Friday, February 26, 2010

ధరల భారం మరింత పెంచే ప్రణబ్ బద్జెట్


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 : బడ్జెట్‌లో ఎన్ని బడా ప్రణాళికలు, పద్దులు ఉన్నప్పటికీ సామాన్యు డు ఆశగా ఎదురుచూసేది ఆ ఒక్కదాని కోసమే. అదే ఆదాయపు పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సగటు ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆదాయపు పన్ను మినహాయింపును రూ.1.60 లక్షల కు పరిమితం చేస్తూ ప్రణబ్ గత విధానాన్నే కొనసాగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.6 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం గలవారు 10 శాతం, రూ.5-రూ.8 లక్షల మధ్య ఆదాయం గలవారు 20 శాతం, రూ.8 లక్షల పైన ఆదాయం గలవారు 30 శాతం పన్ను చెల్లించవలసి వుంటుంది. అయితే గత ఏడాది బడ్జెట్‌లో పన్ను చెల్లింపు కోసం ప్రవేశ పెట్టిన కొత్త విధానం స్థానే ప్రణబ్ ఈ సారి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపులు మరింత సరళతరం కానున్నాయి. ఇప్పటివరకూ కఠినమైన అప్లికేషన్ ఫారమ్‌ను ఎత్తివేసి సరళతరంగా అందరికీ అందుబాటులో ఉండే రెండు పేజీల సరళ్-2 ఫారమ్ ప్రవేశపెడుతున్నట్లు ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో దశల వారీగా ఐటి రిటర్న్స్ దాఖలును కంప్యూటరీకరించను న్నట్లు ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఐటి రిటర్న్స్‌ను కంప్యూటరీకరిస్తున్నట్లు ఆయన వివరించారు. వ్యక్తిగత ఆదాయపు పన్నుల్లో స్వల్ప తేడాలతో సరిపెట్టిన ప్రణబ్ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత దిగుమతులపై సుంకాలు బాగా తగ్గించారు. దీనితో వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. అలాగే రూ.20 లక్షలలోపు గృహరుణాలు తీసుకునే వారికి ఒక శాతం వడ్డీ రాయితీ ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉన్నది. అలాగే సిగరెట్, గుట్కా, రిఫ్రిజిరేటర్లు, కార్లు, స్టీల్, సిమెంట్, బంగారం, వెండి దిగుమతులపై ప్రణబ్ భారీగా వడ్డింపులు జరిపారు. దీనితో ఆయా ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రణబ్ కార్లపై ట్యాక్స్ పెంచినట్లు ప్రకటించిన వెంటనే హ్యూందయ్, మారుతి వంటి అగ్రశ్రేణి కార్ల ఉత్పత్తి సంస్థలు ధరలు పెంచేశాయి. అలాగే వాహనాల కొనుగోలుపై 2 శాతం పన్ను పెంచడంతో వ్యక్తిగత వాహనాల కొనుగోలు సామాన్యుడికి భారం కానున్నది. అలాగే వెండి, బంగారు దిగుమతులపై భారీగా పన్నులు వడ్డించారు. వెండిపై కేజీకి రూ.1,500పైనే పన్ను విధించారు. దీనితో బంగారం, వెండి సరాసరిన మరో రెండు వేలకు పెరిగే అవకాశం ఉన్నది. అయితే ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై ట్యాక్స్ తగ్గించడంతో సెల్‌ఫోన్, కంప్యూటర్, మైక్రోచిప్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాలు చౌకగా లభించే అవకాశం ఉన్నది. ఆహారభద్రత కోసం ఎగుమతులపై ఆంక్షల సడలింపు కొనసాగిస్తూ పన్ను మినహాయింపులు ప్రకటించినప్పటికీ పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతామని ప్రకటించడంతో వాటి ధరలు కూడా పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మధ్య తరగతి ప్రజలకు పెద్దగా పట్టని కాస్మటిక్స్‌పై ప్రణబ్ కరుణ చూపించారు. ఆయా ఉత్పత్తులకు పన్నును తగ్గించారు.

Tuesday, February 23, 2010

ఉస్మానియా లో మావోయిస్ట్ లపై ఆధారాలేవి? సుప్రింకోర్ట్

న్యూఢిల్లీ,ఫిభ్రవరి 23: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మావోయిస్టులు ఉన్నారంటూ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న వాదనకు ఆధారాలు ఇమ్మని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఉస్మానియాలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా విభాగం హెచ్చరికల కారణంగానే క్యాంపస్ లో పోలీసులను మోహరించినట్లు ప్రభుత్వం పదే పదే వినిపిస్తున్నది. అయితే, ఈ వాదనకు నిఘా విభాగం ఇచ్చిన నివేదికలను అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, నిఘా విభాగం నివేదికలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. దీనితో కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. జస్టిస్ జిఎన్ సింఘ్వి, జస్టిస్ అశోక్ కుమార్ ఈ కేసును విచారిస్తున్నారు. ఉస్మానియాలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా విభాగం సమాచారం కారణంగానే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా క్యాంపస్ లో పోలీసులు, కేంద్ర బలగాలను మొహరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనికి ఆధారం ఏమిటని అడిగిన న్యాయమూర్తులు జస్టిస్ జి.ఎన్. సింఘ్వి, జస్టిస్ అశోక్ కుమార్ లకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిఘా విభాగం నివేదికలే అని సమాధానం చెప్పారు. అయితే, ఆ నివేదికలను కోర్టు ముందు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను 25కు వాయిదా వేయడంతో అంతకు ముందు ఉస్మానియా క్యాంపస్ నుంచి పోలీసులను తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తొలగింపు ఆదేశాలపై స్టే ఉత్తర్వులు అప్పటి వరకూ కొనసాగుతాయని సుప్రీం కోర్టు ప్రకటించింది.

