Sunday, September 30, 2012

గెలిపించిన కోహ్లీ

కొలంబో,సెప్టెంబర్ 30:  ప్రపంచ కప్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్   విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్  19.4 ఓవర్లకు 128 పరుగులు  చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ 17 ఓవర్లలో  రెండు వికెట్లు నష్టపోయి 129 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించింది.  కోహ్లీ 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సెహ్వాగ్ 29 పరుగులు చేశాడు. రజా హసన్, షాహిద్ అఫ్రిది చెరో వికెట్ తీసుకున్నారు.  

ఉద్రిక్తత మధ్య సాగరహారం

హైదరాబాద్,సెప్టెంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... టి. జె.ఎ.సి. ఆదివారం నిర్వహించిన తెలంగాణ మార్చ్ ఉద్రిక్తతల మధ్య సాగింది.   తెలంగాణ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, పలు ప్రజా సంఘాలు తెలంగాణ మార్చ్ కు మద్దతిచ్చాయి. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్  ప్రాంతాలు  జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావలసిన న సాగరహారం  రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.  వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికక్కడ కి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీడియా ఓబి వ్యాన్లకు, నెక్లెస్ రైల్వే స్టేషన్‌కు, రెండు పోలీసు జీపులకు నిప్పు అంటించారు.తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో రెండుసార్లు అరెస్టయ్యారు. సాయంత్రం కవాతు వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తదితరులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.  బైక్ ర్యాలీతో కవాతు వేదిక వద్దకు బయలుదేరిన  ఓయు విద్యార్థులపై  పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. డిజిపి దినేష్ రెడ్డి  ఏరియల్ సర్వే ద్వారా నగరంలో పరిస్థితిని పర్యవేక్షించారు. తెలంగాణ మార్చ్ నేపథ్యంలో జంట నగరాల్లో అన్ని తెలుగు వార్తా ఛానెళ్ళు పోలీసుల ఆదేశాల మేరకు   సాయంత్రం నుంచి ప్రసారాలనునిలిపివేశాయి.. తెలంగాణ కవాతు నుంచిఎవరూ వెనక్కు వెళ్లవద్దని కోదండరాం పిలుపునిచ్చారు. ప్రభుత్వ, పోలీసుల తీరుకు నిరసనగా సోమవారం వరకు రేపటివరకు నెక్లెస్ రోడ్డులోనే ఉంటామని స్పష్టం చేశారు.
కాగా సయంత్రం భారీ వర్షంలో తెలంగాణ మార్చ్ కొనసాగుతోంది. వర్షం కురుస్తున్నా తెలంగాణవాదులు నెక్లెస్ రోడ్డులోని సభా వేదిక వద్ద నుంచి కదల లేదు.

Saturday, September 29, 2012

జీశాట్-10 ప్రయోగం విజయవంతం...

హైద‌రాబాద్, సెప్టెంబర్ 29:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం నిర్వహించిన  జీశాట్-10 ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం వేకువ జామున 2.48 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీశాట్-10 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఇది ‘ఇస్రో’ చేపట్టిన 101వ ప్రయోగం కాగా, జీశాట్-10 ఉపగ్రహం ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైనది. దీని బరువు 3400 కిలోలు. అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించే రాకెట్ పరిజ్ఞానం ‘ఇస్రో’ వద్ద లేకపోవడంతో, దీనిని ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించారు. ఉపగ్రహం తయారీ సహా ఈ ప్రయోగానికి మొత్తం రూ.750 కోట్ల ఖర్చు అయింది. ముందుగా నిర్ణయించినట్లే 30.45 నిమిషాల్లో ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. జీశాట్-10 ఉపగ్రహంలో మొత్తం 30 ట్రాన్స్ పాండర్లను అమర్చారు. ఈ ప్రయోగం ఈనెల 22న జరగాల్సి ఉండగా, ఏరియన్-5 రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, వారం రోజులు వాయిదా పడింది. 

గణేశ నిమజ్జనం ప్రశాంతం...

హైద‌రాబాద్, సెప్టెంబర్ 29:  జంట నగరాలలో గణేశ నిమజ్జనోత్సవం శనివారం ప్రశాంతంగా ముగిసింది.  జంట న‌గ‌రాల్లో  వివిధ ప్రాంతాల నుంచి  వినాయ‌క విగ్రహాలను భారీ ఊరేగింపులతో  ట్యాంక్‌బండ్ వ‌ద్దకు తీసుకు వచ్చి హుస్సేన్ సాగ‌ర్‌లో నిమజ్జనం చేశారు.భారీ బందోబ‌స్తు న‌డుమ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా శాంతియుతంగా గ‌ణేశ  నిమ‌జ్జనోత్సవం జ‌రిగింది. ఆదివారం తెలంగాణ మార్చ్ ను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనోత్సవ వేడుకలను త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఖైరతాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి  నిమ‌జ్జనోత్సవం  తెల్లవరు ఝామున 2.35 నిమిషాల‌కు పూర్తైంది. హుస్సేన్ సాగ‌ర్‌లో తెల్లవారు జాము వర‌కూ.. సుమారు 3 వేల విగ్రహాలు నిమ‌జ్జన‌మయ్యాయి.

ఫిడే చెస్ టోర్నీ చాంపియన్‌గా కోనేరు హంపి

అంకారా (టర్కీ),సెప్టెంబర్ 29:  తెలుగుతేజం కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. చివరిదైన 11వ రౌండ్లో గ్రాండ్ మాస్టర్ హంపి పోలెండ్‌కు చెందిన మోనిక సాకోపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.  టోర్నీ ముగిసే సమయానికి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.  ఈ టోర్నీ మొత్తంలో హంపి ఏడు విజయాలు సాధించి, ఓ గేమ్‌లో ఓటమిపాలైంది. మూడు గేమ్‌లు డ్రా చేసుకుంది. ఈ విజయంతో హంపి ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లతోపాటు 40 బోనస్ పాయింట్లు చేరాయి.రూ. 4.43 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మొత్తం 14 అంతర్జాతీయ రేటింగ్ పాయింట్లు దక్కించుకున్న హంపి ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరింది. 

Friday, September 28, 2012

హడలెత్తించిన అసీస్...సూపర్ ఎయిట్‌లో శుభారంభం

కొలంబో,సెప్టెంబర్ 28: ప్రపంచకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి సూపర్ ఎయిట్‌లో శుభారంభం చేసింది.   మాజీ చాంపియన్ భారత్‌ పై ఆసీస్ కేవలం 15 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించి గెలుపు స్వంతం చేసుకుంది. 141 పరుగుల విజయలక్ష్యాన్ని   ఆసీస్ కేవలం ఒక వికెట్ టు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. వార్నర్ 63 పరుగులు చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే తడబడింది. గంభీర్(17) అనవసరపు రనౌట్‌తో ఆరంభమైన భారత్ పతనం  కడదాకా  కొనసాగింది. యువరాజ్ (8), కోహ్లి (15) , రైనా (26), ధోని (15) పరుగులు చేశారు. ఓ ఎండ్‌లో ఇర్ఫాన్ పఠాన్((31) ఆచి తూచి ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. గాయంతో మ్యాచ్‌కు దూరమైన సెహ్వాగ్ లేనిలోటు స్పష్టంగా కనబడింది. ఆసీస్ బౌలర్లలో వాట్సన్ మూడు వికెట్లు తీయగా, కమ్మిన్స్ రెండు, స్టార్క్‌కు ఒక వికెట్టు లభించింది.

సూర్య కిరణ్-2లో సైనా నెహ్వాల్‌

హైదరాబాద్,సెప్టెంబర్ 27: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జెట్ ఫైటర్ విమానం సూర్య కిరణ్-2లో విహరించింది. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత జెట్ ఫైటర్‌లో ప్రయాణించిన క్రికటేతర క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ఖ్యాతికెక్కింది. లండన్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ పతకం సాధించినందుకు గాను సైనాకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ అరుదైన అవకాశం కల్పించింది.  క్స్

నెక్లెస్ రోడ్‌పై తెలంగాణా మార్చ్




హైదరాబాద్,సెప్టెంబర్ 27: ఆదివారంనాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు నెక్లెస్ రోడ్‌పై తెలంగాణా మార్చ్ నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించింది.  తెలంగాణ మంత్రుల అభ్యర్థన మేరకు తెలంగాణ జెఎసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి రాసిన  లేఖ పై  ప్రభుత్వం ఈ అనుమతి మంజూరు చేసింది. అయితే రెండు రోజుల మార్చ్ కి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం త్రోసిపుచ్చింది. తెలంగాణ మార్చ్ ను శాంతియుతంగా జరుపుతామని జెఎసి హామీ ఇచ్చినట్లు మంత్రి జానారెడ్డి తెలిపారు.

జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 28:  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే శుక్రవారం అక్టోబర్ 5 వరకు  వాయిదా వేసింది.  తమ తరపు న్యాయవాది మారారని... విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తి మేరకు  అత్యున్నత న్యాయస్థానం విచారణను  వాయిదా వేసింది.  

Thursday, September 27, 2012

బాబు తెలంగాణా లేఖ పై సీమ నేత బైరెడ్డి గరం...పార్టీకి రాం రాం...

హైదరాబాద్,సెప్టెంబర్ 27:  తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే అభ్యంతరం లేదని  కానీ రాయలసీమ అంటే చిన్న చూపు ఎందుకని  బైరెడ్డి మండిపడ్డారు. తనకు రాజకీయాల కన్నా రాయలసీమ ప్రయోజనాలే ముఖ్యమని బైరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు అవ్వడానికి రాయలసీమను ఉపయోగించుకుంటున్న నేతలు ఆ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమ నాలుగు జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 40 రోజులపాటు రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర చేస్తానని ఆయన తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన అభిమానంతో టిడిపిలో చేరానని, అప్పటి నుండి పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశానని చెప్పారు. నాడు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటే ఇప్పుడు చంద్రబాబు చెయ్యెత్తి జైకొట్టు తెలంగాణా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాటి సిద్ధాంతాల కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఆధ్వర్యంలో పని చేశానని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనకు ఓకే చెప్పి సీమను నిర్లక్ష్యం చేయడంతో తాను పార్టీలో ఉండదల్చుకోలేదన్నారు. రాయలసీమ ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం, ఆత్మాభిమానం కోసం తాను పోరాటం చేస్తానని చెప్పారు.  

Wednesday, September 26, 2012

తెలంగాణాపై బాబు కప్పదాటు లేఖ...

