Thursday, March 31, 2011

సచిన్ వర్సెస్ ముత్తయ్య మురళీథరన్ వీడ్కోలు పోరు !

ముంబై,మార్చి 31: ప్రపంచ క్రికెట్‌లో బ్యాటింగ్‌లో సచిన్ టెండూల్కర్ దిగ్గజమైతే, బౌలింగులో అంతే కీర్తిని లంక బౌలర్ మురళీథరన్ కూడగట్టుకున్నాడు. సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన అటగాడిగా రికార్డు సృష్టించాడు. బ్యాటింగులో దాదాపుగా అన్ని రికార్డులూ బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 464 పరుగులు చేశాడు. శ్రీలంక ఆటగాడు దిల్షాన్ మాత్రమే అతని కన్నా ఎక్కువ 467 పరుగులు చేశాడు.మురళీథరన్ టెస్టు మ్యాచుల్లో 800 వికెట్లు , వన్డే మ్యాచుల్లో 534 వికెట్లు తీసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా మురళీథరన్ చరిత్ర సృష్టించాడు.ముంబైలో శనివారంనాడు ఈ రెండు జట్ల మధ్య  ఫైనల్స్  సందర్భంగా  ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంటోంది. సచిన్ టెండూల్కర్ కోసం భారత్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవాలనే పట్టుదలతో ఉండగా, మురళీథరన్ కోసం ఫైనల్లో విజయం సాధించాలనే దీక్షతో శ్రీలంక ఉంది. వచ్చే నెలలో 38వ ఏట  అడుగిడుతున్న  సచిన్ మరో ప్రపంచ కప్ పోటీలో ఆడే అవకాశాలు లేవు.  అలాగేవచ్చే నెలలోనే మురళీథరన్ 39 ఏళ్ల వయస్సుకు చేరుకుంటున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి శనివారంనాడే మురళీథరన్ తప్పుకుంటున్నారు.

ముంబై చేరుకున్న థోనీ సేన

ముంబై,మార్చి 31 :  ‘హై ఓల్జేజ్’ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయోత్సాహంతో  భారత క్రికెట్ జట్టు ముంబై నగరానికి చేరుకుంది. మొహాలీ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో భారత జట్టు ముంబై బయలుదేరగా, పరాజయ భారంతో పాకిస్థాన్ జట్టు లాహోర్‌కు ప్రయాణమైంది. శనివారం   జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో భారత్ తలపడనుంది. భారత జట్టు బస చేయనున్న హోటల్ బయట అభిమానులు పెద్ద ఎత్తున చేరారు.  కాగా, చేతి వేలి గాయంతో భారత బౌలర్ ఆశిష్ నెహ్రా  శ్రీలంకతో జరగనున్న  ఫైనల్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో గురువారం జరిగిన సెమీస్‌లో నెహ్రా చేతి వేలికి గాయమయింది.
ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్రపతులు...
ప్రపంచకప్  ఫైనల్ మ్యాచ్‌ను భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్, శ్రీలంక అధ్యక్షులు మహేంద్ర రాజపక్స వీక్షించనున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు కొలంబో నుంచి రాజపక్స, న్యూఢిల్లీ నుంచి పాటిల్ ముంబైకు చేరుకుంటారని రాష్టప్రతి భవన్ అధికారులు ధృవీకరించారు. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న ముత్తయ్య మురళీధరన్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమంలో రాజపక్స పాల్గొంటారని శ్రీలంక ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. 

121 కోట్లకు చేరిన భారత జనాభా

న్యూఢిల్లీ,మార్చి 31 : 2011 జనాభా లెక్కల వివరాలను కేంద్ర0 గురువారం ఇక్కడ అధికారికంగా విడుదల చేసింది.  తాజా గణాంకాల ప్రకారం  భారత జనాభా 121 కోట్లుకు చేరింది. గత పదేళ్లలో దేశ జనాభా 18 కోట్లుకు పెరిగింది. పురుషులు 62 కోట్లు, మహిళలు 58కోట్లు వున్నారు.  పురుషులు 17 శాతం, స్ర్తీలు 18 శాతం పెరిగారు. 2001 తర్వాత మళ్లీ పదేళ్లకు ఈ ఏడాది పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను సేకరించిఇంది. కాగా అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా, నాగాలాండ్‌లో జనాభా శాతం తగ్గింది.  కాగా, ఆంధ్రప్రదేశ్ జనాభా (8,46,65,533) 8 కోట్ల 46 లక్షలకు చేరుకుంది.

Wednesday, March 30, 2011

భళా...టీమిండియా...

పాక్ పై గెలుపు..ఇక లంకతో తుది పోరు

మొహాలీ, మార్చి 30: కోట్లాదిమంది భారతీయుల ఆశలను వమ్ము చేయకుండా టీమిండియా వరల్డ్ కప్ సెమీస్ లో పాకిస్తాన్ ను 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్ కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 వోవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత జట్టులో అత్యధికంగా సచిన్ 85 పరుగులు సాధించగా, ఇతర ఆటగాళ్లలో సెహ్వాగ్ 38, గంభీర్ 27, ధోని 25, హర్భజన్ 12 పరుగులు చేశారు. రైనా 34, నెహ్రా 1పరుగుతో నాటౌట్‌గా మిగిలారు. పాక్ బౌలర్లలో వహబ్ రియాజ్ 5, అజ్మల్ 2, హ ఫీజ్ 1 వికెట్ పడగొట్టారు.మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 95వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ 20.2 ఓవర్‌లో ఆఫ్రీది వేసిన రెండవ బంతికి బంతికి సచిన్ బౌండరీని సాధించగానే వన్డేలో 95 అర్ధ సెంచరీ పూర్తి అయింది. ప్రపంచకప్‌లో సచిన్‌కు ఇది 15 హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో తొలి ఫోర్ కొట్టిన సెహ్వాగ్ పాకిస్థాన్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 261 పరుగుల విజయలక్ష్యం తో బరిలోకి దిగిన పాక్ 49.5 ఓవర్లలో 231పరుగులకు ఆలవుట్ అయింది. మిస్బా-ఉల్-హక్ 56 (నాటౌట్) హఫీజ్ 43, షఫీక్ 30 పరుగులు మినహా ఇతర బ్యాట్స్ మెన్లెవరూ రాణించలేదు. మునాఫ్ పటేల్. యువరాజ్, హర్భజన్,నెహ్రా,జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అతిరథ మహారథుల సాక్షిగా రెండు దేశాల ప్రధానుల సమక్షంలో ఇరుదేశాల్లోనూ కలిపి 150 కోట్ల మంది ప్రేక్షకులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను తిలకించారు. ఏప్రిల్ రెండున జరిగే ఫైనల్స్ లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది.
క్రికెటర్లకు బెస్ట్ అఫ్ లక్ చెబుతున్న భారత్-పాక్ ప్రధానులు మన్మోహన్,యూసుఫ్ రజా గిలాని
                                      భారత్-పాక్ సెమీస్ మ్యాచ్ ను వీక్షిస్తున్న అతిరథమహారథులు...


అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహూజాకి ఏడేళ్ల జైలు

ముంబై, మార్చి 30: పనిమనిషిపై అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహూజాకి ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కేసుపై కోర్టు రహస్య విచారణ జరిపింది. పని మనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన అహుజాను పోలీసులు 2009 జూన్‌లో అరెస్టు చేశారు. అహుజాకు 2009 నవంబర్‌లో బొంబాయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. కాగా, తన భర్త అమాయకుడని అహుజా భార్య వాదిస్తూ వస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చినా అహుజాకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అతనితో నటించడానికి చాలా మంది తారలు నిరాకరిస్తూ వచ్చారు. తీర్పు విన్నాక షైనీ కంట నీరు పెట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.



మే 8న కడప , పులివెందుల ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ,మార్చి 30: కడప లోక్ సభ స్థానానికి, పులివెందుల శాసనసభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేసి, 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. మే 8న పోలింగ్ జరుగుతుంది. 13న ఓట్లను లెక్కిస్తారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.

మంత్రి పదవికి వైఎస్ వివేకా రాజీనామా :  ముఖ్యమంత్రి తిరస్కృతి

హైదరాబాద్ : వ్యవసాయ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తమ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడఒతో వివేకానందరెడ్డి మంత్రిపదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన పులివెందుల నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం వుంది.  కాగా వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరస్కరించారు.  వివేకానందరెడ్డి మంత్రి పదవిలో కొనసాగుతారని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా  పదవీ కాలం ముగియటంతో వివేకా రాజీనామా చేశారని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

నూతనప్రసాద్ ఇక లేరు

హైదరాబాద్,మార్చి 30  : ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్ బుధవారం ఉదయం కన్నుమూశారు.  ఆయన వయసు 66 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగామృతి చెందారు.  అందాలరాముడు సినిమాతో నూతనప్రసాద్ సినీరంగ ప్రవేశం చేశారు. ‘అస్సలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’...., ‘నూటొక్క జిల్లాలకు అందగాడ్ని’ అనే డైలాగులతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 1989లో ‘బామ్మమాట బంగారుబాట’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన నూతనప్రసాద్ అప్పటినుంచి వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. 1984లో ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు, 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతనప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. నూతన్ ప్రసాద్ దహన సంస్కారాలు ఎర్రగడ్డ స్మశానవాటికలో నిర్వహించారు. నూతన ప్రసాద్ ఇంటి నుంచి స్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. బంధువులు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Tuesday, March 29, 2011

దాయాదుల పోరుకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ,మార్చి 29:  దాయాదుల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న క్రికెట్ పోరుకు మొహాలీ స్టేడియం వేదిక కానుంది.  ఆటను చూడటానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీతో పాటు పలువురు వివిఐపిలు సిద్ధంగా ఉన్నారు. ఇరు జట్లు అద్భుత పటిమ కనబరుస్తూ సెమీ ఫైనల్‌కు వచ్చి కప్పు కోసం అమీ తుమీకి సిద్ధమయ్యాయి. కాగా,  ఈ ఆటలో భారత్‌తో పాటు పాక్ జట్టుపై కూడా ఒత్తిడి వున్నట్టు  కనబడుతోంది.   సొంత గడ్డపై ఆడటం, ప్రధాని, సోనియా వంటి హేమాహేమీలు మ్యాచ్ చూడటం తదితర అంశాలు భారత్‌ను ఒత్తిడికి గురి చేస్తే, ఫిక్సింగ్ హెచ్చరికలు పాక్‌ను  ఒత్తిడికి గురి చేసే అంశం.  ఈ దశలో భారత కెప్టెన్ ధోని తన సహచరులకు ఒత్తిడికి గురి కావద్దని సూచనలు చేస్తున్నారు. మ్యాచ్‌ను కూడా ఎక్కువగా ఊహించుకోవద్దని ధోనీ సూచనలు ఇచ్చారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన బ్యాట్ బరువు కూడా పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. బరువైన బ్యాట్‌తో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి సచిన్ సిద్ధమయ్యారు. గ్రూప్ దశలో భారత్ ఒక మ్యాచ్‌లో ఓడిపోయి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకొని సెమీస్‌లోకి ప్రవేశించినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. అయితే ధీటైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో  ఆడిన మ్యాచ్‌లో మాత్రం భారత క్రికెటర్లు  సమష్టిగా రాణించి విజయం సాధించారు. ఆసీస్‌పై సమిష్టి విజయం, యువరాజ్ సింగ్ ఫాంలోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశాలు. అయితే బౌలింగ్‌లో ఆసీస్ మ్యాచ్‌లో తప్ప మొదటి నుండి జహీర్ తప్ప మిగిలిన ఫేసర్లు ఎవరూ అతనికి తోడ్పాటు ఇవ్వడం లేదు. గ్రూపు దశలో దక్షిణాఫ్రికాతో ఓటమి చెందిన భారత్ ఓ దశలో అందరి అంచనాలలోనుండి తొలగిపోయిన పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆసీస్‌పై గెలుపుతో అవే అంచనాలు భారీగా పెంచుకుంది. బ్యాటింగ్ ఆర్డర్ భారత్‌కు బలంగానే ఉన్నప్పటికీ ఒక్క వికెట్ కోల్పోతే క్యూలైన్ కట్టడమే భారత్‌ను భయపెడుతున్న అంశం. ఆసీస్ మ్యాచ్ మాత్రం అందుకు మినహాయింపు. ఇదే మనకు ఊరట. అటు పాక్ లో తన భుజ బలంతో పాటు బుర్రతో బౌలింగ్ చేసే ఉమర్ గుల్ భారత  బ్యాట్స్ మెన్లను  కట్టడి  చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే పాక్ కెప్టెన్ అఫ్రిదీ సచిన్‌ను  సెంచరీలు చేయకుండా అడ్డుకుంటామని చెప్పి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఒకప్పుడు  సచిన్ వర్సెస్ అక్తర్ పోరు ఇప్పుడు సచిన్ వర్సెస్ ఉమర్ గుల్ మధ్య సాగనుంది.  

ఇండో-పాక్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ కు అభిమానుల కోలాహలం...

ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక

కొలంబో,మార్చి 29:  ప్రపంచకప్ టైటిల్ పోరుకు శ్రీలంక సిద్ధమయింది. మంగళవారమిక్కడ జరిగిన సెమీస్‌లో న్యూజిలాండ్‌పై నెగ్గి లంక ఫైనల్లో ప్రవేశించింది.   బుధవారం,  భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్‌లో విజేతగా నిలిచిన జట్టుతో లంక ఫైనల్లో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 2న జరుగుతుంది. వరుసగా రెండోసారి, ఇప్పటివరకు  మూడుసార్లు శ్రీలంక ఫైనల్లోకి ప్రవేశించింది. కివీస్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దిల్షాన్(73), సంగక్కర(54) అర్థ సెంచరీలతో రాణించారు. తరంగ 30, చమరసిల్వా 13, సమరవీర 23, మాథ్యూస్ 14 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సౌతీ 3 వికెట్లు పడగొట్టాడు. వెటోరి, మెకే చెరో వికెట్ తీశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 48.5 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటయింది. కివీస్  వరల్డ్ కప్  సెమీస్ వరకు వచ్చి  వెనుదిరగడం ఇది ఆరోసారి.  

ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్,మార్చి 29: : శాసనసభ బడ్జెట్  సమావేశాలు ముగిశాయి. శాసనసభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు మంగళవారం రాత్రి  రాత్రి 8 గంటల సమయంలో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చివరి రోజున  సభలో ప్రభుత్వ భూమి కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చజరిగింది.హైదరాబాద్: భూ కేటాయింపులపై సభాసంఘం వేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి   అంగీకరించారు. ప్రభుత్వం వివిధ సంస్థలకు భూములు కేటాయించడంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఎంఐఎం సభ్యునితోపాటు ప్రతిపక్షాలు ఆరోపించాయి. భూ కేటాయింపులపై సభాసంఘం వేయాలని కోరారు. ఒక పరిమితికిలోబడి భూముల కేటాయింపులపై సభాసంఘం వేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.  సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే విపక్షాల నిరసన మధ్య శాసనసభ అరగంటపాటు వాయిదా పడింది. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో మంత్రి గీతారెడ్డి, ఉప సభపతి వారించినా ఫలితం లేకపోయింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని కోరినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీని అరగంటపాటు వాయిదా వేశారు.ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం సభలో భూకేటాయింపులపై చర్చ ప్రారంభం అయ్యింది. కాగా హసన్ అలీ లింకులపై చర్చించాలంటూ వైఎస్ జగన్ వర్గ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.  హసన్ అలీ పేర్కొన్న ఆ నేత పేరు బయటపెట్టాలని వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దాంతో డిప్యూటీ స్పీకర్ దీనిపై చర్చించేందుకు అవకాశం ఇస్తామని, సభ జరిగేందుకు సహకరించాలని ఎమ్మెల్యేలను కోరారు. 

Thursday, March 24, 2011

శిరీష్ భరద్వాజ్‌కు బెయిల్ నిరాకరణ

హైదరాబాద్,మార్చి 24:   చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది. అతడి తల్లి సూర్యమంగళకు మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరకట్నం కోసం వేధిస్తున్నారని శిరీష్ భార్య, చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఈనెల 14న కేసు పెట్టారు. అప్పటినుంచి శిరీష్, అతడి తల్లి కనిపించకుండా పోయారు. ముందస్తు బెయిల్ కోసం శిరీష్ పెట్టుకున్న అభ్యర్థనను 8వ అడిషినల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో శిరీష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.   

అసీస్ ను కొట్టాం...ఇక పాక్ తో ఢీ...

అహ్మదాబాద్,మార్చి 24: : అసీస్ తో క్వార్టర్ ఫైనల్స్ కష్టమే అన్న భయాలను చెదరగొట్టి కోట్లాది మంది భారతీయుల కొండంత నమ్మకాన్ని నిలబెట్టి.. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురయిన పరాభవానికి ప్రతీకారాన్ని తీర్చుకొని.. ఏ ఒక్కరిపై ఆధారపడకుండా, సమిష్టిగా రాణించి టీమిండియా డ్రీమ్‌కప్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సర్వశక్తులు ఒడ్డి... వరసగా విశ్వవిజేతగా నిలుస్తున్న అసీస్ ను ఆదరగొట్టి  ఇంటిముఖం పట్టించింది. అసాధారణ మ్యాచ్‌లో అద్వితీయ ప్రతిభతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. అసీస్ తన ముందుంచిన 161 పరుగుల విజయ లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టంతో చేదించింది. సచిన్, గంభిర్ ల  అర్థ సెంచరీలకు యువరాజు అజేయ అర్థ సెంచరీ,  రైనా దూకుడు షాట్లు కలసి భారత్ కు  అపూర్వ  విజయాన్ని అందించాయి.  ఇక సెమిస్‌లో చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్తాన్ ను ఢీ కొనబొతోంది.   కాగా, భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన క్రీడాజీవితంలో మరో మైలు రాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 18 వేల పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో  క్వార్టర్ ఫైనల్లో మాస్టర్ ఈ ఫీట్ పూర్తి చేశాడు. వక్తిగత స్కోరు 45 పరుగుల వద్ద అతడీ రికార్డు సృష్టించాడు. 451 వన్డే ఆడుతున్న సచిన్ ఆసీస్ బౌలర్ బ్రెట్‌లీ వేసిన 14వ ఓవర్‌లో సింగిల్ తీయడం ద్వారా 18 వేలు పరుగులు పూర్తి చేయగానే మొతేరాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానం చప్పట్లు, కేరింతలతో మారుమోగింది. 


Wednesday, March 23, 2011

ప్రపంచకప్ సెమీఫైనల్లో పాకిస్థాన్

 మిర్పూర్  ,మార్చి 23 :  పాకిస్థాన్ వరుసగా ఐదోసారి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారమిక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్‌పై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని పాక్ 20.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. అక్మాల్ 47, హఫీజ్ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సెమీస్‌లో భారత్ లేదా ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ ఓటమితో  వెస్టిండీస్ ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 112 పరుగులకు ఆలౌటయింది. వెస్టిండీస్‌పై విజయం సాధించి సెమీఫైనల్ చేరుకోవడంతో పాకిస్థాన్‌లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రపంచకప్‌లో సాధించిన విజయానికి మాజీ అధ్యక్షులు ముష్రాఫ్ జట్టుకు అభినందనలు తెలిపారు. జాతి గర్వపడే విజయాన్ని సాధించారని ముఫ్రాఫ్ అభినందనలు కురిపించారు. పాకిస్థాన్ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడానికి ప్రపంచకప్‌ను గెలువాల్సిన అవసరముందని మాజీ కెప్టెన్, పాక్ రాజకీయవేత్త ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. తమ జట్టు ప్రపంచకప్‌ను గెలుస్తుందన్న ఆశాభావాన్ని ఇమ్రాన్ వ్యక్తం చేశారు. వృద్ధులు, కుటుంబాలు, యువతి, యువకులు రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేశారు. వెస్టిండీస్‌పై విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే ఆకాశంలో టపాసులు పేల్చి ఆనందంతో ఆడిపాడారు. గత కొద్ది సంవత్సరాలుగా పాకిస్థాన్ క్రికెట్ వివాదస్పదమౌతుండటంతో నిరాశకు లోనైన అభిమానులు ఈ విజయంతో ఊరట చెందారు. యువకులు వీధుల్లోకి వచ్చి టీషర్టులను గాలిలో ఊపుతూ బాంగ్రా నృత్యానికి అనుగుణంగా స్టెప్పులు వేశారు.

ఎలిజబెత్ టేలర్ కన్నుమూత

లాస్‌ఏంజెలెస్ ,మార్చి 23 :  హాలీవుడ్ సీనియర్ నటి ఎలిజబెత్ టేలర్ (79) బుధవారం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 20 శతాబ్దపు మేటి నటుల్లో ఒకరిగా పేరు గాంచిన టేలర్ రెండు సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్నారు.  నేషనల్ వెల్వెట్, క్లియోపాత్ర, హూజ్ ఎఫ్‌రైడ్ ఆఫ్ వర్జినీయా వూల్ఫ్? లాంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. తన ఏడుగురు భర్తల్లో ఒకరయిన రిచర్డ్ బర్టన్‌తో సమానంగా ఇమేజ్ సంపాదించారు. 1950-60 దశకంలో హాలీవుడ్‌లో ఆమె ఒక వెలుగు వెలిగారు. 

జగన్ వర్గానికి తొలి విజయం

' స్థానిక ' ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 సీట్లు... 
హైదరాబాద్,మార్చి 23 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన రెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్ధులు విజయం సాధించారు. వైఎస్ఆర్ జిల్లాతోపాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా జగన్ వర్గం అభ్యర్థులే గెలవడం విశేషం.  మొత్తం తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరుగగా జగన్ వర్గం మూడు, కాంగ్రెస్ పార్టీ మూడు, టీడీపీ మూడు స్థానాలను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనకున్న ఆరు స్థానాలలో మూడు స్థానాలను కోల్పోయింది. గెలుపొందిన అభ్యర్థుల వివరాలు : వైఎస్ఆర్ జిల్లా : నారాయణ రెడ్డి (జగన్ వర్గం). చిత్తూరు : దేశాయ్ తిప్పారెడ్డి (జగన్ వర్గం), పశ్చిమ గోదావరి : మేకా శేషుబాబు (జగన్ వర్గం),
నెల్లూరు : వాకాటి నారాయణరెడ్డి (కాంగ్రెస్), కర్నూలు : ఎస్వీ మోహన్‌రెడ్డి (కాంగ్రెస్),శ్రీకాకుళం : విశ్వ ప్రసాద్ (కాంగ్రెస్), తూర్పుగోదావరి : బొడ్డు భాస్కర రామారావు (టీడీపీ), అనంతపురం : మెట్టు గోవింద్‌రెడ్డి (టీడీపీ),పశ్చిమ గోదావరి : అంగర రామ్మోహన్‌రావు (టీడీపీ).

Tuesday, March 22, 2011

కాంగ్రెస్ - టీఆర్‌ఎస్ విలీనం వార్తలను ఖండించిన కేసీఆర్

హైదరాబాద్,మార్చి 22 : కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీన వార్తలను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అవుతోందని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దంటూ కేసీఆర్ మీడియా విజ్ఞప్తి చేశారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జూన్‌లో ప్రకటన చేస్తామని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు హామీ ఇచ్చినట్లు అంతకుముందు వార్తలు వచ్చాయి. సోనియా ఇచ్చిన హామీపై పార్టీలో విస్తృతమైన చర్చ జరిగినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కూడా సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. 


దీక్ష విరమించిన రాఘవులు

హైదరాబాద్,మార్చి 22:  ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు గత ఆరు రోజులుగా  జరుపుతున్న నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ప్రభుత్వం తరపున మంత్రులు పితాని సత్యనారాయణ, పసుపులేని బాలరాజు ఇచ్చిన హామీతో ఆయన మంగళవారం మధ్యాహ్నాం దీక్షను విరమిస్తున్నట్లు వెల్లడించారు.  ఆరోగ్యం క్షీణించటంతో ఆయనను రెండురోజుల  క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో కూడ దీక్ష కొనసాగించిన రాఘవులు తో ప్రభుత్వం  రెండు విడతలుగా జరిపిన చర్చల అనంతరం ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ మంత్రులు హామీలు మాత్రమే ఇచ్చారని, దీంతో అన్ని సమస్యలు పరిష్కారమైనట్లు కాదని అన్నారు. తమ ఉద్యమం కొంతమేర విజయవంతం అయిందని ఆయన అన్నారు. సమస్యలపై మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యమం ఒక అడుగు ముందుకు వేసిందన్నారు. 

Monday, March 21, 2011

' తీన్ మార్ ' లో పవన్ కళ్యాణ్

తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చిరు

న్యూఢిల్లీ,మార్చి 21:   ఏప్రిల్ మూడో వారంలో కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ విలీన సభ నిర్వహించనున్నట్లు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. తమిళనాడులో ఎన్నికల తరువాత విలీన సభ నిర్వహించడం మంచిదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్'ఛార్జి గులామ్'నబీ అజాద్ సూచన చేసినట్లు ఆయన తెలిపారు. విలీన సభకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే అవకాశం ఉందన్నారు.ఏప్రిల్ 11వ తేదీలోపల తాను తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చిరంజీవి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచనల మేరకే తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేశారని ఆయన చెప్పారు. తమిళనాడులో ప్రతి ఒక్కరికీ తాను తెలుసని చెప్పారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తనను పంపించే అవకాశాలు ఉన్నాయన్నారు.  అంతటా ప్రచారం చేయమన్నా తాను సిద్ధమని చెప్పారు. తమిళనాడులో కాంగ్రెసు నేతగా ప్రచారం చేస్తానని చెప్పారు.

