Tuesday, May 31, 2011

తెలంగాణ వచ్చి తీరుతుంది: సుష్మా

కరీంనగర్, మే 31:   తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరంలో ఏర్పాటై తీరుతుందని బీజేపీ సీనియర్ నేత, లోకసభలో ప్రతిపక్షనాయకురాలు సుష్మాస్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.కరీంనగర్‌లో  రాష్ట్ర  బి.జె.పి.ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పోరు’ సభలో సుష్మా ప్రసంగిస్తూ.. తెలంగాణ సంస్కతి, చరిత్ర చాలా గొప్పదన్నారు. నైజాం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఆమె నివాళులర్పించారు. అంతేకాక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు కూడా సుష్మా నివాళులర్పించారు. తెలంగాణ సాధనే బీజేపీ లక్ష్యమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం తెలంగాణ కోసం పోరాడుతునే వుంటామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు.

లోక్‌పాల్‌పై రాష్ట్రాలకు, రాజకీయపార్టీలకు లేఖ

న్యూఢిల్లీ,మే 31:  లోక్‌పాల్ బిల్లుపై వివిధ రాష్ట్రాలోని ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేఖలు రాశారని కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలిపారు. ప్రధాన మంత్రిని, పార్లమెంట్ సభ్యులను, ఉన్నత న్యాయవ్యవస్థల్ని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలా అనే విషయంపై రాష్ట్రాల నుంచి, రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని సేకరించేందుకు లేఖ రాశారని ఆయన తెలిపారు. అంతేకాక ఉన్నత పదవుల్ని నిర్వహిస్తున్న వారిని లోక్‌పాల్ లేదా లోకయుక్తాపరిధిలోకి తీసుకురావాలా అని  లేఖలో అడిగినట్టు ఆయన తెలిపారు. ఈ విషయంపై పౌర సమాజంలోని సభ్యుల, రాజకీయ పార్టీల, నిపుణుల మధ్య ఏకాభిప్రాయం కుదురలేదన్నారు. ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరేలా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.

మరోసారి జూపల్లి రాజీనామా

హైదరాబాద్.మే 31: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌ను కలిసి మరోసారి రాజీనామా సమర్పించారు. మార్చి 3 తేదిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలకు జూపల్లి కృష్ణారావు రాజీనామా లేఖను పంపిచారు. అయితే జూపల్లి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదు. దాంతో గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించి, ఆమోదించాల్సిందిగా కోరారు.మంత్రులందరూ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు. 

Monday, May 30, 2011

రోశయ్యకు గవర్నర్ గిరీ...?

హైదరాబాద్ ,మే 29:మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన రోశయ్య  మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించిన రోశయ్యకు గవర్నర్ పదవి  కట్టబెట్టే అన్శాన్న్ని చర్చిందుకే రోశయ్యను సోనియా ఢిల్లీకి అహ్వానించినట్లు చెబుతున్నారు.  రోశయ్య ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితిపై కాస్తా తీవ్రంగానే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియాకు ఆయన ఇటీవల ఓ లేఖ కూడా రాశారు. కాగా, హైదరాబాదులోని అమీర్‌పేట భూకుంభకోణం వల్ల రోశయ్య గవర్నర్‌గిరీకి ఆటంకాలు ఏర్పడతాయా అనేది అనుమానంగా ఉంది. ఈ కేసును పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కేసుపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎసిబి కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఎసిబి కోర్టు రోశయ్య పేరును క్లియర్ చేయడానికి మరో వారం రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయనను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నాయి.

‘మహంకాళి’ షూటింగ్‌లో గాయపడ్డ రాజశేఖర్

చెన్నై,మే 29:  ‘మహంకాళి’ చిత్ర షూటింగ్‌లో హీరో రాజశేఖర్ సోమవారం గాయపడ్డారు. గాయపడిన రాజశేఖర్‌ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కుడి చేతికి, కన్నుకు గాయమైనట్టు సమాచారం. ఆయనకు ప్రమాదమేమి లేదని 15 రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. రాజశేఖర్ సతీమణి జీవిత దర్శకత్వంలో ‘మహంకాళి’ చిత్రం రూపొందుతోంది. కిల్‌పాక్ మెడికల్ కాలేజిలో ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

చిరంజీవి చిన్నల్లుడికి సుప్రీంలో చుక్కెదురు

న్యూఢిల్లీ,మే 29: వరకట్న వేధింపుల కేసులో చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పరస్పర అంగీకారం కోసం రెండు  కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కావున తన క్లయింట్ కు  బెయిల్ ఇప్పించాలన్న శిరీష్ తరపున న్యాయవాది అభ్యర్థనను జీఎస్ సింఘ్వీ, చంద్రమౌళి ప్రసాద్‌లతో కూడిన బెంచ్ తిరస్కరించింది. కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా 2007 సంవత్సరంలో హైడ్రామాతో శిరీష్ వివాహం చిరంజీవి కూతురు శ్రీజతో జరిగింది. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా శిరీష్ దంపతులు రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆతర్వాత శిరీష్ దంపతులు మీడియా కాన్ఫరెన్స్‌లో తమ పెళ్లిని చెడగొట్టేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే నాలుగేళ్ల తర్వాత నాటకీయంగా శిరీష్‌పై వరకట్న వేధింపుల కేసును తన తల్లితో కలిసి శ్రీజ దాఖలు చేసింది. ఈ కేసులో శిరీష్‌కు హైదరాబాద్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

గేల్‌ పై వెస్టిండీస్ బోర్డు వేటు

అంటిగ్వా,మే 29: బోర్డు మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్‌పై అనుచిత వాఖ్యలు చేసినందుకు విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్‌పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ వేటు వేసింది. భారత్‌తో ప్రారంభం కానున్న సిరీస్‌లో ఒక టీ20 మ్యాచ్‌కు, మరో రెండు వన్డేలకు గేల్‌ను దూరంగా ఉంచుతూ వెస్టిండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా టీమ్, బోర్డ్ మేనేజ్‌మెంట్‌పై జమైకా రేడియోలో గేల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం లేపాయి. దాంతో గేల్ నుంచి వివరణ కోరేందుకు సెలక్షన్ కమిటీ ముందు హాజరుకావాలని బోర్డు కోరింది. 

Sunday, May 29, 2011

పార్టీని రక్షించుకోవడం కోసమే ఎన్‌టీఆర్‌పై తిరుగుబాటు

మహానాడు లో బాబు వివరణ  
హైదరాబాద్ ,మే 29:  తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశం మహానాడు ఆదివారం ముగిసింది. ఈ మహానాడులో 14 తీర్మానాలను ప్రవేశపెట్టినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ మహానాడును రైతులకు అంకితం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తెలుగుదేశం  పార్టీని రక్షించుకోవడం కోసమే ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్టీయార్‌పై తిరుగుబాటు చేశానని.. 200 మంది ఎమ్యెల్యేలతో నాయకత్వ మార్పు చేశానని చంద్రబాబునాయుడు  ముగింపు ప్రసంగంలో అన్నారు.   దివంగత నేత ఎన్‌టీఆర్‌పై తిరుగుబాటు చేస్తాననుకోలేదని,  పార్టీ నాశనం కోసం ఓ దుష్టశక్తి ప్రయత్నించిందని.. దాన్ని అడ్డుకోవడం కోసమే ఎంటీఆర్కు  వ్యతిరేకంగా ఎదురు తిరుగాల్సి వచ్చిందన్నారు.  రాజకీయం వేరు.. బంధుత్వం వేరని అన్నారు. పార్టీలో తన కుటుంబం ఎన్నడూ తలదూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో చెప్పాల్సింది చెప్పా, కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.1995-2004 కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని ఆయన అన్నారు. రైతుల కోసం అవిశ్వాస తీర్మానానికి సిద్ధమని.. అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొడతామని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానం పెట్టండి చూద్దాం....సి.ఎం. సవాల్

చిత్తూరు,మే 29:  దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని సీఎం స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానానికి ఎంత సంఖ్య కావాలో తెలియని వారు కూడా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు.  రాజకీయ లబ్ది కోసమే పార్టీలు ఎదురుదాడి చేస్తున్నాయని విమర్శించారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీ

చిరు వర్గానికి మొండి చెయ్యి...
వై.ఎస్.వివేకాకు నో చాన్స్...
హైదరాబాద్ ,మే 29:   రెండు నెలలపాటు పెండింగ్‌లో ఉంచిన గవర్నర్ కోటా శాసనమండలి సభ్యుల నియామకాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఖరారు చేసింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తన కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎ.చక్రపాణి, డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్, రెడ్డెప్పరెడ్డి, అంగూరి లక్ష్మీశివకుమారిలను నామినేట్ చేశారు. గత మార్చి 29వ తేదీ వరకూ సభ్యులుగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలకు ఉద్వాసన పలికారు. మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డితో పాటు.. కాంగ్రెస్‌లో విలీనం కానున్న ప్రజారాజ్యం పార్టీకి కూడా అధిష్టానం మొండిచేయి చూపింది. ఐఎన్‌టీయూసీ నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్ కుమార్తె మజ్జి శారదకు బదులుగా ఇద్దరు కొత్త వారికి అవకాశం లభించింది. మార్చిలో పదవీ కాలం ముగిసిన శాసనమండలి మాజీ చైర్మన్ ఎ.చక్రపాణి, డి.రాజేశ్వర్‌రావులకు మాత్రమే మళ్లీ అవకాశం ఇచ్చారు. వాస్తవానికి నాలుగేళ్ల పదవీ కాలానికి నామినేట్ అయిన నలుగురు ఎమ్మెల్సీలు మార్చిలో పదవీ విరమణ చేసినా.. కడప లోక్‌సభ, పులివెందుల శాసనభ స్థానాలకు ఉపఎన్నికలను సాకుగా చూపి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త సభ్యుల ఎంపికను వాయిదా వేయించారు. అప్పటి నుంచీ ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరో ఎమ్మెల్సీ కోలా రాజ్యలక్ష్మి మృతితో మరో రెండేళ్ల పదవీకాలం గల స్థానం కూడా అంతకు ముందే ఖాళీ అయింది. కోలా రాజ్యలక్ష్మి స్థానంలో శివకుమారి నియుక్తులయ్యారు. ఆమె పదవీ కాలం రెండేళ్లు (2013 మార్చి వరకు) ఉంటుంది. మిగతా నలుగురు ఆరేళ్లు కొనసాగుతారు.

టైటిల్‌ నిలబెట్టుకున్న చెన్నై

చెన్నై,మే 29:  ఐపీఎల్-4 లో  చెన్నై తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ధోని గ్యాంగ్ భారీ స్కోరు , కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్.. వెరసి చెన్నైను ఐపీఎల్-4 విజేతగా నిలిపింది. చెన్నై 58 పరుగుల తేడాతో బెంగళూర్ పై ఘన విజయం సాధించింది.  206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ వెటోరి సేన ఆదిలోనే కష్టాల్లో పడింది. గత బెంగళూర్ మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గేల్.. ఈ మ్యాచ్‌లో నిరాశపరిచి (0) పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో బెంగళూర్‌కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇక ఛేదించడం తమ వల్ల కాదన్నట్టు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్‌కు చేరారు. అగర్వాల్(10), డివిలియర్స్ (18)), పోమర్‌బాక్ (2), వెటోరి (0), మిధున్ (11)లు వరుసుగా వికెట్లు సమర్పించుకోవడంతో బెంగళూర్ తొందరగానే చేతులెత్తేసింది. కోహ్లీ ఒక్కడే (35) పరుగులు చేసి ఫర్వాలేదనిపించుకున్నాడు. తివారీ (42) పరుగులతో కడ వరకూ క్రీజ్‌లో ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. బెంగళూర్ 147 పరుగులకే పరిమితమవ్వడంతో భారీ ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్టు తీయగా , జకాతీ రెండు, రైనా, బ్రేవోలకు తలో వికెట్టు దక్కింది.

Saturday, May 28, 2011

విశ్వ విఖ్యాత నట సార్వభౌమా...జోహార్...



మహానటుడు,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు 88వ  జయంతి సందర్భంగా ' వార్తాప్రపంచం ' ఘన నివాళి...ఎడిటర్

మహానాడు లో లోకేష్ ఫ్లెక్సీల పై హరికృష్ణ గరం...!

