Wednesday, May 28, 2014

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌కు అదనపు బాధ్యతలు

న్యూఢిల్లీ, మే 28 : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా ఉన్న నరసింహన్ జూన్ రెండు నుంచి తెలంగాణ రాష్ట్రానికి కూడా  గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉంటున్న కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ కొనసాగనున్నారు.

అభివృద్ధిలో బుల్లెట్‌లా దూసుకుపోతా....చంద్రబాబు

హైదరాబాద్, మే 28 : పోలవరం విషయంలో టీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తున్నదని,  అందరం కలిసి కేంద్రంపై పోరాడి అభివృద్ధి చేసుకుందామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. బుధవారం మహానాడులో ఆయన ప్రసంగిస్తూ... అభివృద్ధిలో బుల్లెట్‌లా దూసుకుపోతామని అన్నారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తల సహాయం కోసం ప్రత్యేక నిధి పెట్టాలన్న టీడీపీ యువనేత లోకేష్ నాయుడు సూచన బాగుందని, రూ. 20 కోట్లతో నిధిని ప్రారంభిస్తామని  చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఢిల్లీలో అనేక అవమానాలకు గురయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయమంటే తనను ఎగతాళి చేశారని, రెండు కళ్ల సిద్ధాంతమని ఎద్దేవా చేశారని ఆయన తెలిపారు. ఏపీ భవన్‌లో నిరాహార దీక్ష చేస్తుంటే కరెంట్ కట్ చేశారని, తెలంగాణ కావాలో... ఆంధ్రా కావాలో తేల్చుకోవాలంటూ చాలా మంది తనపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని ఒత్తిడిలు తీసుకువచ్చినా భయపడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కుట్ర పన్నిన పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందని  చంద్రబాబు వ్యాఖ్యానించారు.  సినీనటుడు, జనసేన అ«ధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి కూడా తెలుగుజాతి ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీలకు సహకరించారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో  కూడా పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలోనూ కేసులు ఎత్తివేతకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీని జాతీయ పార్టీగా తీసుకువస్తామని, వచ్చే ఎన్నికల్లో ఆరేడు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్

హైదరాబాద్, మే 28 : పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ బుధవారం సాయంత్రం జారీ అయ్యింది. దీనిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆర్డినెన్ప్ జారీకి మంగళవారం జరిగిన భేటీలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని చింతూరు, భద్రాచలం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్కంపాడు, పీఆర్ పురం మండలాలు సీమాంధ్రలో కలవనున్నాయి.
ఆర్డినెన్స్ పై  కేసీఆర్ గరం...తెలంగాణ బంద్‌కు పిలుపు
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఆంధ్రా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రం తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిందని కేసీఆర్ ఆరోపించారు.  దీనిపై న్యాయపోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే డిజైన్ మార్చి నిర్మాణం చేపట్టాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. పోలవరం దిగువ గ్రామాలు మునగకుండా ఎత్తును తగ్గించాలని తాము కోరుతున్నామని ఆయన అన్నారు.

Tuesday, May 27, 2014

ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం... మహానాడు లో చంద్రబాబు

హైదరాబాద్, మే 27:  సీమాంధ్రలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, అలాగే తెలంగాణాలో సామాజిక న్యాయాన్ని సాధించవలసిన అవసరం ఉన్నదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కష్టకాలంలో కష్టపడి పనిచేయాలని,  ప్రతికూల పరిస్థితులను ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా మార్చుకోవాలని  చంద్రబాబునాయుడు మంగళవారం  ప్రారంభమైన పార్టీ మహానాడు లో పిలుపు ఇచ్చారు.  ఈ 32 ఏళ్లలో అనేక దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి, మనం జాతీయ పార్టీగా మారుతున్నాం అంటూ ప్రతి ఒక్కరం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజలు మన మీద ఆశలు పెట్టుకున్నారు, రాష్ట్ర సమస్యల పరిష్కారంకోసం మనం రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు.  అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చుదిద్దుదాం, యువతకు మంచి భవితను ఇద్దాం, ఇదే ఇప్పుడు మన అందరి తక్షణ కర్తవ్యం అని చంద్రబాబు దిశానిర్దేశనం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఘన విజయాన్ని తెలుగు జాతికి అంకితం చేస్తున్నట్లు  చంద్రబాబునాయుడు తెలిపారు. 30 ఏళ్ల క్రితమే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేసింది టీడీపీనే అని ఆయన తెలిపారు.  ఢిల్లీలో పీవీకి స్మారకచిహ్నం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

