Monday, July 28, 2014

వార్తాప్రపంచం వీక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు...

అదుపులోకి రాని కాలిఫోర్నియా కార్చిచ్చు...

కాలిఫోర్నియా, జూలై 28 : అమెరికాలో  కాలిఫోర్నియాలోని మొసెమైట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన కార్చిచ్చు గంటగంటకీ పెరుగుతోంది. ఇప్పటికే 13 ఇళ్లను భస్మీపటలం చేసిన ఈ కార్చిచ్చు అమడోర్, ఎల్ డొరాడో ప్రాంతాలకు విస్తరిస్తోంది. దాదాపు రెండు వెల మంది సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మంటలు శాక్రమెంటో వైపు విస్తరిస్తున్నట్లు తెలుస్తున్నది. పాలకార్లు సేకరిస్తున్న ఒక వ్యక్తి అటవీ ప్రాంతం సమీపాన పార్క్ చేసిన 13 కార్లు ఇప్పటికే అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న ఈ అగ్నికిలలు కాలిఫోర్నియా అటవీ ప్రాంతాన్ని దగ్ధం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆరు చదరపు మెళ్ల అటవీ ప్రాంతం మంటలకు మాడి మసైంది. అటవీ ప్రాంతంలో ఒక ఇల్లు దగ్ధమైంది. దీని ప్రభావంతో ఆ ప్రాంతం పొగ, దుమ్ముతో నిండిపోయింది. ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది. విమానాల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టు పక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ పై ముందడుగు..

హైదరాబాద్, జూలై 28 : ఎంసెట్ కౌన్సెలింగ్‌పై  సందిగ్ధం తొలగిపోయింది.  ఈనెల 30న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈనెల 30న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని, ఆగస్టు 7వ తేదీ నుంచి విద్యార్థుల సర్టిపికేట్లను పరిశీలించాలని నిర్ణయించినట్లు వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే కౌన్సెలింగ్ ఆలస్యం అయినందున రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని.. ఇంకా ఆలస్యం చేస్తే రెండు రాష్ట్రాల కాలేజీల్లో విద్యార్థులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు.  సర్టిఫికేట్ పరిశీలనఆగస్టు 7న ప్రారంభిస్తే సుమారు 18, 20 రోజులు పడుతుందని, ఈ లోపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థుల ఫీజు రిఇంబర్స్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటే  విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కాగా దీనికి సంబంధించి ఆగస్టు 4న సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు కోర్టు తీర్పు అనుకూలంగా రావచ్చునని వేణుగోపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫేస్ బుక్ లో ' సేవ్ ' ఆప్షన్....

న్యూయార్క్, జులై 28: నెటిజన్లకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఆప్షన్ ప్రవేశపెట్టింది ఫేస్ బుక్. ఆండ్రాయిడ్ లో లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్‌ ను ఉపయోగించే వారికి   ఇక నుంచి ‘సేవ్’ అనే కొత్త ఆప్షన్ దర్శనమివ్వనుంది. సినిమాలు, పాటలు, టీవీ షోల వంటి వాటిని వీలు కుదిరినప్పుడు చూసుకునేందుకు వీలుగా వాటి లింకుల్ని ఈ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ జాబితాలో చేర్చుకునే లింకులు ఇతరులెవరికీ కనిపించవు కూడా. అవసరమనుకుంటే వాటిని ఆర్చీవ్ లో భద్రపర్చుకోవచ్చు. లేదా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.ఈ ఆప్షన్ ను అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది. యూజర్లు సేవ్ చేసుకున్న లింక్స్ ను ఏ సమయంలోనైనా తిరిగి చూసుకోవాలంటే ఎడమవైపున ఉన్న ట్యాబ్ ను క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపింది.

Thursday, July 17, 2014

మలేసియా విమానం కూలిందా....కూల్చేశారా...?

