Sunday, July 31, 2011

వర్మ డిపార్టమెంట్ లో లక్ష్మీ ప్రసన్న!


 మంచు లక్ష్మీ ప్రసన్న నటించిన రామ్ గోపాల్ వర్మ సినిమా ' దొంగలముఠా '  బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుని తీసినన్ని  తీసినని  రోజులు కూడా ఆడకుండానే  అయినా వర్మాజీ కి అమె పై కాంఫిదెన్స్ పోలేనట్టే ఉంది.  ఆమెకు నటిగా లైఫ్ ఇవ్వాలని కంకణం కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ  ఆమెను ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కే కి పరిచయం చేయబోతున్నాడు. ఆయన తాజా చిత్రం ' డిపార్టమెంట్ ' తో ఆమెను  బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిపార్టమెంట్ లో  రానా హీరోగా నటిస్తున్నాడు. అమితాబ్,సంజయ్ దత్ నటిస్తున్న ఈ చిత్రం పోలీస్ డిపార్టమెంట్ నేపధ్యంలో జరుగుతుంది. కాగా  లక్ష్మీ మంచు కూడా ఈ న్యూస్ కన్పర్మ్ చేసింది.  ..ఓ బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసాను. సూపర్ గా ధ్రిల్ అయ్యాను. వివరాలు త్వరలో చెపుతాను.నా కలలు అతి త్వరలో నిజం కాబోతున్నాయి... అని ట్విట్జర్ లో రాసింది.  అయితే అది వర్మ ప్రాజెక్టు అని మాత్రం ఆమె రివిల్ చేయక పోవడం గమనార్హం.  ఇంతకుముందు కూడా ఆమె క్రిష్ 3లో చేయబోతోందని, రాకేష్ రోషన్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే  అదేమీ వర్కవుట్ కాలేదు.

గోబీ ఎడారిని విజయవంతంగా దాటిన పుణె మహిళ


న్యూఢిల్లీ,జులై 31:  సాహసానికి మారుపేరైన భారతనారి మరో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకుంది. నిప్పులు చెరిగే ఎండ,  వెన్ను  వణికించే చలి, ఇసుక తుపాన్లతో నిండిన   ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని పుణెకు చెందిన సుచేతా కడేత్కర్ (33) విజయవంతంగా దాటారు. 1,623 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత 60 రోజులకంటే ముందుగానే.. 51 రోజుల్లో (జూలై 15న) దిగ్విజయంగా పూర్తిచేసుకుని సుచేత బృందం రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు పుటల్లోకి ఎక్కారు. రిప్లే డెవన్‌పోర్ట్ నేతృత్వంలోని 13 మంది బృందం గోబీ సాహసయాత్రకు మే 25న శ్రీకారం చుట్టింది. ఇందులో సుచేత కూడా సభ్యురాలు. ఆరోగ్య సమస్యలు, గాయాల బారినపడడంతో బృందంలోని ఆరుగురు సభ్యులు యాత్ర మధ్యలోనే వైదొలిగారు. గోబీ యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని పుణేకు వచ్చిన సుచేత శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గోబీ ఎడారి యాత్ర అత్యంత సాహసంతో కూడుకున్నది. మే 25న మంగోలియాలోని కొంగోరీన్ ఉత్తర ప్రాంతం నుంచి మా యాత్రను ప్రారంభించాం. రోజుకు సగటున 25 నుంచి 32 కిలోమీటర్ల దూరం నడిచాం. ఉదయం భరించలేని ఎండ, రాత్రిపూట భీకర చలిగాలులు, ఇక ఇసుక తుపాన్ల సంగతి సరేసరి. యాత్రలో ఎన్నో అడ్డంకులు. మధ్యలో అనారోగ్యానికి గురైనా త్వరలోనే తేరుకున్నా’’ అని యాత్రానుభవాల్ని ఆమె వివరించారు. గోబీ సాహసయాత్రకు ముందే ప్రతి రోజు తన ఇంటినుంచి ఆఫీసుకు సుమారు 24 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లేదాన్నని తెలిపారు. ఆ విధంగా నడకను అలవర్చుకున్నానని వెల్లడించారు. ఐర్లాండ్‌కు చెందిన రిప్లే డెవన్‌పోర్ట్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు చెప్పారు. భూటాన్ నుంచి పాకిస్థాన్ వరకు విస్తరించి ఉన్న హిమాలయాలను దాటడమే తన తదుపరి లక్ష్యమని ఆమె చెప్పారు. 

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంగోలియా ఆసక్తి

న్యూఢిల్లీ,జులై 31:  ఏడాదికి పైగా లోక్‌సభ ఆమోదం కోసం వేచిచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తెలిపారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలతో పలు దఫాలుగా చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. దక్షిణ కొరియా, మంగోలియాల్లో వారం రోజుల పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి శనివారం భారత్ తిరిగి వస్తూ ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. మంగోలియాలో మహిళా ఎంపీలతో జరిపిన సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగిందని చెప్పారు. ‘పార్లమెంటులో మహిళలకు కోటా ఉండాలని వారు కూడా కోరుకుంటున్నారని , భారత్‌లో మహిళా బిల్లు త్వరగా ఆమోదం పొందితే.. అలాంటి బిల్లు తేవాల్సిందిగా తాము కూడా మంగోలియా ప్రభుత్వాన్ని కోరతామని వారు చెప్పారని  పాటిల్ వివరించారు. మహిళా బిల్లు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందిన విషయం తెల్సిందే.

వీసా మోసాలపై జాగ్రత్త సుమా... భారతీయ విధ్యార్ధులకు అమెరికా వార్నింగ్

వాషింగ్టన్ ,జులై 31: మోసపూరిత వీసాలు ఇచ్చే  ముఠాలతోను, నకిలీ డాక్యుమెంట్లందించే వ్యక్తులతోను భారతీయ విద్యార్ధులు జాగ్రత్త వహించాలని అమెరికా హెచ్చరించింది. వీసాలకు సంబంధించి ఫెడరల్ అధికార్లు నార్తరన్ వర్జినీయా యూనివర్శటీ పై  దాడి చేసిన సందర్భంలో అమెరికా ఈ హెచ్చరికను జారీ చేసింది.  విద్యార్ధుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని అమెరికాలో విద్య కొరకై వస్తున్న విద్యార్ధులు మోస పూరిత వీసాలు, నకిలీ పేపర్ల విక్రయదారులకు బలి కాకూడదన్న కారణంగా తాము ఈ ప్రకటన చేస్తున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి  టోనర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. నార్తరన్ వర్జినీయా యూనివర్శటీ పై ఫెడరల్ అధికార్లు దాడి చేసిన అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందని భారత ప్రభుత్వంతో సంప్రదిస్తామని  ఆయన తెలిపారు. న్యూఢిల్లీ లోని రాయబార కార్యాలయం విదేశీ వ్యవహారాల శాఖకు వివరించిందని, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ, స్టేట్ డిపార్ట్ మెంట్ లు భారత రాయబార కార్యాలయంతో సంప్రదిస్తూనే వున్నాయన్నారు. దర్యాప్తు సాగుతున్నందున మరిన్ని వివరాలందించలేమని తెలిపారు. 
తానా సపోర్ట్...
యూనివర్శిటీ ఆఫ్ నార్తన్న్ వర్జీనియా ) విద్యార్థులకు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర  వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే తానా సభ్యులందరికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికి సహాయం చేయాలని అందులో సూచించినట్లు పేర్కొన్నారు. బాధితులు తానా కార్యాలయంలో తమను నేరుగా లేదా తేం@తన.ఒర్గ్ కి ఈ మొయిల్ ద్వారా సంప్రదించవచ్చన్నారు.దేశంలోని గుర్తింపు పొందిన, స్టూడెంట్ ఆండ్ ఎక్సేంజ్ విజిటర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ (ఎస్‌ఈవిఐఎస్) ధృవపరిచిన కళాశాలల్లోకి  వీరందరని బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యా సంవత్సరం మధ్యలో ఆగిపోకుండా చూస్తామన్నారు.

విధులకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రుల ససేమిరా..

హైదరాబాద్,జులై 31: తెలంగాణ మంత్రులు  విధులకు హాజరయ్యేది లేదని తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రికి   తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది మంత్రులు శనివారం సాయంత్రం రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన సలహాను  వారు తోసిపుచ్చారు. తెలంగాణకు చెందిన 12 మంది మంత్రుల్లో ఎనిమిది మంది ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మరో నలుగురు గైర్హాజరయ్యారు. కె. జానా రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, సారయ్య, సునీతా లక్ష్మా రెడ్డి, డికె అరుణ ముఖ్యమంత్రి తో సమావేశమయిన వారిలో వున్నారు. నలుగురు మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శంకరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్ని పార్టీల శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో, తెలంగాణ సమస్యపై పార్టీ అధిష్టానం చర్చలు ప్రారంభించిన నేపథ్యంలో విధులకు హాజరు కావాలని ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రులకు సూచించారు. అయితే, అందుకు తెలంగాణ మంత్రులు అంగీకరించలేదు. ఉద్యమం తీవ్రమైన ప్రస్తుత తరుణంలో తాము విధులకు హాజరైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీకి నష్టం జరుగుతుందని వారు చెప్పారు. తాము ప్రజల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు విధులకు హాజరు కావడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఓ మంత్రి కచ్చితంగానే చెప్పినట్లు సమాచారం.  

భారత్, చైనా చమురు తాగెస్తున్నాయిట...!

వాషింగ్టన్,జులై 31: భారతీయులు ఎక్కువగా తింటున్నారు.. అందుకే ఆహార కొరత పెరుగుతోందని వ్యాఖ్యానించిన మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ బాటలోనే ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా నడుస్తున్నారు. భారత్, చైనా చమురును తెగ వాడేస్తున్నాయని, అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు చుక్కలనంటుతున్నాయని ఆయన వాపోయారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ చమురు ధరలకు అనుగుణంగా సాగుతోంది. ధరలు పెరిగితే ఒత్తిళ్ళకు లోనవుతోంది. చైనా, భారత్‌లాంటి దేశాల్లో చమురు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మరింత చేయి దాటిపోతోందని ఒబామా ఒక సదస్సులో వ్యాఖ్యానించారు. చమురు ఉత్పత్తి కన్నా డిమాండ్ శరవేగంగా పెరిగిపోతోంది. ఫలితంగా రేట్లూ పెరుగుతున్నాయి’ అని ఒబామా అన్నారు. శుక్రవారమిక్కడ ‘కార్లు, టక్కుల్లో ఇంధన సామర్థ్యం పెంపు’ అన్న అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని వెంటనే మార్చలేమని, ఇప్పట్నుంచి స్వదేశంలో మరింత చమురు ఉత్పత్తికి చర్యలు మొదలుపెడితే మున్ముందు స్వయంసమృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. 2025 కల్లా అమెరికాలోని కంపెనీలు తమ వాహనాల ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. ప్రస్తుతం వారానికోసారి పెట్రోలు నింపుకునే కార్లు.. 2025కల్లా రెండు వారాలకోసారి పెట్రోలు పోయించుకునేలా పరిస్థితులు మారాలన్నారు. 

రుణసంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కేనా...?

