Thursday, June 26, 2014

బీజేపీ వైపు కిరణ్‌ చూపు ?

హైదరాబాద్, జూన్ 26 : మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య  గురువారం జరిగిన భేటీ  ఈ ప్రచారానికి బలమిస్తోంది.   కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌తో సమావేశం  వాస్తవమేనని, అయితే  తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని తెలిపారు.కిరణ్‌కుమార్‌రెడ్డి తన వర్గానికి చెందిన 30 మంది నేతలతో బీజేపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధమవుతోందని,  దీనికి బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. 

ఏ.పి. విద్యుత్ కష్టాలు తీరుస్తాం...కేంద్రం హామీ

న్యూఢిల్లీ, జూన్ 26 : ఆంధ్రప్రదేశ్‌ను  విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కిస్తానని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గోయల్‌ హామీ ఇచ్చారు.  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  బుధవారం నాడు తమను కలసిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. విభజన నేపథ్యంలో విద్యుత్ వాడకం విషయంలో ఆంధ్రపదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అయితే తెలంగాణకు నష్టం జరగకుండా ఏపీకి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని చంద్రబాబు గోయల్‌ను కోరినట్లుగా సమాచారం. ఏపీ విద్యుత్‌కు సంబంధించి వీడియో ప్రజెంటేషన్ కూడా బాబు అందజేశారు. దీనిపై స్పందించిన గోయల్ మాట్లాడుతూ 500 మెగా వాట్ల అదనపు విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి కొత్త ప్రణాళికను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఈలోగా కొంత సర్దుబాటు జరుగుతుందని ఆయన అన్నారు. 4 వేల మెగావాట్ల విద్యుత్‌కు సంబంధించి సోలార్ విద్యుత్ ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. దీనికి సుమారు 10 వేల ఎకరాల భూమి సేకరించవలసి ఉంటుందని, రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఏపీలో ఏర్పాట్లు చేసుకోవాలని గోయల్ సూచించారు.

Wednesday, June 25, 2014

30న పీఎస్ఎల్‌వీ-సీ23 రాకెట్‌ ప్రయోగం....

హైదరాబాద్, జూన్ 25:  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ నెల 30న ఉదయం 9.49 గంటలకు ప్రయోగించేందుకు పీఎస్ఎల్‌వీ-సీ23 రాకెట్‌ను సిద్ధం చేసినట్లు ఆ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు.  పీఎస్ఎల్‌వీ శ్రేణిలో 27వ ప్రయోగమైన పీఎస్ఎల్‌వీ-సీ23 రాకెట్‌ను ఇస్రో వాణిజ్యపరంగా వినియోగిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ దేశానికి చెందిన 714 కిలోల స్పాట్-7 ఉపగ్రహంతో పాటు జర్మనీకి చెందిన 14 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్7.1, ఎన్ఎల్ఎస్-7.2 (15 కిలోల చొప్పున బరువు కలిగిన) ఉపగ్రహాలను, సింగపూర్ దేశానికి చెందిన 7 కిలోల వెలాక్స్-1 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.  ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు.

ఏపీలో రుణమాఫీకి ఆధార్ లింక్...

హైదరాబాద్, జూన్ 25:   ఏపీలో రైతుల రుణమాఫీకి  ఆధార్ ను లింక్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి  పత్తిపాటి పుల్లారావు చెప్పారు. రుణం మాఫీ చేయాలంటే లబ్ధిదారుడు ఆధార్ కార్డును చూపాలని ప్పుల్లారావు చెప్పారు. చాలామంది నకిలీ పాస్‌ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆయన తెలిపారు. ఆ విధంగా రుణం పొందినవారిని నియంత్రించేందుకే ఆధార్‌ ఆలోచన అని మంత్రి చెప్పారు.

టి.ఆర్.ఎస్. లో చేరిన 11 మంది ఎమ్మెల్సీలు..

