Friday, November 30, 2012

మాజీ ప్రధాని గుజ్రాల్ కన్నుమూత

న్యూఢిల్లీ, నవంబర్ 30: : మాజీ ప్రధాన మంత్రి ఇంద్రకుమార్ గుజ్రాల్(93)  శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు.    గుజ్రాల్ సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా పనిచేశారు.  ఇందిరా గాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా, విపి సింగ్, దేవగౌడ్ ప్రభుత్వాలలో విదేశాంగ మంత్రిగా  ఉన్నారు. 1997-98 మధ్య కాలంలో  గుజ్రాల్ 12వ ప్రధాన మంత్రిగా పని చేశారు. రాజ్యసభ నుండి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో గుజ్రాల్ రెండోవారు. ఆయన కంటే ముందు హెచ్‌డి దేవేగౌడ రాజ్యసభ నుండి ప్రధాని గా పని చేశారు.

Wednesday, November 28, 2012

జగన్ బెయిల్ పిటిషన్‌ తిరస్కృతి...

హైదరాబాద్, నవంబర్ 28: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను  నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం  తిరస్కరించింది. జగన్ పన్నెండు రోజుల క్రితం స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్న, అరెస్టు అక్రమం కాదన్న సిబిఐ వాదనతో ఏకీభవించి ఆయన బెయిల్‌ను తిరస్కరించింది. జగన్ కేసులో తాము సుప్రీం ఆదేశాలను పాటించామని తెలిపింది. అనంతరం మరో బెయిల్ పిటిషన్ పైన తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
    

Tuesday, November 27, 2012

తొలివిడతగా 29 ప్రభుత్వ పథకాలకు నగదు బదిలీ

న్యూఢిల్లీ,నవంబర్ 27: జనవరి నుంచి  దేశంలో 16 రాష్ట్రాల్లోని   51 జిల్లాల్లో అమల్లోకి తీసుకురానున్న ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ని తొలివిడతగా 29 ప్రభుత్వ పథకాలకు వర్తింపచేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ మంగళవారం వెల్లడించారు.  రూ.3,20,000 కోట్ల నగదు బదిలీ బృహత్ పథకాన్ని 2013 చివరకల్లా దశలవారీగా దేశమంతా అమల్లోకి తీసుకొస్తామన్నారు. సంక్లిష్టమైన ఆహారం, ఎరువుల సబ్సిడీ మొత్తాలను మినహాయించి తేలిగ్గా అమలుచేయదగ్గ వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన 29 పథకాలను మొదటగా నగదు బదిలీ పరిధిలోకి తీసుకొచ్చినట్టు, వీటన్నింటి లబ్ధిదారులకు ఆధార్ కార్డు ఆధారంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తామని  తెలిపారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, మహిళా, శిశు సంక్షేమ పథకాల ఫలాలను నగదు రూపంలో ప్రతి నెలా సరైన సమయానికి లబ్ధిదారులకు అందేవిధంగా చూడటమే ఈ నగదు బదిలీ విధానం అమల్లోని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.ఎల్‌పీజీ సబ్సిడీని కూడా ఇదే తరహాలో మున్ముందు అందజేస్తామన్నారు.తొలుతగా నగదు బదిలీని వర్తిం పచేస్తున్న పథకాల్లో మానవ వనరుల అభివద్ధి శాఖ, సామాజిక న్యాయం, సాధికారత శాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖలున్నాయని  అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని  హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ఈ పధకం అమలు జరుగుతుందని జైరాం రమేశ్ తెలిపారు.

Sunday, November 25, 2012

కిరణ్ దూకుడు... 2014 టార్గెట్‌గా కొత్త పధకాలు


హైదరాబాద్, నవంబర్ 25:  సిఎంగా  పదవీ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులు తనకు  అనుకూలంగా  ఉండడంతో మెల్లిగా  దూకుడు పెంచుతున్నారు.   2014 ఎన్నికలు లక్ష్యంగా  పలు కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. ఇదే  సమయంలో పార్టీలోని ఇతర నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆయన పడ్డట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ  తమను సంప్రదించడం లేదని పలువురు మంత్రులు పలు సందర్భాలలో తమ అసంతృప్తిని బయట పెట్టారు. కానీ ఇప్పుడు ఆయన మంత్రులను కలుపుకొని వెళుతున్నారని  చెబుతున్నారు. అలాగే  మార్పు ఉంటుందని భావించి ఇన్నాళ్లూ ప్రత్యర్థలు కిరణ్‌ను టార్గెట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది లేదని తేలడంతో ఆయనతో కలిసి వెళ్లేందుకు కొందరు సిద్ధపడుతున్నట్టు సమాచారం.   ఆదివారం మెట్రో రైలు ప్రాజెక్టు పిల్లర్లకు  దిమ్మెలు అమర్చే కార్యక్రమం లో పాల్గొన్న కిరణ్  జగన్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు.  పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు.  శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. 100రూపాయలతో ఇందిరమ్మ అమృత హస్తం  పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రెండు లక్షల మంది గర్భిణీలకు, లక్ష మంది పిల్ల తల్లులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 120 కోట్లతో రాజీవ్ విద్యా దీవెన ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా 9, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల నుండి 150 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించారు.  228 ఎస్సీ, ఎస్టీ టీచర్ పోస్టుల భర్తీ, 69 ఉద్యోగాలతో మైనార్టీలకు ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Saturday, November 24, 2012

రాజకీయ రంగం పై ' ఆమ్ ఆద్మీ'

 పార్టీ పేరు ప్రకటంచిన అర్వింద్ కేజ్రీవాల్ 


న్యూఢిల్లీ, నవంబర్ 24: : సామాజిక కార్యకర్త అర్వింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన రాజకీయ పార్టీ పేరును  ఆమ్ ఆద్మీగా  ప్రకటించారు.తమ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతుందని ఆయన తన  చెప్పారు. "నేను ఆమ్ ఆద్మీని. నేను స్వరాజ్ తెస్తాను. నేను లోక్‌పాల్ బిల్లు రూపొందిస్తాను" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ నెల 26వ తేదీ సోమవారంనాడు తనతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కలవాలని ఆయన ప్రజలను కోరారు. ఆ రోజు సభ్యులుగా చేరే వారంతా పార్టీ వ్యవస్థాపక సభ్యులవుతారని ఆయన అన్నారు.  అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడి సామాన్యుడి చేతిలో ప్రజాస్వామ్య శక్తిని పెడతామని కేజ్రీవాల్ అన్నారు.పార్టీలో మహిళలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పార్టీకి అధిష్టానమంటూ ఏదీ ఉండదని తెలిపారు.  అత్యంత ప్రగతిశీలమైన భారత రాజ్యాంగ స్ఫూర్తితో పార్టీ పనిచేస్తుందన్నరు. పార్టీని నడిపించడానికి 30 మందితో జాతీయ కార్యవర్గం  పని చేస్తుందన్నారు.


 

Friday, November 23, 2012

జగన్ రిమాండ్ వచ్చే 5 వరకు పొడిగింపు...