నల్లధనం రప్పించడంపై పై మోడీ దృష్టి...ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటు

న్యూ ఢిల్లీ, మే 27: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని పట్టి పీడిస్తున్న నల్లధనాన్ని విదేశాలనుంచి రప్పించడానికి నడుం బిగించారు. మంగళవారంనాడు కేబినెట్  తొలి సమావేశంలోనే విదేశాలనుంచి నల్లధ నాన్ని తీసుకురావడానికి ఒక  ప్రత్యేక దర్యాప్తు సంస్థ - సిట్‌-ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎం బి షా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్  మీడియాకు వెల్లడించారు.  దీనికి వైస్ చైర్మన్ గా జస్టిస్ అర్జిత్ పసాయత్ ఉంటారని, ఈ కమిటీలో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి డైరెక్టర్, ఇంటలిజన్స్ బ్యూరో డైరెక్టర్, ఇంకా డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్, రా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌లు సభ్యులుగా ఉంటారని చెప్పారు.

Monday, May 26, 2014

ఢిల్లీ పల్లకి పై మోడీ...ఆశల ఊయలపై జాతి


న్యూ ఢిల్లీ, మే 26: భారత 15 వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారోత్సవం  సోమవారం సాయంత్రం దేశదేశాలనుంచి వచ్చిన ఆత్మీయ అతిథులమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా జరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నాలుగువేలమంది అతిథులు  ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణ  స్వీకారం చేయించారు. ఈశ్వర్ కీ శపథ్ లేతా హూం అంటూ మోదీ దేవునిపై ప్రమాణం చేశారు.
 మోడి తో పాటు 23 మంది క్యాబినెట్ మంత్రులు,  10 మంది స్వతంత్ర సహాయ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులు   ప్రమాణం చేశారు.  ఆంధ్రప్రదేశ్ నుంచి బి.జె.పి. నేత వెంకాయ్య నాయుడు, టి.డి.పి. నేత పి. అశోక గజపతి రాజులకు క్యబినెట్ మంత్రి పదవులు దక్కాయి. మహారాష్ట్రకు అధికంగా  ఆరు మంత్రి పదవులు దక్కాయి.
ప్రమాణ స్వీకారం చేసిన  క్యాబినెట్  మంత్రులు..
1.రాజ్ నాథ్- (ఉత్తరప్రదేశ్)
2. సుష్మా స్వరాజ్-(హర్యానా)
3.అరుణ్ జైట్లీ (ఢిల్లీ)
4.ఎం.వెంకయ్య నాయుడు(కర్ణాటక)
5.నితిన్ జైరాం గడ్కరీ(మహారాష్ట్ర)
6.సదానంద గౌడ(కర్నాటక)
7.ఉమాభారతి(ఉత్తరప్రదేశ్)
8.నజ్మా హెప్తుల్లా(ఉత్తరప్రదేశ్)
9.గోపీనాథ్ ముండే(మహారాష్ట్ర)
10.రాం విలాస్ పాశ్వాన్ (బీహార్)
11.కల్ రాజ్ మిశ్రా(ఉత్తరప్రదేశ్)
12.మేనకా గాంధీ(ఉత్తరప్రదేశ్)
13.అనంత కుమార్(కర్నాటక)
14.రవిశంకర్ ప్రసాద్ (బీహార్)
15.అశోక్ గజపతిరాజు(ఆంధ్రప్రదేశ్)
16.అనంత్ గీతె(మహారాష్ట్ర)
17.హర్ సిమ్రత్ కౌర్ బాదల్(పంజాబ్)
18.నరేంద్ర సింగ్ తోమార్(మధ్యప్రదేశ్)
19.జ్యూల్ ఓరమ్(సుందర్ ఘడ్)
20.రాధామోహన్ సింగ్( బీహార్)
21.తవర్ చంద్ గెహ్లాట్(రాజస్థాన్)
22.స్మృతీ ఇరానీ(గుజరాత్)
23.డాక్టర్ హర్ష వర్ధన్(ఢిల్లీ)
ప్రమాణ స్వీకారం చేసిన స్వతంత్ర సహాయ   మంత్రులు.
24.జనరల్ వీకే సింగ్(ఉత్తరప్రదేశ్)
25ఇంద్రజిత్ సింగ్( ఢిల్లీ)
26.సంతోష్ గ్యాంగ్ వర్ (బరేలి)
27.శ్రీపాద్ నాయక్ (గోవా)
28.ధర్మేంద్ర ప్రధాన్ (రాజ్యసభ)
29.శర్వానంద్ సొనోవాల్(అసోం)
30.ప్రకాష్ జవదేకర్ (రాజ్యసభ)
31.మనోజ్ సిన్హా(గాజీపూర్)
32.ఉపేంద్ర కుష్వాహ్(కరకట్)
33.సిపి రాధాకృష్ణన్(తమిళనాడు)
ప్రమాణ స్వీకారం చేసిన సహాయ  మంత్రులు.
34.కిరెణ్ రిజిజు(అరుణాచల్ ప్రదేశ్)
35.కిషన్ పాల్ గుజ్జర్(రాజస్థాన్)
36.సంజీవ్ కుమార్(ఉత్తరప్రదేశ్)
37.వాసవ మన్ఫుక్ భాయ్ ధనాజీభాయ్(గుజరాత్)
38.పీయూష్ జయప్రకాష్ గోయల్(రాజ్యసభ)
39.డాక్టర్ జితేంద్ర సింగ్(ఉదంపూర్)
40.నిర్మలా సీతారామన్(తమిళనాడు)
41.దాదారావ్ పటేల్
42.విష్ణుదేవ్ సాయి
43.సుదర్శన్ భగత్
44. నిహాల్ చంద్
45.గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర(కర్నాటక)


