Wednesday, August 27, 2014

న్యూయార్క్ లో మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు...

వాషింగ్టన్‌, ఆగస్టు 26: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా  సెప్టెంబర్‌ 28న న్యూయార్క్‌లోని సుప్రసిద్ధ మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో నిర్వహించనున్న సభలో 25 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ కన్వీనర్‌ విజయ్‌ జోల్లీ, పార్టీ ఎంపీ రాజ్యవర్థన్‌ రాథోడ్‌లకు చెందిన ప్రవాస భారతీయ స్నేహితులు ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రవాసభారతీయులు పెద్ద సంఖలో ఈ సభకు వచ్చేలా చేసేందుకు.. వీరిద్దరూ ఇప్పటికే లాస్‌ఏంజెలిస్‌, డల్లాస్‌, టెక్సాస్‌, హ్యూస్టన్‌ వంటి నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ సభ గురించి తెలియజేసేందుకు ‘పీఎంవిజిట్‌ డాట్‌ ఆర్గ్‌’ అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. మోదీ పర్యటన గురించి వివరాలను ఈ సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే విరాళాలు కూడా అందజేయొచ్చు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా మోదీని ఘనంగా ఆహ్వానించేందుకు ‘ద ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌’ సన్నాహకాలు చేస్తోంది.

మార్టూరు - వినుకొం డ వద్ద ఏపీ రాజధాని...శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్స్?

 హైదరాబాద్‌, ఆగస్టు 27 : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన శివరామకృష్ణన్‌ కమిటీ మార్టూరు - వినుకొండ వద్ద ఏపీ రాజధాని ఏర్పాటుకు సుముఖత తెలిపింది.  శివరామకృష్ణన్‌ కమిటీ తన నివేదికను గురువారం  కేంద్రహోంశాఖ కార్యదర్శి కి అందజేయనుంది.కమిటీ రెండు భాగాల్లో నివేదిక రూపొందించింది. మొదటి భాగంలో రాజధాని ఎలా ఉండాలనేది ,రెండో భాగంలో మౌలిక వసతులు, సదుపాయాలపై చర్చించింది.  మూడు రాజధానుల జోన్లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. సూపర్‌ సిటీ, స్మార్ట్‌ సిటీల ఏర్పాటుకు వ్యతిరేకత చూపింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు  వల్ల ఆర్థిక, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని శివరామకృష్ణన్‌ కమిటీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు భాగాలుగా విభజించాలని నివేదికలో కమిటీ పేర్కొంది. వాటిని ఉత్తరాంధ్ర, మధ్యాంథ్ర, కోస్తాంధ్ర, రాయలసీమగా వివరించింది. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, పెట్టుబడులు ఒకే ప్రాంతంలో ఉండకూడదని కమిటీ స్పష్టం చేసింది. విశాఖను ఐటీ జోన్‌గా అభివృద్ధి చేయాలని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. ఉత్తరాంధ్ర జోన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలు ఉండగా, మధ్యాంధ్రలో పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలు, రాయలసీమకు సంబంధించి  కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు. కోస్తాంధ్ర జోన్‌లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉంటాయి. ఇక రాయలసీమలో ట్రాన్స్‌పోర్టు కారిడార్‌గా అభివృద్ధి చేయాలని కమిటీ చెప్పింది. కాళహస్తి శ్రేణిలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని, బెంగుళూరు-గుంటూరు మధ్య రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని కూడా శివరామకృష్ణన్‌ కమిటీ వెల్లడించింది.   అసెంబ్లీ, సీఎం కార్యాలయం, సెక్రటేరియట్లు రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, కర్నూలు లేదా అనంతపురంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని, గతంలో రాజధానిగా ఉన్న కర్నూలుకు న్యాయం చేయాలని నివిదికలో శివరామకృష్ణన్‌ కమిటీ వెల్లడించింది.

ఎయిర్ ఇండియా వెబ్ సైట్ సేవలకు అంతరాయం.....