హైదరాబాద్,నవంబర్ 22: అక్రమాస్తుల కేసులో నిందితుడైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్‌ను సిబిఐ కోర్టు వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించింది.
 వివిధ కేసుల్లో నిందితులైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రిమాండ్‌ను కూడా కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు వారి రిమాండ్‌ను వచ్చే నెల 5వ తేదీ వరకు పొడగించింది.జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎమ్మార్ ప్రాఫర్టీస్ అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు ప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి బిపీ ఆచార్య గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. అలాగే జగతి పబ్లికేషన్స్ వైస్ ఛైర్మన్ విజయసాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు.వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వివిధ కేసుల్లో నిందితులైన విఐపి ఖైదీలంతా చంచల్‌గుడా జైలులోనే ఉన్నారు. వైయస్ జగన్‌ను సిబిఐ మే 27వ తేదీన అరెస్టు చేసింది. ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది.

Wednesday, November 21, 2012

ఒబామ కొలువులో భారత సంతతి మహిళ...

వాషింగ్టన్ ,నవంబర్ 21:  ఒబామా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన విశాఖ ఎన్ దేశాయ్ కి చోటు దక్కింది. నేషనల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సర్వీసెస్ బోర్డు సభ్యురాలిగా విశాఖ దేశాయ్ సేవలందించనున్నారు. దేశాయ్ బాంబే యూనివర్సిటిలో  చదువుకున్నారు. తన పరిపాలన యంత్రాంగంలో దేశాయ్ కి చోటు కల్పించడం పట్ల తనకు చాలా గర్వంగా ఉందని ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని ఆసియా సొసైటీకి దేశాయ్ అధ్యక్షురాలిగా పనిచేశారు.
 
 

అఫ్జల్ గురూ కు త్వరలో ఉరి...


క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన  రాష్ట్రపతి 

న్యూఢిల్లీ,నవంబర్ 21:  2001లో పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం తిరస్కరించారు. అఫ్జల్ గురుతో పాటు మరో ఆరుగురికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు. అఫ్జల్‌తో పాటు క్షమాభిక్ష తిరస్కరించబడిన ఆరుగురిలో ముంబయి, కోల్‌కతాకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడంతో అఫ్జల్ గురుకు కూడా త్వరలో ఉరిశిక్ష అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫ్జల్ గురుకు క్షమాభిక్షను తిరస్కరిస్తూ హోంశాఖకు రాష్ట్రపతి ఫైల్‌ను పంపారు.


 

Tuesday, November 20, 2012

అమెరికా రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర మహిళ దుర్మరణం...

కాలిఫోర్నియా,నవంబర్ 20:  అమెరికాలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా టెక్కీ మృత్యువాత పడింది. కాలిఫోర్నియాలోని సన్నీవేల్ నగంరోలి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గొర్ల లలిత అలియాస్ మాగంటి లలిత (32) దుర్మరణం పాలైంది. ఆమె భర్త వీరాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు.  వీరాంజనేయులు కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఎరిక్సన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు. వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం కాగా, శశి (10), భువనేష్ (5) ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనేష్ ఏలూరులోని అమ్మమ్మ ఇంటి వద్ద, శశి  అమెరికాలోనే తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. కారులో వెళ్తున్న లలిత, ఆమె భర్త ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్రలైటు పడి ఆగిపోయారు. వెనక నుంచి వచ్చిన వాహనం వీరి కారును ఢీకొట్టింది. లలిత అక్కడికక్కడే మరణించింది.  లలిత పుట్టిల్లు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు. కాకినాడ జెఎన్‌టియులో ఎంటెక్ పూర్తి చేసింది. పెస్లా మోటార్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. 
 

ఎట్టకేలకు కసబ్ ఖతం...

పూణే, నవంబర్ 20: : ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ ను బుధవారం ఉదయం పూణే సమీపంలోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. కసబ్ కు బుధవారం ఉదయం 7 గంటల 36 నిమిషాలకు ఉరిశిక్షను అమలు చేశామని మహారాష్ట్ర హోంశాఖ అధికారులు ధృవీకరించారు. 2008 నవంబర్ 26 తేదిన ముంబైలో మారణహోమం సృష్టించిన సంఘటనలో కసబ్ కీలక సూత్రధారి. ముంబై పేలుళ్ల తర్వాత కసబ్ పట్టుబడ్డాడు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు కసబ్‌కు ఉరిశిక్ష అమలైంది. కసబ్‌ను 2008 నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ సెల్‌లో ఉంచారు. హైకోర్టు 2010 అక్టోబర్ 10వ తేదీన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కసబ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఉరిశిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.పాతికేళ్ల కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ కింది కోర్టు 2010 మే 6వ తేదీన తీర్పు ఇచ్చింది. ఎస్సై తుకారాం కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్న 18 నెలల తర్వాత ఈ తీర్పు వెలువడింది. మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కసబ్ మెర్సీ పిటిషన్‌ను సెప్టెంబర్‌లో తిరస్కరించి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చాలని సిఫార్సు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అక్టోబర్‌లో కోరింది.
 

Monday, November 19, 2012

వీసా మరింత వీజీ...ట...!

హైదరాబాద్, నవంబర్ 19: : నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవసరం లేకుండా అమెరికాకు వీసా పొందేందుకు వీలుగా ప్రారంభించిన ‘ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రాం’(ఐడబ్ల్యూపీ)ను మరింత విస్తృతం చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం  వెల్లడించింది.  ఈ ప్రక్రియలో బిజినెస్/టూరిజం (బీ1, బీ2), డిపెండెంట్ (జే2, హెచ్4, ఎల్2), ట్రాన్సిట్ (సి), క్రూ మెంబర్ (డి)-ఇన్‌క్లూడింగ్ సీ1/డి, ఏడేళ్ల లోపు పిల్లలలకు ఏ కేటగిరీ వీసా అయినను దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే వీసా రెన్యువల్ చేసుకోవాలనుకునేవారు, 48 నెలల కిందటే వీసా గడువు ముగి సిపోయిన వివిధ కేటగిరీల వారు ప్రస్తుత కొత్త విధానం కింద దరఖాస్తు చేసుకోవచ్చని
సూచించింది.కొత్త వెబ్‌సైట్  (www.ustraveldocs. com/ in) ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చని కాన్సులేట్ సూచించింది.
 

చావు చూసిన ' ఛాత్ '...

పాట్నా, నవంబర్ 19:   బీహార్ రాజధాని పాట్నాలో గంగా ఘాట్ వద్ద ఛాత్ ఉత్సవ  సంబరాల్లో   జరిగిన తొక్కిసలాటలో కనీసం 15 మంది మరణించినట్లు సమాచారం. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి వేలాది మంది భక్తులు అక్కడ గుమికూడారు. వారిలో చాలా మంది మహిళలే. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలడం వల్ల ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. ఆ వంతెనను వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. బరువుకు తాళలేక అది కూలిపోయి తొక్కిసలాట సంభవించింది. మృతుల్లో 8 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
 

తొలిటెస్ట్ గెలిచాం...

