Friday, August 31, 2012

కేంద్ర మాజీ మంత్రి కాశీరాం రాణా కన్నుమూత

న్యూఢిల్లీ,ఆగస్ట్ 31: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత కాశీరాం రాణా (76) శుక్రవారమిక్కడ అనారోగ్యంతో మృతిచెందారు. ఉదయం ఛాతీ నొప్పి రావడంతో ఆయనను స్థానిక జివేరాజ్ మెహతా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కడే చనిపోయారు. రాణా సూరత్ నుంచి ఆరుసార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.  వాజపేయి ప్రభుత్వంలో (1998-2004) జౌళి, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం ఆయ్యాక రాణా ప్రాధాన్యం కోల్పోయారు. గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీలో ఆయన ఇటీవలే చేరి ఎన్నికల ప్రచారం చేశారు.

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామా

న్యూఢిల్లీ,ఆగస్ట్ 31: లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల రైతుల పంటలు ఎండిపోతున్నందున శ్రీశైలం నీటిని దిగువకు వదలొద్దంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విన్నవించినా.. అదేం పట్టనట్టు  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు  నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ  ఆయన  రాజీనామా చేశారు.  పార్టీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి తదితరులతో కలిసి గతంలో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మూడుసార్లు విజ్ఞప్తి చేశానని, సీఎం తమ విన్నపాలను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌కు నీటిని వదలడం వల్ల కర్నూలు జిల్లాలో సాగునీటితోపాటు తాగునీటి సమస్య కూడా తీవ్రమవుతుంది’అని చెప్పారు. విద్యుత్ కోసమే నీటిని విడుదల చేయదల్చుకుంటే రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు. ఒకేసారి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సబబు కాదన్నారు. శ్రీశైలం నీటి విడుదలపై ఆవేదనతోనే రాజీనామా ప్రకటిస్తున్నారా లేక ఇతర రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అని అడగ్గా... తన మనసులో రాజకీయ కారణాలేవీ లేవని, రైతులకు అన్యాయం జరుగుతుంటే మనసు కలత చెంది తప్పనిసరై రాజీనామా చేస్తున్నానన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు కూడా ఇదే అంశంపై రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపా రు. తదుపరి కార్యాచరణపై ప్రశ్నించగా... తాను హైదరాబాద్ వెళ్తున్నానని, ఎమ్మెల్యేలతో కలిసి సీఎంను కలుస్తామని చెప్పారు.

ఓజాకు 4 వికెట్లు: తొలిరోజు న్యూజిలాండ్ 328/6

 బెంగుళూరు, ఆగస్ట్ 31:  బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో శుక్రవారం మొదలైన  రెండవ టెస్టులో న్యూజిలాండ్ మొదటి రోజున 81.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ రాస్ టేలర్   సెంచరీ (113)  చేశాడు. బారత స్పిన్నర్ ఓజా 4 వికెట్లు తీసుకోగా.. రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.వాతావరణం సరిగా లేక  పోవడంతో మొదటి రోజున 8.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను నిలిపి వేశారు. ఈ సమయాన్ని కవర్ చేసేందుకు గాను  శనివారం అరగంట ముందు (ఉదయం 9 గంటలకు) ఆటను ప్రారంభించనున్నారు.  రెండు టెస్టు ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా తొలి టెస్టుని కైవసం చేసుకోని 1-0తో ఆధిక్యంలో  ఉంది.

మాయా కొద్నానికి 28 ఏళ్ల జైలు శిక్ష ...

అహ్మదాబాద్ , ఆగస్ట్ 31:   నరోదా పాటియా అల్లర్ల కేసులో గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీకి చెందిన నరోదా ఎమ్మెల్యే మాయా కొద్నానికి స్థానిక ప్రత్యేక కోర్టు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో 32 మంది దోషులుగా తేలిన విషయం తెలిసిందే. 29 మంది దోషులకు జీవితకాల శిక్ష విధించింది. భజరంగదళ్ నాయకుడు బాబు భజరంగికి కోర్టు జీవితకాల శిక్ష విధించింది. 2002 ఫిబ్రవరిలో గోధ్రా రైలు దహనం జరిగిన మర్నాడు నరోదా పాటియా ప్రాంతంలో చెలరేగిన అల్లర్లలో 97 మంది ముస్లింలు మృతి చెందారు.

కాల్పులతో వణికిన న్యూజెర్సీ: ముగ్గురి మృతి

నూజెర్సీ, ఆగస్ట్ 31:  తరచు  కాల్పుల సంఘటనలు అమెరికాను అట్టుడికిస్తున్నాయి.  తాజాగా న్యూజెర్సీలో ఒక సూపర్ మార్కెట్ లో ఒక ఆగంతకుడు జరిపిన కాల్పులలో ఇద్దరు మరణించగా, పోలీసులు ఆ దుండగుని కాల్చి చంపారు.   ఉద్యోగులు పనిచేస్తుండగా సాయుధుడు పథక్‌మార్క్ షాపింగ్ సెంటర్‌లో కాల్పులకు దిగినట్లు సమాచారం. వెంటనే భద్రతా బలగాలు షాపింగ్ సెంటర్‌ను చుట్టుముట్టారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికాలో జరిగిన ఇటువంటి సంఘటనల్లో ఇది నాలుగవది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వద్ద వారం రోజుల క్రితమే ఇటువంటి సంఘటన జరిగింది. ఆగస్టు 5వ తేదీన మైఖెల్ వాడే పేజ్ విస్కాన్సిన్‌లో గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Thursday, August 30, 2012

నేడు అరుదైన పున్నమి రాత్రి...

వాషింగ్టన్‌: ఒకే నెలలో రెండు పర్యాయాలు చంద్రదర్శనమైతే అదీ పూర్ణచంద్రుడు దర్శనమిస్తే 'బ్లూమూన్‌' అంటారు. ఇది అరుదుగా జరిగే సంఘటన. ఈనెలలో 2వ తేదీన పున్నమి వచ్చిన సంగతి తెలిసిందే. మరో సారి  ఆగస్టు 31న  అంటే ఈ శుక్రవారం రాత్రి అరుదైన పున్నమి చంద్రుడు కనిపించనున్నాడు. ఇది ఆగస్టు నెలలో  రెండో పున్నమి కావడం విశేషం. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7.28 గంటలకు ఆకాశంలో నిండు పున్నమి చంద్రుడు దర్శనమిస్తాడని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. మళ్లీ మూడేళ్ల తర్వాత, 2015 జూలై 31న ఇలాంటి అరుదైన ‘బ్లూమూన్’ దర్శనమివ్వనున్నాడు.  దాదాపు ప్రతి రెండున్నరేళ్లకు ఒకసారి ఇలా అరుదుగా ఒకే నెలలో రెండు పున్నములు వస్తాయని తెలిపింది..

పార్లమెంటు సమావేశాల తర్వాత చూద్దాం: తెలంగాణపై ఆజాద్

న్యూఢిల్లీ, ఆగస్ట్ 30: తెలంగాణపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణపై ఇప్పటికిప్పుడు తేల్చేదేమీ లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17వ తేదీలోగా తెలంగాణపై తేల్చాలని పార్టీ తెలంగాణ నాయకులు అడుగుతున్నారని, తెలంగాణపై త్వరగా తేల్చాలని సీమాంధ్ర నాయకులు కోరుతున్నారని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా, పార్లమెంటు సమావేశాల తర్వాతనే తెలంగాణపై ఆలోచన ఉంటుందని ఆయన చెప్పారు.పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదని, దానిపైనే తామంతా దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించలేదని, రాజీనామా పెండింగులోనే ఉందని, పెండింగులోనే ఉంటుందని ఆయన చెప్పారు. వివరణ ఇవ్వడానికి సిబిఐ ధర్మాన ప్రసాద రావుకు నాలుగు నెలల సమయం ఇచ్చిందని, ఆ తర్వాతనే ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలపై కూడా ఆయన ప్రతిస్పందించారు. నాయకత్వ మార్పు ఏదీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని గానీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను గానీ మార్చడం లేదని ఆయన చెప్పారు.

Wednesday, August 29, 2012

నరోదా పాటియా అల్లర్ల కేసు: బీజేపీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ సహా 32 మంది దోషులు

అహ్మదాబాద్, ఆగస్ట్ 29:  గుజరాత్ లో 2002లో గోధ్రా రైలు దహన ఘటన అనంతరం జరిగిన నరోదా పాటియా అల్లర్ల కేసులో నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితురాలు, బీజేపీ నరోదా నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాయా కొద్నానీ, బజ్‌రంగ్‌దళ్ నేత బాబూ బజ్‌రంగీ సహా 32 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. అల్లర్ల సమయంలో 97 మంది ముస్లింలను వీరంతా సజీవదహనం చేసినట్లు నిర్ధారించింది. మరో 29 మంది నిందితులను సరైన ఆధారాలు లేనందున నిర్దోషులుగా పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన సురేశ్ అలియాస్ రిచర్డ్ చారాను అత్యాచారం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. దోషులకు శిక్షల ఖరారుపై వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 31న వాటిని ఖరారు చేయనున్నారు. జడ్జి తీర్పు వెలువరించడంతో కోర్టు హాల్లో ఉన్న కొద్నానీ అక్కడే భోరున విలపించారు. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న కొద్నానీ సహా ఇతర దోషులను తీర్పు అనంతరం కస్టడీలోకి తీసుకొని సబర్మతి జైలుకు తరలించారు.  ఈ కేసులో తొలుత 46 మందిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేయగా 2008లో సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో 24 మందిని అరెస్టు చేసింది. మొత్తం 70 మంది నిందితుల్లో ఆరుగురు అభియోగాల నమోదుకు ముందే మరణించగా మోహన్ నేపాలీ, తేజస్ పాఠక్‌లు బెయిల్‌పై బయటకు వచ్చి పరారయ్యారు. మొత్తం 327 మంది సాక్షులను కోర్టు విచారించింది. గోధ్రా రైలు దహన ఘటన జరిగిన మర్నాడు (2002 ఫిబ్రవరి 28న) నరోదా పాటియా ప్రాంతంలో వీహెచ్‌పీ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు ఓ వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. ఈ దాడిలో 97 మంది మృతిచెందగా మరో 33 మంది గాయపడ్డారు. మోడీ కేబినెట్‌లో 2007 నుంచి స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రిగా ఉన్న కొద్నానీని ఈ కేసులో ఆరోపణలపై 2009 మార్చిలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1998లో ఆమె తొలిసారి నరోదా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై మరో రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. దాడుల సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ప్రోద్బలంతో మంత్రి పదవి దక్కించుకున్నారు.

కసబ్ ఉరిశిక్షను సమర్ధించిన సుప్రింకోర్టు

న్యూఢిల్లీ,ఆగస్ట్ 29: 2008 నవంబర్ 26న ముంబై దాడుల ఘటన కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని సుప్రీం కోర్టు  తీర్పు ఇచ్చింది. కసబ్ పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీం కోర్టు బుదవారం  తీర్పు ఇచ్చింది. కసబ్ వంటి ఉగ్రవాదులకు ఒక్క ఉరి తప్ప మరో శిక్ష లేదని , న్యాయవాదిని నియమించలేదన్న సాకుతో కసబ్ మినహాయింపు పొందలేడని, భారతదేశంపైకి దాడికి తెగబడటం కసబ్ చేసిన పెద్ద తప్పు అని సుప్రీం పేర్కొంది. రెండేళ్ల క్రితం కసబ్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. 2008లో ముంబయి ఉగ్రవాదుల దాడి ఘటనలో కసబ్ తప్ప మిగిలిన ఉగ్రవాదులు అందరూ మరణించారు.  ముంబయి దాడుల ఘటనలో 166 మంది మృతి చెందారు.

Tuesday, August 28, 2012

బిజెపి బ్లాక్ మెయిల్ ను సహించం:సోనియా

న్యూఢిల్లీ, ఆగస్ట్ 28:   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల  ప్రతిపక్షాలపై దూకుడు పెంచారు.  పార్లమెంటు సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలను ముందుండి నడిపిస్తూ.. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇటీవల ‘కాగ్’ బయటపెట్టిన బొగ్గు కుంభకోణాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ పార్లమెంటులో యూపీఏను ఇరుకున పడేస్తున్న నేపథ్యంలో.. మంగళవారం  జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె బీజేపీ పై యుద్ధం ప్రకటించారు.  పార్లమెంటు సమావేశాల్లో బీజేపీపై పార్టీ ఎంపీలు ఎదురుదాడి చేయాలని ఆమె ఆదేశాలిచ్చారు. ‘‘బొగ్గు కుంభకోణం పేరుతో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను లక్ష్యం చేసుకుని బీజేపీ దాడి చేస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. ప్రధాని ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ బీజేపీ.. సమావేశాలను అడ్డుకుంటోంది. బీజేపీ దీన్ని ఒక అలవాటుగా చేసుకుంది. కాగ్ నివేదిక లేదా ఏ ఇతర సమస్యపై నైనా సరే చర్చించడానికి ప్రభుత్వంగాని, ప్రధాని మన్మోహన్‌ గాని సదా సిద్ధంగా ఉన్నారని సోనియా స్పష్టంచేశారు. సజావుగా సాగే సభలోనే ఈ చర్చలకు అవకాశముంటుందని, కానీ బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే సభలోకాదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బ్లాక్‌మెయిలింగ్‌ను బీజేపీ మిత్రపక్షాలే సహించడం లేదని అన్నారు.  ‘‘ఎన్నికలకుఎక్కువ సమయం వెచ్చించాల్సిన దశలోకి మనం అడుగిడుతున్నాం’’ అంటూ రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే కృషి చేయాల్సి ఉందని కార్యకర్తలకు సూచించారు. అస్సాం అల్లర్లు, దేశంలో వర్షాభావం, ఆర్థిక మందగమనం లాంటి ఎన్నో సమస్యలున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి పార్లమెంటు సమావేశాల్లో తగిన సూచనలు చేయాల్సిన బీజేపీ ఆ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటోందంటూ విరుచుకుపడ్డారు.

