Saturday, April 30, 2011

జాడ లేని అరుణాచల్ సి.ఎం.

ఇటానగర్,మే 1 : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో తప్పిపోయిన దీని ఆచూకీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెలియరాలేదు. దీంతో అటు రాష్ట్రంలో, ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హెలికాప్టర్ కోసం భద్రతాబలగాలు సాయంత్రం వరకు ముమ్మరంగా గాలించినా ఫలితం లేకపోయింది. పవన్ హన్స్ సంస్థకు చెందిన ‘ఏస్ 350 యూరోకాప్టర్ బీ-3’ అనే ఈ హెలికాప్టర్ శనివారం ఉదయం 9.56 గంటలకు తవాంగ్ నుంచి టేకాఫ్ తీసుకుంది.
ఉదయం 11.30 గంటలకు ఇది తవాంగ్‌కు 200 కి.మీ దూరంలోని రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కు చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో గల్లంతైంది. నాలుగు నెలల క్రితమే తయారైన ఈ హెలికాప్టర్‌లో ఖాండుతోపాటు ఆయన భద్రతాధికారి యేషి చోద్దాక్, తవాంగ్ ఎమ్మెల్యే సేవాంగ్ ధోండప్ సోదరి యేషి లామూ, హెలికాప్టర్ సిబ్బంది కెప్టెన్ జేఎస్ బబ్బర్, కెప్టెన్ కేఎస్ మాలిక్‌లు ఉన్నారు. బీ-3 టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాల తర్వాత చైనా సరిహద్దులోని సెలా పాస్ వద్ద ప్రయాణిస్తుండగా దానితో కంట్రోల్ రూమ్‌కు సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ మధ్యాహ్నం భూటాన్ సరిహద్దులోని ఎగువ సబాన్సిరి జిల్లా దాపోరిజో ప్రాంతంలో సురక్షితంగా దిగిందని, అక్కడి నుంచి గువాహటికి వస్తోందని వార్తలు వచ్చాయి. రక్షణశాఖ ప్రతినిధి, లెఫ్టినెంట్ గవర్నర్ జేజే సింగ్‌లు కూడా ఈమేరకు ప్రకటనలు చేశారు. అయితే హెలికాప్టర్ ఆచూకీ ఇంకా తెలియలేదని రాష్ట్రప్రభుత్వం, సీఎం కార్యాలయం, భూటాన్ ప్రభుత్వం సాయంత్రం వెల్లడించాయి. గాలింపు ఇంకా కొనసాగుతోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జీకే పిళ్లై ఢిల్లీలో తెలిపారు. బీ-3 గల్లంతైనట్లుగా భావిస్తున్న సెలా పాస్ వద్దకు సహాయక బృందాలను పంపామన్నారు. ఆదివారం ఉదయం ఆర్మీ, వాయుసేన, రాష్ట్ర పోలీసు బలగాలు వాయు, భూ మార్గాల్లో గాలింపు జరుపుతాయని అరుణాచల్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాబిన్ హిబూ తెలిపారు. ఈశాన్య భారత్‌లో గత పక్షం రోజుల్లో హెలికాప్టర్ గల్లంతవడం ఇది మూడోసారి. ఈ నెల 19న పవన్ హన్స్‌కే చెందిన హెలికాప్టర్ తవాంగ్ కొండల్లో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 17 మంది మృతిచెందారు. ఆర్మీకి చెందిన ఇంకో హెలికాప్టర్ గాంగ్‌టక్‌లో కూలిపోవడంతో నలుగురు చనిపోయారు.

ఐఎస్‌డీ కాల్ చార్జీలు తగ్గించిన బీఎస్‌ఎన్‌ఎల్

హైదరాబాద్, మే 1:  వినియోగదారుల సౌకర్యార్థం తొలిసారిగా ఐఎస్‌డీ కాల్ చార్జీలు తగ్గించేందుకు ప్రత్యేక రీచార్జ్ వోచర్లను ప్రవేశపెట్టనున్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీజీఎం రాజీవ్ అగర్వాల్ తెలిపారు. ఈ వోచర్లు మే 5 నుంచి 90 రోజులపాటు అమల్లో ఉంటాయని  వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్‌లో వైర్‌లెస్ ఫోన్ల విభాగంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఆరో స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకున్నట్లు వివరించారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మే మాసాన్ని ‘కస్టమర్ డిలైట్ మంత్’గా పాటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్సీ 200 రీచార్జి పై  రూ. 205 టాక్‌టైం అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న బ్రాడ్‌బాండ్ హోమ్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లో డాటా డౌన్‌లోడ్ సామర్థ్యాన్ని 256 కేబీపీఎస్ ( అన్‌లిమిటెడ్) నుంచి 512 కేబీపీఎస్‌కు (2 జీబీ వరకు) పెంచినట్లు తెలిపారు. మొబైల్ నంబర్ పోర్టబులిటీలో ఇప్పటి వరకు అగ్రస్థానం బీఎస్‌ఎన్‌ఎల్‌దే అన్నారు.

ఇన్ఫోసిస్ చైర్మన్ గా కెవి కామత్

హైదరాబాద్,ఎప్రిల్ 30:  ఇన్ఫోసిస్ చైర్మన్ గా కెవి కామత్ ఎంపికయ్యారు. కామత్ గతంలో ఐసిఐసిఐ బ్యాంక్ అధిపతి గ సారధిగా పని చేశారు. గౌరవ చైర్మన్ గా నారాయణ మూర్తి ఉంటారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా గోపాలకృష్ణన్, సిఇఓగా సిబులాల్ నియమితులవుతారు. ఆగస్టు నుంచి ఈ నియామకాలు అమలులోకి వస్తాయి.

ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతాo: జగన్

కడప,ఎప్రిల్ 30:     ఏడాదిలోపు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారం లో పాల్గొంటూ, త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతామని చెప్పారు. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ తాము అమలు చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ చనిపోయాక ఒక్క పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు.  
చంద్రబాబు కాన్వాయ్ పై దాడి
కొమ్మునూతల గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై స్థానిక ప్రజలు రాళ్లు రువ్వారు. బురద చల్లారు. చంద్రబాబుతోపాటు మైసూరా రెడ్డి వేసుకున్న చొక్కాలపై బురద పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని విమర్శించడంతో స్థానిక ప్రజలు ఆగ్రహంతో  ముందు  బురద చల్లారు. ఆ తరువాత రాళ్లు రువ్వారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు దాడి చేశారు. రాళ్లు రువ్వారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 
                             ముంబై సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో  రాయల్ బెంగాల్ పులి పిల్లల జలకాలాట...

న్యూజెర్సీలో తెలుగు ఎన్నారై హత్య

మహబూబ్‌ నగర్,ఏప్రిల్ 30:  అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు ఎన్నారై ని దుండగులు కాల్చి చంపారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మాదారం గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డి ని దుండగులు కాల్చి చంపారు. అర్జున్ రెడ్డి చాలా కాలంగా అమెరికాలో ఉంటున్నారు. ఆయనకు 52 ఏళ్ల వయస్సు. సొంతంగా ఫార్మసీ షాపు నడుపుతున్నారు.   కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డికి ఆయన దూరపు బంధువైన  అర్జున్ రెడ్డిగత ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి శాసనసభా నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఓ నెల రోజుల్లో ఆయన స్వస్థలానికి రావాల్సి ఉందని చెబుతున్నారు. నల్లజాతీయులే అర్జున్ రెడ్డిని కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు. 

మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పై కాల్పులు

హైదరాబాద్,ఏప్రిల్ 30 : మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పై శనివారం బార్కాస్ వద్ద దుండగులు కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట వద్ద ఆయనతో పాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై కూడా దాడి జరిగింది. పాదయాత్ర చేస్తుండగా ఉదయం 11.15 నిమిషాలకు ఒవైసీపై నాలుగు రౌండ్లు కాల్పులతో పాటు కత్తులతో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు.  ఒవైసీ శరీరం నుంచి మూడు బుల్లెట్లను వైద్యులు బయటకు తీశారు. ఆయనకు ప్రాణ హాని లేదని వైద్యులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది.మహ్మద్ పహిల్వాన్ అనే వ్యక్తి ఈ కాల్పులు చేయించినట్లు సమాచారం. స్మశాన వాటిక స్థల విషయంలో ఒవైసీకి, మహ్మద్ పహిల్వాన్‌కు మధ్య వివాదం వుంది. ఒవైసీని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, హొం మంత్రి సబిత పరామర్శించారు. ఆస్పత్రికి వచ్చిన ముఖ్యమంత్రిని హత్తుకొని ఎమ్మెల్యే బలాల్ కంటతడిపెట్టారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు పాతబస్తీలో హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా ఒవైసీ ఆస్పత్రి సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఆస్పత్రి సమీపంలో భారీగా పోలీసులు మోహరించారు.

Friday, April 29, 2011

దంపతులైన ప్రేమికులు...

లండన్ , ఏప్రిల్ 29:   బ్రిటన్ యువరాజు విలియమ్ తన ప్రియురాలు కేట్ ని వివాహం చేసుకున్నారు. వెస్ట్ మినిస్టర్ ఎబే చర్చిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. కేట్ వేలికి ఐరిష్ గార్డ్ యూనిఫామ్ లో ఉన్న విలియం ఉంగరం తొడిగారు. కేట్ తెల్లటి లేస్ గౌను ధరించారు. వీరిద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విలియమ్ కంటే కేట్ ఆరు నెలలు  పెద్ద. కేట్ డయానాకు తగిన కోడలని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల నుంచి 1900 మంది అథిధులు హాజరైయ్యారు. లండన్'లో పండుగ సందడి నెలకొంది. సెంట్రల్ లండన్'ని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు.  30 ఏళ్ల తరువాత ఈ రాజ కుటుంబంలో జరిగిన పెళ్లి ఇది. ఈ పెళ్లికి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు  అంచనా.

కె.బాలచందర్ కు దాదాసాహేబ్ పాల్కే అవార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29:  2010 సంవత్సరానికి దాదాసాహేబ్ పాల్కే అవార్డుకు ప్రముఖ దక్షిణ భారత సినిమా దర్శకుడు, రచయిత,  నిర్మాత. కె.బాలచందర్ ఎంపికయ్యారు. తెలుగులో ఆయన సత్తెకాలపు సత్తెయ్య, గుప్పెడు మనసు, మరోచరిత్ర, అంతులేని కథ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించారు. గత 45 ఏళ్లుగా ఆయన సినీ రంగంలో ఉన్నారు.  దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా పేరెన్నిక గన్నారు. ఆయన తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాలకు దర్శకత్వ, నిర్మాణ, రచయిత బాధ్యతలు నిర్వహించారు. ఆయన సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. లోతైన వ్యక్తిగత సంబంధాలను, సామాజిక అంశాలను ఆధారం చేసుకుని ఆయన సినిమాలు చేశారు.   నాటక రచయిత అయిన బాలచందర్ 1965లో సినీరంగంలోకి ప్రవేశించారు.  ఆయనకు తమిళంలో ఎంత ఆదరణ ఉందో తెలుగులో కూడా అంతే ఆదరణ ఉంది. ఆయన తమిళంలో తీసిన పలు సినిమాలు తెలుగులో వచ్చాయి.  ఆయనకు 1987లో పద్మశ్రీ అవార్డు లభించింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనను 1973లో కలైమమణి బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వర్ణ నంది, రజత నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయనకు పలు మార్లు ఉత్తమ దర్సకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. మరో చరిత్ర, ఇది కథ కాదు, అంతులేని కథ, రుద్రవీణ, తొలి కోడి కూసింది వంటి ఆయన తెలుగు చిత్రాలు ఎంతో ఆదరణ పొందాయి. అక్కినేని జాతీయ అవార్డు కూడా ఆయనకు లభించింది. రజనీకాంత్, కమల హాసన్‌లను నటులుగా తీర్చిదిద్దింది బాలచందరే. వారిద్దరు ఆయనను తమ గురువుగా గౌరవిస్తారు.

టిఆర్ఎస్ అధ్యక్షుడుగా తిరిగి కె.సి.ఆర్.

