Thursday, October 31, 2013

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు...

 ముంబై,అక్టోబర్ 31:  వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. టెస్టు జట్టుకు ఎంపిక కావడంలో పేస్ బౌలర్ జహీర్ ఖాన్ విఫలమయ్యాడు. హర్భజన్ సింగ్‌ను పక్కన పెట్టి రోహిత్ శర్మకు జట్టులో స్థానం కల్పించారు.  భుజం గాయం కారణంగా రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చారు. ఇషాంత్ శర్మకు చోటు కల్పించారు. బౌలర్లలో షమీ అహ్మద్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్‌లు జట్టులో స్ధానం పొందారు. శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్సు ప్రారంభించిన మురళీ విజయ్‌కు జట్టులో స్థానం లభించింది.  జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ప్రజ్ఞాన్ ఓజా, అమిత్ మిశ్రా, అంజిక్యా రహనే, ఉమేష్ యాదవ్, షమీ అహ్మద్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ సచిన్ టెండూల్కర్‌కు చివరిది కానుంది.సచిన్ టెండూల్కర్ తన 199వ మ్యాచును కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో, 200వ మ్యాచును వెస్టిండీస్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడనున్నాడు. వాంఖడేలో ఆడే 200వ మ్యాచుతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు.


విభజన అంశంపై పార్టీల అభిప్రాయాలు కోరిన కేంద్ర హొంశాఖ

ఢిల్లీ,అక్టోబర్ 31:  రాష్ట్ర విభజన అంశంపై అభిప్రాయాలు పంపాలని  ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పక్షాలకు హొం శాఖ లేఖలు పంపింది. తెలంగాణపై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం(జిఎంఓ) విధివిధానాలపై అభిప్రాయాలు పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు.  7వ తేదీన జిఎంఓ సమావేశం కానున్నందున, నవంబర్ 5కల్లా అభిప్రాయాలు పంపాలని హొం శాఖ కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు పంపిన తరువాత అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. 

Wednesday, October 30, 2013

"ఐగూగుల్" కు ఇక బై...

న్యూఢిల్లీ,,అక్టోబర్ 30:  సెర్చ్ ఇంజన్లలో సాటిలేని గూగుల్ నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన పర్సనలైజ్డ్ హోమ్ పేజ్ ఫీచర్‌ "ఐగూగుల్" మరో రెండురోజుల్లో కనుమరుగు కాబోతుంది. మే 2005లో ప్రారంభమైన "ఐగూగుల్" ప్రయాణం నవంబర్ 1, 2013 శుక్రవారంతో ముగిసిపోనుంది. నెటిజెన్లు తమ ఇష్టాయిష్టాలకి, అభిరుచులకి తగ్గట్టుగా కస్టమ్ హోమ్ పేజీని అతి సులువుగా డిజైన్ చేసుకునే వీలు కల్పించిన యూజర్ ఫ్రెండ్లీ ఐగూగుల్ సేవల్ని గూగుల్ ఉపసంహరించుకుంటోంది. పర్సనలైజ్డ్ స్టార్ట్ పేజీని బ్రౌసర్లో తెరవగానే ఏడురంగుల హరివిల్లుగా దర్శనమిచ్చే ఐగూగుల్‌ని మూసేయవద్దంటూ, గూగుల్‌కి ప్రపంచం నలుమూలల నుంచీ ఎన్నో విజ్ఞప్తులు అందినప్పటికీ ఫలితం లేనట్టే.

ఆరో వన్డేలో గెలిచిన భారత్...

నాగపూర్,అక్టోబర్ 30:  ఆస్ట్రేలియాతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారమిక్కడ జరిగిన ఆరో మ్యాచ్ లో ఆరు వికెట్లతో గెలుపొందింది. 351 పరుగుల బారీ లక్ష్యాన్ని ధోనీసేన  నాలుగు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసి విజయావకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 115 నాటౌట్) మరోసారి మెరుపు సెంచరీ సాధించగా, ఓపెనర్లు శిఖర్ ధవన్ (100), రోహిత్ (79) శుభారంభం అందించారు. సిరీస్ లో రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దవగా, చివరి మ్యాచ్ జరగాల్సివుంది.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన అసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 350 పరుగులు చేసింది. జార్జి బెయిలీ (156), వాట్సన్ (102) సెంచరీలతో రాణించారు. వోజెస్ 44 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.