ఎన్డీటివీ సర్వే పై కస్సుమన్న బాబు...

హైదరాబాద్, ఆగస్ట్ 28: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా నడుస్తోందని వెల్లడించిన ఎన్డిటివీ సర్వేపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కస్సుమన్నారు.  వైయస్ జగన్‌కు అనుకూలంగా  టీవీ చానెల్ సర్వే నిర్వహించిందని ఆయన అన్నారు. సర్వే చేసిన చానెల్ జగన్ మీడియాకు కన్సల్టెన్సీ అని వింటున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు. విభజనపై పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ దానికి కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. తన విదేశీ పర్యటనను రాజకీయం చేయడం దారుణమని ఆయన అన్నారు. పార్లమెంటు ఆవరణలో తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనలో  కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి వల్లనే  జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. విగ్రహ స్థాపనపై తమ పార్టీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. కాగ్ నివేదికను ప్రధానమంత్రి తప్పు పట్టడం సరికాదన్నారు. ఈ నివేదికను పిఏసిలో సవాల్ చేస్తానని మన్మోహన్ చెప్పడం హాస్యాస్పదమని, కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని బాబు మండిపడ్డారు. అడ్డంగా దోచుకునేందుకు ఖనిజ సంపద, సెజ్‌లను అక్రమార్కులు మార్గాలుగా ఎంచుకుంటున్నారని విమర్శించారు. దేశ సంపదను కొందరు వ్యక్తులు కొల్లగొడుతుంటే ప్రధాని అచేతనంగా ఉండటం విడ్డూరమన్నారు.

Monday, August 27, 2012

ఎన్‌డీటీవీ సర్వే----జగన్ వైపే ప్రజల మొగ్గు...

హైదరాబాద్,ఆగస్ట్ 27: ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని ఎన్‌డీటీవీ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం.. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో 48 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీఎం కావాలని 18 శాతం ప్రజలు కోరుకుంటే.. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు సీఎం కావాలని 17 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని 11 శాతం మంది.. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి సీఎం కావాలని 6 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జగన్ సీఎం కావాలని కోరుకుంటున్న వారు 62 శాతం మంది ఉంటే.. ఆ సంఖ్య తెలంగాణలో 19 శాతంగా ఉంది. తెలంగాణలో 43 శాతం మంది ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటుండగా.. మిగతా ప్రాంతంలో ఆ సంఖ్య 4 శాతంగా ఉంది. అలాగే,  మధ్యంతర ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాల్లో 21 సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. ఇటీవల ఇండియాటుడే సర్వేలో కూడా మధ్యంతర ఎన్నికలు వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ 23 నుంచి 27 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైన విషయం తెలిసిందే. తాజా ఎన్‌డీటీవీ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 10 ఎంపీ సీట్లు, కాంగ్రెస్‌కు 9 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడైంది. రెండు స్థానాలు ఇతరులకు వస్తాయని తేలింది. మజ్లిస్‌కు ఒక స్థానం పోతే మిగిలిన ఒక స్థానంలోనే టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ సర్దుకోవాల్సి వస్తుందని ఈ సర్వేఅంచనా.  అలాగే.. జగన్ అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని ఆంధ్ర, రాయలసీమల్లోని 56 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. దీనితో ఏకీభవిస్తున్న వారి సంఖ్య తెలంగాణలో 26 శాతంగా ఉంది. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందేనని తెలంగాణలో 86% మంది చెప్తుండగా.. మిగతా ప్రాంతాల్లో దీనితో ఏకీభవిస్తున్న వారి సంఖ్య 24 శాతంగా ఉంది.

శీను వైట్ల, రాంచరణ్ లతో వైజయంతి సినిమా..

హైదరాబాద్:  వైజయంతీ మూవీస్ సంస్థ ద్వారా  ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత సి.అశ్వనీదత్ రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో భారీ చిత్ర నిర్మణనికి సన్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అత్యున్నత సాంకేతిక విలువలతో... అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయే విధంగా ఈ సినిమాను మలచడానికి దర్శకుడు శ్రీను వైట్ల కృషి చేస్తున్నారుట. రామ్‌చరణ్ ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘నాయక్’, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ‘ఎవడు’, బాలీవుడ్ ‘జంజీర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవి క్ట్‌లు పూర్తవగానే వైజయంతి  సినిమా మొదలవుతుందంటున్నారు. కాగా, ప్రస్తుతం వైజయంతీ సంస్థ రవితేజ హీరోగా నిర్మిస్తున్న  ‘సారొస్తారు’ చిత్రం  పరశురాం  దర్శకత్వంలో రూపొందుతోంది. 

బొగ్గు మసి కాగ్ పుణ్యమే... ప్రధాని

న్యూఢిల్లీ,ఆగస్ట్ 27: బొగ్గు కేటాయింపులకు పూర్తి బాధ్యత తనదేనని, అయితే ఇందులో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకోలేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోకసభలో స్పష్టం చేశారు.  కోల్ గేట్  వ్యవహారం  సోమవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. ప్రధానమంత్రి  ఒక ప్రకటన చేస్తూ పెట్టుబడులను ప్రోత్సహించేందుకే రాయితీలు ఇచ్చినట్లు చెప్పారు. కాగ్ నివేదిక అవాస్తవమన్నారు. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కేటాయింపుల పై  1993 నుండి విధానాలు మారలేదన్నారు. గత ప్రభుత్వాల విధానాలనే తామూ కొనసాగించామని చెప్పారు. ఆయన ప్రకటన చేస్తుండగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ కుంభకోణానికి బాధ్యుడు ప్రధానియేనని, అందుకు బాధ్యతగా ఆయన వెంటనే పదవి నుండి తప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. విపక్షాల నిరసనల మధ్య ప్రధాని ప్రకటన కొనసాగింది.

ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం...

హైదరాబాద్,ఆగస్ట్ 27:  ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్‌ కౌన్సెలింగ్‌ సోమవారం  ప్రారంభమైంది.  రెండు లక్షల మంది విద్యార్థులు ఇంటర్నెట్‌లో ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఇందు కోసం 53 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు 15వేల ర్యాంకులోపు విద్యార్ధుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. కీలకమైన ఆప్షన్ల ప్రక్రియ  ఈనెల 30 నుంచి జరుగుతుంది. ఆప్షన్ల విషయంలో గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్త మార్పులు చేశారు.  పాస్‌వర్డ్ తో పాటు విద్యార్థులకు ప్రత్యేక కార్డు ఇస్తారు.

Sunday, August 26, 2012

అండర్ - 19 వరల్డ్ కప్ విజేత భారత్

టౌన్స్ విల్లే (ఆస్టేలియా),  ఆగస్ట్ 26::  టోనీ ఐర్లాండ్ మైదానంలో జరుగుతున్ అండర్ - 19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్టేలియా పై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచ నెంబర్ వన్‌గా అవతరించింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 130 బంతుల్లో (111) పరుగులు చేయగా...స్మిత్ పటేల్  62 పరుగులు చేశాడు. 226 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.4 ఓవర్లలో  227 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అందించింది. అంతక ముందు ఆస్టేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 8 వికెట్లను కోల్పోయి 225 పరుగులు చేసింది. అండర్ 19 వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు సాధించిన టీమిండియా కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని ఆస్టేలియా కెప్టెన్ బొసిస్టో అందుకున్నారు.

మొదటి టెస్ట్ లో భారత్ ఘన విజయం

హైదరాబాద్, ఆగస్ట్ 26:: న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్  ను  ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో  ఓడించింది. ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్  రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకు ఆలౌటయింది. మెక్ కల్లమ్ (52), విలియమ్సన్ (42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు నేల కూల్చాడు. ఓజా మూడు వికెట్లు పడగొట్టాడు. యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు, కివీస్ 159 పరుగులు చేసింది. అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో రెండు టెస్ట్ ల సిరీస్ లో ధోనీ సేన 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్ట్ బెంగళూరులో ఈనెల 31న ప్రారంభమవుతుంది.
 

బాలీవుడ్ వెటరన్ హంగల్ కన్నుమూత

ముంబై, 26:: బాలీవుడ్ సినీనటుడు ఎకె హంగల్ (95) కన్నుమూశారు. 200లకు పైగా సినిమాలలో ఆయన నటించారు.  పరిచయ్, షోలే సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. 2011 లో  ఆర్దిక సమస్యతో ఇబ్బంది పడిన హంగల్ ను   మెగా హీరోలు అమితాబచ్చన్, అమీర్ ఖాన్  ఆదుకున్నారు. గత మే నెలలో వచ్చిన మధుబాల టివి షో హంగల్ కు చివరిది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు.   

Saturday, August 25, 2012

టి.టి.డి. చైర్మన్ గా మళ్ళీ బాపిరాజు

హైదరాబాద్, ఆగస్ట్ 25:  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి అధ్యక్ష బాధ్యత పార్లమెంట్ సభ్యుడు కనుమూరి బాపిరాజుకు మరోసారి దక్కింది. కనుమూరి బాపిరాజు చైర్మన్‌గా.. మరో 13 మంది సభ్యులుగా పూర్తిస్థాయి పాలకమండలిని ప్రభుత్వం నియమిచింది.  వీరు ఈ పదవుల్లో రెండేళ్ల పాటు కొనసాగుతారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు మళ్లీ నిరాశే మిగిలింది. టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఉన్న మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావుకు ఈసారి అవకాశం లభించలేదు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరికి మరోసారి బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించారు. ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే కండ్రు కమల, మాజీ ఎమ్మెల్యేలు రేపాల శ్రీనివాస్, జి.వి.శ్రీనాథ్‌రెడ్డి, చిట్టూరి రవీంద్రలతో పాటు ఎల్.ఆర్.శివప్రసాద్, చెన్నైకి చెందిన కన్నయ్య (రైల్వే మజ్దూర్ సంఘం అధ్యక్షుడు), రఘునాథ్‌విశ్వనాథ్ దేశ్‌పాండే, సి.హెచ్.లక్ష్మణరావు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి చిత్రారామచంద్రన్, దేవాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య, టీటీడీ ఈవో ఎల్.వి.సుబ్రమణ్యంలు పాలకమండలి సభ్యులుగా కొనసాగుతారు. ముత్యంరెడ్డి స్థానంలో ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డిని బోర్డు సభ్యునిగా నియమించారు.

చంద్రుని పై తొలి మానవుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కన్నుమూత

సిన్సినాటీ ,ఆగస్ట్ 25:  చంద్రుని పై కాలు మోపిన తొలి మానవునిగా చరిత్రకెక్కిన అమెరికా వ్యోమగామి నీల్ ఆల్డెన్ ఆర్మ్ స్ట్రాంగ్ (82) దీర్ఘకాలిక అస్వస్థతతో శనివారం  కన్నుమూశారు. ఆగస్టు 5 న జరిగిన బైపాస్ సర్జరీ అనంతరం తలెత్తిన సమస్యలే మరణానికి దారితీసినట్టు స్ట్రాంగ్ కుటుంబీకులు  తెలిపారు.  1969 జూలై 20న చంద్రునిపై దిగిన అపోలో 11 అంతరిక్ష నౌకకు ఆర్మ్  స్ట్రాంగ్ కమాండర్‌గా వ్యవహరించారు. చంద్రునిపై పాదం మోపీ మోపగానే, ‘‘ఒక మనిషిగా ఇది చాలా చిన్న అడుగే గానీ మానవాళికి మాత్రం గొప్ప ముందడుగు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి. అనంతరం సహచరుడు ఎడ్విన్ ఆల్డ్రిన్‌తో కలిసి చంద్రుని ఉపరితలంపై స్ట్రాంగ్ మూడు గంటల పాటు గడిపారు. పరిశోధనలు చేయడం, నమూనాలు సేకరించడం, ఫొటోలు దిగడంతో పాటు గోల్ఫ్ కూడా ఆడారు. 1930 ఆగస్టు 5న ఒహాయోలో జన్మించిన స్ట్రాంగ్ తన ఆరో ఏటో తొలిసారిగా విమానయానం చేశారు! అప్పటి నుంచే విమానాలన్నా, అంతరిక్షమన్నా విపరీతమైన ఆసక్తి పెంచుకున్నారు. తన 16వ ఏటే పైలట్‌ లెసైన్స్ పొందారు.

వర్షం తో మూడో రోజు ఆటకు అంతరాయం

హైదరాబాద్, ఆగస్ట్ 25: నగరంలో  భారీ వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ క్రికెట్  టెస్ట్ మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది.   ఫాలోఆన్‌ ఆడుతోన్న న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్ లో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. భారత్‌ ఇంకా 238 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో  159 పరుగులకు ఆలౌటైంది.అశ్విన్‌ 31 పరుగులిచ్చి చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.

Friday, August 24, 2012

కివీస్ కు ఫాలోఆన్ గండం...

