Friday, December 28, 2012

గాయకుడు బాలు సోదరుని మృతి...

చెన్నై, డిసెంబర్ 29: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరుడు ఎస్పీ జగదీష్‌బాబు(52) గుండెపోటుతో  చెన్నైలో మృతి చెందారు. చెన్నై లోని బాలుకు చెందిన కోదండపాణి రికార్డింగ్ థియేటర్‌లో జగదీష్‌బాబు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కొన్ని టీవీ సీరియళ్లకు సంగీతం అందించారు. ఆయనకు భార్య రాజావాగ్దేవి, కుమారుడు అభిషేక్ ఉన్నారు.

జాతి ' పరువు ' పోయింది...గుండె బరువు మిగిలింది...

న్యూఢిల్లీ, డిసెంబర్ 29:  దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో ఈ నెల16 ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్‌లో సామూహికంగా అత్యాచారానికి గురైన ప్యారామెడికల్ విద్యార్థిని 13 రోజులపాటు మృత్యువు తో పోరాడి చివరకు కన్ను మూసింది.  ఆమెకు మెరుగైన చికిత్స కోసం సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడే చికిత్స పొందుతూ  శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు మృతి చెందింది. 2012 లో బహుశా అత్యంత విషాదకర ఘటన ఇదే కావచ్చు.  

టి-ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ...

అహ్మదాబాద్, డిసెంబర్ 28:   పాకిస్థాన్‌తో జరిగిన రెండో టి-ట్వంటీలో భారత్ 11పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ట్వంటీ-20 మ్యాచ్లో  ఓటమి పాలైన భారత్ ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను సమం చేసింది. భారత్ విసిరిన 193 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగుల మాత్రమే చేయగలిగింది.  భారత్ బౌలర్లలో దిండా మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, అశ్విన్, యువరాజ్‌లకు ఒక్కో  వికెట్టు లభించింది. 36 బంతుల్లో ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్ల తో 72 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా, ఈ సిరీస్‌లో ఆకట్టుకున్న హఫీజ్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.

అమాత్యులవారిదో మాట....వారి శాఖది మరో మాట....

న్యూఢిల్లీ, డిసెంబర్ 28:  తెలంగాణపై అఖిల పక్ష సమావేశ ప్రహసనం పూర్తయింది. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని షిండే అఖిల పక్ష  సమావేశానంతరం మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు. కానీ,  సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైన ప్రకటనలో మాత్రం  నెల రోజుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామనే విషయం  లేదు. నెల రోజుల్లోగా పరిష్కరించాలని కొన్ని పార్టీలు కోరాయని మాత్రమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఉంది.  రాష్ట్రానికి చెందిన 8 పార్టీల అఖిల పక్ష సమావేశంలో  ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధుల చొప్పున  పాల్గొన్నారు.  అఖిల పక్ష సమావేశం ఇన్‌కెమెరా మీటింగ్ అని, అందువల్ల ఏ పార్టీ ప్రతినిధులు ఏమన్నారనే విషయం తాను వెల్లడించబోనని ఆయన అన్నారు. తెలంగాణపై ఇదే చివరి అఖిల పక్ష సమావేశమని తాను చెప్పినట్లు షిండే తెలిపారు.  తాము అందరి వాదనలు విన్నామని, వాటిని నమోదు చేశామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని యువత సంయమనం పాటించాలని ఆయన అన్నారు.  తాము 2008లో ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో చెప్పిన వైఖరికి కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం అఖిల పక్ష భేటీలో చెప్పింది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తావమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది.

Thursday, December 27, 2012

వెంకన్న సన్నిధిలో తెలుగు వెలుగు...


తిరుపతి, డిసెంబర్ 27 : నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఇక్కడ ప్రారంభించారు. తెలుగు భాష ప్రాచీన భాషల్లో ఒకటని, తెలుగు భాషకు ఎంతో చరిత్ర ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు.  తెలుగు సాహిత్యానికి మూల పురుషులు నన్నయ, తిక్కన, ఎర్రన అన్నారు. తెలుగు శాస్త్రీయ భాష అన్నారు. 11-14 శతాబ్దాల మధ్య కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమని రాష్ట్రపతి పేర్కొన్నారు.  కళా పూర్ణోదయం, ఆముక్త మాల్యద తెలుగులో కలికితురాయిలు అన్నారు. సామాజిక సంస్కరణలకు కన్యాశుల్కం మైలురాయి అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. తెలుగులో కొత్త పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. భాషలు మన వారసత్వ సంపదలని, ప్రాచీన భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని అన్నారు. న్నారు. పరభాష నైపుణ్యంతో మాతృభాష అభివృద్ధికి, ప్రచారానికి కృషి చేయాలన్నారు.