కౌలాలంపూర్,జులై 17: మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం  ఉక్రెయిన్ లో కుప్పకూలింది. అమెరికాలోని ఆమ్ స్టర్  డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న ఈ విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ మీదుగా వెడుతుండగా  కుప్పకూలింది. ఈ విమానంలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా  మరణించినట్లు మలేషియా హోం శాఖ నిర్ధారించింది. ఎంహెచ్-17 విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత అది కూలిపోయినట్లు తెలిసిందని, మొత్తం అందులో ఉన్నవారంతా మరణించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ సంస్థ కూడా తెలిపింది. గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు బయల్దేరిన ఈ విమానం శుక్రవారం ఉదయం 6.10 గంటలకు కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. ఈలోపే ఈ ప్రమాదం జరగింది. అయితే, రష్యా మిసైల్ వల్లే ఈ విమానం కూలినట్లు ఉక్రెయిన్ హోం మంత్రి ఆన్టోన్ తెలిపారు. విమానం 10వేల మీటర్ల ఎత్తులో ఉండగా రష్యా దాన్ని మిసైల్ తో కూల్చేసిందన్నారు. గత రెండు వారాల్లో తమ దేశ యుద్ధ విమానాలను కూడా రష్యా కూల్చేసిందని ఆయన వివరించారు.ఉక్రెయిన్ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం ఉన్న ప్రాంతంలోనే ఈ విమానం కూలడం గమనార్హం. ఈ బోయింగ్ 777 విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రమాద విషయాన్ని అందరికంటే ముందుగా రష్యా వార్తా సంస్థ ఇంటర్ ఫాక్స్ బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ తర్వాతే మలేషియన్ ఎయిర్ లైన్స్ కూడా నిర్ధారించింది. కాగా ఈ విమాన ప్రమాదంపై విచారణకు మలేషియా ప్రధాని ఆదేశించారు.  మరోవైపు విమానం కూలిన ఘటనపై ఉక్రెయిన్ ప్రధాని కూడా విచారణకు ఆదేశించారు. అయితే విమానం కూలడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. 


Monday, July 14, 2014

రాజ్య సభలో కూడా పోలవరం బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ, జులై 14 : పోలవరం బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోలవరం బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణకు మద్దతుగా టీఆర్ఎస్, టీ. కాంగ్రెస్, ఛత్తీస్‌గడ్, ఒడిషా రాజ్యసభ సభ్యులు సభలో బిల్లును వ్యతిరేకిస్తూ... తమ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా ఏపీ కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌లు తమ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం బిల్లు ఆమోదం పొందింది.

భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు డ్రా......

 నాటింగ్ హామ్, జులై 13:  భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ ఊహించినట్టే డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు ఆదివారం ఇంగ్లండ్ లక్ష్యఛేదనకు దిగకుండానే మ్యాచ్ ముగిసింది.167/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 391/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బిన్ని (78), భువనేశ్వర్ కుమార్  (63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. తొలి ఇన్నింగ్స్ లో లో భారత్ 457, ఇంగ్లండ్ 496 పరుగులు చేశాయి.

సాకర్ ప్రపంచ కప్ 2014 విజేత జర్మనీ...

 రియో, జులై 13: జర్మనీ చరిత్ర సృష్టించింది. లాటిన్ అమెరికాలో ప్రపంచ కప్ సాధించిన తొలి యూరప్ జట్టుగా ఘనత సాధించింది. ఉత్కంఠగా సాగిన సాకర్ ప్రపంచ కప్ 2014 ఫైనల్ సమరంలో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. మ్యాచ్ అదనపు సమయంలో మరియా గోయెట్జ్ ఏకైక గోల్ కొట్టి జర్మనీకి కప్ అందించాడు. జర్మనీ ప్రపంచ కప్ సాధించడమిది నాలుగోసారి . అర్జెంటీనా, జర్మనీ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫలితం కోసం మ్యాచ్ ను అదనపు సమయం నిర్వహించారు. ఆట తొలిసగం మాదిరే ద్వితీయార్ధంలోనూ ఇరు జట్లు గోల్ కోసం చెమటోడ్చినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభంలో జర్మనీ దూకుడుగా ఆడగా తరువాత  అర్జెంటీనా కూడా దూకుడు పెంచింది. జర్మనీ గోల్ పోస్ట్ పై దాడికి దిగారు. కాగా అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 30 వ నిమిషంలో అర్జెంటీనా గోల్ చేసినా ఆఫ్ సైడ్ కావడంతో రిఫరీ నిరాకరించాడు. జర్మనీ కూడా గోల్ చేసే అవకాశాల్ని చేజార్చుకుంది. నెలరోజులుగా జరుగుతున్న ఈ పోటీలకు ఆఖరిరోజైన ఆదివారం రియో డి జనీరో సాకర్‌ మైదానం సాంబా నృత్యాలు, షకీరా ఆటాపాటలతో హోరెత్తింది. ఆరంభంలోనే షకీరా ‘లా లాలా’ పాటతో అదరగొట్టింది. కేవలం వరల్డ్‌కప్‌ కోసం షకీరా రూపొందించిన ఈ పాట ఆద్యంతం అద్భుతంగా సాగింది. నడుం వొంపుల వయ్యారాలతో యువతను అమితంగా ఆకట్టుకున్న షకీరా నృత్యం ఈ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. వరల్డ్‌కప్‌ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం షకీరాకి ఇది మూడోసారి. హైతీకి చెందిన హిప్‌ హాప్‌ స్టార్‌ వేక్లెఫ్‌ జీన్‌, బ్రెజిల్‌ సింగర్‌ అలెగ్జాండ్రే పైరెస్‌ కలిసి ‘డర్‌ ఉమ్‌ జైటో’ అంటూ పాటందుకుని స్టేడియాన్ని ఉర్రూతలూగించారు. మెక్సికో గిటారిస్ట్‌ కార్లోస్‌ శాంటనా సూపర్బ్‌ అనిపించాడు. బ్రెజీలియన్‌ సింగర్‌ ఐవేటే సంగాలో తన పాటతో అలరించింది. 
 

