Friday, December 31, 2010

వార్తాప్రపంచం వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

వీడియోలో ఉన్నది నేను కాదు: రంజిత

చెన్నై,డిసెంబర్ 31:     ‘నిత్యానంద స్వామి రాసలీల’ వీడియోలో ఉన్నది తాను కాదని సినీనటి రంజిత స్పష్టం చేశారు. ఆ వీడియోలో తాను ఉన్నట్లు ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు నిత్యానంద స్వామితో సెక్సు స్కాండల్ ఇరుక్కుపోయిన సినీ హీరోయిన్ రంజిత చాలా రోజుల తర్వాత శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది. తనను చంపుతానని ఇన్నాళ్లు కొందరు బెదిరించినందువల్లే ఇన్ని రోజులు బయటకు రాలేక పోయాలని ఆమె తెలిపింది.  నిత్యానంద గొప్ప మహర్షి అని, తాను ఆయన శిష్యురాలిని అని చెప్పారు. 

టీడీపీ కి మాకినేని పెదరత్తయ్య గుడ్‌బై

హైదరాబద్,డిసెంబర్ 31:  గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.   సీనియర్ నేత మాకినేని పెదరత్తయ్య పార్టీకి గుడ్‌బై చెప్పారు. యువనేత జగన్ వెంట తాను ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పెదరత్తయ్య తన అనుచరులతో శుక్రవారం ఉదయం జగన్‌ను కలిసి తన మద్దతు తెలిపారు. విజయవాడలో జరిగిన జగన్  లక్ష్యదీక్షలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.

Thursday, December 30, 2010

ఆంధ్రప్రదేశ్ కు 1,001 టీఎంసీల కృష్ణా జలాలు

న్యూఢిల్లీ,డిసెంబర్ 30:  కృష్ణా జలాల పంపిణీపై ఆరేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్  1,001 టీఎంసీలు వాడుకోవచ్చని కృష్ణా ట్రిబ్యునల్  తీర్పునిచ్చింది. అలాగే మహారాష్ట్ర 666 టీఎంసీలు, కర్ణాటక 911 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ఆదేశించింది.కాగా మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి  ఎదురు దెబ్బ తగిలింది. గతంలో మిగులు జలాలను వాడుకునే హక్కు మన రాష్ట్రానికి మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర పంచుకోవాలని తీర్పు ఇచ్చింది.అలాగే తాగునీటి అవసరాల కోసం చెన్నైకి మూడు రాష్ట్రాలు సమానంగా నీటిని ఇవ్వాలని టిబ్యునల్ పేర్కొంది. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఒక్కో రాష్ట్రం 3.3 టీఎంసీలు, జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో 7 టీఎంసీల చొప్పున నీటిని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఆల్మటి ఎత్తును 524.25 వరకూ పెంచుకోవచ్చని కృష్ణా ట్రిబ్యునల్  అనుమతి ఇచ్చింది. కాగా కృష్ణా టిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని టీడీపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు వంటిదని టీడీపీ నేత కడియం శ్రీహరి అన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. కృష్ణా, డెల్టాకు ఈ తీర్పు తీరని నష్టమని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. ఈ తీర్పుతో కర్ణాటక లాభపడిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ట్రిబ్యునల్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం: బాబు

హైదరాబాద్,డిసెంబర్ 30: రైతులకు న్యాయం జరిగేంతవరకూ రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చ ంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు ఎన్టీయార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతుగర్జన సభ లో లో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుంభకోణంలో కూరుకు పోయిందని ఆయన విమర్శించారు. 2జీ స్కామ్‌లో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, రైతులకోసం రెండు వేల కోట్ల రూపాయలను అడిగితే లేదన్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలున్నా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని బాబు డిమాండ్ చేశారు.

కృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెస్ 'లక్ష్మణరేఖ'

న్యూఢిల్లీ‌,డిసెంబర్ 30: : : శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నోరు విప్పవద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాష్ట్ర  కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులను ఆదేశించారు. ఆయన తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు గురువారం ఉదయం ఫోన్లు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏమీ మాట్లాడవద్దని, ఈ విషయంపై మీడియాకు దూరంగా ఉండాలని, ఇదే అధిష్టానం ఆదేశమని ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులతో చెప్పారు. పార్లమెంటు సభ్యులు ఏం మాట్లాడినా ప్రజలను రెచ్చగొట్టినట్లవుతుందని ఆయన అన్నారు.ఏమైనా చెప్పాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో గానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గానీ చెప్పాలని, బహిరంగంగా అభిప్రాయాలను వెల్లడించకూడదని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్సలు చేసినా, ఆందోళనకారులు విరుచుకుపడినా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. విమర్శలకు తగిన సమయంలో తగు విధంగా సమాధానం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులతో పాటు ఎవరూ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మాట్లాడకూడదని ఆయన హెచ్చరించారు.  

మే 8 తేదిన ఎంసెట్

హైదరాబాద్,డిసెంబర్ 30: :  రాష్ర్టంలో జరిగే ప్రవేశ పరీక్షల తేదిలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మే 8 తేదిన ఎంసెట్, మే 15 ఐసెట్‌ను, జూన్ 4 ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష జరిగిన 15 రోజుల లోపే ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు.  జంబ్లింగ్ లేకుండానే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పౌరహక్కుల నేత కణ్ణబీరన్ కన్నుమూత

హైదరాబాద్,డిసెంబర్ 30: :  సీనియర్ న్యాయవాది, పౌరహక్కుల నేత కణ్ణబీరన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతూ గురువారం సాయంత్రం మారేడ్‌పల్లిలోని ఆయన స్వగృహంలో మరణించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హక్కుల రంగంలో కృషి చేస్తున్నారు. నక్సలైట్ల మీద పెట్టిన కేసుల్ని హైకోర్టులోను, పై కోర్టుల్లోను వాదించారు. బూటకపు ఎన్‌కౌంటర్ల గుట్టురట్టు చేయడంలో ఆయన ముందుండేవారు. అయన భార్య వసంత, కూతురు కల్పన  సాంస్కృతిక రంగంలో సేవలందిస్తున్నారు.
,

నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ: జనవరి 6 న వివరాలు

న్యూఢిల్లీ,డిసెంబర్ 30:  : కేంద్ర హోంమంత్రి చిదంబరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను గురువారం సమర్పించింది. కమిటీ సభ్యుల నుంచి ఆయన నివేదికను అందుకున్నారు. రెండు సంపుటాల రూపంలో ఈ నివేదికను ఇవ్వటం జరిగింది. నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చిదంబరంతో సమావేశం అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ అందించిన రిపోర్టును జనవరి 6 తేదిన సాయంత్రం ఇంటర్నెట్‌లో పెడుతామని కేంద్ర హోంమంత్రి చిదంబరం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల మనోభావాల్ని దెబ్బతినకుండా శ్రీకమిటీ నివేదికను పాఠకులకు, ప్రేక్షకులకు అందించాలని పత్రికలకు, టెలివిజన్ చానెల్లకు చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఊహాజనితమైన కథనాలను, అవాస్తవాలను ప్రసారం చేయవద్దని ఆయన మీడియాను కోరారు. శ్రీకృష్ణ కమిటీ అందించిన నివేదికపై ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గుర్తింపు పొందిన పార్టీలతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభిస్తుందని హోంమంత్రి అన్నారు. సరియైన నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రజాస్వామ్య పద్దతిలో అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతే ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన అన్నారు. కగా, జనవరి 6 తేదిన ఢిల్లీ రావాలంటూ ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపుపొందిన ఎనిమిది రాజకీయ పార్టీలకు హోంమంత్రి చిద ంబరం ఆహ్వానం పంపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు సభ్యులను హాజరుకావాలని ఆహ్వానంలో తెలిపారు. జనవరి 6 తేదిన అన్ని పార్టీల నేతలతో ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్‌లో భేటి జరుగుతుందని తెలిపారు.

Wednesday, December 29, 2010

రెండో టెస్టులో భారత్ గెలుపు

దర్బన్,డిసెంబర్ 29:  రెండో టెస్టులో భారత్ 87 పరుగుల తేడాతో విజయం సాధించిఇంది.   మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్ ఆదివారం  నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది.303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా... నాలుగో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కలిస్ (52 బంతుల్లో 17; 2 ఫోర్లు), డివిలియర్స్ (76 బంతుల్లో 33; 1 సిక్సర్) అవుట్  అయ్యారు.  మొత్తం రెండు ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన హైదరాబాదీ ఆటగాడు  వీవీఎస్ లక్ష్మణ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

'శ్రీకృష్ణ’ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్,డిసెంబర్ 29: రాష్ట్రం లో పరిస్థితుల అధ్యయనానికి ఏర్పాతైన   శ్రీకృష్ణ కమిటీ గురువారం లేదా శుక్రవారం కేంద్రానికి నివేదిక సమర్పించనున్న నేపధ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  నివేదిక ఎలా వుంటుందనే అంశం పై  అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ  చర్చ జరుగుతోంది. మరో వైపు   శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం  ఉందన్న నిఘా నివేదికల నేపథ్యంలో  పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. కేంద్రం నుంచి ఇప్పటికే వచ్చిన 50 కంపెనీల అదనపు బలగాలకు తోడు అదనంగా మరో 50 కంపెనీలు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదనలు పంపింది. ముందస్తు జాగ్రత్త చర్యలపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ కె.అరవిందరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రె డ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఏకే ఖాన్, ఎస్.ప్రభాకర్‌రెడ్డిలతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. అదనపు బలగాలపై అపోహలకు గురికావద్దని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే వాటిని రప్పిస్తున్నట్టు మీడియాకు చెప్పారు.   ఏడాది కాలంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తున్నాం. మన బలగాల సంఖ్య చాలనందుకే కేంద్రం నుంచి అదనపు బలగాలను కోరాం. తెలంగాణతో పాటు సీమాంధ్ర జిల్లాలకు కూడా వాటిని తరలిస్తున్నాం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ఉపద్రవం వస్తుందని, ఏదో జరుగుతుందనే ప్రచారాలను నమ్మవద్దు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పార్టీలు, విద్యార్థులు, మీడియా సహకరించాలి’’ అని కోరారు.  కాగా, నివేదిక, అనంతరం తలెత్తబోయే పరిణామాలు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై ప్రధాని మన్మోహన్‌సింగ్ బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో సుదీర్ఘంగా చర్చించారు! రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చూడాలని మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివేదికకు సంబంధించిన వార్తల కవరేజీలో మీడియా సంయమనం పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అంబికా సోని కోరారు.

Tuesday, December 28, 2010

శాశ్వత పరిష్కారమే సూచిస్తాం: శ్రీక్రిష్ణ

న్యూఢిల్లీ,డిసెంబర్ 28:   ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితికి శాశ్వత పరిష్కారం దిశగా తమ నివేదిక ఉంటుందని ఆశిస్తున్నామని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులకు ఏర్పాటైన తమ కమిటీ నివేదికను సిద్ధం చేసిందని, నెలాఖరులోగా హోంమంత్రి చిదంబరానికి తప్పకుండా అందజేస్తుందని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపేందుకు ఏపీ భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్ శ్రీకృష్ణతో పాటు కమిటీ సభ్య కార్యదర్శి వి.కె.దుగ్గల్, సభ్యులు రవీందర్‌కౌర్, అబూసలే షరీఫ్, రణబీర్‌సింగ్‌తోపాటు కమిటీ సీనియర్ కన్సల్టెంట్ రవి ఢింగ్రా, కమిటీకి తోడ్పాటునందించిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి శశిప్రకాష్ పాల్గొన్నారు‘‘ఎక్కువమందికి అధిక సంతృప్తి కలిగించేలా నివేదికను తీర్చిదిద్దాం’’ అని శ్రీక్రిష్ణ సుస్పష్టంగా పేర్కొన్నారు.  తమ నివేదికలో పలు ప్రత్యామ్నాయాలు, వాటికున్న అనుకూలతలు, ప్రతికూలతలను కూడా పొందుపరిచినట్లు చెప్పారు. రాష్ట్రంలో అదనపు బలగాలను మోహరించింది.. నివేదిక తర్వాత ఏదో జరుగుతుందని కాదని, ఏదీ జరగకుండా ఉండేలా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాటును ప్రభుత్వం చేసిందని వివరించారు.  రాష్ట్రంలో ఎలాంటి హింస చోటుచేసుకోదని గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు.  వివరాలు ముందుగా వెల్లడయ్యే ప్రశ్నే లేదన్నారు.. అరవై ఏళ్ల సమస్యకు పది నెలల్లో పరిష్కారం ఎలా సాధ్యమన్న ప్రశ్నకు శ్రీకృష్ణ చమత్కారంగా జవాబిస్తూ.. ‘‘పాతికేళ్ల పాటు పిల్లలు లేని దంపతులకు తొమ్మిది నెలల్లోనే బిడ్డ పుడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.   

