Tuesday, November 29, 2011

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ విజయం

కటక్,నవంబర్ 29: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. 212 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మిడిల్ ఆర్డర్‌ను రోచ్, రస్సెల్ కుప్పకూల్చారు. ఓదశలో 159 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును రోహిత్ శర్మ, వినయ్ కుమార్‌లు లక్ష్యం వైపు నడిపించారు. విజయానికి 12 కావాల్సివుండగా రోహిత్ శర్మ 72 పరుగులు చేసి సమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత యాదవ్‌, ఆరోన్ కలిసి విజయానికి కావల్సిన పరుగుల్ని ఇంకా ఏడు బంతులుండగానే  అందించారు.  యాదవ్ 6, ఆరోన్ 6 పరుగులుతో నాటౌట్‌గా నిలిచారు.  విండీస్ బౌలర్లలో రోచ్ 3, రస్సెల్ 2, మార్టిన్, సమీ, పొలార్డ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.  కాగా భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో బ్రావో అత్యధికంగా 60, హ్యాత్ 31 పరుగులు చేశారు. యాదవ్, ఆరోన్‌లు రెండేసి వికెట్లు, వినయ్, అశ్విన్, జడేజా, రైనా చెరో వికెట్ పడగొట్టారు.  

అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి కన్నుమూత

గౌహతి,నవంబర్ 29:  ప్రముఖ అస్సామీ రచయిత్రి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామి కన్నుమూశారు. 69ఏళ్ల గోస్వామి ఈ ఏడాది ఫిబ్రవరి 12న కోమాలోకి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం  ఉదయం గుండెపోటుతో మరణించారు. 2005 నుంచి ఉల్ఫా ఉగ్రవాదులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో ఇందిరా గోస్వామి  మధ్యవర్తిగా వ్యవహరించారు. 1982లో సాహిత్య అకాడమీ, 2000 సంవత్సరంలో జ్ఞానపీఠ్ అవార్డును ఆమె అందుకున్నారు. అస్సామీల  ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెబుతూ టుకుంటూ  వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికా ఇటీవలే కన్నుమూయగా, ఇప్పుడు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామి మృతి అస్సామీలకు పెద్ద దెబ్బే.  జీవితంలో డిప్రెషన్‌ను అధిగమించి, ఆత్మహత్య చేసుకోవాలనే కోరికను దిగమింగుతూ జీవించడానికి రచనలు చేసిన ఇందిరా గోస్వామి తన రచనల్లో జీవనశ్వాసను ఒంపారు. ఆమె తన రచనల్లో మహిళలకు, అస్సామీ సమాజ సాంస్కృతిక, రాజకీయ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. అస్సామీ సాహిత్యంలో అత్యంత ఉత్తమమైన పురుష పాత్రను చిత్రీకరించిన ఘనత కూడా ఆమెకు దక్కుతుంది.  మొత్తంగా అస్సామీల ఉనికిని ఆమె చాటి చెప్పారు. చిన్ననాటి నుంచే ఆమెలో ఆత్మహత్య చేసుకోవాలనే విచిత్రమైన కాంక్ష ఉంటూ వచ్చింది. ఇది ఆమె ఆత్మకథ ది అన్‌ఫినిష్‌డ్ ఆటోబయోగ్రఫీ (అసంపూర్ణ ఆత్మకథ) ద్వారా తెలుస్తుంది. షిలాంగ్‌లో తన ఇంటికి దగ్గరగా ఉన్న క్రినోలైన్ జలపాతంలోకి దూకాలని అనిపించేదట. తన భర్త పెళ్లయిన ఏడాదిన్నరకే  కాశ్మీర్‌లో కారు ప్రమాదంలో మరణించడం  ఆమెను విపరీతంగా కృంగదీసింది. ఆమె మరణం భారత సాహితీ రంగానికి  కూడా తీరని లోటు. 

రిటైల్ ఎఫ్.డి.ఐ.ల పై కొనసాగుతున్న పార్లమెంటు ప్రతిష్టంభన

న్యూఢిల్లీ,నవంబర్ 29:   రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినా ప్రతిష్టంభన తొలగిపోలేదు.  మంగళవారం కూడా   ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అంతకు ముందు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు.  ఈ సమావేశంలో ఇరు పక్షాలు కూడా తమ పట్టును వీడలేదు. రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల మనోభావాలను ప్రధానికి తెలిపి, ప్రభుత్వం ప్రతిస్పందించడానికి కొంత సమయం కావాలని ప్రణబ్ ముఖర్జీ  వారికి చెప్పినట్టు సమాచారం . 

కనిమొళికి ఎట్టకేలకు ఊరట

న్యూఢిల్లీ,నవంబర్ 29:  డీఎంకే ఎంపీ కనిమొళికి ఎట్టకేలకు ఊరట లభించింది. 2జీ కేసులో ఆమెతోపాటు మరో నలుగురు నిందితులకు ఢిల్లీ హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. కిందటివారం ఇదే కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు విధించిన షరతులే ప్రస్తుతం వీరికీ వర్తిస్తాయని జస్టిస్ వీకే షాలి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం నిందితులు రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, తమ పాస్‌పోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. బెయిల్ మంజూరైన వారిలో కనిమొళితోపాటు కలైంగర్ టీవీ చానెల్ ఎండీ శరద్ కుమార్, బాలీవుడ్ చిత్ర నిర్మాత కరీం మొరానీ, కుసేగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్లు రాజీవ్ అగర్వాల్, ఆసిఫ్ బల్వా ఉన్నారు. టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహురా బెయిల్ పిటిషన్‌పై మాత్రం కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ముందుగా సీబీఐ అభ్యంతరాలకు రాత పూర్వక వివరణ ఇచ్చిన తర్వాత బెహురా బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన తరఫు న్యాయవాది ఆమన్ లేఖికి జస్టిస్ షాలి చెప్పారు. కాగా,  2జీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా ఇప్పటిదాకా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించకపోవడం గమనార్హం.

రాజీనామాల పై మూడో " సారీ " !

హైదరాబాద్,నవంబర్ 29:  శాసనసభ శీతాకాల సమావేశాలు  ప్రారంభ మవుతున్న తరుణంలో 61 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్  తిరస్కరించారు. పార్టీ మారిన మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలను ఆమోదించారు. కొండా సురేఖ (పరకాల), కుంజా సత్యవతి (భద్రాచలం) రాజీనామాలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. కాగా, మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి) రాజీనామాను కూడా పెండింగ్‌లో ఉంచారు.  ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), రాజయ్య (స్టేషన్ ఘన్‌పూర్), టీడీపీ సభ్యులు గంపా గోవర్ధన్ (కామారెడ్డి), జోగు రామన్న (ఆదిలాబాద్) రాజీనామాలను మాత్రం  స్పీకర్  ఆమోదించారు. నాగం జనార్దనరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిల రాజీనామాలను ఇప్పటికే ఆమోదించడం, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో మొత్తం అసెంబ్లీలో ఖాళీల సంఖ్య 7కు చేరింది. మరోవైపు  జగన్ వర్గం ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి (టీడీపీ), శోభానాగిరెడ్డి (పీఆర్పీ) లతో పాటు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గ  ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి (కాంగ్రెస్) ల రాజీనామాలను తిరస్కరించినప్పటికీ వారిపై అనర్హత పిటిషన్లు యథావిధిగా పరిశీలనలో ఉంటాయని స్పీకర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామాలను మూకుమ్మడిగా తిరస్కరించడం రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది మూడోసారి. 

' అయ్యో ' ఎస్ శ్రీలక్ష్మి...!

హైదరాబాద్,నవంబర్ 29:  ఓఎంసీ కేసులో అరెస్ట్ అయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం  డిసెంబర్ 12 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది.  డిసెంబర్ ఒకటవ  తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆమెను కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం సీబీఐ ని ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో శ్రీలక్ష్మిని విచారించాలని సూచించింది.  జైలుకు పంపితే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. అంతకుముందు .శ్రీలక్ష్మికి  సీబీఐ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)  కి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ని ఆరోపణలతో  శ్రీలక్ష్మి ని సోమవారం సాయంత్రం సి.బి.ఐ. తన అదుపులోకి తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో ఓ మహిళా ఐఏఎస్ అరెస్టు కావడం ఇదే మొదటిసారి. ఓఎంసీ కేసులో ఆమెను నాలుగవ నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డికి సహకరించారని ఆరోపిస్తూ సీబీఐ ఇప్పటికే పలుమార్లు ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో నేరపూరితమైన కుట్ర, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై శ్రీలక్ష్మిని అరెస్టు చేసినట్లు సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ  వెల్లడించారు.  రాజసేఖర రెడ్డి హయాంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సయమంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆమెపై అభియోగాలున్నాయని చెప్పారు. ఓఎంసీ యజమాని గాలి జనార్ధనరెడ్డి, ఆ కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్‌ను  ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేఆరు.

Sunday, November 27, 2011

గోవా చిత్రోత్సవంలో బ్రెజిల్ దర్శకుని మృతి

పనాజి, నవంబర్ 28:  భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) లో  పాల్గొనేందుకు గోవా వచ్చిన బ్రెజిల్ దర్శకుడు ఆస్కార్ మెరోన్ ఫిల్హో ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 56 ఏళ్లు. ఓపెన్ ఫోరంలో మాట్లాడుతుండగా ఫిల్హో కు గుండెపోటు వచ్చింది. వెంటనే గోవా మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి ఆయనను  తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెజిల్‌లో అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థ అయిన ‘అట్లాంటికా సినిమాటోగ్రాఫికా’లో ఫిల్హో డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మారియా ఫిల్హో: ద క్రియేటర్ ఆఫ్ క్రౌడ్స్’ ఇఫీలో ప్రదర్శిస్తున్నారు.

