Wednesday, January 26, 2011

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

న్యూఢిల్లీ, జనవరి 26: :  గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ్మంతటా ఘనం గా జరిగాయి.  రాజధాని ఢిల్లీలోగణతంత్ర దినోత్సవ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించాయి. దేశ సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. రైసినా హిల్స్ నుంచి ఎరక్రోట వరకు ఎనిమది కిలోమీటర్ల మేర సాగిన సైనిక, పోలీసు బలగాల పరేడ్ భారత్ సత్తాను చాటింది. మేజర్ జనరల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలోని బలగాలు సైనిక వాద్యాలకు అనుగుణంగా రాజ్‌పథ్ మీదుగా కవాతు సాగించారు. రాజ్‌పథ్ వద్ద రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడ ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో సైనిక హెలికాప్టర్లు గగనతలం పైనుంచి వీక్షకులపై పూలవాన కురిపించాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇండోనేసియా అధ్యక్షుడు సుశీలో బంబాంగ్ యుధొయోనో, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ సహా పలువురు రాజకీయ, సైనిక ప్రముఖులు ఈ పరేడ్‌ను తిలకించారు.  సైనిక బలగాలు పరేడ్‌లో ప్రదర్శించిన బ్రహ్మోస్ లాంచర్ సిస్టమ్, మల్టీబారెల్ రాకెట్ సిస్టమ్ ‘పినాక’ వంటి ఆయుధ పరికరాలు దేశ సైనిక పాటవాన్ని చాటాయి. డీఆర్డీవో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీయే) ‘తేజస్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న రాయల్ ఎయిర్‌ఫోర్స్ మాజీ ఫ్లైయింగ్ ఆఫీసర్ ఎం.ఎం.శుక్లా (87) పెరేడ్‌లో మాజీ సైనికుల దళానికి నాయకత్వం వహించారు. బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, కోస్ట్‌గార్డ్ తదితర పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే 23 వాహనాలు దేశంలోని సాంస్కృతిక భిన్నత్వానికి అద్దం పట్టాయి.  వివిధ రాష్ట్రాల్లో కూడా  గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

లాల్‌చౌక్‌లో ఎగరని జెండా
ఏక్తా యాత్రలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ పతాకావిష్కరణ చేయాలన్న బీజేపీ ప్రయత్నం విఫలమైంది. శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చన్న అనుమానంతో కేంద్ర, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు బీజేపీ యాత్రకు అడ్డుకట్ట వేశాయి. మంగళవారం కాశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీజేపీ అగ్రనేతలు సహా 200 మందిని పోలీసులు అరెస్టు చేసి... జెండా వందన కార్యక్రమాలు ముగిశాక బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...