విజయవంతంగా తొలి స్వదేశీ ఏరోస్టాట్ రాడార్‌ ప్రయోగం

ఆగ్రా,డిసెంబర్ 28 : తొలి స్వదేశీ ఏరోస్టాట్ రాడార్‌ను  మంగళవారమిక్కడ విజయవంతంగా ప్రయోగించారు. ఈ బెలూన్ రాడార్ వల్ల సైనిక దళాల నిఘా సామర్థ్యం మరింత పెరుగుతుందని ప్రాజెక్ట్ డెరైక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. ఆగ్రాలోని మిలటరీ కాంపౌండ్‌లో ఈ రాడార్‌ను విజయవంతంగా ప్రయోగించారు. హీలియంతో నింపిన ఈ ఏరోస్టాట్‌లో రాత్రి వేళల్లో చూడగలిగే కెమెరాలు, శబ్దగ్రాహక పరికరాలు ఉన్నాయి. ఏరోస్టాట్ రాడార్‌లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయని, మరో రెండ్రోజుల వరకూ దీన్ని భూమి నుంచి కిలోమీటరు ఎత్తులో ఉంచుతామని గుప్తా చెప్పారు. ఒక కిలోమీటర్ ఎత్తు నుంచి 110 కిలోమీటర్ల మేర నిఘా పెట్టగలిగే ఈ రాడార్‌కు రూ. 20 కోట్ల వ్యయమైందని తెలిపారు. ప్రస్తుతం ఆగ్రాలోని చరిత్రాత్మక తాజ్‌మహల్‌తోపాటు ఇతర ముఖ్యప్రాంతాల్లో పగలు, రాత్రి పూట్ల పరిస్థితులను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామన్నారు. నిఘా అవసరాలతోపాటు విపత్తు నిర్వహణ సమయంలోనూ దీన్ని వినియోగించుకోవచ్చునని చెప్పారు.  

మంచులో మునిగిన అమెరికా నగరాలు

వాషింగ్టన్,డిసెంబర్28:   మంచు తుఫానుల కారణంగా అమెరికాలోని ఆరు రాష్ట్రాలలో అత్యవసరపరిస్థితి ప్రకటించారు. భారతీయులు ఎక్కువగా ఉండే న్యూజెర్సీలో కూడా అత్యవసరపరిస్థితి ప్రకటించారు. మంచు కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాలలోనే చిక్కుకున్నారు.  

భారత్ రెండవ ఇన్నింగ్స్ 228- ఆలౌట్

దర్బన్,డిసెంబర్ 28:   భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్  రెండవ ఇన్నింగ్స్'లో భారత్ 70.5 ఓవర్లకు 228 పరులు చేసి ఆలౌట్ అయింది. సెహ్వాగ్ 32 పరుగులు, విజయ్ 9, ద్రావిడ్ రెండు, టెండూల్కర్ ఆరు, వివిఎస్ లక్ష్మణ్ 96, పూజారా పది, ధోనీ 21, హర్భజన్ నాలుగు, జహీర్ ఖాన్ 27 పరుగులు చేశారు. మోర్కెల్, సోసోబ్'లు మూడేసి వికెట్లు, స్టేయన్ రెండు వికెట్లు, కల్లీస్, హార్రిస్'లు ఒక్కో వికెట్  తీసుకున్నారు.ఆ తరువాత రెండవ ఇన్నింగ్స్  మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా  27 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. శ్రీశాంత ఒక రెండు వికెట్లు తీసుకోగా, హర్బజన్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నారు.  

కేసుల ఎత్తివేత:ఎంపీల దీక్ష విరమణ

హైదరాబాద్,డిసెంబర్ 28: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలలో నమోదైన కేసులు అన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు హొం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శాసనసభలో రాజకీయ పార్టీలు కోరిన మేరకు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. మొత్తం 8,047 మందిపై ఉన్న 1667 కేసులను ఎత్తివేస్తున్నట్లు ఆమె చెప్పారు. శాసనసభలో ప్రకటించిన ప్రకారం 565 కేసులు ఎత్తివేశామన్నారు. ఇప్పుడు 900 మందిపై ఉన్న 135 కేసులను ఎత్తివేసినట్లు తెలిపారు. ఇలావుండగా,విద్యార్థులపై నమోదు చేసిన కేసులు అన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేయడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు దీక్షలు విరమించారు.

Monday, December 27, 2010

బొల్లారం రాష్ట్రపతి నిలయం లో బస చేసిన ప్రతిభా పాటిల్ ను కలసిన ముఖ్యమంత్రి

డర్బన్ లో వికెట్ ల విన్యాసం...

డర్బన్,,డిసెంబర్ 27:  కింగ్స్‌మీడ్ మైదానంలో జరుగుతున్న రెండవ టెస్ట్ లో రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 30.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 74 పరుగులు కలుపుకుని భారత్ ప్రస్తుతం 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆట ముగిసే సమయానికి లక్ష్మణ్ (59 బంతుల్లో 23 బ్యాటింగ్; 4 ఫోర్లు), పుజారా (51 బంతుల్లో 10 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. రెండో రోజు 77.4 ఓవర్లలో 245 పరుగులు రాగా... 18 వికెట్లు పడ్డాయి. డర్బన్‌లో ఒకేరోజు ఇన్ని వికెట్లు పడటం ఇదే తొలిసారి. 

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్ష

హైదరాబాద్,డిసెంబర్ 27: ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని కోరుతూ సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షను విరమింపజేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జానారెడ్డి ఆధ్వర్యంలోని మంత్రుల బృందం రెండుసార్లు దీక్షా శిబిరానికి వచ్చి చర్చలు జరిపినప్పటికీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తివేసేదాకా దీక్ష విరమించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఒకదశలో కేకే కాస్త మెత్తబడినట్లు కన్పించినప్పటికీ సర్వే సత్యనారాయణ సహా దీక్షా శిబిరం వద్ద నున్న నేతలు మాత్రం ‘‘చావనైనా చస్తామే తప్ప కేసులు ఎత్తివేయనిదే దీక్ష విరమించే ప్రసక్తే లేదు’’అని తేల్చి చెప్పారు.

Sunday, December 26, 2010

రెండో టెస్టులోనూ అదే వరస...

డర్బన్,డిసెంబర్ 26: రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది.  స్టెయిన్ (4/36), సోట్‌సోబ్ (2/40) ధాటికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది.  వర్షం కారణంగా తొలి రోజు ఆటను నిలిపి వేసే సమయానికి భారత్ ఆరు వికెట్లకు 183 పరుగులు సాధించింది. కెప్టెన్ ధోని (31 బంతుల్లో 2 ఫోర్లతో 20), హర్భజన్ సింగ్ (25 బంతుల్లో 2 ఫోర్లతో 15) క్రీజులో ఉన్నారు. అంతకుముందు మేటి బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (32 బంతుల్లో 4 ఫోర్లతో 25), ద్రవిడ్ (68 బంతుల్లో 3 ఫోర్లతో 25), సచిన్ (22 బంతుల్లో 3 ఫోర్లతో 13), లక్ష్మణ్ (73 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఐదేళ్ల తర్వాత లక్ష్మణ్ టెస్టుల్లో సిక్సర్ కొట్టడం గమనార్హం. ఓవరాల్‌గా లక్ష్మణ్ టెస్టు కెరీర్‌లో కేవలం ఐదు సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. ఆదివారం ఉదయం కురిసిన వర్షం కారణంగా మైదానం అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 

ఢిల్లీలో దట్టమైన పొగమంచు

న్యూఢిల్లీ,డిసెంబర్ 26:  దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు వంద వరకు స్థానిక, అంతర్జాతీయ విమానాలకు అవరోధం కలిగింది. కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్ని విమానాల  రాకపోకలు ఆలస్యమయ్యాయి.  ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా రన్‌వే విజిబిలిటీ వంద మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో 14 అంతర్జాతీయ విమానాలు సహా 42 విమానాలను హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, లక్నోలకు మళ్లించారు. దీనితో  అధికారులు విజిబిలిటీ పరిమితిని పెద్ద విమానాలకు 175 మీటర్ల నుంచి 150 మీటర్లకు, చిన్న విమానాలకు 150 నుంచి 125 కి.మీ.కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలావుండగా, ఢిల్లీలో వర్షంలాగా మంచు కురుస్తోంది. 

జీఎస్‌ఎల్‌వీ వైఫల్యంపై విశ్లేషణ

బెంగళూరు,డిసెంబర్ 26: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగ వైఫల్యంపై దేశంలోని అత్యున్నత అంతరిక్ష శాస్తవ్రేత్తలు విశ్లేషణ జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఏర్పాటు కానున్న వైఫల్య విశ్లేషణ కమిటీ ప్రయోగం తాలూకు సమాచారాన్ని విశ్లేషించి ఒక నివేదిక సమర్పిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికార ప్రతినిధి ఎస్.సతీశ్ తెలిపారు. ప్రయోగ విఫలంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ ఆదివారం శ్రీహరికోటలోని కల్పనా అతిథిగృహంలో సహచర శాస్తవ్రేత్తలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో రష్యా శాస్తవ్రేత్తలు కూడా పాల్గొన్నారు. దేశంలో సమాచార, ప్రసార, టెలివైద్య రంగాలకు మరింత ఊతమిచ్చే లక్ష్యంతో శనివారం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్06 రాకెట్ సాంకేతిక కారణాలతో తొలిదశలోనే విఫలమయింది. రాకెట్‌లో సంకేతాలను దిగువకు ప్రసారం చేసే తీగ ఒకటి తెగిపోవడం వైఫల్యానికి కారణమై ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. కాగా, రెండు వరుస వైఫల్యాలు ఏర్పడినంత మాత్రనా జీఎస్‌ఎల్‌వీ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఇస్రో మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ యు.ఆర్.రావు స్పష్టం చేశారు.

'కూచిపూడి' కి గిన్నిస్ రికార్డు

హైదరాబాద్,డిసెంబర్ 26: కృష్ణా జిల్లాలో సుమారు 600 ఏళ్ల క్రితం పుట్టిన కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. సిలికానాంధ్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన 2వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ‘హిందోళ థిల్లాన’ నృత్యాన్ని 2,800 కళాకారులు ఒకే వేదికపై నర్తించిన అద్భుత దృశ్యాన్ని గిన్నిస్ రికార్డు సంస్థ అధికార ప్రతినిధి తారికవర ప్రత్యక్షంగా వీక్షించారు. రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సహా వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనను గిన్నిస్ రికార్డులోకి చేర్చుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ప్రకటించడంతో స్టేడియం చప్పట్లతో మార్మోగింది. ఈ రసరమ్యమైన నృత్యాన్ని కీర్తించేందుకు తనకు మాటలు రావడం లేదని తారికవర వ్యాఖ్యానించారు. అనంతరం గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. ఈ నృత్య సమ్మేళనంలో 15 దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి ఆది గురువు పద్మ భూషణ్ వెంపటి చినసత్యంతోపాటు పద్మభూషణ్ యామినీ కృష్ణమూర్తి, పద్మశ్రీ డాక్టర్ కె.శోభానాయుడులను రాష్టప్రతి సత్కరించారు.

Friday, December 24, 2010

దీక్ష విరమించిన చంద్రబాబు

హైదరాబాద్,డిసెంబే 24:  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి తన దీక్షను విరమించారు. ఢిల్లీ నుంచి తొమ్మిది పార్టీలకు చెందిన నేతలు శుక్రవారం రాత్రి  ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని నిమ్స్‌లో బాబుతో కొద్దిసేపు చర్చలు జరిపారు. రైతుల తరఫున చేస్తున్న ఈ పోరాటానికి తాము అండగా ఉంటామని, దీక్ష విరమించాలని వారు కోరటంతో ఆయన అంగీకరించారు. దీంతో ఆయా పార్టీల నేతలు చంద్రబాబుకు ఉమ్మడిగా కొబ్బరి నీళ్లు తాగించి దీక్ష విరమింపచేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వారిలో శరద్‌యాదవ్ (జేడీయూ), ఏబీ బర్దన్(సీపీఐ), ప్రకాశ్ కారత్(సీపీఎం), అజిత్‌సింగ్(ఆర్‌ఎల్‌డీ), ఓం ప్రకాష్ చౌతాలా(ఐన్‌ఎల్‌డీ), అరుణ్‌కుమార్ శర్మ(ఏజీపీ), దిషాన్ ఆ లీ (జేడీఎస్) ఉన్నారు. తంబిదురై(ఏఐఏడీఎంకే), వై.గోపాలస్వామి(ఎండీఎంకే) చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు.
                       హైదరాబాద్ లో రెండవ అంతర్జాతీయ కూచిపూడి న్రుత్య సదస్సు ను ప్రారంభించిన
                      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్ర మంత్రి పురంధేశ్వరి కూడా ఫొటోలో వున్నారు.  
              దక్షిణాది విడిదికై హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు స్వాగతం పలుకుతున్న
                                              గవర్నర్ నరసింహన్,  సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి  

బొల్లారం విడిదికి రాష్ట్రపతి

హైదరాబాద్, డిసెంబర్ 24: రాష్టప్రతి ప్రతిభా పాటిల్ దక్షిణాది విడిది కోసం శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్టప్రతికి గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డి.కె.అరుణ, హైదరాబాద్ మేయర్ బండ కార్తీకరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.ప్రసాద్, డీజీపీ అరవిందరావులతోపాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.కాగా, రాష్టప్రతికి 27వ తేదీన ముఖ్యమంత్రి ఇవ్వనున్న విందును ప్రభుత్వం రద్దు చేసింది. వరదలు, భారీ వర్షాలతో రైతులు నష్టపోయిన నేపథ్యంలో రాష్టప్రతికి విందు ఇవ్వటం సమంజసం కాదని రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ నరసింహన్ రాష్టప్రతి గౌరవార్థం అల్పాహార విందు ఇవ్వనున్నారని, ఇందులో కేవలం రాష్టప్రతి, గవర్నర్, సీఎం మాత్రమే పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతిభాపాటిల్ డిసెంబర్ 31 వరకు బొల్లారంలోని రాష్టప్రతి విడిదిలో గడుపుతారు. అనంతరం గోవా బయల్దేరి వెళ్తారు.