హైదరాబాద్, జూన్ 25 ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు టి.డి.పి. ,ఇద్దరు  బీఎస్పీ, ఇద్దరు పి.ఆర్.టి. ఎమ్మెల్సీలు కేసీఆర్ సమక్షంలో  గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పటిష్టమైన తెలంగాణ కోసం రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన మానని గాయమంటూ గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో చెప్పడం దారుణమని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు టీఆర్ఎస్ వ్యతిరేకం కాదని.. దీని వల్ల గిరిజన కుటుంబాలు నష్టపోతాయని, అందుకే పోలవరం డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, ఇంకా ఎందుకు తెలంగాణ ద్రోహ పార్టీ (టీడీపీ)లో కొనసాగుతారని కేసీఆర్ ప్రశ్నించారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌, ఆమోస్‌, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాజలింగం, టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, సలీం, పీఆర్టీయూ ఎమ్మెల్సీలు పూల రవీందర్‌, జనార్దన్‌రెడ్డి తదితరులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 

Tuesday, June 24, 2014

మియామిలో కాల్పులు:ఇద్దరి మృతి

వాషింగ్టన్, జూన్ 24:  అమెరికాలో మళ్లీ కాల్పులు సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి  మియామీలోని లిబర్టీ సిటీలో  జరిగిన కాల్పుల దుర్గటనలో ఇద్దరు వ్యక్తులు మరణించచిగా మరో నలుగురు గాయపడ్డారు.  కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి జాక్సన్ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మరణించారు.  వివరాలు ఇంకా అందాల్సివుంది.

అసెంబ్లీలో జగన్ వర్సెస్ బాబు...

హైదరాబాద్, జూన్ 24 : ఆర్‌బీఐ అనుమతి లేకపోతే రుణ మాఫీ కష్టమంటున్న చంద్రబాబు ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయారని విపక్ష నేత వైఎస్ జగన్  మంగళవారం శాసన సభలో ప్రశ్నించారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని జగన్ అన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలైందని పాత రుణాలు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని, రైతులకు నోటీసులు కూడా వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ వర్తిస్తుందో క్లారిటీ లేదని...కేంద్రం, ఆర్బీఐ సహాయం అవసరమంటూ కొత్త మాట వినిపిస్తున్నారని జగన్ అన్నారు.  జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగమన్న భావన ప్రజల్లో ఉందని, ఇప్పుడు ఉద్యోగాల మాటే లేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి అమలు అవుతుందో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో తమకు సంబంధం అంటగడుతున్న వారుకిరణ్ ప్రభుత్వాన్ని కాపాడలేదా? అని జగన్ ప్రశ్నించారు. అనంతరం  ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తాము రైతు రుణ మాఫీ చేసి తీరతామని స్పష్టం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయవద్దని ఆనాడు వైఎస్ కేంద్రానికి సూచించారని అన్నారు.  రుణమాఫీపై తమకు పూర్తి క్లారిటీ ఉందని, ప్రజల భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని  తేల్చిచెప్పారు.

మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి మృతి...

హైదరాబాద్, జూన్ 24 :  మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి మంగళవారం ఉదయం కాకినాడలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌లో సీనియర్‌నేతగా వెలుగొందిన వెంకట్‌రెడ్డి తూగో జిల్లా పామర్రు, ఆలమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పనిచేశారు. 

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

హైదరాబాద్, జూన్ 24 : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలవడంతో నిర్మలా సీతారామన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ జనార్ధన్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానానికి ళీ ఏర్పడింది. పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యురాలు కాకుండానే కేంద్రమంత్రిగా భాద్యతల్ని చేపట్టిన నిర్మలా సీతారామన్ ను బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీకి దింపింది.   నిర్మలా సీతారామన్ కు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం మద్దతు తెలిపింది. వాస్తవానికి ఎన్నిక జూలై 3 తేదిన జరగాల్సి ఉండగా.. ఈ స్థానానికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.

Monday, June 23, 2014

సచిన్ గౌరవార్థం ఈస్ట్ ఇండియా కంపెనీ బంగారు నాణెం..