 బాబు దిద్దుబాటు యత్నం... ?
హైదరాబాద్,మే 28:  నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టిన నాయకులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా నాయకుడు విజయ్‌బాబును ఆయన మందలించారు. మహానాడు వేదికపై నారా లోకేష్ ఫ్లెక్సీని పెట్టి తన ఫ్లెక్సీని పెట్టకపోవడంపై రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు  సమాచారం అందిన నేపథ్యంలో ,తన కుమారుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.  లోకేష్ ఫ్లెక్సీలు పెట్టడం వంటి చర్యలను తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయడం, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రాకపోవడం వంటి కారణాలతో చంద్రబాబు వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలకు దిగినట్లు చెబుతున్నారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎటువంటి తీర్మానాలు చేయవద్దని ఆయన సూచించారు. అనవసరమైన వివాదాలకు కారణం కావద్దని ఆయన అన్నారు. 

గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ ' నిప్పు '

హైదరాబాద్: రవితేజ హీరోగా బొమ్మరిల్లు బ్యానర్ పై దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి నిర్మిస్తున్న 'నిప్పు' చిత్రం షూటింగ్  హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రవితేజ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాజమౌళి క్లాప్ ఇచ్చారు. మామూలుగా గుణశేఖర్ సినిమాలు భారీతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. భారీ సెట్లు, భారీ ఖర్చు సినిమా నిండా కనపడతాయి. అయితే, ఈమధ్య కాలంలో తన సినిమాలను (అర్జున్, సైనికుడు, వరుడు) ఆ భారీతనం ఏమాత్రం కాపాడలేకపోయిన విషయాన్ని గుణసేఖర్  గ్రహించాడేమో... తాజాగా రూపొందిస్తున్న 'నిప్పు' సినిమాలో ఆ భారీతనానికి, భారీ సెట్స్ కు, గ్రాఫిక్స్ కు స్థానం ఇవ్వడం లేదని  దర్శకుడు గుణశేఖర్ స్వయంగా  చెప్పాడు. రవితేజ బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఉంటూనే, కొత్తదనంతో అతని పాత్ర సాగుతుందని  గుణశేఖర్ చెప్పారు. ఈ సినిమాకి ఆకుల శివ సంభాషణలు రాస్తున్నారు.  హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదట. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నామని  నిర్మాత వై.వి.ఎస్.చౌదరి చెప్పారు.

Friday, May 27, 2011

తెలంగాణా పై మార్పు లేని బాబు మాట

పరిష్కార బాధ్యత కాంగ్రెస్ దే...
మాకు రెండు ప్రాంతాలు ముఖ్యం... 

హైదరాబాద్,మే 27: తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నది కాంగ్రెసు పార్టీయేనని, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెసుదేనని ఆయన అన్నారు. పార్టీ మహానాడులో శుక్రవారం చేసిన అధ్యక్షోపన్యాసంలో ఆయన తెలంగాణపై విస్తృతంగా మాట్లాడారు. కానీ కొత్త విధానాన్ని ప్రకటించలేదు. బిజెపి, కాంగ్రెసు పార్టీలు జెండా పెట్టుకుని తెలంగాణ ఉద్యమాలు చేస్తే తమ పార్టీ మాత్రం జెండా పెట్టుకుని ఆందోళన చేయవద్దని అంటున్నారని ఆయన అన్నారు. తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెసుకు గానీ ఇతర పార్టీలకు గానీ లేదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని, అది తమ తప్పు ఎలా అవుతుందని, సమాధానం చెప్పాలని కాంగ్రెసు పార్టీని అడుగుతున్నానని ఆయన అన్నారు.  రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి తాను ఏం చేయాలన్నా చేస్తానని ఆయన చెప్పారు.తెలుగు ప్రజలతో కాంగ్రెసు పార్టీ ఆడుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. టిడిపిని నామరూపాలు లేకుండా చేస్తామని తెరాస నాయకులు అంటున్నారని, ఆ పని తెరాస వల్ల కాదని ఆయన అన్నారు. లాలూచీ పడి తెరాసను కాంగ్రెసులో కలిపేస్తారని ఆయన అన్నారు. తెలంగాణపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పాయని,  నిర్ణయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. జెండా అండలో పెరిగి, ఈ పార్టీలో ఉండి పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి అన్యాయం చేశారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు రాజకీయాలు మాత్రమే ముఖ్యమయ్యాయని, ప్రజారాజ్యం పార్టీని కలుపుకున్నారని, తెరాసను కలుపుకుంటారని ఆయన అన్నారు.
 జగన్‌ కు  సవాల్
ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దుమ్ముంటే ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను సవాల్ చేశారు. ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందని, తన కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తోందని, తాను కన్నెర్ర చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని జగన్ అన్నారని, కన్నెర్ర చేయాలని తాను జగన్‌ను అడుగుతున్నానని, ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించే విషయంలో తాము వెనక్కి తగ్గడం లేదని ఆయన అన్నారు. తనకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల సంతకాలతో గవర్నర్‌కు జగన్ లేఖ సమర్పించాలని, అలా లేఖ ఇచ్చినప్పుడు గవర్నర్ బలపరీక్ష చేసుకోవాలని ముఖ్యమంత్రికి సూచిస్తారని, అటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ శాసనసభ్యులు కచ్చితంగా ఓటేస్తారని ఆయన అన్నారు. ధైర్యం ఉంటే జగన్ తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులతో గవర్నర్ వద్దకు వెళ్లాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నామని చెప్పిన వైయస్ జగన్ వ్యాఖ్యను ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసు పార్టీ విషవృక్షమని, ఆ విషవృక్షం కొమ్మనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో వైయస్ జగన్ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు గుండెల్లో నిద్రపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆయన అన్నారు. సామాజిక మార్పు తెస్తానని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఏ సామాజిక మార్పు తెచ్చారో చెప్పాలని ఆయన అన్నారు. పలు పార్టీలు వచ్చాయని, అవేవి నిలబడలేకపోయాయని, తెలుగదేశం పార్టీ మాత్రమే నిలబడిందని, తెలుగుదేశం మాత్రమే నిలబడుతుందని ఆయన అన్నారు.
ఆసంతృప్తి లేదన్న హరి
తనకు ఏ విధమైన ఆసంతృప్తి లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు  బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. గత కొద్ది రోజులుగా ఆయన చంద్రబాబు నాయుడి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వారసత్వపోరులో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ,    చంద్రబాబు  ప్రసంగం  పూర్తయ్యే వరకు తాను మహానాడులోనే ఉన్నానని ఆయన చెప్పారు. ఇదిలా వుంటే, తెలంగాణకు చెందిన శాసనసభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, జైపాల్ యాదవ్, జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి  మహానాడుకు హాజరు కాలేదు. హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి కి మద్దతు తెలిపారు.

మహానాడు వేళ 'రామ ' భజన...




వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు భారత్ జట్టు

ముంబై,మే 27: : వెస్టిండీస్ తో   టెస్ట్ సిరీస్ కు  భారత్ క్రికెట్ జట్టుని ప్రకటించారు. ఈ జట్టులో 16 మంది సభ్యులు ఉంటారు. కెప్టెన్ గా ధోనీ, వైఎస్ కెప్టెన్ గా లక్ష్మణ్ ఉంటారు.  భజ్జీ , మునాఫ్, రైనా, అభినవ్ ముకుంద్, మురళీ విజయ్, ద్రవిడ్, కోహ్లీ, బద్రీనాద్, శ్రీకాంత్, అమిత్ మిశ్రా, ఇషాంత్, పార్ధీవ్ పటేల్ జట్టులో ఉన్నారు.  సచిన్ కు విశ్రాంతి ఇచ్చారు. జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. 

Thursday, May 26, 2011

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ

అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 

హైదరాబాద్,మే 26: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ. అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికైనట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. సభ్యత్వం, ఎన్నికల నిర్వహణ సమన్వయకర్తగా పీఎన్‌వీ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొల్లి నిర్మలా కుమారి, యువజన విభాగం అధ్యక్షుడిగా - పి. ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా - మద్దినేని అజయ్‌లను నియమించారు. పార్టీ సలహాదారులుగా డీఏ సోమయాజులు, సీసీ రెడ్డిలు వ్యవహరించనున్నారు. పార్టీ సెంట్రల్ గవర్నరింగ్ కౌన్సిల్ సభ్యులుగా... కొణతాల రామకృష్ణ, పెనుమత్స సాంబశివరాజు, వైవీ సుబ్బారెడ్డి, హాబీబ్ అబ్దుల్ రెహ్మన్, బి. కరుణాకర్ రెడ్డి. బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, జూపుడి ప్రభాకర్‌రావు, ఆర్‌కే రోజా సెల్వమణి, డీఏ సోమయాజులు, మాకినేని పెద్దరత్తయ్య, భూమా నాగిరెడ్డి, జక్కపూడి విజయలక్ష్మి, కణితి విశ్వనాథం, తోపుదుర్తి కవిత, బాలమణెమ్మ, ఎమ్ మారెప్ప, జంగ కృష్ణమూర్తి, మదన్‌లాల్ నాయక్, గిరిరాజ్ నాగేష్, గంపా వెంకటరమణలను నియమించారు. కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీలన్ని తాత్కాలికమేనని ఆపార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి తెలిపారు. పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి కమిటీలన్ని జూలైలో ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి స్థాయి కమిటీలను ప్లీనరీ సమావేశంలో ప్రకటిస్తామన్నారు.




' విజేత ' గా వరుణ్ సందేశ్

హైదరాబాద్:  వరుణ్ సందేశ్ హీరోగా జెమిని ఫిలిం సర్క్యూట్ నిర్మిస్తున్న చిత్రానికి ' విజేత ' టైటిల్ ను ఖాయం చేశారు.  సందీప్ గుణ్ణం ఈ చిత్రానికి దర్శకుడు గా పరిచయ మవుతున్నారు. ఆయన ఇంతకుముందు  ' అమ్మచెప్పింది ' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. 

భారత సైంటిస్టుకు అంతర్జాతీయ ఫెలోషిప్

ముంబై, మే 26: రసాయన శాస్త్రంలో మైక్రోమాలిక్యూల్స్ విభాగంలో చేసిన పరిశోధనలకుగాను భారత్‌కు చెందిన డాక్టర్ జయంత్ కందారే ప్రతిష్టాత్మకమైన అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. జయంత్ ప్రస్తుతం పిరామల్ లైఫ్ సెన్సైస్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నారు. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారిలో ఇప్పటివరకు 44 మంది నోబెల్ బహుమతిని గెలుచుకోవడం గమనార్హం. జర్మనీకి చెందిన హంబోల్ట్ ఫౌండేషన్ పరిశోధన రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించడానికి ఈ ఫెలోషిప్‌ను అందజేస్తోంది. డాక్టర్ జయంత్ ముంబై యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పూణెలోని నేషనల్ కెమికల్ లాబరేటరీనుంచి పీహెచ్‌డీ చేశారు. కేన్సర్ కణాలను నాశనం చేసే ఔషధాలపై జయంత్ పరిశోధనలు చేస్తున్నారు.

కోల్‌కతా కథ కంచికి...

ముంబై,మే 26: ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన రెండో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం  ముంబై 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఇక ముంబై ఫైనల్ చేరాలంటే శుక్రవారం బెంగళూరుతో జరిగే రెండో క్వాలిఫయర్‌లో నెగ్గాలి. ఇరు జట్ల మధ్య విజేత శనివారం జరిగే ఫైనల్లో చెన్నైను ఎదుర్కొంటుంది. టోర్నీ ఆరంభంలో చక్కటి విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన గంభీర్ జట్టు చివరకు ఎలిమినేటర్ రౌండ్‌లోనే వెనుదిరిగింది.