Thursday, December 23, 2010

‘9/11’ వైద్య బిల్లుకు అమెరికా ఆమోదం

వాషింగ్టన్,డిసెంబర్ 23: సెప్టెంబర్ 11 న్యూయార్క్ ఉగ్రవాద దాడుల శిథిలాల తొలగింపులో పాల్గొని ఆ కాలుష్యానికి జబ్బుపడ్డవారికి ఆరోగ్య సహాయం, పరిహారాల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీని వల్ల, అమెరికా ప్రభుత్వం 9/11 శిథిలాల తొలగింపు బాధితులకోసం 430 కోట్ల డాలర్ల (సుమారు రూ. 19,400 కోట్లు) నిధిని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. పదేళ్లపాటు ఆ నిధిని అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించగా, కాంగ్రెస్ దాన్ని 5 ఏళ్లకు కుదించింది.

కరుణాకరన్ కన్నుమూత

తిరువనంతపురం,డిసెంబర్ 23:  కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు కె. కరుణాకరన్  అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. నాలుగు సార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధికకాలం ఆ పదవిని అధిరోహించిన వ్యక్తిగా తిరుగులేని రికార్డు నెలకొల్పారు. 1918, జులై 5న కేరళలోని కన్నూరులో జన్మించిన కరుణాకరన్ విద్యార్థి నేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి 1970లో యుడీఎఫ్ నెలకొల్పడం ద్వారా కరుణాకరన్ పేరు గాంచారు. అంచలంచెలుగా ఎదిగి 1977లో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. కొన్నాళ్ళు కేంద్రంలో పరిశ్రమల శాఖా మంత్రిగా కూడా పనిచేశారు.

చంద్రబాబు ఐసీయుకు తరలింపు

హైదరాబాద్,డిసెంబర్ 23: చంద్రబాబు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల సాయంతో నిమ్స్ ఆసుపత్రిలోని చంద్రబాబు గదిలోకి ప్రవేశించిన ప్రత్యేక వైద్య బృందం ఆయనను ఐసీయుకు తరలించి ఐవీ ఫ్లూయిడ్స్‌ను ఎక్కించింది.

దీక్ష విరమించిన జగన్

విజయవాడ,డిసెంబర్ 23 : రైతు సమస్యల పరిష్కారానికి 48 గంటల పాటు లక్ష్యదీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 12 గంటలకు దీక్ష విరమించారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలానికి చెందిన కొనకళ్ల వీర నాగేశ్వరరావు అనే రైతన్న అందించిన నిమ్మరసం తాగి ఆయన తన దీక్షను విరమించారు.

Wednesday, December 22, 2010

టీఆర్‌ఎస్‌ లో చేరిన టీడీపీ నేత జితేందర్‌రెడ్డి

హైదరాబాద్,డిసెంబర్ 22 : మాజీ ఎంపీ, టీడీపీ నేత జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనతోపాటు భారీ సంఖ్యలో ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. జడ్చర్ల జడ్పీహాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలనుంచి తెలంగాణ వాదులు తరలివచ్చారు.  తెలంగాణ ఉద్యమం బలహీనంగా ఉన్న పాలమూరు జిల్లాలోని ప్రతి ఇంటిపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడానికి కృషి చేస్తానని చెప్పారు. 
                          యు.పి.ఎ. అవినీతి పై ఢిల్లీ రాం లీలా మైదాన్ లో ఎన్.డి.ఎ ర్యాలీ సందర్భంగా
        బి.జె.పి. అగ్రనేతలు నితిన్ గడ్కారి, అద్వాని,సుష్మా స్వరాజ్, జెడి(యు) నేత శరద్ యాదవ్ తదితరులు...

ఉల్లి తో లొల్లి...

న్యూఢిల్లీ,డిసెంబర్ 22: ఘాటెక్కుతున్న ఉల్లి ధర ను అదుపు చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. పదేళ్ల కిందట విదేశాల నుంచి ఉల్లి దిగుమతులపై సుంకాలను రద్దు చేసింది. ఎగుమతులపై వచ్చే ఏడాది జనవరి 15 వరకు విధించిన నిషేధాన్ని నిరవధికంగా పొడిగించింది. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. దిగుమతులను వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖకు హుకుం జారీచేసింది. అసాధారణంగా పెరిగిన ధరను తగ్గించేందుకు దిగుమతులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 5 శాతం సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆశోక్ చావ్లా ఢిల్లీలో తెలిపారు. మళ్లీ ఆదేశాలు జారీ చేసేవరకు నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. దిగుమతి సుంకాలను ఎత్తేయడం వల్ల దేశంలో ఉల్లి సరఫరా పెరుగుందన్నారు. అయితే ఏ దేశం నుంచి ఎంత మొత్తంలో దిగుమతులు వస్తాయో ఆయన చెప్పలేదు. ఇదిలా ఉండగా వారం, పది రోజుల్లో కొత్త పంట వస్తుందని, ఫలితంగా ధరలు తగ్గుతాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి పీకే బసు చెప్పారు. ఎగుమతులపై నిషేధం ఫలితంగా ప్రధాన ఉల్లి మార్కెట్లలో హోల్‌సేల్ ధర 42% వరకు తగ్గింది. దేశంలో అతి పెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్‌లో బుధవారం క్వింటాలు రూ. 3,702 పలికింది. మంగళవారం ఈ ధర రూ. 5,200గా ఉంది. ముంబై, చెన్నై హైదరాబాద్ తదితర నగరాల్లో కిలో ఉల్లి ధర రూ. 50-85 మధ్య పలుకుతోంది.

కాంగ్రెస్ కు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా

హైదరాబాద్,డిసెంబర్ 22: జగన్ కు  మద్దతుగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి వెంకటరావు, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతు ప్రకటించారు. బుధవారం గజపతి నగరంలో వెంకటరావు విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ ఏర్పాటు చేసే పార్టీ కోసం తాము పనిచేస్తామని తెలిపారు. 

రైతులకు కాంగ్రెస్ చేసిందే ఎక్కువ:సి.ఎం.

హైదరాబాద్,డిసెంబర్ 22:రైతు సమస్యలపై నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. తమది ప్రజల పార్టీ అని, నాయకుల పార్టీ కాదని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాము రైతులకు 2004 నుంచి 2010 వరకు 8 వేల కోట్ల రూపాయలు అందించామని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లు 33 కోట్ల రూపాయలే అందించారని, అలా చూస్తే రైతుల పక్షపాతి కాంగ్రెసు పార్టీయా, తెలుగుదేశమా అని ఆయన అన్నారు. తమది జాలి గుండె అని, రైతులను ఆదుకోవడానికి తాము ముందుంటామని ఆయన చెప్పారు. రైతులకు వీలైతే ఇంత కన్నా ఎక్కువ ఇవ్వడానికి తాను ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని, అయితే పరిస్థితి అనుకూలంగా లేదని ఆయన అన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, తాను రైతు బాంధవుడిని అని చాటుకోవడానికి చంద్రబాబు దీక్ష చేపట్టారని, ఆ లక్ష్యసాధనలో చంద్రబాబు విజయం సాధించారని, అందువల్ల దీక్ష విరమించాలని ఆయన అన్నారు.  చంద్రబాబు హయాంలో వైయస్ తో పాటు 11 మంది నిరాహార దీక్ష చేస్తే పలకరించినవారు లేరని, చంద్రబాబు దీక్ష చేపట్టిన వెంటనే తాను ఢిల్లీ నుంచి వచ్చి చంద్రబాబును ఫోన్ లో పలకరించానని, చంద్రబాబు వద్దకు మంత్రులను పంపించామని ఆయన చెప్పారు

బాబుకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్,డిసెంబర్ 22: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి  ఫ్లూయిడ్స్  ఎక్కించేందుకు నిమ్స్ వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వీలుగా చంద్రబాబు ఉన్న గదినే వైద్యులు ఐసియుగా మారుస్తున్నారు.  నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న చంద్రబాబునాయుడు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.  చంద్రబాబు వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే గుండె, రక్త నాళాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

Tuesday, December 21, 2010

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత జట్టు

ముంబయి‌,డిసెంబర్ 21:   సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్, టీ-20కి భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసింది. జట్టు : మహేంద్రసింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సురేష్‌రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్, ప్రవీణ్‌కుమార్, శ్రీశాంత్, పీయూష్‌చావ్లా, జహీర్‌ఖాన్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, యూసఫ్‌పఠాన్, అశ్విన్. కాగా ఇషాంత్ శర్శ, రోహిత్‌లకు జట్టులో చోటు దక్కలేదు.

నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న చంద్రబాబు

హైదరాబాద్‌,డిసెంబర్ 21: హైదరాబాదులో నిమ్స్ లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సీనియర్ మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పితాని సత్యనారాయణ మంగళవారం సాయంత్రం చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీక్ష విరమించాలని వారు చంద్రబాబును కోరారు. దీక్ష విరమిస్తే రైతులకు ఇచ్చే ప్యాకేజీ పెంపుపై చర్చిద్దామని మంత్రులు ఆయనకు చెప్పారు. రైతుల సాయం కోసం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాను దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. గత ఐదు రోజులుగా చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన వైద్యాన్ని నిరాకరిస్తున్నారు.

రాష్ట్ర రైతులకు 400 కోట్ల కేంద్ర సాయం

న్యూఢిల్లీ,డిసెంబర్ 21: రాష్ట్రం లో రైతు సమస్యల పరిష్కారానికి విపక్షాల ఆందోళనల నేపధ్యం లో రాష్ట్ర రైతులకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 400 కోట్ల రూపాయల ప్యాకేజి ప్రకటించారు. జాతీయ విపత్తు నిధి కింద ఈ నిధులు విడుదల చేస్తారు. పొగాకు, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కూడా కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మంగళవారం ప్రధానితో సమావేశమై, రైతాంగ సమస్యలపై ఒక వినతి పత్రం సమర్పించారు. అనంతరం జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రధానికి వినతి పత్రం రూపంలో విన్నవించినట్టు చెప్పారు. అందులో పేర్కొన్న అంశాలను చూసి ఆయన  తక్షణ సాయంగా అడ్వాన్స్‌ల రూపంలో రూ.400 కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పారని జైపాల్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా, పూర్తిగా రంగుమారిన ధాన్యాన్ని కూడా ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలని కోరినట్టు చెప్పారు. ఇదే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్‌ను కూడా కోరనున్నట్టు చెప్పారు. కంది, మినుము తదితర వాణిజ్య పంటల రైతులను ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మకు వినతి పత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర జౌళి శాఖామంత్రి దయానిధి మారన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు.

జగన్ లక్ష్య దీక్ష ప్రారంభం

విజయవాడ,డిసెంబర్ 21:రైతు సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం సీతమ్మ పాదాల వద్ద 48 గంటల లక్ష్య దీక్షను ప్రారంభించారు. అంతకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా దీక్ష ప్రాంగణానికి అభిమానులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భం గా జగన్ మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఈ ప్రభుత్వం మరచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేతులు జోడించి విన్నవిస్తున్నానని, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, పల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జయసుధ, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర రెడ్డి, రేఖా కాంతారావు, శోభానాగిరెడ్డి, గురునాధరెడ్డి, ఆళ్ల నాని, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్, మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, మారెప్ప, కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గండి బాబ్జీ, జ్యేష్ట రమేష్బాబు, జలీల్ ఖాన్, తోట గోపాల కృష్ణ, మాజీ ఎమ్మెల్సీలు సాంబశివరావు, సామినేని ఉదయభాను, వెంకట అప్పారావు, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, సినీనటులు రాజశేఖర్, జీవిత, రోజా, విజయచందర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పిసిసి మాజీ కార్యదర్నులు కొయ్య ప్రసాద రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, తెలుగుదేశం పార్టీ నేత మాకినేని పెద్ద రత్తయ్య తదితరులు జగన్ కు మద్దతుగా దీక్ష లో కూర్చున్నారు.