హైదరాబాద్,,ఆగస్ట్ 24: హైదరాబాద్‌లో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలిటెస్టు  రెండవ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. 307 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో  ఆట కొనసాగించిన  టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో  438 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు సెంచరీ సాధించిన ఛటేశ్వర పూజారా లంచ్ సమయం తర్వాత 159 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రవిచంద్రన్ అశ్విన్ 37, ప్రజ్ఞాన్ ఓజా 4, ఉమేష్ యాదవ్ 4, జహీర్ ఖాన్ డకౌట్ అయ్యారు. కెప్టెన్  ధోనీ 147 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను టీమిండియా స్పిన్నర్స్ రవిచంద్రన్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా కుప్పకూల్చారు.  న్యూజిలాండ్ ఓపెనర్లు మెక్ కల్లమ్ 22, విలియమ్సన్ 32 పరుగులకే ప్రజ్ఞాన్ ఓజా పెవిలియన్‌కు పంపగా.. గుప్తిల్ 2, రాస్ టేలర్ 2, ఫ్లిన్ 16 పరుగులకే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు.  రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్ తీసుకోగా, ప్రజ్ఞాన్ ఓజా 2 వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సయమానికి  ఫ్రాంక్లిన్ 31, వ్యాన్ వేక్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఫాలోఆన్ నుండి తప్పించుకోవాలంటే ఇంకా 133 పరుగులు చేయాల్సి ఉంది. 

కిరణ్, బొత్స సేఫ్...?

న్యూఢిల్లీ,ఆగస్ట్ 24: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాలని కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో గంటా 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి - వాయలార్ రవిని కూడా కలిశారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగతా నలుగురు మంత్రులను కూడా తొల్గించేందుకు   అధిష్టానం పచ్చ జెండా ఊపిందంటున్నారు. సోనియాతో జరిగిన సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆహ్వానించలేదు. ప్రస్తుతానికి నాయకత్వ మార్పు లేకుండా ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డిలను మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశాలున్నాయి.  అయితే, నలుగురు మంత్రులకు ఇప్పుడే ఉద్వాసన పలికే అవకాశం లేనట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వారి పేర్లు చార్జిషీట్‌లో వచ్చినప్పుడు వారు ఎలా ప్రతిస్పందిస్తారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వేటు వేయాలని అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అందరినీ తొలగించి కొత్త మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అడిగినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పొసగడం లేదని భావించిన అధిష్టానం వారుద్దరినీ  మార్చాలని  తొలుత భావించినప్పటికీ ప్రస్తుతానికి రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన, పార్టీ పునర్వ్యస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

Thursday, August 23, 2012

పార్లమెంట్‌ను వదలని ' బొగ్గు ' మంట...

న్యూఢిల్లీ,ఆగస్ట్ 23:  బొగ్గు కేటాయింపుల కుంభకోణం వరుసగా మూడో రోజు గురువారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రధాని రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్న బీజేపీ  ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే అదే ధోరణి కొనసాగించింది. రెండు సభలలో విపక్ష సభ్యులు సభ మధ్యలోకి వచ్చి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.గందరగోళం మధ్య మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడిన ఉబయ సబలూ తర్వాత శుక్రవారానికి వాయిదా పడ్డాయి. మరో వైపు  ప్రతిష్టంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్యసభ సజావుగా సాగేందుకు వీలుగా అటు ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ కూడా అన్ని పార్టీలతో భేటీ అయ్యారు.

హైదరాబాద్ టెస్ట్-తొలిరోజు భారత్ 307/5

ఛటేశ్వర్ పుజారా తొలి సెంచరీ
హైదరాబాద్:ఆగస్ట్ 23:  భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం ఇక్కడ మొదలైన  తొలి  టెస్ట్  లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 87 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 పరుగులు సాధించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో  ఓపెనర్  గంభీర్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బౌల్ట్ బౌలింగ్ లోఅవుటయ్యాడు. ,వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారాతో రెండో వికెట్ కు 28 పరుగులు జోడించిన అనంతరం.. 47 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బ్రేస్ వెల్ బౌలింగ్ లో సెహ్వాగ్ కూడా అవుటయ్యాడు. అనంతరం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కేవలం 19 పరుగులే చేసి బౌల్ట్ బౌలింగ్ లో బౌల్డ్ అవడంతో 125 పరుగులకే 3 ప్రధాన వికెట్లను కోల్పోయి జట్టు కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. ఈ సందర్భంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, పుజారాతో  సమన్వయం ప్రదర్శిస్తూ నాలుగో వికెట్ కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని జతపరిచాడు. 58 పరుగులు చేసిన అనంతరం మార్టిన్ బౌలింగ్ లో కోహ్లీ అవుటవగా, తరువాత వచ్చిన రైనా కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు. రైనా స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోనీ 29 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.  క్రీజులో ఉన్న పుజారా.. కెరీర్ లో తొలి శతకాన్ని పూర్తి చేసుకుని 119 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు., న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 2, మార్టిన్, బ్రేస్ వెల్, పటేల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Wednesday, August 22, 2012

ఉప్పు లేని పప్పులా..

లక్ష్మణ్, ద్రావిడ్ లేకుండా  నేటినుంచి బారత్-న్యూజిలాండ్ టెస్ట్
హైదరాబాద్ , ఆగస్ట్ 22:  న్యూజిలాండ్, భారత జట్ల మధ్య గురువారం హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐదురోజులపాటు జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు క్రికెట్ అభిమానుల నుంచి స్పందన కరువైంది. హైదరాబాదీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మ్ కారణంగా టెస్ట్ దూరం కావడంతో అభిమానుల టెస్ట్ మ్యాచ్ పై ఆసక్తి కనబరచడం లేదంటున్నారు. మొత్తం 39 వేల సీట్ల సామర్ధ్యం ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో కేవలం 2500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయనట్టు హెచ్ సీఏ వర్గాలు వెల్లడించాయి. లక్ష్మణ్ మ్యాచ్ దూరం కావడంతో అభిమానుల స్పందన చాలా తక్కువగా ఉందని హెచ్ సీఏ కార్యనిర్వాహక సభ్యుడు గెరార్డ్ కార్ తెలిపారు గురువారం  ఉ.9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్‌లు లేకుండా 16 సంవత్సరాల తర్వాత టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ మెంట్ ప్రకటించగా.. గత శనివారం వివిఎస్ లక్ష్మణ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గోల్డెన్‌ జనరేషన్‌ గా బావించే భారత బ్యాట్స్ మెన్ లో  ఒక్క సచిన్‌ టెండూల్కర్‌ మాత్రమే మిగిలి ఉన్నాడు.రాహుల్‌, లక్ష్మణ్‌లు భర్తీ చేయలేని గొప్ప బ్యాట్స్ మెన్లని  వీరిని మిస్‌ అవుతున్నామని సచిన్ అన్నాడు.  

అభిమానులకు దూరమవుతున్నా...ప్రజలకు దగ్గరవుతున్నా...చిరు

న్యూఢిల్లీ, ఆగస్ట్ 22: ఈసారి తన  పుట్టిన రోజుకు ప్రత్యేకత ఏమీ లేదని, ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు.  తన భవిష్యత్తు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారని, పదవులు వారే ఇస్తారని ఆయన అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని కొంత మంది అంటున్నారంటే అది వారు తన పట్ల అభిమానాన్ని చాటుకోవడమేనని, తనను ముఖ్యమంత్రిగా చూడాలని వారు కోరుకుంటున్నట్టుగా  అనుకోవాలని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో తనకు అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని ఆయన అన్నారు. సమిష్టి కృషి ఉంటే 2014లో కాంగ్రెసు గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసు మహా వృక్షం లాంటిందని, శాశ్వతంగా ఉండే పార్టి అని, పార్టీ ఉంటుందా ఉండదా అనే మీమాంస అక్కరలేదని ఆయన అన్నారు.రజా సమస్యలు ఒక్క రోజులో పోవని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూ పోవాలని ఆయన అన్నారు. కొన్ని సమస్యలను పరిష్కరిస్తే కొత్త సమస్యలు వచ్చి పడతాయని, అప్పుడు వాటిని పరిష్కరించాల్సి ఉంటుందని, సమస్యల పరిష్కారమనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. అభిమానులకు కాస్తా దూరమవుతున్నా ప్రజలకు దగ్గర అవుతున్నాననే సంతృప్తి ఉందని ఆయన చెప్పారు.

Monday, August 20, 2012

ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య మృతి..

హైదరాబాద్, ఆగస్ట్ 20:  అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్య సోమవారం సాయంత్రం  మెదక్ జిల్లా సిద్ధిపేటలోని తన నివాసంలో మరణించారు. దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా ఆయన తన కుంచెతో చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేశారు. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారుతెలుగు చిత్ర కళారంగానికి అంతర్జాతీయ కీర్తిని ఆర్జించి పెట్టారు. రాజయ్య 1993లో కళా ప్రవీణ, 1997లో కళా విభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డు అందుకున్నారు. విదేశాల్లో సైతం ఆయన చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. రాజయ్య చిత్రాలు పార్లమెంటు హౌస్, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్‌జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలితా కళా అకాడమీల్లో ప్రదర్శనకు ఉంచారు  లలితా కళా అకాడమీ ద్వారా ఆయన చెకోస్లోవికియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో చిత్ర ప్రదర్శనలు పెట్టారు. జెఎన్‌టియు ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.. రాష్ట్రప్రభుత్వం ఆయనను 1966లో రజత పత్రంతో సత్కరించింది. 1969లో తామ్ర పత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్ర కళాప్రపూర్ణ సత్కారం లభించింది. 

Sunday, August 19, 2012

యువరాజ్ సింగ్ కు అర్జున అవార్డ్..

న్యూఢిల్లీ, ఆగస్ట్ 19: ఒలంపిక్ క్రీడల్లో భారత్ కు పతకాలు సాధించిన షూటర్ విజయ్ కుమార్, కుస్తీ వీరుడు యోగేశ్వర్ దత్ కు దేశ అత్యున్నత రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. క్రీడల్లో విశేష ప్రతిభ చూపిన మరో 25 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు లను కూడా కేంద్ర క్రీడాశాఖ ప్రకటించింది. క్యాన్సర్ వ్యాధిని ఎదురించి మళ్లీ క్రికెట్ కు సేవలందించేందుకు సిద్ధ పడుతున్న యువరాజ్ సింగ్ తో పాటు దీపిక కుమారి, లైష్రామ్ బంబేలా దేవి (ఆర్చరీ), సుధా సింగ్, కవిత రాందాస్ రావత్ (అథ్లెటిక్స్), అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్ (బాడ్మింటన్), ఆదిత్య ఎస్ మెహతా (బిలియర్డ్స్), వికాస్ క్రిష్ణన్ (బాక్సింగ్), సర్దార్ సింగ్ (హాకీ), యశ్పాల్ సోలంకి (జూడో), అనుప కుమార్ (కబాడీ), సమీర్ సుహాగ్ (పోలో), అన్ను రాజ్ సింగ్ (షూటింగ్), ఓంకార్ సింగ్ , జయదీప్ కర్మాకార్ (షూటింగ్), దీపికా పల్లికాల్ (స్క్వాష్), సందీప్ సెజ్వాల్ (స్విమ్మింగ్), సోనియా చాను (వెయిట్ లిఫ్టింగ్), నర్సింగ్ యాదవ్, రాజిందర్ కుమార్, గీతా పోగట్ (రెజ్లింగ్), భీమల్జీత్ సింగ్ (వుషు) దీపికా మల్లిక్, రామ కరణ్ సింగ్ (అథ్లెటిక్ పారలింపిక్స్) లకు అర్జున అవార్డు లను ప్రకటించారు.

లక్ష్మణ్ స్థానంలో బద్రీనాథ్

న్యూఢిల్లీ,ఆగస్ట్ 19:  తమిళనాడు వెటరన్ బ్యాట్స్ మన్  ఎస్ బద్రీనాథ్ కు భారత జట్టులో స్థానం లభించింది. వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ కారణంగా ఏర్పడిన ఖాళీలో బద్రీనాథ్ కు స్థానం కల్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 32 ఏళ్ల బద్రినాథ్ 2010 లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో రెండు టెస్ట్ లు ఆడాడు. 

Saturday, August 18, 2012

అంతర్జాతీయ క్రికెట్‌కు లక్ష్మణ్ గుడ్‌ బై

హైదరాబాద్,ఆగస్ట్ 18:   భారత్ తరఫున  అంతర్జాతీయ క్రికెట్లో 16 సంవత్సరాల పాటు సేవలందించిన హైదరాబాదీ  స్టైలిష్‌ బ్యాట్శ్ వివిఎస్ లక్ష్మణ్  రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ కు ఇది సరైన సమయమని భావిస్తున్నానని లక్ష్మణ్ తెలిపాడు. జూనియర్లకు అడ్డుగా ఉండకూడదని, వారికి అవకాశం కల్పించాలని భావించి క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనితో హైదరాబాదులో న్యూజిలాండ్‌తో ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టు  లో కూడా  లక్ష్మణ్‌ ఆడనట్టే. 16 ఏళ్ల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందింనందుకు గర్వంగా ఉందన్నాడు. క్రికెట్ ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించిందన్నారు. హైదరాబాద్ క్రికెటర్లకు తన అనుభవాన్ని పంచుతానని ఆయన చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్ క్రికెట్‌లో ఆడతానని ఆయన చెప్పారు.  క్రీడాజీవితంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హెచ్ సీఏకు కృతజ్ఞతలు చెప్పాడు.