వాషింగ్టన్,జులై 31: దివాళా పరిస్థితి నుంచి అమెరికాను తప్పించడానికి అధ్యక్షుడు బరాక్ ఒబామా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  ఏకైక మార్గమైన గరిష్ట రుణపరిమితి పెంపు బిల్లును ఎగువసభ (సెనేట్)లో ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. సెనేట్ ముందుకు రానున్న ఆ బిల్లును అడ్డుకోవద్దంటూ విపక్ష రిపబ్లికన్ సభ్యులను బుజ్జగించే చర్యలు ప్రారంభించారు. అయితే, అప్పుల విషయంలో అమెరికా డీఫాల్ట్ కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. సమయం మించిపోతుండటంతో.. సెనెట్‌లో బిల్లు ఆమోదం కోసం అవసరమైన రాజీ ఫార్మూలా రూపొందించాలని ఒబామా  ఆ రెండు పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అయితే, సెనేట్‌లో మెజారిటీ డెమోక్రాట్లదే కాబట్టి ఆ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. రిపబ్లికన్లు రూపొందించిన బిల్లు వల్ల కొన్ని నెలల్లోనే మరోసారి రుణపరిమితి సంక్షోభం తలెత్తుతుందని వైట్‌హౌజ్ మీడియా కార్యదర్శి జే కేర్నీ వ్యాఖ్యానించారు. ఆ బిల్లు సెనేట్‌కు రావడమే ‘డెడ్ బిల్’ గా వచ్చిందన్నారు. ప్రస్తుత రుణపరిమితికి ఆగస్టు 2 తుదిగడువు. అందువల్ల దివాళా పరిస్థితిని తప్పించుకోవాలంటే ఆ లోపే పరిమితిని పెంచుకునేలా చట్ట సవరణ జరపాల్సి ఉంది. అలా జరగని పక్షంలో నిధుల లేమితో ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోయి, అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుంది. క్రెడిట్ రేటింగ్‌లు దిగజారుతాయి. అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట దారుణంగా పడిపోతుంది. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అమెరికా అధికార యంత్రాంగం తీవ్రంగా యత్నిస్తోంది.  మరో వైపు సెనేట్‌లో హ్యారీ రీడ్ నేతృత్వంలోని డెమోక్రాట్ల బృందం రుణపరిమితికి సంబంధించిన సొంత ప్రణాళిక ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది.
ప్రపంచ మార్కెట్లపై ప్రభావం
అమెరికా రుణసంక్షోభం వల్ల ఏం ప్రమాదాలు ముంచుకొస్తాయోనని ప్రపంచదేశాలు కలవర  పడుతున్నాయి.   రుణ పరిమితి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇంకా పెంచడం ప్రమాదకరమని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.  అయితే రుణ సమీకరణ పరిమితిని పెంచకపోతే 40శాతం ఖర్చులకు అప్పులపై ఆధారపడిన అమెరికా ఆగస్టు 2 తర్వాత దివాలా తీసినట్లు ప్రకటించాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఆదాయం పెంచే మార్గం లేకపోవడంతో ఖర్చులు తగ్గించడం కోసం సామాజిక పథకాలకు కోత విధించాల్సి ఉంటుంది. ఉన్న నిధులను అత్యవసర ఖర్చులకు మాత్రమే సర్దుబాటు చేస్తారు. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి వడ్డీ చెల్లింపులో డిఫాల్ట్ కాక తప్పని పరిస్థితి వస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సొమ్ము అమెరికా బాండ్లలో ఉంది. అందుకే అమెరికా డిఫాల్ట్ అయితే దాని ప్రభావం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా ఉంటుంది. 

Saturday, July 30, 2011

బాలీవుడ్ ఆఫర్ వచ్చినా ...

అల్లు అర్జున్ కి బాలీవుడ్ ఆఫర్ వచినట్టు భోగట్టా.  హిందీలో పేరున్న యాష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ నుంచి అర్జున్ కు ఆఫర్ వచ్చినట్లుగా  వినపడుతోంది. అయితే ఇది  కన్ఫర్మ్ కాకపోయినా ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో సౌత్ హీరో అవసరమై అల్లు అర్జున్ ని పిలిచి మాట్లాడటం జరిగిందని చెప్తున్నారు. కాగా, ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ మార్కెట్ కు పరిచయమయ్యే అవకాశమున్నా డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక అల్లు అర్జున్ నో చెప్పే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.  తాజా చిత్రం బద్రీనాధ్ ఫెయిల్యూర్ కావటంతో  అర్జున్ అర్జంటుగా తెలుగు లో  ఒక హిట్  ఇవ్వాల్సిన అవసరం ఉందని  అతని డాడీ అల్లు అరవింద్ అభిప్రాయపడుతున్నారుట. . ఇక సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి అల్లు అర్జున్ మరో చిత్రం ప్రారంభం కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారు. చిత్రానికి' హనీ 'అనే టైటిల్   వినపడుతోంది.

ఫిటెనెస్ కోసం మహేష్ కష్టాలు...!

మహేష్ బాబు తన బాడీ ఫిటెనెస్ కోసం పర్సనల్ గా ఫిజికల్ ట్రైనర్ ని నియమించుకున్నారుట. శరీరాన్ని క్రమ పద్దతిలో సన్నగా ఉంచటం చాలా కష్టమని,  ఎప్పుడైనా రిలాక్స్ అయితే బరువు పెరిగిపోతున్నామని , అందుకే  ఓ ట్రైనర్ ని పెట్టుకుని  ఫిటెనెస్ ఎక్సరసైజులు చేస్తున్ననని చెప్పుకొచ్చాడు మహేష్. .ఎక్సరసైజులు ఇబ్బందిగా ఉన్నా ఎంజాయ్ చేస్తున్నాడట.  ముఖ్యంగా  ' దూకుడు ' చిత్రంలో మహేష్ ఓ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు. ఆ పాత్ర ఫిట్ నెస్ కోసమె ఇలా ట్రైనర్ ని పెట్టుకుని మరీ మహేష్ కష్టపడుతున్నారని సమాచారం.  కాగా, పూరీ జగన్నాథ్ చిత్రం  ‘ది బిజినెస్ మేన్’  లో మహేష్ బాబుది డైనమిక్ రోల్ అంటున్నారు. సినిమా షూటింగుకి సంబంధించిన లొకేషన్లను పూరి ముంబైలో ఎంపిక చేస్తున్నారుట. కాజల్ కథానాయికగా నటించే ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఇది వచ్చే సంక్రాంతి సినిమా కావచ్చు.  

నార్త్ వర్జీనియా యూనివర్శిటి విద్యార్థులకు భరోసా

వాషింగ్టన్,జులై 30: యూనివర్శిటి ఆఫ్ నార్త్ వర్జీనియా (యూఎన్‌విఏ) లోని భారతీయ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా  అమెరికా  భరోసా ఇచ్చింది. వాషింగ్టన్ శివారు ప్రాంతంలోని నార్త్ వర్జీనియా యూనివర్శిటిని మూసివేసేందుకు  అమెరికన్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 90 శాతం మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ చెందిన వారే అధికంగా ఉన్నారు. యూఎన్‌విఏ విశ్వవిద్యాలయాన్ని వెంటనే మూసివేయడం  లేదని, దీనిపై వివరణ కోరినట్లు తెలిపారు. అందుకు ఒక నెల గడువు విధించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించేందుకు యూనివర్శిటీ నిరాకరించింది. ప్రవేశం ద్వారం వద్ద యూనివర్శిటీ తెరిచే ఉంటుందని నోటిసులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం గురువారం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహించి విశ్వవిద్యాయానికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారు. 

ఆర్థికసంక్షోభం అంచున అమెరికా...!

వాషింగ్టన్,జులై 30: అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా అప్పుల ఊబిలో విలవిల్లాడుతోంది. అప్పులు చేయడంలో గరిష్ట పరిమితిని ఈ ఏడాది మే 16నే చేరుకున్న అమెరికా ఆర్థిక శాఖ... ఖజానాలో డబ్బులేక, పరిమితిని మించి మరిన్ని అప్పులు చేసేందుకు ఉన్న చట్టాన్ని మార్చుకోలేక నానా అగచాట్లూ పడుతోంది. సబ్‌ప్రైమ్ సంక్షోభాన్ని ఎలాగోలా దాటినా ఇప్పుడు కొత్త సంక్షోభం దానిని ఊపిరిసలుపుకోనీయడం లేదు.  ప్రస్తుతం అమెరికా గరిష్ట రుణ పరిమితి 14.3 లక్షల కోట్ల డాలర్లు. దానిని దాటి మరిన్ని అప్పులు చేయాలంటే అమెరికా చట్ట సభ కాంగ్రెస్ ఆమోద ముద్ర అవసరం. రుణ గరిష్ట పరిమితిని ఈ ఏడాది మేలోనే చేరుకున్నా ప్రస్తుతం ఖజానాలో ఉన్న డబ్బు ఆగస్టు 2వరకూ వివిధ ఖర్చులకు సరిపోతుందని అంచనా. అందుకే ఆగస్టు 2 తర్వాత సంక్షోభం ముంచుకొస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వివిధ పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోవడం లేదు. 40 శాతం ఖర్చులకు అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. రుణ గరిష్ట పరిమితిని పెంచుకోకపోతే 40 శాతం ఖర్చులకు డబ్బు లేనట్లే. అందులోనూ సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్య పరిరక్షణ, సైనికుల జీతాలు, రుణాలపై వడ్డీ వంటివి అస్సలు తప్పించుకోలేనివి. అవికాకుండా ఇక ఇతర ఖర్చులు తగ్గించినా లోటు పూడ్చే అవకాశం లేదని విశ్లేషకులంటున్నారు. ఆగస్టు 2 కల్లా రుణ గరిష్ట పరిమితి చట్టాన్ని సవరించితేనే క్యాపిటల్ మార్కెట్‌ల నుంచి అమెరికా మరిన్ని అప్పులు తీసుకోగలుగుతుంది. రిపబ్లికన్లు వ్యతిరేకిస్తుండడంతో ఈసారి చట్ట సవరణపై అనుమానాలు నెలకొన్నాయి. అమెరికా రుణ గరిష్ట పరిమితిని చేరుకోవడం ఇది కొత్త కాదు. ఈ చట్టాన్ని 1961 నుంచి ఇప్పటికి 74 సార్లు మార్చారు. రీగన్ అధ్యక్షుడిగా ఉండగా 18సార్లు, క్లింటన్ 8సార్లు, జూనియర్ బుష్ 7సార్లు మార్చారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా కూడా దీన్ని మూడేళ్లుగా పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఇక పెంపు ప్రమాదకరమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తుండటమే ప్రస్తుత భయాలకు కారణం. 

Thursday, July 28, 2011

ఆగస్టు 16 నుంచి అన్నాహజారే నిరాహారదీక్ష

న్యూఢిల్లీ,జులై 28: అవినీతి పై మరోసారి పోరాటానికి సామాజిక కార్యకర్త అన్నా హజారే సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను నిరసిస్తూ ఆయన ఆందోళన చేపట్టనున్నారు. ఆగస్టు 16 నుంచి  నిరాహారదీక్షకు దిగుతామని హజారే తెలిపారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన లోక్‌పాల్ బిల్లు ముసాయిదా ప్రజలు కోరుకున్నవిధంగా లేదని పౌరసమాజం ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ముసాయిదా జాతి ప్రజలను అవమానించేదిగా ఉందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. అరవింద్ క్రేజీవాల్, కిరణ్‌బేడీలతో కలిసి  ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని, మంత్రులను పక్కనపెట్టిన లోక్‌పాల్ బిల్లు కోరలు లేని పాము వంటిదని అన్నారు. కేబినెట్ ఆమోదించిన లోక్‌పాల్ ముసాయిదాతో 2జీ, ఆదర్శ్ కుంభకోణాలను విచారించడం సాధ్యం కాదని అరవింద్ క్రేజీవాల్ అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగే సభ్యులను ప్రశ్నించడం అసాధ్యమని అన్నారు.

లోక్‌పాల్ బిల్లు ముసాయిదా ఆమోదం

న్యూఢిల్లీ,జులై 28:  లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా లోక్‌పాల్ పరిధి నుంచి  ప్రధానమంత్రి,న్యాయవ్యవస్థకు మినహాయింపు ఇవ్వటం జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారు.
లోక్‌పాల్ ఇలా...
పదవీ కాలం: ఐదేళ్లు,
కూర్పు: చైర్‌పర్సన్, 8 మంది సభ్యులు
సభ్యులు: నలుగురు ప్రస్తుత, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. మిగతా సభ్యులుగా అవినీతి, విజిలెన్సు కేసులపై దర్యాప్తు చేసిన 25 ఏళ్ల పాలనానుభవం, మచ్చలేని వ్యక్తిత్వం, రికార్డున్న వారు.
ఎంపిక చేసేది: ప్రధాని నేతృత్వంలోని 9 మంది సభ్యుల ప్యానల్. అందులో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభలో విపక్ష నేతలు, ఒక మంత్రి, ప్రఖ్యాత న్యాయ కోవిదులుంటారు.
చైర్‌పర్సన్‌ : భారత ప్రధాన న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ సీజేఐ
చైర్‌పర్సన్ తొలగింపు: సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు రాష్ట్రపతి
విచారణాధికారం: విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టుకు సిఫార్సు మాత్రమే చేస్తుంది.
 దర్యాప్తు : మాజీ ప్రధానులు, మంత్రులు, ఎంపీలు, గ్రూప్ ఏ, అంతకంటే ఉన్నత స్థాయి అధికారులు (పార్లమెంటు ద్వారా ఏర్పాటైన బోర్డులు, అథారిటీలు, కార్పొరేషన్లు, ట్రస్టులు, సొసైటీలు, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల అధికారులతో సహా). మాజీ ప్రధానిపై గరిష్టంగా ఏడేళ్ల లోపు మాత్రమే ఫిర్యాదు చేయవచ్చు. ఇతరులకూ ఇదే వర్తిస్తుంది. విచారణకు సిఫార్సు చేసిన కేసుల్లో దర్యాప్తుకు సీఆర్‌పీసీ సెక్షన్ 197, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19ల కింద అనుమతులు తీసుకోవాల్సిన అవసరం సంస్థకుండదు.
అధికారాలు: ఆరోపణలపై దర్యాప్తు, ప్రభుత్వాధికారులు అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తుల జప్తు. ఇందుకోసం సొంత విచారణ, దర్యాప్తు విభాగంతో పాటు అవసరమైన అధికారులు, సిబ్బంది ఉంటారు.
నిధులు:  భారత సంచిత నిధి నుంచి (సుప్రీంకోర్టు మాదిరిగా) విడుదల చేస్తారు.
లోక్‌పాల్ పరిధిలోకి రానివి: ప్రధాని, న్యాయ వ్యవస్థ, పార్లమెంటులో ఎంపీల ప్రవర్తన.