ముంబై కి' బెజవాడ రౌడీలు '

హైదరాబాద్,మే 26: విజయవాడలో ' బెజవాడ రౌడీలు ' సినిమా షూటింగుకు న్యాయవాదులు అభ్యంతర పెట్టడంతో పోలీసులు  అనుమతి రద్దు చేశారు. తమకు స్క్రిప్టు ఇస్తే, న్యాయ నిపుణుల సలహా తీసుకుని షూటింగుకు అనుమతి ఇచ్చే విషయంపై ఆలోచన చేస్తామని విజయవాడ పోలీసు కమిషనర్ చెప్పారు.  దీనితో  చిత్రం షూటింగ్ ని ముంబై కి షిప్ట్ చేసి మిగతా పార్ట్ ని ఫినిష్ చేయాలని  రాంగోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాలేశ్వరరావు మార్కెట్, కృష్ణా నది, దుర్గా ఆలయం ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయటంతో కీలకమైన సీన్స్ వచ్చేసాయని,  మిగిలినవి అవసరమైతే గ్రాఫిక్స్ లో చూసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చారని  అంటున్నారు. నాగచైతన్య కథానాయకుడిగా శ్రేయా ప్రొడక్షన్స్ పతాకంపై వివేక్ కృష్ణ దర్శకత్వంలో రామ్‌ గోపాల్ ‌వర్మ, కిరణ్ ‌కుమార్ కోనేరు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, శుభలేఖ సుధాకర్, ముకుల్‌దేవ్, అజయ్, అశోక్‌ కుమార్, ఫణి, భరత్, శ్రావణ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

రసాభాసగా తెలుగుదేశం 'తెలంగాణ రణభేరీ'

కరీంనగర్,మే 26‌: తెలుగుదేశం తెలంగాణ ఫోరం తలపెట్టిన తెలంగాణ రణభేరీ బహిరంగ సభతో కరీంనగర్ రణరంగంగా మారింది. పార్టీ జెండాను పెట్టి తెలంగాణ సభ నిర్వహించాలనే తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుల ప్రయత్నానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. హైదరాబాదు నుంచి బయలుదేరిన తెలుగుదేశం నాయకులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. పోలీసుల సహకారంతో ఎట్టకేలకు బుధవారం సాయంత్రం వారు కరీంనగర్ చేరుకోగలిగారు. రణభేరీ బహిరంగ సభలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులంతా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినా 12 మంది గైర్హాజయ్యారు. నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలాచారిలకు ఆహ్వానాలే  వెళ్లలేదు. కాగా, కరీంనగర్ కమాన్ వద్ద తెలుగుదేశం నాయకుల పైకి తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి కారుపై రాళ్లతో తెలంగాణవాదులు దాడి కూడా చేశారు. కరీంనగర్ తెలుగుదేశం పార్టీ కార్యలయానికి దుండగులు నిప్పు పెట్టారు. తీవ్రమైన ఉద్రిక్తత మధ్య తెలంగాణ రణభేరీ బహిరంగ సభ  సాయంత్రానికి ప్రారంభమైంది. కాగా, టీడీపీ జెండా తోనే తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని రణభేరి సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. 

టీడీపీ నుంచి నాగం జనార్దనరెడ్డి సస్పెన్షన్‌

హైదరాబాద్, మే 26: తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నాగం జనార్దనరెడ్డిని    పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.  పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న నేత ఒకరికి ఎలాంటి షోకాజ్ నోటీసూ జారీ చేయకుండా ఏకంగా సస్పెండ్ చేయటం టీడీపీ చరిత్ర లో ఇదే ప్రథమం. ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న నాగం జనార్దనరెడ్డి కొద్దిరోజులుగా పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణా రాహిత్యంగా భావించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందని టీడీపీ ఒక  ప్రకటనలో పేర్కొంది. పర్సనల్ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగిస్తున్నందున నాగంపై చర్య తీసుకున్నామని   ప్రకటనలో తెలిపారు.
టీడీపీ సమైక్యవాదుల పార్టీ: నాగం ధ్వజం
నాగం జనార్దనరెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ ను ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకరరావు, మాజీ మంత్రి బోడ జనార్దన్, తెలుగుయువత ప్రధాన కార్యదర్శి చల్లా మాధవరెడ్డి, కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి కొత్త జైపాల్‌రెడ్డి  ఖండించారు.  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోరుతూ గళం విప్పినందుకు చంద్రబాబు నాగంకు సస్పెన్షన్‌ను బహుమతిగా ఇచ్చారని వారు విమర్శించారు. నాగం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ సమైక్యవాదుల పార్టీ అని, అది సమైక్యవాదానికే కట్టుబడి ఉందనే విషయం తన సస్పెన్షన్‌తో తేలిపోయింద న్నారు. 

అవిశ్వాసంపై బాబుకు జగన్ సవాల్

విజయనగరం,మే 26: సం క్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం ఇక ఎంత మాత్రం ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పేద ప్రజల పట్ల నిజంగా ప్రేమే ఉంటే ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతూ నోటీసులు ఇవ్వాలని , అవిశ్వాస తీర్మానానికి అవసరమైతే తమ వర్గం  మద్దతు పలుకుతుందని జగన్ సవాల్ విసిరారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్ర సందర్భంగా రెండో రోజు బుధవారం ఆయన పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో పర్యటించారు. ఎస్‌ఎస్‌ఆర్ పేట గ్రామంలో ఉణుకూరు అప్పారావు కుటుంబాన్ని ఓదార్చారు. మొయిద జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.

Wednesday, May 25, 2011

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో టోర్నడో ధాటికి చిన్నాభిన్నమైన జోప్లిన్ నగరంలో దృశ్యం. 
ఈ ప్రకృతి విలయంలో 116 మంది మరణించారు.

ఆఫ్రికా దేశాలకు భారత్ వరాలు

ఆడిస్ అబాబా,మే 25: :  ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నూతన సహకారాత్మక సంఘీభావం చోటుచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. భారత్, ఆఫ్రికాలోని 15 దేశాలు పాల్గొన్న ‘ఆఫ్రికా- ఇండియా ఫోరం’ రెండో శిఖరాగ్ర సదస్సు ప్లీనరీలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆఫ్రికా దేశాలకు ఆయన పలు వరాలు ప్రకటించారు. మూడేళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేలా 500 కోట్ల డాలర్ల రుణంతో పాటు ఆ దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు, సామర్థ్య పెంపుదలకు సాధ్యమైనంత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అంతేకాకుండా మరో 70 కోట్ల డాలర్లను కొత్త సంస్థల ఏర్పాటు, శిక్షణ అవసరాల కోసం.. మరో 30 కోట్ల డాలర్లను ఇథియో-జిబౌతి రైల్వేలైన్ నిర్మాణానికి అందజేయనున్నట్లు వెల్లడించారు. 2008లో న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ‘ఆఫ్రికా- ఇండియా ఫోరం’ సదస్సులో ప్రధాని ప్రకటించిన 540 కోట్ల డాలర్ల రుణానికి ప్రస్తుతం ప్రకటించిన రుణ మొత్తం అదనం. 

ఫైనల్లో‌ చెన్నై సూపర్ కింగ్స్

ముంబై,మే 25: :  ఐపీఎల్-4 లో  ఇక్కడి  వాంఖేడి స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి ప్లేఆఫ్ మ్యాచ్‌లో బెంగళూర్‌ పై చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఫైనల్‌కు చేరింది.  టాస్ గెలిచి బెంగళూర్‌కు బ్యాటింగ్ అప్పగించిన చెన్నైకు భారీ లక్ష్యమే ఎదురైంది. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ రన్‌రే ట్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగింది.  రైనా -మోర్కెల్‌జోడి  వరుస సిక్సర్లు, ఫోర్లుతో విరుచుకుపడి చెన్నై గెలుపు ఖాయం చేశారు. రైనా (73), మోర్కెల్ (28) పరుగులు చేశారు. చివరి వరకూ పోరాడిన బెంగళూర్‌కు ఓటమి తప్పలేదు. ఇంకా రెండు బంతులు ఉండగానే చెన్నై విజయం సాధించి ఫైనల్లో బెర్తు ఖాయం చేసుకుంది. ఎలిమినేటర్ స్థానంలో ఉన్న బెంగళూర్ ఫైనల్ బెర్తు కోసం మరో మ్యాచ్ చూడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తన తదుపరి మ్యాచ్‌లో ముంబై-కోలకతా మ్యాచ్ విజేతతో బెంగళూర్ తలపడనుంది. 

ఐఐటీ లోరాష్ట్రానికి మొదటి ర్యాంకు

హైదరాబాద్,మే 25: : ఐఐటీ-2011 ప్రవేశ పరీక్షలో రాష్ట్రానికి చెందిన పృధ్వీరాజ్ మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆలిండియా జనరల్ కేటగిరిలో మొదటి పది ర్యాంకుల్లో ఏడు ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకుని  తమ సత్తా నిరూపించారు. శ్రీ చైతన్య, నారాయణ, కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు భారీగా ర్యాంకులు సాధించారు.  మన రాష్ట్రం నుంచి 65వేల మంది విద్యార్థులు ఐఐటీ ప్రవేశ పరీక్షకు హాజరు అయ్యారు.ర్యాంకులు సాధించిన విద్యార్థులు: ఫస్ట్ ర్యాంకు : పృద్వీరాజ్.రెండోర్యాంకు : నితిన్,మూడో ర్యాంకు : సైమంత్ రెడ్డి,నాలుగో ర్యాంకు : సాయి కిరణ్,ఆరో ర్యాంకు : కునాల్ సాహా,ఎనిమిదో ర్యాంకు : భార్గవ్ రెడ్డి,తొమ్మిదో ర్యాంకు : వరుణ్.

Monday, May 23, 2011

సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 81.71 శాతం ఉత్తీర్ణత

న్యూఢిల్లీ,మే 24:   సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో 81.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  గత ఏడాదితో పోలిస్తే ఇది 1.84 శాతం పెరిగిందని, బాలికలే ఈసారి ముందంజలో నిలిచారని తెలిపాయి. బాలికల ఉత్తీర్ణతా శాతం 86.93 కాగా బాలుర ఉత్తీర్ణతా శాతం 77.83 శాతం గానమోదైంది.  ఈ ఏడాది మొత్తం 7,70,043 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.  

అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు

ముంబై,మే 24:  అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఎంపికయిన  ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ద్వారకా తిరుమలకు చెందిన శ్రీచైతన్య విద్యార్థి పృథ్వీ తేజ , హైదరాబాద్‌కు చెందిన బుర్లె సాయి కుమార్ ఈ ఘనత సాధించారు.  జూలై 10 నుంచి 18 వరకు బ్యాంకాక్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో వీరు పాల్గొంటారు. ఈసారి 80 దేశాల విద్యార్థులు ఒలింపియాడ్‌లో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆణిముత్యాలను వెలికితీసేందుకు 1967లో అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌ను స్థాపించారు. దేశం నుంచి ఎంపికైన మరో ముగ్గురిలో జైపూర్(రాజస్థాన్)కు చెందిన నిశీత్ లహోటీ, కోటా (రాజస్థాన్)కు చెందిన శుభం మెహత్రా, బటిండా(పంజాబ్)కు చెందిన సుమేఘ గార్గ్ ఉన్నారు. వీరందరికన్నా పృథ్వీ తేజ్ చిన్న వయస్కుడు కావడం విశేషం.  

తెలంగాణ పై త్వరలో అఖిలపక్ష సమావేశం: చిదంబరం

న్యూఢిల్లీ,మే 23: తెలంగాణపై కేంద్రం వైఖరిలో ఎటువంటి మార్పు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలతో త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. భేటీకి తేదీలు ఇంకా ఖరారు కాలేదని  విలేకరుల సమావేశంలో చిదంబరం తెలిపారు. కర్ణాటక గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజను వెనక్కు పిలిచే ప్రసక్తి  లేదని చిదంబరం  మరో ప్రశ్నకు సమధానంగా స్పష్టం చేశారు. భరద్వాజ తన విధులు నిర్వర్తించారని, ఆయన పంపిన నివేదికపై తామే నిర్ణయం తీసుకున్నామని  చెప్పారు. గవర్నర్ నివేదికలోని అంశాలు కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించేందుకు నిర్ణయం తీసుకునేలా లేవని ఆయన అన్నారు.

Sunday, May 22, 2011

అతిచిన్న త్రీడీ ప్రింటర్ !

వాషింగ్టన్,మే 22:  కేవలం కిలోన్నర బరువు మాత్రమే ఉండే ఓ సరికొత్త త్రీడీ ప్రింటర్‌ను వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు. తక్కువ ధరతోనే అందరికీ అందుబాటులోకి వచ్చే ఈ బుల్లి ముద్రణ యంత్రం ఆవిష్కరణతో త్రీడీ ముద్రణ, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి .

అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టే వారికి ఈజీగా గ్రీన్‌కార్డు

వాషింగ్టన్, మే 22:  అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టే విదేశీయులకు ఇకపై శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందటం సులభతరం కానుంది. ఈ మేరకు వీరి దరఖాస్తులను 15 రోజుల్లోనే పరిష్కరించే విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. తద్వారా తమ దేశంలో ఉద్యోగాల కల్పన పుంజుకుంటుందని అమెరికా యోచిస్తోంది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్లను ప్రోత్సహించటం  ఆర్థిక, జాతీయ భద్రతను పెంచుకోవాలన్న ఒబామా సర్కారు నిర్ణయాలకు అనుగుణంగా తాజా విధానాన్ని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి గ్రీన్‌కార్డు దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ పేరుతో కొత్త విధానాన్ని సూచించింది. దీని ప్రకారం గ్రీన్‌కార్డు దరఖాస్తులను అదనపు ఫీజు స్వీకరించి 15 పని దినాల్లో పరిష్కరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలను తమ దేశానికి ఆకర్షించేందుకు అమెరికా కాంగ్రెస్ 1990లో ‘ఈబీ-5’ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ముంబై ఇండియన్స్ సంచలన విజయం

బెంగళూరు,మే 22: ఈడెన్‌ గార్డెన్లో  ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ను ఓడించింది. టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కలిస్ (42 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)  అర్ధసెంచరీ సాధించాడు. మనోజ్ తివారీ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్సర్), యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడారు. ముంబై బౌలర్లలో అబు నెచిమ్, ఫ్రాంక్లిన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.  ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి ఆఖరి బంతికి గెలిచింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన ఫ్రాంక్లిన్‌ (47) కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

బెంగళూరు నెంబర్‌వన్

బెంగళూరు,మే 22:  స్థానిక చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచిన రాయల్స్ చాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 128 పరుగులు  చేయగలిగింది. కెప్టెన్ ధోని (40 బంతుల్లో 70; ఫోర్లు 3, సిక్స్ 6) ఒంటరి పోరాటం చేసినా, రెండో ఎండ్‌లో సహకరించే బ్యాట్స్మన్ కరవయ్యాడు. ధోనిని మినహాయిస్తే సాహా (30 బంతుల్లో ఫోర్, సిక్స్తో  22) ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడు.  అనంతరం బరిలోకి దిగిన వెటోరి సేన 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయానికి అవసరన్మైన  129 పరుగులు సాధించింది. కొహ్లి 29 బంతుల్లో 31 పరుగులు చేశాడు. . మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గేల్‌కు దక్కింది.

పట్టు వదలని నాగం

 హైదరాబాద్ ,మే 22:   ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా టీడీపీ తరఫున కేంద్రానికి లేఖ పంపేలా తెలంగాణలోని గ్రామ, మండల, జిల్లా పార్టీ కార్యవర్గాలు మహానాడు లోపు తీర్మానాలు చేయాలని లేదా చంద్రబాబుకు లేఖలు రాయాలని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి కోరారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు తాము అనుకూలమని లేఖ పంపిన ప్పటికీ.. ఆ కమిటీకి కాలం చెల్లిందని, మరోమారు అదే కాపీని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరానికి పంపాలని కోరుతూ అంతకుముందు చంద్రబాబుకు నాగం లేఖ రాశారు. ప్రణబ్ కమిటీకి లేఖ రాసిన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తెలంగాణకు వ్యతిరేకమనే సంకేతాలు ప్రజల్లో ఉన్నాయని, వాటిని తొలగించేందుకు మరోమారు లేఖ పంపాలని విజ్ఞప్తి చేశారు.  తనకు పదవులపై ఆశలేదని,  ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవిని వారు ఆజ్ఞాపించినపుడు వదిలేసేందుకు సిద్ధమని చెప్పారు. 

కక్ష్యలో జీశాట్-8

బెంగళూరు,మే 22:  ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ప్రయోగించిన జీశాట్-8 ఉపగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్‌లో అమర్చిన 440 న్యూటన్ లిక్విడ్ అపోజీ మోటార్(ఎల్‌ఏఎం)ను 95 నిమిషాలపాటు మండించి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చారు. కర్ణాటకలోని హసన్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నియంత్రణ కేంద్రం నుంచి ఈ మొత్తం ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా శాస్త్రవేత్తలు నియంత్రించగలిగారు. ప్రస్తుతం 15 గంటల 56 నిమిషాలకోసారి ఉపగ్రహం తన కక్ష్యలో పరిభ్రమిస్తోందని తెలిపారు.

Friday, May 20, 2011

కటకటాలలో కనిమొళి

న్యూఢిల్లీ,మే 20:  2జి స్పెక్ట్రమ్ కేసులో డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, కళైంజ్ఞర్ టివీ సిఇఓ శరత్ కుమార్ లను సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 30న తదుపరి విచారణ జరుగుతుంది. వారిని తీహార్ జైలుకు తరలించారు. ఈ ఇద్దరికి బెయిలు ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడం తో వారిని అరెస్ట్ చేశారు.

బెంగాల్ 11వ ముఖ్యమంత్రిగా మమత ప్రమాణ స్వీకారం

కోల్‌కతా,మే 20: పశ్చిమబెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.  గవర్నర్ ఎంకే నారాయణన్ ఆమెతో ప్రమాణం చేయించారు. బెంగాల్ లో ౩4 ఏళ్ల తర్వాత తొలి వామపక్షేతర నేతగా, రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా మమత గద్దెనెక్కారు. . ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తాజా మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిమన్ బోస్ సహా 3,200 మంది ప్రముఖులు హాజరు అయ్యారు. కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ, ఏకే ఆంటోనీ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేశారు. 

కిరణ్ క్యాబినెట్ లో జగన్ కోవర్టులు...!

 లిస్ట్  లో కోమటిరెడ్డి , మోపిదేవి, తోట నర్సింహం, విశ్వరూప్, పితాని... 
హైదరాబాద్ ,మే 20:  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టులు ఉన్నారా...!  కాంగ్రెస్  రాష్ట్ర పరిశీలకుడు గులాం నబీ ఆజాద్ కు   పలువురు కాంగ్రెసు నేతలు ఈ విషయం చెప్పారని తెలిసింది. అంతేకాదు ముఖ్యమంత్రి కూడా తనపై ఫిర్యాదులకు కారణం జగన్ కోవర్టులే అని అధిష్టానానికి వివరణ కూడా ఇచ్చుకున్నారంట. ముఖ్యమంత్రి కిరణ్ మంత్రివర్గం ఒక్కటే అయినప్పటికీ అందులో నాలుగు గ్రూపులు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వర్గం, అధిష్టానం వర్గం, జగన్ వర్గం, గోడమీది పిల్లిలా మరో వర్గాలు కేబినెట్‌లో ఉన్నాయని సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ గ్రూపులో డిఎల్ రవీంద్రారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, శ్రీధర్ రెడ్డి, గల్లా అరుణకుమారి తదితరులు ఉండగా, అధిష్టానం విదేయులలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మీనారాయణ, శంకర్ రావు, గీతారెడ్డి తదితరులు ఉన్నారు. గోడ మీది పిల్లుల్లా వ్యవహరిస్తున్న వారు కూడా కేబినెట్లో చాలామందే ఉన్నారంట. రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, రాంరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు గోడమీది పిల్లుల్లా ఉంటూ ఎటు లాభం చేకూరితే అటు ఉండటానికి తయారయి ఉన్నారని తెలుస్తోంది. కాగా, మంత్రివర్గంలో జగన్ వర్గానికి చెందిన వారు దాదాపు ఐదుగురు ఉన్నారని సమాచారం. అందులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు నిత్యం వినబడుతూనే ఉంటుంది. కోమటిరెడ్డితో పాటు మోపిదేవి వెంకటరమణ, తోట నర్సింహం, విశ్వరూప్, పితాని సత్యనారాయణ పేర్లు జగన్ వర్గం మంత్రులుగా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరెవరూ కూడా జగన్‌ను బహిరంగంగా సమర్థించిన దాఖలాలు లేక పోవడం విశేషం. అయితే అవకాశం వస్తే మాత్రం జగన్‌కు లాభం కలిగించడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది.

పుణే వారియర్స్ కు మరో ఓటమి

ముంబై,మే 20:  ఇక్కడి డీవైపాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్  పుణే వారియర్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా... పుణే వారియర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. యువరాజ్ సింగ్ (26 బంతుల్లో 24; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్. గంగూలీ (22 బంతుల్లో 18; 1 సిక్సర్), రాణా (16 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో పఠాన్, షకిబుల్, బాలాజీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోల్‌కతా జట్టు 16.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసి గెలిచింది. కలిస్‌కు గాయం కావడంతో ఓపెనర్‌గా వచ్చిన గంభీర్ (46 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు) ఇన్నింగ్స్ ఆద్యంతం చక్కగా ఆడి అజేయ అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఫామ్‌లో ఉన్న మనోజ్ తివారీ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) కెప్టెన్‌కు అండగా నిలిచాడు. మరోస్టార్ యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా  పరుగులు చేసి మ్యాచ్‌ను తొందరగా ముగించాడు. 

చైనాలో ఆంధ్రా విద్యార్థి మృతి

అనపర్తి,మే 20: వైద్య విద్య చదివేందుకు చైనా వెళ్లిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాసరెడ్డి( 26) షాంగై లోని యాంగోజియా యూనివర్సిటీలో వైద్య విద్య చదువుతున్నాడు. గత డిసెంబర్‌లో ఎంబీబీఎస్‌ను పూర్తిచేసి జనవరి నుంచి హౌస్ సర్జన్ చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో విద్యాభ్యాసం ముగించుకుని డాక్టర్ పట్టాతో స్వగ్రామానికి తిరిగి వస్తాడనుకుంటున్న తరుణంలో ఆయన మరణవార్త ఇంటికి చేరింది. ఈ నెల 16న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్ లిల్లీ జి.యాంగ్ పెడపర్తిలో ఉంటున్న శ్రీనివాసరెడ్డి అక్క వరలక్ష్మికి మెసేజ్ పంపించారు. 

58వ జాతీయ చలనచిత్ర అవార్డులు

'ఆడుకాలం' లో ఒక దృశ్యం 
సలీంకుమార్
ధనుష్
న్యూఢిల్లీ,మే 20: 58వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. మతం కోసం మనిషి అన్వేషణను అద్భుతంగా చిత్రీకరించిన మళయాళ సినిమా ‘అడమింటే మకాన్ అబు’ జాతీయ ఉత్తమ చిత్రంగా, కోడిపందేల ఇతివృత్తంతో రూపొందిన తమిళచిత్రం ‘ఆడుకాలం’ దర్శకుడు వెట్రిమారన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ చిత్రాల్లో నటించిన సలీంకుమార్ (అడమింటే మకాన్ అబు), ధనుష్ (ఆడుకాలం) ఉత్తమ జాతీయ నటుడి అవార్డును సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. జాతీయ ఉత్తమ నటి అవార్డుకు తమిళనటి శరణ్య పొణ్‌వాన్నన్ (తెన్‌మెర్కు పరువక్కట్రు), మరాఠీనటి మిథాలీ జగ్‌తప్ వరాద్కర్ (బాబూ బ్యాండ్ బాజా) సంయుక్తంగా ఎంపికయ్యారు. విశాల్ భరద్వాజ్ (ఇష్కియా), థామస్ కొట్టకపల్లి (అడమింటే మకాన్ అబు) సంయుక్తంగా ఉత్తమ సంగీత దర్శకులుగా నిలిచారు. టాలీవుడ్ సినిమా ‘అద్వైతం’ ఉత్తమ విద్యా విషయిక లఘు చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. అత్యధిక చిత్రాలు నిర్మించే తెలుగు చిత్ర సీమకు ఈ ఒక్క అవార్డు మాత్రమే దక్కడం గమనార్హం. ఉత్తమ బాల నటుడి అవార్డును హర్ష మాయర్ (ఐ యామ్ కలాం), శంతను రంగనేకర్, మశ్చీంద్ర గడ్కర్ (చాంపియన్-మరాఠీ), వివేక్ చబుక్‌స్వార్ (బాబూ బ్యాండ్ బాజా) సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. జాతీయ సమైక్యతా చిత్రానికి అందించే నర్గీస్ దత్ అవార్డును బెంగాలీ చిత్రం ‘మనేర్ మానుష్’ సొంతం చేసుకుంది. కొత్త దర్శకులకు అందించే ఇందిరాగాంధీ అవార్డును మరాఠీ చిత్రం ‘బాబూ బ్యాండ్ బాజా’ దక్కించుకుంది. కన్నడ చిత్రం ‘హెజ్జగళు’ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ గాయకుడిగా సురేష్ వాడ్కర్ (మీ సింధుతాయ్ సప్కాల్-మరాఠీ), ఉత్తమ గాయనిగా రేఖా భరద్వాజ్ (ఇష్కియా) ఎంపికయ్యారు. రజనీకాంత్ నటించిన ‘ఎంతిరన్’ (రోబో) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డును దక్కించుకుంది. సామాజిక వేత్త సింధుతాయ్ సప్కాల్ జీవితం ఆధారంగా తీసిన మరాఠీ చిత్రం ‘మీ సింధుతాయ్ సప్కాల్’ స్పెషల్ జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. ప్రకాష్‌రాజ్ నిర్మించిన కన్నడ చిత్రం ‘పుట్టక్కన హైవే’ ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. విజయ్ మూలే రాసిన ‘ఆజాస్ అండ్ యోగీస్ టూ గాంధీ అండ్ బియాండ్: ఇమేజ్ ఆఫ్ ఇండియా’ ఉత్తమ సినిమా పుస్తకంగా అవార్డు దక్కించుకుంది.జాతీయ అవార్డుల్లో బాలీవుడ్ వెనుకంజ వేసింది. సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’, నజీరుద్దీన్‌షా, విద్యాబాలన్ నటించిన ‘ఇష్కియా’ మాత్రమే బాలీవుడ్‌నుంచి అవార్డులు దక్కించుకోవడం గమనార్హం. ‘దబాంగ్’ ఉత్తమ ప్రజారంజక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. ఇష్కియా చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా విశాల్ భరద్వాజ్, ఉత్తమ గాయనిగా ఆయన సతీమణి రేఖా భరద్వాజ్ అవార్డులు దక్కించుకున్నారు. రిషికపూర్ నటించిన ‘దో దునీ చార్’ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది.  




