ఓ పరికరాన్ని స్విస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చర్మం కింద అమర్చే ఈ ఇంప్లాంట్ 24 గంటలపాటూ రక్తంలోని ఐదు రకాల పదార్థాలను పరిశీలిస్తుంది. 1.4 సెం.మీ. మాత్రమే ఉండే ఈ పరికరం చర్మంపై అమర్చే చిన్న ప్యాచ్ నుంచి విద్యుత్‌ను గ్రహించి పనిచేస్తుంది. గుండెకు ఇబ్బందిగా పరిణమించే పదార్థాలను, జీవక్రియల్లో తేడాలను గుర్తించిన వెంటనే ఇది బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు లేదా టాబ్లెట్‌కు సమాచారం పంపుతుంది. వాటి నుంచి ఇంటర్‌నెట్ ద్వారా నేరుగా వైద్యుడి కంప్యూటర్‌కు సమాచారం అందుతుంది. దీంతో వైద్యుడి సూచనల మేరకు రోగి ముందుగానే జాగ్రత్తపడే అవకాశం కలగనుంది. ఇది మరో నాలుగేళ్లలోగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

సబ్‌మెరైన్ నుంచి సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం

విశాఖపట్నం, మార్చి 21:  భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధిపరిచిన బ్రహ్మోస్ క్షిపణి మరో రికార్డు సృష్టించింది. 290 కిలోమీటర్ల పరిధి గల ఈ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్‌ని విశాఖ తీరంలోని సబ్‌మెరైన్ నుంచి బుధవారం విజయవంతంగా ప్రయోగించారు. నీటిలోపల సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్‌ని ప్రయోగించడం ప్రపంచంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగంలో బ్రహ్మోస్ తన 290కిలోమీటర్ల పూర్తి పరిధిని చేరుకుందని దీన్ని అభివృద్ధి పరిచిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ సీఈవో ఎ.శివథాను పిళ్లై తెలిపారు.  ' బంగాళాఖాతం జలాల్లోని సబ్‌మెరైన్ నుంచి ఉదయం 9.30కి బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లింది. 'ఎస్' ఆకారంలో విన్యాసం చేస్తూ నీటికి ఒక మీటర్ ఎత్తులో ప్రయాణించి లక్షిత నౌకను ధ్వంసం   చేసింది. వర్టికల్ లాంచ్ కాన్ఫిగరేషన్‌లో సబ్‌మెరైన్లలో అమర్చడానికి బ్రహ్మోస్ క్షిపణి సిద్ధంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనది' అని పిళ్లై వెల్లడించారు. బ్రహ్మోస్‌ని ప్రయోగించడం ఇది 34వసారి. గత అక్టోబర్‌లోనూ 'ఐఎన్ఎస్ టెగ్' యుద్ధనౌక నుంచి డీఆర్‌డీవో  దీ నిని విజయవంతంగా పరీక్షించింది.
భూ ఉపరితలం, సముద్ర ఉపరితలం, ఆకాశంలోనూ ప్రయోగించగల సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్‌గా బ్రహ్మోస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు నీటిలోనూ విజయవంతమైంది. అమెరికా, రష్యాలకు చెందిన వేర్వేరు జీపీఎస్ ఉపగ్రహాల ద్వారా బ్రహ్మోస్ క్షిపణి సమాచారాన్ని సేకరించగలదు. దీంతో లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యంత కచ్చితత్వం ఉంటుంది. చివరి నిమిషంలోనూ... కొద్ది మీటర్ల దూరంలోను లక్ష్యాన్ని గుర్తించే శక్తి దీని సొంతం. చాలా లక్ష్యాలు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక దాన్ని ఎంచుకుని దాడి చేయగలదు. భూ ఉపరితలంపై అతి తక్కువ ఎత్తులో(10 మీటర్లు) దూసుకెళ్లి శత్రు రాడార్ల కంట పడకుండా లక్ష్యాన్ని ఛేదించ గలదు. 200కిలోల వార్‌హెడ్లను మోసుకెళుతూ ధ్వని వేగానికి 2.8 రెట్ల వేగంతో(మ్యాక్ 2.8) దూసుకెళ్లగలదు. ఆకాశంలో ప్రయోగించ గల బ్రహ్మోస్ అయితే 300కిలోల వార్‌హెడ్లను మోయగలవు. ఇక ప్రపంచంలోనే సూపర్‌సానిక్ వేగంతో స్థాన చలనంలో మార్పులు చేసుకోగల ఏకైక క్షిపణి బ్రహ్మోస్. ఇది ఇప్పటికే సైన్యం, నౌకాదళానికి అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే వైమానిక దళానికీ అందనుంది. మరోవైపు హైపర్‌సానిక్ బ్రహ్మోస్-2 క్షిపణులను 2017కల్లా రూపొందించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇవి మ్యాక్ 5 నుంచి మ్యాక్ 7(గంటకు 6000 నుంచి 8500 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించగలవు. అమెరికా ఇటీవలే మ్యాక్ 5 వేగం గల క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వీటిని పునర్వినియోగించేలా కూడా శాస్త్రవేత్తలు దృష్టి సారించనున్నారు. అలాగే ప్రస్తుతం సుఖోయ్ యుద్ధ విమానాల కోసం రూపొందించిన బ్రహ్మోస్‌ను మిగ్ విమానాల్లోనూ వినియోగించే విధంగా బ్రహ్మోస్-3ని రూపొందించాలని కూడా రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ క్షిపణులను భారత్-రష్యాలు మాత్రమే వినియోగించుకుంటాయని, మూడో దేశానికి సరఫరా చేయమని బ్రహ్మోస్ ఏరోస్పేస్ స్పష్టం చేసింది.


