Sunday, February 27, 2011

టై గా ముగిసిన భారత్-ఇంగ్లండ్ మ్యాచ్

బెంగళూరు,ఫిబ్రవరి 27:  వరల్డ్ కప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ టై గా ముగిసింది. భారత్ విసిరిన 338 పరుగుల  భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో  338 పరుగులు చేసింది.  ఎంతో  టెన్షన్‌గా సాగిన మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఇరుజట్లకు చేరో పాయింట్ వచ్చింది.   భారత్ విసిరిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా దూసుకె ళ్లిన స్ట్రాస్, బెల్‌ జోడి జోరుకు స్ట్రైకింగ్ బౌలర్ జహీర్ ఖాన్ ఒక్కసారిగా కళ్లేం వేశాడు. 42వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి 280 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లిష్ టీం వెన్ను విరిచాడు. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ నీదా-నాదా అనేరీతిలో దోబుచులాడింది. చావ్లా వేసిన 48వ ఓవర్‌లో టెయిల్ ఎండర్లు బ్రాసన్, స్వాన్‌లు తలో సిక్స్ బాదడంతో మ్యాచ్  ఉత్కంఠకు చేరింది. మునాఫ్ వేసిన చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు కావల్సి ఉండగా షాజద్ ఓ సిక్స్ చేశాడు.  దీంతో చివరి బంతికి గెలుపు రెండు పరుగులు చేయాల్సి ఉండగా, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది.  అద్భుత సెంచరీ చేసిన అండ్రూ స్ట్రాస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సచిన్(120) అద్బుత సెంచరీ, యుజరాజ్ సింగ్(58), గౌతం గంభీర్(51) అర్ధసెంచరీలు, సారథి ధోనీ(31), సెహ్వాగ్(35) రాణింపుతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Saturday, February 26, 2011

శ్రీలంక పై పాక్ గెలుపు

కొలంబో,ఫిబ్రవరి 26: వరల్డ్ కప్  గ్రూప్ ఏలో  రెండు మాజీ ప్రపంచ చాంపియన్లయిన  శ్రీలంక- పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం స్థానిక ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 11 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మిస్బా ఉల్ హక్ (91 బంతుల్లో 83 నాటౌట్; ఫోర్లు 6), సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్ (76 బంతుల్లో 72; ఫోర్లు 4) అర్ధ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. దీనికి ప్రతిగా ఆతిథ్య లంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. సంగక్కర (61 బంతుల్లో 49; ఫోర్లు 2, సిక్స్ 1), చమర సిల్వ (78 బంతుల్లో 57; ఫోర్లు 5) ఇద్దరే రాణించారు. 34 పరుగులకు నాలుగు వికెట్లు తీసిన ఆఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

మార్చి 10న హైదరాబాద్ దిగ్బంధం: కేసీఆర్

హైదరాబాద్,ఫిబ్రవరి 26: మార్చి 10న  10 లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ జిల్లాల ప్రజలందరినీ హైదరాబాద్ తరలించి, చీమ కూడా కదలకుండా దిగ్బంధిస్తామని,  రాజధాని రోడ్లపైనే వంటావార్పు చేస్తాంమని   హెచ్చరించారు. ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో నిరసన దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు  కేసీఆర్ సంఘీభావం ప్రకటించారు. ‘ప్రధాని కుర్చీల కూసున్న మన్మోహన్ ఒక పాణం లేని బొమ్మ అని .  కేంద్రం దిగి రావాలంటె మార్చి 10న హైదరాబాద్‌లోకి చీమను కూడా అడుగు పెట్టనీయొద్దు. నగరమంతా ఎక్కడికక్కడ స్తంభించిపోవాలె’’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు. ‘‘డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను పోగొట్టింది, అప్పటిదాకా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులే. రాజీనామా చేస్తే బంపర్ మెజారిటీతో గెలిపిస్తనని చెప్పిన. అయినా పదవులుపోతే సచ్చిపోతామంటున్నరు. ఇలాంటి సవటలను, దద్దమ్మలను నమ్ముకుంటే తెలంగాణ రాదు. 4 లక్షల మంది ఉద్యోగులు చేపట్టిన సహాయ నిరాకరణను చూసైనా సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు మీ బతుకులు గౌరవంగా ఉన్నయా? బండ కట్టుకుని బావిలో దూకండి. మీరు రాజీనామా చేసుంటే ఈ గోస ఉండేదా?’’ అంటూ గంగవెర్రులెత్తారు.  

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తెలంగాణ పై నిర్ణయం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26:  మే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే  తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. అప్పటి వరకు సమస్యపై నాంపుడు ధోరణి అవలంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందన ఇలాంటి సున్నితమైన అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఒత్తిడి చేస్తుండడంతో  తెలంగాణ సమస్యను పరిష్కరించడం కాంగ్రెస్ అధిష్టానం అవసరంగా భావిస్తోంది. పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే తాము రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఇప్పటికే అధిష్టానానికి తేల్చి చెప్పారు. చెప్పినట్టు సమాచారం. కాగా,  హైదరాబాద్ చిక్కుముడిని విప్పితే సమస్య పరిష్కారమవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు తగిన కసరత్తు చేస్తోంది. శ్రీకృష్ణ కమిటీ సూచించినట్లు తెలంగాణకు అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి, పదేళ్లు ప్రయోగం చేయడం, అది విఫలమైతే తెలంగాణ ఏర్పాటు చేయడం అనే  సిఫార్సుకే కాంగ్రెస్‌ అధిష్టానంతో పాటు.. యూపీఏ సర్కార్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, . రాష్ట్రాన్ని వేర్వేరు రాజధానులతో రెండుగా విభజించి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలనే అంశంపై కూడా తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు  సమాచారం.  

రాష్ట్రానికి ఈ ఖర్మ కాంగ్రెస్ స్వయంకృతమే

 కాంగ్రెస్ హైకమాండ్‌ పై  సీనియర్ నేత దివాకరరెడ్డి ధ్వజం 

హైదరాబాద్,ఫిబ్రవరి 26: కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏమాత్రం బుద్ధిలేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.దివాకర్ రెడ్డి సంచలన  వ్యాఖ్యలు చేశారు. అధిష్టానంలో పెద్దలమని చెప్పుకునే వారు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. వారు తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్ర రావణకాష్టాన్ని తలపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక చర్చావేదికలో పాల్గొన్న జేసీ.. కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటన వల్లే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆయన ఎవరిని అడిగి ఆ ప్రకటన చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదన్నారు. అధిష్టానం తీసుకునే మతిలేని నిర్ణయాలు, బుద్ధిలేని చర్యల వల్ల పరిస్థితి ఈ విధంగా దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఈ ఖర్మ కాంగ్రెస్ స్వయంకృతమేనన్నారు. తెరాస చీఫ్ కేసీఆర్ కూడా ఒక రాజకీయ నేతగా కాకుండా ఉద్యమ నేతగానే ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఆయన చేస్తున్న హెచ్చరికల వల్ల హైదరాబాద్‌లో నివశించే 80 శాతం సీమాంధ్రులు భయంతో జీవనం సాగిస్తున్నారన్నారు. అంతేకాకుండా, తెలంగాణలో ఏ చిన్న ఉద్యమం జరిగినా సీమాంధ్రుల ఆస్తులే ధ్వంసమవుతున్నాయని జేపీ గుర్తు చేశారు.

Friday, February 25, 2011

చికాగో సిటీ కౌన్సిల్‌కు ఎన్నారై ఎన్నిక

చికాగో, ఫిబ్రవరి 25:  ఉత్తర చికాగోలోని 47వ వార్డుకి జరిగిన ఎన్నికల్లో భారత సంతతి యువకుడు అమేయ పవార్ విజయ దుందుభి మోగించాడు. .. ఈ వార్డుకి 30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ వేత్తను ఖంగుతినిపించి  తొలిసారి చికాగో సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులకు జన్మించిన పవార్ పట్టభద్రుడై అతిమామూలుగా వార్డు ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే  ఓటర్లు 50 శాతం ఓట్లతో పట్టంకట్టారు. ఈ విజయం అపురూపమైనదని, అందరితో కలిసి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పవార్ చెప్పారు. 

ప్రపంచకప్: న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం

నాగ్‌పూర్ ,ఫిబ్రవరి 25: వరల్డ్ కప్ లో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై  ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 206 పరుగులకు ఆలౌట్ కాగా... ఆస్ట్రేలియా కేవలం 34 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులతో లక్ష్యాన్ని అధిగమించింది. పేసర్ మిచెల్ జాన్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ మార్చి 4న జింబాబ్వేతో; ఆస్ట్రేలియా మార్చి 5న శ్రీలంకతో తలపడతాయి. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకిది వరుసగా 25వ విజయం కావడం విశేషం. 1999 ఫైనల్ నుంచి ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచింది.

బంగ్లాదేశ్ తొలి విజయం,

 కాగా, ఢాకా లో  శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 27 పరుగుల ఆధిక్యంతో ఐర్లాండ్‌పై నెగ్గి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది.  206 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ 45 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 151 పరుగులకు ఐదు వికెట్లతో లక్ష్యం దిశగా పయనిస్తున్న ఐర్లాండ్‌ను బంగ్లాదేశ్ పేసర్ షఫీయుల్ ఇస్లామ్ (4/21) దెబ్బతీశాడు. షఫీయుల్ ధాటికి ఐర్లాండ్ చివరి ఐదు వికెట్లు 27 పరుగుల తేడాతో పడిపోయాయి.  బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. 

‘జన్మభూమి గౌరవ్’ పేరుతో నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్ళు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25: రైల్వే పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు  మమతా బెనర్జీ రైల్వే  బడ్జెట్‌లో  నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రకటించారు. ప్రత్యేకంగా  ‘జన్మభూమి గౌరవ్’ పేరుతో దేశంలోని చారిత్రక, విద్యా ప్రాంతాలను అనుసంధానిస్తూ  ఈ నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెడతారు. .1. హౌరా-బోల్పూర్-రాజ్‌గిర్(నలంద)-పాటలీపుత్ర(పాట్నా)- వారణాసి(సార్నాథ్)-గయ-హౌరా 2. బెంగళూరు-మైసూరు-హసన్ (స్పేస్ ఫెసిలిటీ, బెలూర్, హలేబిద్, శ్రావాణ్‌బెంగొలా)-హూబ్లీ-గడగ్(హంపి)-బిజాపూర్ (గోలె గుంబాజ్)-బెంగళూరు 3. చెన్నై-పుదుచ్చేరి-తిరుచిరాపల్లి-మదురై-కన్యాకుమారి- తిరువనంతపురం-ఎర్నాకుళం-చెన్నై   4. ముంబై-  అహ్మదాబాద్-(లోథల్)-భావ్‌నగర్(పాలిటానా)-అలాంగ్)-గిర్-డయూ (సోమనాథ్-వెరావల్)-(జునాగఢ్)-రాజ్‌కోట్-ముంబై మార్గాలలో ఈ రైళ్ళు ప్రయాణిస్తాయి.  

మమతా ఎక్స్ ప్రెస్ ఫర్ బెంగాల్... !