కాంగ్రెస్ , తృణమూల్ సీట్ల సర్ధుబాటు

కోల్'కతా,మార్చి 21:   పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య శాసనసభ ఎన్నికల సీట్ల సర్ధుబాటు కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు కేటాయించడానికి తృణమూల్ అధినేత మమతా బెనర్జీ అంగీకరించారు. 229 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది.  కాంగ్రెస్ మొదట 90 సీట్లకు డిమాండ్ చేసింది. అయితే మమతా బెనర్జీ అంగీకరించలేదు. సోమవారం నాడు సోనియాతో ఈ అంశపై చర్చించిన తర్వాత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ టెలిఫోన్ లో మమతా బెనర్జీ తో మాట్లాడి 65 సీట్లకు ఒప్పందం ఖరారు చేశారు.        

610 జిఓ అమలుకు ప్రత్యేక కమిటీ

హైదరాబాద్,మార్చి 21: ఉద్యోగ నియామకాలలో తెలంగాణ ప్రాంత అభ్యర్థుల వాటాకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నలుగురు సభ్యులతో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. 610 జిఓ నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసితో కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

బాలీవుడ్ నటుడు బాబ్ క్రిస్టో మృతి

బెంగళూరు,మార్చి 21: : బాలీవుడ్ నటుడు, విలన్ బాబ్ క్రిస్టో గుండెపోటుతో ఆదివారం బెంగళూరులో మరణించారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. జన్మత ఆస్ట్రేలియాకు చెందిన బాబ్‌క్రిస్టో తొలిసారిగా బాలీవుడ్ నటుడు సంజయ్ ఖాన్ నిర్మించిన అబ్దుల్లా చిత్రం ద్వారా1980 సంవత్సరంలో హిందీ చిత్రసీమకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఖుర్భానీ, సర్ఫరోష్, కిస్మత్, గుమ్‌రాహ్, రూప్ కి రాణి చోరోంకా రాజా, అగ్నిపత్, మిస్టర్ ఇండియా చిత్రాలతోపాటు దాదాపు 200 చిత్రాల్లో నటించారు. గత కొద్దికాలంగా చిత్రసీమకు దూరమయ్యారు. ఆయన బెంగళూరులో స్థిర నివాసమేర్పరుచుకున్నారు. 

లిబియాపై దాడుల్లో 64 మంది మృతి


ట్రిపోలీ,మార్చి 21: : యూరోపియన్ దేశాల, అమెరికా దేశాల సైన్యాలు జరిపిన దాడిలో సుమారు 64 మంది మరణించారని ఆదివారం లిబియా ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరో 150 మంది గాయాల పాలయ్యారని లిబియా టెలివిజన్ అల్ అరేబియా తెలిపింది. ఫ్రెంచ్ ఫైటర్ జెట్‌తో లిబియాపై తొలి దాడిని నిర్వహించారు. ఈ దాడుల్లో లిబియన్ మిలటరీ వాహనాలు ధ్వంసమయ్యాయి. అమెరికా, ఫ్రెంచ్ దళాలు జరిపిన దాడుల్లో సిర్తే, బెంఘాజీ, మిస్రతా, జువారా ప్రాంతాలు దెబ్బతిన్నట్టు లిబియా టెలివిజన్ ప్రసారం చేసింది. అయితే లిబియన్ వ్యతిరేక దళాలపై రసాయనిక ఆయుధాల దాడిని ఆపివేయాలని సంకీర్ణదళాలు హెచ్చరించాయి.

Sunday, March 20, 2011

వెస్టిండీస్‌పై భారత్ గెలుపు: క్వార్టర్స్ లో ఆసీస్‌తో పోరు

చెన్నై,మార్చి 20: ప్రపంచకప్‌లో  వెస్టిండీస్‌పై   భారత్ 80 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో ఆసీస్‌తో పోరుకు సిద్ధమైంది.  టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటయింది. యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించగా, కొహ్లి అర్థ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. మిగతా ఆటగాళ్లెవరూ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. గంభీర్ 22, ధోనీ 22, యూసఫ్ పఠాన్ 11, సచిన్ 2, రైనా 4, హర్భజన్ 3, జహీర్ ఖాన్ 5, అశ్విన్ 10 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో రామ్‌పాల్ 5, రసెల్ 2 వికెట్లు పడగొట్టారు. సామీ, బిషూ, పొలార్డ్ తలో వికెట్ తీశారు. తరువాత వెస్టిండీస్ 43 ఓవర్లలో 188 పరుగులకు ఆలవుట్ అయింది. జహీర్ ఖాన్ 3 వికెట్లు తీసుకోగా, అశ్విన్, యువరాజ్ రెండేసి వికెట్లు, హర్ భజన్,రైనా ఒక్కొక్క వికెట్ తీశారు. కాగా, ఆరు పాయింట్లతో క్వార్టర్స్‌కు చేరిన విండీస్.. పాక్‌తో పోరుకు సిద్ధమైంది. 

ప్రపంచకప్‌ నుంచి కెన్యా నిష్క్రమణ

కోల్‌కతా  ,మార్చి 20:  ప్రపంచకప్‌ నుంచి కెన్యా నిష్క్రమించింది.    ఆదివారమిక్కడ కెన్యాతో జరిగిన 41వ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఘన విజయం సాధించింది. 161 పరుగుల తేడాతో కెన్యాను చిత్తు చేసింది. 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెన్యా 36 ఓవర్లలో 47 పరుగులకే ఆలౌటయింది. జింబాబ్వే బౌలర్లు కలిసికట్టుగా రాణించి కెన్యాను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. 66 పరుగులతో రాణించిన ఇర్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. 

స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి విజేత సైనా

 బాసెల్  ,మార్చి 20:   భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మరో గ్రాండ్‌ ప్రి గోల్డ్ టైటిల్‌ను గెల్చుకుంది. బాసెల్ (స్విట్జర్లాండ్) లో జరిగిన స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సైనా సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జిహ్యున్ సుంగ్ (కొరియా)పై 21-13, 21-14 స్కోరుతో సైనా విజయం సాధించింది.

సంపద తగ్గినా నెంబర్ వన్ ' లక్ష్మీ ' మిట్టలే... !

లండన్ ,మార్చి 20:  భారత సంతతికి చెందిన అపర కుబేరుడు, ఉక్కు దిగ్గజం లక్ష్మిమిట్టల్ బ్రిటన్  లోని ఆసియన్ సంపన్నుల జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని అధిష్టించారు. ఎసియన్ మీడియా, మార్కెటింగ్ గ్రూప్‌కు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ మ్యాగజైన్ రూపొందించిన ఈ జాబితాలో 15.5 బిలియన్ పౌండ్లతో లక్ష్మి మిట్టల్ మొదటి స్థానంలో నిలిచారు.అయితే ఆయన సంపద ఏడాదిలో 1.5 బిలియన్లు పౌండ్లు తగ్గిందని వీక్లీ పేర్కొంది. కాగా విస్తృతమైన వ్యాపారాలున్న హిందూజ సోదరులు-శ్రీచంద్, గోపి, ప్రకాశ్, అశోక్‌లు 9బిలియన్ పౌండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. వీరి సంపద ఏడాదిలో 1 బిలియన్ పౌండ్లు వృద్ధి సాధించింది. 90 మిలియన్ల పౌండ్ల వృద్ధితో 600 మిలియన్ల పౌండ్ల సంపద కలిగిన ప్రముఖ పారిశ్రామిక వేత్త లార్డ్ స్వరాజ్ పాల్ జాబితాలో ఆరోవ స్థానం సాధించారు. వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్ (500 మిలియన్ పౌండ్ల వృద్ధితో 4.5 బిలియన్ పౌండ్లు) మూడవ స్థానంలో, జెట్ ఎయిర్‌వేస్ అధిపతి నరేష్ గోయల్(68 మిలియన్ పౌండ్ల వృద్ధితో 425 మిలియన్ పౌండ్లు) జాబితాలో పదవ స్థానంలో నిలిచారు. 

రాఘవులు దీక్ష భగ్నం

హైదరాబాద్,మార్చి 20:  దళితులు, గిరిజనుల సవుస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్న రాఘవులు, పార్టీ నేతలు మిడియుం బాబూరావు, ఎస్.వీరయ్యు, జి.నాగయ్య లను  శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే, రాఘవులు ఆస్పత్రిలో చికిత్సను నిరాకరించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు దీక్ష ఉపసంహరించేది లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. రాఘవులు అరెస్టు వార్త తెలియడంతో సీపీఎంతోపాటు పార్టీ అనుబంధ ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Saturday, March 19, 2011

వా...చందా...మామ...

హైదరాబాద్,మార్చి 19: ఆకాశంలో శనివారం  భూమికి అతి దగ్గరగా వచ్చిన  చంద్రుడు ప్రజలకు కనువిందు చేశాడు. విశాఖలో సాయంత్రం 5.30 గంటలకు సూపర్ మూన్ కనిపించింది. విశాఖ సముద్రం వద్ద అధిక సంఖ్యలో జనం గుమిగూడి జాబిల్లి కాంతులను వీక్షించారు. భూమికి అతి దగ్గరగా రావడంతో చంద్రుడు ప్రతిరోజూ కనిపించే పరిమాణం కంటే పెద్దగా కనిపించాడు. కాంతి కూడా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించింది. హైదరాబాద్ లో సాయంత్రం 6.27కు కొత్త కాంతులు కురిపించాడు. . కాగా,  రాష్ట్రంలో పలు చోట్ల శనివారం సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు.  నెల్లూరు జిల్లా మైపాడు వద్ద సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం 27 అడుగుల ముందుకు వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్‌లోనూ సముద్ర అలలు భీతి గొల్పుతున్నాయి. దీంతో 25-30 అడుగుల ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. అలల ఉధృతి పెరగడానికి సూపర్‌మూన్ ప్రభావమే కారణమని భావిస్తున్నారు.

అసీస్ దూకుడు కు పాక్ పగ్గాలు

కొలంబో,మార్చి 19 : ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అప్రతిహత విజయాలకు పాకిస్తాన్  అడ్డుకట్ట వేసింది. 34 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన ఆసీస్ అజేయ యాత్రకు పాక్ బ్రేక్ వేసింది. శనివారమిక్కడ జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను పాక్ నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.  ఆసీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని పాక్ 41 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్-ఎలో పాకిస్థాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఉమర్ అక్మల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లో 176 పరుగులకు ఆలౌటయింది.  ప్రపంచకప్‌లో పుష్కరం తర్వాత ఆసీస్ ఓటమి చవిచూసింది. 1999లో జరిగిన వరల్డ్ల్డ్ కప్‌లో పాకిస్థాన్ చేతిలోనే ఆసీస్‌కు భంగపాటు ఎదురుయింది. అయితే 1999 నుంచి 2007 వరకు వరుసగా మూడుసార్లు ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను గెలిచింది.
బంగ్లా పై దక్షిణాఫ్రికా ఘనవిజయం
ఢాకా: గ్రూప్-బి 39వ మ్యాచ్'లో బంగ్లాదేశ్'పై దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది.   తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. ఆ తరువాత 285 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 28 ఓవర్లకే 78 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది.

Friday, March 18, 2011

కివీస్ పై లంక గెలుపు

మురళీధరన్ (4/25)
ముంబై,మార్చి 19:    క్వార్టర్ ఫైనల్ స్థానం ముందే ఖరారు అయినప్పటికీ న్యూజిలాండ్‌తో జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌ను శ్రీలంక తేలిగ్గా తీసుకోలేదు.  112 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని ఖాయం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 265 పరుగులు సాధించింది. కెప్టెన్ కుమార సంగక్కర (128 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 111) ఈ టోర్నీలో తొలి సెంచరీ చేయగా... మహేల జయవర్ధనే (90 బంతుల్లో 6 ఫోర్లతో 66)... ఏంజెలో మాథ్యూస్ (35 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్) రాణించారు. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 35 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. మేటి స్పిన్నర్ మురళీధరన్ (4/25) న్యూజిలాండ్ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. ఇతర స్పిన్నర్లు అజంత మెండిస్ రెండు వికెట్లు, దిల్షాన్ ఒక వికెట్ తీసుకున్నారు. పేస్ బౌలర్లు కులశేఖర, మాథ్యూస్, మలింగలకు ఒక్కో వికెట్ దక్కింది.

వికీలీక్స్ కథనాలు నిరాథారం: ప్రధాని

న్యూఢిల్లీ,మార్చి 19:  యూపీఏ-1 ప్రభుత్వం 2008లో లోక్‌సభలో విశ్వాస తీర్మానం నెగ్గేందుకు ఎంపీలకు లంచాలిచ్చిందన్న వికీలీక్స్ కథనాలు పూర్తిగా నిరాథారమని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు.  వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు పార్లమెంటు ఉభయ సభల్లోనూ శుక్రవారం ప్రకటన చేశారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వాషింగ్టన్‌కు పంపిందంటున్న దౌత్య పత్రాల్లోని వివరాలను గానీ, నిజానిజాలను గానీ, అసలు వాటి ఉనికిని గానీ నిర్ధారించలేమన్నారు. బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్ నుంచి, యూపీఏ ప్రభుత్వం తరఫున ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు. గతంలోనే విచారణ జరిపి తిరస్కరించిన ఉదంతంపై వచ్చిన.. రుజువు చేయలేని వార్తలను పట్టుకుని ప్రతిపక్షాలు  లేనిపోని రాద్ధాంతం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధాని ప్రకటనను విపక్షాలు తీవ్రంగా నిరసించాయి. ఆయన వివరణకు సభ్యులు పట్టుబట్టారు. అందుకు సభాధ్యక్షులు అనుమతించకపోవడం వివాదానికి దారి తీసింది. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి!