హైదరాబాద్,సెప్టెంబర్ 26:  తెలంగాణ అంశంపై ఒక స్పష్టతను ఇస్తానని  చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చివరకు తుస్సుమనిపించారు. తెలంగాణ అంశాన్ని తేల్చటానికి తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాసిన లేఖలో కోరారు. తెలంగాణ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని, 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయటానికి పథక రచన చేస్తున్నారని చంద్రబాబు ప్రధానమంత్రికి రాసిన లేఖలో విమర్శించారు. డిసెంబర్ 2009లో కేంద్ర హోంమంత్రి ప్రకటన అనంతర పరిణామాల్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్‌ను వేయగా, డిసెంబర్ 2010లో నివేదిక సమర్పించిందన్న విషయాన్ని ఆ లేఖలో చంద్రబాబు గుర్తుచేశారు. అయితే ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. కేంద్ర హోంమంత్రి మళ్లీ అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీయే ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదన్న విషయాన్ని ఇటీవలి కాలంలో స్వయంగా కేంద్ర హోంమంత్రి పార్లమెంట్‌లో అంగీకరించారని గుర్తుచేశారు. 
బుధవారం 80వ పుట్టిన రోజు జరుపుకున్న ప్రధాని  మన్మోహన్ సింగ్ 

ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణ : అజాద్ పాత పాట

శ్రీనగర్,సెప్టెంబర్ 26:   తెలంగాణ అంశంపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్  శ్రీనగర్‌లో అన్నారు. ఏకాభిప్రాయానికి మరింత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం తర్వాతనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై ఇంకా ఇరు ప్రాంతాల నేతలతో చర్చించాల్సి ఉందన్నారు. చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ అత్యంత క్లిష్టమైన సమస్య అన్నారు. మహారాష్ట్ర సంక్షోభం పై ఆజాద్ స్పందిస్తూ,  మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ యూపిఏ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారుడని  తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌తో కాంగ్రెసుకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు, ఎన్సీపికి కూడా ఎలాంటి విభేదాలు లేవన్నారు. అజిత్ తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

భద్రతా వలయంలో భాగ్యనగరం...

నిమజ్జనం...తెలంగాణా మార్చ్...జీవ వైవిధ్య సదస్సు...   
హైదరాబాద్,సెప్టెంబర్ 26:  హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి తెలంగాణ మార్చ్ సెగ తగిలింది. 30న తెలంగాణ మార్చ్  ను     దృష్టిలో పెట్టుకుని వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీ  రాత్రి 11 గంటల లోపలే ముగించాలని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశించారు.  తెలంగాణ మార్చ్ కు అనుమతి లేదని ఆయన చెప్పారు. బయటివారు తెలంగాణ మార్చ్ లో పాల్గొనకూడదని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు  మార్చ్ ను వాయిదా వేసుకుంటే ఆ తర్వాత  అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. అయితే, మార్చ్ ను వాయిదా వేసుకోవడానికి తెలంగాణ జెఎసి నిరాకరించింది.  వినాయక నిమజ్జనానికి తమ మార్చ్ ఏ విధమైన విఘాతం కలిగించదని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. మరోవైపు మార్చ్  ను అడ్డుకోవడానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరానికి జిల్లా నుంచి వచ్చే మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టారు.  భద్రత  కోసం 20 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి హైదరాబాదులో జరిగే జీవ వైవిధ్య సదస్సు బందోబస్తుకు పారా మిలిటరీ బలగాలు రావాల్సి ఉంది. కానీ, వినాయక నిమజ్జనం, తెలంగాణ మార్చ్ సందర్భంగా ముందుగానే వాటిని తరలిస్తున్నారు.   

Tuesday, September 25, 2012

అలరించిన బాలు, చిత్ర సంగీత విభావరి

అట్లాంటా, సెప్టెంబర్ 25: యూటీ ఆస్టిన్ విశ్వవిద్యాలయంలో ఐదేళ్లుగా నిర్వహిస్తున్న తెలుగు బోధనా తరగతులకు కావలసిన నిధుల సమీకరణకు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం  ఏర్పాటు చేసిన, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పద్మశ్రీ చిత్ర ల  సంగీత విభావరి గత శనివారం సాయంత్రం డాలస్ లోని బ్లాక్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లో ఘనంగా  జరిగింది. డాలస్ లో ఉంటున్న భారతీయులతోపాటు టెక్సస్ లోని ఇతర ప్రాంతాల నుండి, ఒక్లొహోమా నుంచి కూడా తెలుగు భాషాభిమానులు, సంగీతాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంగీత డోలికల్లో తేలియాడారు. జగదానందకారకా, ఉప్పొంగెలే గోదావరి పాటలతో మొదలుపెట్టి యమహో నీ యమాయమా, స్వప్నవేణువేదొ, మాటేమంత్ర్రమూ, తెలుసామనసా, రాసలీలవేళ మొదలైన హిట్ పాటలతో పాటు, అలనాటి మధురగీతాలైన ఏదివిలో విసిసిన పారిజాతమో, సువ్వేనా సంపెంగపువ్వుల నువ్వేనా, తదితర బాలు పాటలు అందరినీ మంత్రముగ్ధులను చేసాయి.యస్పీశైలజ, ఎస్.పి. చరణ్ కూడా మధుర గీతాలు ఆలపించారు.
:  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం జరిగిన  రథోత్సవం...

ఇప్పటికిప్పుడు తేల్చం.. తెలంగాణపై కుండ బద్దలు కొట్టిన వాయలార్

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 25:  ఈ నెలాఖరులోగా తెలంగాణపైన, కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనంపై ప్రకటనలు వెలువడుతాయంటూ జోరుగా సాగిన ఊహాగానాలు తుస్సుమనేట్టే కనబడుతోంది. అధిష్టానం జాతీయ అంశాలతోనే బిజీగా ఉందని, తెలంగాణపై ఆలోచన చేయడం లేదని  కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి కుండ బద్దలు కొట్టేశారు.సోమవారం జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో  తెలంగాణపై చర్చించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెసులో తెరాస విలీనంపై ప్రశ్నించగా, ఆ విషయం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావునే అడగాలన్నారు.  కెసిఆర్ తనను కలిశారని, తెరాస విలీనం చిన్న విషయం కాదని  ఆయన అన్నారు.

ఇరిగేషన్ స్కాం...మహరాష్ట్ర డిప్యూటీ సి.ఎం. రాజీనామా...

ముంబై,సెప్టెంబర్ 25:  సాగునీటి ప్రాజెక్ట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తమ పదవికి రాజీనామా చేశారు.  అజిత్ పవార్ తన సమీప బంధువు, కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపికి చెందినవారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపి భాగస్వామి. తాను అవినీతికి పాల్పడలేదని . పదవికి తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మహారాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అయితే, అదనంగా 0.1 శాతం ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత పదేళ్లలో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై చేసిన వ్యయంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. మంత్రి పదవి రాజీనామా చేసినప్పటికీ అజిత్ పవార్ ఎన్సీపి శానససభా పక్ష నేతగా కొనసాగుతారు. అజిత్ పవార్ తనకు చెప్పే రాజీనామా చేశారని ఎన్సీపి అధినేత శరద్ పవార్ అన్నారు. తమ పార్టీ మంత్రులు రాజీనామా చేయబోరని, ప్రభుత్వంలో తమ పార్టీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. 

Monday, September 24, 2012

చంద్రబాబు జీవన్మరణ యాత్ర...!

హైదరాబాద్ ,సెప్టెంబర్ 24: తొమ్మిదేళ్ళ అధికారం కోల్పోయిన తరువాత తొమ్మిదేళ్ళ నుంచి ప్రతిపక్షం లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు  2014 ఎన్నికలలో పార్టీ ని గెలిపించే లక్ష్యంతో జీవన్మరణ  పోరాటానికి సిద్ధపడుతున్నారు.  ‘వస్తున్నా... మీకోసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను  అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంనుంచి ప్రారంభిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్లనాటి సుపరిపాలనను ప్రజలకు గుర్తు చేసేందుకే ‘వస్తున్నా... మీకోసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, యూపీఏలతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఎన్డీయే రెండూ బలహీనమవుతున్నాయని.. ప్రాంతీయపార్టీల బలం బాగా పెరుగుతోందని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడినా టీడీపీ కీలక భూమిక పోషించిందన్నారు. 2014 ఎన్నికల తరువాత దేశ రాజకీయాల్లో కీలక మార్పులుంటాయని ఆయన చెప్పారు.  తెలంగాణ అంశంపై తాను పార్టీలో అందరితో మాట్లాడుతున్నానని   చెప్పారు.     చంద్రబాబు ప్రతి రోజూ 18 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఒక్కో జిల్లాల్లో 100 నుంచి 125 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. హిందూపురంలో ప్రారంభమయ్యే యాత్ర గుత్తి మీదుగా కర్నూలు జిల్లా చేరుతుంది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ద్వారా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్, నల్లగొండ మినహా మిగిలిన జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా మీదుగా కోస్తాలోని కృష్ణా జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకూ కొనసాగిస్తారు. జనవరి 26 నాటికి యాత్ర ఎక్కడకు చేరితే అక్కడే ముగిస్తారు. దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ముఖ్యమైన పండుగలు, పర్వదినాల సమయంలో యాత్రకు విరామం ఇస్తారు. 

వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లకు ఉచిత రోమింగ్

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 24:  వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లకు రోమింగ్ చార్జీలు తొలగిస్తున్నట్లు టెలికం మంత్రి కపిల్ సిబల్ సోమవారం వెల్లడించారు.  ఇంటర్నెట్‌పై నియంత్రణకు ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. అయితే, ఇంటర్నెట్ కారణంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారంపై ఏకాభిప్రాయం మాత్రమే కోరుతున్నామన్నారు. ఇంటర్నెట్‌లోని కొన్ని అంశాల్లో భావప్రకటనా స్వేచ్ఛకు పూర్తి రక్షణ ఉంటుందని అన్నారు. టెలికం కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్పెక్ట్రమ్ వేలం కోసం నోటీసు ఆహ్వాన దరఖాస్తులపై (ఎన్‌ఐఏ) టెలికం శాఖ కసరత్తు జరుపుతోందని, ఇది పూర్తయ్యాక ఏకీకృత లెసైన్సు మార్గదర్శకాలపై పనిచేయనుందని తెలిపారు. ఏకీకృత లెసైన్సుల పని పూర్తయిన తర్వాత ఉచిత రోమింగ్‌పై విధి విధానాలను నిర్ణయిస్తామని వెల్లడించారు.


Sunday, September 23, 2012

దుమ్ము రేపిన హర్భజన్: సూపర్‌-8 లో భారత్‌

కొలంబో,సెప్టెంబర్ 23: :  ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో హర్భజన్ తన స్పిన్ మాయాజాలంతో భారత్‌కు ఘన విజయ సాధించి పెట్టాడు. భారత్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్‌-ఎ సూపర్‌-8 లో సూపర్‌గా నిలిచింది. రోహిత్ శర్మ (33 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1సిక్సర్) దూకుడుకు తోడు విరాట్ కోహ్లి (32 బంతుల్లో 40; 6 ఫోర్లు), గంభీర్ (38 బంతుల్లో 45; 5 ఫోర్లు) రాణించడంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత బౌలింగ్ ధాటికి 14.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. కీస్వెటర్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. హర్భజన్ 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, పఠాన్, చావ్లా చెరో 2 వికెట్లు తీశారు.ఆసక్తికర అంశమేమిటంటే అదనపు పరుగులు కేవలం ఒక్కటంబే ఒక్కటే ఇచ్చారు. సూపర్‌-8 లో భారత్‌ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 

వరుణ్‌సందేశ్ కొత్త సినిమా...

