Saturday, January 30, 2010

టైటిల్ నిలబెట్టుకున్న సెరెనా


మెల్ బోర్న్, జనవరి 30: డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియంస్ ఆ స్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్ ను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్స్ లో ఆమె మాజీ చాంపియన్ జస్టిన్ హెనిన్ పై 6-4, 3-6, 6-2 తో గెలిచింది. సెరెనా కు ఇది 12వ గ్రాండ్ శ్లాం టైటిల్. కాగా ఆమె ఆ స్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలవడం ఇది 5వ సారి.

పడవ ప్రమాదంలో 11 మంది దుర్మరణం

హైదరాబాద్, జనవరి 30: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపు తిప్ప వద్ద శనివారం నాడు గోదావరి పాయలో నాటు పడవ బోల్తా పడిన దుర్ఘటన లో 11 మంది మ్రుతదేహాలు వెలికి తీశారు. గల్లంతైన మరో 14 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మాఘ పౌర్ణిమ సందర్భంగా దాదాపు 60 మంది అంతర్వేది వెడుతుండగా అధిక బరువు వల్ల పడవ బోల్తా పడింది. దాదాపు 35 మందిని స్థానికులు రక్షించారు. మ్రుతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం ప్రకటించింది.

ఒక్క రాజీనామాయే వుంది: స్పీకర్


హైదరాబాద్,జనవరి 30: శాసన సభ్య్తుల రాజీనామాలపై సస్పెన్స్ కు స్పీకర్ కిరణ్ కుమా ర్ రెడ్డి తెర దించారు. తమకు 222 రాజీనామాలు అందగా నిభంధనలకు విరుద్ధంగా వున్న 129 రాజీనామాలను తిరస్కరించానని, మరో 92 మంది తమ రాజీనామాలను వుప సం హ రించుకున్నారని స్పీకర్ తెలిపారు. తమ వద్ద మరొక్క రాజీనామా మాత్రమే వుందని, సదరు సభ్యుని పిలిపించి మాట్లాడతానని ఆయన చెప్పారు. ఐతే ఆ సభ్యుని పేరు వెల్లడించడానికి కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. సభ్యులు భావో ద్వేగాలతో రాజీనామాలు చేసినందున నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకొవడం లో ఆలస్యం జరిగిందని స్పీకర్ చెప్పారు.

ఫిభ్రవరి 15 నుంచి అసెంబ్లీ


హైదరాబాద్,జనవరి 30: వచ్చే నెల (ఫిబ్రవరి) 15వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 20న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షతన సచివాలయంలో శనివారం ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి పిఆర్సీని అమలు చేసేందుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. రెండో విడతగా తొమ్మిది జిల్లాల్లో కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. నల్సార్ విశ్వవిద్యాలయంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు 2006లో పెంచిన యుజిసి స్కేలు మేరకు జీతాలు చెల్లించాలని తీర్మానించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 21 పాలిటెక్నిక్ కళాశాలలకు 20 కోట్ల రూపాయల వ్యయంతో పక్కా భవనాలు నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది. చేనేత కర్మికులకు పావలా సబ్సిడీ పరిమితి ని 15000 రూపాయల నుంచి 100000 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది.

Friday, January 29, 2010

రంగుల మాయాబజార్ కు పన్ను మినహాయింపు

హైదరాబాద్,జనవరి 29: శనివారం నాడు విడుదల అవుతున్న రంగుల మాయాబజార్ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ప్రకటించింది. తొలి విడుదల నుంచి ఏడాది పాటు ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. సాంకేతిక విలువలు అంతగా లేని రోజుల్లోనే ‘మాయాబజార్’ చిత్రాన్ని ఓ అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దిన ఘనత చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి, నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణిలకు దక్కుతుంది. 1957లో నిర్మించిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ఇప్పుడు గోల్ట్ స్టోన్ టెక్నాలజీ సంస్థ రంగుల్లోకి మార్చింది. సూపర్ గుడ్ ఫిలింస్ ఈనెల 30న ఆంధ్రదేశమంతటా ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.

చానెల్ కొంటున్న లోకేష్?

హైదరాబాద్,జనవరి 29: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ లోకేష్ ఒక ఛానల్ కు అధిపతి అవుతున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యుఎస్ లోని స్ఠాన్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబిఎ అభ్యసించి 2009 ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చేసారు. ఇక్కడ తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే లోకేష్ కు మీడియా వ్యవహారాలపై ఆసక్తి ఉండటంతో అటు వైపుగా కొద్ది రోజులుగా ఆలోచనలు సాగిస్తున్నారు. తన బంధువులకు చెందిన నార్ని గ్రూప్ నకు చెందిన స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ కొద్దిరోజులుగా ప్రసారాలు సాగిస్తోంది. ఈ ఛానల్ అధినేత నార్నే శ్రీనివాస్ తన తండ్రి చంద్రబాబుకు స్వయానా మేన కొడలికి భర్త. దీంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వంతో ఆ ఛానల్ ను కొనుగోలు చేసి సారథ్యం వహించేందుకు లోకేష్ రంగం సిద్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 40 కోట్ల రూపాయులు చెల్లించి ఆ ఛానల్ ను లోకేష్ తన వశం చేసుకోనున్నట్టు భోగట్టా. అంతేగాక లోకేష్ యుఎస్ లో చదువుతున్న సమయంలో అక్కడ తన మిత్రుడొక్రిని ఆ ఛానల్ కు సీఈఓ గా నియామకం చేసినట్లు తెలిసింది. అలాగే ఛానల్ పేరుతో పాటుగా, రూపురేఖలు మార్చి మంచి రేటింగ్ తేవాలన్న సంకల్పంతో లోకేష్ ఉన్నట్లు సమాచారం. లోకేష్ ఛానల్ ను కొనుగోలు చేసారన్న అంశంపై స్టూడియో ఎన్ అధినేత నార్నే శ్రీనివాస్ కొట్టిపారేయలేదు. లోకేష్ చానల్ పట్ల ఆసక్తిగా ఉన్న మాట నిజమేనని, అయితే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. లోకేష్ మిత్రుడు అభీష్త్ సిఈఓ గా బాధ్యతలు చేపట్టడం కూడా వాస్తవేమేనని ఆయన ధృవీకరించారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నార్నే శ్రీనివాస్ కూతుర్నే జూనియర్ ఎంటీఆర్ పెళ్ళి చేసుకోబోతుండడం కొసమెరుపు.

