Monday, March 30, 2015

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ

న్యూఢిల్లీ, మార్చి 30 : భారతీయ జనతా పార్టీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని తాము అధిగమించామని కమలం పార్టీ నేతలు అన్నారు. బీజేపీ కీర్తి కిరీటంలో మరో కలుకితరాయి వచ్చి చేరింది. ప్రపంచంలోని పార్టీలు అన్నింటిని ఆధిగమించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆదివారం నాటికి ఆ పార్టీ సభ్యత్వాలు 8 కోట్ల 80 లక్షలకు చేరాయి. ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాలకంటే ఎక్కువ కావడం విశేషం. సీపీసీలో 8 కోట్ల 60 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు అదే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పార్టీగా ఉంది. అయితే సభ్యత్వాల విషయంలో ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము అధిగమించామని బీజేపీ ప్రకటించుకుంది. 

మార్చి 31 నాటికి 10 కోట్ల మంది సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యంగా బీజేపీలో సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని 2014 నవంబర్‌ ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక్క ఫోన్‌ కాల్‌తో సభ్యులుగా చేరే హైటెక్‌ విధానాన్ని బీజేపీ ప్రవేశపెట్టింది. తొలి సభ్యులుగా మోదీ చేరారు. అయితే పార్టీ సభ్యత్వాలు 10 కోట్లకు చేరకపోయినా 8 కోట్ల 80 లక్షలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది

Sunday, March 29, 2015

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ... ఆరుగురు మృతి

విశాఖపట్నం, మార్చి 29:  ఎస్‌ రాయవరం మండలం గోకులపాడులోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ  పేలుడు సంభవించింది. ఆదివారం నాడు ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు కారణంగా పరిశ్రమలో బారీగా మంటలు ఎగసి  పడ్దాయి  అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. పరిశ్రమలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహయక చర్యలు చేపట్టారు. ఆదివారం కావడంతో చిన్న పిల్లలు కూడా పనిలోకి వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. 



సైనా,శ్రీకాంత్ లకు ఇండియా ఓపెన్ టైటిల్స్ ...

న్యూఢిల్లీ, మార్చి 29;  ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో హైదరాబాద్‌కి చెందిన వరల్డ్‌ నంబర్‌ వన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రచనోక్‌ ఇంటనాన్‌పై సైనా 21-16, 21-14 తేడాతో గెలుపొందింది. ఇండియన్‌ ఓపెన్‌ సైనా గెలుచుకోవడం ఇదే తొలిసారి. కెరీర్లో సైనాకిది 16వ టైటిల్‌ కాగా సూపర్‌ సిరీస్‌ టైటిల్స్ లో తొమ్మిదోది. 
శ్రీకాంత్ కు టైటిల్ 
ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో కిదాంబి శ్రీకాంత్‌ టైటిల్‌ గెలిచారు. ఫైనల్స్‌లో విక్టర్‌ అక్సెల్‌సన్‌పై విజయం సాధించారు. ఈ టైటిల్‌ను గెలవడం శ్రీకాంత్‌కు ఇదే మొదటిసారి. 

ఆంధ్ర, తెలంగాణ కు ఆర్ధిక సంఘం నిధులు ...

న్యూ ఢిల్లీ, మార్చి 29: ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ  రాష్త్రాలకు నిధులు మంజూరు చేసింది. వివిధ పద్దుల కింద ఏపీకి రూ. 385 కోట్లు, తెలంగాణకు రూ. 150 కోట్లు కేటాయించారు. ఏపీకి గణాంకాల అమలు కోసం రూ. 2.6 కోట్లు, స్థానిక సంస్థలు, పంచాయితీ రాజ్‌, ప్రత్యేక సాయం కింద మిగతా మొత్తం నిధులు మంజూరయ్యాయి. తెలంగాణకూ ఇవే పద్దుల కింద నిధులు మంజూరు చేశారు.