హైదరాబాద్:   ‘మేం వయసుకువచ్చాం’ చిత్రాన్ని అందించిన త్రినాథరావు నక్కిన,యువ హీరో వరుణ్‌సందేశ్ కలయికలో ఓ చిత్రం రాబోతోంది. గతంలో 4 చిత్రాలు నిర్మించిన ‘సుధా సినిమాస్’ అధినేత జె.సాంబశివరావు ఈ తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం విజయదశమినాడు మొదలవుతుందని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇద్దరమ్మాయిలు ఈ చిత్రంలో కథానాయికలుగా వుంటారని, వారి ఎంపిక త్వరలో జరుగుతుందని నిర్మాత చెబుతూ ‘సాయికార్తీక్’ సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రస్తుతం జరుగుతోందని తెలిపారు.

మళ్ళీ ‘దూకుడు’ కాంబినేషన్...!

హైదరాబాద్: ‘దూకుడు’  కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ సినిమా వచ్చి ఈ ఆదివారంతో  ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాతలు  రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఒక ప్రకటన చేస్తూ, మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ తో వచ్చే ఏడాది మరో భారీ చిత్రం మొదలుకానుందని తెలియజేశారు. శ్రీనువైట్ల అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారని, ఎన్టీఆర్‌తో ఆయన చేస్తున్న ‘బాద్‌షా’ చిత్రం పూర్తవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని  వారు చెప్పారు.14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదే సంస్థలో మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం వీరు ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణా ఊహాగానాల వేడిపై నీళ్ళు చల్లిన వాయలార్...

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: తెలంగాణపై అఖిల పక్ష  అభిప్రాయం తర్వాతే నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  వాయలార్ రవి  అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని చైనా పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చిన వయలార్ రవి  మీడియాకు తెలిపారు. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లోకి విలీనం అవుతున్నట్టు ప్రచారం ఎందుకు జరుగుతుందో తనకు తెలియదని, కెసిఆర్ ఇటీవల రెండు మూడు సార్లు తనను కలిశారని, ఈ సందర్భంగా ఆయన విలీన ప్రస్తావనేమీ తేలేదని  రవి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతం వారు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారని, సీమాంధ్రులు సమైక్యాంధ్ర ఉండాలంటున్నారని, ఇరు ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అఖిలపక్షంలో పార్టీల వైఖరి తెలుసుకోవాలని, ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. తమ పార్టీలో కూడా కొందరు తెలంగాణ కోరుతుండగా, మరికొందరు వద్దంటున్నారని వాయలార్ రవి చెప్పారు.

మళ్ళీ ఆర్టీసి వడ్డన...

 హైదరాబాద్, సెప్టెంబర్ 23: డీజిల్ ధరల పెంపు ను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) ఆర్టీసి ఛార్జీలను భారీగా పెంచింది.  పల్లె వెలుగు బస్సుల్లో 25 కి.మీ. వరకు రూ.1, 26 కి.మీ. నుండి 45 కి.మీ. వరకు రూ.2, 46  ఆ పైన  ప్రతి కిలోమీటరుకు రూ.5 పైసల చొప్పున పెంచింది. డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో కి.మీ.కు 12 పైసలు పెంచింది. సిటీ బస్సుల్లో ఇప్పటి వరకు కనీస ఛార్జ్ రెండు స్టేజీల వరకు రూ.4 ఉండగా ఇప్పుడు రూ.5 కు పెంచారు. పెంచిన ఛార్జీలను బట్టి హైదరాబాద్ నుండి ప్రధాన నగరాలైన విజయవాడకు రూ.262, విశాఖకు రూ.625, తిరుపతికి 565, వరంగల్‌కు రూ.137 గా సూపర్ లగ్జరీ ఛార్జీలు ఉండనున్నాయి.  గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర, వెన్నెలస్సుల ఛార్జీలు యథాతథంగా ఉంటాయని,  అయితే రద్దీని బట్టి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారని ఆర్టీసి తెలిపింది.  నెలవారీ సిటీ బస్ పాస్‌లపై రూ.100 మేరకు పెంచింది. అయితే విద్యార్థుల బస్‌ పాస్‌ ఛార్జీలు యథాతథంగా ఉంచారు.  డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసి పైన రూ.834 కోట్ల భారం పడిందని, కానీ తాము మాత్రం ప్రజలపై నామమాత్రం భారం మోపుతున్నామని ఆర్టీసి సగర్వంగా ప్రకటించింది. 

Saturday, September 22, 2012

అంత వీజీ కాదు-తెలంగాణపై సి.ఎం.

హైదరాబాద్,సెప్టెంబర్ 22:  తెలంగాణపై నిర్ణయం అంత సులభం కాదని,  అడిగితే కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తన అభిప్రాయం చెప్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.అన్నారు తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని, వివిధ దశల్లో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఎప్పటిలోగా తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందనేది చెప్పలేనని ఆయన  మీడియాతో అన్నారు. తెలంగాణ మార్చ్ ను వాయిదా వేయించేందుకు వివిధ ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. జీవవైవిధ్య సదస్సును, వినాయక నిమజ్జనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జీవవైవిధ్య సదస్సు దృష్ట్యా తెలంగాణ మార్చ్ ను వాయిదా వేసుకోవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వినాయక నిమజ్జనం కారణంగానే శానససభా సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్‌లో మరోసారి శాసనసభా సమావేశాలు ఉంటాయని ఆయన చెప్పారు. జీవవైవిధ్య సదస్సు సందర్భంగా 400 కోట్ల రూపాయలతో అక్వేరియం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వంద కోట్ల రూపాయలతో మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని ఆయన చెప్పారు.  విద్యుదుత్పత్తి పెంపునకు  చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. సగటున రోజుకు 258 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 181 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. లోటును అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులు 26 జీఓలపై రిటైర్డ్ జడ్డితో విచారణ జరిపించాలని కోరారని చెప్పారు. జీఓల జారీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదో అన్నది విచారించాలని అన్నారు. దానిని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.

Friday, September 21, 2012

కఠిన నిర్ణయాలపై జాతికి మన్మోహన్ సంజాయషీ...

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21:   దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, అందుకే ఆర్థిక సంస్కరణలు అవసరమయ్యాయని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. శుక్రవారం  రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతూ పోతున్నాయని,  ఆర్థికంగా ముందడుగు వేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు. తమ నిర్ణయాలలో హేతుబద్దత ఉందని చెప్పారు. డబ్బులు చెట్లకు కాయవని,  ఉపాధి కావాలంటే సంస్కరణలు తప్పనిసరి అని అన్నారు. సామాన్య ప్రజలపై భారం వేయాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పారు. సిలిండర్లపై పరిమితి విధించడం వల్ల పేదలపై భారం ఏమీ పడదన్నారు. దేశంలో చాలా మంది ఆరుకంటే తక్కువ సిలిండర్లే వాడుతున్నారని వివరించారు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంకలలోకంటే ఇక్కడ డీజిల్ ధర తక్కువే అని తెలిపారు. డీజిల్ ధర పెంచినా ఇంకా 17 రూపాయల సబ్సిడీ భరిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్కరణలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని భావిస్తున్నామన్నారు.

' చిరు' పదవే నా...?


 న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21:   యూపిఏ ప్రభుత్వం నుంచి  తృణమూల్ వైదొలగడంతో  కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ  సారి  మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు లేదా నలుగురు పార్లమెంటు సభ్యులను  కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఊహాగనాలు సాగుతున్నాయి.  ముఖ్యంగా  చిరంజీవికి ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అలాగే ఒకటో రెండో పదవులు తెలంగాణ ప్రాంత ఎంపీలకు ఇవ్వాలని కూడా  అధిష్టానం యోచిస్తోందని సమాచారం. అయితే ఇంతా చేసి చిరుకు దక్కేది  సహాయ మంత్రి పదవేనేమో  అనే పెదవి విరుపులూ వినిపిస్తున్నాయి. మరో వైపు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ ప్రాంత ఎంపీలు  మంత్రి పదవులకు ఒప్పుకుంటారా  అనేది ఇంకో  ప్రశ్న.  


హిందూ మాజీ ఎడిటర్ జి. కస్తూరి మృతి


చెన్నై, సెప్టెంబర్ 21:  ది హిందూ ఆంగ్ల దినపత్రిక మాజీ సంపాదకుడు జి. కస్తూరి (87) శుక్రవారం మృతి చెందారు. హిందూ పత్రికకు జి. కస్తూరి 1965 నుంచి 1991 వరకూ సంపాదకుడిగా సేవలు అందించారు. హిందూ పత్రిక అభివృద్ధితో పాటు, పత్రిక ఆధునీకరణలో  ఆయన కీలక పాత్ర పోషించారు.  జర్నలిజంలో మౌలిక విలువలను కాపాడుతూనే ఆయన ఈ సంస్కరణలు ప్రవేశ పెట్టారు.

స్వాతంత్ర్యయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి...

హైదరాబాద్, సెప్టెంబర్ 21:  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97)  హైదరాబాద్‌లోని తన స్వగృహలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్న బాపూజీకి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఆయన తెలంగాణ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి గ్రామంలో 1915లో సెప్టెంబర్‌ 27న జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్‌ ఇండియా, నాన్‌ముల్కీ ఉద్యమాలలో  కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో మంత్రిపదవినే వదులుకున్నారు. ఇటీవలే నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం కృషిచేశారు. 

 

తృణమూల్ మంత్రులు రాజీనామా

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 21:  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తూ రాసిన లేఖను  ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందచేశారు.  ప్రజావ్యతిరేక విధానాల వల్లే యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్నట్లు మమతా బెనర్జీ ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. యూపీఏ కూటమిలో తమదే పెద్దపార్టీ అని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయం పై తమని సంప్రదించలేదని తెలిపారు. మెజారిటీ  నిరూపించుకోవాలని  యూపీఏను తాము డిమాండ్ చేయడం లేదని పేర్కొన్నారు. తమ వ్యతిరేకత అంతా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపైనేనని ఆమె స్పష్టం చేశారు.  కాగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ మంత్రులు ఆరుగురు --ముకుల్ రాయ్‌,  సౌగత రాయ్, శిశిర్ అధికారి, మోహన్ జాతౌ, సుల్తాన్ అహ్మద్, సుదీప్ బందోపాధ్యాయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు  విడిగా తమ రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను మన్మోహన్ సింగ్  వెంటనే ఆమోదించారు. టిఎంసికి 19 మంది ఎంపీలు ఉండగా అందులో ఆరుగురు మంత్రులుగా ఉన్నారు. 
బెంగాల్ లో కాంగ్రెస్ కౌంటర్...
 ఇటు కేంద్రంలో టిఎంసి మద్దతు ఉపసంహరించుకోగానే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు  ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కాంగ్రెస్  నిర్ణయించింది.  మమతా బెనర్జీ మంత్రివర్గంలోని కాంగ్రెసు మంత్రులు శనివారం రాజీనామా చేసే అవకాశం ఉంది.   