రెండు లగ్జరీ బస్సులు ఢీ: 13మంది దుర్మరణం

నాగపూర్,నవంబర్ 28:  మహారాష్ట్రలో  సోమవారం తెల్లవారు ఝామున నాగపూర్-ఔరంగాబాద్ జాతీయ రహదారిపై బుల్దాన్ సమీపంలో రెండు లగ్జరీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 13మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 70మంది గాయపడ్డారు. వారిలో 20మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

పెద్దపల్లిలో కిషన్‌జీ అంత్యక్రియలు

హైదరాబాద్,నవంబర్ 27: పశ్చిమబెంగాల్ లో ఎన్ కౌంటర్  లో మరణించిన నక్సలైట్ నాయకుడు కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు) మృతదేహాన్ని  పెద్దపల్లికి చేర్చారు.  శనివారం రాత్రి పశ్చిమబెంగాల్‌నుంచి విమానంలో కిషన్‌జీ భౌతిక కాయం హైదరాబాద్ వచ్చింది.  పౌరహక్కుల సంఘాలు, విరసం నాయకులు, విప్లవ సానుభూతిపరులు, కిషన్‌జీ కుటుంబసభ్యులూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌కు ఆయన మృతదేహాన్ని తరలించి ప్రజల సందర్శనార్థం రెండు గంటలు ఉంచి అప్పుడు పెద్దపల్లికి తీసుకువెళ్దామనుకున్నారు. అయితె అందుకు పోలీసులు నిరాకరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా   కిషన్‌జీ మృతదేహాన్ని పెద్దపల్లికి తరలించారు. పెద్దపల్లిలో కిషన్‌జీ అంతిమ యాత్ర ఆదివారం  మధ్యాహ్నం మొదలైంది. ఈ యాత్రలో పౌరహక్కులు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు.  మావోయిస్టు పార్టీ సిద్ధాంతం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు.
డిసెంబరు 4, 5, తేదీలలో దేశవ్యాప్త బంద్
కాగా, కిషన్‌జీ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 29 నుంచి డిసెంబరు 5 వరకు నిరసన వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 4, 5, తేదీలలో దేశవ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చారు. 1,2 తేదీలలో తెలంగాణ బంద్ కు పిలుపు ఇచ్చారు. బంద్ నుంచి వైద్యసేవలను మినహాయించారు.  

కిరణ్ బేడీపై చీటింగ్ కేసు...!

న్యూఢిల్లీ,నవంబర్ 27: మాజీ ఐపియస్ అధికారి, అన్నా హజారే టీమ్ సభ్యురాలు కిరణ్ బేడీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు  ఆదేశించింది. చీటింగ్, విదేశీ కంపెనీలతోనూ ఇతర ఫౌండేషన్లతోనూ కుమ్మక్కయి నిధుల అవకతకవకలకు పాల్పడిన ఆరోపణలపై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది దేవేందర్ సింగ్ చౌహాన్ చేసిన పిర్యాదు మేరకు కిరణ్ బేడీపై కేసు నమోదు చేయాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అమిత్ బన్సాల్  ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆదేశించారు. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి, సిఆర్‌పిఎఫ్, ఇతర పోలీసు సంస్థల అధికారుల పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఇండియా విజన్ ఫౌండేషన్ కింద ఉచిత శిక్షణ ఇస్తానని చెప్పి మైక్రోసాఫ్ట్ నుంచి కిరణ్ బేడీ 50 లక్షలు తీసుకున్నారని చౌహాన్ ఆరోపించారు. ఉచిత శిక్షణ ఇవ్వకుండా, కంప్యూటర్లను ఉచితంగా పంపిణీ చేయకుండా గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి వేదాంత ఫౌండేషన్‌ను మోసం చేసినట్లు అతను ఆరోపించాడు. శిక్షణా కేంద్రం కోసం పారామిలిటరి, సివిల్ పోలీసుల నుంచి నెలకు 20 వేల రూపాయల చొప్పున వసూలు చేయడానికి ఆమె పూనుకున్నారని న్యాయవాది తన పిటిషన్‌లో అన్నారు.

వాంఖడే లో ఉత్కంఠ భరిత ' డ్రా '

ముంబై,నవంబర్ 27: :  డ్రా గా ముగుస్తుందనుకున్న ఆఖరి టెస్టులో చివరి రోజు ఉత్కంఠ  పరిణామాలు సంభవించాయి. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. ఆపై 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి ఓవర్‌లో మూడు పరుగులు చేస్తే విజయం సాధించే దశలో రెండు పరుగులే చేసింది. రెండో ఇన్నింగ్స్ లో  9 వికెట్లకు 242 పరుగులు చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఫలితంగా విండీస్ డ్రాతో గట్టెక్కింది. ఒకవేళ భారత్ ఆలౌటై స్కోర్లు సమమై ఉంటే ఈ మ్యాచ్ ‘టై’ గా ముగిసేది. తొలుత సెహ్వాగ్ (65 బంతుల్లో 60; ఫోర్లు 8) దూకుడైన ఆరంభాన్నివ్వగా... మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లి (114 బంతుల్లో 63, ఫోర్లు 3, సిక్స్ 1) రాణించాడు. అంతకుముందు భారత స్పిన్నర్లు ఓజా (6/47), అశ్విన్ (4/34) స్పిన్ మాయకు విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు కుప్పకూలింది. బ్రాత్‌వేట్ (115 బంతుల్లో 35; ఫోర్లు 2), బ్రావో (105 బంతుల్లో 48; ఫోర్లు 5) టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు, సెంచరీ చేసిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు, సిరీస్ అవార్డు లభించింది.

Friday, November 25, 2011

ఏంటి సచినూ ఇది...!

ముంబై,నవంబర్ 25: సచిన్ వందవ సెంచరీ అభిమానులకు అందని ద్రాక్షే అవుతోంది.  వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతున్న మూడవ ఆఖరి టెస్ట్ లో  సచిన్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటై,  వందో సెంచరీని ఆరు పరుగుల తేడా తో  మిస్ కావటంతో క్రీడాభిమానులంతా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించిన అభిమాన వాంఖడే స్టేడియంలో సచిన్ సెంచరీ మిస్  కావడం అభిమానులకు ఆవేదన  కలిగించింది.

దూరం పెరుగుతోందా...?

హైదరాబాద్: 'పంజా'  సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కలకలం సృష్టించినట్టే కనబడుతోంది.  తనకు వారసత్వంపై నమ్మకం లేదని, చిరంజీవి తమ్ముడిగా నిలబడాలని తాను అనుకోవడం లేదని, అభిమానులు చిరంజీవి తమ్ముడిగా తనను చూడవద్దని, తనను తానుగానే చూడాలని పంజా సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో  పవన్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల  తర్వాత రెండు రోజులకు    హీరో అల్లు అరవింద్ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ ఒంటరి వాడు కాదని,  తామంతా కలిసే ఉన్నామని చెప్పారు. తాను షూటింగు నుంచి ఆలస్యంగా రావడం వల్ల కార్యక్రమానికి వెళ్లలేకపోయామని, రామ్ చరణ్ తేజ్ చైనాలో షూటింగులో ఉన్నారని, చిరంజీవి ఢిల్లీలో ఉన్నారని ఆయన చెప్పారు. గురువారంనాడు తాజాగా చిరంజీవి గొంతు విప్పారు. మీడియా వార్తలు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్‌తో తనకు ఏ విధమైన విభేదాలు లేవని, ఫంక్షన్‌కు హాజరు కాకపోయినంత మాత్రాన దూరమైనట్లు కాదని, తాను చాలా ఫంక్షన్లకు వెళ్లలేదని ఆయన అన్నారు. వారసత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన అభినందించారు. మొత్తం మీద, తాజా పరిణామాలు పవన్ కళ్యాణ్‌కు, చిరంజీవి కుటుంబానికి మధ్య దూరం పెరిగినట్టు సూచిస్తున్నాయి. 

Thursday, November 24, 2011

ఎలాగైతేనే ఏడాది నెట్టుకొచ్చిన కిరణ్...!

హైదరాబాద్ , నవంబర్ 25:  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి పాలనకు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఏడాది పూర్తయింది.  ఇంతవరకు సమస్యలు అధిగమించడానికే సమయం సరిపోయిందని,  ఇక నుండి అభివృద్ధి పుంజుకుంటుందని ఆయన ఓ టీవీ కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేశారు.  తనకు ప్రచారం చేసుకోవడానికి ఓ పేపర్, ఛానల్ లేవని, కాంగ్రెసు పార్టీకి కార్యకర్తలే బలమని, వారే ప్రభుత్వ పథకాల ప్రచారకర్తలని అన్నారు. 2014 ఎన్నికల వరకు సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే  లక్ష్యంగా ముందుకు సగుతానన్నారు.పార్టీ సీనియర్లు, సహచర మంత్రులతో కలిసి కొత్త పథకాలపై చర్చిస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదో ఒక అడ్డంకి వస్తున్నదని, వీలైనంత త్వరగా వాటిని నిర్వహిస్తామని చెప్పారు.  మంత్రివర్గ విస్తరణ సరైన సమయంలో ఉంటుందన్నారు.  జిల్లాల్లో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ శ్రేణుల మధ్య బేధాభిప్రాయాలు వాస్తవమేనని వాటిని అధిగమిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తాను ఎక్కువగా మాట్లాడనన్నారు. బాబు అవిశ్వాసం పెడితే స్వాగతిస్తామని చెప్పారు. సిబిఐ కేసుల విషయంలో ప్రభుత్వం పాత్ర లేదని కోర్టు ఆదేశాల మేరకే దర్యాఫ్తు జరుగుతోందన్నారు. పిసిసి చీఫ్ బొత్సతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ ఓడించలేదు. కానీ కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీ వల్లే ఓడిపోతుంది. కాబట్టే.. అందరినీ కలిపి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. రూపాయికి కిలో బియ్యం ప్రజాకర్షక పథకం అంటే ఒప్పుకోమని,  నిత్యావసర వస్తువుల్లో కీలకమైన బియ్యం రేటు తగ్గితే.. ఆ డబ్బుతో మిగిలిన సరుకులు కొనుక్కోగలరన్న ఉద్దేశంతో ఆ పథకాన్ని అమలు చేస్తున్నామని ,నిత్యావసర ధరల నియంత్రణకు మరో ప్రత్యేక కమిటీని వేస్తామని చెప్పారు.  

టి.కాంగ్రెస్ ఎంపీలపై హైకమాండ్ సీరియస్ !