వారం పాటు తెలంగాణా జె.ఎ.సి. అందోళనా కార్యక్రమాలు

హైదరాబాద్,జనవరి 29: తెలంగాణా పై రాజీనామాలు చేయడానికి ఫిభ్రవరి 7వ తేదీ వరకు గడువు పొడిగించిన జె.ఎ.సి. ఈ వారం పాటూ అందోళనా కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. ఫిభ్రవరి 1: కలెక్టరేట్ల వద్ద ధర్నా, 2వ తేదీ: అసెంబ్లీ ఎదుట తెలంగాణా ఎమ్మెల్యేల రిలే నిరాహార దీక్షలు. 3వ తేదీ: ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు మానవహారం 4వ తేదీ: రాజీవ్ రహదారి పై వంటా వార్పూ 5వ తేదీ: కోదాడ రహదారిపై మానవహారం 6వ తేదీ: ఆదిలాబాద్ లో ప్రజాప్రతినిధుల సదస్సు. 7వ తేదీ: వరంగల్లు కాకతీయ విశ్వ విద్యాలయం విధ్యార్ధుల ఘర్జన కు మద్దతు.

మార్చ్ 10 నుంచి ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్,జనవరి 29: మార్చ్ రెండవ తేదీ నుంచి జరగవసిన ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వారం పాటు వాయిదా వేసింది. దీని ప్రకారం ఈ పరీక్షలు మార్చ్ 10 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరుగుతాయి. అయితే ప్రాక్టికల్స్ తేదీలలో ఎలాంటి మార్పు వుండదు. ఎన్విరాన్మెంట్ పరీక్ష తేదీలో కూడా మార్పు లేదు. కాగా 10వ తరగతి పరీక్షలు కూడా ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.

Thursday, January 28, 2010

పాటల వేటూరికి 75వ బర్త్ డే


కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి సుందర రామ్మూర్తి కొన్ని వేల పాటలను రాసారు. మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయే పాటలను రాసారు.సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు. “పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” “ఉఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు” ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...' అనే పాటకి రెండవ జాతీయ పురస్కారం 1994వ సంవత్సరానికి గాను లభించింది. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు బాషకు ప్రాచీన బాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ బాషాభిమానం వేటూరి వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక. కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ , ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తెలుగు సాహిత్యం లో జీవ నది వేటూరి కి శుక్రవారం 75వ పుట్టిన రోజు సందర్భం గా శుభాకాంక్షలు.

