Tuesday, November 30, 2010

39 మందితో కొత్త మంత్రివర్గం: ఆదిలాబాద్ కు దక్కని చోటు

హైదరాబాద్,డిసెంబర్ 1: రాష్ట్ర కొత్త మంత్రివర్గంలో మొత్తం 39 మందికి చోటు లభించింది. సీఎం కార్యదర్శి జవహర్ రెడ్డి స్వయంగా మంత్రివర్గ జాబితాను బుధవారం తెల్లవారు జామున గవర్నర్‌కు అందించారు. కిర ణ్ మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రులు జానారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డిలకు పదవులు దక్కాయి. అలాగే చాలావరకూ తాజామాజీ మంత్రులను కొనసాగించారు.


జిల్లాల వారీగా... కిరణ్ మంత్రివర్గంలో చోటు సంపాదించిన ఎమ్మెల్యేలు ...

హైదరాబాద్: దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, శంకర్‌రావు

రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి

మెదక్: గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సునీతా లక్ష్మారెడ్డి

నల్గొండ: జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కరీంనగర్: శ్రీధర్‌బాబు

వరంగల్: బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య

నిజామాబాద్: సుదర్శన్‌రెడ్డి

ఖమ్మం: రాంరెడ్డి వెంకటరెడ్డి

మహబూబ్‌నగర్: డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు

ఆదిలాబాద్: జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిథ్యం లభించలేదు.



గుంటూరు: మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి

పశ్చిమగోదావరి: పీతాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్

తూర్పు గోదావరి: విశ్వరూప్, తోట నర్సింహా

శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు

విజయనగరం: బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: బాలరాజు

కృష్ణా: పార్థసారథి

నెల్లూరు: ఆనం రామనారాయణరెడ్డి

పకాశం: మహిధర్‌రెడ్డి

అనంతపురం:  శైలజానాథ్, రఘువీరారెడ్డి

కర్నూలు: టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి

వైఎస్‌ఆర్ జిల్లా: వైఎస్ వివేకానందరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, అహ్మాదుల్లా

చిత్తూరు: గల్లా అరుణ

‘పరమవీరచక్ర’లో బాలయ్య ద్విపాత్రాభినయం

హైదరాబాద్: దర్శకరత్న డా.దాసరి నారాయణరావు అందిస్తున్న మరో ‘బొబ్బిలిపులి’ లాంటి సంచలన చిత్రం ‘పరమవీరచక్ర’ లో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్యున్నారు. ఒకరు మిలటరీ మేజర్ అయితే.... వేరొకరు సినీ సూపర్‌స్టార్. ఏ మాత్రం పొంతన లేని ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి ఈ రెండు పాత్రలను ‘పరమవీరచక్ర’ చిత్రంలో చేస్తున్నారు బాలకృష్ణ. అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత. తన 150వ చిత్రం ‘పరమవీరచక్ర’లో యాక్షన్‌తోపాటు కామెడీకి కూడా పెద్ద పీట వేస్తున్నారు దర్శకరత్న. అలీ, బ్రహ్మానందం, హేమలపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయంటున్నారు. ఇందులో అలీ రోబో గా కనిపిస్తారు.

ఎన్నారై వ్యాపారవేత్త అత్వాల్‌కు అవార్డు

లండన్,నవంబర్ 30: బ్రిటన్‌లో ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త జాన్ అత్వాల్ ఈ ఏడాది ఆసియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. వ్యాపార రంగంలో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. క్రిస్‌మస్ అలంకరణ వస్తువుల వ్యాపారంలో ఆయన అగ్రపథంలో ఉన్నారు. ఆయన స్థాపించిన ప్రీమియర్ డెకరేషన్స్ లిమిటెడ్ లక్షలాది ఫౌండ్ల టర్నోవర్‌తో వెలుగొందుతోంది. డచెస్టర్ హోటల్‌లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెరీ బ్లెయిర్ చేతులుగా మీదుగా జాన్ అత్వాల్ అవార్డు అందుకున్నారు. ఆసియన్ హూస్ హూ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్‌కు చెందిన అత్వాల్ తల్లిదండ్రులు 1961లో బ్రిటన్‌కు వలసవచ్చారు.

అమెరికా విద్యార్థి ఆగడం...

చికాగో,నవంబర్ 30: అమెరికాలో ఓ పాఠశాల విద్యార్థి(15) తుపాకీతో బెది రించి 23 మంది సహచరులతోపాటు ఓ టీచర్‌ను ఐదు గంటల పాటు నిర్బంధించటం తీవ్ర కలకలం సృష్టిం చింది. విస్కన్సిన్‌లోని మేరినెట్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం పాఠశాల విద్యార్థులు ఇంటికి వెళ్లేం దుకు సిద్ధమవుతుం డగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు ఐదు గంటలపాటు కొనసాగిన ఉత్కంఠకు రాత్రి 9 గంటల సమయంలో తెర పడింది.తలుపులు బద్దలు కొట్టి తరగతి గదిలోకి ప్రవేశించిన పోలీసులు బందీలను సురక్షితంగా విడిపించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు కారణం వెల్లడి కాలేదు. నిందితుడి నుంచి రెండు హ్యాండ్‌గన్లు, .22 క్యాలిబర్ సెమీ ఆటోమెటిక్ తుపాకీ, 9 ఎంఎం పిస్టల్, తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

2జీస్పెక్ట్రం సుడిగుండం లో పార్లమెంట్

న్యూఢిల్లీ,నవంబర్ 30: పార్లమెంటులో పదమూడు రోజులుగా జేపీసీపై కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చేసిన తాజా ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ప్రభుత్వం, విపక్షాలు తమ పట్టువీడకపోవడంతో స్పీకర్ మీరాకుమార్ మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష భేటీ విఫలమైంది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేయగా, దీనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేద ని ప్రభుత్వం తేల్చి  చెప్పింది. ఇలా ఇరుపక్షాలు తమ పట్టు వీడకపోవడంతో శీతాకాల సమావేశాలు సజావుగా నడిచే సూచనలు కనిపించడం లేదు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు జరిపిస్తామని ప్రభుత్వం చెప్పగా, జేపీసీతోనే విచారణ జరిపించాలని విపక్షాలు తేల్చిచెప్పాయి. దీంతో రెండున్నర గంటలపాటు జరిగిన అఖిలపక్ష భేటీ వృథాగా ముగిసింది. అయితే పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదాపడతాయనే వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఈ సమావేశాలు ఈనెల 13 వరకు జరగనున్నాయి. మరోవైపు, జేపీసీ డిమాండ్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ యేతర విపక్షాలు రాష్టప్రతిని కలిశాయి. సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్‌బ్లాక్, టీడీపీ, అన్నాడీఎంకే, జేడీఎస్, ఎండీఎంకే, బీజేడీ, ఆర్‌ఎల్డీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీలు పార్లమెంటు నుంచి రాష్టప్రతి భవన్ వరకు పాదయాత్ర నిర్వహించి, రాష్టప్రతికి వినతి పత్రం అందజేశారు. 2జీపై జేపీసీ విచారణకు ఆదేశించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు. 

పులివెందులలో బాబాయ్,అబ్బాయి పోటీ?

ఇడుపులపాయలో అభిమానులతో జగన్ 
హైదరాబాద్,నవంబర్ 30:  లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ తన తండ్రి వై.ఎస్.ఆర్. ప్రాతినిధ్యం వహించిన  పులివెందుల శానససభా స్థానం నుంచి  పోటీ చేయాలని భావిస్తున్నారా?  పులివెందుల నుంచి శానససభకు ఎన్నిక కావడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకునే రాజకీయాలను నడపాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వై.ఎస్.ఆర్. మరణానంతరం ఈ సీటుకు ఆయన సతీమణి విజయలక్ష్మి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె కూడా రాజీనామా చేయడం తో పులివెందుల శాసనసభా సీటుకు మళ్ళి ఉప ఎన్నిక అవసరమైంది.  దాంతో జగన్ రాజీనామా చేసిన కడప లోకసభ స్థానానికి, పులివెందుల అసెంబ్లీ సీటుకు ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగాల్సి వుంది. తాను శాసనసభకు పోటీ చేసి, బాబాయ్ వైయస్ వివేకానంద  చేత లోకసభకు పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచన కావచ్చునేమో కానీ, ఇప్పుడు  వివేకానంద  తాను కాంగ్రెస్ లోనే వుంటానని, అధిష్టానం కోరితే  పులివెందుల నుంచి   పోటీ చేస్తానని ప్రకటించడంతో బాబాయ్,అబ్బాయి ఇద్దరూ పులివెందులలో తలపడే అవకాశాలు లేకపోలెదు.  కాగా,కడపలో  వైయస్ జగన్, ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కేవలం రెండే నిమిషాలసేపు వారు మాటా మాటా అనుకొని దాదాపుగా తెగతెంపులు చెసుకున్నట్టు సమాచారం.  వైయస్ వివేకానంద రెడ్డి విసురుగా బయటకు వచ్చి మీడియా సమావేశం లోతాను  తాను కాంగ్రెసుతోనే ఉంటానని ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం వారి  సంభాషణ ఇలా జరిగిందిట.

వైయస్ జగన్ : ఇక్కడికి ఎందుకొచ్చావు
వైయస్ వివేకానంద రెడ్డి: జరిగిందేదో జరిగింది, ఇప్పుడు సర్దుకుపోదాం
వైయస్ జగన్: నాయన పేరు చెడగొట్టావ్
వైయస్ వివేకానంద రెడ్డి: నేనేం చేశాను
వైయస్ జగన్: చేసిందంతా చేసి.. ఏం చేశానంటావు 
వైయస్ వివేకానంద రెడ్డి: అలా అంటే ఎలా
వైయస్ జగన్: నీ దారి నీది, నా దారి నాది.
వైయస్ వివేకానంద రెడ్డి: నువ్వు చేసింది తప్పు.
వైయస్ జగన్: నేనేం చేశానో నాకు తెలుసు
వైయస్ వివేకానంద రెడ్డి: నేను పోతున్నాను
వైయస్ జగన్: నిన్ను ఎవడు రమ్మన్నాడు
వైయస్ వివేకానంద రెడ్డి: పులివెందుల నుంచి పోటీ చేస్తానని అంటున్నావట కదా
వైయస్ జగన్: నీకెందుకు
వైయస్ వివేకానంద రెడ్డి: అయితే అక్కడే తేల్చుకుందాం.
                  ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మహరాస్ట్ర లోని కరద్ లో స్కూల్ విధ్యార్ధుల ప్రదర్శన  

నో రాజీనామా..కొండా సురేఖ

హైదరాబాద్,నవంబర్ 30 : దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన టిక్కెట్టుతోనే తను 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాననీ, అది వైఎస్ భిక్ష తప్ప మరెవరి భిక్ష కాదనీ, కనుక తను రాజీనామా చేయనవసరం లేదని మాజీమంత్రి కొండా సురేఖ అన్నారు. రాజకీయాలనైనా వదులుకుంటాం కానీ మంత్రిపదవులకోసం కొంతమంది ఢిల్లీ చుట్టూ తిరిగినట్లు తాము తిరగబోమని వైఎస్ వివేకానంద రెడ్డిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. వచ్చే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందనీ, పార్టీకి కనీసం 26 స్థానాలు కూడా రావని ఆమె జోస్యం చెప్పారు. 

సి.ఎం.ఒ. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జె.సత్యనారాయణ

హైదరాబాద్,నవంబర్ 30 : ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన కార్యాలయంలోని అధికారులను మార్చివేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జె.సత్యనారాయణ, కార్యదర్శులుగా రావత్, శ్రీధర్ లను నియమించారు. ప్రస్తుతం సిఎం కార్యాలయంలో ఉన్న జవహర్ రెడ్డి కొనసాగుతారు.పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామ్ బాబుని, ట్రాన్సపోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దినేష్ కుమార్ , వ్యవసాయ శాఖ ఉత్పత్తుల కమిషనర్ గా సివిఎస్ కె శర్మ లను నియమించారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

హైదరాబాద్,నవంబర్ 30 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో 10,500 మంది అభ్యర్థులు మెయిన్స్ కు  అర్హత సాధించారు. ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల వివరాలు అందుబాటులో వుంచారు.   మెయిన్స్ పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. 210 పోస్టులకు మెయిన్స్ లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగింది.

కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా: వైఎస్ వివేకానందరెడ్డి

కడప,నవంబర్ 30: తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నడిచిన బాటలో కాంగ్రెస్ పార్టీలోనే  కొనసాగుతానని వైఎస్ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. అదే విషయాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పినట్లు ఆయన చెప్పారు.  వివేకానందరెడ్డి మంగళవారం కడప ‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన అంతట తానే ఢిల్లీ వెళ్లానని, తనకు మంత్రి పదవిని అధిష్టానం ఆశ చూపిందనటంలో వాస్తవం లేదని అన్నారు. మంత్రి పదవి ఆశించటమే తప్పయితే క్షమించాలన్నారు. తన కుటుంబంలో చీలిక తీసుకు రావాలనే ఆలోచన పార్టీకి, అధిష్టానానికి లేదని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

Monday, November 29, 2010

జగన్ రాజినామా తో మంత్రుల జాబితా కుదింపు?