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25 : 2011-12 సంవత్సరానికి   రూ.1,06,239 కోట్లతో రైల్వే  బడ్జెట్‌ను రైల్వే మంత్రి మమతా బెనర్జీ పార్లమెంట్ కు సమర్పించారు. రైల్వే వార్షిక ప్రణాళికను   రూ.57,630 కోట్లుగాను, మార్కెట్ రుణాలను రూ.2,059 కోట్లుగాను  ప్రతిపాదించారు. మమతా బెనర్జీ ఈసారి కూడా రైల్వే బడ్జెట్‌లో పశ్చిమబెంగాల్‌కు వరాల జల్లు కురిపించారు. రైల్వే ఆధారిత పరిశ్రమలతో పాటు, కొత్తరైళ్లను బెంగాల్‌కు తరలించి ఆమె తన సొంతరాష్ట్రానికి పెద్దపీట వేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ రైల్వే బడ్జెట్‌లో కేరళకు కొంత ప్రాధాన్యత కల్పించారు.
 రైల్వే  బడ్జెట్‌ ప్రధానాంశాలు
పేదలకు రూ. 25తో 100 కి.మీల ప్రయాణం- ఇంఫాల్‌కు రైల్వే పరిధి విస్తరణ- ఈ సంవత్సరాంతానికి దేశంలోని అన్ని రైల్వే గేట్ల వద్ద కాపలాదారుల ఏర్పాటు- ఆలిండియా సెక్యూరిటీ హెల్ప్ లైన్ ఏర్పాటు- నాగపూర్, చండీఘర్, సికింద్రాబాద్ స్టేషన్ల ఆధునికీకరణ- రూ.5,406 కోట్లతో డబ్లింగ్ పనులు- దూరప్రాంత ప్రయాణికులకు మల్టీపర్పస్ స్మార్ట్ కార్డులు- ఆంధ్రప్రదేశ్‌లో 1300 మోగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్- కొత్తగా సూపర్ ఏసీ క్లాస్ ప్రయాణం- ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో 85 కొత్త ప్రతిపాదనలు- ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా రూ. 10వేల కోట్లు సేకరణ- రిజర్వేషన్ బుకింగ్ ఛార్జీలు 50 శాతం తగ్గింపు- ఏటా 700 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణం- ఉద్యోగులకు 10వేల ఇళ్ల నిర్మాణం- ప్రమాదాల నివారణకు యాంటీ-కొలిజన్ పరికరాలు-16వేలమంది మాజీ సైనిక ఉద్యోగులకు రైల్వేలో ఉద్యోగాలు- పదవీ విరమణ చేసిన కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకు ఉపాధి- 1700 ఎకరాల భూమికి 700 కోట్లు చెల్లింపు- ప్రధానమంత్రి రైల్ వికాస్ యోజన ప్రారంభం- బలహీన వర్గాల రైల్వే ఉద్యోగుల పిల్లలకు నెలకు రూ. 1200 స్కాలర్ షిప్-ఖాళీగా ఉన్న లక్షా 75వేల ఉద్యోగాల భర్తీ- ఏసీ బుకింగ్ ఛార్జీలు 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గింపు- కొత్త్తగా 3 శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు- కేంద్ర హోంశాఖ సాయంతో అయిదు పాలిటెక్నిక్ కళాశాలలు -ప్రమాదాలు జరగని రాష్ట్రానికి రెండు ప్రత్యేక రైళ్లు- పురుషుల సీనియర్ సిటిజన్ వయో పరిమితి 62కి కుదింపు- మహిళల సీనియర్ సిటిజన్ వయో పరిమితి 58కి తగ్గింపు-సికింద్రాబాద్‌కు 83 సబర్బన్ సర్వీసులు.
రైల్వే  బడ్జెట్‌ లో ఆంధ్ర...
విశాఖ- సికింద్రాబాద్ మధ్య కొత్తగా దురంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అలాగే తిరుపతి-గుంతకల్ మధ్య కొత్తగా ప్యాసింజర్, సికింద్రాబాద్-పుణె మధ్య శతాబ్ధి , హైదరాబాద్-దర్భంగ్ మధ్య  ఎక్స్ ప్రెస్ లతో పాటు  కాచిగూడ-మిర్యాలగూడ మధ్య కొత్త ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్ మధ్య ఇంటర్‌సిటీ, హౌరా-విశాఖ మధ్య  ఎక్స్ ప్రెస్, ఫలక్‌నూమా-మేడ్చల్ మధ్య కొత్త ప్యాసింజర్, తిరుపతి-అమరావతి మధ్య కొత్త  ఎక్స్ ప్రెస్, హైదరాబాద్- ఫలక్‌నూమా-లింగంపల్లి మధ్య కొత్త సర్వీసులు ప్రకటించారు. . కొత్తగా కరీంనగర్-హసన్‌పర్తి, భద్రాచలం-విశాఖ రైలు  మార్గాలను  కూడా ప్రతిపాదించారు. వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని చేపడతామని రైల్వే మంత్రి  తెలిపారు.   

Thursday, February 24, 2011

మార్చిలో వరుణ్‌సందేశ్ కొత్త చిత్రం


హైదరాబాద్: 'కుదిరితే కప్పు కాఫీ' తర్వాత  వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా మరో లవ్ స్టోరీ రాబోతోంది.  యుకె ఎవెన్యూస్ ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై పి.ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ దర్శకుడు. బాలీవుడ్ తార అమృతరావు (‘అతిథి ఫేం) ’  సోదరి ప్రీతికారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు.  ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘అందమైన ప్రేమకథగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నామని, . వినోదాత్మకంగా సాగే ఈ క్యూట్ లవ్‌స్టోరీ చిత్రీకరణ మార్చిలో  ప్రారంభిస్తామని   తెలిపారు. కోట శ్రీనివాసరావు, నాజర్, అలీ, వేణుమాధవ్, కాశీ విశ్వనాథ్, ‘వెన్నెల’ కిషోర్, రణధీర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి కెమెరా: మల్హార్ భట్, సంగీతం: మోహన్‌జోన్, ఆర్ట్: రామ్, సమర్పణ: శ్రీమతి పి.లక్ష్మి.

2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌పై 30 మంది తో జేపీసీ

కమిటీ చైర్మన్‌గా కిషోర్ చంద్రదేవ్

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24: టెలికాం శాఖలో జరిగిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటును లోక్‌సభ ఆమోదించింది. జేపీసీ వేయడానికి ఒప్పుకున్న కేంద్రం గురువారం దీనికి సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి, సభా నాయకుడు ప్రణబ్ ముఖర్జీ.. అధికార, విపక్షాల వాగ్యుద్ధం మధ్య 30 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుపై తీర్మానాన్ని సభ ముందుంచారు. నాలుగున్నర గంటల గొడవ తర్వాత మూజువాణి ఓటింగ్‌లో తీర్మానాన్ని ఆమోదించారు. తీర్మానాన్ని తదుపరి ఆమోదం కోసం, జేపీసీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం రాజ్యసభకు పంపిస్తారు. జేపీసీ వర్షాకాల సమావేశాలు ముగిసేనాటికి పార్లమెంట్‌కు నివేదిక సమర్పిస్తుంది. యూపీఏ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన తొలి జేపీసీ ఇదే. రూ.1.76 లక్షల కోట్లమేర అవినీతి జరిగిందన్న ఆరోపణలతో 2జీ స్కామ్‌పై విచారణకు జేపీసీని వేయాలని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం తెలిసిందే. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను సజావుగా నడిపేందుకు ప్రభుత్వం దిగొచ్చి కమిటీ వేసింది. ఇందులో 20 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.లోక్‌సభ సభ్యుడు కిషోర్ చంద్రదేవ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.   1998-2009 మధ్య ప్రభుత్వాలు టెలికాం రంగంలో అనుసరించిన విధానాలు, వాటి అమలు తీరు, కేబినెట్ల నిర్ణయాలు, వాటి పర్యవసానాలపై పరిశీలన. అలాగే టెలికాం లెసైన్స్‌లు, స్పెక్ట్రమ్‌ల కేటాయింపుల ధరలపై సమీక్ష. టెలికాం లెసైన్స్‌ల ధరలు, వాటి కేటాయింపుల విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటే వాటిపై పరిశీలన. ప్రభుత్వ విధానాలు సక్రమంగా అమలయ్యాయా లేదా అన్న అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో సరైన విధానాల అమలుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. .


అమర్ చిత్ర కథ సృష్టికర్త అనంత్ పాయ్ మృతి

ముంబై,ఫిబ్రవరి 24: ‘అంకుల్ పాయ్ ' గా దేశంలోని  హస్యప్రియుల్ని ఆలరించిన  అనంత్ వి పాయ్  ముంబైలో కన్నుమూశారు. అమర్ చిత్ర కథ కామిక్స్ ద్వారా భారతీయ సంస్కృతి, ఆచారాలను పాఠకులకు ‘అంకుల్ పాయ్’ అందించారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కనారా జిల్లాలోని కర్కాలలో అనంత పాయ్ జన్మించారు. ముంబై యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు.  టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లో చేరి ఇంద్రజాల్ కామిక్స్ ద్వారా ఫాంథామ్, మంద్రకే ది మెజీషియన్ శీర్షికల ద్వారా చిన్నారులను ఆకట్టుకున్నారు. ఒక సమయంలో దూరదర్శన్‌లో ప్రసారమైన క్విజ్ పోటీలో రామాయణంలో రాముడి తల్లి ఎవరూ అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానమివ్వకపోవడంతో మనస్థాపం చెంది కామిక్స్ ద్వారా భారతీయ పురాణాలను, సంస్కృతిని అందించాలని నిశ్చయించుకున్నారు. ఆతర్వాత అమర్ చిత్ర కథను ప్రారంభించి ఎడిటర్, గ్రాఫిక్ మాస్టర్, రచయిత, పబ్లిషర్, చరిత్రకారుడిగా పలు బాధ్యతల్ని నిర్వహించారు.  అమర్ చిత్ర కథ 20 భాషల్లోకి అనువదించబడినది. పెద్దల్ని సైతం ఆలరించిన ట్వింకిల్ కూడా అంకుల్ పాయ్ సృష్టించిందే. 

విండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ ల తేడాతో విజయం సాధించి0ది. డివిలియర్స్ (107) పరుగుల అజేయ సెంచరీతో జట్టు ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 223 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు ఆదిలో వికెట్లు కోల్పోయినప్పటకీ తర్వాత విజయబాట లో నడిచారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటయింది. డీఎమ్ బ్రేవో 73, డీఎస్ స్మిత్ 36, చంద్రర్‌పాల్ 31, డీజే బ్రోవో 40, థామస్ 15 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 4, స్టెయిన్ 3, బోథా 2 వికెట్లు తీశారు. 

సినీ...బాతాఖానీ... !

ఆడపిల్ల తల్లి: చందమామ సినిమాలో సెకండ్ హీరోయిన్  సింధూ మీనన్  ఓ ఆడపిల్లకు తల్లి అయింది.  యుకె కి చెందిన వ్యాపార వేత్త   ప్రభుని ఆమె గత ఏడాది   సింధూ మీనన్ మొదట శ్రీహరి చిత్రం భధ్రాచలం చిత్రం లో చేసింది. ఆ తర్వాత శివాజీ సరసన 'శ్రీరామ చంద్రులు' చిత్రంలో కనిపించింది. అలా అప్పుడప్పుడూ అవకాశాలు వచ్చిన ఆమె తన సొంత భాష మళయాళంలోనూ బిజీ కాలేకపోయింది. కెరీర్ చివరి దశలో ఆమె తమిళంలో చేసిన ఈరమ్ చిత్రం మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కన్నడంలో చేసిన హూలియా అనే చిత్రంలోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆమె చివరగా తెలుగులో చేసిన సుభధ్ర చిత్రం ఇంకా విడుదల కావల్సి వుంది.

ఏదీ 'దూకుడు '!: మహేష్ నటిస్తున్న' దూకుడు' చిత్రం ఈ వేసవికి విడుదల కావాల్సి వుంది. కానీ సినీ పరిశ్రమ సమ్మెతో ఇంకా దూకుడు వర్క్ చాలా పెండింగ్ లో వుందిట. ఎంత త్వరగా షూటింగ్ పూర్తి చేసినా ఈ సమ్మర్ కి చిత్రాన్ని విడుదల చేయలేమని దర్శకుడు శ్రీను వైట్ల చేతులెత్తేసాడు. ఈ చిత్రం పూర్తయితే కానీ మహేష్ మరో చిత్రం ప్రారంభం కాదు. సో, ఖలేజా ప్లాప్ తో కళ్ళు తెరుచుకుని  ఇక ఇప్పటినుంచి సంవత్సరానికి రెండు విడుదలయ్యేటట్లు చూసుకుంటానంటూ ఇచ్చిన  మాట ను మహేష్ దక్కించుకునేటట్టు కనిపించడం లేదు.