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘ప్రత్యేక తెలంగాణ నినాదాలతో లోక్‌సభను స్తంభింపజేస్తే మార్షల్స్‌తో బైటికి గెంటిస్తా’నని టి.కాంగ్రెస్ ఎంపీలను  లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా హెచ్చరించారు. పార్లమెంట్ ఆవరణలోని ఆర్థిక మంత్రి ఆఫీసులో గురువారం మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ, టి.కాంగ్రెస్ ఎంపీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది.  లోక్‌సభను తెలంగాణ నినాదాలతో స్తంభింపజేస్తే సహించేది లేదని ప్రణబ్ ముఖర్జీ అగ్గిమీద గుగ్గిలమైతే, సభా కార్యక్రమాలు అడ్డుకుంటూనే ఉంటాం. ఆపగలిగితే ఆపుకోండని తెలంగాణ ఎంపీలు తెగేసి చెప్పినట్టు సమాచారం. .‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించి మాట తప్పిన మీరు మమ్మల్ని బెదిరిస్తారా? మీరేం చేసుకుంటారో చేసుకోండి. మేం చేసేది చేస్తాం’ అని టి.కాంగ్రెస్ ఎంపీలు ధిక్కార స్వరాన్ని వినిపించారుట. .  తెలంగాణ ఎంపీల చర్య కారణంగా గురువారం మూడోరోజూ లోక్‌సభ పూర్తిగా స్తంభించడం, విపక్ష నేతల ఫిర్యాదు నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ముఖర్జీ  టి.కాంగ్రెస్ ఎంపీలను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. తెలంగాణ ఎంపీలు గదిలోకి ప్రవేశించగానే ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహంతో ఊగిపోతూ ‘ఏమనుకుంటున్నారు. సభలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? మీకు బాధ్యత లేదా? ఇష్టానుసారం వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలితే మార్షల్స్‌తో సభనుంచి గెంటిస్తా’ అంటూ నిప్పులు కురిపించినట్టు చెబుతున్నారు.  ‘ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? సభలో గొడవ చేయడానికే ఎన్నికయ్యారా? మీ చర్యతో విపక్ష నేతల విమర్శలకు గురి కావాల్సి వస్తోంది. మీవల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది. మీ వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు’ అంటూ ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించారు.  ముఖర్జీ విమర్శలకు పొన్నం ప్రభాకర్ తదితర ఎంపీలు బదులిస్తూ ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు 2009 డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించి, తరువాత సీమాంధ్రుల ఒత్తిడితో మనసు మార్చుకోవటం మీకు తగునా? మీ చర్యల వల్లే ఈరోజు పరిస్థితి ఇంతవరకూ వచ్చింది’ అంటూ అంతే ఆవేశంతో సమాధానమిచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చేసిన ప్రకటనకు సంబంధించి గంటముందు కూడా మాకు చెప్పలేదు. ప్రజలకు మీరు ఆశ పెట్టి తరువాత తెలంగాణ ఇవ్వకుండా దాటవేస్తే మేమేం చేయాలి? తెలంగాణలో కాంగ్రెస్‌ను బతికించుకోవాలా? వద్దా? ప్రత్యేక రాష్ట్రం కోసం పని చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌వాదులకు పుట్టగతులుండవు. పార్టీ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుంది’ అని తెలంగాణ ఎంపీలు పెద్దస్వరంతో ప్రణబ్ ఎదుట వాదించారని తెలిసింది.
సోనియా ఆగ్రహం
కాగా, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో టి. కాంగ్రెస్ ఎంపీలు గురువారం లోక్‌సభను స్థంభింపచేయడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.  లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను పిలిపించుకుని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంగించి వ్యవహరించే వారికి శిక్ష తప్పదని ఆమె అన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా తెలంగాణ ఎంపీలతో తాను చర్చించిన విషయం ప్రణబ్ అధినేత్రికి వివరించినట్టు తెలిసింది. 


మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఎన్ కౌంటర్

కోల్‌కతా,నవంబర్ 24:  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ (56)  పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఖుష్పనీ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్టు చొరబాటు నిరోధక దళానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. జార్ఖండ్ సరిహద్దులోని జాంబనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బురిసోల్ వద్ద కిషన్‌జీ మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఏకే-47 తుపాకీతో పడివున్న కిషన్‌జీ మృతదేహాన్ని కనుగొన్నట్టు వెల్లడించారు. కిషన్‌జీతో పాటు ఉన్న సుచిత్ర, ఇతరులు తప్పించుకున్నట్టు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి ల్యాప్‌టాప్ బ్యాగ్, కిషన్‌జీ, సుచిత్రలకు చెందిన కొన్ని లేఖలు, ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నట్టు తెలిపారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి ఎన్‌కౌంటర్ ఇది. కిషన్‌జీ కోసం మావోయిస్టు ప్రభావిత జంగల్ మహల్ అడవులలో  సంయుక్త దళాలు గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలించాయి.
మూడు దశాబ్దాలుగా రహస్య జీవితం
నక్సలైట్ ఉద్యమ చరిత్రలో మూడు దశాబ్దాలుగా రహస్య జీవితం గడుపుతున్న కిషన్‌జీ మావోయిస్టు పార్టీ అధినేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తరువాత స్థానం లో ఉన్నారు.  కిషన్‌జీ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఓ మాస్టారు  కుమారుడు. కేజీ సత్యమూర్తి, ముక్కు సుబ్బారెడ్డి, ఐవీ సాంబశివరావు లాంటి అగ్రనేతలను కాదని 1980లో కిషన్‌జీకి రాష్ట్ర పార్టీ బాధ్యతలను కొండపల్లి సీతారామయ్య కట్టబెట్టారు. రాష్ర్టంలో పీపుల్స్‌వార్ పార్టీకి ప్రహ్లాద్‌గా నేతృత్వం వహించిన అనంతరం 1987లో దండకారణ్యానికి మకాం మార్చారు. ఆ తరువాత తూర్పు భారతానికి, ఈశాన్య రాష్ట్రాలకు ఉద్యమాన్ని విస్తరించే బాధ్యతలు స్వీకరించారు.

సచిన్ అర్థ సెంచరీ; భారత్ 281/3

ముంబై,నవంబర్ 24: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. సచిన్(67), లక్ష్మణ్(32) క్రీజ్‌లో ఉన్నారు. ద్రవిడ్ 82, గంభీర్ 55, సెహ్వాగ్ 37 పరుగులు చేసి అవుటయ్యారు. విండీస్ బౌలర్లలో రామ్‌పాల్, సమీ, శ్యామూల్స్ తలో వికెట్ తీశారు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 590 పరుగులకు ఆలౌటయింది.
ద్రవిడ్ ఖాతాలో మరో రికార్డు

మిస్టర్ డిపెండబుల్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ఖాతాలో మరో రికార్డు చేరింది. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ ద్రవిడ్ 13వేల పరుగులు పూర్తి చేశాడు. సచిన్ తర్వాత అత్యథిక పరుగులు చేసిన ఆటగాడుగా ద్రవిడ్ రెండోస్థానంలో నిలిచాడు. ఆతర్వాత స్థానంలో పాంటింగ్, కలీస్ ఉన్నారు. 1996లో ద్రవిడ్ ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడగా, ఇప్పటి వరకూ 160 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అతని కెరీర్ లో 36 సెంచరీలు కూడా ఉన్నాయి

పవార్ కు పడింది...!

న్యూఢిల్లీ,నవంబర్ 24: : కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌పై ఓ యువకుడు గురువారం దాడికి పాల్పడ్డాడు. ఎన్‌ఎండీసీ కార్యక్రమంలో హరవిందర్‌సింగ్ అనే యువకుడు పవార్‌ను చెంపదెబ్బ కొట్టాడు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా పవార్‌పై అతడు చేయిచేసుకున్నాడు. లంచం కేసులో శిక్ష పడిన టెలికం మాజీ మంత్రి సుఖ్‌రాంపై కూడా హర్విందర్‌సింగ్  గత వారం దాడికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Wednesday, November 23, 2011

వెస్టిండీస్ భారీస్కోరు

ముంబై, నవంబర్ 24: మూడవ, ఆఖరి  టెస్టులో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. చరిత్రలో తొలిసారి వెస్టిండీస్ టాప్ 6 ఆటగాళ్లు కనీసం అర్ధసెంచరీ సాధించడం విశేషం. . బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కరీబియన్ జట్టు 181 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు సాధించింది. డారెన్ బ్రావో (284 బంతుల్లో 166; 17 ఫోర్లు) సెంచరీ సాధించగా... ఎడ్వర్డ్స్ (165 బంతుల్లో 86; 13 ఫోర్లు) ముందు రోజు జోరును కొద్దిసేపు కొనసాగించాడు. మరో ఇద్దరు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ పావెల్ (149 బంతుల్లో 81; 9 ఫోర్లు), శామ్యూల్స్ (103 బంతుల్లో 61; 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ఆట ముగిసే సమయానికి టెయిలెండర్లు ఫిడేల్ ఎడ్వర్డ్స్ (7), బిషూ (2) క్రీజులో ఉన్నారు. తొలి రోజు రెండు వికెట్లు తీసుకున్న అశ్విన్... రెండో రోజు మరో రెండు వికెట్లతో రాణించాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న వరుణ్ ఆరోన్ ఆఖరి సెషన్‌లో ఒకే స్పెల్‌లో (6-0-29-3) మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓజా, ఇషాంత్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

లోకేశ్ చదువు ఖర్చుపై ఈడీ ఆరా ?

హైదరాబాద్, నవంబర్ 24: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు, విదేశాల్లోని బినామీల లావాదేవీల గుట్టును రట్టుచేసేందుకు ఎన్‌ఫోర్స్ మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సన్నద్ధమవుతోంది. బాబు తనయుడు లోకేశ్ విదేశీ చదువులకు చెల్లింపులెలా జరిగాయి, వాటినెవరు చెల్లించారనే కోణంలో పూర్తిస్థాయి ఆధారాలను సేకరిస్తోంది. మలేసియా, సింగపూర్‌లలో బాబు ఆస్తుల వివరాలతో పాటు ఆయన బినామీలైన సీఎం రమేశ్, సుజనా చౌదరి పలు దేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలను కూడా కూపీ లాగనుంది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ప్రకారం బాబు, ఆయన బినామీలు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లకు ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులకు వారంతా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. వారందించే డాక్యుమెంట్ల తో ఈడీ సంతృప్తి చెందని పక్షంలో అదనపు సమాచారం కోరే అవకాశముంది. ఆ సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతుంది. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి. లోకేశ్ అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్‌లో మెరిట్ స్టూడెంట్ కాని ఆయనకు డొనేషన్లు కడితే తప్ప వాటిలో సీటు దక్కే అవకాశమే లేదు. దాంతో ఆ చదువులకు సుమారు రూ. 23 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ వ్యవహారం పై ఈడీ దృష్టి పెట్టే అవకాశం వుంది.

చంద్రబాబు ఆస్తుల కేసులో స్టే కు సుప్రీం 'నో'

హైదరాబాద్, నవంబర్ 24: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ బాబు బినామీలు సీఎం రమేశ్, రామోజీరావు, మధుకాన్ సుగర్స్ (నామా నాగేశ్వరరావు) వేర్వేరుగా దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. బాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, బినామీలు రామోజీరావు, నామా నాగేశ్వరరావు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, కర్నాటి వెంకటేశ్వరరావు తదితరుల ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే వాటిని హైకోర్టు వద్దే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల సవరణ/ఎత్తివేత కోసం హైకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేసుకోవాలని చెప్పింది. వాటిని దాఖలు చేసుకున్న నాటి నుంచి 15 రోజుల్లోపు పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది.