 న్యూఢిల్లీ ,ఆగస్టు 27:   వినియోగదారుల ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో బుధవారం ఎయిర్ ఇండియా వెబ్ సైట్ సేవలు స్తంభించిపోయాయి. 100 రూపాయలకే ఎయిర్ ఇండియా టికెట్ అనే కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం ఎయిర్ ఇండియా వెబ్ సైట్ ద్వారానే వినియోగదారులు టికెట్ బుక్ చేసుకోవాలంటూ నిబంధన విధించడంతో ఎక్కువ మంది వినియోగదారులు వెబ్ సైట్ ను సందర్శించారు. దాంతో వెబ్ సైట్ క్రాష్ అయిందని ఎయిర్ ఇండియా మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఎయిర్ ఇండియా వెబ్ సైట్ సందర్శించిన వారికి 'సేవలు అందుబాటులో లేవు' అనే సందేశం కనిపిస్తోంది. 100 రూపాయల టికెట్  అవకాశాన్నిఆగస్టు 27 తేది నుంచి ఐదు రోజులపాటు  కల్పించారు. 

Monday, August 25, 2014

1993 నుంచి జరిగిన బొగ్గు గనుల కేటాయింపులన్నీ రద్దు... సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ, ఆగష్టు 25 : బొగ్గు గనుల కుంభ కోణం కేసులో సుప్రీం కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 1993 నుంచి జరిగిన బొగ్గు గనుల కేటాయింపులన్నీంటినీ రద్దు చేస్తూ సుప్రీం చారిత్ర్మాత్మక నిర్ణయం తీసుకుంది. 1993-2010 మధ్య కాలంలో బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో పారదర్శకత లేదని ఉన్నతన్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే ఆ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా గనులను కేటాయించారే తప్ప చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులు జరగలేదని కోర్టు తెలిపింది. వాటిపై మరింత విచారణ జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఇకపై బొగ్గు క్షేత్రాల కేటాయింపులను కోర్టే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఆనాటి కేటాయింపుల సందర్భంగా పోటి బిడింగ్‌ విధానం అనుసరించలేదని కోర్టు తెలిపింది. అల్ర్టామెగా పవర్‌ ప్రాజెక్టుకు కేటాయించిన బొగ్గు గనులు మినహా మిగతా కేటాయింపులు అన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.  ఈ   పిటిషన్‌పై సెప్టెంబర్‌ 1 నుంచి జరిగే విచారణ తరువాత కేటాయింపులు ఎలా జరపాలనే విషయం వెల్లడిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోంది. ఆ దర్యాప్తును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ కేసుపై సీబీఐ త్వరితగతిన విచారణ జరిపి దోషులపై చార్జిషీట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

ఎన్డీయేకు ఉప ఎన్నికలలో ఎదురు దెబ్బ

రాంచీ, ఆగస్టు 25 : కేంద్రంలో అధికారంలో ఉన్న తగిలింది. బీహార్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలో  18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీహార్‌లో మొత్తం 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఆర్జేడీ -జేడీయూ కూటమి ఆధిక్యత సాధించింది.  పంజాబ్‌లో 3 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే పాటియాలాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణీత్‌ కౌర్‌ 23 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమె పంజాబ్‌ మాజీ సీఎం అమరేంద్ర సింగ్‌ భార్య. కర్నాటకలో 3 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగగా... రెండు చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించగా ఒక చోట బీజేపీ గెలుపొందింది.

గాంధీ చిత్రం దర్శకుడు రిచెర్డ్‌ అటెన్‌బరో కన్నుమూత

న్యూఢిల్లీ, ఆగస్టు 25 : ప్రఖ్యాత బ్రిటిష్‌ సినీ నటుడు, దర్శకుడు గాంధీ చిత్రానికి దర్శకత్వం వహించిన రిచర్డ్‌ అటెన్‌బరో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉన్న అటెన్‌బరో తన 90వ ఏట మరణించారు. యువకుడిగా ఉన్నప్పుడే సినీరంగ ప్రవేశం చేసిన అటెన్‌బరో డికీ డార్లింగ్‌గా ప్రసిద్ధి చెందారు. అనేక సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆరు దశాబ్దాలపాటు ఆయన బ్రిటిష్‌ సినీ రంగానికి సేవలు అందించారు. బ్రిజన్‌రాక్‌లో యువకుడిగా, జురాసిక్‌ పార్క్‌లో వృద్ధ సైంటిస్టు గా ఆయన నటించారు. ఆయన దర్శకత్వం వహించిన గాంధీ చిత్రానికి 7 అస్కార్‌ అవార్డులు దక్కాయి. 