మే 5న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు....

న్యూఢిల్లీ, మార్చి 21: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి మే 5న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం అదేనెల 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అదేరోజు నుంచి  17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.  నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ గడువుగా నిర్ణయించారు. మే 5న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం మొత్తం 50,446 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 224 స్థానాలు గల అసెంబ్లీలో 36 స్థానాలు ఎస్సీలకు, 15 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. 

Monday, March 11, 2013

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు....

హైదరాబాద్ , మార్చి 11: నామినేషన్లు దాఖలు గడువు ముగియడనికి  సరిగ్గా ఒక్క రోజు ముందు.. కాంగ్రెస్‌పార్టీ తమ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అధిష్ఠానం ఆమోదించిన ఐదు పేర్లను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ  విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పార్టీ సంఖ్యాబలానికి తగ్గట్లుగా ఐదుగురిని ఎంపిక చేశామని, ఆరో అభ్యర్థి గురించి ఇంకా  ఆలోచిస్తామని బొత్స తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం మొత్తం 160 మంది దరఖాస్తు చేసుకోగా... అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ఐదుగురిని ఎంపిక చేశామన్నారు. గవర్నర్ కోటా సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎ. లక్ష్మీ శివకుమారిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు. రెండో అభ్యర్థిగా విజయనగరం డీసీసీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామిని, మూడో అభ్యర్థిగా మాజీ మంత్రి, పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు మహ్మద్ షబ్బీర్ అలీని ఎంపిక చేసినట్లు చెప్పారు. నాలుగో అభ్యర్థిగా కరీంనగర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ను, ఐదో అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను ఎంపిక చేశామన్నారు. సంవత్సరం ముందు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఖాళీ కాగా.. ఆ స్థానంలో శివకుమారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సంగతి గుర్తు చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన ఆమెను.. కోస్తా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు.   కాంగ్రెస్ అభ్యర్థులు వీరే......
ఎ. శివ లక్ష్మీకుమారి
(తూర్పుగోదావరి - ఎస్సీ)
కె. వీరభద్రస్వామి
(విజయనగరం - వైశ్య)
మహ్మద్ షబ్బీర్ అలీ
(నిజామాబాద్ - మైనారిటీ)
టి. సంతోష్‌కుమార్
(కరీంనగర్- మున్నూరు కాపు)
పి.సుధాకర్‌రెడ్డి
(ఖమ్మం - రెడ్డి)

. ఢిల్లీ రేప్ కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్య

న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. తీహార్ జైలులో ఉన్న రాంసింగ్ తనకు ఈ కేసులో న్యాయం జరిగదనే ఉద్దేశంతో సోమవారం ఉదయం 5 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ బస్సు డ్రైవర్. నిందితుడు రాంసింగ్ జైల్ నెంబర్ 3లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తీహార్ జైలు సిబ్బంది తెలియజేశారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...