Wednesday, November 30, 2022

ఢిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు


హైదరాబాద్, నవంబర్ 30: 

ఢిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు ను ఈడీ అధికారులు చేర్చారు. అమిత్​ ఆరోరా రిమాండ్​ రిపోర్టులో కవిత పేరును ఈడీ పేర్కొంది. మంగళవారం రాత్రి అమిత్​ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అలాగే సౌత్​ గ్రూప్​ సంస్థ వంద కోట్ల రూపాయల ముడుపులను చెల్లించినట్లు తేల్చారు. సౌత్​గ్రూప్​ను శరత్​ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగంట నియంత్రించేవారని ఈడీ వెల్లడించింది. ఈ గ్రూపు ద్వారా రూ. వంద కోట్లను విజయ్​నాయర్​కు చేర్చినట్లు తెలిపారు.ఈడీ చేసిన దర్యాప్తులో అమిత్​ ఆరోరా వాగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా ధృవీకరించినట్లు రిమాండ్​ రిపోర్ట్​లో పేర్కొన్నారు. 36 మంది రూ. 1.38 కోట్లు విలువ చేసే 170 మొబైల్​ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ధ్వంసం చేసిన ఫోన్లలో 10 కవిత ఫోన్లు, రెండు నంబర్లు వాడినట్లు ప్రకటించారు. ఆమె వాడిన ఫోన్లు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేసినట్లు రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్నారు.



Tuesday, November 29, 2022

వైఎస్‌ షర్మిలకు బెయిల్ మంజూరు

హైదరాబాద్, నవంబర్ 30: 

వైఎస్‌ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రగతి భవన్​ వద్ద ఆందోళన నిర్వహించినందుకు మంగళవారం మధ్యాహ్నం పోలీసులు షర్మిల పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రాత్రి 9 గంటల సమయంలో నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలతో పాటు మరో ఆరుగురికి నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని, శాంతియుత నిరసనకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని  విచారణ సమయంలో షర్మిల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి అరెస్ట్ చేసిన అందరికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు.



వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు బదిలీ

హైదరాబాద్, నవంబర్ 29: 

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న ప్రాంతంలో న్యాయమైన విచారణ అసంభవమని వ్యాఖ్యానించింది. భారీ కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై స్వతంత్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని సీబీఐకి నిర్దేశిస్తూ.. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది.2019 మార్చిలో తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై పలు అనుమానాలు ఉన్నాయని, కేసు దర్యాప్తు సజావుగా సాగడం లేదని, దర్యాప్తు సంస్థ విచారణాధికారులపై ప్రైవేట్‌ కేసులు పెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారని.. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేక కుమార్తె వైఎస్‌ సునీత వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.


తెలంగాణలో గోదావరి నదిపై మూడు ప్రాజెక్టులకు ఆమోదం

హైదరాబాద్, నవంబర్ 29: 

తెలంగాణలో గోదావరి నదిపై ప్రభుత్వం చేపట్టిన మూడు ప్రాజెక్టులు చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల, ఛనాక - కోరాట ఆనకట్టకు కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక సలహా మండలి అనుమతులు లభించాయి. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలో చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలు, నిజామాబాద్ జిల్లాలో చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతలు, ఆదిలాబాద్ జిల్లాలో ఛనాకా-కోరాట ఆనకట్ట చేపట్టారు.



ఏపీ నూతన సీఎస్​గా కేఎస్​ జవహర్​రెడ్డి

విజయవాడ, నవంబర్ 29: 

ఏపీ నూతన సీఎస్​గా కేఎస్​ జవహర్​రెడ్డి నియమితులయ్యారు.. ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. జవహర్‌ రెడ్డి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.


రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్​ పోర్ట్​ లైన్​లో 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మెట్రో

హైదరాబాద్ ,నవంబర్ 29:  హైదరాబాద్ లో త్వరలో చేపట్టబోయే రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్​ పోర్ట్​ లైన్​లో 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మెట్రో ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న 31 కిలోమీటర్ల కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు (31కి.మీ.) మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. 