మహబూబ్‌నగర్‌ వద్ద బస్సు దగ్ధం:42 మంది సజీవ దహనం

హైదరాబాద్, అక్టోబర్ 30: మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 42 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు.  కొత్తకోట మండలం పాలెం ఎన్ హెచ్ 44 పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న 49 మంది ఉన్నట్టు సమాచారం. తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ప్రమాదం జరిగింది. ఏసీ బస్సు కావడంతో లోపల ఉన్న ఫాబ్రికేషన్ మెటీరియల్, ఏసీలో ఉండే గ్యాస్, కర్టెన్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.  మిగిలిన ప్రయాణికులంతా మరణించారనే భావిస్తున్నారు. కాగా, ఇంతవరకు 41 మృత  దేహాలు వెలికి తీశారు.  

Sunday, October 27, 2013

సమైక్య సభలో జగన్ ఎన్నికల ప్రసంగం !

 హైదరాబాద్  , అక్టోబర్ 27: "రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకు పోరాడదాం. అవసరమైతే 2014 వరకు పోరాటం చేద్దాం. రాష్ట్రంలో 30 ఎంపీ సీట్లు గెలిపించుకుందాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీలో రాజకీయాలను మనమే శాసిద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధానిని చేద్దాం. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎవరు విడదీస్తారో చూద్దాం'' అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ ఆధ్వర్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావంసభలో  జగన్ మట్ల్లాడుతూ,  ప్రస్తుతం ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి  పోరాటం జరుగుతోందన్నారు. మౌనంగా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను.. భవిష్యత్తులో మరికొన్ని రాష్ట్రాలను ఓట్లు, సీట్ల కోసం ముక్కలు చేస్తారని, అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటేనే ఓట్లు, సీట్ల రాజకీయాలను నిలువరించవచ్చని సూచించారు. "విభజనకు సహకరించి చరిత్రహీనులుగా మిగులుతారా? ప్రజలకు తోడుగా ఉంటారా?'' అని సోనియా, కిరణ్, చంద్రబాబులను ప్రశ్నించారు.  1983లో భారతదేశ పౌరసత్వం తీసుకున్న సోనియాతో సహా   పౌరసత్వం తీసుకున్న వారంతా దేశం విడిచి వెళ్లాలనే బిల్లు పార్లమెంట్‌లో వస్తే సోనియాకు నచ్చుతుందా? అని  నిలదీశారు.  అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుసా అని సోనియాను ప్రశ్నించారు. మీ అత్త ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో పార్లమెంటులో చేసిన ప్రసంగం చదువుకో అంటూ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇందిర చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉటంకించారు. తెలుగు జాతిని చీల్చాలనుకోవడం న్యాయమేనా? బలమైన రాష్ట్రాన్ని బలహీనం చేయడం సబబేనా అని సోనియాను ప్రశ్నించారు.  సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా ఎందుకు చేయలేదు ?  అసెంబ్లీని సమావేశపరచాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తీర్మానం చేద్దామని కిరణ్‌ను కోరాం. దాంతో దేశంలో అలజడి వస్తుందని చెప్పాం. గవర్నర్‌కు విన్నవించాం. నేను, మా అమ్మ దీక్షలు చేశాం. సీఎం కార్యాలయం వద్ద ధర్నాలు చేశాం. ముసాయిదా బిల్లు రాకముందే సమైక్యానికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్న మా ప్రయత్నం అరణ్య రోదనే అయింది'' అని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు.