మంత్రి రఘువీరారెడ్డికి గౌరవ డాక్టరేట్‌

ప్రదానం చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం 
కోయంబత్తూరు, నవంబర్ 24:  జనాభా పెరుగుదల నేపథ్యంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం దేశానికి పెను సవాలేనని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగ ప్రగతికి కృషిచేసినందుకు గుర్తింపుగా ఆయనను ఇక్కడి తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. వర్సిటీ స్నాతకోత్సవ సభలో వర్సిటీ చాన్సలర్ , తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య దీన్ని ప్రదానం చేశారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ,రైతుల పక్షాన దేశంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగ పునరుజ్జీవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, గవర్నర్ రోశయ్య ఎనలేని కృషిచేశారని ప్రశంసించారు. వారిద్దరి వద్ద ఆరున్నరేళ్లు వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసి రైతులకు సేవ చేయడం తన అదృష్టమని రఘువీరా చెప్పారు.

ఇక మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్

హైదరాబాద్  ,నవంబర్ 23:  ఇకపై దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్ జారీ చేస్తామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. 30 రోజుల్లోగా ఆర్డినరీ పాస్‌పోర్ట్ లు  అందచేస్తామని చెప్పారు. బేగంపేటలో ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో మరో మూడు పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ మాన్యువల్‌గా స్వీకరిస్తున్న దరఖాస్తులను ఇకపై  పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలలో ఇ-ప్రాసెసింగ్ ద్వారా తీసుకుంటామని తెలిపారు.

లోక్ సభలో తెలంగాణపై వాయిదా తీర్మానం :

రెండో రోజూ సాగని సభలు 
న్యూఢిల్లీ ,నవంబర్ 23:  టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం లోక్ సభలో తెలంగాణపై వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 700మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాటిపై చర్చించాలని ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం ప్రారంభమైన కొద్ది నిమషాల్లోనే వాయిదా పడ్డాయి. లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. సభ్యుల నిరసనతో సభలో గందరగోళం నెలకొంది. దాంతో సభను స్పీకర్ మీరాకుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగటంతో సభ వాయిదా పడింది. వాయిదా తర్వాత ప్రారంభమైన ఉభయ సభలు తెలంగాణ నినాదాలతో హోరెత్తడంతో గురువారానికి వాయిదా పడ్డాయి.

సత్యసాయి బాబా 86వ జయంతి వేడుకలు

పుట్టపర్తి,నవంబర్ 23: పుట్టపర్తిలో సత్యసాయి బాబా 86వ జయంతి వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో బాబా మహా సమాధి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మల్లాది సోదరులు రూపొందించిన బాబా భక్తి గీతాలు 'హృదయవీణ' సీడీని ఆవిష్కరించారు. సత్యసాయి జయంతి వేడుకలకు రాష్ట్ర మంత్రులు గీతారడ్డి, రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి హాజరయ్యారు. 

Tuesday, November 22, 2011

తొలిరోజే సాగని లోక్ సభ

న్యూఢిల్లీ,నవంబర్ 22:   శీతాకాల సమావేశాల తొలిరోజే  ప్రత్యేక  తెలంగాణ, ఉత్తరప్రదేశ్ విభజనపై లోక్‌సభ అట్టడుకింది. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. అందుకు స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించడం, సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ బుధవారంనాటికి వాయిదా పడింది.  ఉత్తరప్రదేశ్ విభజన అంశంపై సమాజ్‌వాది పార్టీ సభ్యులు  చర్చకు పట్టుపట్టారు. స్పీకర్ మీరాకుమార్ అభ్యంతరం చెప్పడంతో సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమయిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో మళ్లీ వాయిదా పడింది. తిరిగి ప్రారంభకాగానే ప్రత్యేక తెలంగాణ, యుపీ విభజనపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. స్పీకర్ మీరాకుమార్ ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో, సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో సభను బుధవారానికి  వాయిదా వేశారు. కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక తెలంగాణపై బిల్లు పెట్టాలంటూ సభ బయట ఫ్లకార్డులతో నిలబడి నిరసన తెలియజేశారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. 'వుయ్ వాంట్ తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు. ఇక  రాజ్యసభ ప్రారంభకాగానే ఛైర్మన్ హమీద్ అన్సారీ పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ముఖ్మంగా ప్రముఖ సంగీత ధర్శకులు భూపేన్ హజారికాకు సభ ఘనంగా నివాళులర్పించింది. సిక్కిం భూకంప మృతులకు నివాళులర్పిస్తూ మృతుల కుటుంబాలకు సభ సానుభూతి తెలిపింది. అనంతరం సభ బుధవారం నాటికి వాయిదా పడింది. 

పటిష్ట స్థితిలో వెస్టిండీస్

ముంబై,నవంబర్ 22: భారత జట్టుతో జరుగుతున్న మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ధీటైన ఆటతీరును కనబరిచింది. వెస్టిండీస్ జట్టులో నలుగురు ఆటగాళ్లు భరత్, బ్రాత్‌వెయిట్, ఎడ్వార్డ్స్, బ్రావోలు అర్ధ సెంచరీలు నమోదు చేసుకున్నారు. భరత్ 62, బ్రాత్ వెయిట్ 68 పరుగులు చేసి అవుటయ్యారు. ఎడ్వర్డ్స్ 65, బ్రావో 57 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. రెండు వికెట్లు కూడా అశ్విన్‌కే దక్కాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Monday, November 21, 2011

వరుణ్ సందేశ్ ‘చమ్మక్ చల్లో’ ...

హైదరాబాద్:   రా.వన్ సినిమాలో హిట్  సాంగ్ ‘చమ్మక్ చల్లో’  పేరుతో  దర్శకుడు నీలకంఠ వరుణ్ సందేశ్ హీరోగా  రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నరు. ఇప్పటి వరకు ప్రయోగాత్మక, సందేశాత్మక   చిత్రాలకే పరిమితం అయిన నీలకంఠ ఈ సారి కమర్షియల్ గా  హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడంటున్నారు.  డిఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షో,మిస్సమ్మ వంటి చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న దర్సకుడు నీలకంఠ ఈ మధ్యన బాగా వెనకపడ్డారు. ఇక ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటిస్తున్న  ప్రియుడు డిసెంబర్  రెండు న విడుదల అవుతోంది. అలాగే తెలుగులో పలు చిత్రాలకు మాటలు రాసిన  నంధ్యాల రవి దర్సకత్వంలో వరుణ్ మరో చిత్రం చేయబొతున్నాడని సమాచారం. కుమార్ బ్రదర్శ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో కుమార్ బ్రదర్శ్...సుమంత్ హీరోగా 'రాజ్" అనే చిత్రాన్ని వియన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందించారు.

తెలంగాణ పై తెలుగుదేశం తటస్థమే:చంద్రబాబు

న్యూఢిల్లీ, నవంబర్ 21:  తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు మరోసారి చేతులు దులిపేసుకున్నారు. తెలంగాణ బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు. తెలంగాణపై తాను తటస్థుడినని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. రైతు సమస్యలపై జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై తమ పార్టీ తటస్థంగా ఉంటుందని, తాము చాలా కాలం క్రితమే పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజల్లో భావోద్వేగాలున్నాయని, అందుకే తాను తటస్థ వైఖరి తీసుకున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన స్తంభించిందని ఆయన విమర్శించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, పంట విరామం ప్రకటించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అవినీతి పెచ్చరిల్లిందని, అయినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. రైతు సమస్యలను పట్టించుకోకపోతే శాసనసభ శీతాకాలం సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదించాలో ప్రతిపక్ష పార్టీగా తమకు తెలుసునని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి పెడితే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంలో పునరాలోచన చేస్తామని ఆయన చెప్పారు. తన ఆస్తులపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. 

అయ్యో...రూపాయి...!

ముంబై:,నవంబర్ 21: అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి అతలాకుతలం అవుతోంది.  డాలర్ విలువతో పోల్చితే 52 రూపాయలకు మారకం విలువ పడిపోయింది. దాంతో రూపాయి 32 నెలల కనిష్టస్థాయికి చేరుకుంది. 2009 సంవత్సరం తర్వాత ద్రవ్యమార్కెట్‌లో రూపాయి విలువ భారీగా పడిపోవడం ఇదే ప్రథమం. రూపాయి పతనంతో చమురు దిగుమతుల వ్యయం భారీగా పెరిగే అవకాశముంది.

పంతం నెగ్గించుకున్న మాయావతి

యు.పి.విభజన పై అసెంబ్లీ తీర్మానం  
లక్నో,నవంబర్ 21: ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ  ముఖ్యమంత్రి మాయావతి సర్కార్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కాగా రాష్ట్ర విభజనను ఎస్పీ, బీజేపీలు వ్యతిరేకించాయి.  ఈరోజు  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర విభజన అంశంపై సభలో దుమారం రేగింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో సభ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే అధికార బీఎస్పీ రాష్ట్ర విభజన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. విపక్ష సభ్యుల వ్యతిరేకత మధ్యే తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానం ఆమోదంతో ఎట్టకేలకు మాయావతి తన పంతం నెగ్గించుకున్నారు. అంతకు ముందు మాయా సర్కార్ మైనార్టీలో పడిందంటూ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే ప్రతిపక్షాలకు సరిపడా సంఖ్యాబలం లేకపోవటంతో తీర్మానం వీగిపోయింది.
 కేంద్రానికి పంపుతాం:మయావతి
అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు  ముఖ్యమంత్రి మాయావతి తెలిపారు. యూపీ విభజన రాజకీయ ఎత్తుగడ కాదన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే తాము విభజనకు ప్రయత్నించటం లేదని... 2007 నుంచి రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే మళ్లీ తీర్మానం చేయాల్సి వచ్చిందన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని విపక్షాలు కోరుకోవటం లేదని మాయ మండిపడ్డారు. విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీలన్ని దళిత వ్యతిరేకులేనని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ విభజనపై పోరాటం జరుగుతోందని మాయా తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణపై కూడా కాంగ్రెస్ తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.   

Sunday, November 20, 2011

ఇక 'చలి' పార్ల 'మంట' !