Monday, November 28, 2022

యాదాద్రి ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను పరిశీలించిన కె సి ఆర్

హైదరాబాద్ ,నవంబర్ 28: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. తొలుత ప్లాంట్‌ఫేజ్-1లోని యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లిన సీఎం... 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌ చేరుకొని నిర్మాణపనులు పరిశీలించారు. ప్లాంట్‌నిర్మాణం జరుగుతున్న తీరుపై ట్రాన్స్‌కో, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.పవర్ ప్లాంట్‌కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరమనే విషయంపై చర్చించారు. విద్యుత్‌ కేంద్రంలో పనిచేసే సుమారు 10వేలమంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్‌షిప్ నిర్మాణం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అక్కడే భవిష్యత్‌లో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ చేపట్టనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారని అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్‌వరకు 7 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు మంజూరు చేయాలని కార్యదర్శి స్మితాసబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. రైల్వేక్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.


భైంసా కు దూరంగా బండి యాత్ర..

హైదరాబాద్ ,నవంబర్ 28: హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. నిర్మల్‌ జిల్లా అడెల్లి పోచమ్మ ఆలయంలో పూజలు చేసి సంజయ్‌ యాత్రను మొదలుపెట్టారు. బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు బైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని , ఇతర మతాలకు సంబంధించి ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు, నినాదాలు చేయరాదని స్పష్టం చేసింది. సాయంత్రం ఐదింటి వరకే సభ నిర్వహించుకోవాలని షరతు విధించింది. 

​అమరావతి కి ఊరట: హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ, నవంబర్ 28: రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే నెలరోజుల్లో కొన్ని పనులు.. 6 నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న హైకోర్టు పరిమితులపై స్టే విధించింది. విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. జనవరి 31లోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశించింది. రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వంతో పాటు హైకోర్టు తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి.. వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది. 


Sunday, November 27, 2022

భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలు గా పీటీ ఉష

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్ష ఎన్నిక లాంఛనమైంది. పరుగుల రాణి పీటీ ఉషను ఈ అత్యున్నత పదవి వరించనుంది. డిసెంబర్​లో జరిగే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికలకు ఉష నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు కూడా నామినేషన్లు సమర్పించారు. అధ్యక్ష పదవికి మరెవరూ నిమినేషన్​ వేయలేదు. దీంతో పీటీ ఉష ఎన్నిక దాదాపు ఖాయమైంది. అథ్లెటిక్స్​లో ఎన్నో పథకాలు సొంతం చేసుకున్న ఉష.. కీర్తి కిరీటంలో ఇది మరో మైలురాయి. 

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్ వరకు మెట్రో ..

హైదరాబాద్, నవంబర్ 27: మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్ వరకు 31 కిలో మీటర్ల మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు డిసెంబర్ 9 తేదీన సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. మొత్తం 6250 కోట్ల రూపాయలతో ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో పనులు విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

Friday, November 25, 2022

బీజేపీలో మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 26: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ లోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రులు సోనోవాల్‌, కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత శర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ... ప్రజలంతా బి జె పి వైపు చూస్తున్నారని అన్నారు. 

శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌ కు కొత్త టెర్మినల్

హైదరాబాద్, నవంబర్ 26: శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌ కోసం 2018లో హజ్‌ టెర్మినల్‌ సమీపంలో నిర్మించిన టెర్మినల్‌ను ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేస్తున్నారు. విమానాశ్రయ విస్తరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రధాన టెర్మినల్‌ను సిద్ధం చేశామని, సౌదీ ఎయిర్‌లైన్స్‌ ఎస్‌వీ-753 తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్‌ సౌదీ అరేబియాకు ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన టెర్మినల్‌ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అదనపు వివరాలకు 040-66546370 నంబరు ను సంప్రదించాలని సూచించారు.

​9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు



హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణ లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల ను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు పురపాలక శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థికశాఖ, పురపాలకశాఖలో 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, ఆడిట్‌శాఖలో 18 మంది జూనియర్‌ ఆడిటర్ల నియామకానికి ఆర్థికశాఖ అనుమతించింది. ఈ ఉద్యోగాల భర్తీకి వీలుగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులో పేర్కొన్నారు..


ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏడుగురి పేర్లతో సీబీఐ తొలి ఛార్జిషీట్‌

న్యూఢిల్లీ, నవంబర్ 26: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తొలి ఛార్జిషీట్‌ దాఖలైంది. అభిషేక్​ బోయినపల్లి, విజయ్​ నాయర్​ సహా ఏడుగురి పేర్లను సీబీఐ తన ఛార్జిషీట్​లో నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి తాము ఈ ఏడాది ఆగస్టు 17న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని పేర్లను మాత్రమే తొలి ఛార్జిషీటులో నమోదు చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించింది.

