Monday, April 30, 2012

రాజ్యసభకు సచిన్ నామినేషన్‌పై కేసు

మదురై,మే 1:   సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలైంది. మదురై సమీపంలోని ఒక కోర్టులో సచిన్‌పై ఒక కేసు పెండింగులో ఉన్నందున రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని ఎ.బెనిటో అనే న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు, రాజ్యసభ సచివాలయానికి, ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జమైకాలో 2010 మార్చిలో జరిగిన ఒక పార్టీలో సచిన్ జాతీయ పతాకాన్ని అవమానించారనే ఆరోపణపై మేలూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు పెండింగ్‌లో ఉంది.

యాజమాన్య హక్కులపై సుప్రీం సంచలన తీర్పు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 29:  ఏదైనా  ఒక స్థలం సంరక్షకులు లేదా ఏజెంట్ల అధీనంలో దీర్ఘకాలంగా ఉన్నంత మాత్రాన ఆస్తిపై వారికి యాజమాన్య హక్కులు సంక్రమించబోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భూమిని పర్యవేక్షించేందుకు నియమించిన కాపలాదారుడు (వాచ్‌మన్), సంరక్షకుడు, సేవకుడికి దానిపై హక్కులు దఖలు పడబోవని పేర్కొంది. ఆస్తి ఎన్నేళ్లుగా వారి సంరక్షణలో ఉన్నప్పటికీ ఇదే సూత్రం వర్తిస్తుందని తెలిపింది. యజమాని కోరగానే ఆస్తిని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత వారిపై ఉందని జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఈమేరకు రెండు తరాలుగా తమ కుటుంబ పర్యవేక్షణలో ఉన్న స్థలంపై యాజమాన్య హక్కులు కల్పించాలని కోరుతూ ఓ వాచ్‌మన్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 
 

Sunday, April 29, 2012

మదురై పీఠాధిపతిగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద

చెన్నై,ఏప్రిల్ 30:  ప్రతిష్టాత్మక మదురై ఆధ్యాత్మిక పీఠం 293వ పీఠాధిపతిగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద నియమితులయ్యారు. దుష్టశక్తులు ఎన్ని కుట్రలు పన్నినా భక్తులంతా తన వెంటే ఉన్నారని ఆయన  ఈ సందర్భంగా అన్నారు. తన పీఠానికి సంబంధించి 40 దేశాల్లో ఆశ్రమాలు ఉన్నాయన్నారు. మొత్తం 1.2 కోట్ల మంది భక్తులు తన వెంట ఉన్నారని, ఆరోపణలకు చట్టబద్ధంగానే సమాధానమిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు, మదురై మఠాధిపతిగా నిత్యానంద నియామకాన్ని పలువురు భక్తులు వ్యతిరేకించారు. ఆరోపణలు సమసిపోయాకే పదవిని చేపట్టాలని డిమాండ్ చేశారు.  కాగా , ఈ వ్యవహారంలో తాము తలదూర్చబోమని వీహెచ్‌పీ, బీజేపీ నేతలు ప్రకటించారు. 

ఏమిటీ కలయిక ఆంతర్యం...!?

హైదరాబాద్, ఏప్రిల్ 29:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు  ఇంటికి జగన్ వెళ్లడం రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. మోహన్ బాబును తన పార్టీలోకి ఆహ్వానించేందుకు జగన్ ఆయన ఇంటికి వెళ్లి ఉంటారని పలువురు భావిస్తుండగా,  త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో మద్దతు కోసం కూడా వెళ్లి ఉండారనే ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు ఇటీవల తన అరవయ్యో పుట్టిన రోజు సందర్భంగా రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏ రాజకీయ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని తన పుట్టిన రోజు వేడుకలకు చాలా రోజుల తర్వాత ప్రత్యేకంగా పిలవడంతో మోహన్ బాబు టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపించాయి.ఇలాంటి సమయంలో అదీ ఉప ఎన్నికలకు ముందు జగన్ ఆయన ఇంటికి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలను కూడా పరిశీలకులు కొట్టి పారేయడం లేదు. అయితే తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరగలేదని కలెక్షన్ కింగ్  అంటున్నారు. మరోవైపు  కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే జగన్ -మోహన్ బాబు ను హీరోను కలిశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నారు. న్నట్లుగా తెలుస్తోంది. మరి రాజకీయ సమీకరణాలు ఏమైనా మారుతాయా లేదో చూడాలి.

కొడుక్కి తిరుపతి టిక్కెట్ కోసం చిరు ఇంటికి గల్లా...

హైదరాబాద్, ఏప్రిల్ 29:  మంత్రి గల్లా అరుణ కుమారి ఆదివారం రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. తిరుపతి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ తన తనయుడు గల్లా జయదేవ్‌కు వచ్చే విధంగా మద్దతు ఇవ్వాలని ఆమె చిరంజీవిని కోరారు. గల్లా అరుణ తన తనయుడు గల్లా జయదేవ్‌తో కలిసి చిరంజీవి ఇంటికివెళ్లారు.  కాగా, చిరంజీవి   తిరుపతి అభ్యర్థిగా అధిష్టానం వద్ద వెంకట రమణ పేరును ప్రతిపాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జయదేవ్‌కు టిక్కెట్ ఇప్పించేందుకు చిరు సుముఖంగా లేరనే వార్తలు కూడా  వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెంకట రమణ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా గల్లా అరుణ కుమారి తన తనయుడి కోసం చిరును కలిశారు. తన తనయుడికి సీటు ఇస్తే ఎలా గెలుస్తాడో పూర్తి సర్వే వివరాలు చిరుకు వారు వివరించినట్లుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి కూడా జయదేవ్ పేరును కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని గల్లా అరుణకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
 

ఉప ఎన్నికలకు సి.పి.ఎం. రెడీ

 4 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ సీట్లకు అభ్యర్ధుల ప్రకటన 
హైదరాబాద్, ఏప్రిల్ 29:  తమ పార్టీ జాతీయ విధానంలో భాగంగానే రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని, తమకు ఓటేస్తే ప్రజా ఉద్యమాలకు వేసినట్టేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు  చెప్పారు. వచ్చే ఉపఎన్నికల్లో 4 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ సీట్లకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులను ఆయన ప్రకటించారు. పాయకరావుపేట నుంచి విశాఖ జిల్లా కమిటీ సభ్యుడు కె.లోకనాధం, పోలవరం నుంచి గిరిజన సంఘం నాయకుడు తెల్లం వెంకటేశ్వరరావు, తిరుపతి నుంచి కార్మిక సంఘం నాయకుడు కందారపు మురళి, అనంతపురం నుంచి వి.రాంభూపాల్‌రెడ్డి, నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఆ జిల్లా పార్టీ కార్యదర్శి చండ్ర రాజగోపాల్ పోటీ చేస్తారని తెలిపారు. పరకాలలో ఎంసీపీఐ (యు)కి, ఒంగోలులో లోక్‌సత్తాకు మద్దతిస్తామన్నారు. తాము పోటీ చేయని మిగతా చోట్ల వామపక్షాలుంటే వారికి మద్దతిస్తామని, లేని చోట్ల ఎవరికివ్వాలనే దానిపై నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నిర్ణయిస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భావసారుప్యత కలిగిన పార్టీ ఏదీ పోటీకి రాకపోతే తామే రంగంలోకి దిగుతామన్నారు. 

చాలా హాపీగా ఉంది...గవర్నర్

హైదరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్రానికి రెండోసారి గవర్నర్‌గా నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ఉదయం రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. డీఎస్,  మంత్రులుగీతారెడ్డి,  వట్టి వసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఎమ్మెల్యేలు కూడా నరసింహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరో అవకాశం రావడం సంతోషంగా ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. సమస్యలు ఎప్పుడూ ఉండేవేనన్న గవర్నర్ వాటిని అధిగమించినప్పుడే జీవితానికి అర్థముంటుందన్నారు. పోలీసు విభాగంలో ఉన్నప్పుడైనా... గవర్నర్‌గా విధులు నిర్వర్తించినా తనకు రెండూ సంతృప్తినిచ్చాయని తెలిపారు. అయితే దేనికదే ప్రత్యేకత కలిగినవని వెల్లడించారు. రాష్ట్రప్రజలు, ప్రభుత్వం సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

Saturday, April 28, 2012

గవర్నర్ గా నరసింహన్ కొనసాగింపు

హైదరాబాద్,ఏప్రిల్ 28:  రాష్ట్ర గవర్నర్‌గా ఇఎస్ ఎల్ నరసింహన్ ని కొనసాగిస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 3న ఆయన  మళ్లీ గవర్నర్‌ గా ప్రమాణస్వీకారం చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోకూర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

బంగారు లక్ష్మణ్‌కు నాలుగేళ్ల జైలు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 28:  ఆయుధ డీలరు నుంచి లక్ష రూపాయల లంచం తీసుకున్న కేసులో బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. లక్ష రూపాయల జరిమానా కూడా చెల్లించాలని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కన్వల్ జీత్ అరోరా తీర్పు చెప్పారు. 2001లో తెహెల్కా డాట్ కామ్ న్యూస్ పోర్టల్ ‘ఆపరేషన్ వెస్టెండ్’ పేరుతో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ లక్ష్మణ్ దొరికిపోయారు. ఈకేసులో ఆయనను దోషిగా నిర్దారించిన కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.