లండన్, జూన్ 23 :   క్రికెట్ రంగానికి సచిన్ అందించిన సేవలకు గుర్తుగా బ్రిటన్ కు చెందిన వ్యాపారస్థంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ అరుదైన బంగారు నాణాన్ని విడుదల చేసింది. సచిన్ గౌరవార్ధం 12 వేల పౌండ్ల స్టెర్లింగ్ విలువ కలిగిన నాణానికి పూర్తి చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటాయని ఈస్ట్ ఇండియా కంపెనీ వెల్లడించింది. 24 ఏళ్ల కెరీర్ లో క్రికెట్ కు అత్యత్తమ సేవలందించినందుకుగాను అరుదైన నాణాన్ని విడుదల చేసామని ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అతి తక్కవ మంది మాత్రమే ఇప్పటి వరకు చూసిన 200 గ్రాముల బరువుతో ఉండే 210 బంగారు నాణాలు విడుదల చేశామన్నారు. అందమైన బాక్సులో అమర్చిన నాణెంతోపాటు అధికారిక ధ్రువపత్రంతోపాటు సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్ ను అందించారు. 

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ ఖరారు..

హైదరాబాద్, జూన్ 23 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించింది.  లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదివేల జనాభా ఉన్న ప్రాంతాల్లోని వైన్ షాప్‌ల దగ్గర పర్మిట్ రూం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
వైన్ షాపుల రేట్లు :
* పదివేల లోపు జానాభా ఉన్న గ్రామాలు : రూ.32.5 లక్షలు
* 10 -50 వేల లోపు జానాభా పట్టణాలు : రూ. 36 లక్షలు
* 50 వేల నుంచి 3 లక్షల జనాభా నగరాల్లో : రూ.45 లక్షలు
* 3 నుంచి 5 లక్షల జనాభా : రూ.50 లక్షలు
* 5 నుంచి 20 లక్షల జనాభా ఉన్న నగరాల్లో : రూ.65 లక్షలు

Friday, June 20, 2014

మోడీ తొలి కఠిన నిర్ణయం...రైలు ప్రయాణం భారం...

న్యూఢిల్లీ,జూన్ 20 :  రైలు ఛార్జీలు పెరిగాయి. ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం చొప్పున, సరుకు రవాణా ఛార్జీలను 6.5 శాతం చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కఠిన నిర్ణయాలు  తప్పవని ప్రధాని నరేంద్ర మోడీ కొంత కాలంగా చెబుతూ వస్తుండటం, అలాగే రైల్వే మంత్రి సదానంద గౌడ కూడా రైలు ఛార్జీల పెంపు గురించి ప్రస్తావిస్తుండటం తెలిసిందే. అందుకు అనుగుణంగానే రైలు ఛార్జీలను పెంచారు. పెరిగిన ఛార్జీలు తక్షణం అమలులోకి వచ్చాయని కేంద్రం తెలిపింది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల ఛార్జీలు ఇంత పెద్దమొత్తంలో ఎప్పుడూ పెరగలేదు. అటు రవాణాతో పాటు ఇటు ప్రయాణికుల ఛార్జీలను కూడా భారీగా పెంచారు. ప్రధానంగా డీజిల్ ధరలు గణనీయంగా పెరగడం, విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగిన నేపథ్యంలో నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో ఛార్జీల పెంపు తప్పలేదని అంటున్నారు.

Thursday, June 19, 2014

విభజన తర్వాత తెలంగాణలో ఇంధన కొరత...