.ఏ1: కుల్‌దీప్‌ సింగ్‌, దిల్లీ ఆబ్కారీ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్‌

ఏ2: నరేందర్‌ సింగ్‌, దిల్లీ ఆబ్కారీ శాఖ మాజీ అసిస్టెంట్‌ కమిషనర్‌

ఏ3: విజయ్‌నాయర్‌, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జి

ఏ4: బోయినపల్లి అభిషేక్‌, హైదరాబాద్‌ వ్యాపారి

ఏ5: ముత్తా గౌతమ్‌, ఇండియా ఏహెడ్‌ అధినేత

ఏ6: అరుణ్‌ రామచంద్ర పిళ్లై, రాబిన్‌ డిస్టిలరీస్‌ 

ఏ7: సమీర్‌ మహేంద్రు, ఇండో స్పిరిట్‌ యజమాని

విచారణ ప్రారంభమైన 60 రోజుల తర్వాత ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉండడంతో.. తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. . ‘‘మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతిపై 10 మంది మద్యం లైసెన్సుదారులు, వారి సహచరులు, ఈ దందాతో సంబంధమున్న ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఆబ్కారీ విధానంలో సవరణలు, లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాల కల్పన, లైసెన్సు రుసుములో మినహాయింపు/రాయితీ, ఆమోదించకుండానే ఎల్‌-1 లైసెన్సు పొడిగింపు తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఖాతా పుస్తకాల్లో తప్పుడు వివరాల నమోదుతో సంపాదించిన దానిలో కొంత మొత్తం ప్రభుత్వ అధికారులకు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల నుంచి మళ్లించారు. నిందితులకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి విలువైన రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది’’ అని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 30న నిర్ణయం తీసుకుంటామని ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ తెలిపారు.


Sunday, November 6, 2022

జింబాబ్వేపై భారత్ గెలుపు: ఈ నెల 10న ఇంగ్లాండ్‌తో సెమీస్

మెల్బోర్న్ ,నవంబర్ 5:టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై టీమ్‌ఇండియా 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టీమ్‌ఇండియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 17.2 ఓవర్లకు 115 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో సికందర్‌ రజా (34*), బర్ల్‌(35) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 3, షమీ, హార్దిక్‌ 2 వికెట్ల చొప్పున తీయగా.. భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌, అక్షర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ నెల 10న సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా తలపడనుంది.


కోమటిరెడ్డి కొంప ముంచిన మునుగోడు: తన్నుకుపోయిన టి ఆర్ ఎస్

నల్గొండ, నవంబర్ 5:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అతి విశ్వాసానికి , అహంకారానికి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. కోరి తెచ్చుకున్న ఉపఎన్నిక కొంప ముంచింది. నా వూరు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఈడ్చి తన్నారు. మునుగోడు ను బంగారు పళ్ళెం లో పెట్టీ టి ఆర్ ఎస్ కు అప్పగించారు. కాంగ్రెస్ కు ఉన్న సీటు కాస్తా ఊడింది. రాజగోపాల్ ను అడ్డం పెట్టుకుని ఉపఎన్నికకు కారణ భూతమై వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పట్టు 

సాధించాలని కలలు గన్న బి జె పి కి మునుగోడు పీడ కలనే మిగిలింది. 15 రౌండ్లలో కొనసాగిన ఓట్ల లెక్కింపులో... పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి 10,309 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి జయకేతనం ఎగురవేశారు. పోలైన మొత్తం ఓట్లలో తెరాస 95,328 ఓట్లు, భాజపా 85,127 ఓట్లు, కాంగ్రెస్‌ 23,626 ఓట్లు సాధించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఏకంగా డిపాజిట్ నే కోల్పోవడం కొసమెరుపు. 



Saturday, November 5, 2022

ఐదు రాష్ట్రాలలో ఒక లోక్ సభ , 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

​న్యూఢిల్లీ, నవంబర్ 5: ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, చత్తీస్ గఢ్ లో ఖాళీగా ఉన్న కింది పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల నిర్ణయించింది.

వరస నెం. 

రాష్ట్రం పేరు 

పార్లమెంటరీ నియోజక వర్గం సంఖ్య/పేరు

1.

ఉత్తరప్రదేశ్

21- మెయిన్ పురి (పి సి)



వరస నెం. 

రాష్ట్రం పేరు 


అసెంబ్లీ నియోజక వర్గం సంఖ్య/పేరు 

1.