వివాహ రిజిస్ట్రేషన్ సులభతరం

హైదరాబాద్,ఏప్రిల్ 27: హిందూ వివాహ రిజిస్ట్రేషన్లలో కీలక సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వివాహం జరిగిన నెల రోజు ల్లో రిజిస్టర్ చేయించుకోవాలి. అంతకు మించితే సహేతుకమైన కారణాలు చూపుతూ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడం, పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హిందు వివాహచట్టం నిబంధనలను ప్రభుత్వం సవరించింది. నెల రోజులు దాటితే ఉన్నతాధికారుల ఆమోదం తీసుకోవాలన్న నిబంధనను ఎత్తివేసింది. దీంతో వివాహం అయిన తర్వాత ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవ చ్చు. అలాగే పేర్లలో తప్పులు దొర్లితే.. వాటిని సవరించుకునేందుకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే సరిపోతుంది. 

విలీనం లేదు...స్వంతంగా రాష్ట్రం సాధిద్దాం...కె.సి.ఆర్.

హైదరాబాద్,ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. ఏ పార్టీ అయినా వచ్చి టీఆర్‌ఎస్‌లో విలీనం కావాల్సిందేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణను సాధించేదాకా, సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా పునర్నిర్మాణం చేసేదాకా టీఆర్‌ఎస్ ఉంటుందన్నారు.
జాతీయస్థాయిలో బలమైన శక్తిగా ఎదుగుతామని కేసీఆర్ ప్రకటించారు.   స్వీయ రాజకీయ అస్తిత్వం సంతరించుకుంటేనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని, ఆ దిశగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వంకోసం పౌరసమాజమంతా ఐక్యం కావాలని విజ్ఞప్తి చేశారు. పోరాటమైనా, ఉద్యమమైనా, సంక్షోభమైనా, రాజకీయమైనా సందర్భం ఏదన్నాగానీ తెలంగాణ ఐక్యతను ప్రదర్శించాలన్నారు. జూన్ ఆరంభంలో తెలంగాణకోసం మహోద్యమం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహాశక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్‌ను ఎవరూ, ఏమీ చేయలేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన గమ్యం ముద్దాడేదాకా పోరాటం ఆపొద్దని, ఆత్మహత్యలు చేసుకుని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. 10వేలకు పైగా ప్రతినిధులు సభకు హాజరయ్యారు.
 

తెహెల్కా దోషి బంగారు లక్ష్మణ్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్ 27:  తెహెల్కా కుంభకోణం కేసులో బిజెపి నాయకుడు బంగారు లక్ష్మణ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. 2001లో లక్ష రూపాయలు తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ తెహెల్కా స్టింగ్ ఆపరేషన్‌కు  దొరికిపోయారు. అప్పటి నుంచి 11 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. బంగారు లక్ష్మణ్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని తీహార్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పు తర్వాత బంగారు లక్ష్మణ్ కోర్టు హాల్లో కంటతడి పెట్టారు. శనివారంనాడు ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు. బంగారు లక్ష్మణ్‌కు విధించే శిక్షను ఢిల్లీ కోర్టు  ఖరారు చేస్తుంది. స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినప్పుడు బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కుంభకోణంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగారు లక్ష్మణ్ అంచెలంచెలుగా పార్టీ జాతీయాధ్యక్షుడి దాకా ఎదిగారు. అయితే, తెహెల్కా చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌తో ఆయన జాతకం తిరగబడింది. 

Friday, April 27, 2012

తివారీకి పితృత్వ పరీక్ష తప్పదు...

ఉజ్వల శర్మ,రోహిత్,తో ఎన్డీ తివారీ
న్యూఢిల్లీ ,ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్  మాజీ గవర్నర్ ఎన్డీ తివారీకి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురు అయ్యింది. పితృత్వ కేసులో స్పష్టమైన సాక్ష్యాధారాల కోసం డీఎన్ఏ పరీక్షకు రక్త నమూనా ఇవ్వాల్సిందేని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. బలవంతంగా తివారీకి డీఎన్ ఏ పరీక్ష చేయించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్వర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. తాను తివారీకి పుట్టానని చెబుతున్న రోహిత్ శేఖర్ సింగిల్ జడ్డి ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. నాలుగు వారాల్లో ఎన్డీ తివారీ రక్త నమూనాను ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. రోహిత్ శేఖర్ అనే యువకుడు - తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశాడు. తన తల్లి ఉజ్వల శర్మతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న తివారీకి తాను జన్మించానని అతను వాదిస్తున్నాడు. దాంతో ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అది తన ప్రైవసీని దెబ్బ తీసే చర్య అని ఆయన అభివర్ణిస్తున్నారు. తివారీకి పితృత్వ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు నిరుడు డిసెంబర్‌లో జారీ చేసింది.

కన్నుమూసిన భార్యతో సెక్స్...!

చట్టం తెచ్చేందుకు ఈజిప్ట్  సన్నాహాలు
వాషింగ్టన్,ఏప్రిల్ 27:  భార్య కన్నుమూసిన తర్వాత ఆమెతో సంభోగం చేసే హక్కును భర్తలకు కట్టబెట్టే చట్టం తెచ్చేందుకు ఈజిప్ట్ దేశం సన్నాహాలు చేస్తోందిట.  ఎవరైనా చనిపోతే కన్నీటితో వీడ్కోలు పలుకుతారు. కానీ ఈజిప్ట్ లో మాత్రం భార్య కన్నుమూసిన ఆరు గంటల లోపు ఆమె భౌతికకాయంతో సెక్స్ చేసే హక్కుని భర్తకు కట్టబెట్టే వింత చట్టానికి తెరతీస్తోందట. ఈ చట్టానికి ''ఫేర్‌వెల్ ఇంటర్‌కోర్స్ డ్రాఫ్ట్ లా''  (వీడ్కోలు సంభోగానికి ముసాయిదా చట్టం) అనే  పేరు పెడుతున్నారుట... ఈ చట్టానికి సంబంధించి తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ అక్కడి నేషనల్ కౌన్సిల్ ఫర్ విమెన్ అధ్యక్షురాలు డాక్టర్ మెర్వత్ అల్ తలావీ ఈజిప్షియన్ పీపుల్స్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ సాద్ అల్ కతాత్నికి లేఖ రాసినట్టు స్తానిక పత్రిక ప్రచురించింది.  ఈ చట్టంతో పాటు ఎర్లీ మ్యారేజ్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఎర్లీ మ్యారేజ్, సెక్స్ ఆఫ్టర్ డెత్ చట్టాలు తీసుకు రావొద్దని ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయిట. .

Thursday, April 26, 2012

పీఎస్‌ఎల్‌వీ సీ-19 ప్రయోగం సక్సెస్

కక్ష్యలో రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం 
హైదరాబాద్ ,ఏప్రిల్ 26:  పీఎస్‌ఎల్‌వీ సీ-19 ద్వారా రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 (రిశాట్) ప్రయోగం విజయవంతమైంది.  శ్రీహరికోట సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం  ఉదయం 5గంటల 47 నిమిషాలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-19 ఉపగ్రహం 17 నిమిషాల 50 సెకెన్లలో లక్ష్యానికి చేరుకుంది.  ఈ వాహకనౌక ద్వారా 1,830 కిలోలు బరువు కలిగిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 ను  480 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్య లోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల కంటే ఇది అతిపెద్ద ఉపగ్రహం. ఈ ప్రయోగానికి చంద్రయాన్-1 కు వినియోగించిన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగించారు. 498కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పీఎస్‌ఎల్‌వీ సీ-19 ప్రాజెక్టులో ఉపగ్రహానికి 378కోట్లు, రాకెట్‌కు 120కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు పదేళ్లు కష్టపడి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 లో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అనే పరికరం భూమిని అన్ని వేళలా పరిశీలిస్తూ ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాల రాకను గుర్తిస్తుంది. వరదలను కూడా పసిగట్టే సామర్థ్యం ఉంది. అడవులు, భూమిలో దాగి ఉన్న జలవనరులు, నిధి నిక్షేపాల జాడను కనిపెడుతుంది. రక్షణకు సంబంధించిన అంశాలను అతి దగ్గరగా ఛాయాచిత్రాలు తీసి పంపుతుంది.

కోడ్‌ను పాక్షికంగా సడలించిన ఈసీ

హైదరాబాద్ ,ఏప్రిల్ 26:   ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను  ఎన్నికల సంఘం పాక్షికంగా సడలించింది. జిల్లాలకు కాకుండా నియోజకవర్గాలకు మాత్రమే  ఎన్నికోడ్ పరిమితం చేసింది. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ, కరువు నివారణ పనులు కొనసాగించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక పర్యటనలపై మాత్రం జిల్లా వ్యాప్తంగా నిషేధం కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.

మావోయిస్టుల చెర నుండి ఒడిషా ఎమ్మెల్యే విడుదల

భువనేశ్వర్ ,ఏప్రిల్ 26:  మావోయిస్టుల చెర నుండి ఒడిషా రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ బిజెడి శాసనసభ్యుడు జిన్నా హికాకా విడుదలయ్యారు. ఈయన లక్ష్మీపురం స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నెల రోజులకు పైగా మావోయిస్టుల చెరలో ఉన్న హికాకాను మావోయిస్టులు గురువారం ఉదయం విడుదల చేశారు.హికాకాను గత మార్చి 24న మావోలు అపహరించారు. అప్పటి నుండి ప్రభుత్వం ఆయన విడుదల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయితే విదేశీయుల విడుదలకు చూపిన చొరవను ప్రభుత్వం చూపలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హికాకా మావోయిస్టు సానుభూతిపరుడు కాబట్టి ఆయనను ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం అంత చొరవ చూపలేదని అంటున్నారు.

రాజ్యసభకు సచిన్...?

న్యూఢిల్లీ,ఏప్రిల్ 26: క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యసభకు సచిన్ పేరు ప్రతిపాదించాలని హోంమంత్రిత్వ శాఖకు ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి కోటాలో సచిన్‌ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. గురువారం  ఉదయం సచిన్  తన భార్య అంజలితో కలిసి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటసేపు ఈ భేటీ జరిగింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా సచిన్ వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో సచిన్ రాజ్యసభకు నామినేట్ కానున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Wednesday, April 25, 2012

పశ్చిమాన అస్తమించిన మరో తూర్పు కిరణం...