Sunday, July 13, 2014

గురుపౌర్ణమి సందర్భంగా  హైదరాబాద్ లో షిర్డీ సాయి ఆలయాన్ని సందర్శించిన తెలంగాణా సి.ఎం. కె.సి.ఆర్.

Friday, July 11, 2014

పోలవరం బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఆమోదం...

న్యూఢిల్లీ, జులై 11 : ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్టు సక్రమంగా పూర్తి కావడం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో చేసిన ఏడు మండలాలను ఏపీకి కేటాయిస్తూ పోలవరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.  బిల్లును ప్రవేశపెట్టడాన్ని టీఆర్ఎస్, బీజేడీ, ఒడిషా ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్టు కోసం వందలాది గ్రామాలను ముంపునకు గురిచేస్తూ, సరిహద్దు మార్చి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ చేసిన ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం అయితే సంబంధిత రాష్ట్ర అభిప్రాయాలను రాష్ట్రపతి తీసుకుని ఆ తర్వాత లోక్‌సభలో ప్రవేశపెట్టాలని, అధికారంలో ఉన్నామంటూ ఆర్టికల్ 3ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్టాచుటరీ రిసెల్యూషన్‌ను సభలో ప్రవేశపెట్టారు. అయితే వినోద్ ప్రవేశపెట్టిన తీర్మానం సభలో వీగిపోయింది. ఈ నేపథ్యంలో బీజేడీ ఎంపీ రాయ్, టీఆర్ఎస్ ఎంపీ వినోద్ లేవనెత్తిన అంశాలను తోసిపుచ్చుతూ పోలవరం బిల్లును పాస్ చేయాలంటూ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశించారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన తీర్మానానికి లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని, ముంపు ప్రాంతాల ప్రజలకు పురరావాసం కల్పించేందుకే 7 మండలాలను ఏపీలో కలుపుతున్నామని  రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 1959 వరకు భద్రాచలం డివిజన్ ఏపీలోనే ఉందని ఆయన గుర్తు చేశారు. అందులో నుంచి కొన్ని మండలాలనే ఆంధప్రదేశ్‌లో కలుపుతున్నట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
కేంద్రం వైఖరి అప్రజాస్వామికం : కేసీఆర్
హైదరాబాద్ : పోలవరంపై కేంద్రం వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్రంగా వ్యతిరేకించారు.  పార్లమెంట్‌లో పోలవరం బిల్లు ఆమోదం పొందడంతో కేసీఆర్ అందుబాటులో ఉన్న ఇరిగేషన్ అధికారితో సహా పలువురు ఉన్నతాధికారులతో  చర్చలు జరిపారు. కేంద్రం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందని, బిల్లు ఆమోదం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, సుప్రీం కోర్టుకు వెళతామని సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Thursday, July 10, 2014

బడ్జెట్ లో ఆశించిన ప్రాధాన్యత దక్కని ఆంధ్ర...