Wednesday, May 21, 2014

26న 14వ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం...

మంత్రులుగాబిజెపి, మిత్రపక్షాల నాయకులు....
 న్యూఢిల్లీ, మే 20: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ వచ్చే సోమవారం  26వ తేదీ  సాయంత్రం ఆరుగంటలకు రాష్టప్రతి భవన్ ఆరుబైట దాదాపు నాలుగు వేల మంది ఆహ్వానితుల సమక్షంలో భారత దేశం పధ్నాలుగో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలో మొదటిసారి కాంగ్రేసేతర, వెనుకబడిన కులాల నాయకుడు పూర్తి బలంతో ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్నికైన వెంటనే రాష్టప్రతి భవన్‌కు వెళ్లి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్న మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తరువాత బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎల్‌జెపి నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్, శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే తదితర మిత్రపక్షాల నాయకులు ప్రణబ్ ముఖర్జీని కలిసి మోదీని సమర్థిస్తుట్లు లేఖలు అందజేశారు.కాగా, నరేంద్ర మోదీతో పాటు మరికొందరు బిజెపి, మిత్రపక్షాల నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మొట్టమొదట ఎంత మందిని మోదీ తన మంత్రివర్గంలో చేర్చుకుంటారనేది ఇంకా స్పష్టం కాలేదు. మొదట చిన్న మంత్రివర్గంతో పని ప్రారంభించి దశల వారీగా మంత్రుల సంఖ్య పెంచుతారా? లేక మొదట ఒకేసారే పెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతారా? అనేది చర్చనీయాంశంగా తయారైంది. రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జేట్లి, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషి లాంటి సీనియర్ నాయకులతోపాటు మిత్రపక్షాల నుంచి కొందరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి.