Thursday, September 20, 2012

డీజిల్ ధర పెంపు, సబ్సిడీ వంట గ్యాస్ వినియోగంపై పరిమితులు, చిల్లర వర్తకంలోకి విదేశ పెట్టుబడులను నిరసిస్తూ ఎన్‌డీఏ, వామపక్షాలు గురువారం నిర్వైంచిన భారత్ బంద్ సందర్భంగా ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు...

Wednesday, September 19, 2012

పట్టాలపైకి తొలి సూపర్ ఫాస్ట్ ఏసీ డబుల్ డెక్కర్ రైలు...

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 19: దేశంలో తొలిసారిగా సూపర్ ఫాస్ట్ ఏసీ డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది. అహ్మదాబాద్-ముంబైల మధ్య నడిచే ఈ రైలును రైల్వేశాఖ సహాయమంత్రి భరత్‌సిన్హ్ సోలంకి కాలుపూర్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. 1,500 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. అహ్మదాబాద్ నుంచి ముంబై సెంట్రల్ (500 కి.మీ. దూరం) వెళ్లేందుకు 7 గంటల సమయం పడుతుంది. రైలులో ఆధునిక వసతులతోపాటు సౌకర్యంగా ప్రయాణించేందుకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నట్లు సోలంకి చెప్పారు. కుదుపులు లేకుండా ప్రయాణించేందుకు మెరుగైన పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు పశ్చిమ రైల్వే వివరించింది.

మమత పట్టు... కాంగ్రెస్ బెట్టు...

యూఢిల్లీ,సెప్టెంబర్ 19: కేంద్ర సర్కారుకు మద్దతు ఉపసంహరణకు సంబంధించి తమ వైఖరిలో మార్పులేదని.. తన డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించటానికి.. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ అనుమతిని ఉపసంహరించాలని, డీజిల్ ధర పెంపును రూ. 5 నుంచి రూ. 3 లేదా రూ. 4 కు తగ్గించాలని, సబ్సిడీపై వంటగ్యాస్ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 24కు పెంచాలని  తృణమూల్ షరతులు పెట్టింది. యూపీఏ సంకీర్ణంలో 19 మంది ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. తృణమూల్ నిర్ణయంతో సంక్షోభ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం పార్టీ కోర్ గ్రూప్ సమావేశంలో చర్చించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని, ఆర్థికమంత్రి చిదంబరం, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ కూడా పాల్గొన్నారు. డీజిల్ ధర, వంటగ్యాస్ సిలిండర్లకు సంబంధించిన నిర్ణయాలపై స్వల్పంగా మార్పులు చేయగల అవకాశం ఉంది కానీ.. ఎఫ్‌డీఐ నిర్ణయంపై వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆర్థికమంత్రి చిదంబరం బుధవారం మంత్రుల బృందం సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నామని,  అవి కొనసాగుతాయని  వ్యాఖ్యానించారు. తృణమూల్ మంత్రులు ఎవరైనా తమతో మాట్లాడాలనుకుంటే.. తాము ఎలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నామో వారికి వివరిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు.. ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేదీ లేదని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికాసోనీ ధీమా వ్యక్తం చేశారు. 











ఆఫ్ఘన్ పై భారత్ గెలుపు...

కొలంబో,సెప్టెంబర్ 19: టి20 ప్రపంచకప్లో   భారత్ తన తొలి మ్యాచ్‌లో  విజయం సాధించింది. బుధవారం జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్‌ను ఓడించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 159 పరుగులు చేయగా... అనంతరం అఫ్ఘాన్ 19.3 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ధాటిగా ఆడిన మొహమ్మద్ నబీ (17 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ (3/24) కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని నిలువరించాడు. బాలాజీ (3/19), అశ్విన్ (2/20) రాణించారు. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడుతుంది.

Tuesday, September 18, 2012

వాతాపి గణపతిం భజే...

వార్తాప్రపంచం వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు...

తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం...

తిరుపతి:,సెప్టెంబర్ 18:  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ఆరంభమైయ్యాయి. ధ్వజారోహణతో ఆరంభమైన బ్రహ్మోత్సావాలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో హాజరైన సీఎం కిరణ్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి రోజు వేడుకల్లో పాల్గొన్నారు.సాయంత్రం ఆలయ ధ్వజపఠం ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. రాత్రి శేష వాహనంతో మొదలై వరుసగా 26వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

యూపీఏతో తృణమూల్ కటీఫ్...

కోల్‌కతా,సెప్టెంబర్ 18: కేంద్రం లోని యూపీఏ నుంచి తృణమూల్  కాంగ్రెస్ పార్టీ వైదొలగింది. ఈ మేరకు పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాళ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. యూపీఏ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలు కారణంగా తాను పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు  తృణముల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.  మిత్రపక్షమైన తమను ఎప్పుడూ ప్రబుత్వం  సంప్రదించలేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు పెంచినప్పుడు కూడా తమను సంప్రదించకపోవటంపై మమతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ మంత్రులు శుక్రవారం రాజీనామా చేస్తారని మమత తెలిపారు.

ట్వంటీ 20 ప్రపంచకప్‌లో శ్రీలంక బోణీ...

హాంబన్‌టోటా,సెప్టెంబర్ 18:  ట్వంటీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్‌లో శ్రీలంక  జింబాంబ్వే పై 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అజంతా మెండిస్‌ ఆరు వికెట్లు, జీవన్ మెండిస్‌ మూడు వికెట్లు నేలకూల్చి శ్రీలంక కు  పరిపూర్ణమైన విజయాన్నందించారు.   శ్రీలంక నిర్దేశించిన  183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే ఆదిలోనే తడబడి వరుస వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది.

Monday, September 17, 2012

ప్రాక్టీస్ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం

కొలంబో,సెప్టెంబర్ 17:  ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన ట్వంటీ20 ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ జట్టుపై పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. తొలుత భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి  186 పరుగులు చేసింది. అక్మల్ 50 బంతులకు 6 సిక్సర్లు, 5 ఫోర్లతో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

తెలంగాణాపై స్పష్టత ఇచ్చే దిశగా కాంగ్రెస్ యోచన?

న్యూఢిల్లీ:  సెప్టెంబర్ 17: ఈ నెలఖారుకల్లా తెలంగాణాపై స్పష్టత ఇచ్చే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. తెలంగాణా అంశంపై ఈ నెల 21 తేదీన యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.   టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ ను కొన్ని రోజులు   ఢిల్లీలో ఉండాలని అధిష్టానం కోరినట్టు తెలిసింది.  ఈలోగా కేసీఆర్ మరోసారి వయలాల్ రవి, ఆజాద్‌లతో భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో  సోనియా గాంధీ సోమవారం సాయంత్రం అత్యవసరంగా జరిపిన  సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, ఆంటోనీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై గంటకు పైగా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వాయలార్ రవి చైనా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 22వ తేదీన కెసిఆర్‌తో చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణపై  ఈ నెల 21వ తేదీన యుపిఎ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీలోగా తెలంగాణ అంశాన్ని తేల్చేయడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. కెసిఆర్ ఈ నెల 5వ తేదీ నుంచి ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెసు పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి వాయలార్ రవితో ఆయన చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుకు వస్తే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి తాను సిద్ధమేనని ఆయన చెబుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఇవ్వకపోతే జరిగే నష్టం గురించి ఆయన కాంగ్రెసు పెద్దలకు వివరిస్తున్నట్లు సమాచారం. 

ఐఎస్‌ఎస్ కమాండర్‌గా సునీతా విలియమ్స్

హూస్టన్, సెప్టెంబర్ 17:  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కమాండర్‌గా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ బాధ్యతలు చేపట్టారు.  కమాండర్‌ గెన్నడీపదల్క నుంచి ఆమె ఈ బాధ్యతలను తీసుkunnaaru.  ఐఎస్‌ఎస్‌కు రెండో మహిళా కమాండర్‌గా ఎంపికవడం ద్వారా 46ఏళ్ల సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు. గతంలో 2007-08 కాలంలో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐఎస్‌ఎస్‌కు కమాండ్‌గా వ్యవహరించారు.

తొలి రోజే సాగని అసెంబ్లీ..

హైదరాబాద్,సెప్టెంబర్ 17:  శాసనసభ సమావేశాల తొలిరోజే వాయిదా పర్వాలతో సాగింది.  విపక్ష సభ్యుల నినాదాలు, వాయిదా తీర్మానం కోసం పట్టుపట్టడంతోఅసెంబ్లీ  దద్దరిల్లింది.  సభ ప్రారంభమైన తొలి అయిదు నిమిషాల్లోనే టీడీపీ, టీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దీంతో పట్టుమని పదినిమిషాలు కూడా సాగకుండగా గంటపాటు వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. టీఆర్ఎస్ సభ్యుల జై తెలంగాణ నినాదాలతో సభ రెండోసారి అరగంటపాటు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి విద్యుత్ సమస్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా సభ్యులు తమ పట్టువీడకపోవటంతో స్పీకర్ సభను  మంగళవారానికి వాయిదా వేశారు.
తెలంగాణ తీర్మానం సాధ్యం కాదు:  ముఖ్యమంత్రి
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో మోజార్టీ సభ్యులు సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలేనని అన్నారు. ఒకవేళ తీర్మానం చేసినా వీగిపోవటం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ,అప్పటివరకూ వేచి ఉండాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం భరించే స్థితిలో లేదని ఖరాఖండిగా చెప్పారు. సంవత్సరానికి కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు సరిపోతాయన్నారు. ఎగువ నుంచి నీరు వస్తేనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేది లేదని ముఖ్యమంత్రి తెలిపారు.

Saturday, September 15, 2012

సుత్తివేలు ఇకలేరు...

చెన్నై,సెప్టెంబర్ 16:  ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు (65) కన్నుమూశారు. ఇక్కడి తమ స్వగృహంలో ఆదివారం  తెల్లవారుజామున 3.30గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1947 ఆగస్టు 7న సుత్తివేలు జన్మించారు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు. 250కి పైగా చిత్రాలలో నటించిన సుత్తివేలు తొలి చిత్రం ముద్దమందారం. నాలుగుస్తంభాల ఆట సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.   ఆ చిత్ర విజయం తరువాత అందరూ ఆయనన్య్  సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు. జంద్యాల సినిమాల ద్వారా ఆయన హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందేమాతరం సినిమాకు ఆయనకు నంది అవార్డు లభించింది. ఆయన సినిమాలలోకి రాకముందు విశాఖ నావల్ డాక్ యార్డ్ లో పనిచేసేవారు.

ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ మృతి

 రాయ్‌పూర్ ,సెప్టెంబర్ 15:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 ఏళ్లు.  ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయన శనివారం ఉదయం 7 గంటలకు తుది శ్వాస విడిచారు.  1954 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్‌లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2000 - 2009 మధ్య ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్డియే ప్రభుత్వ హయాంలో ఆయన వాజ్‌పేయి, అద్వానీలకు కీలక సూచనలు చేశారు. 2009 మార్చి 31వ తేదీన ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 

సెమీ ఫైనల్లో సింధు ఓటమి

చాంగ్‌హో,సెప్టెంబర్ 15:  భారత బ్యాడ్మింటన్ వర్ధమాన క్రీడాకారిణి, తెలుగుతేజం పివి సింధు  చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో ఓటమి చెందారు. సెమీస్‌లో నాలుగో సీడ్ చైనా షట్లర్ జియాంగ్ చేతిలో 10-21, 21-14, 19-21 తేడాతో జియాంగ్ చేతిలో సింధు ఓడిపోయింది.  రపంచ నెంబర్ 24 సింధు ఒక్కర్తె ఈ టోర్నీలో భారతదేశం నుంచి పాల్గొంది. సైనా నెహ్వాల్ ఈ టోర్నమెంట్లో పాల్గొనలేదు. 

ఆంధ్రకు ' జైపాల"న ...! కిరణ్ ఢిల్లీకి.,!!

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 15:   కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా జైపాల్ రెడ్డిని నియమించాలని  కాంగ్రెసు అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టడంలో భాగంగా వారం లోపే ఈ మార్పులు జరగవచ్చంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ ను కూడా  కేంద్ర మంత్రివర్గంలోకి మార్చనున్నట్లు జాతీయ మీడియాకథనం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాయణ రాణేపేరు వినబడుతోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోనియా గాంధీ పలువురు నాయకులతో చర్చలు జరిపారు. శుక్రవారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్‌లతో చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ, మనీష్ తివారీలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు జోతిరాదిత్య, సచిన్ పైలట్‌లకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ మంత్రులు గులాం నబీ ఆజాద్, సుబోధ్ కాంత్ సహాయ్, జైశ్వాల్, బేణీ ప్రసాద్ వర్మ, వాయలార్ రవి, జైరాం రమేష్ వంటి సీనియర్లను పూర్తిగా పార్టీకి వాడుకోవాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు.   కాగా, తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వడమా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ప్రకటించడమా అనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. 
ఆంధ్రకు ' జైపాల"న ...!

Friday, September 14, 2012

డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ సిలెండర్లపై పరిమితి విధింపునకు నిరసనగా జరిగిన ప్రదర్శనలో చంద్రబాబు... 

చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్...సెమీఫైనల్ కు మన సింధు

ఛాంగ్ ఝౌ(చైనా),సెప్టెంబర్ 14:  చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు సెమీఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ లో లండన్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన లీ ఝూరీని ఓడించిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి 21-19, 9-21, 21-16 తేడాతో లీఝూరీపై  సంచలన విజయం సాధించి సెమీఫైనల్ కు చేరింది.

జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 14:  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది.సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ కాపీని ఇంకా పరిశీలించాల్సి ఉందన్న తదుపరి విచారణను  వాయిదా వేసింది. జగన్ మోహన్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణ్యం, అల్తాఫ్ వాదనలు వినిపించారు. రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ సీబీఐ ఆరోపణలు చేసిందని... తీరా ఛార్జ్ షీటుకు వచ్చేసరికి అంకెలన్నీ జారిపోతున్నాయన్నారు. జగన్ అరెస్టై ఇప్పటికే వంద రోజులకు పైగా జైల్లో ఉన్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ కు ముందు మూడు ఛార్జిషీట్లు దాఖలు చేశారని, అరెస్ట్ చేశాక సప్లిమెంటరీ వేస్తామని సీబీఐ చెప్పినా... ఇప్పటివరకూ సప్లిమెంటరీ వేయలేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. సప్లిమెంటరీ వేయటానికి సీబీఐ ఇంకా ఎన్నిరోజులు సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే జగన్ పై కుట్ర పన్నారని వారు వాదించారు.

Thursday, September 13, 2012

సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మృతి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:    సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కన్నుమూశారు. ఆయన ఎన్ హెచ్ ఆర్ సి తొలి చైర్మన్ గా పనిచేశారు. 1990 సెప్టెంబర్ నుంచి నాలుగేళ్లు   సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ గా  పనిచేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అల్త్ మస్ కబీర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అల్త్ మస్ కబీర్ నియమితులయ్యారు. ఎస్ హెచ్ కపాడియా స్థానంలో ఈనెల 29న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2005, మార్చి 1 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కబీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1948, జూలై 19న కోల్‌కతాలో జన్మించిన కబీర్ కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఆయన ఎల్‌ఎల్‌బీ, ఎమ్ఏ పూర్తి చేశారు. 1990, ఆగస్టు 6న కోల్‌కతా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

లీటరు రు. 5 పెరిగిన డీజిల్ ధర : సిలిండర్లపై సీలింగ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:  డీజిల్ ధరను కేంద్ర ప్రభుత్వం  లీటరు 5 రూపాయలు పెంచింది. అయితే పెట్రో ధరలు యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది. అయితే సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే సబ్సిడీపై ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 6 సిలిండర్లు తర్వాత అదనంగా తీసుకునే ప్రతి ఒక్క సిలిండర్ కు రూ.750 చెల్లించాల్సి వుంటుంది.

Wednesday, September 12, 2012

మూడు ముక్కలాట...!!

హైదరాబాద్, సెప్టెంబర్ 12:  రాష్ట్ర కాంగ్రెస్ లో మూడు ముక్కలాట సాగుతోంది. చిరంజీవి, బొత్స, కిరణ్ ఎవరికి వారే 'ముఖ్యమంత్రి ' పదవి కోసం ఎవరికి వారు సొంత ఎజెండాతో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి విషయానికి వస్తే ఆయన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకులను, ప్రస్తుత రాష్ట్ర నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని వ్యూహాత్మకంగా కలుపుకు పోతున్నట్లుగా కనిపిస్తోంది. సేవ్ కాంగ్రెసు పేరిట రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు కార్యక్రమానికి ముఖ్య నేతలు ఎవరూ హాజరు కాకపోయినప్పటికీ చిరంజీవి హాజరయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైన కొత్తలో బొత్స, చిరంజీవి భుజాలు భుజాలు  రాసుకు  తిరిగారు. అయితే ఆ తరువాత ! చిరు క్రమంగా ముఖ్యమంత్రి కిరణ్‌కు దగ్గరయినట్లుగా కనిపించారు.  ఇప్పుడు ఇద్దరికీ సమాన దూరం పాటిస్తూ.. వారి పని తీరుపై పార్టీ అధిష్టానానికి సైతం చిరంజీవి ఫిర్యాదులు చేసినట్టుగా చెబుతున్నారు. తాజగా  సేవ్ కాంగ్రెసు సదస్సులో చిరంజీవి స్వంత పార్టీ పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కాంగ్రెసు ఇల్లు భద్రంగా ఉంటుందని తాను భావించానని, కానీ ఈ భవనం బీటలు వారి, పైకప్పు చెల్లా చెదురై తనలో అభద్రతా భావం నెలకొల్పుతోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాఖ్యలకు బొత్స కూడా పరోక్షంగా ఘాటుసమాధానమిచ్చారు. కాంగ్రెసును పునాదులతో పెకిలిస్తామని ప్రకటించిన నాయకులు ఆ తర్వాత కనుమరుగై ఆ తర్వాత కాంగ్రెసులోనే విలీనమయ్యారని పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించే  బొత్స వ్యాఖ్యానించారు. దీనితో చిరంజీవి, బొత్స  మధ్య ఉన్న విభేదాలు  బహిర్గతం అయ్యాయి. ఇటు సి.ఎం. కిరణ్   వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందని అంటున్నారు.  మంత్రులతో చర్చించడంతో పాటు నేతలతో టచ్‌లో ఉంటున్నారట. అదే సమయంలో ప్రజల్లోకి కూడా వెడుతున్నారు. అటు బొత్స కూడా పార్టీ నేతలతో భేటీలు జరుపుతూ, జిల్లా పర్యటనలు చేస్తున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ లో కొడాలి నాని

హైదరాబాద్, సెప్టెంబర్ 12:  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు), టీడీపీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలగిన ఉప్పులేటి కల్పన, కాంగ్రెస్‌ను వీడిన కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, వీవీఆర్ హౌసింగ్ అధినేత వాకా వాసుదేవరావు తదితరులు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వీరందరికీ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు  కూడా వైఎస్సార్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. 

లోకేష్ రాజకీయ చిలకపలుకులు...

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్  రాజకీయ ఆరంగేట్రంపై చాలారోజులుగా తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ తొలిసారి రాజకీయాలపై స్పందించారు. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఓ కార్యక్రమానికి హాజరైన లోకేష్-- 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని అన్నారు.   తాను పార్టీలో సాధారణ కార్యకర్తలాగే కొనసాగుతానని చెప్పారు.తండ్రి,  చంద్రబాబు నాయుడు పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని ఢీకొట్టే సత్తా కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. బెదిరింపు రాజకీయాలకు టిడిపి భయపడదన్నారు. ఇతర పార్టీలు ప్రజారాజ్యం పార్టీలాగా కాంగ్రెసు పార్టీలో విలీనం కావాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. 