ఆహ్మదాబాద్, నవంబర్ 19:  ఇంగ్లాండ్ తో ఆహ్మదాబాద్ లో జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.  5 వికెట్ల నష్టానికి 340 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదవ రోజు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 406 పరుగులకు ఆలౌటైంది.ఆతర్వాత 77 పరుగుల విజయలక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ను సెహ్వాగ్, పుజారాలు ధాటిగానే ఆరంభించారు. 25 పరుగులు చేసిన సెహ్వగ్ భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద పీటర్సన్ కు దొరికాడు. ఆతర్వాత పుజారాకు జత కలిసిన కోహ్లీ జట్టును విజయపథం వైపు నడిపించారు.  తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ (206) సాధించిన పుజారా రెండవ ఇన్నింగ్స్ లోనూ రాణించి 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సెహ్వగ్ 25 పరుగులు చేయగా, కోహ్లీ 11 పరుగులతో క్రీజులో నిలిచారు.
 

Sunday, November 18, 2012

సవిత మృతిపై ఐర్లాండ్ దర్యాప్తు...

లండన్, నవంబర్ 18: : అబార్షన్ హక్కుపై తమ దేశం ఇప్పటికిప్పుడు హడావుడిగా నిర్ణయం తీసుకోబోదని ఐర్లాండ్ స్పష్టం చేసింది. భారత దంతవైద్యురాలు సవితా హాలప్పనావర్(31) విషాద మృతిపై దర్యాప్తునకు స్వతంత్ర వైద్య నిపుణుడు సహకరిస్తారని హామీ ఇచ్చింది. కేథలిక్ దేశం కావడంతో.. సవితకు ఐర్లాండ్‌లో గర్భస్రావం చేసేందుకు వైద్యులు నిరాకరించడంతో రక్తం విషతుల్యమై ఆమె  మరణించడం తెలిసిందే. ఈ ఉదంతంపై ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ స్పందిస్తూ,  సవిత మృతిపై నిపుణుల నివేదిక కోసం ఎదురు చూస్తున్నానని, అయితే అబార్షన్ హక్కుపై ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి హడావుడిగా నిర్ణయం తీసుకోబోమన్నారు. ఇలా ఉండగా, భారత దంతవైద్యురాలు సవితా హాలప్పనావర్  విషాద మృతిపై ఐర్లాండ్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేశారు. గర్భస్రావ చట్టాలను మార్చాలని  వారు డిమాండ్ చేస్తున్నారు.

Saturday, November 17, 2012

మమత ' అవిశ్వాస ' అస్త్రం...

కోల్‌కత్తా,నవంబర్ 17: కేంద్రంలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంపై తమ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆమె శనివారం చెప్పారు. యుపిఎ ప్రభుత్వం మైనారిటీలో పడిందని,  మైనారిటీ యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తమ పార్లమెమంటరీ పార్టీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆమె చెప్పారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి.తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆమె ప్రతిపక్షాలను కోరారు. యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం నుంచి తృణమూల్ కాంగ్రెసు తప్పుకున్న విషయం తెలిసిందే. 

పెద్ద దిక్కు కోల్పోయిన మరాఠీలు...

శివసేన అధినేత బాల్ థాకరే కన్నుమూత
ముంబై, నవంబర్ 17 :  దాదాపు 50 ఏళ్ల పాటు  మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన అధినేత బాల్ థాకరే కన్ను మూశారు.ఈ ఏడాది జులై నుంచి ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.థాకరే శివసేనను 1966లో స్థాపించారు. అయితే శివసేన పార్టీ తీవ్ర విమర్శలకు గురువుతూ వచ్చింది. హింసాత్మక చర్యలకు దిగుతోందంటూ, ద్వేషాన్ని రగిలిస్తోందంటూ ఆయన పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. మరాఠీ కార్డును వాడడం ద్వారా బలమైన వోటు బ్యాంకును ఆయన సృష్టించుకున్నారు. ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో 1973లో శివసేన తన సత్తా చాటింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ముంబై పరిసరాల్లోని నగరాలకు కూడా పార్టీ విస్తరించింది.మతతత్వ ఎజెండాతో సంఘ్ పరివార్ 1980 చివరలో, 1990 ప్రారంభంలో ముందుకు వచ్చింది. దాంతో థాకరే దాన్ని అందిపుచ్చుకున్నారు. హిందూత్వ ఎజెండాను స్వీకరించిన బాల్ థాకరే బిజెపితో కలిసి 1995 శాసనసభ ఎన్నికల్లో శివసేన విజయం సాధించింది. అయితే, 1999 ఎన్నికల్లో రెండు పార్టీల కూటమి ఓడిపోయింది. రాజ్ థాకరే పార్టీని చీల్చడంతో శివసేన 2006 లో   బలహీనపడింది. నవనిర్మాణ సేన పేర రాజ్ థాకరే ఏర్పాటు చేసిన సంస్థ శివసేన ఓటు బ్యాంకుకు గండి కొట్టింది.  అక్టోబర్ 24వ తేదీన జరిగిన దసరా సంబరాల్లో తాను ప్రజా జీవితం నుంచి వైదొలుగుతున్నట్లు థాకరే ప్రకటించారు.ఆయన కుమారుడు  ఉద్ధవ్ థాకరే శివసేన ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉన్నారు. శివసేన అధినేత బాల్ థాకరే మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఓ సంచలన రాజకీయవేత్త. మరాఠీల ఆత్మగౌరవ నినాదంతో, మరాఠీల హక్కుల పోరాటంతో ఆయన తన ప్రాంతీయ రాజకీయాలను నడిపించారు. హిందూత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయనను శినసైనికులు దాదాపుగా దేవుడిలాగా ఆరాధిస్తారు. ఆయన ఉద్రేక ప్రసంగాలు అనేక మంది అభిమానులను తయారు చేశాయి.  రాజకీయాల్లో ఆయన కింగ్ కాలేకపోయారు గానీ కింగ్ మేకర్ అయ్యారు. కొంత మందికి మహారాష్ట్ర టైగర్ సాంస్కృతిక యోధుడు కూడా. తన సైగలతో థాకరే దేశ వ్యాపార రాజధాని ముంబైని శాసించారని అంటారు. 

 

Friday, November 16, 2012

టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్

తిరుమల, నవంబర్ 6:  తిరుమల తిరుపతి దేవస్థానం  ఆస్థాన విద్వాంసుడిగా ప్రముఖ సంగీత కళాకారుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ ను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది.  గోవిందరాజు స్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు చేపట్టాలని,  31 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని టీటీడీ విద్యాసంస్థలను ఆధునీకరించాలని  కూడా నిర్ణయించింది. యాత్రికుల సౌకర్యార్థం 70 కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ నుంచి 145 ఎకరాలు కొనుగోలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో 198 ఏకోపాధ్యాయ పాఠశాలలకు నెలకు 99 వేల రూపాయలను భృతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
  

సారీ చెప్పిన కోదండరాం

హైదరాబాద్, నవంబర్ 16: మంత్రి గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. దళితులను కించపరచాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. ఉపన్యాసంలో తప్పులు దొర్లాయన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నామని అన్నారు. కాగా ,
 మంత్రి గీతా రెడ్డిపై కోదండరామ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ విద్యార్థి సమాఖ్యలు శుక్రవారం తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్  కోదండరామ్ ఇంటి వద్ద   ఆందోళనకు దిగాయి.  గీతారెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.  పరిస్థితి  ఉద్రిక్తంగా మారడంతో  పోలీసులు పలువురు దళిత సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను  కోదండరాం పైఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది. తెలంగాణాకోసం మంత్రి గీతా రెడ్డి కదలి రావడంలేదని ఆక్షేపించడంలో భాగంగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడంతో వివాదం చెలరేగింది. 
 