అందరికీ ఆత్మబంధువు గుమ్మడి

ఒక ‘మహామంత్రి తిమ్మరుసు’ మరొక ‘బలరాముడు’ ఇంకొక ‘విశ్వామిత్రుడు’ చివరిగా…’కాశినాయన’ ఇంకా…భక్తపోతన, దశరథుడు, భీష్ముడు, ధర్మరాజు, కర్ణుడు, సత్రాజిత్తు, భృగుమహర్షి…వంటి ఎన్నో అద్భుత పాత్రలకు జీవం పోసిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఉమ్మడి కుటుంబంలో పెద్దన్నగా, ఎఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి ఎందరో హీరోలకు తండ్రిగా, తాతగా, చెప్పులు కుట్టే సగటు మనిషిగా, సాఫ్ట్ విలన్ గా, నిరుపేదగా…వాచకం-అభినయం సమపాళ్లలో రంగరించి ఆరు దశాబ్దాల నట జీవితంలో సుమారు 500 చిత్రాల్లో నటించిన సమున్నత కళాకారుడు గుమ్మడి.గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లూరు మండలం రావికంపాడులో 1927 జూలై 9న జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావు ఎస్.ఎస్.ఎల్.సి. వరకూ చదివారు. విద్యార్థి దశలో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. 1942లో తొలిసారిగా ఒక నాటకం కోసం ముఖానికి రంగు వేసుకున్నారు. అందులో ఆయన వృద్ధుడుగా నటించారు. కాలక్రమంలో సినీ నటుడు అయినా తన సమకాలికులైన ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్.లకు తండ్రిగా, మామగా నటించిన సందర్భాలు ఎన్నో. గుమ్మడి తొలుత కథానాయకుడుగా 1950లో ‘అదృష్ట దీపుడు’ అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన కథానాయకుడుగా నటించిన ‘జై వీర భేతాళ’ కారణాంతరాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అనంతరం ఎన్టీఆర్ సొంత సినిమా ‘తోడు దొంగలు’లో ఆయనతో సమానమైన పాత్ర పోషించారు. చిన్నవయసులోనే క్యారెక్టర్ నటుడుగా మారారు. ‘అల్లూరు సీతారామరాజు’ చిత్రంలో మల్లుదొర, ‘మాయాబజార్’లో బలరాముడు పాత్రలు మరిచిపోలేం. గుమ్మడి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పాత్ర ‘మహామంత్రి తిమ్మరసు’ సినిమాలోని తిమ్మరసు పాత్రే. ఎంతో గంభీరంగా ఆయన ఆ పాత్ర పోషించారు. తిమ్మరసు చిత్రానికి ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం అందుకున్నారు.పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ ఆయన పోషించని పాత్ర లేదు. ఎస్వీ రంగారావుకు సమఉజ్జీగా నిలిచి ఆయన తోనే అభినందలు అందుకున్న విశిష్ట కళాకారుడు గుమ్మడి. ‘కులదైవం’, ‘మా ఇంటి మహాలక్ష్మి’, ‘కులగోత్రాలు’, ‘జ్యోతి’, ‘రాజమకుటం’, ‘సతీ తులసి’, ‘భక్త పోతన’, ‘మిస్సమ్మ’, ‘రాణి రత్నప్రభ’, ‘నమ్మిన బంటు’, ‘జయభేరి’, ‘హరిశ్చంద్ర’, ‘దీపావళి’ వంటి ఎన్నో చిత్రాలు ఆయనను ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేశాయి. నటుడికి వాచకం ప్రధాన ఆర్హత అని నమ్మే గుమ్మడి ‘ఆయనకు ఇద్దరు’ చిత్రం సమయంలో వయోభారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినడంతో సరిగా మాట్లాడలేకపోయారు. దీంతో ఆయన పాత్రకు నూతన ప్రసాద్ చేత డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత గుమ్మడి నటించడం ఆపేశారు. ఆ తర్వాత తన వయసుకు తగ్గట్టుగా ఉంటుందని, స్వరానికి కూడా సరిపోతుందని చెప్పడంతో ‘శ్రీ కాశినాయన చరిత్ర’లో చివరిసారిగా గుమ్మడి నటించారు. ఆ చిత్రం ఇంకా విడుదల కావలసి ఉంది. గుమ్మడిని 1989లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తో సత్కరించగా, రాష్ట్ర ప్రభుత్వం సమున్నతమైన ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును అందజేసింది. గుమ్మడి తన జీవన స్మృతులను ‘తీపి గుర్తులు…చేదు జ్ఞాపకాలు’ పేరుతో అక్షరీకరించారు. రంగుల్లో రూపొందిన క్లాసిక్ ‘మాయాబజార్’ చిత్రాన్ని గుమ్మడి ఇటీవల ప్రత్యేకంగా తిలకించారు. ఈనెల 30న ఈ చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలోనే ఆయన కన్నుమూశారు. ఆయన ఈరోజు మననధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రలు సినీ ప్రేక్షక హృదయాలలో చిరస్థాయిగా నిలచి పోతాయి.

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఖరారు

ముంబై,జనవరి 28: దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఖరారైంది. జట్టు సభ్యులను బీసీసీ గురువారం ప్రకటించింది. అభిమన్యు మిథున్‌, వర్థమాన్‌ సాహాలకు చోటు లభించింది. గాయాల భారిన పడ్డ రాహుల్‌ ద్రావిడ్‌, యువరాజ్‌ సింగ్‌లకు విశ్రాంతినిచ్చింది. శ్రీశాంత్‌ స్థానంలో కర్నాటక ఫాస్ట్‌ బౌలర్‌ అభిమన్యు, దిరేష్‌కార్తిక్‌ స్థానంలో బెంగాల్‌ వికెట్‌ కీపర్‌ వర్థమాన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.జట్టు వివరాలు : ఎంఎస్‌ ధోని ( కెప్టెన్‌), వీరేంధ్ర సెహ్వాగ్‌, గౌతం గంభీర్‌, సచిన్‌ టెండూల్కర్‌, ఎస్‌ భద్రీనాథ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, అమిత్‌ మిశ్రా, ప్రజ్ఞాన్‌ ఓజా, ఇషాంత్‌ శర్మ, ఎం విజయ్‌, సుధీప్‌ త్యాగి, అభిమన్యు మిథున్‌, వర్థమాన్‌ సాహా.

డీ.జీ.పీ. గా గిరీష్ కుమార్ నియామకాన్ని తప్పు పట్టిన క్యాట్

హైదరాబాడ్,జనవరి 28: సీనియారిటీ పక్కనబెట్టి గిరీష్‌ కుమార్‌ను డిజీపిగా ఎందుకు నియమించాల్సి వచ్చిందని క్యాట్‌ ప్రశ్నించింది. మాజీ డీజీపీలు ఎస్‌ఎస్‌పీ యాదవ్‌, మహంతిల తొలగింపు కేసును పరిశీలించిన క్యాట్‌ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డీజీపిల పదొన్నతిలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని గిరిష్‌ కుమార్‌ను సీనియారిటీని పక్కన పెట్టి ఎందుకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో కొత్త డీజీపిని నియమించాలని, గిరీష్‌ కుమార్‌ను తాత్కాలికంగా కొనసాగించాలని, డీజీపీ పదవికి అర్హులైన ముగ్గురి జాబితాను తయారు చేయాలని క్యాట్‌ సూచించింది. అలాగే మాజీ డీజీపీలు ఎస్‌ఎస్‌పి యాదవ్‌, మహంతిలు చేసుకున్న అప్పిల్‌ను పరిశీలిస్తూ రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కులేదని, ప్రభుత్వం ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం ఉందని, అయితే తగ్గించిన వేతనాలను తిరిగి చెల్లించాలని క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది.