న్యూఢిల్లీ, జులై 10:  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  ప్రవేశపెట్టిన  వార్షిక బడ్జెట్ (2014-2015) లో ఆంధ్రప్రదేశ్ కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించ లేదు.  రాష్ట్రంలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల ప్రస్తావనేలేదు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదన గాని, పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన గాని బడ్జెట్ లో లేనే లేవు. అలాగే కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రస్తావనేలేదు. రాష్ట్ర  విభజన సమయంలో చెప్పినవిధంగా ఐఐఎం ను గాని,    సెంట్రల్ యూనివర్సిటీని గానీ  ప్రకటించలేదు
 విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు ప్రాజెక్టు  ఊసే బడ్జెట్ లో లేదు. .ఇక  బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు   కేటాయించినవి:
* ఎయిమ్స్ - అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ
* ఐఐటి - ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
* వ్యవసాయ విశ్వవిద్యాలయం
* అనంతపురం జిల్లా హిందూపురంలో జాతీయ కస్టమ్స్ అండ్  ఎక్సైజ్ అకాడమీ
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు
* విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
* కాకినాడ పోర్టు అభివృద్ధి
  

ఊపు లేని మోడీ సర్కార్ తొలి బడ్జెట్.. ఆదాయపన్ను పరిమితి రు.2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంపు

న్యూఢిల్లీ, జులై 10: నరేంద్ర మోడీ సర్కార్ తొలి కేంద్ర బడ్జెట్ సూపర్ డూపర్ గా వుంటుందని ఆశించిన వారికి నిరాశనే మిగులుస్తూ  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ  17.9 లక్షల కోట్ల రూపాయలతో గురువారం నాడు పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో  ప్రణాళికేతర వ్యయం 12.2 లక్షల కోట్లు కాగా,  ప్రణాళిక వ్యయం రూ.5.75 లక్షల కోట్లు. 
బడ్జెట్  ముఖ్యాంశాలు...
ఆదాయపన్ను పరిమితి రు.2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంపు. సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలకు పెంపు. 
పొదుపు పథకాలపై లక్షన్నర వరకు పన్ను మినహాయింపు
 గృహ నిర్మాణాల పైన రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు
ఇన్ కం ట్యాక్స్ సర్ ఛార్జీల్లో మార్పు లేదు. 80సీసీ పరిమితి రూ.లక్షన్నరకు పెంపు.
బాక్సైట్ ఎగుమతుల పైన ఎక్సైజ్ డ్యూటీ పెంపు
శీతల పానీయాల పైన పన్ను పెంపు.
సిగరెట్ల పైన ఎక్సైజ్ డ్యూటీ 11 శాతం నుండి 72 శాతానికి పెంపు.
సున్నపురాయి, డోలమైట్ పైన పన్ను రాయితీ.
పెట్రో కెమికల్స్ పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు 
ఉక్కు పై దిగుమతి సుంకం 7.5 శాతానికి పెంపు. 
పీపీఎఫ్ స్కీమ్ రూ.లక్ష నుండి లక్షన్నరకు పెంపు.
గంగానదిలో జలమార్గం కోసం నాలుగువేల కోట్ల అంచనా వ్యయం.
 కొత్త బ్యాంకులకు లైసెన్సులు.
2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు
గ్రామజ్యోతి పథకానికి రూ.500 కోట్లు 




Tuesday, July 8, 2014

.1,64,374 కోట్లతో రైల్ బడ్జెట్‌...భద్రత, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ...ఇంధనం ధరలు పెరిగినప్పుడు టిక్కెట్ల ధరలుపెంచే యోచన...

