Saturday, January 28, 2012

మేమిద్దరం టి.డి.పి. తోనే...

ఒంగోలు, జనవరి 28:  జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని  ఆయన తండ్రి, టి.డి.పి. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికష్ణ స్పష్టం చేసారు. తాను తెలుగుదేశం పార్టీని వదిలివెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.  టీడీపీని వదిలే ప్రసక్తే లేదని, తన ఒంటిలో ఉన్నది ఎన్టీఆర్ రక్తమని, తమ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీలోనే కొనసాగుతారని హరికృష్ణ స్పష్టం చేశారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసాన్ని ఆయన ఖండించారు. సుస్థిర పాలన అందించేది ఒక్క టీడీపీయేనని, వచ్చే ఎన్నికలలో లో తెలుగుదేశం పార్టీ విజయంసాధిస్తుందని హరికృష్ణ అన్నారు.పార్టీలో తాను, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ క్రీయాశీలంగానే ఉన్నామని  తాము క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఆరోపించే వారు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తాము క్రియాశీలంగా లేమనడం సరికాదని, పార్టీ కన్నా తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు.

మణిపూర్ శాసనసభ ఎన్నికలలో హింస: ఇద్దరి మృతి

ఇంఫాల్, జనవరి 28: శనివారం జరిగిన మణిపూర్ శాసనసభ ఎన్నికలలో హింస చోటు చేసుకుంది. చందేల్ పోలింగ్ కేంద్రంపై తీవ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నించారు. సిఆర్ పిఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. జవాన్లుకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక జవాన్, ఒక మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. కాగా, ఈ ఎన్నికలలో 82 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 60 స్థానాలకు జరిగిన ఎన్నికలలో 279 మంది పోటీ పడ్డారు.

ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత విక్టోరియా అజరెంకా

మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ని విక్టోరియా అజరెంకా గెలుచుకుంది. ఫైనల్స్ లో మారియా షరపోవాపై 6-3, 6-0 తేడాతో అజరెంకా విజయం సాధించింది. అజరెంకా తొలిసారిగా ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలుచుకుంది. ఈ బెలారస్ క్రీడాకారిణి టెన్నిస్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానానికి దూసుకువెళ్లింది. కాగా,  ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విజేతగా లియాండర్ పేస్ జోడీ నిలిచింది. నెంబర్ వన్ సీడ్   బ్రయాన్ బ్రదర్స్ పై 7-6, 6-2 తేడాతో పేస్-జపానెక్ జా విజయం సాధించారు.  లియాండర్ పేస్ ఖాతాలో ఇది 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్. పేస్ 7 డబుల్స్, 6 మిక్స్ డ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు. 

స్పల్పంగా పక్కకు ఒరిగిన తాజ్‌మహల్‌ మినార్‌

న్యూఢిల్లీ,జనవరి 28:  ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ నాలుగు మినార్‌లలో ఒకటి స్పల్పంగా పక్కకు ఒరిగింది. నైరుతి దిక్కున ఉన్న ఈ మినార్ తాజ్‌మహల్ నిర్మాణం జరిగినప్పటి నుంచి నిలకడగా ఉన్నప్పటికీ మూడు దశాబ్దాల కాలంలో 3.57 సెంటీ మీటర్ల మేరకు పక్కకు ఒరిగింది. నాలుగు మినార్‌ల ఎత్తులో మాత్రం తేడా ఏర్పడలేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్‌ఐ ఈ వివరాలను సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాజ్‌మహల్‌కు పర్యావరణ కాలుష్యం వల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయంపై స్పందించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏఎస్‌ఐ తమ నివేదికను సమర్పించింది.

సిరీస్ అసీస్ స్వాహా...

అడిలైడ్,జనవరి 28:  అడిలైడ్‌ టెస్ట్‌లో ఇండియా 298 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.  నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. విదేశాల్లో వరుసగా రెండు సిరీస్‌లను 4-0 తేడాతో ఇండియా ఓడిపోయింది. గత ఏడాది జూలై, ఆగస్టుల్లో ఇంగ్లండ్‌లో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో ఓడిన టీమిండియా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో అదే మార్జిన్‌తో ఓటమి పాలైంది. ఈ వరుస ఓటముల నేపథ్యంలో గత ఏడాది నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో వున్న టీమిండియా తాజాగా, మూడో ర్యాంక్‌కు దిగజారింది. ప్రపంచ ర్యాంకుల్లో నంబర్‌ వన్‌ స్థానంలో వున్న భారత్ జట్టు విదేశీ గడ్డపై వరుస ఓటముల పాలవడం ఇదే ప్రథమం. కాగా, ఈ ఓటమికి ఎవరూ కుంగిపోయి రిటైరవ్వాల్సిన అవసరం లేదని ఇంఛార్జి కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు.  కొన్నేళ్లుగా ఇండియా బ్యాటింగ్‌ బ్రహ్మాండంగా వుందని, ఈ రెండు టూర్లలో బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారని చెప్పాడు.  

Friday, January 27, 2012

పుంజుకుంటున్న రూపాయి

ముంబయి,జనవరి 27: రిజర్వ్‌ బ్యాంకు తీసుకున్న చర్యలు, దేశంలోకి విదేశీ మదుపుదారులు డాలర్లు తీసుకురావడంతో రూపాయి క్రమంగా  బలపడుతోంది. నవంబరు 9 తర్వాత మళ్లీ 49 రూపాయల 60 పైసల స్థాయికి రూపాయి బలపడింది.  మార్చి నాటికి 46కు వస్తుందని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా రూపాయి బలానికి కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే యూరో బలపడటం... స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఇండియన్‌ కరెన్సీవిలువ పెరుగుతోంది. 

టీమిండియా 166/6

అడిలైడ్,జనవరి 27:  అడిలైడ్ లో జరుగుతున్న ఆఖరి టెస్ట్ లో  విజయం కోసం 500 పరుగులు చేయాల్సివున్న  టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు  ఆరు వికెట్లు నష్టపోయింది‌.  సెహ్వాగ్‌ ఒక్కడే రాణించి 62 పరుగులు సాధించగా లక్ష్మణ్‌ 33 పరుగులు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ లియాన్‌ మూడు, పేస్‌ బౌలర్‌ హారిస్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. 

Thursday, January 26, 2012

ఢిల్లీ రాజ్ పథ్ లో రిపబ్లిక్ డే సంరంభం...  

రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన థాయ్ లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినావత్రా తో రాష్త్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్...

భారత్ 272 ఆలౌట్, ఆసీస్ 50/3

అడిలైడ్,జనవరి 26:  ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 272 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో అత్యధికంగా విరాట్ కోహ్లీ 116 పరుగులు చేయగా , సాహా 35, గంభీర్ 34, సచిన్ 25 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో సిడిల్ 5 వికెట్లు, హిల్‌ఫెనాస్ 3, హారిస్, లియాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా  మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. పాంటింగ్ 1, క్లార్క్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. వార్నర్ 28, కోవాన్ 10, మార్ష్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు. అశ్విన్ 2, జహీర్ 1 వికెట్  తీసుకున్నారు.  ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ ను  7 వికెట్ల నష్టానికి 604 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ 382 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది.