Tuesday, August 19, 2014

ముగిసిన "సర్వే" తంతు...... తెలంగాణ అంతటా కర్ఫ్యూ తరహా వాతావరణం

బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల వివరాలు ఇవ్వడానికి   ప్రజల విముఖత  ....
హైదరాబాద్, ఆగస్టు 19: ‘సమగ్ర కుటుంబ సర్వే’ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో  పూర్తి బంద్ వార్తావరణం లో ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 9.30 సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులకు సమాచారం అందింది. బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల వివరాలు ఇవ్వడానికి చాలావరకు ప్రజలు విముఖత వ్యక్తం చేశారు.  ఎన్యూమరేటర్ల రాక కోసం ప్రజలు వేచిచూడడం, వారు తమ ఇళ్ల వద్దకు రాగానే అవసరమైన పత్రాలు చూపి, నమోదు చేసుకోవడం కనిపించింది. చాలాచోట్ల అనుకున్న సమయానికి సర్వే ప్రారంభం కాలేదు.  జిల్లా, మండలకేంద్రాలు, గ్రామాల్లో సర్వేకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కనిపించింది. సర్వే కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో.. అంతటా కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపించింది. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట, కరీంనగర్ జిల్లా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ జిల్లా బాసర తదితర పుణ్య క్షేత్రాలన్నీ బోసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 15 భూగర్భ గనులు, నాలుగు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.సర్వే వల్ల ఉదయం, సాయంత్రం మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సర్వే కోసం వారం రోజులుగా ప్రత్యేక బస్సులు నడిపి రూ. 12 కోట్ల ఆదాయం ఆర్జించిన ఆర్టీసీకి, మంగళవారం
జిల్లాల వారీగా నమోదైన శాతాలు..
 జిల్లా                 శాతం
 మహబూబ్‌నగర్         99
 ఖమ్మం                  98
 కరీంనగర్                98
 నల్లగొండ                97
 మెదక్                   96
 ఆదిలాబాద్              96
 నిజామాబాద్            93
 రంగారెడ్డి                89
 వరంగల్                 86
 జీహెచ్‌ఎంసీ             77
కె.సి.ఆర్.హ్యాపీ..
తెలంగాణ సమగ్ర సర్వే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సర్వే మన బాగుకోసం వచ్చిందన్న నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడినుంచో స్వస్థలాలకు తరలివచ్చారని ఆయన చెప్పారు. భివాండి, అహ్మదాబాద్, సూరత్, ఇంకా జెడ్డా, గల్ఫ్‌లనుంచి కూడా ప్రత్యేకంగా తరలివచ్చారని ఆయన చెప్పారు. దేశంలో ఎప్పుడూ ఇంతటి అద్భుతమైన సర్వే జరగలేదని, ఇకముందు అన్ని రాష్ట్రాలూ, యావత్ భారతదేశం ఇటువంటి సర్వేను నిర్వహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ హైదరాబాద్ జనాభా గురించి మనం అనుకున్నది వేరు ఇప్పుడు బయటపడుతున్నది వేరు అంటూ హైదరాబాద్ జనాభా దాదాపు ఒక కోటి 20 లక్షలు కావచ్చునని ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నదని, ఇప్పుడు ఇక్కడ స్థిరపడినవారే గాక పనులమీద వచ్చేవారు కూడా ఉంటారు కాబట్టి తరువాత ఇక్కడి మంచినీళ్ల అవసరం ఎంత అనేది అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పుడు సర్వే పూర్తి అయిపోయింది గనక అన్ని లెక్కలూ నికరంగా తేలతాయని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం కోసం సర్వే చేస్తామంటే చిలవలు పలవలు చేశారని కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు  విమర్శలు చేస్తున్నా ఆంధ్ర మిత్రులు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారని ఆయన సంతోషంగా చెప్పారు. ఇప్పుడు వచ్చిన సమాచారం ఆధారంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఇళ్లు కట్టాలి, ఏయే సంక్షేమ పథకాలు అమలు చేయాలి మొదలైన అంశాలపై పూర్తి అవగాహన కల్పించే నివేదిక సిద్ధమవుతుందని, ఇది ముఖ్యమంత్రి టేబుల్‌పై ఉంటుంది, సెక్రటరీల టేబుళ్లపై ఉంటుంది, కలెక్టర్ల టేబుల్‌పై ఉంటుంది, ఎంఆర్ఓ టేబుల్‌పై కూడా ఉంటుందని ఆయన చెప్పారు.


రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది. 

Friday, August 15, 2014

                          స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కొట నుంచి ప్రసంగిస్తున్న కె.సి.ఆర్.
                స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు లో త్రివర్ణపతాకాని ఆవిష్కరించిన చంద్ర బాబు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్   ఇచ్చిన విందుకు హాజరైన ఆంధ్ర, తెలంగాణా సి.ఎం. లు చంద్రబాబు,కె.సి.ఆర్.

మోడీ ‘మేడ్ ఇన్ ఇండియా’ నినాదం....వస్తువుల ఉత్పత్తి ద్వారా ముందుకు కదలాలని పిలుపు

 పేదలకు ‘జన ధన యోజన’ పథకం
న్యూఢిల్లీ, ఆగస్టు 15 : మేక్ ఇన్ ఇండియా అనేది ఇక నుంచి మన విజయ నినాదం కావాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపు ఇచ్చారు. దేశ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని మాట్లాడుతూ, ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావచ్చునని, వస్తువుల ఉత్పత్తితో మాత్రమే దేశ ఆర్థిక ప్రగతి సాధ్యమని ఆయన చెప్పారు. ఇకనుంచి దిగుమతులపై ఖర్చును తగ్గించాలని, మనం అన్ని వస్తువులనూ ఉత్పత్తి చేయడం ద్వారా ముందుకు కదలాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఉత్పత్తే దేశాభివృద్ధికి మూలం అని ఆయన వివరించారుదేశంలో ప్రతి పేదవానికీ ఒక బ్యాంకు ఖాతా ఉండేటట్టు చేయాలని,  ప్రతి పౌరునికీ డెబిట్ కార్డు ఉండాలని అన్నారు.  పేదలకు లక్ష రూపాయలతో జీవిత బీమా కల్పిస్తామని చెప్పారు. 2016 కల్లా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దాలని, 2019 కల్లా దేశం నలుమూలలూ పరిశుభ్రంగా ఉండాలని ఆకాంక్షించారు.  తాను ప్రధానమంత్రిగా గాక ప్రదాన సేవక్‌గా ప్రజల  ముందుకు వచ్చానన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించాలని చెబుతూ ప్రణాళికా సంఘం పాత్ర ఇక ముగిసిందని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘం పాతబడిపోయిందని, దాన్ని మూలపడేయాలని, దాని స్థానంలో దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త సంస్థను ఏర్పాటు చేసుకుందామని ఆయన వెల్లడించారు. ఒక పేదవాడు ఎర్రకోటపై భారత దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయగలగడం అంటేనే మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో చెబుతుందని ఆయన ఆనందంగా చెప్పారు. దేశాబివృద్ధికి పెద్ద పెద్ద ఘనకార్యాలు ఏమీ చేయనక్కరలేదు చిన్న చిన్న పథకాలు చాలు అని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికీ డిజిటల్ కనెక్టివిటీ తీసుకురావాలని, అలాగే సాంకేతిక ప్రగతిఫలాలు దేశ ప్రగతికి దోహదం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు. దేశంలో  మాన భంగాలు జరగడం అంటే అది జాతికే అవమానం అని ఆయన అంటూ తల్లిదండ్రులు ఆడ పిల్లలను కాదు, మగ పిల్లలను అదుపుచేయాలని, ఇది తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన చెప్పారు. దేశంలో ప్రతి పాఠశాలలోనూ మన ఆడపిల్లలకోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.   పార్లమెంటులో సంఖ్యా బలంతో కాకుండా ఏకాభిప్రాయంతో దేశాన్ని నడిపిస్తాను.. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకుపోతాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  తాను మాట్లాడే పోడియానికి బులెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని మోడీ తిరస్కరించటం విశేషం. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రధానమంత్రులు ఎర్రకోట నుంచి బులెట్ ప్రూఫ్ అద్దాల గది నుంచి ప్రసంగిస్తుండగా.. మోడీ తొలిసారి ఆ రక్షణ లేకుండా ప్రసంగించారు.
మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ...
    ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తాం.. సరికొత్త వ్యవస్థను నెలకొల్పుతాం
    పేదలకు ‘జన ధన యోజన’ పథకంతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తాం
    ఎంపీల ద్వారా ‘ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ పథకం’ అమలుచేస్తాం
    యువత నైపుణ్యాల కోసం ‘స్కిల్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం
    పరిశుభ్రమైన భారత్ కోసం అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛ భారత్’ పథకం
    తొలి ఏడాది పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్ల నిర్మాణం
    మతం, కులం ప్రాతిపదికగా హింస ఇంకెన్నాళ్లు? పదేళ్ల పాటు వదిలేద్దాం
    ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే దాన్ని నాణ్యతకు మారుపేరుగా నిలపాలి
    పౌరులను సాధికారం చేయడానికి ‘డిజిటల్ ఇండియా’ను రూపొందిస్తాం
    ప్రభుత్వంలో శాఖల మధ్య అంతరాలనే గోడలు బద్దలుకొడుతున్నా