 "నెపోలియన్"గా సునీల్!:  'మర్యాదరామన్న సునీల్ త్వరలో "నెపోలియన్" అవతారం ఎత్తనున్నాడు.  రాజమౌళి కో డైరక్టర్ కోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి రెండవ వారంలో ప్రారంభంకానుంది. ఈ చిత్రం కామెడీగా కాకుండా రెగ్యులర్ యాక్షన్ చిత్రం తరహాలో సాగనుందని సమాచారం.సునీల్ సరసన దీక్షాసేధ్ నటిస్తుంది. ఈ చిత్రానికి మొదట 'శివం' అనే టైటిల్ పెట్టాలనుకున్నారుట కాని కథకు నెపోలియన్ టైటిల్  యాప్ట్ గా ఉంటుందని ఆ పేరునే  ఫిక్స్ చేశారుట.


మోహన్ బాబా-మజాకా!: చిరంజీవి, మోహన్ బాబు.  మథ్య  పచ్చగడ్డి వేస్తే  ఇంకా భగ్గుమంటూనే ఉందనిపిస్తోంది. .  చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు‌లో కలిపేసిన సందర్భంలో  మోహన్ బాబు తన సన్నిహితుడి ఇంట్లో ఫంక్షన్‌‌లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.చిరంజీవి సినిమా వాళ్శ పరువు తీశాడని,  ఎవరితో యుద్దం చేస్తానని చెప్పాడో వారికే జై కొట్టాడని,  ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్శలా వ్యూహాలు లేకుండా వ్యవహరించి సినిమా వాళ్శు రాజకీయాలకు పనికి రారని అనిపించేలా చేశాడని మోహన్ బాబు మండిపడినట్టు సమాచారం.   

తెలంగాణ పై మార్చి 1 తర్వాత అమీతుమీ: కేసీఆర్

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24:  తెలంగాణ అంశంపై మార్చి 1వ తేదీ తర్వాత తాడో పేడో తేల్చుకుంటామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  తెలంగాణపై కేంద్రం స్పందించేలా కనిపించటం లేదన్నారు. 600మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్రం నుంచి కనీస స్పందన కరువైందన్నారు. రైల్వే, వార్షిక బడ్జెట్‌లను టీఆర్‌ఎస్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణపై చర్చించాలంటూ సభలో తమకు మద్దతు తెలిపిన ఎన్డీయే సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, టీఆర్‌ఎస్ రెండోరోజు కూడా లోక్‌సభలో తెలంగాణ అంశంపై చర్చకు పట్టు బట్టింది.  దీంతో సభా కార్యాక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ మీరాకుమార్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. 

దీక్ష విరమించిన జగన్

హైదరాబాద్ ,ఫిబ్రవరి 24:   విద్యార్థుల ఫీజుల సాధన కోసం ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన మాజీ ఎంపీ  వైఎస్ జగన్ గురువారం దీక్ష విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలన్న లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ  పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని  ఆయన విమర్శించారు.  ప్రభుత్వ  ధోరణితో 25 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష చేస్తున్న తన వద్దకు ప్రభుత్వ దూతలు రాలేదన్న బాధలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయలేదని  విమర్శించారు.  మానవతా దృక్పథంలో ఆలోచన చేసిఈ పథకానికి కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీక్ష విరమించిన తర్వాత జగన్  అపోలో ఆస్పత్రిలో వైద్య  పరీక్షలు చేయించుకున్నారు. మూడు, నాలుగు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు.  వైద్య పరీక్షల అనంతరం  జగన్ తన నివాసానికి చేరుకున్నారు.

వినీలకృష్ణను విడుదల చేసిన మావోయిస్టులు

భువనేశ్వర్,ఫిబ్రవరి 24: తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ చేసిన మల్కన్‌గిరి కలెక్టర్ వినీలకృష్ణను మావోయిస్టులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. మీడియా సమక్షంలో ఆయనను వదిలిపెట్టారు. ఈ నెల 16న మల్కన్ జిల్లాలోని జాన్‌బాయ్ ప్రాంతం నుంచి వినీలకృష్ణ, జూనియర్ ఇంజనీర్ పవిత్రమోహన్ మఝిలనుమావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.  

Wednesday, February 23, 2011

"బుడుగు వెంకటరమణ" ఇకలేరు

చెన్నై,ఫిబ్రవరి 23: ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. బాపు దర్శకతంలో పలు చిత్రాలకు ఆయన సంభాషణలు వ్రాశారు. రక్తసంబంధం చిత్రం ద్వారా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ‘సాక్షి’ సినిమాతో వెంకటరమణ నిర్మాతగా మారారు. దర్శకుడు బాపు కు అత్యంత   సన్నిహితుడైన ముళ్ళపూడి హాస్య  రచన 'బుడుగు' ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ రచన ద్వారా ఆయన "బుడుగు వెంకటరమణ"గాప్రసిద్ధి చెందారు. కోతి కొమ్మచ్చి పేరుతో ఆత్మకథను రాశారు.బాపు-రమణ కాంబినేషన్ లో తాజాగా ' శ్రి రామరాజ్యం ' చిత్రం పూర్తి కావస్తోంది.  

ముగిసిన 48 గంటల తెలంగాణ బంద్

హైదరాబాద్,ఫిబ్రవరి 23  తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన 48 గంటల తెలంగాణ బంద్ బుధవారం రెండో రోజు కూడా పూర్తిస్థాయిలో జరిగింది.  హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాలన్నింట్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, హోటళ్లు, విద్యాలయాలు మూతబడటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. బస్సు, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో ప్యాసింజర్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో ఒక బోగీ పూర్తిగా, మరొకటి పాక్షికంగా తగలబడ్డాయి. ఇది మినహా బంద్ ప్రశాంతంగా జరిగిందని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. 90 శాతం ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో సంస్థకు మరో రూ.6 కోట్ల నష్టం వాటిల్లింది. సాయంత్రం అయిదింటి దాకా ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ఆపేశారు. ఆ తర్వాత నుంచి ఆర్టీసీ నగరంలో బస్సులు తిరిగాయి. అసెంబ్లీకి దారితీసే రోడ్లన్నింటినీ పూర్తిగా మూసేయడంతోరెండో రోజూ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులపై 65 కేసులు నమోదు చేసి 974 మందిని ముందస్తుగా అరెస్టు చేసినట్టు డీజీపీ అరవిందరావు తెలిపారు. మొత్తంమీద బుధవారం 230 రాస్తారోకోలు, 118 కార్యాలయాల్లో సహాయ నిరాకరణ, 72 ధర్నాలు, 161 ర్యాలీలు, 46 దిష్టిబొమ్మలు దహనాలు, 18 మానవ హారాలు, 16 చోట్ల రైళ్ల నిలుపుదల,  వంటి సంఘటనలు  జరిగాయి.

తెలంగాణ అంశంపై అట్టుడికిన లోకసభ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23‌: తెలంగాణ అంశంపై బుధవారం లోకసభ అట్టుడికింది. తెలంగాణపై వెంటనే చర్చకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులతో పాటు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సభ్యులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో లోకసభ కార్యక్రమాలు స్తంభించాయి.  స్పీకర్ మీరా కుమార్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. తెలంగాణపై జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా ప్రతిపక్షాలు వినలేదు. తెరాస సభ్యులు కెసిఆర్, విజయశాంతి లేచి నిలబడి జై తెలంగాణ నినాదాలు చేశారు. వారికి మద్దతుగా ఎన్‌డిఎ సభ్యులు కూడా నినాదాలు చేశారు. వారితో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు గొంతు కలిపారు. కెసిఆర్, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. మంగళవారం తెలంగాణపై కెసిఆర్ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. బుధవారం చర్చకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. అయితే, బుధవారం జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పడంతో కెసిఆర్, విజయశాంతి ఆందోళనకు దిగారు. వెంటనే తెలంగాణపై చర్చను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 

లిబియాలో కనిపిస్తే కాల్చివేత

ట్రిపోలీ,ఫిబ్రవరి 23: లిబియాలో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆదేశంలో కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాల్ని జారీచేసింది. లిబియాకు విమానసర్వీసులు రద్దయ్యాయి. లిబియాలో వున్న భారతీయుల్ని తరలించేందుకు విమానాలు, నౌకలు ట్రిపోలీ చేరుకున్నాయి. 41 ఏళ్ల గఢాఫీ పాలనకు  చరమగీతం పాడాలని ఆందోళనకారులు చేపట్టిన  ఉద్యమానికి మద్దతుగా ఇంటీరియర్ మంత్రి అబ్దుల్ ఫతా యూనిస్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకు అందోళనల్లో 300 మంది పౌరులు మరణించినట్టు సమాచారం. భారతీయుల్ని సులభంగా తరలించేందుకు నౌకలు ఈజిప్టుకు చేరుకున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమారావు తెలిపారు. లిబియాలోని భారతీయులకు రాయబారి అందుబాటులో వున్నారని, క్లియరెన్స్ లభించగానే భారతీయుల తరలింపు చర్యలు చేపడుతామని అన్నారు. 

కెన్యాపై పాకిస్తాన్ గెలుపు

హంబన్‌టోటా:ఫిబ్రవరి 23:  వరల్డ్ కప్ మ్యాచ్ లో  కెన్యాపై 205 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. కెన్యా జట్టులో నలుగురు ఆటగాళ్లు ఖాతా తెరువకుండానే పెవిలియన్ దారి పట్టారు.  ఒబుయా ఒక్కడే రాణించి 47 పరుగులు చేశాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన  పాకిస్తాన్ జట్టు 317 పరుగులు చేసింది. పాక్ జట్టులో కమ్రాన్ అక్మల్ 55, యూనిస్ ఖాన్ 50, మిస్బావుల్ హక్ 65, ఉమర్ అక్మల్ 71 పరుగులు చేశారు. 

రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.1,28,542 కోట్లు

హైదరాబాద్,ఫిబ్రవరి 23: 2011-2012 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఎన్నడూ  లేనివిధంగా లక్షా 28వేల 542 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి శాసనసభలో ప్రవేశ పెట్తారు. బడ్జెట్ లో  ప్రణాళికేతర కేటాయింపులు - 80,984 కోట్లు, - ప్రణాళికా వ్యయం - 47,558, - పన్నేతర ఆదాయం - 12,339 కోట్లు,- పన్ను వసూళ్లు - 56,438 కోట్లు,  రెవిన్యూ మిగులు 3,826 కోట్లు గా  చూపించారు.  ద్రవ్యలోటు - 17,602 కోట్లుగా అంచనా వేశారు. ఉపాధి హామీ పథకం పని దినాలను 100 రోజులనుండి 125 రోజులకు పెంచుతున్నట్లు, ఆహార భద్రతకు అధిక ప్రాదాన్యం ఇస్తున్నట్లు, 2 రూపాయల కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్టు మంత్రి చెప్పారు.  బడ్జెట్ లో - జలయజ్జానికి - 15,010 కోట్లు, - రహదారులు భవనాలకు - 4,108 కోట్లు, - ఇంధన శాఖకు - 4,980 కోట్లు, - పాఠశాలలకు - 14,025 కోట్లు, - ఉన్నత విద్యకు - 3,337 కోట్లు, - గిరిజన సంక్షేమానికి - 1,230కోట్లు, - మైనారిటి సంక్షేమానికి - 3,001కోట్లు, - సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు - 100 కోట్లు, - సంక్షేమ కార్యక్రమాల కోసం - 400 కోట్లు, - ఉపాధి హామీకి - 600 కోట్లు, - పాడి పరిశ్రమకు - 931 కోట్లు, - వైద్య-, ఆరోగ్య శాఖకు - 5,040 కోట్లు, - మౌలిక  వసతులకు - 143 కోట్లు, - రూ.2కిలోల బియ్యానికి - 2,500 కోట్లు, - పట్టణాబివృద్ధికి - 5,080 కోట్లు, - యువజన సంక్షేమానికి - 58.95 కోట్లు, - గ్రామీణాభివృద్ధికి - 3,341 కోట్లు, - గ్రామీణ నీటి సరఫరా - 773 కోట్లు, - స్త్రీ, శిశు సంక్షేమం - 1498 కోట్లు, - ఐటికి - 51 కోట్లు, - విద్యుత్ శాఖకు - 4,980కోట్లు, పశు సంవర్ధకానికి - 931 కోట్లు, ఇంధనానికి - 4,980 కోట్లు, నియోజక వర్గ అభివృద్ధికి - 385 కోట్లు, - పారిశ్రామిక రంగానికి - 858 కోట్లు,  సాంఘీక సంక్షేమం - 2352 కోట్లు, - గ్రామీణ రోడ్లు - 627 కోట్లు,  పాడి పరిశ్రమకు - 930 కోట్లు, పౌరసరఫరాలకు - 2500 కోట్లు,  గృహనిర్మాణానికి - 2300 కోట్లు,ఆర్టీసికి - 200 కోట్లు,  మహిళా సంక్షేమానికి - 1,948 కోట్లు,  ఇంధన శాఖకు 4980 కోట్లు కేటాయించారు.