హైదరాబాద్,నవంబర్ 29: రాష్ట్రం లో నూతన మంత్రివర్గం బుధవారం నాడు ప్రమా ణ స్వీకారం చేస్తుంది. ముందు సుమారు 30 మంది మంత్రులు  ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వెలువడినప్పటికీ, జగన్ రాజినామ  నేపథ్యంలో  18 మందిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించినట్లు ఢిల్లీ పార్టీ వర్గాల సమాచారం. ఈ సంఖ్య 12 మందికే పరిమితం చేసినా ఆశ్చర్యం లేదంటున్నాయి మరి కొన్ని వర్గాలు. పీఆర్పీని ఈసారికి చేర్చుకోకపోయినా, ఆ పార్టీ నిర్ణయం మేరకు ఒక్క చిరంజీవికే ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, దామోదర రాజనర్శింహ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా పార్టీలో ఉంటూ వేచిచూసే వైఖరి అవలంబిం చడం వ్యూహాత్మకమేనని నాయకత్వం భావిస్తోంది.  జగన్‌ పార్టీ పెట్టేవరకూ వారంతా పార్టీలోనే కొనసాగుతారని, ఆలోగా మంత్రిమండలిలో చోటు దొర కని వారు  జగన్  శిబిరంలోకి వెళ్లేందుకే వారంతా ఒక పథకం ప్రకారం వ్యవహరి స్తున్నారని అంచనా వేస్తోంది. ఈ నేప థ్యంలో ఒక్కసారి 30 మందిని మంత్రి వర్గంలోకి తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని, అందుచేత ముందు జాగ్రత్తతో ఆ సంఖ్యను 18కే కుదించినట్లు పార్టీ వర్గాల సమాచారం. జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత పరిస్థితి బట్టి మలి విడత విస్తరణ  చేపట్టే వీలుంది. తొలివిడత ప్రమాణం చేసే వారిలో... ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం),బొత్స సత్యనారాయణ(విజయనగరం), బాలరాజు (విశాఖ),అహ్మదుల్లా (కడప),గల్లా అరుణ( చిత్తూరు)
టిజి వెంకటేష్‌ (కర్నూలు),జేసీ దివాకర్‌రెడ్డి ( అనంతపురం),కన్నా లక్ష్మీనారాయణ (గుంటూరు),మహీధర్‌రెడ్డి (ప్రకాశం)ఆనం రామనారాయణరెడ్డి (నెల్లూరు),పేర్ని నాని ( కృష్ణా),జానారెడ్డి (నల్లగొండ),భట్టి విక్రమార్క (ఖమ్మం),శ్రీధర్‌బాబు (కరీంనగర్‌)దానంనాగేందర్‌ (హైదరాబాద్‌),సారయ్య ( వరంగల్‌),తోట నర్శింహం (తూర్పు),పితాని (పశ్చిమ) ...పేర్లు వినవస్తున్నాయి.

జగన్ కు రాజకీయ పరిణతి లేదు: సి.ఎం.

హైదరాబాద్,,నవంబర్ 29: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డికి రాజకీయ పరిణితి లేదని నూతన  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం తొందరపాటు చర్య అని, దురదృష్టకరమని ఆయన అన్నారు. రాజకీయంలో 30 ఏళ్ల అనుభవం ఉండి శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెసు కార్యకర్తగా ఉన్న వైయస్ వివేకానందకు మంత్రి పదవి ఇస్తే తప్పేమిటని, ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కు ముఖ్యమంత్రి ఇవ్వడం తప్పు కాదా అని ఆయన  ప్రశ్నించారు. సోనియాను లక్ష్యంగా చేసుకొని జగన్ వర్గం మాటలు జారడం సరికాదని, రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు సోనియాగాంధీకి ఎప్పుడూ అవమానం జరగలేదని చెప్పారు. సాక్షి పత్రికలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ లేక్ వ్యూ అతిధి గృహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో సీఎం తీర్మానం చేశారు. సోనియా ఆశయ సాధనకు పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

నా కుటుంబ మీద ఎందుకు ఇలా కత్తి కట్టారు?సోనియాకు జగన్ లేఖ పూర్తిపాఠం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి.,

 తీవ్రమైన ఆవేదనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. గడచిన 14 నెలలుగా అనేక అవమానాలను దిగమింగుకుంటున్నాను. నా మీద, నా కుటుంబం మీద చివరకు జనహృదయ నేత దివంగతుడైన నా తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా నీచమైన స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఓపిగ్గా సహిస్తూ వస్తున్నాను. చివరకు కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టే కుటిల నీతిని చూసి అవాక్కయ్యాను. మా చిన్నాన్న వైఎస్.వివేకానంద రెడ్డికి ఆశలు చూపి పథకం ప్రకారం ఢిల్లీకి రప్పించుకుని మా కుటుంబాన్ని చీల్చే నీచ రాజకీయం చేస్తారా? గులాం నబీ ఆజాద్ సూచనలతోనే ఢిల్లీకి వెళ్లాడని, జగన్‌కు కుటుంబంతోనే పగ్గాలు వేయాలని ప్రయత్నిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తీవ్రమైన వ్యధకు గురయ్యాను. జరుగుతున్న పరిణామాలన్నీ నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికీ, రాజశేఖర్ రెడ్డి కీర్తి ప్రతిష్టలను తుడిచి వేయడానికి జరుగుతున్నవేనని నాకు అర్థమవుతూనే ఉంది. అసలెందుకు ఇలా జరుగుతోంది.

నేను చేసిన నేరమేమిటి? నా మీద, నా కుటుంబ మీద ఎందుకు ఇలా కత్తి కట్టారు? నా తండ్రి కీర్తి ప్రతిష్టల మీద ఎందుకు పరదాలు కప్పుతున్నారు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏమిటది? నా తండ్రి చనిపోయిన రోజున 150 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పదవికి నా పేరును ప్రతిపాదించి సంతకాలు చేస్తే మీ అభీష్టం మేరకు నేను దూరంగానే ఉన్నానే.. అది తప్పా? మీ ఆదేశాన్ని శిరసా వహించి రోశయ్య పేరును ముఖ్యమంత్రి పదవికి నేనే ప్రతిపాదించాను. కదా.. అది తప్పా? మొన్నటికి మొన్న మీరు ముఖ్యమంత్రిని మార్చి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టాలనుకున్నపుడు సీఎల్పీ సమావేశం సజావుగా సాగేలా సంపూర్ణంగా సహకరించాను కదా.. అది కూడా తప్పేనా?

ఇక నేను చేసిన తప్పేమిటి.. ఓదార్పు యాత్రేనా? అది నా వ్యక్తిగతమని నేను ఆచరించి తీరాల్సిన పుత్రధర్మమనీ ఇప్పటికి అనేకసార్లు చెప్పాను. నా తండ్రి గారు జనహృదయాలను చూరగొన్న మహానేత కావడం వల్ల ఆయన హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు అనాధలయ్యాయి. ఈ నేపథ్యంలో మా నాన్న చనిపోయిన 20 రోజులకే, దుర్ఘటన జరిగిన పావురాల గుట్ట సాక్షిగా అక్కడ సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆ బాధిత కుటుంబాలను వారింటికే వెళ్లి పలుకరిస్తానని మాటిచ్చాను. దివంగతులైన నా తండ్రి ఆత్మశాంతి కోసం నేను ఆనాడు మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కనుకనే ఇది ఆచరించి తీరాల్సిన సాంప్రదాయం కనుకనే, యాత్రకు మీ అనుమతి కోరాను. గత నవంబరులోనే ప్రారంభం కావాల్సిన యాత్రను మీ సూచన మేరకు మీమీద గౌరవంతో వాయిదా వేసుకున్నాను.

అనంతరం ఓదార్పు యాత్రను ప్రారంభించిన నాటి నుంచి మా మీద దాడి మొదలైంది. కారణం ఆ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడమే. జనం గుండెల్లో రాజశేఖర రెడ్డి సజీవంగా ఉన్నాడని, సజీవంగా ఉంటాడని తేటతెల్లం కావడం కొందరు కాంగ్రెస్ పెద్దలకు మింగుడుపడ లేదు. ఓదార్పు యాత్రపై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. పార్టీని రెండుసార్లు ఒంటి చేత్తో విజయపథానికి నడిపించిన జననేత విగ్రహాలు ఊరూరా పెడితే పార్టీకి ఏ విధంగా నష్టమో చెప్పగలరా? లేని ఉద్దేశాలను నాకు ఆపాదించారు. మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నతిని ఓర్వలేని కొందరు నేతలు చేస్తున్న కార్యక్రమంగా దీనిని నేను సరిపెట్టుకున్నాను. కానీ, క్రమంగా జరుగుతున్న పరిణామాలతో నాకో విషయం అర్థం కావడం మొదలైంది. జనం గుండెల్లో నుంచి వైఎస్సార్ ప్రతిబింబాన్ని తుడిచి వేయాలని, ఆయన జ్ఞాపకాలను సైతం ధ్వంసం చేయాలని ఢిల్లీ స్థాయిలోనే ఒక పకడ్బందీ వ్యూహం తయారైనట్టు నాకు అర్థమైంది.

దురదృష్టవశాత్తు ఈ వ్యూహకర్తలకు సాక్షాత్తు అధిష్టానం ఆశీస్సులు ఉన్నట్టు తేటతెల్లమైంది. మిమ్మల్ని కలవాలని ఓదార్పు యాత్ర ఉద్దేశాలను వివరించాలని దివంగత నేత సతీమణి, నా తల్లి విజయలక్ష్మి గారు మీ అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశారు. నెల రోజులకు గానీ మాకు మీ సందర్శన కోసం అనుమతి లభించలేదు. మీకు అవసరం ఉంటే మా చిన్నాన్నకు అయినా.. చిరంజీవికి అయినా ఒక్క రోజులో అపాయింట్‌మెంట్ దొరుకుతుంది లేదంటే దివంగత నేత వైఎస్ సతీమణి తన భర్తను కోల్పోయిన కొద్ది నెలలకే మీ అపాయింట్‌మెంట్ అడిగితే నెల రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా మేమేమీ బాధ పడలేదు. ఆ భేటీలో మీకు అన్ని విషయాలు వివరించాం. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనకూడదని కట్టడి చేశారు. ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్లు చేశారు. ముఖ్యమంత్రి మంత్రులకు ఫోన్లు చేశారు. ఆ యాత్రకు ఎవ్వరూ సహరించకుండా ప్రయత్నాలు చేశారు.

అయినా వైఎస్‌ను అభిమానించే జనసామాన్యం, కిందిస్థాయి కార్యకర్తల అండదండలతో యాత్ర విజయవంతంగా సాగింది. యాత్రలో పాల్గొన్న వారిమీద, నాకు సహకరించిన వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. మద్దతుగా నిలిచిన వారిపై వేటు వేశారు. ఓదార్పు యాత్రను భగ్నం చేయడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే నా మీద, నా కుటుంబం మీద విష ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌కు ఆగర్భ శత్రువులమని స్వయంగా ప్రకటించుకున్న మీడియాతో స్నేహం చేసి తప్పుడు ఆరోపణాస్త్రాలను మా మీద సంధించారు. దివంగత నేత మీద కూడా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు.

ఆయన లేరని తెలిసి, ఆరోపణలకు బదులు ఇచ్చుకోలేరని తెలిసి కొందరు పార్టీ నేతలో ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. సాక్షాత్తు మిమ్మల్నే కలిసి వచ్చిన కొందరు నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం గానీ, రాష్ట్ర మంత్రివర్గం గానీ కనీసం ఖండించనైనా లేదు. నిన్నటిదాకా ఉన్న మంత్రివర్గమంతా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మంత్రివర్గమే. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ వీరు భాగస్వాములే. అయినా సరే ఆ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నమే వారు చేయలేదు. ఇంకో పక్క వైఎస్సార్ జ్ఞాపకాలు తుడిచి వేసే ప్రయత్నం కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సభల్లోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన ఫోటో లేకపోవడం ప్రతిసారి వివాదాస్పదమవుతోంది. ఆయన ఫోటో లేనందుకు జనం నిలదీస్తున్నారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రాలేదు.

అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం వైఎస్సార్ మరణంపై జరిగిన కంటి తుడుపు దర్యాప్తు. నాతో సహా ప్రజల్లో ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను సీబీఐ, నిపుణులు నివేదికలు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేక పోయాయి. జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కనీసం ఏ ఒక్కరినైనా ఈ దర్యాప్తు వేలెత్తి చూపలేక పోయింది. ఎవరిపైనా చర్యలు తీసుకోలేక పోయారు. దాని గురించి మాట్లాడటమే మహా పాపమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

నన్ను పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించడానికి ప్రతి చిన్న సంఘటనను అవకాశంగా మల్చుకుంటున్నారు. సాక్షి ఛానల్‌లో వచ్చిన ఒక రాజకీయ విశ్లేషణ కథనాన్ని భూతద్దంలో చూపి సాక్షి కార్యాలయాలపై కొందరు నేతలు దాడులు చేయించారు. పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నేనే కుట్ర చేసినట్టు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా సాక్షి ఛానల్ ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలతో పాటు కొన్ని సానుకూల, ప్రతికూలాంశాలను చర్చించింది. ఇలాంటి కథనాలే ఇతర జాతీయ పత్రికల్లో, మేగజైన్లలో వచ్చాయి.

అలాగే, బీహార్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో రాహుల్ గాంధీ ప్రస్తావన అన్ని జాతీయ, ప్రాంతీయ ఛానళ్ళతో పాటు సాక్షిలో కూడా వచ్చింది. దీనినీ తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. సాక్షి పత్రిక గానీ, సాక్షి ఛానల్ గానీ కాంగ్రెస్ పార్టీకి చెందినవి కావని, అవి స్వతంత్ర మీడియా సంస్థలుగా నిష్పక్షిపాతంగా పని చేస్తాయని, వాటిని ప్రారంభించిన రెండు సందర్భాల్లోనూ సభాముఖంగానే నేను ప్రకటించాను. ఆ సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు రాష్ట్ర గవర్నర్, వీరప్ప మొయిలీ, ఆనందశర్మ వంటి కాంగ్రెస్ పెద్దలు పీసీసీ అధ్యక్షుడు సహా అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు, రాష్ట్ర మంత్రులూ ఉన్నారు.