తప్పుకున్న యడ్యూరప్ప

బెంగళూరు,జులై 28: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్ యడ్యూర ప్ప తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పంపించారు. పార్టీ నిర్ణయం మేరకే రాజీనామా చేసినట్టు యడ్యూరప్ప ప్రకటించారు. తన నివాసంలో మద్దతుదారులతో చర్చలు జరిపిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆషాడమాసం వెళ్లిపోయిన తర్వాత ఈ నెల 30న రాజీనామా లేఖను గరవ్నర్‌కు పంపాలని యడ్యూరప్ప నిర్ణయించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో యడ్యూరప్పను లోకాయుక్త తప్పుబట్టడంతో సీఎం సీటు నుంచి దిగిపోయాలని బీజేపీ అధినాయకత్వం ఆయన ను ఆదేశించింది. దక్షిణాదిన బీజేపీకి ఆశలు రేకిత్తించిన యడూర్యప్ప ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాటినుంచి వివాదాలు, పదవీ గండాలు ఎదుర్కొన్నారు. అసమ్మతిని చవిచూశారు. ఆఖరికి అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఇరుక్కుని పదవి కోల్పోయారు.

Wednesday, July 27, 2011

పార్టీలదే భారం : చిదంబరం

న్యూఢిల్లీ,జులై 27:  తెలంగాణ అంశంపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మరోసారి నోరు విప్పారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సమస్య పరిష్కారం సాధ్యమంటూ  పాడిన పాటనే మరోసారి పాడారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీలో ఏకాభిప్రాయ సాధన కోసం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో చర్చలు జరుపుతున్నారని, ఇదే విధమైన అంతర్గత చర్చలు తెలుగుదేశం పార్టీలో కూడా జరగాలని ఆయన అన్నారు. పార్టీలు అంతర్గత చర్చలు ద్వారా వారి వారి పార్టీలలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలపై, ప్రజలపై బలవంతంగా రుద్దలేమంటూ ఆయన చేతులెత్తేశారు. సమస్య పరిష్కారం ఎవరికి వారు అసాధ్యమంటే లాభం లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం నిలువునా చీలిపోయాయని ఆయన అన్నారు. బిజెపి మాత్రమే తెలంగాణపై ఒకే మాటపై ఉందని ఆయన చెప్పారు.  తెలంగాణ ప్రక్రియ మొదలు పెడతామంటూ 2009 డిసెంబర్ 9న తాను చేసిన ప్రకటనపై వెనక్కు వెళ్లానన్న విమర్శలను చిదంబరం ఖండించారు. ‘‘ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని హోం మంత్రిగా నేను ప్రకటించానంతే. కానీ దానివల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలు చెలరేగడంతో విషయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి తన వైఖరిని మార్చుకుంది. ఆ మేరకు డిసెంబర్ 23న నేను రెండో ప్రకటన చేశాను. నేను ప్రభుత్వం తరఫున మాత్రమే మాట్లాడాను. హోం మంత్రి ఏకపక్షంగా అలాంటి నిర్ణయాలు ప్రకటించి, వెనక్కు తీసుకోగలరని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వమే’’ అన్నారు.

Monday, July 25, 2011

తూతూ మంత్రం గా ఆజాద్‌ చర్చలు

న్యూఢిల్లీ, జులై 25: కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాం నబీ ఆజాద్‌తో పార్టీ తెలంగాణ ప్రతినిధులు సోమవారం రాత్రి జరిపిన చర్చలు  తూతూ మంత్రం గా ముగిశాయి.   తెలంగాణకు అనుకూలంగా కేంద్రం, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను, దాని పరిణామక్రమాన్ని తెలంగాణ నాయకులు ఆజాద్‌కు వివరించారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంపై వారు ఆజాద్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంటన్నర పాటు వారు ఆజాద్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణపై తగిన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తమకు ఉందని సమావేశానంతరం మంత్రి కె. జానారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ అధిష్టానమే తమను చర్చలకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి మరోసారి ఆజాద్‌తో సమావేశమవుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్రత్యామ్నాయం లేదని తాము ఆజాద్‌తో చెప్పినట్లు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై రాజీ లేదని ఆయన అన్నారు.

మరోసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా

హైదరాబాద్, జులై 25: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు మరోసారి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం పదకొండు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్యాక్సు ద్వారా తమ రాజీనామాలను  స్పీకరు కార్యాలయానికి పంపించారు. రాజీనామాలకు ముందు వారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ ఆయ్యారు. ఆ తర్వాత అందరూ రాజీనామాలు చేశారు. 

ప్రధానిని, చిదంబరాన్ని కేసులోకి లాగిన రాజా

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులోకి టెలికం మాజీ మంత్రి ఎ. రాజా ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, ప్రస్తుత హోం మంత్రి పి. చిదంబరాన్ని లాగారు. ఆయన సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఒపి సైనీ ముందు తన వాదన వినిపించారు. స్వాన్, యూనిటెక్ ఈక్విటీ అమ్మకం విషయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు తెలుసునని ఆయన చెప్పారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2జి స్పెక్ట్రమ్ వేలం జరిగిందని ఆయన చెప్పారు. ఈక్విటీ అమ్మకం తప్పు కాదని చిదంబరం ప్రధాని ఎదుటే చెప్పారని, అది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పనికి వస్తుందని చిదంబరం అన్నారని ఆయన అన్నారు. తాను చెప్పే విషయాలు నిజం కాదని ప్రధాని చెప్పగలరా అని ఆయన అడిగారు. 2003లో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్నే తాను అమలు చేశానని ఆయన చెప్పారు.  ఎన్‌డిఎ ప్రభుత్వం, తమ ప్రభుత్వం రూపొందిచిన విధానాన్నే తాను అమలు చేశానని ఆయన చెప్పారు. ప్రభుత్వ విధానం తప్పయితే తనకు ముందు ఆ విధానాన్ని అమలు చేసినవారు కూడా జైలుకు రావాల్సిందేనని ఆయన అన్నారు.  

ఇంగ్లండ్ దే గెలుపు

లండన్,జులై 25:   భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరిగిన తొలి టెస్టు లో ఇంగ్లండ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని రుజువు చేసుకుంది. 458 పరుగుల విజయలక్ష్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 261 పరుగులకే చేతులెత్తేసింది.   లక్ష్మణ్ (56), సురేష్ రైనా (78) పరుగులు మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్‌ను బెంబేలెత్తించింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో  సచిన్ సెంచరీ కోసం చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 10 ఓవర్లుకు పైగా క్రీజ్‌లో ఉన్న సచిన్ 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించగా, బ్రాడ్ మూడు, ట్రెమ్లెట్‌ ఒక వికెట్టు  తీసుకున్నారు.  

Sunday, July 24, 2011

నిరాశ మిగిల్చిన సచిన్...టెస్టు పరుగులలో సెకండ్ ప్లేస్ కు ద్రవిడ్

లండన్ , జులై 24: ఇంగ్లాండులోని లార్డ్స్ మైదానంలో తన వందో సెంచరీని  ఘనంగా చేస్తాడని ఆశపడిన అభిమానులకు సచిన్ టెండూల్కర్ నిరాశనే మిగిల్చాడు.  34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్ట్ బ్రాడ్ బౌలింగులో అవుటయ్యాడు. సచిన్ టెండూల్కర్ 58 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 1990లో తొలిసారి లార్డ్స్ మైదానంలో ఆడాడు. రెండో ఇన్నింగ్సు ఉంటే సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశం భారత్‌కు వస్తుందా అనేది అనుమానమే. ఫాలో ఆన్ ఆడితే చెప్పలేం. కాగ నిన్న మూడవ  రోజు ఆటలో   భారత్ తొలి  ఇన్నింగ్స్ లో  286 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ద్రవిడ్ 103 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 5 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ పై 188 పరుగుల  తొలి  ఇన్నింగ్స్ ఆధిక్యం లో ఉంది.
ద్రవిడ్ కోరిక తీరింది
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో ద్రవిడ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. లార్డ్స్ టెస్టులో అజేయ సెంచరీ చేసిన ద్రవిడ్ ప్రస్తుతం 12,417 పరుగులతో సచిన్ (14,726) తర్వాతి స్థానంలో నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ 15 సంవత్సరాల క్రితం అరంగేట్రం చేసిన మైదానం లార్డ్స్. గంగూలీ, ద్రవిడ్ ఒకేసారి 1996 జూన్ 20న ప్రారంభమైన మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లోకి వచ్చారు. నాడు గంగూలీ సెంచరీ చేస్తే... ద్రవిడ్ మాత్రం 95 పరుగుల దగ్గర అవుటై నిరాశపడ్డాడు. చివరికి  లార్డ్స్ లో సెంచరీ చేయాలనే కోరిక ఇప్పుడు తీరింది.

తెలంగాణా రాజీనామాలు బుట్టదాఖలు...

హైదరాబాద్, జులై 24:  తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐకి చెందిన వంద మంది శాసనసభ్యులు తమ పదవులకు సమర్పించిన రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. భావోద్వేగం తో సమర్పించిన రాజీనామాలు అయినందున వాటన్నింటినీ తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఆయన శనివారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లటానికి ముందు ఈ నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలందరూ తమ రాజీనామాలను ఉద్వేగపూరిత వాతావరణంలో చేసినట్లుగా నిర్ధారణకు వచ్చినందున వీటిని ఆమోదించలేదని పేర్కొన్నారు.  ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చెందిన పలువురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేస్తూ డిప్యూటీ స్పీకర్‌కు లేఖలు సమర్పించారు. భారత రాజ్యాంగంలోని 190 (3)వ ఆర్టికల్ ప్రకారం ఏ సభ్యుడైనా రాజీనామాను సమర్పించినపుడు దానిని స్పీకర్ ఆమోదిస్తే, సదరు సభ్యుడు ప్రాతినిధ్యం వహించే స్థానం ఖాళీ అవుతుంది. అయితే అదే ఆర్టికల్‌లో సదరు సభ్యుడు రాజీనామా స్వచ్ఛందంగా చేయలేదనీ, అది సరైనది కాదనీ, స్పీకర్ తాను సంతృప్తికరమైనదనుకునే ఏ విచారణ ద్వారానైనా తెలుసుకున్నపుడు.. అలాంటి రాజీనామాను తిరస్కరించవచ్చు. శాసనసభ నియమావళిలోని 186వ నిబంధన ప్రకారం కూడా రాజీనామాలపై స్పీకర్ తాను సరైనదనుకునే ఏ రకమైన విచారణనైనా చేయించవచ్చు. అది శాసనసభ కార్యదర్శి కార్యాలయం ద్వారా కావచ్చు, లేదా ఇంకేదైనా ఏజెన్సీ ద్వారా కావచ్చు. గౌరవనీయులైన స్పీకర్ ఇటీవల సభ్యులు సమర్పించిన రాజీనామాలన్నింటినీ అన్ని కోణాల్లో నుంచి కూలంకషంగా పరిశీలించారు. ఇలా మూకుమ్మడిగా రాజీనామాలు చేయటానికి దారితీసిన పరిస్థితులపై విచారించిన తరువాత.. ఎమ్మెల్యేలు ఉద్వేగపూరిత వాతావరణంలో చేసిన రాజీనామలేనన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే వాటిని తిరస్కరించారు’ అని అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన  ప్రకటనలో వివరించారు. ఇలా మూకుమ్మడిగా ఎమ్మెల్యేల రాజీనామాలు తిరస్కరించటం రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది రెండోసారి. 2009 డిసెంబర్ నెలలో ఒకసారి ఇలాగే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు 220 మందికి పైగా మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వాటన్నింటినీ తిరస్కరించారు.