Tuesday, September 11, 2012

పరుగు తేడాతో ఓడిన భారత్

రీ ఎంట్రీలో రాణించిన  యువరాజ్   
చెన్నై,సెప్టెంబర్ 11:  చెన్నైలో జరిగిన ట్వంటీ 20 పోరులో ధోనీ సేన ఒకే ఒక పరుగుతో కివీస్ చేతిలో ఓటమి పాలైంది.  న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. విజయానికి 168 పరుగులు చేయాల్సి ఉండగా చివరలో వికెట్లను కోల్పోయి మ్యాచ్ ను జారవిడుచుకుంది. న్యూజిలాండ్ బ్యాట్శ్మెన్‌లో మెక్‌కుల్లం 67 బంతుల్లో 91 పరుగులు చేశాడు.  భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు తీయగా, జహీర్ ఖాన్, బాలాజీ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ గౌతం గంభీర్ వికెట్‌ను తొందరగా కోల్పోయింది. 12 బంతులకు 3 పరుగులు చేసి ఓపెనర్ గౌతం గంభీర్ అవుటయ్యాడు. టెస్టు మ్యాచుల్లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ ట్వంటీ20 మ్యాచులోనూ తాను తక్కువ కాదని నిరూపించుకున్నాడు. 67 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. యువరాజ్ సింగ్ తన రీ ఎంట్రీలో  26 బంతుల్లో 34 పరుగులు చేశాడు. యువీతో కలిసి ఆడిన కెప్టెన్ ధోనీ 23 బంతులలో  22 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. యువీ అవుట్‌ తోనే మ్యాచ్ కివీస్‌కు అనుకూలంగా మారిపోయింది. బౌలింగ్ కూడా చేసిన  యువీ  రెండు ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చాడు. కానీ వికెట్లుచిక్కలేదు.న్యూజిలాండ్ బౌలర్లలో మిల్స్, ఫ్రాంక్లిన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 
 

బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేకు యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌

న్యూయార్క్,సెప్టెంబర్ 11:  1936 తర్వాత యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ మరోసారి  బ్రిటన్కు లభించింది.  బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుని  తన కెరీర్‌లో తొలిసారి ‘గ్రాండ్‌స్లామ్ చాంపియన్’గా అవతరించాడు.  1936లో ఫ్రెడ్ పెర్రీ... యూఎస్ ఓపెన్ నెగ్గిన తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సాధించిన తొలి బ్రిటన్ క్రీడాకారుడిగా ముర్రే గుర్తింపు పొందాడు.  ఫైనల్లో నాలుగో సీడ్ ముర్రే 7-6 (12/10), 7-5, 2-6, 3-6, 6-2తో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పై గెలిచాడు. విజేతగా నిలిచిన ముర్రేకు 19 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 53 లక్షలు); రన్నరప్ జొకోవిచ్‌కు 9 లక్షల 50 వేల డాలర్లు (రూ. 5 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 4 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఈ అంతిమ సమరంలో చాలా ర్యాలీలు కనీసం 30 షాట్‌లకు తగ్గకుండా జరిగాయి. ఒక ర్యాలీ అయితే నమ్మశక్యంకానిరీతిలో 54 షాట్‌లపాటు జరిగింది.

Monday, September 10, 2012

ఏంటి తేల్చేది...? కె.సి.ఆర్. అలానే అంటారు..తెలంగాణాపై షిండే

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 10: సెప్టెంబర్ 30వ తేదీలోగా తెలంగాణ అంశం తేలుతుందని తనకు సంకేతాలు అందినట్లు కెసిఆర్ చేసిన ప్రకటనను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నీరు గార్చారు.  తెలంగాణ అంశాన్ని ఇప్పట్లో తేల్చలేమని ఆయన సోమవారం స్పష్టంగానే చెప్పేశారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో తాము చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా తేలుతుందని కెసిఆర్ అన్నారు కదా అని అంటే కెసిఆర్ అలాగే అంటారు, అలా కాకుండా మరోలా ఎలా అంటారని ఆయన అన్నారు. మరో రకంగా మాట్లాడే అవకాశం కెసిఆర్‌కు లేదని ఆయన అన్నారు. కెసిఆర్ ఇదిగో అదిగో అనే మాట్లాడుతారని ఆయన అన్నారు. తెలంగాణపై అవగాహనకు మరింత సమయం పడుతుందని ఆయన చెప్పారు. తాను ఈ మధ్యనే హోం మంత్రి బాధ్యతలు స్వీకరించానని ఆయన చెప్పారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఇప్పట్లో లేదని ఆయన అన్నారు. నెలలో తెలంగాణ వస్తుందని కెసిఆర్ ఎలా చెప్పారో తెలియదని, ఉద్యమ నాయకులు అలాగే చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణపై లోతుగా పరిశీలన చేయాల్సి ఉందని ఆయన అన్నారు. నక్సల్స్ సమస్యను ఆయన తెర మీదికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రం కాబట్టి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఛత్తీస్‌గడ్‌లో నక్సల్స్ సమస్య పెరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ చాలా కాలంగా పెండింగులో ఉన్న అంశమని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ కొలిక్కి వస్తుందని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్ విషయం హోం మంత్రిత్వ శాఖ దృష్టిలో ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు హోం మంత్రిత్వ శాఖకు తెలుసునని ఆయన అన్నారు.  మరోవైపు తెలంగాణపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా ఆదివారంనాడు చెప్పారు. 

యుఎస్ ఓపెన్ టెన్నిస్ విజేత సెరెనా విలియమ్స్

న్యూయార్క్,సెప్టెంబర్ 10:  సెరెనా విలియమ్స్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ విజేతగా నిలిచారు. హోరాహోరీ జరిగిన పోరులో బెలారుస్‌కు చెందిన విక్టోరియా అజరెంకాపై ఆమె విజయం సాధించారు. యుఎస్ టైటిల్‌ను గెలుచుకోవడం సెరెనాకు ఇది నాలుగోసారి. 1999, 2002, 2008ల్లో ఆమె యుఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకుంది.యుఎస్ ఓపెన్ టైటిల్ విజయంతో సెరెనా ఒకే ఏడాది వింబుల్డన్, ఒలింపిక్స్, అమెరికా ఓపెన్ గెలుచుకున్న తన సోదరి వీనస్, స్టెఫీ గ్రాఫ్ సరసన చేరింది. ఈ నెల 26న 31వ ఏట అడుగిడుతున్న సెరెనా ఇప్పటి వరకు 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. ఆమె ప్రస్తుతం నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది. 

Sunday, September 9, 2012

ఆదివారం తిరుమల సందర్శించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ మృతి

ఆనంద్(గుజరాత్),సెప్టెంబర్ 9:  క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ (91) కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతోఉన్న ఆయన నడియాడ్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి క్షీర విప్లవ పితామహుడిగా కురియన్ ఖ్యాతి కెక్కారు. గుజరాత్ పాల సహకార సంఘం మార్కెటింగ్ ఫెడరేషన్ స్థాపించి పాల ఉత్పత్తి రంగంలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. అమూల్ పాల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి కురియన్ చేసిన కృషి ఎంతో ఉంది. జాతీయ డైయిరీ బోర్డు చైర్మన్ గా ఆయన విశేష సేవలందించారు. 1999లో భారత ప్రభుత్వం కురియన్ ను పద్మవిభూషణ్ తో గౌరవించింది.

పీఎస్‌ఎల్‌వీ సీ-21 ప్రయోగం సక్సెస్...

శ్రీహరికోట,సెప్టెంబర్ 9:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ సీ21) ఉపగ్రహ వాహక నౌకద్వారా రెండు విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్‌థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం  ఉదయం 9.51 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ 21 ని విజయవంతంగా ప్రయోగించింది. 51 గంటలు కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం  పీఎస్‌ఎల్‌వీ సీ21 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్రాన్స్ కు చెందిన స్పాట్-6, జపాన్ కు చెందిన ప్రొయిటెరస్, మనదేశానికి చెందిన మినీరెడిన్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ21  విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ స్పాట్-6 ఉపగ్రహం 1.5 రిజల్యూషన్‌తో భూమిని చిత్రీకరించనుంది. ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం..  పీఎస్‌ఎల్వీ సీ-21 ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం కావడం విశేషం.  ఇస్రో 49 ఏళ్లలో 62 ఉపగ్రహాలను, 37 వాహన నౌకల ప్రయోగాలను చేపట్టింది.పీఎస్‌ఎల్వీ సీ-21 ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.ఇస్రో విజయం దేశానికి గర్వ కారణమని, మన శాస్త్రవేత్తలు మరో ప్రత్యేకత చాటుకున్నారని ప్రధాని మన్మోహన్  అన్నారు.

Saturday, September 8, 2012

డ్రీమ్ లైనర్ విమానం రెడీ

 న్యూఢిల్లీ,సెప్టెంబర్ 8: ఎయిరిండియా కొనుగోలు చేసిన భారీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ తొలి విమానం శనివారం సాయంత్రం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికాలోని సౌత్ కెరొలైనాలోని బోయింగ్ ఫ్యాక్టరీ నుంచి దీన్ని తీసుకొచ్చారు. ఈ భారీ విమానంలో 256 మంది ప్రయాణించవచ్చు. నాన్‌స్టాప్‌గా 15,000 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించగలదు. మిగతా వాటితో పోలిస్తే ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుంది. ముందుగా దీనిపై పైలట్లు, సిబ్బందికి శిక్షణనిచ్చిన తర్వాత సర్వీసులు ప్రారంభిస్తారు.ఆరేళ్ల క్రితం 27 విమానాలకు ఎయిరిండియా ఆర్డరిచ్చింది. మొదటి విడతగా కొన్ని విమానాలు 2008 సెప్టెంబర్‌లోనే రావాల్సి ఉండగా సాధ్యపడలేదు. దీనిపై బోయింగ్ కొంత మేర పరిహారాన్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో విమానాలను ఎయిరిండియా తీసుకుంటోంది.  కొన్ని వారాల్లోగా మరో రెండు డ్రీమ్‌లైనర్స్‌ను డెలివరీ తీసుకుంటుంది. మార్చి నాటికి మొత్తం ఎనిమిది విమానాలను బోయింగ్ అందజేస్తుంది.

వర్షం వల్ల భారత్-కివీస్‌ తొలి ట్వంటీ 20 మ్యాచ్ రద్దు

విశాఖపట్నం,సెప్టెంబర్ 8: భారత్-కివీస్‌ల మధ్య ఇక్కడి వైఎస్సార్ స్టేడియంలోశనివారం జరగాల్సిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన అభిమానులు నిరాశ చెందారు.  ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలిచి  ఊపు మీద ఉన్న భారత జట్టులోకి కేన్సర్ ట్రీట్‌మెంట్ అనంతరం యువరాజ్ తిరిగి చేరడంతో అభిమానులు ఈ మ్యాచ్ పై ఆసక్తిని కనబరిచారు. 

భారత్-పాక్‌ వీసా ఒప్పందం

 పాక్‌ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీతో ఎస్.ఎం. కృష్ణ   
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 8:  నూతన సరళీకృత వీసాల జారీ పై  భారత్-పాకిస్థాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందువల్ల రెండు దేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలకు మార్గం సుగమం అవుతుంది. మూడు రోజుల పాక్ పర్యటన కోసం ఇస్లామాబాద్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణతో కలిసి పాక్ అంతర్గతశాఖ మంత్రి రెహమాన్ మాలిక్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. 38 ఏళ్లుగా అమలులో ఉన్న పాత ఒప్పందం స్థానంలో దీన్ని కుదుర్చుకున్నారు. తాజా ఒప్పందంతో రెండు దేశాల ప్రజలు సులువుగా వీసా పొందవచ్చు. , పాక్‌ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ తో కూడా  ఎస్‌ఎం కృష్ణ,  సమావేశమయ్యారు.  పర్యటనలో భాగంగా కృష్ణ పాక్ ప్రధాని పర్వేజ్ అష్రాఫ్‌తో  భారత్-పాక్ సంబంధాలను మెరుగుపరచడంపై చర్చించారు. ఈ ఏడాది చివర్లోగా భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు పర్వేజ్ తెలిపారు. పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించే అంశాన్ని పరిశీలిస్తానని ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హామీ ఇచ్చారు. 