న్యూఢిల్లీ, జూలై 8: 2014-15 వ సంవత్సరానికి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ రూ.1,64,374 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక పై  రైల్వే స్టేషన్‌లలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగం పెంచుతారు.  బుల్లెట్ ట్రైన్  త్వరలోనే పరుగులు తీయబోతోంది. రైళ్లలోనూ, ముఖ్యమైన రైలు స్టేషన్‌లలోనూ  పనిచేసుకోవడానికి వీలుగా త్వరలోనే వైఫై రాబోతోంది. రైల్వేల అభివృద్ధి ఇక మీదట ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో జరగబోతోంది. మహిళా ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించడానికి వీలుగా మహిళలకు రిజర్వ్ చేసిన రైలు బోగీలలో వేల సంఖ్యలో మహిళా పోలీసులను నియమించబోతున్నారు. అన్నిటికంటె మించి రైళ్లలోనూ, రైలు స్టేషన్‌లలోనూ పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలోనూ ఎస్కలేటర్లు ఏర్పాటుకాబోతున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. రైలు బయలుదేరడానికి ముందే ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకుపోవడం, రైలు స్టేషన్‌లోకి వచ్చాకే ఆటోమేటిక్ తలుపులు తెరుచుకోవడం, వచ్చే స్టేషన్‌లో ప్రయాణికులు తమకు ఏయే ఆహార పదార్ధాలు కావాలో మొబైల్ ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించబోతున్నారు. మెట్రో నగరాలను కలుపుతూ హై స్పీడ్ రైళ్లను త్వరలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇంధనం ధరలు పెరిగినప్పుడు టిక్కెట్ల ధరలు పెరుగుతాయని కూడా మంత్రి చెప్పడం కొసమెరుపు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రైళ్లు
నాగపూర్ - సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు,  చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు, సికింద్రాబాద్ - నిజాముద్దీన్ ప్రీమియం రైలు, విశాఖ - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు, పారాదీప్ - విశాఖల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు,  విజయవాడ - ఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు,  సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని  రైల్వే మంత్రి  తెలిపారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, రూ. 20 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సదానందగౌడ తెలిపారు. రైల్వే రిజర్వేషన్లలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆయన చెప్పారు. మొబైల్స్, పోస్టాఫీసుల ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించునున్నట్లు ఆయన తెలిపారు. 

Thursday, July 3, 2014

తెలంగాణాలో భూ సేకరణ పై కమిటీ...

హైదరాబాద్, జులై 3 : తెలంగాణా  రాష్ర్టంలో చేపట్టే భూ సేకరణలో పారదర్శకత, నష్ట పరిహా రం చెల్లింపు, పునరావాస కార్యక్రమాలకు అనుసరించాల్సిన విధానంపై అధ్యయనానికి ప్రభుత్వం  ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ  ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షునిగా ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు,  తారక రామారావు, జోగు రామన్న ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల భూముల వ్యవహారం అధికారులే చూసుకుంటున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో చట్టప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. భూముల వ్యవహారంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిసస్తుందని  చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూములు వ్యవహారంపై ఈ నెల 7వ తేదీన ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని మహమూడ్ అలీ వెల్లడించారు.

ఎపీఎన్జీవోలకు కేటాయించిన భూములు వెనక్కి...

హైదరాబాద్, జులై 3 : ఎపీఎన్జీవోలకునగర శివారులోని గోపనపల్లిలో  కేటాయించిన 189 ఎకరాల భూములను తెలంగాణ ప్రభుత్వం  వెనక్కి తీసుకుంది. అక్కడ రెవెన్యూ అధికారులు గురువారం బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఏపీఎన్జీవోలకు ఈ భూమిని 2004లో అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. ఇళ్ల స్థలాలలో ఇంటి నిర్మాణాలు జరగలేదని తిరిగి 2007లో ఆ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఏపీఎన్జీవోల అభ్యర్థన మేరకు 2008లో తిరిగి కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు  వాపస్ తీసుకుంది.  ఉమ్మడి రాజధానిగా ఆంధ్రా ఉద్యోగులు పదేళ్లు మాత్రమే ఇక్కడ ఉంటారు కాబట్టి ఆ తర్వాత ఆ భూమి నిరుపయోగంగా ఉంటుందని, ఆ భూములన్నీ తెలంగాణ ఉద్యోగులకు చెందాలని భావించి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీఎన్జీవోలు భగ్గుమంటున్నారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు  మాట్లాడుతూ -గత ప్రభుత్వం ఇచ్చిన భూములను తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకోవడం అనాలోచిత చర్య అని అన్నారు. 189 ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం తమకు ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కాదని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేశారని ఆయన తెలిపారు. అయినా 2003 తర్వాత ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు భూమి అప్పగించిన తర్వాత సభ్యులను చేర్చుకుని, ఆ భూమిని సాగు చేసి, లే ఔట్లు వేయడం జరిగిందని అశోక్‌బాబు తెలిపారు. 2010లో 90 ఎకరాల భూమికి సంబంధించి ఒక వివాదంలో ఇది ప్రభుత్వ భూమికాదని, ప్రైవేట్ వ్యక్తులదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మేము (ఏపీఎన్జీవోలు), ప్రభుత్వం కలిసి 2011లో సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చామని ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తుందని, సుప్రీం కోర్టు కూడా తీర్పు వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పిందని అశోక్‌బాలు వెల్లడించారు. అప్పటికే ఈ భూమిపై సుమారు రూ. 3 కోట్లు ఖర్చుపెట్టి లే అవుట్ అప్రూవ్ చేయించామని, 165 గజాలు ఉన్న స్థలాలను 100 గజాలుగా మార్చామని అశోక్‌బాబు చెప్పారు. ఆ రోజన 1644 మందికి ఇల్ల స్థలాలు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. కేసు విచారణలో ఉన్న 90 ఎకరాల భూమి కాకుండా మిగతా భూమిలో లే అవుట్లు వేసి పంచినట్లు ఆయన చెప్పారు. 90 ఎకరాలతోపాటు 10 ఎకరాలు స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చారు. ఆ భూమిపై ఇంకొక వ్యక్తి ఆ భూమి తనదని కోర్టులో కేసు వేశారని ఆయన తెలిపారు. అది కూడా హైకోర్టులో ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, అప్పుడు డివిజన్ బెంచ్‌కువెళ్లి స్టే తీసుకువచ్చినట్లు అశోక్‌బాబు చెప్పారు. ఇక్కడ హైకోర్టు బెంచ్ కూడా ఈ కేసు తీర్పు వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2011లో సుప్రీంకోర్టు, 2013లో హైకోర్టు ఇచ్చిన తర్వాత మేము లే అవుట్ అఫ్రూవ్ చేయించుకుని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి వేసి, పవర్ లైను వేసి, పార్కులు కట్టి దాదాపు నెలకు రూ. 30 వేలు దానిపై ఖర్చు పెట్టినప్పటికీ నిర్మాణాలు చేపట్టలేకపోయామని, దానికి కారణం కోర్టు అభ్యంతరాలేనని అశోక్‌బాబు తెలిపారు. 