నెదర్లాండ్స్ పై ఐర్లాండ్ విజయం

కోల్'కతా,మార్చి 18:  ప్రపంచ కప్ క్రికెట్ లో  గ్రూప్-బి 37వ మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుపై ఐర్లాండ్ జట్టు విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసి నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లకు 306 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్  47.4 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 307 పరుగులు చేసి విజయం సాధించింది. ఐర్లాండ్ జట్టులో పిఆర్ స్టిర్లింగ్ 101 పరుగులు, పోర్టర్ ఫీల్డ్ 68, జోయ్స్ 28, విల్సన్ 27 పరుగులు చేశారు. నీల్ ఒబ్రియాన్ 57 పరుగులు, కెవిన్ ఒబ్రియాన్ 15 పరుగులు చేసి నాటౌట్'గా నిలిచారు.

Thursday, March 17, 2011

విదేశాలకూ ఇక ‘మనియార్డర్ ’

హైదరాబాద్, మార్చి 18:  విదేశాల్లోని ఆప్తులకు సులభంగా డబ్బు పంపేందుకు ‘మనియార్డర్ విదేశ్’ పేరుతో తపాలాశాఖ సరికొత్త పథకాన్ని అవుల్లోకి తెచ్చింది. దీని ద్వారా దేశంలోని అన్ని ప్రధాన పోస్టాఫీసుల నుంచి విదేశాల్లో ఉన్న వారికి తేలిగ్గా డబ్బు పంపవచ్చు. నాలుగు రోజుల్లో వారికి సొమ్ము  చేరుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్’ ద్వారా విదేశాల నుంచి భారత్‌కు డబ్బు పంపే సదుపాయుం ఉంది. అయితే,  ఇక్కడినుంచి విదేశాలకు సొమ్ము పంపే అవకాశం లేదు. ఈ ఇబ్బందులను నివారించేందుకు పోస్టల్‌శాఖ ‘మనియూర్డర్ విదేశ్’ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా డబ్బు పంపేవారు పోస్టాఫీసుల్లో తవు చిరునామా ధ్రువపత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. మనియార్డర్ చేసే సొమ్ము విలువను యూఎస్ డాలర్లలో లెక్కిస్తారు.సాధారణ అవసరాల నిమిత్తం ఈ పథకం ద్వారా 100 నుంచి 500 యూఎస్ డాలర్లు (రూ. 5000 -రూ. 2,50,000 ) వరకు పంపే వీలుంది.  విదే శాల్లో ఖరీదైన విద్య, వైద్యం కోసమైతే లక్ష యూఎస్ డాలర్లు(రూ. 50 లక్షల వరకు) పంపే వెసులుబాటు కల్పించారు.విదేశాలకు విహార యాత్రలకు వెళ్లినవారికి 10,000 యూఎస్ డాలర్ల వరకు (రూ. 5 లక్షలు) పంపవచ్చు.విదేశాలకు 100 నుంచి 1000 యూఎస్ డాలర్ల వరకు పంపే వారి నుంచి తపాలాశాఖ సేవల కింద 12 డాలర్లు వసూలు చేస్తారు.1000 నుంచి 3000 యూఎస్ డాలర్ల వరకు పంపిస్తే 20 యూఎస్ డాలర్లు కమిషన్ చెల్లించాలి.3000 నుంచి 5000 డాలర్ల వరకూ 25 డాలర్లను కమిషన్ చార్జ్ కింద వసూ లు చేస్తారు.విదేశాల నుంచి డబ్బును భారత్‌లో ఉన్న వారికి కూడా పంపవచ్చు. అయితే ఒకసారి 500 యూఎస్ డాలర్ల వరకు మాత్రమే పంపాలి. ఇలా ఒక ఏడాదిలో 12 సార్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.విదేశాల నుంచి పంపిన డబ్బును రూ. 2.5 లక్షల వరకు నగదు రూపంలోనే అందిస్తారు. డబ్బు విలువ అంతకు మించి ఎక్కువగా ఉంటే చెక్ రూపంలో ఇస్తారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్

హైదరాబాద్, మార్చి 18: చివరి నిమిషం వరకు ఉత్కంఠ కలిగించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ నుంచి ఒకరు, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఒకరు పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యే కోటాలో పది ఎమ్మెల్సీ స్థానాల కోసం గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. సాయంత్రం అయిదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. తొలి ప్రాధాన్యతా ఓట్లతో అయిదుగురు అభ్యర్థులు విజయం సాధించగా, మిగిలిన అభ్యర్థులకు రెండు నుంచి వరుసగా అయిదో ప్రాధాన్యతాఓట్ల వరకు లెక్కించాల్సిన పరిస్థితి తలెత్తింది. అర్ధరాత్రి వరకు జరిగిన లెక్కింపులో చివరకు కాంగ్రెస్ 5, దాని మిత్రపక్షాలైన పీఆర్పీ, ఎంఐఎం ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక టీడీపీ ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దింపగా ఒకరు ఓడిపోయారు. దాని మిత్రపక్షం సీపీఐ అభ్యర్థి టీడీపీ మద్దతుతో గెలుచుకోగలిగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి కేవ లం 11 ఓట్లతో చివరి స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యారు. పోలైన 293 ఓట్లకుగాను రెండు ఓట్లు చెల్లలేదు. ఒకటి ఎవరికీ పడలేదు.  ప్రాధాన్యతలను ఇవ్వడంలో దాదాపు అన్ని బ్యాలెట్లలోనూ క్రాస్ ఓటింగ్ కనిపించింది. మొత్తం 10 స్థానాలకు గాను 12 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

వరల్డ్‌కప్: ఇంగ్లాండ్ ఆశలు సజీవం

చెన్నై,మార్చి 18: వరల్డ్‌కప్ 2011 లో భాగంగా అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి టోర్నీలో ఆశలను సజీవంగా నిలుపుకుంది. గురువారం ఇక్కడ విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 18 పరుగుల తేడాతో గెలుపొందిఇంది.  ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ తమ లీగ్ మ్యాచ్‌లు ఆరింటిని ముగించుకుని ఏడు పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, విండీస్‌లపై గెలవగా,ఇండియాతో జరిగిన మ్యాచ్‌ను టై చేసుకుంది. 

కెనడాపై ఆసీస్ గెలుపు

బెంగళూరు,మార్చి 17: వరల్డ్‌కప్‌లో ఆసీస్ జైత్రయాత్ర  కొనసాగుతోంది. బుధవారం ఇక్కడ కెనడాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఏడు వికెట్లతేడాతో గెలుపొంది ఘన విజయాన్ని నమోదు చేసింది. కెనడా తమ ముఇనుంచిన  212 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా  చేదించింది.  ఆసీస్ ఓపెనర్లు వాట్సన్, హడ్డిన్ తమ దైన శైలిలో విజృంభించి  ఆసీస్ గెలుపును సులభం చేశారు. వాట్సన్ 94 పరుగులు చేసి..తృటిలో సెంచరీ కోల్పోగా, హడ్డిన్ 88 పరుగులతో వాట్సన్‌కు చక్కటి సహకారాన్నందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన డా తొలి 10 ఓవర్లలో ఒక వికెట్టు నష్టానికి 77 పరుగులు చేసి పరుగుల వరద సృష్టించింది. కానీ ఇప్పటికీ గ్రూప్-ఎ నుంచి క్వార్టర్స్కు చేరిన ఆసీస్‌కు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా విజయా న్ని చేజిక్కుంచుకుంది. కెనడా బౌలర్లలో ఒసినైడ్, బైడ్‌వాన్, డెవ్‌సన్ తలో వికెట్ తీశారు.

Wednesday, March 16, 2011

2జీ స్పెక్ట్రమ్ కేసు: మాజీ మంత్రి రాజా స్నేహితుని ఆత్మహత్య

న్యూఢిల్లీ,మార్చి 16: : 2జీ స్పెక్ట్రమ్ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి ఎ..రాజా స్నేహితుడు, గ్రీన్ హౌస్ ప్రాపర్టీ ఎం.డి. సాధిక్ భాషా ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నయ్‌లోని తన నివాసంలోనే ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సాధిక్ భాషా నివాసంలో సీబీఐ పలుమార్లు సోదాలు నిర్వహించింది. దీంతో మనస్తాపానికి గురైన సాధిక్ భాషా ఈ చర్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఈయన డీబీ రియాలిటీ సంస్థ ఎండీ సాధిక్ బాల్వాకు పరోపకారం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కోణంలోనే సీబీఐ ఆయన నివాసంపై పలుమార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.ఇదిలావుండగా, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్మును డీబీ రియాలిటీకి మళ్లించి అక్కడ నుంచి డీఎంకే అధికార పార్టీ కలైంజ్ఞర్ టీవీకి అందజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్పెక్ట్రమ్ సొమ్ముతోనే కలైంజ్ఞర్ టీవీని నెలకొల్పినట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఛానల్‌కు కరుణానిధి కుమార్తె, రాజ్యసభ్యురాలు కనిమొళి, కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాల్‌ భాగస్వాములుగా ఉన్నారు.  వీరిని కూడా  సీబీఐ ఇటీవల దర్యాప్తు జరిపింది.  

సమితిలో కీలక పదవిలో భారత మహిళ

న్యూయార్క్,మార్చి 16: : ఐక్యరాజ్యసమితిలోని ఓ ప్రధాన విభాగంలో భారతదేశానికి చెందిన లక్ష్మి పూరి నియమితులయ్యారు. ఇంటర్‌గవర్నమెంటల్ సపోర్ట్ అండ్ స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్స్ ఫర్ యూఎన్ విమెన్ అనే విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ హోదాలో లక్ష్మి పూరిని నియమించారు. ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో పలు హోదాల్లో 28 సంవత్సరాలపాటు సేవలందించారు. 1999 నుంచి 2002 సంవత్సర కాలంలో హంగరీ, బోస్నియా, హెర్జిగోవినాలో భారత రాయబారిగా పనిచేశారు.

Tuesday, March 15, 2011

తిరుమలలో తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుమల,మార్చి 15:  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  తెప్పోత్సవాలు తిరుమలలో మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తొలి రోజు స్వామి వారు  శ్రీరామచంద్ర అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో తిరుమల ఆలయం శోభిల్లుతోంది. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్మోగుతున్నాయి.

ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా విజయం

కోల్‌కతా,మార్చి 15: ఈడెన్‌గార్డెన్ మైదానంలో జరిగిన వరల్డ్ కప్  మ్యాచ్ లో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా 131 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 273 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు 33.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది.  ఐర్లాండ్ జట్టులో విల్సన్ 31, కెవిన్ ఓబ్రియన్ 19, డాక్‌రెల్ 16, మూనీ 14 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా జట్టులో మార్కెల్, పీటర్సన్‌లు మూడేసి వికెట్లు, కల్లిస్ రెండు వికెట్లు, బోథా, డ్యూమినీ చెరో వికెట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో అత్యధికంగా డ్యూమినీ 99, ఇంగ్రామ్ 46, వాన్ విక్ 42 పరుగులు చేశారు.  డ్యూమిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు..

బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ అవకాశాలు సజీవం

చిట్టగాంగ్,మార్చి 15: బంగ్లాదేశ్  ప్రపంచకప్‌లో తమ క్వార్టర్ ఫైనల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. నెదర్లాండ్స్ తో సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 46.2 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో నలుగురు రనౌట్ కావడం విశేషం. 161 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (113 బంతుల్లో 6 ఫోర్లతో 73 నాటౌట్) రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలలో పాలుపంచుకున్నాడు. బంగ్లాదేశ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించడంతోపాటు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
క్వార్టర్ ఫైనల్‌కు చేరిన పాక్
   వరల్డ్ కప్ గ్రూప్ ‘ఎ’ లో  పాకిస్థాన్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.  జింబాబ్వేతో జరిగిన డే అండ్ నైట్ వన్డేలో పాక్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఆఫ్రిది సేన ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఎనిమిది పాయింట్లు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే  39.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 151 పరుగులు చేసింది. పలు మార్లు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడడంతో మ్యాచ్‌ను కుదించి పాక్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 38 ఓవర్లలో 162 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (65 బంతుల్లో 49; ఫోర్లు 4) శుభారంభాన్ని ఇవ్వగా షఫీఖ్ (97 బంతుల్లో 78 నాటౌట్; ఫోర్లు 7)  చివరిదాకా  క్రీజులో నిలిచి పాక్‌కు విజయాన్ని అందించాడు. 34.1 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన పాక్ 164 పరుగులు సాధించింది. 1999 ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత పాక్ జట్టు ఛేజింగ్‌లో గెలవడం ఇదే తొలిసారి.   

చిరు కుమార్తెకు వరకట్న వేధింపులు !