Friday, August 17, 2012

2జీ ని మించిన బొగ్గు ' స్కాం '...కాగ్ నివేదిక

బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాల వల్ల  1.86 లక్షల కోట్ల నష్టం  
న్యూఢిల్లీ,ఆగస్ట్ 17:  బొగ్గు కేటాయింపుల్లో తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.86 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిదని  కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్)  పేర్కొంది.  పార్లమెంట్ ఉభయ సభల్లో కాగ్ నివేదికను శుక్రవారం ప్రవేశపెట్టారు. 2004 నుంచి 2009 మధ్య జరిగిన బొగ్గు కేటాయింపులపై కాగ్‌ ఈ  నివేదిక సమర్పించింది.  2జీ కుంభకోణం కన్నా బొగ్గు కుంభకోణం పెద్దదని నివేదికలో అభిప్రాయపడింది. బొగ్గు గనుల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయని నిర్థారించింది. ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించదని కాగ్‌ తీవ్రంగా తప్పుపట్టింది. టాటా గ్రూపు సంస్థలు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, అనిల్‌ అగర్వాల్‌ సంస్థలు, ఎస్సార్‌ గ్రూపు సంస్థలు, అదాని గ్రూపు, ఆర్సెలర్‌ మిట్టల్‌, ల్యాంకో సంస్థలు  బొగ్గు కేటాయింపుల్లో బాగా ప్రయోజనం పొందాయని కాగ్‌ స్పష్టం చేసింది. మొత్తం 25 కంపెనీల జాబితాను కాగ్ ఇచ్చింది. అదే విధంగా ఢిల్లీ విమానాశ్రయంపై కూడా కాగ్‌ నివేదిక ఇచ్చింది. ఏడాదికి కేవలం 100 రూపాయల అద్దెతో 60 ఏళ్ల పాటు జీఎంఆర్‌కు భూమి కేటాయించారని కాగ్‌ చెప్పింది. దీనివల్ల ప్రభుత్వానికి 60 ఏళ్లలో లక్షా 63 వేల 557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం పోయిందని కాగ్‌  తేల్చింది.

తెలంగాణా పై రాజ్య సభలో వీగిన బి.జె.పి. తీర్మానం

న్యూఢిల్లీ,ఆగస్ట్ 17:  తెలంగాణ అంశంపై బిజెపి సభ్యుడు ప్రకాష్ జవదేకర్  ప్రతిపాదించిన ప్రైవైట్ తీర్మానాన్ని రాజ్యసభ  తిరస్కరించింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు ద్రోహం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. యుపిఎ ప్రభుత్వానికి తెలంగాణ అంశం పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశంపై జరిగిన చర్చకు హోం శాఖ సహాయ మంత్రి జైస్వాల్ సమాధానం ఇచ్చిన తర్వాత ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా లేదని, అందుకే చర్చ సందర్భంగా సభకు హోం మంత్రి గానీ ప్రధాన మంత్రి గానీ రాలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని, తెలంగాణకు రాజకీయ పరిష్కారం చూపించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారని, ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదని, కమిటీలు వేశామన్నారని, కాలయాపన కోసం కమిటీలు వేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ తేదీన అయినా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం నిర్వహించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో, ఉద్యోగాల్లో ఇటీవలి జరిగిన వ్యవహారాలను ఎత్తిచూపుతూ ప్రతి విషయంలో తెలంగాణవాళ్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు తాము జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నా కూడా తాము ఆ పనిచేశామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉందని, అలా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయాలు అడుగుతారు గానీ తన వైఖరి ఏమిటో కాంగ్రెసు చెప్పడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తే తాము బలపరుస్తామని ఆయన చెప్పారు.

Thursday, August 16, 2012

నటి టి.జి.కమలాదేవి మృతి

చెన్నయ్,ఆగస్ట్ 16:  అలనాటి సినీ నటి టి.జి.కమలాదేవి (84) గురువారం కన్నుమూశారు. ఆమె దాదాపు 70 చిత్రాలకు పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. కమలాదేవి అసలు పేరు గోవిందమ్మ. 1930, డిసెంబర్ 29న జన్మించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, గాయనిగా, నటిగా కమలాదేవి తనదైన ముద్ర వేసుకున్నారు. బాలనాగమ్మ, పాతాళ భైరవి, మల్లీశ్వరి, దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు, గుణ సుందరి కథ, కథానాయకుడు, ఇల్లరికం తోడుదొంగలు, పల్లెటూరు, చక్రపాణి, వెలుగు నీడలు, భక్త రాందాసు, బంగారు పంజరం, కంచుకోట, పెత్తందార్లు, అభిమానవతి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.నాటకాలలో  అలెగ్జాండర్ పాత్ర కమలాదేవికి  గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆమెను నాటక కళాపూర్ణ అవార్డుతో సత్కరించింది. కమలదేవి సెన్సార్ బోర్డు చైర్మన్ గా కూడా సేలందించారు. సినిమాలతో పాటు క్రీడల్లో కమలాదేవి రాణించారు. బిలియర్డ్స్ క్రీడలో ఆమె  ఆమె రెండు సార్లు జాతీయ చాంపియన్ షిప్ గెలుచుకున్నారు.

Wednesday, August 15, 2012

నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత

నెల్లూరు,ఆగస్ట్ 15: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురవడంతో బుధవారం అర్ధరాత్రి ఆయన ను  అత్యవసరంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంట భార్య రాజ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలలో ఒకరైన జనార్థన్ రెడ్డి 1992-94 కాలంలొ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.  2004 లోకసభ ఎన్నికలలో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.  2009, మార్చి 16న రాజ్యసభకు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికయ్యారు.  2007 డిసెంబర్‌లో తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం జనార్థన రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఘనంగా పంద్రాగష్టు..' .మీసేవలు ' పెంచుతామన్న సి.ఎం.

హైదరాబాద్,ఆగస్ట్ 15: : ఉపాధి హామీ పధకం అమలులో  మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్శ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ...  పేద ప్రజల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. మహిళల్లో సాధికారికత తీసుకు వచ్చేందుకు స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. యువత కోసం రాజీవ్ యువకిరణాలు ప్రారంభించామని, మూడేళ్లలో 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది యువకులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. గుడిసె లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దడమే తమ లక్ష్యమని, అందులో భాగంగా ఇప్పటికే 8 లక్షల మందికి 2004 నుండి తమ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిందని, ఇంకా నాలుగు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రానున్న రెండేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.3500 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించామని, 2008 నుంచి రూ.5,300 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను  బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.   గ్యాస్ సరఫరా తగ్గటం, జల విద్యుత్ ఉత్పత్తి తగ్గటంతో విద్యుత్ సమస్యలు పెరిగాయన్నారు. 'మీ సేవ'లో అందిస్తున్న 34 సేవలను 100 కు పెంచుతామని సీఎం తెలిపారు. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదాకు కృషి చేస్తున్నట్లు కిరణ్ వెల్లడించారు. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతి సాంస్కృతి శాఖ శకటానికి, రెండో బహుమతి డెయిరీ డెవలప్‌మెంట్ శకటానికి, మూడో బహుమతి పర్యాటక శకటానికి వచ్చింది. అటవీ శాఖ శకటానికి కన్సోలేషన్ బహుమతి వచ్చింది. వివిధ జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు  స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.   

ఎర్రకోట నుంచి ప్రధాని స్వాతంత్ర దినోత్సవ హామీలు...

కరవు ప్రాంతాల రైతులకు రాయితీలు
రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లు
పేదలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
 ఐదేళ్లలో ప్రతి గ్రామానికి నిరంతర విద్యుత్ 

న్యూఢిల్లీ,ఆగస్ట్ 15:  భారత దేశాన్ని అభివృద్ధిలో నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్  అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ,  66 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కమ్మేస్తుందని, భారత్ పైన కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడిందన్నారు.
కరవు ప్రాంతాలలో రైతులను  ఆదుకుంటామని, వారికి రాయితీలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులలో ఉచిత మందుల సరఫరాను  ఆధునికీకరిస్తామన్నారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ కేటాయిస్తామన్నారు. దేశంలో దారిద్ర్యం, పేదరికం తొలగిన రోజే నిజమైన స్వాతంత్రం అన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి నిరంతరం విద్యుత్ వచ్చే విధంగా ఐదేళ్లలో కృషి చేస్తామన్నారు.
 దేశ అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోలియో రహిత దేశంగా భారత్‌ను నిర్మిస్తామన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపట్టిందని చెప్పారు. నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లు తెరుస్తామని చెప్పారు. అసోం ఘర్షణలు జాతికి కళంకమని, ఈ  తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. త్వరలో రాజీవ్ గృహ రుణ పథకం ద్వారా పేదలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. లోక్ పాల్ బిల్లు తీసుకు రావడానికి యుపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Tuesday, August 14, 2012

మంత్రి పదవికి ధర్మాన ప్రసాదరావు రాజీనామా

ఆమోదం పై సి.ఎం.తర్జనభర్జన... 
హైదరాబాద్, ఆగస్ట్ 14: జగన్ ఆస్తుల కేసుల తనను నిందితుడిగా చేర్చుతూ సీబీఐ అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాత్రి రాజీనామా లేఖను స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు.  సీబీఐ తనపై నమోదు చేసిన కేసు నుంచి క్లీన్‌చిట్‌తో బయటకొస్తానని మంత్రి ధర్మాన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నింపుకున్న తాను పార్టీకి, నాయకత్వానికి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. ‘‘కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తిని నేను. ఈ దేశంలో ఎందరో నిస్వార్థ నాయకులను తయారు చేసిన కాంగ్రెస్ భావజాలాన్ని ఒంటిబట్టించుకున్న వ్యక్తిని. వ్యక్తిగత ప్రతిష్టకంటే కాంగ్రెస్ ప్రతిష్ట, ప్రభుత్వ గౌరవం ముఖ్యమని, మా నాయకుడికి ఏ సమస్యా రాకూడదని భావించాను. సీబీఐ నాపై అభియోగాలు నమోదు చేసిన కారణంగా ముఖ్యమంత్రికి నా రాజీనామాను సమర్పించాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. మంచి సంప్రదాయాన్ని పాటించాను. ఉన్నత విలువలకు కట్టుబడే రాజీనామా చేశాను.  మంత్రిగా నేను ఎలాంటి అవినీతీ, పొరపాట్లూ చేయలేదని గట్టిగా నమ్ముతున్నా. నమ్మడమే కాదు, కోర్టులో సీబీఐ అభియోగాలను ఎదుర్కొని క్లీన్‌గా బయటకు రాగలననే పూర్తి విశ్వాసం నాకుంది. కేబినెట్ సభ్యునిగా సభా నాయకుడికే రాజీనామా సమర్పించాలనే సంప్రదాయాన్ని పాటించాను. అందుకే గవర్నర్‌ను కలవలేదు’’ అని ధర్మాన వివరించారు. 
మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబుగాం సర్పంచ్‌గా రాజకీయ జీవి తం ప్రారంభించిన ధర్మాన ఆ మండలానికి ఎంపిపిగా పనిచేశారు. ఆ తరువాత జిల్లా యువజన కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో ఎన్.జనార్దనరెడ్డి కేబినెట్‌లో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. 1996లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓడిపోతామని తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాన్ని శిరసావహించి ఎంపీగా పోటీ చేశారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సమర్థంగా తనదైన శైలిలో ఎదుర్కుని పలువురిని ఆకట్టుకున్న గుర్తింపు ఉంది. 1989లో శాసనసభ్యునిగా గెలుపొందిన ధర్మాన ఆ మరుసటి సంవత్సరంలోనే ఎన్ జనార్ధనరెడ్డి కేబినెట్‌లో ఓడరేవులు, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో కూడా రెండోసారి శాసనసభ్యుడిగా గెలుపొందినప్పటికీ అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. 2004లో వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన, 2009లో కూడా రాజశేఖర్‌రెడ్డిహయాంలో  రెవెన్యూ మంత్రిగానే కొనసాగారు. వైయస్ మరణానంతరం రోశయ్య కేబినెట్‌లో కూడా అదే శాఖను నిర్వర్తించిన ధర్మాన కిరణ్ కేబినెట్‌లో ప్రస్తుతం ఆర్అండ్‌బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు అందరూ ముఖ్యమంత్రుల కేబినెట్‌లలో కూడా ధర్మాన తనదైన శైలిలో చక్రం తిప్పారు. ఆయా కేబినెట్‌లలో కీలక వ్యక్తిగా మారారు. ప్రదానంగా  వైయస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా  ఒక వెలుగు వెలిగారు. ధర్మాన పై ఇటీవల కాలంలోనే ఆరోపణలు చుట్టుముట్టాయి. స్థానికంగా వివిధ అంశాలపై ఆయన నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి. అయితే వీటిని ఆయన తన రాజకీయ లౌక్యం, చతురత, వాగ్దాటితో తిప్పికొడుతూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో జారీ అయిన 26 జీవోల విషయంలో తొలిసారిగా ఆయన తీవ్ర ఆరోపణలకు గురయ్యారు. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినపుడు కూడా ధర్మాన గంభీరంగా వ్యవహరించారు. జీవోలు జారీచేసినవారు నిందితులు కారని, ఆ జీవోల వలన లబ్ధి పొందినవారే దోషులుగా వుంటారని ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. చివరకు సీబీఐ చార్జిషీటులో  నిందితునిగా చేర్చడంతో దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తొలిసారిగా దర్మానకు  పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
' వార్తా ప్రపంచం ' వీక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

  రాష్ట్రపతిగా తొలి సారి జాతినుద్దేశించి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ... 

హైదరాబాద్ లో ' ఆటో ' బాదుడు...