బీహార్ సుఖాంతం...కొత్త సి.ఎం. గా నితీశ్ జిగ్రీ దోస్తే..

పాట్నా, మే 20: నితీష్ కుమార్ రాజీనామా అనంతరం బీహార్  రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా జితన్‌రామ్ మాంఝి(68) మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు 17మంది మంత్రులతో గవర్నర్ డి.వై.పాటిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. మాంఝి.. నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ సందర్భంగా మాంఝి మాట్లాడుతూ.. నితీశ్ ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేయడమే తన ప్రథమ ప్రాధాన్యమన్నారు. 23న జరిగే విశ్వాస పరీక్ష అనంతరం కేబినెట్‌ను విస్తరిస్తానని చెప్పారు.  అంతకుమందు జేడీయూ ప్రభుత్వానికి భేషరతు మద్దతును కొనసాగిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఓ లేఖను అందజేశారు. దీంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి జేడీయూ కూటమి సభ్యుల సంఖ్య 124కు చేరింది. గత ఏడాది బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి జేడీయూకి కాంగ్రెస్ మద్దతిస్తోంది. మరోవైపు... ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 88కి పడిపోయింది.

జాతి సేవలో తరిస్తా...నరేంద్రమోడీ

న్యూఢిల్లీ, మే 20 : బలహీనవర్గాల సంక్షేమం కోసమే తమ  ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల కలలు నిజం చేయడమే మన అందరి స్వప్నం అని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం  బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం మోదీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 13న ప్రధాని అభ్యర్థిగా తనను ఎన్నుకున్నారని, సెప్టెంబర్ 15 నుంచి తాను పని చేయడం ప్రారంభించానని , ఆ రోజు నుంచి అణువణువు...క్షణక్షణం ఆ బాధ్యత నెరవేర్చేందుకు పనిచేశానని గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తలా జీవించడానికే ప్రాధాన్యమిచ్చానన్నారు. పేదవాడు ఈ స్థాయికి ఎదగడం భారత రాజ్యంగం గొప్పతనమని మోదీ అన్నారు.

భారతదేశమే తన తల్లి అని...తన తల్లికి సేవచేసే భాగ్యం కలగడం అదృష్టమని మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ కూడా తన తల్లి లాంటిదే అని ఆయన అన్నారు.  ఆశావాదులే దేశాన్ని ముందుకు నడిపించగలరని నిరాశావాదులు దేశాన్ని ముందుకు నడిపించలేరన్నారు. 125 కోట్ల జనాభా ఒక్క అడుగు ముందుకేస్తే భారతదేశం 125 అడుగులు ముందుకెళ్తుందని మోదీ కరతాల ధ్వనుల మధ్య ఉద్విగ్నంగా ప్రకటించారు. సమర్థులైన తన సహచరులు....అనుభవజ్ఞులైన సీనియర్ల అండదండలతో తన బాధ్యతలు సమర్థంగా నెరవేరుస్తానని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2019లో మళ్లీ తన రిపోర్టు కార్డుతో అందరి ముందుకొస్తానని ఆయన తెలిపారు.

Friday, May 16, 2014

విభజిత రాష్ట్రాలకు వీర సి.ఎం.లు...

సీమాంధ్ర చంద్రుడు....

తెలంగాణా చంద్రుడు... 