Monday, December 20, 2010

ఎన్.ఆర్.ఐ.ల కోసం కొత్త ఛానెల్

వాషింగ్టన్,డిసెంబర్ 20:  ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయులకు వినోదం పంచేందుకు మరో కొత్త ఛానెల్ ఆవిర్భవించింది. ఐపీ టీవీ గ్రూప్ ప్రవాస భారతీయులకు ప్రత్యేకించి ‘డేటా బజార్’ పేరుతో నూతన నెట్ ఛానెల్‌ను ప్రారంభించింది. నిన్న, నేటి తరాలకు వేదికగా డేటా ఛానెల్ ప్రసారాలు భారతీయులను ఆకట్టుకుంటాయని ఛానెల్ ప్రారంభోత్సవం సందర్భంగా డేటాబజార్ వ్యవస్థాపకులు, సీఈఓ ఒనీ సీల్ వెల్లడించారు. ఉత్తర అమెరికా వ్యాప్తంగా వందకు పైగా వున్న ఐపీ గ్రూప్ ఛానల్స్‌కు 1.2 బిలియన్ల ప్రేక్షకులున్నారు.  కేవలం 59.99 డాలర్లు చెల్లించి ఐపీ గ్రూప్ ఛానెల్ ప్రసారాలు పొందవచ్చని తెలిపారు. డేటా బజార్‌లో భారతీయ చిత్రాలు, సంప్రదాయ కార్యక్రామలు ప్రసారం చేస్తామన్నారు.

జగన్ దీక్షకు రంగం సిద్ధం...

హైదరాబాద్,డిసెంబర్ 20: రైతు సమస్యలపై మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 48 గంటల సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం మంగళవారం క్రిష్ణా తీరంలో ప్రారంభమవుతోంది. రైతులు, చేనేత కార్మికుల కోసం జగన్ చేయనున్న ఈ దీక్ష మంగళవారం ఉదయం సీతమ్మవారి పాదాల వద్ద ఇసుక తిన్నెలపై ప్రారంభం కానుంది. సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన దీక్షా ప్రాంగణానికి 'వైఎస్‌ఆర్ లక్ష్య దీక్షా ప్రాంగణం’గా పేరుపెట్టారు. ఇక్కడ 100 అడుగుల వెడల్పు, పది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారీ వేదికపై సహచరులు, రైతులతో కలిసి యువనేత దీక్షలో కూర్చుంటారు. జగన్ లక్ష్య దీక్ష సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులు తెలిపారు.

భారీగా పెరగనున్న వంట గ్యాస్ ధర

న్యూఢిల్లీ,డిసెంబర్ 20:   వంటగ్యాస్ ధరను భారీగా పెంచడానికి కసరత్తు జరుగుతున్నది. గ్యాస్ సిలిండర్ పెంపు ధ రూ. 50 నుంచి రూ. 100 వరకూ ఉండవచ్చని అంచనా. ఆగస్టు నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధరలు దాదాపు 66 శాతం పెరిగాయని, దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వం చెబుతున్నది. చమురు సంస్థలు ఏటా దాదాపు 30 లక్షల టన్నుల ఎల్‌పీజీని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వంటగ్యాస్ ధర పెంపుపై కేంద్రప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకోనుంది. 

నిత్యానంద ఆస్తులు 2వేల కోట్లు...!

బెంగళూరు,డిసెంబర్ 20:  శృంగారకేళీలు జరిపి పట్టుబడ్డ నిత్యానంద తాను కొన్ని కోట్లకు అధిపతిని అనే విషయాన్ని సిఐడి పోలీసుల విచారణలో తెలిపాడట. ఆయన వద్ద సుమారు 2వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది.  ఇన్ని డబ్బులు సంపాదించిన నిత్యానంద అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఓ దీవి కొనుక్కొని అక్కడే లగ్జరీ జీవితం గడుపుదామనుకున్నాడట. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఆశ్రమాలకు లాస్ ఏంజేల్స్ ను ప్రధాన కేంద్రంగా చేద్దామని భావించాడు. కానీ పాపం ఆయన విదేశాలకు వెళ్లడానికి సిద్ధమయిన తరుణంలో హిమాచల్ ప్రదేశ్ లో  అరెస్టయ్యాడు. నిత్యానంద సాధువుగా జీవిస్తున్నప్పటికీ లగ్జరీ లైఫ్ గడపడమే ఆయనకు ఇష్టమంట. విదేశాలకు వెళ్లినప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని అందమైన అమ్మాయిలతో డ్యాన్సులు కూడా చేసేవాడంట. అమెరికా వెళ్లగానే నిత్యానంద స్వామి గెటప్ మారుతుందంట. చీకటి పడితే నైట్ పార్టీలకు వెళ్ళే  నిత్యానందకు ఇష్టమైన డ్యాన్సు ల్యాప్ డ్యాన్సు. నిత్యానందపై స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఓ భక్తడి నుండి యాగం పేరిట 4లక్షల డాలర్లు వసూలు చేశాడంట గతంలో. నిత్యానంద ప్రముఖుల దగ్గరనుండి భారీగానే డబ్బులు వసూలు చేస్తారు. అయితే అలా వసూలు చేసిన సొమ్ముతో ఏదైనా కొన్నప్పుడు దాతలు ఇచ్చినట్టు ప్రకటిస్తాడట.   నిత్యానంద సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించింది. భారత్ నుండి అమెరికా వరకు ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. కర్ణాటకలోని బిడాడిలో మొదట అశ్రమం స్థాపించాడు. ఆ తర్వాత ఒక్కొటి స్థాపించుకుంటూ వెళ్లిపోయాడు.  నిత్యానందకు అమెరికాలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. లాస్ ఏంజెల్స్ లో 100 ఎకరాల స్థలం ఉందంట. అమెరిరాకా, మలేషియా తదితర 33 దేశాల్లో వెయ్యికి పైగా ఆశ్రమాలు ఉన్నాయి. నిత్యానంద కేవరం రంజితతోనే రాసలీలలు జరపలేదు, తన వద్దకు వచ్చే భక్తురాళ్లలో చాలామందిని లోబర్చుకునే వాడంట. భక్తురాళ్లను లోబర్చుకోవడానికి ఆయన ఓ పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. అదే ఏకాంత సేవ. ఏకాంత సేవ పేరుతో భక్తురాళ్లని రాత్రిపూట సేవ పేరిట ఆశ్రమంలోనే ఉంచుకొని వారితో నేను కృష్ణుడు అయితే నీవు రాధవు అంటూ పలికి వాళ్లను లోబర్చుకునేవాడంట.  చిరుత చర్మం పోలీసులకు నిత్యానంద ఆశ్రమంలో దొరికిందంట. నిత్యానందపై పోలీసులు 430 పేజీల చార్జీ షీటు తయారు చేసినట్టు తెలుస్తోంది. 

సెంచూరియన్ లో ఓడిన భారత్...

సెంచూరియన్,డిసెంబర్ 20: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో  టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. రెండో ఇన్నింగ్స్ లో 459 పరుగులకు భారత్ ఆలౌటయింది. 50వ టెస్ట్ సెంచరీ సాధించిన సచిన్ 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.  దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 4 వికెట్లు పడగొట్టాడు. మోర్కల్, హారీస్ రెండేసి వికెట్లు తీశారు. టసట్‌సోబ్, కల్లిస్‌ ఒక్కో వికెట్  తీసుకున్నారు.   తొలి ఇన్నింగ్స్ లో భారత్ 136 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 620/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

జగన్ వెంటే ఉంటాం: జివిత,రాజశేఖర్

హైదరాబాద్,డిసెంబర్ 20:  వైఎస్ జగన్ చేపట్టనున్న నిరాహారదీక్షలో పాల్గొంటామని జీవిత, రాజశేఖర్ తెలిపారు. జగన్ వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరెడ్డిని చూసే తాము కాంగ్రెస్‌లో చేరామని వారు చెప్పారు. జగన్‌ను డైనమిక్ లీడర్‌గా వర్ణించారు. జగన్ లాంటి మనిషి సీఎం కావాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్ లేదని జీవిత, రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.

బాబు దీక్ష భగ్నం: టీడీపీ బంద్‌

హైదరాబాద్,డిసెంబర్ 20:  : రైతు సమస్యలపై మూడు రోజుల క్రితం  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టినదీక్షను పోలీసులు భగ్నం చేసి చికిత్స నిమిత్తం నింస్ కు తరలించారు. చంద్రబాబునాయుడు నింస్ లో తన దీక్షను కొనసాగిస్తున్నారు.   చంద్రబాబుపై నాన్‌బెయిల్ కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు అరెస్ట్ ను  నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా తెదేపా కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలకు దిగారు. రైతాంగ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చేవరకూ దీక్ష విరమించేది లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.చంద్రబాబునాయుడు అరెస్ట్ ‌ను నిరసిస్తూ ఆపార్టీ  సోమవారం నాడు  రాష్టవ్య్రాప్త బంద్‌కు పిలుపు నిచ్చింది. పలు జిల్లాల్లో  పార్టీ కార్యకర్తలు దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేయించారు.

Sunday, December 19, 2010

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్06 ప్రయోగం వాయిదా

నెల్లూరు,డిసెంబర్ 19: సోమవారం జరగవలసిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్06 ప్రయోగం వాయిదా పడింది. శనివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభించిన కొద్దిసేపటికే ద్రవ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు శాస్తవ్రేత్తలు వెల్లడించారు. మళ్ళీ ప్రయోగ తేదీని  త్వరలో ప్రకటిస్తారు.

                                  హైదరాబాద్ లో రైతు సమస్యలపై నిరాహార దీక్ష చేస్తున్న చంద్ర బాబుకు
                                         మద్దతు ఎలుపుతున్న సి.పి.ఎం. జాతీయ నేత ప్రకాష్ కారత్

పార్టీకి ఇది ప్రక్షాళన సమయం: సోనియా

న్యూఢిల్లీ,డిసెంబర్ 19: కాంగ్రెస్ పార్టీ చరిత్ర చాలా గొప్పదని, కాంగ్రెస్ ఎప్పుడు పేదల కోసమే ఉన్నదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం అన్నారు. మూడురోజుల ప్లీనరీ సమావేశంలో భాగంగా రెండో రోజు ఆమె సమావేశాలను ప్రారంభించి ప్రసంగించారు.కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ప్రతినేత ప్రస్తుతం ఆత్మపరిశీనల చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతీయంగా పార్టీని ప్రక్షాళన చేయాలని బీహార్ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. పార్టీ అధికారం లో లేని   రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు  ఉత్పన్నమవుతున్నాయన్నారు.  జై జవాన్ జై కిసాన్ అన్న మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నినాదాన్ని కొనసాగిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడినాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అన్నారు.నవ్యత, సేవ ఈ రెండు కాంగ్రెస్ ఎజెండా అని ప్రకటించారు. కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే ఆ ఘనత ఎవరి వ్యక్తిగతం కాదని, అది పార్టీ ఘనతే అన్నారు. జమ్ము-కాశ్మీర్ లో శాంతి భద్రతలకై కృషి చేస్తామని చెప్పారు. నక్సల్స్ సమస్యను అరికట్టడానికి సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారని చెప్పారు. కాగా ఈ ప్లీనరీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పొడిగిస్తూ పార్టీ నిబంధనను పొడిగించారు.  కాగా, ఎఐసిసి ప్లీనరీ సమావేశాలలో ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రసంగం పేలవంగా సాగింది.  వికీలీక్స్ ప్రస్తావనలేకుండా ఆయన తన ప్రసంగం ముగించారు. రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వికీలీక్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే. మంత్రులు, ప్రజల మధ్య అగాధం పెరిగిపోయిందని రాహుల్ అన్నారు.

టెస్ట్ క్రికెట్‌లో సచిన్ 50వ సెంచరీ

సెంచూరియన్,డిసెంబర్ 19:  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 50వ సెంచరీలు సాధించిన ఆటగాడిగా కి రికార్డు నెలకొల్పాడు.  అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ తన ఖాతాలో 50వ సెంచరీ జమ చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో   ఈ ఘనత సాధించాడు. 197 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ చేసి  సచిన్ శతకం సాధించాడు.

