Thursday, September 29, 2011

రెండు రాష్ట్రాలు - రెండు రాజధానులు...?

ఇదేనా కేంద్రం ఫార్ములా...!  
హైదరాబాద్ ,సెప్టెంబర్ 29: తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర విభజనకు కొత్త ఫార్ములాను తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ను  రెండుగా విడగొట్టి కొద్ది కాలం హైదరాబాదునే ఇరు ప్రాంతాలకు రాజధాని గా వంచి,  రెండు రాష్ట్రాలూ  ఆయా రాజధానులను ఏర్పాటు చేసుకున్న అనంతరం హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి తెలంగాణ, సీమాంధ్రులు ఒప్పుకోని పక్షంలో ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలన విధించే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.  ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోక పోయినా రెండు రాష్ట్రాలు - రెండు రాజధానులు అనే సూత్రంతో కేంద్రం ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. 

టి.డి.పి. నుంచి టి.ఆర్.ఎస్. లోకి గంపా...

హైదరాబాద్ ,సెప్టెంబర్ 29: తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి శాసనసభ్యుడు గంపా గోవర్ధన్ గురువారం రాజీనామా చేశారు. రెండు పేజీల రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీకి ఫాక్స్ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (లో చేరబోతున్నట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఫాక్స్ చేసిన తర్వాత గంపా గోవర్దన్ తెరాస శాసనసభ్యుడు కెటిరామారావుతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై చంద్రబాబు నాయుడు వైఖరిని ఆయన విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

కోదండరామ్‌ అరెస్టు

హైదరాబాద్ ,సెప్టెంబర్ 29: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. నిషేదాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణపై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హ్యాకర్ల ర్యాలీ నేపథ్యంలో ఆయన అరెస్టు జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తలపెట్టిన సకల జనుల సమ్మెకు మద్దతుగా హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగరాల హ్యాకర్లు గురువారం వార్తాపత్రికలను పంపిణీ చేయలేదు. దీంతో జంటనగరాల్లోని ఇళ్లకు వార్తాపత్రికలు పూర్తిగా బందయ్యాయి.హ్యాకర్లు గురువారం ఉదయమే సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ నుంచి హైదరాబాదులోని క్లాక్ టవర్ వరకు ర్యాలీ తలపెట్టారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. హ్యాకర్లను అరెస్టు చేశారు. వారి అరెస్టును నిరసిస్తూ కోదండరామ్ క్లాక్ టవర్ వద్ద బైఠాయింపు జరిపారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హ్యాకర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నాకు దిగారు. పోలీసులు హ్యాకర్లను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణలో ప్రజాస్వామిక ఉద్యమాలను కూడా అనుమతించడం లేదని ఆయన అన్నారు. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని కూడా అనుమతించకపోవడాన్ని ఆయన వ్యతిరేకించారు.

గాయత్రీదేవి గా కనకదుర్గమ్మ

శరన్నవరాత్రులలో గురువారం రెండవ రోజున

గాయత్రీ దేవి గా దర్శనమిచ్చిన బెజవాడ కనకదుర్గ 


విజయవాడ,సెప్టెంబర్ 29:  : దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ గురువారం రెండవ రోజున  గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  నవరాత్రుల్లో రెండోరోజు అమ్మవారు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.  శరన్నవరాత్రి ఉత్సవ్ల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

Wednesday, September 28, 2011

మధ్యంతర ఎన్నికల ప్రసక్తి లేదు: ప్రధాని

చిదంబరం, ప్రణబ్‌లపై పూర్తి  విశ్వాసం 
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 28:  మన రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని,  మధ్యంతర ఎన్నికల కోసం విపక్షాలు తహతహలాడుతున్నాయని, అందుకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. అమెరికా పర్యటన నుంచి తిరిగొస్తూ ప్రధాని మంగళవారం రాత్రి ఎయిరిండియా వన్ ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. ‘విపక్షాలు నా ప్రభుత్వంలోని కొన్ని బలహీనతల్ని గుర్తించాయి. ఇక మధ్యంతర ఎన్నికలు వచ్చేలా చేయగలమని భ్రమపడుతున్నాయి. ఇది సరికాదు. ఐదేళ్ల పాటు పాలించేందుకు ప్రజలు మాకు అధికారమిచ్చారు. ఆ మేరకు పూర్తి కాలం పాటు పాలన అందిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ఇదివరకే పార్లమెంటులో స్పష్టంగా చెప్పానని, ఎన్నికల కోసం విపక్షాలు మరో రెండున్నరేళ్లు ఆగక తప్పదన్నానని గుర్తుచేశారు. తన ప్రభుత్వంలో దృక్కోణానికి సంబంధించిన సమస్య ఉంటే ఉండొచ్చని, ఒకవేళ ఉంటే దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి చిదంబరంల మధ్య విభేదాలొచ్చాయన్న వార్తలపై స్పందిస్తూ.. ‘మంత్రుల మధ్య ఎలాంటి గొడవలూ లేవు. ఆ మేరకు నాకు ఎలాంటి సమాచారం కూడా లేదు. కానీ మీడియాలో మాత్రం మంత్రుల మధ్య విభేదాలున్నట్టు వార్తలొస్తున్నాయి’ అని చెప్పారు. చిదంబరం 2008లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు స్పెక్ట్రమ్ వేలం కోసం పట్టుబట్టి ఉంటే 2జీ కుంభకోణాన్ని నివారించగలిగేవారని ప్రణబ్ నేతృత్వంలోని ఆర్థిక శాఖ(ప్రధాని కార్యాలయం కు పంపిన నోట్‌పై రాజకీయ దుమారం రేగడం విదితమే. 2జీ కేసులో చిదంబరానికి క్లీన్‌చిట్ ఇస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘చిదంబరం, ప్రణబ్‌లపై నాకు పరిపూర్ణ విశ్వాసముంది’ అని చెప్పారు. తమది ఐకమత్యంతో కూడిన ప్రభుత్వమని, తన కేబినెట్‌లో అభిప్రాయభేదాలకు తావులేదని చెప్పుకొచ్చారు.  కాగా, సోమవారం 79వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మన్మోహన్ నాలుగోసారి కూడా తన పుట్టినరోజును ఎయిరిండియా వన్ విమానంలోనే జరుపుకున్నారు. అమెరికా పర్యటననుంచి తిరిగొస్తూ.. తనతోపాటు ప్రయాణిస్తున్న విలేకరుల సమక్షంలో కేక్ కట్ చేశారు.  

Monday, September 26, 2011

అక్టోబర్ 1న విజయవాడలో జగన్ దీక్ష

విజయవాడ,సెప్టెంబర్ 26:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు దీక్షకు సిద్ధమయ్యారు. గత నెల రోజులకు పైగా కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్ --తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంట విరామం ప్రకటించి ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా అక్టోబర్ 1వ తారీఖున తాను విజయవాడలో దీక్ష చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన సోదర, సోదరీమణుల కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయాల్లో కుళ్లు, కుతంత్రం లేకుండా విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ఆయన కష్టపడి రెండోసారి అధికారంలోకి తెచ్చిన ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు లేదన్నారు.గతంలో జగన్ విద్యార్థులకు ఫీజు రీయింబర్సు మెంట్స్ ఇవ్వాలని హైదరాబాదులో ఫీజు పోరు, న్యూఢిల్లీలో జలదీక్ష, విజయవాడలో లక్ష్యదీక్ష తదితర దీక్షలు చేసిన విషయం తెలిసిందే.

విజయవంతంగా పృధ్వీ-2 పరీక్ష

బాలాసోర్,సెప్టెంబర్ 26:  క్షిపణి సాంకేతిక పరిజ్ఞా నంలో భారత్‌ మరో మెట్టు పైకెక్కింది. అణు శీర్షాలను మోయగల పృధ్వీ-2 క్షిపణిని శాస్త్రవేత్తలు సోమవారం చాందీపూర్ నుంచి  విజయవంతంగా పర్రిక్షించారు. స్వదేశీ సాంకేతిక పరి జ్ఞానంతో రూపొందిన పృధ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలానికి 350 కిలో మీటర్ల దూరం లోని లక్ష్యాల పై దాడి చేయగల సామర్థ్యం పృధ్వీ-2 కలిగివుంది.  బాలిస్టిక్‌ క్షిపణి విధ్వంసకరాలను గుర్తింవ్హగల సామర్థ్యం కూడా  పృధ్వీ-2 కి ఉంది.

తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్,సెప్టెంబర్ 26:  కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు మెల్లిమెల్లిగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1616 (-40) డాలర్లు ఉండగా, ఔన్స్ వెండి ధర 28 (-3) డాలర్లు పలుకుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,270 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.25,500 ఉంది. అలాగే కిలో వెండి ధర 50,530 ఉంది.