హైదరాబాద్ ,ఆగస్ట్ 14:  జంటనగరాలలో ఆటో ఛార్జీలు పెరిగాయి. మీటర్ పై కనీస ఛార్జీని 14 నుంచి 16 రూపాయలు పెంచారు. కిలో మీటర్ కు మీటర్ ఛార్జీని 8 నుంచి 9 రూపాయి పెంచారు. 21 వతేదీ అర్ధరాత్రి నుంచి పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయి. మూడు నెలల్లోగా కొత్త మీటర్లను సవరించుకోవాలని రవాణశాఖ ఆదేశాలు జారీ చేసింది. జంటనగరాలలో ఆటో ఛార్జీలు కనీసం రెండేళ్ళ వ్యవదిలో మీటర్ పై  కనీసం రెండు రూపాయలు  పెరగడం ఆనవాయితీగా వస్తోంది..పైగా అడ్డదారి దోపిడీ తప్పదు.  ప్రభుత్వం  కూడా వారితో లాలూచీ పడ్డమే తప్ప ప్రజల బాధలు పట్టవు...ఇక మళ్ళీ బస్సు చార్జీల బాదుడు కోసం సిద్దంగా ఉండాల్సిందే...

విలాస్ రావు కన్నుమూత

చెన్నై,ఆగస్ట్ 14: : కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మహారాష్ట్రకు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మహారాష్ట్రలోని లాతూరు జిల్లా బభల్ గావ్ లో మే 26, 1945లో విలాస్ రావ్ జన్మించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వైశాలిని ఆయన వివాహం చేసుకున్నారు. పుణె యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్ బి పట్టాలు పుచ్చుకున్నారు. మహారాష్ట్రకు 1999-2003, 2004-2008లో రెండుసార్లు సీఎంగా పనిచేశారు. 2008 ముంబై దాడులతో సీఎం పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. ఆయనకు అమిత్, రితేష్, ధీరజ్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. అమిత్ ఎమ్మెల్యేగా ఉండగా, రితేష్ బాలీవుడ్ నటుడిగా ఉన్నారు.

Monday, August 13, 2012

క్యూరియాసిటీ వ్యోమనౌకకు కొత్త వెర్షన్ సాప్ట్ వేర్

భూమి నుంచే క్యూరి యాసిటీ మెమరీకి అప్‌లోడ్ 
వాషింగ్టన్,ఆగస్ట్ 13:  అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణకు పంపిన క్యూరియాసిటీ వ్యోమనౌకకు శాస్త్రవేత్తలు కొత్త వెర్షన్ సాప్ట్ వేర్  పొందుపరిచారు. పనితీరును మెరుగు పరిచి, అడ్డంకులను అధిగమించే శక్తినిచ్చేందుకు దాని ప్రధాన కంప్యూటర్లలో  మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ఈ సాఫ్ట్ వేర్ ను భూమి నుంచే క్యూరియాసిటీ మెమరీకి అప్‌లోడ్ చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ -నాసా -తెలిపింది. ఈ  నెల 10 నుంచి 13 వరకు సాప్ట్ వేర్  మార్పిడిని పూర్తిచేసినట్లు వెల్లడించింది. కొత్త సాఫ్ట్ వేర్ సాయంతో క్యూరియాసిటీ తన పటిష్టమైన రోబో చేతిని  మరింత సమర్థంగా ఉపయోగించగలదని, ప్రమాదాలను అధిగమిస్తూ ముందుకు ప్రయాణించగలదని పాసెడెనాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఇంజనీర్ బెన్ చిచీ పేర్కొన్నారు. సాప్ట్ వేర్‌ను వివిధ దశల్లో అప్‌గ్రేడ్ చేసే విధంగా ప్రాజెక్టును తొలి దశలోనే డిజైన్ చేసినట్లు తెలిపారు. రోవర్‌లో ప్రస్తుతమున్న సాఫ్ట్ వేర్ దాని ల్యాండింగ్‌కు సంబంధించినదని, కొత్త సాప్ట్ వేర్ అంగారకుడి ఉపరితల ఆపరేషన్స్‌కు సంబంధించినదని వివరించారు. కొత్త సాప్ట్ వేర్ సాయంతో రోవర్.. తన ముందున్న అడ్డంకులను ఫొటోల ద్వారా పసిగట్టి, వాటిని అధిగమిస్తూ, మరింత స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్నారు. రోవర్ సుదీర్ఘ ఆపరేషన్లు చేసేందుకు కొత్త సాప్ట్ వేర్  దోహదపడుతుందన్నారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమ అమలుకై విజయమ్మ దీక్ష

హైదరాబాద్, ఆగస్ట్ 13:   అర్హులైన పేద విద్యార్థులందరికీ  రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం ఏలూరులో దీక్ష చేపట్టారు. అర్హులందరికీ పథకం అమలును యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్‌తో ఆమె  రెండు రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. అంతకు ముందు  దీక్ష స్థలికి చేరుకున్న ఆమెకు విద్యార్థులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

బాబా రామ్ దేవ్ అరెస్ట్

న్యూఢిల్లీ, ఆగస్ట్ 13:  నల్లధనం పై దీక్షకు దిగిన యోగా గురువు బాబా రామ్ దేవ్ బాబాని పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ లీలా మైదానం నుంచి పార్లమెంట్ కు భారీ ర్యాలీ చేపట్టిన వెంటనే పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు. స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతున్నట్లు రామ్ దేవ్ బాబా ప్రకటించారు.

జగన్ కేసు: నాల్గవ చార్జిషీట్‌లో నిందితుడిగా మంత్రి ధర్మాన

హైదరాబాద్, ఆగస్ట్ 13:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ సోమవారం నాలుగో చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్టు పై సిబిఐ ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మంత్రి ధర్మాన ప్రసాద రావును ఈ చార్జిషీట్‌లో చేర్చింది. ఆయనను ఈ చార్జిషీట్‌లో సిబిఐ ఐదో నిందితుడిగా చేర్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద రావు వాన్‌పిక్ ప్రాజెక్టుకు మేలు చేసేలా జీవోలు జారీ చేశారని, ఆ రకంగా ఆయన కుట్ర చేశారని సిబిఐ అభియోగాలు మోపింది. వాన్‌పిక్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన చార్జిషీట్‌లో సిబిఐ 14 మంది నిందితులను చేర్చింది. సిబిఐ 117 పేజీలతో 284 డాక్యుమెంట్లతో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో వైయస్ జగన్ తొల ముద్దాయి కాగా, జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. మిగతా నిందితులు వరుసగా ఇలా ఉన్నారు - నిమ్మగడ్డ ప్రసాద్ (3), మోపిదేవి వెంకటరమణ (4), ధర్మాన ప్రసాద రావు (5), బ్రహ్మానంద రెడ్డి (6), ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ (7), మరో ఐఎఎస్ అధికారి శామ్యూల్ (8), నిమ్మగడ్డ ప్రకాష్ (9), వాన్‌పిక్ ప్రాజెక్టు (10), జగతి పబ్లికేషన్స్ (11), రఘురామ్ సిమెంట్స్ (12), కార్మిలేషియా (13), సిలికాన్ బిల్డర్స్ (14). జీవోల విడుదల సమయంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా పనిచేసినవారిపై కూడా సిబిఐ అభియోగాలు మోపింది. వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 15 వేల ఎకరాలకు పైగా భూములు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్ ముడుపులుగానే జగన్‌కు చెందిన నాలుగు కంపెనీల్లో 854 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టారని సిబిఐ ఆరోపించింది. ఇందుకు రెవన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద రావు 9 జీవోలు చేశారని, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా మన్మోహన్ సింగ్, శామ్యూలు జీవోలపై సంతకాలు చేశారని సిబిఐ ఆరోపించింది. వీరు కుట్రకు పాల్పడ్డారని సిబిఐ అభియోగం మోపింది.
ధర్మాన ప్రసాద రావు 2007, 2008, 2009ల్లో దురుద్దేశ్యవూర్వకంగానే నిమ్మగడ్డ ప్రసాద్‌కు మేలు చేస్తూ జీవోలు జారీ చేశారని సిబిఐ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటి వరకు సిబిఐ ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో నలుగురు ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో ఉండగా, విజయసాయి రెడ్డి బెయిల్‌పై బయటు ఉన్నారు. మే 15వ తేదీన నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను సిబిఐ అరెస్టు చేసింది. మే 22వ తేదీన అప్పుడు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది. మే 27వ తేదీన వైయస్ జగన్‌ను అరెస్టు చేసింది. ధర్మాన ప్రసాద రావును సిబిఐ ఇప్పటికే మూడు సార్లు విచారించింది.
రాజీనామా యోచనలో ధర్మాన? 
ఇలావుండగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన సిబిఐ తనను  ఐదో నిందితుడిగా చేర్చడం పట్ల  తీవ్ర విస్మయానికి గురైన ధర్మాన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిశారు.  మంగళవారం ఆయన కేంద్ర మంత్రి పల్లంరాజును కలుస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి  తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, గవర్నర్ నర్సింహన్‌కు సమర్పిస్తారని భావిస్తున్నారు.

Sunday, August 12, 2012

ముగిసిన ఒలింపిక్స్... పసిడి లేని భారత్ ....

లండన్, ఆగస్టు 12: లండన్ ఒలింపిక్స్ క్రీడోత్సవం ఆదివారంతో ముగిసింది. స్టార్ రన్నర్ ఉసేన్ బోల్ట్ వరుసగా రెండు ఒలింపిక్స్ లోనూ మూడేసి స్వర్ణాలు అందుకొని రికార్డు సృష్టిస్తే, అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఏకంగా అత్యధిక పతకాలు సాధించి చరిత్రను తిరగరాశాడు. అతని ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరగా, వాటిలో 18 స్వర్ణాలే. రెండు రజతాలు, మరో రెండు కాంస్యాలను కూడా ఒలింపిక్స్ లో కైవసం చేసుకున్నాడు. ఇలావుంటే, ఉగ్రవాద దాడుల భయం నేపథ్యంలో బ్రిటన్ ప్రభ్వుం గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మెగా ఈవెంట్‌ను లండన్ ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ విజయవంతంగా పూర్తి చేసింది.  గత నెల 27న ప్రారంభోత్సవం మాదిరిగానే ముగింపు కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. కాగా,  ఒలింపిక్స్ పురుషుల హాకీలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ టైటిల్‌ను నిలబెట్టుకుంది. రివర్‌బాంక్ ఎరీనాలో జరిగిన ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. పతకాల పట్టికలో అమెరికా 104 పతకాలతో మొదటి స్థానం లో నిలవగా, 87 పతకాలతో చైనా రెండవ స్థానం లోనూ, 65 పతకాలతో బ్రిటన్ మూడో స్థానం లోనూ నిలిచాయి. ఇండియా రెండు రజత, 4 కాంస్య పతకాలు మాత్రమే గెలిచింది.  

ఒలింపిక్స్ లో మనకు మరో రెండు పతకాలు

లండన్ , ఆగస్ట్ 12: లండన్ 2012 ఒలింపిక్స్ లో  భారత్ కు రెండవ రజత పతకం లభించింది. రెజ్లింగ్ ఫైనల్ లో సుశీల్‌ కుమార్ పోరాడి ఓడాడు. జపాన్ రెజ్లర్ తత్సుహిరో యోనెమిత్సుతో విజయం సాధించి బంగారు పతకం గెలుచుకున్నాడు. దీనితో   సుశీల్‌ కుమార్ రజత పతకం తో సరి పెట్టుకోవలసి వచ్చింది.
 రెజ్లింగ్‌లో కాంస్య పతకం
హర్యానా రాష్ట్రానికి చెందిన యోగేశ్వర్ దత్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించారు. పురుషుల 60 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో అతను కాంస్యాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో యోగేశ్వర్ 3-1తో ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ మాంగ్ పైన ఘన విజయం సాధించాడు. తొలి రౌండ్లో 0-1తో వెనుకబడిన యోగేశ్వర్ ఆ తర్వాత రెండో రౌండ్లో 1-0తో ఉండి పథకంపై ఆశలు సజీవంగా నిలిపాడు. కీలక మూడో రౌండ్‌లో ఒక్కసారిగా రెచ్చిపోయిన యోగేశ్వర్ కొరియా బాక్సర్‌ని కుప్పకూల్చాడు. పల్టీల మీద పల్టీలు కొట్టించి చివరి రౌండ్‌ను నిమిషంలో ముగించి ఏకంగా ఆరు పాయింట్లు సాధించాడు.

జగన్ పార్టీలో పి.జె. ఆర్. కూతురు..

హైదరాబాద్, ఆగస్ట్ 12: సీనియర్ కాంగ్రెస్ నేత  స్వర్గీయ పి.జనార్ధన్ రెడ్డి కూతురు  విజయా రెడ్డి ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రజా సంక్షేమం కోసమే తాను జగన్ పార్టీలో చేరానని చెప్పారు. ఇద్దరు నేతలను (పిజెఆర్, వైయస్ఆర్) కలిపిన ఘనత తనదే అని చెప్పారు. స్వర్గీయ పిజెఆర్, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అహర్నిశలు ప్రజల కోసం పాటుపడ్డారని,  వారి బాటలోనే నడుద్దామని చెప్పారు.  విజయా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన  సందర్భంగా భారీగా అభిమానులు తరలి వచ్చారు. అంతకుముందు విజయా రెడ్డి ఖైరతాబాద్‌‍లోని మహంకాళీ అమ్మవారి గుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత ఖైరతాబాద్ జంక్షన్‌లోని పిజెఆర్ విగ్రహానికి, పంజాగుట్ట చౌరస్తాలోని వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వెళ్లారు.


Saturday, August 11, 2012

కిరణ్ మార్పు, తెలంగాణ అంశాల పై ఊహాగానాలు...

