Saturday, December 31, 2011

హ్యాపీ న్యూఇయర్...

'వార్తాప్రపంచం' వీక్షకులకు నూతన సంవత్సర శుబాకాంక్షలు...

Friday, December 30, 2011

రెచ్చగొట్టే డ్రెస్ వేస్తే రేప్ చేస్తారా...!?

హైదరాబాద్,డిసెంబర్ 31: పోలీసుశాఖ వార్షిక నివేదిక వివరాలను  మీడియాకు వెల్లడిస్తూ డీజీపీ  దినేశ్ రెడ్డి  మహిళల వస్త్రధారణ పై చేసిన కామెంట్ వివాదానికి కారణమైంది. అత్యాచారాలు పెరగడానికి మహిళల వస్త్రధారణ కూడా ఒక కారణమని డీజీపీ పేర్కొన్నారు. "నేరాల తీరును విశ్లేషిస్తే... మహిళలు పురుషులను రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకోవడం కూడా అత్యాచారాలకు ఒక కారణమని తెలుస్తోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సల్వార్ కమీజ్, చుడీదార్‌లు వచ్చాయి. ఆధునిక వస్త్రధారణలో భాగంగా ధరిస్తున్న దుస్తులు రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. ఇది నేర విశ్లేషణలో వెల్లడైన  విషయం'' అని డీజీపీ తెలిపారు. ఇదే సందర్భంగా "నేరాల తీరును విశ్లేషిస్తే... మహిళలు పురుషులను రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకోవడం కూడా అత్యాచారాలకు కారణమని తెలుస్తోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సల్వార్ కమీజ్, చుడీదార్‌లు వచ్చాయి. ఆధునిక వస్త్రధారణలో భాగంగా ధరిస్తున్న దుస్తులు రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. ఇది నేర విశ్లేషణలో స్ప ష్టమైన విషయం'' అని డీజీపీ తెలిపారు. ఏటేటా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, వారి వేష ధారణ ను కించపారచడం తమ  ఉద్దేశం కాదని అన్నారు. కాగా.. దినేశ్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించడంతో... డీజీపీ కార్యాలయం దీనిపై వివరణ మరింత ఇచ్చింది.  నేటి ఆధునికపోకడల్లో భాగంగా మహిళలు ధరిస్తున్న వస్త్ర ధారణను నియంత్రించడం పోలీసుల బాధ్యత కాదని , డీజీపీ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించడం, డీజీపీ వ్యక్తిత్వం గురించి తెలిసిన మహిళలు సైతం ఆయనను విమర్శిస్తూ మాట్లాడటం విచారకరమని ఆ వివరరణలో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ దాక చేరిన డి.జి.పి. కామెంట్స్ పై  కేంద్ర హోం మంత్రి చిదంబరం కూడా ఘాటు గానే స్పందించారు.  డీజీపీ ప్రకటనతో  తీవ్రంగా విభేదిస్తున్నామని, సమయం, సందర్భాన్ని బట్టి ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకోవచ్చునని . అది వారి వ్యక్తిగత ఇష్టాల ఇష్టాలకు సంబంధించిన విషయమని దీనిపై పోలీసులు జోక్యం అనవసరమని అన్నారు.  టెన్నిస్ లేదా ఫుట్‌బాల్ ఆడేటప్పుడు పైనుంచి కిందిదాకా దుస్తులు వేసుకోరు కదా!  అలాగే... ఏ కాక్‌టైల్ పార్టీకో వెళ్తున్నప్పుడు స్విమ్ సూటూ  వేసుకోరు'' అని చిదంబరం సెలవిచ్చారు. గతంలో కెనడాకు చెందిన ఓ కానిస్టేబుల్  'వేశ్యల్లాగా రెచ్చగొట్టే దుస్తులు వేసుకుంటే... అత్యాచారాలు ఎందుకు జరగవు?' అని చేసిన  వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'స్లట్ వాక్' అనే ఉద్యమానికి దారి తీసింది. కెనడా కానిస్టేబుల్ చేసిన వ్యాఖ్యపై  మహిళల నుంచి నిరసన మాత్రమే కాదు... ధిక్కారం కనిపించింది. 'మా దుస్తులు, మా ఇష్టం! మధ్యలో మీ కేం సంబంధం' అంటు యువతీ లోకం నినదించింది. 'మగాడి బుద్ధి వంకరైతే.... మేం ముసుగు వేసుకుని తిరగాలా?' అని ప్రశ్నించారు. 'మారాల్సింది మా దుస్తులు కాదు. మీ ఆలోచనలు' అని సూచించారు. మన దేశంలో... ఢిల్లీ, భోపాల్ తదితర నగరాల్లోనూ ఈ 'స్లట్ వాక్స్' జరిగాయి. భోపాల్ లో 'బేషరమీ మోర్చా' అనే సంఘం కూడా ఏర్పడింది. స్లట్ వాక్ ఉద్యమంలో భాగంగా దేశ విదేశాల్లో అనేక ఆసక్తికరమైన నినాదాలు పుట్టుకొచ్చాయి.'భారతదేశం మనది.. అమ్మాయిలు, అబ్బాయి సమానం' అని ఒకరు ప్లకార్డ్స్ ప్రదర్శించగా... 'గ్రేప్స్ తినండి. రేప్స్ మానండి' అని మరోచోట నినదించారు. 'అమ్మాయంటే నీ అబ్బ సొత్తు కాదు'... అని ఇంకోచోట కన్నెర్ర చేశారు. 'నేనేం వేసుకున్నా, నేనేం చేసినా... అది నా ఇష్టం. నన్ను ముట్టుకునే అధికారం నీకు లేదు' అని మరో యువతి నినదించింది. భారత జట్టు క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా అందాల ప్రదర్శన చేస్తానన్న పూనం పాండేకూడా స్లట్ వాక్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది కదా. . 

తమిళనాడు, పుదుచ్చేరిల్లో 33 మందిని బలిగొన్న ' థానే '

న్యూఢిల్లీ,డిసెంబర్ 31: తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లను వణికించిన  'థానే' తుఫాను 33 మందిని పొట్టన పెట్టుకుంది. మరో 21 మందిని గల్లంతు చేసింది. ఐదు వేలకుపైగా ఇళ్లను నేలమట్టం చేసింది. మూడు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది.  ఈ తుఫాను  శుక్రవారం ఉదయం 6.30-7.30 గంటల మధ్య పుదుచ్చేరికి ఆగ్నేయ దిశలో తీరం దాటి  ప్రస్తుతం బలహీనపడుతోంది.  థానే కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, పుదుక్కోట్టై, నాగపట్నం, తంజావూరు, పుదుచ్చేరిలతోపాటు రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో 33 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కడలూరులోనే 21 మంది మరణించారు. చేపల వేటకు వెళ్లిన 21 మంది జాలర్లు గల్లంతయ్యారు. రాష్ట్రానికి గండం తప్పిందని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. తుఫాను తీరం దాటినా సహాయ చర్యలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతాయని  చెప్పారు.

నెల్లూరు జిల్లాలో' థానే 'కల్లోలం

థానే తుపాను ప్రభావం వల్ల నెల్లూరులో భారీ వర్ష దృశ్యం 
చెన్నైడిసెంబర్ 30:   థానే తుపాను శుక్రవారం  తెల్లవారుజామున పుదుచ్చేరి, తమిళనాడులోని కడలూరు మధ్య తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు మరికొంత సమయం పడుతుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ వ్యవస్థ చాలా చోట్ల దెబ్బతింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని స్కూళ్లు, విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడు, ఇరక్కం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. థానే తుపాను ప్రభావం నెల్లూరు జిల్లా మీద తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలోని 13 తీరప్రాంత మండలాలు కల్లోలంగా ఉన్నాయి. తీర గ్రామాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు కూడా తోడు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సముద్రం లో అలజడి ఎక్కువగా ఉండటంతో పాటు కావలి ,మైపాడు,తదితర ప్రాంతాల్లో సముంద్రం మరింత ముందుకు రావటంతో మత్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడ మండలం వేనాడు, ఇరక్కం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Thursday, December 29, 2011

ఇక పాస్ పోర్టులు చకచకా...

హైదరాబాద్,డిసెంబర్ 30: ఈ ఏడాది (2011లో) 4.90 లక్షల పాస్‌పోర్టులను జారీ చేసి రికార్డు నెలకొల్పామని సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు.  పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. తత్కాల్ దరఖాస్తులను మూడు రోజుల్లోనే పరిశీలించి పాస్‌పోర్టును జారీ చేస్తున్నామని శ్రీకర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ప్రస్తుతం 200 దరఖాస్తులకు టోకెన్లు (స్లాట్స్) జారీ చేస్తున్నామని, దరఖాస్తుదారుల డిమాండ్ ఆధారంగా మరో 500 స్లాట్స్ ను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారంరోజుల్లో ప్రతి నిత్యం 2,500 స్లాట్స్‌ను ఆన్‌లైన్ దరఖాస్తుదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు. లోగడ తిరస్కృతికి గురైన దరఖాస్తుదారులు తిరిగి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకుని స్లాట్ పొందే విధానం అమలులో ఉండేదన్నారు. ఇకపై వీరు ఎలాంటి టోకెన్ అక్కర్లేకుండా మూడు రోజుల్లో నేరుగా కార్యాలయానికొచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆరు పాస్‌పోర్టు సేవాకేంద్రాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. వీటి నుంచి ఇప్పటివరకు 20 వేల దరఖాస్తులు అందాయని, ఇందులో 6,500 పాస్‌పోర్టులను జారీ చేశామని చెప్పారు. త్వరలో కరీంనగర్‌లో మినీ పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు శ్రీకర్‌రెడ్డి తెలిపారు.

లోక్ 'బాల్ ' తో ఆడుకున్న పెద్దలు...!