నెత్తురోడిన గడ్చిరోలి

రెండు  ఎన్‌కౌంటర్లలో  27 మంది నక్సల్స్, నలుగురు పోలీసుల మృతి
ముంబై, మే 20: మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగి లింది. గడ్చిరోలి జిల్లాలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో సుమారు 27 మంది నక్సల్స్ మృతి చెందినట్లు తెలిసింది.  నక్సల్స్ జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు కమాండర్, ఇద్దరు ఎస్పీవోలు  సహా నలుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని నర్గొండా ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు ఉదయం 7:30కు మెరుపుదాడి చేశారు. పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. సుమారు గంటన్నరపాటు పోలీసులు, నక్సలైట్ల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి సమీపంలో ఇద్దరు సీనియర్ మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉంది. నక్సల్స్ కాల్పుల్లో సీ-60 బెటాలియన్‌కు చెందిన చిన్న మెంట అనే కమాండర్ మృతిచెందారు. కాగా, బామ్రాగడ్ తాలూకాలోని తడ్‌గావ్ పరిసరాల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. రహదారిపై నక్సల్స్ అమర్చిన మందుపాతరను పోలీసులు వెలికితీసి తిరిగి వెళ్తుండగా నక్సల్స్ కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో సుమారు 12 మంది నక్సల్స్ మృతిచెంది ఉండవచ్చని తెలుస్తోంది. నక్సల్స్ కాల్పుల్లో ఎస్పీవోలు సుధాకర్, పుంగటి, కానిస్టేబుల్ సురేంద్ర పఠాన్ మరణించారు.

Thursday, May 19, 2011

నాకౌట్‌కు చెన్నై

చెన్నై,మే 19:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో ఈ జట్టు 11 పరుగుల తేడాతో కొచ్చి టస్కర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కొచ్చి 20 ఓవర్లలో ఐదు వికెట్లకే 141 పరుగులకు పరిమితమైంది.

అల్‌ఖైదా కొత్త నేత సైఫ్ అల్ ఆడెల్...?

వాషింగ్టన్,మే 19: ఒసామా బిన్ లాడెన్ మృతితో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా తాత్కాలిక అధినేతగా ఈజిప్టు ప్రత్యేక దళాల మాజీ అధికారి సైఫ్ అల్ ఆడెల్ బాధ్యతలు నిర్వహించడానికి నిర్ణయం జరిగినట్లు సిఎన్‌ఎన్ పేర్కొంది. అల్‌ఖైదాలో ఉన్నత స్థాయి వ్యూహకర్త, సీనియర్ మిలిటరీ నాయకుడైన సైఫ్ అల్ ఆడెల్ అల్‌ఖైదా తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరించడానికి నిర్ణయమైనట్లు మాజీ లిబియా మిలిటెంట్ నోమన్ బెనోట్‌మన్‌ను ఉటంకిస్తూ సిఎన్‌ఎన్ పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన ‘ద న్యూస్’ వార్తాపత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆడెల్ అల్‌ఖైదా చీఫ్‌గా నియమితుడైనట్లు ధ్రువీకరించింది. అల్‌ఖైదాలో లాడెన్ తర్వాత స్థానంలో డిప్యూటీగా ఉంటూ వచ్చిన అల్‌జవహరీ కూడా ఆడెల్‌ను తాత్కాలిక చీఫ్‌గా అంగీకరించినట్లు సిఎన్‌ఎన్ తెలిపింది.

యడ్యూరప్ప సేఫ్...?

బెంగళూరు,మే 19: కర్ణాటక లో  రాష్ర్టపతి పాలన విధించాలంటూ గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ పంపిన ప్రత్యేక నివేదికపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించడం లేదు. రాజ్యాంగ విరుద్ధ చర్యలుండవంటూ ఇప్పటికే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఎన్‌డీఏ నేతలకు హామీ ఇచ్చారు. గవర్నర్ వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. బుధవారం ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ప్రశంసలు కురిపించారు. రోజుకు 18 గంటలు కష్టపడే సీఎం అని పొగిడారు. అసెంబ్లీలో యడ్యూరప్పకు మంచి మెజారిటీ ఉందని ఒప్పుకున్నారు. మరోవైపు, రాష్ట్రపతి పాలనకు సంబంధించి తన వాదనలో మార్పులేదని స్పష్టంచేశారు. తన నివేదికపై కేంద్రం ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఐదేళ్లూ కొనసాగుతానని ధీమా వ్యక్తంచేశారు. కాగా, గవర్నర్‌ను రీకాల్ చేయాల్సిందేనని ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టంచేశారు. బీజేపీ డిమాండ్‌లో మార్పు లేదని, గవర్నర్‌పై ప్రధానికి, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. యడ్యూరప్ప ఐదుగురు మంత్రులతో కలసి బుధవారం సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్నారు. వచ్చే నెల రెండో తేది నుంచి తలపెట్టిన శాసనసభ సమావేశాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై ఇదివరకే మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపించారు. అయితే కేంద్రానికి తాను పంపిన నివేదికపై ఇంకా ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని గవర్నర్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఒకటి, రెండు రోజులు ఆగితే సమావేశాలు నిర్వహించాలా, వద్దా అనే విషయాన్ని తెలియజేస్తానని హామీ ఇచ్చారు. కాగా, వర్నర్ సిఫారసు మేరకు రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం గవర్నర్ నివేదికను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు తెలిసింది. 

Wednesday, May 18, 2011

కేరళ ముఖ్యమంత్రిగా ఉమెన్ చాందీ ప్రమాణస్వీకారం

తిరువనంతపురం,మే 19:  కేరళ రాష్ట్రానికి 21వ  ముఖ్యమంత్రిగా ఉమెన్ చాందీ ప్రమాణస్వీకారం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పదవిని చాందీ చేపట్టడం ఇది రెండవసారి. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎస్ గవాయి చేతుల మీదుగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌తోపాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

అస్సాం ముఖ్యమంత్రిగా తరుణ్ గగోయ్ ప్రమాణస్వీకారం

గౌహతి,మే 19: అస్సాం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తరుణ్ గగోయ్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. గౌహతిలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి గగోయ్ మద్దతుదారులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అస్సాంలో పూర్తి స్థాయిలో శాంతిని నెలకొల్పడానికి, అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడానికి తాను కట్టుబడి వున్నానని తరుణ్ గగోయ్ ప్రమాణస్వీకార అనంతరం  తెలిపారు. అస్సాంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) ని మట్టి కరిపించి  గగోయ్ కాంగ్రెస్ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఏజీపీ పార్టీ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది.

విశాఖ నావీ డాక్ యార్డ్ లో ఘోర ప్రమాదం: 5 గురి మృతి

విశాఖపట్నం,మే 18:  : విశాఖ నావీ డాక్ యార్డ్ లో  బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో అయిదుగురు నేవీ సిబ్బంది మృతి చెందారు. మృతి చెందినవారిలో కమాండర్, అసిస్టెంట్ కమాండర్, కెప్టెన్, సెయిలర్, మాస్టర్ చీఫ్ ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో పదిమంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఐఎన్‌ఎస్ కళ్యాణి ఆస్పత్రికి తరలించారు. సబ్ మెరైన్ మరమ్మతులు చేస్తుండగా మత్స్యడ్రైడాక్‌లో గేట్లు విరిగి నీరు లోనికి ప్రవేశించింది. బిల్డింగ్ సెంటర్ గేటు ఒక్కసారిగా కూలిపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. 

సత్తా చూపిన పంజాబ్ కింగ్స్

ధర్మశాల,మే 18: ఇక్కడి హెచ్‌పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐ.పి.ఎల్. మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 111 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వాల్తాటి (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆరంభంలో వేగంగా ఆడాడు. వాల్తాటి ఉన్నంతసేపు ప్రేక్షక పాత్ర పోషించిన గిల్‌క్రిస్ట్... ఆ తర్వాత  చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లను బెదరగొట్టాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై ఘోరపరాజయాన్ని చవిచూసింది. 

మావోయిస్టుల మందుపాతరకు ఏడుగురు జవాన్లు మృతి

న్యూఢిల్లీ,మే 18: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా బోరగొండ వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జవాన్లు వాహనంలో వెళుతుండగా మందుపాతర  పేల్చి వేశారు. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సుకుమా నుంచి జగదల్‌పూర్‌కు తరలిస్తున్నారు.

Tuesday, May 17, 2011

ఐసీఎస్‌ఈ ఫలితాల విడుదల

న్యూఢిల్లీ,మే 17: ఐసీఎస్‌ఈ ఫలితాలను విడుదల చేశారు. పదవ తరగతిలో  98.61, పన్నెండవ తరగతిలో 97.24 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు  అధికారులు వెల్లడించారు. ఫలితాలను సిబిఎస్‌ఇ రిజల్ట్సు డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్  వెబ్‌సైట్‌లో వుంచారు.

అత్యాచారయత్నం కేసులో ఐఎంఎఫ్ అధినేత

న్యూయార్క్,మే 17: అత్యాచారయత్నం ఆరోపణపై అరెస్టయిన అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అధినేత డోమినిక్ స్ట్రాస్‌కన్ తానే పాపం ఎరుగనని కోర్టులో చెప్పారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు వైద్య పరీక్షలకు కూడా సిద్ధమేనని అన్నారు. పోలీసులు ఆయన చేతులకు సంకెళ్లు వేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మాన్‌హట్టన్‌లోని ఒక హోటల్‌లో పనిమనిషిపై అత్యాచారయత్నం చేశారనే ఆరోపణపై స్ట్రాస్‌కన్‌ను న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధపడుతున్న స్ట్రాస్‌కన్ అనూహ్యంగా అత్యాచారయత్నం కేసులో పట్టుబడ్డారు. అభియోగాలు రుజువైతే ఆయనకు పదిహేనేళ్ల నుంచి ఇరవయ్యేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాగా, స్ట్రాస్‌కన్ గతంలో తనపై కూడా అఘాయిత్యానికి ప్రయత్నించారని ఫ్రెంచి రచయిత్రి, జర్నలిస్టు ట్రిస్టేన్ బానన్ ఆరోపించారు.

Monday, May 16, 2011

రాణులు...మహరాణులూ...

సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి గా ప్రమణ స్వీకారం చేస్తున్న జయలలిత
                బెంగాల్ సి.ఎం.గా తన ప్రమాణ స్వీకారోత్సవానికి మన్మోహన్, సోనియాలను ఆహ్వానించేందుకు
                                                  సోమవారం ఢిల్లీ వచ్చిన మమత 

కర్ణాటకలో మళ్లీ సంక్షోభం

బెంగళూరు,మే 16:కర్ణాటకలో మళ్లీ సంక్షోభం నెలకొంది.. అసమ్మతి ఎమ్మెల్యేల వ్యవహారానికి శుభం కార్డు పడిందన్న ఆనందంలో ఉన్న కమలనాథులకు తీరా క్లైమాక్స్ ‌లో కర్ణాటక గవర్నర్ గట్టి షాకు ఇచ్చారు. ఐదుగురు స్వతంత్రులతోపాటు 11 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో యడ్యూరప్ప సర్కారును రద్దు చేసి, కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ కేంద్రానికి సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక నివేదిక పంపారు. తాము యడ్యూరప్పకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు 10 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పైగా.. తనను కలవడానికి వచ్చిన సదరు ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ లేదంటూ రాజ్‌భవన్‌లోకి గవర్నర్ అనుమతించకపోవడం విశేషం.మరోవైపు గవర్నర్ చర్యను తీవ్రంగా నిరసించిన బీజేపీ వెంటనే ప్రతిచర్యకు దిగింది. తన బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించాలని నిర్ణయించింది. శాసనసభాపక్ష సమావేశం ముగిసిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్లి.. ప్రతిభాపాటిల్ ముందు బల ప్రదర్శన చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. గవర్నర్ తీరును నిరసిస్తూ కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిలకు లేఖలు రాశారు. తన ప్రభుత్వానికి తగు మెజారిటీ ఉన్నందున.. రాజ్యాంగపరమైన సంక్షోభం సృష్టించే ప్రయత్నాలు చేయరాదని చెప్పారు.


Sunday, May 15, 2011

జగన్ గుంటూరు దీక్షలో ఏడుగురు ఎమ్మెల్యేలు

గుంటూరు,మే 15:: రైతులకు మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన దీక్షలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీల నుండి ఏడుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత, శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శివప్రసాద్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. వారితో పాటు శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు, పుల్లా పద్మావతి, తిప్పారెడ్డి, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణ, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ పీఆర్పీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ, భూమా నాగిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కాగా అంతకుముందు భారీగా అభిమానులతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చిన వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పూలమాల వేశారు.  జగన్ దీక్ష 48 గంటల పాటు కొనసాగుతుంది.

రైతు ఉద్యమ నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ మృతి

లక్నో,మే 15:   రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షులు మహేంద్ర సింగ్ తికాయత్  ఉత్తరప్రదేశ్‌లోని కుమారుడి నివాసంలో ఆదివారం తెల్లవారుఝామున అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. తికాయత్ గత కొద్దికాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. తికాయత్  ఉత్తర భారత దేశంలో రైతు సమస్యలపై పలు ఉద్యమాలు సాగించారు. రైతుల హక్కులకు మద్దతుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం గా ఆందోళనలు నిర్వహించారు. పలుసార్లు అరెస్టయ్యారు.   

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం

ధర్మశాల,మే 15:  ఐపీఎల్-4లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 141 పరుగులకే చేతులెత్తేసింది. దాంతో 29 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. అంతకు ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ స్కోర్: 170/6, ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కోర్ 141/8.

Saturday, May 14, 2011

మరోసారి పెట్రో వాత...!

న్యూఢిల్లీ,మే 15: పెట్రోల్ ధరలు  మళ్ళీ భగ్గుమన్నాయి. సామాన్యుడికి కేంద్రం మరోసారి పెట్రో వాత పెట్టింది. లీటర్ పెట్రోల్ కు రూ.5 పెంచింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కేంద్రం పెట్రోలు ధరలు పెంచుతూ ప్రకటన చేసింది. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.  గత తొమ్మిది నెలల్లో ఎనిమిదిసార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు ధరలు పెంచాయి. కాగా త్వరలో మరోమారు పెట్రోలు ధరల పెంపు ఉండవచ్చని చమురు సంస్థలు సూచనప్రాయంగా తెలిపాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.65 చిల్లర ఉండగా, పెరిగిన ధరతో రూ.71 చేరుకుంది. అలాగే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.63.37కు చేరింది. ఒక్కసారిగా పెట్రోల్ ధర అయిదు రూపాయిలు పెరగటంతో పెట్రోల్ బంక్ ల వద్ద వినియోగదారులు బారులు తీరారు.

Friday, May 13, 2011

కాంగ్రెస్ లో ఐరన్ లెగ్...!

న్యూఢిల్లీ,మే 13: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రచారం కాంగ్రెసు పార్టీకి ఏ మాత్రం కలిసి వచ్చినట్లు లేదు. ఆయన ప్రచారం వల్ల కాంగ్రెసు పార్టీకి ఒరిగిందేమీ లేదని కడప లోకసభ స్థానానికి, పులివెందుల శాసనసభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే కాకుండా తమిళనాడు శాసనసభా ఎన్నికల ఫలితాలు కూడా తెలియజేస్తున్నాయి. కడప లోకసభ స్థానంలో చిరంజీవి పెద్ద యెత్తున ప్రచారం చేశారు. పులివెందులలో కూడా ఆయన ప్రచారంలో పాల్గొని హంగామా సృష్టించారు. ఆయన ప్రచారం పులివెందులలో వైయస్ విజయమ్మ మెజారిటీని గానీ కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ మెజారిటీని గానీ ఏ మాత్రం తగ్గించలేకపోయింది. తమిళనాడులో కూడా చిరంజీవి  మూడు రోజుల పాటు ప్రచారం సాగించారు. అక్కడ  కూడా ఆయన ప్రచారం కాంగ్రెసుకు కలిసి రాలేదని అర్థమవుతోంది. తమిళనాడులో కాంగ్రెసు 65 స్థానాలకు పోటీ చేయగా నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి. కాంగ్రెసు ఎక్కువ సీట్లు తీసుకుని ఆ సీట్లను కోల్పోవడం ద్వారా డిఎంకెను కూడా దెబ్బ తీసింది. 

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు

న్యూఢిల్లీ,మే 13:  వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును  ప్రకటించారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్థానంలో గౌతం గంభీర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. వైఎస్ కెప్టెన్‌గా సురేష్ రైనా, వికెట్ కీపర్‌గా పార్థీవ్ పటేల్‌ను ఎంపిక చేసారు. విరాట్ కోహ్లీ, యువరాజ్‌సింగ్, బద్రినాథ్, రోహిత్ శర్మ, హర్భజన్‌సింగ్, ఆర్ అశ్విన్, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్, వినయ్ కుమార్, యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, వ్రిద్ధిమాన్ సాహాలకు జట్టులో స్థానం లభించింది. 

నిరాశ పడక్కర్లే: సి.ఎం.

హైదరాబాద్,మే 13:  ఉప ఎన్నికలలో ఓటమికి ఎవరూ బాధ్యత వహించవలసిన అవసరంలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫలితాలు వెలువడిన తరువాగత సచివాలయంలో  విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలలో ఇటువంటివి సహజమని అన్నారు. ఇటువంటి ఫలితాలు చాలా ఎన్నికలలో చూశామన్నారు. ప్రత్యేక పరిస్థితులలో ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రావలసిన ఓట్లు వైఎస్ కుటుంబ సభ్యులకు మళ్లాయన్నారు. వైఎస్ఆర్ పై ఉన్న గౌరవాన్ని ప్రజలు చూపించారని తెలిపారు. ప్రజల తీర్పుని గౌరవిస్తామన్నారు. అందరూ కష్టపడి పనిచేసినా ప్రజల మద్దతు వారికి ఉందని, ప్రజాస్వామ్యంలో  గొప్ప తనం ఇదేనని ఆయన అన్నారు.

బెంగాల్ లో మమత విజయకేతనం-తమిళనాట జయ భేరి

కేరళలో యు.డి.ఎఫ్.
అస్సోం లో కాంగ్రెస్ హ్యాట్రిక్
పుదుచ్చేరిలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ,మే 13; అయిదు రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికలలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్ లో మూడు దశాబ్దాల వామపక్ష పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ నాయకత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. తమిళనాడులో డిఎంకెని కూడా ప్రజలు ఓడించారు. అక్కడ అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత నాయకత్వంలోని కూటమి ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని స్థానాలు గెలుచుకుంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది.
పశ్చిమ బెంగాల్
మొత్తం స్థానాలు - 294
తృణమూల్ కాంగ్రెస్  - 226
వామపక్షాలు - 62
ఇతరులు  - 6
కేరళ
మొత్తం స్థానాలు - 140
యుడిఎఫ్ - 72
ఎల్.డి.ఎఫ్.  - 68
అస్సాం
మొత్తం స్థానాలు - 126
కాంగ్రెస్  - 78
ఎజిపి  - 10
ఎయుడిఎఫ్  - 18
బిజెపి  - 5
ఇతరులు  - 15
పుదుచ్చేరి
మొత్తం స్థానాలు - 30
ఎఆర్ సి - 20
కాంగ్రెస్ కూటమి  - 9
ఇతరులు గెలిచిన స్థానాలు - 1

తల్లీకొడుకులకు రికార్డ్ మెజారిటీ

కడప,మే 13: కడప లోక్ సభ ఉప ఎన్నికలో   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయిలో రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన  5,45,672 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి, తెలుదేశం పార్టీ అభ్యర్థి మైసూరా రెడ్డి  ధరావతు కోల్పోయారు. కాగా, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలో  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,  వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి పై 81,373 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పులివెందుల నియోజకవర్గానికి ఇంతవరకు 15 సార్లు జరిగిన ఎన్నికలలో ఇదే అత్యధిక  మెజారిటీ. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన బిటెక్ రవి (ఎం.రవీంద్రనాధ్ రెడ్డి) డిపాజిట్  కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని  జగన్మోహన రెడ్డి అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మీడియా తో తో మాట్లాడుతూ,  ఈ ఫలితాలు రాష్ట్రంలో జరుగబోవు మార్పులకు నాంది అని  అన్నారు. ప్రతిపక్షంగా ఉండవసిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజలను మోసం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ  కాంగ్రెస్ కు అలయన్స్ పార్టనర్ అయిపోయిందని,  అందువల్ల ఈ ప్రభుత్వం పడిపోదని అన్నారు. . 

Thursday, May 12, 2011

సివిల్స్ లో రాష్ట్రానికి ర్యాంకుల పంట


శ్వేతామహంతి
హైదరాబాద్, మే 12:  దేశంలో అత్యున్నత స్థాయి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు  ర్యాంకుల పంట పండించారు. రాష్ట్ర క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పి.కె.మహంతి కూతురు శ్వేతామహంతి తన మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో మొదటి వంద లోపు ర్యాంకర్లలో మన రాష్ట్రానికి చెందిన వారు 18 మంది ఉన్నారు. 2, 12, 13, 18, 23, 24, 25, 26, 31, 37, 52, 53, 54, 57, 83, 90, 94, 96  ర్యాంకుల్ని రాష్ట్ర అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. ఈసారి సివిల్స్ మొదటి రెండు ర్యాంకులూ మహిళలే సాధించటం విశేషం. చెన్నైకి చెందిన ఎస్.దివ్యదర్శిని ఈ ఏడాది ఐఏఎస్ టాపర్‌గా నిలిచారు. చెన్నైలోని అంబేద్కర్ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన దివ్యదర్శిని.. ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె తన రెండో ప్రయత్నంలో సివిల్స్ టాపర్‌గా నిలిచారు. రెండో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన శ్వేతా మొహంతి సాధించగా.. మూడో ర్యాంకును చెన్నైకే చెందిన దంతవైద్యుడు ఆర్.వి.వరుణ్‌కుమార్ సాధించారు. టాప్ 25లో అత్యధికంగా 15 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉండగా, ఐదుగురు వైద్య పట్టభద్రులు, మిగిలిన ఐదుగురు సైన్స్, మేనేజ్‌మెంట్, కామర్స్, సోషల్ సెన్సైస్ పట్టభద్రులు ఉన్నారు. 