Wednesday, January 25, 2012

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సిక్కు తలపాగాతో రాహుల్ గాంధి  

వార్తాప్రపంచం వీక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు... 

ఇస్రో మాజీ చీఫ్ జి. మాధవన్ నాయర్‌పై వేటు

న్యూఢిల్లీ,జనవరి 25:    వివాదాస్పదమైన యాంత్రిక్స్ - దేవాస్ డీల్‌లో ఇస్రో మాజీ చీఫ్ జి. మాధవన్ నాయర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. మాధవన్ నాయర్‌తో పాటు మరో ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను ప్రభుత్వ పదవులకు అనర్హులుగా ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇస్రో ఎస్ బాండ్ స్పెక్ట్రమ్‌ను ప్రైవేట్ కంపెనీకి కేటాయించిందనే ఆరోపణలపై ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. నాయర్‌తో పాటు ఇస్రో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ కె. భాస్కర నారాయణ, యాంత్రిక్స్ కమర్షియల్ ఆర్మ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఆర్ సిద్ధమూర్తి, ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్ కెఎన్ శంకరలపై ప్రభుత్వం వేటు వేసింది. మాధవన్ నాయర్ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవాస్‌తో కాంట్రాక్టు కుదిరింది. చంద్రయాన్ 1 ప్రాజెక్టు వెనక మాధవన్ నాయర్ ప్రతిభ ఉంది. దేవాస్ డీల్‌పై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మాధవన్ నాయర్‌పై చర్యలు తీసుకుంది. యాంత్రిక్స్, దేవాస్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ జరపడానికి ప్రధాని మే 31వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషన్ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. కాగా ఇస్రో ప్రస్తుత చైర్మన్ రాధాకృష్ణన్ తనను ఈ వ్యవహారంలో ఇరికించారని, డీల్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని మాధవన్ నాయర్ అంటున్నారు.

ఈ యేడాది 109 'పద్మ' అవార్డులు

న్యూఢిల్లీ,జనవరి 25:   కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 'పద్మ' అవార్డులను ప్రకటించింది. అయిదు పద్మ విభూషణ, 27 పద్మ భూషణ, 77 పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.  అవార్డులు పొందిన వారిలో 19 మంది మహిళలున్నారు. పద్మ విభూషణ్ అందుకున్నవారిలో కెజి సుబ్రమణ్యం, శ్రీ మారియో డి మరాండా, వోకల్‌ ఆర్టిస్ట్ భూపెణ్‌ హజారికా, డాక్టర్‌ కాంతిలాల్‌ హస్తిమల్‌, టీవీ రాజేశ్వర్ ఉన్నారు.  పద్మభూషణ్ అందుకున్నవారిలో సినీతారలు షబానా అజ్మీ, ధర్మేంద్ర, మీరా నాయర్‌ ఉన్నారు. పద్మశ్రీ అందుకున్నవారిలో మన రాష్ట్రం నుంచి ముణిరత్నం (సామాజిక సేవ), సయ్యద్‌ మహ్మాద్‌ ఆరీఫ్‌ (బ్యాడ్మింటన్ కోచ్) ఉన్నారు. కాగా ఈ ఏడాదికి భారత రత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించలేదు.

అడిలైడ్‌ టెస్ట్ లో టీమిండియా ఎదురీత

అడిలైడ్,జనవరి 25:    అడిలైడ్‌ టెస్ట్ లో  టీమిండియా ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను  7 వికెట్లకు 604 పరుగుల దగ్గర డిక్లేర్‌ చేయడంతో  ఆసీస్‌ భారీ స్కోరుకు సమాధానం చెప్పలేక భారత్ బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. సచిన్‌ 12, గంభీర్‌ 30 పరుగులతో  క్రీజులో ఉన్నారు. సెహ్వాగ్‌ 18, ద్రవిడ్‌ ఒక పరుగు తో  ఔటయ్యారు.  అంతకు ముందు క్లార్క్‌, పాంటింగ్ డబుల్‌ సెంచరీలతో  ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 604 పరుగుల దగ్గర డిక్లేర్‌ చేసింది. 

Tuesday, January 24, 2012

చిరు-బాలయ్య అభిమానుల మధ్య చిచ్చు

హైదరాబాద్,జనవరి 24:   చిరంజీవి,  బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం వారి  అభిమానుల మధ్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కాంగ్రెసు నాయకులు చిరంజీవిని సమర్థిస్తూ బాలయ్యను దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగుదేశం నాయకులు బాలయ్యను సమర్థిస్తూ చిరంజీవిని విమర్శిస్తున్నారు. మరోవైపు   సినీ ప్రపంచంలో అగ్ర హీరోలు కావడంతో  వారి అభిమానులు కూడా రెండుగా చీలిపోయి ఘర్షణకు దిగే వాతావరణం ఏర్పడింది. నెల్లూరు, తిరుపతిల్లో ఈ  హీరోల అబిమానులు రెండుగా చీలిపోయి, రోడ్ల మీదికి వచ్చి ఘర్షణ పడ్డారు. చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అభిమానులు నెల్లూరులోని శ్రీ వివేకానంద సెంటర్‌లో బాలకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు బాలయ్య అభిమానులు, అటు చిరంజీవి అభిమానులు పోటా పోటీగా నినాదాలు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. పరిస్థితులు అదుపులో ఉంచేందుకు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. తిరుపతిలో కూడా చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య  ఘర్షణ తో  ఉద్రిక్తత నెలకొంది.  నాలుగు కాళ్ల మండపం వద్ద బాలయ్య అబిమానులు, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పక్షాలు పరస్పరం దాడులకు దిగాయి. ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. 

రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు

హైదరాబాద్,జనవరి 24:  రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు.వీరిలో 2,78, 48,792 మంది పురుష ఓటర్లు, 2,79,14,616 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డులలో తొలి స్థానం ఆంధ్రప్రదేశ్ దేనని చెప్పారు. 40 లక్షల నకిలీ ఓటరు కార్డులు తొలగించినట్లు తెలిపారు. 20 మంది హిజ్రాలకు కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఎపి ఆన్ లైన్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తామన్నారు. బుధవారం  జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 33 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు.  

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సునీల్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్,జనవరి 24:  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బంధువు, జగన్ సన్నిహితుడు  సునీల్ రెడ్డిని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో  అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు. సునీల్ రెడ్డిని వెంట తీసుకువెళ్లి పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. 120 బి. 409, 420,477 సెక్షన్ల కింద ఆయన పై కేసులు నమోదు చేశారు.  అరెస్ట్ విషయాన్ని సునీల్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలిపారు.స్టైలిష్ హోమ్స్ రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు  సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. విల్లాలను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ జగన్‌కు అందించడంలో లేదా జగన్ సంస్థల్లోకి మళ్లించడంలో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు.