కిరణ్ లేఖను కేంద్ర హోంశాఖకు పంపిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ , అక్టోబర్ 27:   రాష్ట్ర విభజన అంశంలో సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు రాసిన లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పరిశీలనార్థం పంపారు. విభజన ప్రక్రియలో గత సంప్రదాయాలను విస్మరించి, ఇష్టానుసారం ముందుకెళ్లరాదని సూచిస్తూ, సీఎం  రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఫ్యాక్స్‌లో అందిన ఈ లేఖను ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలమేరకు రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోంశాఖకు పంపినట్టు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఏ ముఖ్యమంత్రి లేఖనైనా పరిశీలన, తదుపరి చర్యలకోసం సంబంధిత శాఖకు లేదా ప్రధాని కార్యాలయానికి పంపుతారని, అలాగే కిరణ్ లేఖనూ పంపారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, విభజనపై జీవోఎం కసరత్తు సాగుతున్నందున సీఎం లేఖపై ప్రభుత్వపరంగా ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు ఉండబోవని, జీవోఎం తదుపరి సమావేశంలో దీనని పరిశీలించే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
అలాగా-నాకు తెలియదే...దిగ్విజయ్
అయితే  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ విషయం తనకు తెలియదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాగా మరోవైపు కేంద్రమంత్రి చిరంజీవి ....ముఖ్యమంత్రి లేఖతో పాటు ఆయన వ్యాఖ్యలను సమర్థించారు.  విభజన ప్రక్రియ సరిగా జరగటం లేదని చిరంజీవి అన్నారు.

భారత్, చైనాల పోటీపై ఒబామా ఆందోళన

న్యూయార్క్ , అక్టోబర్ 27:   గణితం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్, చైనా అత్యుత్తమ విద్యను అందిస్తూ.. అమెరికాను దాటిపోతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి బీజింగ్ వరకు వందల కోట్ల మందికి ఉత్తమ విద్య అందించేందుకు ఆ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. బ్రూక్లిన్‌లో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఒబామా ప్రసంగిస్తూ భారత్, చైనాల పోటీని తట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

కాశ్మీర్ పై పాక్ కు హామీ ఇవ్వని ఒబామా

వాషింగ్టన్, అక్టోబర్ 27:  కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోండని అమెరికాను అడగడానికి వచ్చిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చుక్కెదురైంది.  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఆయన ఊహించని ప్రశ్నలు  ఎదుర్కోవలసి వచ్చింది. 2008 ముంబై దాడుల నిందితులపై విచారణ ఎందుకు ప్రారంభించలేదని షరీఫ్‌ను ఒబామా నిలదీశారుట.  అంతేకాక సీమాంతర తీవ్రవాదం, ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా కార్యకలాపాలపై  కూడా ఒబామాఆరా తీశారు. వైట్‌హౌస్‌లో ఒబామాను కలిసి రెండు గంటలు చర్చించిన అనంతరం ఈ విషయాల్ని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. భారత్‌తో సంబంధాలు, కాశ్మీర్ అంశం కూడా తమ మధ్య చర్చకు వచ్చిందని షరీఫ్ తెలిపారు.   26/11 ముంబై దాడుల నిందితుల విచారణ జాప్యంపై, ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ తెలిపిన తర్వాత నిర్బంధంలో ఉన్న డా. షకీల్ ఆఫ్రిదీ గురించి కూడా ఒబామా ప్రశ్నించినట్లు షరీఫ్ తెలిపారు. కాగా,  ఒబామా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడడానికి షరీఫ్ విజ్ఞతతో అడుగులు వేస్తున్నారని కొనియాడారు. ఆయుధ కొనుగోలుకు వినియోగించే నిధుల్ని సామాజిక అభివృద్ధికి ఖర్చు చేస్తే ఉపఖండంలో శాంతి నెలకొంటుందని ఒబామా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద నిర్మూలనకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడానికి అంగీకరించామన్నారు. చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దక్షిణాసియాలో నిలకడైన అభివృద్ధి సాధించడానికి అన్ని పక్షాలు నిరంతరాయంగా కృషి చేయాలని ఇరు దేశాలు తీర్మానించాయి. అయితే అమెరికా ద్రోన్ దాడులు, కాశ్మీర్ సమస్యపై మాత్రం ఒబామా నుంచి ఏవిధమైన హామీ షరీఫ్‌కు దక్కలేదని తెలుస్తోంది.

Friday, October 25, 2013

ఇది అల్లాటప్పా అల్పపీడనం కాదట..