న్యూఢిల్లీ,నవంబర్ 21:  మంగళవారం నుంచే ప్రారంభం కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వేడి వేడిగా జరగనున్నాయి. ధరల పెరుగుదల.. నల్లధనం.. 2జీ.. లోక్‌పాల్.. ఉత్తరప్రదేశ్.. తెలంగాణ.. అంశాలు ఉభయ సభలను కుదిపేయనున్నాయి. ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి సమావేశాల మొదటిరోజే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం వరాల జల్లులు కురిపించనుంది. ఉత్తరప్రదేశ్ విభజన ప్రతిపాదన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలాంటి అంశాలపై వాడివేడిగా చర్చ జరగనుంది.  30 రోజులపాటు జరిగే  సమావేశాల్లో దాదాపు 31 బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో న్యాయవ్యవస్థలో ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు, లోక్‌పాల్‌తోపాటు ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు, లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే బిల్లు, జాతీయ ఆహార భద్రత బిల్లు, మనీ లాండరింగ్ నిరోధక(సవరణ) బిల్లు, అణు నియంత్రణ అథారిటీ బిల్లు, పింఛన్ల రంగంలో విదేశీ పెట్టుబడులకు వీలు కల్పించే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ అథారిటీ బిల్లులు ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలు సుమారు 45 అంశాలను లేవనెత్తాలని యోచిస్తున్నాయి. ఇందులో విదేశాల్లో నల్లధనం దాచుకున్నవారి పేర్లు వెల్లడించడం, ఆహార ద్రవ్యోల్బణం, తెలంగాణ, రైతుల ఆత్మహత్యలు, భారత్-పాక్ సంబంధాలు, కాశ్మీర్‌లో పరిస్థితి, మణిపూర్ దిగ్బంధం, వరదలు, పలుచోట్ల మెదడువాపు విజృంభణ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు.. తదితర అంశాలున్నాయి. కాగా, 2జీ ప్రకంపనలు తాజాగా ఎన్డీయేను కూడా తాకడంతో దీనిపై సభలో దుమారం రేగే అవకాశాలున్నాయి. సీబీఐ తాజా దాడులు బీజేపీని ఇరకాటంలోకి నెట్టడంతో దీన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు పాలకపక్షం పావులు కదుపుతోంది. 

అగ్నిప్రమాదంలో 14 మంది హిజ్రాల మృతి

న్యూఢిల్లీ,నవంబర్ 21:   దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నందనగరిలోని కమ్యూనిటీ సెంటర్‌లో హిజ్రాల సమావేశంలో అకస్మాత్తుగా ఎగసిపడిన మంటల్లో 14 మంది హిజ్రాలు మరణించగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. నందనగరి కమ్యూనిటీ కేంద్రంలో ఈనెల 18 నుంచి హిజ్రాలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా 2,500 మంది హిజ్రాలు హాజరైన సమావేశాల కోసం కమ్యూనిటీ సెంటర్‌లో భారీ టెంట్లు నిర్మించారు. వంట గదిలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ వైర్లు, టెంట్లు అంటుకుని మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. వంట కోసం తెచ్చుకున్న రెండు సిలిండర్లు పేలడంతో మంటలు క్షణంలో వ్యాపించాయి. బయటకు వెళ్లేందుకు ఒకేఒక్క మార్గం ఉండటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.  మంటల్లో చిక్కుకుని 14 మంది మరణించారు. 12 మంది మృతదేహాలను బయటికి తీశారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. 17 అగ్నిమాపక యంత్రాలు, 40 మంది సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈనెల 14 నుంచి శనివారం వరకూ ఘజియాబాద్‌లో సమావేశాలు నిర్వహించుకున్న హిజ్రాలు, శనివారం సమావేశ స్థలాన్ని నందనగరి కమ్యూనిటీ సెంటర్‌కు మార్చారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

అసోం, నాగాలాండ్ లలో భూకంపం

న్యూఢిల్లీ,నవంబర్ 21:  అసోం, నాగాలాండ్ లలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9 గా నమోదు అయింది. . ఉదయం 8.45 గంటలకు భూమి 15-20 సెకన్ల పాటు కంపించటంతో ప్రజలు భయాందోళనలతో తూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంఫాల్ కు 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని  గుర్తించారు. 

Friday, November 18, 2011

కిరణ్ కు ' జై ' సుధ...!

హైదరాబాద్,నవంబర్ 18:  కాంగ్రెసు సికింద్రబాద్ శాసనసభ్యురాలు జయసుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై కొట్టేసి  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తనకు వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం ఇచ్చినందున వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నట్టు  ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన జయసుధ  ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.  శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయిన  తర్వాత జయసుధ మీడియా తో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డిపై  ప్రశంసల  జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తన మద్దతు ఉంటుందని, ముఖ్యమంత్రి పనితీరు బాగుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిని తన నియోజకవర్గానికి అహ్వానిస్తానని ఆమె చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం యువతకు వరమని ఆమె కొనియాడారు.  వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి సమర్థంగా అమలు చేస్తున్నారని ఆమె అన్నారు.

Thursday, November 17, 2011


ఇండోనేసియా లోని బాలి లో ఏసియన్ సదస్సు సందర్భంగా సమావేశమైన  మన్మోహన్,  ఒబామా... 

2-0 తో సిరీస్ గెలిచిన భారత్

కోల్ కతా,నవంబర్ 17:  :  భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య  ఈడెన్ గార్డెన్స్ లో  జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్- 15 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు టెస్ట్ ల సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 463 పరుగులకు ఆలౌట్ కావటంతో విజయం భారత్ ను వరించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా హైదరాబాదీ ఆటగాడు లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్లు, ఇషాంత్ శర్మ, అశ్విన్, ఓజాలు చెరో రెండు వికెట్లు తీశారు. 22వ తేదీ నుంచి ముంబయిలో మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
యువరాజ్‌కు ఉద్వాసన
కాగా, భారత టెస్ట్ జట్టు నుంచి  యువరాజ్ స్థానంలో రోహిత్ శర్మను జట్టులోకి ఎంపిక చేశారు.  22 తేదిన ముంబైలో ప్రారంభమయ్యే మూడవ టెస్ట్, చివరి టెస్ట్ లకు భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. యువ బౌలర్లు అశ్విన్, ఓజాలు రాణిస్తుండటంతో హర్భజన్ సింగ్‌కు చోటు దక్కలేదు. జట్టు: మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, ఆర్ అశ్విన్, ఓజా, ఉమేష్ యాదవ్, విరాట్ కోహ్లీ, రహానే, రాహుల్ శర్మ, వరుణ్ ఆరోణ్

Wednesday, November 16, 2011

ఐశ్వర్వ్యకు ఆడపిల్ల

ముంబయ్,నవంబర్ 16:  మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బుధవారం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ముంబయిలోని సెవన్ హిల్స్ ఆస్పత్రిలో ఆమె బుధవారం  ఉదయం 10.02 నిమిషాలకు కూతురిని ప్రసవించింది. ఈవిషయాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తనకు అందమైన మనవరాలు పుట్టిందంటూ ఆయన మురిసిపోయారు. బుల్లి ఐశ్వర్య రాక తో బచ్చన్ కుటుబం ఆనందంలో  మునిగితేలుతోంది.  

Tuesday, November 15, 2011

తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతో ప్రణబ్ చర్చలు

న్యూఢిల్లీ,నవంబర్ 16: తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చలను ప్రారంభించింది.  కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మిత్రపక్షాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆయన కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె నేత టీఆర్ బాలుతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఎన్సీపి నేత శరద్ పవార్‌తో ఆయన చర్చలు జరిపే అవకాశాలున్నాయి. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీతో కూడా ఆయన చర్చలు జరుపుతారని అంటున్నారు. పార్టీపరంగా రాష్ట్రానికి చెందిన మూడు ప్రాంతాల నాయకులతో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ మిత్ర పక్షాలతోనూ జాతీయ పార్టీలతోనూ చర్చలు జరిపే బాధ్యతను నిర్వహిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా, రాష్ట్రానికి చెందిన పార్టీలతో చర్చలు జరుపుతారా లేదా అనేది ఇంకా తెలియలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో మిత్రపక్షాలను సంప్రదించుకుండానే 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. కాంగ్రెసు ఏకపక్షంగా ప్రకటన చేసిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. దాంతో ఇప్పుడు తదుపరి ప్రకటనపై అభ్యంతరాలు రాకుండా మిత్రపక్షాలతో కూడా ప్రణబ్ ముఖర్జీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

భలే.. భలే... పెట్రోల్ ధర కాస్త తగ్గింది...!

న్యూఢిల్లీ,నవంబర్ 16: : పెరగడమే తప్ప తగ్గడం తెలియని పెట్రోల్ ధరలు 33 నెలలలో మొదటిసారి స్వల్పంగా తగ్గాయి.  అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గడంతో పెట్రోల్ ధరను చమురు కంపెనీలు కాస్త తగ్గించి జనంపై కనికరం చూపాయి.  ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.25 పైసలు తగ్గింది. హైదరాబాదులో తగ్గింపు రూ. 1.85 పైసలుదాకా వుంది. పెట్రోల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఇటీవల నిరసన వ్యక్తమైంది. తృణమూల్ కాంగ్రెసు నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెట్రోల్ ధర పెంపుపై కాంగ్రెసు మీద తీవ్రంగా మండిపడ్డారు. యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని కూడా ఆమె బెదిరించిన  విషయం తెలిసిందే.

‘శ్రీరామరాజ్యం’ నయనకు బర్త్ డే గిప్ట్ అవుతుందా?

హైదరాబాద్:  ఈ నెల 17న విడుదలవుతున్న  ‘శ్రీరామరాజ్యం’ సినిమా నయనతార నటజీవితంలో ప్రత్యేకమైన చిత్రం కానుంది. ఈ సినిమా తర్వాత ఆమె నటనకు గుడ్‌బై చెప్పనుంది. నవంబర్ 18 నయనతార పుట్టినరోజు జరుపుకోబోతున్న నయనతార-  ‘శ్రీరామరాజ్యం’   విజయాన్ని  ప్రేక్షకులు తనకు  పుట్టినరోజు కానుకగా  ఇవ్వాలని  ఆకాంక్షిస్తోంది.  '' నటిగా ఎన్ని మంచి పాత్రలు చేసినా ఆత్మసంతృప్తిని ఇచ్చింది మాత్రం ‘సీత’ పాత్రేనని, ఈ పాత్ర తన నడవడికలో కూడా మార్పును తెచ్చిందని, తన మనసుకు ఎంతో దగ్గరైందనీ'  అంటోంది నయన. ఇంతటి గొప్ప పాత్రను ఇచ్చి తన గౌరవాన్ని పెంచిన బాపు, బాలకృష్ణ, యలమంచిలి సాయిబాబులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజున నయనతార తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో కలసి ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని చూస్తుందని సమాచారం.  వచ్చే ఏడాది ప్రభుదేవాతో ఆమె పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే.   