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి సురవరం

హైదరాబాద్‌,మార్చి 29: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకరరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా గురుదాస్‌ దాస్‌గుప్తా ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సభ్యునిగా కె. నారాయణ ఎన్నికయ్యారు. పుదుచ్చేరిలో  జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

పట్టిసీమ తెస్తాం ...పోలవరం సాధిస్తాం

ఏలూరు, మార్చి 29 : పోలవరం ప్రాజెక్టు మన కల అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరానికి ఎంత ఖర్చయినా ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పినట్టు తెలిపారు. ఇక్కడి రైతులకు ఇచ్చిన తర్వాతనే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తామని వివరించారు. గోదావరిలో మూడువేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రంలో నీటికి కరువు ఉండనే ఉండదని బాబు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం  చంద్ర బాబు అక్కడినుంచి పోలవరం వెళ్లారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. 

వరల్డ్ కప్ విజేత అసీస్...

మెల్‌బోర్న్‌, మార్చి 29:  క్రికెట్ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.  ఫైనల్లో న్యూజిల్యాండ్‌ను చిత్తుగా ఓడించి కప్‌ని గెలుచుకుంది.  ఆసిస్‌  వరల్డ్ కప్ గెలవడం ఇది ఐదోసారి . ఇంతకుముందు 1987, 1999, 2003, 2007, 2015లో  ఆస్ట్రేలియా కప్‌ గెలుచుకుంది. ఈ గెలుపు అనంతరం వన్డే క్రికెట్‌కు ఆసిస్ జట్టు కెప్టెన్‌ క్లార్క్‌ స్వస్తి చెప్పారు. ఈ రోజు మ్యాచ్ లో కివీస్ ను 45 ఓవర్లకే 182 పరుగులకు అల్ అవుట్ చేసిన ఆస్ట్రేలియా ...33.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టం తో విజయ లక్ష్యాన్ని చేధించింది .


Saturday, March 28, 2015

పీఎస్‌ఎల్‌వీ-సి27 ప్రయోగం విజయవంతం

 హైదరాబాద్‌ ,మార్చి 28; పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి27(పీఎస్‌ఎల్‌వీ) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ 'షార్‌' నుంచి శనివారం సాయంత్రం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.దీని బరువు 1,425 కిలోలు. ఇందులో ఇంధనం 821.5 కిలోలు కాగా ఉపగ్రహం బరువు 603.5 కిలోలు. దీని తయారీకి రూ.125 కోట్లు ఖర్చు చేశారు.నావిగేషన్‌ అభివృద్ధికిగాను మొత్తం ఏడు ఐఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాలను నింగిలోకి పంపాల్సిఉండగా.. ప్రస్తుతం పంపించింది నాలుగోది. మిగిలిన ఉపగ్రహాలను ఈ ఏడాదిలోనే పంపెందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. నావిగేషన్‌ వ్యవస్థతో విపత్తుల అంచనా, నౌకలు, ఇతర వాహనాల రాకపోకలు గుర్తించే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది . 

బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నెంబర్ 1 సైనా నెహ్వాల్‌..


ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌లో డ్రైవర్ గా తెలంగాణా మహిళ

న్యూఢిల్లీ,మార్చి 28: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌లో తెలంగాణ ఆడపడుచు సరిత చరిత్ర సృష్టించింది. డీటీసీలో మొదటి మహిళా డ్రైవర్‌గా స్టీరింగ్ పట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలానికి చెందిన   సరిత మొదట ఇంటివద్దే ఆటో నడిపింది. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బస్‌ డ్రైవర్‌గా పనిచేసింది. అయితే అక్కడి ఓ లెక్చరర్‌ ప్రోత్సాహంతో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. అక్కడ బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌గా పనిచేసింది.

చిత్తూరు జిల్లాలో మూడు పత్రిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థలకు శంకుస్థాపన

చిత్తూరు, మార్చి 28 : జిల్లాలోని ఏర్పేడు మండలం మెర్లపాకలో ఒకే రోజు మూడు పత్రిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థలకు శంకుస్థాపన జరిగింది. ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ఐటీకి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.  మెర్లపాకలో ఐఐటీ, పంగూరులో ఐఐఎస్‌ఈఆర్‌, సత్యవేడు శ్రీసిటీలో ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేయనున్నారు.