న్యూఢిల్లీ,ఆగస్ట్ 11: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీ ఉండడంతో రాష్ట్ర రాజకీయాలపై పెద్ద యెత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చానని, తన భేటీలకు రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని గవర్నర్ అన్నారు. అయితే, ఆయన అలా అన్నప్పటికీ ఏదో జరుగుతోందనే ప్రచారం మాత్రం జరుగుతోంది.గవర్నర్ నరసింహన్ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. దానికి తోడు, పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. పైగా, జైపాల్ రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాదులోని పిసిసి కార్యాలయం గాంధీభవన్‌లో జరిగే సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కానీ, దానికి ఆయన హాజరు కాలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపులపై చెలరేగిన వివాదం కారణంగానే మనస్తాపానికి గురై జైపాల్ రెడ్డి రాలేదని చెబుతున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, దానివల్లనే ఆయన రాలేదని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గవర్నర్ భేటీ తర్వాత సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, తాను ఇప్పుడు ఏమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. తాను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశానని, ఆ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న నరసింహన్ కలిసినప్పుడు ఇరువురి మధ్య సంభాషణ జరగడం సహజమని ఆయన అన్నారు. అన్ని విషయాలు గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.     

కేంద్ర మంత్రివర్గంలోకి రాహుల్ ?

న్యూఢిల్లీ,ఆగస్ట్ 11:  రాహుల్ గాంధీని ప్రభుత్వంలోకి అహ్వానించడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. ప్రభుత్వంలోనూ కాంగ్రెసు పార్టీలోనూ పెద్ద పాత్ర పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో ప్రదాని శనివారం ఈ వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీని ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తున్నట్లు తాను ఎప్పుడూ  చెబుతునే ఉన్నట్లు ఆయన మీడియాకు  గుర్తు చేశారు. తాను పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పెద్ద పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను ఏ విధమైన పాత్ర నిర్వహించాలనేది పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ గత నెలలో అన్నారు. కాగా, సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టడంతో ఖాళీ అయిన ఆ పదవిని రాహుల్ గాంధీకి ఇవ్వాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కొంత మంది సోనియా గాంధీని కోరారు. అయితే, ఆ పదవిని హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇచ్చారు. ప్రణబ్ నిర్వహించిన ఆర్థిక శాఖను పి. చిదంబరానికి అప్పగించారు. అయితే, వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని ,ఈ పునర్వ్యస్థీకరణలో రాహుల్ గాంధీకి మంత్రి పదవి ఇవ్వవచ్చుననే ప్రచారం సాగుతోంది. 

Friday, August 10, 2012

అమెరికా రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దుర్మరణం

వాషింగ్టన్,ఆగస్ట్ 11:  అమెరికాలోని ఒక్లహోమా నగరంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న  కారు ఓ మలుపు వద్ద అదుపు తప్పి మరో రోడ్డులో వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొందని, ఈ సందర్భంగా మంటలు చెలరేగి కారు తగలబడిపోయిందని ఒక్లహోమా హైవే పోలీసుల ప్రతినిధి కెప్టెన్ క్రిస్ వెస్ట్ తెలిపారు. మృతులను సుబ్బయ్యగారి జశ్వంత్ రెడ్డి, గాదె ఫణీంద్ర, అంతాటి అనురాగ్, రావికంటి శ్రీనివాస్, వెంకట్‌గా గుర్తించినట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) తెలిపింది.  వీరిలో వెంకట్ ఒక్కరే వివాహితుడని వివరించింది. మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించి.. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ‘తానా’ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వివరించారు. అనురాగ్ కెంటకీలో నివసిస్తుండగా.. మిగతా నలుగురూ ఒక్లహోమా నగరంలో ఉంటున్నారని చెప్పారు.  మృతుల్లో ఫణీంద్ర ఖమ్మం జిల్లా వాసి కాగా.. రావికంటి శ్రీనివాస్ స్వస్థలం క రీంనగర్ జిల్లా గోదావరిఖని. జశ్వంత్ రెడ్డి కడపవాసి. అనురాగ్, వెంకట్ హైదరాబాద్‌కు చెందినవారు.  

టీ-20 వరల్డ్ కప్‌ టీం లో యువరాజ్-న్యూజిలాండ్‌తో సిరీస్ కు లక్ష్మణ్...

ముంబై, ఆగస్ట్ 10:  క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. శ్రీలంకలో జరిగే టీ-20 క్రికెట్ వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో  యువరాజ్‌కు స్థానం దక్కింది. యువరాజ్ సింగ్ 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ లో చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి అతను క్రికెట్‌ కు దూరంగానే ఉన్నాడు. గతవారం ప్రాక్టీస్ గేమ్ ఆడాడు. బెంగళూర్‌లో అండర్ -19 ప్రపంచ కప్ ఆటగాళ్లతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో అతను బ్యాట్ పట్టాడు. లక్ష్మీపతి బాలాజీ, పియూష్ చావ్లాలతో పాటు స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లకు కూడా ట్వంటీ20 జట్టులో తిరిగి స్థానం లభించింది. జట్టు వివరాలు:  ఎంఎస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మనోజ్ తివారీ, జహీర్ ఖాన్, అశోక్ దిండా, ఆర్ అశ్విన్, పియూష్ చావ్లా, లక్ష్మీపతి బాలాజీ, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ.
న్యూజిలాండ్‌తో సిరీస్ కు లక్ష్మణ్...
న్యూజిలాండ్‌తో స్వదేశంలో  జరిగే టెస్టు సిరీస్‌ల్లో మొదటి రెండు టెస్టులకు కూడా సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివియస్ లక్ష్మణ్‌కు చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు మ్యాచ్  ఈ నెల 23వ తేదీన హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 31వ తేదీ నుంచి చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.  భారత జట్టు వివరాలు : ఎంఎస్ ధోనీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, అజంకియా రహనే, పియూష్ చావ్లా, విరాట్ కోహ్లీ, వివియస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, ఆర్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా, ఛతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ.

Thursday, August 9, 2012

హర్యానా మంత్రి మెడకు చుట్టుకున్న మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు

న్యూఢిల్లీ, ఆగస్ట్  9: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక ఆత్మహత్య హర్యానా హోంశాఖ సహాయ మంత్రి గోపాల్ కందా మెడకు చుట్టుకుంది.   ఇరవై మూడేళ్ల గీతికా శర్మ శనివారం రాత్రి ఢిల్లీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ మానసిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖ రాసింది. దీనితో తన తన పదవికి రాజీనామా చేసిన గోపాల్ కందా అజ్ఞాతం లోకి వెళ్ళిపోయారు.  గతంలో ఆయన నిర్వహించిన ఎండిఎల్ఆర్ విమానయాన సంస్థలో  గీతికా శర్మ ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది.  కేసులో నిందితుడైన  గోపాల్  ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, అతని ఆచూకీ దొరకగానే అరెస్టు చేస్తామని  డిల్లీ పోలీసులు చెప్పారు. గూర్గాన్‌లోని కందా ఫామ్ హౌస్‌లో, సిర్సాలోని అతని ఇంట్లో, అతని కార్యాలయాలలో పోలీసులు  సోదాలు నిర్వహించారు.అరెస్టు ప్రచారం నేపథ్యంలో గోపాల్ కందా తన న్యాయవాదిచే గురువారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దరఖాస్తు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా, గీతిక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఎండిఎల్ఆర్ మేనేజర్ అరుణా చద్దాను అరెస్టు చేశారు.
ఉపరితలం నుంచి ఉపరితలం మీద రెండు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగిన అగ్ని-2 ను భారత్ బుధవారం నాడు విజయవంతంగా పరీక్షించింది...

అరెస్ట్ పై జగన్ పిటిషన్ కొట్టేసిన సుప్రింకోర్ట్

హైదరాబాద్, ఆగస్ట్  9: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. తన అరెస్టు అక్రమమంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం గురువారం తిరస్కరించింది. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ వేసిన  పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు గురువారం విచారించింది. జగన్‌కు బెయిల్ ఇవ్వడం పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా చెప్పాలని  సిబిఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు  వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో రెండో నిందితుడుగా ఉన్న విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ వేసిన మరో పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు విజయ సాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్ పై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

అద్వానీపై సోనియా ఫైర్...!

న్యూఢిల్లీ, ఆగస్ట్  8: ఎప్పుడూ ప్రశాంతంగా  కనిపించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కోపం వచ్చింది. బుధవారం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో  యూపిఏ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత అద్వానీ చేసిన వ్యాఖ్య పై ఆమె తీవ్రంగా స్పందించారు.   అద్వానీ చేసిన వ్యాఖ్యలపై సోనియా మండిపడటమే కాకుండా యూపిఏ ఎంపీలంతా నిరసన తెలపాలని సూచించారు. అంతే కాకుండా అద్వానీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేవరకు పట్టుబట్టారు. అసోం అల్లర్లపై అద్వానీ మాట్లాడుతూ అక్రమ చొరబాట్లను యూపిఏ ప్రభుత్వం అరికట్టలేకపోవడం వల్లనే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్నారు. అసోంలో అల్లర్లు హిందూ, ముస్లింలకు సంబంధించినవి కావని, భారతీయులకు, విదేశీయులకు మధ్య జరుగుతున్నవని చెప్పారు. అంతటితో ఆగక యూపిఏ ప్రభుత్వంపై అద్వానీ మరిన్ని విమర్శలు గుప్పించారు. అధికారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన యూపిఏ ప్రభుత్వానికి చట్టబద్దత లేదని వ్యాఖ్యలు చేశారు. దాంతో అద్వానీ సోనియా గాంధీ మండిపడ్డారు. అద్వానీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అద్వానీ తప్పులు చెబుతున్నారంటూ ఆగ్రహంతో చేతిలోని పెన్సిల్‌తో టేబుల్‌పై కొట్టారు. ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు దూకండంటూ యుపిఏ ఎంపీలను పురికొల్పారు. సోనియా తీవ్ర భావోద్వేగాలతో కదిలిపోయారు.పలుమార్లు ఆమె సహచర సభ్యులకు సూచనలిస్తూ.... అనేకసార్లు సైగలు చేశారు. ఆమె పలుమార్లు ప్రతిపక్షం వైపు చేయి చూపిస్తూ మీరిలా చేస్తే సహించేది లేదన్నారు. దీనితో అద్వానీ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గొడవ చేయటంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ దశలో మీరాకుమార్ జోక్యం చేసుకునివ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అద్వానీకి హితవు చెప్పారు. దాంతో ఆయన కొద్దిసేపు బెట్టు చేసినా ఆ తరువాత మీరాకుమార్ సలహా మేరకు యుపిఏ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. సోనియా హావభావాలు, కదలికలు సభలో మొయిలీ సహా పార్టీ సీనియర్ నేతలను విస్మయ పరిచాయి. ఎనిమిదేళ్లుగా యూపీఏకు నేతృత్వం వహిస్తున్న సోనియా ఇన్నేళ్ల కాలంలో ఏనాడూ ఇంత ఆగ్రహంగా ఉండడం చూడని ఎంపీలు మరింత ఉత్సాహంతో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 

Wednesday, August 8, 2012

సత్యం రామలింగ రాజు ఆస్తుల అటాచ్‌మెంటుకు సిబిఐకి అనుమతి

హైదరాబాద్,ఆగస్ట్ 8: సత్యం కేసులో రామలింగ రాజుకు చెందిన రూ.120 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంటుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిసేషన్ (సిబిఐ )కి కోర్టు బుధవారం అనుమతిని ఇచ్చింది. రామలింగ రాజు ఆస్తుల కేసు తుది దశకు చేరుకున్న  నేపథ్యంలో ఆయన ఆస్తుల అటాచ్‌మెంటుకు అనుమతివ్వాలని సిబిఐ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐకి అటాచ్‌మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది. అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతివ్వడంతో ఇక తదుపరి కార్యాచరణకు సిబిఐ సిద్ధమవుతోంది. కాగా ,రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్ల కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రంగారెడ్డి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ ప్రమోటర్లకు చెందిన ఆస్తుల విలువ 2.48 కోట్ల రూపాయల మేర ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 44 రకాల ఆస్తుల జప్తునకు అనుమతి ఇస్తూ  ము ఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే  ఫైల్‌పై సంతకం చేశారు. 

మేరీకామ్ కు కాంస్య పతకం

లండన్, ఆగస్ట్ 8:  భారత్ ఐరన్ లెడీగా పేరు గాంచిన మహిళా బాక్సర్ మేరీకామ్  51 కేజీల ఫ్లై వెయిట్‌ సెమీ ఫైనల్స్ లో బ్రిటన్‌ బాక్సర్‌ నికోల్‌ ఆడమ్స్‌తో చేతిలో పరాజయం పాలైంది. 51 కేజీల ఫ్లై వెయిట్‌లో పోటీపడుతున్నఆమె రెండో సీడ్‌ ఆడమ్స్‌తో 11-6 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత చరిత్రలోనే కాంస్య పతకం అందుకున్న తొలి బాక్సర్‌గా మేరీ రికార్డ్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో నికోల్‌ ఆడంస్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ.. లండన్ ఒలంపిక్స్ నింబంధనల ప్రకారం  మేరీకి కాంస్య పతకం దక్కింది.మేరీకామ్ సాధించిన ఈ మెడల్ తో లండన్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. దీంతో ఒలింపిక్స్ లో భారత రికార్డు మెరుగయింది. బీజింగ్ ఒలింపిక్స్ లో భారత్ మూడు పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు కాంస్యాలున్నాయి.  

Tuesday, August 7, 2012

సైనా నెహ్వాల్‌కు రూ.50 లక్షలు నజరానా

హైదరాబాద్, ఆగస్ట్ 7: ఒలింపిక్స్ లో భారత్‌కు కాంస్య పతకం సాధించిన  ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు నజరానా ప్రకటించింది.  ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత్ తరపున తొలిసారి సెమీస్‌కు చేరి రికార్డు సృష్టించిన సైనా మంగళవారం  హైదరాబాద్  చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో   సైనాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

శ్రీలంకపై ట్వంటీ 20 కూడా మనదే...