Saturday, July 23, 2011

నార్వేలో ఉగ్రవాదుల దాడి: 87మంది మృతి

ఓస్లో,జులై 23:  నార్వే రాజధాని ఓస్లోలోని ప్రధానమంత్రి కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు ఓ దీవిలో ఆగంతకుడు జరిపిన కాల్పుల ఘటనల్లో 87మంది దుర్మరణం పాలయ్యారు. బాంబు దాడిలో ఏడుగురు మృతి చెందగా, ఓటోయ ద్వీపంలో జరుగుతున్న యువజన సమ్మేళనంపై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో  సుమారు 80మంది మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు.  ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

శ్రీశైలం ప్రాజెక్టకు భారీగా వరద నీరు

శ్రీశైలం ,జులై 23:   ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  నీటిమట్టం 809 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 2.68 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 9,070 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా జూరాలకు వరద నీరు వచ్చి చేరటంతో అధికారులు  ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేశారు. 2,62,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల గరిష్ట నీటిమట్టం 318.56 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.2 మీటర్లగా ఉంది. నీటి విడుదల కారణంగా దిగువ ప్రంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా కాన్సులేట్‌కు12 ఎకరాలు

హైదరాబాద్,జులై 23:  హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గచ్చిబౌలిలో 12 ఎకరాలను లీజుకిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుతో అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ స్థల కేటాయింపు జరిగింది. తాజాగా శుక్రవారం ఈ స్థలాన్ని లీజుకిచ్చేందుకు సచివాలయంలో ఒప్పందం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్ సమక్షంలో అమెరికా కాన్సులర్ జనరల్ కేథరిన్ ధనాని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) డెరైక్టర్ బి.ఆర్. మీనా, సాధారణ పరిపానల శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి ఆర్.ఎం. గోనెల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో అమెరికా కాన్సులేట్ కార్యాలయం కొనసాగుతోంది. గచ్చిబౌలిలో నిర్మించనున్న కార్యాలయం దేశంలోనే అతిపెద్దదిగా అవతరించనుంది. 

డ్రగ్స్ కేసులో హీరో వరుణ్ సందేశ్...!

హైదరాబాద్,జులై 23:  హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్ డ్రగ్స్ కేసులో ఇరుకున్నారు. ఆయనతో పాటు మరో యువహీరో అభిషేక్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు శుక్రవారం నాడు  లంగర్‌హౌస్‌లో  జూనియర్ ఆర్టిస్టు నాగసిద్ధార్థతో పాటు నైజీరియన్ ఫ్రెడరిక్‌ను  కొకైన్‌తో   పట్టుకున్నారు. వారిద్దరినీ పోలీసులు విచారించారు. నాగసిద్ధార్థ బెంగుళూర్‌లోని నారాయణ హృదయాలయలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రెడరిక్ క్రిమినాలజీలో డాక్టరేట్ చేశాడు. వారి నుంచి 50 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటరాగేషన్లో నాగసిద్ధార్థ తాను వరుణ్ సందేశ్‌, అభిషేక్‌, నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్రెడరిక్, నాగసిద్ధార్థ హైదరాబాదు నగరానికి 250 గ్రాముల కొకైన్ తెచ్చినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ కాల్ లెటర్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, సిద్ధార్థ తనకు తెలుసునని అయితే   అంత సాన్నిహిత్యం లేదని మీడియాకు చెప్పిన వరుణ్ సందేశ్ అవసరమైతే వైద్య పరీక్షలకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.  ఫ్రెడరిక్ వద్ద మీ ఫోన్ నెంబర్ ఎలా ఉందని అడిగితే  తన ఫోన్ నెంబర్ చాలా మంది వద్ద ఉందని   తాను చేసేది ఏమీలేదని వరుణ్ సమాధానమిచ్చారు.  

తేల్చాల్సింది సోనియానే...

కుండ బద్దలు కొట్టిన అజాద్...  
న్యూఢిల్లీ,జులై 23: తెలంగాణ అంశంపై అందరితో చర్చల తర్వాతే నిర్ణయమన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ మరో అడుగు ముందుకేసి.. తాను ఈ విషయంలో నిమిత్తమాత్రుడినేనని స్పష్టంచేశారు. ‘‘నా చేతిలో ఏమీ లేదు. నేను నిమిత్తమాత్రుడిని. నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు. మీతో, వారితో (సీమాంధ్ర నేతలతో) చర్చలు జరిపి అన్నీ అధినేత్రికి నివేదిస్తాను. ఆ నివేదికపై పార్టీ అగ్రనేతలతో చర్చించి ఆమె నిర్ణయిస్తారు’’ అని అజ్జద్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తేల్చిచెప్పినట్లు తెలిసింది. అంతేకాదు, ‘‘మీరు నేను చేసిన సూచన పాటించకుండా పెద్ద సంఖ్యలో వస్తే చర్చలు జరపడం కష్టం. మరోసారి చెబుతున్నా. అయిదు నుంచి పదిమందితో చిన్న బృందంగా వస్తే అన్ని విషయాలూ సమగ్రంగా చర్చించడం కుదురుతుంది. అప్పటిదాకా చర్చల ప్రక్రియతో ముందుకెళ్లడం వీలు కాదు.  చిన్న బృందంగా రండి’’ అని ఆయన చెప్పినట్లు సమాచారం. సోమవారం రాత్రి 7 గంటలకు భేటీ అవుదామని వారికి సమయం కూడా ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా రెండోరోజు శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలోవచ్చి తనతో సమావేశమైనపుడు చివర్లో ఆజాద్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఆయన ప్రతిపాదనకు అంగీకరించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సాధ్యమైనంత వరకు శనివారం.. లేదంటే ఆదివారం ప్రతినిధి బృందాన్ని ప్రకటిస్తామని అంటున్నారు. 

Thursday, July 21, 2011

తెలంగాణకు విస్తృతాధికారాలతో ‘ప్రాదేశిక అథారిటీ’ ?

న్యూఢిల్లీ,జులై 21:   క్లిష్టమైన తెలంగాణ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా.. ఆ ప్రాంతానికి విస్తృతాధికారాలు గల ‘ప్రాదేశిక అథారిటీ’ (టెరిటోరియల్ అథారిటీ)ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం లేనందున.. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తూనే.. తాత్కాలిక పరిష్కారంగా మరింత ఆకర్షణీయమైన, మరింత హేతుబద్ధమైన ఏర్పాటుపై కసరత్తు చేసే బాధ్యతను కేంద్ర హోంశాఖకు అప్పగించినట్లు తెలిసింది. ఆమేరకు తెలంగాణ ప్రాంతానికి ‘ప్రాదేశిక అథారిటీ’ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ అధికారులు రూపొందిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల బోగట్టా.  ఈ ప్రాదేశిక అథారిటీ అధికారాల విషయంలో.. జమ్మూకాశ్మీర్‌కు గల ‘స్వయంప్రతిపత్తి’   కి కొంచెం తక్కువగాను, ఇటీవల గూర్ఖాలాండ్‌కు ప్రకటించిన ‘స్వయంపాలన’ కు కొంచెం ఎక్కువగాను ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం కాగలదని  అని ఆ వర్గాలు అంటున్నాయి.

Wednesday, July 20, 2011

ఢిల్లీ పర్యటన పట్ల సీమాంధ్ర నేతల సంతృప్తి

న్యూఢిల్లీ,జులై 20:  సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు  న్యూఢిల్లీ పర్యటన పట్ల  హ్యాపీగా కనిపిస్తున్నారు.  ఢిల్లీ  నుండి హైదరాబాదుకు బయలుదేరే సమయంలో పలువురు సీమాంధ్ర నేతలు అధిష్టానం వైఖరి పట్ల సంతృప్తి వైఖరి చేశారు. మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో అధిష్టానంపై తమకున్న  అపోహలు తొలగిపోయాయని చెప్పారు. సమైక్యాంధ్ర, తెలంగాణ విషయంలో అధిష్టానం ఇరు ప్రాంతాలకు అనుకూలమైన ప్రకటన త్వరలో చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 17న సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఎకె ఆంటోని తదితరులతో సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు. తెలంగాణ విషయంలో వారికి సంతృప్తికరమైన సమాధానాలు అధిష్టానం నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు ఆల్ హ్యాపీస్ అన్న తరహాలో వెనుదిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆజాద్ తదితరుల  వ్యాఖ్యలు గమనించినా సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని అయితే రాష్ట్రం విడిపోవడం మాత్రం అసంభవమని పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు  అన్నారు. అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు సహజమే అన్నారు.  చర్చలతో ముఠాకక్షదారులే కలిసి పోతుంటే ప్రాంతీయ విభేదాలు ఉన్న తాము కలవలేమా అని అన్నారు. ఒకరి విజయం మరొకరి వైఫల్యం కాదన్నారు. అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు సహజం అన్నారు. పరిష్కారం ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Monday, July 18, 2011

నోళ్ళు పారేసుకోవద్దని అజాద్ సలహా...!

న్యూఢిల్లీ,జులై 18:  పరస్పర దూషణలు మానుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో గులాం నబీ ఆజాద్ చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆజాద్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం ఈ సాయంత్రం  జరిగింది.  సంప్రదింపులు, విధివిధానాలపైనే చర్చ జరిగిందని తెలిసింది. ఆజాద్‌తో భేటిలో సీమాంధ్రకు చెందిన 12 మంది ఎంపీలు, 27 మంది ఎమ్యెల్యేలు, 15 మంది మంత్రులు, 10 మంది ఎమ్యెల్సీలు పాల్గొన్నారు. ఆజాద్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటి సుమారు గంటన్నర సేపు జరిగింది.

తెలంగాణపై ఒత్తిళ్ళు పనిచేయవు: ఏఐసిసి

న్యూఢిల్లీ,జులై 18: తెలంగాణ అంశం భావోద్వేగాలకు సంబంధించినదని  ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారి అన్నారు.  అందరూ సహనం వహించాలని ఆయన సూచించారు. ప్రాంతీయ ఒత్తిళ్ల వల్ల జాతీయ ప్రయోజనాలకు  భంగం వాటిల్లుతుందన్నారు. గుర్ఖాలాండుకు, తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ విషయంలో అందరితో చర్చించి జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ తీవ్రంగా ఉందన్నారు. ఒత్తిళ్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని, గతంలో కూడా తాము ఇదే విషయం చెప్పామని ఆయన అన్నారు.

Saturday, July 16, 2011

విజయవాడలో సమైక్యాంధ్ర భేటీ

 ఆరుగురు మంత్రులు, పది మంది శానససభ్యులు, నలుగురు శానససభ్యులు హాజరు
విజయవాడ,జులై 16: సమైక్యాంధ్ర కోసం విజయవాడలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆరుగురు మంత్రులు, పది మంది శానససభ్యులు, నలుగురు శానససభ్యులు హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అందించే ప్రతిపాదనలపై చర్చించడానికి కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శైలజానాథ్, కాసు వెంకటకృష్ణా రెడ్డి, పార్థసారథి, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి, పితాని హాజరయ్యారు. కాంగ్రెసు శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, రాజేష్, డిఎస్ దాసు, గాదె వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెసు ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, సింగం బసవపున్నయ్య, రాయపాటి శ్రీనివాస్, ఐలా వెంకయ్య సమావేశానికి వచ్చారు. 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ తులసిరెడ్డి కూడా వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఎవరూ ఈ సమావేశానికి రాలేదు. ఉత్తరాంధ్రలో  గత కొద్ది రోజులుగా ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం జరుగుతోంది. పైగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఉత్తరాంధ్రకు చెందినవారే. నెల్లూరు జిల్లా నుంచి సమావేశానికి ఎవరూ రాలేదు. 

Friday, July 15, 2011

జగన్ పై " రగడ 'పాటి...!

విజయవాడ,జులై 15:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాటలతో విరుచుకుపడ్డారు.  హైకోర్టు ఆదేశాలపై జగన్ సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్లు వార్తాకథనాలు రాయిస్తున్నారని, అవి కోర్టు ధిక్కారం కిందికే వస్తాయని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను కుట్రగా వైయస్ జగన్ వర్గం, మీడియా అభివర్ణిస్తోందని, దీనిపై ఎవరైనా కోర్టు ధిక్కారం కింద ఫిర్యాదు చేయవచ్చునని ఆయన అన్నారు. జగన్ అసలు రూపం త్వరలో బయటపడుతుందని ఆయన అన్నారు.

నా చేతుల్లో మీడియా ఉంది, సర్కస్ కంపెనీ వ్యక్తులున్నారని భావించి జగన్ విర్రవీగితే సహించబోమని ఆయన అన్నారు. జగన్ వర్గం అసందర్భ ప్రేలాపనలు, నీలాపనిందలకు పాల్పడుతున్నారని, ఇదేమి న్యాయమూ ధర్మమూ అంటే తనపై విరుచుకుపడుతున్నారని ఆయన అన్నారు. చేతిలో టీవీ, పత్రిక ఉంది కదా అని ఇష్టానుసారంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాను తలుచుకుంటే వంద మీడియా సంస్థలను పెట్టగలనని, రాజకీయాల్లో ఉన్నవారు మీడియా రంగంలోకి వెళ్లకూడదని భావించి తాను స్థాపించలేదని ఆయన అన్నారు. తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని జగన్ వేధించాడని ఆయన ఆరోపించారు. వైయస్సార్‌కు రాముడి వెంట తమ్ముడిలా నడిచిన వివేకా చేత తనకోసం వైయస్ జగన్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయించారని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడి వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామాను వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు. భయంతో 2004 ఎన్నికల్లో జగన్ పోటీ చేయలేదని ఆయన చెప్పారు. వైయస్సార్ పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ ఎక్కడున్నాడని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై గౌరవంతోనే సోనియా జగన్‌కు పార్లమెంటు సీటు ఇచ్చారని ఆయన చెప్పారు. వైయస్సార్‌పై అభిమానంతో జగన్ ముఖ్యమంత్రి కావాలని తామంతా సంతకాలు చేశామని, కాంగ్రెసు గుండెల్లో గునపాలు దించడానికి కాదని ఆయన అన్నారు. బాబాయ్‌కి మంత్రి పదవిని ఇచ్చినప్పుడు కుటుంబాన్ని చీల్చారని అంటుంటే మహానేత కుమారుడు తెలిసీతెలియక మాట్లాడుతున్నాడని అనుకున్నామని, ఇక మీదట సహించబోమని ఆయన అన్నారు.