భద్రాద్రిలో కళ్యాణ వైభోగం..

ఖమ్మం,మార్చి 28: తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాద్రిలో   తొలి శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా  జరిగాయి. మిధిలా ప్రాంగణం లో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు  సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు  సమర్పించారు.  భద్రాచలం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. భద్రాచలాన్ని గొప్ప ఆద్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. తెలంగాణలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ తెలియజేశారు.
భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌
ఖమ్మం జిల్లాలోని పినపాకలో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణానికి  ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ 1080 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తే లక్ష్యమని, మూడేళ్లలో  థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. దీని ద్వారా తెలంగాణలో మిగులు విద్యుత్‌ సాధిస్తామని సీఎం తెలిపారు.

కళ్యాణోత్సవంతో పులకించిన ఒంటిమిట్ట,రామతీర్థం...

కడప, మార్చి 28 : శ్రీరామనవమి సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాస్వామికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఒంటిమిట్టలో ధ్వజారోహణం వైభవంగా సాగింది. రాములవారి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
రామతీర్థంలో
విజయనగరం జిల్లా  రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఆనంద గజపతిరాజు దంపతులు సమర్పించారు. రాష్ట్రమంత్రి మృణాళిని దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు.  మంత్రి మాణిక్యాలరావు కూడా  రాములవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను మంత్రి మాణిక్యాలరావు సమర్పించారు. రామతీర్థం అభివృద్ధికి రూ. 1.7 కోట్లను కేటాయిస్తున్నట్లు  మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు.

Thursday, March 26, 2015

సెమీస్ తో సరి... ఇండియా ఇంటికి ..

భారత్ కు భంగపాటు.. ఫైనల్లో ఆసీస్
సిడ్ని ,మార్చి 26;వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేకు పడింది. ఆసీస్ పేస్ కు ధోని సేన దాసోహమైంది. ప్రపంచకప్ నుంచి భారత్ నిష్ర్కమించింది. ఆతిథ్య జట్టు ఫైనల్ చేరగా, టీమిండియా ఇంటిముఖం పట్టింది. గురువారమిక్కడ జరిగిన సెమీస్ సమరంలో భారత్ ను ఆస్ట్రేలియా 95 పరుగుల తేడాతో ఓడించింది. 329 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ధోని సేన 46.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది.

ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు ధావన్, రోహిత్ 76 పరుగుల శుభారంభం అందించారు. ధావన్ ధాటిగా ఆడాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 45 పరుగులు చేసి తొలి వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోహ్లి(1) వెంటనే అవుటయ్యాడు. కొద్ది సేపటికే రోహిత్(34), రైనా(7) అవుటవడంతో టీమిండియా కష్టాల్లో పడింది.ఈ దశలో రహానే, ధోని జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 178 పరుగుల వద్ద రహానే(44) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ధోని అర్ధసెంచరీ ఒంటరి పోరాటం చేసినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ధోని 65 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేసి రనౌటయ్యాడు. అంతకుముందు జడేజా(16) రనౌటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్కనర్ 3 జాన్సన్ 2, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు స్మిత్(105) సెంచరీ, ఫించ్(81) అర్థసెంచరీలతో రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. స్మిత్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా తలపడుతుంది

Saturday, March 14, 2015

జింబాబ్వే పై గెలుపుతో లీగ్ విజయం పరిపూర్ణం


ఆక్లాండ్,మర్చి 14; క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా జరిగిన వన్డేలో జింబాబ్వేపై భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ధోని సేన ఛేదించింది. సురేశ్‌ రైనా (110*), అజేయ శతకంతో అదరకొట్టగా, ధోని (83*)కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్‌ విజయతీరాలకు చేరింది. తాజా ప్రపంచకప్‌లో భారత్‌ ఆడిన అన్ని లీగ్‌ మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేయడమే కాకుండా, అన్ని మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఆలౌట్‌ చేసి రికార్డు సృష్టించింది. 