అప్పుడూ ఏ ఒక్కరూ నా మాటలకు అభ్యంతరం చెప్పలేదు. అలాంటిది ఇపుడు కాంగ్రెస్ ఛానల్‌లో కాంగ్రెస్ వ్యతిరేక వార్త వచ్చిందనే అసత్య ప్రచారంతో పథకం ప్రకారం సాక్షిపై దాడులకు ఉసిగొల్పారు. ఢిల్లీ నుంచి అందిన ఆదేశాలతో యువజన కాంగ్రెస్ నేతలు కొందరు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ ఆందోళన ద్వారా జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకి అన్న ముద్ర వేయడం వారి లక్ష్యం. నన్ను పార్టీ నుంచి గెంటివేసే కుట్ర జరుగుతుందనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? చివరకు మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే నీచమైన ఎత్తుగడలకు దిగజారారంటే ఏమనుకోవాలి? ఇంకెంత కాలం సహనంతో ఉండాలి?

వీటికి తోడు ప్రతి రోజు నా పైన గాలి వార్తల ప్రచారం. నా మీద వేటుకు రంగం సిద్ధమైందంటూ మీడియాకు కథనాలు అందిస్తున్నారు. వేటా? లేటా? అని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే రోడ్డు మీద వెళ్లే ఏ చిన్న పిల్లాడిని అడిగినా 'నేడో రేపో జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తారు" అని ఠకీమని సమాధానం చెపుతారు. అదును కోసం చూస్తున్నారని, జగన్‌పై ఇక వేటు వేస్తారని సామాన్య జనం కూడా అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని విష ప్రచారాల నడుమ, ఇన్ని కుట్రలు, కుహకాల మధ్య మహానేత ప్రతిష్టకు మసిపూసే కుయుక్తులను సహిస్తూ ఇంకా ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని భావిస్తున్నా.. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది జనానికి అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది. ఏ పార్టీ కోసమైతే నా తండ్రి తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఆయన కుటుంబానికి కల్పించడం, అందుకు అధిష్టానం ఆశీస్సులు ఉండటం అత్యంత శోచనీయం. నాకు మరో మార్గం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేనూ, నా తల్లి విజయలక్ష్మి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వానికి నా తల్లి గారు, పార్లమెంట్ సభ్యత్వానికి నేనూ రాజీనామా చేస్తున్నాం.

ఈ సందర్భంగా మీకో విషయాన్ని స్పష్టం చేయదలిచాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రచారాలు చేయించారు. అటువంటి నీచమైన వ్యక్తిత్వం కాదు నాది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఒక మాట ఇస్తే దానికి ఎప్పటికీ కట్టుబడి ఉండాలని మా నాన్న నాకు నేర్పించారు. అలాగే రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా విశ్వసనీయత పెంపొందించుకోవాలని, ఉన్నత విలువలు పాటించాలని ఆయన నాకు నేర్పారు. ఈ విలువలు దిగజార్చేలా నేనెప్పుడూ వ్యవహరించలేదు. ఇక ముందూ వ్యవహరించబోను.

నేను గతంలో లాగే ఇక ముందు కూడా విలువలను పాటిస్తాను... గౌరవిస్తాను. నేను ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొడతానని మీరు భయపడుతున్న నేపథ్యంలో ఆ విలువల స్ఫూర్తితోనే మీకు హామీ ఇస్తున్నాను... నా తండ్రిని గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్న పార్టీ శాసనసభ్యులందరికీ ఇప్పుడే ఈ సందర్భంలోనే విజ్ఞప్తి చేస్తున్నా.. మీరెవ్వరూ నా కోసం రాజీనామాలు చేయవద్దని.. మీరెక్కడ ఉన్నా మీ ప్రేమాభిమానాలు నాపై ఉంటే చాలని..

ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నదే ముఖ్యమని నా తండ్రి తరచూ చెబుతుండేవారు. ఆయన నాకు నేర్పిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలు నాకు మార్గదర్శకాలు, అవే నన్ను నడిపిస్తాయి.

ఇక సెలవు.
మీ...
వై.యస్.జగన్.  

సంగక్కర ముందుకు...సచిన్ వెనక్కు...

ముంబై,నవంబర్ 29:ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ‌లో సచిన్ టెండూల్కర్‌ను వెనక్కు నెట్టి శ్రీలంక కెప్టెన్ సంగక్కర నెంబర్‌వన్ అయ్యా డు. బౌలింగ్ లో భారత బౌలర్ జహీర్‌ఖాన్ కెరీర్‌లో అత్యుత్తమంగా మూడో ర్యాంక్ సాధించాడు.

‘ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్...

హైదరాబాద్,నవంబర్ 29: గత టీటీడీ పాలకమండలి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆనంద నిలయం-హైదరాబాద్,నవంబర్ 29: గత టీటీడీ పాలకమండలి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును నిలిపివేయాలని  హైకోర్టు ఆదేశింసింది.  ఈ ప్రాజెక్టు ఆగమ శాస్ర్తాలకు విరుద్ధమని, దీన్ని చేపట్టే పరిధి టీటీడీ పాలకమండలికి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రాకార వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాలకమండలికి లేదని పేర్కొంది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టు విషయంలో టీటీడీ చపలమైన ధోరణితో వ్యవహరించిందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. టీటీడీ చర్య ఏ మాత్రం లౌకిక కార్యకలాపం కాదని విస్పష్టం చేసింది. ఈ నిర్ణయుం వల్ల, పురాతన కాలం నాటి శాసనాలు దెబ్బ తిని, లిపి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల స్వర్ణమయం కార్యక్రమాన్ని నిలిపివేయాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ప్రకాశరావు, న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. టీటీడీ తలపెట్టిన ‘అనంత స్వర్ణమయుం’ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ దేవాలయూల పరిరక్షణ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈయనతో పాటు మరికొందరు కూడా స్వర్ణమయ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారు.ఇదే సమయంలో స్వర్ణమయాన్ని సమర్థిస్తూ మరికొందరు కూడా అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లన్నింటిపై వాదనలను విన్న ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్ 8న తీర్పును వాయిదా వేసింది. సోమవారం ఎట్టకేలకు తీర్పు వెలువరిస్తూ.. స్వర్ణమయ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలను అనుమతిం చింది. ఆదికేశవులు నాయుడు చైర్మన్‌గా ఉన్న సమయంలో అప్పటి పాలక మండలి అనంత స్వర్ణమయానికి సంబంధించి తీసుకున్న పలు నిర్ణయాలను ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. స్వర్ణమయ కార్యక్రమాన్ని ఓ విధానం అంటూ లేకుండా చేపట్టిన ప్రాజెక్టుగా అభివర్ణించింది.
                               రాజినామా చేసిన జగన్ కు మద్దతు గా ఖమ్మం లో అభిమానుల ప్రదర్శన

పార్టీకి నష్టం లేదు: కాంగ్రెస్

న్యూఢిల్లీ,నవంబర్ 29: జగన్ రాజీనామా దురద్రుష్టకరమని కేంద్ర మంత్రి,  రాష్ట్ర కాంగ్రెస్ వ్యహారాల ఇంచార్జి  వీరప్ప మొయిలీ అన్నారు. ఇంతకుమించి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.  ఐతే పార్టీపై ఆయన రాజినామా ప్రభావం ఎంతమాత్రం వుండదని సీనియర్ నేత ,ఎం.పి. వి. హనుమంతరావు అన్నారు. జగన్ తెగేదాకా తాడు లాగాడని ఆయన వ్యాఖ్యానించారు.

త్వరలో జగన్ కొత్త పార్టీ

హైదరాబాద్,నవంబర్ 28: కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ వారం,పది రోజులలో  కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, లోకసభ స్పీకర్ మీరా కుమార్ కు పంపిన జగన్ సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది. గురువారంనాడు ఇడుపులపాయకు రావాల్సిందిగా ఆయన తన అభిమానులకు సూచిస్తున్నారు. దాన్ని బట్టి గురువారంనాడు కొత్త పార్టీ గురించి ప్రకటిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, త్వరలోనే వైయస్ జగన్ పార్టీ పెడతారని వైయస్ జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా ఈ విషయం చెప్పారు. కొండా సురేఖ వంటివారు మాత్రం పార్టీ గురించి వైయస్ జగన్ తమతో మాట్లాడలేదని అన్నారు.   కాగా, జగన్ చేసిన రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. 

ప్రస్తుతానికి క్యాబినెట్ లో చేరకూడదని పి.ఆర్.పి.నిర్ణయం

హైదరాబాద్,నవంబర్ 29: మంత్రి వర్గంలో చేరకూడదని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. సోమవారం సాయంత్రం పొద్దు పోయేవరకు  జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించారు. వేచి చూసే ధోరణి అవలంభించాలని తీర్మానించారు.  తమ వల్లే వైఎస్ జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడారన్న అపవాదు తమపై పడకూడదన్న అభిప్రాయం  సమావేశంలో వ్యక్తమైంది. అయితే ప్రజలపై అనవసర ఎన్నికల భారం మాత్రం పడనీయకూడదని సమావేశం నిర్ణయించింది. భవిష్యత్'లో అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోర్ కమిటీలో నిర్ణయించారు.

వైదొలగిన జగన్...తల్లితో పాటు కాంగ్రెస్ కు గుడ్ బై

హైదరాబాద్,నవంబర్ 29 : కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా జగన్, విజయలక్ష్మి రాజీనామా చేశారు. వైఎస్ మరణానంతరం 14 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెంది ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన అయిదు పేజీల బహిరంగ లేఖ లో పేర్కొన్నారు.  జగన్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.


పార్టీ వ్యతిరేకిగా చిత్రించారు

తాను ఒంటరిగానే పార్టీ నుంచి బయటకు వెళుతున్నానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించి తనను ఒంటరిగానే బయటకు పంపాలనుకున్నారని సోనియాగాంధీకి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. తనను బయటకు పంపించేందుకు ‘సాక్షి’ కథనాన్ని భూతద్దంలో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రపూరిత కథనాలు ప్రచారం చేయించారని ఆయన తన లేఖలో ప్రస్తావించారు.పదవులు ఆశచూపి తమ కుటుంబంలో చిచ్చు రేపుతారా అని జగన్ ప్రశ్నించారు. తాను చేసిన నేరమేంటని, ఎందుకు తనపై కక్ష సాధిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఓదార్పుయాత్ర చేయటమే తన తప్పా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీ సభలు, సమావేశాల్లోనూ వైఎస్‌ఆర్ ఫోటోలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారన్నారు.ఆయన మృతిపై కంటితుడుపుగానే దర్యాప్తు చేసిందన్నారు. చిరంజీవికి ఒక్కరోజులోనే అధిష్టానం అపాయింట్‌మెంట్ ఇచ్చిందని, అదే విషయంలో తన తల్లి నెలరోజులు ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు.

రాజీనామాల పరంపర

వైఎస్ జగన్మోహన రెడ్డికి మద్దతుగా రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. జగన్ రాజీనామాతో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. జగన్'కు మద్దతుగా అన్ని జిల్లాలలో ప్రదర్శనలు నిర్వహించారు. కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడలలో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. పిసిసిలో కొందరు, రాష్ట్రంలోని పలు డిసిసిల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా నేతలు రాజీనామాలు చేశారు. యువజన కాంగ్రెస్ నేతలు కూడా పలువురు రాజీనామా చేశారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు కూడా అనేకమంది రాజీనామాలు చేశారు. వీరే కాకుండా పలువురు ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్'లు రాజీనామాలు చేశారు.




Sunday, November 28, 2010

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ యత్నాలు ముమ్మరం

న్యూఢిల్లీ,నవంబర్ 27: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలపడం.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మరింత ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్, జపాన్, రష్యా, జర్మనీ వంటి అనేక దేశాలతో భారత్‌ చర్చలను ముమ్మరం చేసింది. భారతదేశం ఆయా దేశాలతో జరిపే చర్చల్లో భద్రతా మండలితోసహా ఐక్యరాజ్యసమితిని సంపూర్ణంగా సంస్కరించడంపై.. దృష్టి పెట్టింది. భారత్‌కు వచ్చే జనవరి నుంచి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం లభించనున్న విషయం తెలిసిందే. రెండేళ్లపాటు ఈ హోదాలో భారత్ కొనసాగుతుంది. భారత్‌తోపాటు జి-4 దేశాల గ్రూప్‌లోని బ్రెజిల్, జర్మనీలు సైతం వచ్చే జనవరి నుంచి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాల హోదాలో కలిసి పనిచేయనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా మండలిని విస్తరించి.. కొత్తగా ఆరుదేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని జి-4 దేశాలు (భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్) కోరుతున్నాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాల నుంచి రెండేసి, యూరప్, లాటిన్ అమెరికాలకు ఒక్కొక్కటి చొప్పున చోటు కల్పించాలని అవి సూచిస్తున్నాయి. భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను 15 నుంచి 25కు పెంచాలని కూడా అవి కోరుతున్నాయి.

మంత్రివర్గంలో చిరు చేరిక ఖాయం?