వినీల్‌కృష్ణ విడుదల పై ఇంకా సందిగ్ధత

భువనేశ్వర్,ఫిబ్రవరి 23: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్‌కృష్ణ విడుదల పై  ఇంకా సందిగ్ధత వీడలేదు. వినీల్ కృష్ణ విడుదలకు మావోయిస్టులు మరికొన్ని షరతుల్ని విధించినట్టు తెలుస్తోంది. వినీల్ కృష్ణ ను శుక్రవారం మధ్యాహ్నంలోగా విడుదల చేస్తామని మావోయిస్టులు వెల్లడించారని ఆయనతో పాటు కిడ్నాప్ కు గురై విడుదలైన ఇంజనీర్ పవిత్ర  తెలిపారు.

Tuesday, February 22, 2011

బంద్ తో స్తంభించిన తెలంగాణ

బుధవారం కూడా  కొనసాగనున్న బంద్
హైదరాబాద్,ఫిబ్రవరి 22: 48 గంటల తెలంగాణ బంద్ తొలి రోజు సంపూర్ణంగా జరిగింది. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు మూతబడ్డాయి. రవాణా  వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన 48 గంటల బంద్‌లో మంగళవారం అన్ని వర్గాల వారూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా పూర్తి స్థాయిలో బంద్ జరిగింది. సాయంత్రం దాటినా ఎక్కడా కనీసం దుకాణ సముదాయాలు కూడా తెరుచుకోలేదు. తెలంగాణ జిల్లాలన్నింట్లోనూ ప్రజలు పూర్తిగా బంద్ పాటించారు. రోడ్లపైఅడ్డుగోడలు కట్టారు. మానవ హారాలుగా ఏర్పడ్డారు. 16 చోట్ల రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై ఫిష్ ప్లేట్లు తొలగించారు. పలుచోట్ల విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. ఆర్టీసీ కార్మికులు కూడా చరిత్రలోనే తొలిసారిగా బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలకడంతో తెలంగాణ అంతటా బస్సు సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. ఫలితంగా  ఆర్టీసీకి రూ.6 కోట్ల నష్టం వాటిల్లింది. నిరసనకారుల దాడిలో 769 బస్సులు ధ్వంసమయ్యాయి. జంటనగరాల్లో 15 బస్సుల అద్దాలను పగలగొట్టారు. హైదరాబాద్‌లో పాతబస్తీ మినహా ఎక్కడా బస్సులు తిరగలేదు. బుధవారమూ బంద్ కొనసాగనున్నందున తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా బస్సులు రోడ్డెక్కే పరిస్థితి లేదు. తెలంగాణవ్యాప్తంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో 1.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి రూ.28 కోట్ల నష్టం వాటిల్లింది. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, టీడీపీలతో పాటు పలు ప్రజా సంఘాలు తెలంగాణ అంతటా ర్యాలీలు, నిరసన ప్రదర్శన నిర్వహించాయి. రాజధానిలో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా సాయంత్రం ఐదింటిదాకా ఆపేశారు. ఉస్మానియా ప్రాంగణం మరోసారి రణరంగంగా మారింది. వర్సిటీలో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం; నిజాం కాలేజీ హాస్టళ్లలో విద్యార్థులు ప్రదర్శనలకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీశాయి. అసెంబ్లీకి దారి తీసే రోడ్లను పూర్తిగా మూసేయడంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. సహాయ నిరాకరణలో భాగంగా ప్రభుత్వోద్యోగులు తెలంగాణవ్యాప్తంగా విధులు బహిష్కరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పలు చోట్ల తెలంగాణవాదులు వాటర్ ట్యాంకులు, సెల్ టవర్లు ఎక్కి నిరసన తెలిపారు. జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, అరుణోదయ విమలక్కలతో సహా 1,978 మందిని అరెస్టు చేశారు. 

పార్లమెంట్ లో తెలం'గానం'


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజు బీజేపీ, టీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణా అంశాన్ని లేవనెథారు.  ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బిల్లు పెట్టాలని బీజేపీ లోక్‌సభలో డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌నాథ్ సింగ్  పేర్కొన్నారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. ‘శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో సభకు తెలియాల్సిన అవసరం ఉందని,  తక్షణమే.. ఈ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని,  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారానే తెలంగాణ అభివృద్ధిపథంలో నడుస్తుందని   పేర్కొన్నారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ కూడా తెలంగాణపై మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కూడా జీరో అవర్‌లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తక్షణం లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టాలని, మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభలో మాట్లాడారు. వాయిదా తీర్మానానికి అనుమతిస్తూ తెలంగాణపై చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. అయితే స్పీకర్ అందుకు నిరాకరిస్తూ జీరో అవర్‌లో మాట్లాడాలని సూచించారు. జీరో అవర్ సరిపోదని, బుధవారమే  వాయిదా తీర్మానం ఇస్తామని కేసీఆర్ చె ప్పడంతో స్పీకర్ అంగీకరించారు.  అనంతరం కె.సి.ఆర్. తమ పార్టీ సహచర ఎంపీ విజయశాంతితో కలిసి పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, 'ప్రధానమంత్రికి మేం ఒక్కటే అప్పీలు చేస్తున్నాం. వారం రోజుల నుంచి 4 లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. పాలన స్తంభించింది. న్యాయవాదుల ఆందోళనతో న్యాయవ్యవస్థ స్తంభించింది. విద్యార్థి, ఉపాధ్యాయులు, లెక్చరర్ల ఆందోళనతో విద్యావ్యవస్థ స్తంభించింది. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. జేఏసీ పిలుపుమేరకు రెండు రోజుల బంద్ విజయవంతంగా ప్రారంభమైంది. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నాయి. సీఎం కూడా చొరవ తీసుకోవాలి. డిసెంబరు 9 నాటి ప్రకటనను ముందుకు తీసుకెళ్లాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చి రెండు నెలలవుతోంది. ఇంకా తాత్సారం చేయడం ఎవరికీ శ్రేయస్కరం కాదు..’ అని పేర్కొన్నారు.   

ఇంగ్లాండ్ ను అల్లాడించి ఓడిన నెదర్లాండ్స్

నాగ్‌పూర్  , ఫిబ్రవరి 22:   వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ నెదర్లాండ్స్ తో  జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అతికష్టం మీద గెలిచిఇంది.  293 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ స్ట్రాస్ (88), పీటర్‌సన్‌లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. పీటనర్‌సన్ (39) నిషమ్రించిన అనంతరం.. క్రీజ్‌లోకి వచ్చిన ట్రాట్ (62 )పరుగులతో జట్టు ఇన్నింగ్స్‌కు చక్కటి పునాది వేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్ (33), కాలింగ్‌వుడ్(30), రవి బోపారా (30)లు ఆచితూచి ఆడి ఇంగాడ్‌ను గెలుపు బాట పట్టించారు. డచ్ బౌలలర్లలో డస్కెచీ రెండు వికెట్లు తీయగా, బుకారీ, సీలార్‌లు తలో వికెట్టు సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ అంచనాలు మించి ఆడింది. ఇంగ్లీష్ బౌలింగ్‌ను సమర్ధంగా ఎదుర్కొని 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచారు.డస్కెటీ 110 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 119 పరుగులు చేసి నెదర్లాండ్స్ భారీ స్కోరుకు దోహదపడ్డాడు.చివర్లో కూపర్ (47),బోరెన్ (35), గ్రూత్ (28) పరుగులు చేయడంతో నెదర్లాండ్స్ మంచి స్కోరు చేసి0ది.

కలెక్టర్ వినీల్ కృష్ణ విడుదల

భువనేశ్వర్ , ఫిబ్రవరి 22:  మల్కన్'గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణని మావోయిస్టులు వదిలిపెట్టారు. కృష్ణ విడుదల కోసం మధ్యవర్తులు జరిపిన చర్చలు ఫలించాయి. మావోయిస్టుల 14 డిమాండ్లను పరిష్కరించేందుకు ఒడిషా ప్రభుత్వం అంగీకరించింది. ప్రొఫెసర్లు హరగోపాల్, సోమేశ్వరరావు  మావోయిస్టులతో మధ్యవ ర్తిత్వం నెరిపారు.  మావోయిస్టు ఖైదీ గంటి ప్రసాద్ బెయిలు పొందే విషయంలో జాప్యం జరగడంతో కృష్ణ విడుదల ఆలస్యం అయింది. గోవింద్ పల్లి అడవుల్లో కోహిలిపుట్ ప్రాంతంలో కృష్ణను, ఇంజనీర్లను మావోయిస్టులు వదిలిపెట్టడంతో  వారిని తీసుకువచ్చేందుకు  ప్రభుత్వ అధికారులు బయలుదేరి వెళ్ళారు. 

అట్టుడుకుతున్న లిబియా

కైరో, ఫిబ్రవరి 22:  లిబియా లో  మహ్మద్ గడాఫీ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతుండటంతో రాజధాని ట్రిపోలీలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఆందోళనలను అణిచివేసే ప్రయత్నంగా అటు భద్రతా దళాలు, ఇటు గడాఫీ మద్దతుదార్లు మారణహోమం సృష్టిస్తున్నారు. నిరసనల సందర్భంగా గత కొద్ది రోజులు చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల్లో 84 మంది ప్రజలు మృతిచెందినట్టు ప్రభుత్వం చెబుతుండగా, 233 మంది మృతిచెందినట్టు మానవ హక్కుల సంస్ధలు ఘోషిస్తున్నాయి. మరోవైపు అధ్యక్షుడు గడాఫీ ఇప్పటికే దేశాన్ని వీడి వెళ్లిపోయాడన్న పుకార్లు వ్యాపించాయి. అయితే గడాఫీ లిబియాలో ఉన్నాడా? లేడా? అనే విషయాన్ని ఇప్పటివరకూ ఏ వార్తా సంస్ధ ధృవీకరించలేదు.  ఇదిలావుండగా, సంస్కరణలు తీసుకువచ్చేందుకై ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలకు నిరసనకారులు అంగీకరించకపోతే దేశంలో తీవ్రమైన అంతర్యుద్ధం తప్పదని అధ్యక్షుడు గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లామ్ గడాఫీ హెచ్చరించాడు. ట్రిపోలీలోని టెలివిజన్ చానల్ ద్వారా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ హెచ్చరిక చేశాడు. నాలుగు దశాబ్ధాల గడాఫీ పాలనను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఉద్యమించడాన్ని ఆయన ఖండించాడు. లిబియాలో సాగుతున్న ప్రజా ఉద్యమాలను విదేశీ కుట్రగా సైఫ్ అల్ ఇస్లామ్ పేర్కొన్నాడు. అయితే ఆందోళనలను అణిచివేసే ప్రక్రియలో కొన్ని ‘పొరబాట్లు’ చోటుచేసుకున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరిస్తూ ‘నవీన లిబియా’ నిర్మాణానికి సహకరించాల్సిందిగా పౌరులను కోరాడు.
భారతీయుల భద్రతకు చర్యలు...
లిబియాలోని భారతీయుల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఆకాశమార్గం, సముద్రయానం ద్వారా భారతీయుల్ని తరలించే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

గోద్రా అల్లర్ల కేసులో 31మంది దోషులుగా నిర్థారణ

అహ్మదాబాద్ ,ఫిబ్రవరి 22 :  గోద్రా అల్లర్ల కేసులో 31మందిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. దోషులకు శిక్ష కాలాన్ని ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 25న ప్రకటించనుంది. నేరారోపణలు రుజువు కానందున మరో 63మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరిలో 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ను తగులబెట్టిన ఘటనలో 69మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 80మంది నిందితులు జైల్లోనే ఉన్నారు. కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక న్యాయస్థానం 250మందిని విచారించింది.