హైదరాబాద్, మార్చి 15:  తన భర్త శిరీష్ భరద్వాజ్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారంటూ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సీసీఎస్ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శిరీష్‌తో పాటు ఆయన తల్లిపై పోలీసులు వరకట్న వేధింపులు, డౌరీ ప్రొహిబిషన్ యాచ్ట్ ల  కింద  కేసు నమోదు చేశారు. వివాహమైన ఏడాదికే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని, అయితే తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకున్నందున బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిన్నకుండిపోయానని శ్రీజ తన ఫిర్యాదులో వివరించారు. ‘‘వ్యాపారం చేయడానికి పుట్టింటి నుంచి రూ. 50 లక్షలు తీసుకురావాల్సిందిగా వారం రోజుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ బాధలు తాళలేక డబ్బు తీసుకువస్తానని చెప్పి ఆ ఇంటి నుంచి వచ్చేశాను. ఇక తిరిగి వెళ్లను. వేధింపులకు పాల్పడిన భర్త, అత్తలపై చర్యలు తీసుకోండి’’ అని తన ఫిర్యాదులో శ్రీజ పేర్కొన్నారు. వివాహమైన నాటి నుంచి శిరీష్ ఎలాంటి వ్యాపకం లేకుండా తిరుగుతూ, తాను ఏదో తెస్తానని ఆశిస్తున్నారని వివరించారు. దీంతో అభద్రతాభావానికి లోనైన తాను.. తన పేరిట ఉన్న ఆస్తులను పుట్టింటి వారి పేరిట రీ-రిజిస్టర్ చేసినట్లు పోలీసులకు తెలిపారు. ఈ పరిణామం తరవాత తనకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, భర్త ఆగడాలకు అత్త వంత పాడేదని శ్రీజ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2007 అక్టోబర్ 17న న్యూ బోయిన్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో శిరీష్-శ్రీజలు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఫుకుషిమా లో పేలిన నాలుగో రియాక్టర్

టోక్యో,మార్చి 15:   ఫుకుషిమా లో నాలుగో రియాక్టర్ పేలింది. అంతకు ముందు రియాక్టర్‌లో పనిచేసే ఉద్యోగులను ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రియాక్టర్‌లో పేలుడు సంభవించటంతో రేడియేషన్ లీకయ్యే ప్రమాదం ఉందని జపాన్ ప్రధాని తెలిపారు. కాగా క్యోడాలో సాధారణం కంటే 9 రెట్లు ఎక్కువగా రేడియేషన్ ఉన్నట్లు శాస్తవ్రేత్తలు గుర్తించారు. ఇలావుండగా, జపాన్ తీరప్రాంతంలో శ్మశాన వాతావరణం రాజ్యమేలుతోంది. దేశచరిత్రలో కనీవినీ ఎరుగని భారీ భూకంపం, దాని ఫలితంగా వచ్చిన సునామీ ధాటికి విలవిల్లాడిన ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క మియాగీ రాష్ట్రంలోనే సోమవారం రెండువేల మంది మృతదేహాలు బయటపడ్డాయి. సునామీ కబళించిన ఊళ్లలో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే..! 

అణు కేంద్రాల భద్రతపై సమీక్ష

న్యూఢిల్లీ,మార్చి 15:  జపాన్‌లో సంభవించిన సునామీ కారణంగా, అక్కడి అణు కేంద్రాలకు ముప్పు ఏర్పడిన నేపథ్యంలో భారత్‌లోని అణు కేంద్రాల భద్రతపై సమీక్షకు ప్రభుత్వం ఆదేశించింది. దేశంలోని అణు కేంద్రాలపై సత్వరమే సాంకేతిక సమీక్ష జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఇవి తట్టుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్నాయో, లేదో సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), జపాన్ అణు పరిశ్రమల మండలి, ప్రపంచ అణు కార్యకలాపాల సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని ప్రధాని చెప్పారు.  ఇదిలా ఉండగా, జపాన్‌లో దాదాపు 25 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిలో చాలామంది సునామీ ప్రభావిత ప్రాంతాల్లో లేనందున సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. భారతీయులెవరికీ హాని జరిగినట్లు ఎలాంటి సమాచారం రాలేదని, దాదాపు 70 మంది భారతీయులు మాత్రం సునామీ ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో తలదాచుకుంటున్నారని తెలిపారు. కాగా, భారత్‌లోని అణుకేంద్రాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని అణు ఇంధన కమిషన్ మాజీ చైర్మన్ అనిల్ కకోద్కర్ చెప్పారు. ముంబైలోని విధాన్ భవన్‌లో సోమవారం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, సునామీ అనంతరం జపాన్ అణు కేంద్రాల్లో ముప్పు సంభవించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అణు కేంద్రాల రూపకల్పన మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. జపాన్‌లోను, భారత్‌లోను భూ ప్రకంపనల తీరు తెన్నులు వేరని, అందుకే గుజరాత్‌లో లోగడ భూకంపం సంభవించినా, తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని గుర్తు చేశా రు. మహారాష్టల్రోని జైతాపూర్ అణుకేంద్రానికీ ఎలాంటి ముప్పు లేదని, అణుకేంద్రం సముద్రమట్టానికి చాలాఎత్తులో పీఠభూమిపై ఉందని చెప్పారు.

Sunday, March 13, 2011

'సమితి' లో సంగీత ఝరి

న్యూయార్క్,మార్చి 13:  శాంతిసౌథంలో మథుర సంగీత ధ్వనులు  మారుమ్రోగాయి.  ఐక్యరాజ్యసమితి ప్రధాన భవనంలో కమనీయ కర్నాటక సంగీత కచేరీ కన్నుల పండువగా సాగింది. ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసుడు ఎల్. సుబ్రమణ్యమ్ తన వాద్యగాన మాధుర్యంతో సభ్య ప్రతినిధులకు భారతీయ సంప్రదాయ సంగీత సంస్కృతిని పరిచయం చేశారు. గతంలో  ఐక్యరాజ్యసమితిలో సంగీత సామ్రాజ్ఞి ఎమ్‌ఎస్. సుబ్బలక్ష్మి కర్నాటక సంగీతం ఆలపించి తన గానమాధుర్యంతో అందరినీ మంత్రముగ్థులను చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఐక్యరాజ్యసమితిలో భారత్ తాత్కాలిక సభ్య హోదా పొందిన నేపథ్యంలో  ఏర్పాటు చేసిన కర్నాటక సంగీత కార్యక్రమంలో వయొలిన్ విద్వాంసుడు ఎల్. సుబ్రమణ్యమ్ తన కుమారుడు అంబితో కలిసి అద్భుతమైన రాగాలను ఆలపించారు. 90 నిమిషాల పాటు సాగిన ఈ సంగీతఝరి 500 మంది ప్రేక్షకులను పారవశ్యంలో ముంచెత్తింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్-కి మూన్, ఐరాస ప్రథమ మహిళ, సభలో భారత ప్రతినిధి హర్దీప్‌సింగ్‌పురి, ఉప ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మంజీవ్ సింగ్ పురి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మృతులు వేలల్లో...నష్టం కోట్లలో...

దిక్కు తోచని జపాన్...
టోక్యో,మార్చి 13:  భూకంపం, సునామీల కారణంగా జపాన్‌లో మృతుల సంఖ్య 1,700 దాటినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రాకాసి అలలు జపాన్ ఈశాన్యంలో 2,100 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని కబళించాయి. పెద్ద సంఖ్యలో పల్లెలు, పట్టణాలు, నగరాలను సునామీ తుడిచిపెట్టింది. దాదాపు 23 అడుగుల ఎత్తైన  రాకాసి అలలు కొన్ని ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర భూమిపైకి చొచ్చుకువచ్చి . బోట్లు, కార్లు, ఇళ్లు, భవనాలను ముంచేశాయి. . ఒఫునాటో, సెన్సెకి, కెసెన్నుమా లైన్లలో నాలుగు రైళ్లు గల్లంతయ్యాయి. వాటిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నదీ తెలియదు. అంతకుముందు సెన్సెకి లైన్ మీద ఒక రైలు పడిపోయివుండగా గుర్తించారు. భూకంపం, సునామీల దెబ్బకు మొత్తం 3,400 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 181 సంక్షేమ భవనాలు, నర్సింగ్‌హోమ్‌లు దెబ్బతిన్నాయి. భూకంపం తాకిన ప్రాంతాల్లో 55.7 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా,ఆరు లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిచి పోయాయి. టోక్యో నగరంలో లోకల్ రవాణా వ్యవస్థ స్తంభించిపోవటంతో శుక్రవారం రాత్రి 1.20 లక్షల మంది ఇళ్లకు చేరుకోలేక వీధుల్లోనే కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది. సునామీతో దెబ్బతిన్న ప్రాంతాలన్నింటికీ సహాయ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. సహాయ చర్యల కోసం 20,000 మంది సైనికులు, 200 హెలికాప్టర్లు, విమానాలు, 25 బోట్లు రంగంలోకి దిగాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల నుంచి సహాయ బృందాలు జపాన్‌కు చేరుకుంటున్నాయి. దాదాపు 50 దేశాలు సహాయం ప్రకటించాయి.
' అణు భయం ' 
ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటులో పేలుడు సంభవించటంతో రేడియేషన్ విడుదలవుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే అణు రియాక్టర్ ఉన్న కంటైనర్‌కు ఎలాంటి ముప్పూ వాటిల్లలేదని ప్రభుత్వం చెప్తోంది. అయితే ప్లాంటు పరిసరాల నుంచి వేలాది మందిని ఖాళీ చేయించటం.. ప్లాంటు సమీపం నుంచి రక్షించిన ముగ్గురికి రేడియేషన్ సోకినట్లు నిర్ధారణ కావటం ప్రజల ఆందోళనను రెట్టింపు చేస్తోంది.

Saturday, March 12, 2011

సారీ...సైనా...


బర్మింగ్‌హామ్,మార్చి 13: : ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ లో భారత స్టార్ సైనా నెహ్వాల్‌కు మరోసారి చుక్కెదురైంది. అనేకమంది అగ్రశ్రేణి షట్లర్లు ఈ టోర్నీకి దూరం కావటంతో టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపించినా... క్వార్టర్స్‌లోనే సైనా పరాజయం పాలైంది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎరికో హిరోసీ (జపాన్) 21-11, 22-20 స్కోరుతో సైనాపై విజయం సాధిం చింది. గత ఏడాది ఈ టోర్నీలో సెమీస్ చేరిన సైనా ఈ సారి క్వార్టర్స్ లోనే ఇంటిముఖం పట్టింది.

దటీజ్ దక్షిణాఫ్రికా...!

నాగపూర్,మార్చి 13:  ప్రపంచకప్‌లో భాగంగా శనివారమిక్కడ జరిగిన ఉత్కంఠ భరిత   మ్యాచ్ లో  దక్షిణాఫ్రికా భారత్ పై   విజయయం సాధించి గ్రూప్ 'బి ' లో అగ్రస్థానానికి చేరింది.  టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటయింది. ఒక దశలో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లిన టీమిండియాకు పదునైన బౌలింగ్‌తో సఫారీలు కళ్లెం వేశారు. 30 పరుగుల తేడాతో 8 వికెట్లు పడగొట్టారు. సచిన్ 111, సెహ్వాగ్ 73, గంభీర్ 69 మాత్రమే రాణించారు. యువరాజ్ 12, కొహ్లి1, హర్భజన్ 3 పరుగులు చేసి అవుటయ్యారు. పఠాన్, జహీర్‌ఖాన్, నెహ్రా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు.  ధోనీ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 5, పీటర్‌సన్ 2 వికెట్లు పడగొట్టాడు. మోర్కల్, ప్లెసిస్, కల్లిస్ తలో వికెట్ తీశారు. ఆ తరువాత దక్షిణాఫ్రికా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ ల నష్టం తో లక్ష్యాన్ని చేధించింది.    ఈ  ప్రపంచకప్‌లో ఇది భారత్ కు తొలి వోటమి.  


పార్టీ జెండాను ఆవిష్కరించిన జగన్

హైదరాబాద్,మార్చి 12:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం కడప జిల్లా ఇడుపులపాయ లోఆవిష్కరించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద మధ్యాహ్నం 2.29 గంటల ప్రాంతంలో అశేష జనావళి సాక్షిగా  జెండాను ఆవిష్కరించారు. ముందు నీలం, మధ్యలో తెలుపు ,చివర ఆకుపచ్చ రంగుల్లో జెండా రూపొందించారు. జెండా మధ్యలో వైఎస్సార్ బొమ్మ పెట్టారు. బొమ్మ వెనుక కాషాయం రంగు ఉంది. బొమ్మ చుట్టూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందుపరిచారు. నీలం రంగు యువ చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలుగా తీసుకున్నారు. జెండా ఆవిష్కరణకార్యక్రమానికి జగన్‌తో పాటు ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి
 ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అమనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, బాబూరావు, శోభానాగిరెడ్డి,కాటసాని రామిరెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొణతాల రామకృష్ణ, కొండా సురేఖ, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, లేళ్ల అప్పిరెడ్డి, విజయభాస్కరరెడ్డి, నాగార్జున, గోపాల్‌రెడ్డి, పూడి పుల్లారెడ్డి, కుంభా రావిబాబు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు కూడా   హాజరయ్యారు.  


