Thursday, February 24, 2011

2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌పై 30 మంది తో జేపీసీ

కమిటీ చైర్మన్‌గా కిషోర్ చంద్రదేవ్

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24: టెలికాం శాఖలో జరిగిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటును లోక్‌సభ ఆమోదించింది. జేపీసీ వేయడానికి ఒప్పుకున్న కేంద్రం గురువారం దీనికి సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి, సభా నాయకుడు ప్రణబ్ ముఖర్జీ.. అధికార, విపక్షాల వాగ్యుద్ధం మధ్య 30 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుపై తీర్మానాన్ని సభ ముందుంచారు. నాలుగున్నర గంటల గొడవ తర్వాత మూజువాణి ఓటింగ్‌లో తీర్మానాన్ని ఆమోదించారు. తీర్మానాన్ని తదుపరి ఆమోదం కోసం, జేపీసీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం రాజ్యసభకు పంపిస్తారు. జేపీసీ వర్షాకాల సమావేశాలు ముగిసేనాటికి పార్లమెంట్‌కు నివేదిక సమర్పిస్తుంది. యూపీఏ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన తొలి జేపీసీ ఇదే. రూ.1.76 లక్షల కోట్లమేర అవినీతి జరిగిందన్న ఆరోపణలతో 2జీ స్కామ్‌పై విచారణకు జేపీసీని వేయాలని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం తెలిసిందే. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను సజావుగా నడిపేందుకు ప్రభుత్వం దిగొచ్చి కమిటీ వేసింది. ఇందులో 20 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.లోక్‌సభ సభ్యుడు కిషోర్ చంద్రదేవ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.   1998-2009 మధ్య ప్రభుత్వాలు టెలికాం రంగంలో అనుసరించిన విధానాలు, వాటి అమలు తీరు, కేబినెట్ల నిర్ణయాలు, వాటి పర్యవసానాలపై పరిశీలన. అలాగే టెలికాం లెసైన్స్‌లు, స్పెక్ట్రమ్‌ల కేటాయింపుల ధరలపై సమీక్ష. టెలికాం లెసైన్స్‌ల ధరలు, వాటి కేటాయింపుల విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటే వాటిపై పరిశీలన. ప్రభుత్వ విధానాలు సక్రమంగా అమలయ్యాయా లేదా అన్న అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో సరైన విధానాల అమలుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. .


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...