అకాడమీల పునరుద్ధరణ 

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,   తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు  హామీ ఇచ్చారు. సంగీత, నాట్య, లలిత కళా అకాడమీలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. పాఠశాలల్లో ప్రాథమిక దశ నుంచి 10వ తరగతి వరకు తెలుగు విధిగా పాఠాలు బోధించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ముందుగా సుశీల, రావు బాలసరస్వతి మాతెలుగు తల్లి పాటను పాడగా, తెలుగు భాషపై ప్రత్యేకంగా రచించిన, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను సభలో వినిపించారు. ఆనారోగ్య కారణాల వల్ల ఆయన ప్రత్యక్షంగా పాడలేకపోతున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

Monday, December 24, 2012

గ్యాంగ్‌రేప్ బాధితురాలి పరిస్థితి విషమం

న్యూఢిల్లీ,డిసెంబర్ 24:  సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నగ్యాంగ్‌రేప్ బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంకా వెంటిలేటర్ పైనే ఆమెకు చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు
 సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా  ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళన నేపథ్యంలో  పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు నగరంలోని పది మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. ఇండియాగేట్, రాజీవ్‌చౌక్, విజయ్ చౌక్, రైసినా హిల్స్ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇండియా గేట్ వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించటం లేదు. మీడియా వాహనాలపై ఆంక్షలు విధించారు. గ్యాంగ్ రేప్ బాధితురాలికి ఆందోళనాకారులు దామిని అనే పేరు పెట్టి, గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోరాడుతున్నారు.
ప్రధానమంత్రి  విచారం
మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనల నేపథ్యంలో ఆయన  జాతినుద్దేశించి ప్రసంగించారు.బాధితురాలు  త్వరగా కోలుకోవాలని తమ కుటుంబం ప్రార్థిస్తుందోన్నారు.  ప్రజల ఆందోళన అర్థవంతమైనదేనని, అయితే హింసాత్మక ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు. సంయమనం పాటించాలని కోరారు.

Thursday, December 20, 2012

గాయని నిత్యశ్రీ భర్త ఆత్మహత్య!

చెన్నై, డిసెంబర్ 20 :  శాస్త్రీయ గాయని నిత్యశ్రీ  భర్త మహదేవన్ చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని తమ ఇంటి వద్ద గల కొట్టూర్పూరం వంతెనపై నుంచి అడియార్‌లోకి దూకి ఆయన  ఆత్మహత్య చేసుకున్నారు. మహదేవన్ తన తెల్లటి హోండా సిటీలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వంతెన వద్దకు వచ్చాడని, డ్రైవర్ కారు నడిపాడని పోలీసులు చెప్పారు. కారు ఆపాలని డ్రైవర్‌ను అడిగి, మహదేవన్ మొబైల్‌లో మాట్లాడుతూ  అడియార్‌లోకి దిగిపోయాడని సమాచారం.  భార్య భర్తల మధ్య కలహాలే మహదేవన్ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి నిత్యశ్రీ నిద్ర మాత్రలు మింగిందని, అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిసింది.   డికె పట్టమ్మాళ్ మనవరాలు అయిన నిత్యశ్రీ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వంసతకుమారి తో సమానంగా పేరు తెచ్చుకున్నారు. 

హిమాచల్‌ ' హస్త 'గతం...

సిమ్లా, డిసెంబర్ 20 : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 68 స్థానాలకు గానూ 36 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీకి 26 స్థానాలు, ఇతరులు ఆరు స్థానాలను గెలుచుకున్నారు. . ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనడంలో హిమాచల్‌ ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ ధూమల్‌ విఫలమయ్యారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ వీరభద్రసింగ్‌ కాంగ్రెస్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లో గట్టెక్కించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 

మోడీ దే గుజరాత్...