కాంగ్రెస్ పార్టీకి విలీనం పిచ్చి...ఎందుకు కలుస్తా0...!మహబూబ్ నగర్ ,ఏప్రిల్ 29:  తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా కె.చంద్రశేఖర రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ ప్రతినిదుల సభలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సభలో అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సభలో తీర్మానం చేశారు.  చంద్రశేఖర రావు  ఈ సందర్భంగా మాట్లాడుతూ,  టిఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని  స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి విలీనం పిచ్చిపట్టుకుందన్నారు. పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కే డిపాజిట్ దక్కలేదని, అటువంటి పార్టీలో తాము ఎందుకు కలుస్తామని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ప్రజలు బంగాళ ఖాతంలో విలీనం చేస్తారన్నారు. 

ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం

జైపూర్,ఏప్రిల్ 29: : ఐపిఎల్ 34వ మ్యాచ్'లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. మొదట ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 94 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 18.1 ఓవర్లో మూడు వికెట్లు నష్టపోయి 95 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Thursday, April 28, 2011

అమెరికాలో టోర్నడోల బీభత్సం: అలబామాలో 128 మంది మృత్యువాత

వాషింగ్టన్,ఏప్రిల్ 29: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టోర్నడోలకు మెరుపు వరదలు తోడై అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి ధాటికి పలు రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే భవనాలు నేలమట్టం కాగా, వాహనాలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. బుధవారం ఒక్క రోజే అలబామాలో 128 మంది మృత్యువాత పడ్డారు. అలబామా యూనివర్సిటీ ఉన్న టస్కలూసా నగరంలో వరదలు వీధి వీధినీ తుడిచిపెట్టాయని మేయర్ వాల్టర్ మడాక్స్  తెలిపారు. అలబామా గవర్నర్ రాబర్ట్ బ్రాంట్లీ విలేకరులతో మాట్లాడుతూ ‘తుపానుల ధాటికి రాష్ట్రం బాగా నష్టపోయింది. రాష్ట్రానికి ఇంకా టోర్నడోల ముప్పు తొలగిపోలేదు’ అని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో టోర్నడోలకు బలైన వారి సంఖ్య 246కి చేరింది.  తీవ్రంగా నష్టపోయిన అలబామా రాష్ట్రానికి గాలింపు, సహాయక బృందాలను పంపుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలిపారు. కాగా, అలబామా, జార్జియా, మిసిసిపీలోని కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన టోర్నడోలు, వడగళ్ల వాన, మెరుపు వరదలు సంభవించే అవకాశముందని, ప్రమాదకరమైన పిడుగులు కూడా పడొచ్చని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. గ్రేట్ లేక్స్ నుంచి దిగువన ఉన్న గల్ఫ్ కోస్ట్ వరకు మరో 21 రాష్ట్రాల్లోనూ టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదముందని తెలిపింది. 

అమెరికా రాయబారి తిమోతీ రోమెర్ రాజీనామా

న్యూఢిల్లీ,ఏప్రిల్ 29: భారత్‌లో అమెరికా రాయబారి తిమోతీ రోమెర్ (54) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దౌత్యపరంగా అత్యంత కీలకమైన పదవిలో రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. వ్యక్తిగత కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలుగా తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయేందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 2009 మేలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆయనను  భారత్‌లో రాయబారిగా నియమించారు. అప్పటి నుంచి రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. ' రెండేళ్లపాటు మాత్రమే భారత్‌లో రాయబారిగా కొనసాగుతానని ఈ పోస్టు బాధ్యతలు స్వీకరించే ముందే ఒబామాకు చెప్పాను' అని ఆయన పేర్కొన్నారు. భారత్, అమెరికా సంబంధాలు అంతర్జాతీయ భాగస్వామ్యం దిశగా సానుకూల మార్గంలో ముందుకెళ్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలకు ఎలాంటి హద్దులూ లేవన్నారు. కీలకమైన ద్వైపాక్షిక సంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా బలోపేతం చేయడంలో విజయం సాధించినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించా రు. అయితే భారత వైమానిక దళానికి అవసరమైన యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి వందల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో అమెరికా బిడ్ ఎంపిక కావకపోవడం పట్ల తీవ్ర నిరాశ చెందామని రోమెర్ పేర్కొన్నారు.

2023లో ప్రేమ సాయిగా సత్య సాయిబాబా అవతారం...!

 బెంగళూరు, ఏప్రిల్ 28 :  పుట్టపర్తి సత్య సాయిబాబా కర్ణాటకలోని మాండ్యా జిల్లా దొడ్డమలూర్ గ్రామంలో ప్రేమ సాయిగా అవతరిస్తారని నమ్ముతున్నారు. ఈ చిన్న గ్రామం బెంగళూర్ - మైసూర్ రహదారి పక్కన ఉంది. పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు ఒకరు  శ్రీ సత్య సాయి - ఆనందసాయి అనే శీర్షికతో రాసిన పుస్తకంలో ప్రేమ సాయి అవతారం ఇక్కడే జరుగుతుందని చెప్పాడని గ్రామస్థులు విశ్వసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కలియుగంలో తాను మూడు అవతారాలు ఎత్తుతానని, తాను షిర్డీ సాయి బాబా అవతారాన్ని అని, మూడో అవతారం ప్రేమసాయిగా దొడ్డమలూర్ గ్రామంలో జరుగుతుందని  ఆ  గ్రామాన్ని సందర్శించినప్పుడు సత్యసాయి బాబా తనకు చెప్పినట్లు ఆ భక్తుడు రాశాడు. తాను చిన్న ఇంటిలో జన్మిస్తానని 1960 దశకంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు  బాబా చెప్పారని తెలిపాడు. కాగా, సత్య సాయిబాబా అంచనా ప్రకారం ప్రేమ సాయి ఈ గ్రామంలో 2023లో పుడతాడని కృష్ణా చారిటబుల్ ట్రస్టు నడుపుతున్న రామదాసు అనే వ్యక్తి చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ కస్తూరి స్త్రీగా జన్మిస్తాడని, అదే గ్రామానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుని ప్రేమసాయికి జన్మ ఇస్తుందని సత్య సాయి చెప్పినట్లు ఆయన తెలిపారు.

సెకండ్ ఇంటర్ లో 63.27 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్ , ఏప్రిల్ 28 : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 63.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద గత ఏడాది కంటే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది.  ఈ ఏడాది కూడా బాలురపై బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది బాలికలు 66.39 శాతం ఉత్తీర్ణత సాధించగా, 60.61 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. కృష్ణా జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానం సాధించగా, 46 శాతంతో నల్గొండ చివరి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగింది.

సత్యసాయి ట్రస్టు ఏడాది వ్యయం రూ.100 కోట్లు !

పుట్టపర్తి, ఏప్రిల్ 28 : సత్యసాయి ట్రస్టు ఏడాది వ్యయం రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య వుంటున్నదని ట్రస్టీలలో ఒకరైన శ్రీనివాస్ మీడియాకు వివరించారు. అలాగే సత్యసాయి మెడికల్ ట్రస్టుకి ఏటా రూ.100 నుంచి రూ.130 కోట్ల వరకూ విరాళాలు అందుతున్నాయని చెప్పారు. ట్రస్టుకి విరాళాలు కావాలని సత్యసాయి బాబా ఏనాడు భక్తులను కానీ, మరెవ్వరిని కానీ కోరలేదని తెలిపారు.  సత్యసాయి బాబా పేరుమీద ఆస్తులేవీ లేవని,  ఆస్తులన్నీ ట్రస్టు పేరుమీదనే ఉన్నాయనీ, పూర్తిగా ట్రస్టు నియంత్రణలోనే కార్యకలాపాలు కొనసాగాయనీ  శ్రీనివాసన్  వెల్లడించారు. ట్రస్టుకి తదుపరి చైర్మన్ ఎవరనేదీ త్వరలో నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ట్రస్టు సభ్యులలోనే ఒకరిని ఎన్నుకుంటామని, ట్రస్టు వ్యవహారాలతో సంబంధం లేని బయటివారికి చెక్‌పవర్ అప్పగించబోమని చెప్పారు. సత్యసాయి బాబా ఆసుపత్రిలో చేరిన మొదటిరోజే శవపేటిక తయారీకి ఆర్డర్ ఇచ్చారన్న ఆరోపణలను సెంట్రల్ ట్రస్ట్ ఖండించింది. ఈ ఆరోపణలు అవాస్తవమని, ఒక భక్తుడు ఈ ఆర్డర్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని మీడియా సమావేశంలో ట్రస్టీ శ్రీనివాసన్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే నిరాధార కథనాలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, ప్రత్యేకించి సత్యసాయి ట్రస్ట్ ఆస్తులను మదించి విలువ లెక్కకట్టలేదని  గత ఏడాది వరకూ ట్రస్ట్ కార్యకలాపాలు, ఆస్తులకు సంబంధించి ఆడిట్ వివరాలు మాత్రం ప్రభుత్వం ముందు ఉంచామని  మరో ట్రస్టీ  నాగానంద్  వెల్లడించారు. మీడియా సమావేశానికి ట్రస్టీలు ఎస్. చక్రవర్తి, పీఎమ్. భగవతి, ఎస్వీగిరి, ఇందూలాల్ షా, శ్రీనివాసన్, నాగానంద్, రత్నాకర్ హాజరు అయ్యారు. సత్యసాయి బాబా ఆసుపత్రిలో చేరిన మొదటిరోజే శవపేటిక తయారీకి ఆర్డర్ ఇచ్చారన్న ఆరోపణలను సెంట్రల్ ట్రస్ట్ ఖండించింది. ఈ ఆరోపణలు అవాస్తవమని, ఒక భక్తుడు ఈ ఆర్డర్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని మీడియా సమావేశంలో ట్రస్టీ శ్రీనివాసన్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే నిరాధార కథనాలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు.సత్యసాయి బాబాకు సెంట్రల్ ట్రస్ట్ శ్రద్ధాంజలి ఘటించింది. రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించింది. ట్రస్టు భవిష్యత్ కార్యాచరణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులు మందుగా బాబాకు అంజలి ఘటించి తమను తాము పరిచయం చేసుకున్నారు. ట్రస్టు చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలు, ఆస్తుల వివరాలను వెల్లడించారు. 

పైలట్ల సమ్మెతో ఎయిరిండియా టికెట్ బుకింగ్‌ నిలిపివేత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : పైలట్ల సమ్మెతో ఎయిరిండియా శుక్రవారం  నుంచి అయిదు రోజుల వరకూ టికెట్ బుకింగ్‌ను నిలిపివేసింది. కాగా పైలట్లు చేపట్టిన సమ్మె నేటితో రెండోరోజుకు చేరింది. దాంతో 50 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. పైలట్ల సమ్మెపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు పైలట్లతో పాటు ఎగ్జిక్యూటివ్ పైలట్లు కూడా సమ్మెకు దిగారు. కాగా ఎయిరిండియా పైలట్ల సమ్మెతో వందలమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ ఇండియాలోని ఓ వర్గానికి చెందిన భారత వాణిజ్య పైలట్ల సంఘం(ఐసీపీఏ) పైలట్లు.. తమకు సహోద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వీరంతా.. సంస్థ విలీనం అనంతరం ఎయిర్ ఇండియాలో పైలట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బందితో సమానంగా వేతనాలు, మెరుగైన పని వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐసీపీఏకి చెందిన దాదాపు 600 మంది పైలట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి హఠాత్తుగా సమ్మెకు ఉపక్రమించారు.

