Monday, May 27, 2013

హమ్మయ్య...టెంపరేచర్ తగ్గింది...

హైదరాబాద్, మే 27 : రాష్ట్రంలో నిన్నటి వరకూ అగ్ని గుండంలా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. . దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల పలుచోట్ల కురుస్తున్న వర్షాలతో  రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. వేడి తగ్గడం తో జనం రిలాక్స్ అవుతున్నారు. అల్పపీడనం బలపడే అవకాశం ఉందని,   కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడవచ్చని  తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

మహానాడులోనూ అరిగిపోయిన రికార్డే...

హైదరాబాద్, మే 27 : 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర తన జీవితంలో మరువరాని ఘట్టం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం  గండిపేటలో  32వ టీడీపీ మహానాడులో బాబు ప్రసంగించారు. పాదయాత్రలో తనను నడిపించింది కార్యకర్తలే అని ఆయన తెలిపారు. సమాజంలో మార్పు, అవినీతి ప్రక్షాళన కోసం యువత ముందుకు రావాలని బాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ దుష్టపాలన వల్ల రాష్ట్ర నష్టపోయిందని ధ్వజమెత్తారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, అసమర్థ ప్రభుత్వంతో రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. విద్యుత్ సమస్యతో పరిశ్రమలు మూతపడ్డాయని, వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. విద్యుత్ సమస్యతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మహస్తం మొండిహస్తం అన్న తన వ్యాఖ్యలు  నిజమయ్యాయన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, బెల్టుషాపులను వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. పేదల భూముల కారుచౌకగా కొట్టేసి పెత్తందార్లకు కట్టబెట్టారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 11 వేల కోట్లు ఖర్చుపెట్టి 30 లక్షల ఎకరాలకు నీరిచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరివ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. సీబీఐ అన్ని చార్జిషీట్లలో జగన్‌ను దోషిగా చూపించారని, జగన్ అరెస్ట్ అయినా...దొంగమంత్రులు కొనసాగుతున్నారన్నారు. కళంకిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని బాబు డిమాండ్ చేశారు. టీడీపీ పోరాటం వల్లే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని తెలిపారు. పార్టీలో అవినీతిపరులను ఉపేక్షించబోమని, అవినీతిపరులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు.

Monday, May 20, 2013

సోమవారం ఢిల్లీలో చైనా ప్రధని లీ కెక్వియాంగ్ కు అధికారికంగా స్వాగతం చెబుతున్న మన్మోహన్ సింగ్ ...

ధర్మాన , సబిత అవుట్...

 హైదరాబాద్, మే 20:   సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఈ  మంత్రులు దాదాపు 20 నిమిషాలపాటు ఆయనతో సమావేశమై రాజీనామాలు సమర్పించి తిరుగుముఖం పట్టారు. సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి రాగా, ధర్మాన మాత్రం తన సిబ్బందితో కలిసి వచ్చారు. వాస్తవానికి సీబీఐ అభియోగాలను ఎదుర్కొంటున్న మంత్రుల రాజీనామా తప్పదని ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడటం.. ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో సైతం కేంద్రంలో మాదిరిగానే రాష్ర్టంలోని మంత్రులు కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో  ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి రాజీనామల నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. సీబీఐ అభియోగాలు మోపినప్పుడే రాజీనామా చేశామని, అప్పుడే వాటిని ఆమోదిస్తే తమకు గౌరవమైనా దక్కేదని, అలా కాకుండా అవమానకర రీతిలో తమను సాగనంపుతున్నారని మంత్రులు వాపోయినట్టు భోగట్ట. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తో పాటు  రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు.. ధర్మాన, సబితలకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. 
.

Thursday, May 16, 2013

మళ్ళీ తగ్గిన బంగారం ధర

ముంబయి, మే 16 : బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ ధర నెల రోజుల్లో రెండోసారి 1400 డాలర్లు దిగిపోయింది. ప్రస్తుతం 1392 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. గత రాత్రి ఎంసీక్స్ లో 10 గ్రాముల బంగారం ధర 397 రూపాయలు నష్టపోయి 26,310 వద్ద ముగిసింది. ఈ ఉదయం మరో 150 రూపాయలు కోల్పోతూ 26,150కి సమీపంలో ట్రేడవుతోంది. గత రాత్రి కేజీ వెండి 1202 రూపాయలు కోల్పోయి 43,314 వద్ద ముగిసింది. ప్రస్తుతం డాలర్‌ ఇండెక్స్‌ 83.8కి సమీపంలో ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసల దాకా లాభపడుతూ 54.72కు సమీపంలో కొనసాగుతోంది. 

Saturday, May 11, 2013

కర్ణాటక 28వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

 బెంగళూరు,మే 11: కర్ణాటక 28వ ముఖ్యమంత్రిగా  సిద్ధరామయ్య సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నాయకుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ఏఐసీసీ పరిశీలకుల బృందం కొత్త నాయకుడి ఎన్నికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించింది. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌ను సైతం నిర్వహించింది.  ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 121 సీట్లు గెల్చుకొని కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అవినీతి రహిత, పారదర్శక పాలనను అందిస్తానని  సిద్ధరామయ్య ప్రజలకు హామీ ఇచ్చారు.  ముందుగా తానొక్కడినే ప్రమాణం చేస్తానని, సోనియా, రాహుల్‌ను కలిసిన తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

వైదొలగిన బన్సల్, అశ్వనీకుమార్

న్యూఢిల్లీ,మే 11: దేశవ్యాప్త ఒత్తిడికి కాంగ్రెస్  తలొగ్గింది.  తప్పనిసరి పరిస్థితుల్లో తన కళంకిత మంత్రులిద్దరినీ తప్పించింది. బొగ్గు కుంభకోణంపై సీబీఐ నివేదికను  మార్చేసిన కేంద్ర న్యాయ మంత్రి అశ్వనీకుమార్, రైల్వే బోర్డులో లాభదాయక పోస్టును అమ్మకానికి పెట్టి సీబీఐకి అడ్డంగా దొరికిన మేనల్లుడి నిర్వాకంతో రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ లను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. తమను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన అనంతరం శుక్రవారం రాత్రి సమయంలో వారిద్దరూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆయన అధికారిక నివాసం లో విడివిడిగా కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు.  బన్సల్, అశ్వనీకుమార్ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతున్నట్టు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీకి కడియం గుద్ బై...

వరంగల్,మే 11:  తెలుగుదేశం పార్టీకి మరో షాక్...దాడి వీరభద్రరావు తరవాత  పార్టీ సీనియర్‌ నేత,  పొలిట్‌ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా అధినేత చంద్రబాబుకు పంపారు. తెలంగాణ ప్రాంతంలో దళిత నాయకుడిగా గట్టి పట్టున్న కడియం శ్రీహరి పార్టీ వీడడంతో పార్టీలో కలకలం రేగింది.
 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...