న్యూఢిల్లీ,నవంబర్ 27: ఢిల్లీ పర్యటనలో వున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ఫోన్ చేశారు. మంత్రివర్గంలో ప్రజారాజ్యం చేరే విషయంపై వీరివురూ చర్చించినట్టు తెలిసింది. సీఎంతో సంభాషణ అనంతరం అందుబాటులో వున్న సహచరులతో చిరంజీవి సమాలోచనలు ప్రారంభించారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత చిరంజీవితో సీఎం భేటి కానున్నారు.మంత్రివర్గం తొలి జాబితాలో 30 నుంచి 35 మంది వరకు చోటు కల్పించేఅవకాశాలున్నట్లు  తెలుస్తోంది. ఇందులో పూర్తిగా కాంగ్రెస్‌ వారే ఉన్నారు. తరువాత  జగన్‌ వ్యహారం ఎలా ఉంటుందో చూసి పిఆర్పీ మద్దతు అవసరమైన పక్షంలో వారితో మంత్రి వర్గాన్ని విస్తరించాలని పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండవ జాబితాలో పిఆర్పీతో పాటు మరి కొందరు కాంగ్రెస్‌ వారిని కలుపుకుని మొత్తం 10 మందికి అవకాశం కల్పి స్తారని సమాచారం.

కె.వి.పి. తో సహా పలువురు సలహాదారుల రాజీనామా

హైదరాబాద్,నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు రాజీనామా చేశారు. ప్రభుత్వ పరిశ్ర మల శాఖ సలహాదారు పీటర్ హాసన్ కూడా రాజీనామా చేశారు. మరో ప్రభుత్వ సలహాదారు సీసీ రెడ్డి కూడా తన పదవీకి రాజీనామా చేశారు. రాజీనామాలు సమర్పించాలని ప్రభుత్వ సలహాదారులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రభుత్వ సలహాదారులు రాజీనామాలు చేశారు.
                                       ఢిల్లీ లోని ఎ.పి. భవన్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్ది ని
                                                    కలసిన పార్లమెంట్ సభ్యుడు అజారుద్దీన్

రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన కేంద్ర మంత్రి జటువా

కోల్కత,నవంబర్ 27: కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి సి.ఎం. జటువా కోల్కతా సమీపంలోని అంటాలా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ను వెనక నుంచి మరో ఆహనం ఢీ కొనడం తో జరిగిన ప్రమాదంలో ఆయన తలకు, కాలికి గాయాలయ్యాయి. ప్రధమ చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. 

తొలి వన్ డే లో భారత్ గెలుపు

గువాహతి,నవంబర్ 28: న్యూజిలాండ్‌తో ఆదివారమిక్కడ జరిగిన తొలి వన్డేలో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను 236 పరుగులకే కట్టడి చేసి భారత్ విజయాన్ని అందుకుంది. కివీస్ 45.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటయింది. హౌ 9, గుప్తిల్ 30, విలియమ్‌సన్ 25, స్టైరిస్ 10, ఇలియట్ 5, టఫీ 4, టేలర్ 66, హాప్కిన్స్ 16, మెక్‌కల్లమ్ 35, మిల్స్ 32 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో యువరాజ్, శ్రీశాంత్, అశ్విన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. నెహ్రాకు ఒక వికెట్ దక్కింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటయింది. విరాట్ కొహ్లి (105) సెంచరీతో రాణించాడు. యువరాజ్ సింగ్42, గంభీర్ 38 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మెక్‌కే 4, మిల్స్ 3, టఫీ 2 వికెట్లు పడగొట్టారు.
                    ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ ను కలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణకే ఉప ముఖ్యమంత్రి పదవి: సి.ఎం.

న్యూఢిల్లీ,నవంబర్ 27: ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణవారికే ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టంచేశారు. కొత్త మంత్రివర్గం కూర్పు ఆదివారం నాటికి పూర్తయ్యే అవకాశముందని ఆయన తెలి పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన కిరణ్‌కుమార్ శనివారం రోజంతా బిజీబిజీగా గడిపారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను, రాజ్యసభ చైర్మన్, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీని కలిశారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను, ఎ.కె.ఆంటోనీ, చిదంబరం, గులాంనబీ ఆజాద్, జైపాల్‌రెడ్డి తదితర కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగేందుకు సహకారం ఇవ్వాలని కోరా రు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తనకు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదని తెలంగాణ జేఏసీ పేర్కొందని విలేకరులు ప్రస్తావించగా.. కేబినెట్‌లో ఎవరు ఉండాలనే విషయాన్ని తెలంగాణ జేఏసీ నిర్ణయించదని, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన బదులిచ్చారు.

విజయవంతంగా ‘హైలాస్’ ప్రయోగం

న్యూఢిల్లీ,నవంబర్ 27: ఫ్రాన్స్ సంస్థ ఏడ్స్-ఆస్ట్రియమ్‌తో కలిసి రూపొందించిన అధునాతన పూర్తి స్థాయి కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘హైలాస్’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. వాణిజ్యపరమైన అవసరాల కోసం అభివృద్ధిపర్చిన హైలాస్(హైలీ అడాప్టబుల్ శాటిలైట్) కౌరోలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.09 (భారత కాలమానం ప్రకారం) గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశించిన మధ్యంతర భూస్థిర కక్ష్య(జియో సింక్రోనస్ ఆర్బిట్)లోకి 35 నిమిషాల తర్వాత చేరిన హైలాస్ తన వాహక నౌక అరైన్-5 వీ198 నుంచి సుర క్షితంగా విడిపోయిందని ఇస్రో ప్రకటించింది. అతి శక్తివంతమైన 10 ట్రాన్స్‌ఫాండర్స్ తో కూడిన 2,541 కిలోల బరువు గల హైలాస్‌ను బ్రిటన్‌కు చెందిన అవంతి కమ్యూనికేషన్స్ సంస్థ కోసం రూపొందించారు. ఇస్రో నిర్మించిన ఉపగ్రహాల్లో అధిక బరువైనదైన హైలాస్ 15 ఏళ్లపాటు తన సేవలను అందించనుంది. హైలాస్ ప్రాజెక్టును చేజిక్కించుకునేందుకు 2006లో అమెరికా, ఐరోపాలోని ప్రముఖ సంస్థలు పోటీ పడినప్పటికీ ఇస్రో, ఆస్ట్రియమ్‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును దక్కించుకున్నాయి.

కైగా అణు విద్యుత్కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం

న్యూఢిల్లీ,నవంబర్ 27: 220 మెగావాట్ల సామర్థ్యంతో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన భారత 20వ అణు విద్యుత్ ప్లాంటు ... కర్ణాటకలోని కైగా అణు విద్యుత్కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించింది. ఫలితంగా 20, అంతకు మించి అణు విద్యుత్ ప్లాంట్లున్న ఆరో దేశంగా భారత్ అవతరించింది. దీంతో దేశ అణు విద్యుత్ సామర్థ్యం 4,780 మెగావాట్లకు చేరింది. ప్లాంటు క్రిటికాలిటీని సంతరించుకుందని  ఆటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ ప్రకటించారు. ప్లాంటును వీలైనంత త్వరగా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్లాంటును ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ పలు దశల్లో తనిఖీలు చేసిన అనంతరం వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తిని మొదలు పెడుతుంది. క్రిటికాలిటీ నుంచి వాణిజ్య ఉత్పత్తి స్థాయికి చేరేందుకు సుమారు రెండు నెలలు పడుతుంది.

ఆస్ట్రేలియా చదువులు మాకొద్దు...

న్యూఢిల్లీ,నవంబర్ 27:  ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న జాతివివక్ష దాడుల కారణంగా గత ఏడాది వ్యవధిలో 30 వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరుగుముఖం పట్టారని అక్కడి భారత విద్యార్థుల సమాఖ్య(ఫిసా) తెలిపింది. దాడులకుతోడు వీసా నిబంధనల కఠినతరం, శాశ్వత నివాసానికి ప్రభుత్వ అనుమతి నిరాకరణ కూడా ఇందుకు కారణమని మెల్‌బోర్న్ నుంచి వెలువడే ‘ఇండియన్ స్టూడెంట్’ మ్యాగజైన్ కథనాన్ని ఉటంకిస్తూ  ఫిసా  తెలిపింది.

Friday, November 26, 2010

మృత్యువుతో పోరాడి ఓడిన తపస్వి

హైదరాబాద్,నవంబర్ 26: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇంటర్ విద్యార్థిని తపస్వి(17) శుక్రవారం తుది శ్వాస విడిచింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయంది. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడింది. తపస్వి చిత్తూరు లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఆ కళాశాలకు తపస్వి ప్రతిరోజు ప్రశాంతినగర్‌కు చెందిన మణికంఠ అనే ఆటో డ్రైవర్ ఆటోలో వెళ్లి వ స్తుండేది. ఈ క్రమంలో త నను ప్రేమించాలంటూ మణికంఠ ఆమెను వేధించసాగాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో తపస్వి కుటుంబ సభ్యులు మణికంఠను వారించారు. దీనితో తపస్విపై మణికంఠ పగ పెంచుకున్నాడు.అక్టోబర్ 26న కాలకృత్యాలకు వెళ్లిన తపస్విపై మణికంఠతో పాటు మరో ఇద్దరు యువకులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తపస్వి శరీరం 70 శాతం వరకు కాలిపోయింది. దీంతో ఆమెను చికిత్స కోసం తిరుపతి రుయా బర్న్స్ వార్డుకు తరలించారు.

నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం

పాట్నా,నవంబర్ 26:,: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ దేవానంద్ ప్రమాణం చేయించారు. బీహార్ 34వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ మోడీ(బిజెపి) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 35 మంది సభ్యులున్న మంత్రివర్గంలో 15 మంది జనతాదళ్ -యునైటెడ్( జెడి-యు) అభ్యర్థులు, పది మంది బిజెపి అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేశారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ

న్యూఢిల్లీ,నవంబర్ 26: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర హొం మంత్రి చిదంబరం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఒక్కో జిల్లాకు ఈ ఏడాది 25 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వచ్చే ఏడాది ఒక్కో జిల్లాకు 30 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 60 జిల్లాలలో ఈ ప్రత్యేక ప్యాకేజీ పథకం అమలు చేస్తారు. ఈ పథకం అమలయ్యే జిల్లాలలో రహదారులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు.

పతకాల పట్టికలో భారత దేశానికి ఆరవ స్థానం

గ్వాంగ్‌జౌ,నవంబర్ 26 : ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత దేశానికి ఆరవ స్థానం లభించింది. భారత్ కు 14 బంగారు పతకాలు లభించాయి. బాక్సింగ్ 75కిలోల విభాగంలో భారత  క్రీడాకారుడు విజేంద్ర సింగ్ బంగారు పతకం గెలుచుకున్నాడు.

Thursday, November 25, 2010

విదేశీ పౌరసత్వం లేని ఎన్నారైలకు ఓటు

న్యూఢిల్లీ,నవంబర్ 25: ఉద్యోగం, చదువు, తదితర కారణాల రీత్యా వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కూడా త్వరలో ఓటు హక్కు లభించనుంది. ఈ మేరకు కేంద్రం ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించేందుకుగాను గత వర్షాకాల సమావేశాల్లో ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం, సవరణ బిల్లు, 2010’ని పార్లమెంటు ఆమోదించింది. దీనికి సంబంధించి కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసినట్లు ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి లోక్‌సభలో చెప్పారు. విదేశాల్లో ఉంటూ అక్కడి పౌరసత్వం పొందనివారు మాత్రమే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని మంత్రి తెలిపారు. అయితే ఓటుహక్కు పొందిన వారు ఎన్నికల్లో ఓటు వేయాలంటే సొంత నియోజకవర్గానికి రావలసి ఉంటుందన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ త్వరలోనే ప్రకటిస్తుందని అన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో దాదాపు 1.10 కోట్ల మంది ప్రవాస భారతీయులున్నారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లి ఆరునెలల్లోలోగా తిరిగిరాని వారి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించేవారు. వచ్చే 2014 లోక్‌సభ ఎన్నికలలోగా ప్రవాస భారతీయులు ఓటుహక్కును కల్పించనున్నట్లు ‘ప్రవాస భారతీయ దివస్’ సందర్భంగా ఈ ఏడాది మొదట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.

: శాంతి భద్రతలపై రాజీ పడం: సి.ఎం.

హైదరాబాద్,నవంబర్ 25: శాంతి భద్రతల విషయంలో కఠినంగా, కచ్చితంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ కమిటీ హాల్‌లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. ‘‘నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు, ప్రధాని మన్మోహన్‌లకు కృతజ్ఞతలు. మీడియా సహకారం నాకు కావాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అన్నింటిని అమలు చేసేందుకు పూర్తిగా ప్రయత్నిస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరిచి ఎక్కువ మంది లబ్ది పొందేలా చూస్తాం. జలయజ్ఞం, పారిశ్రామీకరణను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తాం. సంక్షేమ పథకాల అమలుపై ప్రతి మూడు మాసాలకొకసారి సమీక్ష జరుపుతాం. హైదరాబాద్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూలమయిన నగరంగా చేసేందుకు ప్రయత్నిస్తాం. ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం, స్థానిక నాయకుల సహకారంతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేస్తాం. రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకునిపోతా. ప్రతిపక్షాలు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. ప్రజలకు మేలు జరుగుతుంది. 41 ఎంపీ సీట్లు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న వైఎస్సార్ రాజకీయ చివరి కోరికను నెవేర్చేందుకు కలిసికట్టుగా కృషి చేస్తాం. ఆరోగ్యం, విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. దీనికనుగుణంగానే సీఎం పదవి చేపట్టిన వెంటనే నిమ్స్ ఆస్పత్రిని సందర్శించాను. మంత్రివర్గ ఏర్పాటుపై అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాను. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తా. నేను ఏం చేయాలనుకుంటున్నానో నా పనితీరే చెబుతుంది’’ అని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతల స్వీకారం

హైదరాబాద్,నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 16వ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయనకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.,ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, కేవీపీ, కేశవరావు, సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కిరణ్‌కుమార్‌రెడ్డి తల్లి సరోజనమ్మ, సతీమణి, బంధువులు, కాంగ్రెస్ నేతలు హాజరు అయ్యారు.