తెలంగాణ లోనూ మా పార్టీ ఉంటుంది: జగన్

హైదరాబాద్,డిసెంబర్ 19: తెలంగాణ ఇచ్చేది తాను కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆ ప్రాంతంలో తన పార్టీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాను  పెట్టబోయే పార్టీ లౌకిక భావాలతో ఉంటుందని, ముస్లింలకు నాన్న వైఎస్  తీసుకొచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ కు కట్టుబడతామని,  ఎన్‌డీఏ, యూపీఏలతో సంబంధం లేకుండా, లౌకిక భావాలు గల పార్టీగా తన  పార్టీ ఉంటుందని అని  కడపలో చెప్పారు.   ‘‘నాన్న నాకు నేర్పింది ఒక్కటే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, వెనక్కు తగ్గకపోవడం. నేను కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను’’ అని ముస్లిం మత పెద్దలకు భరోసా ఇచ్చారు. వైఎస్ మరణానంతరం సోనియాగాంధీ, కాంగ్రెస్ అధిష్టానం తనను, తన కుటుంబాన్ని అవమానాలపాలు చేసి పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి కల్పించిన తీరును వారికి వివరించారు.

Saturday, December 18, 2010

                                    హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీలొ 
                                      కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న  ఆఫీసర్ల ఆనందోత్సాహం...

రాష్ట్రానికి కేంద్ర బలగాలు

హైదరాబాద్,డిసెంబర్ 18: డిసెంబరు 31 తర్వాత ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపి అరవిందరావు హెచ్చరించారు. అంతర్యుద్ధం వంటి మాటలను ఎవరు ఉపయోగించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ముందుజాగ్రత్త చర్యగా కేంద్రాన్ని బలగాలను కోరామన్నారు. మొత్తం 50 కంపెనీల బలగాలను పంపమని అభ్యర్థించామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తే తమకేమీ అభ్యంతరం లేదనీ, కానీ రెచ్చగొట్టే విధంగా, హింసాత్మక ధోరణిని అవలంభిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. ‘తెలంగాణ నేతలు మిమ్మల్ని బెదిరిస్తూ, హెచ్చరికలు చేస్తున్నారు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా ,బెదిరించటం తెలంగాణ నేతల ధర్మమని, పోలీసుల్ని నైతికంగా బలహీనం చేయటానికే అలా మాట్లాడతారని డీజీపీ వ్యాఖ్యానించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు నేపథ్యంగా జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేత విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని, తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని డీజీపీ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో పోలీసుల పాత్ర చాలా చిన్నదని, చట్ట ప్రకారం తాము పనిచేస్తామన్నారు.

ప్రపంచకప్ కోసం భారత ప్రాబబుల్స్...

ముంబై,డిసెంబర్ 18:  వచ్చే ఏడాది ఉపఖండంలో జరిగే ప్రపంచకప్ కోసం భారత ప్రాబబుల్స్ ను   సెలక్టర్లు  ప్రకటించారు. 30 మంది సభ్యుల బృందంలో పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌కు చోటు దక్కలేదు. యూసుఫ్ పఠాన్‌తో పాటు అజింక్యా రహానే, చటేశ్వర పుజారాలకు స్థానం లభించింది. జనవరిలో ఈ జాబితాను 15 మందికి కుదిస్తారు. 13 మంది బ్యాట్స్‌మెన్, ఏడుగురు పేస్ బౌలర్లు, ఆరుగురు స్పిన్నర్లతో పాటు నలుగురు వికెట్ కీపర్లను ఎంపిక చేశారు.  ప్రాబబుల్స్ జాబితా: ధోని, సెహ్వాగ్, సచిన్, గంభీర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, విజయ్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, సౌరభ్ తివారీ, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, జహీర్ ఖాన్, నెహ్రా, శ్రీశాంత్, మునాఫ్, ఇషాంత్, వినయ్ కుమార్, ప్రవీణ్, హర్భజన్, అశ్విన్, అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా, రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజా, వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్.

సానియా కు ఐటీఎఫ్ టైటిల్

న్యూఢిల్లీ,డిసెంబర్ 18:  భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్‌లో జరిగిన ఐటీఎఫ్ అల్ హబ్టూర్ చాలెంజ్ ట్రోఫీని సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో హైదరాబాదీ స్టార్ 2-1 సెట్లతో ఐదో సీడ్ జొవనొస్కీ (సెర్బియా)ని ఓడించింది.  డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 165వ ర్యాంకులో ఉన్న సానియా 4-6, 6-3, 6-0తో తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ క్రీడాకారిణిని ఓడించింది. సింగిల్స్‌లో టైటిల్ చేజిక్కించుకున్న సానియా డబుల్స్ లో  రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన వ్లాదిమిర ఉహ్లిరొవాతో జతకట్టిన భారత స్టార్ ఫైనల్లో 4-6, 6-7 (5/7)తో జూలియా జార్జెస్ (జర్మనీ)-పెట్రా మాట్రిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది.

ధోనీ సేన ముందు భారీ సవాల్...

సెంచూరియన్,డిసెంబర్ 18: : భారత్‌తో టెస్టు మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా రికార్డుల కోసం ఉపయోగించుకుంటోంది. తొలి ఇన్నింగ్స్ ను  4 వికెట్ల నష్టానికి 620 పరుగుల  వద్ద డిక్లేర్ చేసింది.కెరీర్‌లో 38 సెంచరీలు చేసిన కలిస్‌ డబుల్ సెంచరీ చేశాడు. డివిలియర్స్ ఏకంగా తమ దేశ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు.  సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో  భారత్  2 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ 63 , గంభీర్ 80  పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి ద్రవిడ్ 28,  ఇషాంత్ 7 పరుగులతో  క్రీజులో ఉన్నారు. స్టెయిన్, హారిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

పాక్ పాత పాట...

ఇస్లామాబాద్ ,డిసెంబర్ 18: కాశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం లభించేంతవరకు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయని పాక్ స్పష్టంచేసింది. పాక్‌పై దుష్ర్పచారానికి భారత్ ఉగ్రవాదం అంశాన్ని ఉపయోగించుకుంటోందని పాక్ విదేశాంగ కార్యదర్శి బషీర్  ఆరోపించారు. ఉగ్రవాదం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, అది ప్రపంచవ్యాప్త సమస్య అని వ్యాఖ్యానించారు. ‘ఇరుదేశాల మధ్య కాశ్మీర్ సహా, చాలాకాలంగా నలుగుతున్న సమస్యలు ఉన్నాయి.. వాటికి సరైన పరిష్కారం లభించేంతవరకు ఏదో, ఒక రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయి’ అని బషీర్ పేర్కొన్నారు.  కాగా , కాశ్మీర్ సమస్యతో సహా భారత్‌తో పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలనూ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రధాని గిలానీ పేర్కొన్నారు. మూడు రోజులపాటు పాక్‌ పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని వెన్ జియాబావోకు విందు ఇచ్చిన సందర్భంగా గిలానీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో శాంతికి, అభివృద్ధికి విఘాతం కల్గించే ఎలాంటి విధానాన్నైనా పాక్ వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు.

Friday, December 17, 2010

పలు సమస్యలు, సవాళ్ల మధ్య కాంగ్రెస్ ప్లీనరీ

న్యూఢిల్లీ,,డిసెంబర్ 17: 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ 83వ ప్లీనరీ శనివారం ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్..సహా పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు హాజరయ్యే ఈ సమావేశాల్లో పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సవాళ్లపై మేధోమథనం జరగనుంది. 2జీ, ఆదర్శ్ సహా ఇటీవల పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తున్న కుంభకోణాలు, యూపీఏలో విభేదాలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆంధ్రప్రదేశ్ పరిణామాలు, 2011, 2012లలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన.. ఇన్ని సవాళ్ల మధ్య 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏని మరోసారి విజయతీరాలకు చేర్చడం.. మొదలైన అన్శాలపై ఈ మూడురోజుల ప్లీనరీ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది.పార్టీ ఆవిర్భవించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేసే తీర్మానంతోపాటు రాజకీయ, ఆర్థిక, విదేశాంగ రంగాలపై చేయనున్న తీర్మానాల ముసాయిదాలు సిద్ధమయ్యాయి. శనివారం పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగే తొలి సమావేశంలో పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, పీసీసీ సారథులు, సీఎల్‌పీ నాయకులు ముసాయిదాలపై చర్చించి తుదిమెరుగులు దిద్దుతారు. పార్టీ ప్రతినిధు లు ఆది, సోమవారాల్లో వీటిపై చర్చించి, అవసరమైన మార్పులు చేసి వాటిని ఆమోదిస్తారు. ప్లీనరీ సమావేశాల ప్రాంగణం వద్ద నాలుగువేలమందికి బస ఏర్పాట్లు చేశారు.

వైష్ణవాలయాల్లో ముక్కోటి సందడి

హైదరాబాద్‌,,డిసెంబర్ 17:  వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరవడంతో భక్తులు మూలవిరాట్టును దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు.  సింహాచలం, అన్నవరం, యాదగిరిగుట్ట, అహోబిళం, శ్రీశైలం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తిలోని వరదరాజ స్వామి దేవస్థానం, కాణిపాకం..తదితరఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  భద్రాచలంలో గరుడసేవ కన్నుల పండువగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఉత్తర ద్వారం లో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులమంత్రోచ్ఛారణలు, దూప దీపాలు, గంటల మోత నడుమ తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తరద్వారాలు తెరుచుకోగానే శంఖు,చక్ర, గదాధారుడైన వైకుంఠరాముడు గరుడవాహన రూఢుడై భక్తులకు సాక్షాత్కరించాడు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా చూసిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. 

భారతీయ సైన్స్ జర్నలిస్టుకు అంతర్జాతీయ అవార్డు

వాషింగ్టన్,డిసెంబర్ 17: భారత సీనియర్ పాత్రికేయుడు పల్లవ బాగ్లా ఈ ఏడాదికిగాను సైన్స్ జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు ‘డేవిడ్ పెర్ల్‌మన్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ సైన్స్ జర్నలిజం’ను అందుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో గురువారం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ‘ హిమనీనదాలపై వాతావరణ మార్పుల ప్రభావం’అన్న అంశంపై రాసిన వ్యాసాలకుగాను ఆయన ‘న్యూస్’ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

దడ దడలాడిస్తున్న వికీలీక్స్ ...

న్యూఢిల్లీ: 'ప్రభుత్వాలను బహిరంగం చేస్తాం' అన్న నినాదంతో పనిచేస్తున్న లాభాపేక్షలేని ఒక స్పచ్ఛంద సంస్థ వికీలీక్స్. అందరికీ అందుబాటులోలేని ప్రభుత్వ పత్రాలను సేకరించి, స్వీకరించి ఈ సంస్థ ప్రచురిస్తుంది. 2006లో ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అస్సాంజ్ సారథ్యంలో సన్‌షైన్ ప్రెస్ ఈ వెబ్‌సైట్ ను ప్రారంభించింది. తైవాన్, యూరప్, ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాలకు చెందిన సాంకేతిక నిపుణులు, రాజకీయాశ్రయం పొందిన చైనీయులు, జర్నలిస్టులు, గణితశాస్త్రవేత్తలు ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు.  ఆసియా ఖండంలోని, మాజీ సోవియట్ కూటమిలోని దేశాలు, ఆఫ్రికా ఖండం, మధ్యప్రాచ్యంలోని నిరంకుశ రాజ్యాలు చేస్తున్న నిరంకుశ కార్యకలాపాలను, అణచివేత చర్యలను ప్రపంచ ప్రజలకు బహిర్గత పర చాలన్న ప్రాథమిక లక్ష్యంతో వికీలీక్స్ ఏర్పడింది.
తమ ప్రభుత్వాల, కార్పొరేట్ సంస్థల అనైతిక ప్రవర్తన గురించి ఏ ప్రాంత ప్రజలు పత్రాలు అందజేసినా  కూడా ఈ వెబ్‌సైట్ ప్రచురిస్తుంది. మొదటగా 'చట్టాలకతీతమైన సంహారాలు, అదృశ్యాలు' అని కెన్యా 'జాతీయ మానవ హక్కుల కమిషన్' నివేదికను వికీలీక్స్ ప్రచురించింది. ఇరాక్‌లో అమెరికా సైన్యం దాదాపు లక్షన్నర మంది అమాయక పౌరులను ఊచకోత కోసింది. 2007లో అమెరికా సైన్యం చేస్తున్న అమానుష మారణకాండకు సంబంధించిన దృశ్యాలను 'కొల్లేటరల్ మర్డర్' పేరుతో 2010లో వికీలీక్స్ వెబ్‌సైట్‌లో పెట్టారు. దాంతో పాటు 'ఇరాక్ వార్ లాగ్స్' అని 4 లక్షల డాక్యుమెంట్లను కూడా వికీ ప్రచురించింది.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి సోవియట్ సోషలిస్టు స్వప్నం ఆవిరవడంతో అమెరికా ప్రపంచ సంరక్షకుడుగా, ప్రపంచ పోలీసుగా అవతరించింది.అమెరికా దాని మిత్ర దేశాలకు వికీలీక్స్ సింహస్వప్నంగా మారింది. ప్రపంచ దేశాల దౌత్య సంబంధాల్లో నెలకొన్న కుట్రలు, కుయుక్తులు, అమానవీయ కార్యకలాపాలు, హక్కుల హననాలు బహిరంగమవుతుండడంతో అమెరికాతోసహా పలు పాశ్చాత్య  దేశాల ప్రజాస్వామ్య స్వభావం ప్రపంచానికి అర్థమవుతోంది. రహస్య పత్రాలను వికీలీక్స్ ప్రచురించడం ఒక గొప్ప సమాచార విప్లవంగా ప్రపంచ ప్రజాస్వామికవాదులు కీర్తిస్తున్నారు. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధాలలో అమెరికా అనుసరించిన కుట్రపూరిత, దుర్మార్గ విధానాలను ధృవపరచే పత్రాలను బయటపెట్టడంతోపాటుగా ఆ దేశ విదేశ వ్యవహారాలలోని లొసుగులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎంతో కాలంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం 'తనకు తానుగా చంకలు గుద్దుకుంటూ ముందుకొస్తున్న ఆశావహ దేశం'గా విదేశాంగ మంత్రి హిల్లరి క్లింటన్ మన దేశంపై చేసిన వ్యాఖ్యానాలను వెల్లడించే పత్రాలను సైతం వికీలీక్స్ ప్రచురించింది.  అలాగే తాలిబాన్ అణచివేత కోసం పాకిస్థాన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థికసహాయం భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు, తాలిబన్లకు చేరుతోందని అమెరికా సైనిక, అధికార వర్గాలు భావిస్తున్న కీలక పత్రాలను సైతం వికీ విడుదల చేసింది.
లాటిన్ అమెరికా మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకునేందుకు, అమెరికా ప్రభుత్వం, సీఐఏ, దాని కార్పొరేట్ సంస్థలు ఆయా దేశాల ప్రజా ప్రభుత్వాలను కూల్చేందుకు పన్నిన పన్నాగా లు, కుట్రలకు సంబంధించిన పత్రాలను లక్షల సంఖ్యలో ప్రచురించింది. వెనిజులా, క్యూబా దేశాధినేతలను హత్య చేసేందుకు జరిగిన కుట్ర రహస్యాలు వెల్లడయ్యాయి. ఉత్తర కొరియాను నియంత్రించే విషయంలో అమెరికా, చైనాల మధ్య కుదిరిన రహస్య ఒప్పంద పత్రాలను, చివరికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్, ఆయన సిబ్బందిపైన అమెరికా ప్రభుత్వం గూఢ చర్యానికి పాల్పడింది.వికీలీక్స్ చేతికి అధికారిక రహస్య పత్రాలు చిక్కిన దేశాల ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఆ వెబ్‌సైట్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా విరుచుకుపడ్డాయి అవన్నీ అసత్యాలని అరచి గగ్గోలు పెట్టాయి.