హైదరాబాద్, అక్టోబర్ 25 :ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉన్నది చాలా అరుదైన అల్పపీడనమని వాతావరణ నిపుణులు నిర్ధారించారు. ప్రస్తుతం ఇది ఒంగోలు - గుంటూరు మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైందని, కొంత భాగం సముద్రంలోను, మరికొంత భాగం భూమి ఉపరితలం మీద ఉండటం వల్లే అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉండటానికి కారణమైందని విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణులు ప్రొఫెసర్ ఓఎస్ఆర్ యూ భానుకుమార్ తెలిపారు. ఈ పరిస్థితి వల్ల 2009 నాటి భారీ వర్షాలు పునరావృతం కానున్నాయని ఆయన చెప్పారు. ఈ అల్పపీడనం ఎక్కువగా కదలకుండా అలాగే ఉండిపోతుందని, సముద్రంలోని కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందని భానుకుమార్ అన్నారు. గతంలో 2009లో కూడా ఇలాంటి పరిస్థితే ఒకసారి సంభవించిందని, అప్పుడు తీవ్రస్థాయిలో వరదలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా అంతే తీవ్రస్థాయిలో వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అల్పపీడన ప్రభావం గుంటూరు, ప్రకాశం, కరీంనగర్ జిల్లాల మీద ఎక్కువగా ఉంటుందని, అలాగే శ్రీకాకుళం మీద కూడా కొంతవరకు ఉంటుందని వివరించారు. 

మధుర గాయకుడు మన్నాడే కన్నుమూత..

బెంగళూరు, అక్టోబర్ 25 : మహమ్మద్ రఫీ.. ముకేష్.. కిషోర్ కుమార్.. మన్నాడే... హిందీ చలనచిత్ర చరిత్రలో సంగీతానికి స్వర్ణయుగంగా చెప్పుకొనే 1950-70ల నడుమ ఒక వెలుగు వెలిగిన ఈ నాలుగు స్తంభాల్లో ఆఖరు స్తంభం ఒరిగిపోయింది.   క్లాసికల్, రొమాంటిక్, కామెడీ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నమైన పాటలతో సినీ సంగీతాభిమానులను రసడోలలూగించిన మన్నాడే (94) మధుర స్వరం మూగబోయింది!! నాలుగునెలలుగా ఊపరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3.50 గంటలకు కన్నుమూశారు.  మన్నాడేకు ఇద్దరు కుమార్తెలు షురోమా, సుమిత ఉన్నారు.  మన్నాడే భార్య సులోచన కుమరన్ 2012 జనవరిలో కేన్సర్‌తో కన్నుమూశారు. మన్నాడే అసలు పేరు ప్రబోధ్ చంద్ర డే. 1919 మే 1న పూర్ణచంద్ర డే, మహామాయా డే దంపతులకు కోల్‌కాతాలో జన్మించారు. సంగీతాచార్యుడైన తన బాబాయి కృష్ణచంద్ర డే, ఉస్తాద్ డబీర్ ఖాన్, ఉస్తాద్ అమన్ అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ రహమాన్‌ఖాన్‌ల వద్ద చిన్న వయసునుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. పదో ఏట నుంచే బాలగాయకుడిగా స్టేజీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. కాలేజీ రోజుల్లో రెజ్లింగ్, బాక్సింగ్ కూడా నేర్చుకుని కుస్తీపట్లు పట్టినా.. పాటను మాత్రం ఏ దశలోనూ వదల్లేదు. వరుసగా మూడేళ్లపాటు అంతర్‌కళాశాలల పాటల పోటీల్లో విజేతగా నిలవడమే ఇందుకు నిదర్శనం. తొలుత బారిస్టర్ కావాలనుకున్న మన్నాడే.. తన బాబాయి సలహాతోనే సంగీతాన్నే జీవికగా మలుచుకున్నాడు. ఆయనకు 'మన్నా డే' అనే పేరు పెట్టింది.. 1943లో తమన్నా చిత్రంలో సురయ్యాతో సూపర్‌హిట్ యుగళగీతాన్ని ఆలపించే అవకాశాన్ని ఇచ్చిందీ కృష్ణ చంద్ర డేనే కావడం విశేషం.


Friday, October 18, 2013

డాక్టర్ రావూరి భరద్వాజ కన్నుమూత

హైదరాబాద్,అక్టోబర్ 18:  నవలా రచయిత, సాహితీవేత్త,  జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ(86) కన్నుమూశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి 8.35 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం ఈనెల 14న ఆస్పత్రిలో చేర్చారు. ఇటీవలే ఆయన జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణరెడ్డి తర్వాత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న తెలుగు రచయితగా ఖ్యాతికెక్కారు. ఆయన రాసిన పాకుడురాళ్లు నవలకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. సుమారు 170పైగా కథలు, నవలలు రాశారు. కృష్ణా జిల్లా మొగలూరులో 1927, జూలై 5న రావూరి భరద్వాజ జన్మించారు. పేదరికం కారణంగా ఆయన ఏడో తరగతి వరకే చదువుకున్నారు. 17 ఏటనే కలం పట్టారు. కాదంబరి, పాకుడురాళ్లు ఆయనకు పేరు తెచ్చిన నవలలు. ఎవరూ స్పృశించని అంశాలపై రచన చేయడం భరద్వాజ ప్రత్యేకత. 1987 వరకు ఆల్ ఇండియా రేడియో పనిచేశారు. ఆయన రాసిన జీవనసమరం పుస్తకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.