విశ్రాంతి కోసం విదేశాలకు రజనీ కాంత్

చెన్నై, మే 12: దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ వైద్యుల సలహా మేరకు విశ్రాంతి కోసం విదేశాలకు పయనం కానున్నారు. ఈ కారణంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాణా’ షూటింగ్ వాయిదాపడింది. రాణా షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాడే రజనీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా మళ్లీ అస్వస్థతకు గురవడంతో మైలాపూర్‌లోని ఇస్‌బెల్లా ఆస్పత్రిలో చేర్చారు. వారం రోజులు ఆస్పత్రిలోనే ఉన్న ఆయన మంగళవారం రాత్రి డిశ్చార్జి అయ్యారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజనీకి వైద్యులు సలహా ఇచ్చారు. చెన్నైలో తీవ్రమైన ఎండలు కారణంగా   అమెరికా లేదా స్విట్జర్లాండ్ వెళ్లేందుకు రజనీకాంత్ వీసా సిద్ధం చేసుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లో రాహుల్ అరెస్టు

గ్రేటర్ నోయిడా,మే 12:  గ్రేటర్ నోయిడా రైతులకు మద్దతుగా బుధవారం ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్, ఫిరోజాబాద్ ఎంపీ రాజ్‌బబ్బర్‌లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు రైతుల ఆందోళనతో అట్టుడుకుతున్న భట్టాపర్సాల్ గ్రామంలో రాహుల్ ధర్నా చేశారు. రహదారి కోసం సేకరించిన తమ భూములకు మరింత పరిహారం కావాలని కోరుతూ ఈ గ్రామ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల కళ్లుగప్పి, రాహుల్ అత్యంత నాటకీయంగా ఒక కార్యకర్త వెంట బైక్‌పై వేకువ జామున 4 గంటలకు ఈ గ్రామానికి చేరుకున్నారు. ఉదయం గ్రామస్తులతో కలిసి ధర్నాకు కూర్చున్న తర్వాత కాని ఆయన రాక గురించి పోలీసులు తెలుసుకో లేకపోయారు. ఇటీవల ఆందోళనలో పోలీసుల కాల్పుల్లో రైతులు మరణించిన సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఈ సందర్భంగా రాహుల్ డిమాండ్ చేశారు. ఇక్కడ జరిగినది చూస్తుంటే భారతీయుడిగా చెప్పుకొనేందుకే సిగ్గు పడుతున్నానంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రజలపైనే అఘాయిత్యాలకు ఒడిగడుతోందని దుయ్యబట్టారు. సాయంత్రం వరకు సాగిన ఈ ధర్నాలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా పాల్గొన్నారు. 

కడపలో ఒకచోట రీపోలింగ్

హైదరాబాద్,మే 12: కడప లోక్‌సభ స్థానానికి ఈనెల 8న జరిగిన పోలింగ్‌లో నగరంలోని 108వ పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సక్రమంగా పనిచేయని కారణంగా   అక్కడ గురువారం నాడు  రీపోలింగ్ నిర్వహించారు.  ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో మొత్తం 957 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల తో పాటు  కడప, పులివెందుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు   శుక్రవారం జరుగుతుంది. 

Wednesday, May 11, 2011

సర్వేలు ఏమంటున్నాయి...?


సర్వేలకు అందని తమిళ ఓటరు నాడి...!

చెన్నై,మే 11: తమిళనాడులో గత నెల 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి ఆధిక్యత లభిస్తుందన్న అంశంలో వివిధ ఎగ్జిట్ పోల్స్ వేర్వేరు అంచనాలు ప్రకటించాయి. అన్నా డీఎంకే అధినేత జయలలితకు తమిళనాడు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ఎన్నికల ముందు మీడియా సంస్థలు బాకా ఊదయి. అయితే, అన్నా డీఎంకే కూటమికి 110 స్థానాలు,   అధికార డీఎంకే కూటమికి 124 స్థానాలు వస్తాయని స్టార్ న్యూస్ అంచనా వేసింది. అయితే, మరో చానెల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ మాత్రం అన్నాడీఎంకే కూటమికే అధికారం దక్కుతుందని చెబుతోంది. అన్నా డీఎంకేకు 120నుంచి 132 స్థానాల వరకూ రావొచ్చని ఆ చానెల్ సీఎస్‌డీఎస్‌తో కలిసి నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. డీఎంకే కూటమికి 102 నుంచి 114 వరకూ వస్తాయని ఆ సర్వే పేర్కొంది. మరోపక్క రెండు కూటములూ పోటాపోటీగా ఉన్నాయని, సీ-ఓటర్ సర్వే మాత్రం అన్నా డీఎంకే కూటమికి తిరుగులేని ఆధిక్యత లభిస్తుందని జోస్యం చెబుతోంది. ఆ కూటమికి 168 నుంచి 176 స్థానాలు వస్తాయని, డీఎంకే కూటమి 54 నుంచి 62 వరకూ మాత్రమే లభించవచ్చని తెలిపింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలున్నాయి. ప్రస్తుతం రద్దవుతున్న అసెంబ్లీలో డీఎంకే కూటమికి 163, అన్నాడీఎంకే కూటమికి 70 స్థానాలూ ఉన్నాయి.
అస్సాంలో తరుణ్ గోగోయ్ హ్యాట్రిక్!
గువాహటి: అస్సాంలో ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరసగా మూడోసారి కూడా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి.  126 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 41 నుంచి 47 స్థానాలు వస్తాయని హెడ్‌లైన్స్ టుడే జోస్యం చెప్పింది. ఈసారి అధికార పీఠాన్ని అందుకోవాలని కలలు కంటున్న ఏజీపీకి 31-35 మధ్య రావొచ్చని పేర్కొంది.  ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీకి 16 నుంచి 18 స్థానాలు లభించవచ్చని తెలిపింది. సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్‌కు 64 నుంచి 72 వస్తాయి. ఏజీపీకి 16-22 మధ్య, ఏయూడీఎఫ్‌కు 11-17 మధ్య, బీజేపీకి 7నుంచి 11 మధ్య స్థానాలు లభిస్తాయని ఆ చానెల్ తెలిపింది. సీ-ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 41-45 మధ్య వస్తాయి. ఏజీపీకి 31-35 మధ్య, బీజేపీకి 14-18 మధ్య, ఏయూడీఎఫ్‌కు 11-15 వస్తాయని ఆ సర్వే అంచనా. రద్దయిన అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 53, ఏజీపీకి 24, బీజేపీకి 10, ఏయూడీఎఫ్‌కు 10 స్థానాలున్నాయి.

 

కుప్పకూలనున్న ఎర్ర కోటలు...?

న్యూఢిల్లీ,మే 11: పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలలో అధికార పగ్గాలు చేతులు మారబోతున్నాయని ఎగ్జిట్‌పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. బెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా పాలన సాగిస్తున్న వామపక్ష సంఘటన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదని స్టార్‌న్యూస్ చానెల్ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ సర్వేలో తేలింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ - కాంగ్రెస్ కూటమి విజయం సాధించబోతున్నట్టు  సర్వే తెలిపిందు.  తృణమూల్ కాంగ్రెస్ 181 స్థానాలను, కాంగ్రెస్ 40 స్థానాలను గెలుచుకోవచ్చుట. గత ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 227 స్థానాలలో విజయం సాధించిన వామపక్ష సంఘటన ఈ సారి 62 స్థానాలకు పరిమితం కాబోతున్నదని ఈ సర్వే తెలిపింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ - కాంగ్రెస్ కూటమి 210 నుంచి 220 స్థానాలలో విజయం సాధిస్తుందని, లెఫ్ట్ ఫ్రంట్ 65 నుంచి 70 స్థానాలకు పరిమితమౌతుందని హెడ్‌లైన్స్ టుడే - ఓఆర్‌జీ సర్వే తెలిపింది. ఇక సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే తృణమూల్ కాంగ్రెస్- కాంగ్రెస్ కూటమికి 222 నుంచి 234 సీట్లు వస్తాయని తెలిపింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి లెఫ్ట్‌ఫ్రంట్ 60 నుంచి 72 స్థానాలకు పడిపోతుందని ఐబీఎన్ సర్వే అంచనా వేసింది.
. కేరళలోనూ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) పరాజయం పాలు కాబోతున్నదని స్టార్‌న్యూస్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రజాతంత్ర సంఘటన (యూడీఎఫ్) 88 స్థానాలలో విజయం సాధిస్తుందని, ఎల్డీఎఫ్ మాత్రం 49 స్థానాలతో సరిపుచ్చుకుంటుందని సర్వే వెల్లడించింది. అయితే కేరళలో స్వల్ప మెజారిటీతో ఎల్డీఎఫ్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే వెల్లడించింది. సీట్ల సంఖ్యలోనూ, ఓటింగ్ శాతంలోనూ కొద్దిపాటి మెజారిటీతో తిరిగి ఎల్డీఎఫ్ పగ్గాలు దక్కించుకుంటుందని, అచ్యుతానందన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఈ సర్వే తెలిపింది. 69 నుంచి 77 స్థానాలను ఎల్డీఎఫ్ సాధిస్తుందని, యూడీఎఫ్ 61 నుంచి 71 స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. ఎల్డీఎఫ్‌కు 46 శాతం, యూడీఎఫ్‌కు 45శాతం, బీజేపీకి 6శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. కాగా హెడ్‌లైన్స్ టుడే మాత్రం యూడీఎఫ్‌కు 85 నుంచి 92 సీట్లు వస్తాయని, ఎల్డీఎఫ్‌కు 45 నుంచి 52 సీట్లు లభించవచ్చని అంచనా వేసింది. యూడీఎఫ్‌కు 83 నుంచి 91 సీట్లు లభిస్తాయని, ఎల్డీఎఫ్‌కు 49 నుంచి 57 సీట్లు లభించే అవకాశముందని సీ-ఓటర్ సర్వే అంచనా వేసింది.

Tuesday, May 10, 2011

చంద్రబాబు - హరికృష్ణ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం...!

జగన్ కు సన్నిహితంగా జూనియర్ ఎన్ టీఆర్...
 జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి  'నార్నే' చానెల్...? 
హైదరాబాద్ ,మే 10: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,  ఆయన బావమరిది ,రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉన్నట్లు కనబడుతోంది.  జూనియర్ ఎన్టీఆర్ వివాహంలో కూడా  వీరిద్దరు ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారు.  2014 శానససభ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించకుండా చూడడమే ప్రధాన ధ్యేయంగా హరికృష్ణ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు  జూనియర్ ఎన్టీఆర్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తరుచుగా ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.  2014 ఎన్నికల్లో వైయస్ జగన్‌కు అధికారం లభించేలా సహాయపడడం ద్వారా 2019 నాటికి తాను బలపడాలన్నది  జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశమని చెబుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వయస్సు కూడా చిన్నదే. ఇప్పుడు ఆయన వయస్సు 33 ఏళ్లు. అధికారం కోసం 2014 తర్వాత మరో ఐదేళ్లు ఆగాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికలను వైయస్ జగన్ టార్గెట్ చేసుకుంటే తాను 2019 ఎన్నికలను టార్గెట్ చేసుకోవాలని  జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జగన్‌కు ఓ సామాజిక వర్గం మద్దతు బలంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వల్ల మరో బలమైన సామాజిక వర్గం మద్దతు లభించే అవకాశాలున్నాయి. ముందస్తు ఆలోచనతో ఇద్దరు యువనేతలు ఒక్కటైనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
 బాబు చేజారనున్న స్టూడియో-ఎన్ ఛానల్ ?
ప్రస్తుతం  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పెత్తనంలో ఉన్న స్టూడియో-ఎన్ ఛానల్ త్వరలో హరికృష్ణ చేతిలోకి మారనుందనే  కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛానల్ చంద్రబాబు తనయుడు లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న ఆ ఛానల్ త్వరలో జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది. కారణం జూ.ఎన్టీఆర్ స్టూడియో-ఎన్ ఛానల్ అధినేత నార్నె శ్రీనివాసరావు అల్లుడూ కావడమేనని వేరే చెప్పక్కరలేదు.    చంద్రబాబుతో ఎంత బాంధవ్యం ఉన్నప్పటికీ, ఎన్నేళ్ల అనుబంధం ఉన్నప్పటికీ నార్నెకు జూ.ఎన్టీఆర్ అల్లుడు అయినందున ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడం ఖాయం. సో...  జూ.ఎన్టీఆర్ చేతిలోకి ఛానల్ రాగానే ఇప్పటికే చంద్రబాబును ఢీకొడుతున్న హరికృష్ణ బాబు ఇమేజ్ తగ్గించే అంశానికే ప్రాధాన్యత ఇస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో రాజకీయ సమీకరణాల కోసం బాలకృష్ణ కూతురును చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. బాలకృష్ణ కూతురును కోడలుగా చేసుకొని బాలకృష్ణను ఆధిపత్య పోరు నుండి తొలగించాడు. అసలే గొడవలు అంటే పడని బాలకృష్ణ ఇప్పుడు మరింత మిన్నకుండి పోయారు. రాజకీయ సమీకరణాల కోసం బాబు ఏ ప్లాన్ అయితే వేశాడో ఇప్పుడు హరికృష్ణ కూడా చంద్రబాబు నుండి ఆధిపత్యాన్ని నందమూరి కుటుంబం వైపుకు తీసుకు రావడానికి నార్నె ఇంటికి తన తనయుడిని అల్లుడిగా చేసి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నాడు. మొత్తానికి నందమూరి - నారా కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను కలిచి వేస్తోంది.

జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ కు నెహ్రూ అవార్డ్

న్యూఢిల్లీ,మే 10:  ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన పురస్కారానికి జర్మనీ చాన్సెలర్ అంజెలా మెర్కెల్ (57) ఎంపికయ్యారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని కమిటీ 2009 సంవత్సరానికి గానూ ఈ అవార్డ్ కు  మెర్కెల్‌ను ఎంపిక చేసింది. న్యాయబద్ధమైన, సంతులిత అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుపరిపాలనతో పాటు 21 శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోగలస్థాయిలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టి0చే లక్ష్యంతో ఆమె పనిచేశారని ఆ ప్రకటనలో ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం మెర్కెల్ కృషి చేశారని పేర్కొన్నారు. అవార్డ్ కింద రూ.కోటి, ప్రశంసాపత్రం, ట్రోఫీ అందజేస్తారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, మదర్ థెరిసా, సూకీ, ముబారక్, మండేలా తదితరులు గతంలో ఈ పురస్కారం అందుకున్నారు.

భుజం నొప్పితో ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన సెహ్వాగ్

న్యూఢిల్లీ,మే 10:: భుజం నొప్పిని భరిస్తూనే ఐపీఎల్‌లో కొనసాగుతున్న ఢిల్లీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఎట్టకేలకు వైదొలిగాడు. రోజు రోజుకూ నొప్పి తీవ్రమవుతుండటంతో శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించాడు. దీంతో ఐపీఎల్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు  సెహ్వాగ్  దూరం కానున్నాడు. వచ్చే నెలలో ఆరంభమయ్యే విండీస్ పర్యటనకూ అందుబాటులో ఉండటం లేదు. సర్జరీ కోసం సెహ్వాగ్  లండన్ వెళ్లనున్నాడు.ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఆసీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎనిమిది పాయింట్లతో డీడీ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ అవకాశాలు వీరికి దాదాపుగా లేనట్టే. 

Monday, May 9, 2011

అయోధ్య కధ మళ్ళీ మొదటికి...!

న్యూఢిల్లీ,మే 9: :  అయోధ్య వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ను సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.  తదుపరి ఆదేశాలు వెలువడేవరకూ యథాతథస్థితి కొనసాగించాలని జస్టిస్ అప్తాబ్ అలం, ఆర్‌ఎం లోధాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. స్థలాన్ని విభజించాలని ఎవరూ కోరలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమితో పాటు, వివాదాస్పద స్థలంలో కూడా యథాతధ స్థితి కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే వివాదరహిత 67 ఎకరాలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది.

అమెరికాపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి గిలానీ ఆగ్రహం

 ఇస్లామాబాద్,మే 9: : అమెరికాపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి గిలానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎస్ఐపై అమెరికా ఆరోపణలను ఆయన ఖండించారు. ఐఎస్ఐ కృషివల్లే లాడెన్ ని కనుక్కోగలిగారన్నారు. ఆల్ ఖైదా తమ గడ్డపై పుట్టలేదన్నారు. ఆల్ ఖైదాని పెంచిపోషించింది అమెరికాయేనని ఆయన విమర్శించారు. అమెరికా ఏకపక్ష దాడులు విచారకరమని ఆయన అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు తమభూభాగాన్ని  వాడుకోవడాన్ని తాము సహించ బోమని  ఆయన స్పష్టం చేశారు.

Sunday, May 8, 2011

గెలిస్తే చాలదు...భారి మెజారిటీ వస్తేనే రాజకీయ మనుగడ...!

హైదరాబాద్,మే 8:  జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా నిలిచిన పులివెందుల, కడప ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. కడప పార్లమెంటు నుండి జగన్ విజయావకాశాలపై ఎవరికీ అనుమానం లేకున్నప్పటికీ ఎంత ఆధిక్యం అనే దానిపైనే జగన్ పరువు ఆధార పడి ఉంది. గత సాధారణ ఎన్నికలలో జగన్ లక్షా డెబ్బై వేల ఓట్లతో గెలిచాడు. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ రావాలని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేసింది. అదేవిధంగా జగన్ ఆధిక్యాన్ని లక్షకన్నా తగ్గించాలని కాంగ్రెసు, టిడిపిలు ప్రయత్నాలు చేశాయి. జగన్ విజయం దాదాపుగా ఖాయమైనప్పటికీ ఆధిక్యత మాత్రం భారీగా ఉంటేనే ఆయన ప్రభావం ఉన్నట్టుగా అందరూ గుర్తించేలా కనిపిస్తోంది. లేదంటే వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీలో జగన్ తప్ప మరే సీటు గెలిచే అవకాశమే లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  వైయస్ దుర్మరణం, కాంగ్రెసు నుండి బయటకు రావడం, గత ముప్పయ్యేళ్లుగా కడపలో వారి కుటుంబమే రాజ్యమేలుతున్న నేపథ్యంలో జరిగిన ఎన్నికలు కావడం తో  జగన్ ఇది వరకు గెలిచినట్లుగా సాధారణంగా గెలిస్తే ఆయన ప్రభావం పెద్దగా వుండదని అంటున్నారు. 
ఇక పులివెందుల నియోజవర్గంలో కూడా విజయమ్మ గెలుపు జగన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. పులివెందులలో మాత్రం విజయమ్మ గెలిచే అవకాశాలు ఎంతగా ఉన్నాయో, ఓడిపోయే అవకాశాలు అంతే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ జగన్‌కు అత్యంత ముఖ్యమైన పులివెందులలో విజయమ్మ ఓడిపోయినా జగన్ కు ద్బ్బే  అంటున్నారు పరిశీలకులు. ఓటింగ్ శాతం గతంలో కంటే కొద్దిగా పెరిగినప్పటికీ ఓటర్లు ముప్పయ్యేళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేశారనే భావన అందరిలో ఉంది. ఈ పరిస్థితి  ఖచ్చితంగా జగన్ మెజార్టీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. 



ఉప ఎన్నికలు ప్రశాంతం

హైదరాబాద్,మే 8: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసాయి. ఉప ఎన్నికల ఓటింగ్ సమయం ముగిసి పోయినప్పటికి పోలింగ్ బూత్‌ల వద్ద్ద క్యూలో భారీగా  వున్న ఓటర్లకు కూడా వోటు వేసేందుకు అనుమతించడంతో  చాల చోట్ల పొద్దు పోయేవరకు పోలింగ్ కొనసాగింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ 81 శాతం నమోదు కాగా, కడప లోకసభ నియోజకవర్గంలో 69.5 శాతం నమోదైంది. పులివెందులలో మూడు శాతం ఓటింగ్ పెరిగింది. కడపలో సాంకేతిక లోపం తలెత్తడంతో 108 పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్  చెప్పారు.

Saturday, May 7, 2011

ఎయిరిండియా పైలట్ల సమ్మె విరమణ

న్యూఢిల్లీ,మే 7: ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలంకావడంతో గత పదిరోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను  ఎయిర్ ఇండియా పైలట్లు విరమించారు.  తొలగించిన పైలట్లను విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో   సుధీర్ఘ చర్చల అనంతరం పైలట్లకు, అధికారులకు మధ్య అవగాహన కుదిరింది. ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ)కు గుర్తింపునివ్వనున్నట్టు అధికారులు తెలిపారు. 

Friday, May 6, 2011

కడప, పులివెందుల ఉప ఎన్నికలకు పటిష్ట భద్రత

హైదరాబాద్,మే 6:  కడప, పులివెందుల ఉప ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిజిపి అరవింద రావు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఇసి) ప్రధానాధికారి భన్వర్ లాల్ తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో భద్రత విషయమై వారు చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,ఉప ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న రెండు కోట్ల 73 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 316 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. మొత్తం 1512 పోలింగ్ స్టేషన్ల వద్ద 11,100 మంది పోలీస్ లతో  బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 10,829పై బైండోవర్ కేసులు పెట్టినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చునన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో తీస్తామని చెప్పారు. కాగా, పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల  ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్ సిబ్బంది, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు నుంచి వేలిముద్ర, సంతకం తీసుకుంటామని చెప్పారు. ఎన్నిక ప్రచార సమయం శుక్రవారం  సాయంత్రం 5 గంటలతో ముగిసిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వార్తలను ఛానల్స్ ప్రసారం చేయకూడదన్నారు. కడప లోక్ సభ స్థానానికి, పులివెందుల శాసన సభ స్థానానికి ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 13న ఓట్లను లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

పాక్ పిచ్చి ప్రేలాపన...!

ఇస్లామాబాద్, మే 6: లాడెన్ విషయంలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పుకోవడానికి, ఆ విధంగా పరువు దక్కించుకోవడానికి పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇస్లామాబాద్‌కు కొద్ది దూరంలోనే ఉన్న అబోటాబాద్‌లో అమెరికా సైనిక దళాలు బిన్ లాడెన్‌ను హతమార్చడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేక పోతోంది. తమకేమాత్రం తెలియకుండా, తమ ప్రమేయమే లేకుండా అమెరికా దళాలు అల్‌ఖైదా అధినేతను మట్టుబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పాక్, అమెరికాపై తీవ్రస్థాయిలో విరుచుకు పడింది.  తమను సంప్రదించకుండా తమకు ఏరకమైన సంకేతాలు అందించకుండా 'ఆపరేషన్ లాడెణ్ ను  అమెరికా నిర్వహించటం ఎంతమాత్రం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  పాక్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ ఇందుకు సంబంధించి అమెరికాపై నిప్పులు చెరిగారు. మరోపక్క అమెరికాతోపాటు భారత్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పాక్‌లో ఈరకమైన రహస్య కార్యకలాపాలు ఎంతమాత్రం నిర్వహించడానికి వీల్లేదంటూ అమెరికాను హెచ్చరించారు.ఇక పై  ఈ తరహా చర్యలకు అమెరికా పాల్పడితే దాని పరిణామాలు భయానకంగా ఉంటాయని హెచ్చరించారు. లాడెన్‌ను హతమార్చటం ద్వారా ఉగ్రవాద నిరోధానికి సంబంధించి అమెరికా గణనీయమైన పురోగతి సాధించిన మాట నిజమే అయినా, అన్ని విషయాల్లోనూ ఇదేరకమైన పద్ధతి పనికిరాదన్న అభిప్రాయాన్ని బషీర్ వ్యక్తం చేశారు. తమనుతాము రక్షించుకోగలిగే తమ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోగలిగే శక్తియుక్తలు పాక్‌కు ఉన్నాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ వీటి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఉద్ఘాటించారు. అవసరమైతే అమెరికా తరహాలో భారత్ కూడా సైనిక చర్యకు పాల్పడగలదంటూ సైనిక, వైమానిక దళాల ప్రధానాధికారులు వ్యాఖ్యానించటంపై కూడా బషీర్ తీవ్ర విమర్శలు చేశారు. 26/11 ఘాతుకానికి పాల్పడిన ముష్కర మూకలను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ ఒసామా’ తరహాలోనే భారత్‌కూడా కమెండో ఆపరేషన్ నిర్వహించగలదని భారత సైనికాధినేతలు చెప్పడం పాక్‌లో కలవరం రేకెత్తించింది. ‘ఏకపక్షంగా ఏదేశమైనా పాకిస్తాన్‌కు సంబంధించి ఎలాంటి దాడికైనా పాల్పడగలమని భావిస్తే అది  తప్పు చేయడమే అవుతుంది’ అని బషీర్ హెచ్చరించారు. పాకిస్తాన్ కూడా శక్తిలోనూ, యుక్తిలోనూ మరే దేశానికీ తీసిపోదని సైనిక, వైమానిక దళాలు అత్యంత శక్తివంతమైన రీతిలో పాటవాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించారు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...