12మంది ఎంపీల రాజీనామాలు తిరస్కృతి

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా పెండింగ్‌
న్యూఢిల్లీ,నవంబర్ 16: ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పలు పార్టీలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు చేసిన రాజీనామాల్లో ఒక్కటి మినహా అన్నింటినీ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం తిరస్కరించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామాను పెండింగ్‌లో ఉంచి, మిగతా 12 రాజీనామాలనూ స్పీకర్ తోసిపుచ్చారని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. రాజీనామాలు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం తదితర కారణాల వల్ల వాటిని తోసిపుచ్చారని పేర్కొన్నాయి. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), గుత్తా సుఖేందర్‌రెడ్డి (నల్లగొండ), మధు యాష్కీ గౌడ్ (నిజామాబాద్), మంద జగన్నాథ్ (నాగర్‌కర్నూల్), బలరాం నాయక్ (మహబూబాబాద్), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), జి.వివేక్ (పెద్దపల్లి),సరిసిల్ల రాజయ్య (వరంగల్); టీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ (మహబూబ్‌నగర్), విజయశాంతి (మెదక్); టీడీపీ నుంచి నా మా నాగేశ్వరరావు (ఖమ్మం), రమేశ్ రాథోడ్ (ఆదిలాబాద్)ల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. కోమటిరెడ్డితో పాటు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన రాజీనామాను కూడా స్పీకర్ పెండింగ్‌లో పెట్టారని లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి. 

22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసిన సచిన్

కోల్‌కతా,నవంబర్ 16: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. 15 నవంబర్ 1989.... కరాచీ జాతీయ స్టేడియంలో పాకిస్థాన్ ప్రత్యర్థిగా బరిలోకి దిగిన సచిన్ నాటినుంచి రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం మాస్టర్ టెస్టు క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్ ఉన్న ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానం సంపాదించాడు. ఆల్‌రౌండర్ విల్ఫ్రెడ్ రోడ్స్ (ఇంగ్లండ్) 30 ఏళ్ల 315 రోజుల పాటు (జూన్ 1, 1899 నుంచి ఏప్రిల్ 12, 1930) కెరీర్ కొనసాగించి అగ్రస్థానంలో నిలిచాడు.ఇంగ్లండ్‌కే చెందిన డెన్నిస్ బ్రౌన్ క్లోజ్ (26 ఏళ్ల 356 రోజులు), ఫ్రాంక్ వూలీ (25 ఏళ్ల 13 రోజులు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో 182 టెస్టులు, 453 వన్డేలు ఆడిన సచిన్ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీతో పాటు 18,111 పరుగులు చేశాడు. టెస్టుల్లో 15,086 పరుగులు సాధించాడు.

స్వామియే శరణమయ్యప్పా...

రెండు నెలల వార్షిక మండలం-మకరవిలక్కు యాత్రికులకోసం బుధవారం  తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం.

యు.పి. ని నాలుగు ముక్కలు చేయాల్సిందే:మాయావతి

లక్నో,నవంబర్ 15:  పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి డిమాండ్ చేశారు.చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని  మాయావతి మరోసారి స్పష్టం చేశారు.  మంగళవారం  మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెద్ద రాష్ట్రాలతో ఉపయోగం లేదని, చిన్న రాష్ట్రాలతో చాలా లాభాలున్నాయని మాయవతి అన్నారు. ఈ నెల నవంబర్ 21న విభజనపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు  తెలిపారు.యూపీ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి ప్యాకేజీ తమకు అందలేదన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి బీఎస్పీ కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.

భారత్ ' శత ' క్కొట్టుడు...!

కోల్ కతా,నవంబర్ 15:  వెస్టిండీస్ -భారత్ జట్లమధ్య కోల్ కతాలో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో రోజున భారత్ 631 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో హైదరాబాదీ బ్యాట్స్ మెన్ లక్ష్మణ్   176 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మంగళవారం బరిలోకి దిగిన భారత్  పరుగుల సునామీ సృష్టించింది. ఈ మ్యాచ్ లో ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయటం విశేషం. రాహుల్ ద్రావిడ్ 119, టీమిండియా కెప్టెన్ ధోనీ 144 పరుగులు చేయగా లక్ష్మణ్ 176 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మొదట్లోనే  తొలి వికెట్ ను కోల్పోయింది.

కేంద్ర మంత్రి కుమారునితో జెనీలియా పెళ్లి

ముంబై,నవంబర్ 15: ప్రముఖ సినీ నటి జెనీలియా పెళ్లి కేంద్ర మంత్రి కుమారునితో ఖరారైంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విలాస్ రావు కుమారుడు రితీష్ ని ఆమె పెళ్లి చేసుకోనుంది. ఫిబ్రవరి 4న వీరి పెళ్లి జరుగనుంది. వీరిద్దరూ 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. 

Monday, November 14, 2011

చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ


వై.ఎస్.విజయమ్మ పిటిషన్ పై హైకోర్ట్ ఆదేశం

హైదరాబాద్,నవంబర్ 14: : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  ఆస్తులపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని  కోర్టు ఆదేశించింది. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు విజయమ్మ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు, అవినీతి వ్యవహారాలు, బినామీ ఆస్తులు, భూ ఆక్రమణ తదితర అంశాలను వివరిస్తూ విజయమ్మ 2424 పేజీల నివేదికని కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు బినామీ సంబంధాలు, ఎంపి సుజనా చౌదరి, సిఎం రమేష్ లతో ఉన్న వ్యాపార సంబంధాలు, ఏలేరు కుంభకోణంలో కోట్ల రూపాయల అక్రమార్జన వ్యవహారాలను కూడా ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.హెరిటేజ్ డెయిరీకి ఏ విధంగా లాభాలు చేకూర్చింది, సింగపూర్ లో హొటల్ వివరాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో చంద్రబాబు సాగించిన కార్యకలాపాలను  విజయమ్మ తన పిటిషన్ లో వివరించారు. పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్,కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ల  వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.

'దూకుడు' గా వస్తున్న 'బిజినెస్ మ్యాన్'...!

హైదరాబాద్: మహేష్ బాబు రాబోయే  కొత్త సినిమా బిజినెస్ మ్యాన్  సంచలనాలకు సిద్దమవుతోంది. 'ఇలా రౌండప్‌ చేసి నన్ను కన్ఫ్యూజ్‌ చెయ్యొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను’’ అనే డైలాగ్ తో  మహేష్ అభిమానులను అలరించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ చేసిన 'దూకుడు' వంద రోజులకు ముందే బిజినెస్ మ్యాన్ విడుదల కానుంది. ' ముంబై నేపథ్యంలో సినిమా కథ సాగుతుంది. ఇప్పటికే బిజినెస్‌ పరంగా విపరీతమైన క్రేజు ఏర్పడింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 8 కి చిత్రీకరణ పూర్తిచేసి, అదే నెల 2వ వారంలో ఆడియో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.  జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్‌ కానుంది.

గాలి జనార్థన్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్,నవంబర్ 14:  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల  28వ తేదీ వరకూ పొడిగించింది. ఈ కేసులో వీరి రిమాండ్ గడువు సోమవారం తో ముగియడంతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని గాలి జనార్థన్ రెడ్డి న్యాయమూర్తిని అభ్యర్థించారు. తాను ఏ తప్పూ చేయలేదని; తాను జైల్లో ఉండడం వలన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించారు. అయితే న్యాయమూర్తి ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.

Sunday, November 13, 2011

కలాం కు సారీ చెప్పిన అమెరికా

న్యూఢిల్లీ,నవంబర్ 14: భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్‌కలాంను అమెరికా ఆదివారం క్షమాపణ కోరిందని ఇక్కడి యూఎస్ రాయబార  కార్యాలయం  వెల్లడించింది. ఈ మేరకు యూఎస్ ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరీటి అడ్మినిస్ట్రేటర్ నుంచి అబ్దుల్ కలాంకు వ్యక్తిగతంగా లేఖను అందజేసినట్లు పేర్కొంది. ఇటువంటి ఘటన మరో సారి పునరావృతం కాకుండా ఉండేలా పటి ష్టమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వానికి మరో లేఖ ద్వారా వివరించింది. కాగా  కలాంకు జరిగిన తాజా అవమానంపై భారత్  తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆమోదయోగ్యం కాని చర్యలకు తెరదించకపోతే అమెరికా ప్రముఖులపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ అంశంపై విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ అమెరికాలోని భారత రాయబారి నిరుపమా రావుకు ఫోన్ చేసి మాట్లాడారు. సెప్టెంబర్ 29న న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయంలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కాలాంను భద్రతా సిబ్బంది తనిఖి చేసిన సంఘటన  తెలిసిందే.

భారతీయ పర్యాటకులకు వీసాచార్జీలను తగ్గించిన శ్రీలంక

కొలంబో,నవంబర్ 14:  భారతీయ పర్యాటకులకు  వీసా చార్జీలను శ్రీలంక తగ్గించింది. శ్రీలంకలో పర్యటించే భారతీయుల నుంచి కేవలం 10 డాలర్లు మాత్రమే వీసాల చార్జీల కింద వసూలు చేస్తారు. అన్ని సార్క్ దేశాలకు ఇది వర్తిస్తుంది. గతంలో 50 డాలర్లు వసూలు చేయాలని భావించినా భారత్ చొరవతో దీన్ని కుదించింది. భారతీయేతరులతోపాటు , నాన్ సార్క్ దేశాలకు చెందిన వారు 20 డాలర్లు చెల్లించాలి.
శ్రీలంకను అత్యధికంగా సందర్శించే పర్యటకుల జాబితాలో బ్రిటన్ స్థానాన్ని తాజాగా భారత్ ఆక్రమించింది. శ్రీలంకకు వెళ్లే భారతీయుల శాతం రెట్టింపైంది. ఈ నేపథ్యంలో రేట్లను తగ్గించాలని భారత్ కోరింది. మాల్దీవులు, సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఈటీఏ, ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఎల్టీటీఈతో చిరకాల యుద్ధానికి తెర పడటంతో పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక చర్యలు తీసుకుంటోంది. 

అబ్దుల్ కలాంకు అమెరికాలో అవమానం

న్యూఢిల్లీ,నవంబర్ 13: : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్దుల్ కలాంకు అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అవమానం ఎదురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కలాం ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు రెండుసార్లు కలాంను ఒళ్లంతా తడిమి చూసే ప్రయత్నాలు చేశారు. ఓ కార్యక్రమానికి హాజరై గత సెప్టెంబర్‌లో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో న్యూయార్కు ఎయిర్ పోర్టు అధికారులు ఆయన ఒళ్లంతా తడిమి చూసే ప్రయత్నాలు చేశారు.  ఎయిరిండియా ప్రతినిధులు అభ్యంతరం చెప్పినప్పటికీ  వారు కలాం బూట్లు, కోటు విప్పి తనిఖీలు చేశారు.  కాగా 2009లోనూ న్యూఢిల్లీలో కలాంను పూర్తిగా తనిఖీ చేసి ఓ ఎయిర్ లైన్స్ అధికారులు అవమానపర్చారు. ఇలాంటి సంఘటన ఆయనకు ఎదురుకావడం ఇది రెండోసారి.