Wednesday, October 16, 2013

షిర్డీ ఆలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు లేఖ...!

ముంబై ,  అక్టోబర్ 16:  ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని పేల్చివేస్తామని షిర్డీ ట్రస్ట్‌కు వచ్చిన ఓ బెదిరింపు లేఖ కలకలం సష్టించింది. నవంబర్ 9న షిర్డీ ఆలయంతోపాటు ముంబైలో ఠాక్రే నివాసమైన మాతోశ్రీని కూడా పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి  లేఖ వచ్చిందని పోలీసులు చెప్పారు. అదేరోజున ముంబై దాదర్‌లోని శివసేన కార్యాలయాన్ని, శివాజీ పార్క్ మైదానంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేకు అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని, ఇండోర్‌లోని ప్రముఖ ఖజ్రానా గణేష్ ఆలయాన్ని కూడా బాంబులతో పేల్చేస్తామని హిందీలో రాసిన ఆ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖ మంగళవారం రాత్రి 9.30 గంటలకు కొరియర్ ద్వారా తమకు అందిందని షిర్డీ ట్రస్ట్ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి అజయ్ మోరే విలేకరులకు తెలిపారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేశారు.  ఆలయంలోకి సెల్‌ఫోన్‌లను అనుమతించకుండా నిషేధం విధించారు.

రెండవ వన్ డేలో భారత్ అపూర్వ విజయం...

జైపూర్, అక్టోబర్ 16:  భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదయింది. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్   9 వికెట్లతో  కంగారూలను చిత్తుచేసి మొదటి మ్యాచ్ లో ఓటమికి బదులు తీర్చుకుంది. ఆసీస్ నిర్దేశించిన 360 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే   43.3 ఓవర్లలో  కేవలం ఒకే వికెట్ నష్టంతో  362 పరుగులు చేసింది. ప్రపంచ వన్డే క్రికెట్ లో రెండో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.    రోహిత్, కోహ్లి సెంచరీలతో హోరెత్తించారు. శిఖర్ ధావన్  తృటిలో శతకం కోల్పోయినా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్ అవుటయిన తర్వాత క్రీజ్ లో అడుగుపెట్టిన కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత్ తరపున వేగంగా సెంచరీ సాధించిన ఘనత సాధించాడు. ప్రపంచ ఆటగాళ్లలో ఏడో బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 16వ సెంచరీ. 100 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లి కంటే ముందు రోహిత్ సెంచరీ సాధించాడు. 102 బంతుల్లో 11 ఫోర్లు, ౩ సిక్సర్లతో శతకం పూర్తి చేసిన రోహిత్ 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధావన్ 95 పరుగులు చేసి ఫాల్క్‌నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు

Saturday, October 12, 2013

సీమాంధ్రలో మళ్ళీ రోడ్డెక్కిన బస్సులు....చల్లారుతున్న ఉద్యమ వేడి

 హైదరాబాద్, అక్టోబర్ 12 :  సమైక్య రాష్ట్ర డిమాండ్‌తో చేపట్టిన సమ్మెను సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులు విరమించుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం, ఆర్టీసీని ప్రభుత్వమే నిర్వహించడం వంటి పలు డిమాండ్లతో ఆగస్టు 13న సీమాంధ్రకు చెందిన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే ఖాన్ ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో చర్చలు ఫలించాయి. సమ్మెను విరమించుకుంటున్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి  నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కాగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు. ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు కూడా ఇంతకు ముందే సమ్మె విరమించడంతో సమైక్యాంధ్ర ఉద్యమ వేడి చాల వరకు చల్లారింది. ఇక ఎన్. జి. ఓ.లు మాత్రమె ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు.