Friday, March 11, 2011

దిల్ రాజు కొత్త సినిమా ' మిస్టర్ పర్‌ఫెక్ట్ ' లో ప్రభాస్, కాజల్ 

విగ్రహాలను పునఃప్రతిష్ఠిస్తాం: సీ.ఎం.

హైదరాబాద్,మార్చి 12: మిలియన్ మార్చ్ సందర్భంగా ఆందోళనకారులు ట్యాంక్‌బండ్‌పై కూల్చివేసిన విగ్రహాలను పునఃప్రతిష్ఠిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులు ఎంతటివారైనా శిక్షిస్తామని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేస్తామని కొన్ని నెలలుగా ప్రకటనలు చేసిన వారందరిపైనా కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యమూ ఉందని అంగీకరించారు. ‘‘హైదరాబాద్‌ను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. మిలియన్ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలూ నన్ను కోరారు. ఏదైనా గొడవ చేస్తారనే సమాచారం సర్కారుకు ఉంది. అందుకే అనుమతి ఇవ్వలేదు. ఇది సున్నిత సమస్య. అందుకే రబ్బరు బుల్లెట్లతో కూడా కాల్చవద్దని పోలీసులను ఆదేశించాం. కొంచెం పొరపాటు జరిగిన మాట వాస్తవమే. నేను ఒప్పుకుంటున్నాను. ’’ అని వివరించారు.
 

మధుర మీనాక్షి ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు

మధురై,మార్చి 12: తమిళనాడులోని విఖ్యాత మధుర మీనాక్షి ఆలయానికి ఐఎస్‌ఓ 9001:2008 విశిష్ట గుర్తింపు ధ్రువపత్రం లభించింది. భక్తులకు అత్యుత్తమ సేవలందిం చడం, భద్రతా ప్రమాణాల్ని నిక్కచ్చిగా పాటించడం, నిత్యం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల  తమకు ఈ గుర్తింపు లభించిందని ఆలయ ఈవో పద్మనాభన్ తెలిపారు. ఐఎస్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ స్థాయిలో సేవల్ని అందించేందుకు భవిష్యత్తులో ఆలయ మండలి విశేషకృషి చేస్తుందన్నారు. మీనాక్షి ఆలయంతోపాటు చెన్నైలోని పార్థసారథి ఆలయం, శ్రీకపిలేశ్వర ఆలయాలకు కూడా ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది.

ఎంపీల నిధులు రూ.5 కోట్లకు పెంపు

న్యూఢిల్లీ,మార్చి 12: పార్లమెంటు సభ్యులకు  ప్రతీ సంవత్సరం ఇచ్చే ఎంపీల స్థానిక అభివృద్ధి నిధి (ఎంపీల్యాడ్ ఫండ్-ఎంపీఎల్‌ఏడీఎఫ్) మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచుతున్నట్లు కెంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ  ప్రకటించారు. ఆస్పత్రులపై సేవాపన్ను భారం సహా బడ్జెట్‌లో పేర్కొన్న కొన్ని పన్ను ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సూచనలిచ్చారు. మత్స్యకారులకు, చేపల రైతులకు స్వల్పకాలిక రుణాల వడ్డీపై ఇస్తున్న సబ్సిడీని కొనసాగిస్తున్నట్లు ప్రణబ్ తెలిపారు. వారు సకాలంలో రుణాలు చెల్లించినట్లయితే.. వడ్డీశాతాన్ని మరింత తగ్గిస్తామన్నారు. ఆ నిర్ణయాలతో 20 లక్షల మంది మత్స్యకారులు, చేపల రైతులు లబ్ధి పొందుతారన్నారు. రూ. 500 కోట్లతో మహిళల స్వయం సహాయక బృందాల అభివృద్ధి నిధిని నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2011-12 సంవత్సరం బడ్జెట్‌పై చర్చకు ఆయన శుక్రవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు ప్రభుత్వ ప్రాధామ్యమని, ఆ రంగాల్లో మౌలికవసతుల కల్పనను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందువల్ల విద్యాసంస్థలు, ఆసుపత్రుల మూలధన వాటాలను మౌలిక వసతుల ఉపరంగాలుగా పరిగణిస్తామన్నారు. 

ఇంగ్లాండ్ పై బంగ్లా అనూహ్య విజయం

చిట్టగాంగ్ , మార్చి 11:  ప్రపంచ కప్  మ్యాచ్'లో ఇంగ్లాండ్ జట్టుపై బంగ్లాదేశ్ జట్టు అనూహ్య  విజయం సాధించింది. 226 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు 49 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసింది.  ఇక్బాల్ 38 పరుగులు, ఇమ్రుల్ 60, సిద్ధిఖీ 12,షకీబ్ అల్ హసన్ 32, రహీమ్ 6, రజాక్ ఒక పరుగు చేశారు. రఖీబుల్ హసన్, నయీమ్ ఇస్లామ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యారు. మహ్మదుల్ల 21 పరుగులు, షఫీవుల్ ఇస్లామ్ 24 పరుగులతో నాటౌట్'గా నిలిచారు. షాజద్ మూడు వికెట్లు, జిపి శ్వాన్ రెండు వికెట్లు, టిటి బ్రెస్నన్ ఒక వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 225 పరుగులకు కుప్పకూలింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 49.4 ఓవర్లలో ఇంగ్లాండ్ టీమ్‌ను కట్టడి చేసింది. ఇంగ్లాండ్ జట్టులో ట్రాట్ 67, మోర్గాన్ 63 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఇస్లామ్, రజాక్, హసన్ రెండేసి  వికెట్లు తీసుకున్నారు. 

భారీ భూకంపం, సునామీ లతో జపాన్ అతలాకుతలం

టోక్యో, మార్చి 11: జపాన్‌లో భారీ భూకంపం, సునామీ సంభవించాయి.  జపాన్ సముద్ర అంతర్భాగంలో సంభవించిన భూకంప తీవ్రత  రెక్టార్ స్కేల్‌పై 8.8గా నమోదైంది. భూకంప ధాటికి వందలాదిమంది మరణించారు.  భవనాలు పూర్తిగా ధ్వంసమైనాయి. ఇరవై అడుగుల మేర పోటెత్తిన సముద్ర అలలలో  పట్టణాలు నేలమట్టమవుతున్నాయి. భారీ ఆకాశహర్మ్యాలు, సుందర భవనాలు, చారిత్రక కట్టడాలు  పునాదులతో సహా కదిలి కడలి గర్భంలో కొట్టుకుపోతున్నాయి. చారిత్రక సెందాయ్ నగరంలో పాతిక అడుగుల మేర జలరాశి మహోగ్రంగా పోటెత్తుతోంది. ప్రజలు  భవంతులపైకి చేరి రక్షించమని హాహాకారాలు చేస్తున్నారు. సునామీ ప్రభావం రష్యా, మార్కస్ ఐలాండ్, ఉత్తర మారియానాలో కూడా  వుండవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. రంగంలోకి దిగిన జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ సేవా సంస్థలు హెలికాప్టర్ల సహాయంతో ప్రజలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.చిబా వద్ద ఆయిల్ రిఫైనరీ కేంద్రం నీటిలో మునిగిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపు అగ్నికీలలు చిమ్మిన ఈ రిఫైనరీ కేంద్రం, ఆనక కడలి ఒడిలో శాంతించింది. ఈ పరిస్థితి నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఐదు అణు విద్యుత్ కేంద్రాలను మూసివేసింది. యురేనియం నిల్వల తరలింపునకు చర్యలు చేపట్టింది. భారీ భూకంపానికి గురైన జపాన్‌లో అత్యవసరపరిస్థితిని విధించారు. భూకంపం దాటికి ఓడలు, భవనాలు, వాహనాలు, ఫ్లైఓవర్లు కొట్టుకుపోయి జపాన్ లో దయనీయస్థితి కనిపిస్తోంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై జపాన్ అంధకారంలో మునిగిపోయింది. ఓకే ప్రాంతంలో పలుమార్లు భూకంపం వ చ్చినట్టు సమాచారం..జపాన్ సముద్ర అంతర్భాగంలో సంభవించిన భూకంపం ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపై అధికంగా వున్నట్లు అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా సుమారు పందొమ్మిది దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. తైవాన్, ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మెక్సికో, పిలిప్పీన్ దేశాలకు సునామీ ముప్పు పొంచి వున్నదని, ఆయా దేశాల్లో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆయా దేశాల ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నాయి. జపాన్ లో  1995 సంవత్సరం తర్వాత ఇదే అతిపెద్ద భూకంపంగా భావిస్తున్నారు. ఆసియా ఖండానికి తూర్పు ముఖద్వారంగా నెలవై వున్న జపాన్ దేశం చిన్న చిన్న దీవుల సముదాయం. సుమారు రెండువేల దీవులు జపాన్ దేశ పరిధికి చెందుతాయి. వీటిలో పది దీవులు మినహా మిగిలినవన్నీ భూపరిమితి తక్కువ కలిగిన దీవులు. తాజా సునామీ బీభత్సంలో ఈ చిన్న చిన్న దీవులన్నీ తుడిచి పెట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. 

ఐర్లాండ్ పై వెస్టిండీస్ విజయం

మొహలి,మార్చి 11:    ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్  44 పరుగుల తేడాతో నెగ్గి పట్టికలో మరో రెండు పాయింట్లను జత చేసుకుంది. టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన ఐర్లాండ్ జట్టు 49 ఓవర్లలో 231 పరుగలకు ఆలౌట్ అయ్యింది. ఐర్లాండ్ బౌలర్లలో బెన్ 4, సమ్మీ మూడు వికెట్లు తీసుకున్నారు. 

పార్టీ పేరును ప్రకటించిన జగన్

హైదరాబాద్,మార్చి 11:   వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీకి ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’గా నామకరణం చేస్తున్నట్లు జగ్గంపేట బహిరంగ సభలో వెల్లడించారు. శనివారం  మధ్యాహ్నం 2.29 నిమిషాలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ప్లీనరీ నిర్వహించి పార్టీ విధివిధానాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రతి పేదవాడికీ సంతోషాన్ని ఇచ్చే పార్టీ 'వైఎస్సాఆర్ పార్టీ’ అని  జగన్మోహన్ రెడ్డి అన్నారు.

జింబాబ్వే పై శ్రీలంక గెలుపు

క్యాండీ (శ్రీలంక),మార్చి 11: గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 139 పరుగుల తేడాతో జింబాబ్వే పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓపెనర్లు తిలకరత్నే దిల్షాన్ (131 బంతుల్లో 144; ఫోర్లు 16, సిక్స్ 1), ఉపుల్ తరంగ (141 బంతుల్లో 133; ఫోర్లు 17) సెంచరీలతో హోరెత్తించారు. భారీ  లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే ఆరంభంలో లంకను బెదరగొట్టింది. ఓపెనర్ బ్రెండన్ టేలర్ (72 బంతుల్లో 80; ఫోర్లు 9, సిక్స్ 1) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినప్పటికీ  ఇతరులు రాణించలేదు. ఫలితంగా 188 పరుగులకే ఆలౌటయ్యింది.  బౌలింగ్‌లోనూ సత్తా చాటుకుని కేవలం మూడు ఓవర్లలో నాలుగు పరుగులకు నాలుగు వికెట్లు తీసిన దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. 