ఒడిశా

01- పడంపూర్ 

2.

రాజస్థాన్

21-సర్దార్షహర్

3.

బీహార్

93-కుర్హాని

4.

చత్తీస్ గఢ్

80-భానుప్రతాప్పూర్ (ఎస్టీ)

4.

ఉత్తర ప్రదేశ్ 

37-రాంపూర్


ఉప ఎన్నిక షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:

 

ఎన్నికల ప్రక్రియ 

నిర్ణీత తేదీలు 

గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ

10 నవంబర్, 2022 ((గురువారం)

నామినేషన్ల చివరి తేదీ

17 నవంబర్, 2022(గురువారం)

నామినేషన్ల పరిశీలన తేదీ

18 నవంబర్, 2022 (శుక్రవారం)

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ

21 నవంబర్, 2022(సోమవారం)

పోలింగ్ తేదీ

5 డిసెంబర్ 2022(సోమవారం)

కౌంటింగ్ తేదీ

డిసెంబర్ 8, 2022(గురువారం)

ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ 

డిసెంబర్ 10, 2022 (శనివారం)

ఈత కెళ్ళి ఆరుగురు మృత్యువాత ..

​మేడ్చల్, నవంబర్ 5: మేడ్చల్ జిల్లా మల్కారంలోని ఎర్రగుంట చెరువులో కొడదామని వెళ్ళిన ఆరుగురు అందులో పడి చనిపోయారు. మృతులు కాచిగూడలోని అడ్జి కార్ఖానాలోని మదర్సాకు చెందినవారిగా గుర్తించారు. కాచిగూడలో ముల్లాగా పనిచేస్తున్న అబ్దుల్‌ రెహమాన్‌... ఇటీవలే మల్కారంలో ఇల్లు నిర్మించుకున్నాడు. గృహ ప్రవేశానికి మదర్సాలోని పిల్లలు, తోటి ఉపాధ్యాయుల్ని పిలవగా... ఈ విషాద ఘటన జరిగింది. జవహర్‌నగర్‌ పోలీసులు... స్థానికుల సాయంతో.. చెరువుల్లోంచి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను మదర్సా ఉపాధ్యాయుడు యోహాన్, విద్యార్థులు ఇస్మాయిల్, జాఫర్, సొహైల్, అయాన్, రియాన్‌గా గుర్తించారు. మృతిచెందిన విద్యార్థుల వయస్సు 12 నుంచి 14ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. హెచ్​ఎండీఏ ఇటీవలే ఎర్రగుంటను సుందరీకరించింది. తొలిసారి ఇలాంటి ఘటన జరిగిందని స్థానిక కార్పొరేటర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. 

Friday, November 4, 2022

మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన: 12 న రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం

న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12 తేదీలలో తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో 10,472 కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12వ తేదీ సాయంత్రం తెలంగాణలో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. 

కాలుష్యం కోరల్లో ఢిల్లీ: ప్రైమరీ స్కూల్స్ కు సెలవు..

న్యూఢిల్లీ, నవంబర్ 4: ఢిల్లీలో కాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ n నేపథ్యం లో ఆప్​ ప్రభుత్వం కాలుష్య పరిస్థితి మెరుగుపడే వరకు ఢిల్లీ లో ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 5వ తరగతి కంటే పైబడిన విద్యార్థుల బహిరంగ క్రీడా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వాహనాలకు సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Thursday, November 3, 2022

పాత్రికేయ దిగ్గజం వరదాచారి కన్నుమూత


హైదరాబాద్ , నవంబర్ 3; ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు జి.ఎస్ వరదాచారి (92) కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వరదాచారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం చదివారు. వివిధ పత్రికల్లో ముఖ్యమైన పదవుల్లో పని చేశారు. నాన్ ముల్కీ సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత జరిగిన చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వరదాచారి.. అనేక వ్యాసాలు రాశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విద్యార్థులకు పాఠాలు బోధించారు. జర్నలిజంలో మెలుకువలు నేర్పుతూ ఆయన కొన్ని పుస్తకాలను సైతం రాశారు. ఇలాగేనా రాయడం, దిద్దుబాటు, నార్ల వెంకటేశ్వరరావు, మన పాత్రికేయ వెలుగులు, జ్ఞాపకాల వరద వంటి పుస్తకాలను ఆయన రచించారు. తెలుగు జర్నలిజానికి విశేష సేవ చేసిన వరదాచారి మరణం పట్ల ముఖ్యమంత్రి 

కే సి ఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.