   ఇక తాజాగా  ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి సంబంధించిన రహస్యాలను వికీలీక్స్ బయటపెట్టింది.   భారతదేశంలో అమెరికా రాయబారి టిమోతి రీమోర్స్ తో రాహుల్ గాంధీ జరిపిన సంభాషణను వికీలీక్స్ వెల్లడించింది. లష్కరే తోయిబా కన్నా హిందూ తీవ్రవాదం ప్రమాదకరంగా పరిణమించిందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ గ్రూపుల పెరుగుదల వల్ల ముస్లింలతో మతపరమైన, రాజకీయపరమైన ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన విందు సందర్భంగా రాహుల్ కు, రిమోర్ కు మధ్య సంభాషణ జరిగింది.లష్కరే తోయిబాకు దేశంలోని కొన్ని ముస్లిం గ్రూపుల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వంటి సంఘటిత హిందూ నాయకులు ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని ఆయన అన్నారు. ర్యాడికల్ హిందూ గ్రూపుల నుంచి దేశ అంతర్గత భద్రతకు ముప్పు కొత్తదేమీ కాదని ఆయన అన్నారు. వికీలీక్స్ వెల్లడించిన రాహుల్ గాంధీ తిమోతి రిమోర్స్ తో జరిపిన సంభాషణపై  వికీలీక్స్ వెల్లడించిన వివరాలు కలకలం సృష్టిస్తున్నాయి.      

ఇది పూర్తిగా 'హాట్' గురూ...

 నాగాలాండ్ లొ   ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ ప్రదర్శనలో ఉంచిన అత్యున్నత మేలి రకం 'రాజా మిర్చి '  
    

కాంగ్రెస్ కు మాజీ మంత్రి పెన్మత్స రాజీనామా

హైదరాబాద్,డిసెంబర్ 17 : విజయనగరం  జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు  పార్టీకి రాజీనామా చేశారు. తాను  మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి వెంట ఉంటానని ప్రకటించారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చడం ఒక్క జగన్మోహన రెడ్డికే సాధ్యమవుతుందన్నారు.  

'హిందూ' వివాదంలో రాహుల్‌

న్యూఢిల్లీ,డిసెంబర్ 17 : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ చిక్కుల్లో పడ్డారు. అమెరికా రాయబారి రోమర్‌తో అతివాద హిందూ సంస్థలపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వికీలీక్స్ బయటపెట్టింది. హిందూ తీవ్రవాదంతోనే భారత్‌కు నష్టమని రాహుల్ వ్యాఖ్యానించిన టేపులను వికీలీక్స్ బయటపెట్టి సంచలనం సృష్టించింది. 2009 సంవత్సరంలో హిల్లరీ క్లింటన్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇచ్చిన విందులో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.

కల్లీస్, ఆమ్లా సెంచరీలు - సౌతాఫ్రికా 351/2

సెంచూరియన్ పార్క్,డిసెంబర్ 17: కల్లీస్, ఆమ్లా  సెంచరీలతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో  2 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. స్మిత్ 62, పీటర్సన్ 77 పరుగులు చేసి అవుటయ్యారు. స్మిత్, పీటర్సన్ వికెట్లను హర్భజన్ పడగొట్టాడు. ప్రస్తుతం ఆమ్లా 102, కల్లీస్ 101 పరుగులతో క్రీజులో వున్నారు. అంతకుముందు భారత్  తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకు ఆలౌటైంది.

నిరాహార దీక్ష ప్రారంభించిన చంద్రబాబు

హైదరాబాద్ ,డిసెంబర్ 17:  రైతుల సమస్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి దీక్షను ఆరంభించారు. చంద్రబాబుతోపాటు ఎంపీ హరికృష్ణ, దేవేందర్‌గౌడ్, నాగం జనార్థన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉమామాధవరెడ్డి, మహిళా ఎమ్మెల్యేలు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వరుసగా వస్తున్న కష్టాలు, నష్టాలతో రైతులు ఏవిధంగా బతకాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారన్నారు.పంట నష్టపోయిన రైతులకు వరికి ఎకరాకు రూ.10వేలు, వాణిజ్య పంటలకు 15వేలు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలన్నారు.చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని చంద్రబాబు అన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని కోరినట్లు ఆయన తెలిపారు. కావాలనే పత్తి ఎగుమతులపై ఆంక్షలు విధించి ధర తగ్గేలా చేశారన్నారు. అలాగే వ్యవసాయ కూలీలు. మత్స్యకారులు, పశువుల కాపర్లు, చేతి, కులవృత్తుల వారిని సర్కార్ ఆదుకోవాలన్నారు. అంతర్జాతీయ ధరలను బూచిగా చూపి పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచారన్నారు. విధి లేని పరిస్థితిలోనే తాను నిరాహార దీక్షకు దిగినట్లు చంద్రబాబు తెలిపారు. 

Thursday, December 16, 2010

                           ఈ  నెల 20న శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించనున్న  జి.ఎస్.ఎల్.వి-ఎఫ్.06 రాకెట్.
                                             దీని ద్వారా    జిశాట్ -5 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు.

             అసోం లోని రాజీవ్ గాంధి ఒరంగ్ నేషనల్ పార్క్ లో కవల ఏనుగులను కన్న తల్లి ఏనుగు అల్కా 

ఇక ‘2జీ’ దర్యాప్తుపై సుప్రిం' పర్యవేక్షణ: ఎన్‌డీఏ పాలన వరకూ దర్యాప్తు పరిధి విస్తరణ

న్యూఢిల్లీ,డిసెంబర్ 16: 2జీ స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తును పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దర్యాప్తు పరిధిని ఎన్‌డీఏ పాలన వరకూ విస్తరిస్తూ... 2001 నుంచి 2008 వరకు టెలికాం విధానాన్ని దర్యాప్తు పరిధిలోకి చేర్చింది. ‘ఇది రూ. 1.76 లక్షల కోట్లకు సంబంధించినది మాత్రమే కాదు.. దీని పరిధి ఇంకా విస్త్రుతమైనది. 2001లో ఏం జరిగిందనేది కూడా పరిశీలించాల్సి ఉంది. అందుకే సీబీఐ ని ఆ కోణంలో కూడా దర్యాప్తు జరపాలని ఆదేశిస్తున్నాం’ అని జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఏకే గంగూలీల ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. ‘2001 నుంచి, 2006-2007 వరకు లెసైన్సుల జారీలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించి ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనట్లయితే, వెంటనే కేసు నమోదు చేసి, కూలంకషంగా దర్యాప్తు జరపాలని ధర్మాసనం సీబీఐని ఆదేశిఇంచింది.  ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు పురోగతిపై   నివేదికను వచ్చే విచారణ తేదీ ఫిబ్రవరి 10, 2011న   సీల్డ్ కవర్లలో తమకందజేయాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లను ఆదేశించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణకు ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి స్కామ్ విచారణకు మరో ప్రత్యేక బృందం అవసరం లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తూ.. అర్హత లేని కంపెనీలు స్పెక్ట్రం లెసైన్సులు పొందినట్లు స్పష్టమైన ఆధారాలున్న కాగ్ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. 122 లెసైన్సుల జారీలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. 

రైతుల రుణాలపై వడ్డీ మాఫీ

హైదరాబాద్‌,డిసెంబర్ 16:  ప్రకృతి వైపరీత్యాలు, అకాల నష్టాలకు గురైన రైతాంగాన్ని  ఆదుకోవటానికి రాష్ట్ర సర్కార్‌ ముందుకు వచ్చింది.  ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి గురువారం శాసనసభ శీతాకాల సమావేశాల ముగింపు రోజున రైతులకు కొన్ని రాయితీలు  ప్రకటిం చారు. బ్యాంకు నుంచి రూ.16,500 కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారని, వాటిపై వడ్డీని మాఫీ చేస్తున్నామన్నారు.  పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.6,000 చెల్లిస్తా మన్నారు. గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు మరో రూ.1,500 పెంచామన్నారు. అలాగే గేదెలు, ఆవులకు రూ.15,000, దూడలకు రూ.10,000, గొర్రెలకు రూ.2,000, పౌల్ట్రీ రంగానికి రూ.40,000 చెల్లిస్తామని తెలిపారు. చేనేత రంగంలో మగ్గానికి రూ.5,000, రంగు మారిన, తడిసి పోయిన నూలుకు రూ.5,000 చెల్లిస్తామని, మత్స్యకార   పడవలకు రూ.5,000, పెద్ద పడవలు, వలలు నష్టపోయిన వారికి రూ.10,000 చెల్లిస్తామన్నారు.  మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీ రాజ్‌, రోడ్లు, భవనాల శాఖలకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఇప్పటికే రూ.810 కోట్లకు టెఎండర్లు పిలిచామన్నారు. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, ఇది వారి ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి అన్నారు. 

నిత్య యవ్వన 'ఔషధం'!

లండన్ ,డిసెంబర్ 16: మనుషుల యవ్వనాన్ని ఎక్కువకాలంపాటు కాపాడగలిగే ఔషధాన్ని తయారు చేశానంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్తవ్రేత్త ఎడ్వర్డ్ గోజిల్. లినాలిడోమైడ్ అనే ఔషధం వ్యాధినిరోధక వ్యవస్థలోని సైటోకైన్స్ అనే కీలక రసాయనాలకు బలాన్ని చేకూర్చుతుందని, తద్వారా మనిషి యవ్వనాన్ని ఎక్కువకాలం కాపాడుతుందని ఎడ్వర్డ్ వెల్లడించారు. లినాలిడోమైడ్ ద్వారా వృద్ధాప్యం త్వరగా రాకుండా చేయొచ్చని, వయసు మళ్లినవారిపై చేసిన తమ పరిశోధనలో తేలిందమి, ఇతర మాత్రలు లేదా టానిక్‌ల కంటె లినాలిడోమైడ్ సమర్థంగా పనిచేస్తుందని ఆయన అన్నారు.

చప్పగా ముగిసిన అసెంబ్లీ...