అహ్మదాబాద్, డిసెంబర్ 20 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడో సారి మోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 118 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 60 స్థానాలు, జీపీపీ రెండు, ఇతరులు రెండు స్థానాలను గెలుచుకున్నారు.
మణినగర్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 85వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో మోడీ విజయం సాధించారు. ఆయన కుడి భుజంగా చెప్పుకునే మాజీ హోంమంత్రి అమిత్ షా నరన్‌పూర్ నియోజకవర్గంలో గెలుపొందారు. మరోవైపు బీజేపీ నుంచి విడిపోయి బీపీపీ పార్టీ స్థాపించిన కేశుభాయ్ పటేల్ విశవదర్‌లో గెలుపొందారు.

Wednesday, December 19, 2012

'ఉల్లాసంగా ఉత్సాహంగా' విషాదాంతం...!

బెంగళూరు,డిసెంబర్ 19:  కర్ణాటకలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్ర హీరో యశోసాగర్ దుర్మరణం చెందాడు. తుముకూరు జిల్లా శిరా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో యశోసాగర్ తో పాటు కారు డ్రైవర్ కూడా మృతి చెందాడు. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. యశోసాగర్ ప్రముఖ కన్నడ నిర్మాత బి.వి. సోము తనయుడు. ఇతని అసలు పేరు భరత్. అనేక కన్నడ చిత్రాల్లో యశో సాగర్ బాలనటుడుగా నటించాడు. హీరోయిన్ స్నేహా ఉల్లాల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు వెళుతూ విమానం అందకపోవటంతో యశోసాగర్ తన స్నేహితుడి కారులో  వెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

ఉరి తీయండంటున్న రేప్ కేసు నిందితుడు...

న్యూఢిల్లీ,డిసెంబర్ 19:  తాను తీవ్రమైన తప్పు చేశానని, తనను ఉరి తీయండని ఢిల్లీ బస్సులో గ్యాంగ్ రేప్ కేసులో ఓ నిందితుడు బుధవారం కోర్టును కోరాడు.  ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులు ముగ్గురిని పోలీసులు ఈ రోజు కోర్టులో హాజరు పర్చారు. తాను దారుణమైన తప్పు చేశానని పవన్ గుప్తా అనే నిందితుడు కోర్టులో చెప్పాడు.  మరో నిందితుడు వినయ్ శర్మ కూడా ఈ తప్పు చేసినందుకు తాము ఘోరంగా సిగ్గుపడుతున్నామన్నాడు. అమ్మాయిపై తాము అత్యాచారం మాత్రం చేయలేదని వారు చెప్పారు. మరో నిందితుడు ముఖేష్ మాత్రం ఏమీ చెప్పలేదు. కోర్టు పవన్‌కి, వినయ్‌కి నాలుగు రోజుల రిమాండును విధించింది. కోర్టులో ఏమీ మాట్లాడని ముఖేష్‌కు పద్నాలుగు రోజుల రిమాండు విధించింది. ఈ కేసులో ముఖేష్ ప్రధాన నిందితుడి సోదరుడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ను కూడా కోర్టులో హాజరు పర్చారు. కాగా వీరు ఐడెంటిఫికేషన్ పరేడ్ వద్దని కోరారు. మరోవైపు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరో నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్ ఠాకూర్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బీహార్‌లోని ఔరంగాబాద్ వద్ద అరెస్టు చేశారు. కాగా గ్యాంగ్ రేప్ పైన ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

Monday, December 17, 2012

హాట్రిక్...!