ఆఖరి టెస్ట్ లోనూ అదే వరస...!

అడిలైడ్,జనవరి 24:  నాలుగు టెస్టుల సిరీస్ ను 3-0 తో గెలిచిన అసీస్ నాల్గవ, ఆఖరి టెస్ట్ లో కూడా భారత్ జట్టు ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.   అడిలైడ్‌లో మంగళవారం మొదలైన  నాల్గవ టెస్టులో ఆస్టేలియా -మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ప్రస్తుత కెప్టెన్ మైఖెల్ క్లార్క్ వీరోచిత బ్యాటింగ్‌తో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి  3 వికెట్లను కోల్పోయి 335 పరుగులు చేసింది. మొదటి టెస్టులో మాదిరే రికీ పాంటింగ్, మైఖెల్ క్లార్క్ ఇద్దరూ కూడా సెంచరీని నమోదు చేశారు. 84 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను రికీ పాంటింగ్ 137, మైఖెల్ క్లార్క్ 140 పరుగులతో ఆదుకున్నారు.  రికీ పాంటింగ్ 137 పరుగులు చేయడంతో 13, 000 పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అటు క్లార్క్ కూడా కెరీర్‌లో 19వ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో అతనికిది రెండో సెంచరీ.

Monday, January 23, 2012

బాలయ్య వర్సెస్ చిరు +లక్ష్మీపార్వతి


హైదరాబాద్,జనవరి 23:    చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, దానిని  తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు. దీనికి ప్రతిగా  బాలయ్య విశాఖలో స్పందించారు. ఒకరు తనను బాలుడు అన్నారని, అలాంటివారు తనను ఓవైపే చూశారని, రెండోవైపు చూడలేదన్నారు. తన మరోరూపం చూపిస్తానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.సి. ఎం. కావాలని కొందరు కలలు కంటున్నారని,  అలాంటివారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సాటిరారని బాలకృష్ణ పరోక్షంగా చిరును విమర్శించారు. పార్టీని అమ్మకున్నవాళ్లా నన్ను విమర్శించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
నీవు ఎన్టీఆర్‌కు పుట్టిన కొడుకువేనా? 

మరోవైపు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి కూడా బాలయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ''నీ తండ్రి చావుకు కారణమైన చంద్రబాబుకు మద్దతివ్వాలా? నీకు రోషం, పౌరుషం లేవా? నీవు ఎన్టీఆర్‌కు పుట్టిన కొడుకువేనా? ఎన్టీఆర్‌కు ఇటువంటి సంతానం కలగడం చాలా బాధగా ఉంది’’ అని బాలకృష్ణను ఉద్దేశించి  లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. చిరంజీవి అన్నట్లు బాలకృష్ణది చిన్నపిల్లవాడి మన:స్తతత్వం అన్నారు. బాలకృష్ణకు రాజకీయ అవగాహనలేదని చెప్పారు. ప్రజల్లో విశ్వసనీయతలేని చంద్రబాబు అధికార కోసం నందమూరి వంశాన్ని కరివేపాకులా ఉపయోగించుకుంటున్నారని  పేర్కొన్నారు. ఇన్తకుముందు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను ఇదే మాదిరిగా ఉపయోగించుకున్నారని,  పదవి కోసం సొంత మనుషులను తాకట్టు పెట్టే నీచమైన సంస్కృతి చంద్రబాబుదని, పదవి వ్యామోహంతో బాలకృష్ణను తన వైపు తిప్పుకొనేందుకే కొడుకు లోకేష్‌కు బాలకృష్ణ కూతురితో పెళ్లి జరిపించారని  లక్ష్మిపార్వతి దుయ్యబట్టారు.

అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంతో అట్టుడికిన అమలాపురం...

అమలాపురం,జనవరి 23:   తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాల ధ్వంసంతో  అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఈ చర్యను నిరసిస్తూ స్థానిక దళిత నేతలు ఆందోళనకు దిగారు. అమలాపురం వచ్చే ప్రధాన మార్గాలను దిగ్బంధించి నిరసన తెలిపారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై  రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక అధికారిగా రామచంద్రాపురం డిఎస్ పిని నియమించారు. ఈ ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్ . పి త్రివిక్రమవర్మతో హోం  మంత్రి సబిత చర్చలు జరిపారు. బాధ్యులను గుర్తించేందుకు బృందాలను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. మరోవైపు అమలాపురంలో వారం రోజులపాటు 144 సెక్షన్ విధించారు. 

పరిటాల రవి కుమారుని అరంగేట్రం పై ఇంకా సస్పెన్స్

అనంతపురం,జనవరి 23:   తెలుగుదేశం దివంగత నేత   పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్  రాజకీయాలలోకి వస్తాడని జరుగున్న ప్రచారానికి పరిటాల రవి సతీమణి, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత తెర దించారు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని  సునీత చెప్పారు.  రాజకీయాల్లోకి ప్రవేశించడానికి శ్రీరామ్‌కు ఇంకా సమయం రాలేదని ఆమె అన్నారు. శ్రీరామ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని, చదువును పూర్తి చేయాల్సి ఉందని ఆమె అన్నారు. శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై కుటుంబ సభ్యులంతా  చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.పరిటాల రవి సేవా ట్రస్టు కార్యక్రమాల్లో శ్రీరామ్ ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నాడని, తమ కుటుంబం మొదటి నుంచి పేదల పక్షాన ఉందని, అందులో భాగంగానే శ్రీరామ్ తమ ఇంటికి వచ్చేవారిని కలుసుకుంటున్నాడని ఆమె చెప్పారు.   

స్వాతంత్ర్య సమరయోధుడు ఎంఎస్ రాజలింగం మృతి

హైదరాబాద్,జనవరి 23:  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఎంఎస్ రాజలింగం సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటు తో మృతి చెందారు. రాజలింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఆయన వయస్సు తొంబై మూడేళ్లు. గాంధీ భవన్  ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా  ఉన్న  రాజలింగం 1919లో వరంగల్ జిల్లాలో జన్మించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావు మంత్రివర్గంలో పని చేశారు. 1964లో న్యాయవాద వృత్తి స్వీకరించారు. ఇటీవల డిసెంబర్ 28న కాంగ్రెసు ఆవిర్భావ వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనను  సత్కరించారు.

రాహుల్ గాంధీ పై బూటు విసిరిన యువకుడు...

డెహ్రాడూన్,జనవరి 23:  కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పైకి ఓ యువకుడు సోమవారం బూటు విసిరాడు. డెహ్రాడూన్‌లో ర్యాలీలో పాల్గొన్న రాహుల్ పైకి ఓ యువకుడు షూ విసిరిన ఈ సంఘటన కలకలం రేపింది. ఆ యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ  ఈ ఘటన తనపై ఏ విధమైన ప్రభావం చూపబోదని  అన్నారు. బిజెపి బలంగా ఉన్న ఉత్తరాఖండ్‌లో  శానససభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొంటున్నారు. డెహ్రూడూన్‌లోని వికాస్‌నగర్‌లో ప్రచారం చేస్తుండగా ఈ  ఘటన జరిగింది. 