Wednesday, April 27, 2011

                          పశ్చిమ బెంగాల్ మూడవ దశ ఎన్నికల సందర్భంగా కోల్ కతాలో
                                ఓటు వేసి వస్తున్న ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య    

మహా సమాధి లోకి సత్యసాయిబాబా

పుట్టపర్తి,  ఏప్రిల్ 27:    సత్యసాయి మహా సమాధి అయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లో బుధవారం బాబా అంత్యక్రియలు శాస్త్రోక్తంగా పూర్తి అయ్యాయి. మరణ కాల దోష పరిహారం కోసం బాబా సోదరుని కుమారుడు రత్నాకర్‌తో వేద పండితులు దశదానాలు చేయించారు. పీఠాధిపతులు వేదమంత్రోచ్చారణతో బాబాకు హారతి ఇచ్చారు. బాబా అంతిమ కోర్కె ప్రకారం వేద పండితులు క్రతువు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పుణ్య నదుల నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో బాబా పార్దీవ దేహానికి అభిషేకం చేశారు. అనంతరం పంచద్రవ్యాలతో సంప్రోక్షణ చేసి, ఉపనిషత్తుల ప్రకారం వేద పండితులు పూజలు నిర్వహించారు. సాయికి మహాహారతితో మహాసమాధి పూర్తి అయ్యింది. ఈ అంత్యక్రియల కార్యక్రమం సుమారు 90 నిమిషాల పాటు కొనసాగింది. పుట్టపర్తిలో ఏర్పాటు చేసి భారీ స్క్రీన్‌ల ద్వారా సత్యసాయి అంతిమ సంస్కార కార్యక్రమాలను భక్తులు వీక్షించారు. మహా సమాధి కార్యక్రమానికి బాబా కుటుంబసభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు ఎల్‌కె అద్వానీ, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, మర్రి శశిథర్‌రెడ్డి, డీజీపీ అరవిందరావు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, పంజాబ్ గవర్నర్ శివరాజ్‌పాటిల్, వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, పలు రాష్ట్ర మంత్రులు, వీఐపీలు హాజరు అయ్యారు.
ఏప్రిల్ 4తేదినే బాబా శవపేటికకు ఆర్డర్...!
సత్యసాయి మరణంపై వున్న పలు అనుమానాలకు బలం చేకూరుతున్నాయి. బాబా కోసం శవపేటికను ఏప్రిల్ 4 తేదిన ఆర్దర్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  ట్రస్ట్ సభ్యులు కోరిన విధంగానే ఏప్రిల్ 5 తేదిన శవపేటిక కోయంబత్తూరు నుంచి కుమార్ అండ్ కో నుంచి పుట్టపర్తికి పంపినట్టు రశీదులో వివరాలు వెల్లడయ్యాని ఒక న్యూస్ చానెల్ తెలిపింది. 

పెళ్లి లారీ బోల్తా: పదిమంది మృతి

 నిజామాబాద్, ఏప్రిల్ 27:   నిజామాబాద్  జిల్లాలో జరిగిన ప్రమాదంలో పదిమంది మృత్యువాత పడ్డారు. పెళ్లివారు ప్రయాణిస్తున్న లారీ బోల్తా  పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం లక్కొరా వద్ద జరిగింది.

పూణే వారియర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ముంబై: ఐపీఎల్ టోర్నిలో భాగంగా పూణే వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ఇంకా మూడు బంతులు ఉండగానే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయంతో ర్యాంక్‌ల పట్టికలో చెన్నై జట్టు రెండవస్థానానికి చేరుకుంది. చెన్నై జట్టులో అత్యధికంగా బద్రినాథ్ 63 పరుగులు చేశారు. బద్రీనాథ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశారు. రైనా 25 బంతుల్లో 34 పరుగులు, విజయ్ 31 పరుగుల సాధించి చెన్నై జట్టు విజయంలో పాలు పంచుకున్నారు.

Tuesday, April 26, 2011

సాయిబాబాకు మన్మోహన్ సోనియా నివాళులు

పుట్టపర్తి,ఏప్రిల్ 26: ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ సత్యసాయిబాబాకు ఘన నివాళులర్పించారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో మన్మోహన్, సోనియా పుట్టపర్తికి చేరుకున్నారు. బాబా పార్ధీవ శరీరం వద్ద మన్మోహన్, సోనియాలు మౌనంగా నివాళులర్పించారు. ప్రధాని, సోనియాల వెంట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్‌ వున్నారు. సత్యసాయి బాబా అవతార పురుషుడని పధానమంత్రి మన్మోహన్‌సింగ్ అభివర్ణించారు. ఆయన ఆధ్యాత్మిక తత్వం మానవాళికే ఖ్యాతిని తెచ్చిపెట్టిందని తెలిపారు. కోట్లాది మందిలో ఆశాభావాన్ని రేకెత్తించిన మహోన్నత వ్యక్తి బాబా అని, ఆయనకు ప్రణామములు అర్పిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు.
ట్రస్ట్ సమావేశం
 సత్యసాయి మరణాంతరం తొలిసారి ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబా ఆత్మకు శాంతి చేకూరాలని తొలి తీర్మానాన్ని ట్రస్ట్ సభ్యులు అమోదించారు. సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు కల్పించకుండా యధావిధిగా కొనసాగిస్తామని  సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ పేరిట విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. బాబా ఆశయాల్ని కొనసాగించడమే తమ ముందు వున్న ప్రధాన కర్తవ్యమని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

చిన్నబోయిన ‘సత్యగీత’

పుట్టపర్తి ,ఏప్రిల్ 26:   సత్యబాబాకు ‘సత్యగీత’ అత్యంత ప్రీతిపాత్రమైన ఏనుగు. సత్యసాయి నిర్యాణం భక్తులను ఎంత వేదనకు గురిచేసిందో, సంఘటనను జీర్ణించుకోవడం సత్యగీతకూ అంతే కష్టంగా ఉంది. గతంలో సత్యసాయికి పెంపుడు ఏనుగుగా ఉన్న సాయిగీత మూడేళ్ల క్రితం ప్రమాదవ శాత్తూ మరణించిన తరువాత, సత్యగీత ఆయన కొలువులో చేరింది. అయితే సత్యగీతకన్నా సాయిగీతకే సాయిబాబాతో అనుబంధం ఎక్కువ. సత్యగీత వచ్చే సరికే బాబా కొంత అనారోగ్యంతో ఉండటంతో సత్యగీత, సాయిబాబా కలయిక తరచూ జరిగేది కాదని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రశాంతి నిలయంలో ఏ కార్యక్రమం జరిగినా సత్యగీత ముందుండేది. ఇప్పుడు సాయిబాబా నిర్యాణం తరువాత అంతా సాయిబాబా అంత్యక్రియల ఏర్పాట్లులో ఉన్నారే తప్ప, బాబాకు ప్రీతిపాత్రమైన సత్యగీతను అంతగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం తన ఆవాసంలోనే సత్యగీత దీనంగా కనిపిస్తోంది. 

సత్యసాయి సమాధికి ఏర్పాట్లు

పుట్టపర్తి ,ఏప్రిల్ 26:  బుధవారం  ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల సమయంలో సత్యసాయి అంత్యక్రియలు జరగనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం  సాయంత్రం ఆరు గంటల్లోగా క్యూలైన్లలో ఉన్న భక్తులందరికీ దర్శనానికి అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. బుధవారం   మధ్యాహ్నాం 12 గంటల తర్వాత బాబా మహా సమాధి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.  కాగా, సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని కుల్వంత్ హాల్‌లోనే ఖననం చేయాలని ట్రస్టు సభ్యులు  నిర్ణయానికి వచ్చారు. అక్కడ బాబా పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయంపై ట్రస్టు సభ్యులు ఓ నిర్ణయానికి రాలేదు. దీనిపై తదనంతరం నిర్ణయం తీసుకుంటారు.

సాయి బాబా కు మలేసియా భక్తుల సంతాపం

కౌలాలంపూర్ ,ఏప్రిల్ 26: భగవాన్ సత్యసాయి బాబా మరణం పట్ల మలేసియాలోని భక్తులు సంతాపం వ్యక్తం చేశారు.  మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని బాంగ్‌సార్ ప్రాంతంలో 200 మందిపైగా బాబా భక్తులు ఒకచోట చేరి అవతార పురుషుడికి శోకతప్త హృదయాలతో అంజలి ఘటించారు. భజనలతో భక్తజన బాంధవుడికి నివాళి అర్పించారు. సాయి మహిమలను ఈ సందర్భంగా  తలుచుకున్నారు. ‘‘బాబా మాకు గురువు కంటే ఎక్కువ. భక్తులందరికీ ఆయన తండ్రి వంటి వారు’’ అని మలేసియాలోని సత్యసాయి సెంట్రల్ కౌన్సిల్ అధ్యక్షుడు సురేష్ గోవింద్ అన్నారు.  పలువురు చైనా భక్తులు కూడా బాబాకు అంజలి అర్పించారు. పెనాంగ్ రాష్ట్రం నుంచి పలువురు పుట్టపర్తి వెళ్లనున్నట్టు చెప్పారు.

సాయి బాబాను కీర్తించిన బ్రిటీష్ మీడియా

లండన్,ఏప్రిల్ 26: భౌతిక దేహం వీడిన భగవాన్ సత్యసాయి బాబాను బ్రిటీష్ మీడియా అవతార పురుషుడిగా స్తుతించింది. గత శతాబ్దంలోని సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్తల్లో భగవాన్ సత్యసాయి బాబా ఒకరని డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. సర్వం తెలిసిన సర్వాంతర్యామిగా బాబాను పొడిగింది. బాబాను భక్తులు కనిపించే దేవుడిగా కొలుస్తారని, ఆయన మాత్రం అందరిలో దైవాన్ని చూశారని పేర్కొంది. అన్ని మతాలను సమానంగా ఆదరించి, ప్రేమ మార్గాన్ని భక్తులకు ప్రవచించారని ప్రస్తుతించింది. బాబాను భారతదేశంలో అత్యంత జనాదరణ కలిగిన ఆధ్యాత్మిక గురువుగా ద టైమ్స్ పత్రిక పేర్కొంది. సత్యం, శాంతి, ప్రేమ, అహింసా బోధనల ద్వారా బాబా సుప్రసిద్ధులయ్యారని తెలిపింది. విశ్వవ్యాప్తంగా బాబాకు భక్తులున్నారని గార్డియన్ పేర్కొంది.

నేపాల్‌లో సాయిబాబా భక్తుల్లో విషాదo

ఖట్మండూ,ఏప్రిల్ 26: భగవాన్ సత్యసాయిబాబా నిర్యాణం నేపాల్‌లో వేలాదిమంది భక్తుల్లో విషాదాన్ని నింపింది. సాయిబాబా అస్తమయంపై విచారం వ్యక్తంచేస్తూ నేపాల్ ప్రధాని జలానాథ్ ఖణాల్ సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ‘సత్యసాయిబాబా అస్తమయంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది భక్తుల్లో ప్రేమ, సేవాభావాలను పెంపొందించిన ఆధ్యాత్మిక మూర్తి మనమధ్య లేకపోవడం మానవాళికి తీరని లోటు’ అని ఆయన పేర్కొన్నారు. నేపాల్‌లో బాబాకు అనేకమంది భక్తులు ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా సాయి భక్తులు భజనలు, ప్రార్థనలు చేస్తున్నారు. సాయి మరో అవతారంలో తిరిగి వస్తారని వారు విశ్వసిస్తున్నారు. నేపాల్‌లో 186 సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నట్టు ఖట్మండూ లోని  సత్యసాయి సెంట్రల్ ట్రస్టు తెలిపింది. బాబా నిర్యాణం వార్త వినగానే వేలాదిమంది భక్తులు తమ శ్రద్ధాంజలి ఘటించడానికి పుట్టపర్తికి బయలుదేరారని ట్రస్టు వర్గాలు తెలిపాయి. 

పుణే వారియర్స్ కు మరో ఓటమి

చెన్నై,ఏప్రిల్ 26: ఐపీఎల్-4లో చెన్నైతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పుణే వారియర్స్ 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వారియర్స్ లక్ష్య ఛేదనలో ఏమాత్రం చురుకుదనం కనబరచలేదు . రైడర్ (15), మిశ్రా (9), పాండే (12)లు త్వరగా పెవిలియన్ చేరి అభిమానులను నిరాశ పరిచారు.  యువరాజ్ ఒక్కడే పోరాడి 34 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. చెన్నై టీం సమష్టిగా రాణించి విజయ బాపుటా ఎగురవేసింది. చెన్నై బౌలర్లలో మోర్కెల్ మూడు, అశ్విన్ , బొలింగర్ లు తలో రెండు వికెట్లు తీశారు.