న్యూయార్క్ ,ఏప్రిల్ 25:అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. విశాఖపట్నానికి చెందిన కరణం నిఖిల్ (28) మృతదేహం డల్లస్ శివార్లలోని ట్రోఫీక్లబ్ సిటీలో అతడి అపార్టుమెంట్లో ఈనెల 21న కనిపించినట్లు తానా వర్గాలు తెలిపాయి. అయితే, నిఖిల్ దాదాపు పది రోజుల క్రితమే మరణించి ఉంటాడని, ఇరుగుపొరుగు వారు అతడి అపార్టుమెంట్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు తెలియజేసిన తర్వాత మాత్రమే మృతదేహాన్ని కనుగొన్నామని స్థానిక పోలీసులు తెలిపారు. నిఖిల్ తన అపార్టుమెంట్‌లో ఒక్కడే నివసిస్తున్నాడు. అతడి మృతదేహం భరించలేని స్థితిలో ఉందని పోలీసులు చెప్పారు. అతడిది హత్య లేదా ఆత్మహత్య అయ్యే అవకాశం లేదని.. బహుశా ఏదైనా మందు రియాక్షన్  వల్ల మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఓ స్కూలు ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, సుధారాణి దంపతుల కుమారుడైన నిఖిల్.. 2006లో ఎన్ఐటీ అలహాబాద్‌లో ఎంఎస్ (ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్) చేశాడు. తర్వాత నోయిడాలో కొన్నాళ్లు పనిచేశాడు. 2008లో టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీలో చేరి 2011లో ఎంఎస్ పూర్తిచేశాడు. తర్వాత డల్లస్ లో  ఉద్యోగంలో చేరాడు.  నిఖిల్ మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం సాయంత్రానికి నిఖిల్ మృతదేహం విశాఖపట్నానికి చేరుకునే అవకాశం ఉంది.

నిర్లక్ష్యం సంకెళ్ళనుంచి మమకారం ఒడిలోకి...

న్యూఢిల్లీ,ఏప్రిల్ 25:   నార్వేలోని శిశు సంరక్షణ కేంద్రంలో దాదాపు ఏడాదిగా ఆశ్రయం పొందుతున్న  ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ బాలలు అభిజ్ఞాన్ (3), ఐశ్వర్య (1) మంగళవారం భారత్ చేరుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ దంపతులు అనురూప్, సాగరికా భట్టాచార్యలు పిల్లల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంగా నార్వే శిశు సంక్షేమ శాఖ వారిని  శిశు సంరక్షణ కేంద్రానికి తరలించగా, వారిని భారత్‌కు పంపాలంటూ భారత ప్రభుత్వం దౌత్యపరంగా నార్వేపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా, నార్వే కోర్టు ఆ బాలల సంరక్షణను భారత్‌లో ఉంటున్న వారి బాబాయి అరుణభాస్ భట్టాచార్యకు అప్పగిస్తూ  తీర్పునిచ్చింది. అభిజ్ఞాన్, ఐశ్వర్యలతో కలసి వారి బాబాయి అరుణభాస్ మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. బాలల తాత, నాయనమ్మ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ తదితరులు విమానాశ్రయం వద్ద వారికి స్వాగతం పలికారు. కాగా, ఆ బాలలను భారత్‌కు పంపినందుకు విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ నార్వే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మళ్ళీ రాజకీయాలలోకి మాజీ రెబెల్ స్టార్...!

మొగల్తూరు,ఏప్రిల్ 25:  తాను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని  తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన కృష్ణంరాజు మనసులోని మాటను బయటపెట్టారు. ప్రజల ఇబ్బందుల్ని చూసే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు.  ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి  భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.

Tuesday, April 24, 2012

టి.ఎంపీలపై సోనియా గరం

లొక్ సభ నుంచి నాలుగు రోజులు సస్పెన్షన్
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ
చిరు, రేణుకలకు పదవులు ?
న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: కాంగ్రెసు తెలంగాణ లోకసభ సభ్యులపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ సభ్యులై ఉండి లోకసభ సమావేశాలను అడ్డుకోవడంపై ఆమె వారిపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. రెండో విడత సమావేశాలు మంగళవారం మొదలైన రోజు కూడా  లోకసభ సమావేశాలను అడ్డుకోవడంతో సోనియా గాంధీ ప్రధాని కార్యాలయంలో కోర్ కమిటీ సభ్యులతో పరిస్థితిని చర్చించారు. ఆ తర్వాత తమ పార్టీ సభ్యులను ఎనిమిది మందిపై నాలుగు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రతిపాదించింది. దాంతో  లోకసభ నుంచి నాలుగు రోజుల పాటు వారిని స్పీకర్ మీరా కుమార్ సస్పెండ్ చేశారు. ఇలాఉండగా  తమను మంత్రి పదవుల నుంచి తప్పించాలని, తాము పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తామని నలుగురు కేంద్ర మంత్రులు సోనియాకు లేఖలు రాశారు. సోనియా సూచన మేరకే వారు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి, బడ్జెట్ సమావేశాల తర్వాత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ భారీ మార్పులు ఉండవచ్చునని చెబుతున్నారు.  రాష్ట్రానికి చెందిన చిరంజీవికి, రేణుకా చౌదరికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. అయితే, చిరంజీవికి పిసిసి అధ్యక్ష పదవిని అప్పగించే ఆలోచన కూడా లేకపోలేదని అంటున్నారు. పిసిసి పదవి నుంచి బొత్స సత్యనారాయణను తప్పిస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే పిసిసి పదవి అప్పగించాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ కూడా పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని ప్రచారం కోసం వాడుకుంటూ సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దే నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా నియమించదలుచుకుంటే కన్నా లక్ష్మి నారాయణకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. అలాగే  తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండానే 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి సోనియా గాంధీ సిద్దపడుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

జూన్ 12న ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగింది. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి జూన్ 12న  పోలింగ్ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 18న ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు మే25 తుది గడువు. మే 28వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.  జూన్ 15న ఓట్ల లెక్కింపు చేపడతారు. నర్సన్నపేట, పాయకరావుపేట, రామచంద్రాపురం, పోలవరం, నర్సాపురం, పత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం, రాయదుర్గం, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డతో పాటు తెలంగాణ ప్రాంతంలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల్కు,  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు  జరగనున్నాయి..గత సంవత్సరం డిసెంబరులో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చందిన పదహారు మంది శాసనసభ్యులపై స్పీకర్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన శోభా నాగి రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.  ఇక చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో తిరుపతి స్థానం ఖాళీ అయింది. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఉన్నదని మేకపాటి రాజమోహన్ రెడ్డి తన నెల్లూరు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.  కాగా షెడ్యూలు విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.  ఎన్నికలు జరుగనున్న 18 శాసనసభ నియోజకవర్గాల్లో 44,01,392మంది ఓటర్లు ఉన్నారు.  5,405 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 

సెకండ్ ఇంటర్ లో 58.43 శాతం పాస్

హైదరాబాద్, ఏపిల్ 24:  ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం లో  ఈ ఏడాది 58.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  ఫలితాలను  మంగళవారం మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారధి  విడుదల చేశారు.  ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,45,694 మంది విద్యార్థులు హాజరు కాగా, 4,94,758మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 61.25 కాగా బాలురు 55.95 శాతం ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.84 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 74 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 43 శాతం ఉత్తీర్ణతతో నిజామాబాద్ చివరి స్థానంలో ఉంది. ద్వితీయ స్థానంలో విశాఖపట్నం నిలిచింది. వొకేషనల్ ఫలితాల్లో 72 శాతంతో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 23 నుంచి జరుగుతాయి. 

సెక్స్ సీడీ దెబ్బకు సింఘ్వీ అవుట్...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24:  సీడీ  చిక్కుల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అటు పార్టీ పదవులకు, ఇటు అధికారిక పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవితోపాటు న్యాయ, చట్ట వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ పదవి నుంచి వైదొలగుతున్నట్టు ఆయన  ప్రకటించారు. లోక్‌పాల్‌పై నివేదికను రూపొందించిన కమిటీకి సింఘ్వీ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. తన తెరచాటు లీలలను తెలియజేసిన ఓ సీడీ బయటికొచ్చిన పదిరోజులకు ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలుమొదలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా రాజ్యసభ సభ్యుడైన సింఘ్వీతో రాజీనామా చేయించిందని ప్రచారం జరుగుతోంది. ఒక మహిళతో సింఘ్వీ అత్యంత సన్నిహితంగా ఉన్న దృశ్యాలతో కూడిన సీడీ వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సీడీ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉన్న సింఘ్వీ, సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ రెండు పేజీల ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. పార్టీ, పార్లమెంటరీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ పంపారు. సీడీ వివాదం కారణంగా పార్లమెంట్ కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కూడా తలెత్తకుండా చూసేందుకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని సింఘ్వీ తన ప్రకటనలో తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఖండించారు. సీడీలో అనుచిత సంభాషణ సాగించానని ప్రచారం సాగిస్తూ తనపై అభూత కల్పనలతో కూడిన ఆరోపణలను చేస్తున్నారన్నారు. పదిరోజులపాటు సీడీని విని, చూసి, నిశితంగా పరిశీలించి, ఆసాంతం దుర్భిణీ పట్టిన తన వ్యతిరేకులు సైతం అందులో ఎలాంటి తప్పు, అవినీతి కనుగొనలేకపోయారన్నారు. ఏదో పదవిని ఆశచూపి వాగ్దానం చేసినట్లు సీడీలో ఉందంటూ మీడియాలో కొన్ని తప్పుడు కథనాలను, వదంతులను పదే పదే ప్రచారంలో పెడుతున్నారన్నారు. ఐదు రోజుల క్రితమే ఢిల్లీ హైకోర్టు ఫైనల్ పర్మనెంట్ డిక్రీని జారీచేసిందన్నారు. సీడీ పూర్వాపరాలను ఆయన వివరిస్తూ, ‘వ్యక్తుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Monday, April 23, 2012

బి.జె.పి.లోకి జీవితారాజశేఖర్...?