Thursday, November 15, 2012

శబరిమల అయ్యప్ప యాత్ర ప్రారంభం...

శబరిమల కేరళ,నవంబర్ 15: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప యాత్ర  శుక్రవారం ప్రారంభమయింది.  మలయాళం క్యాలెండర్ ప్రకారం ప్రతినెలా మొదట్లో కొద్ది రోజులపాటు ఆలయాన్ని తెరిచినప్పటికీ నవంబర్ నుంచి జనవరి వరకు నిర్వహించే పూజలకు  విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతిఏటా వృశ్చికమాసం మొదటి రోజున శబరిమల యాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఈ ఏడాది నవంబర్ 16న వచ్చింది.  శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 41 రోజుల మండలపూజ డిసెంబర్ 26న ముగుస్తుంది. అనంతరం మకరవిళక్కు మొదలై వచ్చే ఏడాది జనవరి 14న జ్యోతి దర్శనంతో భక్తులు దివ్యానుభూతి చెందుతారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అయ్యప్ప మాల ధరించి 41 రోజుల దీక్ష చేస్తారు. అనంతరం స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్తారు.
 

కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణశర్మ మృతి

విజయవాడ,నవంబర్ 15: :కూచిపూడి నాట్యాచార్యులు, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ(77) గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఐదు రోజుల క్రితం కండరాల సంబంధిత చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.   భామాకలాపంలో సత్యభామగా... ఉషాపరిణయంలో ఉష... మోహినీ రుక్మాంగదలో మోహిని... క్షీరసాగర మథనంలో మోహిని.. విప్రనారాయణలో దేవదేవిగా చక్కటి అభినయంతో పలువురి మన్ననలు అందుకున్నారు. తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ఆయన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు.
 

కిరణ్, బొత్సలను మార్చం : అజాద్

న్యూఢిల్లీ, నవంబర్ 15:  ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులను మార్చబోమని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ స్పష్టం చేశారు. కిరణ్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. ఢిల్లీ వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అసదుద్దీన్ తనతో అన్నారని ఆజాద్ తెలిపారు. తమది సెక్యులర్ పార్టీ అని ఆజాద్ చెప్పారు.

రాహుల్ నాయకత్వంలో ఎన్నికల సమన్వయ కమిటీ

న్యూఢిల్లీ, నవంబర్ 15:  రాహుల్ గాంధీ నేతృత్వంలో 2014 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా రాహుల్ నాయకత్వంలో ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో అహ్మద్ పటేల్, మధుసూదన్ మిస్త్రీ, అహ్మద్ పటేల్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ సభ్యులుగా ఉంటారు.ఎన్నికల కోసం మరో రెండు సబ్ కమిటీలను పార్టీ నియమించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది తెలిపారు. ఎన్నికలకు ముందే పొత్తుల ఖరారు కోసం ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఓ సబ్ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచార, ప్రచార సబ్ కమిటీకి దిగ్విజయ్ సింగ్ సారథ్యం వహిస్తారని వెల్లడించారు.

Wednesday, November 14, 2012

బుధవారం  ఢిల్లీలో ప్రధాని మన్ మోహన్ తో సమావెశమైన మియన్మార్ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ చెయిర్ పర్సన్ ఆంగ్ సాన్ సూ కీ...

నెహూ జయంతి సందర్భం గా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఢిల్లీలో నెహ్రూ సమాధి వద్ద   రంగుల బెలూన్లు వదులుతున్న రాష్ట్రపతి, ప్రధాని తదితరులు...
 

ఎంఐఎం పై కాంగ్రెస్ ఎదురుదాడి

హైదరాబాద్, నవంబర్ 14: ఎంఐఎం పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది.  కాంగ్రెస్ మతతత్వ పార్టీ అని ఎంఐఎం ఆరోపించడం బాధాకరమని, ఎంఐఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని  కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స, షబ్బీర్‌ అలీ అన్నారు. కాంగ్రెస్ ఒక్కటే సెక్యూలర్ అని ఎంఐఎం నేత అసదుద్దీన్ చాలా సందర్భాల్లో చెప్పారని, పార్లమెంట్‌లో కూడా అసదుద్దీన్ అంగీకరించారని బొత్స, షబ్బీర్‌ అలీ అన్నారు. ఇన్నేళ్లుగా కాంగ్రెస్‌లో కనిపించని మతతత్వం ఇప్పుడే కనిపించిందా అని ప్రశ్నించారు.మతసామరస్యాన్ని కాపాడటమే తప్పా అని అన్నారు. ఎంఐఎం వైఖరిలో మార్పుకోసం  నిరీక్షించలేమని, కాంగ్రెస్‌ విధానాలు, సిద్ధాంతాలు నచ్చినవారితోనే తాము కలిసి ఉంటామన్నారు. 2014 వరకు రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని బొత్స, షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.  
 చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ అంశం చాలా సున్నితమైంది, చాలా చిన్నదని, దానిపై రాద్ధాంతం చేయడం ఎంఐఎంకు సరికాదని అన్నారు.
 

Monday, November 12, 2012

స్వాతంత్ర్య యోధుడు మూర్తి రాజు మృతి...