Monday, April 25, 2011

సచిన్ కంట తడి

పుట్టపర్తి,ఏప్రిల్ 25:  పుట్టపర్తి సత్య సాయి బాబా పార్ధివ దేహాన్ని చూసి  సచిన్ టెండూల్కర్ కంట తడి పెట్టారు.   సత్య సాయి బాబాను కడసారి చూడడానికి సచిన్ తన భార్య అంజలితో కలిసి సోమవారం పుట్టపర్తి వచ్చారు. వారితో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన చాముండేశ్వరినాథ్ కూడా ఉన్నారు. సత్య సాయి బాబా మరణంతో సచిన్ టెండూల్కర్ ఆదివారం విషాద వదనంతో కనిపించారు. తన 38వ జన్మదిన వేడుకలను జరుపుకోలేదు.
ఫ్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాల్ లో సాయిబాబా పార్థీవ శరీరం...

సురేష్ కల్మాడీ అరెస్ట్

కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసు

 న్యూఢిల్లీ,ఏప్రిల్ 25:  కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసులో సురేష్ కల్మాడీని సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి పిలిపించిన అధికారులు ఆయన్ని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో కల్మాడీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జాతీయ క్రీడలకు సంబంధించిన క్వీన్ బాటన్ రిలే, టీఎస్‌ఆర్ (టైమింగ్ స్కోరింగ్ అండ్ రిజల్ట్) పరికరాల కుంభకోణంలో జరిగిన అవకతవకల్లో కల్మాడీని బాధ్యుడిగా సీబీఐ ధృవీకరించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ను కట్టపెట్టడం వల్ల సుమారు 141 కోట్ల అవినీతి చోటుచేసుకుంది. 

ట్రాక్టర్ బోల్తా : పదిమంది మహిళలు దుర్మరణం

గుంటూరు,ఏప్రిల్ 25:  : గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ నాగార్జున సాగర్ కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమంది మహిళలు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ కింద చిక్కుకున్నవారిని స్థానికులు బయటకు తీస్తున్నారు. బాధితులు సత్తెనపల్లి సమీపంలో సుందరయ్య కాలనీ వాసులు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Sunday, April 24, 2011

డెక్కన్ ఛార్జర్స్ ఓటమి

హైదరాబాద్,ఏప్రిల్ 24: ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 173 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మలింగ ధాటికి తట్టుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. డెక్కన్ జట్టులో అత్యధికంగా కుమార సంగక్కర 34, ధావన్ 25, మిశ్రా 25, క్రిస్టియన్ 21 పరుగులు చేశారు. మిగితా డెక్కన్ ఆటగాళ్లు రెండెంకెల స్కోరును చేరుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో మలింగ 3 వికెట్లు పడగొట్టగా, పటేల్, పొలార్ద్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి డెక్కన్ ఛార్జర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓ దశలో 70 పరుగులకే ముంబై నాలుగు వికెట్లు కోల్పోయింది. 70 పరుగుల వద్ద సచిన్, రాయుడు, పొలార్డ్  అవుటవ్వడంతో ముంబై కష్టాల్లో పడింది. డ్డట్టు కనిపించింది. అయితే రోహిత్ శర్మ, సైమండ్స్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో ముంబై భారీ లక్ష్యాన్ని డెక్కన్ ముందుంచింది. రోహిత్ 56 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సైమండ్స్ 44 (33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సరు) పరుగులు చేశారు. వీరిద్దరూ 5 వికెట్‌కు 102 పరుగులు జోడించారు. మిశ్రాకు రెండు వికెట్లు, ఓజా, ఇషాంత్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
సాయిబాబాబ కడసారి దర్శనానికై ప్రశాంతినిలయం వద్ద భక్త జనం ఎదురుచూపులు

ప్రశాంతినిలయంలో విదేశీ భక్తుల ప్రార్ధనలు...

భక్తుడు సచిన్ కు బాబా ఆశీస్సులు (ఫైల్ ఫొటో)

సత్య సాయిబాబా అస్తమయం...

పుట్టపర్తి,ఏప్రిల్ 24: భగవాన్ సత్యసాయి బాబా (86)  తుదిశ్వాస విడిచారు.ఆదివారం   ఉదయం 7.40 నిమిషాలకు సత్యసాయి బాబా దేహాన్ని చాలించినట్టు  సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్  ప్రకటించింది.   28 రోజుల పాటు  సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొంందిన  బాబా ఈ రోజు  కార్డియోవాస్కులర్ ఫెయిల్యూర్‌తో మరణించినట్టు ట్రస్ట్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. బాబా మరణంతో పుట్టపర్తిలో విషాద వాతావరణం నెలకొంది. దేశ విదేశాలలోని బాబా భక్తులు తీవ్ర విచారానికి లోనయ్యారు. బాబా భౌతిక కాయాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో ఉంచారు. ఆదివారం  సాయంత్రం నుంచి బాబా కడసారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. బాబా భౌతిక కాయాన్నిరెండు రోజుల పాటు సాయి కుల్వంత్ మందిరంలోవుంచిన అనంతరం 27వ తేదీన అక్కడే అధికార లాంచనాలతో సమాధి చేస్తారు.  బాబా అంత్యక్రియలు  జరిగే ఏప్రిల్ 27 తేదిన అనంతపురం జిల్లాకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వరకు 4 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.  సత్యసాయి బాబా మరణ వార్త వెలువడగానే  ప్రముఖులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి పుట్టపర్తి చేరుకుని  బాబా పార్థీవ శరీరాన్ని సందర్సించి నివాళులు అర్పించారు.  ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కడప నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. . బెంగళూరులో ఉన్న పీఆర్పీ అధినేత చిరంజీవి బాబా మరణవార్త వినగానే పుట్టపర్తికి బయలుదేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.  ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి, ప్రధాని మన్మోహన్, సీనియర్ బీజేపీ నాయకులు అద్వానీ, వివిధ  రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు బాబా మృతి పట్ల సంతాపం తెలిపారు.
        అనంతపురం జిల్లా పుట్టపర్తిలో  1926 నవంబర్ 23న బాబా జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక మార్గం పట్టిన బాబా ప్రేమతత్వాన్ని బోధించారు. నా జీవితమే నా సందేశం అని ప్రవచించిన బాబా ప్రపంచ మానవాళిని ప్రభావితం చేశారు. కేవలం ఆధ్యాత్మిక బోధనలకే పరిమితం కాకుండా విస్త్రుతంగా  సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు అత్యున్నత ప్రమాణాలతో విద్య, వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. పలు జిల్లాల్లో వందలాది గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. 2009 ఒడిశాలో వరద బాధితులకు 699 ఇళ్లు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తన ట్రస్ట్ ద్వారా బాబా సేవలందిస్తున్నారు. బాబా సేవలకు గుర్తింపుగా 1999 నవంబర్ 23న ప్రభుత్వం తపాల బిళ్ల విడుదల చేసింది.   



Saturday, April 23, 2011

ఈజిప్టుకు భారత్ ఈవీఎంలు

కైరో,ఏప్రిల్ 23:  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) అద్భుతమైన యంత్రాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషీ అభివర్ణించారు. భారత్‌లో అమలవుతున్న ఎన్నికల వ్యవస్థ గురించి ఈజిప్టు ఉన్నతాధికారులకు వివరించేందుకోసం ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కైరో వచ్చారు. ముబారక్ నియంతృత్వ శకం ముగిసినందున ఈజిప్టులో ఎన్నికల వ్యవస్థకు బాసటగా నిలిచేందుకు ఈవీఎంలను సమకూరుస్తామని ఆయన తెలిపారు. అయితే ఈజిప్టులో జరిగే ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణలో మాత్రం తాము పాల్గొనబోమని స్పష్టంచేశారు. శుక్రవారం ఈజిప్టు న్యాయశాఖ మంత్రితో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉన్నందున భారత్ తమ ఈవీఎంలను అరువు ప్రాతిపదికన ఈజిప్టుకు సమకూరుస్తుందని ఖురేషీ వెల్లడించారు.
 

నరేంద్ర మోడీని వీడని ' గోద్రా ' ...!

అహ్మదాబాద్,ఏప్రిల్ 23:  ‘గోద్రానంతర అల్లర్లు’  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వెంటాడుతూనే ఉన్నాయి. అల్లర్లకు పాల్పడుతున్న హిందువులను.. వారి ఆగ్రహం చల్లారేవరకు.. చూసీచూడనట్లు వదిలేయాలని పోలీసు అధికారులకు మోడీ ఆదేశాలిచ్చారని పేర్కొంటూ.. అల్లర్లు జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఒక కీలక అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ముస్లింలకు గుణపాఠం నేర్పాలని మోడీ అభిప్రాయపడ్డట్లు అందులో భట్ ఆరోపించారు. జాకియా జఫ్రీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 14న సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆ అఫిడవిట్‌లోని వివరాలను భట్ సన్నిహితులు శుక్రవారం వెల్లడించారు. 2002లో, గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను దగ్ధం చేసిన ఘటనలో 59 మంది కరసేవకులు మరణించడంతో.. గుజరాత్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగి దాదాపు వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాటి మారణహోమం సమయంలో సంజీవ్ భట్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీసీపీగా విధుల్లో ఉన్నారు. అల్లర్ల సమయంలో 2002 ఫిబ్రవరి 27న మోడీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
డీసీపీ హోదాలో సంజీవ్ భట్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అల్లర్లకు పాల్పడుతున్న హిందువులతో సున్నితంగా వ్యవహరించాలని ఆ సమావేశంలో మోడీ పోలీసు అధికారులకు సూచించారని భట్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. అయితే, ఆ అఫిడవిట్లోని వివరాలను వెల్లడించేందుకు సంజీవ్ భట్ నిరాకరించారు. అందులోని అంశాలు మీడియాకు లీక్ కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌కు కాకుండా నేరుగా సుప్రీంకు అఫిడవిట్‌ను సంజీవ్ భట్ సమర్పించారు. ఇందుకు గల కారణాలను అఫిడవిట్‌లో వివరించానని భట్ తెలిపారు. ‘ఇంటెలిజెన్స్ బ్యూరోలో అధికారిగా ఉండటం వల్ల నాకా విషయాలు తెలిశాయి. ఆ వివరాలను వెల్లడించడం వృత్తిపరంగా సరికాదు.. అయితే, చట్టపరమైన బాధ్యత ఉన్నప్పుడు వెల్లడించక తప్పదు’ అన్నారు. గతనెలలో భట్‌ను కూడా మూడురోజుల పాటు సిట్ విచారించింది. ఫిబ్రవరి 27 నాటి సమావేశంలో పాల్గొన్న ఇతరులు.. భట్ ఆ సమావేశంలో పాల్గొనలేదని పేర్కొనడాన్ని ప్రస్తావించగా.. తననెవరు ఆ సమావేశానికి వెళ్లమన్నది, ఎవరితో కలిసి తాను ఆ సమావేశానికి వెళ్లిందీ.. తన అఫిడవిట్‌లో సమగ్రంగా వివరించానన్నారు. ‘సిట్, సుప్రీంకోర్టులు వాస్తవాలు కావాలనుకుంటే.. అవి నా అఫిడవిట్‌లో లభిస్తాయి’ అన్నారు. సంజీవ్ భట్ ప్రస్తుతం రాష్ట్ర రిజర్వ్ పోలీస్ శిక్షణాకేంద్ర ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గోద్రానంతర అల్లర్ల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఎహ్‌సాన్ జఫ్రీని, ఆయన ఇంట్లోనే ఆందోళనకారులు సజీవ దహనం చేశారు. దాంతో ఆయన భార్య జాకియా జఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు, పోలీసు ఉన్నతాధికారులు సహా 63 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. కోర్టు ఆ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. కాగా 2002, ఫిబ్రవరి 27 నాటి సమావేశానికి సంజీవ్ భట్ హాజరు కాలేదని సిట్‌కిచ్చిన వాంగ్మూలంలో నరేంద్ర మోడీ స్పష్టంచేశారు.

Friday, April 22, 2011

అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం

హైదరాబాద్ ,ఏప్రిల్ 22:   గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో  పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. . ఉభయగోదావరి,, కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాలో మిర్చి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, అనంతపురం జిల్లాలో మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

సత్యసాయిబాబా సజీవ సమాధికి సన్నాహాలు...?