విభజన బాద్యత సొనియాకు అప్పగిద్దాం: జె.సి. ప్రతిపాదన

హైదరాబాడ్,జనవరి 28: రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధికి అప్పగిస్తూ ఆమెకు ఒక మెమోరాండం సమర్పించాలని మాజీ మంత్రి జె.సి. దివాకరరెడ్డి చేసిన ప్రతిపాదనను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర విభజన, ప్రస్తుత రూపంలో రాష్ట్రం కొనసాగింపు, హైదరాబాద్ ప్రతిపత్తి, ఇతర సంబంధిత అంశాలపై వాదనలు, ప్రతిపాదనలు, సూచనల మంచి చెడ్డలను ఈ పత్రంలో పిసిసి అధ్యక్షుడు వివరిస్తారు. సోనియా గాంధి తీసుకునే ఏ నిర్ణయానికైనా తామంతా కట్టుబడి ఉంటామనే వాగ్దానంతో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ సంతకాలు చేయవలసి ఉంటుందని కూడా ఈ పత్రం సూచిస్తుంది. శాంతికి భంగం వాటిల్లకుండా చూసేందుకు కాంగ్రెస్ వాదులందరినీ సమైక్యపరచడం, మామూలు కార్యక్రమాలను కొనసాగించడం ఈ కొత్త మెమోరాండం లక్ష్యం. ‘ఈ వ్యవహారాన్ని ఆమె నిర్ణయానికి వదలివేయండి. అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు వ్యవధి ఇవ్వండి. మనం అంతా సంఘటితం అవుదాం. ఉద్యమాలు ఏవీ లేకుండా చూద్దాం’ అని దివాకరరెడ్డి సూచించారు. పిసిసి అధ్యక్షుడు ఈ ప్రతిపాదనకు స్పందిస్తూ, ‘ఇది ఎంతో మంచి ప్రతిపాదన’ అని పేర్కొన్నారు. నాయకులందరినీ సంప్రదించి ముందుకు సాగడానికి తనకు వ్యవధి అవసరమని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేసినట్లు దివాకరరెడ్డి తెలియజేశారు.

వచ్చేవారంలో తెలంగాణా పై కమిటీ

నూఢిల్లి,జనవరి 28: తెలంగాణ వివాదంపై కేంద్ర మంత్రి చిదంబరం మరోసారి స్పందించారు. సమస్య పరిష్కారం తుది దశలో ఉందని వెల్లడించారు. ఫిబ్రవరి మొదటి వారంలో కమిటీ వేయనున్నట్లు స్ఫష్టం చేశారు. శాంతిభధ్రతలకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ వద్దని విజ్ఞప్తి చేసారు. ఇలావుండగా, కమిటీలపై తమకు నమ్మకం లేదని ఉస్మానియా జె.ఎ.సి. తెలిపింది. తెలంగాణా పై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరో వైపు చిదంబరం తాజా ప్రకటన పై చర్చించేందుకు తెలంగాణా జె.ఎ.సి. హైదరాబాడ్ లో సమావేశమవుతొంది. కేంద్ర ప్రకటన రాకపోతే తెలంగాణా ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయాలన్న తెలంగాణా జె.ఎ.సి. గడువు గురువారం సాయంత్రం తో ముగిసింది.

Wednesday, January 27, 2010

గడువు పై రాజీ లేదు: కె.సి.ఆర్.

హైదరాబాడ్,జనవరి 27: తెలంగాణా పై ఈనెల 28 వరకు విధించిన గడువు పై రాజీ లేదని టీ.ఆర్.యస్. అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావ్ తెలిపారు. 29వ తేదీ శుక్రవారం నాడు జే.ఎ.సీ. కార్యాలయం నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి స్పీకర్ కు రాజీనామాలు సమర్పిస్తామని ఆయన తెలిపారు. దీనికి జె.ఎ.సి. లోని అన్ని పార్టీలు కలసి వస్తాయని ఆశిస్తున్నామని కె.సి.ఆర్. తెలిపారు.

రవి తేజ , త్రిష జంటగా మరో కొత్త చిత్రం

రవితేజ కథానాయకుడుగా కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్‌ ఆర్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ‘కిక్‌’ నిర్మాత వెంకట్‌ నిర్మించ నున్న చిత్రం ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ సంద ర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లా డుతూ ‘‘కిక్‌’ వంటి సంచల విజయం తరువాత రవితేజతో మళ్ళీ ఈ సినిమా nirmistunnaamani cheppaaru. ఇందు లో రవితేజtoe త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే డా.శ్రీహరి ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా గోపీచంద్‌ మలినేని దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 25న రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సమర్పణ: కె. అచ్చిరెడ్డి, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సహ నిర్మాత వి.సురేష్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

మేడారం జాతర షురూ

వరంగల్,జనవరి 27: అడవితల్లి బిడ్డలు సమ్మక్క – సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం నుంచి సమ్మక్క – సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభం అయింది. 7.30 గంటలకు సారలమ్మను గద్దెకు చేర్చారు. గద్దెకు సారలమ్మ చేరుకోవడంతో ఈ మహాజాతర మొదలయింది. రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే సమ్మక్క – సారలమ్మ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి లక్షలా మంది భక్తులు తరలివస్తారు. పూనుగండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్ద రాజును, కొండాయి నుంచి సమ్మక్క మేనల్లుడు గోవిందరాజును కూడా గద్దెకు తీసుకువస్తారు. చిలకలగట్టు నుంచి గురువారంనాడు సమ్మక్కను మేళతాళాలతో, డప్పు చప్పుళ్ళతో వేడుకగా తీసుకువస్తారు. తరువాత తల్లీబిడ్డలయిన సమ్మక్క – సారలమ్మలు గద్దెపై కొలువుదీరిన తరువాత భక్తులు తమ తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ జాతరలో ముఖ్యంగా భక్తులు మొక్కుకున్న ప్రకారం తమ నిలువెత్తు బంగారం (బెల్లం) దేవతలకు సమర్పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

స్టాక్‌మార్కెట్‌ భారీ పతనం

ముంబై,జనవరి 27: బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమయింది. 2010లో ఇదే అతి భారీ పతనంగా మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్‌ 520 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయాయి .

టీమిండియా ఘన విజయం

ఢాకా,జనవరి 27: బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ, ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. బుధవారం లంచ్ విరామానంతరం బంగ్లాదేశ్ 312 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో భారత్ విజయానికి కేవలం రెండు పరుగుల కోసం రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ – గౌతం గంభీర్ లతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వ్యక్తిగత పరుగులేవీ చేయకుండానే విజయం వరించింది. బంగ్లా ఓపెనింగ్ బౌలర్, కెప్టెన్ సఖీబుల్ హసన్ వేసిన రెండు బంతులూ బై స్ గా రెండు పరుగులు ఇచ్చాడు. ఈ విజయంతో భారత జట్టు శ్రీలంక పర్యటనలో భాగంగా నిర్వహించిన రెండు టెస్ట్ ల సీరీస్ ను 2 – 0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టిన జహీర్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్షే గెలుపు

కొలంబో,జనవరి 27: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్‌ పార్టీ అభ్యర్థి రాజపక్షే గెలుపొందారు. ప్రత్యర్థి, యూనైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడం పార్టీ అభ్యర్థి ఫొన్సెకాపై 18 లక్షల ఓట్ల మెజారీటీతో ఆయన విజయం సాధించారు. లెక్కింపు సంర్భంగా ఫొన్సెకా ఉన్న భవనం చుట్టూ మిలటరీ దళాలు మోహరించాయి.

ఉద్యోగులకు 39 శాతం ఫిట్ మెంట్

హైదరాబాడ్,జనవరి 27: పిఆర్సీ సిఫార్సులపై ప్రభుత్వం – ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. 2010 ఫిబ్రవరి నెల నుంచి 39 శాతం ఫిట్ మెంట్ అమలుకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. పెరిగిన ఫిట్ మెంట్ కారణంగా రాష్ట్ర ఖజానాపై నెలకు 2,700 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. పెరిగిన జీతం మార్చి నెల నుంచి నగదుగా వస్తుంది. ఫిబ్రవరి నెలలో పెరిగిన జీతాన్ని జిపిఎఫ్ లో కలుపుతామని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగ సంఘాల నాయకులు 40 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, మానిటరీ బెనిఫిట్ 2009 నుంచి అమలు చేయాలని పట్టు పట్టారు. కాగా, 39 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు, 2010 ఫిబ్రవరి నెల నుంచి మానిటరీ బెనిఫిట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొంత తర్జన భర్జనల అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం ఉద్యోగ సంఘాలతో ఇతర డిమాండ్లపై చర్చలు జరుపుతామని ప్రభుత్వం తెలిపింది.

గుమ్మడి ఇకలేరు

హైదరాబాడ్,జనవరి 27: ప్రముఖ సినీ నటుడు గుమ్మడి వేంకటేశ్వరరావు(83) కన్నుమూశారు. మూత్రపిండ సమస్యలతో ఆదివారం కేర్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రావికంపాడులో 1927లో జన్మించిన గుమ్మడి దాదాపు 500లకు పైగా చిత్రాలలో నటించారు. ఆరు దశాబ్దాలపాటు చిత్రరంగంలో హీరోగా, విలన్‌గా, కారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక పాత్రలకు జీవం పోసిన ఆయన కళారంగానికి ఎనలేని సేవలందించారు. 1950లో ఆదృష్టదీపుడు అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయిన గుమ్మడి, ఆ తర్వాత ఎలాంటి భేషజాలకు పోకుండా అన్ని రకాల పాత్రలకు సై అన్నారు. దశరథుడి పాత్ర ఆయనకు అతికినట్లు సరిపోయేదని చిత్ర ప్రముఖులు ఎన్నోసార్లు పేర్కొన్నారు. మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి గాను రాష్టప్రతి రజతపతకం అందుకున్న గుమ్మడి, మరోమలుపు చిత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమనటుడిగా, 1999లో రఘుపతి వెంకయ్య అవార్డును పొందడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా పొందారు.
గుమ్మడి వేంకటేశ్వరరావు అంత్యక్రియలు గురువారం పంజగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికా నుండి కుమారుడు, కూతురు, ఇంకా కొంతమంది బంధువులు రావాల్సిఉన్నందున తుది కార్యక్రమం గురువారం నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిసింది. గుమ్మడి మరణం పట్ల చిత్ర పరిశ్రమ ప్రగాధ సంతాపం వ్యక్తం చేసింది.

Monday, January 25, 2010

వికసించిన 'పద్మా' లు







నూఢిల్లీ,జనవరి 25: 61వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకతించింది. పద్మ విభూషణ్: నోబెల్ బహుమతి గ్రహీత వెంకటరామక్రిష్ణన్,కె.శివరామన్, ఇబ్రహీం అల్కాజీ, జొహార్ సెగల్, ప్రతాప్ చంద్రా రెడ్డి(అపోలో), రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వేణుగోపాల రెడ్డి. పద్మ భూషణ్: ఇళయరాజ, అమీర్ ఖాన్, పి. సుశీల, వుస్తాద్ ఆలీ ఖాన్, మల్లికా సారాబాయి, నూకల చిన సత్యనారాయణ, దాక్తర్ రమాకాంత్ పండా, జర్నలిస్ట్ ఫరీద్ జఖారియా. పద్మశ్రీ: శొభా రాజ్, గోపీచంద్, సైనా నెహ్వాల్, రేఖ, వీరేంద్ర సెహ్వాగ్, సైఫ్ ఆలీఖాన్. మొత్తం 130 మందికి ఈ అవార్డులు ప్రకటించారు.