హైదరాబాద్, జూన్ 19 :  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  విభజనకు ముందు విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాద్ నుంచి రామగుండం, వరంగల్ ఐఓసీ డిపోలకు రైల్వే ట్యాంకర్లద్వారా ఇంధనం సరఫరా అయ్యేది. ఆయా డిపోల నుంచి జిల్లాల్లో ఉన్న పెట్రోల్ బంకులకు ట్యాంకర్లతో పెట్రోల్, డీజిల్‌లను సరఫరా చేసేవారు. విజయవాడ ఐఓసీ మెయిన్ పాయింట్ నుంచి వరంగల్ డిపోకు... హైదరాబాద్ చర్లపల్లి నుంచి రామగుండం డిపోకు రైల్యే ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజీల్ వచ్చేది. వరంగల్ డిపో నుంచి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పెట్రోల్ బంక్‌లకు, రామగుండం డిపో నుంచి కరీంనగర్ , నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు డీజీల్, పెట్రోల్ పంపిణీ అయ్యేది. అయితే విభజన తర్వాత విజయవాడ మెయిన్ పాయింట్ నుంచి వరంగల్ డిపోకు సరఫరా నిలిచిపోయింది. రామగుండంలోని ఐవోసీలో స్టాక్ లేకపోవడంతో ఆ ప్రభావం పంపిణీపై పడింది. మూడు జిల్లాలకు కేటాయించాల్సిన ఇంధనాన్ని ఆరు జిల్లాలకు పంపిణీ చేయాల్సి వస్తోంది. రామగుండం డిపో నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు 4 వేల లీటర్ల పెట్రోల్, 20 వేల లీటర్ల డీజిల్ సరిపోయేది. ప్రస్తుతం వరంగల్ జిల్లాకు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేయాల్సి రావడంతో డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది. విజయవాడ నుంచి ట్యాంకర్లు వస్తే అధిక టాక్స్ పడుతుందనే ఉద్దేశంతో ఆయిల్ ట్యాంకర్లు సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.


ఎ.పి. అసెంబ్లీ స్పీకర్ గా కోడెల..

హైదరాబాద్, జూన్ 19 : ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 9-22 గంటలకు స్పీకర్‌గా ఆయన ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక కోసం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని కలుసుకుని స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపాల్సిందిగా కోరగా అందుకు జగన్ సానుకూలంగా స్పందించి కోడెలకు మద్దతు తెలిపారు. దీంతో కోడెల శివప్రసాద్ పేరును పార్టీ ఖరారు చేసింది.   ఎపి శాసన సభలో టిడిపి, అధికార టిడిపి మిత్రపక్షం బిజెపి, ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెసు పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేరు.  కోడెల నర్సారావుపేట నుండి గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలుపొందారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

Wednesday, June 18, 2014

ఇరాక్‌లో తెలంగాణ పౌరుల రక్షణకు సచివాలయంలో హెల్ప్‌లైన్‌...

హైదరాబాద్,జూన్ 18:  ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల రక్షణకు సచివాలయంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామని ప్రత్యేక కార్యదర్శి రమణారెడ్డి తెలిపారు. 040-2322 0603తో పాటు మొబైల్: 94408 54433 నంబర్లతో ఫోన్లు ఏర్పాటు చేశారు. అలాగే సొ_న్రి@తెలంగన.గొవ్.ఇన్ అనే ఈ మెయిల్ ఐడీని ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయంలో మొబైల్ నంబర్లు 00964 770 444 4899; 00964 770 484 3247 కూడా అందుబాటులో ఉంటాయి.

Tuesday, June 17, 2014

ఫీజు రీఎంబర్స్ మెంటు ఎవరిది వారిదే...

హైదరాబాద్, జూన్ 16:  ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ 2014-15 విద్యా సంవత్సరంలో పాత విధానం ప్రకారమే ఫీజు రీఎంబర్స్ మెంటు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.  స్థానికత ఆధారంగా ఏ రాష్ట్ర విద్యార్థుల ఫీజులను ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని అఖిల పక్ష సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు సీమాంధ్రతోపాటు దేశంలోని ఏ ప్రాంతంలో చదువుతున్నా పాత నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తారు. అలాగే, తెలంగాణలో చదువుకుంటున్న సీమాం«ద్ర విద్యార్థుల ఫీజులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రీయింబర్స్‌మెంట్ పథకం కింద కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికత ఆధారంగా ఏ రాష్ట్ర విద్యార్థుల బకాయిలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకంలో ఇప్పటికే ఉన్న నిబంధనలను ఇక ముందు కూడా పాటించాలని నిర్ణయించారు. ఫీజుల పథకానికి సంబంధించి అఖిలపక్షంలో ఏకాభిప్రాయం రావడంతో నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుంది. 