పుట్టపర్తి,ఏప్రిల్ 22:  పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రభుత్వం, ట్రస్టు చేస్తున్న ఏర్పాట్లను చూస్తుంటే  బాబా సజీవ సమాధికి సన్నాహాలు  జరుగుతున్నట్టు  కనిపిస్తోందని పలువురు భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జీవించి ఉండగానే చైతన్యం పొందిన ఆత్మలు సమాధిలోకి వెళ్లిపోవడాన్ని సజీవ సమాధిగా చెపుతుంటారు. గురువారం ట్రస్టు సభ్యులు అత్యవసరంగా భేటీ కావడం దీనికి మరింత ఊపునిస్తోంది. ఇప్పటికే ధర్మవరంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి మూడు హైపవర్ జనరేటర్లు తరలించారు. కడప, వరంగల్ జిల్లాలకు చెందిన ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు కర్నూలులో సిద్ధంగా ఉంచారు. కర్నూలుకు చెందిన ఏపీఎస్పీ బెటాలియన్‌ను ఇప్పటికే పుట్టపర్తికి తరలి వెళ్లింది. ఇక్కడ ఏర్పాట్లను ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి పర్యవేక్షిస్తున్నారు. వీవీఐపీలు వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. హుటాహుటిన హెలిప్యాడ్‌లను నిర్మిస్తున్నారు. పలువురు డీఐజీలు అక్కడే మకాం వేశారు. కర్ణాటక అధికారుల బృందం కూడా పుట్టపర్తి బయలు దేరింది. సత్యసాయిని చూసేందుకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో పలువురు కేంద్ర మంత్రులు వస్తున్నట్టు వార్తలు  పొక్కుతున్నాయి. మరోవైపు ఆస్పత్రి వైద్యులు మాత్రం పాత పాటే పాడుతున్నారు. బాబా ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు.   సత్యసాయి గత నెల 28వ తేదీ నుంచి ప్రశాంతి నిలయంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి భక్తులకు బాబా దర్శనం కరువైంది. ఇలావుండగా, చిక్‌బళ్లాపూర్ స్వామిజీ శివసాయిబాబా పుట్టపర్తికి చేరుకుని   ఆస్పత్రిలోకి వెళ్లాలని చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.  పోలీసుల విజ్ఞప్తిని ఖాతరు చేయని శివసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

కోల్‌కతా నైట్‌రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ గెలుపు

కోల్‌కతా,ఏప్రిల్ 22: ఐపీఎల్-4 టోర్నిలో అడుగుపెడుతూనే క్రిస్ గేల్ సెంచరీ నమోదు చేశాడు.  కోల్‌కతా నైట్‌రైడర్స్ విసిరిన 172 పరుగుల విజయలక్ష్యాన్ని 11 బంతులుండగానే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అవలీలగా అధిగమించారు. బెంగళూరు ఒపెనర్లు గేల్, దిల్షాన్‌లు ధాటిగా బ్యాటింగ్‌ను ప్రారంభించి తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించారు. ఆతర్వాత బ్యాటింగ్ దిగిన విరాట్ కోహ్లీ కూడా వేగంగా పరుగుల్ని సాధించాడు. గేల్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 102 పరుగులు చేయగా, దిల్షాన్ 38, కోహ్లీ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అంతకుముందు బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ జట్టులో అత్యధికంగా కెప్టెన్ గంభీర్ 48, యూసఫ్ పఠాన్ 46, కల్లీస్ 40, హాడిన్ 18 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో అరవింద్ 2, మహ్మద్, వెట్టోరిలకు చెరో వికెట్ దక్కింది.

టెస్ట్ లకు మలింగ గుడ్‌బై

ముంబై,ఏప్రిల్ 22: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ టెస్ట్ లకు  గుడ్‌బై చెప్పాడు.  ఐపీఎల్ టోర్నిలో ముంబై ఇండియన్స్ కు  ఆడుతున్న మలింగను ఇంగ్లాండ్ లో జరిగే పర్యటనకు శ్రీలంక సెలక్షన్ కమిటీ జట్టునుంచి తప్పించారు. మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకు అందుబాటులో వుండనని తెలిపిన మలింగ ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఐపీఎల్ టోర్నిలో ఆడుతున్నాడు. అయితే మలింగ వ్యవహారంపై శ్రీలంక క్రికెట్ బోర్డు మండిపడింది. టెస్ట్ లకు అందుబాటులో వుండకపోవడంపై స్పందిస్తూ.. తాను వన్డే, టీ20 పోటీలకు ఫిట్‌గా వున్నానని.. ఎక్కువ సేపు ఫీల్డ్ లో  వుండే ఫిట్‌నెస్ తనకు లేకపోవడం వల్ల టెస్ట్ లకు ఆడనని తెలిపానని మలింగ వెల్లడించాడు. ఇప్పటి వరకు మలింగ 30 టెస్ట్ లలో  101 వికెట్లు, 84 వన్డేలో 127 వికెట్లు, 29 టీ20 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీసుకున్నాడు. 

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ భారీ విజయం

షాన్ మార్ష్ మెరుపు అర్ధసెంచరీ
మొహాలీ,ఏప్రిల్ 22: షాన్ మార్ష్ మెరుపు అర్ధసెంచరీకి తోడుగా జట్టు మొత్తం ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరచడంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో భారీ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో గెలిచి సీజన్‌లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. పీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. షాన్ మార్ష్ (42 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి అర్ధసెంచరీ సాధించాడు. దినేశ్ కార్తీక్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించాడు. . రాజస్థాన్ బౌలర్ టెయిట్ మూడు వికెట్లు తీసుకోగా, వాట్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తరువాత రాజస్థాన్  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసి ఓడింది. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు (20 బంతుల్లో) చేసిన జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది. పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలవగా, రాజస్థాన్‌కు ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో ఓటమి.

వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ మృతి

హైదరాబాద్,ఏప్రిల్ 22 : వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ (33) గుండెపోటుతో మృతి చెందారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం  ఉదయం మరణించారు. ‘గమ్యం’, ‘నిన్న నేడు రేపు’, ‘సంభవామి యుగే యుగే’ ‘కళావర్ సింగ్’,‘ఎల్‌బిడబ్ల్యూ’ చిత్రాలకు అనిల్ సంగీతం సమకూర్చారు. అనిల్ స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల.

Thursday, April 21, 2011

వివాదoలో లోక్‌పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీ కో చైర్మన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: వివాదస్పద సీడీ వ్యవహారంలో లోక్‌పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీ కో చైర్మన్ శాంతిభూషణ్ కు   ఎదురుగాలి వీస్తోంది. వివాదస్పద సీడీలో వున్న శాంతిభూషణ్ సంభాషణల్ని ట్యాంపరింగ్ చేయలేదని హైదరాబాద్ ఫోరెన్సిక్ లాబ్ ధృవీకరించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివాదస్పద సీడీలపై హైదరాబాద్ ఫోరెన్సిక్ అధికారులు అందించిన రిపోర్టును ఢిల్లీ పోలీసులు గురువారం అందుకున్నారు. సమాజ్‌వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అప్పటి ఎస్పీ నాయకుడు అమర్‌సింగ్‌లతో శాంతి భూషణ్ జరిపిన సంభాషణలతో కూడిన సీడీలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాంతి భూషణ్‌పై అమర్‌సింగ్, దిగ్విజయ్ సింగ్ విమర్శనాస్ర్తాలు పదునెక్కాయి. శాంతి భూషణ్‌పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నానని దిగ్విజయ్ మరోసారి పునరుద్ఘాటించారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ ' సీలింగ్ ఫ్యాన్'

హైదరాబాద్,ఏప్రిల్ 21: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీలింగ్ ఫ్యాన్‌ను ఎన్నికల కమిషన్ కేటాయించింది.  జగన్, వైఎస్ విజయమ్మలకు కామన్ సింబల్ లభించింది. కాగా,  ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ  గడువు ముగిసిన తర్వాత కడప లోకసభ పోటిలో 42 మంది అభ్యర్థులు  మిగిలారు. బ్యాలెట్ పత్రంలో జగన్‌కు ఆరవ స్థానాన్ని కేటాయించారు. ఇక పులివెందుల ఉప ఎన్నికల బరిలో 24 మంది మిగిలారు. ఈ నియోజకవర్గంలోని బ్యాలెట్ పేపర్‌లో వైఎస్ విజయమ్మకు  8వ స్థానాన్ని కేటాయించారు.  

ఫస్ట్ ఇంటర్ లో 52.21 ఉత్తీర్ణత

హైదరాబాద్,ఏప్రిల్ 21: ఇంటర్మీడియెట్ ప్రధమ సంవత్సర ఫలితాలు విడుదల అయ్యాయి.52.21 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత మూడు శాతం పెరిగింది. బాలికల ఉత్తీర్ణత శాతం 56.61 శాతం కాగా, బాలురు 48.46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలోను,నల్గొండ జిల్లా చివరి స్థానంలోనూ నిలిచాయి. సప్లిమెంటరీ పరీక్షలు మే 27 నుంచి జరుగుతాయి.




విషమంగానే సత్యసాయి ఆరోగ్యం

పుట్టపర్తి,ఏప్రిల్ 21:   గత 25 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యసాయి ఆరోగ్యం విషమంగానే  ఉంది. ఆయన ఆరోగ్యంపై డాక్టర్ సఫాయా గురువారం ఉదయం తాజా బులెటిన్ విడుదల చేశారు. బాబా అవయవాల పనితీరు స్వల్పంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటిలేటర్ ద్వారా శ్వాస, మూత్రపిండాలకు డయాలసిస్ కొనసాగుతోందని  సఫాయా తెలిపారు. బాబా లోబీపీతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.  

ప్రేమోన్మాదానికి ఉపాధ్యాయిని బలి

విశాఖపట్నం,ఏప్రిల్ 21:  ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. విశాఖ జిల్లా అరకులోయ సమీపంలోని డుంబ్రిగూడ మండలం కొర్ర గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయిని లొక్కోయి సుందరమ్మ (29) ఆర్.డుంబ్రిగూడలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల (జీపీఎస్) లో పని చేస్తున్నారు. అవివాహిత అయిన ఆమె ఉద్యోగరీత్యా అరకులోయలోని పోస్టల్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్లారు. ప్రేమిస్తున్నానంటూ గతంలో ఆమె వెంటపడి, తిరస్కరణకు గురైన అదే గ్రామానికి చెందిన తాంగుల సుబ్బారావు( 32) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాఠశాలకు చేరుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని సుందరమ్మను కోరాడు. అందుకు ఆమె తిరస్కరించి, తక్షణమే వెళ్లిపోవాలని హెచ్చరించారు. ముందుగానే పథకం ప్రకారం కత్తి పట్టుకుని పాఠశాలకు వచ్చిన సుబ్బారావు.. ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. కత్తితో ఆమెపై దాడి చేసి, అనంతరం గొంతు కోయడంతో సుందరమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరాన్ని కళ్లారా చూసిన పాఠశాల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు కిల్లో మోనిమ అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెను కూడా చంపుతానని బెదిరించాడు. దీంతో మోనిమ కేకలు వేయడంతో సమీపంలోని గిరిజనులు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన హంతకుడు అక్కడి నుంచి పారిపోయి అరకులోయ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సుందరమ్మను సుబ్బారావు చాలా కాలంగా వేధిస్తున్నాడు. 2004లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు కూడా పంపారు. అక్కడ సత్ప్రవర్తనకు ఉత్తమ ఖైదీగా గుర్తింపు పొంది విడుదలయ్యాడు. గ్రామానికి వచ్చిన తర్వాత ఆమెను మళ్లీ వేధించడం మొదలెట్టాడు. చివరికి ఇంత ఘాతుకానికి తెగబడ్డాడు.

Tuesday, April 19, 2011

హెలికాఫ్టర్ ప్రమాదంలో 17 మంది మృతి

గౌహతి,ఏప్రిల్ 19: అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో 17 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కూడా వున్నారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లతోసహా ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పవన్ హాన్స్ హెలికాఫ్టర్ లిమిటెడ్‌కు చెందినది. ల్యాడింగ్ సమయంలో మంటలంటు కోవడంతో హెలికాఫ్టర్‌కు ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు.