Sunday, January 24, 2010

రెండవ టెస్ట్ పై భారత్ పట్టు


ఢాకా,జనవరి 24: రెండవ, ఆఖరి టెస్ట్ లో భారత్ జట్టు బంగ్లా పై ఆది లోనే పట్టు బిగించింది. తొలి రోజునే 233 పరుగులకు బంగ్లాను ఆలౌట్ చేసిన భారత్ ఆట ముగిసే సమయనికి వికెట్ నస్టపోకుండా 69 పరుగులు చేసింది. సెహ్వాగ్ 41 పరుగులతోనూ, గంభీర్ 21 పరుగులతోనూ ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టులో మహ్మదుల్లా 96 పరుగులు మినహా ఇతర బ్యాట్స్ మెన్లెవరూ రాణించ లేదు. ఇషాంత్ శర్మ 4 వికెట్లు, జహీర్ఖాన్ 3 వికెట్లు తీసుకున్నారు. రెండు టెస్ట్ ల ఈ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యత తో వుంది.

తెలంగాణాపై ఒత్తిళ్ళకు లొంగం: మొయిలీ

న్యూఢిల్లీ,జనవరి 24: తెలంగాణాపై ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేసారు. తెలంగాణా పై తమకు స్పష్టమైన వైఖరి వుందని ఆయన తెలిపారు.

మంటల్లో విమానం

టెహ్రాన్,జనవరి 24: ఇరాన్ లోని మషాద్ పట్టణంలో టబాన్ ఏర్ లైన్స్ చెందిన ఒక విమానం ఆదివారం నాడు ల్యాండింగ్ సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రయణీకులు గాయపడ్డారు.

Saturday, January 23, 2010

రోశయ్య రచ్చబండ

శ్రీకాకుళం,జనవరి 23: శ్రీకాకుళం జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్య శనివారం నాడు వీరఘట్టం మండలం చిదిమి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. తమకు తాగునీరు, వైద్య, బస్సు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు సీఎంను కోరారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1952 నుంచి శ్రీకాకుళం జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో, లేదోనని తెలుసుకునేందుకే ఈ పర్యటన అని సీఎం స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ దేశంలోనే గొప్ప పథకమని దీనిద్వారా ఎంతోమంది లబ్ధిపొందారని ఆయన అన్నారు.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిరకాల వాంఛ గా మిగిలిన రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

జాతీయ ఉత్తమనటి ప్రియాంక చోప్రా


న్యూడిల్లీ,జనవరి 23; కేంద్రప్రభుత్వం 56వ జాతీయ చలనచిత్ర అవార్డులను శనివారం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా ఉపేంద్ర (జోగువా – మరాఠీ చిత్రం), ఉత్తమ నటిగా ప్రియాంక చోప్రా (ఫ్యాషన్‌) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం అంతహిన్‌ (బెంగాలి), ఉత్తమ తెలుగు చిత్రం -1940లో ఒక గ్రామం చిత్రాలు ఎంపిక అయ్యాయి.ఉత్తమ నటుడు – ఉపేంద్ర లిమాయే (జోగువా – మరాఠీ చిత్రం)ఉత్తమ నటి – ప్రియాంక చోప్రా (ఫ్యాషన్‌),ఉత్తమ సహాయ నటుడు – అర్జున్‌ రాంపాల్‌,ఉత్తమ సహాయనటి – కంగనా రనౌత్‌ ,ఉత్తమ చిత్రం – అంతహిన్‌ (బెంగాలి)బెస్ట్‌ పాపులర్‌ చిత్రం – ఓయ్‌ లక్కి లక్కి ఓయ్‌ (హిందీ)ఉత్తమ హిందీ చిత్రం – రాక్‌ ఆన్‌,ఉత్తమ తెలుగు చిత్రం – 1940లో ఒక గ్రామం,ఉత్తమ గాయకుడు – హరిహరన్‌ ,ఉత్తమ గాయకురాలు – శ్రేయ ఘోషల్‌

తెలంగాణా కోసం చావద్దు...బ్రతకండి: సుష్మాస్వరాజ్ పిలుపు


హైదరరాబాద్,జనవరి 23: ప్రత్యేక తెలంగాణా కొసం విధ్యార్థులు జరుపుతున్న పోరాటానికి బీజేపీ మద్దతు ఇస్తుందని పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ప్రకటించారు. అఖిలభారతీయ విధ్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన విధ్యార్ధి రణభేరి మహాసభలో ఆమె ప్రసంగించారు. తలంగాణా కొసం ఆత్మహత్యలు చేసుకొవద్దని, త్వరలో యేర్పదే కొత్త రాస్ట్రాన్ని చూసుకునేందుకు జీవించాలని ఆమె పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడాలంటే ఇంకెంత మంది చావాలని ప్రశ్నించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆమె కోరారు. తెలంగాణపై భారతీయ జనతాపార్టీ అభిప్రాయాన్ని మరొక్కసారి స్ఫష్టంగా చెప్పేందుకే హైదరాబాదు వచ్చానని ఆమె తెలిపారు. ప్రతి విషయం పరిశీలించాకే ఎలాంటి శషబిషలు లేకుండా తమ పార్టీ తెలంగాణపై తీర్మాణం చేసిందని సుష్మా వివరించారు. తమ బతుకు తాము బతుకుతామన్న తెలంగాణ వారి వాదనలో న్యాయముందని సుష్మాస్వరాజ్‌ అన్నారు. తెలంగాణా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విధ్యార్ధులు ఈ సభకు తరలివచ్చారు.