తెలుగు సంస్కృతి కి 'ప్రాంతీయ ' తెగులు

విచక్షణ మరచిన మిలియన్ మార్చర్లు
ట్యాంక్ బండ్ పై 13 విగ్రహాలు ధ్వంసం
హైదరాబాద్,మార్చి 11: తెలంగాణ జేఏసీ గురువారం నిర్వహించిన  మిలియన్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగి, విధ్వంసంతో ముగిసింది. అడుగడుగునా ఖాకీల ఆంక్షలతో గురువారం ఉదయం రాష్ట్ర రాజధానిలో బంద్ వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం వేడెక్కింది. అనుకున్న సమయానికి ఉద్యమకారులు మిలియన్ మార్చ్ నిర్వహించారు.  ట్యాంక్‌బండ్ మీదున్న విగ్రహాలు, పోలీసు, మీడియా వాహనాలను ధ్వంసం చేశారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 13 విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రేణులు అక్కడికి వచ్చిన నేతలపైనా దాడులకు దిగాయి.. మిలియన్ మార్చ్ కు  సహకరించలేదంటూ  టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ పైనా  దాడి కి దిగారు.  ‘జనం వచ్చారని వచ్చావా?’ అంటూ మహిళలు ఆయన కారుకు అడ్డం తిరిగి తిట్లదండకం అందుకున్నారు. ‘మీ వల్లే తెలంగాణ రావడం లేదు’ అంటూ కాంగ్రెస్ ఎంపీలు కే.కేశవరావు, మధుయాష్కీలపై భౌతికదాడులకు దిగడంతో వారు పోలీసుల సాయంతో వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, మిలియన్ మార్చ్ నేపథ్యంలో పోలీసులు రాజధానిని ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌ను అష్టదిగ్బంధం చేశారు. రహదారులన్నీ మూసేసి ఎక్కడివారిని అక్కడే అడ్డుకున్నారు. నేతల అరెస్టులు, బారికేడ్లు, చెక్‌పోస్టులతో నిలువరించే ప్రయత్నం చేశారు. రైళ్లు, బస్సులు రద్దుచేసి, రోడ్లను మూసేశారు. అతికష్టంగా మిలియన్ మార్చ్ లో పాల్గొన్న తెలంగాణవాదులు తమ నేతల అరెస్టులపై మండిపడ్డారు. నేతలను విడిచిపెట్టాల్సిందేనంటూ ట్యాంక్‌బండ్‌పై విధ్వంసానికి పాల్పడ్డారు. దీన్ని చిత్రిస్తున్న మీడియా వాహనాలపై దాడి చేశారు.  కెమెరాలను లాక్కుని హుస్సేన్ సాగర్‌లో పడేశారు. మరోవైపు ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు ర్యాలీగా ట్యాంక్‌బండ్ వైపు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల రాళ్లు.. పోలీసుల బాష్పవాయు ప్రయోగాలతో ఓయూ రణరంగంగా మారింది. పోలీసులు ఉదయం ఆరు గంటల నుంచే నగరంలోని రహదారులన్నీ మూసేశారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత న్యూడెమోక్రసీ కార్యకర్తలు, బీజేపీ, సీపీఐ కార్యకర్తలు, టీఆర్‌ఎస్ శ్రేణులు ట్యాంక్‌బండ్‌కు చేరాయి.
 13 మంది మహనీయుల విగ్రహాలు ధ్వంసం
మిలియన్ మార్చ్ లో  తెలంగాణవాదులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న 13 మంది మహనీయుల విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. వాటిలో 12 విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో పడేశారు. మరో నాలుగింటిని పాక్షికంగా ధ్వంసం చేశారు. కూల్చేసిన ప్రతి విగ్రహం వద్ద.. కొమరం భీం విగ్రహం పెట్టాలని ప్లకార్డులు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 33 విగ్రహాలలో   గురజాడ అప్పారావు, బళ్లారి రాఘవ, సర్ ఆర్థర్ కాటన్, త్రిపురనేని రామస్వామిచౌదరి, బ్రహ్మనాయుడు, శ్రీకృష్ణదేవరాయలు, సిద్ధేంద్రయోగి, అన్నమాచార్య, ఎర్రాప్రగడ, నన్నయ భట్టు, కందుకూరి వీరేశలింగం, మరో రెండు విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సీఆర్ రెడ్డి, జాషువా, శ్రీశ్రీ, క్షేత్రయ్య విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

Tuesday, March 8, 2011

పాక్ ను పడగొట్టిన కివీస్

క్యాండీ (శ్రీలంక),మార్చి 9: :మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 110 పరుగుల ఆధిక్యంతో పాక్ పై ఘనవిజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కిదే తొలి పరాజయం. రాస్ టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది.  న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 302 పరుగుల స్కోరు చేసింది. అనంతరం పాకిస్థాన్ 41.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది.  కివీస్ ‘బర్థ్ డే బర్త్‌డే బాయ్’ రాస్ టేలర్ (124 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 131 నాటౌట్) తుఫాన్ సృష్టించాడు.  ఆఖరి ఆరు ఓవర్లలో రాస్ టేలర్, నాథన్ మెక్‌కల్లమ్, జాకబ్ ఓరమ్ వీరవిహారంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 302 పరుగుల స్కోరు చేసింది.

వేద పండితులకు టిటిడి ఆయుష్మాన్ భవ

తిరుపతి,మార్చి 8: వేద పండితుల పేరిట ఆయుష్మాన్ భవ ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు టిటిడి ప్రకటించింది. మంగళవారం  జరిగిన టిటిడి వేద సమ్మేళనంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వేదపండితుల భార్యలకు అయిదు వేల రూపాయల వితంతు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. వేద విద్యార్థుల పేరిట మూడు వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు. వృద్ధ వేదపండితులకు 8 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు.

దిగి వచ్చిన డిఎంకె: కాంగ్రెస్ కు 63 స్థానాలు

న్యూఢిల్లీ,మార్చి  8: తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, డిఎంకెల మధ్య ఎట్టకేలకు చర్చలు ఫలించాయి. కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలు కేటాయించడానికి డిఎంకె అంగీకరించింది. ఈ రెండు పార్టీల మధ్య మూడు రోజుల నుంచి చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే 15 స్థానాలు అదనంగా పొందింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, కేంద్ర మంత్రి అళగిరి, కరుణానిధి మేనల్లుడు, కేంద్ర మంత్రి దయానిధి మారన్'ల మధ్యన జరిగిన చర్చలలో సీట్ల ఒప్పందం కుదిరింది. డిఎంకె 61 స్థానాలను ఇవ్వడానికి అంగీకరించింది. మరో రెండు స్థానాలను మిత్ర పక్షాల నుంచి ఇప్పిస్తామని డిఎంకె హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదట 60 స్థానాలను కోరింది. డిఎంకె 60 స్థానాలను ఇవ్వడానికి అంగీకరించిన తరువాత 63 స్థానాలను కోరింది. దాంతో ఇరు పార్టీల మధ్య వ్యవహారం బెడిసి కొట్టింది. దాంతో చర్చలు మొదలయ్యాయి.  చివరికి కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టి  కోరిన విధంగా 63 స్థానాలను పొందింది. 


దినోత్సవాలతో సరి...సాధికారత ఏది ?

మార్చి 8 -అంతర్జాతీయ మహిళా దినోత్సవం 

మిలియన్ మార్చ్ కు అనుమతి నిరాకరణ

హైదరాబాద్,మార్చి 8 : ఈనెల 10వ తేదీన  తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన మిలియన్ మార్చ్ కు  అనుమతి నిరాకరించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు.  మిలియన్ మార్చ్ పై  ప్రొఫెసర్ కోదండరామ్ సమాచారం ఇచ్చారే కానీ తమను అనుమతి కోరలేదన్నారు. మార్చ్ లో   చట్టసమ్మతం కాని అంశాలు ఉన్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇతరులకు సమస్యలు సృష్టించకుండా మిలియన్ మార్చ్ నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు.  బందోబస్తు కోసం అదనపు బలగాలను రప్పిస్తున్నట్లు ఏకేఖాన్ తెలిపారు. సామాన్య ప్రజల రక్షణ కోసం తాము తీసుకోవాల్సి జాగ్రత్తలు తాము తీసుకుంటామన్నారు.
పరిక్షలు యథాతథం
కాగా, తెలంగాణ జేఏసీ తలపెట్టిన ‘మిలియన్ మార్చ్’ ఆందోళన సమయాన్ని మార్చడంతో ఆరోజు నిర్వహించాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఉన్నతాధికారులు తెలిపారు. పదిన జరపతలపెట్టిన ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్-2 పేపర్ పరీక్ష  ఉదయం 8 నుంచి 11 వరకు పరీక్ష ఉండటం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం లేదన్నారు. సీబీఎస్‌ఈ బోర్డు నిర్వహించే సోషల్ సైన్స్ పరీక్ష కూడా యథాతథంగా ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇది ఉదయం 10.30కు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తవుతుంది. 
శాంతియుతంగానే  మిలియన్ మార్చ్
 మిలియన్ మార్చ్ ను   శాంతియుతంగానే  నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.  మార్చ్ ను శాంతియుతంగా నిర్వహిస్తున్నందున పోలీసుల అనుమతి అవసరం లేదన్నారు. నాలుగు గంటలకు ట్యాంక్‌బండ్‌ పై ప్రతిజ్ఞ నిర్వహిస్తామని తెలిపారు.

Monday, March 7, 2011

ర్యాలీగా మాత్రమే మిలియన్ మార్చ్

హైదరాబాద్: మార్చి7: ఈనెల  10 తేదిన తలపెట్టిన మిలియన్ మార్చ్  యధావిధిగా కొనసాగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. అయితే పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా, విద్యార్థులు, తల్లితండ్రుల కోరిక మేరకు మిలియన్ మార్చ్ సమయంలో మార్పులు చేశామని ఆయన అన్నారు. మిలియన్ మార్చ్ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తామని ఆయన అన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి ట్యాంక్ బండ్ వరకు మిలియన్ మార్చ్ ర్యాలీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌పై ధర్నా నిర్వహిస్తామని, తెలంగాణ వాదులందరూ పాల్గొనాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. కాగా,  ‘మిలియన్ మార్చ్’కు అనుమతి లేదని హైదరబాద్ నగర పోలీస్ కమీషనర్ ఏకే ఖాన్, సైబరాబాద్ కమిషనర్ తిరుమల రావు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడటం, సభలు, ర్యాలీలను నిర్వహించడంపై నిషేదాజ్ఞలు విధించారు. పోలీసులు జారీ చేసిన నిషేదాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

కెన్యాపై కెనడా గెలుపు

న్యూఢిల్లీ, మార్చి ౭:  ప్రపంచకప్‌లో భాగంగా సోమవారమిక్కడ జరిగిన 23వ లీగ్ మ్యాచ్‌లో కెన్యాపై కెనడా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా 45.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు అందుకుంది. కెన్యాపై విజయంతో కెనడా ఈ ప్రపంచకప్‌లో బోణి కొట్టింది. హాన్సరా (70), బాగాయ్ (64) అర్థ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కెన్యా 50 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటయింది.

ప్రపంచకప్‌కు పీటర్సన్ దూరం

హెర్నియా ఆపరేషన్ కై స్వదేశానికి ప్రయాణ౦
 చెన్నై,మార్చి 7: ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. హెర్నియా ఆపరేషన్ కోసం మరో 24 గంటల్లో కెవిన్ పీటర్సన్ స్వదేశానికి ప్రయాణమవుతాడని జట్టు సమాచార ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే గాయాలు, ఫామ్‌ లేమితో కొట్టుమిట్టాడుతున్న ఇంగ్లాండ్ జట్టుకు కెవిన్ పీటర్సన్ దూరమవడంతో కష్టాలు తప్పవని క్రీడా  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై చేపాక్కం స్టేడియంలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ముగిసిన వెంటనే కెవిన్ పీటర్సన్ అనారోగ్యంతో బాధపడ్డాడు. పీటర్సన్‌ను పరీక్షించిన వైద్యులు అతనికి హెర్నియా ఆపరేషన్ వెంటనే చేయాలని సూచించారు. పీటర్సన్  స్థానంసో ఇయాన్ మోర్గాన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.  శుక్రవారం ఇంగ్లాండ్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. 


పాణిగ్రహణం...

                                         అల్లు అర్జున్-స్నేహారెడ్డి పెళ్ళి ఫొటో...
                            గ్రాఫిక్ డిజైనర్ యామినీ రాయ్‌తో బిజెపి ఎంపి వరుణ్ గాంధీ వివాహ దృశ్యం .
                               పెద్దమ్మ, యుపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ,
                               సోదరి ప్రియాంకా గాంధీ ఈ వివాహానికి హాజరు కాకపోవడం కొసమెరుపు 

Sunday, March 6, 2011

పెరగనున్న ఐటి ఉద్యోగుల వేతనాలు

హైదరాబాద్, మార్చి 7: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, బీమా రంగం, ఇతర కార్పోరేట్ రంగాల్లో ఉద్యోగుల వేతనాలు ఈ ఏడాది బాగా పెరిగే అవకాశాలున్నాయి. రెండేళ్ల పాటు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని విలవిలలాడిన ఐటి ఉద్యోగులకు  ఈ ఏడాది 16 శాతం వరకు వేతనాలు పెరుగుతాయని హ్యూమన్ రిసోర్స్ కన్సల్టింగ్ సంస్ధ మెర్సర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇంక్రిమెంట్లు గత ఏడాది కంటే ఎక్కువగానే ఉంటాయి. అనేక బెనిఫిట్లను ఉద్యోగులకు కార్పోరేట్ కంపెనీలు ఇవ్వనున్నాయని,   కొన్ని కంపెనీలు 13 నుంచి 14 శాతం వరకు ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు వెనకాడవని హ్యూమన్ రిసోర్స్ సంస్ధ పేర్కొంది.  ప్రథానంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్, చమురు, సహజవాయువు, మైనింగ్ షిప్పింగ్, ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో, ఐటి, ఎఫ్‌ఎంజిసి, ఇతర వినిమయ వస్తువుల తయారీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. 

ఐర్లాండ్‌పై గెలిచిన భారత్

బెంగళూరు,మార్చి 6:: పపంచకప్‌లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన 22వ లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెహ్వాగ్ 5, సచిన్ 38, గంభీర్ 10, కొహ్లి 14, ధోనీ 34 పరుగులు చేశారు. యూసఫ్ పఠాన్ (30), యువరాజ్ సింగ్ (50) నాటౌట్‌గా మిగిలారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 47.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటయింది. 