ఏలూరు, నవంబర్ 12: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు(96) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. వరప్రసాదమూర్తి రాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా చిననెండ్రకొలను. 36 ఏళ్లపాటు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. తన 1,800 ఎకరాల భూమిని పేదలకు పంచారు. రాష్ట్రవ్యాప్తంగా 56 విద్యాసంస్థలు స్థాపించారు. తణుకు స్కూలులో చదువుతున్న రోజుల్లోనే విద్యార్ధి కార్యదర్శిగా ఉండి స్వదేశీ దుస్తులు ధరించి, ఖద్దరు టోపీ ధరించి స్కూలుకి వెళ్ళేవారు. ఎంతో క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకున్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, జయప్రకాశ్ వంటి నాయకుల ఉపన్యాసాలకు ఉత్తేజితులై చైతన్యబాటను ఎన్నుకొన్నారు.1942 లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బలపరుస్తూ ఉద్యమ కార్యకర్తలకు చేదోడు వాదోడై నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా బోర్డు సభ్యునిగా పోటీలేకుండా ఎన్నికైయ్యారు.  1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎన్నికయ్యారు.1961 లో అఖిల భారత సర్వోదయ సమ్మేళనాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు లో  ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ, ఆర్యనాయకం చౌదరి, శంకర్ రావ్ దేవ్ వంటి నాయకులు ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.  హరిజనులకోసం కాలనీలను, పేదలకోసం ఇళ్లను, బాటసారుల కోసం విశ్రాంతి గృహాలను, భూదాన యజ్ఞానికి అనేక ఎకరాలను, అనేక విద్యాసంస్థలకు స్థల భవనాలను దానం చేశారు. తన తండ్రి పేరిట చింతలపాటి బాపిరాజు ధర్మసంస్థను స్థాపించి ఉన్నత ఓరియంటల్, ప్రాధమిక, జూనియర్, డిగ్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో 68 విద్యాసంస్థలను స్థాపించారు. భారతీయ కళా పరిషత్తును స్థాపించి కళాత్మకమైన సేవలను అందించారు. కొల్లేరు ప్రాంత రైతంగానికి సేవలందించారు.వీరు చిననిండ్రకొలను లో గాంధీజీ స్మారక భవనాన్ని నిర్మించారు. 1964 లో ఫిన్ లాండ్ ప్రపంచ శాంతి మహాసభలకు భారత ప్రతినిధిగా వెళ్ళారు. 1971 లో మార్కెటింగ్ శాఖామాత్యులుగా, 1972 లో దేవాదాయ శాఖామంత్రిగా, దేశీయ వైద్య శాఖా మంత్రిగా సేవలందించారు.  
 

అదుపులోకి రాని పాతబస్తీ...

హైదరాబాద్, నవంబర్ 12:  భాగ్యలక్ష్మి ఆలయ వివాదంతో పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుతులు ఇంకా కొనసాగుతున్నాయి.  భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో ఎంఐఎం, ప్రభుత్వం తీరును ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ, హిందూ ధార్మిక సంస్థలు  సోమవారం  నిర్వహించిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.   ర్యాలీలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఆలయం విషయమై మజ్లిస్ ఎమ్మెల్యేలు ఆదివారం చార్మినార్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేసిన  విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా చేపట్టిన భాగ్యలక్ష్మి దేవాలయం ముస్తాబు పనుల్లను  ఎంఐఎం అడ్డుకోవడమే గాక, న్యాయస్థానాన్ని ఆశ్రయించి పనులు జరగకుండా చూడాలనుకున్నారని, అయితే న్యాయస్థానం పూర్వ స్థితి కొనసాగించుకునేందుకు దేవాలయానికి అనుమతి ఇచ్చిందని, ఆ ఉత్తర్వులను అమలుచేయమని కోరితే కూడా పోలీసులు ముందుకు రావడం లేదని  బి.జె.పి. నేత కిషన్‌రెడ్డి ఆరొపించారు.

 

మజ్లిస్ కు మండింది...

రాష్ట్ర, కేంద్ర సర్కార్లతో కటీఫ్...

హైదరాబాద్, నవంబర్ 12: రాష్ట్రంలో  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ  నిర్ణయాలకు వ్యతిరేకంగా  మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఎంఐఎం ప్రకటించింది.  సంఘ్ పరివార్ కార్యక్రమాలకు ఊతమిస్తున్న ప్రభుత్వానికి ఏ పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని  పార్టీ చీఫ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మద్దతు ఉపసంహరణపై గవర్నర్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే యూపీఏకు మద్దతు ఉపసంహరణ పై   రాష్ట్రపతిని కలుస్తామని ఆయన తెలిపారు.ముస్లింల విషయంలో సీఎం కిరణ్ మరో పీవీ నర్సింహరావులా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంఘ్ పరివార్ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు నిరసనగా మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఒవైసీ తెలిపారు. పోలీసు బలగాలతో తమను అడ్డుకోలేని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని ఓవైసీ తెలిపారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మద్దతు ఉపసంహరణపై వెనక్కి తగ్గిది లేదని ఒవైసీ మరోసారి స్పష్టం చేశారు.మతతత్వవాదులకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము 1998 నుండి కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తున్నామని 2004లో కాంగ్రెసు అధికారంలోకి రావడంలో మజ్లిస్‌దే కీలక పాత్ర అన్నారు.అయితే గత కొన్ని సంవత్సరాలుగా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొణిజేటి రోశయ్య హయాంలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన అల్లర్లలో ముస్లింలు నష్టపోయారన్నారు. ఆదోనిలో జరిగిన అల్లర్లలో ముస్లింలకు చెందిన దుకాణాలను తగులపెట్టారన్నారు. సంగారెడ్డిలో అల్లర్లకు పాల్పడిన వారిని అరెస్టు చేయలేదన్నారు. అల్లర్లకు పాల్పడిన వారికి ఎమ్మెల్యే మద్దతిస్తున్నారని విమర్శించారు.గత మూడేళ్లలో సంగారెడ్డి, సిద్దిపేట, ఆదోనీలలో ముస్లింలపై దాడులు జరిగాయన్నారు. మాదన్నపేటలో జరిగిన అల్లర్లకు సంఘ్ పరివార్ కారణమని ఆరోపించారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నివేదించారని, ఆయన నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు. పాతబస్తీలో సబ్జి మండీని ఐదు రోజుల పాటు మూసేయించారని విమర్శించారు. ఈ ప్రభుత్వం పాతబస్తీని కర్ఫ్యూ పరిస్థితుల్లోకి నెట్టేసిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గతంలో తన స్నేహితుడు అని, జగన్ ఇప్పుడు తన స్నేహితుడు అని అసదుద్దీన్ అన్నారు.





 

Saturday, November 10, 2012

పర స్త్రీ తో సంబంధం... సిఐఎ డైరెక్టర్ రాజీనామా

వాషింగ్టన్, నవంబర్ 10:  వైవాహికేతర సంబంధం కారణంగా  అత్యున్నత నిఘా సంస్థ - సిఐఎ డైరెక్టర్ డేవిడ్ పెట్రాయెస్ రాజీనామా చేశారు.   పెట్రాయెస్ తన రాజీనామాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు శుక్రవారం సమర్పించారు. వివాహమైన 37 ఏళ్ల తర్వాత తాను వైవాహికేతర సంబంధం పెట్టుకోవడమనేది సరి కాదని అభిప్రాయపడుతున్నట్లు  ఆయన పేర్కొన్నారు.  పెట్రాయెస్ వైవాహికేతర సంబంధం గురించి ఎఫ్‌బిఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పెట్రాయెస్ బుధవారం 60వ పడిలో పడ్డాడు. పెట్రాయెస్ 38 ఏళ్ల క్రితం హోలీ పెట్రాయెస్‌ను పెళ్లి చేసుకున్నారు. న్యూయార్క్‌లోని వెస్టే పాయింట్ యుఎస్ మిలటిరీ అకాడమీ క్యాడెట్‌గా ఉన్నప్పుడు ఆయన ఆమెను కలిశారు. ఆమె అకాడమీ సూపరింటిండెంట్ కూతురు. వారికి ఇద్దరు పిల్లలు.ఆయన రాజీనామాను ఆమోదించిన ఒబామ పెట్రాయెస్ సేవలను ఒబామా ప్రశంసించారు. దశాబ్దాల పాటు పెట్రాయెస్ అసాధారణమైన సేవలు అందించారని, అమెరికా రక్షణకు, పటిష్టతకు సేవలు అందించారని అన్నారు. సిఐఎ డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ మోరెల్ యాక్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తారని చెప్పారు.