Wednesday, July 2, 2014

తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్

హైదరాబాద్, జులై 2 : తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 21 ఓట్లు పోలవగా అన్ని ఓట్లు స్వామిగౌడ్‌కే పడ్డాయి.
మరోవైపు చైర్మన్ ఎన్నికల్లో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు స్వామిగౌడ్‌కు ఓటేశారు. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. బుధవారం ఉదయం సభ ప్రారంభంకాగానే శాసనమండలి చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై రగడ నెలకొంది. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నిక నిర్వహించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. ఇది అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయాలని డీఎస్ వినతి చేశారు. దీనిపై మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ మండలి నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తున్నామని ఆయన సమాధానమిచ్చారు.అనంతరం డీఎస్ మాట్లాడుతున్న సమయంలోనే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవడంతో పోడియం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చైర్మన్ ఎన్నిక తీరుకు నిరసనగా పోటీ నుంచి తప్పుకుంటున్నామని డీఎస్ ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అటు టీడీపీ సభ్యులు సైతం పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

Tuesday, July 1, 2014

ఇంగ్లండ్ లోని భారతీయ రెస్టారెంట్ కు జాతీయ అవార్డు ....

లండన్ , జులై 1:  ఇంగ్లండ్ లోని  జింఖానా భారతీయ రెస్టారెంట్ కు జాతీయ అవార్డు దక్కింది.  'నేషనల్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్'  అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ రెస్టారెంట్ ఇదే కావడం విశేషం. ఇంగ్లండ్ లో  భారతీయ వంటకాలకు ఈ రెస్టారెంట్ ప్రసిద్ధి గాంచింది.  గత సెప్టెంబర్లో జింఖానా రెస్టారెంట్ ప్రారంభమైంది.    తక్కువ కాలంలోనే  బ్రిటీష్ స్టైల్లో వెరైటీ రుచుల వంటకాలతో మంచి పేరు తెచ్చుకుంది.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై విచారణ బుధవారానికి వాయిదా

హైదరాబాద్, జులై 1: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారంపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ భవనాన్ని తనిఖీ చేసి అక్రమ నిర్మాణం చేపట్టారని గుర్తించగా, ఎన్ కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమేనని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి హైకోర్టులో వాదించారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం కోసం చేసిన దరఖాస్తును జీహెచ్ఎంసీ అధికారులు తిరస్కరించారని అన్నారు. కాగా నోటీసులు ఇవ్వకుండా వ్యక్తుల ఆస్తుల్లోకి చొరబడటం హక్కులకు భంగం కలిగించడమేనని  ఎన్ కన్వెన్షన్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రైవేటు ఆస్తుల్లో తనిఖీలు చేసేముందు కచ్చితంగా నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...