Wednesday, November 24, 2010

మేము పట్టించుకోం: కె.సి.ఆర్.

హైదరాబాద్,నవంబర్ 24:   ముఖ్యమంత్రి కె.రోశయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రోశయ్య చెప్పినట్లు వయోభారంతోనే రాజీనామా చేసి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. రోశయ్య రాజీనామా, తదనంతర పరిణామాలను తాము పట్టించుకోబోమన్నారు. ఏ ప్రాంతానికి చెందినవారికి సీఎం పదవి కట్టబెట్టినా... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ శక్తి తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేదన్నారు. డిసెంబర్ 9న వరంగల్‌లో మహాగర్జనను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని  ఆయన  తెలిపారు.

ఇదేగా కాంగ్రెస్ సంస్కృతి ...చంద్రబాబు

హైదరాబాద్,నవంబర్ 24:  ముఖ్యమంత్రులను తరచూ మార్చే సంస్కృతి కాంగ్రెస్‌దేనని.. అవినీతి, అక్రమాలలో  ఆ పార్టీకి సాటి  ఏదీ లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు.  సీఎంలను మార్చినంత మాత్రాన కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల నింద తొలగిపోదన్న విషయం ప్రజలు గమనిస్తున్నారని ఆయన కర్నూలు జిల్లా పర్యటనలో అన్నారు.  రాహుల్ గాంధీ అడుగు పెట్టిన ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ భూస్థాపితమవుతోందని, బీహార్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు.  రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలని , సోనియాగాంధీ ఎదుట తోకాడించడం మినహా రాష్ట్ర సమస్యల సాధనకు ఏమీ చేయడం లేదన్నారు.

యడ్యూరప్ప సేఫ్..

బెంగళూరు,నవంబర్ 24:   కర్ణాటక నాయకత్వంపై వారం రోజుల పాటు సాగిన దాగుడు మూతల అనంతరం ముఖ్యమంత్రిగా యడ్యూరప్పే కొనసాగుతారని బీజేపీ అధిష్టానం  విస్పష్టంగా ప్రకటించింది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ప్రకటనను పార్టీ అధికార ప్రతినిధి జవదేకర్ విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. ‘వచ్చే నెలలో తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నందున పదవిలో కొనసాగేందుకు యడ్యూరప్పను అధిష్టానం అనుమతించింది’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో గడ్కారీ నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప సీఎంపై వచ్చిన భూ అక్రమాల ఆరోపణలను తోసిపుచ్చారు.

కొత్త స్పీకర్ పై ఉత్కంఠ

హైదరాబాద్,నవంబర్ 24:   శాసనసభ స్పీకర్ పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.  డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి  లలో ఒకరిని స్పీకర్‌గా ఎంపిక చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. వీరిలో అసెంబ్లీ నియమ నిబంధనలు క్షుణ్నంగా తెలియడంతోపాటు రాజకీయాల్లో అపార అనుభవమున్న గాదె వెంకటరెడ్డి వైపే హైకమాండ్ మొగ్గుచూపుతున్నా,  గాదె వెంకటరెడ్డి మాత్రం స్పీకర్ పదవిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు.దీనితో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను  స్పీకర్ పదవి వరించే అవకాశాలున్నాయి.కాగా, జాతీయ విపత్తుల నివారణ కమిటీ సభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజిమంత్రి జె.గీతారెడ్డిల పేర్లు కూడా  స్పీకర్ పదవికి వినవస్తున్నాయి.  ఐతే సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపికైనందున అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వకూడదంటే మర్రి శశిధర్‌రెడ్డికి ఆ అవకాశం వుండక పోవచ్చు.  గీతారెడ్డిఉప ముఖ్యమంత్రి పదవి వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్ పేరునెవ్ హైకమాండ్ ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.  

వైఎస్ పథకాలకే తొలి ప్రాధాన్యత: కిరణ్‌కుమార్‌రెడ్డి

 హైదరాబాద్,నవంబర్ 24:  వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ ను అమలు పరచడమే తొలి ప్రాధాన్యత అని నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన  కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పతి పనిలోను కష్టం ఉంటుందని, దానిని అధిగమించేందుకే ప్రయత్నిస్తానన్నారు. సమస్యలున్నప్పడే కష్టించి పనిచేయడానికి అవకాశముంటుందన్నారు. రాయలసీమలోని ఓ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించినప్పటికి, తాను అసలు సిసలైన హైదరాబాదీనని కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రైవేట్ టెలివిజన్ చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో  చెప్పారు.  తాను జన్మించింది, విద్యాభ్యాసం, తన బాల్యం, జీవితం అంతా హైదరాబాద్‌తోనే ముడిపడివుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో హైకమాండ్ స్టాండే తన స్టాండ్ అని ఆయన వెల్లడించారు. ఇలవుండగా, ముఖ్యమంత్రిగా ఎంపికైన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని పలువురు మంత్రులు, ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు గల్లా అరుణకుమారి, బలరాజు, సునీతా లక్ష్మారెడ్డి వున్నారు. ముఖ్యమంత్రిగా కిరణకుమార్ రెడ్డి ఎంపికను తెలంగాణా వాదులు స్వాగతించారు. కిరణ కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో నగిరిపల్లిలో జన్మించినప్పటికీ.. అతని విద్యాభ్యాసం ఎక్కువగా తెలంగాణా ప్రాంతంలోనే సాగింది. మంచి వక్తగా, వివాద రహితుడిగా పేరు ఉన్న వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడంతో తెలంగాణా శ్రేణుల్లో కూడా ఆనందం  వ్యక్తమవుతోంది.

తెలంగాణకు డిప్యూటీ సీఎం పదవి

హైదరాబాద్,నవంబర్ 24: : నూతనంగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి వుంటుందని రాష్టవ్య్రవహారాల ఇంఛార్జి వీరప్ప మొయిలీ  వెల్లడించారు. డిప్యూటి సీఎం పదవిని తెలంగాణ ప్రాంతం వారికి దక్కే అవకాశాలున్నాయి.  డిప్యూటి సీఎం పదవికి   గీతారెడ్డి, జానారెడ్డి, మర్రిశశిధర్‌రెడ్డి  పోటీలో వున్నారు.  కాగా, డిప్యూటి సీఎం  పేరున్ కూడా అధిష్టానమే ప్రకటించే అవకాశం వుంది.  

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్,నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎల్పీ భేటిలో ఏకవాక్య తీర్మానాన్ని సోనియాగాంధికి నివేదించిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును సోనియా ఖరారు చేశారు. సోనియా నిర్ణయాన్ని ప్రణబ్ అధికారికంగా ప్రకటించారు. 1986-2004 వరకు వాయల్పాడు నియోజకవర్గం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసారు. ఆతర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో పీలేరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చాక స్పీకర్ పదవిని చేపట్టారు.

ఆర్ధిక గణాంకాలలో ఘనాపాటి...

హైదరాబాద్,నవంబర్ 24:  వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య 14 నెలల 22 రోజుల పాటు రాష్ట్రాన్ని పాలించారు.  రాజకీయాల్లో అపార అనుభమున్న రోశయ్య రాష్ట్రంలో వివిధ పదవులను నిర్వహించారు. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి హోదాలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కింది. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు.  గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు.  ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ , గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య , విద్యుత్ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య , విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004 మరియు 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్ధిక మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను  15 సార్లు ఆంద్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.  2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనా,, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. సి.ఎం. గా పనిచేసిన కాలమంతా అనేక ఒతిళ్ళను, సమస్యలను ఎదుర్కొని చివరకు హుందాగా పదవినుంచి వైదొలగారు.  

బీహార్ లో జె.డి.(యు)-బి.జె.పి. కూటమి కే మళ్ళీ పట్టం

పాట్నా,నవంబర్ 24: బీహార్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో నితిష్ కుమార్ నాయకత్వంలోని జె.డి.(యు)-బి.జె.పి. కూటమి నాలుగింట మూడొంతుల మెజారిటీ సాధించింది.   మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరుగగా జేడీయూ, బీజేపీ కూటమి 206 సీట్లను గెలుచుకుంది. 2005 ఎన్నికలలో ఈ కూటమికి 143 సీట్లు వచ్చాయి. లాలూ ప్రసాద్ -రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని ఆర్.జె.డి.-ఎల్.జె.పి. కూటమి కి  25 సీట్లు మాత్రమే వచ్చాయి. ఐతే వీరిద్దరూ ఎన్నికలలో పోటీ చేయలేదు. వీరికి గత ఎన్నికలలో 64 సీట్లు వచ్చాయి. గత అసెంబ్లీలో 5 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జరిగిన ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైంది.ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి  తాము పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.
ఫలితాలు
జేడీయూ+బీజేపీ =206
ఆర్జేడీ+ ఎల్జేపీ =  25
కాంగ్రెస్        =   4
లెఫ్ట్ + ఇతరులు=  8

ముఖ్యమంత్రి పదవికి రోశయ్య గుడ్ బై...సోనియా కు కొత్త సి.ఎం.ఎంపిక బాధ్యత

హైదరాబాద్,నవంబర్ 24: రాష్ర్ట రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటు చెసుకున్నాయి. మంగళవారం వరసగా జరిగిన పరిణామాలలో ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామ చేయడం, సాయంత్రం జరిగి సి.ఎల్.పి. సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక భాధ్యతను సోనియా కు అప్పగిస్తూ తీర్మానం చెయడం జరిగింది. రోశయ్య బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి తన మంత్రిమండలి  రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకు పదవిలో కొనసాగాలని ఆయనకు గవర్నర్ సూచించారు. అంతకుముందు, విలెకరుల సమవేశంలో రోశయ్య తన రాజినామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేల బలం ఉండి తాను ముఖ్యమంత్రిని కాలేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో ఈ పదవి తనకు లభించిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానని చెప్పారు. ఇప్పటి వరకు తనకు సహకరించినవారికి ఆయన కృతజ్జతలు తెలిపారు. వయోభారం, పనివత్తిడితోనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ను ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని చెప్పారు.

గవర్నర్ నరసిం హన్ కు రాజీనామా సమర్పిస్తున్న రోశయ్య


తనకు ఇంతటి స్థానం కల్పించిన పార్టీని తాను వదలనని, ఓపిక ఉన్నంతవరకు పార్టీకి సేవ చేస్తానని ఆయన చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని ఆయన తెలిపారు. మంగళవారం సోనియాను కలిసిన రోశయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు చెప్పారని, అధినేత ఆమోదంతో నే తన పదవికి రాజీనామా చేశారని మొయిలీ తెలిపారు.

సోనియాకే బాధ్యత:

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఇస్తూ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశం తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని రోశయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపారు. అధిష్టానం ప్రతినిధులుగా ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్, ఆంటోనీ, అహ్మద్ పటేల్ ఈ సమావెశానికి ఆజరయ్యారు. సీఎల్పీ అత్యవసర సమావేశానికి 148 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 8 మంది ఎమ్మెల్యేలు, 12 ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, పులివెందుల ఎమ్మెల్యే విజయలక్ష్మి సమావేశానికి హాజరుకపోవడం గమనార్హం. సమావేశం  అనంతరం ప్రణబ్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ..సీఎల్పీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను  పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నివేదిస్తామనితెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను సోనియాకు అప్పగిస్తూ ఒక తీర్మానం, ముఖ్యమంత్రిగా రోశయ్య సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలిపారు.  ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తగిన సమయంలో సోనియా నిర్ణయం తీసుకుంటారని ప్రణబ్ చెప్పారు.

Tuesday, November 23, 2010

స్వీడన్‌లో విశాఖ విద్యార్ధి థీసిస్ కు బహుమతి

హైదరాబాద్,నవంబర్ 23: విశాఖపట్టణానికి చెందిన వి. సాయికృష్ణ దినేష్  స్వీడన్‌లోని కారల్స్‌క్రోనాలో ఉన్న బ్లికింజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బీటీహెచ్)లో చదువుతున్నాడు. అతడు సమర్పించిన సిద్ధాంత ప్రతిపాదన బెస్ట్ థిసీస్‌గా ఎంపికయింది. దీంతో అతడికి 50 వేల స్వీడిష్ క్రోనార్ల నగదు బహుమతిగా లభించింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు బీటీహెచ్‌తో అనుసంధానమయేందుకు వీలుగా టెలీమేనిపులేటర్ హార్డ్‌వేర్ ప్రతిపాదన చేసినందుకు అతడికీ ఈ గౌరవం దక్కింది. దినేష్ తండ్రి డాక్టర్ వీ. నరసింహమూర్తి పాలకొండ డిగ్రీ కాలేజీలో చరిత్ర అధ్యాపకులుగా, ఆంధ్రా యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రోగ్రామింగ్ అధికారిగా సేవలందిస్తున్నారు.