హైదరాబాద్, ఏప్రిల్ 23:   హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత భారతీయ జనతా పార్టీ లో చేరనున్నారు. వారిద్దరు ఈ నెల 25వ తేదీన  పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడి సమక్షంలో వారు బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో రాజశేఖర్, జీవిత మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వారిద్దరు రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో  వారు  కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ రాజశేఖర రెడ్డి వారిద్దరిని కాంగ్రెసులోకి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారం కూడా పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వారు కొంత కాలం వైయస్ జగన్‌తో ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడానికి జీవిత, రాజశేఖర్  ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వారు పెట్టిన షరతులు   చంద్రబాబు నాయుడికి నచ్చలేదని, దాంతో తెలుగుదేశం పార్టీలో వారిని చేర్చుకోలేదని వార్తలు వచ్చాయి. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. చివరకు బిజెపిలో చేరడానికి రాజశేఖర్, జీవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అట్టుడికిన విజయనగరం

విజయనగరం,ఏప్రిల్ 23:  మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా టి.డి.పి., ఆ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోటాపోటీ ధర్నాలతో విజయనగరం సోమవారం అట్టుడికింది. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కాంగ్రెస్‌, టిడిపిలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించాయి. తొలుత టిడిపికి అనుమతి నిరాకరించిన పోలీసులు చివరకు అనుమతి ఇచ్చారు. కలెక్టరేట్‌ దగ్గర ఉదయం నుంచే పోలీసులను పెద్ద ఎత్తున మొహరించారు. కలెక్టరేట్‌ చుట్టూ ఇనుప కంచె వేశారు. ఒకవైపు టిడిపి, మరోవైపు కాంగ్రెస్‌ ర్యాలీగా బయల్దేరాయి. అయితే ధర్నా సెంటర్‌ వైపు వెళ్లకుండా పోలీస్‌ బ్యారక్‌ వద్ద చంద్రబాబును పోలీసులు నిలువరించారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలను పోలీసులు వెనక్కి నెట్టేశారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కలెక్టరేట్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. తర్వాత టిడిపికి పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో కలెక్టరేట్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేశారు. తర్వాత ధర్నా చేట్టారు. 

సమ్మర్ సినిమాలు...

దమ్ము

దరువు

అధినాయకుడు

మంగళవారం నుంచి మళ్ళీ పార్లమెంట్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్ 23: : పార్లమెంట్‌ మలివిడత సమావేశాలు మంగళవారం రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉగ్రవాద నిరోధక జాతీయ కేంద్రం ఎన్ సీటీసీ ఏర్పాటును ప్రతిపక్షాలతో పాటు యూపిఏలోని కొన్ని కీలక భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకిస్తుండటంతో సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలున్నాయి. 2012-13 బడ్జెట్‌తో పాటు లోక్‌పాల్‌ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందాల్సి ఉంది.

ఈనెల 26న పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగం

నెల్లూరు,ఏప్రిల్ 23:  పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీన ఉదయం 5.47 గంటలకు సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం -షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగం జరుగుతుందని షార్ వర్గాలు ప్రకటించాయి. 70 గంటల ముందు . అంటే సోమవారం ఉదయం 6.47 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. రూ.498 కోట్లతో చేపట్టిన ఈ ప్రయోగంలో ఉపగ్రహానికి రూ.378 కోట్లు, రాకెట్‌కు రూ.120 కోట్లు వ్యయం చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ19 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1,830 కిలోలు బరువు కలిగిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 (రిశాట్-1) ను 480 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష (సన్ సింక్రోనస్ ఆర్బిట్) లోకి ప్రవేశపెడతారు. అనంతరం రిశాట్-1 లోని ద్రవ ఇంధన ఇంజన్ల సాయంతో 536 కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల కంటే ఇది అతిపెద్ద ఉపగ్రహం కావడంతో చంద్రయాన్-1 కు వినియోగించిన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగిస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 20 ప్రయోగాలు చేయగా, 19 విజయవంతమయ్యాయి.

Sunday, April 22, 2012

కలెక్టర్ విడుదలపై 25 వరకూ మావోల డెడ్ లైన్

కొడుకుతో కలెక్టర్ (ఫైల్ ఫొటో)
ఛత్తీస్ గఢ్,ఏప్రిల్ 22:  ఛత్తీస్ గఢ్ లోని  సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ను కిడ్నాప్ చేసిన  మావోయిస్టులు ఆయన విడుదలకు షరతులు విధించారు. కలెక్టర్ విడుదలకు మంగళవారం వరకూ మావోలు చత్తీస్ గడ్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. జైలులో ఉన్న 12మంది మావోయిస్టు నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. బస్తర్ లో ఉన్న పారా మిలటరీ దళాలను ఉపసంహరించుకోవటంతో పాటు, ఆపరేషన్ గ్రీన్ హంట్ నిలిపివేయాలని కూడా మావోయిస్టులు డిమాండ్ చేశారు. కాగా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ క్షేమంగా ఉన్నట్లు ఛత్తీస్ గఢ్ పోలీసులు తెలిపారు.

Saturday, April 21, 2012

భద్రాచలంలో అతిరాత్రం మహాయాగం

భద్రాచలం,ఏప్రిల్ 21: : భద్రాచలంలో అతిరాత్రం మహాయాగం ప్రారంభమైంది. సీతారాముల ఆలయం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న 'ఎటపాక'లో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు వివిధ పీఠాధిపతులు, కేరళ నుంచి నంబూద్రి వంశీయులు భద్రాద్రి చేరుకున్నారు. ఈ మహత్కర్యాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాచలం తరలి వస్తున్నారు. లోకకళ్యాణం కోసం పన్నెండు రోజులు నిర్వహించే ఈ సోమ యాగం మే 2న ముగియనుంది. సూత్యం అనే ప్రక్రియతో జరిగే పూర్ణాహుతితో మే 2న యాగం పూర్తవుతుంది. ప్రకృతిని పరిశుద్ధం చేసి విశ్వశాంతితోపాటు జన్మరాహిత్యాన్ని ప్రసాదించే అతిరాత్రంపై సామాన్యులు, వేదపండితులే కాకుండా శాస్త్రజ్ఞులు కూడా ఈ యజ్ఞ వేదిక వైపు దృష్టి సారించారు. నిష్ఠాగరిష్ఠంగా చేసే ఈ క్రతువుపై పరిశోధనలు చేసేందుకు దేశవిదేశాలనుంచి శాస్త్రజ్ఞులు అతిరాత్రం వేదికకు విచ్చేశారు.

Wednesday, April 18, 2012

మరో 100 రోజుల్లో లండన్ ఒలింపిక్స్...

భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం...

భువనేశ్వర్,ఏప్రిల్ 19: : భారత్ తొలిసారిగా ఖండాతర క్షిపణి అగ్ని-5 ని ఒడిషాలోని వీలర్‌ ఐలాండ్‌ నుంచి ప్రయోగించింది. భారత్‌ కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిముషాలకు ఈ ప్రయోగం జరిగింది. అగ్ని-5 క్షిపణి లక్ష్యం వైపు విజయవంతంగా దూసుకువెళుతోంది. అగ్ని-5 ప్రయోగంతో ఖండాతర క్షిపణి రక్షణ వ్యవస్థ  ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. అలాగే దేశ అమ్ముల పొదిలో అగ్ని ఓ కీలక ఆయుధం కానుంది.  అంతర్జాతీయ రక్షణ వ్యవస్థల  తీరుతెన్నులను  మార్చగలదని భావిస్తున్న ఈ ప్రయోగాన్ని ప్రపంచ దేశాలన్ని  ఆసక్తిగా గమనిస్తున్నాయి. రక్షణ, అంతరిక్ష రంగాలతో పాటు మరికొన్ని కీలక రంగాలకు చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టు కోసం కఠోరంగా శ్రమించారు. నిర్దేశించిన లక్ష్యాలపై పడి విధ్వంసం సృష్టించడం ఒక్కటే కాకుండా భారతదేశ రక్షణావసరాలకు తగ్గట్టుగా బహుముఖ సేవలందించగల బ్రహ్మాస్త్రంగా అగ్నిని మలచారు. సుమారు 50 టన్నుల బరువు, 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోతూ ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

రాష్ట్ర వార్షిక ప్రణాళిక 48,935 కోట్లు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 18: 2012-2013 సంవత్సరానికి  రాష్ట్ర వార్షిక ప్రణాళిక 48,935 కోట్లు రూపాయలుగా ఖరారయింది. మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ప్రణాళిక సంఘం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. పోలవరం వివాదం కోర్టులో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని  కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా అన్నారు. విద్య, ఆరోగ్యం అంశాలు జాతీయప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని, ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని అహ్లువాలియా సలహా ఇచ్చారు.
13 శాతం ఎక్కువ:ముఖ్యమంత్రి
ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఆమోదించిన పెట్టుబడుల మొత్తం గత ఆర్థిక సంవత్సరం కన్నా 13 శాతం ఎక్కువని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఆ రెండు ప్రాజెక్టులకు సూత్రబద్దంగా అన్ని అనుమతులు లభించాయని, కానీ పూర్తి అనుమతులు లభించిన తర్వాత వాటి గురించి మళ్లీ సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు. స్త్రీనిధి బ్యాంక్‌కు రూ.200 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. ట్రిపుల్ ఐటిలకు నిధులు ఇవ్వాలని కూడా కోరినట్లు ఆయన చెప్పారు. ట్రాన్స్ మిషన్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలని తాము కోరామని ఆయన చెప్పారు. గ్యాస్ ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకు గ్యాస్ మరింత కేటాయించాలని కోరామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం పరిశీలకుడు వాయలార్ రవిని మంత్రులు కలుసుకోవడంపై  ప్రస్తావించగా పార్టీ అధిష్టానం నేతలతో మంత్రులు కలిసి పార్టీ గురించి మాట్లాడారని, పార్టీని బలోపేతం చేయడంపై మాట్లాడారని ఆయన చెప్పారు. వాయలార్ రవి హైదరాబాద్ వెళ్తున్నారని తనకు తెలుసునని, తనకు అధికార కార్యక్రమాలు ఉండడం వల్ల ఢిల్లీలో ఉన్నానని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్లమెంటు సమావేశాల వ్యవహారాలకు సంబంధించి బిజీగా ఉన్నారు కాబట్టి వాయలార్ రవి రాష్ట్రంలోని ఉప ఎన్నికల వ్యవహారాలను చూస్తున్నారని ఆయన చెప్పారు.