విభజన ప్రక్రియకు శ్రీకారం....

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటు అయిన మంత్రుల బృందం శుక్రవారమిక్కడ సమావేశమైంది.  హోం శాఖ కార్యాలయం ఈ జరిగిన  తొలి సమావేశానికి ఐదుగురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా రక్షణ మంత్రి ఆంటోని, విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆర్థిక మంత్రి చిదంబరం ఈ భేటీకి రాలేదు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అధ్యక్షతన  జరిగిన ఈ సమావేశంలో మంత్రులు గులాంనబీ ఆజాద్‌, జైరామ్‌ రమేశ్‌, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మొత్తం 11 అంశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం మంత్రుల కమిటీకి నిర్దేశించింది .రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రాథమిక విధివిధానాలను మంత్రులు కమిటీ పరిశీలించింది.  ఈ నెల 19న మరో దఫా సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. విధివిధానాలకు సంబంధించి నోడల్ మినిస్ట్రీస్, డిపార్ట్ మెంట్లను ఖరారు చేసినట్లు మంత్రుల బృందం తెలిపింది.   ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, అన్ని సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తామని రిమంత్రుల బృందం హామీ ఇచ్చింది.
 సీమాంధ్రకు   ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ?
 రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర ప్రాంతానికి  ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజితోపాటు, అత్యాధునిక వసతు లతో రాజధాని ఏర్పాటు అంశాలతో బుజ్జగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే..తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి చేజారవచ్చనే ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అందుచేత  హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి మొగ్గు చూపడం లేదని సమాచారం.

నిమ్స్‌ నుంచి జగన్‌ డిశ్చార్జ్‌...

హైదరాబాద్,అక్టోబర్ 12:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం నిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  కీటోన్స్‌ మినహా... చక్కెరస్థాయి తదితరాలన్నీ సాధారణస్థాయికి వచ్చినట్టు  వైద్యపరీక్షల్లో తేలటంతో వైద్యులు...జగన్ ను డిశ్చార్జ్‌ చేశారు.  కీటోన్స్‌ సాధారణంగా జీరో శాతం ఉండాలని, ఈ స్థాయికి చేరుకునేందుకు మరో రెండు, మూడురోజులు పట్టే అవకాశముందని వైద్యులు శనివారం తెలిపారు. మూడు రోజుల పాటు విశ్రాంతి  తీసుకోవాలని సూచించారు.సమైక్యాంధ్ర డిమాండ్‌తో  ఐదు రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన జగన్‌ ఆరోగ్యం క్షీణించటంతో ఈనెల 9న అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా నిమ్స్‌కు తరలించారు.   వైద్యులు బలవంతంగా  ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు.  
...

Thursday, October 10, 2013

నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న జగన్

హైదరాబాద్,అక్టోబర్ 10: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిమ్స్ లో తన దీక్షను కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ  జగన్‌ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పోలీసుల సహాయంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. 

శ్రిహరి మృతితో కన్నీరు మున్నీరైన చిత్ర పరిశ్రమ

హైదరాబాద్,అక్టోబర్ 10:  తమ అభిమాన నటుడు శ్రీహరిని కడసారి చూపు చేసేందుకు ఆయన నివాసానికి అభిమానులు పోటెత్తారు. లివర్ వ్యాధికి చికిత్స పొందుతూ బుధవారం ముంబై ఆస్పత్రిలో మరణించిన  శ్రీహరి ( 49) భౌతికకాయాన్ని గురువారం ఉదయం  ఇక్కడి ఆయన నివాసం జూబ్లీహిల్స్ కు తీసుకువచ్చారు. హిందీ చిత్రం రాంబో రాజ్ కుమార్ షూటింగ్ లో పాల్గొన్న శ్రీహరి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను అక్కడే లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ  ఆయన  తుది శ్వాస విడిచారు.  శ్రీహరి భౌతిక కాయాని కడసారి  చూసేందుకు అభిమానులు వెల్లువెత్తారు. రియల్ స్టార్ అమర్ హై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సినీ ప్రముఖులే కాకుండా, రాజకీయ నేతలు, అభిమానులు ఆయన ఇంటికి తరలి వచ్చారు.  మంచితనానికి మారుపేరు శ్రీహరి అన్న అంటూ అభిమానులు శ్రీహరి భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.  సాయంత్రం బాచుపల్లిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. 