దంతెవాడలో కాల్పులు: 20 మంది నక్సల్స్ మృతి

రాయపూర్,నవంబర్ 23:   ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా లో మంగళవారం పోలీసులకు, నక్సల్స్ కు   నడుమ జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఇరవై మంది నక్సల్స్ మరణించారు.   అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్, సీఏఎఫ్, డీఎఫ్ దళాలకు చెందిన 101 మంది పోలీసులు ఏరియా డామినేషన్ కోసం వెళ్లారు. జేగురుకొండకు ఆరు కిలోమీటర్ల దూరంలోని కుందేడు, ఆశ్రమపడా గ్రామాల మధ్యనున్న అటవీ ప్రాంతంలో ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపు రెండువందల మంది నక్సల్స్ పోలీసులపై కాల్పులు ప్రారంభించగా, పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. కొద్దిసేపు హోరాహోరీ కాల్పుల తర్వాత నక్సల్స్ పారిపోయారు. సంఘటనా స్థలంలో తొమ్మిది మంది మృతదేహాలు మాత్రమే లభించాయని, కనీసం ఇరవై మంది మరణించి ఉంటారని సీఆర్పీఎఫ్ ఐజీ పంకజ్‌కుమార్ సిన్హ్ చెప్పారు. సంఘటనా స్థలంలోని నెత్తుటి మరకల ఆధారంగా, కొన్ని మృతదేహాలను నక్సల్స్ తరలించుకుపోయి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంఘటనా స్థలం నుంచి తొమ్మిది తుపాకులు, కొన్ని గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2 నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు, దండకారణ్యంలో భారీ దాడులకు పాల్పడే ఉద్దేశంతోనే ఇక్కడ సమావేశమై ఉంటారని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా, బీజాపూర్ జిల్లాలోని ముర్తండా గ్రామం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్‌కు చెందిన మైన్‌ప్రూఫ్ వాహనం ధ్వంసమైంది. వాహనంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ ఓంకార్ సిన్హా, డ్రైవర్ రామారావు అక్కడికక్కడే మరణించారు.

ఉద్యోగుల సమ్మెతో రేడియో, టీ.వీ.ప్రసారాలు బంద్

 హైదరాబాద్,నవంబర్ 23 :ఆకాశవాణి, దూరదర్శన్   ఉద్యోగుల రెండు రోజుల సమ్మెతో దేశవ్యాప్తంగా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలు తొలిసారిగా నిలిచిపోయాయి.  ప్రసార భారతి ని రద్దు చేసి తమను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి తీసుకోవాలంటూ వీరు ఆందోళనబాట పట్టారు. 

29 నుంచి శీతాకాల అసెంబ్లీ

హైదరాబాద్,నవంబర్ 23:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి  ప్రారంభం కానున్నాయి. అదేరోజున రాష్ట్ర శాసనమండలి సమావేశం కూడా ప్రారంభం అవుతుంది. ఆరు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. మైక్రో ఫైనాన్స్, వర్షాలు, సహాయక చర్యలు తదితర అంశాలపై  ఈ  సమావేశాల్లో వేడిగా చర్చ జరిగే  అవకాశం ఉంది.

సింగిల్స్ లోనూ సోమ్ దేవ్ కు స్వర్ణం

 గ్వాంగ్‌జౌ,నవంబర్ 23:  ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. టెన్నిస్ క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ అసాధారణ ప్రతిభతో రెండో పసిడి పతకాన్ని సాధించాడు. సింగిల్స్  ఫైనల్లో సోమ్ దేవ్ ఉజ్బెకిస్తాన్ కు చెందిన డెనిస్ ఇస్తోమిన్ ను 6-1, 6-2 స్కోరుతో ఓడించి స్వర్ణ పతకం సాధించాడు. డబుల్స్ ఈవెంట్  లో సోమ్ దేవ్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. భారత్ ఇప్పటి వరకు టెన్నిస్ లో మూడు కాంస్య పతకాలు సాధించింది. ఇక హకీ సెమీఫైనల్స్ లో భారత్ ఓడిపోయింది. 4-3 తేడాతో భారత్ పై మలేషియా విజయం సాధించింది. కాంస్య పతకం కోసం భారత  జట్టు దక్షిణకొరియా జట్టుతో తలపడనుంది.

నాగపూర్ టెస్ట్ లో భారత్ ఘన విజయం

నాగపూర్,నవంబర్ 23:   నాగపూర్ టెస్ట్ లో  భారత్ ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్ల ధాటికి కివీస్ 175 పరుగులకే చేతులెత్తేసింది. దాంతో న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో మూడు టెస్ట్ ల  సిరీస్‌ను 1-0  తో టీమిండియా కైవసం చేసుకుంది. ఇషాంత్ శర్మ, హర్బజన్ చెరో మూడు వికెట్లు, ఓజా, రైనా చెరో రెండు వికెట్లు తీశారు.     మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రాహుల్ ద్రావిడ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ గా హర్భజన్‌సింగ్ ఎంపిక  అయ్యారు.

Monday, November 22, 2010

ఘనంగా ప్రారంభమైన ‘శ్రీరామరాజ్యం’

హైదరాబాద్: బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ ఘనంగా ప్రారంభమైంది. బాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ శ్రీరామునిగా, నయనతార సీతగా, శ్రీకాంత్‌ లక్ష్మణునిగా, డా.అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా కనువిందు చేయబోతున్నారు. బాపు చిరకాల మిత్రుడు ముళ్లపూడి వెంకటరమణ తనదైన శైలిలో రచనను అందిస్తున్నారు. శ్రీ సాయిబాబా మూవీస్‌ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ రామకృష్ణా స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవంలో..దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో బాలకృష్ణ క్లాప్‌ కొట్టగా, రమేష్‌ ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బాపు దర్శకత్వం వహించారు.బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రం తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయి కీర్తి తెచ్చిన బాపు-రమణలనుంచి వస్తున్న మరో అద్భుత దృశ్యకావ్యమని, సీనియర్‌ నటీనటులంతా ఉన్న ఈ సినిమాలో నటిస్తున్నారని చెప్పారు. నిర్మాత ఎలమంచిలి సాయిబాబు మాట్లాడుతూ బాపు, ముళ్లపూడి, ఇళయరాజా అంగీకారం..హీరో ప్రోత్సాహంతోనే ఈ సినిమా సాధ్యమైందని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిస్తామని అన్నారు. జయసుధ, బాలయ్య, మురళీమోహన్‌, బ్రహ్మానందం, కె.ఆర్‌.విజయ, ఝాన్సీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, గ్రాఫిక్స్ : కమల్‌కణ్ణన్‌ (మగధీర ఫేం), ఛాయాగ్రహణం: పి.ఆర్కే.రాజు, ఎడిటింగ్‌: జి.జి.కృష్ణారావు, డాన్స్‌:శ్రీను, పాటలు: వెన్నెలకంటి, జొన్నవిత్తుల.

గ్రీన్‌కార్డ్ కోసం భారీగా దరఖాస్తులు

న్యూయార్క్ ,నవంబర్ 22:   అమెరికాలో చట్టబద్దమయిన శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డ్ కోసం  ఈ ఏడాది పోటీ భారీ స్థాయిలో ఉంది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 25 శాతం అధికంగా గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు వచ్చాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.  ప్రతి ఏటా 50 వేల మందికి మాత్రమే ఈ కార్డులు మంజూరు చేస్తారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 25 శాతం అధికంగా దరఖాస్తులు వచ్చాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. నిష్పక్షపాతంగా లబ్దిదారులను ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని కొన్నేళ్ల క్రితం అమెరికా కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. అయితే ఈ పద్ధతిని రద్దు చేయాలని కొందరు చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నెల వ్యవధితో గ్రీన్‌కార్డ్ దర ఖాస్తు దాఖలుకు గడువిచ్చారు. నవంబర్ 3తో గడువు ముగిసింది. చివరి గంటలో 62 వేల ఆప్లికేషన్లు వచ్చాయి. గ్రీన్ కార్డ్ కు దరఖాస్తు చేసిన వారిలో మెక్సికో, చైనా, భారత్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారు  అత్యధిక సంఖ్యలో ఉన్నారు.

భారత్ కు భద్రతామండలి సభ్యత్వంపై అమెరికా కాంగ్రెస్‌లో తీర్మానం

వాషింగ్టన్,నవంబర్ 22: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి వీలుగా ఐరాస చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ సభ్యుడు గుస్ బిలిరాకిస్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం లో పంచ శాంతికి, దక్షిణాసియా అభివృద్ధికి భారత్ చేసిన కృషిని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ లో ఏ రాజకీయాభిప్రాయాన్నయినా స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చని తీర్మానం పేర్కొంది. తీర్మానంపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడంకోసం విదేశీ వ్యవహారాల హౌస్ కమిటీ పరిశీలనకు పంపారు.

తొక్కిసలాటలో 190 మంది మృతి

నాంఫెన్,నవంబర్ 22: కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో సోమవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 190 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. రాజధాని లోని ఒక నది మధ్యనున్న ద్వీపంలో జరుగుతున్న జల ఉత్సవంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వర్షాకాలం ముగింపు సందర్భంగా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. వీటికి దాదాపు 20 లక్షల మంది హాజరవుతుంటారని అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి పడవ పందాలు ముగిసిన తర్వాత సంగీత కార్యక్రమాలు జరిగే కోపిచ్-డైమండ్ ఐలాండ్‌కు వెళ్లడానికి వేలాది ప్రజలు ఒకేసారి బ్రిడ్జిపైకి వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అనేక మంది నదిలో పడిపోయారు. వందలాదిమంది కింద పడిపోయారు. దీంతో కనీసం 190 మంది చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వందలాది మంది తీవ్ర గాయాలతో నేలపై పడి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

కొనసాగుతున్న పార్లమెంట్ ప్రతిష్టంభన

న్యూఢిల్లీ,నవంబర్ 22: పార్లమెంటులో వారంరోజులకు పైగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ చేపట్టిన దౌత్యం విఫలమైంది. సోమవారం ఉదయం, పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు విపక్ష సభ్యులతో ఆయన నిర్వహించిన సమావేశం ఎలాంటి ఫలితమివ్వలేదు. 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న పలు ఇతర దర్యాప్తు సంస్థల బృందాలను కూడా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)తో జతచేద్దామన్న ప్రభుత్వ సూచనను విపక్షాలు ముక్తకంఠంతో తోసిపుచ్చాయి. ప్రతిష్టంభన తొలగాలంటే జేపీసీ ఏర్పాటే ఏకైక మార్గమని స్పష్టంచేశాయి. దాంతో ప్రధానమంత్రి మన్మోహన్‌తో చర్చించాక, మళ్లీ కలుస్తానంటూ ప్రణబ్ వారికి హామీ ఇచ్చి, వెనుతిరిగారు. కాగా, 2జీ స్పెక్ట్రమ్ స్కాంపై జేపీసీ విచారణ కోరుతూ.. విపక్షాలు వరుసగా ఏడోరోజూ కూడా సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఉభయసభలను స్తంభింపజేశాయి. జేపీసీ ఏర్పాటును నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ప్రభుత్వ పక్షం కూడా అదే స్థాయిలో స్పందించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ భూకుంభకోణాలను ప్రస్తావిస్తూ.. ‘యడ్యూరప్పను తొలగించాలoటూ ప్రతినినాదాలతో బదులిచ్చింది. 2జీ స్పెక్ట్రమ్ సహా ఆదర్శ్ హౌసింగ్, కామన్వెల్త్ అవినీతిలపై జేపీసీ విచారణకు ఆదేశించాలని విపక్షాలు డిమాండ్‌చేశాయి. ఇరుపక్షాలు పట్టువీడకపోవడంతో ఉభయసభలూ మంగళవారానికి వాయిదాపడ్డాయి. గందరగోళ పరిస్థితుల మధ్య ఉభయసభల్లోనూ కొన్ని అధికారిక పత్రాలను మాత్రం ప్రవేశపెట్టగలిగారు.

దలైలామాకు జామియా మిలియా గౌరవ డాక్టరేట్

న్యూఢిల్లీ,నవంబర్ 22:  టిబెట్ అధ్యాత్మిక గురువు దలైలామాను ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (హానరీస్ కాసా)తో  సత్కరించనుంది. మంగళవారం జరిగే విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో దలైలామాను గౌరవ డాక్టరేట్  తో సత్కరించనున్నట్టు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌సిబాల్ అధ్యక్షత వహిస్తారు.  విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నజీబ్ జంగ్ అధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో 147 మందికి బంగారు పతకాలు, 127 మందికి పిహెచ్‌డీ డిగ్రిలను ప్రదానం చేస్తారు.

అంతర్గత భద్రతా విభాగం డెరైక్టర్ అరెస్ట్

న్యూఢిల్లీ,నవంబర్ 22: దేశ అంతర్గత భద్రతా విభాగం డెరైక్టర్ రవీందర్ సింగ్ అరెస్టయ్యారు. భద్రతా అనుమతులకు ప్రయత్నిస్తున్న కొన్ని సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారని రూఢీ కావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నామని హోం శాఖ కార్యదర్శి పిళ్ళై తెలిపారు. దేశ అంతర్గత భద్రతపై ఇప్పటికే సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ సమయంలో అంతర్గత భద్రత కు భాద్యత అహించవలసిన హోం శాఖలో నే ఉన్నతాధికారి పట్టుబడదం మరింత కలవరం కలిగిస్తోంది.
                       గోవా లో 41వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభోత్సవంలో కల్చరల్ ప్రోగ్రాం
                     పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్  హయ్యర్ లెర్నింగ్ 29వ స్నాతకోత్సవంలో
                                                             పాల్గొన్న ప్రధాని మన్మోహన్ సింగ్

రోశయ్య రాజినామా అస్త్రం?