Saturday, January 21, 2012

ఇక సులభంగా యు.ఎస్. వీసాలు ...

న్యూఢిల్లీ,జనవరి 22:  అమెరికాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు   భారత్, చైనా దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా మంజూరు ప్రక్రియను వేగవంతంతో పాటు సరళతరం చేసేందుకు  అధ్యక్షుడు బరాక్ ఒబామా సమాయత్తమయ్యారు. 2011లో రికార్డు స్థాయిలో 68 వేల హెచ్1బీ వీసాలు ప్రక్రియను ఇప్పటికే కౌన్సిలర్ బృందం పూర్తి చేసిందని కౌన్సిలర్ ఎఫైర్స్ మినిస్టర్ జేమ్స్ హెర్మన్ తెలిపారు. 2011లో దేశ వ్యాప్తంగా దాదాపు 7 లక్షల వీసా అప్లికేషన్‌లు తమ కార్యాలయానికి వచ్చాయని ఆయన చెప్పారు. భారత్‌లో ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్, ముంబై దౌత్య కార్యాలయాలల్లో సిబ్బంది సంఖ్యను గత అయిదేళ్లతో పొలిస్తే గణనీయంగా పెంచినట్లు  ఆయన తెలిపారు. 

‘ద వాల్ స్ట్రీట్’ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్‌గా ప్రవాసాంధ్రుడు

న్యూయార్క్,జనవరి 22:  ‘ద వాల్ స్ట్రీట్’ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్‌గా ప్రవాసాంధ్రుడు రాజు నారిశెట్టి  నియమితులయ్యారు. ఆ పత్రిక డిజిటల్ ప్రచురణలజర్మన్, జపనీస్, చైనా ఎడిషన్లకు  ఆయన ఇన్‌చార్జి గా వ్యవహరిస్తారు. రాజు ప్రస్తుతం ‘ద వాషింగ్టన్ పోస్ట్’కు మేనేజింగ్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 1994లో మొదటిసారిగా ఈ పత్రికకు లో పిట్స్బర్గ్  విలేకరిగా పనిచేసిన ఆయన 2006లో యూరప్ విభాగానికి ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. గతంలో భారత్‌లో మింట్ న్యూస్ పేపరుకు రాజు నారిశెట్టి స్థాపక ఎడిటర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ అందుకున్న రాజు నారిశెట్టి గుజరాత్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ నుండి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు.

సమన్వయ భేటీ లో అజాద్ అసహనం...!

హైదరాబాద్,జనవరి 22: కాంగ్రెస్ లో ముఠాపోరును సహించేదిలేదని  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్  పార్టీ నేతలను హెచ్చరించారు. 'ఇలాగైతే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు. ముఠాపోరును సహించేది లేదు. ప్రజల్లోకి వెళ్లకుండా సచివాలయంలోనే కూర్చుంటే ఎలా? పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది' అని పార్టీ నేతలకు  ఆజాద్‌ స్పష్టం చేశారు.  హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో  గులాంనబీ ఆజాద్‌-- పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. పార్టీ, ప్రభుత్వం దేనికదే అన్నట్లుంటే అధిష్టానం చూస్తూ ఊరుకోదని, మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయంలో కూర్చోకుండా జిల్లాల్లో పర్యటించాలని  హితవు పలికారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేకనే వివిధ ఎన్నికలను నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నామని,ఇలా ఎన్నాళ్లు వాయిదా వేస్తారని పార్టీనేతల్ని ఆజాద్‌ ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ, కాంగ్రెస్‌ పార్టీ పై పడుతున్న ప్రభావం, జగన్‌ను దృష్టిలో పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న యాత్రలు తదితర విషయాల్ని పార్టీ నేతలంతా ఆజాద్‌కు వివరించారు. అయితే అధికార పార్టీగా మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను ఆజాద్‌ ప్రశ్నించినట్లు సమాచారం. 

విద్యుత్ 'బాదుడు' నుంచి ఊరట

హైదరాబాద్, జనవరి 21:   వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఇంధన సర్దుబాటు చార్జీల భారం నుంచి వినియోగదారులకు ఊరటనిస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వినియోగదారుల నుంచి 2008-09 సంవత్సరానికి సంబంధించి రూ.1,649 కోట్ల సర్‌చార్జీలను వసూలు చేసుకునేందుకు  విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లకుఅనుమతినిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) 2010లో ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. సర్‌చార్జీ వసూలు ప్రతిపాదనలను డిస్కంలు నిర్ణీత కాల వ్యవధి ముగిసిన తరువాత సమర్పిస్తే.. ఆ ఆలస్యాన్ని మాఫీ చేస్తూ సర్‌చార్జీల వసూలుకు అనుమతినిచ్చే అధికారం ఈఆర్‌సీకి లేదని తేల్చి చెప్పింది. అలాగే ప్రతిపాదనల సమర్పణ కాలవ్యవధిని పెంచే అధికారం కూడా ఈఆర్‌సీకి ఎంత మాత్రం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 2008-09 కి సమర్పించిన ప్రతిపాదనలు చెల్లుబాటుకావని, అవి కాలపరిమితి దాటిన ప్రతిపాదనలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి.లోకూర్, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకొకసారి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాలి. కానీ వెయ్యిరోజులు, ఐదు వందల రోజుల అసాధారణ జాప్యంతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నాయి. ఇదే విధంగా 2008-09 సంవత్సరానికి గృహ వినియోగదారులు, పరిశ్రమలు, వాణిజ్య వర్గాల నుంచి రూ.1649 కోట్ల సర్‌చార్జీ వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతినిస్తూ ఈఆర్‌సీ 2010 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు కంపెనీలు, రైస్ మిల్లర్లు, తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రతిపాదనలు సరైన పద్ధతిలోలేవని, బహిరంగ విచారణ అనంతరం మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంటూ తీర్పునిచ్చారు. నిర్ణీతకాల వ్యవధిలోపు డిస్కంలు ప్రతిపాదనలను సమర్పించలేని పక్షంలో.. కాల వ్యవధిని పెంచే అధికారం ఈఆర్‌సీకి ఉందని పేర్కొన్నారు. దీనిని సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ముందు వేర్వేరుగా 153 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

విదేశాంగ మంత్రి ఎస్‌. ఎం కృష్ణ కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురు

బెంగళూరు,జనవరి 21:  అక్రమ మైనింగ్ కేసులో విదేశాంగ మంత్రి ఎస్‌. ఎం కృష్ణ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిలకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తమకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని, దర్యాప్తు కోసం లోకాయుక్త ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని వారు చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు  తోసిపుచ్చింది. కృష్ణ 2003 లో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విలువైన ఖనిజాలున్న ప్రాంతంలోని అటవీ భూములను డీరిజర్వ్ చేశారని వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త దర్యాప్తు కొనసాగుతుందని జస్టిస్ ఎన్ ఆనంద తన ఉత్తర్వుల్లో ప్రకటించారు. కుమారస్వామిపై కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దీంతో లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేసేందుకు మార్గం సుగమమైంది. 