Saturday, November 12, 2011

భాగ్యనగరంలో బాలల సినిమా పండగ

హైదరాబాద్,నవంబర్ 13: 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్ నగరం సర్వసన్నద్దమైంది. సోమవారం  నుంచి 20వ తేదీ వరకూ ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు  భారత బాలల  చలన చిత్రొత్సవ కమిటీ చైర్‌పర్సన్ నందితాదాస్, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ  తెలిపారు. దాదాపు 150 సినిమాలను  ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పదిచిత్రాలు ఎంపికకాగా.. మన రాష్ట్రానికి చెందిన నాలుగు చిత్రాలు ఉన్నాయి.  చిత్ర ప్రదర్శనలకోసం మొత్తం 13 స్క్రీన్లు ఎంపిక చేశారు.  ఇందులో మూడు తాత్కాలిక థియేటర్లను శిల్పారామంలో ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా, సినీ నిర్మాతలు, దర్శకులు.  చిత్రోత్సవాల్లో పాల్గొనే చిన్నారులతో సమావేశాలు,  బహిరంగ చర్చా గోష్టులతో పాటు ‘లిటిల్ డెరైక్టర్స్’ అనే కొత్త కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. చిత్రోత్సవాల్లో ప్రదర్శించే అంతర్జాతీయ, జాతీయ చిత్రాలకు 4 విభాగాల్లో 15 గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డులు ఇస్తామని నందితాదాస్ తెలిపారు. చిత్రోత్సవాలను లక్షన్నర మంది చిన్నారులు వీక్షిస్తారని , ప్రతి జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేసి ప్రభుత్వ ఖర్చుతో ఉత్సవాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి అరున చెప్పారు.  అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికను భవిష్యత్ లో కూడా హైదరాబాద్‌లోనే కొనసాగిస్తారని, వేరే ప్రాంతానికి మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించబోదని మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం శాశ్వత వేదికను నిర్మించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నామని తెలిపారు.

రాజీనామా లేఖలపై కదలిక

 నాగం , నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిల రాజీనామాల  ఆమోదం  
హైదరాబాద్,నవంబర్ 13:   తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు.  తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో నాగం, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో దివంగత  వైఎస్ పేరును చేర్చడాన్ని నిరసిస్తూ ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నల్లపురెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అంతకుముందు ఫిర్యాదు ఇచ్చింది. ఆ పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన స్పీకర్ తీర్పును రిజర్వులో ఉంచారు. ఈలోగా ప్రసన్న రాజీనామా లేఖ ఇవ్వడంతో స్పీకర్ టీడీపీ పిటిషన్‌ను తిరస్కరించి ఆయన ఇచ్చిన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇక నాగం తన రాజీనామా ఆమోదం కోసం పలుమార్లు స్పీకర్‌పై   ఒత్తిడి చేశారు. ధర్నాలు చేసి పట్టుబట్టడమే కాకుండా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో తాజాగా పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ తరుణంలో ఆయన రాజీనామాను కూడా మనోహర్ ఆమోదించారు. స్పీకర్ వద్ద  ఇంకా 79 మంది రాజీనామాలు పెండింగ్‌లో ఉన్నాయి.  టీడీపీ నుంచి 34 మంది, టీఆర్‌ఎస్ నుంచి  16 మంది, కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరి రాజీనామా లేఖలు స్పీకర్ వద్ద పరిశీలనలో ఉన్నాయి. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీల నుంచి 25 మంది చేసిన రాజీనామాలు కూడా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.




తెలంగాణాపై తొందరపడం: తేల్చేసిన పి.ఎం.

న్యూఢిల్లీ,నవంబర్ 13: తెలంగాణపై తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోబోమని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు.  మాల్దీవుల్లో సార్క్ శిఖరాగ్రంలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణం లో  తన ప్రత్యేక విమానం లో విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణా పై తొందరపాటు నిర్ణయం తీసుకుని  ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల్లో సమస్యలను సృష్టించజాలమని తెలిపారు.  తెలంగాణ ఒక సంక్లిష్టమైన అంశమని,  ఏకాభిప్రాయం ఆధారంగా మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటామని   పునరుద్ఘాటించారు. సమస్యతో సంబంధం  ఉన్నవారందరూ అంగీకరించే సరైన, వాస్తవిక పరిష్కారాన్నే కనిపెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

సత్యసాయి ఆకాంక్షలు వెల్లడిస్తా: ఐశాక్ టైగ్రేట్

అనంతపురం,నవంబర్ 12:  అమెరికాకు  చెందిన సత్యసాయి భక్తుడు ఐశాక్ టైగ్రేట్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23వ తేదీలోగా బాబా తనతో చర్చించిన విషయాలను బయటకు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐశాక్ తెల్ల కాగితాలపై బాబా స్వయంగా గీసిన స్కెచ్ లను బయటపెట్టారు. అనేకమార్లు ప్రత్యేకంగా సంభాషించే అవకాశం సత్యసాయి తనకు కల్పించారని, ఈ క్రమంలో సత్యసాయి సంస్థల భవిష్యత్ ప్రణాళిక అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఐశాక్ ఈమెయిల్ ద్వారా ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. వెయ్యికాళ్ల మండపం తరహాలో ప్రశాంతి నిలయంలో ఆలయాలు నిర్మించాలని తనతో బాబా చెప్పారన్నారు. అటువంటి స్కెచ్ లను బాబా వేసి చూపించారన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందరంగా ప్రశాంతి నిలయం ఉండాలని, అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి తన సందేశాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని బాబా తనతో చెప్పినట్లు ఐశాక్ టైగ్రేట్ వెల్లడించారు. సత్యసాయి సంస్థలను భవిష్యత్తులో ఏ విధంగా నిర్వహించాలి అన్న దానిపై ఒక నిర్దిష్ట ప్రణాళికను బాబా రూపొందించారని, ఈ విషయాన్ని తనతో పలుసార్లు ప్రస్తావించారన్నారు. దీనికి తానే సజీవ సాక్ష్యమని ఆయన తెలిపారు. గతంలో కూడా ఐశాక్ టైగ్రేట్ బాబా గురించి పలు విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే.  

వైట్ హౌస్ వద్ద కాల్పులు

వాషింగ్టన్,నవంబర్ 12:  వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ సమీపంలో శుక్రవారం కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి రూస్ వెల్ట్ బ్రిడ్జి మీదుగా పరిగెత్తినట్లు చెబుతున్నారు.  ఈ సంఘటనతో వాషింగ్టన్ డీసీ మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఆ కాల్పులు శ్వేతసౌధాన్ని గురిపెట్టి జరిగాయని చెప్పడానికి ఆధారాలు లెవని అధికారులు అంటున్నారు. పశ్చిమ దిశగా రెండు వాహనాలు వెళ్లినట్లు కూడా వారు గుర్తించారు. కాగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కాలిఫోర్నియాలో ఉన్నారు. .

Sunday, November 6, 2011

గుజరాత్ చేరిన అద్వాని యాత్రకు స్వాగతం పలుకుతున్న ఆ రాష్ట్ర సి.ఎం. నరేంద్ర మోడీ ...

కార్తీకమాసం పిక్నిక్ విషాదాంతం...

హైదరాబాద్,నవంబర్ 7: కార్తీక సమారాధనలో భాగంగా పిక్నిక్‌కు వెళ్లిన ఆరుగురు చిన్నారులు, ఓ ఉపాధ్యాయురాలు వశిష్ట గోదావరి నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు దొరకగా.. మిగిలినవారి జాడ కోసం గాలిస్తున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మూడు పాఠశాలలకు చెందిన 73 మంది విద్యార్థులు విహారయాత్రకు కాకరపర్రు వెళ్లారు.  వీరిలోని 10 మంది విద్యార్థులు స్నానం చేసేందుకు కాకరపర్రులోని గోదావరి లంకలో దిగారు. అయితే, లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు.  వెంటనే అప్రమత్తమయిన  టీచర్ లక్ష్మీప్రసన్న, తణుకు బాలుర హైస్కూల్ విద్యార్థి డి.అశోక్‌కుమార్నదిలోకి దిగి వారిని కాపాడేందుకు యత్నించారు. ఈ సమయంలో లక్ష్మీ ప్రసన్న ఓ విద్యార్థిని రక్షించి.. మరొకరిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ.. మునిగిపోయారు. అశోక్ కుమార్‌కు ఈత రాకున్నా ధైర్యసాహసాలు ప్రదర్శించి.. ముగ్గురిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు.  గాలింపు కొనసాగుతోంది.

మిస్ వరల్డ్ గా వెనెజులా యువతి


లండన్,నవంబర్ 7: : మిస్ వరల్డ్-2011 కిరీటాన్ని వెనెజులా  యువతి ఇవియన్ సర్కోస్ కైవసం చేసుకుంది. లండన్ లోని ఎరల్స్ కోర్టులో 61వ మిస్ వరల్డ్ పోటీలు వైభవంగా జరిగాయి.మొదటి రన్నరప్ గా మిస్ ఫిలిఫ్సీన్స్ వెన్ డోలైన్ రుయాస్, రెండో రన్నరప్ గా మిస్ పోర్టోరికో అమండా పెరెజ్ లు నిలిచారు. కాగా భారత తరపున ప్రాతినిధ్యం వహించిన కనిష్తా ధంకార్ కు  20వ స్థానం  కూడా దక్కలేదు. 

చంద్రపాల్ సెంచరీ: విండీస్ 256/5

న్యూఢిల్లీ,నవంబర్ 6: భారత్‌తో ఆదివారమిక్కడ ప్రారంభమయిన మొదటి టెస్ట్ లో వెస్టిండీస్ ఆటగాడు శివనారాయణ చంద్రపాల్ సెంచరీ సాధించాడు. 144 బంతుల్లో 6 ఫోర్లు , 2 సిక్సర్లతో సెంచరీ పూర్తిచేశాడు. టెస్ట్ లలో చంద్రపాల్ కిది 24వ శతకం. తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న విండీస్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. చంద్రపాల్ 111, బాగ్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బ్రాత్‌వేట్ 63, పావెల్ 14, ఎడ్వార్డ్స్ 15, బ్రేవో 12, శ్యామూల్స్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఓజా 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు.

