Tuesday, September 5, 2023

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

 హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌ తురక చెరువులో మిథున్ మృతదేహం లభ్యం అయింది. మిథున్‌ ఆడుకుంటూ వెళ్లి ఇంటిముందు కాలువలో పడి కొట్టుకు పోయాడు. ప్రగతినగర్‌ చెరువులో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బాలుడి మృతదేహం వెలికి తీశారు. 

వన్ డే వరల్డ్ కప్ కు భారత జట్టు

ముంబై, సెప్టెంబర్ఐ 5: ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ కు  15 మంది సభ్యుల భారత జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనింగ్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ను జట్టు లోకి తీసుకున్నారు.  అయితే తిల‌క్ వ‌ర్మ‌, సంజూ సాంస‌న్‌ల‌ను వ‌దిలేశారు. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయ‌నున్నాడు. టాప్ ఆర్డ‌ర్‌లో శుభ‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజా ఉన్నారు. బౌల‌ర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌, ష‌మీ, అక్ష‌ర్ ప‌టేల్ ఉన్నారు. ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌ల‌కు కూడా చోటు క‌ల్పించారు

ఇండియా పేరు ‘భార‌త్‌’ గా మార్పు?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఇండియా పేరు ను  ‘భార‌త్‌’ గా మార్చేందుకు న‌రేంద్ర మోదీ ప్రభుత్వం పావులు క‌దుపుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జ‌రిగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్రభుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌ను తెస్తుందని భావిస్తున్నారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌గా మార్చే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని, ఇండియా పేరు మార్చుతూ స‌భ‌లో తీర్మానం ఆమోదించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి జి 20 ప్ర‌తినిధుల‌కు డిన్న‌ర్ కోసం పంపిన అధికారిక ఆహ్వాన ప‌త్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసిఉండ‌టం పేరు మార్పు ప్ర‌తిపాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది. 


Friday, August 11, 2023

జయప్రదకు జైలు..

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం ఎగ్మోర్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. నటి జయప్రద నిర్వహిస్తున్న థియేటర్‌లో పనిచేసిన వారి ఇ ఎస్ ‌ఐ డబ్బులు ప్రభుత్వ బీమా కార్పొరేషన్‌కు చెల్లించలేదని కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెపై కోర్టు ఈ చర్యలు తీసుకుంది


Friday, February 17, 2023

పాలమూరు రంగారెడ్డి కి సుప్రీం పాక్షిక అనుమతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకు కోవాలని స్పష్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం సూచించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై మాత్రం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం స్టే విధించింది. 


అదానీ వ్యవహారంలో సీల్డ్​ కవర్​ కమిటీ కి సుప్రీంకోర్టు నో..


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అదానీ-హిండెన్​బర్గ్​ వ్యవహారంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యలను పటిష్ఠం చేసేందుకు ప్రతిపాదిత నిపుణుల కమిటీ పేర్లు సీల్డ్​ కవర్​లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల విషయంలో పూర్తి పారదర్శకతను కొనసాగించాలని కోరుతున్నామని.. సీల్డ్ కవర్‌లో నిపుణుల కమిటీ పేర్లపై కేంద్రం చేసిన సూచనను అంగీకరించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. నిపుణుల కమిటీ సభ్యులపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఈ వ్యవహారంపై తామే ఒక కమిటీ ఏర్పాటు చేస్తామంటూ.. దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది.

ఉద్ధవ్​ ఠాక్రేకు ఎదురుదెబ్బ … ఏక్​నాథ్​ శిందే వర్గానికే శివసేన పేరు, ఎన్నికల గుర్తు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివసేన పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం.. ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2018లో సవరించిన శివసేన పార్టీ రాజ్యాంగాన్ని అప్రజాస్వామికం అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలాంటి ఎన్నికలు లేకుండా సొంత కోటరీలోని వ్యక్తుల్ని పార్టీ పదాధికారులుగా అప్రజాస్వామికంగా నియమించుకునేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నారని స్పష్టం చేసింది. అలాంటి పార్టీ వ్యవస్థల్ని నమ్మలేమని అభిప్రాయపడింది.



Wednesday, February 15, 2023

పట్టాలు తప్పిన గోదావరి: ప్రయాణికులు సేఫ్

హైదరాబాద్, ఫిబ్రవరి 15: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ఉదయం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4 మొత్తం 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అయితే ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.ప్రమాదం కారణంగా ఈ మార్గం లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కుతూహలమ్మ మృతి

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ (73) తిరుపతిలో కన్నుమూశారు. కుతూహలమ్మ చిత్తూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985 సంవత్సరంలో వేపంజేరి (ప్రస్తుతం జీడీ నెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత జీడీనెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


Tuesday, February 14, 2023

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయుల బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధిస్తూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాన్‌ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. టీచర్ల బదిలీల నిబంధనలపై హైకోర్టును నాన్‌ స్పౌజ్ టీచర్లు ఆశ్రయించారు. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదించారు. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరిపిన హైకోర్టు... ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.



Monday, February 13, 2023

అదానీ వ్యవహారం పై నిపుణుల కమిటీ?

​న్యూఢిల్లీ , ఫిబ్రవరి 13:అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం నేపథ్యంలో రెగ్యులేటరీ మెకానిజంను బలోపేతం చేయడం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ కమిటీ కోసం షీల్డ్‌ కవర్‌లో నిపుణుల పేర్లను ఇవ్వాలనుకుంటున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కమిటీ వేయాలని ఇంతకు ముందు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం స్పందించింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని సెబీ చూస్తోందని సుప్రీంకోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.

Sunday, February 12, 2023

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ను నియమించారు ఆంధ్రప్రదేశ్​కు కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​ను నియమించారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్​గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్​, సిక్కిం గవర్నర్​గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్​గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​గా శివ్ ప్రతాప్​లను నియమించారు. లద్దాఖ్ ఎల్​జీగా. అరుణాచల్​ ప్రదేశ్ గవర్నర్​గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను నియమించారు. మణిపుర్ గవర్నర్​గా ఉన్న లా గణేశన్​ను నాగాలాండ్ గవర్నర్​గా బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్​ను మేఘాలయా గవర్నర్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిమాచల్ గవర్నర్​గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్​ను.. బిహార్ గవర్నర్​గా బదిలీ చేశారు. 


బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...