Friday, February 17, 2023

పాలమూరు రంగారెడ్డి కి సుప్రీం పాక్షిక అనుమతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకు కోవాలని స్పష్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం సూచించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై మాత్రం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం స్టే విధించింది. 


అదానీ వ్యవహారంలో సీల్డ్​ కవర్​ కమిటీ కి సుప్రీంకోర్టు నో..


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అదానీ-హిండెన్​బర్గ్​ వ్యవహారంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యలను పటిష్ఠం చేసేందుకు ప్రతిపాదిత నిపుణుల కమిటీ పేర్లు సీల్డ్​ కవర్​లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల విషయంలో పూర్తి పారదర్శకతను కొనసాగించాలని కోరుతున్నామని.. సీల్డ్ కవర్‌లో నిపుణుల కమిటీ పేర్లపై కేంద్రం చేసిన సూచనను అంగీకరించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. నిపుణుల కమిటీ సభ్యులపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఈ వ్యవహారంపై తామే ఒక కమిటీ ఏర్పాటు చేస్తామంటూ.. దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది.

ఉద్ధవ్​ ఠాక్రేకు ఎదురుదెబ్బ … ఏక్​నాథ్​ శిందే వర్గానికే శివసేన పేరు, ఎన్నికల గుర్తు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివసేన పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం.. ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2018లో సవరించిన శివసేన పార్టీ రాజ్యాంగాన్ని అప్రజాస్వామికం అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలాంటి ఎన్నికలు లేకుండా సొంత కోటరీలోని వ్యక్తుల్ని పార్టీ పదాధికారులుగా అప్రజాస్వామికంగా నియమించుకునేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నారని స్పష్టం చేసింది. అలాంటి పార్టీ వ్యవస్థల్ని నమ్మలేమని అభిప్రాయపడింది.



Wednesday, February 15, 2023

పట్టాలు తప్పిన గోదావరి: ప్రయాణికులు సేఫ్

హైదరాబాద్, ఫిబ్రవరి 15: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ఉదయం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4 మొత్తం 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అయితే ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.ప్రమాదం కారణంగా ఈ మార్గం లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కుతూహలమ్మ మృతి

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ (73) తిరుపతిలో కన్నుమూశారు. కుతూహలమ్మ చిత్తూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985 సంవత్సరంలో వేపంజేరి (ప్రస్తుతం జీడీ నెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత జీడీనెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


Tuesday, February 14, 2023

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయుల బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధిస్తూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాన్‌ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. టీచర్ల బదిలీల నిబంధనలపై హైకోర్టును నాన్‌ స్పౌజ్ టీచర్లు ఆశ్రయించారు. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదించారు. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరిపిన హైకోర్టు... ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.



Monday, February 13, 2023

అదానీ వ్యవహారం పై నిపుణుల కమిటీ?

​న్యూఢిల్లీ , ఫిబ్రవరి 13:అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం నేపథ్యంలో రెగ్యులేటరీ మెకానిజంను బలోపేతం చేయడం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ కమిటీ కోసం షీల్డ్‌ కవర్‌లో నిపుణుల పేర్లను ఇవ్వాలనుకుంటున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కమిటీ వేయాలని ఇంతకు ముందు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం స్పందించింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని సెబీ చూస్తోందని సుప్రీంకోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.

Sunday, February 12, 2023

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ను నియమించారు ఆంధ్రప్రదేశ్​కు కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​ను నియమించారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్​గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్​, సిక్కిం గవర్నర్​గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్​గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​గా శివ్ ప్రతాప్​లను నియమించారు. లద్దాఖ్ ఎల్​జీగా. అరుణాచల్​ ప్రదేశ్ గవర్నర్​గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను నియమించారు. మణిపుర్ గవర్నర్​గా ఉన్న లా గణేశన్​ను నాగాలాండ్ గవర్నర్​గా బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్​ను మేఘాలయా గవర్నర్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిమాచల్ గవర్నర్​గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్​ను.. బిహార్ గవర్నర్​గా బదిలీ చేశారు. 