Friday, September 7, 2012

శీతాకాల పార్లమెంటును తుడిచి పెట్టేసిన బొగ్గు దుమారం...

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: :  బొగ్గు కుంభకోణం నేపథ్యంలో  గొడవలు, ప్రతిష్టంభన, వాయిదాలమయంగా సాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరికి ఆఖరి రోజు శుక్రవారం కూడా అదే గొడవ మధ్య    నిరవధికంగా వాయిదా పడ్డాయి. బొగ్గు గనుల కేటాయింపుల్లో ఖజానాకు రూ.1.86 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్న కాగ్ నివేదిక దుమారం రేపడం, ప్రధాని రాజీనామా డిమాండ్‌తో సభలను బీజేపీ రోజుల తరబడి స్తంభింపజేస్తూ వచ్చింది. శుక్రవారం కూడా ఉభయ సభల్లోనూ అదే తంతు కొనసాగింది.  రాజ్యసభలో చైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవేదన వ్యక్తం చేస్తూ, సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఏమాత్రం పని చేయని సమావేశాలుగా ఇవి గుర్తుండిపోతాయని అన్నారు. లోక్‌సభను  కూడా ప్రధాని రాజీనామా డిమాండ్‌తో బీజేపీ మరోసారి హోరెత్తించింది. దాంతో స్పీకర్ మీరాకుమార్ కనీసం సాంప్రదాయిక ముగింపు ప్రసంగం కూడా చేయలేకపోయారు! దీనిపై ఆమె తీవ్ర విచారం వెలిబుచ్చుతూ, వచ్చే సమావేశాలైనా సజావుగా సాగుతాయని ఆశాభావం వ్యక్తంచేస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. 15వ లోక్‌సభ కాలంలో అత్యధిక సభా సమయం వృథా అయిన సమావేశాల జాబితాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో స్థానంలో నిలిచాయి. 

ఒబామా 'ఉద్యోగ' హామీ

వాషింగ్టన్ ,సెప్టెంబర్ 7: డెమోక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థిగా బరాక్‌ ఒబామా నామినేషన్‌ స్వీకరించారు. తమకూ, రిపబ్లికన్ల విధానాలకు మధ్య ఉన్న తేడాలను ని అధ్యయనం చేసి ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. తనను మళ్ళీ గెలిపిస్తే ఆర్థిక వ్యవస్థను చక్కబెడతానని, విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీల వర్షం కురిపించారు.  పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ఒబామా తెలిపారు. అల్‌ఖైదా పూర్తిగా అంతమైపోవచ్చిందని, 2014 కల్లా ఆఫ్ఘనిస్థాన్‌లో తమ మిషన్‌ పూర్తవుతుందని ఒబామా చెప్పారు. నవంబర్‌ ఆరున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ఈటీవి సుమన్ కన్నుమూత..

హైదరాబాద్,సెప్టెంబర్ 7: ఈనాడు గ్రూప్‌ అధినేత రామోజీరావు రెండవ కుమారుడు, ఉషోదయా ఎంటర్‌ ప్రైజెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిహెచ్‌ సుమన్‌ అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 45 సంవత్సరాలు. సమన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1966 డిసెంబరులో జన్మించిన సుమన్‌ జర్నలిజంలో మాస్టర్స్  డిగ్రీ పొందారు. ఉషోదయా ఎంటర్‌ ప్రైజెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఈటీవీ టెలీ ఫిలింస్  లో నటించారు. కొన్ని మెగా సీరియల్స్ కు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.  

Thursday, September 6, 2012

వర్షాల వల్ల 48వేల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్,సెప్టెంబర్  6: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 48,690 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక సర్వేలో తేలిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎక్కువగా వరి పంట 39,915 ఎకరాల్లో, పత్తి 8,250 ఎకరాల్లో నీట మునిగిందని చెప్పారు. 235 ఎకరాల్లో మొక్కజొన్న, 290 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 25,262 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 12,560 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 3,012 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 4,357 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2,490 ఎకరాలు , నిజామాబాద్ జిల్లాలో 1,182 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 200 ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయన్నారు.
ప్రాజెక్టులకు జలకళ....
ఇలాఉండగా,  భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ధాటికి ప్రియదర్శిని జూరాల పూర్తిగా నిండింది. ఎగువనున్న ఆలమట్టి, నారాయణపూర్ నిండటంతో ప్రాజెక్టుకు ఏకంగా 1.53 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దాంతో 19 గేట్లను రెండు మీటర్ల దాకా ఎత్తి 1.85 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇటు  కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి వరద నీరు భారీగా వస్తోంది.   శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 7,500 క్యూసెక్కుల విడుదలకు రంగం సిద్ధమైంది. నాగార్జునసాగర్‌కు మాత్రం ఇప్పటికి 29,005 క్యూసెక్కులే వదిలారు. సాగర్ నీటిమట్టం 510.4 అడుగులకే పరిమితం అయింది. పూర్తి సామర్థ్యం 408 టీఎంసీ కాగా 132 టీఎంసీ మాత్రమే ఉంది. మరోవైపు గోదావరి  ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది.  ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి గోదావరి 44 అడుగుల నీటిమట్టంతో నిలకడగా ప్రవహిస్తోంది.  మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు నదిలోకి వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దా గోదారి పరవళ్లు తొక్కుతోంది. వరద 8,95,946 క్యూసెక్కులకు చేరింది. నీటిమట్టం 10.70 అడుగులకు చేరింది. కాగా, ప్రకాశం బ్యారేజీకి మూడు రోజులుగా వస్తున్న వరద గురువారం తగ్గుముఖం పట్టింది. 

తెలంగాణ పై స్పష్టత ఇస్తాం...బాబు

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 6:  తెలంగాణ అంశంపై బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.  బిసీ డిక్లరేషన్‌పై జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అవసరం లేదని, రాష్ట్ర రాజధాని హైదరాబాదు తెలంగాణలోనే ఉన్నందున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదని అద్వానీ అప్పట్లో అన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై బిజెపి నేతృత్వంలోని ఎన్డియే తన ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా చర్చించిందా అని ఆయన అడిగారు. ఎప్పుడైనా చర్చకు పెట్టారా, ఈ రోజు మాట మార్చడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారంపై కన్నా తెలంగాణను రాజకీయం చేయడం మీదనే దృష్టి పెడుతున్నారని ఆయన ఇతర రాజకీయ పార్టీలను విమర్శించారు. తాము తెలంగాణపై ఇచ్చిన లేఖ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉందని ఆయన చెప్పారు. తాము ఎప్పటికప్పుడు తెలంగాణపై మాట్లాడుతూనే ఉన్నామని, పార్టీ మహానాడులో కూడా చెప్పామని ఆయన అన్నారు.
తెలంగాణపై మరోసారి తప్పకుండా స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు. బిసి డిక్లరేషన్‌ను ప్రకటించామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చర్చించి స్పష్టమైన వైఖరి ప్రకటించామని, ఇప్పుడు తెలంగాణపై కూడా పార్టీలో చర్చించి స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ తరఫున ఏం చేయాలో అది చేస్తామని ఆయన చెప్పారు.

ఫీజు రీయింబర్సుమెంట్ పై విజయమ్మ దీక్ష

హైదరాబాద్ ,సెప్టెంబర్ 6:   విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్సుమెంట్ ను అమల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద  రెండు రోజుల దీక్ష ప్రారంభించారు. ఆమె దీక్షలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ నేతలు రెహ్మాన్, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద చదువులు... పేదల హక్కుగా భావించిన  వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని విజయమ్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితుల పేరుతో పేద విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎందుకు భారంగా భావిస్తోందో అర్థం కావటం లేదని విజయమ్మ అన్నారు. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు పై వైఎస్ జగన్ దీక్ష చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 
ముఖ్యమంత్రి విమర్శ...
 ఫీజు రీయింబర్సుమెంట్ పై  వైయస్ విజయమ్మ చేస్తున్న దీక్ష రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  విమర్శించారు.  ప్రభుత్వం 99 శాతం మంది విద్యార్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయమే ఫైనల్ అని, దీనిపై పునఃసమీక్షించేది లేదన్నారు. మేనేజ్‌మెంట్ కోటా భర్తీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలోని 550 ప్రయివేటు, 30 ప్రభుత్వ కళాశాలలతో ఎలాంటి సమస్య లేదని, కేవలం 85 కళాశాలలతోనే సమస్య ఉందన్నారు. అయినా వాటిపై కోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున బోధనా రుసుము లేదని, కాంగ్రెసు హయాంలోనే ఎక్కువ చెల్లిస్తున్నామన్నారు.

భారత ప్రధానిఫై వార్తాకథనం: సారీ చెప్పేందుకు వాషింగ్టన్ పోస్టు ' నో '..

వాషింగ్టన్,సెప్టెంబర్ 6:  భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వాన్ని తప్పు పడుతూ వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన వార్తాకథనం తీవ్ర దుమారం రేపుతోంది. తాము ఆ వార్తాకథనానికి కట్టుబడి ఉన్నామని, క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని వాషింగ్టన్ పోస్టు కరస్పాండెంట్ అన్నారు. ప్రధాని కార్యాలయం కమ్యూనికేషన్స్ సలహాదారు పంకజ్ పచౌరి చేసిన ఫిర్యాదుకు వాషింగ్టన్ పోస్టు ఇండియా బ్యూరో చీఫ్, వార్తాకథనం రచయిత సిమోనే డెన్యూర్ జవాబు ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ జర్నలిస్టుకు ఉందని, దాని గురించి తాము అభ్యంతరం చెప్పడం లేదని, అనైతికమైన, వృత్తిపరమైన ప్రవర్తన లోపాన్ని ఎత్తు చూపుతూ మాత్రమే ఈ లేఖ రాస్తున్నామని పచౌరి డెన్యూర్‌కు రాసిన లేఖలో అన్నారు. కేబినెట్ సహచరులు అవినీతి సొమ్ముతో జేబులు నింపుకుంటున్నా మౌనం వహిస్తున్న కారణంగా మన్మోహన్ ప్రతిష్ట మసకబారిందంటూ వాషింగ్టన్‌ పోస్ట్  కథనం రాయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. పీకల్లోతు అవి నీతిలో కూరుకుపోయిన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కారణంగా ప్రధాని మన్మోహన్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని తెలిపింది. బొగ్గు కుంభకోణం గురించి కూడా పత్రిక ప్రస్తావించింది.

Wednesday, September 5, 2012

హస్తినలో తెలంగాణా వేడి...