Monday, June 16, 2014

అవును ముళ్ళకిరీటమే...బాబుకు అర్ధమవుతున్న వాస్తవం...

రామకుప్పం, జూన్ 16 : ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ముళ్ల కిరీటం వంటిదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా సోమవారం సొంత నియోజకవర్గం రామకుప్పం పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆర్థిక వనరులు లేవని, జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవని అన్నారు. అయితే కష్టపడడం తనకు కొత్తకాదని, 24 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రంలో మనం భాగస్వాములమని, కేంద్ర సహకారం ఉందని ఆయన అన్నారు. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన హామీలన్నీ  అమలు చేస్తాను తప్పా వెనుతిరిగేది లేదని ఆయన స్పష్టం చేశారు.  రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకుని ఏపీని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. నీరు-మీరు కార్యక్రమంతో కరువును ఎదుర్కొంటామని బాబు వెల్లడించారు.

Sunday, June 15, 2014

ఆదివారం భూఠాన్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి థింపూ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న ఆ దేశ ప్రధాని షెరింగ్... 

సరోగసి ద్వారా ఆడపిల్లను కన్న మంచు లక్ష్మీ....

హైదరాబాద్, జూన్ 15 : నటుడు, దర్శక, నిర్మాత మోహన్‌బాబు కుమార్తె నటి మంచు లక్ష్మీ తల్లి అయింది.  బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్, షారూక్ ఖాన్ తరహాలో మంచు లక్ష్మీ కూడా సరోగసి ద్వారా ఆడ శిశువుకు జన్మ నిచ్చింది. ఫాదర్స్ డే రోజున  తండ్రి మోహన్‌బాబును తాతను చేస్తూ ఆయనకు మనవరాలిని కానుకగా ఆందించారు.  సృష్టికి ప్రతి సృష్టి చేయగల విధానమే సరోగసీ. అద్దె గర్భం. పిల్లలు ఇక పుట్టరు  అనుకొన్న దంపతులు సరోగసీ విధానం ద్వారా బిడ్డను కనvacchu. ఒక దంపతులకు సంబంధించిన పిండం వేరొక స్త్రీ గర్భాశయంలో 9 నెలలు పెరిగి జన్మించడం ద్వారా వచ్చిన శిశువును సరోగసీ (అద్దె గర్భం) శిశువు anTaaru.  స్త్రీలలో ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా గర్భాశయ వ్యాధులు ఉన్నప్పుడు లేదా గర్భాశయం చిన్నదిగా ఉండటం, వ్యాధులు సోకడం వల్ల గర్భాశయాన్ని తీసివేసినప్పుడు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సరోగసీ అవసరమవుతుంది. సరోగఫీ విధానంలో భాగంగా భార్యాభర్తలలో స్త్రీ నుంచి అండాన్ని, అదే విధంగా పురుషుని నుంచి శుక్రకణాలను సేకరించడం జరుగుతుంది. వీటిని ప్రయోగశాలలో కృత్రిమంగా ఫలదీకరణం చెందించి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తారు. సంయుక్త బీజం విభజన చెంది కొన్ని కణాల దశలో పిండంగా వున్నపడు సరోగసీ తల్లి (వేరొక మహిళ) గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

Tuesday, June 3, 2014

మోడీ సర్కార్ లో అపశృతి....రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం

న్యూఢిల్లీ, జూన్ 3 : కేంద్ర గ్రామీణ, తాగునీరు, పారిశుద్ధ్య మంత్రి గోపీనాథ్ ముండే( 64) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు కారులో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మోతీబాగ్ సమీపంలో ఉదయం 6:30 గంటలకు ముండే ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గోపినాథ్‌ను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7:20 గంటలకు ముండే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రమాదంలో ముండేకు బలమైన గాయలు ఏమీ కాలేదని, తీవ్ర ఆందోళన వల్లే ముండే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. డిసెంబర్ 12, 1949లో గోపినాథ్ ముండే జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో బీడ్ నుంచి 2 లక్షల మెజార్టీతో ముండే విజయం సాధించారు. కేంద్ర గ్రామీణ, తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిగా ముండే బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా కూడా ముండే పనిచేశారు. గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో ముగినిపోయారు. బుధవారం మహారాష్ట్రలోని లాతూర్‌లో గోపినాథ్ ముండే అంత్యక్రియలు జరుగనున్నాయి.