హైదరాబాద్,డిసెంబర్ 16:   అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చప్పగా ముగిశాయి. మొత్తం 6 రోజులపాటు సభ సమావేశమైంది. 23 గంటల 25 నిమిషాలుపాటు సమావేశమైన సభ వివిధ అంశాలపై పెద్దగా చర్చ లేకుండానే ముగిసిఒది. ఉద్యమాల్లో విద్యార్థులపై కేసుల ఎత్తివేత, తుపానులో నష్టపోయిన రైతులకు సాయం.. వంటి రెండు అంశాలతోనే ఈ సమావేశాలు పరిసమాప్తమయ్యాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం రెండురోజులకే పరిమితమైంది. వాయిదా తీర్మానాల్లో దేనికీ చర్చకు అవకాశంరాలేదు.  ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుంది. ఏడాదిలో 52 రోజుల పాటు సభ కొనసాగాల్సి ఉన్నా.. ఈ ఏడాది 42 రోజులకే పరిమితమైంది.

నారా వర్సెస్ నల్లారి ...

చివరిరోజున సభ ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలతో దద్దరిల్లింది. ప్రతి పక్షనేత నారా చంద్రబాబు, సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సీఎంగా నీ సత్తా ఏమిటో తెలిసిందని చంద్రబాబు అంటే... నీకు బీపీ ఎక్కువైంది, స్థాయి తెలుసుకుని మర్యాదగా మాట్లాడు అని సీఎం హెచ్చరించారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించలేక సిగ్గులేకుండా మహారాష్ట్ర తో లాలూచీ పడ్డారని చంద్రబాబు ధ్వజమెత్తగా... తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక బాబ్లీకి వెళ్లావని మంత్రి రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. నీ బాబ్లీ యాత్ర వల్ల రాష్ట్రం రూ. 20 లక్షలు మహారాష్ర్టకు చెల్లించాల్సి వచ్చిందని సీఎం దెప్పిపొడిచారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, పోడియంలో తెలుగుదేశం సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

శ్రీకృష్ణ నివేదిక అనుకూలంగా లేకుంటే సహాయ నిరాకరణ : కోదండరాం

వరంగల్,డిసెంబర్ 16: డిసెంబర్ 31న తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వనట్లయితే.. జనవరి 1 నుంచి సహాయ నిరాకరణ చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. మహాగర్జన సభలో కోదండరాం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏమాత్రం తాత్సారం చేసినా సహాయ నిరాకరణ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని, ఈ మేరకు వారం రోజుల్లో ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో మాట్లాడామన్నారు. బ్రిటిష్ . శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా వస్తుందనే అనుమానాలను కొందరు మిత్రులు వ్యక్తం చేస్తున్నారని, ఈ నివేదిక మనకు అనుకూలంగా వచ్చినా.. రాకపోయినా తెలంగాణ సాధన కోసం ముందుండి పోరాడాల్సిందేనని చెప్పారు.

భారత్-చైనా మధ్య 6 ఒప్పందాలు

  న్యూఢిల్లీ,డిసెంబర్ 16: 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ , చైనాదేశాలు నిర్ణయించాయి. చైనా ప్రధానమంత్రి వెన్ జియబావో, భారత్ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ల మధ్య జరిగిన భేటీ లో గ్రీన్ టెక్నాలజీ బది లీలో సహకారం, రెండు దేశాల్లోనూ ప్రవహిస్తున్న నదీజలాల సమాచార మార్పిడి, మీడియా, సాంస్కృతిక వారధిలకు సంబంధించిన ఒప్పందాలతో పాటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన మరో 2 ఒప్పందాలను రెండు దేశాలు కుదుర్చుకున్నాయి. వాణిజ్య అసమానతల తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చైనా హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల్లో భారత్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యలను వీలైనంత త్వరగా, శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. 2011ను ఇరుదేశాలు చైనా - ఇండియా ఎక్స్ఛేంజ్ సంవత్సరంగా ప్రకటించాయి. ఇందులో భాగంగా 500మంది భారతీయ యువకులు చైనా పర్యటిస్తారు. ఒక దేశానికి చెందిన డిగ్రీ, డిప్లొమాలకు మరో దేశంలో గుర్తింపునివ్వాలని, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. మాండరిన్ చైనీస్ భాషను సీబీఎస్‌ఈ పాఠశాలల సిలబస్‌లో చేర్చడాన్ని చైనా స్వాగతించింది.                           

భారత్... 136/9

సెంచూరియన్ ,డిసెంబర్ 16:  దక్షిణ్రాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో  136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్‌తో ఆరంభమైన ఇండియన్ టాప్ ఆర్డర్ పతనం చివరిదాకా కొనసాగింది.  గంభీర్ 5, ద్రావిడ్ 14, సచిన్ 36, లక్ష్మణ్ 7, హర్బజన్ సింగ్ 27 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.  ధోని 33, జైదేవ్ ఉనాద్కత్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. బౌలర్ స్టెయితన  పదునైన బంతులతో  మూడు,తన ఇన్నిస్వింగ్‌ర్లతో  మోర్కెల్ నాలుగు వికెట్లు తీశారు.

తెలంగాణా వచ్చి తీరుతుంది: కె.సి.ఆర్. ధీమా

గురువారం వరంగల్ లో తెలంగాణా గర్జన కు హాజరైన జన సందోహం 
వరంగల్,డిసెంబర్ 16: తెలంగాణా ఉద్యమానికి అడ్డుపడేది తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులేనని వరంగల్ జరిగిన మహాగర్జన సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంత లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి, తనని నడిపించిన ఘనత ముమ్మాటికి ప్రజలదేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రాంతవారికి చెప్రాసీ ఉద్యోగం రాకుండా ఫ్రీజోన్ అంశమనే కొత్త నాటకానికి ప్రభుత్వం తెరతీస్తే తాను నిరాహారదీక్ష చేపట్టానని ఆయన తెలిపారు. దీక్ష ఫలితంగా కేంద్రం దిగివచ్చి యాభై నాలుగు సంవత్సరాల పోరాటానికి ఫలితం వస్తే అందుకు సీమాంధ్ర నాయకులు గంట సేపట్లో ఏకమై మరోసారి తెలంగాణకు అడ్డుపడ్డారని ఆయన తెలిపారు. తదనంతర పరిస్థితుల తర్వాత తాను తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకుల్ని కలిసి ఏకం కావాలని కోరానన్నారు. సీమాంధ్ర నాయకులు రాజీనామా చేసినట్లే తెలంగాణ ప్రాంత నాయకులు రాజీనామా చేయాలని కోరితే అందుకు వారు వెనక్కి తగ్గారని, అలాంటి వారిని చవటలూ, దద్దమ్మలు అనకుంటే ఏమనాలి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల రాష్ట్ర గవర్నర్ చేసే వ్యాఖ్యల్ని కేసీఆర్ తప్పుపట్టారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ పారామిలటరీ దళాలను దించి ఉద్యమాన్ని అణిచివేస్తామని అరవిందరావు చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. మహాగర్జనకు వచ్చిన ప్రజా స్పందనను చూసి కేంద్రానికి సరియైన నివేదికిస్తే ఎలాంటి ఇబ్బందులుండవని ఆయన అన్నారు.తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఆశపడకుండా, అధిష్టానానికి బయట పడకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలిచ్చే అభిమానం కన్నా పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు.

ఇంత పెద్ద జన సంద్రాన్ని తాను జీవితంలో చూడలేదని మహాగర్జన  సభలో పాల్గొన్న ఆర్యసమాజ్ ప్రతినిధి, సామాజిక వేత్త  స్వామి అగ్నివేష్‌ అన్నారు. తనది శ్రీకాకుళం జిల్లా అని, అయితే... న్యాయం వైపే మాట్లాDaతానని చెప్పారు. న్యాయం కోసం తెలంగాణకు తెలంగాణ తెచ్చుకుందామని స్వామి అగ్నివేష్‌ పిలుపునిచ్చారు. మహాగర్జన ద్వారా కేంద్రానికి అల్టిమేటం జారీ చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలని మహాగర్జన తీర్మానించిందని ఆయన ప్రకటించారు.

పోటెత్తిన జనం..

 తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిర్వహించిన తెలంగాణ మహాగర్జనకు జనం పోటెత్తారు.మహాగర్జన సభ సందర్భంగా తెలంగాణలోని విద్యాసంస్థలను మూసేశారు. విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించి వరంగల్ కు చేరుకున్నారు. ముంబై, సూరత్, ఔరంగాబాద్ నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఈ సభకు తరలివచ్చారు. తెలంగాణ డెవలప్ మెంట్ తరఫున తెలంగాణ ఎన్నారైలు కూడా సభకు వచ్చారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి 20 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు.

లారా పరుగుల రికార్డ్ ను అధిగమించిన ద్రవిడ్

సెంచూరియన్,డిసెంబర్ 16: మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.  సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌ లో లారా 11, 953 పరుగుల రికార్డ్ ను అధిగమించడం ద్వారా ద్రవిడ్ ఈ ఘనత సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో సచిన్, పాంటింగ్ కొనసాగుతున్నారు.

జగన్ వెంట 'అనంత' ఎం.పి.?

హైదరాబాద్,డిసెంబర్ 16: కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమైన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. కోస్తా జిల్లాల్లో అలజడి సృష్టించిన జగన్ గురువారం రాయలసీమ లో హడావిడి చేశారు. కర్నూలులో కాంగ్రెసు శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూతురు వివాహ విందుకు హాజరైన ఆయన పలువురు కాంగ్రెసు శాసనసభ్యులను కలుసుకున్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో కూడా మంతనాలు జరిపారు. ఆ తర్వాత అనంతపురం వెళ్లి పలువురు నాయకుల కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఆయన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో ఆ పార్టీ నాయకులతో సమావేశమై తాను పెట్టబోయే పార్టీ గురించి మంతనాలు జరిపారు. అనంత వెంకట్రామి రెడ్డి ఇటీవలి దాకా వైయస్ జగన్ కు మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ ఇటీవల ఆయన మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో జగన్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.






                      గురువారం హైదరాబాద్ లో రాజకీయ పార్టీల ప్రతినిథులతో భేటీ అయిన శ్రీకృష్ణ కమిటి 
                                    ముఖ్యమత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన శ్రీకృష్ణ కమిటి   
                 రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైన శ్రీకృష్ణ కమిటి సభ్య కార్యదర్శి దుగ్గల్ 

అందరూ మెచ్చే నివేదికే ఇస్తాం: శ్రీకృష్ణ కమిటి

హైదరాబాద్,డిసెంబర్ 16: శ్రీకృష్ణ కమిటి నివేదిక సిద్ధమైనట్లు సభ్య కార్యదర్శి వీకె. దుగ్గల్ వెల్లడించారు. ఈ నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నామని, ఈ నెలాఖరులోగా దానిని ప్రభుత్వానికి అందిస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో చర్చించి నివేదిక రూపొందించామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటి తుదివిడత రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దుగ్గల్ మాట్లాడారు. తామిచ్చే నివేదిక అందరినీ సంతృప్తి పరుస్తుందనే ఆశిస్తున్నామని, ఇది తమకు సవాల్‌తో కూడుకున్న విషయమని తెలిపారు. తక్కువ వ్యవధిలోనే ఎన్నో విషయాలను ఎంతో ఎకాగ్రతగా పరిశీలించి నివేదిక రూపొందిచామన్నారు. ఈ నివేదిక రూపొందించడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లాంటి అందమైన రాష్ట్రం మరెక్కడా లేదని కితాబిచ్చారు. ఇక్కడ ఉన్నన్ని పర్యాటక ప్రదేశాలను తాము ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు.తామిచ్చే నివేదికలో ఏమున్నప్పటికీ ప్రజలు సంయమనం పాటించాలని శ్రీకృష్ణ కమిటి సభ్యులు విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి ఇదే విషయం చెప్పామన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో వారు చర్చలు జరిపారు. 

Wednesday, December 15, 2010

భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధం

   భారత్, దక్షిణాఫ్రికా  కెప్టెన్లు ధోనీ-స్మిత్    
సెంచూరియన్ ,డిసెంబర్ 15: భారత్, దక్షిణాఫ్రికా  టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సెంచూరియన్‌లో  గురువారం మొదలయ్యే తొలి టెస్టుకు  ఓ వైపు గాయాలు... మరో వైపు వాతావరణ పరిస్థితులు భారత్‌ను ఆందోళనలోకి నెడుతున్నాయి.తొలి మ్యాచ్ సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరగనుంది. బౌన్స్ ఎక్కువగా ఉండే వికెట్‌ను తయారు చేశారు. వాతావరణం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలమే అయినా... రెండు రోజులుగా ఆకస్మిక వర్షాలు ముంచెత్తాయి. 1991లో దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించింది. భారత - దక్షిణాఫ్రికా దేశాల మధ్య తొలిసారిగా టెస్ట్మ్యాచ్‌ 1992లో జరిగింది. అప్పటినుంచి ఇప్పుటి వరకు రెండు జట్ల మధ్య సఫారీ గడ్డపై మొత్తం 12 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. అందులో దక్షిణాఫ్రికా ఆరు  గెలవగా... భారత్‌ కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. మిగిలిన ఐదు టెస్టులు డ్రాగా ముగిసాయి. భారత్‌ ఇప్పడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాలో ఆ జట్టును ఓడించడటం పెద్ద సవాలే.

