Monday, January 24, 2011

తెలంగాణలో 'రచ్చబండ' రచ్చరచ్చ

హైదరాబాద్, జనవరి 24 :ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో రచ్చరచ్చయింది. రచ్చబండను ఎక్కడికక్కడే స్థానికులు అడ్డుకున్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజాప్రతినిదులను, అధికారులను గ్రామాల పొలిమేరలనుంచే తెలంగాణవాదులు వెళ్లగొట్టారు. పలు చోట్ల రోకలిబండలు, చాటలు, కారంపొడి, చీపురు కట్టలతో గ్రామస్తులు నిరసన తెలిపారు. మరి కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు భయంతో గ్రామ శివార్లనుంచే వెనుదిరిగారు. తెలంగాణ తెచ్చాకే గ్రామాల్లోకి అడుగు పెట్టాలని ప్రజలు ఎక్కడికక్కడ నినాదాలు చేయడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు లకు  దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.  మెదక్‌ జిల్లాలో మంత్రి సునీతాలక్ష్మారెడ్డి వాహనంపై టమాటాలు, కోడిగుడ్లతో తెలంగాణవాదులు దాడి చేశారు. కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్‌బాబును స్థానికులు అడ్డుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి సుదర్శన్‌రెడ్డిని గ్రామస్తులు తెలంగాణపై నిలదీశారు. తమకు ప్రభుత్వ సహాయం అవసరం లేదని, తెలంగాణ ఇస్తే చాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని రచ్చబండ వద్దు వెళ్లిపొమ్మని చెప్పారు.సికింద్రాబాద్‌ బొల్లారంలో మంత్రి శంకర్రావును తెలంగాణవాదులు అడ్డుకాన్నారు. వరంగల్‌లో మంత్రి సారయ్యను దేశాయిపేట గ్రామస్తులు తెలంగాణ ఏదీ అని అడిగారు. వందలాది మంది గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేసినా సారయ్య రచ్చబండను నిర్వహించలేకపోయారు. చివరకు చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఇక ప్రజల ఆగ్రహాన్ని కళ్లారా చూసిన మంత్రి పొన్నాల రచ్చబండ కార్యక్రమానికి వెళ్లనేలేదు. ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో మంత్రి కోమట్‌రెడ్డిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. నల్గొండలో ఎమ్మెల్యే బిక్షంగౌడ్‌పై స్థానికులు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో రచ్చబండ వద్దంటూ ఎంపీటీసీ ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...