స్వతంత్ర భారతావని చరిత్రలో కొత్త అధ్యాయం... మోడీ సునామీలో మట్టి కరచిన కాంగ్రెస్

న్యూఢిల్లీ, మే 16:  స్వతంత్ర భారతావని చరిత్రలో భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యాయ్యాన్ని ఆవిష్కరించింది. సార్వత్రిక ఎన్నికలలో ఎవ్వరి సాయం లేకుండానే, తనంతట తానుగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పార్టీగా  భారతీయ జనతా పార్టీ రికార్డు నెలకొల్పింది. గతంలో ఎప్పుడైనా ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే తనంతట తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో మెజారిటీ సాధించగలిగింది. ఒక కాంగ్రెసేతర పార్టీ  తొలిసారిగా ఇంత మెజారిటీ సాధించడం ఇదే మొదటి సారి. నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రకటించిన అనంతరమే ఇది సాధ్యమైందని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేనంతటి దుస్థితిని కాంగ్రెస్ పార్టీ, దాన్ని నమ్ముకున్న పార్టీలు ఈ ఎన్నికలలో మూటగట్టుకున్నాయి.  నరేంద్ర మోదీని  తమ నాయకునిగా ఎన్నుకోవడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ శనివారం సమావేశం అవుతోంది. అనంతరం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించవలసిందిగా కోరతారు.  భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించిన దేశ ప్రజలకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో ఇన్ని ఎన్నికలు జరిగినా, ఒక అభ్యర్థికి ఐదు లక్షల 75 వేల మెజారిటీ రావడం ఇదే మొదటిసారి అని, ఆ రికార్డు సృష్టించిన వడోదర ఓటర్లకు ఇదే తమ కృతజ్ఞతాభివందనలు అని ఆయన అన్నారు.   దేశ భవిష్యత్తుకోసం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు.

Thursday, May 15, 2014

ప్రాదేశిక ఫలితాలు...సీమాంధ్ర లో టీడీపీ హవా...తెలంగాణాలో కారు జోరు

హైదరాబాద్,మే 14: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 653 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ... టీడీపీ -373 ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - 275 , కాంగ్రెస్ -2 స్థానాలు, ఇతరులు - 3 స్థానాలు గెలుచుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 10,092 ఎంపీటీసీ స్థానాలకు గాను 10,081 స్థానాల్లో కౌంటింగ్ పూర్తి కాగా, టీడీపీ - 5,216 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - 4,199 , కాంగ్రెస్‌-  172, సీపీఐ - 24, సీపీఎం -14, బీజేపీ -13, బీఎస్‌పీ - 2, ఇతరులు -431 స్థానాలు గెలుచుకున్నారు.
తెలంగాణ
తెలంగాణ లో తెలంగాణలో మొత్తం 440 జెడ్పీటీసీ స్థానాలకు గాను- టీఆర్ఎస్-191, కాంగ్రెస్ -176, టీడీపీ 53, వైఎస్ఆర్ సీపీ- 6, బీజేపీ - 4, సీపీఎం 2, సీపీఐ 2, ఇతరులు 6  స్థానాలు గెలుచుకున్నారు. అలాగే
తెలంగాణలో మొత్తం 6,467ఎంపీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ 2351, టీఆర్‌ఎస్ 1868, బీజేపీ 275, వైఎస్ఆర్ సీపీ - 121, సి.పి. ఎం - 145, సీపీఐ 80.., బీఎస్‌పీ 28, ఇతరులు 545. లోక్‌సత్తా 1 స్థానాలు గెలుచుకున్నారు. 
రీపోలింగ్
నిజామాబాద్ జిల్లా, బండపల్లి, మైలారం స్థానాల ఏకగ్రీవంపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహిస్తామని రాస్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత్‌రెడ్డి  చెప్పారు. కోర్టు ఆదేశం మేరకు కొల్లాపూర్ జడ్పీటీసీకి ఈనెల 18న రీ పోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా తూర్పు ఎర్రబెల్లిలో చెదలు పట్టిన బ్యాలట్‌లకు రీపోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే తెనాలిలో రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా

హైదరాబాద్, మే 15 : ఈ ఏడాది పదో తరగతి పరీక్షా  ఫలితాల్లో 88.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో 96.26 శాతం ఉత్తీర్ణతతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అలాగే రెండో స్థానంలో కడప, మూడో స్థానంలో వరంగల్ నిలిచాయి. ఈ సారి కూడా బాలిక ల హవా కొనసాగింది. బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 87.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,784 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 16 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. 10 రోజుల్లో టెన్త్ మార్కుల జాబితా ఆయా పాఠశాలలకు పంపనున్నట్లు వారు తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యూషన్‌లకు ఈనెల 30  చివరి తేదీ.  