Tuesday, January 17, 2012


భర్తతో కలసి హ్యారిసన్ నుంచి న్యూయార్క్ ఆస్పత్రికి వెడుతూ  రైల్లోనే ప్రసవించిన భారతీయ  సంతతి మహిళ...  


ఉత్తరాఖండ్  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధి  

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచారంలో ప్రియాంకా గాంధి  

చలి వేస్తోంది...చంపెస్తోంది...

హైదరాబాద్,జనవరి 17:  రాష్ట్రం లో  చలి తీవ్రత పెరిగింది. మూడు రోజులుగా చలికి తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15  మంది మృతి చెందారు. గుంటూరులో ఆరుగురు, శ్రీకాకుళం, కరీంనగర్‌లో నలుగురు, నల్గొండలో ఇద్దరు చనిపోయారు. మంగళవారం విజయనగరం జిల్లాలో ఒక వృద్ధుడు, శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ మహిళ మృతి చెందారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మూడు రోజులుగా సున్నా, అంతకంటే తక్కువ డిగ్రీల ఊష్ణోగ్రతలే నమోదవుతున్నాయి.  శ్రీకాకుళం, గుంటూరు, అదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మెదక్, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతున్నాయి.  అటు ఉత్తరాదిన కూడా చలిగాలుల తీవ్రత  కొనసాగుతోంది.

Sunday, January 15, 2012

తెలంగాణా తేలాల్సింది రాష్ట్రంలోనే: లగడపాటి

విజయవాడ,జనవరి 15: ప్రత్యేక తెలంగాణ అంశం ఇప్పుడే కాదు.. ఎప్పటికీ తేలదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ముందు ఎటువంటి పరిష్కారం లేదన్నారు. ఈ సమస్యకు రాష్ట్రంలోనే పరిష్కార మార్గం కనుగొనాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తీర్మానం ప్రతిని కేంద్రానికి పంపితేనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా, ఈ తీర్మానం చేసినప్పటికీ తెలంగాణ ఏర్పాటవుతుందని చెప్పలేమన్నారు. అసెంబ్లీలో తీర్మానం అనేది రాష్ట్ర ఏర్పాటుకు మొదటి మెట్టు వంటిదన్నారు. ఆ తర్వాత అన్ని అంశాలపై అధ్యయనం చేసి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.  

మరో సారి ఇన్నింగ్స్ ఓటమి: సిరీస్ అసీస్ కైవశం

పెర్త్,జనవరి 15: భారత్ మరో సారి ఇన్నింగ్స్ ఓటమి మూట గట్టుకుంది.  పెర్త్ లో జరిగిన మూడో టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 37 పరుగుల తేడాతో  అసీస్ చేతిలో ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో 208 పరుగులు వెనకబడిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 171 పరుగులకె ఆల్ అవుట్ అయింది.  దీనితో నాలుగు టెస్ట్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా 3-0 తో కైవశం చేసుకుంది. నాల్గవ, ఆఖరి టెస్ట్ ఈ నెల 24న  అడిలాయి డ్ లో మొదలవుతుంది.    

Friday, January 13, 2012

'వార్తాప్రపంచం'  వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు...

భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి 6,47,832 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్, జనవరి 13: తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మూడు రోజుల సదస్సులో మొత్తం 243 ఒప్పందాల ద్వారా 6,47,832 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వాటిద్వారా మొత్తం 6,78,592 మందికి ఉపాధి లభించనుంది’’ అని వివరించారు. శుక్రవారం సదస్సు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొత్తం పెట్టుబడుల్లో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే రూ.1.75 లక్షల కోట్లు వస్తున్నాయని వివరించారు. ఒక్క విశాఖ స్టీలు ప్లాంటే రూ.42,500 కోట్లతో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిందని చెప్పారు. అందుకవసరమైన గనులను కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ''40 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. ఇందులో ఒప్పందాలు కుదిరిన భారీ ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించేందుకు ఎస్కార్ట్ అధికారులను నియమించనున్నాం. పరిశ్రమల అవసరాలను వారు ఎప్పటికప్పుడు తెలుసుకుని తీరుస్తారు. ప్రాజెక్టుల అమలును నెలకోసారి స్వయంగా సమీక్షిస్తాను. పరిశ్రమలకు ఆన్‌లైన్ ద్వారా అనుమతులు మంజూరు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా మరో మూడు నెలల్లో రాష్ట్రంలో జీ టు బీ (గవర్నమెంట్ టు బిజినెస్) పోర్టల్‌ను కేంద్రం ప్రారంభించనుంది. ఇకనుంచి పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులూ ఆన్‌లైన్ ద్వారానే లభిస్తాయి. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. పరిశ్రమలకు కరెంటు కొరత లేదు. జల, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గడం, సాంకేతిక సమస్యలతో కొన్ని ప్లాంట్లు మూతపడటం వల్ల గతంలో కోత విధించాల్సి వచ్చింది. కేస్-1 బిడ్డింగ్ ద్వారా 2,000 మెగావాట్లు కొనుగోలు చేస్తున్నందున వాటికి కొరత తీరనుంది. ఈ సదస్సులోనే ఏకంగా 54 వేల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం.  రూ.40 వేల కోట్లతో 6,400 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్ల స్థాపనకు జీవీకే గ్రూపుతో ఒప్పందం కుదిరింది. జీవీకే, ఎన్టీపీసీ, జెన్‌కో, సింగరేణి వంటివాటితో మొత్తం రూ.2 లక్షల కోట్లతో విద్యుత్కేంద్రాల స్థాపనకు ప్రభుత్వానికి ఒప్పందాలు కుదిరాయి. ప్రైవేట్ ప్లాంట్ల నుంచి 25 శాతం విద్యుత్ పొందేందుకు కృషి చేస్తున్నాం. అనుబంధ పరిశ్రమలు లేనందుకే రాష్ట్రంలో ఆటో పరిశ్రమలు రావడం లేదు. త్వరలో వస్తాయి. మహీంద్రా ట్రాక్టర్ల యూనిట్ ఇప్పటికే వచ్చింది.కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలకు భూ సేకరణ సమస్య కాబోదు. కొత్తగా రూపొందిస్తున్న విధానం మేరకే కేటాయింపులుంటాయి. పైగా అన్ని పరిశ్రమలకూ భూమి అవసరముండదు. అవసరమైన వాటికి ప్రభుత్వమే సేకరించి ఇస్తుంది. కొత్త విధానం మేరకు ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది. పనులు ప్రారంభించని పరిశ్రమల నుంచి సంబంధిత శాఖలు భూమిని వెనక్కి తీసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాన్యుఫాక్చరింగ్ పెట్టుబడి ప్రాంతానికి రాష్ట్రంలో 25 వేల హెక్టార్ల భూమి అవసరం అవుతుంది. అందుకు ఐదారు ప్రాంతాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’’  అని ముఖ్యమత్రి వివరించారు.      