హైదరాబాద్,నవంబర్ 22: ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం ఢిల్లీ వెడుతున్నారు.  ఐతే  ఆయన  అధిష్టానం పిలుపు మేరకు కాకుండా తనకు తాను గా వెడుతున్నందున రాజకీయ వర్గాలలో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. జగన్ వ్యవహారం తలనొప్పి గా మారడం,  మంత్రివర్గ విస్తరణకు, నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం తనకు స్వేచ్ఛ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. తాను రాజీనామా చేస్తే శాంతిస్తారా అని రోశయ్య సోమవారం పుట్టపర్తిలో అనడం అందులో భాగమేనని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని  నాలుగైదు సార్లు ఆయన  అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే అధిష్టానం ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తనకు స్వేచ్ఛ ఇవ్వకుండా వైయస్ జగన్ వ్యవహారాలను కట్టడి చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వ్యవహారం పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో రోశయ్య ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పి.సి.సి. నివేదిక ఇప్పటికే అందుకున్న అధిష్టానం  జగన్ పై చర్యలు తీసుకునే విషయంపై రోశయ్యతో అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. ఈసారి కూడా ఢిల్లీ పెద్దలు నాన్ పుడు ధోరణి అవలంబిస్తే  రోశయ్య రాజినామా అస్త్రం సంధించ వచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా,  కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పంపిన నివేదికలు అందాయని, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ  ఢిల్లీలో అన్నారు. 

బంగారు పతకం అందించిన సోమ్‌దేవ్-సనమ్

Somdev Devvarman and Sanam Singh (L) celebrate with their gold medal on the podium after winning the men's doubles final at the Asian Games.గాంగ్'జౌ,నవంబర్ 22: : ఆసియా క్రీడలలో టెన్సీస్ పురుషుల డబుల్స్ లో   భారత్ కు బంగారు పతకం లభించింది.    సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్-సనమ్ సింగ్ జోడి విజేతగా నిలిచి భారత్ ఖాతాలో ఆరో స్వర్ణాన్ని జమచేశారు.  . ఇది భారత్ కు  లభించిన ఆరో స్వర్ణపతకం.  డబుల్స్‌లో పసిడి నెగ్గిన సోమ్‌దేవ్ సింగిల్స్ సెమీఫైనల్లో  6-2, 0-6, 6-3తో తాతాసుమ ఇటో (జపాన్)పై గెలుపొంది   ఆసియా క్రీడల టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. కాగా   టెన్సీస్ మిక్స్'డ్ డబుల్స్ లో సానియా జోడీకి రజత పతకం లభించింది. పురుషుల ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో జయంత తాలుక్‌దార్, రాహుల్ బెనర్జీ, మంగళ్ సింగ్ చంపియాలతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. 

భారత్ కు 373 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యత

నాగపూర్,నవంబర్ 22: : భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మూడవ టెస్ట్ లో ఆదివారం మూడవ రోజున భారత్  8 వికెట్లు నష్టానికి  566 పరుగుల వద్ద   తొలి ఇన్నింగ్స్   డిక్లేర్ చేసింది. దీనితో  భారత్ కు  373 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యత లభంచింది.  ద్రావిడ్ 191, ధోనీ 98, గంభీర్ 78, సెహ్వాగ్ 74, సచిన్ 61, హర్బజన్ సింగ్ 20, లక్ష్మణ్ 12, రైనా 3 పరుగులు చేశారు. శర్మ ఏడు పరుగులు చేసి, శ్రీనాధ్ పరుగులు ఏమీలేకుండా నాటౌట్ గా నిలిచాడు.  కాగా, ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.

Sunday, November 21, 2010

‘సాక్షి’ చానెల్‌ కథనంపై నివేదిక కోరిన ఎ.ఐ.సి.సి.

న్యూఢిల్లీ,నవంబర్ 21:  యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పై  ‘సాక్షి’ చానెల్‌లో వచ్చిన కథనంపై  నివేదిక పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఎ.ఐ.సి.సి. ఆదేశించింది.  పీసీసీ నుంచి నివేదిక వచ్చాక ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పారు. కాగా, ‘సాక్షి టీవీ’లో వచ్చిన కథనంపై తానేమీ మాట్లాడదలచుకోలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ చెప్పారు.  ఆ కథనాన్ని తాను చూడలేదని, తనకు ఆ విషయమే తెలియదని ఆయన  అన్నారు. 

భారత్ కు అయిదు బంగారు పతకాలు

 గ్వాంగ్'జౌ,నవంబర్ 21:  ఆసియా క్రీడలలో భారత్ క్రీడాకారులు అయిదు బంగారు పతకాలు సాధించారు. దీంతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానానికి  చేరింది. మహిళల మూడు వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ ఈవెంట్'లో సుధాసింగ్ స్వర్ణపతకం సాధించింది.టెన్నిస్ సింగిల్స్ లో సానియాకు కాంస్య పతకం లభించింది.

నాగపూర్ టెస్ట్ లో భారత్ ఆధిక్యం

నాగపూర్,నవంబర్ 21:  న్యూజిలాండ్'తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ తొలిఇన్నింగ్స్'లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ 78 పరుగులు, సెహ్వాగ్ 74 పరుగులు చేసి అవుటయ్యారు. ద్రావిడ్ 69 పరుగులు, సచిన్ టెండూల్కర్ 57 పరుగులతో క్రీజ్'లో ఉన్నారు.అంతకు ముందు తొలిఇన్నింగ్స్'లో న్యూజిలాండ్ జట్టు 193 పరుగులు చేసింది.

Saturday, November 20, 2010

జార్ఖండ్ గృహిణికి కేబీసీలో రూ. కోటి

న్యూఢిల్లీ,నవంబర్ 20: కౌన్ బనేగా కరోడ్‌పతి-4లో జార్ఖండ్‌కు చెందిన రాహత్ తస్నీమ్(37) కోటి రూపాయలు గెలుచుకున్నారు. మధ్యతరగతి గృహిణి రాహత్ తస్నీమ్ 'ఆఫ్రికాలోని ఓ దేశపు ప్రథమ అధ్యక్షురాలు ఏ ప్రాంతానికి చెందిన వారు?' అనే ప్రశ్నకు ‘డబుల్ డిప్’ అవకాశం ఉపయోగించుకొని ఆమె ఆ మొత్తాన్ని సొంతం చేసుకున్నారు. ‘ఈ షోలో మొదట చాలా కంగారుపడ్డా. అందుకే వెంటనే లైఫ్‌లైన్లను ఉపయోగించుకున్నా. అయితే రూ. 3.2 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య అడిగిన ప్రశ్నలకు నేను చెప్పిన జవాబులు సరైనవని ముందే ఊహించా. రూ. ఐదు కోట్ల జాక్‌పాట్ ప్రశ్నకు జవాబు తెలియకపోవడం, లైఫ్‌లైన్లు కూడా లేకపోవడంతో గేమ్ నుంచి విరమించుకున్నా’ అని తస్నీమ్ చెప్పారు.

2జీ 'అక్రమార్కులను' శిక్షిస్తాం: ప్రధాని

న్యూఢిల్లీ,నవంబర్ 20:   2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినవారెవరైనా సరే వదలబోమని, తప్పకుండా శిక్షిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు. పార్లమెంటులో రగడకు దారితీస్తున్న ఈ కుంభకోణంపై ఆయన మొట్టమొదటిసారి స్పందించారు. ఏ విషయాన్ని చర్చించడానికైనా ప్రభుత్వానికి భయం లేదని, పార్లమెంటును సజావుగా సాగనివ్వాలని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఎవరి స్వప్రయోజనాలు దాగి ఉన్నాయన్న దానిపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయని చెప్పారు. ‘మీరెవరూ సందేహపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి తప్పు చేసినా వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం’ అని అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ క్రమబద్ధంగా జరగడానికి వీలుగా పార్లమెంటును సజావుగా సాగనివ్వాలని రాజకీయ పార్టీలను కోరారు. ‘పలు చట్టాలు చేయడానికి, అనుబంధ పద్దులు ఆమోదం పొందడానికి పార్లమెంటును సజావుగా నడపాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. 

'గుజారిష్' కు సూపర్ హిట్ టాక్

హైదరాబాద్,నవంబర్ 20:  ఐశ్వర్యరాయ్‌, హృతిక్‌రోషన్‌  జంటగా నటించిన 'గుజారిష్' చిత్రం సూపర్ హిట్ టాక్  సంపాదించింది. ‘పెరాప్లెజియ’పేషంట్ గా హృతిక్‌, అతనికి సపర్య చేసే వివాహిత నర్సు పాత్రలో ఐశ్వర్య అవధుల మేరకు నటించారు.  వీరి మధ్య ప్రేమ, వారి మధ్యలో   ఒమర్‌ సిద్ధికి అనే పాత్ర ,  ఈ ముగ్గురి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులేమిటి? అనేది ఆసక్తికరంగా మలిచారు  దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ. ఐశ్వర్యరాయ్‌, హృతిక్‌రోషన్‌లు ఇద్దరూ పోటీపడి డీగ్లామరైజ్‌ పాత్రల్లో తమ నట విశ్వరూపాన్ని చూపారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రేక్షకులకు  ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అందించారు. కాగా, 2004 లో వచ్చిన స్పానిష్ చిత్రం 'ది సీ ఇన్సైడ్', 1996 లో ఆస్కార్ పొందిన 'ది ఇంగ్లీష్ పేషంట్'  చిత్రాలను ఈ చిత్రం గుర్తుకు తెస్తుంది.

ఎస్సై పరీక్షలపై సీమాంధ్ర విద్యార్థుల డెడ్ లైన్

హైదరాబాద్,నవంబర్ 20: ఎస్సై పరీక్షలను యథతథంగా నిర్వహించాలని పట్టుబడుతున్న సీమాంధ్ర విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. పరీక్షల వాయిదాను రద్దు చేసుకుని, పరీక్షలను నిర్వహిస్తామని సోమవారంలోగా ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రం అగ్ని గుండమవుతుందని వారు హెచ్చరించారు. తమ ఆందోళనకు మద్దతు తెలపాలని వారు సీమాంధ్ర మంత్రులకు, శాసనసభ్యులకు విజ్ఞప్తులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓ పది మంది విద్యార్థులకు ప్రభుత్వం లొంగిపోయిందని సీమాంధ్ర జెఎసి కన్వీనర్ శామ్యూల్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ పది మంది విద్యార్థులు 12 బస్సులు ధ్వంసం చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే సాకు చూపారని ఆయన అన్నారు. సీమాంధ్ర విద్యార్థుల సహనాన్ని అసమర్థతగా భావించవద్దని ఆయన అన్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో లా పరీక్షలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయం గేట్లు మూసేశారు కాగా, ఎస్సై పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఆందోళనలు విరమించుకోవాలని ఆమె సీమాంధ్ర విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం ఉంటే తప్ప పరీక్షలు నిర్వహించాడనికి వీలు కాదని, దాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆందోళన విరమించాలని ఆమె అన్నారు. ఎస్సై పరీక్షల నిర్వహణ వల్ల ఆరో జోన్ లోని అభ్యర్థులకు ఏ విధమైన అన్యాయం జరగదని నచ్చజెప్పడానికి ప్రయత్నించామని, అయినా తెలంగాణ విద్యార్థులు ఆందోళన విరమించుకోలేదని ఆమె చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె సీమాంధ్ర విద్యార్థులకు హామీ ఇచ్చారు.

బీహార్‌లో మళ్లీ బీజేపీ, జేడీయూ కూటమి దే అధికారం: ఎగ్జిట్ పోల్స్

పాట్నా,నవంబర్ 20: : బీహార్‌లో మళ్లీ బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెల్పుతున్నాయి. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశముందని సీఎన్‌ఎన్ ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆరు  విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే ఫలితాలు వెల్లడించింది. బీజేపీ, జేడీయూ కూటమికి 185-201 సీట్లు, ఆర్జేడీ, ఎల్జేపీ 22-32 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నట్టు అంచనా వేసింది. కాంగ్రెస్ 6-12, ఇతరులు 9-19 స్థానాలు గెల్చుకునే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడయింది. బీహార్‌లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు శనివారం చెదురుమదురు సంఘటనలు మినహా పూర్తయ్యాయి. చివరి విడత ఎన్నికల్లో 26 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 50 శాతం పోలింగ్ జరిగిఇంది.  గయా జిల్లా ఇమామ్‌గంజ్ నియోజకవర్గ పరిధిలోని  లండా గ్రామంలో  మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు.  

మార్చి 7 నుంచి ఇంటర్,24 నుంచి ఎస్.ఎస్.సి. పరీక్షలు

హైదరాబాద్ ,నవంబర్ 20:   ఇంటర్మీడియట్ పరీక్షలు  మార్చి 7 నుంచి  నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు  ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు పరీక్షలు జరుగుతాయి. కాగా,  పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ  ప్రకటించింది.

నాగపూర్ టెస్ట్; కివీస్ 148/7

నాగపూర్,నవంబర్ 20:  భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి   న్యూజిలాండ్  తొలి ఇన్నింగ్స్ లో   7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.  మెక్‌కల్లమ్ 34, సౌథీ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మెకింతోష్ 4, గుప్తిల్ 6, టేలర్ 20, వెటోరి 3, రైడర్ 59, హప్కిన్స్ 7 పరుగులు చేసి అవుటయ్యారు. విలియమ్‌సన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. భారత బౌలర్లలో శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, ఓజా రెండేసి వికెట్లు తీశారు. హర్భజన్‌కు ఒక వికెట్ దక్కింది. వాతావరణం అనుకూలించకపోవడంతో మొదటి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమయింది.  