ఆమోదం లేకుండానే శీతాకాల సమావేశాలు వాయిదా
న్యూఢిల్లీ,డిసెంబర్ 30: లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కిన లోక్‌పాల్ బిల్లు  అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్ మక వైఖరితో అటకెక్కింది. పెద్దల సభలో దీనిని గట్టెక్కించేందుకు యూపీఏకు తగిన బలం లేకపోవడంతో అర్ధరాత్రి దాకా చర్చ తో సాగదీసి ఆఖరి నిమిషంలో గందరగోళానికి 'తావిచ్చి' సభను ఈ సారికి నిరవధిక వాయిదా వేయించడంలో సఫలీకృతమైంద్. బిల్లు బలహీనంగా ఉందంటూ చర్చ సందర్భంగా విపక్షాలు ధ్వజమెత్తాయి. అయినా అధికార కూటమి సవరణలు, మార్పుచేర్పుల జోలికిపోకుండా బిల్లుపై చర్చను సాగదీసింది. సరిగ్గా ఓటింగ్ సమయం వచ్చేసరికి.. విపక్షాలు బిల్లుకు 187 సవరణలను ప్రతిపాదించాయని, వీటిని పరిశీలించేందుకు సమయం కావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బన్సల్ సభ చైర్మన్‌ను కోరారు. దీంతో గందరగోళం తీవ్రతరం కావడంతో చైర్మన్ హమీద్ అన్సారీ అర్ధరాత్రి 12 గంటలు దాటాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, లోక్‌పాల్ బిల్లు మూలన పడదని, వచ్చే సమావేశాల్లో సభ ముందుకు తీసుకొస్తామని కేంద్ర న్యాయ శాఖ సల్మాన్ ఖుర్షీద్ మీడియాకు చెప్పారు. చర్చలో
 విపక్షాల సభ్యులు, అధికార పక్ష సభ్యులు పోటాపోటీగా 'ప్రసంగించారు'. వ్యతిరేకిస్తూ కొందరు, సమర్థిస్తూ కొందరు... కొన్ని అంశాలనే వ్యతిరేకిస్తూ కొందరు, వ్యతిరేకించినా మద్దతిస్తూ కొందరు, అసలు లోక్‌పాల్ అవసరమేమిటని ఇంకొందరు... ఇలా ప్రసంగిస్తూనే వచ్వ్హారు. . రాత్రి 11.30 గంటల సమయానికిగానీ... వీరికి రాజ్యాంగ నిబంధనలు గుర్తుకు రాలేదు. శీతాకాల సమావేశాల గడువు అర్ధరాత్రి 12 గంటల తో ముగుస్తున్నందున చర్చ కొనసాగించే అవకాశంలేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  పవన్‌కుమార్ బన్సల్ 'చావు కబురు చల్ల'గా చెప్పారు.  "విపక్ష సభ్యులు 187 సవరణలను ప్రతిపాదించారు. వీటన్నింటినీ ఇప్పుడు చేపట్టలేం. ఆ తర్వాత సంప్రదింపులు జరపాలన్నా కనీసం మూడు రోజులు పడుతుంది. కానీ... కొన్ని రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయంటూ తేల్చేశారు. దీనితో గంద్రగోళం తార స్థాయికి చేరడంతో  సభాధ్యక్షుడు  సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో... అర్ధరాత్రి వేళ  జాతి ఆకాంక్షించిన లోక్‌పాల్‌ బిల్లు అటకెక్కింది.

Wednesday, December 28, 2011

భగవద్గీత భద్రం...

మాస్కో,డిసెంబర్ 28: భగవద్గీతపై నిషేధం విధించాలని కోరుతూ సైబేరియా కోర్టులో వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన రష్యాలోని హిందువులు విజయం సాధించారు. ఉగ్రవాద సాహిత్యంగా ముద్ర వేసి భగవద్గీతను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సైబేరియా టోమ్‌స్క్ కోర్టు  బుధవారం తోసిపుచ్చింది.  స్టేట్ ప్రాసిక్యూటర్ వాదనలను, హిందువుల ప్రతిస్పందనను విన్న జడ్జి పిటిషన్‌ను సమీక్షించి, భగవద్దీతను నిషేధించాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చారు. స్టేట్ ప్రాసిక్యూటర్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని ఇస్కాన్  రష్యా యూనిట్ నాయకుడు సాధు ప్రియ దాస్ చెప్పారు.  

ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి తగ్గిన శిక్ష

హైదరాబాద్ ,డిసెంబర్ 28: లోగడ తీవ్ర సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రత్యూష ప్రియుడిగా భావించిన సిద్ధార్థ రెడ్డికి కింది కోర్టు విధించిన శిక్షాకాలాన్ని హైకోర్టు తగ్గించింది. ప్రత్యూష 2002లో మరణించింది. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష కూల్ డ్రింకులో విషం కలుపుకుని సేవించారని, దాని వల్ల ప్రత్యూష మరణించిందని వార్తలు వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స పొందిన సిద్ధార్థ రెడ్డి మాత్రం బతికి బయటపడ్డారు. ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి ఆరేళ్ల కారాగారవాసాన్ని విధించింది. దీనిపై సిద్దార్థ రెడ్డి హైకోర్టుకు వెళ్లాడు. సిద్ధార్థ రెడ్డికి నాంపల్లి కోర్టు విధించిన ఆరేళ్ల శిక్షా కాలాన్ని హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది.  రూ. 50 వేల జరిమానా విధించింది. ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి బెయిల్‌పై బయటే ఉన్నాడు. 15 రోజుల్లో లొంగిపోవాలని హైకోర్టు సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ రెడ్డి 115 రోజులు జైలులో గడిపాడు. ప్రత్యూష తల్లి సరోజిని -హైకోర్టులో తమకు న్యాయం జరగలేదని ,హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెడతానని  చెప్పారు

దీక్ష విరమించిన హజారే

ముంబై,డిసెంబర్ 28:  సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ముంబై లో చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షను జ్వరం కారణంగా  వైద్యుల సలహాపై ఒక  రోజు ముందే బుధవారం సాయంత్రం  విరమించారు. బలహీన లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం దీక్ష ప్రారంభించారు. మూడు రోజులపాటు దీక్ష చేయాలని భావించారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు రెండో రోజునే దీక్ష విరమించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, నియంతలు దేశాన్ని పాలిస్తున్నారని దీక్ష విరమించిన తర్వాత హజారే వ్యాఖ్యానించారు.

దడదడలాడిస్తున్న ‘ థానే '

విశాఖపట్నం,డిసెంబర్ 28:  బంగాళాఖాతంలో ఏర్పడిన ‘థానే’ పెను తుపానుగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశలో 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతయిన థానే రాగల 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి,  శుక్రవారం కడలూరు-శ్రీహరికోట మధ్య తీరం దాటే   అవకాశముంది. తుపాను ప్రభావంతో గురువారం నుంచి  సముద్రం తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని,  తమిళనాడు, దక్షిణకోస్తా, చిత్తూరు జిలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను హెచరిక కేంద్రం తెలిపింది.  తుపాను  తీరం దాటే సమయంలో తీరం వెంట 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచవచ్చని , మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

తొలి ఇన్నింగ్స్ లో 282 పరుగులకు భారత్‌ ఆలౌట్

ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 179 
మెల్‌బోర్న్,డిసెంబర్ 28: భారత్‌తో జరుగుతున్న తొలిటెస్ట్ లో బుధవారం  మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండవ ఇన్నింగ్స్ లో  8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మైక్ హస్సీ 79, పాటిన్‌సన్ 3 పరుగులతో క్రీజులో నిలిచారు. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో పాంటింగ్ చేసిన 60 పరుగులు తప్ప మిగితా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, జహీర్ 2, ఇషాంత్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో  282 పరుగులకు ఆలౌటైంది.

అక్కినేనికి భార్యా వియోగం

హైదరాబాద్,డిసెంబర్ 28:  ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అన్నపూర్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు 79 సంవత్సరాలు. అన్నపూర్ణ మృతితో అక్కినేని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అక్కినేనితో ఫిబ్రవరి 18, 1949 తేదిన అన్నపూర్ణ వివాహం జరిగింది. అన్నపూర్ణకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు నాగార్జున, నిర్మాత వెంకట్ అక్కినేని అన్నపూర్ణ కుమారులు. 2009 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు దంపతులు వివాహ వజ్రోత్సవం జరుపుకున్నారు.అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అన్నపూర్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. తన తల్లి మరణవార్తను తెలుసుకున్న సినీ నటుడు నాగార్జున హుటాహుటిన బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

న్యూయార్క్ లో రాజ్‌కపూర్ చిత్రాల ప్రదర్శన

 న్యూయార్క్, డిసెంబర్ 28:  భారతీయ నట దిగ్గజం  రాజ్‌కపూర్ నటించిన సూపర్ హిట్  చిత్రాలు  అమెరికా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.  ‘రాజ్‌కపూర్ అండ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ సినిమా' ’ పేరిట ఇక్కడి  మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ (మొమా) ఆధ్వర్యంలో  ఈ  సినీ ప్రదర్శనను జనవరి 6 నుంచి 16 వ తేదీ వరకు పది రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన 35 మిల్లీమీటర్ల ప్రింట్లతో  ఈ చిత్రాలను లు ప్రదర్శిస్తారు. వీటిలో ఆవారా, బర్సాత్, బూట్ పాలిష్, జిస్ దేశ్ మే గంగా బెహ్‌తీ హై, శ్రీ 420, మేరా నామ్ జోకర్, బాబీ చిత్రాలున్నాయి. అలాగే, భారత్‌లో మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా రాజ్‌కపూర్ సాధించిన ఖ్యాతిని వివరిస్తూ కార్యక్రమం ప్రారంభంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు మొమా ప్రతినిధులు తెలిపారు. 

నాడు రాజీవ్...నేడు రాహుల్...

న్యూఢిల్లీ,డిసెంబర్ 28: లోక్‌పాల్ బిల్లుకు రాజ్యాంగ హోదా కల్పించాలన్న రాహుల్ గాంధీ ప్రతిపాదన గతంలో రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ బిల్లుకు రాజ్యాంగ హోదా ప్రతిపాదన మాదిరిగానే పార్లమెంటులో వీగిపోయింది. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిస్తున్న ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌జేడీ వంటి పార్టీలు ప్రతిపక్షంతో జతకలవడంతో తాజాగా లోక్‌పాల్ ‘రాజ్యాంగ (116వ) సవరణ బిల్లు’ లోక్‌సభ తిరస్కరణకు గురైంది. దీంతో దాదాపు 22 ఏళ్లక్రితం నాటి పరిస్థితి   మళ్లీ చోటు చేసుకుంది.  రాహుల్ తండ్రి, నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా 1989లో పంచాయతీరాజ్ బిల్లుకు రాజ్యాంగ హోదా కల్పించాలని ప్రతిపాదించగా, దానిని పార్లమెంటు తిరస్కరించింది.  ప్రభుత్వేతర పార్టీలన్నీ ఒక్కతాటిపై నిలిచి దానిని అడ్డుకున్నాయి. ఆ వెంటనే లోక్‌సభను రద్దుచేసిన రాజీవ్ ఎన్నికలకు వెళ్లగా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అయితే మళ్లీ 1991 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్ప్డు కూడా  లోక్‌పాల్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు తెచ్చిన సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి యూపీఏ సర్కారు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.  అత్యంత కీలక బిల్లు విషయంలో ప్రభుత్వం సాధారణ మెజారిటీకి అవసరమైన 273 ఓట్లను కూడా పొందలేకపోయిందని, కేవలం 250 ఓట్లను మాత్రమే పొందగలిగిందని బీజేపీ విమర్శించింది. 