పల్లెకలె, ఆగస్ట్ 7: శ్రీలంకతో జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.  టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 156 పరుగుల లక్ష్యాన్ని లంకేయుల ముందుంచింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. ఇర్ఫాన్ పఠాన్ మూడు, దిండా నాలుగు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, అశ్విన్‌లకు తలో వికెట్టు లభించింది. శ్రీలంకను 118 పరుగులకే కట్టడి చేయడంతో విజయం  భారత్ పక్షాన నిలిచింది.  అంతకుముందు   బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.  కోహ్లీ (68) అర్థ సెంచరీతో రాణించాడు. రైనా 34, రహానే 21, ధోనీ 16, గంభీర్ 6 పరుగులు చేశారు. లంక బౌలర్లలో ఈరంగ రెండు వికెట్లు పడగొట్టాడు. మెండిస్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఇప్పటికే వన్డే సిరీస్ లో శ్రీలంక పై భారత్ 4-1 తేడాతో గెలిచింది. 

తెలుగు, ఉర్దూ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత

న్యూఢిల్లీ,,ఆగస్ట్ 7:  ప్రముఖ తెలుగు, ఉర్దూ సాహితీవేత్త సామల సదాశివ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. హిందుస్తానీ సంగీతంపై ఆయన రాసిన ' స్వరలయలు ' గ్రంథానికి ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.  హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ, పార్శీ భాషల నుంచి పలు గ్రంథాలను ఆయన తెలుగులోకి అనువదించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఆయన  గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.  2006లో రాజీవ్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా దయాగామ్ మండలం చెరుపల్లి ఆయన స్వగ్రామం.  1928లో జన్మించిన ఆయన ఆదిలాబాద్‌లోని విద్యానగర్‌లో ఉంటున్నారు. వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడు. యాది అనే ఆయన రచన విశేష ప్రాచుర్యం పొందింది. ఉర్దూలో అంజాద్ రుబాయిలు, హిందుస్థానీ గజల్స్ ఆయన పేరెన్నికగన్న రచనలు. పలువురు ఉర్దూ కవులను ఆయన తెలుగువారికి పరిచయం చేశారు. ఆయనను అభిమానులు ఆత్మీయంగా రుషి, దీర్ఘదర్శి అని పిలుచుకుంటారు. ఆయన రచనలు ఆత్మీయంగానూ ఆసక్తికరంగానూ సాగుతాయి. ఆయన కవిత్వం సాంబశివ శతకం (1950), నిరీక్షణం (1952), ప్రభాతం (1949), విశ్వామిత్రం, సఖినామాలుగా వచ్చాయి. వాటన్నింటితో 2002లో సదాశివ కావ్యసుధ పేర గ్రంథం వచ్చింది.

ఆంధ్రకు ఊరట- రత్నగిరికి గ్యాస్ సరఫరా నిలిపివేత

న్యూఢిల్లీ,,ఆగస్ట్ 7:  ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్ కు కేటాయించిన గ్యాస్ సరఫరాను నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ప్రధాని కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఆ రాష్ట్రానికే చెందాలని పేర్కొంది. రధాని ఆదేశాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే కాకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు, కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి కూడా ఊరట లభించింది. గ్యాస్ మళ్లింపుపై ప్రతిపక్షాల కేంద్ర ప్రభుత్వంపైనే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, జైపాల్ రెడ్డిపై, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్షాల ఒత్తిడి, అధికార పక్షంలోని ఓ వర్గం వ్యాఖ్యలతో తీవ్రమైన ఒత్తిడికి గురైన ముఖ్యమంత్రి గ్యాస్ మళ్లింపుపై సోమవారం విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో చర్చించారు. ఆ తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‍‌ను కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తికి ప్రధాని కార్యాలయం నుంచి వెంటనే సానుకూల స్పందన రావడమే కాకుండా ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

ఉప రాష్ట్రపతిగా తిరిగి హమిద్ అన్సారీ : ఓటింగ్ కు 47 మంది ఎంపీలు దూరం

న్యూఢిల్లీ,,ఆగస్ట్ 7: ఉప రాష్ట్రపతిగా యూపీఏ అభ్యర్థి హమిద్ అన్సారీ మరోసారి ఎన్నికయ్యారు. ఆయనకు 490 ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థి జశ్వంత్ సింగ్ కు 238 ఓట్లు దక్కించుకున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం 787 మంది సభ్యులున్నారు. 47 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనలేదు. కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలు నుంచి 11 మంది, బీజేడీ నుంచి 21 మంది, టీడీపీ నుంచి 11 మంది ఎంపీలు ఓటు వేయలేదు. బీజేపీ, ఏజీపీ, ఆరెఎస్పీ, టీఆర్ఎస్ నుంచి ఇద్దరేసి ఓటింగ్ లో పాల్గొనలేదు. జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.

విలాస్‌రావు దేశ్‌ముఖ్ ఆరోగ్యం విషమం

చెన్నై,ఆగస్ట్ 7:  కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మృత్యువుతో పోరాడుతున్నారు. కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న విలాస్‌రావు చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  వెంటిలెటర్ పైన ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విలాస్‌రావు ఏడాది క్రితం చేయించుకున్న హెల్త్ చెకప్‌లో వ్యాధి విషయం బయటడింది. దీంతో రెండుమూడుసార్లు ఆయన విదేశాలలో చికిత్స చేయించుకున్నారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో కూడా విలాస్‌రావుకు మూడు రోజులు డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో ఆయనను చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. విలాస్‌రావుకు కాలేయ మార్పిడికి కూడా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. విలాస్‌రావు దేశ్‌ముఖ్ 26 మే 1945లో జన్మించారు. మొదటి నుండి కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ప్రముఖ సినీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఆయన తనయుడే. ఆయన మహారాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999 నుండి 2003 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ రెండుసార్లు లాతూర్ నుండి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రమంత్రివర్గంలో  మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో భారీ పరిశ్రమల శాఖను, పంచాయతీరాజ్ శాఖను, గ్రామీణాభివృద్ధి శాఖను, ఎర్త్ సైన్స్ శాఖను, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను చేపట్టారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ మెంబర్‌గా ఉన్నారు.

Monday, August 6, 2012

అంగారక గ్రహంపై దిగిన 'క్యూరియాసిటీ రోవర్'

వాషింగ్టన్,ఆగస్ట్ 6:   నాసా ప్రయోగించిన 'క్యూరియాసిటీ రోవర్'  విజయవంతంగా అంగారక గ్రహంపై దిగింది. దీంతో నాసాలో శాస్త్రవేత్తలు సంబరాలు అంబరాన్నంటాయి. అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లను రోవర్ పసిగట్టనుంది. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన క్యూరియాసిటీ రోవర్ 2011 నవంబరు 26న భూమి నుంచి బయలుదేరింది.  దీని ప్రయోగానికి అయిన ఖర్చు 13,700 కోట్ల రూపాయలు. ఈ ప్రయోగం చాలా క్లిష్టమైందని నాసా పేర్కొంది. ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. ఈ రోవర్ అంగారక గ్రహంపై దిగడం సులభమేమీ కాదు. గంటకు దాదాపు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే వ్యోమనోకను కేవలం ఏడు నిమషాలలోనే అరుణ గ్రహం పైకి సురక్షితంగా దించాలి. ఈ ప్రక్రియ విజయవంతమైంది. క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై రెండేళ్ల పాటు పరిశోధన చేయనుంది. అక్కడి నుండి ఫోటోలు పంపిస్తుంది. ఈ రోవర్ 1540 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి అంగారకుడిపై దిగింది. ఇప్పటి వరకు నాసా శాస్త్రవేత్తలు కేవలం తక్కువ బరువు ఉండే రోవర్‌లను పంపించారు. అవి కూడా కేవలం మూడు నెలలు మాత్రమే అక్కడ పని చేసేవి. కానీ ఈ క్యూరియాసిటీ మాత్రం అందుకు విభిన్నం. ఇది 900 కిలోల బరువైనదే కాకుండా.. రెండు సంవత్సరాల పాటు పని చేస్తుంది. దీనిని అంగారకుడి పైకి ప్రయోగించే ముందు శాస్త్రవేత్తలు అంగారకుడి తరహా వాతావరణాన్ని భూమి మీద సృష్టించి దానిని పరీక్షించారు. ఆ తర్వాతే ప్రయోగించారు. కాగా ఈ తరహా ప్రయోగాలకు భారత ప్రభుత్వం కూడా ఇస్రోకు అనుమతి ఇచ్చింది.  

బాక్సింగ్ లో పతకం ఖాయం చేసిన మేరీ కోమ్‌

లండన్, ఆగస్ట్ 6:  ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల బాక్సింగ్‌లో భారత క్రీడాకారిణి, వరల్డ్ చాంపియన్‌ మేరీ కోమ్‌ మెరుపులు మెరిపించింది. భారతదేశానికి మరో పతకాన్ని ఖాయం చేసింది. బాక్సింగ్లో  మహిళల  ఫ్లై 51 కెజీల కేటగిరీలో ఆమె సెమీ ఫైనల్‌ కు చేరుకుంది.మేరీ కోమ్ టునీషియాకు చెందిన మరోవా రహాలీని 15-6 స్కోరుతో క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. అంతకుముందు తొలి రౌండ్‌లో పోలాండ్‌ బాక్సర్‌ను చిత్తుకింద కొట్టి 19-14తో గెలిచిన మేరీ కామ్‌...క్వార్టర్‌ఫైనల్‌ ఫైట్‌ లోనూ చెలరేగింది.  పవర్‌ పంచ్‌లతో ప్రత్యర్థి మరోవాను అదరగొట్టి సెమీస్‌లోకి ఎంటరై, భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. 29 ఏళ్ళ మేరి కోమ్‌ ఇంతవరకు అయిదుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.

Sunday, August 5, 2012

అమెరికాలో గురుద్వారాలో కాల్పులు--ఏడుగురి మృతి

న్యూయార్క్,ఆగస్ట్ 5: అమెరికాలో విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలోని ఓక్ క్రీక్ వద్ద గురుద్వారాలో ఆదివారం  ఉదయం ప్రార్థనల సమయంలో  కొందరు ఆగంతకులు  విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో  ఏడుగురు మృతిచెందగా ఓ పోలీసు అధికారి సహా కనీసం 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురుద్వారలో మొత్తం ముగ్గురు దుండగులు ఉన్నారని భావిస్తుండగా వీరిలో ఒకరు పోలీసు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. తెల్లజాతికి చెందిన బట్టతల గల భారీకాయుడొక డు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దుండగుడు స్లీవ్‌లెస్ టీ షర్ట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ గురుద్వారను ఆరేడేళ్ల క్రితం  నిర్మించారు. కాగా ఆదివారం ఇక్కడ ప్రసంగించేందుకు భారత్ నుంచి ప్రత్యేకంగా ఓ సిక్కు మతబోధకుడు వచ్చారు. 

విలియమ్స్ సిస్టర్స్ కు ఒలింపిక్స్ 'డబుల్'

లండన్, ఆగస్ట్ 5:  అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణులు విలియమ్స్ సిస్టర్స్ ఒలింపిక్స్ లో రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్ లో నాలుగేసి స్వర్ణ పతకాలు గెలిచిన ఖ్యాతిని అక్కాచెళ్లెలిద్దరూ దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన తుది పోరులో చెక్ రిపబ్లిక్ జోడి ఆండ్రియా, లూసియాను 6-4, 6-4తో వీనస్, సెరెనా విలియమ్స్ ఓడించి టైటిల్ గెలిచారు. సిడ్నీ, బీజింగ్ ఒలింపిక్స్ లో వీరు టైటిల్స్ సాధించారు.
100 మీటర్ల స్ప్రింట్‌లో ఫ్రాజర్‌ కు స్వర్ణం
మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో జమైకా స్టార్‌ ఫ్రాజర్‌ ప్రైస్‌ సంచలనం సృష్టించింది. 10.75 సెకెన్లలో గమ్యం చేరుకుని స్వర్ణ పతకం గెల్చుకుంది. అమెరికా అథ్లెట్‌ జెటర్‌, జమైనా రన్నర్‌ కాంప్‌బెల్‌ బ్రౌన్‌ రజత, కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 1992, 1996లో గెయిల్‌ డెవర్స్స్‌ తర్వాత ఒలింపిక్స్లో 100 మీటర్ల టైటిల్‌ను నిలబెట్టుకున్న అథ్లెట్‌గా ఫ్రాజర్‌ రికార్డుల్లోకి ఎక్కింది.
క్వార్టర్ ఫైనల్లో మేరీకామ్
భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకామ్ ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల ప్లయ్ వెయిట్ 51 కేజీల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పోలెండ్ బాక్సర్ కరోలినా మైకాల్ జుక్ ను 19-14తో ఓడించింది.
వైదొలగిన మనోజ్ కుమార్
భారత బాక్సర్ మనోజ్ కుమార్ వివాదస్పదరీతిలో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. 64 విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ గేమ్ లో అతడు బ్రిటన్ బాక్సర్ థామస్ స్టాకర్ చేతిలో 20-16 తేడితో ఓడిపోయినట్టు జడ్జిలు ప్రకటించారు. 