Tuesday, April 17, 2012

వాయలార్ వల్ల అవుతుందా...?

హైదరాబాద్,ఏప్రిల్ 17:  రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్ది , నాయకులను ఒక తాటి మీదికి తేవడానికి వాయలార్ రవి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చారు. అయితే  రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా గులాం నబీ ఆజాద్ తో కాని పని వాయలార్ రవితో అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. తెలంగాణ, వైయస్ జగన్ వ్యవహారం వంటి సమస్యలు ఓ వైపు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుంటే పార్టీ నాయకుల్లో నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ముఖ్యమంత్రి పదవి నుంచిరోశయ్యను దించి కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టిన తర్వాత సమస్యలు తగ్గకపోగా మరింత పెరిగాయి. పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ ఉన్నప్పుడు దాదాపుగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ముఖ్యమంత్రికీ పిసిసి అధ్యక్షుడికీ మధ్య విభేదాలు ఉన్న జాడలు కనిపించలేదు. డి. శ్రీనివాస్ ఎలా వ్యవహరించేవారో తెలియదు గానీ దూకుడు ఎప్పుడూ ప్రదర్శించలేదు. ముఖ్యమంత్రి పదవిపై ఆశ పడినట్లు కూడా కనిపించలేదు. కానీ బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా చేసిన వెంటనే కాంగ్రెసులోని పాత సంప్రదాయం మళ్లీ ముందుకు వచ్చింది. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడికీ ముఖ్యమంత్రికీ పడకపోవడమనేది పార్టీ సంప్రదాయంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం పొసగడం లేదు. పైగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసంతృప్తులను కూడగడుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. వచ్చే ఉప ఎన్నికల్లో గెలవడం మాట అటుంచి, ఈ ఇద్దరికి మధ్య సయోధ్య కుదుర్చడం, పార్టీని ఏక తాటి మీదికి తేవడం అనేది సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పిలిచి ఆజాద్ క్లాస్ కూడా తీసుకున్నారు. అప్పటికప్పుడు ముగ్గురు కలిసి పోయినట్లే కనిపించారు. కానీ, వరుస మారినట్టు కనిపించక పోవడంతో సోనియా గాంధీ తన దూతగా వాయలార్ రవిని రంగంలోకి దించారు. వాయలార్ రవి కూడా ఇది వరకు రాష్ట్ర కాంగ్రెసు  వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. అందువల్ల ఆయనకు రాష్ట్ర పరిస్థితులు తెలిసే ఉంటాయని, రాష్ట్ర కాంగ్రెసు నాయకులతో పరిచయాలు బాగానే ఉండి ఉంటాయని అనువకోవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దే పని ఆయనతో అవుతుందా అనేదే  ప్రశ్న. రాష్ట్రంలో 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి  జరగనున్న  ఉప ఎన్నికలకు క్షేత్ర స్థ్యాయిలో పార్టీఈని సమాయత్తం చేయడానికే తాను వచ్చానని వాయలార్ రవి చెబుతున్నారు. . ఆయన ఈ మూడు రోజులు కలిసే నాయకుల అబిప్రాయాల మీదనే ఆధారపడే అవకాశం ఉంది. వారు చెప్పే విషయాలు కొత్తవేమీ కావు. కాంగ్రెసు నాయకులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఆజాద్ ముందు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. సమిష్టి బాధ్యత కోసం సమన్వయ కమిటీ కూడా వేశారు. మొక్కుబడికి రెండు సమావేశాలు జరిగాయి. మరో సమావేశం జరుగుతుందనే గ్యారంటీ లేదు. ఈ పరిస్థితిలో  వాయలార్ రవి సాధించేది ఏముంటుందని కొందరు పార్టీ పెద్దలు పెదవి విరుస్తున్నారు.  

Monday, April 16, 2012

ఈ నెల 27న భారత్ లోకి రానున్న ఏపిల్ మూడవ తరం టాబ్లెట్ పిసి, కొత్త ఐపాడ్...

Friday, April 13, 2012

జగన్ కేసు: బెయిల్‌పై విజయసాయి రెడ్డి విడుదల

హైదరాబాద్,ఏప్రిల్ 13:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డికి ఊరట లభించింది.   విజయసాయిరెడ్డి  చంచల్‌గూడ జైలు నుంచి శుక్రవారం బెయిల్‌ పై విడుదలయ్యారు. జనవరి 2 తేది నుంచి విజయసాయిరెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. విజయసాయిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. 25 వేల ఇద్దరి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ.. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే షరతును కోర్టు విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

Thursday, April 12, 2012

స్వేచ్చాగీతం...

నెల రోజుల మావోయిస్ట్ చెర నుంచి గురువారం భువనేశ్వర్ లో విడుదలైన అనంతరం సంతోషం లో మునిగితేలుతున్న  ఇటాలియన్ టూరిస్ట్ పౌలో బొసుస్కో 


హే...సాయిరాం....

షిరిడి సాయి గా నటిస్తున్న  నాగార్జున ఇటీవల ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవ ఫంక్షన్లో మద్యం సేవిస్తూ... పొగ తాగుతూ కనిపించడం  కలకలం రేపింది. మద్యం సేవించడం, స్మోకింక్ చేయడం ఆయన పర్సనల్ విషయం అయినప్పటికీ.... . షిరిడి సాయి సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి ఇది చర్చ నీయాంశం అయింది.  అన్నట్టు నాగార్జున భార్య అమల కూడ అక్కడే ఉన్నారు.

మావోల చెర నుంచి ఇటాలియన్ కు విముక్తి

భువనేశ్వర్,ఏప్రిల్ 12:  : మావోయిస్టుల చెరలో ఉన్న ఇటలీ దేశస్తుడు పౌలో బొసెస్కోకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గత నెల 14న ఒడిశాలో కిడ్నాప్‌ చేసిన అతన్ని 29 రోజుల అనంతరం మావోయిస్టులు విడుదల చేశారు. కంథమాల్‌ - మోహన అటవీప్రాంతంలో పౌలోను విడిచి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో దాదాపు నెల రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే హికాక ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు.  నేడో, రేపో ప్రజాకోర్టు నిర్వహిస్తామని, ప్రజల నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే హికాక విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మావోయిస్టులు ప్రకటించారు. కాగా మరో ఇటలీ దేశస్తుడు క్లోడియోను మార్చి 24న మావోయిస్టులు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Wednesday, April 11, 2012

ఇండోనేషియాలో భారీ భూకంపం...ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రకంపనలు

జకర్తా,ఏప్రిల్ 11: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.9 గా నమోదైంది. భూకంప తీవ్రతకు సుమత్రా దీవి వణికింది. ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. బందా ఏస్ ప్రాంతానికి 495 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్రం లోపలి భాగంలో 33 కిలోమీటర్ల అడుగున భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా వాతావారణ శాఖ వెల్లడించింది.
భారత్‌లో ప్రకంపనలు
ఇండోనేషియాలో సంభవించిన భూకంప  ప్రభావం దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలోను, , అసోంపైన   చూపింది.  గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ, విజయనగరం, తాడేపల్లిగూడెం, తిరుపతి, కాకినాడ, అనకాపల్లిలో స్వల్పంగా సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించింది.
సునామీ ముప్పు లేదు
భారతదేశానికి సునామీ ముప్పు ఉందని భావించి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలను ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉపసంహరించుకుంది. భారత్‌కు సునామీ వస్తుందనే వస్తుందనే సమాచారాన్ని నమ్మవద్దని ఎన్ఎండిఎ అంతకు ముందు సూచించింది. హిందూ మహా సముద్రంపై సునామీ ప్రభావం లేదని, అండమాన్ నికోబార్ దీవులకు కూడా ప్రమాదం లేదని జాతీయ విపత్తుల సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.

Tuesday, April 10, 2012

నరేంద్రమోడీకి. క్లీన్ చిట్

అహ్మదాబాద్,ఏప్రిల్ 11:  గోద్రా ఘటన అనంతర గుజరాత్ అల్లర్లలో గుల్బర్గ్ ఊచకోత కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి.. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో మోడీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని, కాబట్టి కేసును మూసివేయాలని సిట్ సూచించింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ చేసిన ఫిర్యాదులో పేర్కొన్న 58 మందిలో ఎవరూ నేరం చేసినట్లు రుజువుకాలేదని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎం.ఎస్.భట్ వెల్లడించారు. 2002 నాటి అల్లర్ల సందర్భంగా జరిగిన గుల్బర్గ్ సొసైటీ ఊచకోత ఘటనలో 69 మంది మృతుల్లో ఎహ్‌సాన్ జాఫ్రీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో పాటు మరో 57 మందిపై నేరపూరిత కుట్ర ఆరోపణలు చేస్తూ.. ఎహ్‌సాన్ భార్య జాకియా పిటిషన్లు దాఖలు చేశారు.  ఈ పిటిషన్లపై కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇస్తూ.. సిట్ నివేదికను, సంబంధిత పత్రాలను 30 రోజుల్లోగా జాకియాకు అందించాలని ఆదేశించింది. 