Friday, November 19, 2010

అమెరికాలో చిత్తూరు జిల్లా యువకుని మృతి

హైదరాబాద్,నవంబర్ 19: అమెరికాలోని ఆర్గాన్, ఈస్ట్ కోస్ట్ దారిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల గ్రామానికి చెందిన విజయభాస్కర్‌రెడ్డి మరణించాడు. రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి నరసింహారెడ్డి, రెడ్డెమ్మ దంపతుల పెద్ద కుమారుడు విజయభాస్కర్‌రెడ్డి (34) ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు.

రంజీ ‌లో త్రిపురపై హైదరాబాద్ గెలుపు

హైదరాబాద్,నవంబర్ 19: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. జింఖానా మైదానంలో మూడు రోజులకే ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 35 పరుగుల తేడాతో త్రిపురను ఓడించింది. గత మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న జట్టు ఈ సారి గెలుపును అందుకుంది.తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు వెనుకబడిన త్రిపుర, రెండో ఇన్నింగ్స్‌లో రవితేజ (5/20) బౌలింగ్ ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో హైదరాబాద్‌కు బోనస్ పాయింట్ సహా 6 పాయింట్లు దక్కాయి. ఈ రంజీ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అవమానకర ఆటతీరుతో 21 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైన హైదరాబాద్, జార్ఖండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. డిసెంబర్ ఒకటి నుంచి జరిగే తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్, గోవాను ఢీకొంటుంది.

శ్రీలంక అధ్యక్షునిగా రెండవ పర్యాయం బాధ్యతలు చేపట్టిన రాజపక్స

కొలంబో,నవంబర్ 19: శ్రీలంక అధ్యక్షునిగా మహీంద రాజపక్స రెండవ పర్యాయం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష సచివాలయం ఎదురుగా ఉన్న సముద్రతీరంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. త్రివిధ దళాల కవాతు, 21 తుపాకుల వందనంతో జరిగిన ఈ కార్యక్రమంలో లంక ప్రధాన న్యాయమూర్తి అశోక డిసిల్వా రాజపక్స చేత ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం కోసం విపరీతంగా ప్రజా ధనాన్ని వృథా చేశారని ఆరోపిస్తూ విపక్షాలు యూఎన్‌పీ, జేవీపీలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. 2005 నవంబర్‌లో మొదటిసారి అధ్యక్ష భాధ్యతలు స్వీకరించిన రాజపక్స రెండోసారి ఆ పదవిని చేపట్టడం కోసం రాజ్యాంగాన్ని సవరించారు.

మన్మోహన్ కు రాహుల్ బాసట

న్యూఢిల్లీ,నవంబర్ 19: స్పెక్ట్రమ్ కుంభకోణంతో సతమతమవుతున్న దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ సమర్ధించారు. ఈ విషయంలో ప్రధానికి తాను గట్టి మద్దతు ఇస్తానని రాహుల్ ప్రకటించారు.ప్రధానమంత్రి విభ్రాంతికర పరిస్థితిలో లేరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు, ప్రధానమంత్రిని విభ్రాంతికర పరిస్థితిలోకి నెట్టిందా..? అని విలేఖరులు అడిన ప్రశ్నకు సమాధానంగా.. రాహుల్ పైవిధంగా బదులిచ్చారు.ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జనార్థన్ ద్వివేది కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఎల్లప్పుడూ ప్రధాని వెంటే నిలుస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అతని గొప్పతనం గురించి యావత్ ప్రపంచానికి తెలుసని, ఆయన సమర్ధవంతుడని, పార్టీ పూర్తిగా ఆయనతోనే ఉంటుందని ద్వివేది వ్యాఖ్యానించారు.2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సుప్రీం పరిశీలనపై ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్- న్యూజిలాండ్ మధ్య శనివారం నుంచి  మూడవ, ఆఖరి  టెస్ట్ జరిగే 
 నాగపూర్ వి.సి.ఎ.  స్టేడియం గురువారం వర్షం తో తడిసి ముద్ద అయిన చిత్రం    
                                         ఢిల్లిలో జరుగుతున్న భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో
                                     ఆధునిక పరిజ్ఞానం, యంత్ర పరికరాలతో ఏర్పాటైన వ్యవసాయ శాఖ స్టాల్ 

బ్రెజిల్‌ అధ్యక్షునికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి

న్యూఢిల్లీ ,నవంబర్ 19: ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరా గాంధీ శాంతి బహుమతి - 2010’ బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇయాన్సియో లులా డా సిల్వకు దక్కింది. నిరాయుధీకరణ, అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన గల అంతర్జాతీయ కమిటీ ఈ ఎంపిక చేస్తుంది. బ్రెజిల్‌లో ఆకలి సమస్యను తొలగించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేసిన విశిష్టమైన కృషికి గాను లులాను ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది. లులా త్వరలో బ్రెజిల్‌ దేశాధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో
 ఆమె విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి రోశయ్య


రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ రాత పరీక్షలు వాయిదా : తెలంగాణా లో హర్షం: సీమాంధ్రలో నిరసన

హైదరాబాద్ ,నవంబర్ 19: ఎస్‌ఐ రాత పరీక్షను వాయిదా వేయాలంటూ ఓయు జెఎసి విద్యార్థుల ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాతే పరీక్షలు నిర్వహిస్తామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 14(ఎఫ్) నిబంధనపై కేంద్ర హోంమంత్రితో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలిపారు.తమది బాధ్యతగల ప్రభుత్వమని, అన్నివర్గాలవారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. శాంతిని నెలకొల్పేందుకే పరీక్షను వాయిదా వేశామని, ఇంత గందరగోళం మధ్య విద్యార్థులు పరీక్షలు సరిగా రాయలేరన్నారు.


టిఆర్ఎస్ బంద్ విరమణ

హోంమంత్రి ప్రకటనపై ఉస్మానియా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎస్ఐ పోటీ పరీక్షలు వాయిదా వేయడంతో తెలంగాణలో చేయతలపెట్టిన బంద్ ని టిఆర్ఎస్ విరమించుకుంది. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశానికి సంబంధించి 14 (ఎఫ్)పై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.

సీమాంధ్ర లో నిరసన

ఎస్ఐ పరీక్షలను వాయిదా వేయడంతో సీమాంధ్ర జెఎసి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ పరీక్షల వాయిదాకు నిరసనగా శనివారం బంద్'కు పిలుపు ఇచ్చారు. తిరుపతి ఎస్'వి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీమాంధ్ర ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఐ పోటీ పరీక్షలు వాయిదా వేయడాన్నినిరసిస్తూ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో విద్యార్తులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. అభ్యర్థులు ఎంతో కష్టపడి వ్యయప్రయాసలకోర్చి పరీక్షలకు సిద్ధమయితే, ఇప్పుడు వాయిదా వేయడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్లు వ్యవహర్తిస్తోందన్నారు. విశాఖ లో కూడా విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు కూడా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కాగా బంద్ పిలుపు తో అన్ని యూనివర్శిటీల పరిధిలో శనివారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు.

Thursday, November 18, 2010

భారత్‌కు రెండో స్వర్ణం

గ్వాంగ్‌జౌ,నవంబర్ 19:   ఆసియా క్రీడల్లో భారత్ రెండో స్వర్ణాన్ని దక్కించుకుంది. రోయింగ్‌లో భారత్ ఆటగాడు భజరంగ్ లాల్ థక్కర్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

బాడ్మింటన్‌ లో ముగిసిన భారత్ పోరు



గ్యాంగ్‌జౌ,నవంబర్ 18: ఆసియా క్రీడలలో బాడ్మింటన్‌ లో ఒక్క పతకమైనా దక్కకుండానే భారత్ పోరు ముగిసింది. భారత ఆశాకిరణం సైనా నెహ్వల్‌ క్వార్టర్ ఫైనల్స్ లోనే చేతులెత్తేసింది. హాంగ్‌కాంగ్‌కి చెందిన ఇవ్ వుయ్ యున్  చేతిలో 8-21, 21-8, 19-21 తో ఓటమి పాలైంది.




పార్లమెంట్ శీతాకాల సమావేశాల కుదింపు?

న్యూఢిల్లి,నవంబర్ 18:   2జి స్ప్రెక్ట్రం కుంభకోణం పై సం యుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకు పట్టు బడుతూ ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటుండడంతో శీతాకాల సమావేశాలను ప్రభుత్వం గడువు కంటె ముందుగానే ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెలికాం మంత్రి రాజా రాజినామా తో శాంతించని విపక్షాలు ప్రధాని పై సుప్రిం కోర్టు వ్యాఖ్యల దరిమిలా సం యుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకు పట్టు బడుతూ  పార్లమెంట్ దిగ్బంధాన్ని కొనసాగిస్తున్నాయి.  గురువారం ఐదో రోజు కూడా 2జి స్ప్రెక్ట్రం కుంభకోణం పై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు  లోక్‌సభ, రాజ్యసభలను స్తంభింపజేశాయి. దీంతో ఉభయసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్)లు కర్ణాటక సీఎం యడ్యూరప్ప భూ వివాదాన్ని లేవనెత్తి ప్రతిపక్షాలకు ధీటుగా బదులిచ్చాయి. విపక్ష సభ్యుల నిరసనలతో... రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే వాయిదా పడింది. లోక్‌సభ మొదట మధ్యాహ్నం వరకూ, పరిస్థితిలో మార్పు లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. 

జిల్లాల్లో ఎస్సై రాతపరీక్ష యథాతథం: రోశయ్య

హైదరాబాద్,నవంబర్ 18:   ఎస్సై రాతపరీక్ష హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో  యథాతథంగా జరుగుతుందని ముఖ్యమంత్రి  రోశయ్య స్ఫష్టం చేశారు.  ఉన్నతాధికారులతో ఈవిషయంపై సీఎం చర్చించారు. ఈ సమావేశంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు డీజీపీ అరవిందరావు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ పూనం మాలకొండయ్య పాల్గొన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వమని, రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకోవద్దని సీఎం కోరారు. ప్రభుత్వం పట్టింపులకు పోవడం లేదని, ఫ్రీజోన్‌కు సంబంధించి 14(ఎఫ్‌) రద్దుకు అసెంబ్ల్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, తాజాగా కేంద్ర హోంమంత్రి చిదంబరంతో కూడా చర్చించానని రోశయ్య వివరించారు. ప్రభుత్వ వాదనలో తప్పులుంటే చెప్పాలని, వాటిని సరిచేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం సూచించారు. పోలీస్‌ శాఖలో ఖాళీలతో పరిపాలన నడపలేమని, హైదరాబాద్‌ ఫ్రీజోనేనని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందని రోశయ్య అన్నారు. 

రణరంగంగా మారిన ఉస్మానియా

హైదరాబాద్,నవంబర్ 18: హైదరాబాద్ ఫ్రీ జోన్ అన్న ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యలతో ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. ఎస్సై పరీక్షలను ఆపేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే ఉద్రిక్తతకు నిలయంగా ఉన్న వర్సిటీ కాస్తా, సాయంత్రం సీఎం చేసిన ప్రకటనతో ఏకంగా రణరంగంగా మారింది. పోలీసుల మోహరింపు, విద్యార్థుల ప్రతిఘటనలతో యుద్ధ వాతావరణం నెలకొంది. విద్యార్థులు పలుచోట్ల విధ్వంసానికి దిగారు. పోలీసుల లాఠీచార్జిలో ఇద్దరు గాయపడటంతో వారిపైకి రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు కూడా రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.రబ్బరు బుల్లెట్లతో 8 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా విడిపోయి తార్నాక, హబ్సిగూడ, కాకతీయ నగర్ తదితర ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్సులపై విరుచుకుపడ్డారు. 18 బస్సులను ధ్వంసం చేశారు. యూనివర్సిటీకి నాలుగు వైపులా దారులన్నింటినీ పోలీసులు దిగ్బంధించారు. గవర్నర్ నరసింహన్, రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావుల దిష్టిబొమ్మలను విద్యార్థులు దగ్ధం చేశారు. రాత్రి 10 దాటాక పరిస్థితి మరింత తీవ్ర రూపు దాల్చింది. పోలీసులు రబ్బర్ బులెట్లు, టియర్ గ్యాస్ వదలగా, బీ-హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టల్ నుంచి విద్యార్థులు రాళ్లు రువ్వారు. విద్యార్థుల రాళ్ల వర్షంలో ఓయూ సీఐ, మరికొందరు పోలీసులు గాయపడ్డారు. అర్ధరాత్రి దాటాక కూడా పోలీసులు కాల్పులు జరుపుతుండటంతో విద్యార్థులంతా రోడ్లపైనే ఉండిపోయారు. పోలీసులు పెద్దసంఖ్యలో దూసుకువచ్చి హాస్టళ్లను ముట్టడికి ప్రయత్నించగా విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటిఇంచారు. జాక్ నాయకుడు రాజారాం యాదవ్‌ను పోలీసులు గురువారం అర్ధరాత్రి ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణా బంద్ కు కేసీఆర్ పిలుపు

ఫ్రీ జోన్ రగడ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు విధించారు. ఇవి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి వారం పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు శుక్రవారం హైదరాబాద్‌లో ఓయూ జాక్, తెలం గాణలో పీడీఎస్‌యూ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనితో పాటు తెలంగాణ వ్యాప్తంగా రిలే నిరా హారదీక్షలు చేపట్టాలని ఓయూ జాక్ నిర్ణయించింది. ఇదిలా వుండగా శనివారం తెలంగాణ బంద్ పాటించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...