‘నందీశ్వరుడు' గా నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్:  ‘సింహా’ విజయం సాధించిన ఉత్సాహంలో వరుసగా సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యంతో పాటు పరుచూరి మురళి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నారు.  కాగా ఈ నందమూరి  నటసింహం త్వరలో నటించనున్న మరో చిత్రం ‘నందీశ్వరుడు’. బాలయ్య సంచలన విజయాల్లో ఒకటైన నరసింహానాయుడుతో పాటు మరో ప్లాప్ చిత్రం సీమసింహానికి కథను అందించిన చిన్నికృష్ణ  కథను అందిస్తున్న ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు. ఇంతకు ముందు బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించిన బి గోపాల్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనే ఆలోచనలో వున్నారట. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర  పూర్తి వైవిద్యంగా పవర్ ఫుల్ గా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.

భారత సంతతికి పులిట్జర్ అవార్డు

వాషింగ్టన్ ,ఏప్రిల్ 19:  ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్ క్యాన్సర్ వైద్య నిపుణుడు సిద్ధార్థ ముఖర్జీ సొంతం చేసుకున్నారు. నాన్ ఫిక్షన్ కేటగిరిలో ‘ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలాడీస్: ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్’ పుస్తకానికి పులిట్జర్ పురస్కారందక్కింది. క్యాన్సర్ మహమ్మారికి  సంబంధించిన చికిత్స, పరిశోధన అంశాలను ఈ పుస్తకంలో పొందిపరిచారు. దూమపానానికి  వ్యతిరేకంగా, బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లాంటి పలు కార్యక్రమాలను  ముఖర్జీ చేపట్టారు. ముఖర్జీ ఢిల్లీ నగరంలో జన్మించారు.

‌డెవిల్స్ ను చిత్తు చేసిన ఛార్జర్స్

న్యూఢిల్లీ,ఏప్రిల్ 19:  ఢిల్లీ డేర్‌డెవిల్స్ ను చిత్తు చేసి డెక్కన్ ఛార్జర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ చార్జర్స్ 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. సోహల్(62), సారథి సంగక్కర(49), వైట్(31)లు  రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్ జట్టు 168 పరుగులు చేసింది. భారీలక్ష్యంతో బ్యాటింగ్ కు  దిగిన డేర్‌డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో  డ్ వార్నర్ ఒక్కడే రాణించి అర్ధసెంచరీ (51) చేశాడు.  ఛార్జర్స్ బౌలర్లలో క్రిస్టియన్, హర్మీత్‌సింగ్ చేరో రెండు వికెట్లు తీసుకోగా, ఓజా, మిశ్రా, ధావన్‌లు తలో వికెట్ పడగొట్టారు. 

న్యూజిల్యాండ్‌లో భారత కమ్యూనిటీ వృద్ధి

హమిల్టన్ ,ఏప్రిల్ 19: న్యూజిల్యాండ్‌లో భారత సంతతి కమ్యూనిటీ వృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల కోసం వలసపోయే వారి సంఖ్య భారీగా తగ్గింది. అయితే, ఇందుకు విరుద్ధంగా న్యూజిల్యాండ్ వచ్చే భారతీయుల సంఖ్య గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. 2009-10వ సంవత్సరానికిగాను 73,400 మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి అర్హత సాధించాగా, ఇందులో భారతీయులే అధికమని, విదేశీ విద్యార్థుల విషయంలో భారత్ ప్రధాన ఆదాయ వనరుగా మారిందని కార్మిక  శాఖ  వెల్లడించింది. విదేశీ విద్యార్థుల ద్వారా గత ఏడాది న్యూజిల్యాండ్ 2.3 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. భద్రమైన ప్రదేశమనే భావన, కుటుంబ వాతావరణంతో పాటు, ఆతిథ్య రంగం, వ్యాపార రంగాలలో విసృ్తతమైన అవకాశాలుండడంతో భారతీయులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతున్నారని మేనేజ్‌మెంట్ విద్యార్థి గుర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఉన్నత చదువుల కోసం పంజాబ్, గుజరాత్‌ల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారని పేర్కొన్నారు.

లోక్‌పాల్ బిల్లు కమిటీపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ,ఏప్రిల్ 19: లోక్‌పాల్ ముసాయిదా కమిటీలో ఐదుగురు పౌర సమాజ నేతలకు స్థానం కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, మరికొందరు అడ్వొకేట్లు దీన్నిదాఖలు చేశారు. పార్లమెంట్ సభ్యులతో మాత్రమే పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కానీ ఈ కమిటీలో ఐదుగురు మంత్రులతోపాటు మరో ఐదుగురు పౌర సమాజ నేతలకు స్థానం కల్పించారని, ఇది రాజ్యంగ విరు ద్ధ మని స్పష్టంచేశారు. అలాగే తండ్రీకొడుకులైన శాంతిభూషణ్, ప్రశాంత్‌భూషణ్‌లకు కమిటీలో చోటు కల్పించడంపైనా అభ్యంతరం తెలిపారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు ప్రశాంతం

కోల్‌కతా,ఏప్రిల్ 19: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఆరు ఉత్తరాది జిల్లాలు.. డార్జిలింగ్, జల్‌పాయిగురి, కూచ్‌బెహార్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, మాల్దాల్లోని 54 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో భారీస్థాయిలో 74.27 శాతంమంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాల్లో పోలింగ్ 82.91 శాతంగా నమోదు కావడం విశేషం. 11 మంది మంత్రులు సహా అనేకమంది ప్రముఖులు మొదటి విడత బరిలోఉన్నారు. 38 మంది మహిళలు సహా 364 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చడానికి సోమవారం ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. విద్యుత్ కోత కారణంగా కొన్నిచోట్ల కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్ నిర్వహించారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. వాటిని బాగుచేసి, పోలింగ్‌ను కొనసాగించారు. సున్నితమైనవిగా పేర్కొన్న 1800 పోలింగ్ కేంద్రాలు సహా మొత్తం 12,131 పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పారామిలటరీని మోహరించారు.  మొత్తం మీద ‘పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

Monday, April 18, 2011

ఉత్తర కరోలినా లో తుపాన్ ధాటికి 23 మంది మృతి

వాషింగ్టన్, ఏప్రిల్ 18: అమెరికాపై తుపాన్లు విరుచుకుపడ్డాయి. వీటి ధాటికి ఆరు రాష్ట్రాల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు కూడా కూలిపోయాయి. అత్యవసర సహాయ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.  ఉత్తర కరోలినా లో అధిక నష్టం సంభవించింది.  దీంతో ఉత్తర కరోలినా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఉత్తర కరోలినాలో 23 మంది, వర్జీనియాలో నలుగురు, అలమాబాలో ఏడుగురు మృతిచెందారు. మరోవైపు వర్జీనియాలో వచ్చిన తుపాను తీవ్రతకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. 

న్యూజిలాండ్‌లో భూకంపం

వెల్లింగ్టన్,ఏప్రిల్ 18: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైంది. న్యూజిలాండ్‌ ఈశాన్య తీరంలోని  తూర్పు అక్లాండ్‌లో భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.  పసిఫిక్ సునామీ వార్మింగ్ సెంటర్ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. అయితే ఇప్పటికిప్పుడే ముప్పేమి లేదని తెలిపింది. 

రాయల్స్ పై నైట్ రైడర్స్ మూడో విజయం

కోల్‌కతా,ఏప్రిల్ 18:   ఐపిఎల్ నాలుగో అంచెలో కోల్‌కతా నైట్ రైడర్స్ దూసుకు వెడుతోంది. ఆదివారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో సొంత గడ్డపై ఎనిమిది వికెట్లతో  ఘన విజయం సాధించింది.  వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఇంతకుముందు నైట్ రైడర్స్ రాయల్స్  వారి సొంతగడ్డ జైపూర్‌లోనూ ఓడించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బాలాజీని వరించింది. మొదట బ్యాటింగ్ చేసిన  రాజస్థాన్ రాయల్స్  కేవలం 15.2 ఓవర్లలో 81 పరుగులకే చేతులెత్తేసింది. లక్ష్యఛేదనలో కోల్‌కతా 2 వికె ట్లు కోల్పోయి మరో 38 బంతులు మిగిలుండగానే విజయబావుటా ఎగురవేసింది.

Sunday, April 17, 2011

యాంటీ బయాటిక్స్ కు బ్రేక్

న్యూఢిల్లీ,ఏప్రిల్ 18: గుర్తింపు లేని యాంటీ బయాటిక్ మందుల విక్రయాలను అరికట్టేందుకు  కేంద్రం సిద్ధమయింది.  వీటిని నియంత్రించేందుకు ఔషధ చట్టంలో కొత్త షెడ్యూల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రస్తుత చట్టం.. ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్’ లోని షెడ్యూల్  ‘హెచ్’ కింద 536 రకాలైన ఔషధాలున్నాయి. వీటిని డాక్టర్ సూచనల మేరకు మాత్రమే విక్రయించాలి. గుర్తింపులేని యాంటీ బయాటిక్స్ విక్రయాలను నిరోధించేందుకు ఇప్పుడు ఇదే చట్టంలో ‘హెచ్ 1’ పేరిట కొత్త షెడ్యూల్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. మూడోతరం యాంటీ బయాటిక్స్‌కు ప్రత్యేక కలర్ కోడింగ్ ప్రవేశపెట్టాలని ఈ శాఖ ప్రతిపాదించింది. నిర్దేశిత కాంబినేషన్లలో మార్కెట్‌లో లభిస్తున్న యాంటీ బయాటిక్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. 

Saturday, April 16, 2011

                                లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైనప్పటి  చిత్రం...

సాయిబాబా చికిత్సకై అమెరికావైద్య నిపుణులు

పుట్టపర్తి,ఏప్రిల్ 16:  సత్యసాయి బాబా కు వైద్య సేవలు అందించేందుకు అమెరికా నుంచి ఇద్దరు వైద్య నిపుణులు డాక్టర్ కల్పలత, డాక్టర్ శ్రీధర్ పుట్టపర్తి చేరుకున్నారు. కాగా, సత్యసాయి బాబా కు  వెంటిలేటర్ల ద్వారానే శ్వాస అందిస్తున్నారు.  వైద్యానికి బాబా శరీరం కొద్దికొద్దిగా స్పందిస్తున్నట్లు డాక్టర్ సఫాయా వివరించారు. 

రాయల్ చాలెంజర్స్ పై చెన్నై సూపర్ కింగ్ జట్టు విజయం

చెన్నై,ఏప్రిల్ 16: ఐపిఎల్ 14వ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై చెన్నై సూపర్ కింగ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది. 

జీవో 177 తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్, ఏప్రిల్ 16 :  జీవో నెంబర్ 177ను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీవో విడుదలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో వచ్చిన వ్యతిరేకత మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు  మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

విజయమ్మ , వివేకానందరెడ్డి నామినేషన్లు

పులివెందుల,ఏప్రిల్ 16 : పులివెందుల  అసెంబ్లీ స్థానానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ విజయమ్మ,  కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ వివేకానందరెడ్డి సహా 9మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి నామినేషన్ వేశారు. కాగా విజయలక్ష్మి పేరుతో జేఈ విజయలక్ష్మి, ఈ విజయలక్ష్మీ, ఓ విజయలక్ష్మీ ఇంటి పేర్లతో  మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్‌ఆర్ సతీమణి విజయమ్మ తాసీల్దార్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషను పత్రాలను ఆర్డీవోకు అందచేశారు. విజయమ్మతో పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఇంటి వద్ద నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరిన వీరితో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వచ్చారు.
కడప లో డీఎల్ నామినేషన్
 కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, అహ్మదుల్లా, కేంద్రమంత్రి సాయిప్రతాప్ తదితరులు హాజరయ్యారు.

Friday, April 15, 2011

పుట్టపర్తిలో ఏం జరుగుతోంది...?