ఇండియన్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకున్న సైనా

హైదరాబాద్,డిసెంబర్ 15: నగరంలో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్ చివరి నిమిషంలో తప్పుకుంది. గాయమే ఇందుకు కారణమని చెబుతున్నా... ఇతర కారణాలూ ఉండొచ్చన్న వాదనలు వినపడుతున్నాయి. వాస్తవానికి సైనా ఈ ఏడాది పాల్గొనాల్సిన జాబితాలో ఈ ఇండియన్ ఓపెన్ ( లేదు. అయితే వేదిక హైదరాబాద్‌కు మారటంతో సైనాను తప్పనిసరిగా ఆడించాలని నిర్వాహకులు భావించారు. ఆమె కూడా అంగీకారం తెలిపింది. అయితే సరిగ్గా టోర్నీ ప్రారంభమయ్యే రోజు ఆమె అనూహ్యంగా తప్పుకోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం టోర్నీ ప్రారంభోత్సవం, ఆ తర్వాత మీడియా సమావేశంలో టైటిల్ గెలుస్తానని ఉత్సాహంగా ప్రకటించిన సైనా గాయం ఇప్పుడే బయటపడిందా అనేది సందేహంగా మారింది. టోర్నమెంట్‌నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నందుకు సైనా 250 డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ ఓపెన్‌నుంచి దూరమైన సైనా జనవరి మొదటివారంలో జరిగే సూపర్‌సిరీస్ ఫైనల్స్ లో కూడా పాల్గొనటం లేదు. జనవరి 18 నుంచి జరిగే మలేసియా సూపర్‌సిరీస్‌లో ఆమె బరిలోకి దిగుతుంది.

వెయిట్ లాస్ 'షో' లో 100,000 డాలర్లు గెలుచుకున్న ఎన్నారై

కౌలాలంపూర్,డిసెంబర్ 15: వెయిట్ లాస్ (బరువు తగ్గటం) రియాల్టీ టీవీ సీరిస్ నిర్వహించిన పోటీలో ‘ది బిగ్గెస్ట్ లాసర్ ఆసియా 2’ అవార్డును కౌలాలంపుర్‌లో నివసిస్తున్న భారతీయడు వివేకానందం దేవరాజ్ (24) గెలుచుకున్నట్లు అక్కడి ఒక వార్తా సంస్థ తెలిపింది. దేవరాజ్ దేహబరువు 144 కిలోలు అయితే ఆరు నెలల కాలంలో సగానికి సగం బరువు అంటే 67 కిలోలు తగ్గినట్లు తెలిపింది. ఈ అవార్డు కింద రూ.100,000 డాలర్లు బహుమతిని అందజేసినట్లు అ వార్త సంస్థ పేర్కొంది. మలేషియాలోని ఐఒఐ రిసొర్ట్ సిటీలో ఈ పోటీలు దాదాపు 13 వారాల పాటు జరిగాయి. మలేషియా, హాంకాంగ్, ఇండోనేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి 16 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.

వచ్చేవారమే 'రగడ '

హైదరాబాద్: కింగ్ నాగార్జున హీరోగా కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి యువదర్శకుడు వీరు పోట్ల దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం రగడ డిసెంబరు 23న విడుదలకు సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రగడ' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరు 23నే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని,  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఎంతో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నామని నిర్మాత శివప్రసాద్ రెడ్డి  తెలిపార్. ప్రేక్షకులు, అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్టుగా  డైరెక్టర్ వీరు పోట్ల ఈ చిత్రాన్ని రూపొందించారని,  నాగార్జున తో ' కామాక్షి ' బ్యానర్లో చేసిన ఈ చిత్రం మరో సన్సేషనల్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాత. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అనుష్క, ప్రియమణి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు.
                బుథవారం హైదరాబాద్ లో సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డిని కలసిన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున...
                     పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లో ఆయన విగ్రహానికి సి.ఎం. నివాళి...

చిక్కుల్లో 'స్వాతీ'' !

హైదరాబాద్,డిసెంబర్ 15: లక్షలాది మంది పాఠకుల చేతుల్లో అలంకారంగా ఉంటూ వస్తున్న స్వాతి వారపత్రిక భవిష్యత్తు చిక్కుల్లో పడింది. తన పత్రిక 'స్వాతీ' నే తన ఇంటి పేరుగా మార్చుకుని స్వాతి బలరామ్ గా ప్రసిద్ధుడైన  వేమూరి బలరామ్ కు కుటుంబమే ఎదురు తిరిగింది.  వివిధ వారపత్రికలు రాజ్యమేలుతున్న సమయంలో  వేమూరి బలరామ్ 'స్వాతీని  ప్రారంభించారు.  పోటీని తట్టుకుని  వార పత్రిక అంటే స్వాతి ఒక్కటే అన్నంతగా తీర్చిదిద్దారు. అలాంటి పత్రిక  ఆస్తి తగాదాల వల్ల ఈరోజు చిక్కుల్లో పడింది. స్వాతి కార్యాలయాన్ని ఇటీవల అల్లుడి సహాయంతో బలరామ్ కూతురు, భార్య స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సహకారంతో వారు బలరామ్ లేని సమయం చూసి స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. తన కార్యాలయం స్వాధీనంపై వేమూరి బలరామ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తన అల్లుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వేమూరి బలరామ్ అల్లుడు అనిల్ కుమార్ ఆదాయం పన్ను శాఖలో అదనపు కమిషనర్ గా పనిచేస్తున్నారు. తన అధికారాన్ని వినియోగించి అనిల్ కుమార్ విజయవాడ నగర పోలీసు కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారని, దీంతో పోలీసు కమిషనర్ తన భార్యకు, కూతురుకు అనుకూలంగా వ్యవహరించారని వేమూరి బలరామ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన అభ్యంతరం చెప్పారు. తమ వ్యవహారంలో పోలీసుల జోక్యాన్ని నివారించాలని ఆయన హైకోర్టు అభ్యర్థించారు. తనను తన కార్యాలయంలో ప్రవేశించడానికి అనుమతించాలని కూడా ఆయన కోరారు. తన కార్యాలయం నుంచి భార్య, అల్లుడు, కూతురు తీసికెళ్లిన కీలక పత్రాలను తనకు తిరిగి ఇప్పించాలని ఆయన కోరారు.
                           భారత్ లో మూడు రోజుల పర్యటనకై ఢిల్లీ చేరుకున్న చైనా ప్రథాని జియాబావో.

రోడ్డు ప్రమాదాలలో 14 మంది మృతి

హైదరాబాద్,డిసెంబర్ 15:  రాష్ట్రంలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో  14 మంది మరణించారు.  ఖమ్మం జిల్లా అశ్వాపురంవద్ద లారీ-ఆటో ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు.  కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం కరువల్లి సమీపంలో బస్సు-ఆటో ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ పటమట జేడీ టవర్స్ వద్ద లారీ- ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ అల్కాపురి కూడలి వద్ద లారీ కిందపడి నాలుగో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

కాంగ్రెస్ కు జక్కంపూడి రాజినామా...

హైదరాబాద్,డిసెంబర్ 15: తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామమోహనరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య, ఎఐసిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కూడా రాజీనామా చేశారు.  ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ, పార్టీతో తనకు ఉన్న 30 ఏళ్ల అనుబంధం తెగిపోయిందని అన్నారు. తామంతా  జగన్మోహన రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి పర్యటనలో భాగంగా  తూర్పు గోదావరి జిల్లా కడియం సెంటర్లో జరిగిన సభలో వారు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా  జగన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.


Tuesday, December 14, 2010

కేంద్ర సమాచార కమిషన్‌ నూతన కమిషనర్‌గా సత్యానంద్‌ మిశ్రా

న్యూఢిల్లీ,డిసెంబర్ 14: కేంద్ర సమాచార కమిషన్‌  నూతన కమిషనర్‌గా సత్యానంద్‌ మిశ్రాను నియమించనున్నారు. ఈమేరకు ప్రధానమంత్రి మన్మోహన్‌ న్యాయ శాఖమంత్రి వీరప్పమొయిలీ, ప్రతిపక్షనేత సుష్మస్వరాజ్‌ పాల్గొన్న సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత కమీషనర్‌ ఎ.ఎన్‌.తివారీ పదవీకాలం ఈ నెల 19న ముగియనున్నది. 1973 ఐఏఎస్‌ బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 61ఏళ్ల మిశ్రా గతంలో సిబ్బంది శిక్షణ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు.

రెహమాన్‌కు ‘గోల్డెన్ గ్లోబ్’ నామినేషన్

లాస్ ఏంజెలిస్,డిసెంబర్ 14: ‘ఆస్కార్’ ఘనత సాధించిన భారతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్‌కు ‘గోల్డెన్ గ్లోబ్’ నామినేషన్ దక్కింది. డానీ బోయల్ రూపొందించిన ‘127 అవర్స్’ చిత్రానికి అందించిన సంగీతానికి ఈ గుర్తింపు లభించింది. ఉత్తమ స్వరకల్పన విభాగంలో రెహమాన్ ‘గోల్డెన్ గ్లోబ్’ నామినేషన్ పొందడం ఇది వరుసగా రెండోసారి. గత ఏడాది ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికి అందించిన స్వరకల్పనకు ‘గోల్డెన్ గ్లోబ్’ నామినేషన్ లభించింది. ‘ది కింగ్స్ స్పీచ్’ స్వరకర్త అలెగ్జాండర్ డెస్‌ప్లాట్, ‘అలైస్ ఇన్ వండర్‌లాండ్’ సంగీత దర్శకుడు డానీ ఎల్ఫ్‌మాన్, ‘ది సోషల్ నెట్‌వర్క్’ సంగీత దర్శకద్వయం ట్రెంట్ రెజ్నర్, అటికస్ రాస్‌లు కూడా ఈసారి ‘గోల్డెన్ గ్లోబ్’ నామినేషన్ పొందిన వారిలో ఉన్నారు.

హైదరాబాద్ లో పెరిగిన ఆటో రేట్లు

హైదరాబాద్,డిసెంబర్ 14: నగరంలో ఆటోల  మీటర్ చార్జీలు పెరిగాయి.  ఇప్పుడున్న కనీస మీటర్ చార్జీ రెండు రూపాయలు పెరగగా, కిలోమీటర్‌కు రూపాయి చొప్పున పెరిగింది. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆటోరిక్షా కార్మిక సంఘాలు మంగళవారం సాయంత్రం రెండు దఫాలుగా జరిపిన చర్చలలో ఈ మేరకు అంగీకార ం క్దిరింది.  కనీస చార్జీ ప్రస్తుతం రూ.12 ఉండగా, దానిని రూ.14కు పెంచారు. అలాగే ప్రతీ కిలోమీటర్‌కు ఇప్పుడు రూ.7 ఉండగా, దానిని రూ.8 కి పెంచడంతో పాటు వెయింటింగ్ ఛార్జీని నిమిషానికి 10 పైసల నుంచి 25 పైసలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

రైతు సమస్యలపై వేడెక్కిన రాష్ట్ర రాజకీయం...

హైదరాబాద్,డిసెంబర్ 14:  రైతు సమస్యలపై రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.రైతు సమస్యల పరిస్కారం కోరుతూ, 17 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చే స్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, 21, 22 తేదీలలో  విజయవాడలో లక్ష మందితో దీక్షకు దిగుతానని మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఎచ్చరించీ విషయం తెలిసిందే. ఈ దశలో      ముఖ్యమమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 1000కోట్ల రూపాయల ప్యాకేజీని కోరగా,  కేంద్రం రూ.500 కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. రంగు వెలిసిన, తడిసిన ధాన్యం కొనేందుకు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) కొంత  మేర నిబంధనలను  సడలించే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత ప్రత్తి సమాఖ్య(సిసిఐ) కూడా పత్తి కొనుగోలుపై ఉదారంగా వ్యవహరించనుంది. రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగించాలని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పోన్ చేసి రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం..

జగన్ వెంట అనపర్తి ఎమ్మెల్యే...

హైదరాబాద్,డిసెంబర్ 14:  జగన్ వెంట పరుగెడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలను సముదాయించడం పెద్ద తలనొప్పిగా  మారింది. బందరు ఎమ్మెల్యే పేర్ని నానీని ఏదో విధంగా బుజ్జగించి తమ దారిలోకి తెచ్చుకునేలోపు తూర్పుగోదావరి నుంచి అనపర్తి  ఎమ్మెల్యే   శేషారెడ్డి తయారయ్యారు. కార్యకర్తల అభీష్టం మేరకు తాను వైఎస్ జగన్ యాత్రలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని వద్దని చెప్పినా... వెళ్లకుండా ఉండటం తన వల్ల కాదని శేషారెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదిలావుంటే ఇంకా తూర్పుగోదావరిలో జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆది నుంచి జగన్ కుడిభుజంలా ఉంటూ మంత్రి పదవిని సైతం వద్దని చెప్పిన మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యనాయకులతో కీలక మంతనాలు సాగిస్తున్నారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...