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం


 
మెల్‌బోర్న్,ఫిబ్రవరి 22 :న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్  నగరంలో పలు భవనాలు కుప్పకూలాయి.  దాదాపు 75 మంది మరణించారు.  రిక్కార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదు అయ్యింది. శిధిలాల కింద జ్ఞ్కా పలువురు చిక్కుకుని ఉంటారని  భావిస్తున్నారు. రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Monday, February 21, 2011

ప్రముఖ నటుడు మిక్కిలినేని కన్నుమూత

విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘దీక్ష’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఆయన అయిదుసార్లు జైలుకు కూడా వెళ్లారు.  మిక్కిలినేని గా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి  పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు. ఆంధ్ర నాటకరంగ చరిత్ర, తెలుగువారి జానపద కళారూపాలు, ప్రజా పోరాటాల రంగస్థలం,ఆంధ్రుల నృత్య కళావికాసం,తెలుగువారి చలన చిత్ర కళ మొదలైన రచనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా 1982లో గౌరవ డాక్టరేట్ 'కళాప్రపూర్ణ' అందుకున్నారు.

కొనసాగుతున్న సహాయనిరాకరణ : ట్రెజరీ కార్యాలయాల్లో స్తంభించిన లావాదేవీలు

హైదరాబాద్,ఫిబ్రవరి 21:    తెలంగాణ జిల్లాల్లో సహాయనిరాకరణ కొనసాగుతోంది.సహాయ నిరాకరణలో భాగంగా తెలంగాణ ఉద్యోగులు సోమవారం రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డెరైక్టరేట్‌లో ప్రధాన సర్వర్‌ను డౌన్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ట్రెజరీ కార్యాలయాల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. బ్యాక్ అప్ సర్వీస్ లేకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలకు ఆస్కారం లేకుండాపోయింది. అసలే అత్యవసరాలకు మినహా మిగతా బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రధాన సర్వర్‌ను డౌన్ చేయడంతో జీతాలు, పెన్షన్లు, గ్రాట్యుటీ తదితర అన్ని రకాల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చెందిన బిల్లులను తీసుకోవడానికి ఆంక్షలు లేవని, సర్వర్ డౌన్ కావడంతో ఇప్పుడు ఆ బిల్లులు కూడా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. అయితే ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ట్రెజరీ కార్యకలాపాలను, చెల్లింపులను ఆన్‌లైన్ ద్వారా కాకుండా సిబ్బందితో చేయిస్తామని, కానీ తెలంగాణలో సహాయ నిరాకరణ వల్ల ఆవిధంగా చేయించడం సాధ్యం కాదని వారు పేర్కొన్నారు. ఈ కారణంగా తెలంగాణ జిల్లాల్లో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను తీసుకోవడానికి వీలుండదని తెలిపారు. 

పలు జిల్లాల్లో భారీ వర్షం:పంటలకు నష్టం

హైదరాబాద్,ఫిబ్రవరి 21:  రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం కురిసిన వర్షాలు జనజీవితాన్ని అతలాకుతలం చేశాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా, పంటనష్టం తట్టుకోలేక ఓ రైతు గుండె పోటుతో మృతి చెందాడు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలి పోగా, పొగాకు జిగురు కారిపోయాయి. కళ్లాల్లో ఉన్న మిర్చి తడిసిపోయింది. వందలాది ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండలో వడగండ్ల వర్షం కురిసింది. బలమైన గాలుల వల్ల లు  పొలాల్లో ఉంచిన వేరుశనగ కుప్పలు కొట్టుకుపోయాయి. నల్గొండ జిల్లాలో కొన్నిచోట్ల  కురిసిన భారీ వర్షాల వల్ల  వరి, మిర్చి, బత్తాయి పంటలకు నష్టం వాటిల్లింది.  కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 40,679 ఎకరాల్లో పం టలు దెబ్బతింది.  చిత్తూరు జిల్లా చంద్రగిరిలో గాలి, వాన బీభత్సం సృష్టించింది. తిరుమలలో  కుండపోత వర్షం కురిసింది.ప్రకాశం జిల్లాలో మిర్చి, పొద్దుతిరుగుడు, ముదురు పొగాకు పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.  మచిలీపట్నంలో బస్‌స్టాండు జలమయమైంది. విజయవాడలో ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు మండలాల్లో పొలాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది.కాగా,  ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు, కోస్తాంధ్రమీదుగా భూ ఉపరితల ద్రోణి ఆవరించి న కారణంగా రానున్న 24 గంటల్లో కో   స్తాలో కొన్నిచోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం  తెలిపింది.

అవినీతి నిర్మూలనకు చర్యలు

పార్లమెంట్ ప్రసంగంలో రాష్ట్రపతి హామీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 21: ప్రజాజీవితంలో అవినీతికి తావులేకుండా  కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ తెలిపారు.  పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్టప్రతి ప్రసంగించారు.ప్రజాజీవితంలో ఉన్నత విలువలను, సమగ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,  విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తుందని, వస్తామని, పాలనలో పారదర్శకతను పెంపొందిస్తుందని  హామీ ఇచ్చారు.సుమారు 50 నిమిషాలపాటు ప్రసంగించిన రాష్టప్రతి.. యూపీఏ-2 ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.  అవినీతిని అరికట్టే చర్యలలో భాగంగా శాసన, పాలనాపరమైన చర్యలన్నింటిని మంత్రుల బృందం పరిశీలిస్తోందని,  సహజ వనరుల వెలికితీతకు బహిరంగ, పోటీ వ్యవస్థను ప్రవేశపెట్టడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగుల కేసులను సత్వరం విచారించి చర్యలు తీసుకోవడానికి చట్టాల్లో సవరణలు చేయడం వంటివి ఈ బృందం పరిశీలనలో ఉన్నాయని రాష్ట్రపతి చెప్పారు. అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి, రైతులు పండించిన పంటలకు తగిన ప్రతిఫలం అందించడానికి కృషి జరుగుతుందని చెప్పారు.  మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలోనే లోక్‌సభ ముందుకు వస్తుందని తాను ఆశిస్తున్నట్టు  ప్రతిభా పాటిల్  తమప్రసంగంలో పేర్కొన్నారు.

కసబ్‌కు మరణశిక్ష ఖరారు

ముంబై,,ఫిబ్రవరి 21:ముంబై దాడుల నరహంతకుడు, కరడుగట్టిన పాక్ ఉగ్రవాది కసబ్‌కు కింది కోర్టు విధించిన మరణశిక్షను బాంబే హైకోర్టు ఖరారు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరిగిన ఈ అత్యంత అరుదైన, అసాధారణ మృత్యుకాండ దోషికి మరణదండనే సరైందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇద్దరు భారతీయులు ఫాహిమ్ అన్సారీ, షాబుద్దీన్ అహ్మద్‌లను కింది కోర్టు నిర్దోషులుగా తేల్చడాన్ని హైకోర్టు సమర్థించింది. వీరి నిర్దోషిత్వాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర సర్కారు దాఖలు చేసిన అప్పీలును బలమైన సాక్ష్యాలు లేనందున కొట్టేసింది. ప్రత్యేక విచారణ కోర్టు తనకు గత ఏడాది మేలో విధించిన మరణశిక్షపై కసబ్ చేసుకున్న అప్పీలును జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ ఆర్‌వీ మోరేల హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారించి తీర్పు చెప్పింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న క సబ్ విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యాడు.  క్రిమినల్ కుట్ర, దేశంపై యుద్ధం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఆయుధాలు, పాస్‌పోర్టు, తది తర చట్టాల కింద కసబ్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. 

వరల్డ్ కప్ -జింబాబ్వేపై ఆసీస్ గెలుపు

అహ్మదాబాద్,ఫిబ్రవరి 21:వరల్డ్ కప్ -2011లో భాగంగా ఇక్కడ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 91 పరగుల తేడాతో ఘన విజయం సాధించిఒది. 263 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే 171 పరుగులకే ఆలవుట్ అయింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ జాన్సన్ 4 వికెట్లు తీసుకోగా టైట్‌ రెండు వికెట్లు, బ్రెట్‌లీ, హస్సీ చెరో   వికెట్  తీసుకున్నారు.  

                                           పార్లమెంట్ ఉభయసభల నుద్దేశించి ప్రసంగించేందుకు
                                           సెంట్రల్ హాల్ కు వెడుతున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్   

ఎమ్యెల్సీ ఎన్నికల నోటీఫికేషన్ జారీ

హైదరాబాద్,ఫిబ్రవరి 21: శాసన సభ్యుల కోటాలో 10 ఎమ్యెల్సీ స్థానాల ఎన్నికలకోసం ఎన్నికల సంఘం నోటీఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 28వ తేది నుంచి నామినేషన్లను  స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది మార్చి 7. మార్చి 8 తేదిన నామినేషన్ల పరిశీలన, మార్చి 10 తేది వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు అని నోటిఫికేషన్‌  తెలిపింది. మార్చి 17వ తేదిన ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
కర్నాటక నుంచి రాజ్యసభకు  హేమామాలిని
బెంగళూరు: స్థానికేతర అభ్యర్థి అనే వివాదం నడుమ బాలీవుడ్ నటి హేమామాలిని కర్నాటక నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. రాజ్యసభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతిపక్షాలు ప్రఖ్యాత కన్నడ రచయిత మరులసిద్దప్పను రంగంలోకి దించాయి. కర్నాటకలో మార్చి మూడో తేదిన మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగునున్నాయి. కర్నాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానానికి హేమామాలిని నామినేషన్ వేసిన కొద్ది సేపటికే వ్యూహాత్మకంగా కాంగ్రెస్, జేడీఎస్‌లు మరులసిద్దప్పను రంగంలోకి దించడంతో  కర్నాటకలో రాజ్యసభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.

Sunday, February 20, 2011

కెనడాను సునాయాసంగా ఓడించిన లంక



హంబన్‌టోటా,ఫిబ్రవరి 20: ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 210 పరుగుల ఆధిక్యంతో కెనడాపై ఘనవిజయం సాధించింది. భారత్, లంక, పాకిస్తాన్ సంతతి ఆటగాళ్లతో కూడిన  కెనడా జట్టుపై శ్రీలంక ఆట మొదటి నుంచి చివరిదాకా ఆధిపత్యాన్ని కనబర్చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 332 పరుగులు సాధించింది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్  మహేల జయవర్ధనే (81 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100) సెంచరీ చేయగా... కెప్టెన్ కుమార సంగక్కర (87 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 92) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.   అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా బ్యాటింగ్ వైఫల్యంతో 36.5 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, తిసారా పెరీరా మూడేసి వికెట్లు తీసుకున్నారు. సెంచరీ వీరుడు జయవర్ధనేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. 


ప్రపంచకప్ :కెన్యాపై న్యూజిలాండ్ ఘనవిజయం

చెన్నై,ఫిబ్రవరి 20:  ప్రపంచకప్‌ రెండో వన్డే మ్యాచ్‌లో కెన్యాపై పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెన్యా చిత్తుగా ఓడిపోయింది. కెన్యా నిర్ధేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 8 ఓవర్లలోనే చేధించి సునాయాసంగా విజయం సాధించింది. కివీస్ ఓపెనర్లు గుప్తిల్, మెక్ కల్లమ్‌లు అలవోకగా జట్టును గెలిపించారు. వీరిలో 32 బంతులాడిన గుప్తిల్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు సాధించగా, మెక్ కల్లమ్ 17 బంతుల్లో నాలుగు ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. తద్వారా కివీస్ 8 ఓవర్లలో వికెట్ లేమితో 72 పరుగులతో ఘన సాధించింది. ఫలితంగా రెండున్నర గంటలోపే వన్డే ప్రపంచకప్ రెండో మ్యాచ్‌ ముగిసింది. 

సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ ఏర్పాటుకు కేంద్రo గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 21వ తేదీ నుంచి  ప్రారంభంకానున్నాయి.  24వ తేదీన రైల్వే  బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి మమతా బెనర్జీ లోక్‌సభలో ప్రవేశపెడతారు. సాధారణ బడ్జెట్‌ను 28వ తేదీన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెడతారు.  ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు  సాఫీగా జరిగేందుకు వీలుగ  2జీ స్పెక్ట్రమ్‌పై జేపీసీ ఏర్పాటుకు ఏకాభిప్రాయం కుదిరింది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న  ప్రధాని - సభ ప్రశాంతంగా జరగాలని  మన్మోహన్ సింగ్ విపక్షాలను కోరారు. జేపీసీ గొడవతో గత సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. 

Saturday, February 19, 2011

సహాయనిరాకరణతో స్తంభించిన తెలంగాణ

హైదరాబాద్,ఫిబ్రవరి 19: తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణతో తెలంగాణలోని పది జిల్లాల్లో 3 రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించాయి. అన్ని కార్యాలయాల్లో ఎక్కడి ఫైళ్లక్కడే ఆగిపోయాయి. భూములు, భవనాల వంటి స్థిరాస్తి క్రయ విక్రయాలు ఆగిపోవడంతో కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన రైతులు, ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రబీ పంట రుణాలకు సాగు సర్టిఫికెట్లు కోసం ఎమ్మార్వో కార్యాలయాలకు వచ్చిన రైతులు ఒట్టి చేతులతో వెళ్లాల్సి వచ్చింది. వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం తెలంగాణ నుంచే సమకూరుతోంది. సహాయ నిరాకరణ వల్ల ఆ మేరకు రాబడి నిలిచిపోయింది. రాష్టవ్య్రాప్తంగా రోజుకు సగటున సుమారు 6,000 భవనాలు, స్థలాల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వీటిలో తెలంగాణ వాటా దాదాపు సగం. ఆ లెక్కన మూడు రోజుల్లో 9,000 పై చిలుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ’ 11 కోట్ల రోజువారీ ఆదాయంలో సగం తెలంగాణ నుంచి వస్తుంది.  వాహనాల రిజిస్ట్రేషన్లదీ అదే పరిస్థితి. రాష్ట్రంలో నెలకు సగటున 80 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వాటిలో 60 శాతం దాకా తెలంగాణలోనే ఉంటాయి. ఆ లెక్కన తెలంగాణలో రోజుకు సగటున 1,400 రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వాణిజ్య పన్నుల రిటర్నుల స్వీకరణ నిలిచిపోయింది.

22 నుంచి 48 గంటలపాటు తెలంగాణ బంద్

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన సహాయ నిరాకరణలో భాగంగా ఈ నెల 22 నుంచి 48 గంటలపాటు తెలంగాణ బంద్ పాటించాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.  అత్యవసర సర్వీసులు మినహా రవాణా, పరిపాలనను పూర్తిగా స్తంభింపజేయాలని ప్రజలను కోరారు. ఈజిప్టు తరహాలో ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపైకి రావాలన్నారు. 

ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం: బంగ్లా పై భారీ విజయం


ఢాకా,ఫిబ్రవరి 19: టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది.  బంగ్లాదేష్ పై  87 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 14 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో  140 బంతుల్లో 175 పరుగులు చేశాడు.  సెహ్వాగ్ తో పాటు పోటాపోటీగా ఆడిన కోహ్లి ప్రపంచకప్‌లో ఆడుతున్న తొలిమ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 83 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. 371 పరుగుల  భారీలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. మునాఫ్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్ రెండు, హర్భజన్ సింగ్, యుసఫ్ పఠాన్‌ల తలో వికెట్ తీసుకున్నారు.    

రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర బిజెపి నేత వనం ఝాన్సీ మృతి

హైదరాబాద్,ఫిబ్రవరి 19: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, బిజెపి అధికార ప్రతినిధి వనం ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మరణించారు.  మహబూబ్‌నగర్‌ జిల్లా  ఆమన్‌గల్ మండలం లోని ఓ గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టా కార్యక్రమానికి ఆమె వెళ్లారు. రాత్రి కావటంతో అచ్చంపేటలో రాత్రి బస చేశారు. ఆ తర్వాత ఉదయాన్నే హైదరాబాద్‌కు తిరుగు కారులో ప్రయాణం అయ్యారు. ఆమన్‌గల్ మండలం కడ్తాల్ వద్దకు వచ్చిన తర్వాత వెనుక నుండి వచ్చిన ఇన్నోవా కారు ఝాన్సీ ఉన్న కారును ఢీకొట్టింది. తీవ్రం గా గాయపడిన   ఆమెను వెంటనే హైదరాబాద్‌ డిఆర్‌డీవోలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే  మార్గమధ్యలో మరణించారు. కారులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరొకరు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వనం ఝాన్సీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

Friday, February 18, 2011

అమెరికాలో భారీ హెల్త్ స్కాం...!

బోస్టన్,ఫిబ్రవరి 18:   అమెరికా వైద్యరంగ చరిత్రలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హెల్త్ కేర్‌లో సుమారు రూ. 1,015 కోట్ల భారీ కుంభకోణానికి సంబంధించి వంద మందికి పైగా డాక్టర్లు, నర్సులను అరెస్టు చేశారు. వీరిలో ప్రవాస భారతీయు సంతతికి చెందిన ఆరుగురు వైద్యులున్నారు. మెుత్తం 111 మందిపై అభియోగాలు దాఖలయ్యాయి.   మెడికేర్‌ను మోసగించేందుకు కుట్ర పన్నటం, తప్పుడు క్లెయిం లు  దాఖలు చేయుటం తదితర అభియోగాలు మోపారు. 65 ఏళ్లు దాటిన వారి కోసం అమెరికా ప్రభుత్వం మెడికేర్ బీమా  పథకాన్ని అమలు చేస్తోంది. దాదాపు 4.5 కోట్ల మంది పౌరులు ఈ పథకంలో నమోదు చేయించుకున్నారు. అమెరికా వైద్యరంగ చరిత్రలో ఇది భారీ కుంభకోణమని అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ అభివర్ణించారు.

డీఎంకే, పీఎంకే ఎన్నికల పొత్తు

చె న్నై,,ఫిబ్రవరి 18:  త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని డీఎంకే, పీఎంకే నిర్ణయించాయి. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో పొత్తు కుదిరింది. పీఎంకేకు 31 శాసనసభ నియోజకవర్గాలను, ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించేందుకు డీఎంకే అంగీకరించింది. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు లేదన్న కేంద్రం

సోనియాను కలవకుండానే  తిరిగి హైదరాబాద్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18:  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టడంలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ స్పష్టంచేశారు. మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో 31 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. వీటిలో తెలంగాణ బిల్లు లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ తాజా పరిస్థితులను వివరించి, రాష్ట్ర ఏర్పాటును కోరేందుకు వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి పయనమైంది. సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న 20 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీల బృందం తొలిరోజు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ను, తరువాత రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీలను కలిసి తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని వివరించింది. చివరగా శుక్రవారం హోంమంత్రి చిదంబరాన్ని కలిశారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే పరిస్థితులను వివరించారు. ఐదు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ పార్టీ అధినేత సోనియగాంధీ అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పయనమయ్యారు.

ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల పై జగన్ దీక్ష ప్రారంభం

హైదరాబాద్,ఫిబ్రవరి 18: ఫీజు రీఎంబర్స్ మెంట్  బకాయిల విడుదలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాజీ ఎం.పి.  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద    దీక్షను చేపట్టారు. ఈ దీక్ష 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది.  కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ , ఆమె భర్త, కాంగ్రెసు ఎమ్మెల్సీ కొండా మురళి కూడా దీక్షకు హాజరయ్యారు. వైయస్ జగన్ దీక్షకు వచ్చినవారిలో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. మిగతా 15 మంది కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శానససభ్యులు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి దీక్షకు హాజరయ్యారు. తెలుగుదేశం శానససభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగి రెడ్డి వైయస్ జగన్ దీక్షకు వచ్చారు. దీక్షకు హాజరైన కాంగ్రెసు శాసనసభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, బాబూరావు, రాజా అశోక్ బాబు, రవి, గుర్నాథ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, జయసుధ, ఆదినారాయణ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.

 

వారం పాటు హరీష్ సహా ఐదుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

హైదరాబాద్,ఫిబ్రవరి 18: బడ్జెట్ సమావేశాల తొలిరోజున  గవర్నర్ నరసింహన్‌ ప్రసంగిస్తున్న సమయంలో అనుచితంగా ప్రవర్తించిన ఐదుగురు సభ్యులను ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఏడురోజులపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన  ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, విద్యాసాగర్‌రావు, సమ్మయ్య ఉండగా, టిడిపి నుండి రేవంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఉన్నారు. రూల్ నెంబర్ 17ఏ కింద దౌర్జన్యంగా వ్యవహరించినందుకు వీరిపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కాగా సస్పెన్షన్ అనంతరం సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

Thursday, February 17, 2011

సహాయనిరాకరణతో తెలంగాణ జిల్లాల్లో స్తంభించిన పాలన

హైదరాబాద్,ఫిబ్రవరి 17: తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంతో ఆ ప్రాంతంలో పాలన స్తంభించింది. ఉద్యోగులు పెన్ డౌన్, కార్మికులు టూల్‌డౌన్, ఉపాధ్యాయులు చాక్‌డౌన్ చేశారు. ఉద్యోగులు రిజిస్ట్టర్‌లో సంతకాలు చేసి, విధులను బహిష్కరించి కార్యాలయాల ఎదుట బైఠాయిం చారు. ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నుల శాఖల్లో పన్నుల వసూళ్లూ నిలిచిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. ఉపాధ్యాయులు జనగణన కార్యక్రమాన్ని బహిష్కరించారు. తెలంగాణవాదులు, ఉద్యోగులు టికెట్లు తీసుకోకుండానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జేఏసీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎగువ నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు విధులను బహిష్కరించడంతో సచివాలయం బోసిపోయింది. అన్ని శాఖల్లోని 90 శాతం మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారని,  సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాగేందర్‌రావు తెలిపారు.  నాంపల్లి క్రిమినల్ కోర్టు, సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టుల్లో న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు.

దేవాస్‌ తో ఒప్పందం రద్దు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17: పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన వాణిజ్య విభాగం ఆంట్రిక్స్కు, ప్రైవేటు సంస్థ దేవాస్ మల్టీమీడియాకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం గురువారం రద్దు చేసింది. ఈ ఒప్పందం దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా లేదని వెల్లడించింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారల పై కేంద్ర కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ నిర్ణయం తీసుకుంది. ఇస్రోకు చెందిన జీశాట్-6, జీశాట్-6ఏలలో 90 శాతం ట్రాన్స్పాన్డర్లను వినియోగించుకునేందుకు ఆంట్రిక్స్, దేవాస్ కంపెనీల మధ్య ఒప్పందం కుదరడం తెలిసిందే. 2005 జనవరిలో జరిగిన ఒప్పందం ప్రకారం దేవాస్ సంస్థకు సుమారు రూ. 1,350 కోట్లకే (30 కోట్ల డాలర్లు) రెండు ఉపగ్రహాలకు చెందిన ట్రాన్స్పాండర్లను 12 ఏళ్లపాటు లీజుకిచ్చారు.  దేవాస్‌ తో ఒప్పందం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 2 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వార్తలు వెలువడటంతో కలకలం రేగింది. 

ప్రపంచకప్ క్రికెట్ ప్రారంభ వేడుకల దృశ్యాలు...






క్రికెట్ పండగ షురూ...

శనివారం తొలి మ్యాచ్ లో భారత్-బంగ్లా ఢీ ..