వైయస్సార్ ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పారని, వైయస్ జగన్ రాజ్యం తెస్తానని అనలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గం ఆగడాలకు తాను బెదరబోనని ఆయన చెప్పారు. తనపై జగన్ వర్గం, సాక్షి మీడియా చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసు ఇస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ పెట్టేవాడైతే, జగన్ కొట్టేవాడని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం, అసెంబ్లీ తీర్మానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

విజయవంతంగా జిశాట్ -12 ప్రయోగం

నెల్లూరు,జులై 15:   భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటనుంచి  శుక్రవారం సాయంత్రం 4.48 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సి 17 రాకెట్‌ను  విజయవంతంగా ప్రయోగించింది. 1410 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్‌-12ను ఇది నింగిలోకి మోసుకెళ్లింది.  జీశాట్‌-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది. రూ. 200 కోట్లతో ఈ ప్రయోగాన్ని షార్‌ చేపట్టింది. జీశాట్ -12 నిర్దిష్ట కక్ష్యలోకి చేరుకున్నట్లు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రజ్ఞుల్లో ఆనందం అంబరాన్ని అంటింది. జిశాట్ -12 ఉపగ్రహం వల్ల సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.  ఈ ఉపగ్రహాన్ని విద్య, టెలిఫోన్, టెలిమెడిసిన్ సర్వీసులకు వినియోగిస్తారు.

Thursday, July 14, 2011

పెరిగిన బస్సు చార్జీలు

హైదరాబాద్,జులై 14:  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసీ)  బస్సు చార్జీలను పెంచింది. మొదటి 20 కిలోమీటర్ల వరకు చార్జీలో లో మార్పులు ఉండవు. ఆ తర్వాత  ఆర్డినరీ బస్సులకు 20 నుండి 40 కిలోమీటర్ల వరకు 1 రూపాయి, 40 నుండి 60 వరకు రూ.2, 60 నుండి 80 వరకు రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సులకు పది కిలోమీటర్ల వరకు మినహాయింపు ఇచ్చి ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 10 పైసల చొప్పున పెంచారు.

రెండు వారాల్లో తెలంగాణ పై ప్రకటన: కెసిఆర్ ధీమా

హైదరాబాద్,జులై 14:   రెండు వారాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు కండువా వేసుకుని గురువారం కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల దీక్షా శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రెండు వారాల్లో తెలంగాణ  పై ప్రకటన వెలువడుతుందని తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందని ఆయన చెప్పారు. ధర్మమే గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాలను, దీక్షను ఆయన కొనియాడారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు. 

' దీక్ష ' లు ముగిశాయి...

హైదరాబాద్,జులై 14:  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు చేపట్టిన 48 గంటల దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని 12 గంటలు ముందుగానే దీక్షలను విరమిస్తున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ మంత్రి సరోజినీ పుల్లారెడ్డి వారి చేత దీక్ష విరమింపజేశారు.
విద్యార్ధులు కూడా...
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులు కూడా దీక్షలు విరమించారు. దీక్షలు విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇప్పటికే విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. దీక్షలు విరమించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా విద్యార్థులను కోరారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, విరసం నేత వరవరరావు, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, వివేక్ వారి చేత దీక్షలు విరమింపజేశారు.

Wednesday, July 13, 2011

మీడియా ముందుకు ఆ ఇద్దరు...ఆ వెనుక జయ...?

చెన్నై,జులై 13:  తమిళనాడు లో కరుణ సర్కార్ కూలిపోయి,జయ అధికారంలోకి రావడంతో  సినీ నటి రంజిత, నిత్యానంద స్వామి లకు గొప్ప రిలీఫ్ వచ్చింది. రాసలీలల కేసులో ఇరుక్కున్న ఈ ఇద్దరు  బుధవారం చెన్నైలో  విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  డిఎంకె , సన్ నెట్ వర్క్ లపై  ధ్వజమెత్తారు. డిఎంకె  తమను ఉద్దేశ పూర్వకంగానే   రాసలీలల కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. తమను అనవసరంగా నిందించినందుకే ఆ పార్టీ ఓటమి పాలయిందన్నారు. ఆ పార్టీకి ముందు ముందు మరిన్ని కష్టాలు తప్పవన్నారు. జర్నలిజం పేరుతో తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూశారని సన్ నెట్ వర్క్, నక్కీరన్‌పై వారు విరుచుకు పడ్డారు. వీడియోలో ఉన్నది తాము కాదని , వీడియోలను నక్కీరన్ మార్ఫింగ్ చేసి తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందని ఆరోపించారు.  తమను అరవై కోట్ల రూపాయలు  డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. మార్పింగ్ వెనుక సన్ నెట్ వర్క్ హస్తం సైతం ఉందని వారు అభిప్రాయపడ్డారు. వీడియోలో ఉన్నది తాను కాదని , ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో తప్పుడు కథనాలు రాశారని నటి రంజిత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు రంజితకు ఆశ చూపి తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారని నిత్యానంద స్వామి ఆరోపించారు.

టి.కాంగ్రెస్ 48 గంటల నిరశన దీక్ష

హైదరాబాద్ .జులై 13:  తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల 48 గంటల నిరశన దీక్ష బుధవారం ఉదయం ఇందిరా పార్క్ వద్ద ప్రారంభం అయ్యింది. ఇప్పటికే రాజీనామాలు చేసినా అధిష్టానం నుంచి ఎలాంటి అనుకూల ప్రకటన రాకపోవటంతో మరింత ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ నేతలు దీక్షలకు దిగారు. 48 గంటల దీక్షలో ముగ్గురు మంత్రులు, ఏడుగురు పార్లమెంటు సభ్యులు, 14 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు.

మూడు వరుస పేలుళ్ళతో ఉలిక్కిపడిన ముంబై

ముంబై,జులై 13: : ముంబై నగరం లో బుధవారం సాయంత్రం  మూడు చోట్ల వరుస పేలుళ్లు సంభవించాయి. నలుగురు మృతి చెందారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 11 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదర్, జవేరీ బజార్, ఒపేరా హౌస్ ప్రాంతాలలో ఈ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లకు సంబంధించి పోలీస్ కంట్రోల్ రూంకు ముందుగానే ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. దాదర్ వద్ద నిలిపి ఉన్నకారులో బాంబు పేలింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముంబైలో గతంలో భారీ పేలుళ్లు సంభవించి ఈ నెల 11వ తేదీ నాటికి అయిదేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రేలుళ్ళలతో  దేశంలోని ప్రధాన నగరాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో  కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు.

Tuesday, July 12, 2011

విద్యార్థులకు కె.సి.ఆర్. హితోపదేశం...!

హైదరాబాద్ ,జులై 12:  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనల్ని మనం ఇప్పటికే చాలా హింసించుకున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు పంపిన సందేశంలో అన్నారు. దీక్షలు విరమించాలని కోరుతూ ఆయన మంగళవారం సాయంత్రం ఓ సందేశం పంపించారు. రెండు రోజులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా దీక్షలు చేస్తున్నారు. రెండు విశ్వవిద్యాలయ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఆయన ఓ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. తన అభ్యర్థనను మన్నించి దీక్షలు విరమించాలని ఆయన విద్యార్థులను కోరారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల భవిష్యత్తు కోసమే జరుగుతోందని ఆయన అన్నారు. దీక్షల ద్వారా ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే మనల్ని మనం చాలా హింసించుకున్నామని, పదునైన వ్యూహాలతో రాజీలేని పోరాటం చేద్దామని ఆయన అన్నారు.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దీక్షలు పరామర్శించడానికి వచ్చిన తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత గద్దర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. బయటివారికి లోనికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.  తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేస్తానని ఆయన చెప్పారు.

జగన్ ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ ,జులై 12:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు  షాక్ ఇచ్చింది.  జగన్ ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది. రెండు వారాలలో తమకు సీల్డ్ కవర్‌లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వ శాఖలన్నీ విధిగా సిబిఐకి సమాచారం అందించాలని, ప్రతివాదులు సహకరించాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని  జగన్ నిర్ణయించుకున్నారు. జగన్ ఆస్తులు అక్రమ ఆర్జనంటూ మంత్రి శంకరరావు రాసిన లేఖను హైకోర్టు తనంత తానుగా విచారణకు స్వీకరించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, కడప జిల్లాకు చెందిన న్యాయవాది షేర్వాణీ ఇంప్లీడ్ అయ్యారు.

సిబిఐ విచారణను వ్యతిరేకించిన జగన్ తరపు న్యాయవాదులు ఈ విచారణ వల్ల సందూర్ పవర్, జగతి పబ్లికేషన్స్, భారత సిమెంట్స్ వంటి కంపెనీలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని, స్టాక్ మార్కెట్‌పై దీని ప్రభావం ఉండవచ్చునని వాదించారు. అయితే ఆ వాదనలను కోర్టు త్రోసిపుచ్చింది. పిటిషన్ వేసిన శంకరరావు మంత్రి కాబట్టి జగన్ కంపెనీలు ఏమైనా ఉల్లంఘించినట్టు భావిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చుగాని, మంత్రి స్థాయి వ్యక్తి ఒక సాధారణ వ్యక్గిగా హై కోర్టుకు లేఖ రాశారని వారు వాదన వినిపించారు. ఆయన పిటిషన్ వేయడంతో రాజకీయ ప్రత్యర్థులు కూడా రాజకీయ దురుద్దేశంతో పిటిషన్‌లు దాఖలు చేశారని వారు వాదించారు. అయితే ఈ వాదనలను కోర్టు త్రోసిపుచ్చుతూ సిబిఐ విచారణ జరిపితే తప్పేమిటని ప్రశ్నించింది.

అజాద్ నోట అదే మాట... ఏకాభిప్రాయం తప్పదు

న్యూఢిల్లీ,జులై 12:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏకాభిప్రాయం అవసరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి  గులాంనబీ ఆజాద్  మరోసారి స్పష్టం చేశారు.  ఏకాభిప్రాయం లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమన్నారు. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయవలసిన అవసరం ఉందన్నారు. అటు శాసనసభ్యుల మధ్య, ఇటు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు శాసనసభ తీర్మానాల తరువాతే ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పూర్తి గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు సూత్రాల  అమలు సాధ్యం కావన్నారు. ఆ కమిటీ సరైన పరిష్కారం చూపలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య మరింత జటిలమైందన్నారు. రాష్ట్ర విభజనను  సీమాంధ్రులు వ్యతిరేకిస్తున్నారని, వారి మద్దతు లేకుండా తెలంగాణను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ ఏవిధంగా ఉందో, సీమాంధ్రలోనూ ఉద్యమాలు నడుస్తున్నాయని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రివర్గంలో ఎట్టకేలకు మార్పులు, చేర్పులు

న్యూఢిల్లీ,జులై 12: : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కేంద్ర మంత్రివర్గంలో ఎట్టకేలకు మార్పులు, చేర్పులు జరిగాయి. మంగళవారం సాయంత్రం  కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.  కీలకమైన రైల్వే శాఖను మళ్లీ తృణమూల్ దక్కించుకుంది.
పదోన్నతి పొందిన మంత్రులు
జైరాం రమేష్ -గ్రామీణాభివృద్ధి శాఖ
దినేష్ త్రివేది - రైల్వే శాఖ
బేణి ప్రసాద్ వర్మ - ఉక్కుశాఖ
కేబినెట్‌లో కొత్త ముఖాలు
కిషోర్ చంద్రదేవ్ - గిరిజన అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ
జయంతి నటరాజన్ - పర్యావరణ, అటవీ శాఖ
రాజీవ్ శుక్లా - పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
మిలింద్ దేవరా - కమ్యూనికేషన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ
పవన్ సింగ్ ఘటోవర్ - ఈశాన్య రాష్ట్రల అభివృద్ధి శాఖ
సుదీప్ బందోపాధ్యాయ్ - హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
జితేంద్ర సింగ్ - హోం ఎఫైర్స్
చరణ్ దాస్ మహంతో - అగ్రికల్చర్ అండ్ ఫుండ్ ప్రాసెసింగ్
శాఖల మార్పు జరిగిన మంత్రులు
వీరప్ప మొయిలీ - న్యాయ శాఖ నుంచి కార్పొరేట్ వ్యవహారాల శాఖ
ముకుల్ రాయ్ - రైల్వేస్ నుంచి షిప్పింగ్‌
విలాసరావ్ దేశ్‌ముఖ్ - గ్రామీణాభివృద్ధి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ
శాఖల మార్పు జరిగినసహాయ మంత్రులు
పవన్ కుమార్ బన్సాల్ - , జలవనరుల శాఖ
ఆనంద్ శర్మ - టెక్స్‌టైల్స్
సల్మాన్ ఖుర్షీద్ - న్యాయశాఖ, మైనార్టీ శాఖ
పదవులు కోల్పోయిన వారు
సాయి ప్రతాప్
కాంతిలాల్ భూరియా
అరుణ్ యాదవ్
దయానిధి మారన్
ఎంఎస్ గిల్
బీకే హండిక్
మురళీ దేవరా

సాయి ప్రతాప్ అవుట్-కిషోర్ చంద్ర దేవ్ ఇన్

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి పదవికి సాయిప్రతాప్ మంగళవారం రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఆదేశాల ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను పంపినట్లు సమాచారం. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిప్రతాప్‌కు ఉద్వాసన పలికి కిషోర్ చంద్రదేవ్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నాట్టు సమాచారం.  కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో 13మందికి స్థానం కల్పిస్తున్నారు.  సీమాంధ్ర నేత కిషోర్ చంద్రదేవ్ కు పంచాయతీరాజ్, గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ కేటాయించనున్నారు.