గుజ‌రాత్ అసెంబ్లీ కి రెండు దశల్లో ఎన్నికలు: డిసెంబ‌ర్ 1, 5 తేదీల్లో పోలింగ్



న్యూఢిల్లీ, నవంబర్ 3; గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన తొలి ద‌ఫా, అయిద‌వ తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 182 స్థానాలకు గాను తొలి విడుత‌లో 89 స్థానాల‌కు, రెండ‌వ విడుత‌లో 93 స్థానాల‌కు పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2023 ఫిబ్ర‌వ‌రి 18 న ముగియ‌నున్న‌ది.

2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ 111 స్థానాలు గెలుచుకుంది. 


బి జె పి చేతుల్లో ప్రజాస్వామ్యం హత్య: కె సి ఆర్

మునుగోడు లో ముమ్మరంగా పోలింగ్…


హైదరాబాద్ , నవంబర్3; సర్వత్రా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వృద్ధులు, మహిళలు, యువత ఓటేసేందుకు ఉత్సాహంచూపారు. వికలాంగులు సైతం తమ ఓటహక్కును వినియోగించు కునేందుకు ముందుకొచ్చారు. 47 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చే తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా సిబ్బంది సకాలంలో స్పందించి సరిచేశారు . చివర్లో చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడంతో.. సమయం ముగిసినా వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఫలితంగా పలు కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. సుమారు 90శాతానికి పైగా పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.



Wednesday, November 2, 2022

​ఇక నుంచి ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలు…


హైదరాబాద్ , నవంబర్ 2; పదో తరగతి వార్షిక పరీక్షలు ఇక నుంచి ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పరీక్షలు జరపాలని నిర్ణయించినట్లు సర్క్యులర్ లో తెలిపారు. ఇప్పటి వరకు పదో తరగతిలో పదకొండు పేపర్లతో పరీక్షలు నిర్వహించారు.  ద్వితీయ భాష మినహా ప్రథమ, తృతీయ భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు రెండు పేపర్లకు విద్యార్థులు రాస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి బోధన జరగక గతేడాది ఆరు పేపర్లతోనే పరీక్ష జరిగింది.పదకొండు పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. ఆరు పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి.. ఎస్​సీఈఆర్టీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించింది. అయితే సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని తెలిపింది.




బంగ్లా పై గెలుపు: భారత్ సెమీస్ ఛాన్స్ సజీవం


మెల్ బోర్న్ , నవంబర్ 2; టీ20 ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన కీలక పోరు లో టీమ్​ఇండియా ఐదు పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్​ ఆశల్ని సజీవం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్ శర్మ (2) విఫలం కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (50) ఫామ్‌ అందిపుచ్చుకొని అర్ధశతకం సాధించాడు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (64*: 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆఖర్లో అశ్విన్‌ (13: 6 బంతుల్లో సిక్స్‌, ఫోర్) ధాటిగా ఆడాడు. సూర్యకుమార్‌ (30) రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ 3, షకిబ్ 2 వికెట్లు పడగొట్టారు.అయితే వర్షం కారణంగా భారత జట్టు నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని 151 రన్స్​కు కుదించారు. లిట్టన్​ దాస్​(60:27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) టాప్​ స్కోరర్​గా నిలిచాడు​. టీమ్​ఇండియా బౌలర్లలో అర్షదీప్​, హార్దిక్​ పాండ్య చెరో రెండు వికెట్ల తీయగా.. షమీ ఒక వికెట్​ పడగొట్టారు.



Tuesday, November 1, 2022

మునుగోడు పోలింగ్ కు సర్వం సిద్ధం..

హైదరాబాద్, నవంబర్ 1; మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారపర్వం ముగిసింది. గురువారం జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 855 మంది కాగా, పురుషులు లక్షా 21 వేల 662 మంది.. మహిళలు లక్షా 20 వేల 126 మంది ఉన్నారు. ఓటర్ల వర్గీకరణ చూస్తే అత్యధికంగా 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. 31 నుంచి 40 ఏళ్ల మధ్య 64 వేల 721 మంది ఉండగా.. 41 నుంచి 50 ఏళ్ల మధ్యలో 47,430 ఓటర్లున్నారు. 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. 798 మంది ఈ సదుపాయాన్ని ఎంచుకోగా.. అందులో 685 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.  గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 









బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...