హైదరాబాద్,ఏప్రిల్ 15: పుట్టపర్తి సత్యసాయిబాబాకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలకు ఇద్దరు మంత్రులను బాధ్యులను చేస్తూ ఓ టీవీ చానెల్ శుక్రవారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. బాబా బందీ అంటూ గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన టీవీ చానెల్ సత్య సాయిబాబా వ్యవహారాల్లో కుట్ర చేస్తున్నవారి విషయంలో ఇద్దరు మంత్రులు భారీగా డబ్బులు తీసుకున్నారని, అందుకే వారు మాట్లాడడం లేదని టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ఆ ఇద్దరు మంత్రులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రుల పేర్లను మాత్రం  చానెల్ వెల్లడించలేదు. వాస్తవాలను దాచి పెడుతూ కోట్లాది రూపాయల వ్యవహారాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. సత్య సాయిబాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత మంత్రి జె. గీతా రెడ్డి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై సమీక్ష చేశారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఆమె ఎడతెరిపి లేకుండా ప్రకటనలు చేస్తూ వచ్చారు. మంత్రి రఘువీరా రెడ్డి కూడా సత్య సాయిబాబా ట్రస్టుపై, సత్య సాయిబాబా వ్యవహారాలపై వస్తున్న వార్తాకథనాలకు వివరణ ఇవ్వడంలో  హడావిడి చేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరు మంత్రులు కూడా మౌనం వహించారు.  మంత్రుల పేర్లను మాత్రం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ వెల్లడించలేదు.సత్య సాయిబాబా స్థితిపై నోరు విప్పకుండా ఉండడానికి ఓ ఐపియస్ అధికారికి కూడా భారీగా డబ్బులు ముట్టినట్లు చానెల్ ఆరోపించింది. ఆ అధికారికి 200 కోట్ల రూపాయలు ముట్టాయని, వాటిని అతను హవాలా మార్గంలో విదేశాల్లో తన కుమారుడికి తరలించాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా చెప్పుకుంది. కాగా, బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య సేవలకు స్పందిస్తున్నారని సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా శుక్రవారం సాయంత్రం కూడా ప్రకటించారు.
2011 వై.ఎఫ్.ఎల్.ఒ యంగ్ వుమన్ అచీవర్స్ అవార్డ్ ను ఢిల్లీలో అందుకున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ 

నామినేషన్ దాఖలు చేసిన జగన్‌

కడప, ఏప్రిల్ 15:  ఉప ఎన్నిక జరగనున్న కడప పార్లమెంట్ స్థానానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి కలెక్టర్‌కు ఆయన శుక్రవారం ఉదయం తన నామినేషన్ పత్రాలు అందచేశారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. కాగా పులివెందుల శాసనసభ స్థానానికి శనివారం వైఎస్ విజయలక్ష్మి నామినేషన్ వేయనున్నారు. కాగా, పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై కాంగ్రెస్ అబ్యర్ధిగా పోటీ చేస్తున్న  ఆమె మరిది వివేకానంద రెడ్డి మంత్రి పదవికి  చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఆమోదించి, గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ కూడా వివేక రాజీనామాను ఆమోదించారు.  ఇలా వుండగా కడప లోక్ సభ స్థానానికి ఇప్పటి వరకు 9 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. పులివెందుల శాసన సభ స్థానానికి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినవారు మంత్రులైనా వదిలిపెట్టేదిలేదని ఆయన హెచ్చరించారు. ఉప ఎన్నికలకు ఆరుగురు పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 7799 మందిపై బైడోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.  అనధికార నగదు బదిలీపై ఇన్ కంటాక్స్ అధికారులకు గానీ, 1800-4251788 ఫోన్ నంబర్ కు గానీ సమాచారం అందించవచ్చని ఆయన తెలిపారు.

సీడి వివాదంలో లోకపాల్ కమిటీ కో-ఛైర్మన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:  అవినీతి నిరోధానికి ఏర్పాటయిన లోకపాల్ డ్రాఫ్టింగ్ కమిటీ తొలి సమావేశానికి ఒకరోజు ముందే కమిటీ సహ ఛైర్మన్‌ పై ఓ వివాదం చెలరేగింది. లోకపాల్ కమిటీ సహ ఛైర్మన్, మాజీ న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌లతో మాట్లాడినట్లు భావిస్తున్న సీడి వెలుగులోకి వచ్చింది. ములాయంసింగ్‌కు సంబంధించిన న్యాయసంబంధ విషయంలో జ్యోకం చేసుకోవాలని కోరుతూ అమర్‌సింగ్ శాంతిభూషణ్‌ను కలిసినట్లు సీడీ సంభాషణల్లో నమోదయింది.అయితే ఈ సీడీ కల్పితమని శాంతిభూషణ్, అమర్‌సింగ్ పేర్కొన్నారు. ఈ సీడి వ్యవహారంపై శాంతిభూషణ్ పోలీసు కేసు నమోదుచేశారు. 

రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం

జైపూర్,ఏప్రిల్ 15: రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసింది. పానికర్ 9 పరుగులు, ద్రావిడ్ 35, మెనారియా 27, వాట్స్ న్ 22 పరుగులు చేశారు. టేలర్ 35 పరుగులు, బోథ్ 12 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. తరువాత నైట్ రైడర్స్ జట్టు 18.3 ఓవర్లలో  ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. ఎంఎస్ బిస్లా ఒక్క పరుగు మాత్రమే చేసి రన్ అవుటయ్యాడు. కల్లీస్ 80 పరుగులు, గంభీర్ 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.

Thursday, April 14, 2011

‘అంకుశం' రామిరెడ్డి మృతి

హైదరాబాద్,ఏప్రిల్ 14 : ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామిరెడ్డి  మరణించారు. రామిరెడ్డి ‘అంకుశం’ సినిమాలో విలన్ పాత్రతో ప్రేక్షకుల మన్నన పొందారు. అప్పటినుంచి ఆయన   ‘అంకుశం' రామిరెడ్డిగా పేరు పొందారు. అమ్మోరు, అనగనగా ఒకరోజు, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, పెద్దరికం, గాయం, బలరామకృష్ణులు, ఓసేయ్ రాములమ్మ సినిమాల్లో ప్రతి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రామిరెడ్డి మృతి పట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

తెలంగాణ కోసం కేసీఆర్ చండీయాగం

హైదరాబాద్, ఏప్రిల్ 14:  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దంపతులు చండీయాగం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ ఫాంహౌస్‌లో గురువారం ఉదయం కేసీఆర్ దంపతులతో వేద పండితులు చండీయాగాన్ని ఆరంభించారు. 65మంది వేద పండితులు మూడు రోజుల పాటు ఈ యాగాన్ని జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్మేలు, ఎంపీ విజయశాంతి, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కాఠిన్యం

ఇక పని చేస్తేనే జీతాలు 
హైదరాబాద్, ఏప్రిల్ 14: పెన్ డౌన్, చాక్ డౌన్, టూల్ డౌన్, సహాయ నిరాకరణలతో సహా ఎలాంటి ఆందోళన చేసినా ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. వారికి సమ్మె చేసే హక్కు లేదని పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని పేర్కొంది. పని చేయకపోతే జీతాలిచ్చే సమస్యే లేదని తేల్చి చెప్పింది. ఆందోళన సమయంలో విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇబ్బంది కలిగిస్తే క్రిమినల్ చర్యలూ తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆటలాడినా, డ్రమ్ములు వాయించినా కూడా క్రమశిక్షణ వేటు ఖాయమని కరాఖండిగా చెప్పింది. ఈ మేరకు జీవో నంబర్ 177ను బుధవారం ప్రభుత్వం జారీ చేసింది. 

త్రీడీ సినిమాగా ‘షోలే ’

ముంబై, ఏప్రిల్ 14: బ్లాక్‌బస్టర్  హిందీ సినిమా ‘షోలే ’ త్రీడీ సినిమాగా రూపొందనుంది. నిర్మాత సుభాష్ ఘాయ్ ఈ చిత్రాన్ని మాయా డిజిటల్ కంపెనీతో కలసి త్రీడీ రూపంలోకి మార్చనున్నారు. దీనికి సంబంధించి కాపీరైట్ చర్చలు జరుగుతున్నాయని ’ ని ఘాయ్  తెలిపారు. అమితాబ్ బచ్చన్, హేమామాలిని తదితరులు నటించిన షోలే (1975) అశేష జనాదరణ పొందడం తెలిసిందే.   కాగా, రుతుపర్ణో ఘోష్ దర్శకత్వం వహించిన ‘నైకా దుబి’ బెంగాలీ చిత్రాన్ని ఘాయ్ హిందీలోకి ‘కాష్మాకాశ్’ పేరుతో డబ్ చేశారు. హిందీ వర్షన్ పాటలను మంగళవారం విడుదల చేశారు. 

తమిళనాడు, కేరళ పుదుచ్చేరి ఎన్నికలు ప్రశాంతం

న్యూఢిల్లీ,ఏప్రిల్ 14: దక్షిణాదిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. తమిళనాడులో 75 శాతం మంది ఓటర్లు, కేరళలో 74.4 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా.. అత్యధికంగా పుదుచ్చేరిలో 85.21 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో.. ప్రత్యేకించి తమిళనాడులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి ప్రయత్నంగా భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారులు గట్టి నిఘా పెట్టారు. తనిఖీల్లో తమిళనాడులో రూ. 54.17 కోట్లు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. మూడు అసెంబ్లీ ఎన్నికలనూ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కేరళలో మొట్టమొదటి సారిగా 8,835 మంది ప్రవాస భారతీయులు ఓటేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి (86), కేరళ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ (87), పుదుచ్చేరి సీఎం వైద్యలింగం, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత (63) వంటి హేమాహేమీల భవితవ్యం మే 13వ తేదీన జరిగే కౌంటింగ్‌లో తేలనుంది.  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాం (ఆంధ్రప్రదేశ్‌లో ఉంది) అసెంబ్లీ నియోజకవర్గంలో 95.64 శాతం పోలింగ్ నమోదైంది. 30,936 మంది ఓటర్లకుగాను అత్యధికంగా 29,585 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tuesday, April 12, 2011

ఢిల్లీ డేర్‌డెవిల్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం

జైపూర్,ఏప్రిల్ 12:  ఐపీఎల్-4లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ పై  6 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. వార్నర్ (54) వేణుగోపాలరావు (60) అర్థ సెంచరీలతో రాణించారు.

డెక్కన్ ‌పై కోల్‌కతా విజయం

కోల్‌కతా,ఏప్రిల్ 12: ఐపీఎల్-4లో భాగంగా ఇక్కడ ఛార్జర్స్ తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 9 పరుగుల తేడాతో తొలి విజయం నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో డెక్కన్ ఆటగాళ్లు విఫలమయ్యారు.154 పరుగులకే అవుటై  రెండో ఓటమి  నమోదు చేశారు.  కోల్‌కతా బౌలర్లలో అబ్దుల్లా మూడు వికెట్లు తీయగా, భాటియా , ఉనాద్కత్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న కోల్‌కతా బ్యాట్‌మెన్‌లలో ఓపెనర్ కల్లీస్ 53 పరుగులతో బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడగా, బిస్లా 19, కెప్టెన్ గంభీర్ 29, యూసఫ్ పఠాన్ 22,తివారీ 30 పరుగులు చేశారు. 

కళ్యాణ వైభోగమే...

' వార్తాప్రపంచం '  వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.. 
భద్రాచలం,ఏప్రిల్ 12 : భూలోక వైకుంఠమైన భద్ర గిరిలో మంగళవారం శ్రీ సీతారామచంద్రస్వాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా స్టేడియంలో సరిగ్గా మధ్యాహ్నం 12.గంటలకు ఆగమ శాస్త్ర ప్రకారం అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. ఆతర్వాత రామదాసు చేయించిన తాళిబొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు. అనంతరం సీతమ్మ, రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది.  ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను  సమర్పించారు.కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, రెండు గంటలకు తిరువారాధన, నాలుగు గంటలకు అభిషేకరం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయంలోని ధ్రువ మూర్తుల కళ్యాణం, తొమ్మిది గంటలకు అలంకారం చేశారు. తొమ్మిదిన్నర గంటలకు మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తెచ్చారు. సరిగ్గా పన్నెండు  గంటలకు కళ్యాణం జరిగింది. ఈ వేడుకను కన్నులారా తిలకించి తరించేందుకు దేశనలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో భద్రాచలం పట్టణంలోని వీధులన్నీ జనసంద్రమయ్యాయి.12 సంవత్సరాలకో మారు జరిగే పుష్కర పట్టాభిషేకాన్ని కూడా తిలకించాలనే తలంపుతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.                                       

Monday, April 11, 2011

వారెవా...! వా..ట్సన్...!

