జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్: తొమ్మిది మంది నక్సల్స్ మృతి
రాంచి,జనవరి 28: జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సబ్ జోనల్ కమాండర్ సహా తొమ్మిది మంది నక్సల్స్ మృతి చెందారు. లుహూర్ అటవీ ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల సంయుక్త బృందం అక్కడికి వెళ్ళడంతో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది నక్సల్స్ మృతి చెందారని, మృతదేహాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతుల్లో ఒకరిని సబ్ జోనల్ కమాండర్ బసంత్ యాదవ్‌గా గుర్తించామని చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఆరు రైఫిళ్లు, మూడు నాటు తుపాకులు, రూ. 2,800 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
Comments