యు.పి.ఎ. విజయమా...వైఫల్యమా...?

రాజ్యాంగ హోదా లేకుండా 7 సవరణలతో లోక్‌పాల్ బిల్లుకు  లోక్ సభ ఆమోదం
రాష్ట్రాల్లో లోకాయుక్తల ఏర్పాటు వాటి ఇష్టం...
రాజ్యసభ లో బిల్లు ఆమోదం  అనుమానమే...    
న్యూఢిల్లీ,డిసెంబర్ 28:  అవినీతిని అరికట్టేందుకు  ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు మంగళవారం సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదం పొందినా.. కాంగ్రెస్‌కు అనూహ్యంగా ఎదురుదెబ్బే తగిలింది. లోక్‌పాల్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా దక్కేలా చేయడంలో మన్మోహన్ సర్కార్ విఫలమైంది. కోరల్లేని లోక్‌పాల్ బిల్లుతో ప్రయోజనం లేదని అటు అన్నా హజారే దీక్షకు దిగి అనారోగ్యం పాలైనా.. ఈ బలహీనమైన బిల్లుకు మేం మద్దతిచ్చేది లేదని బీజేపీ భీష్మించినా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దానిని మాత్రం ఆమోదింపచేసుకోగలిగింది. సీబీఐను లోక్‌పాల్ పరిధిలోకి తేవడం లాంటి భారీ  సవరణలకు తలొగ్గలేదు. లోకాయుక్తలను ఏర్పాటు చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఇచ్చే సవరణతో మిత్రపక్షాల మద్దతు పొందగలిగింది. సాయుధ బలగాలను, తీర గస్తీ దళాలను లోక్‌పాల్ విచారణ పరిధి నుంచి తొలగిస్తూ సవరణలు చేసి బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం పొందేలా చేసుకుంది. అయితే లోక్‌పాల్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలన్న రాహుల్ గాంధీ ప్రతిపాదన మాత్రం నెరవేరలేదు. రాజ్యాంగ హోదా కల్పించేందుకు ప్రవేశపెట్టిన బిల్లు.. సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేక పోయింది. లోక్‌సభ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లు బుధవారం రాజ్యసభలో చర్చకు రానుంది. అయితే రాజ్యసభలో యూపీఏ పక్షాలకు మెజారిటీ లేనందున బిల్లు ఆమోదం అనుమానమే. 

Tuesday, December 27, 2011

పరిటాల రవి హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్య

హైదరాబాద్ ,డిసెంబర్ 27: విప్లవ దేశభక్త పులులు సంస్థ వ్యవస్థాపకుడు, పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉండి నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్యకు గురయ్యాడు. హైదరాబాదులోని సుల్తాన్ బజార్‌ పోలీసు స్టేషన్ పరిధిలో గల బొగ్గులకుంట ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఐదుగురు గుర్తు తెలుయని వ్యక్తులు అతన్ని దారుణంగా హత్య చేశారు.  గోవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్నఆటోను  బైక్‌లపై ఇద్దరు వ్యక్తులు  వెంబడించారని, మరో ఇద్దరు కాపు కాశారని, ఐదుగురు దాడి చేసి చంపారని  పోలీసులు వివరించారు.  గోవర్దన్ రెడ్డితో పాటు ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పారిపోయినట్లు తెలుస్తోంది.  దుండగులు ఆటో డ్రైవర్‌ను బంధించి గోవర్ధన్ రెడ్డిని హత్య చేశారు. ఆటోలో పటోళ్ల గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రయాణించి దాడి సమయంలో పరారైన వ్యక్తి ఎవరనేది  ఇంకా తెలియ లేదు.

ఇండియా కోసం మరణిస్తా:అన్నా హజారే

ముంబైలో మూడు రోజుల నిరాహార దీక్ష ప్రారంభం  ముంబై,డిసెంబర్ 27: భారత ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని, తాను జీవించి ఇండియా కోసం మరణిస్తానని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లు బలహీనంగా ఉందని ఆరోపిస్తూ , ఇక్కడి ఎంఎంఆర్‌డిఎ మైదానంలో మూడు రోజుల నిరాహార దీక్ష ప్రారంభించిన అన్నా హజారే భారీగా గుమికూడిన ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించారు. గుండె నిచ్చిన భారత దేశం కోసం ప్రాణాలనైనా అర్పిస్తానని ఆయన అన్నారు. దేశం కోసం తాను కుటుంబాన్నే వదిలేశానని, తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా తెలియదని, దేశం కోసం వివాహం కూడా చేసుకోలేదని ఆయన అన్నారు. మరణిస్తాననే భయం లేదని, పోరాడుతూ పోతానని ఆయన అన్నారు. తన జట్టు సభ్యులు దీక్ష విరమించాలని అడిగారని, తాను వారి మాటలు వినలేదని ఆయన చెప్పారు.ప్రజల మద్దతు వల్లనే రామ్ లీలా మైదాన్‌లో 12 రోజులు దీక్ష చేయగలిగానని ఆయన చెప్పారు. లోక్‌పాల్ బిల్లును నీరు గార్చడం అన్నా జట్టును మోసం చేయడం కాదని, ప్రజలను మోసం చేయడమని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఏదో ఒక రోజు ప్రజలు ఎగిసిపడి ప్రభుత్వాన్ని శిక్షిస్తారని ఆయన అన్నారు. ప్రజా పార్లమెంటు ఢిల్లీలోని పార్లమెంటు కన్నా పెద్దదని ఆయన అన్నారు. తమ ఓట్ల ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని శిక్షిస్తారని ఆయన అన్నారు. తన శరీర ఉష్ణోగ్రతపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అయినా దీక్ష కొనసాగిస్తానని ఆయన అన్నారు.

భారత్ 214/3

మెల్‌బోర్న్,డిసెంబర్ 27: : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో  రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ద్రావిడ్ 68, నైట్ వాచ్‌మెన్ ఇషాంత్ శర్మ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆటలో సెహ్వాగ్, ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌లు అర్ధ సెంచరీలను నమోదు చేశారు.  అర్ధ సెంచరీ నమోదు చేసుకుని మంచి ఊపు మీద కనిపించిన సచిన్.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అవుట్ కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సచిన్ 98 బంతుల్లో 73 పరుగులు చేసి సిడిల్ బౌలింగ్లో  క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సెహ్వాగ్ 67, గంభీర్ 3 పరుగులు చేశారు.సెహ్వాగ్ 8 వేల పరుగుల క్లబ్‌లో చేరడం, అలెన్ బోర్డర్ 64 అర్ధ సెంచరీల రికార్డును సచిన్ అధిగమించడం రెండవ రోజు ఆటలో విశేషం.

Monday, December 26, 2011

రెడీ ఫర్ కరెంట్ షాక్...!

హైదరాబాద్,డిసెంబర్ 26:   విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీంతో చార్జీల పెంపునకు అనుమతి నివ్వాలంటూ విద్యుత్ నియంత్రణ మండలిని విద్యుత్ పంపిణీ సంస్థ( డిస్కం) కోరింది. ప్రతిపాదిత పెంపుతో గృహ, పరిశ్రమ, వాణిజ్య వినియోగదారులపై రూ.4,950 కోట్ల భారం పడుతుందని అంచనా. 100 యూనిట్లు పైబడి విద్యుత్ వాడే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. పెంచిన చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.

సంక్రాంతి తర్వాత మళ్ళీ తెలంగాణా సమరం: కేసీఆర్

హైదరాబాద్,డిసెంబర్ 26:  సంక్రాంతి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు విశ్రమించేదిలేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ భవన్‌లో తెలంగాణ లెక్చరర్ల సంఘం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ , తెలంగాణ ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరుకుందన్నారు. అవసరమయితే మరోసారి దీక్షకు దిగుతానన్నారు. ప్రజా ఉద్యమంలో ప్రజలదే విజయమన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు. తాను మాట్లాడినా, మాట్లాడకపోయినా వార్తేనని కేసీఆర్ చమత్కరించారు. చంద్రబాబు వంచనలకు అంతేలేదని, వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది  ఆయనేనని అన్నారు. ఆంధ్రా హజారేనని చెప్పుకుంటున్న చంద్రబాబు సీబీఐ దర్యాప్తుపై ఎందుకు స్టే తెచ్చుకున్నారని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. అవిశ్వాస సందర్భంగా వచ్చిన అవకాశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారవిరుచుకున్నారని అన్నారు. ప్రభుత్వంపై కనీస ఒత్తిడి కూడా తేలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చే వరకు రాజీలేని పోరాటం చేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

తెలంగాణ హుళక్కేనా...!

 న్యూఢిల్లీ,డిసెంబర్ 26:   తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కొత్త సంవత్సరంలో కచ్చితమైన ప్రకటన చేసే  అవకాశం ఉంది. అయితే తెలంగాణాకు అనుకూలంగా కాదని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయ సాధన కుదరలేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పుడు సాధ్యం కాదని తేల్చి చెప్పేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.  జనవరిలో జరిపే కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆహ్వానించి తుది అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేశారనే విషయాన్ని కూడా వారి నుంచి రాబట్టి ప్రకటన చేస్తారని అంటున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా గత రెండేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  యుపిఎ భాగస్వామ్య పక్షాల నాయకులు శరద్ పవార్, మమతా బెనర్జీ, కరుణానిధి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ కాంగ్రెసు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా 277/6

మెల్‌బోర్న్,డిసెంబర్ 26:  భారత ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, జహీర్‌లు రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో  6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఓపెనర్ కోవాన్ 68 పరుగులు చేయగా,, వార్నర్ 37, పాంటింగ్ 62, క్లార్క్ 31 పరుగులు చేశారు. హస్సీ, మార్ష్  పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. హాడీన్ 21 పరుగులతోను, సిడ్లే 34 పరుగులతోనూ   క్రీజులో ఉన్నారు. ఉమేష్ యాదవ్ 3, జహీర్ 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. 

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప మృతి

బెంగళూరు,డిసెంబర్ 26: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప మృతి చెందారు. గత కొద్దికాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితోబాధపడుతున్న బంగారప్ప అదివారం అర్ధరాత్రి 12.40 నిమిషాలకు బెంగళూరులోని మాల్యా ఆస్పత్రిలో మరణించినట్టు బంధువర్గాలు వెల్లడించాయి. న్యాయశాస్త్రంలో పట్టబధ్రుడైన బంగారప్ప.. కర్నాటక రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. కర్నాటక అసెంబ్లీకి 1967 సంవత్సరంలో తొలిసారిగా ఎన్నికైన బంగారప్ప.. 1996 సంవత్సరం వరకు సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా సేవలందించారు. 1990-92 కాలంలో కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆతర్వాత 1996 సంవత్సరంలో 11 లోకసభకు, 1999లో 13 లోకసభకు, 2003 సంవత్సరంలో 14వ లోకసభకు (బీజేపీ అభ్యర్థిగా) బంగారప్ప ఎంపికయ్యారు. బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఆయన 2005 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున తిరిగి లోకసభకు ఎంపికయ్యారు. 2009 సంవత్సరంలో సమాజ్‌వాదీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికలో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప కుమారుడు బీఎస్ రాఘవేంద్ర చేతిలో బంగారప్ప ఓటమి చవిచూశారు. ఆతర్వాత బంగారప్ప జనతాదళ్‌లో పార్టీలో చేరారు.గతంలో ఆయన కర్నాటక వికాస్ పార్టీ, కర్నాటక కాంగ్రెస్ పార్టీలను స్థాపించారు. 

మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి మృతి

హైదరాబాద్,డిసెంబర్ 26:  మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సిద్దారెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు. సిద్దారెడ్డి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.  1958, 64, 71 సంవత్సర కాలంలో మూడుసార్లు ఎమ్మెల్సీగా, 1983లో మధిర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1964 సంవత్సరంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో, 1971లో పీవీ నర్సింహరావు కేబినెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.

Sunday, December 25, 2011

ఆదివారం నాడు 88వ పుట్టిన రోజు జరుపుకున్న మాజీ ప్రధాని అటల్ జీ 

22 మంది టూరిస్ట్ లకు 'పులికాట్'

చెన్నై,డిసెంబర్ 25: : తమిళనాడు లోని పులికాట్ సరస్సులో పర్యాటకుల బోటు మునిగి  22 మంది మరణించారు.  చెన్నై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలవేరుకాడు వద్ద  ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం 60మంది  బోటులో విహారానికి వెళ్ళగా, మిగిలినవారు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు.    

Saturday, December 24, 2011

మినీ సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం...

ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు
న్యూఢిల్లీ,డిసెంబర్ 24: 2014 సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు రిహార్సల్ గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం  ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్‌లో వచ్చే ఏడాది జనవరి 30న, మణిపూర్‌లో జనవరి 28న, గోవాలో మార్చి 3న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో ఎన్నికలు జరపనుంది. అయితే కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత ఎన్నికలు ఫిబ్రవరి నాలుగున  ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 8, 11, 15, 19, 23, 28 తేదీల్లో మిగతా విడత ఎన్నికలుంటాయి. మార్చి 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి తెలిపారు.  

హ్యాపీ క్రిస్మస్....

వార్తాప్రపంచం వీక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు...

ఉరేసుకుందాం రా...కెసిఆర్ ను సవాల్ చేసిన 'దేశం' నేతల అరెస్ట్

హైదరాబాద్,డిసెంబర్ 24:  ఉరేసుకుందాం రమ్మంటూ తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సవాల్ చేస్తూ తాడుతో హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద హంగామా చేసిన తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును, మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. వారితో పాటు తెలుగుదేశం ఇతర నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని హైదరాబాదులోని నాంపల్లి పోలీసు స్టేషనుకు తరలించారు. తనకు, కెసిఆర్‌కు తాడు తెచ్చానని, ఇద్దరం ఉరేసుకుందాం రావాలని మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్‌ను సవాల్ చేశారు. కెసిఆర్‌పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తుంటే కెసిఆర్ ఫామ్ హౌస్‌లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పిట్టల దొరలాగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ వద్ద ఉన్నది కట్టె తుపాకి అని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు వారిని  అరెస్టు చేసే సమయంలో గన్ పార్కు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మరోవైపు గన్‌పార్కు వైపు రావడానికి ప్రయత్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని తెరాస కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కొంత మంది తప్పించుకుని గన్ పార్కుకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Friday, December 23, 2011

ఢిల్లీ ఇందిరా గాంధి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని  శుక్రవారం ఉదయం   కమ్ముకున్న మంచు

      డాన్-2 సినిమా ప్రమోషన్లో భాగంగా పాట్నా లో మీడియా సమావేశంలో షారూక్, ప్రియాంకా చోప్రా..

ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కన్నుమూత

హైదరాబాద్,డిసెంబర్ 23: : ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి (82) ఈ ఉదయం కన్నుమూశారు.  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మహారథి ఎన్నో హిట్ సినిమాలకు మాటలు రాశారు.. ఎన్టీఆర్-బి.విఠలాచార్య కాంబినేషన్‌లో బందిపోటు చిత్రంతో రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్-కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన నిలువుదోపిడి, దేవుడు చేసిన మనుషులురాలకు మహారథి సంభాషణలు అందించారు.   కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాకోసం మహారథి అనేక సినిమా ఆఫర్లను వదులుకుని తపస్సులా రచన చేశారు. పెత్తందారులు, కంచుకోట, దేశోద్ధారకులు, పాడిపంటలు, ప్రజారాజ్యం సినిమాలకు కూడా సంభాషణలు రాశారు. త్రిలింగ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. కృష్ణ నటించిన శాంతి సందేశం చిత్రానికి ఆయన చివరిగా మాటలు రాశారు.  కృష్ణ నటించిన సింహాసనం  చిత్రంలో మహారథి కీలక పాత్ర పోషించారు. రైతు భారతం అనే సినిమాను మహారథి స్వయంగా నిర్మించారు.

కాంగ్రెస్ 'మార్క్' సమన్వయం !

న్యూఢిల్లీ,డిసెంబర్ 23:   రాష్ట్ర కాంగ్రెస్‌లో  పార్టీ నాయకత్వం, ప్రభుత్వ సారథ్యం మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో... పరిస్థితిని చక్కదిద్దడానికి అధిష్టానం  సమన్వయ కమిటీని రంగం లోకి దించింది.  ఈ కమిటీకి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహిస్తారు.  దీంతో రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆజాద్ ఇకనుంచి మరింత క్రియాశీలంగా ‘సూపర్‌బాస్’ పాత్రను పోషించే అవకాశం వుంది.  సమన్వయ కమిటీలో ఆజాద్‌తోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎంపీ కావూరి సాంబశివరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవిలకు అధిష్టానం స్థానం కల్పించింది. గత కొద్ది మాసాలుగా పీసీసీ చీఫ్, సీఎం పరస్పర విరుద్ధ వైఖరులతో నడుస్తున్న వైనాన్ని అధిష్టానం గమనించిందని, వారి మధ్య రాజీ మిధ్య అని తేలడంతోనే సమన్వయ కమిటీని వేసిందని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.  కమిటీలో సీమాంధ్ర నుంచి నలుగురు ఉండగా తెలంగాణ నుంచి ముగ్గురే ఉండటం గమనార్హం. గతంలో వైఎస్ హఠాన్మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అధిష్టానం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2010 ఫిబ్రవరి 5న నాటి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో రోశయ్య, డి.శ్రీనివాస్, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, కావూరి, గీతారెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ సారి  కమిటీ లో కేవీపీ రామచంద్రరావు, గీతారెడ్డి, జానారెడ్డి లకు చోటు దక్కలేదు.

Thursday, December 22, 2011

మూడు వెబ్‌సైట్ల ద్వారా విదేశీయుల రిజిస్ట్రేషన్

హైదరాబాద్,డిసెంబర్ 23: రాష్ట్రానికి వచ్చే విదేశీయులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మూడు వెబ్‌సైట్ల ద్వారా అవకాశం ఇస్తున్నట్లు ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) భావనా సక్సేనా వెల్లడించారు. ఇప్పటి వరకు నగరానికి వచ్చేవారు హైదరాబాద్ పోలీసు వెబ్‌సైట్  (www.hyderabadpolice. gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, ఇకపై అధికారిక వెబ్‌సైట్స్ (www. immigrationindia.nic.in, www.mha.nic.in , www.mha.gov.in ) లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని  వివరించారు. వీటి ద్వారా వీసా ఎక్స్‌టెన్షన్, ఎగ్జిట్ పర్మిట్, రిటన్ వీసా, పీఐఓ/ఓసీఐ తదితర సదుపాయాలను  పొందవచ్చునని చెప్పారు.

‘బిజినెస్‌మేన్’ ఆడియో విడుదల

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా నటించిన ‘బిజినెస్‌మేన్’ ఆడియో  విడుదలయింది. శిల్పా కళావేదికలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తెలుగు, తమిళం, మలయాళంలో భాషల్లో ఒకేసారి ఈ సినిమా ఆడియో విడుదల చేశారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కృష్ణ, విజయనిర్మల దంపతులు, నిర్మాత రామానాయుడు, హీరో మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్, హీరోయిన్ కాజల్, దర్శకులు పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, రాజమౌళి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. ' మహేష్‌తో సినిమా చేయడం ఒక మత్తు. డెరైక్టర్‌కి కిక్కిస్తాడు. బిజినెస్‌మేన్’తో మహేష్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతుంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్  ఈ సందర్భంగా అన్నారు. మహేష్ మాట్లాడుతూ -‘‘జగన్ ఎప్పుడు సినిమా మొదలుపెట్టారో, ఎప్పుడు పూర్తి చేశారో నాకే తెలియలేదు. జగన్ పెన్ పవరేంటో రేపు తెరమీద చూస్తారు. థమన్ అద్భుతంగా సంగీతం అందించాడు. జనవరి 11న మనందరికీ పెద్ద పండుగ మొదలు కాబోతుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ -‘‘రెండేళ్లు సినిమా తీయడం కాదు. పూరి జగన్నాథ్‌లా ఆరు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని నా శ్రీమతి అంటూ ఉంటుంది. అందుకే ఆయన దగ్గర రెండు సినిమాలకైనా అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉంది. మహేష్, నేను కలిసి సినిమా చేయాలని కమిటైపోయాం. కౌబాయ్, జేంస్బాండ్ తరహా కావాలో లేక అల్లూరి సీతారామరాజులాంటి సినిమా చేయాలో అభిమానులే నిర్ణయించాలి’’ అని తెలిపారు. మహేష్, నమ్రతలను పూరి జగన్నాథ్ సభాముఖంగా సరదాగా ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్ని అలరించింది.

