ఈ ఏడాదికి హెచ్-1బీ వీసాలు అయిపోయాయి !
వాషింగ్టన్, జనవరి 28: విదేశీ ఉద్యోగులకు అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాలు ఈ ఏడాదికి ఇక నిండుకున్నాయి. 2011 సంవత్సరానికి గానూ నిర్దేశించిన పరిమితి (65,000)కి మించి వీసా దరఖాస్తులు అందినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సీఐసీ) శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కనక జనవరి 26 తర్వాత అమెరికాలో ఉద్యోగ నియామకం పొందినవారు వీసా కోసం చేసుకునే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. గత ఏడాది చూస్తే డిసెంబర్ 21 నాటికి గానీ ఈ నిర్దేశిత పరిమితికి తగిన దరఖాస్తులు అందలేదు. ఎట్లాగో దరఖాస్తులు అందినా, వివిధ కారణాల వల్ల కొందరికి వీసాలు మంజూరు చేయలేదు. దీనితో 11,000 హెచ్-1బీ వీసాలు ఇంకా మిగిలేవున్నాయి. అయితే కొత్త ఏడాదికి ఐటీ రంగం పుంజుకుంది. ఫలితంగా నియామకాలు పెరిగి వీసాకు దరఖాస్తులు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. నెల తిరక్కుండానే నిర్దేశిత దరఖాస్తులు నిండుకున్నాయి. ఇకపై ఉద్యోగం పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. జనవరి 26లోపు నియామక పత్రం పొందిన వారు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి సంఖ్య అధికంగా ఉంటే డ్రా ద్వారా అదృష్ట వంతులను ఎంపిక చేస్తారు. 2008లో ఇదేవిధంగా ఏప్రిల్ మాసానికే దరఖాస్తులు నిండుకున్నాయి. అప్పుడు కూడా డ్రా ద్వారానే ఉద్యోగులకు ప్రవేశం కల్పించారు.
Comments