రెండో ఎస్సార్సీని అంగీకరించం: కేకే

హైదరాబాద్,జులై 12 : రెండో ఎస్సార్సీని తాము అంగీకరించేది లేదని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకుడు కేశవరావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తే తాము హైదరాబాద్‌పై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన మంగళవారం ఇక్కడ తెలిపారు.
 స్టీరింగ్ కమిటీ ఛైర్మన్లుగా  జానా, కేకే
  23 మంది సభ్యులతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల స్టీరింగ్ కమిటీ మంగళవారం ఏర్పడింది. స్టీరింగ్ కమిటీ ఛైర్మన్లుగా జానారెడ్డి, కేశవరావులు వ్యవహరిస్తారు. కన్వీనర్లుగా పొన్నం ప్రభాకర్, బస్వరాజు సారయ్య, సమన్వయ కర్తలు గా వివేక్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ నియమితులయ్యారు.

Monday, July 11, 2011

మూడవ టెస్టు డ్రా: సిరీస్ భారత్ కైవసం

డొమినికా,జులై 11:   భారత్-వెస్టిండీస్‌  మధ్య ఇక్కడ జరిగిన మూడవ టెస్టు డ్రా ముగిసింది. 180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 94/3 వికెట్లు వద్ద ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో మొదటి టెస్టులో గెలిచిన భారత్ 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. విండీస్ గడ్డపై చాలా కాలం తరువాత రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచి విజయ దుందుభి మోగించాలనకున్న ధోని గ్యాంగ్ కు నిరాశే ఎదుదైంది. భారత్ ఓపెనర్ ముకుంద్ ఆరంభంలోనే డకౌట్‌గా వెనుదిరిగి భారత్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. కాగా విజయ్ (45), రైనా (8) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. డ్రా  సమయానికి ద్రవిడ్(34) , లక్ష్మణ్ (3) పరుగులతో నా టౌట్‌గా క్రీజ్‌లో నిలిచారు.

రగులుతున్న సీమాంధ్ర

హైదరాబాద్,జులై 11:  సమైక్యాంధ్రకు అనుకూలంగా సీమాంధ్రలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాష్టాన్ని సమైక్యంగా  ఉంచుతామని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఆంధ్ర, ఎస్వీ, పద్మావతి, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు వివిధ రూపాల్లో ఆందోళనలకు దిగుతున్నారు. సోమవారంనాటికి  ఆందోళనలు ఉధృతమయ్యాయి. మంత్రులు, రాజకీయ నాయకుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి వచ్చిన నేతలను అడ్డుకుంటున్నారు. తాజాగా, మంత్రి రఘువీరారెడ్డిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. 

దిక్కుమాలిన ప్రభుత్వం...సినిమా టిక్కెట్ల ధరనూ పెంచేసింది.

హైదరాబాద్,జులై 11: అన్ని ధరలూ పెరిగిపోయి జీవనం భారమై పోయిన పరిస్థితుల్లో రిలాక్స్ కోసం సినిమాకు వెడదామనుకునే వారికి ఆ సంతోషం కూడా మిగల్చలేదు దిక్కుమాలిన ప్రభుత్వం.  కొందరు బడా నిర్మాతల లాబీయింగ్ కు తలొగ్గి సినిమా టిక్కెట్ల ధరలను పెంచి పారేసింది.   మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎసి ధియేటర్ల టిక్కెట్ ధరను  50 రూపాయల నుంచి 60 రూపాయలకు పెంచారు. సాధారణ టిక్కెట్ ధరను  25 నుంచి 30 రూపాయలకు పెంచారు. ఇతర ప్రాంతాలలో ఎసి టిక్కెట్ ధరను  30 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచారు. సాధారణ టిక్కెట్ ధరను  20 నుంచి 25 రూపాయలకు పెంచారు.

తెలంగాణపై మూడు ఆప్షన్స్...

న్యూఢిల్లీ,జులై 11:  తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేస్తుందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. తెలంగాణపై అధిష్టానం మూడు రకాల పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నదని,  ఒకటి ఏడాదిలోగా తెలంగాణ ప్రక్రియని పూర్తి చేయడం, రెండు- హైదరాబాద్ మినహాయించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం, మూడు- రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేయడమని   ఆయన విలేకరులకు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్­ రాష్ట్రంలో ఏవిధమైన రాజకీయ అనిశ్చితి లేదని ఆయన చెప్పారు.  కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణపై ఒక ప్రకటన వెలువడుతుందని సింఘ్వీ చెప్పారు.

Sunday, July 10, 2011

రాజీనామాలపై నిపుణుల సలహా: స్పీకర్

న్యూఢిల్లీ,జులై 10:   ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రజాప్రతినిధులు సమర్పించిన  రాజీనామాలపై   తక్షణం ఎలాంటి నిర్ణయం ఉండబోదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిపుణులతో సంప్రదించి సలహా తీసుకోవడంతో పాటు రాజీనామా చేసిన సభ్యులందరితోనూ వేర్వేరుగా సంప్రదింపులు జరిపి తదనుగుణ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాద్ వెళ్ళక  రాజీనామా లేఖలు పరిశీలించిన తర్వాత తప్ప, తానీ విషయంలో ఏమీ మాట్లాడలేనని అన్నారు. అమెరికా నుంచి ఆదివారం ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న నాదెండ్ల- రాజధానిలో జరుగుతున్న  సార్క్ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొన్నారు. ఆయన 13న హైదరాబాద్ చేరుకుంటారు.

ఉపరాష్ట్రపతి రేసులో సుశీల్ కుమార్ షిండే

న్యూఢిల్లీ,జులై 10:  వచ్చే ఏడాది జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు   తాను రేసులో వున్నానని కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధి ఆశీస్సులున్నాయని షిండే అన్నారు. దళిత వర్గానికి చెందిన షిండే... గాంధీ, నెహ్రూ కుటుంబాలకు అత్యంత విధేయుడు. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా షిండే సేవలందించారు.

Saturday, July 9, 2011

తెలంగాణ వచ్చే వరకు వెనక్కు తగ్గం: కేకే

హైదరాబాద్,జులై 9; : తెలంగాణ వచ్చే వరకు రాజీనామాలను వెనక్కు తీసుకోబోమని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ జేఏసీతో కలిసి పనిచేయాలనుకోవడం లేదని, ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతామని ఆయన చెప్పారు. శనివారం  తెలంగాణ కాంగ్రెస్ నేతల  సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు కోర్ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు కేశవరావు వెల్లడించారు. రాజీనామాలతో తమందరి బాధ్యత పెరిగిందన్నారు. ఎల్లుండి మరోసారి సమావేశమయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. తెలంగాణ వాదులైన ప్రజా ప్రతినిధులను విడదీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

తెలంగాణ పై జగన్ కప్పదాటు

కడప,జులై 9: తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చే శక్తి గానీ, ఆపేశక్తి గానీ తమకు లేదని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ-ప్రజాప్రస్థానంలో మాట్లాడుతూ తెలంగాణపై తమ వైఖరి చెప్పమని ఎవరూ అడగకపోయినప్పటికీ బాధ్యత గల రాజకీయ పార్టీగా తమ అభిప్రాయం చెబుతున్నామన్నారు. తెలంగాణపై రాజకీయ నేతల విన్యాసాలను చూస్తే బాధనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్రం రావణకాష్టంగా మారడానికి, వందల మంది చనిపోవడానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటుచేసే పూర్తి హక్కు కేంద్రానికి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రజల జీవితాలతో కేంద్ర చెలగాటమాడుతోందని విమర్శించారు. అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.  
అడిగే శక్తి ఉంది కదా: కోదండరామ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ఇచ్చే శక్తీ తెచ్చే శక్తీ లేకపోవచ్చు గానీ అడిగే శక్తి ఉంది కదా అని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని జగన్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ, తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేసే శక్తి ఉందని, దాన్ని ఉపయోగించాలని తాము అంటున్నామని ఆయన అన్నారు. 

Friday, July 8, 2011

14న కేంద్ర మంత్రివర్గ విస్తరణ...?

న్యుఢిల్లీ,జులై 8: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ నెల 14వ తేదీన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిఎంకెకు చెందిన ఎ రాజా, దయానిధి మారన్ రాజీనామాలతో, రైల్వే మంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వెళ్లడంతో మంత్రివర్గంలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మరికొంత మందికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రధాని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆంద్రప్రదేశ్ నుంచి సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్, తెలంగాణకు చెందిన సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ మంత్రివర్గంలో చోటు కోసం రేసులో ఉన్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన 11 మంది లోకసభ సభ్యుల్లో 9 మంది రాజీనామా చేశారు. సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ మాత్రమే రాజీనామాలకు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్  నుంచి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు రాజీనామా చేసిన నేపథ్యంలో హనుమంత రావుకు అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ అంశంపై తీవ్రమైన వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంత్రి వర్గంలో ఎవరికీ చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తే మాత్రం కావూరికి చోటు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. డిఎంకె నుంచి మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా జరుగుతోంది. దయానిధి మారన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పోటీ తీవ్రమైంది. డిఎంకె యుపిఎ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే, డిఎంకె నుంచి కొత్తగా మంత్రివర్గంలో ఎవరూ చేరకపోవచ్చునని భావిస్తున్నారు. రైల్వే మంత్రి మమతా బెనర్జీ స్థానంలో తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడికే ఆ పదవి దక్కే అవకాశాలున్నాయి. కాంగ్రెసుకు చెందిన కొంత మందికి కూడా మంత్రివర్గంల స్థానం లభించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు రాజీనామా చేసిన నేపథ్యంలో హనుమంత రావుకు అవకాశం దక్కవచ్చునని అంటున్నారు.

స్వర్ణయుగం తెస్తా: జగన్

కడప,జులై 8: వైఎస్‌ఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఇడుపులపాయలో ప్రారంభం అయ్యాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా ప్రజా ప్రస్థానం వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి  సంచలన రీతిలో పార్టీ విధివిధానాలను, నూతన పథకాలను ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు కూడా చూడని పేదరికాన్ని తాను చూశానన్నారు. ఓదార్పు యాత్రలో అనేక మారుమూల ప్రాంతాలు పర్యటించి పేదరికాన్ని దగ్గరగా చూసి, పేదల బతులకులను, వారి బాధలను పరిశీలించానన్నారు. వారి బాధలను తీర్చడానికి మహొన్నతమైన రీతిలో పథకాలను రూపొందించినట్లు తెలిపారు. పథకాల వివరాలు....పథకాలలో కొన్నింటిని ఈ దిగువ ఇస్తున్నాం.1. రాష్ట్రంలో తొలిసారిగా రైతు బడ్జెట్ ప్రవేశం2. రైతులకు వడ్డీలేని రుణాలు. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.3. మహిళలకు వడ్డీలేని రుణాలు. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.4. వైఎస్ఆర్ అమ్మ ఒడి పథకం : ఈ పథకం కింద తన పిల్లలను బడికి పంపించేందుకు ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్­లో 500 రూపాయలు జమ చేస్తారు. ఇద్దరు పిల్లలు ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేస్తారు. పిల్లలు ఇంటర్­లోకి వచ్చేసరికి దానికి 750 రూపాయలకు పెంచుతారు. డిగ్రీలోకి వచ్చిన తరువాత వెయ్యి రూపాయలకు పెంచుతారు.5. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పెంపు.6. ఏడాదికి పది లక్షల ఇళ్ల నిర్మాణం7. ప్రతి రైతు కూలీ కుటుంబానికి ఒక ఎకరా భూమి పంపిణీ8. రైతులకు వ్యవసాయంలో సలహాల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలతో 103 వాహనాలు9. పశువులకు, మేకలకు వైద్యం కోసం వెటర్నరీ డాక్టర్లతో 102 వాహనాలు.10. ప్రతి మండలానికి ఒక 104 వాహనం11. రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచడం.12. రైతులకు మద్దతు ధర కోసం ప్రత్యేక నిధి13. ఆరోగ్యశ్రీ పథకం మెరుగుపరచడం.
 ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వివరాలు :
ఎమ్మెల్యేలు : కొండా సురేఖ, శివప్రసాద్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, ఆదినారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ధర్మాస కృష్ణదాసు, శోభా నాగిరెడ్డి, శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, బాలరాజు, కొర్ల భారతి, ప్రసాదరాజు, గొల్ల బాబురావు, కుంజా సత్యవతి ఎమ్మెల్సీలు : పుల్లా పద్మావతి, కొండా మురళి, మేకా శేషుబాబు, దేవగూడి నారాయణరెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, జూపూడి ప్రభాకర్.ఎంపీలు : మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి.