Friday, January 22, 2010

సోనియాపై పిటీషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్ట్


నూఢిల్లీ,జనవరి 22: బెల్జియం లోక్ సభ సభ్యత్వాన్ని యుపిఎ అధ్యక్షరాలు సోనియా గాంధీ అంగీకరించడంపై వేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. రాజన్ అనే వ్యక్తి వేసిన ఈ పిటీషన్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్యంలోని బెంచ్ విచారించి శుక్రవారం తీర్పును వెలువరించింది. అంతేగాక పిటీషన్ వేసిన రాజన్ కు కోర్టు 10 లక్షల జరిమానా విధించింది. బెల్జియం ప్రభుత్వం ఆ దేశానికి చెందిన రెండో అత్యున్నత పురస్కారమైన లోక్ సభ సభ్యత్వాన్ని ( ఆర్డర్ ఆఫ్ లియోపార్డ్) యుపిఎ అధ్యక్షరాలు సోనియా గాంధీకి ప్రకటించింది. దీనిని సోనియా ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ రాజన్ పిటీషన్ దాఖలు చేయగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. రాజన్ ఇది వరకు కూడా పలుమార్లు సోనియాపై కోర్టులో పిటీషన్ లు దాఖలు చేశారు.

అస్ట్రేలియాలో భారతీయలపై ఆగని దాడులు

మెల్బోర్న్,జనవరి 22: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ బ్రిస్బేన్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. 25 ఏళ్ల యువకునిపై దాడి చేసి అతని వద్ద ఉన్న నగదు లాక్కున్నారు. మరో ఘటనలో మన దేశానికి చెందిన టాక్సీడ్రైవర్‌పై ఇద్దరు ఆస్ట్రేలియన్లు దాడి చేశారు.

హైదరాబాద్ ఏర్ పోర్ట్ లో అలెర్ట్

హైదరాబాద్,జనవరి 22: ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసే అవకాశాలు వున్నట్టు నిఘా సంస్థలు హెచ్హరించిన నేపధ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలోనూ, ఆ పరిసరాలలోనూ అదనపు బలగాలను మోహరించి తనిఖీలు ముమ్మరం చేశారు.

తెల్గీకి నాలుగేళ్ళ జైలు

హైదరాబాద్,జనవరి 22: నకిలీ స్టాంపుల కేసులో తెల్గీ తో పాటు ఐదుగురు నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నాలుగు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది. 500 రూపాయల జరిమానా కూడా విధించిన న్యాయస్థానం దానిని చెల్లించకపోతే మరో నెల రోజులు జైలుశిక్ష అనుభవించాలని పేర్కొంది. తెల్గీ తో పాటు ఐదుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో కోర్ట్ తన తీర్పును వెలువరించింది.

ఫుల్ టైం గవర్నర్ భాధ్యతలు చేపట్టిన నరసింహన్


హైదరాబాద్,జనవరి 22: ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి గవర్నర్ గా ఇఎన్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనిల్ రమేష్ దవే ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 9.45 గంటలకు రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నారాయణ్ దత్ తివారి అనారోగ్య కారణాలతో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో జనవరి ప్రారంభంలో నరసింహన్ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయననే రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించడంతో మరోసారి శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు.

ధ్వంసం చేసిన వారినుంచే పరిహారం వసూలు : హైకోర్ట్

హైదరాబాద్,జనవరి 22: ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే వారి చేతే నష్టపరిహారాన్ని వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు అవసరమైతే చట్టాలను సవరించాలని సూచించింది. బంద్‌లు, ధర్నాలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు లేదని హైకోర్టు తెలిపింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ఆందోళన చేసుకోవచ్చని సూచించింది. వార్తల ప్రసారంలో మీడియా తన సామాజిక బాధ్యత గుర్తెరగాలని హైకోర్టు హితవు పలికింది.

ఆంధ్రకు రూ. 3720 కోట్ల ప్రపంచబ్యాంక్ రుణం

హైదరాబాద్,జనవరి 22: రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకోసం రూ. 3720 కోట్ల రుణం కోసం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. రహదారుల అభివృద్ధికి రూ. 1568 కోట్లు, గ్రామీణ తాగు నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం రూ. 720 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి 1432 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుంటున్నట్లు సిఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై శుక్రవారం నాడు సంతకాలు జరిగాయి. 2015 నాటికి ఈ మూడు ఒప్పందాల పనులు పూర్తౌతాయి.

Thursday, January 21, 2010

‘ఆస్కార్’కు మళ్లీ రెహ్మాన్ పాట


ముంబై,జనవరి 21: ‘స్లమ్ డాగ్ మిలియనీర్ 'చిత్రంలోని ‘జై హూ’ పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి రెండు ఆస్కార్ లు గెలుచుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడుగా ఎ.ఆర్.రెహ్మాన్ గత ఏడాది సంచలనం సృష్టించారు. ఈ ఏడాది సైతం ఆయన మరోసారి ఆస్కార్ నామినేషన్ కు వెళ్లారు. హాలీవుడ్ చిత్రం ‘కపుల్స్ రిట్రీట్’ కోసం ఆయన కంపోజ్ చేసిన ‘నానా’ అనే పాట ఈ ఏడాది జరుగనున్న 82వ అకాడమీ అవార్డుల కోసం అవార్డు కమిటీ నామినేషన్ కు వెళ్లింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన 63 పాటల్లో ఇదొక పాటగా కమిటీ గుర్తించింది. ఈ పాటలో కొంత భాగాన్ని రెహ్మాన్ కుమారుడు పాడటం విశేషం. ఫిబ్రవరి 2న నామినేషన్లను ప్రకటించనున్నారు. ఆంగ్లం, ఆఫ్రికన్, హిందీ, స్పానిష్, సంస్కృతం వంటి ట్రాక్స్ తో కూడిన ఈ ఆల్బమ్ త్వరలోనే ఇండియాలో కూడా విడుదల కానుంది.