న్యూఢిల్లీ , సెప్టెంబర్ 5:  తెలంగాణ అంశం  దేశ రాజధాని  హస్తినను  వేడెక్కించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు యుపిఎ భాగస్వామ్య పక్షాలతో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు బిజెపి రాస్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హస్తినలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల దీక్షను బుధవారం విరమించారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ఎన్డియే అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి అగ్రనేతలు హామీ ఇచ్చారు. ఇక కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జెఎసి నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. వారు  కేంద్ర మంత్రి వాయలార్ రవిని,  హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకనట చేయకపోతే ఈ నెల 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్ తో తమ సత్తా చాటతామని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లాబీయింగ్ మొదలెట్టారు. అధిష్టానం పెద్దలతో సమావేశమై సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా ఒక ప్యాకేజీని ప్రకటించే విషయంపై కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
 

నటుడు రాజేంద్ర ప్రసాద్ కు అంజియో ప్రాస్టీ

హైదరాబాద్ , సెప్టెంబర్ 5:  ఛాతి నొప్పితో సోమవారం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రి లో చేరిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్  అంజియోప్రాస్టీ సర్జరీ అనంత్రం ఆస్పత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.  ఆయన  పూర్తిగా కోలుకున్నారని.. ఆయన ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. 

శివకాశీలో భారీ పేలుడు: 52 మంది మృతి

చెన్నై,సెప్టెంబర్ 5:  తమిళనాడులోని శివకాశీలో ఓం శివశక్తి ఫైర్ వర్క్స్ లో  బుధవారం సంభవించిన భారీ పేలుడు లో  52 మంది మృతి చెందగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. శివకాశీ బాణాసంచా తయారీకి పెట్టింది పేరు. ప్రమాదం జరిగిన ఈ ఫ్యాక్టరీ శివకాశీకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సదానందపురం వద్ద ఉంది. దీపావళి పండుగ వస్తున్న సందర్భంగా బాణాసంచా తయారీని ఎక్కువ మందితో, ఎక్కువ మోతాదులో చేపట్టడమే ప్రమాదానికి కారణం కావచ్చునని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో 45 గదులలో క్రాకర్స్ తయారి  చేస్తున్నారు.  భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని మొదట శివకాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని మధు రై ఆసుపత్రికి తరలించారు. 

Tuesday, September 4, 2012

                               ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు... 

కోల్ స్కాం పై రంగంలోకి దిగిన సి.బి.ఐ.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4:  బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం ఐదు కంపెనీలపై కేసులు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, వాస్తవాల వక్రీకరణ అభియోగాలు మోపింది. ఒక కేసులో కాంగ్రెస్ ఎంపీ విజయ్ దార్దా, ఆయన సోదరుడు, మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర దార్దాలను కూడా నిందితులుగా చేర్చింది.  కేసులు నమోదు చేసిన వెంటనే సీబీఐ దర్యాప్తు బృందాలు దేశవ్యాప్తంగా 11 నగరాల్లోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పాట్నా, ధన్‌బాద్, నాగ్‌పూర్, రాంచి, యావత్మాల్, భిలాయ్ నగరాల్లో పలు సంస్థల యాజమాన్యాల కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు చేపట్టాయి. 2006-09 సంవత్సరాల మధ్య బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై  ఐదు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు  ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు బొగ్గు గనుల కేటాయింపులు పొందిన ఐదు కంపెనీలు.. జేఎల్‌డీ యావత్మాల్ ఎనర్జీ లిమిటెడ్, జేఏఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్, నవ్‌భారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, విని ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్, వాటిలోని 20 మంది డెరైక్టర్లు, గుర్తు తెలియని అధికారులపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందని కాగ్ ఇచ్చిన నివేదికపై వివాదం చెలరేగి గత రెండు వారాలుగా పార్లమెంటు స్తంభించిన నేపథ్యంలో.. సీబీఐ కేసులు నమోదు చేసి సోదాలు నిర్వహించటం గమనార్హం. అయితే.. తాము కేసులు నమోదు చేయటానికి కాగ్ నివేదికకు సంబంధం లేదని సీబీఐ పేర్కొంది. కాగ్ సూచనల మేరకు బొగ్గు గనుల శాఖ అధికారులు సమాచారం ఇచ్చిన తర్వాత మూడు నెలల కిందట సీబీఐ అధికారులు ప్రాధమిక దర్యాప్తు నమోదు చేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లో బొగ్గు గనుల కేటాయింపులు పొందిన పలు సంస్థల పాత కార్యాలయాలను, క్షేత్రాలను కూడా సీబీఐ బృందాలు తనిఖీ చేశాయి. ఈ సంస్థలను కేవలం బొగ్గు గనుల కేటాయింపులు పొందటం కోసమే ఏర్పాటు చేశారని, కేటాయింపులు పొందిన తర్వాత అవే గనులను అధిక ధరకు వేరే సంస్థలకు సబ్ లీజుకు ఇచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. 2005లో గనుల కేటాయింపులు పొందిన కొన్ని సంస్థలు ఇంకా బొగ్గు తవ్వకాలు ప్రారంభించాల్సి ఉందని కూడా అధికార వర్గాలు తెలిపాయి.

Monday, September 3, 2012

సత్య సాయి అనుమానాస్పద వీలునామా...!

 అనంతపురం, సెప్టెంబర్ 3:  పుట్టపర్తి సత్యసాయి తన 44 ఏళ్ల వయసులోనే  రాసి  రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా చెబుతున్న వీలునామా బయట పడింది. సత్యసాయి ట్రస్టు కు  చెందిన సత్యజిత్ పేరిట విడుదల చేసిన ఓ ప్రకటన, దానితోపాటే విడుదల చేసిన సత్యసాయి డిక్లరేషన్ బట్టీ, సత్య సయి  తన స్థిర, చరాస్తులన్నీ భక్తులు ఇచ్చినవేనని, వాటిలో ఒక్క పైసా కూడా కుటుంబ సభ్యులకు చెందవని వీలునామలో పేర్కొన్నారని తెలుస్తోంది. తన ఆస్తులను సామాజిక, ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని, వాటిని కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారని చెబుతున్నారు.   1967 మార్చి 23న ముంబై లో ఈ వీలునామ  రిజిస్ట్రేషన్ అయింది.   అయితే, సత్యసాయి మరణించిన  రెండేళ్ల తర్వాత దీనిని బయట పెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. . అయితే, ఇటువంటి అనుమానాలు ముందే వస్తాయని ఊహించిన, సత్యజిత్ ఆ వీలునామాకు అప్పట్లో సాక్షిగా ఉన్న ఇందూలాల్ షాతో అటెస్టేషన్ చేయించారు. దానిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.   పదేళ్ల కిందటే సత్యసాయి ఈ డిక్లరేషన్‌ను తనకు ఇచ్చారని చెబుతున్న సత్యజిత్  2011 నవంబర్ 16వ తేదీనే ట్రస్టు సభ్యుడు ఇందూలాల్ షాతో కలిసి డిక్లరేషన్‌ను బయట పెట్టాలని భావించానని, కానీ, ఆ తర్వా త వాయిదా వేసుకున్నానని ప్రకటనలో వివరించారు. 

న్యూజిలాండ్ తో రెండు టెస్ట్ ల సిరీస్ భారత్ కైవసం

బెంగళూరు, సెప్టెంబర్ 3:   న్యూజిలాండ్ తో రెండు టెస్ట్ ల సిరీస్ ను భారత్  2-0 తో కైవసం చేసుకుంది బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండవ, ఆఖరి టెస్ట్  లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గంభీర్ 34, సెహ్వగ్ 38, పుజారా 48, సచిన్ 27, రైనా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరగా.. కోహ్లీ 51, ధోని 48 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ జట్టులో పటేల్ 3 వికెట్లు, సౌథీ, బోల్ట్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 248 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ జట్టు ముందు 262 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరిస్ అవార్డు దక్కింది. గతంలో అజారుద్దీన్ పేరిట ఈ రికార్డు  ఉంది. 

యు.ఎస్.లో మరో తెలుగబ్బాయి దుర్మరణం...

న్యూయార్క్, సెప్టెంబర్ 3:  అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పడపాటి రాజాచౌదరి ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి మృతి చెందాడు.. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన రాజా చౌదరి (25) న్యూయార్క్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో  పనిచేస్తున్నారు. ఆదివారం సహచర మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన రాజా ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి మృత్యువాతపడ్డారు. 

Sunday, September 2, 2012

విదేశీ పర్యాటకులకు సెల్‌ఫోన్ కనెక్షన్ల పై ఆంక్షలు...

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 2:  భారత్‌ను సందర్శించే విదేశీ పర్యాటకులకు మూడు నెలలకు మించి సెల్‌ఫోన్ కనెక్షన్లను మంజూరు చేయరాదని టెలికం సర్వీస్ ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సిమ్‌కార్డుల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈమేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల అమలులోకి వచ్చిన ఈ ఉత్వర్వుల ప్రకారం విదేశీయులు భారత్‌లో మొబైల్ కనెక్షన్లు పొందేందుకు పాస్‌పోర్టుతోపాటు చెల్లుబాటులో ఉన్న వీసా పత్రాలను సమర్పించాలి. కాలపరిమితి ముగిసిన వీసాలపై సెల్ కనెక్షన్లు మంజూరు చేయరాదని సర్వీస్ ప్రొవైడర్లను టెలికాంశాఖ ఆదేశించింది. ఒకవేళ వీసా గడువు ఎక్కువగా ఉన్నా విదేశీయులకు మూడు నెలల వ్యవధికి మించి కనెక్షన్లు ఇవ్వరాదని స్పష్టం చేసింది. 

నేడు మూడో వర్ధంతి...


Saturday, September 1, 2012

నిరాశా నిస్పృహలో రాయపాటి

గుంటూరు,సెప్టెంబర్ 1:  గుంటూరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబ శివ రవు తమ కాంగ్రెసు పార్టీ పై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెసు పార్టీని ఆ భగవంతుడే కాపాడాలని ఆయన అన్నారు. పార్టీ భవిష్యత్ పై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళనలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు తాను పనికి రానని, త్వరలో రాజకీయ సన్యాసం గురించి వెల్లడిస్తానని ఆయన చెప్పారు. 2014 వరకు ప్రభుత్వాన్ని నడిపించడానికి  కాంగ్రెసు పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చునని ఆయన అన్నారు. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలు చేసినా గుర్తింపు లభించడం లేదని రాయపాటి  చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తాజాగ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని ఆశించి భంగపడినట్లు భోగట్టా. స్వంత గుంటూరు జిల్లాలో కూడా ఆయనకు అనుకూలమైన పరిస్థితులు లేవని చెబుతారు. మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆధిపత్యం వల్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇరువురికి మధ్య బహిరంగ వాగ్యుద్ధం చెలరేగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...