 అహ్మదాబాద్, డిసెంబర్ 18:  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లో బీజేపీ ఘనవిజయం సాధించడం, నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఎన్నికల ఫలితాల విశ్లేషణ సంస్థ టుడేస్ చాణక్య అయితే బీజేపీ ఈసారి మరింతగా ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 140 పైగా సీట్లను కొల్లగొడుతుందని జోస్యం చెప్పింది. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తుందని కూడా అభిప్రాయపడింది. 40 సీట్లతో కాంగ్రెస్ మరోసారి ఘోర పరాజయం మూటగట్టుకుంటుందని అంచనా వేసింది.  సి-ఓటర్, హెడ్‌లైన్స్ టుడే, ఏబీపీ న్యూస్ తదితరాల సర్వేలు కూడా బీజేపీకి 116 నుంచి 128 సీట్లు వస్తాయని తేల్చాయి. ప్రస్తుతం బీజేపీకి 117, కాంగ్రెస్‌కు 59 సీట్లున్న విషయం తెలిసిందే.  ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. తాజా పోలింగ్ శాతం 1995 కంటే (64.39) కూడా ఎక్కువని ప్రధాన ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ ప్రకటించారు. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 87 స్థానాలకు గత గురువారం తొలి దశలో పోలింగ్ జరగడం తెలిసిందే. సోమవారం రెండో దశలో 95 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Wednesday, December 12, 2012

సితార్ పండిట్ రవిశంకర్ కన్నుమూత...

శాంటియాగో, డిసెంబర్ 12:  ప్రముఖ సితార్  విద్వాంసుడు పండిట్ రవిశంకర్ (92)మంగళవారం కన్నుమూశారు. అమెరికాలోని శాంటియాగోలో ఆయన తుది శ్వాస విడిచారు. రబింద్రో శౌంకర్ చౌదరి అయిన పండిట్ రవిశంకర్ 1920 ఏప్రిల్ 7వ తేదీన వారణాసిలో జన్మించారు. సమకాలీన సంగీత విద్వాంసుల్లో ఆయనకు ఆయనే సాటి.   భారత సంగీతాన్ని పాశ్చాత్య దేశాల్లోకి తీసుకుని వెళ్లడంలో ఆయన విశేష కృషి సలిపారు.   పండిట్ రవిశంకర్‌కు భార్య సుకన్య, కూతుళ్లు సితార విద్వాంసురాలు అనుష్కా శంకర్, గాయని నోరహ్ జోన్స్ ఉన్నారు. ఆయన కచ్చేరీలకు తోడుగా ఉండే కుమారుడు సుభేంద్ర శంకర్ 1992లో మరణించాడు.  1999లోభారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఆయనను 1999లో వరించింది. మూడు సార్లు ఆయన గ్రామీ అవార్డులు అందుకున్నారు. చాంట్స్ ఆప్ ఇండియా, ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా, త్రీ రాగాస్, ది సౌండ్స్ ఆఫ్ ఇండియా వంటి పలు ఆల్బమ్స్‌ను ఆయన వెలువరించారు.

Monday, December 10, 2012

తెలంగాణపై 28వ తేదినే ఆల్ పార్టీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: : రాష్ట్రంలోని అన్ని పార్టీలు  కోరితే అఖిల పక్ష సమావేశం వాయిదాపై ఆలోచిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం అన్నారు. 28వ తేదినే ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుందని,అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపిస్తామని,  ఒకవేళ పార్టీలు అన్ని కోరితేనే తేదీని వాయిదా వేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. తెలుగు మహాసభల దృష్ట్యా అఖిల పక్షం తేదీ మార్చాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తిని తోసి పుచ్చారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సంప్రదింపులు కొనసాగుతాయన్నారు.
 జెఎసి హడావిడి....
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ నెల 26వ తేదీలోగా కచ్చితమైన వైఖరి వెల్లడించకపోతే 27వ తేదీన తెలంగాణ బంద్ పాటిస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ హెచ్చరించారు.  సోమవారం జెఎసి విస్తృత స్థాయి సమావేశానంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ,  ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాజకీయ నాయకులతో ములఖాత్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీన విద్రోహ దినం పాటిస్తామని, ఈ సందర్భంగా నల్లజెండాల ప్రదర్శన ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణపై అభిప్రాయం చెప్పని పార్టీల పట్ల అనుసరించాల్సిన కార్యాచరణను ఈ నెల 26, 27 తేదీల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మండల స్థాయిలో తెలంగాణ కోసం దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Saturday, December 8, 2012

ఈడెన్‌లో ఓడనున్న భారత్...?