Monday, May 12, 2014

మున్సిపల్ ఎన్నికలు ....సీమాంధ్రలో సైకిల్ తడాఖా... తెలంగాణలో పరువు నిలుపుకున్న కాంగ్రెసు...


హైదరాబాద్, మే 12 :  సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతంగా భావిస్తున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశం   , తెలంగాణలో కాంగ్రెసు  పార్టీలు సత్తా చాటుకున్నాయి.   తెలంగాణలో 53 మున్సిపల్ స్థానాలకు గానూ కాంగ్రెస్ 23, టీడీడీ, బీజేపీ కూటమికి 11, టీఆర్ఎస్‌కు 9, లభించగా ఇతరులు 9, ఎంఐఎం 1 సీట్లు గెలుపొందాయి. సీమాంధ్రలో 92 మున్సిపల్ స్థానాలకు గానూ తెలుగుదేశం పార్టీ 65 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ 20, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు.  రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సీమాంధ్ర ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి గెలుపు చారిత్రాత్మకమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  చంద్రబాబు నాయుడు  అన్నారు. అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. సీమాంధ్ర ప్రజలు తమ ఓటు ద్వారా అవినీతికి గుణపాఠం చెప్పారని, అభివృద్ధికి పట్టం గట్టారని చంద్రబాబు అన్నారు.

Tuesday, May 6, 2014

అమేథి లో రాహుల్ ప్రత్యర్థి స్మృతి ఇరానీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న మోడీ....

తుది దశకు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఘట్టం ....సీమాంధ్ర లో పోలింగ్ కు సర్వం సిద్ధం...

 న్యూఢిల్లీ, మే 6 : లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంటొంది. మొత్తం 9 దశలలో ఇప్పటి వరకు 7 దశల్లో 438 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, 64 లోక్‌సభ స్థానాలకు 8వ దశ  పోలింగ్ బుధవారంజరగనుంది.ర్తయింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీమాంధ్రలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు ఉత్తరప్రదేశ్(15), బీహార్(7), హిమాచల్ ప్రదేశ్(4), జమ్ము కశ్మీర్(2), ఉత్తరాఖండ్(5), పశ్చిమ బెంగాల్(6) లలో బుధవారం 8వ దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఇక 9వ , ఆఖరి విడత ఎన్నికలు ఈ నెల 12న జరుగుతాయి. మొత్తం 9 దశల వోట్ల లెక్కింపు 16న చేపడతారు.

సబ్బం హరికి బాబు సబ్బు రాశాడా...!

విశాఖ లోక్‌సభ పోటీ నుంచి చివరి క్షణంలో
తప్పుకున్న జై సమైక్యాంధ్ర  అభ్యర్థి సబ్బం  హరి... 
విశాఖపట్నం, మే 6 : విశాఖ లోక్‌సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జై సమైక్యాంధ్ర పార్టీ నేత సబ్బంహరి ప్రకటించారు. టీడీపీ-బీజేపీ కూటమికే తన మద్దతని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి గెలవాలని సబ్బంహరి ఆకాంక్షించారు. రాష్ట్ర సమైక్యత కోసం తీవ్రంగా ప్రయత్నించామని సబ్బం తెలిపారు. సమైక్యత కోసం సుప్రీంలో చివరి వరకు పోరాటం చేశామని, అయితే విభజన ఆగదని  సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో తేలిపోయిందన్నారు.  తన నిర్ణయంతో జై సమైక్యాంధ్ర పార్టీ కి సంబంధం లేదని ఆయన వివరించారు. తనకు రహస్య ఏజెండాలు ఏమీ లేవని సబ్బం తేల్చిచెప్పారు. విశాఖలో విజయలక్ష్మిని పోటీలో నిలపడం వెనుక కుట్ర ఉందని, విశాఖ వనరులను కొల్లగొట్టడమే జగన్ ఉద్దేశమని ఆయన ఆరోపించారు. కాగా ఎలాగైనా అధిలారం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు చివరి క్షణంలో  పోటీ నుంచి తప్పుకునేలా సబ్బం హరిని మేనేజ్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...