Thursday, July 7, 2011

ఇక సంప్రదింపుల కమిటీ...!!

హైదరాబాద్,జులై 7:  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ఆ ప్రాంత పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండడంతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.  రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారినీ ఏకాభిప్రాయానికి తెచ్చేలా సంప్రదింపులు జరిపే పేరుతో ఈ కమిటీని ఏర్పాటుచేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు  తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఇద్దరేసి చొప్పున ప్రతినిధులతో కమిటీ  ఏర్పాటు చేయాలని.. రాష్ట్రంలోని పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులందరితో మాట్లాడి వారినందరినీ ఏకాభిప్రాయానికి తీసుకువచ్చేందుకు కమిటీ కృషిచేసేలా చూడాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. బహుశా ఈ సంప్రదింపుల కమిటీ ఏర్పాటు పై  వారాంతంలోగా  లేదంటే నెలాఖరుకు కానీ  ప్రకటించే అవకాశాలు ఎక్కువగా  వున్నాయి.   

సీమాంధ్ర శక్తి చూపిస్తాం: టిజి వెంకటేష్

హైదరాబాద్,జులై 7:  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సీమాంధ్ర శక్తి చూపిస్తామని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ హెచ్చరించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తెలంగాణ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి ఉద్యోగులే కీలకమని ఆయన కర్నూలులో అన్నారు. ఉద్యమాలు చేయాలనుకుంటే తెలంగాణ జెఎసి నేత కోదండరామ్ ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మితిమీరి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి పాలన వస్తే కొంపలేం మునిగిపోవని ఆయన అన్నారు. కాగా, కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. అయితే, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేస్తారని ఆయన అన్నారు. ఈ నెల 12వ తేదీన తమ వాదనలను పార్టీ అధిష్టానానికి వివరిస్తామని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు.

ఇక ఐక్య ఉద్యమాలు: జానారెడ్డి

హైదరాబాద్,జులై 7:  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ జెఎసి నేత కోదండరామ్‌తో భేటీ అనంతరం ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఢిల్లీ పరిణామాలను జానా రెడ్డి తనకు వివరించారని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ ఉధృతికి చేపట్టాల్సిన చర్యలపై జానారెడ్డితో చర్చించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము రాజీనామాలు చేశామని జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ సాధన కోసం ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. రాజీనామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తర్జనభర్జనలు పడుతోందని, చర్చలు సాగుతున్న సమయంలో ఆందోళన కలిగించే చర్యలు చేపట్టకూడదని ఆయన అన్నారు. దశలవారీగా ఆందోళనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం సాధించి తీరుతామని ఆయన అన్నారు. రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, మందా జగన్నాథం, రాజయ్య, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం సాయంత్రం జానా రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు కోసమే తాము రాజీనామాలు చేశామని కేశవ రావు అన్నారు.

Wednesday, July 6, 2011

రాజీనామాలకు చలించని కేంద్రం

' చర్చల '  పాటే పాడిన పెద్దలు  
న్యూఢిల్లీ,జులై 6:  తెలంగాణా పై 12 మంది మంత్రులతోపాటు వంద మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపిలు రాజీనామా చేసినా కేంద్రంలో చలనంలేదు.  మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎంతో ఆశతో ఢిల్లీ వచ్చిన తెలంగాణ మంత్రులకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ ఏమీ లభించలేదు. దాంతో వారిలో కొందరు  తిరుగుప్రయాణం అవుతున్నారు. మరి కొందరు గురువారం  బయలుదేరతారు. తెలంగాణ నేతల డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. మంత్రులతో ఉదయం సమావేశమైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్­ఛార్జి గులాం నబీ అజాద్  ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారు. మరోవైపు కేంద్ర మంత్రి చిదంబరం సంప్రదింపులు కొనసాగుతాయని మాత్రమే చెప్పారు. దాంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.  మరికొంత సమయం ఎదురు చూస్తామని  కొందరు ఎంపిలు చెప్పారు.
సంప్రదింపులతోనే నిర్ణయం:  చిదంబరం
 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి కేంద్రం ఆలోచించటం లేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం స్పష్టం చేశారు. చర్చలు, సంప్రదింపుల ప్రక్రియతోనే తెలంగాణపై సమస్యపై ఒక నిర్ణయానికి వస్తామని ఆయన  విలేకర్ల సమావేశంలో అన్నారు.ఇందులో భాగంగానే తెలంగాణ ప్రాంత నేతలతో ఆరాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్ చర్చలు జరుపుతున్నారన్నారు. రాష్ట్రంలో బంద్‌లు, ఆందోళనలు ఉన్నందున కేంద్ర బలగాలను తరలించినట్లు చిదంబరం తెలిపారు.  ఏపీలో స్వల్ప సంఘటనలు మినహా శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చిదంబరం పేర్కొన్నారు. 

Tuesday, July 5, 2011

వైయస్సార్ కాంగ్రెసు లోకృష్ణ, విజయనిర్మల , నరేష్

హైదరాబాద్:  తెలుగు సూపర్ స్టార్ కృష్ణ దంపతులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ, విజయనిర్మలతో పాటు నటుడు, రాజకీయ నేత నరేష్ కూడా వైయస్ జగన్ పార్టీలోచేరనున్నారు.  వీరు ముగ్గురు మంగళవారం వైయస్ జగన్‌తో గంటకు పైగా చర్చలు జరిపారు. పార్టీలో చేరడానికి త్వరలో ముహూర్తం ఖరారవుతుందని, తాము ముగ్గురం ఒకేసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతామని కృష్ణ సతీమణి, ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మల మీడియా ప్రతినిధులతో చెప్పారు.కొత్త రక్తాన్ని, యువతను ప్రోత్సహించడానికే తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. యువతను ప్రోత్సహించాలనేది పెద్దలుగా తమ బాధ్యత అని ఆమె అన్నారు. మానసికంగా తాము వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నామని ఆమె అన్నారు. తాను, కృష్ణ క్రియాశీలకంగా ఉండబోమని, నరేష్ మాత్రం క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరిస్తారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏమిటో తేలిపోయిందని నరేష్ అన్నారు. గతంలో కృష్ణ పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. నరేష్ బిజెపిలో కొంత కాలం పనిచేశారు.

కన్నీరు మున్నీరైన నయనతార

హైదరాబాద్: శ్రీరామరాజ్యం షూటింగ్­లో ప్రముఖ నటి నయనతార కన్నీళ్ళు పెట్టుకున్నారు.  ఇదే తన చివరి చిత్రం అని ఆమె విలపించారు. పెళ్లైన తరువాత సినిమాలలో నటించనని చెప్పారు. చిత్ర దర్శకుడు బాపుతోపాటు ఇతర పెద్దలకు పాదాభివందనం చేశారు. తన వద్ద ఉన్న వస్తువులు అన్నింటినీ తన సహాయకులకు ఇచ్చివేశారు. తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని వ్యక్తిగత మేకప్ మ్యాన్ కు ­కు ఇచ్చారు. పెళ్లైనప్పటికీ సినిమాలలో నటించవచ్చని హీరో బాలకృష్ణ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే పెళ్లైన తరువాత సినిమాలలో నటించడానికి ప్రభుదేవా ఒప్పుకోరని ఆమె ఏడుస్తూనే చెప్పారు. శ్రీరామరాజ్యంలో నయనతార సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లైన తరువాత సినిమాలలో నటించకూడదన్న ఒప్పందంపైనే నయనతారని ప్రభుదేవా వివాహం చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఇంతకాలంగా సినీపరిశ్రమతో ఉన్న అనుబంధం తెగిపోతుందని ఆమె బాధపడ్డారు. వచ్చే నెలలో నయనతార, ప్రభుదేవాల  వివాహం జరగనుంది.

రాజీనామాల స్కోర్ 109...

హైదరాబాద్,జులై 5:  తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సంఖ్య 109కి చేరుకంది. తాజాగా కెసిఆర్, శంకర రావు,  విజయశాంతి రాజీనామాలు చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుల సంఖ్య 12కు,శాసనసభ్యుల సంఖ్య 99కు చేరుకుంది. టి.ఆర్.ఎస్. బి.జె.పి. సి.పి.ఐ. ఎమ్మెల్యేలు కూడా రాజినామాలు చేSaaru. పార్టీల వారీగా రాజీనామా చేసిన శాసనsabhyula  వివరాలు:  కాంగ్రెస్ - 43,టిడిపి - 37,టిఆర్ఎస్ - 11, సిపిఐ - 4,పిఆర్­పి - 2, బిజెపి -2. 15 మంది ఎమ్మెల్సీలు కూడా  రాజీనామాలు చేశారు. 

ఓయులో నాగం, గన్‌పార్కు వద్ద టిడిపి నేతల అరెస్టు

హైదరాబాద్,జులై 5: తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి బంద్  పిలుపులో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని, అసమ్మతి టిడిపి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులతో దీక్షను విరమింపజేయడానికి హరీశ్వర్ రెడ్డితో కలిసి నాగం జనార్దన్ రెడ్డి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని  అరెస్టు చేశారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు విద్యాలయం నుండి బయటకు రావడానికి ప్రయత్నించగా పోలీసులు గేట్లు వేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు లోపలకు రావద్దంటూ విద్యార్థులు హెచ్చరించారు.
కాగా అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ధర్నా చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్ తరలించారు. తెలుగుదేశం నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.

Monday, July 4, 2011

మళ్ళీ బంద్ ల గోల ...

హైదరాబాద్ ,జులై 4‌:  వీళ్ళు తెలంగాణా తెచ్చి ప్రజలకు ఎంత మేలు చేస్తారో గానీ ఇప్పుడు మాత్రం ప్రజాజీవనానికి ప్రతిబంధకాలు  కల్పిస్తున్నారు. సోమవారం నాదు మీడియా సమావేశంలో చిదంబరం  తెలగాణా పై లైట్  గా మాటాడిన మరు క్షణమే  తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి మంగళ, బుధవారాలలో  48 గంటల తెలంగాణా  బంద్ తో పాటు  ఐదు రోజుల  ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు ఇచ్చేసింది.  తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ రాజీనామాలకు సంఘీభావంగా5,6,తేదీలలో బంద్,   7న విద్యార్థుల ర్యాలీ, 8, 9 తేదీల్లో రైలు రోకో ( ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ వెళ్లే రైళ్లని ఆపాలని ) నిర్వహిస్తారుట. ఇక  10వ తారీఖున తెలంగాణా జిల్లాలలో   వంటావార్పు ఉంటుందట. ఆ తర్వాత వరుసగా ప్రతి రోజు తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టే వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేయాలని జెఏసి నిర్ణయించుకుంది. మాములుగానే తెర వెనక వుండే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు  చంద్రశేఖర రావు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన 48 గంటల బంద్ కు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.   

కొంప అంటించి చుట్ట కాల్చుకోవడం అంటే ఇదే...!