కోల్‌కతా,డిసెంబర్ 9:  ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ (104 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్సర్), సెహ్వాగ్ (57 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించినా... మిడిలార్డర్ కుదేలవడంతో  ఒకే సెషన్‌లో 36 పరుగుల వ్యవధిలో ఆరు ప్రధాన వికెట్లు కోల్పోయింది.  అశ్విన్  కాస్త దూకుడు గా (151 బంతుల్లో 83 బ్యాటింగ్; 13 ఫోర్లు) ఆడటంతో ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం నుంచి భారత్ బయపడింది. అశ్విన్‌తో పాటు ఓజా (21 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ మూడు వికెట్లు తీసుకోగా... అండర్సన్, స్వాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 167.3 ఓవర్లలో 523 పరుగులకు ఆలౌటయింది. ఓజా నాలుగు, అశ్విన్ మూడు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం భారత్ 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది.

ముగ్గురు ఎంపీల వివరణ కోరిన బాబు

హైదరాబాద్,డిసెంబర్ 8 : రాజ్యసభలో ఎఫ్ డీఐలపై ఓటింగ్ కు ముగ్గురు టీడీపీ ఎంపీల గైర్హాజరు పై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వారి నుంచి వివరణ కోరారు.  రాజ్యసభలో  శుక్రవారం నాడు ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి,గుండు సుధారాణి, దేవేందర్ గౌడ్ లు గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. వీరు ఢిల్లీలోనే ఉండి కూడా సభకు హాజరు కాలేదు.మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకంలో 51 శాతం ఎఫ్‌డీఐలకు రాజ్యసభలో కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేయించుకుంది, మొత్తంమీద 244 మంది సభ్యుల్లో 225 మంది ఓటింగ్‌లో పాల్గొన్నట్టు రాజ్యసభ అధికారులు ప్రకటించారు. తీర్మానాన్ని ఓడించేందుకు యూపీఏకు 116 ఓట్లు కావాల్సి ఉండగా 123 లభించాయి. సమాజ్‌వాదీ 9 మందీ వాకౌట్ చేశారు.  మొత్తంమీద 19 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.విపక్షాల తరఫున అన్నాడీఎంకే సభ్యుడు వి.మైత్రేయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 102 ఓట్లు రాగా, వ్యతిరేకిస్తూ 123 ఓట్లు పడ్డాయి. విపక్షాల ఎఫ్‌డీఐ వ్యతిరేక తీర్మానం లోక్‌సభలో కూడా గత బుధవారం వీగిపోవడం తెలిసిందే. 

Tuesday, December 4, 2012

భారత ఒలింపిక్ సంఘంపై సస్పెన్షన్ వేటు

న్యూఢిల్లీ, డిసెంబర్ 4:  భారత ఒలింపిక్ సంఘంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఒలింపిక్ ఛార్టర్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గతంలోనే స్పష్టం చేసింది. అయితే ఎన్నికల విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఐఓసీ తీవ్రంగా పరిగణించి ఈ చర్య తీసుకుంది. కాగా సస్పెన్షన్ కొనసాగితే 2016లో జరిగే ఒలింపిక్ క్రీడలలో భారత్ క్రీడాకారులు పాల్గొనే అవకాశం కోల్పోతారు. అంతేకాకుండా భారత్ లో క్రీడాభివృద్ధికి ఐఓసీ నిధులు నిలిచిపోతాయి.  ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఎ) సెక్రటరీ జనరల్‌గా కళంకిత లలిత్‌ భానోత్‌ ఎన్నికయిన విషయం తెలిసిందే. అధ్యక్షునిగా అభరు సింగ్‌ చౌతాలా కూడా శుక్రవారం నాడు  పోటీ లేకుండా ఎన్నికయ్యారు. కామన్వెల్త్‌ క్రీడల్లో అవినీతి కేసులో అరెస్టయిన భానోత్‌ గతేడాది పదకొండు నెలలు జైలు జీవితం గడిపారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసి) తమపై నిషేధం విధించకుండా భారత్‌ ఇప్పటి వరకూ చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధమైనరీతిలో భానోత్‌ను ఎన్ను కోవటం వివాదం మరింతగా రాజుకుంది. ఒలింపిక్‌ సంస్థల్లో కళంకిత వ్యక్తులు ఉండరాదని ఐఓసి నైతిక విలువల కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది. అయినా భానోత్‌ను సెక్రెటరీ జనరల్‌గా ఎన్నుకున్న విషయం తెలిసిందే. క్రీడా మంత్రిత్వ శాఖ కోడ్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించటంతో భారత ఒలింపిక్‌ సంఘంపై నిషేధం విధిస్తూ బోర్డు కార్యవర్గ సమావేశంలో ఐఓసి నిర్ణయం తీసుకుంది.  