Friday, March 13, 2015

క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ ప్రత్యర్థి బంగ్లా ...

మెల్బోర్న్, మార్చి13;  ప్రపంచకప్‌ క్రికెట్ -2015 తొలి అంకం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో క్వార్టర్‌ ఫైనల్‌లో తలపడే జట్లు దాదాపు ఖరారు అయ్యాయి.  ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం.. పూల్‌-ఎలో నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో పూల్‌-బిలో అగ్రస్థానంలో ఉన్న జట్టు తలపడాల్సి ఉంది. తాజా గణంకాల ప్రకారం భారత్‌ 10 పాయింట్లతో పూల్‌-బిలో అగ్రస్థానంలో ఉండగా, పూల్‌-ఎలో 7 పాయింట్లతో బంగ్లాదేశ్‌ నాలుగో స్థానంలో ఉంది. కాబట్టి క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ X బంగ్లాదేశ్‌ పోరు ఖరారైనట్లే. తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ ఈనెల 21న వెల్లింగ్టన్‌లో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేసింది. మ్యాచ్‌ను కొద్దిగా ముందుకు జరిపి మార్చి 19న మెల్‌బోర్న్‌ వేదికగా నిర్వహించనుంది. 

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు



హైదరాబాద్ ,మార్చి  13; స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. పెంచిన గౌరవ వేతనాలు వచ్చే నెల నుంచి అమలవుతాయి.
ప్రస్తుత, పెంచిన గౌరవ వేతనాలు:
పదవి                           ప్రస్తుత వేతనం       పెంచిన వేతనం
  • జిల్లా పరిషత్ చైర్మన్               రూ. 7,500            రూ. లక్ష
  • జడ్పీటీసీ                               రూ. 2,250            రూ. 10 వేలు
  • ఎంపీపీ                                  రూ. 750                రూ. 5 వేలు
  • ఎంపీటీసీ                                రూ. 1500             రూ. 5 వేలు
  • నగర మేయర్                         రూ.14 వేలు           రూ. 50 వేలు
  • డిప్యూటీ మేయర్                    రూ. 8 వేలు            రూ. 25 వేలు
  • కార్పోరేటర్                              రూ. 4 వేలు            రూ.6 వేలు

14,184.03 కోట్లతో 2015-16 ఏపీ వ్యవసాయ బడ్జెట్‌......

హైదరాబాద్‌, మార్చి 13 : రూ.14,184.03 కోట్లతో 2015-16 ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ ను వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. ప్రణాళిక వ్యయం రూ.4,513 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ప్రణాళికేతర వ్యయం రూ.9670 కోట్లుగా ప్రతిపాదించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యవసాయం తోడ్పడుతుందన్నారు. 
 
బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు : 
- రుణమాఫీకి- రూ. 5 వేల కోట్లు
- ఉచిత విద్యుత్‌కు రూ.3 వేల కోట్లు
- అనుబంధరంగాలకు రూ.2,717.61 కోట్లు
- మార్కెటింగ్‌కు రూ. 17.83 కోట్లు
- సహకారశాఖకు రూ.7.88 కోట్లు
- మత్సశాఖకు రూ.36.50 కోట్లు
- పశుసంవర్ధకశాఖకు రూ. 672.73 కోట్లు
- పట్టుపరిశ్రమశాఖకు రూ.93.61 కోట్లు
- ఉద్యానవనశాఖకు రూ.144.07 కోట్లు
- ఎన్జీరంగా వర్సిటీకి రూ.367.73 కోట్లు
- వైఎస్‌ఆర్‌ ఉద్యానవర్సిటీకి రూ.53.01 కోట్లు
- వెంకటేశ్వర పశువైద్య వర్సిటీకి రూ.124.48 కోట్లు
- పశువుల హాస్టల్‌కు రూ.5 కోట్లు
- వ్యవసాయంలో యాంత్రీకరణకు రూ.141.63 కోట్లు
- భూసారపరీక్షలకు - రూ. 90.95 కోట్లు
- విత్తన మార్పిడి, పంటరకాల అభివృద్ధి- రూ. 80 కోట్లు
- పంట బీమాకు రూ.172 కోట్లు
- వడ్డీలేని రుణాలకు రూ.100 కోట్లు
- పామాయిల్‌ తోటలకు రూ.28.5 కోట్లు
- ఏపీలో డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌..
- జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ..
- ప్రయోగశాలల ఏర్పాటుకు రూ.13.89 కోట్లు