మిర్పూర్,ఏప్రిల్ 11:  బంగ్లాదేశ్‌తో శనివారమిక్కడ జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ షేన్ వాట్సన్  సెంచరీతో చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించాడు. వామ్మో! వాట్సన్ అనుకునేలా విజృంభించాడు. 15 సార్లు బంతిని బౌండరీ కి తరలించిన ఈ డాషింగ్ ఓపెనర్ అంతే సంఖ్యలో బాల్‌ను బౌండరీ అవతలకు కొట్టాడు. బంగ్లా నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 26 ఓవర్లలోనే ఛేదించింది. ఆస్ట్రేలియా 26 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 232 పరుగులు చేసింది.96 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 185 పరుగులు చేసిన వాట్సన్ అజేయంగా నిలిచాడు. అతడికి రికీ పాంటింగ్(37) అండగా నిలిచాడు. హాడిన్ 8 పరుగులు చేసి అవుటయ్యాడు.  ఈ విజయంతో మూడు వన్డేల ఈ సిరీస్‌ను  ఆసీస్ 2-0 తో కైవ్సం చేసుకుంది.  మూడో వన్డే ఈ నెల 13న జరగనుంది.

Sunday, April 10, 2011

జగన్‌ ఓటమి లక్ష్యంగా కడపకు క్యాబినెట్...!

హైదరాబాద్,ఏప్రిల్ 11: కడపలో జగన్‌ను ఓడించడంపై ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్  పూర్తిగా దృష్టి పెట్టారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలపై  డీఎస్ సమక్షంలో  సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. జగన్‌ను నిలువరించేందుకు సర్వ శక్తులూ ఒడ్డాలని మంత్రులను సీఎం కిరణ్ ఆదేశించారు.  నామినేషన్ల ఘట్టం నుంచి ఓట్ల లెక్కింపు దాకా ఎవరెవరు ఏమేం చేయాలో పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పులివెందుల అభ్యర్థి, వ్యవసాయ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, టీజీ వెంకటేశ్, కె.పార్థసారథి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బసవరాజ్ సారయ్య, పసుపులేటి బాలరాజు, డీకే అరుణ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు భేటీలో పాల్గొన్నారు. కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతలను ఏడుగురు సీనియర్ మంత్రులకు సీఎం ప్రత్యేకంగా అప్పగించారు. కడపకు కన్నా లక్ష్మీనారాయణ, పులివెందులకు ఆనం రామనారాయణరెడ్డి, ప్రొద్దుటూరుకు టీజీ వెంకటేశ్, జమ్మలమడుగుకు బొత్స సత్యనారాయణ, బద్వేలుకు మానుగుంట మహీధర్‌రెడ్డి, కమలాపురానికి ఎన్.రఘువీరారెడ్డి, మైదుకూరుకు ధర్మాన ప్రసాదరావు ఇన్‌చార్జిలుగా నియమితులయ్యారు. నామినేషన్ల అనంతరం పోలింగ్ ప్రక్రియ దాకా ఏడుగురు మంత్రులూ పూర్తిస్థాయిలో నియోజకవర్గాల్లోనే ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఈ మంత్రులకు ఎంపీలంతా పూర్తిస్థాయిలో చేదోడువాదోడుగా నిలవాలని నిర్ణయించారు. వీరికి తోడు రాష్టవ్య్రాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కూడా కడప లోక్‌సభ స్థానం పరిధిలోని మండలాలకు భారీగా తరలించనున్నారు. మండలాల వారీగా వారిని రప్పించుకునే బాధ్యతను ఆయా నియోజకరవర్గాల మంత్రులకు అప్పగించారు.

కింగ్స్ పై పూణె వారియర్స్ విజయం

ముంబయి,ఏప్రిల్ 11: ఐపీఎల్-4లో  కొత్తగా ప్రవేశించిన పూణె వారియర్స్ శుభారంభం చేసింది. ఆదివారమిక్కడ జరిగిన 5వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 13.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. వారియర్స్ బ్యాట్స్మెన్లలో   జెస్సీ రైడర్ 17 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. కాగా, మన్హాస్ 35, రాబిన్ ఉతప్ప 22, యువరాజ్‌సింగ్ 21 పరుగులు చేసి విజయానికి తోడ్పాటు అందించారు. కింగ్స్ బౌలర్లలో ప్రవీణ్‌కుమార్, మెక్‌లారెన్, నాయర్ తలో వికెట్ తీసుకున్నారు.
ఓడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 
ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో  ఢిల్లీ డేర్‌డెవిల్స్ పై ముంబై ఇండియన్స్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ 17.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. సులభమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ సచిన్ (50 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫామ్‌ను కొనసాగిస్తూ చివరి వరకూ నిలబడి జట్టును గెలిపించాడు. సంచలన బౌలింగ్ ప్రదర్శనకు గాను మలింగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 

కడప, పులివెందుల ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్: కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అధికారవర్గాల సమాచారం మేరకు నామినేషన్ల దాఖలకు ఈనెల 18ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. 19న నామినేషన్ల పరిశీలన, 21లోపు వాటిని ఉపసంహరించుకునే గడువు ఉంటుంది. మే 8వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్నికల నిబంధనల మేరకు మే నెల 15వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియనంతా పూర్తి చేయాలి.

డెక్కన్ చార్జర్స్ పరాజయం

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్ ఎనిమిదో సారి పరాజయం పాలైంది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో డెక్కన్ చార్జర్స్ ను ఓడించింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన డెక్కన్ చార్జర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

బాబు కు బామ్మరుదుల పోటు...!

హైదరాబాద్, ఏప్రిల్ 10:  తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ  విడుదల చేసిన బహిరంగ లేఖ పార్టీలో కలకలం రేపింది. మొదలైంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన దీక్షకు మద్దతుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర చేపట్టి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తున్నపుడే.. అవినీతిపై పోరాటానికి త్వరలో జనం ముందుకు వస్తానంటూ హరికృష్ణ రాసిన లేఖ ప్రతులను ఆయన అనుచరులు బహిరంగంగా పంపిణీ చేశారు. హరికృష్ణ  తన లేఖలో కుంట భూమిలేని వారు రాజకీయాల్లోకి వచ్చి సంపాదిస్తున్నారంటూ చేసిన ప్రస్తావన పార్టీ అధినేత ను ఉద్దేశించినవేనని  పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొద్దిరోజులుగా చంద్రబాబు, హరికృష్ణ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు.చంద్రబాబు ' మీకోసం ' యాత్ర నిర్వహించినపుడు, ఆ తర్వాత పార్టీలో అన్నీ తానై వ్యవహరించినా కరివేపాకు లాగా తనను వాడుకుని వదిలేయటం పట్ల అసంతృప్తిగా ఉన్న హరికృష్ణ తన నిరసనను ఏదో ఒక రూపంలో కొద్ది రోజులుగా బయటపెడుతున్నారు. దీనికి హరికృష్ణ సోదరి, కేంద్రమంత్రి పురందేశ్వరితో పాటు, ఆయన కుమారుడు జూనియర్ ఎన్‌టీఆర్‌ల సహకారం లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసిన  సమయంలో.. నిజమైన కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరుగుతోందనే వాదాన్ని చంద్రబాబు తెరపైకి తెస్తే.. ఇప్పుడు హరికృష్ణ అనుచరులు ఎన్‌టీఆర్ కుటుంబానికి అవమానం అనే నినాదాన్ని తెరపైకి తెస్తున్నారని.. దీనినిబట్టి పార్టీలో కుటుంబ కలహాలు ఏస్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో తన పర్యటన సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహరించిన తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న హరికృష్ణ తన అనుచరులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వల్లభనేని వంశీమోహన్‌ల ద్వారా దాన్ని వ్యక్తపరిచారు. ఈ పరిణామాలు చంద్రబాబును ఇరుకునపెట్టాయి. చంద్రబాబు వాటి పై పత్రికా ప్రకటన విడుదల చేయటంతో పాటు విలేకరులతో మాట్లాడిన సమయంలో ఎవరిని ఏ స్థాయిలో చూడాలో తనకు బాగా తెలుసంటూ ఒకరకంగా హరికృష్ణపై బెదిరింపు ధోరణితో వ్యక్తం చేశారు.  సింగపూర్ పర్యటనలో ఉన్న తాను  జూనియర్ ఎన్‌టీఆర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని.. ఎంటీఆర్  కుటుంబానికి  తాను ఎంతో చేశానని, ఎప్పుడూ హరి  వెన్నంటి ఉండే వంశీకి విజయవాడ పార్లమెంటు సీటు ఇవ్వటంతో పాటు పెద్ద మొత్తంలో ఆర్థికసాయం చేశానని లీక్ చేయటం ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని హరికృష్ణ ఆగ్రహంతో ఉన్నారు.   కాగా, మరో బామ్మరిది,వియ్యంకుడు   బాలయ్య బాబు కూడా  పార్టీలో నెలకొన్న వివాదాల్లోకి  తనను లాగవద్దంటూ పత్రికా ప్రకటన విడుదల చేయడం  చంద్రబాబు కు మరింత ఇబ్బంది కలిగిస్తోంది. 




' వెండి ' పరుగులు...!

ముంబై,ఏప్రిల్ 10:  వెండి పరుగు కొనసాగుతోంది.  బులియన్ మార్కెట్లో ధర శనివారం ఒక్కరోజే రూ. 1,880 పెరిగి, రూ. 62,005కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధర ఔన్స్ (31.1గ్రా)కు 40 డాలర్లకు పైన కొనసాగుతోంది. ఇక బంగారం ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములు రూ. 135 పెరిగి, రూ. 21,325కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అంతే మొత్తం పెరిగి, రూ. 21,225కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో జూన్ డెలివరీకి సంబంధించి ఔన్స్ ధర 1,475 డాలర్లకు ఎగసింది.

అన్నాహజారేకు టాగూర్ శాంతి బహుమతి

న్యూఢిల్లీ,ఏప్రిల్ 10: : అవినీతిపై పోరులో భాగంగా ఆమరణ నిరాహార దీక్షతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన అన్నా హజారేకు ఈ ఏడాది ‘రవీంద్రనాథ టాగూర్ శాంతి బహుమతి’ని ఇవ్వనున్నట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అవినీతికి వ్యతిరేకంగా అంకితభావంతో అహింసాపూరిత నిరసన చేపట్టి విజయం ధించిన హజారేకే సంఘీభావంగా ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు కింద కోటి నగదు, స్వర్ణ పతకం, ప్రశంసాపత్రం అందజేస్తారు.
విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున తయారైన 38.2 అడుగుల పొడవైన దోశకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో  చోటు దక్కింది.  20 నిమిషాల్లో 25 మంది ఈ దోశెను తయారు చేశారు. విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా దీన్ని తయారు చేశారు.

Saturday, April 9, 2011

మరో ప్రవాస భారతీయుడికి ఒబామా కొలువు

వాషింగ్టన్,ఏప్రిల్ 9: : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరో ప్రవాస భారతీయుడికి తమ కొలువులో ఉన్నత  పదవి కేటాయించారు. విస్కాన్సిన్ లా స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ అంజు దేశాయ్‌ని ప్రభుత్వంలోని విదేశీ దావా పరిష్కార బృందం (ఫారిన్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ కమిటీ) లో సభ్యునిగా నియమించారు.  అంజుదేశాయ్ 2001లో విస్కాన్సిస్ యూనివర్సిటీలో చేరడానికి ముందు చైనా నాన్జింగ్‌లోని జాన్ హాప్కిన్స్ వర్సిటీ, తైవాన్‌లోని నేషనల్ సింగ్ హువా యూనివర్సిటీలో, తైవాన్‌లోని నేషనల్ తైవాన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. అంతకుముందు ఇరాన్-యుఎస్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో పనిచేసిన అనుభవం ఉంది. హార్వర్డ్‌తో సహా అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన దేశాయ్ కాలిఫోర్నియా లా రివ్యూ’కి చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మరికొన్ని సంస్థల్లోనూ కీలక పదవులు నిర్వహిస్తున్నారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...