గూగుల్, ఫేస్‌బుక్ సహా సామాజిక వెబ్‌సైట్లపై చర్యలు

న్యూఢిల్లీ,జనవరి 13:  సమాజంలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం, అభ్యంతరకర, అశ్లీల సమాచారాన్ని పొందుపర్చడం తదితర అభియోగాలపై సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లు గూగుల్, ఫేస్‌బుక్ సహా 19 వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలకు కేంద్రం ఆమొదం తెలిపింది. విద్వేషాలను రగల్చటం, దేశ సమైక్యతకు భంగం కలిగించడం, అభ్యంతరక సమాచారాన్ని పొందుపర్చడం వంటి అభియోగాల్ని ఆయా సైట్లపై మోపారు. యాహూ, మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర సంస్థలపై చర్యలు తీసుకునేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కేంద్రం  ఢిల్లీ న్యాయస్థానానికి తెలిపింది. రికార్డులను వ్యక్తిగతంగా పరిశీలించిన తరువాత ఆయా వెబ్‌సైట్లపై చర్యలు తీసుకునేందుకు తగిన ఆధారాలున్నట్లు అనుమతుల విభాగం సంతృప్తి చెందినట్లు వెల్లడించింది. వెబ్‌సైట్లపై ఐపీసీ సెక్షన్లు 153-ఎ, 153-బి, 295-ఎ కింద కేసులు నమోదుకు సూచించినట్లు తెలిపింది. ఈమేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధీష్‌కుమార్‌కు రెండు పేజీల నివేదిక అందచేసింది. 

Wednesday, January 11, 2012

విక్టరీ దర్శకుడు వి. మధుసూదనరావు మృతి

హైదరాబాద్, జనవరి 12 : విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకుని.. ఎంతోమంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శక నిర్మాత వీరమాచనేని మధుసూదనరావు (88) బుధవారం కన్నుమూశారు. దాదాపు పదేళ్ల నుంచి అనారోగ్యంతో దర్శకత్వానికి దూరమైన ఆయన.. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. 1923లో కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో  జన్మించిన మధుసూదనరావు.. ప్రముఖ దర్శకుడు కేఎస్ ప్రకాశరావు వద్ద శిష్యరికం చేసి, 1959లో తొలిసారిగా సతీ తులసి చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత ఆరాధన, గుడిగంటలు, రక్తసంబంధం, జమీందారు, అదృష్టవంతులు, ప్రజానాయకుడు, భక్తతుకారాం, ఇద్దరూఇద్దరే, జేబుదొంగ, ఈ తరం మనిషి లాంటి అనేక హిట్ సినిమాలను తెలుగు తెరకు అందించారు.  తెలుగులో మొత్తం 72 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 60 సూపర్ హిట్లే.  అక్కినేని నాగార్జున, జగపతి బాబు, రమేష్‌బాబు లాంటి వారితో పాటు ఎంతోమందిని తెలుగు సినీ ప్రపంచానికి హీరోలుగా పరిచయం చేసింది  విక్టరీ మధుసూదనరావే. హిందీలో మూడు, కన్నడంలో రెండు సినిమాల కు దర్శకత్వం వహించిన మధుసూదనరావుకు 1997లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది. 1982లో ఆయన నంది అవార్డుల కమిటీలో సభ్యుడుగా పనిచేశారు. 1983 జనవరి 26న హైదరాబాద్‌లో సినీ రంగంలోని వివిధ విభాగాలలో శిక్షణ ఇచ్చేందుకు మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో ఎంతోమంది ప్రముఖ దర్శకులుగా, హీరోలుగా ఎదిగారు. ఈయనవద్ద పనిచేసిన 57 మంది అసిస్టెంట్ డైరెక్టర్లలో చాలామంది తర్వాతి కాలంలో ప్రముఖ దర్శకులుగా ఎదిగారు. వీరిలో చంద్రశేఖర్ రెడ్డి, రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి, రాంచందర్‌రావు, కేఎస్ రెడ్డి, మురారి తదితరులున్నారు.

Tuesday, January 10, 2012

అధ్యక్ష ఎన్నికల బరిలో లేనన్న జిందాల్

లూసియానా గవర్నర్‌గా రెండో పర్యాయం బాధ్యతలు చెపట్టిన జిందాల్ 
హూస్టన్ ,జనవరి 11:  భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ (40) అమెరికాలోని లూసియానా గవర్నర్‌గా రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్యాథరీన్ కిటీ కింబాల్ ఆయన చేత  ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యా రంగంపై ప్రధానంగా దృష్టి పెడతానని ప్రమాణ స్వీకారం తర్వాత జిందాల్ పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను పూర్తిచేసే దాకా విశ్రమించబోనని అన్నారు. లూసియానా ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పారు. ఉద్యోగాలు పెంచాలని, ప్రభుత్వ విద్యారంగంలో సాధించాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గతేడాది అక్టోబర్ 22న లూసియానా గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జిందాల్ 50 శాతంపైగా ఓట్లతో విజయం సాధించారు. రాష్ర్ట ప్రజలు మరోమారు ఆయనకు పట్టం కట్టారు. గవర్నర్ పదవిని చేపట్టిన తొలి ఇండియన్ అమెరికన్‌గా ఖ్యాతికెక్కిన జిందాల్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు వచ్చాయి. అయితే  2012 అధ్యక్ష ఎన్నికల బరిలో తాను లేనని ఆయన స్పష్టం చేశారు.

టీనేజి లోనే డెత్తేజి చెప్పొచ్చుట...