రబ్బానీ ఓవరాక్షన్...శాఖ మార్పు...?

ఇస్లామాబాద్ ,ఏప్రిల్ 10:    పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ మంత్రిత్వ శాఖ మారే అవకాశాలు కనపడుతున్నాయి. అమెరికా దౌత్యవేత్త సమక్షంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో విభేదిస్తూ మాట్లాడినందుకు ఆమెను  విదేశాంగ శాఖ నుంచి తప్పించగలరనే  ప్రచారం ఊపందుకుంది. ప్రధాని యూసుఫ్ రజా గిలానీ వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి.  గిలానీ ఇటీవల మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ,  కొత్త టీమ్ కాశ్మీర్ తదితర విషయాలపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతుందని అన్నారు. దీన్ని బట్టి రబ్బానీ శాఖ మారడం ఖాయమని భావిస్తున్నారు. కాగా, అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి థామస్ నీడేస్‌తో కూడిన ప్రతినిధి బృందం పాకిస్తాన్ సందర్శించినప్పుడు రబ్బానీ జర్దారీతో విభేదించి అందరినీ ఆశ్చర్యపరిచారు.చికాగోలో మేలో అఫ్గనిస్తాన్‌పై జరిగే సదస్సులో పాకిస్తాన్ పాల్గొనే విషయాన్ని నీడేస్ ప్రస్తావించారు. వాషింగ్టన్ ఆహ్వానం పంపితే తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని జర్దారీ చెప్పారు. రబ్బానీ మధ్యలో జోక్యం చేసుకుని---పాకిస్తాన్ - అమెరికా సంబంధాలపై కొనసాగుతున్న సమీక్ష  తర్వాతనే చికాగో సమావేశంపై నిర్ణయం తీసుకుంటామని  చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

తారా విలాపం...!

హైదరాబాద్,ఏప్రిల్ 10:  ఉద్యోగాలు, సినిమా అవకాశాల పేరిట  అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతోదన్న  ఆరోపణల తో అరెస్టైన సినీ ఆర్టిస్టు తారా చౌదరి తాను ఎలాంటి తప్పు చేయలేదని అంటోంది.  కావాలనే తనను వ్యభిచారం కేసులో ఇరికించారని ఆమె ఆరోపించింది. తనకు చంపుతానని పలు బెదిరింపులు వస్తున్నాయని చెప్పింది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానని తెలిపింది. తాను సినీ ఆర్టిస్టును కాబట్టి సినిమా వాళ్లతో సంబంధాలు ఉంటాయని ,  తనను కొందరు రాజకీయ నేతలు వాడుకున్నారని  సమయం వచ్చినప్పుడు వారి గుట్టు బయట పెడతానని చెబుతోంది తార.  తాను అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి లాగాననే ఆరోపణలను ఆమె ఖండించింది. తాను ఏ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి లాగలేదని తెలిపింది. డిజిపి, హోంమంత్రి రక్షణ కల్పిస్తే అన్ని విషయాలు బయట పెడతానని చెప్పింది. తన లాప్‌టాప్‌లో ఏమీ లేదని తెలిపింది. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రాణభయముందని , పోలీసు విచారణపై తనకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు.

టెక్ మహీంద్రాలో భారీగా రిక్రూట్‌మెంట్

హైదరాబాద్,ఏప్రిల్ 10:  సాఫ్ట్ వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 10 వేల మంది ఉద్యోగుల నియామకానికి టెక్ మహీంద్ర స్వీకారం చుట్టింది. సత్యం కంప్యూటర్స్ సంస్థను విలీనం చేసుకున్న తర్వాత భారీ స్థాయిలో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ ఇదేనని కంపెనీ అధికారులు తెలిపారు.  

4జీ సర్వీసులను ప్రారంభించిన భారతీ ఎయిర్‌టెల్‌

కోల్ కతా,ఏప్రిల్ 10:  దేశంలో బ్రాడ్‌బ్యాండ్ విప్లవానికి భారతీ ఎయిర్‌టెల్‌ శ్రీకారం చుట్టింది. 4జీ సర్వీసులను ఈ సంస్థ మంగళవారం కోల్‌కతాలో ప్రారంభించింది. బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా మొబైల్‌ వీడియో అత్యంత సులభతరమవుతుంది. సెల్‌ఫోన్లో టీవీ ఛానెళ్లను ఇంట్లో ఉన్న టీవీలో చూసినట్లు చూడొచ్చు. కంపెనీలు ప్రధాన కార్యాలయాల నుంచే ఫ్యాక్టరీల్లో సమస్యల్ని పరిష్కరించవచ్చు. వైద్య రంగంలోనూ దూర ప్రాంతం నుంచి రోగులకు చికిత్స అందించవచ్చు. ఇప్పటి వరకు ఈ సేవల్ని 2జీ, 3జీ సర్వీసుల ద్వారా అందిస్తున్నారు. అయితే 4జీ రాక వల్ల ఈ సేవల్లో వేగం, నాణ్యత పెరుగుతాయి. అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇప్పటికే 4జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో భారతీ ఎయిర్‌టెల్‌ తొలిసారిగా 4జీ సర్వీసుల్ని ప్రారంభించింది. అందుబాటు ధరల్లో 4జీ సేవల్ని వినియోగదారులకు అందించాలన్నది తమ లక్ష్యమని ఈ కంపెనీ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ తెలిపారు.

Monday, April 9, 2012

సి.ఆర్.పి.ఎఫ్. శౌర్యదినం సందర్భంగా ఢిల్లీలో అందరూ మహిళలే గల  పారా మిలటరీ పైప్ బ్యాండ్  ప్రదర్శన

అమెరికాలో కేన్సర్ వ్యాధికి   అరుదైన చికిత్స చేయించుకుని ఢిల్లీ చేరుకున్న స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్


తిరుపతి తెలుగుదేశం అభ్యర్థిగా చదలవాడ

హైదరాబాద్, ఏప్రిల్ 9: చిరంజీవి రాజినామా వల్ల తిరుపతి నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు  తెలుగుదేశం అభ్యర్థిగా చదలవాడ కృష్ణ మూర్తిని  పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. చదలవాడ 2009 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెసులో ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెసు పార్టీలో ఉంటూనే అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెసు నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గెలుపు కోసం కృషి చేశారనే ఆరోపణలున్నాయి. కాగా, చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుండి సోమవారం ప్రారంభించారు.

కంటితుడుపుగా కరెంట్ చార్జీలు తగ్గింపు

హైదరాబాద్, ఏప్రిల్ 9: విద్యుత్ ఛార్జీలను   రు. 4400 కోట్ల మేర పెంచిన  ప్రభుత్వం కంటితుడుపు గా  రు.  175 కోట్ల మేర  తగ్గించింది.  కేవలం ఒకే ఒక స్లాబ్‌కు నామమాత్రం ఊరట నిచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఇక ఛార్జీల తగ్గింపు సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలోని 47 లక్షల గృహాలకు విద్యుత్ చార్జీల పెంపు భారం తగ్గ్గుతుందని  ఆయన తెలిపారు.విద్యుత్ చార్జీలు పెంచడం తనకు కూడా బాధగానే ఉందని, అయితే తప్ప లేదని ముఖ్యమంత్రి  అన్నారు. విద్యుత్ వినియోగం కన్నా ఉత్పత్తి తక్కువగా ఉందని  చెప్పారు. రోజుకు 42 మిలియన్ యూనిట్ల కొరత ఉందని ఆయన చెప్పారు.  విద్యుత్ కొనుగోలుకు రూ. 200 కోట్ల రూపాయలు వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ కొనుగోలు ధర రూ.1.15 పైసల నుంచి మూడు రూపాయలకు పెరిగిందని ఆయన అన్నారు. మే మాసానికల్లా విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు అదనపు విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని, దాంతో విద్యుత్తు కోతను నివారిస్తామని ఆయన చెప్పారు. సింహాద్రి నుంచి త్వరలో 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. 

Sunday, April 8, 2012


ఆదివారం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ తో సమావేశమైన పాక్ అధ్యక్షుడు జర్దారి 

ఆదివారం అజ్మీర్ దర్గాను సందర్శించిన పాక్ అధ్యక్షుడు జర్దారి

56 దేశాల్లో ఎయిర్ ఇండియా సేల్స్ ఏజెంట్లు

ముంబై,ఏప్రిల్ 8:  టిక్కెట్ల అమ్మకాలు, పంపిణీ యంత్రాగాన్ని విస్తరించాలని ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీనిలో భాగంగా 56 దేశాల్లో జనరల్ సేల్స్ ఏజెంట్స్ (జీఎస్‌ఏ )లను నియమించాలని నిర్ణయం తీసుకుంది. జీఎస్‌ఏలు నిర్దేశిత దేశం లేదా ప్రాంతంలో ఎయిర్ ఇండియాకు సేల్స్ రిప్రజెంటేటివ్‌లుగా పనిచేస్తారు. టిక్కెట్లు, కార్గో స్పేస్ అమ్మడంతో పాటు ప్రయాణికులకు తగిన సమాచారం అందించడంలో జీఎస్‌ఏలు సహాయపడతారు. మొదట 5 సంవత్సరాలకు కాంట్రాక్టు పద్ధతిలో వీరిని నియమిస్తారు. పనితీరు ఆధారంగా గడువు పొడిగింపు ఉంటుంది.