క్రైస్ట్ చర్చ్ లో భూకంపం

న్యూజిలాండ్,డిసెంబర్ 23 : న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9 గా నమోదు అయ్యింది. దీనితో  విద్యుత్, టెలిఫోన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా క్రైస్ట్ చర్చ్ విమానాశ్రయాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కాగా ఆస్తి, ప్రాణ నష్టంగురించి  వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Wednesday, December 21, 2011

న్యూజెర్సీలో చిన్నవిమానం కూలి భారతీయుని మృతి

న్యూయార్క్,డిసెంబర్ 22: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన విమాన ప్రమాదంలో భారతీయుడొకరు మృతి  చెందారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో భారతీయుడు రాకేష్ చావ్లా( 36) తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న చిన్న విమానం రద్గీగా ఉండే న్యూజెర్సీ హైవేపై కుప్పకూలింది. న్యూయార్క్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘గ్రీన్‌హిల్ అండ్ కో’ లో చావ్లా మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో నిష్ణాతుడైన రాకేష్ చావ్లా 2003లో బ్లాక్‌స్టోన్ గ్రూపు నుంచి గ్రీన్‌హిల్‌లో చేరారు.ఇదే కంపెనీకి చెందిన మరో ఎండీ జెఫ్రీ బక్లాల్యూ(45), ఆయన భార్య, వారి ఇద్దరు పిల్లలు ప్రమాదంలో చనిపోయారు. న్యూజెర్సీ టెటర్‌బరో ఎయిర్‌పోర్ట్ నుంచి గాల్లోకి ఎగిరిన 14 నిమిషాల తర్వాత విమానం ప్రమాదానికి గురయిందని ఫెడరల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి జిమ్ పీటర్స్ తెలిపారు. 2005 సొకాటా సింగిల్-ఇంజిన్ టర్బోప్రొప్ రకానికి చెందిన ఈ విమానంలో చావ్లా, జెఫ్రీ కుటుంబం అట్లాంటాకు వెడుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
 

Thursday, December 15, 2011

మరో వివాదంలో చిదంబరం

న్యూఢిల్లీ,డిసెంబర్ 16: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రమేయంపై ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన మాజీ క్లయింట్ అయిన సునైర్ హోటల్స్ లిమిటెడ్ చైర్మన్ ఎస్.పి. గుప్తాపై నమోదైన మూడు చీటింగ్, ఫోర్జరీ కేసులను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు  ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చిదంబరం గతంలో గుప్తా తరఫున ఢిల్లీ హైకోర్టులో వాదించారని... నాటి పరిచయం దృష్ట్యా కేసులను ఉపసంహరించాలని హోంమంత్రి హోదాలో ఆదేశించారంటూ ఓ ఆంగ్ల పత్రిక, చానల్‌లో కథనం వచ్చింది. దీంతో చిదంబరం రాజీనామాకు పట్టుబడుతూ విపక్షాలు గురువారం పార్లమెంటులో తీవ్ర గందరగోళం సృష్టించాయి. ఫలితంగా ఉభయసభలూ పలుమార్లు వాయిదాపడ్డాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పేర్లు చెప్పుకొని గుప్తా తమ నుంచి కోట్లాది రూపాయలు రుణం తీసుకొని మోసం చేశాడని వీఎల్‌ఎస్ ఫైనాన్స్ అనే సంస్థ ఈ కేసులు పెట్టింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం చిదంబరంపై విపక్షాల ఆరోపణలన్నీ ఏకపక్షమైనవంటూ ఆయన్ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. కేసుల ఉపసంహరణ విషయం చిదంబరానికి తెలియదని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఆగమేఘాలపై హోటల్ యజమానిపై కేసుల విచారణను నిలుపుదలచేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ కేసులపై విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. 

Wednesday, December 14, 2011

బుధవారం హైదరాబాద్ లో కలెక్టర్ల సమావేశం లో సి.ఎం కిరణ్ కు మంత్రులు రఘువీరా, ఆనం స్వాగతం.

వరుణ్‌ కొత్త సినిమా


హైదరాబాద్:  వరుణ్‌సందేశ్, మోనాల్‌గజ్జర్ జంటగా నంద్యాల రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘ఇప్పటివరకు లవర్‌బోయ్ పాత్రలకే పరిమితమయ్యాను. అయితే ఈ చిత్రంలో వాటికి భిన్నమైన పాత్ర చేస్తున్నాను. ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్’’ అని వరుణ్ ఈ సందర్భంగా అన్నాడు.   కె.ఎం. రాధాకృష్ణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ, ఈ బేనర్‌లో ఇది  ఆరవ సినిమా అని దాదాపు తెలుగు పరిశ్రమలో ఉన్న హాస్యనటీనటులందరూ ఇందులో నటిస్తున్నారని,  వచ్చే వేసవికి సినిమాని విడుదల చేస్తామని  చెప్పారు.  మోనాల్‌ గజ్జర్‌ మాట్లాడుతూ, 'వెన్నెల ఒకటిన్నర' సినిమా తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. సాంప్రదాయ అమ్మాయిగా కన్పిస్తాను. వినోదాత్మకచిత్రమిది అన్నారు.      

లోక్‌పాల్ బిల్లుపై పార్టీల మధ్య కుదరని ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ,డిసెంబర్ 15:  లోక్‌పాల్ బిల్లుపై ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేలోగానే ఈ బిల్లు ఆమోదించేలా పార్టీలన్నీ సహకరించాలని, పార్టీ రాజకీయాలకు దీనిని బలి చేయవద్దని ప్రధాని విజ్ఞప్తి చేసినా, ఫలితం లేకుండా పోయింది. ప్రధానిని, దిగువ శ్రేణి ప్రభుత్వోద్యోగులను లోక్‌పాల్ పరిధిలోకి తేవడం వంటి కీలక అంశాలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.  దాదాపు మూడు గంటల సేపు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గ్రూప్-సీ, గ్రూప్-డీ ఉద్యోగులను లోక్‌పాల్ పరిధిలోకి చేర్చాల్సిందేనని బీజేపీ పట్టుపట్టగా, సీపీఐ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి చేర్చాలన్న అంశంపై మాత్రం బీజేపీ, వామపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. గ్రూప్-సీ, గ్రూప్-డీ ఉద్యోగులు కోట్ల సంఖ్యలో ఉన్నందున వారందరినీ లోక్‌పాల్ పరిధిలోకి చేర్చడం సాధ్యంకాని పని అని తమ పార్టీ భావిస్తోందని సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా అన్నారు. వారి కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. లోక్‌పాల్ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలని వామపక్షాలు డిమాండు చేశాయి. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తితోనే కొనసాగాలని, అయితే, సీబీఐ డెరైక్టర్ ఎంపికలో లోక్‌పాల్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని శిరోమణి అకాలీదళ్ నేత ఎస్.ఎస్.ధిండ్సా అన్నారు. లోక్‌పాల్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండు కూడా అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమైంది. 

Tuesday, December 13, 2011

‘బాడీగార్డ్’ సంక్రాంతి బెస్ట్.... వెంకటేష్

హైదరాబాద్:  వెంకటేష్  కథానాయకుడిగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘బాడీగార్డ్’. ఆడియోను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘అభిమానుల మధ్య నా పుట్టిన రోజున ‘బాడీగార్డ్’ పాటలు విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. 25 ఏళ్ల నా కెరియర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేశాను. దానికి కారణం అభిమానుల ప్రోత్సాహమే. ‘బాడీగార్డ్’ ఈ సంక్రాంతికి ఓ మంచి సినిమాలా నిలుస్తుంది. అభిమానుల అంచనాలను అందుకుంటుంది’’ అని వెంకటేష్  ఈ సన్సర్భంగా అన్నారు.ఆడియో సీడీని వివి వినాయక్ ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రభాస్‌కు అందించారు. ‘బాడీగార్డ్’ సినిమా వెబ్‌సైట్‌ను తమిళ హీరో కార్తీక్ ఆవిష్కరించారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘‘మలయాళం, హిందీ వెర్షన్‌లకంటే తెలుగు ‘బాడీగార్డ్’ పెద్ద హిట్ అవుతుంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. జనవరి 9న అంటే రెండు రోజుల ముందుగానే ఓవర్‌సీస్‌లో రిలీజ్ చేస్తున్నాం. వెంకటేష్ కెరియర్‌లో ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుంది అని నమ్మకంతో చెప్పగలను’’ అన్నారు. కథానాయిక త్రిషతోపాటు డి.రామానాయుడు, రానా, కె.ఎస్.రామారావు, కె.ఎల్. నారాయణ, సంతోష్ శ్రీనివాస్, వేణుమాధవ్, ఎంఎల్ కుమార్ చౌదరి, భీమినేని శ్రీనివాస్, మెహర్ రమేష్, పైడిపల్లి వంశీ, పరుచూరి శివరాంప్రసాద్, రమేష్ పుప్పాల, రజత్ పార్థసారధి, రామ్‌లక్ష్మణ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

స్వరాజ్ పాల్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

లండన్ ,డిసెంబర్ 14:   బ్రిటన్‌లో ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ మారియెట్ హోటల్ జరిగిన ఓ కార్యక్రమంలో అందజేశారు. వివిధ రంగాల్లో ఎనలేని కృషిని చేసినందుకు ఈ అవార్డును స్వరాజ్‌పాల్‌కు భారతీయ కంపెనీ పవర్‌బ్రాండ్ ప్రకటించింది. తనకు అందజేసిన అవార్డును భారత ప్రజలకు స్వరాజ్‌పాల్ అంకితమిచ్చారు. లేబర్ పార్టీకి చెందిన రాజకీయవేత్తగానే కాకుండా, వాల్వెర్‌హాంప్టన్ యూనివర్సిటీ, వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటికి ఆయన చన్సలర్ గా సేవలందిస్తున్నారు. 1983 సంవత్సరంలో స్వరాజ్‌పాల్‌కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

 

జడ్జీల్లో జవాబుదారీతనం పెంచే బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ,డిసెంబర్ 14:    అన్నా హజారే బృందం లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని పట్టుబడుతున్న న్యాయ వ్యవస్థ ప్రమాణాలు-జవాబుదారీ బిల్లు-2010 కు  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు.  జడ్జీల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీల దుష్ర్పవర్తన లేదా అనర్హతకు సంబంధించి అందే వ్యక్తిగత ఫిర్యాదులపై విచారణ, అందుకు అనుసరించాల్సిన పద్ధతులను ఈ బిల్లులో పొందుపరిచారు.ఒకే కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించకుండా జడ్జీలు దూరం పాటించడాన్ని తప్పనిసరి చేయాలని బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. కేసుల విచారణ సందర్భంగా జడ్జీలు రాజ్యాంగబద్ధ సంస్థలు లేదా వ్యక్తులపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలనే నిబంధనను ఈ బిల్లులో ప్రభుత్వం తొలుత ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపిందా లేదా అనే విషయం తెలియరాలేదు.. కాగా, విజిల్‌బ్లోయర్స్ భద్రత బిల్లు-2010, సిటిజన్స్ చార్టర్ బిల్లు-2011 లకు కూడా కేబినెట్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిటి జన్స్ చార్టర్ (పౌర సేవల జాబితా)లో పౌరులకు అధికారులు నిర్ణీత వ్యవధిలోగా అందించాల్సిన సేవలను ఈ బిల్లులో పొందుపరిచారు. అయితే 15 రోజుల వ్యవధి చాలా తక్కువని కొందరు మంత్రులు అభిప్రాయపడటంతో చివరకు 30 రోజుల వ్యవధిగా నిర్ణయించారు.
విజిల్‌బ్లోయర్స్ భద్రత బిల్లులో కేంద్ర మంత్రి మండలి, న్యాయ వ్యవస్థ, కార్పొరేట్లను దీని పరిధిలోకి తేవాలని ప్రతిపాదన ఉంది.అలాగే మనీలాండరింగ్ నిరోధక బిల్లులో సవరణలకు అంగీకారం తెలిపింది. అయితే ఆహార భద్రత బిల్లుపై చర్చ జరిగినా దానిపై కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బిల్లుపై నిర్ణయాన్ని 18న జరగనున్న సమావేశానికి వాయిదా వేసింది.