Thursday, March 12, 2015

బొగ్గు కుంభకోణంలో సి.బి.ఐ. సమన్స్ వచ్చిన మన్మోహన్ కు నేనున్నానంటూ సంఘీభావం తెలుపుతున్న సోనియా...

జూట్ బ్యాగ్ లో లక్షా 13 వేల కోట్ల బడ్జెట్

హైదరాబాద్,మార్చి 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2015-16 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభకు సమర్పించారు.  బడ్జెట్ ముఖ్యాంశాలు...
మొత్తం బడ్జెట్   -           రూ. 1,13,049.00 కోట్లు
ప్రణాళికేతర వ్యయం -   రూ.78,637.00 కోట్లు
ప్రణాళికా వ్యయం    -  రూ.34,412.00 కోట్లు
రెవెన్యూ లోటు -           రూ.7,300 కోట్లు
ఆర్థిక లోటు -     రూ. 17,584 కోట్లు
ఆర్థిక లోటు 3 శాతం, రెవెన్యూ లోటు 1.24 శాతం   
కేటాయింపులు...
సాగునీటి రంగానికి: - రూ.5,258 కోట్లు
సాంఘిక సంక్షేమానికి రూ.2,123 కోట్లు
గిరిజన సంక్షేమం : రూ.993 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.3,231 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.379 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1080 కోట్లు
వికలాంగుల సంక్షేమం రూ.81 కోట్లు
చేనేత, జౌళి రంగానికి రూ.46 కోట్లు
గృహ నిర్మాణం రూ.897 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ.2123 కోట్లు
గిరిపుత్ర కల్యాణ పథకం
ఎస్సీలకు 60 శాతం సబ్సీడీతో రుణాలు
ఉన్నత విద్య - రూ.3049 కోట్లు
ఇంటర్ విద్య రూ. 585 కోట్లు
పాఠశాల విద్య రూ.14,962 కోట్లు
పంచాయతీ రాజ్ రూ.3296 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ. 280 కోట్లు
గ్రామీణ నీటి సరఫరా రూ. 881 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.8212 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 3168 కోట్లు
రెవెన్యు శాఖ రూ.1429 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖకు రూ.200 కోట్లు
శాంతిభద్రతలకు రూ.4062 కోట్లు
వికలాంగులకు రూ.81 కోట్లు
పర్యాటక రంగానికి రూ.330 కోట్లు
రవాణా శాఖకు రూ.122 కోట్లు
స్కిల్ డెవలప్ మెంట్ కు రూ.360 కోట్లు
ఐటీ రంగానికి రూ.370 కోట్లు
ఆరోగ్య శాఖకు : రూ.5,728 కోట్లు
గనులు రూ.27 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.897 కోట్లు
గోదావరి పుష్కరాలకు అన్ని శాఖల నుంచి రూ.1,360 కోట్లు
పోలీస్ సంక్షేమానికి రూ.40 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.37 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లు
ప్రతిపాదనలు...
మచిలీపట్నంలో 300 ఎకరాల్లో మెరైన్ అకాడమీ ఏర్పాటు
కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిస్ట్ సర్క్యూట్లు
బారువ, కళింగపట్నం, కాకినాడ, రామాయపట్నం,తుమ్మలపెంట దగ్గర సముద్ర విహారాలు
భవానీ ద్వీపాన్ని ప్రముఖ టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధి
భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు
2015 జూన్ నాటికి శిల్పారామాలు పూర్తి
కర్నూలులో కొత్త శిల్పారామాలు మంజూరు
వృద్ధకళాకారులకు ఫించన్లు రూ.500 నుంచి రూ.1500కు పెంపు

తెలంగాణాలో చెరువుల పండుగ ....