న్యూఢిల్లీ,జులై 4‌: న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపై కేంద్రమంత్రి చిదంబరం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామా తర్వాత సైతం ఆయన చాలా కూల్ గా స్పందించడం గమనార్హం. అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించడం లేదు. సోమవారం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రం అంశంపై ఇంకా నిర్ణయమే తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల రాజీనామాలు తమను ఏమీ ఆశ్చర్యం కలిగించలేదన్నారు. రాజీనామాల వల్ల తలెత్తిన పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు,  పార్లమెంటు సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని అన్నారు. తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతాయని అన్నారు. సంప్రదింపుల తర్వాతే స్పష్టమైన ప్రకటన ఉంటుందన్నారు. ఏకాభిప్రాయం కుదిరే వరకు సంప్రదింపులు కొనసాగుతాయన్నారు. అఖిలపక్షం నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకుంటామని చెప్పారు.ఇంకా రెండు పార్టీలు తమ అభిప్రాయం చెప్పాల్సి ఉందన్నారు.  డిసెంబర్ 9 ప్రకటనను ప్రశ్నించే వారు డిసెంబర్ 23 ప్రకటనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల రాజీనామాలపై తాను స్పందించనన్నారు. అది ఆ పార్టీకి సంబంధించిన అంశమన్నారు.  

ఆరో జోన్‌లో హైదరాబాదు...?

న్యూఢిల్లీ,జులై 4‌: ప్రధాని మన్మోహన్ సింగ్‌తో రాజకీయ వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. తెలంగాణ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశ  వివరాలు తెలియనప్పటికీ  హైదరాబాదును ఆరో జోన్‌లో భాగం చేయడానికి వీలుగా 14ఎఫ్ నిబంధనను తొలగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం.  అయితే,  దీనిపై తిరిగి తీర్మానం చేసి పంపాలని శానససభను కోరుతూ ఓ మెలిక పెట్టడం గమనార్హం.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, వీరప్ప మొయిలీ, శరద్ పవార్, ఫరుఖ్ అబ్దుల్లా, దయానిధి మారన్ పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన 9 మంది లోకసభ సభ్యులు రాజీనామా చేయడం వల్ల యుపిఎ ప్రభుత్వానికి ముప్పేమీ లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు. చిన్న రాష్ట్రాలకు కాంగ్రెసు వ్యతిరేకం కాదని సంప్రదింపులు, చర్చల ద్వారానే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. రాజీనామాలు క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందా, రాదా అనేది క్రమశిక్షణా సంఘం చూసుకుంటుందని ఆయన చెప్పారు. రాజీనామాల వల్ల రాజ్యాంగ సంక్షోభం లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా అన్నారు.

తెలంగాణ రాజీనామాల స్కోర్ 90...

హైదరాబాద్,జులై 4‌: తెలంగాణ సాధన కోసం  రాజీనామాలు చేసిన శాసనసభ్యుల సంఖ్య 89కి చేరుకుంది. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రారంభమైన రాజీనామాల పర్వం క్రమంగా ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులందరూ రాజీనామాలు సమర్పించారు. వారు శానససభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కకు తమ రాజీనామా లేఖలను సమర్పించారు.  తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డితో పాటు ముగ్గురు పార్టీ తిరుగుబాటు శానససభ్యులు ఆదివారంనాడే తమ రాజీనామా లేఖలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మొత్తం 37 మంది రాజీనామాలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు తెలుగుదేశం లోకసభ సభ్యులు రాజీనామాలు చేయడానికి ఢిల్లీ బయలుదేరారు.

          కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన 43 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. ఎల్బీ నగర్ శాసనసభ్యుడు ఫాక్స్ ద్వారా సాయంత్రం రాజీనామా చేశారు. వీరిలో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో పాటు కాంగ్రెసుకు మద్దతిస్తున్న స్వతంత్ర శాసనసభ్యులు కూడా ఉన్నారు. మంత్రులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేశారు, కానీ మంత్రిపదవులకు రాజీనామా చేయలేదు. తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు 15 మంది ఉండగా 12 మంది రాజీనామాలు చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన 12 మంది లోకసభ సభ్యులుండగా 9 మంది రాజీనామా చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులుండగా కేశవ రావు మాత్రమే రాజీనామా చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన 11 మంది శాసనసభ్యులు, బిజెపికి చెందిన ఇద్దరు శానససభ్యులు, సిపిఐకి చెందిన నలుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత వారు రాజీనామాలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కావడంతో సిపిఎంకు చెందిన ఓ శానససభ్యుడు రాజీనామా చేసే అవకాశాలు లేవు. అలాగే, మజ్లీస్‌కు చెందిన ఏడుగురు శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేయకపోవచ్చు. తెలంగాణలో మొత్తం 119 శానససభా స్థానాలుండగా, ఇప్పటికే పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదం పొందింది.

వింబుల్డన్‌లో కొత్త చాంపియన్‌ నొవాక్ జొకోవిచ్

లండన్,జులై 4: టాప్‌సీడ్ రాఫెల్ నాదల్‌ను రఫ్ ఆడించి సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత వింబుల్డన్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-4, 6-1, 1-6, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. సోమవారం విడుదల చేసే ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంక్ హోదాను దక్కించుకోనున్న జొకోవిచ్‌కు ఇది తొలి వింబుల్డన్ టైటిల్. ఓవరాల్ కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతంలో అతను ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రెండుసార్లు (2008, 2011లో) కైవసం చేసుకున్నాడు.  

Sunday, July 3, 2011

రాజీనామాలు తప్పవా...?

న్యూఢిల్లీ,జులై 3: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులకు రాజీనామాలు చేసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. వారు ఆదివారం రాత్రి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. సోమవారం  సమర్పించనున్న రాజీనామాలపై వారు కేంద్ర మంత్రితో  చర్చించినట్టు సమాచారం. ఇటు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతూ, రాజీనామాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు.  తెలంగాణ పాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రేపు ఉదయం 11-12 గంటల మధ్య రాజీనామాలు చేయనున్నారని  ఆయన చెప్పారు.

నాగం వర్గం రాజీనామా

హైదరాబాద్,జులై 3: తెలంగాణ కోసం పోరాడే వారిమథ్య ఐక్యతను కోరుతూ  ఇందిరా పార్కు వద్ద రెండు రోజుల దీక్షను  చేపట్టిన ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి తో పాటు ఆయనకు  మద్దతు తెలిపిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు జనార్ధన రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వేణుగోపాల చారి, హరీశ్వర రెడ్డి, జోగు రామన్నలు రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. ఆ లేఖలను శాసనసభ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్కకు పంపారు.ఇందిరా పార్కు వద్ద ఆచార్య జయశంకర్ ప్రాంగణంలో ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి ఆదివారం  ఉదయం 10 గంటలకు ఐక్యత దీక్షను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ,  మాజీ మంత్రి బోడ జనార్ధన్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, విమలక్క, వసంత రెడ్డి పాల్గొన్నారు. 

Saturday, July 2, 2011

రాజీనామాలు చేసేది ఎందరు...?

 హైదరాబాద్ ,జులై 2:  ఎంత మంది కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తారనేది  అనుమానంగానే ఉంది. అసలు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు రాజీనామా చేస్తారా అనేది కూడా అనుమానమే. సోమవారం 11 గంటలకు ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు, హైదరాబాదులో శానససభ్యులు రాజీనామాలు చేస్తారని గట్టిగానే చెబుతున్నారు. బుజ్జగింపులు పనిచేయవని కూడా వారు కరాఖండిగా చెబుతున్నారు. కానీ, వారు ఆ మాట మీద నిలబడతారని తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం లేదు. కాగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. తెలంగాణపై తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తానని చెప్పినా అంగీకరిస్తానని ఆయన చెప్పారు. అందువల్ల ఆయన నుంచి రాజీనామా రాదని స్పష్టం అవుతోంది. కాగా, ఈ పదవి కోసం పోటీ పడి భంగపడిన మంత్రి జె. గీతారెడ్డి మాత్రం రాజీనామాపై ఆవేశం గానే  ఉన్నారు.  తెలంగాణ సెంటిమెంటు తక్కువగా ఉన్న హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు చాలా మంది రాజీనామాలకు ముందుకు రాకపోవచ్చు. హైదరాబాదు నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ కూడా రాజీనామాలకు సిద్ధంగా లేరని అర్థమవుతోంది. అలాగే, రంగారెడ్డి జిల్లాకు చెందిన హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రాంత నేతల సమావేశాలకు  ఆమె హాజరు కావడం లేదు.  లోకసభ సభ్యుడు సర్వే సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధపడకపోవచ్చు. శుక్రవారం ఏర్పాటైన కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో సగం మంది హాజరయ్యారు. ఈ సగం మంది కచ్చితంగా రాజీనామా చేస్తారని వివేక్, పొన్నం ప్రభాకర్ వంటి పార్లమెంటు సభ్యులు కచ్చితంగానే చెబుతున్నారు. అమెరికా నుంచి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ స్వదేశానికి బయలుదేరారు. ఏమైనా   అందరూ రాజీనామా చేయకపోయినా, సగం మంది రాజీనామా చేసినా కాంగ్రెసు ఇరకాటంలో పడుతుందనేది  వాస్తవం.  

ఇంగ్లండ్ టూర్ కు ­ భారత జట్టు ఎంపిక

చెన్నై,జులై 2: ఇంగ్లండ్ టూర్ కు  భారత క్రికెట్ జట్టుని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సీనియర్లను జట్టులోకి తీసుకున్నారు. ధోనీని కెప్టెన్ గా , గౌతమ్ గంభీర్ ను  వైఎస్ కెప్టెన్ గా  ఎంపిక చేశారు. ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రైనా, ముకుంద్, హర్భజన్, జహీర్ ఖాన్, శ్రీశాంత్, ప్రవీణ్, ఇషాంత్ శర్మ, మునాఫ్, వృద్దిమాన్ సాహ, మిశ్రా, యువరాజ్ సింగ్ లకు స్థానం లభించింది.  17వ క్రీడాకారుడిగా వీరేంద్ర సెహ్వాగ్ ను  తీసుకున్నారు.

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత క్వితోవా

లండన్,జులై 2: వింబుల్డన్ ఉమెన్ సింగిల్స్ టైటిల్స్ను  చెక్ క్రీడాకారిణి క్వితోవా గెలుచుకుంది.   ఫైనల్స్ లో క్వితోవా 6-3, 6-4తో షరపోవాపై గెలుపొందింది. మార్టినా తరువాత వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న చెక్ క్రీడాకారిణి క్వితోవా.  

రాష్ట్రంలో రాష్ట్రపతి

హైదరాబాద్,జులై 2:  : రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, గవర్నర్ నరసింహన్‌ బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రతిభాపాటిల్ వారం రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) విద్యార్థులతో ముఖాముఖి జరుపుతారు.  5న హైదరాబాద్‌లోని భారత డైనమిక్స్ లిమిటెడ్‌ను సందర్శిస్తారు. 6వ తేదీ సాయంత్రం తిరుపతి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన మహిళా సాధికారిత కార్యక్రమంలో పాల్గొంటారు. 7వ తేదీన శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు తిరుమలలో నూతనంగా నిర్మించిన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. సాయంత్రం అక్కడ్నుంచి ముంబాయి వెడతారు.  

Friday, July 1, 2011

కాంగ్రెసోళ్ళు రాజినామాలు చేస్తారట...చూద్దాం...!

హైదరాబాద్,జులై 1 : తెలంగాణాపై అథిష్టానం  నాన్పుడు ధోరణి, ఇటు టి.ఆర్.ఎస్. నుంచి ఒత్తిడి మథ్య రాజినామాలకే సిద్ధపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు తమ రాజీనామాలు నేరుగా స్పీకర్ కు  సమర్పించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు   నిర్ణయం తీసుకున్నారు.  శుక్రవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల  సమావేశం అనంతరం  మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ, డిసెంబరు 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  ఎంపిలు లోక్ సభ క్­సభ స్పీకర్ కు  తమ రాజీనామాలు సమర్పిస్తారని ఎం.పి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ స్పీకర్ కు  రాజీనామాలు సమర్పిస్తారని చెప్పారు.
తొందరపడవద్దు: ఆజాద్
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత తేలికేం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్­ఛార్జి గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణ అంశం ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉందని, నాయకులు ఎవరూ తొందరపడవద్దని  గులాం నబీ ఆజాద్ తెలంగాణ ప్రజాప్రతినిధులకు సలహా ఇచ్చారు. తెలంగాణ విషయంలో రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని,  రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపవలసి ఉందని ఆయన చెప్పారు.  ఇదిలా ఉండగా, ఆజాద్­ హైదరాబాద్ లోనే  ఉన్నా ఆయనతో చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపలేదు.
రాజీనామాలు మార్గం కాదు: ఎఐసిసి
తెలంగాణ సమస్య జటిలమైనదని ఎఐసిసి కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండేజ్ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాజీనామాలు మార్గం కాదని ఆయన హితవు పలికారు. అందరితో చర్చించి అధిష్టానం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు.
టిడిపి ఎమ్మెల్యేలు కూడా సిద్ధం: ఎర్రబెల్లి
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతల రాజీనామా ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. వారికంటే ముందే తాము రాజీనామా చేస్తామని చెప్పారు. ఈ విషయం చర్చించడానికి తమ పార్టీ నేతలు ఈ నెల 4న సమావేశం కానున్నట్లు తెలిపారు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...