Thursday, November 8, 2012

ఇక డెడ్ లైన్లు లేవ్..డెత్ లైన్లే...

తెలంగాణపై  కె.సి.ఆర్.

కరీంనగర్,నవంబర్ 8:  కాంగ్రెసు ,  తెలుగుదేశం , వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లను తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితం చేస్తేనే ప్రత్యేక రాష్ట్రాన్ని  సాధించుకోగలుగుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు  చంద్రశేఖర రావు అన్నారు. ఈ మూడు పార్టీలు తెలంగాణ ద్రోహ పార్టీలే అన్నారు.పన్నెండేళ్లుగా హోరాహోరీగా సాగుతున్న ఉద్యమంలో అనేక జయాలు, అపజయాలు వచ్చాయని, పుష్కర కాలం ఉద్యమాన్ని సజీవంగా ఉంచుకున్నామన్నారు.  పాలమూరులో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినప్పుడు జెఏసి మద్దతు ఇవ్వలేదని, అది తనను గాయపర్చిందని,  అందుకే జెఏసి తో కొద్ది విభేదాలు వచ్చాయని, అయితే మళ్లీ కలిసి ఉద్యమించలేనంత స్థితిలో విభేదాలు కె.సి.ఆర్.   చెప్పారు.బి.జె.పి. తో  కలిసి పని చేసేందుకు కూడా తమకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు.
తెలంగాణ కోసం పార్టీని విలీనం చేసేందుకు కూడా తాను సిద్ధపడ్డానని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెసు పార్టీ తాత్సారం చేస్తోందని, ఇక నుండి కాంగ్రెసుతో ఎలాంటి సంబంధాలు ఉండవన్నారు.  భవిష్యత్తులో  అసలు ఏ పార్టీతోనూ పొత్తులుండవని, ఈ విషయంలో తాము కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు.
తెలంగాణపై ఇక కాంగ్రెసుకు ఎలాంటి డెడ్ లైన్లు లేవని... ఇక డెత్ లైన్లే అని అన్నారు.
 

Wednesday, November 7, 2012

కాంగ్రెసు చాలా డేంజర్ : కె.సి.ఆర్.

వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం...


కరీంనగర్‌, నవంబర్ 7:  2014 ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని పార్టీ  అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.  కరీంనగర్‌లో పార్టీ మేధోమథన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెసును నమ్మొద్దని, అది చాలా డేంజర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామని చెప్పడం వల్లనే తాను చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని, చర్చలకు బ్రేకులు వేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ జెఎసిని తామే ఏర్పాటు చేశామని, జెఎసి చైర్మన్‌కా కోదండరామ్‌ను నియమించింది తానేనని, అటువంటి జెఎసి తాము ఎలా వదులుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసితో విభేదాలు చిన్నవేనని, ఆ సమస్యలు సమసిపోతాయని ఆయన అన్నారు. పార్లమెంటు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

 

విధ్యార్ధి ఆత్మహత్య...ఉస్మానియాలో ఉద్రిక్తత

హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ  సంతోష్ అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట గల చెట్టుకు ఉరి వేసుకున్నాడు.  అదిలాబాద్ జిల్లాకు చెందిన  సంతోష్ ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తెలంగాణ కోసమే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సంతోష్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.  సంతోష్ అంతిమయాత్రకు తొలుత నిరాకరించిన పోలీసులు చివరకు సికింద్రాబాదులోని అమర వీరుల స్థూపం వరకు అనుమతించారు. అయితే, ఒయు పోలీసు స్టేషన్ వద్ద అంతిమ యాత్రను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కిస్తా....ఒబామా

వాషింగ్టన్,నవంబర్ 7:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన  విజయం  అమెరికా ప్రజలందరిదీనని   బరాక్ ఒబామా అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు  మరింత కృషి చేస్తానని చెప్పారు.  పార్టీలు వేరైనా తాను రోమ్నీతో కలిసి పని చేస్తానని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు, మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు రోమ్నీ సలహాలు, సహాయం తీసుకుంటానని చెప్పారు. నిరాశ, నిస్పృహ నుండి దేశాన్ని బయట పడేస్తానని, మన మధ్య బేధాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ అందరి దృష్టి మాత్రం అమెరికా భవిష్యత్తు మీదే ఉండాలని ఒబామ అన్నారు. ఆర్థిక మాంద్యానికి మన భావి  తరాలు బలి కాకూడదని, దానిని సమర్థవంతంగా ఎదుర్కొందామన్నారు. అమెరికా పౌరులు ఎప్పుడు కూడా మాకేం చేస్తారని ఆలోచించరని, మనమందరం కలిసి ప్రపంచానికి ఏం చేద్దామని ఆలోచిస్తారనీ అన్నారు. అమెరికా చాలా ఉన్నతమైనదని, ప్రపంచానికి మార్గదర్శిగా తన పాత్ర మరింత సమర్ధవంతంగా పోషిస్తుందని చెప్పారు.

భారత్ అభినందన

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రెండోసారి ఎన్నిక కావడం పై భారత్‌ ఆయనకు అభినందనలు తెలిపింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌  ఒబామాకు పంపినఅభినందనల సందేశాలలో పేర్కొన్నారు. 
 
 

మళ్ళీ ఒబామా...

వాషింగ్టన్,నవంబర్ 7: అమెరికా అధ్యక్ష పీఠాన్ని బరాక్ ఒబామా నిలబెట్టుకున్నారు.      అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పోటాపోటీగా  సాగిన ఎన్నికల్లో బరాక్ ఒబామా నాయక్త్వం లో  డెమాక్రాట్స్ మళ్ళీ  జయకేతనం ఎగురవేశారు. 270 మ్యాజిక్ ఫిగర్ ను దాటిన ఒబామా 303 స్థానాలను గెలుచుకున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాను ఆయన కైవసం చేసుకున్నారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోనూ ఒబామా హవా కొనసాగింది. ఒబామాకు గట్టి పోటీ ఇచ్చిన రిపబ్లిక్ అభ్యర్థి మిట్ రోమ్నీ కి 203 స్థానాలు లబించాయి. 180 ఎలక్టోరల్ ఓట్లు వచ్చే వరకూ రోమ్నీ బలంగా పోటీ ఇచ్చారు.ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒబామా  ఓట్లు వేగంగా 270 మ్యాజిక్ ఫిగర్ ను దాటిపోయాయి.  ఒబామా పెన్సున్వేలియా, మస్సాచూట్స్, న్యూ జెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, మైనీ, మ్యారీల్యాండ్, ఇలినోయిస్, రోడ్ ఐల్యాండ్, వెర్మోంట్, న్యూ హాంప్‌షైర్, మిన్నేసోట, వాషింగ్టన్ డీసీ రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించారు. అదేవిధంగా రోమ్నీ కూడా కెంటకీ, ఓక్లహోమా, సౌత్ కరోలినా, అలబామా, జార్జియా, ఊమింగ్ ఇండియానా, కన్సెస్, ల్యూసియానా, మిస్సిస్సిపీ, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, టెన్నీస్సీ, అర్కన్సా, టెక్సాస్, ఉత్హా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించారు.