మిథున రాశి నుంచి ఉల్కాపాతం

న్యూఢిల్లీ,డిసెంబర్ 14:   జెమిని నక్షత్ర మండలం (మిథున రాశి) నుంచి బుధ, గురువారాల్లో వివిధ రంగులతో కూడిన ఉల్కాపాతం సంభవించనుందని సైన్స్ పాపులరైజేషన్ అసోసియేషన్ ఆఫ్ కమ్యూనికేటర్స్ అండ్ ఎడ్యుకేటర్స్ (స్పేస్) అధ్యక్షుడు సీబీ దేవగణ్ వెల్లడించారు. తూర్పు ఆకాశంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మధ్యస్థ వేగంతో రాలే ఈ జెమినైడ్స్ (మిథున రాశి ఉల్కలు) ను నేరుగా చూడవచ్చని ఆయన తెలిపారు. గంటకు 50 నుంచి 100 వరకు ఉల్కలు రాలే అవకాశముందన్నారు. సాధారణంగా భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయే తోకచుక్కల శకలాలను ఉల్కలుగా పిలుస్తారని, అయితే ప్రస్తుతం మిథునరాశిలోని ‘3200 ఫాథాన్’ అనే గ్రహశకలానికి చెందిన అవశేషాలు ఉల్కలుగా రా లనున్నాయని వివరించారు. 

కేబుల్ టీవీ డిజిటలైజేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ,డిసెంబర్ 14:  తక్కువ ధరకే నాణ్యమైన టీవీ ప్రసారాలను అందించేందుకు ఉద్దేశించిన కేబుల్ టీవీ డిజిటలైజేషన్ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు వల్ల కేబుల్ ఆపరేటర్లకు ఎటువంటి నష్టం ఉండదని హామీ ఇచ్చింది. అనలాగ్ టీవీ నెట్‌వర్క్ నుంచి డిజిటలైజేషన్‌కు మారడం వల్ల భారత్ కూడా అమెరికా, బ్రిటన్, కొరియా, తైవాన్‌ల సరసన చేరుతుందని తెలిపింది.  ఈ సందర్భంగా జరిగిన చర్చలో సమాచార, ప్రసారశాఖ మంత్రి అంబికా సోని  మాట్లాడుతూ, ఈ బిల్లు వల్ల సెట్ టాప్ బాక్సుల ధరలు తగ్గుతాయని, వాయిదా పద్ధతుల్లో, అద్దెకు కూడా దొరుకుతాయని వివరించారు. అలాగే వీక్షకులు తమకు అవసరంలేని చానళ్లను తీసుకోవాల్సిన అగత్యం తప్పుతుందన్నారు. చానళ్ల సంఖ్యను కలిగి ఉండటంపై ట్రాయ్ పరిమితి విధించనుందని చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యంగా చానళ్ల టీఆర్పీ రేటింగ్‌ల గొడవకు ఈ బిల్లు తెరదించుతుందని సోని వివరించారు. ఇకపై చందాదారుల జాబితానే దీన్ని నిర్ణయిస్తుందన్నారు. నిబంధనలు అతిక్రమించే కేబుల్ ఆపరేటర్ల లెసైన్సుల రద్దుకు ఈ బిల్లుకు అవకాశం కల్పిస్తుందన్నారు. 

Monday, December 12, 2011

‘ద డర్టీ పిక్చర్’ కు వసూళ్ళే వసూళ్ళు...!

హైదరాబాద్:  విద్యాబాలన్ నటించిన ‘ద డర్టీ పిక్చర్’ వంద కోట్ల రూపాయల బిజినెస్ దిశగా దూసుకెడుతోంది. హిందీతో పాటు తెలగు, తమిళంలో కూడా రిలీజ్ అవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది. ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ. 65 కోట్ల వసూళ్లు సాధించింది.  ఒకప్పటి దక్షిణాది ఐటం సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కడంతో....స్మిత తెరవెనక జీవితం గురించి తెలుసుకోవడానికి  ప్రేక్షకులు క్యూ కడుతున్నారు . దీనికి తోడు సినిమాపై నెలకొన్ని అనేక వివాదాలు డర్జీ పిక్చర్ కు  పబ్లిసిటీ పెంచేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ పూర్తయ్యే నాటికి 100 కోట్ల మార్కు దాటుతుందని సినిమా వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఒక సాధారణ లోబడ్జెట్ చిత్రంగా వచ్చి వంద కోట్ల మార్కును దాటిన సినిమాగా డర్జీ పిక్చర్ రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ విజయంతో బాలీవుడ్ ‘ఎ’ గ్రేడ్ హీరోయిన్ల సరసన చేరిన విద్యా బాలన్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం విద్యాబాలన్ రెమ్యూనరేషన్  రూ. 7 కోట్లు ట.  

జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హత కై కాంగ్రెస్ పిటిషన్

హైదరాబాద్,,డిసెంబర్ 13:  అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ శాసనసభాపక్షం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసింది. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని కోరుతూ విడివిడిగా లేఖలు అందజేసినట్టు  ప్రభుత్వ విప్ మురళీమోహన్ మీడియాకు తెలిపారు.  కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన 1.ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట), 2. గొల్ల బాబూరావు (పాయకరావుపేట), 3. పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రాపురం) 4. టి. బాలరాజు (పోలవరం) 5. ఎం.ప్రసాదరాజు (నర్సాపురం) 6. మేకతోటి సుచరిత (పత్తిపాడు) 7. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల) 8. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), 9. మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి) 10. గురునాథ్‌రెడ్డి (అనంతపురం) 11. కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) 12. చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు) 13. జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి) 14. శ్రీనివాసులు (కోడూరు) 15. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట) 16. కొండా సురేఖ (పరకాల). గతేడాది కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. వారికి అన్నివిధాలా నచ్చజెప్పి చూశామని, అయినా అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు. అందుకే వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరామన్నారు. రాబోయే ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. 

చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి...?

న్యూఢిల్లీ,డిసెంబర్ 13:  కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఊరిస్తూ వస్తున్న కేంద్ర మంత్రి పదవి ఈసారి విస్తరణలో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.  యూపీఏ కూటమిలో కొత్తగా చేరిన ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) అధినేత అజిత్‌సింగ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి వీలుగా  కేంద్ర కేబినెట్ విస్తరణకు  సన్నాహాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తమ నాయకుడికి కూడా ఈసారి తప్పకుండా పదవి దక్కుతుందని చిరంజీవి సహచరులు, అనుచరులు  ఆశ పడుతున్నారు.రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ మంగళవారం ఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత ఏ క్షణమైనా సరే కేబినెట్‌లోకి అజిత్‌సింగ్‌ను తీసుకోవచ్చని గట్టి సంకేతాలున్న తరుణంలో చిరంజీవికి పదవి అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు ఇప్పుడుకేంద్ర కేబినెట్‌ను విస్తరించాల్సి రావడానికి  పెద్ద కారణమే ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేసి అధికస్థానాలను సాధించాలన్న వ్యూహంతో కాంగ్రెస్ అధిష్టానం ఆర్‌ఎల్‌డీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అజిత్‌సింగ్ తన పార్టీని యూపీఏలో భాగస్వామిగా చేస్తూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాకు ఇప్పటికే లేఖ రాయడంతోపాటు స్వయంగా ఆమెని కలిశారు. యూపీఏలో ఆర్‌ఎల్‌డీ చేరికకు సోనియా వెంటనే గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చారు. అలాగే, అజిత్‌సింగ్ కోరినట్టుగా కేబినెట్‌లో కీలక శాఖను ఇవ్వడానికీ ఆమె సమ్మతించారు. ఆర్‌ఎల్‌డీతో కుదిరిన పొత్తు ఒడంబడికలో భాగంగా అజిత్‌సింగ్‌కు కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన పౌరవిమానయాన శాఖను ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం పౌర విమానయాన శాఖను సీనియర్ మంత్రి వయలార్ రవి చూస్తున్నారు. వాస్తవానికి ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఆయనకు గతంలో చేసిన మార్పుల సందర్భంగా పౌర విమానయాన శాఖను అదనంగా అప్పగించారు. వయలార్ రవితోపాటు కేబినెట్‌లోని మరో 9మంది మంత్రుల వద్ద రెండేసి శాఖలు ఉన్నాయి. శరద్ పవార్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, కపిల్‌సిబల్, ఆనంద్ శర్మ, సెల్జా, పవన్‌కుమార్ బన్సల్, సల్మాన్‌ఖుర్షీద్, జైరాం రమేశ్, కిశోర్‌చంద్రదేవ్‌లు ఒక్కొక్కరూ రెండు శాఖలను చూస్తున్నారు. వీరిందరి దగ్గరున్న శాఖలూ చాలా ముఖ్యమైనవే కావడంతో పౌర విమానయాన శాఖను ఇవ్వని పక్షంలో ఎవరో ఒకరి దగ్గరున్న అదనపు శాఖను అజిత్‌సింగ్‌కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఏడాది పాటు 'నీట్' వాయిదా

న్యూఢిల్లీ,డిసెంబర్ 13: ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను మరో ఏడాది వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత తలెత్తడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా దేశంలోని 60 శాతం ఎంబీబీఎస్ సీట్లు గల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, గోవా, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలు ‘నీట్’ను వ్యతిరేకిస్తున్నాయి. ‘నీట్’ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని, ‘నీట్’ సిలబస్‌ను అభ్యర్థులకు కనీసం రెండేళ్ల ముందే, అంటే ఇంటర్‌లో చేరినప్పుడే వారికి పరిచయం చేయాలని ఈ రాష్ట్రాలు కోరుతున్నాయి. నిజానికి ‘నీట్’ నిర్వహణపై సుప్రీంకోర్టు ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉండగా, పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిని మరో ఏడాది వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఫలితంగా సీబీఎస్‌ఈ 2012 సంవత్సరంలో ఆలిండియా ప్రీ మెడికల్/ప్రీ డెంటల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను (ఏఐపీఎంటీ) ఎప్పటి మాదిరిగానే నిర్వహించనుంది. 2012 ఏప్రిల్ 1న ఏఐపీఎంటీ ప్రిలిమినరీ, మే 13న ఫైనల్ పరీక్షలు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని 15 శాతం ఆలిండియా కోటా సీట్ల భర్తీ కోసం సీబీఎస్‌ఈ ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తోంది.

