Friday, January 21, 2011

తెలంగాణపై మరింత 'నాన్పుడు '!


న్యూఢిల్లీ,జనవరి 21:   జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపైన అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేయతలపెట్టిన అఖిల పక్ష సమావేశం ఈ నెలలో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ అంశంపై కొంతకాలంపాటు సాచివేత ధోరణి అవలంభించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ముందుగా పార్టీలో ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోర్ కమిటీ సమావేశం ముగిసిన తరువాత చిదంబరం విలేకరులతో మాట్లాడుతూ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే ఈ ప్రకటనలో స్పష్టతలేదు. ఈ సంప్రదింపులనేవి కాంగ్రెస్ పార్టీలోనా? ఇతర పార్టీలతోనా? అనేది  ఆయన స్పష్టం చేయలేదు. కాగా,  డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్లు పార్టీలో పలువురు భావిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో ఆ పార్టీకి అర్ధం కావడంలేదు. అయితే దీనిని ఇలాగే నాన్సటం మంచిది కాదని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెలలో హొం మంత్రి చిదంబరం విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆ కారణంగానో   లేక మరో కారణం చేతనో  సంప్రదింపుల బాధ్యతలను ప్రణబ్ ముఖర్జీకి అప్పగించారు. చిదంబరం విదేశీ యాత్ర నుంచి తిరిగి వచ్చేలోపల ప్రణబ్ ముఖర్జీ సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలతో చర్చలు జరుపుతారు. చిదంబరం వచ్చిన తరువాతనే  అఖిలపక్షం సమావేశం జరిగే అవకాశం ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...