ఐటీ ఉద్యోగులకూ సమ్మె సెగ

హైదరాబాద్,సెప్టెంబర్ 26:  సకల జనుల సమ్మె ప్రభావం తాజాగా ఐటీ ఉద్యోగులను  తాకింది. తెలంగాణకు మద్దతుగా విధులకు హాజరు కావద్దంటు జెఎన్టీయూ జేఏసీ నేతలు సోమవారం ఐటీ ఉద్యోగులను అడ్డుకున్నారు. హైటెక్ సిటీకి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధం చేసి విధులకు వెళ్లవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాల చేశారు. దాంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగులను అడ్డుకోవటంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగ, విధులకు వెళుతున్న సచివాలయ ఉద్యోగులను సోమవారం ఉదయంఎన్జీవో కాలనీ వద్ద తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సచివాలయం వెళుతున్న ఆర్టీసీ బస్సులను తెలంగాణవాదులు వనస్థలిపురం వద్ద అడ్డుకున్నారు. రెండు బస్సుల అద్దాలను పగులగొట్టారు. దాంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Sunday, September 25, 2011

అంతమైన ‘ఆర్స్’

 కేప్ కానవెరాల్ ,సెప్టెంబర్ 25:    ప్రపంచమంతా ఆందోళన కలిగించిన అమెరికా ఉపగ్రహం ‘ఆర్స్’ ఎట్టకేలకు శనివారం ఉదయం భూమిపై రాలిపోయింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలిగించకుండానే తన ప్రస్థానాన్ని ముగించింది. 1991లో డిస్కవరీ వ్యోమనౌక ద్వారా ప్రయోగించిన ఈ మినీబస్సు సైజు ఉపగ్రహం పసిఫిక్ సముద్రం సమీపంలో కూలిపోయిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఈ ‘అప్పర్ అట్మాస్పిరియక్ రీసెర్చ్ శాటిలైట్(ఆర్స్)’ 26 ముక్కల వరకు విడిపోయిందని, ఇతర లోహపు శకలాలు కూడా భూమిపై పడిపోయాయని నాసా తెలిపింది. ఆరు టన్నుల బరువు గల ఆర్స్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే చాలావరకు మండిపోయి ఉంటుందని, 500 కిలోల శకలాలు మాత్రమే భూమిపై పడి ఉంటాయని పేర్కొంది. అయితే ఆర్స్ భూ వాతావరణంలోకి ఎప్పుడు ప్రవేశించింది? శకలాలు ఎక్కడ పడ్డాయన్న వివరాలు ఇంకా కచ్చితంగా తెలియలేదని చెప్పింది. అది పసిఫిక్ సముద్రం సమీపంలో కూలి పోయిందని, దాని శకలాలు కెనడా భూభాగంలో పడిపోయాయని ప్రాథమికంగా అంచనావేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే  ‘ఆర్స్’  కు  కాలంచెల్లిన తర్వాత దానిని భూమిపై కూల్చేందుకు కావలసిన నియంత్రణ వ్యవస్థను అందులో ఏర్పాటుచేయనందుకే ప్రస్తుతం దాని ఉనికి సరిగ్గా తెలియలేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా 1979లో అమెరికాకే చెందిన స్కైలాబ్ అంతరిక్ష కేంద్రం కూడా విపరీత ఆందోళన కలిగించి, చివరికి హిందూ మహా సముద్రంలో కూలిపోయింది. ఆ తర్వాత 2001లో రష్యా చివరి అంతరిక్ష కేంద్రం ‘మిర్’ను ఆదేశం చక్కగా నియంత్రించి పసిఫిక్ సముద్రంలో కూల్చేసింది.

కాంగ్రెస్ లో తెలంగాణా చీలిక...?

హైదరాబాద్,సెప్టెంబర్ 25:   కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికే ఆ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది.  తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో కాంగ్రెస్‌ను వీడటంతో పాటు ‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ’(టీసీపీ) పేరుతో ఏకంగా కొత్తగా పార్టీని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించినట్టు చెబుతున్నారు. కొత్తపార్టీలో చేరబోయే వారి జాబితాలోమంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజు సారయ్యలతో పాటు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు  ఉన్నట్టు  తెలుస్తోంది.

Saturday, September 24, 2011

తెలంగాణలో పూర్తిగా స్తంభించిన రవాణా వ్యవస్థ

హైదరాబాద్,సెప్టెంబర్ 24: : తెలంగాణలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. శనివారం ఉదయం నుంచి రైళ్ల రాకపోకలు కూడా స్తంభించాయి. బస్సులు, ఆటోలతో పాటు రైళ్లు కూడా ఆగిపోవడంతో రవాణాకు పూర్తి అంతరాయం కలుగుతోంది. తెలంగాణ జెఎసి ఇచ్చిన పిలువు మేరకు శనివారం ఉదయం  48 గంటల రైల్ రోకో కార్యక్రమం ప్రారంభమైంది. సికింద్రాబాదు నుంచి నడవాల్సిన 55 ఎక్స్‌ప్రెస్ రైళ్లను, 22 ప్యాసింజర్ రైళ్లను ముందు జాగ్రత్త చర్యగా ఆపేసింది. మరో 55 రైళ్లను దారి మళ్లించారు. సికింద్రబాదు వరకు రావాల్సిన రైళ్లను విజయవాడలోనే ఆపేశారు.  తెలంగాణవాదులు శనివారం ఉదయమే రైలు పట్టాల మీదికి వచ్చారు. సికింద్రాబాదు, కాజీపేట, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాదులో ఆటోలు కూడా బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణలో బస్సులు నడవడం లేదు. పెట్రోల్ బంకులు బంద్ పాటిస్తున్నాయి. మద్యం షాపులను కూడా తెరవ లేదు. కాగా, తెలంగాణలో సకల జనుల సమ్మె శనివారంనాడు 12వ రోజుకు చేరుకుంది. రైల్ రోకోను విజయంవంతం చేయడానికి ఆందోళనకారులు పట్టాలపైనే వంటావార్పూ పెట్టారు.

Friday, September 23, 2011

పటౌడీ కన్నుమూత

కుటుంబ సభ్యులతో పటౌడీ
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 23:  భారత అత్యుత్తమ క్రికెట్ కెప్టెన్లలో ఒకరైన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (70) గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానిక గంగారామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన తుదిశ్వాస విడిచే సమయానికి భార్య షర్మిలా ఠాగూర్, కుమారుడు సైఫ్ అలీ ఖాన్, కూతుళ్లు సోహా, సాబాలు చెంతనే ఉన్నారు. భారత క్రికెట్‌ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన క్రికెటర్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ. తాను ఆడిన 46 టెస్టుల్లో 40 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించారు. భారత్‌కు విదేశాల్లో తొలిసారి సిరీస్ విజయాన్ని అందించారు. ఆయన అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన కొద్ది రోజులకే కారు ప్రమాదంలో కుడి కంటి చూపు కోల్పోయారు. కానీ  దృఢ సంకల్పంతో  ఏదైనా సాధ్యమే అని పటౌడీ నిరూపించారు.

చిదంబరం కు కష్టకాలం...!

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 23:  2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో హోంమంత్రి చిదంబరం పాత్రపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం ఆయనకు దన్నుగా నిలిచాయి. చిదంబరం నిజాయితీని తాము ఏమాత్రం శంకించడం లేదని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. చిదంబరం రాజీనామా చేయాలని, ఆయన పాత్రపై సీబీఐ విచారణ జరగాలని వస్తున్న డిమాండ్లను తోసిపుచ్చారు. చిదంబరం వైపు ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఆయనకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. మరోవైపు ఈ కుంభకోణంపై ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ (పీఏసీ) హోదాలో విచారణ జరిపిన బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీ, ఆ పార్టీ రాష్ట్ర నేత దత్తాత్రేయ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చిదంబరం తక్షణమే రాజీనామా చేయాలని, లేదా ప్రధాని అయినా ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు.
ఆ లేఖపై మాట్లాడను: ప్రణబ్
న్యూయార్క్: 2జీ కుంభకోణంపై తన కార్యాలయం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపిన లేఖపై స్పందించేందుకు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని యన న్యూయార్క్ లో విలేకరులతో అన్నరు.  ‘‘సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ద్వారా ఈ లేఖ బయటకు వచ్చింది. ఈ చట్టం ద్వారా భారత ప్రజలకు చాలా అధికారాలిచ్చాం. దేశం నుంచి అవినీతిని పారదోలేందుకు, పాలనను పారదర్శకంగా ఉంచేందుకు మేం తీసుకున్న అనేక చర్యల్లో ఈ చట్టం కూడా ఒకటి. ఈ లేఖను ఇవ్వాలంటూ సమాచార చట్టం ద్వారా ఇప్పటికే కొందరు ప్రధాని కార్యాలయాన్ని కోరారు. ఆ వివరాలను  కోర్టుకు కూడా సాక్ష్యంగా సమర్పించారు’’ అని అన్నారు.
ప్రధాని  మద్దతు
 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో హోంమంత్రి పి. చిదంబరానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నాటి ఆర్థిక మంత్రిగా, ప్రస్తుత హోంమంత్రిగా చిదంబరంపట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. అయితే 2జీ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై స్పందించబోనన్నారు.  కాగా, బుధవారం రాత్రే ఈ అంశంపై ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి చిదంబరంతో 20 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడిన మన్మోహన్... న్యూయార్క్ పర్యటన ముగించుకుని ఈ నెల 27న భారత్‌కు తిరిగి వచ్చేంత వరకు ఓర్పుగా ఉండాలని ప్రధాని.. చిదంబరానికి సూచించినట్లు తెలిసింది.