మాదన్నపేటలో ఇరువర్గాల ఘర్షణ: కర్ఫ్యూ

హైదరాబాద్,ఏప్రిల్ 8:  అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న హైదరాబాద్ లోని మాదన్నపేట, సైదాబాద్, చంచల్‌గూడ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్టు నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. వదంతులను నమ్మొద్దొని ప్రజలను కోరారు. అదనపు బలగాలు మొహరిస్తున్నామని, ఆందోళన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఏకే ఖాన్ తెలిపారు. మాదన్నపేటలో ఆదివారం ఉదయం  ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లరిమూకలు ఆర్టీసీ బస్సులపై రాళ్లు విసిరాయి. దీంతో 10 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అల్లరిమూకలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసు బలగాలను మొహరించారు. ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. మరోవైపు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అవసరమైతే మరిన్ని బలగాలు తరలించాలని ఆదేశించారు. రాష్ట్రమంతా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు.

Thursday, April 5, 2012

తాత్కాలిక సయోధ్య...!

న్యూఢిల్లీ,ఏప్రిల్ 6: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలపై చర్య విషయంలో  ఉప ఎన్నికలయ్యే వరకు వేచి చూడాలని అధిస్టానం నిర్ణయించింది. ఈ లోగా  ఈ ఇద్దరు  నేతల పనితీరుపై   నిరంతర నిఘా ఉంచాలని భావిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే బాధ్యతను  కొందరు కోస్తా నేతలకు అప్పగించినట్టు సమాచారం. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకుంటామని కిరణ్, బొత్సలిద్దరూ అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే సగం సీట్లయినా గెలుచుకోవాలన్న హైకమాండ్.. టి.డి.పి., వైఎస్సార్ కాంగ్రెస్‌లను  నిలువరించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదలొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కలిసికట్టుగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించింది. పార్టీని భ్రష్టు పట్టిస్తానంటే  హైకమాండ్ అనుమతించదంటూ ఈ ఇద్దరితో జరిపిన భేటీలలో ఆజాద్ ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించినట్టు భోగట్టా.   ఉప ఎన్నికలు పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకంగా మారాయో ఆజాద్ ఈ సందర్భం గా వివరించారు.  ''ఉప ఎన్నికల ఫలితాలను బట్టే మీ పనితీరు ఏమిటనేది హైకమాండ్ అంచనాకు వస్తుంది. దానికి అనుగుణంగా భవిష్యత్తులో తగిన నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని మర్చిపోకండి’’అని స్పష్టం చేశారుట. 
విభేదాలు మీడియా సృష్టే...బొత్స
రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దల మధ్య విభేదాలున్నాయన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తనకు సమన్వయం కొరవడిందనడం అవాస్తవమన్నారు. ‘‘సీఎం, డిప్యూటీ సీఎం, నేను అంతా బాధ్యత ఎరిగిన వాళ్లమే. వాటిని గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకుంటాం. పార్టీ తరఫున పునర్నిర్మాణం జరుగాలనే కోరుకుంటాం. మా నాయకత్వం అప్పగించిన పనులు చేస్తాం.   వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం ’’ అని చెప్పారు.  బొగ్గు కొనుగోళ్లలో, ఏసీబీ దాడుల్లో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.  ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేస్తామని, గెలుపోటములకు సమష్టి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటును నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

Wednesday, April 4, 2012

వేటు ఎవరిపైన...?

న్యూఢిల్లీ,ఏప్రిల్ 4:   రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరిన పరిస్థితులపై కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరినీ ఢిల్లీకి రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు అధిష్టానం ముందుకు రాకముందే పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంగళవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇటీవలి కాలంలో రెండు దఫాలుగా సోనియాను కలిసిన డీఎస్.. తాజా పరిణామాల్లో హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ రావటం, వచ్చిన వెంటనే సోనియాతో సమావేశం కావటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో రెండు దఫాలుగా సోనియాను కలిసిన డీఎస్.. తాజా పరిణామాల్లో హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ రావటం, వచ్చిన వెంటనే సోనియాతో సమావేశం కావటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో చేజారిన పరిస్థితులను గాడిలో పెట్టటంపై గత కొంత కాలంగా తర్జనభర్జన పడుతున్న అధిష్టానం.. ఆ విషయంలో రాష్ట్రంలోని మిగిలిన నాయకులకన్నా డీఎస్‌ను విశ్వాసంలోకి తీసుకోవటం గమనార్హం. . కాగా,  సీఎంను లేదా పీసీసీ అధ్యక్షుడిని ఎవరో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, వారిద్దరి మధ్య సయోధ్య కుదిరే పనికాదన్న నిర్ధారణకు అధిష్టానం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ప్రభావం కూడా ఉన్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసి ఉంది. మరోఐపు కిరణ్‌ను తప్పించి ముఖ్యమంత్రి పీఠాన్ని డీఎస్‌కు అప్పగించే అవకాశాలున్నాయని గత కొద్ది రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. కిరణ్‌ను తప్పించాలన్న డిమాండ్‌తో రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స కూడా ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానానికి పలు నివేదికలు పంపించటమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఆయన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు మంత్రుల మద్దతు కూడగట్టినట్లు సమాచారం. అయితే మద్యం సిండికేట్ వ్యవహారంలో బొత్స పాత్రపై ముఖ్యమంత్రి అత్యంత కీలకమైన పలు అంశాలను హైకమాండ్ ముందు ఉంచినట్లు చెప్తున్నారు. ఈ దృష్ట్యా బొత్స నే తప్పించవచ్చనే  ప్రచారం కూడా ఉంది.

అమెరికాలో నగరాలలో ‘కళ్యాణమస్తు’

తిరుపతి,ఏప్రిల్ 4:  అమెరికాలోని పది నగరాలలో ‘కళ్యాణమస్తు’ కార్యక్రమం ద్వారా సామూహిక వివాహాల్ని జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 28 నుంచి జూన్ 2 తేది వరకు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది.సాన్ జోస్, సాక్రమెంటోకా, న్యూజెర్సీ, నార్త్ కోస్ట్, డల్లాస్, అరిజోనా, డెట్రాయిట్, మిల్‌వాలీకీ పోర్ట్లాండ్, సీటెల్ నగరాల్లో  ‘కళ్యాణమస్తు’ నిర్వహించనున్నట్టు  టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. గత త్రైమాసికంలో భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాల వల్ల 34 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు.

Tuesday, April 3, 2012

జగన్ పార్టీలోకి వంగవీటి రాధా...

విజయవాడ ,ఏప్రిల్ 3:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి విజయవాడకు చెందిన వంగవీటి రాధా చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఆయన జగన్ పార్టీలో చేరేందుకు తన తండ్రి రంగా  పుట్టిన తేది అయిన జూలై నాలుగో తేదిని ఎంచుకుంటు సమాచారం.  తొలుత కాంగ్రెసు పార్టీలో ఉన్న వంగవీటి రాధా ఆ తర్వాత చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి కొంతకాలం ఆయన రాజకీయాలకు  దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత  చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. విజయవాడలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధాకు చిరంజీవితో వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెసులోకి వెళ్లలేదు. తాజాగా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

26/11 సూత్రదారి హఫీజ్‌పై అమెరికా భారీ రివార్డ్

 వాషింగ్టన్ ,ఏప్రిల్ 3:  26/11 ముంబయి ఉగ్రవాద దాడులకు  కుట్ర  చేసిన  లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్‌ను పట్టించిన వారికి 10 మిలియన్ల డాలర్ల బహుమతిని అమెరికా  ప్రకటించింది. అమెరికా నిర్ణయంపై భారత దేశం హర్షం ప్రకటించింది. దీనిపై  విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పందిస్తూ  హఫీజ్ పాకిస్తాన్‌లోనే ఉన్నారని  అన్నారు. కుట్రదారులను పట్టివ్వాలని తాము పాక్‌ను ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని విమర్శించారు. హఫీజ్ సయిదా ఎఫ్‌బిఐ జాబితాలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది. ఇతను ప్రస్తుతం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు భావిస్తున్నారు. హఫీజ్ పైన ఉన్న పలు కేసులను లాహోర్ కోర్టు తోసిపుచ్చింది.

ఎ.పి. వైపు జయప్రద చూపు...!

తిరుపతి,ఏప్రిల్ 3:  హీరో నందమూరి బాలకృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని, పార్టీలకు అతీతంగా ఆయనకు తాను మద్దతిస్తానని ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద  అన్నారు. మంగళవారం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ,  బాలకృష్ణ తనను ఎప్పుడు పిలిచినా సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అభిమానంతో తాను టిడిపిలో చేరానని చెప్పారు. ఎన్టీఆర్ కారణంగా తాను బాబుకు మద్దతు పలికానన్నారు. బాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని బాగా పాలించారన్నారు. తనకు ఎపి పుట్టినిల్లు, యుపి మెట్టినిల్లు అని అన్నారు. ఎపి రాజకీయాలంటో ఇష్టం అని,  ప్రస్తుతం ఎపి రాజకీయాలు తెలంగాణ తదితర సమస్యలతో క్లిష్టంగా ఉన్నాయని అన్నారు.  తాను ప్రస్తుతం యుపి రాజకీయాల్లో ఉన్నానని, ఇక్కడకు వచ్చినప్పుడు ఏ పార్టీలో చేరాలనే అంశంపై పెద్దలతో చర్చిస్తానని ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని అన్నారు. 

మెక్సికోలో భూకంపం

మెక్సికో,ఏప్రిల్ 3:  మెక్సికోలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైంది. భూ ప్రకంపనలతో ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు చాలా భవనాలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. గత నెలలో కూడా మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. వరుస ప్రకంపనలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కాగా  ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం లేదు.