జమ్మూకాశ్మీర్ లో సెల్ ఫోన్లపై నిషేధం తొలగింపు

శ్రీనగర్,జనవరి 21: జమ్మూకాశ్మీర్ లో సెల్ ఫోన్లపై గత ఏడాది నవంబర్లో విధించిన నిషేధాన్ని కేంద్రం గురువారం నాడు తొలగించింది. ఐతే కష్టమర్ల వెరిఫికేషన్ కు సంభందించి ఆపరేటర్లకు కొన్ని కఠినమైన నిభంధనలు విధించింది. రాష్ట్రం లోని 38 లక్షల మంది సెల్ ఫోన్ కష్టమర్ల వెరిఫికేషన్ కు సంభందించి విధివిధానాలను ఖరారు చెసిన అనంతరం కేంద్రం ఈ నిషేధాన్ని తొలగించింది.

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోంది:రోశయ్య


హైదరాబాద్,జనవరి 21: అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, నాణ్యతను పెంచడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన ఆవశ్యకత కలెక్టర్లపై ఉందని ముఖ్యమంత్రి రోశయ్య ఉద్బోధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పనితీరుపై ప్రజలకు నమ్మకం తగ్గిందని ఆయన అన్నారు. జూబ్లీహాల్ లో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో ఆయన ఒక్కొక్కరితో ముఖాముఖీ భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం గురువారం ముగిసింది. అనంతరం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశం వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం, నాణ్యతలో పెరిగిన మార్పు ప్రజలకు స్పష్టంగా తెలిసేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని ఆయన ఆదేశించారు. అభివృద్ధి అంటే నిరుపేదలకు కేవలం భూమిని పంచిపెట్టినంత మాత్రాన రాబోదన్నారు. పంచిపెట్టిన భూమి నుంచి మంచి ఫలాలు రావాలని, ఆ ఫలాలు అవసరమైన ప్రజలకు చేరినప్పుడే అభివృద్ధి మాటకు అర్థం అన్నారు. రెవెన్యూ వసూళ్ళపై దృష్టి సారించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయం పెరిగితేనే సంక్షేమ పథకాల అమలు వీలవుతుందన్నారు. నకిలీల వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్థమైనదన్న భావన ప్రజల్లోకి వెళ్ళిందన్నారు. అన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లతో త్వరలోనే రెండు రోజుల సమావేశం ఏర్పాటు చేస్తానని రోశయ్య తెలిపారు. ఇక నుంచి ప్రతి శనివారమూ జిల్లాల పర్యటన చేస్తానని ఆయన అన్నారు. పరిపాలన విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకూ లొంగకుండా కలెక్టర్లు పనిచేయాలని రోశయ్య సూచించారు. అలాగే పరిపాలనకు సంబంధించి కలెక్టర్లపై ఎలాంటి ఒత్తిడులూ చేయవద్దని మంత్రులను కూడా సిఎం ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించే విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు ఎదురైనా తనతో నేరుగా సంప్రతించాలని కలెక్టర్లకు రోశయ్య తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉందని ధర్మాన అన్నారు. ఐటి పరిశ్రమను జిల్లాల్లో కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ పథకం కింద పేద లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే వాటిని ప్రభుత్వమే అందజేస్తుందని ధర్మాన వెల్లడించారు.

ఓయూ ఇంజనీరింగ్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్,జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన ఇంజనీరింగ్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ సాధించేవరకూ పరీక్షలు రాసేదిలేదని విద్యార్ధులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు కేయూ వైస్‌ఛాన్సలర్‌ ప్రకటించారు.

సీమాంధ్ర సమైక్య జేఏసీకి కాంగ్రెస్ దూరం

హైదరాబాద్,జనవరి 21: టీడీపీ ప్రతిపాదించిన సమైక్య ఆంధ్ర ఐక్య కార్యాచరణ సమితిలో తాము చేరడం లేదని ప్రభుత్వ విప్‌ శైలజానాథ్‌ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు, సారూప్యత కలిగిన అంశాలపై పోరాటం చేసేందుకు టీడీపీలో కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరాలు లేవన్నారు. సమైక్య నినాదానికి అనుకూలంగా ప్రజా సంఘాలతో, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా శైలజానాథ్‌ స్పష్టం చేశారు.

వేణుగోపాల్ ది ఆత్మహత్యా? హత్యా?

హైదరాబాద్,జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణా కొసం ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్న ఎంసిఏఅ విధ్యార్థి వేణుగొపాల్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉద్యమం నీరుగారిపోకుండా రగిలించే ఉద్దెశ్యంతోనే వేణుగొపాల్ ను తగలబెట్టి సొనియాకు రాసిన లేఖ ను అతని సంచిలో పెట్టివుంటారనే అనుమానాలు ఉన్నాయి. ఈ లేఖను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్టు నగర పోలిస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. సీసిఎన్ పొలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.

బంగ్లా పై భారత్ గెలుపు

చిటగాంగ్,జనవరి 21: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 113 పరుగుల తేదా తో గెలిచింది. 415 పరుగుల విజయలక్ష్యానికి గాను బంగ్లా జట్టు 301 పరుగులకు ఆలౌట్ అయింది. 67/2 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో చివరి రోజు గురువారం ఆట ప్రారంభించిన బంగ్లా మరో 234 పరుగులు చేసిన ఆలౌటయింది. బంగ్లా జట్టులో రహీమ్‌ 101, ఇక్బాల్‌ 52 పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 3, అమిత్‌ మిశ్రా 3, జహీర్‌ఖాన్‌ 2, సెహ్వాగ్‌ 1, వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాఢించిన గంభీర్ కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆథిక్యత సంపాదించింది

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...