Thursday, September 22, 2011

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 23: ఇన్వెస్టర్లు ఎడాపెడా అమ్మకాలకు దిగడంతో గురువారం ఇతర ఆసియా మార్కెట్లతో పాటు భారత్ స్టాక్ మార్కెట్ కూడా తీవ్రంగా స్పందించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా గ్యాప్ డౌన్‌తో 16,828 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమయ్యింది. ఆతర్వాత ఇక ఏ దశలోనూ కోలుకునే సంకేతాలివ్వని సెన్సెక్స్ ఒకానొక దశలో 16,316 పాయింట్ల కనిష్టానికి ( 749 పాయింట్ల పతనం) కూడా పడిపోయింది.చివరకు 704 పాయింట్లు(4.13 శాతం) కుప్పకూలి 16,361 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇది దాదాపు నెలరోజుల కనిష్టస్థాయి ముగింపు కావడం గమనార్హం. , గడిచిన రెండేళ్లలో సెన్సెక్స్ ఒక్కరోజులో ఈ స్థాయి(శాతాల్లో చూస్తే) పతనాన్ని చూడటం ఇదే తొలిసారి. అంతక్రితం 2009, జూలై 6న బీఎస్‌ఈ సెన్సెక్స్ 870 పాయింట్ల భారీ క్షీణతను చవిచూసింది. కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా గురువారం 209.60 పాయింట్లు(4.08%) క్షీణించి 5,000 కిందికి పడిపోయింది. 4,923.65 వద్ద స్థిరపడింది.

సి.ఎం. బియ్యం జల్లు ...

తిరుపతి, సెప్టెంబర్ 22:  రాష్ట్రంలోని 2 కోట్ల 25 లక్షల తెల్ల రేషన్‌కార్డుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబరు 1వ తేదీ నుంచి కిలో బియ్యం ఒక్క రూపాయికే పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.  రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిని కట్టడి చేయడం కోసం నవంబరు 1వ తేదీ నుంచి 25 రకాల సర్టిఫికెట్లు ఈ సేవా కేంద్రాల నుంచి పది నిమిషాల్లోనే అందించే వ్యవస్థను అమలు చేయనున్నట్టు సీఎం తెలిపారు. తిరుపతి లో బుధవారం  రైతు, మహిళా సదస్సులో సీఎం మాట్లాడారు.మహిళల కోసం ప్రతి ఆర్నెల్లకో కొత్త పథకం ప్రారంభిస్తామన్నారు. నిరుద్యోగులకు ఏడాదికి 5 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని, డిసెంబర్‌లో ఒకే రోజు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని పునరుద్ఘాటించారు. అక్టోబర్ 2వ తేదీన ఇందిర జలప్రభ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాలకు డ్రిప్, బోర్ల ద్వారా సాగునీరందించే పథకం చేపడతామన్నారు. రాష్ట్రంలో గర్భిణులకు పౌష్టికాహారం అందించడం కోసం మహిళా సంఘాల నేతృత్వంలో 38 వేల పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. 

Wednesday, September 21, 2011

ఆర్టీసీ బస్ బీభత్సం

హైదరాబాద్,సెప్టెంబర్ 21: నగరంలోని  యూసఫ్ గూడ కృష్ణానగర్ వద్ద బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. బస్సు బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. సకల జనుల సమ్మె ప్రభావంతో పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. అయితే డ్రైవర్ కు సరైన అవగాహన లేకపోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. పరారైన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  మృతి చెందిన ఆటో డ్రైవర్ మల్లేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అలాగే కుటుంబంలోని ఒకరికి ఉద్యోగంతో పాటు, గ్రేటర్ కాంగ్రెస్ తరపున మరో రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి దానం నాగేందర్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వం పట్టుదలకు పోయి బస్సులను అనుభవంలేని వారితో నడిపించటం వల్లే ఓ అమాయక ప్రాణం బలైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.ఈ ఘటనకు ప్రభుత్వంతో పాటు, ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడినవారికి ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం అందించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టుదల వీడాలని, లేకుంటే బస్సులు తిరిగి డిపోలకు చేరవని హెచ్చరించారు.

Tuesday, September 20, 2011

వివాదంలో బాలూ కుమారుడు...!

చెన్నై,సెప్టెంబర్ 20:  కోలీవుడ్ నటి సోనాతో అసభ్యకరంగా ప్రవ ర్తించిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా నేపథ్య గాయకుడు ఎస్పీబీ చరణ్  బెయిల్ కోసం  చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోనా అసత్య ప్రచారం చేస్తోందని, తప్పుడు ఫిర్యాదు ఇచ్చిందని తెలిపారు. నటుడు వైభవ్ ఇంట్లో జరిగిన విందులో చరణ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, బలాత్కారం కూడా చేయబోయాడని సోనా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పాండిబజార్ పోలీసులు చరణ్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్న సోనా డిమాండ్‌కు చరణ్ అంగీకరించే అవకాశాలు కన్పించడం లేదు. తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చరణ్  అంటున్నాడు.

భూకంపం మృతుల సంఖ్య 72కి చేరిక

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20:  ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఆదివారం సంభవించిన పెను భూకంపం అపార నష్టాన్ని కలిగించింది.  మృతుల సంఖ్య 72కి చేరింది. భూకంప ప్రభావం అధికంగా ఉన్న  సిక్కింలో 41 మంది చనిపోయారు. భూ ప్రకంపనల ధాటికి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లు, పలు ఇతర నిర్మాణాలు నేలమట్టమవగా, కొన్ని చోట్ల మొబైల్ ఫోన్ టవర్లు కుప్పకూలాయి. ఇళ్ల శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండొచ్చన్నారు. 5 వేల మంది సైనిక సిబ్బంది, ఆరు విమానాలు, 15 హెలికాప్టర్ల ద్వారా సిక్కింలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను జారవిడుస్తున్నామన్నారు. కొండ చరియలు విరిగిపడటం, ప్రతికూల వాతావరణం కారణంగా సిక్కింలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా, మేఘాలయలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక 4.3 తీవ్రతతో మళ్లీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. అటు మహారాష్ట్రలోని లాతూర్, ఉస్మానాబాద్, సోలాపూర్ సహా పలు జిల్లాల్లో సోమవారం ఉదయం 6.23 గంటలకు స్వల్ప ప్రకంపనలు సంభవించాయి.
సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. భూకంప మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేల చొప్పున అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష పరిహారంగా  ప్రకటించింది. 

పీ.ఎం. నవుతానా...!

మూడు రోజుల సద్భావనా దీక్షను నిమ్మరసం తో ముగిస్తున్న గుజరాత్ సి.ఎం. నరేంద్ర మోడీ

' పిల్ ' పైనా కోర్ట్ రెస్పాన్స్ ' నిల్ '

హైదరాబాద్, సెప్టెంబర్ 20:   సకల జనుల సమ్మెను నిలిపి వేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌  (పిల్ ) లో ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌రావుకు, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌కు హైకోర్టు  నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నానికి చెందిన నారాయణ అనే వ్యక్తి సకల జనుల సమ్మెను నిలిపి వేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సమ్మె వల్ల ప్రైవేటు, ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా నిలిచి పోయాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ కక్రు, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అయితే నోటీసులకు సమాధానం ఇవ్వడానికి వారికి వారం గడువివ్వడమే విడ్డూరం. పరిస్థితి తీవ్రత పై వేగం గా స్పందించే స్థితిలో న్యాయవ్యవస్థ లేదనడానికి ఇదే నిదర్శనం. ప్రజా ప్రయోజనాలు ఏ వ్యవస్థకూ పట్టని దౌర్భాగ్య అవస్థలో ఉన్నాం మనం...

సమ్మెట పై సర్కార్ ఊరట చర్యలు

హైదరాబాద్, సెప్టెంబర్ 20:  సకల జనుల సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. ప్రజలకు విద్యుత్. రవాణా ఇబ్బందులను తగ్గించేందుకు రెండు టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేసింది.  ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, సింగరేణి కాలరీస్, జెన్‌కో, ట్రాన్స్కో ఎండిలతో ఏర్పాటైన  టాస్క్ ఫోర్స్  బొగ్గు, సహజ వాయువుల కేటాయింపు, సరఫరా, ఉత్పత్తి వంటి అంశాలను  పర్యవేక్షిస్తుంది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండి, పోలీసు అధికారులతో ఏర్పాటైన  మరో టాస్క్ ఫోర్స్  రవాణా సమ్మె వల్ల కలిగే సమస్యలను అధిగమించే అంశాలను పర్యవేక్షిస్తుంది. రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా ఎంఎంటిఎస్, లోకల్ రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వే అధికార్లను కోరారు.  తెలంగాణ ప్రాంతంలో తిరిగేందుకు టూరిస్టు, ప్రైవేటు వాహనాలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేయాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు. నిత్యావసర వస్తువులు సక్రమంగా ప్రజలకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా బొగ్గు నిల్వలు పడిపోతుండడంతో విద్యుత్ సంక్షోభం తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆప్రమత్తమైన ప్రభుత్వం బయట ప్రాంతాల నుంచి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

తెలంగాణా రవాణా పై సమ్మెట...