Monday, April 2, 2012

కిరణ్, బొత్సలకు ఢిల్లీ పిలుపు

హైదరాబాద్,ఏప్రిల్ 2: : ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఈ నెల నాలుగో తేదిన ఇద్దరూ ఢిల్లీ రావాలంటూ వారిని అధిష్టానం ఆదేశించింది.ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో అధిష్టానమే రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే   వీరిద్దరి  వ్యవహారం పార్టీ పెద్దలను మరింత కలవరపరుస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్  కొన్ని నియోజకవర్గాలలో మూడో స్థానానికి పరిమితమైంది. ఇందుకు తెలంగాణ సెంటిమెంట్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న సానుభూతి కారణాలు అయినప్పటికీ సిఎం, పిసిసి చీఫ్ మధ్య ఉన్న విభేదాలను తేలిగ్గా తీసివేయలేమని   పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు ఉప ఎన్నికల ఫలితాలపై సిఎం, బొత్సలు బాధ్యత వహించారని, వారి కారణంగానే ఓడిపోయిందని తప్పు పడుతున్నారు. ఈ పరిస్థితిలో   రానున్న ఉప ఎన్నికల్లోనైనా  కొన్ని స్థానాలైనా  గెలిస్తే  పరువు దక్కుతుందని అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం పార్టీ పెద్దలు మొదట పిసిసి చీఫ్, సిఎం మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే దిశలో వారిని ఢిల్లీకి పిలిపించుకున్నట్లుగా కనిపిస్తోంది.  ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో   గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఉప ఎన్నికల బాధ్యతను ఇరువురు తీసుకోవాలని పిసిసి చీఫ్, సిఎంకు అధిష్టానం సూచించనున్నట్లు సమాచారం 
మరోవైపు ఢిల్లీ పర్యటన సందర్భంగా బొత్స రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. హైకమాండ్ పెద్దలను కలిసి అవసరమైతే రాజీనామా అంశాన్ని ప్రస్తావించాలని భావిస్తున్నారు. మద్యం కేసులో తనను దోషిగా చూపే కుట్ర జరుగుతున్నందున, నిర్దోషిగా తేలేంతవరకు మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. హైకమాండ్ పెద్దలు ఒకవేళ సానుకూలంగా ఉంటే అప్పటికప్పుడే రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 

మయన్మార్ లో సూకీ సంచలనం..

యాంగాన్ ,ఏప్రిల్ 2:  మయన్మార్ రాజకీయాల్లో సంచలనం.. విపక్ష నాయకురాలు, ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ తొలిసారి ప్రజాప్రతినిధిగా చట్టసభలో ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది.ఆదివారం పార్లమెంటుకు జరిగిన కీలక ఉప ఎన్నికల్లో కవామూ స్థానం నుంచి సూకీ చారిత్రక విజయం సాధించారని ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ ప్రకటించింది. అయితే ఆమె విజయాన్ని ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. స్వతంత్ర సంస్థలు కూడా ధ్రువీకరించలేదు. ఆదివారం 45 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్‌ఎల్‌డీ 44 చోట్ల పోటీ చేసింది. ఎన్నికల ఫలితాలను వారంలోగా అధికారికంగా ప్రకటించే   అవకాశముంది.యాంగాన్‌లోని ఎన్‌ఎల్‌డీ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ సైన్‌బోర్డుపై సూకీ విజయ వార్తను ప్రకటించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంతోషంతో నృత్యాలు చేశారు. ఆనందబాష్పాలు రాల్చారు. ‘మేం గెలిచాం, మేం గెలిచాం’ అంటూ నినాదాలు చేశారు.  పోటీ చేసిన అన్ని స్థానాల్లో తామే విజయం సాధించనున్నట్లు ఎన్‌ఎల్‌డీ ధీమాగా చెబుతోంది. 22 ఏళ్ల కిందటి ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ విజయం సాధించినా అప్పటి జుంటా ప్రభుత్వం ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించ కపోవడం తెలిసిందే. తర్వాత సూకీని ప్రభుత్వం సుదీర్ఘ కాలం గృహనిర్బంధంలో ఉంచింది. 2010లో ఆ నిర్బంధాన్ని తొలగించింది.నిరంకుశ సైనిక ప్రభుత్వంపై దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసిన సూకీ 1945లో రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో జన్మించారు. 1988లో యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చారు. మహాత్మాగాంధీ బోధనలు, బౌద్ధమత అహింసా సూత్రాల ప్రేరణలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పోరాడారు. ఆమెకు 1991లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 

తిరుమల హుండీ ఆదాయం ఒకే రోజు రూ.5.73 కోట్లు !

చిత్తూరు,ఏప్రిల్ 2:  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి  ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జీంచారు. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు వేంకటేశ్వర స్వామికి హుండీ ద్వారా  రూ.5.73 కోట్లు ఆదాయం వచ్చింది.నగదు తోపాటు కిలో బంగారం కూడా ఇందులో ఉంది. కొంత విదేశీ కరెన్సీ కూడా ఉంది. ఐదేళ్లుగా స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకూ పెరుగుతూ రూ.కోటి దాటింది. అజ్ఞాత భక్తులు అధిక మొత్తంలో స్వామివారికి నిధులు సమర్పించిన సమయంలో ఇది రూ.రెండు నుంచి మూడు కోట్లు దాటుతోంది. మొత్తమ్మీద ఏడాదిలో సగటున చూస్తే రోజుకు రూ.కోటిన్నరకు పైగా ఆదాయం హుండీ ద్వారా లభిస్తోంది. 1980 సమయంలో రోజుకు రూ.లక్ష ఆదాయం వస్తేనే విశేషంగా భావించేవారు. అప్పట్లో అజ్ఞాత భక్తుల కానుకలు కూడా రూ.లక్ష దాటేవి కావు. 1990 నుంచి స్వామివారికి హుండీ కానుకలు పెరిగాయి.  ఐదేళ్ల నుంచి క్రమంగా రోజుకు రూ.కోటి దాటిన ఆదాయం ఆదివారం రూ.5.73 కోట్లకు చేరింది. ఇప్పటి వరకూ అత్యధికంగా వచ్చిన ఆదాయం రూ.3.75 కోట్లు కాగా ఆదివారంతో సరికొత్త రికార్డు నమోదైంది. నిజానికి శ్రీరామ నవమిని పురస్కరించుకుని తిరుమలలో రద్దీ స్వల్పంగానే ఉంది. కానీ హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా ఉండడం గమనార్హం. మార్చి31తో ఆర్థిక సంవత్సరం ముగిసే నేపథ్యంలో తమకు లాభంగా వచ్చిన సొమ్ము నుంచి పారిశ్రామిక వేత్తలు అధిక మొత్తంలో స్వామి వారికి కానుకలు సమర్పించుకోవడం పరిపాటి. ఈ క్రమంలోనే ఆదివారం ఓ అజ్ఞాత భక్తుడు రూ.మూడు కోట్ల వరకు హుండీలో వేసినట్లు తెలిసింది.

Sunday, April 1, 2012

సాంస్కృతిక సలహాదారుగా కె.వి.రమణాచారి

హైదరాబాద్ ,ఏప్రిల్ 1:    రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారిని నియమిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం తెలియజేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ రిటైర్మెంట్‌కు మూడు నెలల ముందే రమణాచారి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణోత్సవం

భద్రాచలం,ఏప్రిల్ 1:   శ్రీ రామ నవమి సందర్భంగా ఆదివారం భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వామి వారికి, అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  ప్రత్యేక హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి ఇక్కడకు చేరుకున్న సీఎం ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు సి. రామచంద్రయ్య, బాలరాజు, పొన్నాల లక్ష్మయ్య తదితర ప్రముఖులు శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు టీటీడీ తరపున సీతారామ దంపతులకు పట్టువస్త్రాలు సమర్పించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో  సీతారాముల శిరస్సుపై  పురోహితులు జీలకర్ర బెల్లం ఉంచారు. 

కేంద్ర మాజీ మంత్రి ఎన్‌కేపీ సాల్వె మృతి

న్యూఢిల్లీ,ఏప్రిల్ 1:   కేంద్ర మాజీ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వె(90) ఆదివారం  ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని సాల్వె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారు హరీష్ సాల్వె, కుమార్తె అరుంధతి ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని చిన్‌వాడ ప్రాంతంలో జన్మించిన సాల్వె క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో చాలా ఏళ్లు సేవలందించారు. కేంద్ర మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు.

థాయ్‌లాండ్‌లో బాంబు పేలుళ్లు; 14 మంది మృతి

హట్‌యాయి,ఏప్రిల్ 1:   దక్షిణ థాయ్‌లాండ్‌లో ముస్లిం చొరబాటుదారులు శనివారం జరిపిన బాంబు దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 14కు చేరుకుంది. 340 మంది గాయపడ్డారు. యల నగరంలో రెస్టారెంట్లు, దుకాణాలతో కిటకిటలాడే ఓ ప్రాంతంలో బాంబులతో నింపిన ట్రక్కుతో ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 20 నిమిషాల తర్వాత ఘటనా స్థలం వద్ద ప్రజలు గుమిగూడినప్పుడు మరో కారు బాంబు పేలింది. ఈ విస్ఫోటనంతో ఎక్కువగా ప్రాణ నష్టం సంభవించింది. దక్షిణ ప్రావిన్స్ లోని నరాటివాత్, పటాని, యల ప్రాంతాల్లో 2004 నుంచి ఇప్పటివరకు ఐదు వేల మందికి పైగా అమాయకులను ముస్లిం చొరబాటుదారులు బలితీసుకున్నారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...