Thursday, August 14, 2014

భారతీయ విలువలు ప్రపంచానికి మార్గదర్శకం...రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆగస్టు 14:  అసహనం, హింసాకాండను ప్రోత్సహించడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా మోసగించడమేనని, హింసాకాండను రెచ్చగొట్టే వైఖరి గర్హనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రాచీన నాగరికతతో కూడుకుని ఉన్నప్పటికీ భారత్, అధునాతన దేశమని, అధునాతన కలలకు నిలయమని రాష్ట్రపతి అన్నారు.
విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టాలని భావించేవారికి భారతీయ విలువలు, రాజకీయ ఒరవడి అర్థంకావని,  శాంతియుత పరిస్థితులు లేకుండా ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించడం కష్టతరమన్నది భారతీయులకు తెలుసునని అన్నారు. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు మతోన్మాద సిద్ధాంతాలతో వివిధ దేశాల భౌగోళిక హద్దుల రేఖాచిత్రాలనే మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. తీవ్రవాదాన్ని, తీవ్రవాద కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని భారతీయ విలువలు చాటిచెబుతున్నాయని, ప్రజాస్వామ్యానికి భారత్ మార్గదర్శకమైనదని రాష్ట్రపతి అన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోగా 80శాతం అక్షరాస్యత సాధించాలని, 2019లో జరిగే మహాత్మాగాంధీ 150వ  జయంతినాటికి పరిశుద్ధ భారత్ సాధించాలన్న  ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అభినందనీయమని రాష్ట్రపతి అన్నారు.
వార్తాప్రపంచం వీక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు... 

ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి కుదింపు...

హైదరాబాద్, ఆగష్టు 14 :  హైదరాబాద్ సహా ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో నవంబర్ నుంచి ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని కుదించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. దీని ప్రకారం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఇకపై నెలకు 5 లావాదేవీలు మాత్రమే ఉచితం. అదే మరో బ్యాంకు ఏటీఎంలోనైతే ఈ పరిమితిని ప్రస్తుతమున్న 5 నుంచి 3కు తగ్గించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. నగదు విత్‌డ్రాయల్స్ మొదలుకుని బ్యాలెన్స్ స్టేట్‌మెంట్ల లావాదేవీల దాకా అన్నీ ఈ పరిమితికి లోబడే ఉండాలి. ఒకవేళ దాటితే ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ. 20 మేర చార్జీలు పడతాయి. అయితే, చెక్‌బుక్కులు తదితర అదనపు సర్వీసులు ఉండని బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. మిగిలిన చోట్ల ఇతర ఏటీఎంల వాడకంపై ప్రస్తుతమున్న ఐదు లావాదేవీల పరిమితి  యథాప్రకారం కొనసాగుతుంది.  

రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ....రైతులకు లక్షన్నర , డ్వాక్రా సంఘాలకు లక్ష చొప్పున మాపీ

హైదరాబాద్, ఆగష్టు 14 : రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు రూ. లక్షన్నర చొప్పున, డ్వాక్రా సంఘాలకు రూ. లక్ష చొప్పున మాపీ చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. ఆర్థిక శాఖ జీవో నెం. 174 లో రుణ మాఫీ ఏ విధంగా అమలు చేయాలనేది  పేర్కొన్నారు.  ఒక రైతు కుటుంబానికి రూ. లక్షన్నర లబ్ది చేకూర్చే విధంగా మాఫీ చేయనున్నారు. అదే విధంగా డ్వాక్రా సంఘాలకు రూ. లక్ష వరకు రుణ మాఫీ చేయాలనే నిర్ణయాన్ని ఆగస్టు 2న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేయడానికి విధివిధానాలు, కమిటీలో ఎవరు ఉండాలి, ఏ విధంగా చేయాలి... అర్హులను గుర్తించి అమలు చేసే విధానాన్ని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీనికి సంబంధించి ఒక కమిటీని  ప్రభుత్వం తరఫు నుంచి కొందరు, బ్యాంకర్ల తరఫు నుంచి కొందరు ప్రతినిధులతో ఏర్పాటు చేస్తారిఉ.

తెలంగాణ సర్వేకు హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతి...

బ్యాంక్ అకౌంట్లు, వ్యక్తిగత వివరాలకోసం పట్టుపట్టవదని కోర్టు ఆదేశం... 
సంక్షేమ పథకాల అమలు కోసమే సర్వే అన్న సర్కార్.. 

హైదరాబాద్, ఆగష్టు 14 : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వేకు  హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది. వివరాల కోసం ప్రజలపై ఒత్తిడి తేవద్దని స్పష్టం చేసింది. ఎవరైనా అభ్యంతరం చెబితే వదిలివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంక్ అకౌంట్లు, వ్యక్తిగత వివరాలకోసం పట్టుపట్టవదని కోర్టు సూచించింది. సమగ్ర సర్వేపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. సర్వే తప్పనిసరికాదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. సమగ్ర సర్వే స్వచ్చంధంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితంలోకి చొరబడడంలేదని, సంక్షేమ పథకాల అమలు కోసమే సర్వే చేస్తున్నట్లు ఆయన కోర్టుకు వెల్లడించారు. ఈనెల 19న తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వేను వ్యతిరేకిస్తూ సీతాలక్ష్మి అనే న్యాయవాడి కోర్టును ఆశ్రయించారు. ఇది చట్ట వ్యతిరేకమని, దీనికి చట్టబద్ధత లేదని, ఇటువంటి సర్వేను కేంద్రప్రభుత్వం మాత్రమే చేయాలని, ఎవరు పడితే వారు చేయకూడదనే కోణంలో వారు పిటిషన్ వేశారు. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్లు, వాహనాలు, కులం, ఏ ప్రాంతం నుంచి ఎప్పుడు వచ్చారు, తదితర విషయాలు సర్వే ఫార్మాట్‌లో ఉన్నాయని, ఈ రకంగా వ్యక్తుల వివరాల్లోకి చొరబడడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం ప్రజా శ్రేయస్సుకోసం, సంక్షేమపథకాల అమలు కోసమే సర్వే నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అంతే తప్ప ప్రజలపై ఒత్తిడి తీసుకురాబోమని, ఇది తప్పనిసరికాదని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి కాదని అంటోంది కాబట్టి ప్రజలకు ఇష్టమైతేనే ఎన్యూమరేటర్స్‌కు వివరాలు ఇవ్వాలని, లేదంటే ఇవ్వాల్సిన పనిలేదని చెప్పారు. ప్రజలు సహకరిస్తేనే వివరాలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.


Tuesday, August 12, 2014

తాత్కాలిక రాజధానిగా బెజవాడ...