హైదరాబాద్, సెప్టెంబర్ 20: సకల జనుల సమ్మెలో భాగంగా సోమవారం నుంచి ప్రారంభమైన ఆర్టీసి ఉద్యోగుల సమ్మె రవాణా వ్యవస్ధపై తీవ్ర ప్రభావం  చూపుతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో వరుసగా ఏడోరోజు కూడా పని స్తంభించింది. ఉత్తర, దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని ముఖ్య నగరాలకు వెళ్లే జాతీయ రహదారులను తెలంగాణ వాదులు సోమవారం తెల్లవారుజాము నుంచే తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో, రవాణా వ్యవస్ధ పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పది జిల్లాల ద్వారా వెళ్లే జాతీయ రహదారులను తెలంగాణ వాదులు దిగ్బంధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.  మొత్తం 89 డిపోల్లో ఉన్న 10వేల బస్సులు కదలలేదు. 58వేల మంది ఆర్టీసి కార్మికులు విధులను బహిష్కరించారు. తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు నడవనందుకు రూ.8 కోట్ల నష్టం వాటిల్లిందని ఎండి బి ప్రసాదరావు వెల్లడించారు. ప్రైవేటు క్యారియర్ బస్సులు నడుపుకునేందుకు రూ.100కే పర్మిట్‌ను రవాణా శాఖ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఎక్కడ పర్మిట్ ఉన్నా రాష్ట్రంలో ఎక్కడైనా నడపుకునేందుకు వీలుగా ఈ పర్మిట్‌లను అనుమతిస్తున్నట్టు ఆయన  వెల్లడించారు.

Monday, September 19, 2011

భూకంపం మృతులు 11 ...

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 19:   భారతదేశంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో పలుచొట్ల ఆదివారం సయంత్రం సంభవించిన భూకంపం లో 11 మంది మరణించారు.   ఇది రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. గ్యాంగ్‌టక్ పర్వత శ్రేణుల్లో భూకంపం కేంద్రం నమోదైంది.  న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలువురు గాయపడ్డారు. సిక్రింలోని గ్యాంగ్‌టాక్ కేంద్రంగా భూకంపం తాకింది.  సిక్కింలో నలుగురు, నేపాల్‌లో ఐదుగురు, బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఇద్దరు మరణించినట్లు సమాచారం.

సకల జనుల ఖర్మ...

హైదరాబాద్,సెప్టెంబర్ 19:  సకల జనుల సమ్మెకు మద్దతుగా సోమవారం  నుంచి తెలంగాణ పరిధిలో ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ బస్సులు రోడ్డుపైకి వచ్చిన దాఖలాలు లేవు. దీనితో  ఆటోలు, ప్రయివేట్ వాహనాలకు భారీగా గిరాకి పెరిగింది.   ప్రయాణికుల నుంచి అధిక మొత్తం డిమాండ్ చేస్తున్నారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో రైల్వే అధికారులు సోమవారం ఉదయం ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచారు. సికింద్రాబాద్- లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి, సికింద్రాబాద్-మేడ్చల్ రూట్లలో 120 సర్వీసులను తిప్పుతున్నారు. అలాగే ఎంఎటీఎస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. వీటితో పాటు తెలంగాణ జిల్లాల మీదగా వెళ్లే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

గాలి జనార్ధనరెడ్డి రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్,సెప్టెంబర్ 19:  ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు నాంపల్లి న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. కస్టడీ ముగియటంతో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిని సీబీఐ పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. కాగా వీరిద్దర్ని మరో తొమ్మిదిరోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అయితే  పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించటంతో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అధికారులు చంచలగూడ జైలుకు తరలించారు. కాగా, గాలి జనార్దనరెడ్డి తరపున ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు.

Sunday, September 18, 2011

జూనియర్ శివాజీగణేశన్ ‘చిరుతపులి’ !

హైదరాబాద్:   శివాజీగణేశన్ మనవడు జూనియర్ శివాజీగణేశన్ కథానాయకుడిగా, ఎ.వెంకటేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘సింగకుట్టి’ చిత్రం ‘చిరుతపులి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కూనిరెడ్డి శ్రీనివాస్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. మధురై నేపథ్యంలో సాగే ఈ సినిమా లో మాతృదేశం  ఔన్నత్యాన్ని   చెప్పే పాత్రలో జూనియర్ శివాజీగణేశన్ నటించారు.గౌరీముంజల్ కథానాయికగా నటించారు. 

మాదాపూర్ లో మరో సాప్ట్ వేర్ సంస్థకు తాళం

హైదరాబాద్ ,సెప్టెంబర్ 18:  హైదరాబాద్ లోని మాదాపూర్ లో మరో సాప్ట్ వేర్ సంస్థ మూతపడింది. టాస్క్ ఇన్ఫోటెక్ సంస్థని మూసివేశారు. ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

గవర్నర్ పాలనే శరణ్యమా...?

హైదరాబాద్ ,సెప్టెంబర్ 18:    సకల జనుల సమ్మె తీవ్రమవుతోంది. . ఇది ఎలా పరిష్కారమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విరమించండనే అప్పీళ్ళు, చర్యలు తీసుకుంటామని నిస్సహాయ హెచ్చరికలు తప్పితే సీరియస్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.  కొన్ని శాఖలను  ఎస్మా పరిధిలోకి తెచ్చినా ఫలితం సున్న.  ఈ ఆరు రోజులలో  సకల జనుల సమ్మెలోకి ఒక్కో విభాగం వచ్చి చేరుతోంది.  సోమవారం నుంచి సకల జనుల సమ్మెలో తామూ భాగస్వాములమవుతున్నామని... ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోతాయని ఎన్ఎంయూ తెలంగాణ ఫోరం ప్రకటించింది. మరో వైపు సోమవారం తెలంగాణలోని జాతీయ రహదారుల దిగ్బంధానికి జేఏసీ  పిలుపునిచ్చింది.  ఇటు పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు తాము కూడా సమ్మెకు వెడతామని ప్రకటించారు.  సుమారు 1.90 లక్షల మందిదాకా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఐకేపీ, ఎన్ఎంఆర్, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లు  సోమవారం నుంచి సమ్మెలో ఇగుతామంటున్నారు. ఉపాధ్యాయలోకం ఇప్పటికే సమ్మెలో చేరింది. పరీక్షలన్ని వాయిదా పడ్డాయి. సింగరేణి లో సమ్మె వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయి విద్యుత్ సరఫరా మిణుకు మిణుకు మంటోంది. డిసెంబర్ 9 న సన్నాసి ప్రకటన చేసి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్న కేంద్రం ఇక అంతిమం గా గవర్నర్ పాలన  కే మొగ్గు చూపుతున్నట్టు ఢిల్లీ వర్గాల భోగట్టా.    

 

విషాదంగా ముగిసిన వైమానిక విన్యాసాలు

రెనో,సెప్టెంబర్ 18:  అమెరికాలోని రెనోలో  వైమానిక విన్యాసాల ప్రదర్శన విషాదంగా ముగిసింది. ఓ యుద్ధ విమానం అదుపు తప్పి జనంపై కుప్పకూలి తునాతునకలైంది. దీంతో పైలట్‌తోపాటు వీక్షకుల్లో ఎనిమిది మంది మృతిచెందగా, 56 మందికి పైగా గాయపడ్డారు. హాలీవుడ్ స్టంట్ పైలట్ జిమ్మీ లీవార్డ్ (80) నడుపుతున్న పీ-51 ముస్తాంగ్ రకానికి చెందిన విమానం స్టేడియంలోని ‘బాక్స్ సీట్’ ఏరియాపై కూలిపోయింది. ఈ విమానం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. క్షతగాత్రుల్లో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

తెలంగాణ ఒత్తిడి: ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

హైదరాబాద్,సెప్టెంబర్ 18: తెలంగాణవాదుల ఒత్తిడికి తలొగ్గి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు  వారు వేర్వేరుగా స్పీకర్ కార్యాయానికి రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు పంపారు. 

Saturday, September 17, 2011

చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ నుంచి సైనా అవుట్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ నుంచి అవుటైంది. శుక్రవారం జరిగిన మహిళా సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్ చేతిలో సైనా ఓటమి పాలైంది. సైనా వాంగ్ చేతిలో 8-12, 12-21 స్కోరుతో పరాజయం పాలైంది. వాంగ్ చేతిలో కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే సైనా ఓటమి పాలైంది. 

చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ దే గెలుపు

కార్డిఫ్,సెప్టెంబర్ 17:   భారత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్ విజయం సాధించి వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్ చేసింది. భారత్‌పై  6 వికెట్ల తేడాతో గెలిచింది. విజయానికి కావాల్సిన 241 పరుగుల్ని ఇంకా పది బంతులు ఉండగానే ఇంగ్లాండ్ సాధించింది. .5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్ 3-0 తేడాతో గెలుపొందింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 304 పరుగుల భారీ స్కోరు చేసింది.  భారత జట్టులో కోహ్లీ 107, ద్రావిడ్ 69, ధోని 50 పరుగులు చేశారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు  కుదించి 241 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచారు. కెప్టెన్ కుక్, ట్రాట్‌లు రాణించి అర్ధ సెంచరీలు సాధించారు. చివర్లో రవి బొపారా, బెయిర్‌స్టో ధాటిగా ఆడటంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వశమైంది. ఇంగ్లాండ్ జట్టులో కుక్ 50, కిస్వెట్టర్ 21, ట్రాట్ 63, బెల్ 26, బొపారా 37, బెయిర్‌స్టో 41 పరుగులు చేశారు.

నరేంద్ర మోడీ దీక్ష ప్రారంభం

అహ్మదాబాద్,సెప్టెంబర్ 17:   గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సద్భావనా దీక్ష శనివారం ప్రారంభమైంది. శాంతి, సామరస్యం కోసం ఆయన మూడు రోజుల పాటు ఈ నిరశన దీక్షను కొనసాగించనున్నారు. గుజరాత్ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద మోడీ చేపట్టిన దీక్షకు మద్దతుగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ,అరుణ్ జైట్లీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఏఐడీఎంకే ప్రతినిధులు హాజరయ్యారు.
కాగా కాంగ్రెస్ కూడా పోటీగా దీక్షకు దిగింది. సబర్మతీ ఆశ్రమానికి ఎదురుగా కాంగ్రెస్ నేత,మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా దీక్ష ఆరంభించారు.  లోకాయుక్తకు భయపడే మోడీ దీక్ష చేపట్టారని వాఘేలా వ్యాఖ్యానించారు.