Sunday, December 11, 2011

జయప్రదం గా సీజన్ ముగించిన భారత్

ఆఖరివన్డేలో 34 పరుగులతో వెస్టిండీస్‌పై గెలుపు 
చెన్నై,డిసెంబర్ 11:  చిదంబరం స్టేడియంలో ఆదివారం నాడు ఆసక్తికరంగా సాగిన ఐదవ, ఆఖరి వన్డేలో భారత్ 34 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. మనోజ్ తివారీ (126 బంతుల్లో 104 రిటైర్డ్‌హర్ట్; 10 ఫోర్లు, 1 సిక్సర్) కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించగా... ఈ ఏడాది వన్డేల్లో టాప్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లి (85 బంతుల్లో 80; 5 ఫోర్లు) సమయోచితంగా రాణించాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తివారీ... గంభీర్ (41 బంతుల్లో 31; 2 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. కోహ్లితో కలిసి 117 పరుగులు జోడించాక... కండరాలు పట్టేయడంతో తివారీ రిటిర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో రోచ్, మార్టిన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. వెస్టిండీస్ జట్టు 44.1 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటయింది. 78 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా... పొలార్డ్ (110 బంతుల్లో 119; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) చివరి వరకూ పోరాడి కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. రస్సెల్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడి అర్ధసెంచరీ చేశాడు. టెయిలెండర్ల సహాయంతో పొలార్డ్ సాగించిన పోరాటం ఒక దశలో భారత శిబిరంలో ఆందోళన పెంచినా... ఈ కరీబియన్ స్టార్ 11వ సిక్సర్ కోసం ప్రయత్నించి అవుటవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. జడేజా మూడు వికెట్లు తీసుకోగా... పఠాన్, మిథున్ రెండేసి వికెట్లు సాధించారు. ఈ ఏడాది భారత జట్టు స్వదేశంలో ఒక్క టోర్నీలోనూ ఓడిపోకుండా సగర్వంగా సీజన్‌ను ముగించింది. ప్రపంచకప్, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ సత్తాచాటి హ్యాట్రిక్ ట్రోఫీలను సాధించింది. స్వదేశంలో ఆడిన 18 వన్డేల్లో కేవలం రెండు సార్లు మాత్రమే భారత్ ఓడిపోయింది.

మల్లెమాల వెళ్ళిపోయారు...

హైదరాబాద్, డిసెంబర్ 11:  సందేశాత్మక  కవితలతో...సినిమాలతో...  సహజకవి గా, నిర్మాతగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించిన ఎం.ఎస్.రెడ్డి (మల్లెమాల సుందరరామిరెడ్డి) ఆదివారం  హైదరాబాద్‌లో మరణించారు.   ఆయన వయసు 87ఏళ్లు.   నిర్మాతగా ఆయన తొలి సినిమా ‘భార్య’. ఇది తమిళ చిత్రం ‘భవాని’కి రీమేక్. కౌముది పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి కేఎస్‌ప్రకాశరావు దర్శకత్వంలో ఆయన ఆ సినిమాను నిర్మించారు.  ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణవిజయం’ ఆయన సంస్థకు గుర్తింపు తెచ్చిన సినిమా. అందులో ప్రఖ్యాత నటి హేమమాలిని చేత ఓ ప్రత్యేక పాటలో నర్తింపచేశారాయన. తర్వాత చలంతో  'ఊరికి ఉపకారి, , శోభన్‌బాబుతో కోడెనాగు, నాయుడుబావ, జీవితనౌక, రామబాణం, కృష్ణతో పల్నాటిసింహం, ఏకలవ్య, సుమన్‌తో ‘కళ్యాణవీణ’, నారాయణరావుతో ‘ముత్యాలపల్లకి’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘రామాయణం’ తదితర చిత్రాలను కౌముది, శబ్దాలయ, గహత్రి ఫిలింస్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ సంస్థలపై నిర్మించారు ఎమ్మెస్. జూనియర్ ఎన్టీఆర్‌ని ఆయన హీరోగా పరిచయంగా చేస్తూ... అందరూ బాలలతో గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన ‘రామాయణం’ విమర్శకుల ప్రశంసలందుకుంది. అలాగే భాగస్వామిగా దొరలు-దొంగలు, రామయతండ్రి, వంశోద్ధారకుడు, వెలుగునీడలు చిత్రాలను ఆయన నిర్మించారు. అలాగే శాంతి పిక్చర్స్ ద్వారా ‘శంకరాభరణం’ చిత్రాన్ని పంపిణీ చేసి డిస్ట్రిబ్యూటర్‌గా కూడా తనదైన ముద్ర వేశారు రెడ్డి. తుపాన్ బీభత్సంపై ఆయన నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం ‘కన్నీటి కెరటాలు’ విమర్శకుల ప్రశంసలందుకుంది. తన తనయుడు ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మాతగా మారాక.. ఆయన నిర్మించిన తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, అమ్మోరు, అరుంధతి లాంటి సంచలన హిట్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.  తన ఇంటిపేరునే కలం పేరుగా చేసుకొని ‘మల్లెమాల’ పేరిట ఎన్నో రచనలు చేశారు ఎమ్మెస్. ‘ముత్యాలపల్లకి’లో ‘‘సన్నాజాజికి గున్నమావికి పెళ్లి కుదిరింది’’, ‘‘తెల్లావారకముందే పల్లె లేచింది’’ పాటలు పెద్ద హిట్ సాంగ్స్‌గా నిలిచాయి. ‘తలంబ్రాలు’లో ‘‘బుల్లిపాప కోరేది తల్లిపాలు, కన్నెపిల్ల కోరేది తలంబ్రాలు’’ పాట కూడా పెద్ద హిట్. ఇంకా పల్నాటిసింహం, పచ్చని సంసారం, అంకుశం, అమ్మోరు చిత్రాలకు ఆయన పాటలు రాశారు. అలాగే ఆయన రాసిన ‘మల్లెమాల రామాయణం’ పుస్తకం పాఠకుల నుంచి విశేషఆదరణ పొందింది. ఇటీవల ఆయన రచించిన ‘ఇది నా ఆత్మ కథ’ పుస్తకం విడుదల కాకుండానే సంచలనం సృష్టించింది.
నిర్మాతగా ఎన్ని గొప్ప సినిమాలను నిర్మించినా... చాలామందికి ఎమ్మెస్‌రెడ్డి అనగానే గుర్తొచ్చేది ‘అంకుశం’లో ఆయన పోషించిన ముఖ్యమంత్రి పాత్ర. ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర నిలిచేవుంది. చలనచిత్ర వాణిజ్యమండలికి అధ్యక్షుడిగా వ్యవహరించడంతో పాటు, రెండు సార్లు చలనచిత్ర అభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఫిలింనగర్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కూడా అధ్యక్షుడుగా సేవలందించారు. అన్నామలై యూనివర్సిటీనీ నుంచి డాక్టరేట్, రాష్ట్ర ప్రభుత్వం అందించే రఘుపతి వెంకయ్య పురస్కారం, అలాగే ‘రామాయణం’ చిత్రానికి గాను నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతులమీదుగా స్వర్ణకమలం అందుకున్నారు. ఇంకా సహజకవి, అభినవ, వేమన, పద్యకవి సమ్రాట్, ఆంధ్రవాల్మీకి, కళారత్న ఆయన అందుకున్న బిరుదులు.

రాహుల్ గాంధీపై హజారే ధ్వజం

న్యూఢిల్లీ, డిసెంబర్ 11:  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై హజారే మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అయితే కేవలం ఒక్క రోజు పేదల గుడిసెల్లో ఉన్నంత మాత్రాన అవి నెరవేరవని చురకంటించారు. లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం బలహీన నివేదికను తెచ్చినందుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేసిన హజారే తమ ప్రసంగంలో ‘ రాహుల్ యువకుడు. ప్రధాని కావాలని ఆశపడుతున్నారు. పల్లెలకు వెళ్లినప్పుడల్లా.. ఒక రాత్రి పేదల గుడిసెల్లో బస చేస్తున్నారు. అయితే ప్రధాని కావాలంటే ఇది సరిపోదు. కొన్ని నెలలపాటు వారి గుడిసెల్లో ఉండాలి. ఇంకెంతో త్యాగం చేయాలి’ అని సూచించారు. ‘లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తెచ్చిన పేలవమైన నివేదిక వెనుక రాహుల్ గాంధీ హస్తమున్నట్లు భావిస్తున్నాం. ఇంతకీ స్థాయీ సంఘానికి సీనియర్ బాస్ ఎవరు? బిల్లులో మార్పులు చేసే ధైర్యం రాహుల్‌కు కాక ఇంకెవరికుంది?’ అని హజారే ప్రశ్నించారు.  మళ్ళీ ఇంతలోనే రాహుల్‌పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు.

కార్టూనిస్ట్ మారియో మిరాండా మృ తి

పనాజీ, డిసెంబర్ 11:  ప్రసిద్ధ కార్టూనిస్ట్ మారియో మిరాండా (85) గోవా రాజధాని పనాజీ చేరువలోని లొవుటోలిమ్ గ్రామంలో తన స్వగృహంలో ఆదివారం ఉదయం నిద్రలోనే కన్ను మూశారు.  గోవా ప్రజల జీవన శైలిని తన కార్టూన్లలో ప్రతిబింబించిన మిరాండా ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘ఎకనామిక్ టైమ్స్’, ‘ఫెమినా’ వంటి పత్రికల్లో ఆయన కార్టూన్లు పాఠకాదరణ పొందాయి.   

Friday, December 9, 2011

క్యాబినెట్ విస్తరణకు తెలంగాణాతో ముడి...!

న్యూఢిల్లీ,డిసెంబర్ 10: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు, తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు రాష్ట్ర  వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ముడి  పెట్టారు. తెలంగాణ సమస్యను పరిష్కరించిన తర్వాతనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం అంత సులభం కాదని, తెలంగాణ సమస్య సంక్లిష్టమైందని ఆయన అన్నారు. అయినా ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని, ఏకాభిప్రాయ సాధనకు కూడా ప్రయత్నిస్తున్నామని, పెద్ద యెత్తున కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

బాబు అక్రమాస్తుల కేసులో మరో మలుపు

హైదరాబాద్,డిసెంబర్ 10:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమాస్తుల కేసు శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ బాబు, ఆయన బినామీలు వేర్వేరుగా దాఖలు చేసుకున్న అనుబంధ పిటిషన్లను విచారించేందుకు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కూడా నిరాకరించింది. కేసును మరో ధర్మాసనానికి నివేదించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.లోకూర్‌కు విజ్ఞప్తి చేసింది. దాంతో న్యాయమూర్తులు జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనానికి ఈ కేసు విచారణ బాధ్యతలను సీజే అప్పగించారు. సోమవారం విచారణ జరగనుంది. బాబు కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన రిలయన్స్‌లో తనకు వాటాలున్నాయని సీజే పేర్కొనడం, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నుంచి వైదొలగడం, జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనానికి కేసును అప్పగించడం తెలిసిందే.