నిజామాబాద్,,మార్చి 12 : తెలంగాణాలో  చెరువుల పండుగ పారంభమయింది. రాష్ట్ర చిన్న నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులకు మైలురాయిగా నిలువనున్న మిషన్ కాకతీయ ఉద్యమానికి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ లో ముఖ్యమంత్రి చ్సనంద్రశేఖర రావు శ్రీకారం చుట్టారు. పార పట్టి మట్టిని తీసి.. ఆ మట్టిని తట్టతో మోసి ట్రాక్టర్‌లో వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.   మన చెరువులను పునరుద్ధరించుకొనే ఈ మిషన్ కాకతీయ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగాలని, స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సైతం ప్రజలతో మమేకమై రాత్రిపగలు కష్టపడాలని సీఎం పిలుపునిచ్చారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ,  రాష్ట్రంలో మొత్తం 46,447 చెరువులు ఉన్నాయని,  ఈ ఏడు 9,573 చెరువులను పునురద్ధరణకు తీసుకున్నామని  ప్రతీ సంవత్సరం 20 శాతం చొప్పున చెరువుల పునరుద్ధరణ చేసుకుంటూ వెడతామని  చెప్పారు.

Sunday, March 8, 2015

ఫైనల్ లో సైనా ఓటమి ...

బర్మింగ్ హాం , మార్చి  8; ఆల్‌ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన పోరులో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో 16-21, 21-14, 21-7 తేడాతో సైనా నెహ్వాల్ ఓటమి చెంది అభిమానులను నిరాశ పరిచింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత్ నుంచి ఫైనల్ కు చేరిన క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించినా.. చివరి అడ్డంకిని మాత్రం దాటకలేకపోయింది.


Saturday, March 7, 2015

విభజన హామీలపై వెనక్కు తగ్గం ..వెంకయ్య

నెల్లూరు, మార్చి 7 : విభజన హామీలు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని గత ప్రభుత్వం విభజన చట్టంలో పొందుపర్చకపోవడం వల్లే ఇప్పుడు సమస్య వస్తోందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయం కేంద్ర మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వెంకయ్య అన్నారు.
 
గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే పోలవరం పనులు ఇంతకాలం ముందుకు సాగలేదని విమర్శించారు. పోలవరం అథారిటీ నివేదిక తర్వాత నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని వెంకయ్య చెప్పారు. ఏపీ రాజధానికి పట్టణాభివృద్ధి శాఖ నుంచి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని వెంకయ్య వెల్లడించారు. 
 
విభజన బిల్లులో పేర్కొన్న అన్ని అంశాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వాటిని అంశాల వారీగా పరిష్కరిస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.


బంగారు తెలంగాణ సాధిస్తాం....గవర్నర్

హైదరాబాద్‌, మార్చి 7 : బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఉభయలసభనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. 
 
ఎస్సీ, ఎస్టీ కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది వృద్ధిరేటు 5.3 శాతంగా అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడితో నడుస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం కళ్యాణ లక్ష్మీ పథకం అమలులోకి తెచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినట్లు గవర్నర్‌ తెలిపారు. మిషన్‌ కాకతీయతో 45 వేల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామన్నారు. వాటర్‌ గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై వేధింపుల నిరోధానికి షీటీమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 
 
సింగిల్‌ విండో పద్దతిలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వనున్నట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమని పంపిణీ చేస్తామన్నారు. ప్రతినియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందజేయనున్నట్లు తెలిపారు. త్వరలో విద్యుత్‌ సమస్యను అధిగమిస్తామని గవర్నర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వైఫై సేవలు అందజేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేల నిధులు రూ.1.5 కోట్లకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం కృషి చేస్తున్నట్లు గవర్నర్‌ అన్నారు.
 