Thursday, September 15, 2011

ఊసరవెల్లి ’ఆడియో విడుదల

దేవీశ్రీ తో కలసి స్టెప్పేస్తున్న ఎన్ టీ ఆర్ 
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 16: ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘ఊసరవెల్లి’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆడియో సీడీని ఆవిష్కరించి కీరవాణికి ఇచ్చారు.ఈ వేడుకలో రాజమౌళి, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, హరీష్‌శంకర్, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, డి.సురేష్‌బాబు, ‘దిల్’ రాజు, కె. అచ్చిరెడ్డి, నల్లమలుపు శ్రీనివాస్, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, సురేష్‌రెడ్డి, గణేష్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ - ‘‘తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలి టాకీ విడుదలైన ఈ రోజున ఆడియో వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉందని,  ఈ సినిమా సిక్సర్ కాదు... బౌండరీ దాటి, స్టేడియం దాటి బయటపడుతుందని అన్నారు.


గ్యాస్ బండ ఇక గుదిబండే ...!

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 16: గ్యాస్ బండ ఇక ప్రజల నెత్తిన గుదిబండే కానుంది. సబ్సిడీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 4 నుంచి 6కు పరిమితం చేయడంతోపాటు ఈ పరిమితి దాటాక ఒక్కో అదనపు సిలిండర్‌పై మార్కెట్ ధర ప్రకారం సుమారు 710 రూపాయలు వసూలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఒకవేళ గ్యాస్ సబ్సిడీని ఏడాదికి నాలుగు నుంచి ఆరు సిలిండర్లకు పరిమితం చేస్తే వినియోగదారులు ఆ పరిమితి దాటాక సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం రూ. 710 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సబ్సిడీపై ఇస్తున్న సిలిండర్లను పరిమిత సంఖ్యలో సరఫరా చేయడం వల్ల ప్రభుత్వానికి రూ. 20,000 కోట్లు ఆదా అవుతుంది. సొంత ఇల్లు, కారు, ద్విచ క్రవాహనం, ఆదాయ పన్ను జాబితాలో పేరు కలిగి ఉన్న వారికి ఈ పరిమితి వర్తిస్తుందని అధికారి తెలిపారు.

మళ్ళీ పేలిన పెట్రో బాంబ్...!

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 16: నాలుగు నెలల వ్యవధిలో మరోసారి ప్రజల నెత్తిన పెట్రోబాంబు పేలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, డాలరుతో రూపాయి మారక విలువ క్షీణించడాన్ని సాకుగా చూపుతూ పెట్రోలు రేట్లను మళ్లీ పెంచారు. ఈ మేరకు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోలు రూ.3.14 నుంచి రూ. 3.32 వరకూ ధరలను పెంచాయి. స్థానిక పన్నుల కారణంగా వివిధ ప్రాంతాల్లో పెట్రో ధరల్లో వ్యత్యాసం ఉండనుంది. పెరిగిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 111 అమెరికా డాలర్లకు చేరిందని, అందుకు అనుగుణంగానే పెట్రోలు రేట్లు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వరంగ చమురు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆయన వివరించారు. ‘‘ప్రభుత్వరంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై రూ.2.61 చొప్పున నష్టపోతున్నాయి. రోజుకు రూ.15 కోట్ల నష్టాలు చవిచూస్తున్నాయి. లీటరుపై నష్టపోతున్న రూ.2.61కు వ్యాట్ ఇతర పన్నులు కలుపుకుని మొత్తమ్మీద రూ.3.14 పెంచాల్సి వచ్చింది’’ అని మరో ఉన్నతాధికారి తెలిపారు.కేంద్ర ప్రభుత్వం కిందటేడాది జూన్‌లోనే చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. అప్పట్నుంచీ చమురు కంపెనీలు అడపాదడపా రేట్లను పెంచుతూనే ఉన్నాయి. మరోవైపు పెట్రోలు అమ్మకంపై ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,450 కోట్లు నష్టపోయాయి. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, ఎల్‌పీజీ అమ్మకాలపై ఈ కంపెనీలు రోజుకు రూ.263 కోట్లు నష్టపోతున్నాయి. లీటరు డీజిల్‌పై రూ.6.05, కిరోసిన్‌పై 23.25, గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.267 రాయితీ ఇస్తున్నాయి.

సకల జనుల సమ్మె ప్రభావంతో సింగరేణిలో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా

హైదరాబాద్,సెప్టెంబర్ 16: సకల జనుల సమ్మె ప్రభావంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా స్తంభించటం.. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపైనే కాక.. ఇటుక బట్టీలు, ఔషధ తయారీ పరిశ్రమలు, సిమెంటు ఫ్యాక్టరీలు వంటి చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ఈ పరిశ్రమలకు రోజూ ఒక్కో లారీ (సుమారు 17 టన్నులు) చొప్పున బొగ్గు సరఫరా అవుతుంది. కరీంనగర్ జిల్లాలోని సింగరేణి రామగుండం రీజియన్ నుంచి రోజూ దాదాపు 150 లారీల్లో ఇలాంటి పరిశ్రమలకు బొగ్గు రవాణా జరుగుతుంది. కానీ మూడు రోజులుగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా స్తంభించటంతో.. ఈ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా.. ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమే బొగ్గు నిల్వలుంచుకునే సిమెంట్, ఫార్మా పరిశ్రమలు బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిపివేసే పరిస్థితికి చేరుకుంటున్నాయి.  సమ్మె కారణంగా సింగరేణిలో వరుసగా గురువారం మూడో రోజు కూడా బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. ఖమ్మం జిల్లాలోని మణుగూరు, సత్తుపల్లి ఓపెన్‌కాస్టు గనుల్లో మినహా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 36 భూగర్భ, 12 ఓపెన్ కాస్టు గనుల్లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. సింగరేణి సంస్థ ఒక రోజు ఉత్పత్తి లక్ష్యం 1.65 లక్షల టన్నులు. మూడు రోజుల్లో 4.95 లక్షల టన్నులు ఉత్పత్తి కావాల్సి ఉండగా, 41,200 టన్నులు మాత్రమే జరిగింది. ఇది కూడా మణుగూరు, సత్తుపల్లి ఓపెన్‌కాస్టు గనుల్లోనే. మూడు రోజుల సమ్మెతో సింగరేణికి రూ. 67.50 కోట్ల నష్టం వాటిల్లింది. రైలు, రోడ్డు మార్గాలలో బొగ్గు రవాణా నిలిచిపోయింది. సత్తుపల్లి నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీలను అడ్డుకొని ఆందోళనకారుల గాలి తీసేశారు.

Wednesday, September 14, 2011

సిబిఐ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన గాలి జనార్ధన్ రెడ్డి

హైదరాబాద్,సెప్టెంబర్ 14:  కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తమ సిబిఐ కస్టడీని సవాల్ చేస్తూ  రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. కాగా వీరిద్దరూ బుధవారం  కోఠిలోని సిబిఐ కార్యాలయంలో సిబిఐ అధికారుల విచారణకు హాజరయ్యారు. గాలి తరఫు న్యాయవాదుల సమక్షంలో అధికారులు వారిని విచారించారు. మూడు రోజుల పాటు సిబిఐ, గాలి జనార్ధన్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనలు విన్న నాంపల్లి ప్రత్యేక కోర్టు   ఈ నెల 19 వరకు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వు ఇచ్చింది. మరోవైపు  గాలి జనార్ధన్ రెడ్డి శ్రీవారికి బహూకరించిన బంగారు కిరీటం విషయంలో  తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. 

తీవ్రమవుతున్న సకల జనుల సమ్మె

హైదరాబాద్,సెప్టెంబర్ 14: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల  పిలుపు మేరకు సకల జనుల సమ్మె రెండు రోజులు పూర్తిచేసుకుంది.  సచివాలయం పై సమ్మె ప్రభావం పాక్షికంగా ఉండగా జిల్లాలలో తీవ్రం గానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా సుమారు 450 సినిమా హాళ్లు మూతపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వచ్చంధంగా 160 సినిమా హాళ్ళ లో ప్రదర్శనలు నిలిపివేశారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా నిరాహార దీక్షలు చేపట్టింది.   కరీం నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల లో  సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నందున బొగ్గు ఉత్పత్తికి తీవ్ర  అంతరాయం ఏర్పడింది.
 18  అర్ధరాత్రి నుంచి ఆర్టీసి సమ్మె
సకలజనుల సమ్మెలో భాగంగా ఆర్టీసి తెలంగాణ కార్మికులు ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. తెలంగాణ జిల్లాలలోని 89 డిపోలలో 60వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని తెలంగాణ ఎన్ఎంయు ఫోరం తెలిపింది. 
  ప్రభుత్వం హెచ్చరిక
తెలంగాణ ఉద్యోగులు వెంటనే సకల జనుల సమ్మెను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. సమ్మె వల్ల తెలంగాణలోని సామాన్య ప్రజలకే నష్టమని, సంక్షేమ పథకాలకు సైతం ఆటంకం కలుగుతోందని,  ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో హాజరు కాకుంటే చర్యలు తప్పవని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు.  ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ రాదన్నారు.   