ఢాకా,ఫిబ్రవరి 17: రాక్‌స్టార్ బ్రయన్ ఆడమ్స్ మెరుపులు, ఉపఖండ సాంప్రదాయల మధ్య 43 రోజులపాటు క్రికెట్ అభిమానులకు పండగ సంబరాన్ని నింపే 10వ క్రికెట్ వరల్డ్ కప్‌ టోర్నమెంట్ ను  బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బంగబంధు స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల కేరింతల మధ్య క్రికెట్ పండగ మొదలైంది. వివిధ దేశాలకు చెందిన కెప్టెన్లను బంగ్లాలోని సంప్రదాయ రిక్షాలో కూర్చో బెట్టి స్టేడియంలోకి తీసుకువచ్చారు. ఈ టోర్నిలో 14 దేశాలు, 210 మంది క్రీడాకారులు పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్, ఎహసాన్, లాయ్‌లు, బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్, బంగ్లాదేశ్ కళాకారులు రునా, సబీనా యాస్మిన్, ముంతాజ్‌లు క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించారు. శనివారం జరిగే ప్రపంచకప్ క్రికెట్ ఆరంభ మ్యాచ్‌లో  బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.  ప్రపంచకప్‌లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ కప్ టోర్నిలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సేన విజయం సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈసారి ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంటుందన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. 
                               గురువారం ఢాకా లో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలలో
                                                  సైకిల్ రిక్షాపై వస్తున్న భారత కెప్టెన్ ధోని

జయప్రకాశ్ నారాయణ పై టీఆర్‌ఎస్ దాడి

హైదరాబాద్,ఫిబ్రవరి 17 :  లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం జేపీ విలేకర్లతో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. జయప్రకాశ్ నారాయణపై జరిగిన దాడిని అద్దుకున్న కాంగ్రెస్ నాయకుడు  పాలడుగు వెంకట్రావ్పై కూడా   టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు.  దాడి గురించి జయప్రకాశ్ నారాయణ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో డిప్యూటీ స్పీకర్ వైద్యులను పిలిపించి జేపీకి పరీక్షలు చేయించారు.  స్పీకర్ ఛాంబర్‌లో జేపీని పలువురు మంత్రులు, చిరంజీవి పరామర్శించారు. దాడి జరిగిన తర్వాత లోకసత్తా కార్యాలయంలో జయప్రకాష్ నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. సతమతమౌతున్న ప్రజాస్వామ్య విలువలకి ఈ దాడి  పరాకాష్ట అన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల భవిష్యత్‌కు, యువత భవిష్యత్ కోసం, సహజ వనరుల పంపిణి కోసం లోకసత్తా  కట్ట్టుబడి ఉందని   జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు కృష్ణా ఫేజ్-3 గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందటే ఆ ఘనత లోకసత్తాదేనన్నారు.  కాగా, సిద్దిపేటలో మెదక్ జిల్లా లోకసత్తా అధ్యక్షుడు శ్రీనివాస్‌పై తెలంగాణవాదులు దాడి చేశారు. జయప్రకాశ్ నారాయణపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టిన శ్రీనివాస్‌పై తెలంగాణవాదులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన శ్రీనివాస్‌ను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలావుండగా,  లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కాంగ్రెస్ నాయకుడు పాలడుగు వెంకట్రావ్‌లపై దాడిని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ తీవ్రంగా స్పందించింది. దాడికి  నిరసనగా శుక్రవారం సీమాంధ్ర విద్యాసంస్థల్ని మూసివేయాలని పిలుపునిచ్చింది. 

సిగ్గు,శరం విడిచిన తెలంగాణా ప్రజాప్రతినిథులు

అసెంబ్లీలో గవర్నర్ కు అవమానం
తలదించుకున్న ప్రజాస్వామ్యం

హైదరాబాద్,ఫిబ్రవరి 17: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు యుద్ధవాతావరణంతో మొదలయ్యాయి. సమావేశాల తొలి రోజైన గురువారం గవర్నర్ ప్రసంగిస్తుండగానే సభ రణరంగంగా మారింది. టీఆర్‌ఎస్, టీడీపీల తెలంగాణ సభ్యులు గవర్నర్ గో బ్యాక్ అని నినదిస్తూ.. నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ముందున్న మైకులు విరిచి, టేబుల్‌ను ధ్వంసం చేసి, ఆయన కుర్చీని లాగి పడేశారు. ఒక దశలో గవర్నర్‌పై దాడి చేయటానికి కూడా కీ ప్రయత్నించారు. జాతీయగీతం ముగియగానే ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించటం మొదలుపెట్టారు. వెంటనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేచి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. తమ చేతుల్లోని పేపర్లను చింపి గవర్నర్‌పైకి విసిరారు. పోడియం వద్దకు చేరుకుని నిరసనను తీవ్రం చేశారు. గవర్నర్ ముందున్న టేబుల్‌పై మైక్‌ను లాగివేశారు. ఇంతలో టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా సభలోకి వచ్చారు. వస్తూనే ఆందోళన మొదలుపెట్టారు. రేవంత్‌రెడ్డి, మహేం దర్‌రెడ్డి వంటివారు గవర్నర్ ఉన్న వేదిక పైకి వెళ్లి వెనుక నుంచి కుర్చీలు లాగి కిందపడేశారు. గవర్నర్‌ను తోయటానికి ప్రయత్నించారు.  రేవంత్‌రెడ్డి ఒకింత ఆవేశంగా భద్రతాసిబ్బందిని నెట్టుకుంటూ గవర్నర్‌ను తోసేయటానికి యత్నించారు. దాంతో పక్కనే ఉన్న శాసనమండలి చైర్మన్ చక్రపాణి కాలు బెణికింది. మరోపక్క టీఆర్‌ఎస్ సభ్యుల నిరసన తీవ్రస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. మైక్‌లను బలవంతంగా లాగిపారేశారు. మైక్ ఉన్న టేబుల్‌నూ లాగేశారు. ఈ దశలోనే గవర్నర్‌ పై దాడి చేయటానికి టీఆర్‌ఎస్ సభ్యులు ప్రయత్నించారు. అప్పటికే సభలోకి వచ్చిన మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ పరిణామాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. తాత్కాలిక మైక్‌ను ఏర్పాటు చేశాక గవర్నర్ మళ్లీ ప్రసంగం మొదలుపెట్టారు. దాంతో టీఆర్‌ఎస్ సభ్యులు ఆయనను అడ్డుకోవటం తీవ్రతరం చేశారు. ఈ దశలో టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యులు తమ కండువాలు, బ్యానర్లను నేరుగా గవర్నర్‌పైకి విసిరారు. ఇవి గవర్నర్‌  పై పడకుండా డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, సిబ్బంది ప్రయత్నించారు.ఇదే సమయంలో సభలోని రెండో వరుసలోని బల్లపైకి హరీష్‌రావు ఎక్కి చించిన కాగితాలను గవర్నర్‌పైకి విసరటం మొదలుపెట్టారు. ఆయనతోపాటు మరో సభ్యుడూ టేబుల్‌పైకి ఎక్కి ఆవేశంగా నినాదాలు చేశారు. హరీష్‌రావు టేబుల్‌పై నుంచి గవర్నర్‌ పై దూకే యత్నం చేశారు. మార్షల్స్ అడ్డుకోవటంతో వారిపై పడ్డారు. మరోపక్క టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి తదితరులు గవర్నర్ ఉన్న వేదికపైకి వెళ్లటానికి మళ్లీ ప్రయత్నించారు. ఈ గొడవలోనూ గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. చివరకు మార్షల్స్ టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యులు కొందరిని బయటకు పంపించారు. తర్వాత కొద్దిసేపటికే గవర్నర్ తన ప్రసంగాన్ని కుదించి ముగించారు. సుమారు 45 నిమిషాల పాటు సాగాల్సిన గవర్నర్ ప్రసంగం 9 నిమిషాల్లో ముగిసింది. గంటపాటు జరగాల్సిన సభ 14 నిమిషాల్లో పూర్తయింది. ఇదంతా జరుగుతున్న సమయంలో సభలోనే ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎం రోశయ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పీఆర్పీ నేత చిరంజీవిలతోపాటు మిగతా సభ్యులంతా నిశ్చేష్టులయ్యారు. 

Wednesday, February 16, 2011

ఆంధ్రకు చెందిన ఒరిస్సా ఐఎఎస్ అధికారిని కిడ్నాప్ చేసిన మావోలు

మల్కన్‌గిరి,ఫిబ్రవరి 17: : ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ వినీల్‌ కృష్ణను బుధవారం రాత్రి మావోయిస్టులు అపహరించారు. అతని విడుదలకు 48 గంటల గడువు విధించారు. ఆయన విడుదలకు మావోయిస్టులు 17 డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లతో కూడిన పత్రాన్ని మావోయిస్టులు ఆంగ్లభాషలో వినీల్ కృష్ణతోనే రాయించారు. జైలులో ఉన్న తమ ఖైదీలను విడుదల చేయాలని, కేంద్ర బలగాలను ఉపసహరించాలని, కూంబింగ్ ఆపాలని వాటిలోని ప్రధానమైన డిమాండ్. కలెక్టర్ వినీల్‌కృష్ణ విడుదలకు మావోయిస్టులు 48 గంటల గడువు ప్రకటించారు. వినీల్ కృష్ణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ కాగా ఆయన కుటుంబం గత 20 ఏళ్లుగా  హైదరాబాదులో ఉంటోంది. వినీల్ కృష్ణ ఐఐటి - మద్రాసు గ్రాడ్యుయేట్. 2005లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో చేరారు. 16 నెలల క్రితం మల్కన్‌గిరి కలెక్టర్‌గా వచ్చారు. ఒరిస్సాలోని చిత్రకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బడపదరలో జనసంపర్క్ శిబిరానికి హాజరైన కలెక్టర్‌ సాయంత్రం 4గంటలకు మజ్జి అనే జేఈతో కలసి శపపరమెట్ల గ్రామంలో పాఠశాల చూసేందుకు బైకుపై బయలుదేరారు.గమ్యం చేరుకునేలోగా మధ్యలోనే వారిని మావోయిస్టులు అపహరించారు. కలెక్టర్‌తో పాటు బడపదరలో జనసంపర్క శిబిరంలో పాల్గొన్న డీఆర్‌డీఏ పీడీ బల్వంత్‌సింగ్‌ చిత్రకొండకు తిరిగివచ్చారు. ఆయన తర్వాత రావాల్సిన కలెక్టర్‌ మాత్రం రాత్రి 10 గంటల వరకూ తిరిగిరాలేదు. వినీల్ కృష్ణను విడుదల చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తగిన సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ముందుకు వచ్చింది.

అసాధారణ భద్రత మధ్య ఇక 'సభా' పర్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 16:  శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలి సభ్యులనుద్దేశించి ఉదయం పదకొండు గంటలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ ప్రభావం అసెంబ్లీ సమావేశాలపై పడకుండా డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు, శాంతిభద్రతలు వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే కాంగ్రెస్‌లో విలీనం కావాలని నిర్ణయించిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అండగా నిలవనున్నారు.ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెరాస నిర్ణయించింది. అయితే తెరాస ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి నిర్ణయించింది.  తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా అసెంబ్లీ బందోబస్తుకు పారా మిలటరీ బలగాలను ఉపయోగిస్తున్నారు. సందర్శకులపై ఆంక్షలు విధించారు. నగర పోలీసు శాఖ 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సాయుధ బలగాలను అసెంబ్లీ చుట్టూ మోహరింప చేస్తున్నారు. మూడంచెల భద్రతా వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేస్నున్నారు. అడుగడుగునా తనిఖీలు చేయాలని, తగిన పాస్‌లు ఉంటే తప్ప ఎవరినీ లోనికి అనుమతించ వద్దని ఆదేశించారు. ఐదుగురు ఎసిపిలు స్వయంగా ఈ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 

అన్నవరం ఆలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభం

అన్నవరం,,ఫిబ్రవరి 16:    తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారి ప్రధాన ఆలయంలో పునర్నిర్మాణ పనులు  బుధవారం ప్రారంభించారు. దర్శనాలను బుధవారం ఉదయం నుండి నిలిపివేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలోనే తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాలాలయంలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు మాత్రమే ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ల దర్శనానికి అనుమతించారు. అనంతరం వేదపండితులు, అర్చకులు, వైదిక ప్రముఖుల పర్యవేక్షణలో కళాపకర్షణ, శిఖరంపై ఉండే కలశాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఉన్న ఆలయం స్థానంలోనే కొత్త ఆలయం నిర్మించనున్నందున పనుల సమయంలో మూలవిరాట్‌లకు నష్టం వాటిల్లకుండా భారీ చెక్కపెట్టెను రక్షణగా ఏర్పాటు చేసారు. పాత ఆలయం తొలగింపునకు సుమారు 40 రోజులు, కొత్త ఆలయ నిర్మాణానికి సుమారు 8 నెలల సమయం పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో సుమారు 10 నెలల వరకు బాలాలయంలోని ఉత్సవమూర్తులనే భక్తులు దర్శించుకోవాల్సివుంటుంది. ఇక ఆలయంలో నిర్వహించే వ్రతాలు, కల్యాణాలు యథావిథిగా జరుగుతాయని దేవస్థానం వర్గాలు తెలిపాయి. 