హైదరాబాద్, ఆగస్టు 12: కృష్ణా జిల్లా విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను దశల వారీగా విజయవాడకు తరలించాలని సూచించారు. రాష్ట్రానికి నూతన రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మరో వారం రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనున్న తరుణంలో.. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై సీఎం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సలహా కమిటీతో  చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకోవాలని, అన్ని ప్రధాన శాఖల కార్యాలయాలు తాత్కాలిక రాజధాని నగరంలో ఉండేలా చూడాలని  చంద్ర బాబు అధికారులను ఆదేశించారు. ప్రజలతో సంబంధం ఉన్న శాఖల అధిపతుల కార్యాలయాలను తొలుత విజయవాడ తరలించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. ఆ తరువాత దశల వారీగా మిగిలిన శాఖాధిపతుల కార్యాలయాలను తరలించాలని చెప్పారు.   ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటి పారుదల శాఖ కార్యకలాపాల కోసం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. రాష్ట్ర స్థాయి సమీక్షలు మొత్తం విజయవాడలోనే సాగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా విజయవాడ నుంచే తన శాఖ కార్యకలాపాల వేగం పెంచారు. ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో తన క్యాంపు కార్యాలయంతో పాటు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలోని పోరంకిలో దేవాదాయశాఖ నిర్మించిన వృద్ధాశ్రమం భవనాలను తన క్యాంపు కార్యాలయంగా, ఆ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలుగా ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం తన శాఖ ఉన్నతాధికారుల కార్యాలయాలను విజయవాడకు తరలించే ఏర్పాట్లలో పడ్డారు. గృహ నిర్మాణ, అటవీ, పంచాయితీరాజ్, రహదారులు, భవనాల శాఖలను తొలుత తరలించే అవకాశం ఉంది.  ఇక గన్నవరం సమీపంలోని ‘మేథా టవర్స్’లో రాష్ట్ర స్థాయిలోని 11 శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ భవ నంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మార్పులు చేర్పులు చేయడం కోసం కృష్ణా జిల్లా కలెక్టర్‌ను నివేదిక కూడా కోరింది. ఇక్కడ రవాణా, ఐటీ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, సహకార, ఆర్ అండ్ బీ, విద్య, వ్యవసాయ, ఎక్సైజ్, సంక్షేమ, వాణిజ్య పన్నుల శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు  సమాచారం.  అలాగే.. గన్నవరంలోని ప్రాంతీయ శిక్షణా కశాశాలలోని 25 ఎకరాల స్థలంలో ఆర్‌టీసీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. దీంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలో 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది. ఈ స్థలాలను ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కేటాయించేందుకు పరిశీలిస్తోంది. దీంతో పాటు విజయవాడకు సమీపంలో అద్దెకు తీసుకోవడానికి అనువైన భవనాలు ఏమున్నాయో వాటి వివరాలను కూడా ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం నుంచి సేకరిస్తోంది.   

Monday, August 11, 2014

రైల్వే రిజర్వేషన్లు ప్రైవేటుపరం...

న్యూఢిల్లీ, ఆగస్టు 11 :  రిజర్వేషన్ కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వై టీ ఎస్‌ కే పేరిట ప్రైవేట్ రిజర్వేషన్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. సర్వీస్ చార్జ్ వసూలు చేసుకునే అవకాశాన్ని వైటీఎస్‌కేలకు అప్పగించింది. అన్‌రిజర్వ్ టిక్కెట్లకు రూపాయి, స్లీపర్ క్లాస్‌ రూ.30, ఏసీ రూ.40  చొప్పున సర్వీస్ చార్జ్‌లు వసూలు చేయనున్నారు.  వైటీఎస్‌కేలు ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి తత్కాల్‌ టిక్కెట్లు ఇవ్వనున్నారు. టిక్కెట్ల దుర్వినియోగం అడ్డుకునేందుకు ప్రత్యేక రంగు టిక్కెట్లు ఇవ్వనున్నారు.

ఆగస్టు 31వ తేదీలోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి... విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి అడ్మిషన్లు