Monday, September 12, 2011

విషమంగానే అయాజ్ ఆరోగ్యం

హైదరాబాద్,సెప్టెంబర్ 12:  : ఆదివారం నాడు హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు సోమవారం తెలిపారు. అయాజ్ అవయవాలు పనిచేయటం లేదని వారు వెల్లడించారు.కాగా, అయాజుద్దీన్ పై నార్సింగ్ పోలీసులు  కేసు నమోదు చేశారు. అతనిపై 304/ఏ, 337 సెక్షన్ల కింద సుమోటోగా కేసు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.బైక్ రేసింగ్ చేస్తుండగా  మహ్మద్ అయా జుద్దీన్(19) తీవ్ర గాయాల పాలవగా.. అజహర్ సోదరి కుమారుడు అజ్మల్ ఉర్ రెహమాన్(16) ప్రాణాలు కోల్పోయాడు. అతి వేగంతో  బైక్ నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ వార్త తెలిసి లండన్ లో ఉన్న అజారుద్దీన్ సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.  

Saturday, September 10, 2011

గాలి జనార్దన్ రెడ్డి వజ్రకిరీటాన్ని తిరిగి ఇవ్వం: టి.టి.డి.

హైదరాబాద్ ,సెప్టెంబర్ 10:  తిరుమల శ్రీవారికి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రదానం చేసిన 45 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రకిరీటాన్ని తిరిగి ఇచ్చేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం గాలి జనార్దన్ రెడ్డి ఆ కిరీటాన్ని ప్రదానం చేశారు. అవినీతికి పాల్పడిన గాలి జనార్దన్ రెడ్డి ప్రదానం చేసిన వజ్ర కిరీటాన్ని వాపసు చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టిటిడి కార్యనిర్వాక అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలోనూ వజ్ర కిరీటాన్ని వాపసు చేసేది లేదని ఆయన ఓ వార్తా సంస్థతో చెప్పారు. ఆ కిరీటాన్ని పరిశీలించడానికి ఆదాయం పన్ను శాఖ అధికారులు లేదా కేంద్ర, రాష్ట్ర సంస్థల అధికారులు ఎవరు వచ్చినా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

ఉత్తరాఖండ్ సి.ఎం. మార్పు

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 10: : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ పై వేటు పడింది. ఆయనని మార్చాలని బిజెపి నిర్ణయించింది. కొత్త ముఖ్యమంత్రిగా బిసి ఖండూరిని ఎంపిక చేశారు. ఖండూరి ఆదివారం  ప్రమాణ స్వీకారం చేస్తారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు..

మూడో వన్డేలోనూ భారత్ ఓటమి

లండన్,సెప్టెంబర్ 10:  ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓడిపోయింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 43 ఓవర్లలో 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఇంగ్లండ్ 41.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 2 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్‌లోనూ రాణించిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Thursday, September 8, 2011

ఢిల్లీ తిరిగి వచ్చిన సోనియా

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 8:  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. గతనెల 2వ తేదీన ఆమె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. నెల రోజులపైగా విశ్రాంతి అనంతరం సోనియా భారత్‌కు తిరిగి వచ్చారు. సోనియా తన కుమార్తె ప్రియాంకతో కలిసి వచ్చినట్టు  విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోనియా లేని  సమయంలో పార్టీ బాధ్యతలను చూసేందుకు రాహుల్‌గాంధీ, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేదీతో నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో పురోగతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 8:  ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. హుజీ ఈ-మెయిల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని కిస్త్వర్ ప్రాంతం నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు గుర్తించామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ తెలిపారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఓ సైబర్ కేఫ్ యజమాని కూడా ఉన్నాడు. కాగా ఢిల్లీ బాంబు పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య 12 కి చేరింది. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తర్సెమ్ సింగ్ (34) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం గురువారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు.  ఇలాఉండగా ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై పార్లమెంట్ ఉభయసభలు గురువారం దద్దరిల్లాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబట్టింది. దాంతో ఇరు సభల్లోనూ కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

Wednesday, September 7, 2011

ఢిల్లీ పేలుడు మృతులు 9: దేశమంతా హైఎలర్ట్

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 7:  : ఢిల్లీలో హైకోర్టు సమీపంలో బుధవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. హైకోర్టు గేటు నెంబర్.5 వద్ద ఈ జరిగిన ఈ పేలుడులో  తొమ్మిదిమంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. మరో 45మంది గాయపడినట్లు పేర్కొన్నారు. గాయపడినవారిలో ఎక్కువమంది న్యాయవాదులేనని తెలిపారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించటంతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారులో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు ఓ డబ్బాలో బాంబును అమర్చి కారులో ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసు బలగాలతో పాటు, బాంబ్ స్వ్కాడ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా మూడు నెలల క్రితం హైకోర్టు సమీపంలో ఇదే తరహా పేలుడు సంభవించినా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మళ్లీ అదే తరహాలో పేలుడు జరగటం నిఘా వర్గాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కాగా ఈ ఘటన తో హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.  

అక్టోబర్ 13 న బాన్సువాడ ఉప ఎన్నిక

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 7: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక  అక్టోబర్    13 న జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్‌ను ప్రకటించింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే పదవిని వీడటంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. రాష్ట్రం లోని బాన్సువాడతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు నియోజవకర్గానికి కూడా ఇదే రోజు ఉప ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి(పశ్చిమ), పుదుచ్చేరిలోని ఇందిరానగర్, మహారాష్ట్రలోని ఖడక్వాసలా, బీహార్‌లోని దరౌందా అసెంబ్లీ నియోజకవర్గాలకు, హర్యానాలోని హిస్సార్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

భారత్, బంగ్లా సరిహద్దు ఒప్పందం

సాకారం కాని తీస్తా నదీ జలాల ఒప్పందం
ఢాకా,సెప్టెంబర్ 7:  దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యకు తెరదించుతూ భారత్, బంగ్లాదేశ్‌ల చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.  రెండు రోజుల బంగ్లా పర్యటన కోసం భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ఆ దేశ రాజధాని ఢాకా చేరుకున్నారు. పర్యటన సందర్భంగా ఇరు దేశాలు భూ సరిహద్దు గుర్తింపు,  స్వదేశీ భూభాగాల ( ఎన్‌క్లేవ్) మార్పిడి తో సహా  పది ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే కీలకమైన తీస్తా నదీ జలాల ఒప్పందంపై అంగీకారం కుదరలేదు.  తీస్తా నదీ జలాల ఒప్పందం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం కారణంగా సాకారం కాలేదు.అయితే తీస్తాతోపాటు ఫెనీ నదీ జాలలను పంచుకోవడంపై పరస్పర ఆమోదయోగ్య, పారదర్శక ఒప్పందం కోసం చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయని మన్మోహన్ చెప్పారు. బంగ్లా నుంచి 46 వస్త్ర ఉత్పత్తులు సహా 61 వస్తువులను సుంకం లేకుండా భారత్ మార్కెట్లోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తీన్ భిగా కారిడార్ గుండా బంగ్లాదేశీయులను రోజుకు 24 గంటలూ భారత్‌లోకి అనుమతిస్తామన్నారు. ఎన్‌క్లేవ్ మార్పిడి ఒప్పందం కింద బంగ్లాలోని 111 భారత ఎన్‌క్లేవ్‌లు, అలాగే భారత్‌లోని 51 ఎన్‌క్లేవ్‌లను ఇచ్చిపుచ్చుకోనున్నారు. 1974 తర్వాత భారత్ తన భూభాగంలో కొంత భాగాన్ని వేరే దేశానికి అప్పగించనుండడం ఇది రెండోసారి.

రెండో వన్డేలో ఇంగ్లండ్‌ విజయం

సౌతాంప్టన్,సెప్టెంబర్ 7: భారత్‌తోజరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే జయ కేతనం ఎగురవేసింది. అలెస్టర్ కుక్ (80), కెవిస్టర్ (46) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో వర్షం కారణం గా మ్యాచ్ ను  శాపంగా మారడంతో 23 ఓవర్లకు  కుదించారు. దీంతో భారత్  8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు మాత్రమే చేసింది. 

గణపతి స్థపతి అస్తమయం

చెన్నై,సెప్టెంబర్ 7:  తమిళనాడు ప్రభుత్వ ఆస్థాన శిల్పి, హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహ రూపశిల్పి డాక్టర్ వి. గణపతి స్థపతి (84) మంగళవారం ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గణపతి శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 6.05 గంటలకు కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  ద్రవిడ దేవాలయ శిల్ప శాస్త్ర నిష్ణాతులైన గణపతి...శివగంగ జిల్లా పిళ్లయార్‌పట్టి గ్రామంలో 1927లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీ రామారావు ఉన్న సమయంలో...హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించి, అందుకు తగిన సమర్థుడు గణపతి స్థపతేనని ఆయన్ను రప్పించారు. కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తై తిరువళ్లువర్ విగ్ర హంతో పాటు అనేక శిల్పాలకు గణపతి రూపకల్పన చేశారు. 

Tuesday, September 6, 2011

                  బంగ్లాదేశ్ పర్యటనకై ఢాకా చేరుకున్న ప్రధాని మన్మోహన్ కు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా స్వాగతం...