Saturday, February 11, 2023

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత్ బోణీ

నాగ్‌పూర్‌ , ఫిబ్రవరి 11: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది

ఈ-రేస్‌ సీజన్ 9 విజేత జాన్‌ ఎరిక్‌ వర్నే

హైదరాబాద్,   ఫిబ్రవరి 11: హైదరాబాద్‌ లో జరిగిన ఫార్ములా ఈ-రేస్‌ సీజన్  9లో జాన్‌ ఎరిక్‌ వర్నే విజేతగా నిలిచారు. ఫార్ములా ఈ-రేసుకు సంబంధించి నెల నుంచే మెుదలైన హడావిడి శనివారంతో ముగిసింది.  క్వాలిఫైంగ్‌ రేస్‌ వరకు టాప్‌లో నిలిచిన జాగ్వార్‌ రేసింగ్‌ టీమ్‌ డ్రైవర్‌ సామ్‌ బర్డ్‌ క్వాలిఫైంగ్‌ రేసు పూర్తి అయ్యేసరికి వెనుకబడిపోయారు. క్వాలిఫైంగ్‌ రేసు అనంతరం జరిగిన ఫైనల్‌ రేసులో సామ్‌ బర్డ్‌ వెనకబడటంతో ఫైనల్‌ 10 ల్యాప్‌లలో ముందంజలో నిలుస్తూ ఫార్ములా ఈ సీజన్‌-9 విజేతగా జా ఎరిక్‌ వా నిలిచారు.మొత్తం రేసు పూర్తి అయ్యేసరికి 25 పాయింట్లతో జా ఎరిక్‌ వా మొదటి స్థానంలో నిలవగా.. 18 పాయింట్లతో నిక్ క్యాసిడి రెండో స్థానంలో నిలిచారు. ఇక 15 పాయింట్లతో ఆంటోనియో ద కోస్తా మూడో స్థానంలో నిలిచారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రేసర్లకు మంత్రి కేటీఆర్‌ ట్రోఫీలు అందజేశారు. 



రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీలు

హైదరాబాద్,   ఫిబ్రవరి 11: రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఉద్దెశించిన పంచాయతీరాజ్‌ చట్టం  సవరణ బిల్లు ను శాససన సభ ఆమోదించింది.  దీంతో భద్రాచలం మండలంలో భద్రాచలం, సీతారాంనగర్‌, శాంతినగర్‌, బూర్గంపాడు మండలంలో సారపాక, ఐటీసీ, ఆసిఫాబాద్‌ జిల్లాలో రాజంపేటను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఇప్పుడైనా సొంత జాగా ఇళ్లకు పైసలూడిపడేనా..

హైదరాబాద్,   ఫిబ్రవరి 11: రాష్ట్రంలో సొంత స్థలాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం 2023-24లో 4 లక్షల మంది వరకు లబ్ధిదారులకు సాయం అందించనుంది. ఈమేరకు పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి ఆర్థికసాయం అందించడానికి నిర్ణయించింది. అయితే రెండో సారి అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇదిగో అదిగో అంటున్న కె సి ఆర్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఎన్నికల దృష్ట్యా ఈ హడావిడి చేస్తోంది తప్ప పైసలూడి పడ తాయనుకోడం లేదని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. 

పాతబస్తీకీ మెట్రో తెస్తాం: కె టి ఆర్

హైదరాబాద్,   ఫిబ్రవరి 11: హైదరాబాద్ పాతబస్తీకి కచ్చితంగా మెట్రో తీసుకొస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  హామీ ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆయన శాసనసభా ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో నూతన మార్గాల ఏర్పాటుకు కేంద్రం సహకరించడం లేదని , బిజెపి అధికారం లో ఉన్న చోట చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో ఏర్పాటుకు కోట్ల నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహా నగరానికి మాత్రం కేంద్రం మొండి చెయ్యి చూపుతోందని ఆయన విమర్శించారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం-ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా హైదరాబాద్ నగరం నలుమూలల మురుగునీటి వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. 

విశాఖ రైల్వే జోన్ కు 106 కోట్లు…


న్యూఢిల్లీ:  ఫిబ్రవరి 11: విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కేంద్ర కార్యాలయం, ఇతర అవసరాలకు106.89 కోట్ల రూపాయలు అంచనా వ్యయం మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఇప్పటికే భూమి గుర్తించారు. సర్వే, లేఅవుట్‌ ప్లాన్‌, సిబ్బంది నివాస కాలనీ, ఇతర నిర్మాణాల.. ప్రాథమిక పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు.. రైల్వే మంత్రి  లోక్ సభ లో తెలిపారు.


ఎమ్మెల్సీ కోడ్: నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. వాస్తవానికి ఈనెల 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...