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి  ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ, ఆగస్టు 11 : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి  ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే అడ్మిషన్లు జరగాలని, ఆగస్టు 31వ తేదీలోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని థర్మాసనం తెలంగాణ సర్కార్‌ను  ఆదేశించింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. స్థానికత అంశం ఈ కేసు పరిధిలోకి రాదని సుప్రీం పేర్కొంది. ఈ  ఏడాది వరకే ఉమ్మడి అడ్మిషన్లు ఉండాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి అడ్మిషన్లు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పదేళ్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలోనే అడ్మిషన్లు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్థానికత విషయంలో 371 డి ప్రకారమే అడ్మిషన్లు జరగాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.  కాగా, ఈ నెల 4న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెల 7 నుంచి  ఆ రాష్ట్రంలోని  13 జిల్లాల్లో ఎంసెట్‌ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం సోమవారం కోర్టు ఇచ్చే తుది తీర్పుకోసం ఎదురుచూసింది.  ఎంసెట్‌ అడ్మిషన్లు నిర్వహించేందుకు సిబ్బంది కొరత ఉందని అక్టోబర్‌ నెలాఖరు వరకు అడ్మిషన్లకు గడువు ఇవ్వాలని తెలంగాణ సర్కారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏఐసీటీఈ, ఏపీ సర్కారు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో  ఇంప్లీడ్‌ పిటీషన్లు వేశాయి.  ఏపీ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆగస్టు 31లోగా అడ్మిషన్లు పూర్తి చేసి సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఇక  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో  టీ సర్కారు ఎంసెట్‌ అడ్మిషన్ల షెడ్యూలు ఖరారు చేయనుంది.

Tuesday, August 5, 2014

ఎంపీ కవితపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం...

 హైదరాబాద్,ఆగస్టు 5:  టీఆర్ఎస్ నేత, నిజమాబాద్ ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని మాదన్నపేట పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చాక కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత్ లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు భారత భూభాగంలోనివి కావని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై  బీజేపీ లీగల్‌ సెల్ అడ్వొకేట్‌ కన్వీనర్ కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. కరుణాసాగర్ ఫిర్యాదును పరిశీలించిన ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు

తిరుమల, ఆగస్టు 5 : తిరుమల శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. మొదటి ఘాట్ రోడ్ 16వ మలుపు దగ్గర అటవీ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. 16వ మలుపువద్ద చెలరేగిన మంటలు 8వ మలుపు వద్దకు చేరుకున్నాయి. మూడు, నాలుగు కిలోమీటర్ల మేర మంటలు విస్తరించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో టీడీపీ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలులు వీస్తుండడంతో మంటలను అదుపు చేయడం కష్టమవుతోంది. 

ఫేస్ బుక్ పై కేసుకు పెరుగుతున్న మద్దతు...

లండన్, ఆగస్టు 5: సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా దాఖలైన  కేసులో యూజర్ల మద్దతు  పెరుగుతోంది. ఆస్ట్రియాకు చెందిన మాక్సిమలియిన్ ష్రెమ్స్ అనే న్యాయ విద్యార్థి ఫేస్ బుక్ పై వేసిన కేసుకు సంబంధించి 11,500 మంది యూజర్లు అండగా నిలిచారు. లక్షలాది యూజర్ల వ్యక్తిగత విషయాలను ఎన్ఎస్ఏ నిఘా సంస్థకు  ఫేస్ బుక్ ఇచ్చేసిందని ష్రెమ్స్ కేసు వేశాడు. యూజర్ల వ్యక్తిగత రహస్యాలను ఉల్లంఘించిందంటూ ఫేస్ బుక్ పై కేసు వేయడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్లంత తనతో ఈ పోరాటంలో కలిసిరావాలని కోరాడు. లైక్ బటన్ ద్వారా థర్డ్ పార్టీ వెబ్ సైట్లకు చెందిన యూజర్లను కూడా ట్రాక్ చేస్తోందని, యూజర్లు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం ద్వారా డేటా ప్రైవసీ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆ దావాలో పేర్కొన్నాడు. దీనిపై రూ.4.6 కోట్లను ఫేస్ బుక్ చెల్లించాలని దావా వేశాడు. ఫేస్ బుక్ లో ఉల్లంఘనకు పాల్పడిన ప్రతీ యూజర్ నుంచి  41 వేల రూపాయిలు చొప్పున తనకు ఇప్పించాలని కోర్టుకు విన్నవించాడు. ఆగస్టు ఒకటో తేదీ వరకు ష్రిమ్స్ తో పాటు అతడి పోరాటంలో 2,500 మంది చేరగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పదివేల మందికి పైగా యూజర్ల మద్దతు తెలపడం  తాను భావించిన దానికంటే చాలా ఎక్కువ అని ష్రెమ్స్ అంటున్నాడు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...