చింతకాయల పోకిరి...!

 వెంకటేష్, మహేష్ బాబు కలిసి తొలిసారిగా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు.  శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో దిల్ రాజ్ నిర్మించే ఈ చిత్రం అక్టోబర్లో  ప్రారంభం  కావచ్చు. . ఈ చిత్రానికి   'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే టైటిల్ రిజిస్టర్ చేసి ఉంచారు. ప్రస్తుతం వెంకటేష్  'గంగ ది బాడీగార్డ్' చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం మొదలవుతుందని అంటున్నారు. మహేష్ బాబు ‘దూకుడు’ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతూనే మరో పక్క 'బిజినెస్ మెన్' సినిమా చేస్తూనే, మరోపక్క మధ్యలో ఈ సినిమాకు కొన్ని డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. దిల్ రాజ్ ప్రస్తుతం ఈ సినిమా మీద పూర్తి కాన్సంట్రేషన్ పెడుతున్నాడట. 

అఖిల్ ను కృష్ణ వంశీ చేతుల్లో పెట్టిన నాగార్జున...!

నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వ బోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ దర్శకత్వంలో అఖిల్ సినీ అరంగేట్రం చేయనున్నాడని సమాచారం. తన కుమారుడు అఖిల్ కోసం మంచి కథను తయారు చేయాలని నాగార్జున కృష్ణ వంశీకి సూచించాడుట. కృష్ణ వంశీ ఇప్పటికే అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులతో  సినిమా చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం మొగుడు సినిమా షూటింగులో బిజీగా ఉన్న ఆయన...అనంతరం అక్కినేని కుటంబంతో సినిమా మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ప్రారంభం కావచ్చునంటున్నారు. వాస్తవానికి కొత్త డైరెక్టర్లతో తమ కుటుంబ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే అలవాటు ఉన్ననాగార్జున...ఈ సారి మాత్రం కేడి, దడ చిత్రాలు ఫ్లాఫ్ నేపధ్యంలో  మంచి అనుభవం ఉన్న కృష్ణ వంశీ ద్వారా తెరకు పరిచయం చేయాలని డిసైడ్ అయ్యాడంటున్నారు. నాగార్జున -కృష్ణ వంశీ కాంబినేషన్లో నిన్నే పెళ్ళాడతా చిత్రం సూపర్ డూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.

ఓటుకు నోటు కేసులో అమర్ సింగ్ అరెస్టు

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 6 :  ఓటుకు నోటు  కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ అరెస్టయ్యారు. తన ఆరోగ్యం సరిగా లేనందున కోర్టుకు హాజరు కావడం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన మంగళవారం ఉదయం కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. దాంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు. అమర్‌ సింగ్‌కు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీంతో అమర్‌ సింగ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బిజెపి మాజీ పార్లమెంటు సభ్యులు ఫగ్గన్ సింగ్ కులస్తే, మహవీర్ సింగ్ భంగోరా బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. వారిద్దరిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

Monday, September 5, 2011

గాయంతో వన్డే సిరీస్ నుంచి సచిన్ అవుట్

సౌతాంప్టన్ , సెప్టెంబర్ 5: ఇంగ్లాండుతో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి గాయాల కారణంగా ఒక్కొక్క భారత ఆటగాడే తప్పుకుంటున్నాడు. తాజాగా, సచిన్ టెండూల్కర్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా అతను వన్డే సిరీస్‌కు దూరమవుతున్నాడు. ఇప్పటికే కీలక ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. సచిన్ టెండూల్కర్కు  నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు. సిరీస్ నుంచి టెండూల్కర్ తప్పుకుంటున్న విషయాన్ని జట్టు మేనేజర్ శివలాల్ యాదవ్ ప్రకటించారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు జరిగే చాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 ఈవెంట్‌లో కూడా సచిన్ ఆడకపోవచ్చు. దీంతో సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం మరింత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల కారణంగా ఇప్పటి వరకు వీరేందర్ సెహ్వాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ ఇంగ్లాండుతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు స్థానాలు కల్పించారు.

గాలి జనార్ధన రెడ్డికి 19 వరకు రిమాండ్

హైదరాబాద్,సెప్టెంబర్ 5: : బిజెపి నేత, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) యజమాని గాలి జనార్ధన రెడ్డి, ఆ కంపెనీ సిఎండి శ్రీనివాసరెడ్డిలకు కోర్టు ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది. వారిని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. 15 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. బుధవారం  లోపల పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

కాంగ్రెస్ వీక్ నెస్ తిమోరీ కనిపెట్టేశాడు...!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5. "టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దీక్ష నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు తలొగ్గడం ద్వార  కాంగ్రెస్ ప్రతిష్ఠ దెబ్బ తిన్నదని,   బెదిరింపులకు తేలిగ్గా లొంగిపోయే బలహీనమైన పార్టీ గా కాంగ్రెస్‌ పై ముద్ర పడిందని  భారత్‌లో అప్పటి అమెరికా రాయబారి తిమోతీ రోమర్ అభిప్రాయ పడ్డారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణపై కేంద్రం ప్రకటన, అనంతర పరిణామాలపై రోమర్ తన మాతృదేశానికి ఆ మర్నాడే పంపిన రహస్య కేబుల్‌లో ఈ విషయాలున్నాయి. వికీలీక్స్ ఈ కేబుల్‌ను  బయటపెట్టింది. తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం.. ఆ పార్టీ నేతల మధ్య చీలికకు కారణమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయం..  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఘన విజయమన్నారు. "లోక్‌సభలో కేవలం రెండు, అసెంబ్లీలో ఆరు స్థానాలను మాత్రమే ప్రస్తుతం కలిగి ఉన్న టీఆర్ఎస్.. యూపీఏతో గొడవ పెట్టుకొని.. గెలవడం ఘన విజయమే'' అని వ్యాఖ్యానించారు. "ఓ ప్రాంతీయ నాయకుడి డిమాండ్లకు తేలిగ్గా తలొగ్గిన కాంగ్రెస్‌ను బలహీనమైన, వెన్నెముక లేని పార్టీగా మీడియా అభివర్ణిస్తోంది'' అని ఈ కేబుల్‌లో రోమర్ పేర్కొన్నారు.మరిన్ని ప్రత్యేకరాష్ట్ర డిమాండ్లను కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.  "2009 సెప్టెంబర్‌లో వైఎస్ మరణంతో ఎదురైన సంక్షోభం నుంచి బయటపడే దశలో  కాంగ్రెస్..  తెలంగాణ డిమాండ్‌ను ఆమోదించడం ద్వారా కొత్త రాష్ట్రాల తేనెతుట్టెను కదిలించిందని రోమర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వ్యాపార రంగంపై ఆధిపత్యం కలిగివున్న  రెండు బలమైన రజకీయ సామాజిక వర్గాలు.. హైదరాబాద్‌ను తెలంగాణ వారికి తేలికగా ఇచ్చే అవకాశం లేదని ఆయన  విశ్లేషించారు. 

'లీ' పెను తుపాను గుప్పెట్లో లూసియానా, మిసిసిపి

మియామీ, సెప్టెంబర్ 5:  పెను తుపాను 'లీ' అమెరికాలోని తీరప్రాంత రాష్ట్రాలను కుదిపేస్తోంది. కుండపోత వర్షాలతో ఆయా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఫలితంగా కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తవచ్చని అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, పెను తుపాను ఆదివారం ఉదయం లూసియానాలో తీరాన్ని తాకడంతో కుండపోత వర్షాలతో లూసియానా జలమయమైంది. లూసియానా, మిసిసిపిల్లోని చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. దీంతో, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ బాబీ జిందాల్ ప్రకటించారు. మిసిపిపిలోనూ అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు అక్కడి గవర్నర్ స్పష్టం చేశారు. తుపాను కారణంగా 60 శాతం చమురు ఉత్పత్తి, 55 శాతం సహజవాయువు ఉత్పత్తి నిలిచిపోయింది. తీర ప్రాంతంలోని డెస్టిన్, ఫ్లోరిడా, వెస్ట్‌వార్డ్ నుంచి సబీనా పాస్ వరకు, టెక్సాస్ల్లో తుపాను హెచ్చరికలు జారీ  చేశారు.

జయలలితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5:   అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. జయ అప్పీలుపై న్యాయస్థానం సందేహాలు వ్యక్తం చేసింది. బెంగళూరు ట్రయల్ కోర్టు ఎదుట ఆమె విచారణకు హాజరు కావల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. జయలలిత అక్రమాస్తుల కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విచారిస్తున్న విషయం  తెలిసిందే.

గాలి జనార్థన్‌రెడ్డి అరెస్ట్

హైదరాబాద్, సెప్టెంబర్ 5:  అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డిని సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఆయనతోపాటు ఓఎంసీ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గాలి జనార్థన్‌రెడ్డి అరెస్ట్ ను  సీబీఐ జే డీ ధ్రువీకరించారు. ఆయన్ని ప్రశ్నించేందుకు హైదరాబాద్ తీసుకువస్తున్నారు. మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి అరెస్ట్ పై కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ్ వ్యాఖ్యానించటానికి నిరాకరించారు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన అపరాధి అని చెప్పలేమన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి అరెస్ట్ పై సమాధానం చెప్పాల్సింది తాను కాదని, బీజేపీనే అడగాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు. '' గాలి జనార్థన్‌రెడ్డి వేరే పార్టీకి చెందిన వ్యక్తి. అతనికి సంబంధించి నన్ను ప్రశ్నించటం అనైతికం. ఇది మీడియాకు తగదు.... మీడియా ప్రతినిధులు విలువలు పాటించాలి. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చూడటం ఏ నైతికతకు నిదర్శనమని’'' ఆయన సూటిగా ప్రశ్నించారు.