కొలువుదీరిన కేసీఆర్...12మందితో ప్రభుత్వ ఏర్పాటు

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ తొలి ప్రభుత్వం 12మందితో కొలువుదీరింది. సోమవారం ఉదయం 8.20కి రాజ్‌భవన్‌లో కె చంద్రశేఖర్‌రావుచేత ముఖ్యమంత్రిగా గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా నాయిని నర్సింహ్మారెడ్డి (హైదరాబాద్), ఈటెల రాజేంద్ర (కరీంనగర్), టి హరీశ్‌రావు (మెదక్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (నిజామాబాద్), మహమూద్ అలీ (హైదరాబాద్), టి రాజయ్య (వరంగల్), కల్వకుంట్ల తారక రామారావు (కరీంనగర్), టి పద్మారావు (హైదరాబాద్), మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), జి జగదీశ్‌రెడ్డి (నల్లగొండ), జోగురామన్న (ఆదిలాబాద్)లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 12 మందితో కూడిన మంత్రివర్గంలో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చారు. మైనారిటీ కోటా కింద మంత్రివర్గంలో స్థానం సంపాదించిన మహమూద్ అలీని, వరంగల్ జిల్లా నుంచి గెలిచిన దళిత వర్గానికి చెందిన టి రాజయ్యను ఉప ముఖ్యమంత్రులు చేశారు.  కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించేందుకు ప్రయత్నించారు. కేబినెట్‌లో నలుగురు రెడ్లు, ముగ్గురు వెలమలు ఉన్నారు. ఈటెల రాజేంద్ర, టి పద్మారావులు బీసీలు కాగా, ఎస్సీ వర్గం నుంచి జోగు రామన్న, రాజయ్యలకు అవకాశం కల్పించారు. మంత్రివర్గంలో ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం కల్పించలేదు. అదేవిధంగా మహిళలకూ ప్రాధాన్యత దక్కలేదు.
నాయినికి కీలక హోం శాఖ.....హరీశ్‌కు సాగునీటిపారుదల....కేటీఆర్‌కు ఐటి, పంచయతీరాజ్
 తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలతోపాటు, మున్సిపాలిటీ పరిపాలన- పట్టణాభివృద్ధి, ఎనర్జీ, కోల్, జిఎడిలతోపాటు మంత్రులకు కేటాయించని శాఖలను నిర్వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి రెవెన్యూ, సహాయ, పునరావాసం, అర్బన్ ల్యాండ్ సీలింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు కేటాయించారు. మరో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్యకు వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. నాయిని నర్సింహ్మారెడ్డికి హోంశాఖ, జైళ్లు, ఫైర్ సర్వీస్, సైనిక సంక్షేమం, కార్మిక ఉపాధి శాఖలు కేటాయించారు. ఈటెల రాజేందర్‌కు ఆర్థిక, ప్రణాళిక, చిన్నతరహా పొదుపు మొత్తాలు, లాటరీలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖలు కేటాయించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ, పశు సంవర్థక శాఖ, ఫిషరీస్, డైయిరీ డెవలప్‌మెంట్, సీడ్స్ కార్పొరేషన్ శాఖలు కేటాయించారు.టి హరీశ్‌రావుకు సాగునీటిపారుదల, మార్కెటింగ్, శాసన సభా వ్యవహారాలు, టి పద్మారావుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అప్పగించారు. పి మహేందర్‌రెడ్డికి రవాణా శాఖ, కల్వకుంట్ల తారక రామారావుకు పంచాయతీరాజ్, ఐటి శాఖలు అప్పగించారు. జోగు రామన్నకు అటవీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. జగదీష్‌రెడ్డికి విద్యాశాఖ అప్పగించారు. 


బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...