Saturday, August 4, 2012

చివరి వన్డేలోనూ బారత్ గెలుపు

పల్లెకెలె, ఆగస్ట్ 4:  శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను 4-1 తేడాతో భారత్ గెల్చుకుంది. శనివారమిక్కడ జరిగిన చివరి వన్డేలో లంకపై టీమిండియా 20 పరుగులతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక 45.4 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటయింది. తిరిమానే(77) మెండిస్ (72) అర్థ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. దిండా రెండు వికెట్లు నేలకూల్చాడు. జహీర్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. 

రాష్ట్రానికి ' గ్యాస్ ' కట్....ఇకపై ఇంకా ' పవర్ ' కటకట

హైదరాబాద్, ఆగస్ట్ 4: మహారాష్ట్రలోని విద్యుత్తును ఉత్పత్తి చేసే రత్నగిరి పవర్ ప్లాంటుకు రసాయన ఎరువుల ప్లాంట్లకు ఇచ్చే 'తొలి ప్రాధాన్యం' ఇవ్వాలని  మంత్రుల కమిటీ  నిర్ణయం తీసుకున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో గ్యాస్ సరఫరాకు సంబంధించి రాష్ట్ర కోటా 3.8 ఎంఎంఎస్‌సీఎండి నుంచి ఏకంగా 1.48 ఎంఎంఎస్‌సీఎండీకి తగ్గిపోయింది. ఫలితంగా 400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం కలుగనుంది. రిలయన్స్ సంస్థ గ్యాస్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించివేయడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేటాయించిన దానిలో 38 శాతం గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. ఎన్టీపీసీకి గ్యాస్‌ను మళ్లించడంతో.. ఇది 33 శాతానికి పడిపోయింది. రత్నగిరి దెబ్బకు ఇది 30 శాతం లోపు తగ్గిపోయింది.  ఇంత తక్కువ ఇంధనంతో సాంకేతికంగా గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేయడం కష్టమవుతుంది. రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు సరఫరా చేసే గ్యాస్‌తో రాష్ట్రానికి 400-500 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతుందని ఓడరేవులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అసలే వాతావరణం సహకరించక రాష్ట్రం భారీ విద్యుత్ కొరతను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ తరలింపు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 3.56 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌లో ప్రస్తుతం 1.36 ఎంఎంఎస్‌సీఎండీ మాత్రమే అందుతోందని, మిగతా గ్యాస్‌ను కూడా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఇంతవరకు కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ షిండే స్వరాష్ట్రం మహారాష్ట్ర పై ప్రేమ వల్లే రత్నగిరి పవర్ ప్లాంటుకు మహర్దశ పట్టిందని అంటున్నారు.   

సైనా నెహ్వాల్ కు కాంస్యం

లండన్,ఆగస్ట్ 4:  ఒలింపిక్స్ లో భారత్ కు మూడవ పతకం లభించింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం గెలిచింది. చైనాకు చెందిన ప్రత్యర్థి వాంగ్ జిన్ గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంది.
వికాస్ కృష్ణన్‌ నిస్క్రమణ
 బాక్సింగ్ విభాగంలో  ప్రీ క్వార్టర్ ఫైనల్లో గెలిచి ఫైనల్స్కు చేరుకున్న  భారత క్రీడాకారుడు వికాస్ కృష్ణన్‌కు ఆ  ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ప్రత్యర్థి జట్టు అమెరికా ఫిర్యాదుతో బాక్సింగ్ అసోసియేషన్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ ఫలితాలను తిరిగి సమీక్షించింది. ఈ సమీక్ష అనంతరం అమెరికా క్రీడాకారుడికి అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించింది. దీంతో వికాస్ కృష్ణన్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
35వ స్థానంలో భారత్
ఒలింపిక్‌ పతకాల పట్టికలో  అమెరికా 21 స్వర్ణాలతో సహా 43 పతకాలు అగ్రస్థానంలో ఉండగా,  చైనా 20 స్వర్ణాలతో సహా 42 పతకాలతో రెండో స్థానంలోకి దిగిపోయింది. మిగతా స్థానాల్లో దక్షిణ కొరియా, బ్రిటన్‌, ఫ్రాన్స్ , జర్మనీ, ఇటలీ, ఉత్తర కొరియా, కజఖస్తాన్‌ వున్నాయి. ఇక ఒక రజతం, ఒక కాంస్యం సాధించిన భారత్‌ ప్రస్తుతానికి 35వ స్థానంలో వుంది.

Friday, August 3, 2012

త్వరలో అన్నా రాజకీయ పార్టీ...

న్యూఢిల్లీ, ఆగస్ట్ 3:  ప్రముఖ సామాజిక కార్యకర్త, జనలోక్ పాల్ బిల్లు ఉద్యమ నేత అన్నా హజారే జంతర్ మంతర్ వద్ద శుక్రవారం  సాయంత్రం 6 గంటలకు తన దీక్ష విరమించారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. లోక్ పాల్ బిల్లు ప్రవేశపెడితే తాను రాజకీయాలకు స్వస్తి చెబుతానన్నారు. తాము పెట్టే రాజకీయ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. పార్టీకి అధిష్టానం అంటూ ఏమీ ఉండదని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. తాను ఎన్నికలలో పాల్గొనని చెప్పారు. అవినీతిలో పోరుపై తాను యువత వెంటే ఉంటానని అన్నా ప్రకటించారు.

బ్యాడ్ లక్ సైనా....

లండన్, ఆగస్ట్ 3:  ఒలింపిక్స్ లో  భారత్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్స్ లో  పరాజయం పాలయింది. ,  వెంబ్లీ ఎరీనాలో జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్స్ లో  సైనా నెహ్వాల్, చైనాకు చెందిన వాంగ్ ఇహాన్ చేతిలో  21-13 తో ఓటమి  పాలయింది.   ఈ మ్యాచ్ ఓటమితో సైనా నెహ్వాల్ వరుసగా ఆరు సార్లు వాంగ్ ఇహాన్‌ చేతిలో ఓడిపోయింది. దీంతో  ఇక కాంస్య పతకం కోసం సైనా  శనివారం  వాంగ్ జిన్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.
రాపిడ్ ఫైర్ పిస్టల్ లో భారత్ కు రజత పతకం
ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ లో విజయకుమార్ రజత పతకం గెలుచుకున్నాడు. 585 పాయింట్లతో విజయకుమార్ ఈ పతకం సాధించాడు. కాగా,  50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ లో జాయ్ దీప్ కర్మాకర్ 0.9 పాయిట్ల తేడాతో కాంస్యపతకం చేజార్చుకున్నారు.

Thursday, August 2, 2012

సెమీఫైనల్స్ కు చేరిన సైనా

లండన్,ఆగస్ట్ 2: ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగోసీడ్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో సెమీఫైనల్స్ కు చేరి పతకానికి చేరువైంది. వెంబ్లీ ఎరెనాలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో  సైనా 21-15, 22-20 తో వరల్డ్ ఏడో ర్యాంకర్, ఏడోసీడ్ టిన్ బాన్ (డెన్మార్క్) పై విజయం సాధించింది. నాలుగేళ్ల కిందట బీజింగ్ గేంస్ లో క్వార్టర్స్ లోనే వెనుదిరిగిన సైనా ఈసారి మాత్రం ఆ అడ్డంకిని సునాయాసంగానే దాటింది. శుక్రవారం జరిగే సెమీ పైనల్స్ లో సైనా... వరల్డ్ నంబర్‌వన్ యిహాన్ వాంగ్ (చైనా) తో తలపడుతుంది.  గతంలో ఈ ప్రత్యర్థితో ఐదుసార్లు తలపడిన సైనా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.  కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్న సైనా ఈసారి వాంగ్‌ను దెబ్బకొట్టాలని... పతకాన్ని ఖాయం చేసుకోవాలని భారత్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. 

రాజకీయ ప్రత్యామ్నాయంపై అన్నా హజారే దృష్టి...

న్యూఢిల్లీ,ఆగస్ట్ 2: సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటం కీలక మలుపు తిరిగింది. తన మద్దతుదారులతో  రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అన్నా హజారే  ఉన్నట్లు అర్థమవుతోంది.తాను స్వయంగా రాజకీయాల్లో పాల్గొనబోనని, అయితే రాజకీయ ప్రత్యామ్నాయానికి మద్దతు ఇస్తానని అయన చెప్పారు. ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చవేర్చడంలో తప్పు లేదని ఆయన అన్నారు. అన్నా హజారీ దీక్ష గురువారం ఐదో రోజుకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు దీక్ష విరమించనుంది. దేశంలో మార్పునకు రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరమైతే దాన్ని పూరించాల్సిందేనని ఆయన అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల చేతుల్లో ఉండాలని ఆయన అన్నారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చని నాయకులను అధికారం నుంచి దించేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటుకు సరైన వ్యక్తులు ఎన్నిక కావడానికి రాజకీయ పార్టీ ఏర్పాటు మాత్రమే ప్రత్యామ్నాయం అయితే అందుకు సిద్ధపడడంలో తప్పు లేదని ఆయన అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న అన్నా హజారే చుట్టూ వేలాది మంది మద్దతుదారులు చేరారు. ఆయన కుడిచేయి మణికట్టు రాఖీలతో నిండిపోయింది. పార్టీని ఏర్పాటు చేయాలా అనే విషయంపై 48 గంటల్లో సమాచారం అందించాలని ఆయన తన అనుచరులకు సూచించారు. అన్నా అసలు రంగు బయటపడిందని కాంగ్రెసు నేత అంబికా సోనీ విమర్శించారు.

క్వార్టర్ ఫైనల్స్ కు సైనా నెహ్వాల్

లండన్,ఆగస్ట్ : ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. నెదర్లాండ్ క్రీడాకారిణి యోజీ పై 21-14, 21-16 తేడాతో సైనా నెహ్వాల్ గెలిచింది.
 పేస్-విష్ణువర్ధన్ జోడీ నిష్క్రమణ
లండన్: ఒలింపిక్స్ నుంచి భారత టెన్నిస్ క్రీడాకారులు పేస్-విష్ణువర్ధన్ జోడీ నిష్క్రమించింది. టెన్నిస్ పురుషుల డబుల్స్ రెండో రౌండ్ లో ఫ్రెంచ్ జోడీపై 6-7, 4-6, 3-6 తేడాతో పేస్ జోడీ ఓడిపోయింది.

Wednesday, August 1, 2012

ఇక హాట్‌ మెయిల్‌ బంద్...కొత్తగా అవుట్‌లుక్‌ మెయిల్‌ ...

న్యూఢిల్లీ,, ఆగస్ట్ 1:వ్యక్తిగత ఇ-మెయిల్‌కు నాంది పలికిన హాట్‌ మెయిల్‌ మూత పడింది. సభీర్‌ భాటియా అనే భారతీయుడు 1996 లో దీనిని స్థాపించారు. హాట్‌ మెయిల్‌ వచ్చే వరకు పర్సనల్‌ ఇ-మెయిల్‌కు అవకాశం ఉండేది కాదు. సమీర్‌ భాటియా విప్లవాత్మక ఐడియాతో ముందుకు రావడం.. అప్పట్లో పెను సంచలనం కలిగించింది. పర్సనల్‌ మెయిల్‌ ఒక భారీ మార్కెట్‌ అవుతుందనే అంచనాతో మైక్రోసాఫ్ట్‌400 మిలియన్‌ డాలర్లు వెచ్చించి హాట్‌మెయిల్‌ను కొనుగోలు చేసింది. గానీ పర్సనల్‌ మెయిల్‌ మార్కెట్లో ఆ కంపెనీ ఎదగలేకపోయింది. జీమెయిల్‌ దెబ్బకు హాట్‌మెయిలే కాదు ఆ తర్వాత వచ్చిన యాహూ మెయిల్‌ కూడా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌.. అవుట్‌లుక్‌ మెయిల్‌ పేరుతో ఒక కొత్త సర్వీసును ప్రారంభించింది. జీమెయిల్‌ కంటే మెరుగైన సేవలు ఇందులో లభిస్తాయని చెప్పింది. అవుట్‌లుక్‌ మెయిల్ ఉన్నందున హాట్‌మెయిల్‌ను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 

క్వార్టర్‌ ఫైనల్స్ కు కశ్యప్

హైదరాబాద్, ఆగస్ట్ 1: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు,  పారుపల్లి కశ్యప్ లండన్ ఒలింపిక్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. పురుషుల సింగిల్స్ లో క్వార్టర్‌ ఫైనల్స్ కు చేరుకున్న మొదటి భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ప్రి క్వార్టర్స్లో శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను 21-14, 15- 21, 21-9 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్స్స్‌కు చేరుకోవడం ద్వారా కశ్యప్ ఈ  ఘనత సాధించాడు.                              

ఈ నెల 14 వరకు జగన్ రిమాండ్ పొడిగింపు...

హైదరాబాద్, ఆగస్ట్ 1: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసు, ఎమ్మార్ కేసులలోని నిందితులను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి, వారందరికీ ఈ నెల 14వ తేది వరకు రిమాండ్ పొడిగించింది. ఈ మూడు కేసులలో అరెస్టైన జగన్‌ను, నిమ్మగడ్డ ప్రసాద్‌ను, మోపిదేవి వెంకటరమణను, గాలి జనార్ధన్ రెడ్డిని, విజయ రాఘవను తదితరులను కోర్టు విచారించింది. ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మీ మాత్రమే కోర్టు విచారించలేదు. మిగిలిన అందరినీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి 14 వరకు రిమాండును పొడిగించింది.  జగన్ గత మే 27వ తేదిన అరెస్టు కాగా,  గాలి గత సంవత్సరం అరెస్టయ్యారు. అప్పటి నుండి ఈ కేసులలో వరుసగా నిందితులు అరెస్టవుతున్నారు. ఈ మూడు కేసులలోనూ సిబిఐ ఇప్పటికే కోర్టులో పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...