Sunday, September 4, 2011

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఓనం ఉత్సవాలు జరుపుకుంటున్న కేరళ మహిళలు

Saturday, September 3, 2011

ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ ఇకలేరు

హైదరాబాద్,సెప్టెంబర్ 3:  ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ (91) శనివారం కన్నుమూశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితం కేర్ ఆస్పత్రిలో చేరారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హరిశ్చంద్రప్రసాద్ స్వస్థలం. 1921 జూలై 8న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన పిన్నవయసులోనే పారిశ్రామికవేత్త, రాజకీయవేత్తగా ఎదిగారు. 1947లో తణుకులో ఆంధ్రా షుగర్స్ స్థాపించారు. తణుకు పట్టణానికి తొలి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తణుకులో పాలిటెక్నిక్  కాలేజీ, కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాలతో పాటు జిల్లా, ఇతర ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేశారు.
:టి.టి.డి. పాలకమండలి నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కనుమూరి బాపిరాజు... 

Friday, September 2, 2011

బాబుగారి ఆస్తులు ఇవేనట...ఇంతేనట...

హైదరాబాద్ ,సెప్టెంబర్ 2:  తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తుల వివరాల్ని ప్రకటించారు. తన కుటుంబ ఆస్తులు 39 కోట్ల 88 లక్షల రూపాయలుగా చంద్రబాబు ప్రకటించారు. తాను వెల్లడించిన ఆస్తులు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయని నిరూపిస్తే వాటిని వారికే అందజేస్తానని ఆయన అన్నారు.
ఆస్తుల వివరాలు
* పంజగుట్టలో 650 గజాల భవనం
* లోకేష్ పేరున ఆస్తులు 6 కోట్ల 73 లక్షలు
* మహారాష్ట్రలో లోకేష్ పేరున 12 ఎకరాల భూమి
* తమిళనాడులో 2.3 ఎకరాల ఎస్టేట్
* లిస్టెడ్ కంపెనీల్లో 2.52 కోట్ల ఆస్తులు
* ఇంటి విలువ 38 లక్షలు
* బ్రహ్మణి ఆస్తులు 3 కోట్ల 22 లక్షలు
* భువనేశ్వరి ఖాతాలో పీఎఫ్ డబ్బు 65 లక్షల 44 వేల రూపాయలు
* మదీనాగూడలో 5 ఎకరాల భూమి
* 26.96 లక్షల విలువైన బంగారం
అప్పుల వివరాలు
* భువనేశ్వరి అప్పులు: 12 కోట్ల 39 లక్షలు
* ఇల్లు -విజయబ్యాంకులో తాకట్టు
* ఎస్టేట్ యూకో బ్యాంక్‌లో తాకట్టు

ప్రముఖ పాత్రికేయులు నండూరి రామ్మోహన్‌రావు మృతి

విజయవాడ,సెప్టెంబర్ 2: ప్రముఖ పాత్రికేయులు నండూరి రామ్మోహన్‌రావు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొద్దికాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మంచి రచయితగా, సంపాదకుడిగా నండూరి సుప్రసిద్ధులు. విశ్వరూపం, విశ్వదర్శనం, నరావతారం, భారతీయ చింతన ఆయన సుప్రసిద్ధ రచనలు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికలకు ఆయన సంపాదకులుగా సేవలందించారు. నండూరి రామ్మోహన్‌రావు మృతికి పలువురు ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం ప్రకటించారు.  విశ్వరూపం, విశ్వదర్శనం ద్వారా సామాన్య ప్రజలకు  సైన్సు సంగతులు పరిచయం చేశారు.  ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేన్ నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
జీవిత  విశేషాలు...
నండూరి రామమోహనరావు 1927 మార్చి 24వ తేదీన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో జన్మించారు. నూజివీడు, మచిలీపట్నంలో చదివారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే 'విజ్ఞానం' అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆయన జర్నలిస్టు జీవితం 'ఆంధ్రపత్రిక'లో ప్రారంభమైంది. 1948 నుంచి 1960 వరకు ఆయన 'ఆంధ్ర పత్రిక'లో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో 'ఆంధ్రజ్యోతి'లో అడుగు పెట్టారు. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980లో నండూరి రామమోహనరావు 'ఆంధ్రజ్యోతి' సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. 1960 నుంచి 1994 దాకా... అంటే 34 సంవత్సరాల కాలం ఆయన 'ఆంధ్రజ్యోతి'లో అక్షర యాత్ర చేశారు. ఆయన ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. ఆయన 1962, 1978, 1984, 1992లలో అమెరికాలోను, 1982లో రష్యాలో పర్యటించారు. ' బాపు - రమణలు నండూరిని 'అనువాద హనుమంతుడు' అని కొనియాడారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచనలను అచ్చ తెలుగులో, అందరికీ నచ్చేలా, తనదైన ప్రత్యేక శైలిలో అనువదించడమే దీనికి కారణం. మార్క్త్వేన్  రచించిన టామ్ సేయర్, హకిల్ బెరిఫిన్‌ లను అవే పేర్లతో అనువదించారు. మార్క్త్వేన్ మరో రెండు రచనలను రాజు - పేద, విచిత్ర వ్యక్తి పేరిట అనువదించారు. అలాగే... కాంచన ద్వీపం (రాబర్ట్ స్టీవెన్‌సన్) అనే మరో అనువాద రచన కూడా చేశారు. 61 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ పుస్తకాలకు ఆదరణ ఉండడం విశేషం. నండూరి ఖగోళ, భౌతిక శాస్త్రాలను పరిశోధించి 'విశ్వరూపం' అనే పుస్తకం రచించారు. మానవాళి పరిణామ క్రమానికి సంబంధించిన నరావతారం, తత్త్వశాస్త్రాన్ని సులువుగా వివరించే 'విశ్వ దర్శనం' ఆయన కలం నుంచి జాలువారినవే. నండూరి.. సవ్యసాచి పేరుతో రాజకీయ వ్యంగ్య రచనలు, హరివిల్లు పేరుతో బాల గేయాలు, ఉషస్విని పేరిట కవితలు రచించారు. కథా గేయ సుధానిధి  కూడా ఆయన రచనే. మిత్రలాభం, మిత్ర భేదం (పంచతంత్ర కథలు) పేరిట బాపు వేసిన బొమ్మలకు నండూరి మాటలను అందించారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మతో కలిసి 'మహా సంకల్పం' అనే సంకలనాన్ని వెలువరించారు. సంపాదకీయాల సంకలనం అను పల్లవి, చిరంజీవులు, వ్యాఖ్యావళి ఆయన ఇతర రచనలు.  నండూరి రామమోహనరావుకు అనేకమంది ప్రముఖ పాత్రికేయులు, రచయితలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రపత్రికలో పని చేస్తున్నపుడు వారపత్రికకు సంబంధించి కొడవటిగంటి కుటుంబరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, తెన్నేటి సూరి, పిలకాగణపతిశాస్త్రి వంటి హేమాహేమీలతో సాహిత్యంపై చర్చించేవారు. ఆంధ్రపత్రిక వీక్లీలో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించాలని సంకల్పించినప్పుడు... అనువాద బాధ్యతలను నండూరికే అప్పగించారు. 

Thursday, September 1, 2011

అక్కినేని పై వాణిశ్రీ సంచలన వ్యాఖ్యలు

విజయవాడ,సెప్టెంబర్ 1 : అలనాటి ప్రముఖ నటి వాణిశ్రీ అక్కినేని నాగేశ్వరావు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవదాసు చిత్రంలో సావిత్రి నటించక పోతే, ప్రేమ నగర్ లో  నేను నటించకపోతే...అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత రామానాయుడు ఎక్కడ ఉండేవారని ఆమె ప్రశ్నించారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళా పీఠం విజయవాడలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన సావిత్రి కాంస్య విగ్రహాన్ని వాణిశ్రీ  ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఐదేళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల్నే ఎవరూ గుర్తుంచుకోరని, అలాంటిది ఒక సినీ నటిని గుర్తు పెట్టుకుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చిత్ర పరిశ్రమ ప్రత్యేకత అన్నారు. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో పద్మశ్రీలు, పద్మ భూషణ్ అవార్డులను కొనుక్కుంటున్నారని, అలా కొనుక్కోక పోవడం వల్లనే సావిత్రి, ఎస్వీ రంగారావు లాంటి వారికి ఆ అవార్డులు రాలేదని ఆమె వ్యాఖ్యానించారు.

యు.ఎస్.లో సల్మాన్ కు సర్జరీ...

ముంబై,సెప్టెంబర్ 1 : ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధితో గత కొద్దికాలంగా బాధ పడుతున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌కు అమెరికా ఆస్పత్రిలో సర్జరీ నిర్వహించారు. సర్జరీ కోసం ఆగస్టు 29 తేదిన సల్మాన్ యూఎస్ వెళ్లారు.సల్మాన్‌కు పదిహేను రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు వెల్లడించారు. సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత మరోసారి పరీక్షలు జరుపుతామన్నారు. సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత ‘ఏక్ థా టైగర్’ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు సల్లూభాయ్ దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...