Saturday, November 5, 2011

‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’ భూపేన్ హజారికా మరిలేరు

హైదరాబాద్,నవంబర్ 6:  ‘దిల్ హూమ్ హూమ్ కరే..’, ‘ఓ గంగా బెహతీ హో..’ లాంటి మరపురాని గీతాలు ఆలపించిన సంగీత, సాహిత్య దిగ్గజం భూపేన్ హజారికా కన్ను ముశారు. నాలుగు నెలలకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల హజారికా  శనివారం సాయంత్రం ముంబై ఆస్పత్రిలో తుది శ్వాశ విడిచారు.   అస్సామీ సంప్రదాయ, గిరిజన సంగీతాల నుంచి అద్భుతం, అపురూపమైన స్వరజగతిని సృష్టించి శ్రోతల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన హజారికా ను  అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి గుర్తుగా  ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’ గా పిలుస్తారు. హజారికా అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాలకు వందలాది పాటలు రాసి, స్వరకల్పన చేశారు. శకుంతల,ప్రతిధ్వని తదితర అస్సామీ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. వాటికి సంగీతమూ అందించారు. పాటలూ పాడారు. కల్పనా లాజ్మీతో కలిసి రూపొందించిన రుదాలి, ఏక్‌పల్, దార్మియాన్, దామన్, క్యోన్ వంటి చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఈ ఏడాది విడుదలైన ‘గాంధీ టు హిట్లర్’ సినిమాలో ‘వైష్ణవ జన్..’ పాట ను ఆయన చివరగా పాడారు. 976 లో జాతీయ ఉత్తమ సంగీతదర్శకుని అవార్డ్ అందుకున్న  హజారికా 1977లో పద్మశ్రీ, 1992లో దాదా ఫాల్కే, 2001లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 1967-72 మధ్య ఎమ్మెల్యే (అస్సాం) గా. 1999-2004 మధ్య సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా పని చేశారు. 

కోమటిరెడ్డి దీక్ష భగ్నం : నిమ్స్ లో చికిత్స

హైదరాబాద్,నవంబర్ 6:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నల్గొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను  పోలీసులు భగ్నం చేశారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న కోమటిరెడ్డిని  ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయనను  చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లోని అత్యవసర చికిత్స విభాగంలో ఆయకు చికిత్స చేస్తున్నారు. నిమ్స్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ మేమే ఇస్తాం: సుష్మా స్వరాజ్

నల్గొండ, నవంబర్ 6: తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని తప్ప మరిదేన్నీ అంగీకరించరాదని, మరే   ప్రత్యామ్నాయానికైనా  అంగీకరిస్తే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ అన్నారు.  బీజేపీ రాష్ట్ర శాఖ నల్లగొండలో నిర్వహించిన ‘బీజేపీ తెలంగాణ పోరు’ సభలో మాట్లాడుతూ, తెలంగాణ కోసం  బలిదానాలకు పాల్పడవద్దని, భావి తెలంగాణ కోసం బతికి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఇస్తుందని హామీ ఇచ్చారు.
చిన్న రాష్ట్రాలలో అభివృద్ది లేదనే వాదన సరికాదని, ఎన్డీయే ప్రభుత్వం గతంలో మూడు రాష్ట్రాలిస్తే ఇప్పుడవన్నీ సుభిక్షంగా ఉన్నాయని సుష్మా తెలిపారు. తెలంగాణకు మద్దతిస్తున్నామంటే అది ఆంధ్రాకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేశారు.

Friday, November 4, 2011

దీపావళి పోయె...బక్రీద్ పోయే...ఇక సంక్రాంతి...

హైదరాబాద్ ,నవంబర్ 4: తెలంగాణపై జనవరిలోగా నిర్ణయం వెలువరిస్తామని, ఈ విషయం రాష్ట్రంలోని తమ పార్టీ నేతలకు తెలుసునని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. ఆ విషయం తెలిసి కూడా తమ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరడం తొందరపాటు చర్యేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయ నాయకులు తొందరపడి పార్టీలు మారితే తెలంగాణ రాదని ఆయన అన్నారు. తెలంగాణ వంటి క్లిష్టమైన, సున్నితమైన సమస్య పరిష్కారానికి సహనం, ఓర్పు అవసరమని ఆయన అన్నారు.  తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు జరుగుతోందని, చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడానికి  తమ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి సమయంలో తొందరపడి పార్టీలు మారడం దురదృష్టకరమని ఆయన అన్నారు.  తెలంగాణ వంటి సమస్యల విషయంలో రాజనీతిజ్ఞత ప్రదర్శించాలని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ చేతులు ముడుచుకుని కూర్చుందని అనడం సరి కాదని,  ఆయన అన్నారు.

కోనేరు ప్రసాద్‌కు ఏడు రోజుల సిబిఐ కస్టడీ

హైదరాబాద్ ,నవంబర్ 4: ఎమ్మార్ ప్రాపర్టీస్  కేసులో అరెస్టయిన స్టైలిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్‌ను ఏడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోనేరు ప్రసాద్‌ను 15 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరగా, ఏడు  రోజుల పాటు అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.  విదేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన తర్వాత కోనేరు ప్రసాద్‌ను గురువారం సిబిఐ అధికారులు అధికారులు అరెస్టు చేశారు.  కాగా, కోనేరు ప్రసాద్‌కు ఎవరెవరితో సంబంధాలున్నాయనే విషయాలపై సిబిఐ ఆరా తీస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితోనూ,  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతోనూ అతనికి గల సంబంధాలపై సిబిఐ విచారణ సాగిస్తోంది. రికార్డుల్లో గజానికి ఐదు వేల రూపాయలు మాత్రమే చూపించి ఎమ్మార్ - ఎంజిఎఫ్ అభివృద్ది చేసిన టౌన్‌షిప్‌లోని విల్లా స్థలాలను గజానికి 25 వేల నుంచి 50 వేల రూపాయలకు అమ్మినట్లు కోనేరు ప్రసాద్‌పై ఆరోపణలున్నాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ -ఎపిఐఐసి ఈక్విటీని బలహీనపరిచినట్లు, దానికి కోట్లాది రూపాయలు నష్టం కలిగించినట్లు తెలుస్తోంది.

గాలి కేసులో సి.బి.ఐ. ఎదుట హాజరైన జగన్

బాబునూ విచారించండి...  
హైదరాబాద్ ,నవంబర్ 4:  ఓబుళాపురం గనుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుక్రవారం  సీబీఐ ఎదుట  సాక్షిగా హాజరై తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ,  2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు. ఈ  వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని  సీబీఐకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రామ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని జగన్ వివరించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైన ఏడాదిన్నర తర్వాత తనను ఒక సాక్షిగా మాత్రమే సీబీఐ పిలిచిందంటే... ఇందులో తనకు సంబంధం లేదనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా సాక్షిగానే విచారించిందన్నారు. కాగా, జగన్మోహన రెడ్డి ఇచ్చిన జిఓ కాపీని పరిశీలిస్తామని సిబిఐ జెడి లక్ష్మీనారాయణ చెప్పారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీతో తనకు ఎటువంటి సంబంధంలేదని జగన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆ కంపెనీ యజమాని గాలి జనార్దన రెడ్డిని వ్యక్తిగతంగానే కలిసినట్లు జగన్ చెప్పారన్నారు.

చెర విడిన 'సత్యం' రాజు

న్యూఢిల్లీ,నవంబర్ 4:  సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, ఆడిటర్ వడ్లమాని శ్రీనివాస్ లకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికీ రెండు లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ, ట్రయిల్ కోర్టు విచారణకు సహకరించాలని సూచించింది. గత రెండు సంవత్సరాల ఎనిమిది నెలలుగా రామలింగరాజు జైల్లో ఉన్నారు. 2009లో ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Tuesday, November 1, 2011

ధోని, అభినవ్ బింద్రాలకు అరుదైన గౌరవం

న్యూఢిల్లీ, నవంబర్ 1:   భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఒలంపిక్ గోల్డ్ మెడల్ గ్రహిత అభినవ్ బింద్రాలకు అరుదైన గౌరవం దక్కింది.  వీరిద్దరికీ టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అందజేశారు. సౌత్ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమానికి ధోని, బింద్రాలు హాజరయ్యారు. రక్షణ శాఖ సహయ మంత్రి పళ్ళమ్రాజు వీరిద్దరినీ అభినందించారు. 

ఇదేనా బాబు మనసులో మాట...!

హైదరాబాద్ ,నవంబర్ 1:   తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు దేశ రాజధాని హస్తినలో  స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారం రోజుల సత్యాగ్రహానికి మద్దతు ఇస్తుంటే, మరో పక్క వారి అధినేత  హైదరాబాదులో రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో తెలంగాణ ఏర్పాటు ను వ్యతిరేకించే విధంగా మాట్లాడి సంచలనం రేపారు.ఆంధ్రప్రదేశ్ అవతరణకు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పదవీ త్యాగం చేశారని ,తెలుగుజాతి మూడు వేల ఏళ్ల పాటు కలిసి ఉందని, 150 ఏళ్లు మాత్రమే విడిపోయి ఉందని చంద్రబాబు ఈ సందర్భం గా అన్నారు. ఈ వ్యాఖ్యలు బాబు  తెలంగాణ వ్యతిరేక వైఖరిని చెప్పకనే చెబుతున్నాయని రాజకీయ పరిశీలకులు భాష్యం చెబుతున్నారు. మరోవైపు ఆయన బావమరిది, తెలుగుదేశం నాయకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ నేరుగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడి కలకలం రేపారు. రాష్ట్రం విడిపోకుండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బాలకృష్ణ ఓ కార్యక్రమంలో అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ అవతరించిందని, దాన్ని విడగొట్టడం సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తూ , తెలంగాణ రాష్ట్ర సమితి ని, కాంగ్రెసును ఎండగట్టాలనే తమ లక్ష్యాన్ని సాధించడం మాట అటుంచి, బావా మరదుల వ్యాఖ్యలతో ఖంగు తినాల్సి వచ్చింది. కాంగ్రెసు, తెరాస నాయకులు ఇంత కాలం తెలుగుదేశం తెలంగాణ నేతలపై చేస్తు న్న వ్యతిరేక వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్లయింది.

నల్గొండలో ఆమరణ దీక్ష ప్రారంభించిన కోమటిరెడ్డి

నల్గొండ,నవంబర్ 1:  తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నది సీమాంధ్రులు  కాదని... తెలంగాణ మంత్రులేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో నల్గొండ పట్టణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఆమరణ దీక్షను ప్రారంభించారు.విజయమో.. వీర స్వర్గమో ఈ దీక్ష ద్వారానే తేల్చుకుంటానని ఆయన అన్నారు.  సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు ఒక్కటై  బలం చాటారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్నిపార్టీలు ఒక్కటి కాకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, కేకే,రాజయ్య, మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు హాజరై కోమటిరెడ్డికి సంఘీభావం తెలిపారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఈ దీక్షకు తరలి వచ్చారు.
ఢిల్లీలో దీక్ష చేపట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ
న్యూఢిల్లీ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష వారంపాటు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. అంతకు ముందు ఆయన గాంధీజీ సమాధి స్థలం రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అక్కడే గంటపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం చేశారు.



బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...