Tuesday, November 6, 2012

ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు అందుకున్న సచిన్...

ముంబై,నవంబర్ 6:  భారత క్రికెట్ దిగ్గజం,రాజ్యసభ సభ్యుడు   సచిన్ టెండూల్కర్ మంగళవారం ఆర్డర్ ఆఫ్  ఆస్ట్రేలియా  అవార్డును అందుకున్నారు. ఆస్ట్రేలియా మంత్రి సైమన్ క్రీన్ ఈ అవార్డును సచిన్ టెండూల్కర్‌కు ప్రదానం చేశారు. సచిన్ టెండూల్కర్ ఈ అవార్డు అందుకున్న రెండో భారతీయుడు. ఇంతకు ముదు మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీకి ఈ అవార్డు దక్కింది.  ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని సచిన్ అన్నారు. 1985 నుంచి తనకు ఆస్ట్రేలియాతో అనుబంధం ఉందని చెప్పారు. విదేశీ గ్రౌండ్స్ లో సిడ్నీ తనకు ఫేవరెట్ గ్రౌండ్ అని సచిన్  చెప్పారు.
 

Monday, November 5, 2012

నాగం నడక ఎటు...?

హైదరాబాద్, నవంబర్ 5: కాంగ్రెసుతో కలిసిపోయే పార్టీలలో తాను చేరబోనని  తెలంగాణ మ నగారా సమితి శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి  తెలిపారు.తద్వారా  తాను తెరాసలో చేరబోనని పరోక్షంగా చెప్పారు. పైగా, ఎన్డీయె తెలంగాణ ఇస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పడం ద్వారా బిజెపి వైపు ఆయన అడుగులు వేస్తున్నట్లు  అనబడుతోంది. తనకు కావాల్సింది పార్టీ కాదని, తెలంగాణ అని ఆయన అన్నారు.  తెలంగాణకు శత్రువు కాంగ్రెసు పార్టీయేనని,  ప్రజల ఓట్లతో గెలిచి ఉంటే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలు అర్థమై ఉండేవని ఆయన అన్నారు. బిజెపిలో కూడా తాను చేర బోవడం  లేదని,  అయితే తెలంగాణా సాధన కోసం బిజెపి సహా అని పక్షాలతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా భరోసా యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు.
 

ఆమె నిరశన అపూర్వం ...

ఇంపాల్, నవంబర్ 5: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల నిరశనకు  12 సంవత్సరాలు పూర్తయ్యాయి. మణిపూర్ ప్రజల స్వేచ్ఛ కోసం షర్మిల పుష్కరకాలంగా అన్నపానీయాలు ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఆమె కనీసం మంచి నీరు కూడా ముట్టలేదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్‌పిఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె 2000 నవంబర్ ఐదో తేది నుండి నిరాహార దీక్ష చేపట్టారు. 2000 నవంబర్ 2న ఇంపాల్‌ లోయలోని మలోంలో అసోం రైఫిల్స్ ఎన్‌కౌంటర్‌లో పదిమంది పౌరులు చనిపోయారు. షర్మిల పౌరహక్కుల కార్యకర్త. దీనిపై ఆమె గళమెత్తారు. వెంటనే ఐదో తేది నుండి నిరాహార దీక్ష చేపట్టారు. మాన వహక్కుల ఉద్యమకారులు కిరాతకమైన చట్టంగా అభివర్ణించే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇప్పటికీ తన దీక్షపై వెనక్కి తగ్గలేదు.  ఆత్మహత్య నేరం కింద ఆమె జైలుకు, కోర్టుకు, ఇంటికి అంటూ ఇలా పన్నెండేళ్లుగా తిరుగుతున్నారు. ఫ్లూయిడ్స్ బలవంతంగా ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల జ్యూడిషియల్ కస్టడిలో ఉన్నారు.  రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. పాలకులు స్పందించక పోవడంపై పౌరసంఘాలు మండిపడుతున్నాయి.
 

Sunday, November 4, 2012

హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం

 రికార్డు స్థాయిలో 74.62 శాతం పోలింగ్


సిమ్లా, నవంబర్ 4:  హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74.62 శాతం పోలింగ్ నమోదైంది. తొలుత పోలింగ్ మందకొడిగా సాగినా, ముగింపు దశలో వేగం పుంజుకుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సరికి 74.62 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు.  హిమాచల్‌లో పోటీ ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష  కాంగ్రెస్‌కు మధ్యనే జరిగింది.  హిమాచల్‌లో 1977 నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోలేదు. ఈసారి అందుకు భిన్నంగా ఫలితాలు ఉండగలవని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి వీరభద్ర సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. రెండు ప్రధాన పార్టీలూ మొత్తం అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. 

గడ్కరీ ని కొనసాగించడం బీజేపీ ఇష్టం...ఆర్ఎస్ఎస్

చెన్నై, నవంబర్ 4:  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జాతీయ సమావేశాలు ఆదివారం చెన్నై లో ముగిశాయి.బీజేపీ అధ్యక్షుడిగా గడ్కరీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సమావేశం అభిప్రాయపడింది. ఆయన న్యాయపరంగానే ఎదుర్కొంటారని తీర్మానించారు. బీజేపీ అంతర్గత వివాదాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోదని మరో తీర్మానం చేశారు. రామజన్మభూమి, అయోధ్య విషయంలో పీఠాధిపతులు, మఠాధిపతుల నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంటుందన్న తీర్మానాన్ని ఆమోదించారు.
 
ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ర్యాలీ లో మన్మోహన్, సోనియా, రాహుల్....

Saturday, November 3, 2012

'నీలం' ఎఫెక్ట్: కోస్తాలో భారీ వర్షాలు...

హైదరాబాద్, నవంబర్ 3:  నీలం తుపాను ప్రభావం  వల్ల కోస్తాంధ్ర లో భారీ వర్షాలు పడుతున్నాయి.  ఇప్పటివరకూ కృష్ణాజిల్లాలో 224 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో  ఎనిమిది మంది మృతి చెందారు. లక్షకు పైగా హెక్టార్లలో పంట నీట మునిగింది.  అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 70వేల ఎకరాల్లో పంట నీట మునగగా, రాష్ట్రవ్యాప్తంగా 59 చెరువులకు గండ్లు పడ్డాయి.  ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు. ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. తమ్మిలేరు జలాశయం నుంచి వరదనీరు వచ్చిచేరుతుండడంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి.కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చిననందిగామ వద్ద బుడమేరు కట్టకు గండి పడడంతో విజయవాడ-మైలవరం మధ్య రాకపోకలకు అంతరయ్మ్ ఏర్పడింది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లో  పంటపొలాలు నీటమునిగాయి. పలు కాలనీల్లోకి నీరు చేరింది.  భారీవర్షాల కారణంగా పలురైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
  

జగన్ కు జైకొట్టిన లక్ష్మీపార్వతి...