రాజకీయాలకు నరేష్ గుడ్‌బై

చిత్తూరు,ఫిబ్రవరి 16:  రాజకీయాలకు తాను స్వస్తి  చెప్పానని, ఇకనుంచి సేవా కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తానని సినీనటుడు, బీజేవైఎం రాష్ట్ర మాజీ నాయకుడు నరేష్ వెల్లడించారు. బుధవారం ఆయన పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో సతీసమేతంగా విలేకరులతో మాట్లాడారు. పార్టీలకతీతంగా సేవ చేసేందుకు ‘ఐడియా’ స్వచ్ఛం ద సంస్థను ఏర్పాటు చేశానని, దీనిద్వారా రాయలసీమలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడతానన్నారు. భగవాన్ సత్యసాయిబాబా చేపట్టిన సేవాకార్యక్రమాలకు స్పందించి, ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెరర్ స్ఫూర్తిగా ఈ   నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాయలసీమ చరిత్ర, వాతావరణం, ఇక్కడి ప్రజల అభిమానం తనను కట్టిపడేశాయన్నారు. అనంతపురం జిల్లా మడకశిర నివాసి, మంత్రి రఘువీరారెడ్డి సోదరుని కుమార్తె రమ్యను తాను ప్రేమవివాహం చేసుకున్నానని, ఆమెకూడా సేవాదృక్పథం కలిగి ఉండడంతో ఐడియా సేవాసంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

న్యూజిలాండ్‌పై భారత్ విజయం

చెన్నై ,ఫిబ్రవరి 16:  ప్రపంచకప్ క్రికెట్ సన్నాహక పోటీల్లో భాగంగా బుధవారమిక్కడ జరిగిన వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 361 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 43.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటయింది. భారత బౌలర్లలో హర్భజన్, యువరాజ్, పీయూష్ చావ్లా, నెహ్రా రెండేసి వికెట్లు తీశారు. ఆశ్విన్‌కు ఒక వికెట్ దక్కింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది.

ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలపై ఫలించని చర్చలు

హైదరాబాద్ ,ఫిబ్రవరి 16: ఫీజు రీఎంబర్స్ మెంట్  బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలతో మంత్రి మండలి ఉప సంఘం బ్య్ధవారం రెండవసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఫీజులు, ఉపకారవేతనాల కింద వెయ్యి కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. దశలవారీగా అక్టోబర్ వరకు 25 శాతం చొప్పున బకాయిలు చెల్లిస్తామని తెలిపింది. అందుకు యాజమాన్యాలు అంగీకరించలేదు. ఈనెల 20వ తేదీలోపు 50 శాతం, 28లోపు మొత్తం బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. లేకుంటే ఈ నెల 24 నుంచి కాలేజీలను మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేశాయి.
18 నుంచి ఏడు రోజుల పాటు నిరాహారదీక్ష జగన్
కాగా, ఫీజు రీయింబర్స్'మెంటు కోసం హైదరాబాద్'లో ఈ నెల   చేయనున్నట్లు  మాజీ ఎం.పి. వైఎస్ జగన్మోహన రెడ్డి  ప్రకటించారు. ఫీజు రీయింబర్స్'మెంటుపై సుప్రీం కోర్టు మొట్టికాయవేసినా సిగ్గులేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇక బాబుతో అమీతుమీకి నాగం సిద్ధం...!

హైదరాబాద్ ,ఫిబ్రవరి 16: తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందంటూ  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగు ల మహా ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ అంశం విషయంలో టిడిపి రెండుగా చీలిపోయిందని చెప్పారు. తెలంగాణ కోసం తెలంగాణ టిడిపి ఫోరం కట్టుబడి ఉందని చెప్పారు. టిడిపి తెలంగాణ నేతలు అందరూ తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. తెలంగాణ టిడిపిలో ఎవరైనా ద్రోహులు ఉంటే వారి పని పడతామని  హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేకి అయిన గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అడ్డుకుంటామని నాగం స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదన్నారు. ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా  ఆయన పరోక్షంగా చంద్రబాబు నుద్దేశించి  అన్నారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సర్కారుకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయాని అన్నారు.   తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానిని, కేంద్రాన్ని తెలంగాణకు ఒప్పించిన తర్వాతే హైదరాబాద్ తిరిగి రావాలన్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరితో నాగం జనార్దన్ రెడ్డి పూర్తిగా విసిగిపోయి ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఏ కమిటీ ముందైనా హాజరవుతా...

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై తాను ఏ కమిటీ ముందైనా హాజరవుతానని, అందుకు తాను భయపడడం లేదని ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ముందు హాజరవుతానని ఇప్పటికే చెప్పానని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటైతే ఆ కమిటీ ముందు కూడా హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. టీవీ చానెళ్ల సంపాదకులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన బుధవారం వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల బాధ్యత పూర్తిగా టెలికం మాజీ మంత్రి ఏ రాజాదే అని ఆయన చెప్పారు. 2009లో రాజాకు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించే స్థితిలో తాను లేనని, తాను సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సంకీర్ణ ధర్మంలో రాజీ పడక తప్పదని ఆయన అన్నారు. ముందొచ్చినవారికి ముందు కేటాయింపులు అనే విధానం తనకు తెలియదని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో అన్ని కోణాల్లో తనకు వివరణ ఇవ్వాలని తాను 2007 నవంబర్‌ 2వ తేదీన తాను రాజాకు లేఖ రాసినట్లు, స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏ విధమైన అవకతవకలు జరగలేదని రాజా జవాబు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ట్రాయ్, టెలికం శాఖ, ఆర్థిక శాఖ అనుమతుల తర్వాతనే 2జి స్పెక్ట్రమ్ వేలాలు జరిగాయని ఆయన చెప్పారు. తాను పిఎసి ముందు హాజరవుతానని ఇప్పటికే బహిరంగంగా చెప్పానని, ఏ కమిటీ ముందైనా హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఎస్ బ్యాండ్ కుంభకోణంపై సమయానుకూలంగా సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. యాంత్రిక్స్, దేవాస్ ఒప్పందంపై అన్ని ప్రభుత్వ విభాగాల్లో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Tuesday, February 15, 2011

పోలీసులలో టెన్షన్ టెన్షన్

 ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు--  మరోవైపు తెలంగాణ ఆందోళనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఆందోళనలు, మరోవైపు  అసెంబ్లీ సమావేశాల్నేపథ్యంలో పోలీసు యంత్రాంగం  టెన్షన్ టెన్షన్ గా ఉంది  అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతుండగా టిఆర్‌ఎస్ ఈ నెల 19న జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. ఇటు చూస్తే సహాయనిరాకణకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్‌కు వచ్చే అన్ని జాతీయ రహదారులను దిగ్బంధనం చేసేందుకు టిఆర్‌ఎస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ రోజు హైవేలపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతుంది. తెలంగాణ సరిహద్దుల్లో రహదారులపై వాహనాలను నిలిపి వేసి రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తే ప్రయాణీకులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో ఉన్న పారా మిలటరీ బలగాలను శాంతిభద్రతల పరిస్థితి తలెత్తితే అదుపు చేసేందుకు మోహరిస్తున్నారు. హైవేలపై పోలీసు పెట్రోలింగ్ కూడా విస్తృతం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున అక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థను నగర పోలీసులు ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ నుంచి సచివాలయం, అసెంబ్లీ వరకు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. నగరంలో అదనపు పారామిలటరీ బలగాలను సచివాలయం ముందు ఇప్పటికే మోహరించారు.

రెండవ వార్మప్ మ్యాచ్‌లోనూ ఓడిన ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15:   వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా నిర్వహించిన రెండవ  వార్మప్ మ్యాచ్‌లోనూ పాంటింగ్ బృందానికి చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా...మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 47.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. 218 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 44.2 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి అధిగమించింది.

9.5 శాతం కానున్న ఈపీఎఫ్ వడ్డీ రేటు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15:  ఉద్యోగులు తమ భవిష్యనిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 2010-11కి సంబంధించి, 1 శాతం అదనంగా, 9.5 శాతం పొందే అవకాశం ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. దీనివల్ల 4.71 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు త్వరలో ఆర్థికశాఖ ఆమోదం లభించే అవకాశం ఉందని చెప్పారు. ‘ఈపీఎఫ్‌పై 9.5 శాతం వడ్డీ రేటు ప్రతిపాదనపై ఆర్థికశాఖ కొన్ని వివరణలు కోరింది. కార్మికశాఖ వాటికి జవాబులు పంపింది’ అని ఖర్గే వివరించారు. 2005-06 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది.

సీరియల్ కిల్లర్ సురీందర్ కోలీకి మరణ శిక్ష

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15: నిథారీ హత్యల కేసులో సీరియల్ కిల్లర్ సురీందర్ కోలీకి సుప్రీంకోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. 2005లో జరిగిన పద్నాలుగేళ్ల బాలిక హత్య కేసులో అతడికి ఈ శిక్ష విధించింది.నిందితుడిపై ఎలాంటి దయా దాక్షిణ్యాలను ప్రదర్శించలేమని జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ జ్ఞాన్‌సుధా మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిథారీలో 2005-06 మధ్య జరిగిన వరుస హత్యలు అత్యంత కిరాతకమైనవని, ఇవి అరుదైన వాటిలో అరుదైన కేసులని అభివర్ణిస్తూ, నిందితుడు సీరియల్ కిల్లర్‌గా స్పష్టమవుతోందని పేర్కొంది. నిథారీలో జరిగిన రింపా హల్దర్ అనే బాలిక హత్య కేసుపై ‘సుప్రీం’ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. 
                                 ప్రజల సందర్శనార్ధం మంగళవారం నుంచి తెరిచిన రాష్ట్రపతి భవన్ లోని
                                  మొగల్ గార్డెన్స్ లో పూల సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న ప్రతిభా పాటిల్

జగన్ తో పోటీ కి ' సై' అంటున్న వివేకా అల్లుడు !

హైదరాబాద్,ఫిబ్రవరి 15: వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పై  అయన బాబాయి, రాష్ట్ర మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. మంగళవారం ఆయన మావయ్య వివేకాతో కలిసి ఢిల్లీ వెళ్లారు. జగన్ పై పోటీ చేసే అవకాశాన్ని తనకే ఇవ్వాలని ఆయన సోనియా గాంధీని అభ్యర్థించేందుకు వెళ్లారు. తాను కూడా వైఎస్సార్ కుటుంబానికి చెందిన వ్యక్తినే కనుక తనకు ఆ అవకాశాన్ని ఇవ్వాలని నర్రెడ్డి కోరుతున్నారు. జగన్‌తో కుటుంబంపరమైన ఇబ్బందులు ఏమీ లేవనీ, కేవలం రాజకీయ వైరం మాత్రమే ఉన్నదన్నారు. జగన్‌పై పోటీ చేసేందుకు వీలుగా అధిష్టానం తనకు అవకాశం ఇస్తే జగన్‌ను  చిత్తుగా ఓడిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే తాను నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు జగన్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో నర్రెడ్డి కూడా కడప పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. ఇక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విజయమ్మను జగన్ దించే అవకాశాలు ఉన్నాయి. ఆమెపై వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...