Saturday, October 5, 2013

సమైక్యాంధ్ర సమ్మె ఉధృతం...రాష్ట్రంలో పలుచోట్ల అంధకారం...

హైదరాబాద్,అక్టోబర్ 5 : సమైక్య రాష్ట్రం కోసం  విద్యుత్తు ఉద్యోగులు.. తెలంగాణ ప్రకటనతో  తమ ఆందోళనను ఉధృతం చేయడంతో సీమాంధ్రతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. సీలేరులో  2, 3, 4 యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేయడంతో దాదాపు 400 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది.  కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటులో కూడా ఉద్యోగులు ఉత్పత్తి నిలిపివేయడంతో మరో 210 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. డొంకరాయి పవర్‌ప్లాంట్‌ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడంతో ఖమ్మం జిల్లా పొల్లూరు పవర్‌ ప్లాంట్‌కు అంతరాయం కలిగింది. నీటి సరఫరా లేక అక్కడ 450 మెగావాట్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.  శుక్రవారం నాడు విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ లో ఒక ట్రాన్స్ ఫార్మర్ పేలిపోగా.. దానికి మరమ్మతులు చేసేందుకు ఉద్యోగులు ముందుకు రాలేదు. దాంతో దాదాపు 1265 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడో యూనిట్ ప్రస్తుతానికి ఆయిల్ మీద నడుస్తోంది. ఇది ఏ క్షణంలోనైనా ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.   జెన్ కో చరిత్రలో ఉద్యోగులు స్వచ్ఛందంగా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయడం  ఇదే ప్రథమం.


పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు...

తిరుపతి,అక్టోబర్ 5 : చిత్తూరు జిల్లా పుత్తూరులో  శుక్రవారం రాత్రినుంచి కొనసాగిన ఆపరేషన్.. శనివారం సాయంత్రానికి ముగిసింది. ఉగ్రవాదులున్న ఇంటి గోడలను డ్రిల్లింగ్ చేసి  ఉగ్రవాదులు బిలాల్‌, ఇస్మాయిల్ అలియాస్ మున్నాను ఆక్టోపస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఒక మహిళ, ముగ్గురు పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు.వారిని అంబులెన్స్‌లో చెన్నైకు తరలించారు.  ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ లక్ష్మణ్ కు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు అదనపు డీఐజీ వీఎస్ కే కౌముది తెలిపారు. కాగా, ఉగ్రవాదులు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పేలుళ్లు జరపడానికి కుట్ర పన్నుతున్నట్లు వచ్చిన కథనాల గురించి మాత్రం తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కౌముది చెప్పారు.

దీక్ష మొదలెట్టిన జగన్...

హైదరాబాద్,అక్టోబర్ 5 :  సమైక్య రాష్ట్రం కోసం లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఉదయం 11.30గంటలకు ఆయన దీక్ష ప్రారంభించారు. దీక్షావేదికతో పాటు, దీక్షకు మద్దతుగా తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పార్టీనేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Friday, October 4, 2013

అడ్డుకోడానికి ఇంకా చాన్స్ ఉంది...అశోక్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 4 : కేంద్ర కేబినెట్‌లో నోట్ ఆమోదం పొందినంత మాత్రాన రాష్ట్ర విభజన జరగదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు.  అసెంబ్లీలో తీర్మానం రావాలి, పార్లమెంట్‌లో బిల్లు పాస్ అవ్వాలని అన్నారు. అంచేత అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో ముసాయిదాను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికైనా మించిపోయింది లేదని, సమ్మెకు దూరంగా ఉన్నవాంతా ప్రజలకు మద్దతు ఇస్తూ, తమతో కలిసి రావాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి రావాలని అన్నారు. సమ్మెను కొనసాగిస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు రాజీనామాలు చేశామని నాటకాలు ఆడుతున్నారని, ఎవరూ రాజీనామాలు చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈనెల 6న ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్‌గడ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. చత్తీస్‌గడ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది.  నవంబర్ 11న తొలిదశ, 19న రెండో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒక దశలోనే పోలింగ్ జరుగుతుందని, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25న , రాజస్థాన్‌లో డిసెంబర్ 1న , ఢిల్లీ, మిజోరాంలలో డిసెంబర్ 4న పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. 