వాషింగ్టన్,జనవరి 11:  మనిషి ఎంతకాలం జీవించగలుగుతాడన్న విషయాన్ని వారి  యుక్త వయసులోనే అంచనా వేయొచ్చని ఓ పరిశోధన ద్వారా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వెల్లడించారు.  మనిషి దేహ కణాల్లో నిచ్చెన రూపంలోని డీఎన్‌ఏ అనే జన్యు పదార్థంప్రోటీన్లతో నిర్మితమైన క్రోమోజోమ్‌లో భాగంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే క్రోమోజోమ్‌ల రెండు చివర్లా ఉండే అతిచిన్న ‘టీలోమర్’ నిర్మాణాల పొడవును బట్టి మనిషి ఆయుర్దాయాన్ని అంచనా వేయొచ్చంటున్నారు బ్రిటన్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో’ శాస్త్రవేత్తలు. పిచ్చుకల మాదిరిగా ఉండే 99 ‘జీబ్రా’ పిట్టలపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలిందన్నారు. అధ్యయనంలో భాగంగా తొలుత 25 రోజుల వయసులోని పిట్టల క్రోమోజోమ్‌ల చివర్లో ఉన్న టీలోమర్‌ల పొడవును వారు నమోదుచేశారు. తర్వాత ఏడాదికోసారి, ఆ తర్వాత ఏటా వివరాలు రికార్డుచేశారు. ఆ తర్వాత ఆకలి చావులు, ఇతర జంతువుల దాడి, ప్రమాదాలు, జబ్బుల కారణంగా మరణించినవాటిని మినహాయించి సహజంగా చనిపోయినవాటిని పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయని పరిశోధన బృందం సారథి హిడింగర్ తెలిపారు. యుక్తవయసులో టీలోమర్‌లు పొడవుగా ఉన్న పక్షులు ఎక్కువ కాలం అత్యధికంగా 8.7 ఏళ్ల వరకు జీవించాయని, తక్కువ పొడవు ఉన్న పిట్టలు త్వరగా చనిపోయాయన్నారు. అయితే యుక్తవసులో ఉన్నప్పటి టీలోమర్‌ల పొడవు మాత్రమే ఆయుర్దాయం పరిమాణంతో సరిపోలుతోందని, మనుషుల్లో కూడా ఇలాంటి పరిశోధన నిర్వహిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు.   ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే వుంది. ఎప్పుడు పోతామో తెలిస్తే టెన్షన్ తో గుండె ఆగి ఇంకా ముందే పోవచ్చు...! 

అట్లాంటాలో భారత కాన్సులేట్ కార్యాలయం

వాషింగ్టన్,జనవరి 11:  అమెరికాలోని అట్లాంటాలో భారత కాన్సులేట్ కార్యాలయం మంగళవారం ప్రారంభమైంది. దీంతో న్యూయార్క్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌లలో ఉన్న కాన్సులేట్ కార్యాలయాలతో కలిపి అమెరికాలో మొత్తం ఐదు కార్యాలయాలు భారతీయులకు సేవ లందిస్తున్నాయి. అట్లాంటాలోని ఈ నూతన కాన్సులేట్ ద్వారా  జార్జియా పరిధిలోని లక్ష మంది వరకూ భారతీయులు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఆగ్నేయ అమెరికాలో సుమారు 2 లక్షల 90 వేల మందికి ఈ కాన్సులేట్ ద్వారా ప్రయోజనం కలగనుంది. సీనియర్ భారత దౌత్యవేత్త అజిత్ కుమార్‌ను నూతన కాన్సులేట్‌కు మొదటి కాన్సుల్ జనరల్‌గా భారత్ నియమించింది. 

Friday, January 6, 2012

బాబు ' హోరు ' గల్లు యాత్ర...!

హైదరాబాద్ , జనవరి 6:   తెలంగాణలో ఉప ఎన్నికల ప్రచారానికి తానే నేరుగా వస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ని  లక్ష్యంగా చేసుకుని వరంగల్ జిల్లా లో  రైతు పోరు బాట యాత్ర జరిపిన చంద్రబాబు  ఇక తెరాస ఆటలు సాగవని హెచ్చరించారు. తెరాసకు విధివిధానాలు లేవని ఆయన అన్నారు. తెరాస కన్నా తమ పార్టీకే తెలంగాణలో పటిష్టమైన నాయకత్వం ఉందని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాల ప్రభావం వల్ల తన తెలంగాణ పర్యటనలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తానని ఆయన చెప్పారు. తెరాస కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని ఆయన అన్నారు. రైతు సంక్షేమం కోసం తాను వస్తున్నానని ఆయన అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. రైతులపై ప్రేమ ఉంటే వారు కూడా పోరాడాలని, వారు పోరాడకుండా పోరాడేవారిపై దాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక అలా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు వస్తుంటే తెలంగాణ అంటూ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినా అడ్డుకుంటే ఎలా అని ఆయన అడిగారు.
చంద్రబాబు నాయుడుపై కేసు
కాగా చంద్రబాబు యాత్ర సందర్భంగా అడుగడుగునా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు యాత్రను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవాలని చూడటం, వారిని టిడిపి ప్రతిఘటించడం, పోలీసులు లాఠీ చార్జీ చేయడం వంటి  పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టాలని వరంగల్ జిల్లా అడిషనల్ జ్యూడిషియల్ మెజిస్ట్రీట్ శుక్రవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.  పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, న్యాయవాదులు వేసిన పిటిషన్ పైన స్పందించిన కోర్టు చంద్రబాబు తో పాటు , తెలుగుదేశం సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్‌పై వారం రోజుల్లో కేసు నమోదు చేసి విచారణ జరపాలని హన్మకొండ పోలీసులను ఆదేశించింది. 

చంచల్ గూడ జైలుకు శ్రీలక్ష్మి

హైదరాబాద్ , జనవరి 6:  ఓఎంసి కేసులో  ఐఎస్ఎస్ అధికారి శ్రీలక్ష్మినాంపల్లి సిబిఐ కోర్టులో  లొంగిపోయారు.  ఆమెకి నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్ ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలనే సుప్రీం కోర్టు సమర్ధించడం తో  ఈ నెల 6వ తేదీ లోపల నాంపల్లి కోర్టులో లొంగిపోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఈరోజు లొంగిపోయారు. ఈ నెల 12 వరకు కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ఆమెని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణని కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదావేసింది.

ఇన్నింగ్స్ తేడాతో చాప చుట్టేసిన టీమిండియా

సిడ్నీ, జనవరి 6:  అనుకున్నట్లే సిడ్నీ టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్  తేడాతో చాప చుట్టేసింది.  అసీస్  టీమిండియాపై ఇన్నింగ్స్, 68 పరుగులతో  విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌పై గెలవడం ఆసీస్‌కు ఇది పదోసారి కాగా, ఒక్క సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లోనే ఇది మూడోసారి. తొలి ఇన్నింగ్స్ లో 468 పరుగులతో వెనుకబడి నాలుగో రోజు ఉదయం రెండు వికెట్లకు 114 పరుగులతో రెండో ఇన్నింగ్స్  ప్రారంభించిన భారత్‌, టీ బ్రేక్‌ తర్వాత కాసేపటికి 400 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్ 2-0తో సిరీస్ పై పట్టు బిగించింది .  

Tuesday, January 3, 2012

 గబ్బర్ సింగ్ గా వస్తున్న పవన్ కళ్యాన్...  