మరోవైపు గవర్నర్‌ ప్రసంగం సాగుతుండగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లేందుకు విపక్ష సభ్యులు యత్నించడంతో టీఆర్‌ఎస్‌ నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత రామ్మోహన్‌రెడ్డిలను టీఆర్‌ఎస్‌ సభ్యులు నెట్టివేశారు. దీంతో సభలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్‌ తన ప్రసంగాన్ని 15 నిమిషాల్లోపే ముగించారు.


ప్రత్యేక హోదా తోనే ఆంధ్ర అభివృద్ధి సాధ్యం...గవర్నర్

హైదరాబాద్‌, మార్చి 7 : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం దేశానికే ఆదర్శంగా ఉంటుందని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని వ్యాఖ్యానించారు.విభజనతో ఏపీకి ఆర్థిక లోటు ఏర్పడిందని తెలిపారు. సంక్షోభంలోనే అవకాశాలు వెదుకుతున్నామని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలిస్తామని కేంద్రం చెప్పిందన్న గవర్నర్‌ ఇతర రాష్ర్టాలతో ధీటుగా నిలబడాలంటే అది ఏపీకి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని పేర్కొన్నారు.కేంద్రం నుంచి మరింత సహకారం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.  ఏపీ సమగ్రాభివృద్ధి కోసం 7 మిషన్లు చేపడుతున్నట్లు తెలిపారు. 
 
హుద్‌హుద్‌ తుపాను నష్టానికి కేంద్రం వెయ్యి కోట్లు ప్రకటించినా ఇప్పటి వరకు రూ.650 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని గవర్నర్‌ సభలో తెలియజేశారు. 2015-16లో ఏపీలో నాలుగు కొత్త ఓడరేవులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. ఆగ్నేయాసియాకు ఏపీని ముఖద్వారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2015-16లో రైతులకు 10వేల సోలార్‌ పంపుసెట్లను పంపిణీ చేస్తామన్నారు. 
 
ఉద్యానవన రైతులకు ఎకరాకు రూ.10 వేల రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి తెల్లరేషన్‌కార్డుదారులకు ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని...పోలీస్‌స్టేషన్లు, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పటు చేసినట్లు తెలిపారు. స్మార్ట్‌ ఏపీలో భాగంగా స్మార్ట్‌ కార్డు, స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమాలు చేపట్టినట్లు గవర్నర్‌ అన్నారు. జన్మభూమి, మా ఊరు పథకాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. 2014-15లో ఆర్థికాభివృద్ధి 7.21 శాతంగా ఉందని తెలిపారు. రాష్ర్టాభివృద్ధికి విజన్‌ 2050 డాక్యుమెంట్‌ రూపకల్పన చేస్తామన్నారు. 
 
వృథాగా పోతున్న గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గవర్నర్‌ తెలిపారు. రెండో దశ రుణమాఫీ కోసం కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. పోలవరానికి కేంద్రం రూ.100 కోట్లు కేటాయించి నిరాశపర్చిందని వ్యాఖ్యానించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని గవర్నర్‌ తేల్చి వెల్లడించారు. 
 
బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో...చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం తొలిస్థానంలో ఉందన్నారు. ఆక్వాకు ఏపీని కేపిటల్‌గా మారుస్తామని గవర్నర్‌ తెలిపారు. పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం అమెరికా, ఆస్ర్టేలియా, జపాన్‌ల సాయం తీసుకోనున్నట్లు చెప్పారు. 
 
గిరిపుత్రిక కళ్యాణ పథకం పేరుతో గిరిజన యువతుల పెళ్లికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. దళారీ వ్యవస్థను ఆరికడతామని, అవినీతి రహిత పాలన అందజేస్తామని గవర్నర్‌ స్పష్టం చేశారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులను ఆధునీకరిస్తామన్నారు. ఏపీలో ప్రతి ఇంటికి గ్యాస్‌ పైప్‌లైన్‌ వేయనున్నట్లు చెప్పారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. 
 
గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగు లో మొదలెట్టి ఇంగ్లిష్ లో కొనసాగించి చివర తెలుగు లో ముగించారు. 

Friday, March 6, 2015

హోళీ రంగులలో తడిసి ముద్దయిన గవర్నర్ నరసింహన్ .... 