ఏలూరు, నవంబర్ 3:  త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి శనివారం చెప్పారు. తాను ఎన్టీఆర్ టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపుతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్  ఆశయాలను కొనసాగించేందుకు  తాను ఈ పదహారు ఏళ్లు కష్టపడ్డానని చెప్పారు. తనను అమ్మ అని అన్నవాళ్లే తనపై ఎన్నో కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తాను ఎన్టీఆర్ మరణం తర్వాత అనే పుస్తకాన్ని రాయబోతున్నట్లు చెప్పారు. తన ఆశయాలు కొనసాగే అనుకూలమైన వేదికగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తాను భావిస్తున్నానని లక్ష్మీ పార్వతి  ఏలూరులో చెప్పారు. ఈ పార్టీ ద్వారా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేరుస్తానని చెప్పారు.
 
 

Friday, November 2, 2012

అమెరికాలో వివాహిత ఆత్మహత్య


 నెల్లూరు,నవంబర్ 2:  భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన   వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన మునగల  సరిత బెనారస్ వర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసింది. హైదరాబాద్ సంతోష్ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్నపురెడ్డి సుధీర్‌రెడ్డిని  గతేడాది అక్టోబరు 9న  వివాహమాడింది.ఆతర్వాత మూడు నెలలకు సుధీర్‌రెడ్డి అమెరికా వెళ్లిపోయాడు. ఆ సమయంలో సరితకు వీసా రానందున పుట్టింటికి వచ్చేసింది. గత నెల నాలుగో తేదీన ఆమె అమెరికా వెళ్లింది. అప్పటికే  సరిత భర్త నిక్కీ అనే మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. సరితను ఒంటరిగా వదలి రాత్రి పూట నిక్కీ ఇంటి కి వెళ్లేవాడు. విడాకులు ఇవ్వమని భర్త పెడుతున్న వేధింపులు తట్టుకోలేక సరిత శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది.తన అవయవాలు దానం చేయాలని  ఆమె తన సూసైడ్ నోట్ లో పేర్కొంది. 
 

Thursday, November 1, 2012

ఎర్రన్నాయుడు దుర్మరణం

శ్రీకాకుళం,నవంబర్ 1:  టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు(55) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి సమీపంలో గురువారం అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన శ్రీకాకుళంలోని  ఆస్పత్రికి తరలించారు. అరగంట పాటు వెంటిలేటర్ పై  ఉన్న ఆయన చివరకు ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్టణంలో ఓ వివాహానికి హాజరై శ్రీకాకుళం తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. 
కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 1957, ఫిబ్రవరి 23న వ్యవసాయ కుటుంబంలో ఎర్రన్నాయుడు జన్మించారు. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి కేంద్ర మంత్రిగా ఎదిగారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హరిశ్చంద్రపురం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభ్యుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. 1983 నుంచి 1994 వరకు ప్యానల్ ఆఫ్ చైర్మన్ మెంబర్‌గా ఉన్నారు. 1995-96 మధ్య కాలంలో చీఫ్ విప్‌గా సేవలందించారు. 1996, 98, 99, 2004లో శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్లమెంటరీ నేతగానూ పనిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా సేవలందించారు. 1999-2000లో రైల్వే కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ సంప్రతింపుల కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 

     
 

సీట్లో చిరు... కాకతీయ ఉత్సవాలకు నిధుల మంజూరు ఫైలు పై తొలి సంతకం

న్యూఢిల్లీ ,నవంబర్ 1: కాంగ్రెసు పార్టీ ముఖ్యనేత చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా  గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు  స్వీకరించిన అనంతరం కాకతీయ ఉత్సవాలకు రూ.25 లక్షలు మంజూరు చేసే ఫైలు పై  తొలి సంతకం చేశారు.  దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనకుఅప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయమంత్రిగా సర్వే సత్యనారాయణ కూడా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

న్యూజెర్సీరోడ్డు ప్రమాదం లో తెలుగు విద్యార్థిని మృతి

న్యూజెర్సీ ,నవంబర్ 1:  అమెరికాలోని న్యూజెర్సీలో  జరిగిన రోడ్డు ప్రమాదం లో  తెలుగు విద్యార్థిని ముప్పా విశ్వజ మృతి చెందింది.ఆమె మెడిసిన్ చదివేందుకు అమెరికా వచ్చింది.  ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. 21 సంవత్సరాల విశ్వజ తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉంటున్నారు.


 

తెలంగాణవాదుల నిరసన మధ్య రాష్ట్రవతరణ...

 హైదరాబాద్ ,నవంబర్ 1:  తెలంగాణ రాజకీయ ఐక్యకార్యా సమితి చైర్మన్  కోదండరామ్‌తో సహా పలువురిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు.   రాష్ట్రవతరణ  దినోత్సవాన్ని నిరసించాలని, నల్ల జెండాలతో నిరసన తెలపాలని తెలంగాణ జెఏసి పిలుపునిచ్చింది. దీంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుకే తాను నిరసన చేస్తున్నామని కోదండరామ్ ఈ సందర్భంగా అన్నారు. సీమాంధ్ర ప్రభుత్వంలో తెలంగాణవాదులను అణగదొక్కుతున్నారని నిప్పులు చెరిగారు. కాగా జెఏసి పిలుపు మేరకు తెలంగాణలోని పది జిల్లాల్లో తెలంగాణవాదులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. తెలంగాణా మంత్రులు అవతరణ వేడుకల్లో పాల్గొనక పోవడంతో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఎగురవేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.    
 

పురంధేశ్వరికి ప్రమోషన్...స్వతంత్ర హోదాతో జౌళి శాఖ

న్యూఢిల్లీ,నవంబర్ 1: కేంద్ర మంత్రి పురంధేశ్వరికి  చివరి నిమిషంలో నిలిచి పోయిన పదోన్నతి తిరిగి లభించింది.  ఆమెకు జౌళీ శాఖను స్వతంత్ర హోదాలో అప్పగించారు. ఇప్పటి వరకుజౌళీశాఖను ప్రస్తుత పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి నిర్వహించారు.  దయానిధి మారన్ రాజీనామా తర్వాత జౌళీ శాఖకు క్యాబినెట్ మంత్రిగా ఎవరూ లేరు. సహాయమంత్రిగా పనబాక లక్ష్మి ఉన్నారు.ఇప్పుడు పనబాక పెట్రోలియం శాఖకు వెళ్లడంతో జౌళీ శాఖను పురంధేశ్వరికి స్వతంత్ర హోదాలో కేటాయించారు. దీంతో రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మరో ప్రాధాన్యతమున్న పదవి దక్కినట్టయింది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...