ఇక మొబైల్ ఫోన్ ద్వారా రైలు టికెట్‌

న్యూఢిల్లీ,జనవరి 4:  రైలు టికెట్లను ఇకమీదట మొబైల్ ఫోన్ ద్వారానే పొందవచ్చు.  పేరును రిజిస్టర్ చేసుకోవడంతోపాటు.. మొబైల్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉండి తగిన సాఫ్ట్ వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే  రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ-టికెట్‌ను బుక్ చేసుకునే ఈ సౌలభ్యాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ’(ఐఆర్‌సీటీసీ) ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా బుక్ చేసుకున్న తరువాత ప్రయాణికులకు పీఎన్‌ఆర్, రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఎక్కే తరగతి తోసహా పూర్తి వివరాలతో కూడిన రిజర్వేషన్ మెసేజ్ వస్తుంది. దీనితో  ప్రయాణికులు ఈ-టికెట్ ప్రింటవుట్‌ను ఇక తమతోపాటు తీసుకెళ్లనక్కర్లేకుండా ప్రయాణ సమయంలో మొబైల్‌  మెసేజ్‌ను చూపితే సరిపోతుంది.  ఈ విధంగా టికెట్ బుక్ చేసుకునేందుకు మొదటిసారి మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత నుంచి ఐడీ, పాస్‌వర్డ్  వినియోగించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ-టికెట్లకోసం వసూలు చేసే సర్వీస్ చార్జీని స్లీపర్ క్లాస్‌కు రూ.10, ఆపై తరగతికి రూ.20 చొప్పున వసూలు చేస్తారు. 

బ్యాంకు మారినా అదే అకౌంట్ నంబర్‌...

న్యూఢిల్లీ,జనవరి 4:  బ్యాంకు మారినా పాత అకౌంట్ నంబర్‌ను కొనసాగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొబైల్ నంబర్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాల్లోకి అమలులోకి వచ్చిన పోర్టబిలిటీ (మార్పిడి) సదుపాయం ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు కూడా విస్తరించనుంది. ఈ దిశగా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వీటిని పరిష్కరించి త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి డి.కె.మిట్టల్ తెలిపారు. 

తొలిరోజు పై చేయి అసీస్ దే ...

సిడ్నీ,జనవరి 3:  భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం మొదలైన  రెండవ టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో  మూడు వికెట్లు నష్టపోయి 116 పరుగులు చేసింది.  మూడి వికెట్లనూ జహీర్ ఖాన్ తీసుకున్నాడు. అంతకుముందు భారత్ జట్టు   191 పరుగులకు  ఆలౌట్ అయింది. ధోనీ 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సచిన్ 41, సెహ్వాగ్ 30, కొహ్లీ 23, అశ్విన్ 20, ద్రావిడ్ 5, లక్ష్మణ్ 2, పరుగులు చేయగా, గంభీర్, జహీర్, ఇషాంత్, యాదవ్ డకౌట్ అయ్యారు. ఆసిస్ బౌలర్లు ప్యాటిన్సన్‌ కు 4 వికెట్లు, సిడేల్, హిల్వేఫనాన్‌కు మూడేసి వికెట్లు  దక్కాయి.    

బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు శ్రీలక్ష్మి

న్యూఢిల్లీ,జనవరి 3: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో తన బెయిల్ రద్దుపై ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి సుప్రీంకోర్టుకెక్కారు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఈనెల 2వ తేదీన హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మంగళవారం శ్రీలక్ష్మీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓఎంసీ అనుమతుల విషయంలో తాను ఏ తప్పు చేయలేదంటూ ఆ పిటిషన్‌లో ఆమె మూడు కారణాలను తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున,  మహిళ అయినందున తనకు బెయిల్ కొనసాగించాలని, సీబీఐకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని, ఏ తప్పు చేయలేదు కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంలేదని ఆమె పేర్కొన్నారు.  ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేస్తూ, ఈనెల 6వ తేదీ లోపల నాంపల్లి కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. 

‘టీవీ-18’ కి ఈటీవీ ఛానళ్ల అమ్మకం

ముంబై,జనవరి 3: :  ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు  తమ గ్రూప్‌కు చెందిన ఈటీవీ ప్రాంతీయ ఛానళ్లను సేల్ చేసెస్తున్నారు.  బిజినెస్ న్యూస్ చానళ్లను నడిపే రాఘవ్ బెహల్‌కు చెందిన ‘టీవీ-18’ సంస్థతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సబ్సిడీ కంపెనీ ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ లిమిటెడ్-ఇన్ఫోటెల్ టీవీ 18, ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ గ్రూప్‌తో చర్చలు ఫలించాయి. 2600 కోట్ల రైట్స్ ఇష్యూ ద్వారా 100 శాతం న్యూస్ ఛానల్స్, 50 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్, 24.5 శాతం తెలుగు ఈటీవీ న్యూస్ ఛానల్స్ లో వాటా కొనుగోలు చేయడానికి ఆర్‌ఐఎల్ బోర్డు అంగీకారం తెలిపింది. తొలుత  ఛానళ్ల అమ్మకానికి సోని టీవీతో రామోజీ చర్చలు జరిపారు. 

Monday, January 2, 2012

హైదరాబాద్ మేయర్ గా మొహ్మద్ మజీద్ హుస్సేన్

హైదరాబాద్ ,జనవరి 3:   గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గా అహ్మద్ నగర్ కార్పోరేటర్ మొహ్మద్ మజీద్ హుస్సేన్ ని ఎంఐఎం ఎంపిక చేసింది.  కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పందంలో భాగంగా  రెండేళ్ళ కాలానికి ఎంఐఎం కు  మేయర్ పదవి లభించింది. 21 సంవత్సరాల తరువాత మేయర్ పగ్గాలను ఎంఐఎం చేపట్టబోతోంది.కాగా, డిప్యూటీ  మేయర్‌గా కాంగ్రెస్ కు చెందిన కవాడిగూడ కార్పోరేటర్ రాజ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. ఐదేళ్ల పాలనలో మొదటి రెండేళ్లు కాంగ్రెసు, ఆ తర్వాత రెండేళ్లు ఎంఐఎం, చివరి ఏడాది మళ్లీ కాంగ్రెసుకు మేయర్‌గా అవకాశం దక్కుతుంది.  మొదటి  రెండేళ్ళపాటు  మేయర్ గా పనిచేసిన బండ  కార్తీక రెడ్డి నెలక్రితమే రాజీనామా చేశారు. 

జగన్ ఆస్తుల కేసులో తొలి అరెస్టు

జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి
హైదరాబాద్,జనవరి 3:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో తొలి అరెస్టు జరిగింది. వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ సోమవారంనాడు అరెస్టు చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆయన రెండో నిందితుడు. సోమవారం సిబిఐ అధికారులు దాదాపు తొమ్మిది గంటల పాటు  విజయ సాయి రెడ్డిని ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆయన ఇంతవరకు 30 సార్లు సిబిఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆయన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జగతి పబ్లికేషన్స్‌కు ఆయన పెట్టుబడులు సంపాదించారు. జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులన్నీ విజయసాయి రెడ్డికి తెలుసునని అంటారు. ఓబిసి డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. వైయస్ హయంలో ఆయన టిటిడి బోర్డు సభ్యుడిగా పనిచేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో 74 మంది నిందితులుగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 17వ తేదీన సిబిఐ ఈ కేసు నమోదు చేసింది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...