Saturday, January 29, 2011

ఉద్యమ పార్టీకి ఉనికేది !?

ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి  నాయకత్వం వహిస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పట్టు  తక్కువే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో కలుపుకుంటే తెలంగాణాలో పది జిల్లాలు ఉన్నాయి. అయితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గత దశాబ్దకాలంగా పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి  కేవలం మూడంటే.. మూడు జిల్లాల్లోనే చ్ప్పుకోదగ్గ  పట్టుంది. అదికూడా జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాల్లోనే ఈ పట్టు ఉండటం గమనార్హం. వీటిలో కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలను మాత్రమే చెప్పుకోవచ్చు. మిగిలిన జిల్లాల్లో ఈ పర్టీ గులాబీల ప్రభావం అంతంతమాత్రమే. పార్టీ  అధినేత కేసీఆర్ సొంత జిల్లాగా పేరొందిన కరీంనగర్‌లో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే తెరాసకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాలోని మిగిలిన సెగ్మెంట్‌లలో తెరాస ఉన్నా లేనట్టుగానే ఉంది. ఇక. ఆదిలాబాద్‌లో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉండగా, మూడింటికి మాత్రమే తెరాస ప్రాతినిథ్యం వహిస్తోంది. వరంగల్‌ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం ఒకే ఒక స్థానాన్ని కలిగివున్న తెరాస నిజామాబాద్ జిల్లాలోకూడా  ఒక స్థానాన్నే కలిగివుంది. ఇక మిగిలిన జిల్లాలకొస్తే  నల్గొండ జిల్లాల్లో 12 సీట్లుండగా, ఒక్కదానిలో కూడా తెరాస గెలవలేక పోయింది. మెదక్ పది ఉంటే ఒక స్థానం( -సీపేట-లో  గెలుపొందింది. తెలంగాణలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా చెప్పుకునే మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబీ సెగ్మెంట్లు ఉండగా తెరాసకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.  ఇక ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిస్థితిని సమీక్షిస్తే.. కనీసం ఎమ్మెల్యేలు కాదు కదా కనీసం మద్దతుదారులు కూడా లేకపోవడం గమనార్హం. తెరాస ఆవిర్భవించిన తర్వాత స్థానిక సంస్థల్లో మినహా సార్వత్రి క ఎన్నికల్లో ఒంటరిగా ఒక్కసారి కూడా పోటీ చేయలేదు, 2004లో కాంగ్రెస్ పార్టీతోనూ, 2009లో మహాకూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఈ పొత్తుల్లో భాగంగా 2004లోనే తెరాస 26 అసెంబ్లీ సీట్లను గెలుచుకోగా, 2009లో తెదేపా, సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ.. కేవలం పది స్థానాలకే పరిమితమైంది.  హైదరాబాద్ తమ సొత్తని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం సాహసం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న బలం, బలగాన్ని సులభంగానే  అంచనా వేయవచ్చు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...