నార్వే తెలుగు దంపతులకు తప్పని జైలు...

ఓస్లో, డిసెంబర్ 4:  కుమారుడిని హింసించారనే ఆరోపణపై తెలుగు దంపతులు చంద్రశేఖర్‌, అనుపమ లకు నార్వేలోని ఓస్లో కోర్టు మంగళవారం శిక్షలు ఖరరు చేస్తూ తీర్పు వెలువరించింది.   చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధించారు. వారు తమ ఏడేళ్ల కుమారుడికి వారు వాతలు పెట్టినట్లు పోలీసులు ఆరోపించారు. పిల్లవాడి ఒంటిపై కాల్చిన మరకలు, మచ్చలు ఉన్నాయని, బెల్టుతో కొట్టారని ఓస్లో పోలీసు శాఖ ప్రాసిక్యూషన్ అధిపతి కుర్ట్ లిర్ ఆరోపించారు.  పిల్లవాడు పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది నెలల తర్వాత పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. 
 

వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వసంత

విజయవాడ, డిసెంబర్ 4:  ఆప్కాబ్ ఛైర్మన్ వసంత నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయంలో (1983- 1984) హోంమంత్రిగా పనిచేశారు. కాగ, చిత్తురు జిల్లా పలమనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.

Saturday, December 1, 2012

దంపతుల అరెస్ట్ పై నార్వే వివరణ...

ఓస్లో, డిసెంబర్ 1 : నార్వేలోని ఓస్లోలో తెలుగు దంపతులు చంద్రశేఖర్, అనుపమల అరెస్ట్ పై నార్వే పోలీసులు ప్రకటన చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించారని, వారు అనేకసార్లు ఇలానే వ్యవహరించారని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు నార్వే పోలీసులు పేర్కొన్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోతారనే వారిని రిమాండ్ లో ఉంచినట్లు తెలిపారు. సోమవారం  ఓస్లో జిల్లా కోర్టు తీర్పు వెలువరించనుంది. కాగా, పిల్లవాడిని  కొట్టాడనే ఆరోపణపై నార్వేలో అరెస్టయిన తెలుగు దంపతుల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైదరాబాద్ నగరానికి చెందిన  వి.చంద్రశేఖర్ టిసిఎస్  కు చెందిన కంపెనీలో ఉద్యోగి. తమ అబ్బాయి పదే పదే స్కూలు నుంచి ఇతరుల బొమ్మలు తెస్తుండటంతో చంద్రశేఖర్ అతడిని మందలించారు. దానిపై ఆ అబ్బాయి తన పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడమే కాక.. తిరిగి భారత్‌కు పంపేస్తామని బెదిరిస్తున్నట్లు కూడా వారికి చెప్పాడని చంద్రశేఖర్ తమ్ముడి కొడుకు శైలేందర్ తెలిపారు.దీనిపై విచారించిన అక్కడి అధికార వర్గాలు చంద్రశేఖర్, అనుపమలు తమ పిల్లవాడికి చెమ్చాకు బదులు చేత్తో అన్నం పెడుతున్నారని, ఇలా అనేక రకాల తప్పులను ఎత్తి చూపారు. అయితే తాము అన్ని తప్పులు చేసినట్లు ఆ దంపతులకు తెలీదు. కానీ తొమ్మిది నెలల తర్వాత దంపతులిద్దరూ అరెస్టయ్యారు. తమ బాబాయికి అసలు కేసు గురించి తెలియదని, తమ పిన్నిని, పిల్లలను తీసుకుని జూలైలో హైదరాబాద్ వచ్చి, తిరిగి అక్టోబర్ చివరి వారంలో ఓస్లో తిరిగి వెళ్లారని, అప్పుడే భార్యతో సహా తమ ముందు హాజరు కావాల్సిందిగా అక్కడి అధికారులు నోటీసు ఇచ్చారని శైలేందర్ చెప్పారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...