రాజ్యాంగబద్ధ సంస్థగా లోక్‌పాల్

న్యూఢిల్లీ,డిసెంబర్ 10:   లోక్‌పాల్ బిల్లును పరిశీలన చేస్తున్న పార్లమెంటు స్థాయీ సంఘం  తన నివేదికను శుక్రవారం పార్లమెంటుకు సమర్పించింది. సంఘం చైర్మన్ అభిషేక్ మను సింఘ్వి.. 286 పేజీల నివేదికను రాజ్యసభకు అందించగా, కమిటీ సభ్యుడు పినాకి మిశ్రా లోక్‌సభలో ఇచ్చారు. చర్చల సందర్భంగా తమకు అందిన ఆధారాలను కూడా రెండు సభలకు అందించారు. అనంతరం సింఘ్వి విలేకరులతో మాట్లాడుతూ.. లోక్‌పాల్‌ను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వల్ల.. మొత్తం ప్రక్రియే ఆలస్యమవుతుందన్న వాదనను తోసిపుచ్చారు. రాజ్యాంగ బద్ధతను ఒక్క రోజులో కల్పించవచ్చన్నారు. లోక్‌పాల్‌ను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హర్షం వ్యక్తంచేశారు. దీని ద్వారా ఆ అథారిటీకి సమగ్రత, ప్రత్యేక హక్కులు లభిస్తాయని అన్నారు. 

కోల్‌కతా కార్పొరేట్ ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం:90 మంది మృతి

కోల్‌కతా,డిసెంబర్ 10:  పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగన ఘోర అగ్ని ప్రమాదంలో  90 మంది మరణించారు.  వీరంతా మంటల బారిన పడకున్నా.. వాటివల్ల వెల్లువెత్తిన దట్టమైన పొగ, విషయవాయువు వల్ల ఊపిరాడక చనిపోయారు. మృతుల్లో అత్యధికులు వివిధ అనారోగ్యాలతో చికిత్స పొందుతూ.. కదలలేక మంచాల మీద ఉన్న రోగులే కావటం బాధాకరం.  దక్షిణ కోల్‌కతా లోని ధాకూరియా ప్రాంతంలో గల ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో ఈ దారుణం సంభవించింది. ఏడంతస్తుల  ఈ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఆస్పత్రి భవనంలో మొత్తం 190 పడకలు ఉన్నాయి. ఐసీయూ, ఐసీసీయూ, ఇంటెన్సివ్ థెరపీ యూనిట్, క్రిటికల్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్న రోగులు అత్యధికంగా ఈ ప్రమాదంలో మరణించారు. నిర్లక్ష్యపూరిత వైఖరితో 90 మంది మృతికి కారణమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఆస్పత్రి యాజమాన్యంపై బెయిల్‌కు అవకాశం లేని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఆస్పత్రి యాజమాన్య బోర్డులో సభ్యులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆర్.ఎస్.గోయెంకా, ఎస్.కె.టోడిలు సహా ఆరుగురిని అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం మీడియాకు తెలిపారు.

Thursday, December 8, 2011

మరో ధర్మాసనానికి బాబు అక్రమాస్తుల కేసు

హైదరాబాద్,డిసెంబర్ 9:  చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఊహించని మలుపు తిరిగింది. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడంలో తప్పేముందంటూ హైకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ఈ కేసును కీలక మలుపు తిప్పింది. చంద్రబాబు అక్రమాస్తులపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని, సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ చంద్రబాబు, రామోజీరావు, సీఎం రమేష్ తదితరులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను తాము విచారించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది.చంద్రబాబుకు మద్దతుగా రిలయన్స్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. రిలయన్స్‌లో తనకు వాటాలు ఉన్నందున ఈ కేసును తాను విచారించడం సబబుగా ఉండదని, అందువల్ల ఈ కేసు మొత్తాన్ని మరో ధర్మాసనానికి నివేదిస్తున్నానని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసును విచారించే బాధ్యతను న్యాయమూర్తులు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, జస్టిస్ కె.ఎస్.అప్పారావులతో కూడిన ధర్మాసనానికి అప్పగించారు.  చంద్రబాబు తదితరుల అనుబంధ పిటిషన్లను జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.

రెహమాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

దుబాయ్,డిసెంబర్ 9:  భారత్‌ సంగీత దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌ను 8వ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ చైర్మన్ శేఖ్ మజీద్ బిన్ మొహమ్మద్ బిన్ రశీద్ అల్ ముక్తౌమ్...45 ఏళ్ల రెహమాన్‌కు ఈ  అవార్డు అందజేశారు. తన సంగీతం ద్వారా భారతీయ , పాశ్చాత్య సంస్కృతులను మరింత వెలుగులోకి తెస్తున్నానని ఈ సందర్భంగా రెహమాన్‌ అన్నారు. గతంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, యాశ్ చోప్రా, సుభాష్ ఘాయ్, అమెరికన్ నటులు మోర్గాన్ ఫ్రీమాన్, సీన్ పెన్, దర్శకుడు ఆలివర్ స్టోన్ తదితరులు ఈ అవార్డును అందుకున్నారు

వీరేంద్రుని వీరంగం...!

ఇండోర్, డిసెంబర్ 9: నాలుగు దశాబ్దాల వన్డే చరిత్రలో అద్భుత  ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కాలం లో రెండే డబుల్ సెంచరీలు నమోదు కాగా... ఆ రెండింటినీ భారతీయులే సాధించడం  విశేషం. వెస్టిండీస్‌తో గురువారం ఇండోర్‌లో జరిగిన నాలుగో వన్డేలో సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు. 219 పరుగులతో  సచిన్ (200 నాటౌట్) రికార్డును అధిగమించాడు. సచిన్ (గ్వాలియర్), సెహ్వాగ్ (ఇండోర్) డబుల్ సెంచరీలు సాధించిన రెండు మైదానాలు మధ్యప్రదేశ్‌లోనివే. పరుగుల వరద పారించిన ఈ రెండు పిచ్‌లకు క్యూరేటర్ ఒక్కరే (సమందర్ సింగ్).
బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్ మన్‌గా సెహ్వాగ్ (142) రెండో స్థానంలో నిలిచాడు. వాట్సన్ (150) ముందు ఉన్నాడు.
ఇన్నింగ్స్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన సచిన్ (25) రికార్డును వీరూ (25) సమం చేశాడు.
సిరీస్ కైవసం
వీరూ ధాటికి భారత్ -వన్డేల్లో  అత్యధిక స్కోరు-418/5 ను నమోదు చేసింది.   టీమిండియా 153 పరుగుల భారీ తేడాతో నెగ్గి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 418 పరుగుల భారీ స్కోరు సాధించింది. సెహ్వాగ్ విజృంభణకు తోడు ఓపెనర్ గంభీర్ (67 బంతుల్లో 67; ఫోర్లు 11), రైనా (44 బంతుల్లో 55; ఫోర్లు 6) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం విండీస్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటయ్యింది. రామ్‌దిన్ (96 బంతుల్లో 96; ఫోర్లు 12) సెంచరీ చేజార్చుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సెహ్వాగ్‌ కు దక్కింది.

చిదంబరంపై ఫిర్యాదులో సాక్షిగా సుబ్రమణ్య స్వామి

న్యూఢిల్లీ,డిసెంబర్ 8:  2జి స్పెక్ట్రమ్  కేసులో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంపై చేసిన ఫిర్యాదుపై సాక్షిగా మారేందుకు ఢిల్లీ కోర్టు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామికి అనుమతి ఇచ్చింది. వాంగ్మూలం ఇవ్వడానికి ఈ నెల 17వ తేదీన విట్నెస్ బాక్స్ లో  హాజరు కావాలని స్వామిని కోర్టు ఆదేశించింది. ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్ర ఉందంటూ చేసిన ఫిర్యాదును పరిశీలిస్తుంది. కేసులో చిదంబరాన్ని కూడా భాగస్వామిని చేయాలని స్వామి కోర్టును కోరారు. తీహార్ జైలులో ఉన్న టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కలిసి చిదంబరం స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించారని స్వామి ఆరోపించారు. స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించడానికి రాజా, చిదంబరం మధ్య నాలుగు సమావేశాలు జరిగాయని ఆయన చెప్పారు. రాజాతో అప్పటి ఆర్థిక మంత్రి మాట్లాడారని ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను కూడా ఆయన ప్రస్తావించారు. స్పెక్ట్రమ్ ధరలపై రాజా, చిదంబరం కలిసే ఫార్ములాను రూపొందించారని ఆయన అన్నారు. విదేశీ కంపెనీలకు లైసెన్సుల విక్రయానికి అప్పటి ఆర్థిక మంత్రి అనుమతి ఇచ్చారని రాజా ఫైలులో, పత్రికా ప్రకటనలో నోట్ చేశారని ఆయన చెప్పారు.

Wednesday, December 7, 2011

జన్మదిన వేడుకలకు సోనియా దూరం

న్యూఢిల్లీ,డిసెంబర్ 7: జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు.    ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ పూజారి వెల్లడించారు. సోనియా జన్మదినం రోజున పార్టీ కార్యకర్తలు ఎవరూ దేశరాజధానికి రాకూడదని ఆయన  వెల్లడించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి ఎంతో దూరం నుంచి అభిమానులు, కార్యకర్తలు ఢిల్లీకి రావడం ఖర్చుతో కూడుకున్న పని కావడం వల్ల... సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సోనియాగాంధీ తన 66వ జన్మదినాన్ని డి సెంబర్ 9 తేదిన జరుపుకోవాల్సిఉంది.  

బాబు ఆస్తులపై సీబీఐ విచారణ ముమ్మరం

హైదరాబాద్,డిసెంబర్ 7: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన ఆస్తుల వివరాల్ని సీబీఐ సేకరిస్తోంది. విచారణలో భాగంగా రెవెన్యూ అధికారుల నుంచి రికార్డులను తెప్పించుకున్నట్టు తెలిసింది. చంద్రబాబు హయంలో కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల ను  సీబీఐ అధికారులు సచివాలయంలో తనిఖీ చేశారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...