బాబు ను ఇబ్బంది పెట్టను...పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌, మార్చి 6 : టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తన అభిమతం కాదని జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, బాధ్యతను గుర్తుచేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు.  పాలకుల విధానాల్లో లోపం ఉంటే ఆ ప్రభావం రాబోయే తరాలపై పడుతుందని పవన్‌ పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు నష్టం జరిగిందని మోదీకి చెప్పానని పవన్‌ వివరించారు. అభివృద్ధి మాటున గ్రామాలను నాశనం చేయొద్దని సూచించారు. గ్రామాలు ఉండాలి, గ్రామాభివృద్ధి జరగాలని పవన్‌ అభిప్రాయపడ్డారు. 10 శాతం రైతులకు భూమివ్వడం ఇష్టంలేదని మంత్రులు, ఎమ్మెల్యేలే తనకు చెప్పారని ఆయన తెలిపారు. రెండు రాష్ర్టాల్లో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. ఏపీ రాజధాని సింగపూర్‌ దేశం కంటే పెద్దదన్న పవన్... సింగపూర్‌కు మించిన రాజధాని కట్టాలనుకోవడం సంతోషకరమన్నారు. సింగపూర్‌ నిర్మించేందుకు 20 ఏళ్లు పట్టిందని, ఏపీ రాజధాని నిర్మాణానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని పవన్‌ వెల్లడించారు.  ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. పార్లమెంటులో ఎందుకు మాట ఇచ్చారన్నారు. మాట తప్పితే ఏపీలో బీజేపీని ఎలా నమ్ముతారని పవన్‌ ప్రశ్నించారు. 

ఆపద్భాంధవుడు ధోనీ... వెస్టిండీస్ పై విజయంతో భారత్ కు నాకవుట్ బెర్త్..

పెర్త్‌, మార్చి 6: ప్రపంచ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్న ధోనీసేన వరుసగా నాలుగో విజయం సాధించింది. గ్రూపు-బిలో టాపర్ గా కొనసాగుతున్న భారత్ నాకౌట్ బెర్తు దక్కించుకుంది. తాజాగా వెస్టిండీస్ పై విజయం సాధించింది. పెర్త్‌ వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య శుక్రవారం నాడు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌నే విజయం వరించింది. భారత బ్యాట్స్‌మెన్‌ తడపడుతూ ఆడినా వెస్టిండీస్  విధించిన 183 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించారు. 4 వికెట్ల తేడాతో 39.1 ఓవర్లలో 185 పరుగులు చేసి వెస్టిండీస్ పై విజయబావుటా ఎగురవేశారు. భారత జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆపద్బాంధవుడుగా ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించే కెప్టెన్‌ ధోనీ, ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను కనబరిచాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి తడబడినా, చమటోడ్చి మరీ 40 పరుగులు చేసి భారత్‌ గెలుపును ఖాయం చేశాడు. కెప్టెన్‌గా భారత్‌కు 59 విజయాలు అందించి  మాజీ టీమిండియా కెప్టెన్‌ గంగూలీ 58 విజయాల రికార్డును కూడా ధోనీ.బ్రేక్‌ చేశాడు. విండీస్ బ్యాటింగ్ ;ఓ షమి అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా, ఉమేష్‌ యాదవ్‌ 2 వికెట్లు, అశ్విన్‌, శర్మ, జడేజాలు తలో వికెట్‌ తీసుకున్నారు. ఈ టోర్నమెంటులో  ఇప్పటి వరకు ఓటమెరుగని జట్లు రెండే. న్యూజిలాండ్, భారత్ ఆడిన  నాలుగు మ్యాచ్ లలో గెలుపొందాయి. లీగ్ దశలో భారత్ మరో రెండు మ్యాచ్ లు  పసికూనలైన  ఐర్లాండ్, జింబాబ్వే జట్లతో ఆడాల్సి బున్నందున  లీగ్ దశను ఓటమి లేకుండా ముగించే అవకాశముంది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...