రాష్ట్ర విభజన నిర్ణయం పై రగులుతున్న సీమాంధ్ర...







ఆమరణ దీక్షకు జగన్ సన్నద్ధం..

హైదరాబాద్ , అక్టోబర్ 4:  పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ను ఇంత దారుణంగా విభజిస్తుంటే దేశం మొత్తం చూస్తూ ఊరుకుందని, రాష్ట్రమంటే అంత చులకనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరన్న చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజిస్తే రేపు కృష్ణా ఆయకట్టులో అనేక గొడవలు రోజూ జరుగుతాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం అవతలివైపున్న జిల్లాలు మాత్రమే కాదని, ఇవతలవైపు మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. పదేళ్లలో హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలంటున్నారని, హైదరాబాద్ నగరాన్ని నిర్మించడానికి 60 ఏళ్లు పట్టినప్పుడు కేవలం పదేళ్లలో మరో హైదరాబాద్ లాంటి నగరాన్ని అక్కడ నిర్మించగలరా అని జగన్ నిలదీశారు. విభజనకు వ్యతిరేకంగా తాను రేపటినుంచి చేపట్టబోతున్న ఆమరణ నిరాహార దీక్షకు అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

విభజన దిశగా మరో అడుగు... నోట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

న్యూఢిల్లీ, అక్టోబర్ 4:  ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్‌ రాజధానిగా ఏర్పాటు చేయాలన్న సి. డబ్ల్యు.సి. నిర్ణయానికి   కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర పడింది.  ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రతిపాదించిన కేబినెట్‌ నోట్‌ను గురువారం ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన మంత్రవర్గ సమావేశం ఆమోదించింది. తద్వారా రాష్ట్ర విభజనకు, దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు అధికారికంగా కేంద్రం శ్రీకారం చుట్టింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికీ పదేళ్ల పాటు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం ఆమోదించింది. విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు 9 మంది మంత్రులతో కూడిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు అవసరమైన చట్ట, పాలనాపరమైన యంత్రాంగం రూపకల్పనతో పాటు నదీజలాలు, జల వనరులు, విద్యుత్‌ పంపిణీ వంటి విభజనతో ఉత్పన్నమయ్యే అన్ని అంశాలు, సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, వాటికి పరిష్కార మార్గాలు చూపడమే గాక సమైక్య రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజల భద్రత, రక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను మంత్రుల బృందానికి  అప్పగించారు. అలాగే విభజన అనంతరం కోస్తాంధ్ర, రాయలసీమలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం ఆర్థికంగా ఎలాంటి సహాయాన్ని, ఎంతమేరకు అందజేయాలన్న అంశాన్ని కూడా జీఓఎం చూస్తుంది. రెండు రాష్ట్రాల్లోని వెనకబడ్డ ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవసరాలను తీర్చడంతో పాటు వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కూడా సిఫార్సు చేస్తుంది. వీటితో పాటు విభజన ప్రక్రియలో భాగంగా మున్ముందు తలెత్తే అన్ని అంశాలనూ అది పరిశీలిస్తుంది. అనంతరం కేంద్రానికి సమగ్ర నివేదికను జీఓఎం సమర్పిస్తుంది. అంతేగాక ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన సమగ్రమైన బిల్లును కూడా అదే తయారు చేస్తుంది. దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక రాష్టప్రతికి పంపుతారు. అనంతరం బిల్లును ఆయన అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపుతారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక దాన్ని రాష్టప్రతి తన ఆమోదంతో పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఆమోదించి, దానిపై రాష్టప్రతి ఆమోద ముద్ర కూడా పడగానే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుంది. 

Thursday, October 3, 2013

లాలూ ప్రసాద్ కు ఐదేళ్లు జైలు- 25 లక్షల రూపాయల జరిమానా

రాంచీ,అక్టోబర్ 3 : దాణా స్కాంలో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కు ఐదేళ్లు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. లాలూకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడయ్యారు. వీరిద్దరు సహా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు కొనసాగాయి. దోషులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి ఈ తీర్పును వారికి కూడా వినిపించారు. జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ ఈ తీర్పు వెలువరించారు. కాగా,  సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ను హైకోర్టు లో సవాలు చేస్తామని ఆర్.జె.డి.  ప్రకటించింది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...