Saturday, March 5, 2011

లిబియాలో భీకరపోరు

కైరో,, మార్చి 6:   లిబియాలో గడాఫీ అనుకూల, వ్యతిరేక దళాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ప్రధానంగా రాస్ లునాఫ్, అల్ జావియా పట్టణాల్లో భీకరపోరు కొనసాగుతోంది. రాజధాని ట్రిపోలీకి దగ్గరలో ఉన్న అల్‌జావియా పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం గడాఫీ సేన శనివారం మూడుసార్లు ప్రయత్నించిందని,  గడాఫీ మద్దతుదారుల దాడుల్లో అల్‌జావియాలో 30 మంది చనిపోయినట్లు చానళ్ళు తెలిపాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణల్లో దేశవ్యాప్తంగా శనివారం ఒక్కనాడే దాదాపు 74 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బెంఘాజీ శివార్లలో గడాఫీ సైన్యం జరిపిన వైమానిక దాడులలో సైన్యానికి చెందిన ఆయుధ గిడ్డంగి వద్ద  దాదాపు 34 మంది చనిపోయారు. తిరుగుబాటుదారులు నియంత్రణలోకి తీసుకున్న ప్రాంతాలపై తిరిగి పట్టు సాధించడం కోసం గడాఫీ సైన్యం యుద్ధట్యాంకులు, అత్యాధునిక ఆయుధాలతో దాడులను ఉధృతం చేసింది. తిరుగుబాటుదారుల స్థావరాలపై విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తోంది. గడాఫీ ప్రభుత్వాన్ని గుర్తించడం లేదంటూ అమెరికా సహా పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో.. సమాంతర ప్రభుత్వ ఏర్పాటుకు తిరుగుబాటుదారులు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 

కౌన్సిల్ ఎన్నికలు: ఏడో సీటుపై ఎటూ తేల్చని కాంగ్రెస్

హైదరాబాద్,, మార్చి 6:   ఎమ్మెల్యే నియోజకవర్గాల శాసనమండలి స్థానాల ఎన్నికల్లో ఆరింటికి పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ కూటమి ఏడో స్థానంపై మల్లగుల్లాలు పడుతోంది. ప్రజారాజ్యం పార్టీ, ఎంఐఎం, ఇండిపెండెంట్లను కలుపుకొని ఆరు స్థానాలు గెలవనున్న కాంగ్రెస్.. నాలుగు స్థానాలకు తన అభ్యర్థులను ఖరారు చేసింది. శాసనమండలి ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ మహ్మద్ జానీ, సభ్యులు పాలడుగు వెంకట్రావు, బి.చెంగల్రాయుడులతో పాటు కొత్తగా కర్నూలు మాజీ మున్సిపల్ చైర్మన్, డీసీసీ ప్రధాన కార్యదర్శిసుధాకర్‌బాబును ఎంపిక చేస్తూ ఢిల్లీలో జాబితా విడుదల చేశారు. ఇక.. కాంగ్రెస్‌లో విలీనమవుతున్న ప్రజారాజ్యం పార్టీకి ఒక స్థానాన్ని, ఎంఐఎంకు మరో స్థానాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.   ఎమ్మెల్యే కోటా స్థానాలు పదింటికి ఎన్నికలు జరగనుండగా ఒక్కో అభ్యర్థి గెలవాలంటే 27 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్య ఓటు వేయాల్సి ఉంటుంది. శాసనసభలో కాంగ్రెస్, పీఆర్పీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ల సంఖ్యను అనుసరించి ఆ కూటమికి ఆరు స్థానాలు కచ్చితంగా దక్కుతాయి. ఏడో స్థానానికి అభ్యర్థిని నిలిపినా గెలుపు కచ్చితమని లేదు. దీంతో ఏడో అభ్యర్థిని బరిలో దింపాలా వద్దా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. పార్టీకి ఆరు స్థానాల్లో గెలుపునకు సరిపడా ఓట్లతోపాటు అదనంగా మరికొన్ని ఓట్లు ఉండటంతో.. రెండో ప్రాధాన్య ఓటు లెక్కిం పు తో అయినా ఏడో అభ్యర్థి గట్టెక్కే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఏడో అభ్యర్థిని దింపడం పై నిర్ణయం తీసుకోవలసి వుంది. 

గులాంనబీ ఆజాద్‌పై కాకా ఫైర్

హైదరాబాద్,, మార్చి 6:   కాంగ్రెస్ వృద్ధనేత జి.వెంకటస్వామి (కాకా) మళ్లీ తన అసమ్మతి గళాన్ని విప్పారు. మొన్న సోనియాగాంధీపై నిప్పులు చెరిగిన ఆయన నేడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌పై విరుచుకుపడ్డారు. విభజించి పాలించడంలో ఆయన మొనగాడని ధ్వజమెత్తారు. కేసీఆర్, నరేంద్రకు పదవులిచ్చి తెలంగాణ రాకుండా చేసిన మహాపురుషుడు ఆయనేనని విమర్శించారు. శనివారం సాయంత్రం తన నివాసంలో కాకా మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని,  పేర్కొన్నారు. ‘‘ఎన్నో ఏళ్లుగా నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కొనసాగుతున్నా. ఎప్పుడు మీటింగ్ జరిగినా తెలంగాణ గురించి ప్రస్తావిస్తే తరువాత మాట్లాడదాంలే...అంటూ వాయిదా వేసేవారు. ఇక లాభం లేదనుకుని ఒకసారి మీటింగ్‌లో తెలంగాణ ఇస్తరో.. ఇయ్యరో చెప్పాలి. లేకుంటే వాకౌట్ చేసి పోతానని గట్టిగా అడిగిన. వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ నా వద్దకొచ్చి చేతులు పట్టుకుని అట్లా చేయొద్దని ఆపారు. అప్పటి నుంచి నేను సీడబ్ల్యూసీలో ఉంటే తెలంగాణపైనే మాట్లాడతానని అనుకున్నారేమో! నన్ను తీసేసిండ్రు’’ అని కాకా చెప్పారు. అయినప్పటికీ తనకేమాత్రం బాధలేదని, సంతోషంగానే ఉన్నానని అన్నారు.  కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని ఇది వరకే భావించానన్నారు. 

కాంగ్రెస్ తో డీఎంకే కటీఫ్...

 నిన్నటి అనుబంధం...
* తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకేల మధ్య బెడిసి కొట్టిన పొత్తు
* 60 స్థానాలు ఇస్తామన్న డీఎంకే; 63కు కాంగ్రెస్ పట్టు

న్యూఢిల్లీ, మార్చి 6:  కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు సంక్షోభంలో పడింది. పాలక సంకీర్ణం నుంచి వైదొలగుతున్నట్టు కూటమిలోని రెండో అతి పెద్ద భాగస్వామ్య పక్షమైన డీఎంకే శనివారం ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన డీఎంకే... కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగి, యూపీఏకు అంశాలవారీగా మాత్రమే మద్దతు కొనసాగించాలని చెన్నైలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయించింది. సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలను సహించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు మంత్రివర్గం నుంచి తప్పుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్  కోరినట్టు 60 సీట్లిచ్చేందుకు కూడా తంగీకరించామని, అయితే  హఠాత్తుగా తమకు 63 సీట్లు కావాలని డిమాండ్ చేసిందని  పైగా ఎక్కడెక్కడ పోటీ చేయాలో తామే నిర్ణయించుకుంటామంటూ మడతపేచీ పెట్టిందని, తమ పార్టీని   వదిలించుకోవడమే దీని వెనక ఏకైక ఉద్దేశంగా కనిపిస్తోందని కరుణానిధి మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరి స్పష్టం కావడంతో, ఇక యూపీఏలో కొనసాగడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చామని  పేర్కొన్నారు. కాగా సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం రంగంలోకి దిగారని, ఆదివారం ఉదయానికి ఆయన చెన్నై చేరుకుంటారని తెలిసింది. మరో మంత్రి ప్రణబ్ నేరుగా కరుణతో మాట్లాడే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. అయితే , కరుణానిధి ఆరోపణలపై కాంగ్రెస్ ఇంతవరకు స్పందించలేదు. అనవసర వ్యాఖ్యలతో పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయబోమని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు.
యూపీఏ కు గడ్డు పరిస్థితి
 543 మంది సభ్యుల లోక్‌సభలో సాధారణ మెజారిటీ 272 కాగా, యూపీఏ ప్రస్తుత బలం 260 మాత్రమే. డీఎంకే వైదొలగుతుండటంతో అది 242కు పడిపోనుంది. 19 మంది ఎంపీలున్న తృణమూల్  యూపీఏలో భాగస్వామి కాగా,  సమాజ్‌వాదీ (22 మంది ఎంపీలు), బీఎస్పీ (21), ఆర్జేడీ (4), జేడీ-ఎస్ (3)  పార్టీలు యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఉమ్మడి బలగాల ఉనికిపై తృణమూల్ అధ్యక్షురాలు, రైల్వే మంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. వాటిని ఉపసంహరించకుంటే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించారు. ఇక మే నెలలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు కూడా నానాటికీ క్లిష్టంగా మారుతోంది. తమకు మూడో వంతు సీట్లు కావాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మానస్ భుయా శనివారం డిమాండ్ చేశారు! కాంగ్రెస్‌తో ఒకవేళ పొత్తు పెట్టుకున్నా, ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోనని మమత ఇప్పటికే కరాఖండీగా  చెప్పారు. తాజా పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరుస్తున్నాయి.

రాజినామా బాటలో తెలంగాణ మంత్రులు

హైదరాబాద్,మార్చి 5: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలోనే మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. శనివారం జరిగిన  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం లో  ఈ నెల 12వ తేదీ వరకు శాసన సభ సమావేశాలను బహిష్కరించాలని  నిర్ణయించారు. ఈ నెల 12 లోపే ఢిల్లీ వెళ్లాలని  తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే సోనియా గాంధీ ముందే మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

కొలంబో మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కొలంబో,మార్చి 5:   ఇక్కడ జరుగుతున్న ఐసిసి ఒక రోజు క్రికెట్ ప్రపంచకప్ 20వ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. ఆస్ట్రేలియాతో తలపడుతున్న శ్రీలంక జట్టు  ఆట నిలిచిపొయే సమయానికి 32.5 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 146 పరుగలు చేసింది. తారంగ్ ఆరు పరుగులు, దిల్షన్ నాలుగు, జయవర్దనే 23 పరుగులు చేసి అవుటయ్యారు. సంగక్కర 73 పరుగులు, సమరవీర 34 పరుగులతో నాటౌట్ గా  నిలిచారు. లీ, టైట్ చెరో వికెట్ తీసుకున్నారు.

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్,మార్చి 5: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మంత్రి పార్ధసారధి తెలిపారు. అన్ని జిల్లాలలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు. కాగా, రంగారెడ్డి , హైదరాబాద్ లలో మిలియన్ మార్చ్ కారణంగా ఈ నెల 10వ తేదీన పరీక్ష నిర్వహించాలా? వద్దా? అనే విషయం టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడి  నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇలా వుండగా,  మిలియన్ మార్చ్, వివిధ పరీక్షల నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు శాసన సభ పరిసర ప్రాంతాలలో ఆంక్షలు విధించారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు.
టెన్త్, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఈనెల 25వ తేదీ వరకు 144వ సెక్షన్ విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎ.కె.ఖాన్ చెప్పారు.

Friday, March 4, 2011

తమిళనాట ఇక ' జయ 'ప్రదం?

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 5: త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సారధ్యంలోని అన్నాడీఎంకే కూటమికే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమికన్నా అన్నాడీఎంకే కూటమికే ఎక్కువగా లాభం చేకూరనుందని ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ ‘ఔట్‌లుక్’, ఎండీఆర్‌ఏ సంస్థ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో తేలింది. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచ్చిలలో ఫిబ్రవరి 26-28 మధ్య 626 మందితో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న 54 శాతం మంది ప్రజలు తాము అన్నాడీఎంకే కూటమికి అధికారం కట్టబెడతామని పేర్కొనగా కేవలం 34 శాతం మంది ప్రజలు మాత్రమే డీఎంకే వైపు మొగ్గు చూపారు. కాగా, 2జీ స్పెక్రమ్ కుంభకోణంతో తమిళనాడు ప్రతిష్ట దెబ్బతిన్నదని 86.1 శాతం మంది అభిప్రాయపడగా అవినీతి ఆరోపణలు, ధరల పెరుగుదల అంశాలు ఎన్నికల్లో డీఎంకే కూటమిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వరుసగా 71.9, 72.5 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2జీ కుంభకోణం... ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబం, డీఎంకేను దెబ్బతీసిందని 78.1 మంది పేర్కొనగా ఈ స్కాం వల్ల కరుణ కుటుంబం లబ్ధి పొందిందని 73 శాతం మంది విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
జయతో చేతులు కలపిన విజయకాంత్    
ఇలా వుందగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని ప్రముఖ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, అన్నాడీఎంకే నిర్ణయించాయి. డీఎండీకేకి 41 నియోజకవర్గాలను కేటాయించేందుకు జయలలిత అంగీకరించారు. ఈ మేరకు ఇరు పార్టీలు మీడియాకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించిన తరువాత విజయకాంత్ జయలలితను కలుసుకోవడం ఇదే తొలిసారి.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...