ఆంధ్ర వస్తువులపై బ్యాన్ – ప్రొఫెసర్ కోదండరామ్

న్యూఢిల్లీ, ఫిభ్రవరి 23: తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆంధ్ర, రాయలసీమ నాయకుల ఆస్తుల లెక్కలు తీస్తున్నామంటూ సంచలన ప్రకటన చేసిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం మరోసారి సంచలనం సృష్టించారు. తెలంగాణను రాజకీయంగా అడ్డుకుంటున్న ఆంధ్ర, రాయలసీమ సంపన్నుల ఆధ్వర్యంలోని సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులను తెలంగాణలో బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బహిష్కరించే వస్తువులు, సంస్థల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే, ఏది కొనాలి, ఏది వాడొద్దో అనే విషయంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందన్నారు. తెలంగాణ న్యాయవాదులు సోమవారం నిర్వహించిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన కోదండరామ్ మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర సంపన్నులతోనే తమకు ఇబ్బంది అని, ఇంకెవరినీ వ్యతిరేకించడం లేదన్నారు. తెలంగాణను వ్యతిరేకించే శక్తుల, రాజకీయంగా అడ్డుకొని, ఆటంకాలు సృష్టిస్తున్న వారి సంస్థల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులను బహిష్కరించాలంటూ తాము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. ఆంధ్ర, రాయలసీమ సంపన్నుల వస్తువులను బహిష్కరిస్తామే కాని, వారి ఆస్తులు, వ్యాపారాలపై దాడులు మాత్రం చేయబోమన్నారు. తెలంగాణ సాధన ఉద్యమాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తామన్నారు. కాగా, ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సింగరేణి కోల్ బెల్ట్ సమ్మెను వాయిదా వేసినట్లు కోదండరామ్ ప్రకటించారు. ఈ సమ్మెను ఎప్పుడు నిర్వహించేదీ అన్ని సంఘాలతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, మార్చి 10 వ తేదీలోగా కోల్ బెల్ట్ సమ్మె ఉంటుందన్నారు.

నవ్వుల డింగరీ ఇకలేరు..


చెన్నై,ఫిభ్రవరి23: పద్మనాభంకొన్ని తరాలను ఊపిరాడకుండా నవ్వించారు. కంట తడి పెట్టించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి అజరామరమైన గాయకున్ని తెలుగువారికి అందించారు. కడప జిల్లా, పులివెందుల తాలూకా, సింహాద్రి పురానికి చెందిన బసవరాజు వెంకట పద్మనాభరావు కేవలం 12 సంవత్సరాల వయస్సులో సినిమాలపై అమితమైన వ్యామోహంతో, గాయకుడుగా ఓ వెలుగు వెలగాలని, అప్పటి చెన్నపురి మహానగరం చేరుకున్నారు. తొలిసారిగా మహానటి కన్నాంబను తన పాటలతో మెప్పించిన ఈ కుర్రాడు రాజరాజేశ్వరీ కంపెనీలో కళాకారుడుగా అడుగు పెట్టాడు. అలా చెన్నయ్ నగరంలో ఎదుగుతూ, గూడవల్లి రామబ్రహ్మం పరిచయంతో ఆయన రూపొందించిన మాయాలోకం అనే సినిమాలో తెరంగేట్రం చేశారు. ఇలా సినిమాలు, సీఎస్ఆర్ వంటి సీనియర్ నటులతో కలిసి ాటకాలు ఆడుతూ, నాగయ్య గారి త్యాగయ్య సినిమాలో కనిపించి, 1947లో వచ్చిన 'రాధిక' సినిమాలో కృష్ణుడుగా మెరిసి ఎల్ వీప్రసాద్ వంటి మహామహుల అభిమానం సంపాదించుకున్నారు. చివరకు నాగిరెడ్డి చక్రపాణి పరిచయంతో వాహిని సంస్థలో ఉద్యోగిగా నటజీవితాన్ని రూపొందించుకున్నారు. 1949లో వచ్చిన షావుకారు చిత్రం పద్మనాభాన్ని నటుడుగా నిలిపింది. రూ.150 ల జీతంతో ప్రారంభమైన కుర్రాడి జీవితం నెమ్మదిగా జీవితంలో వెలుగు నీడలను, మంచి చెడులను రుచి చూస్తూ, నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా పద్మనాభాన్ని తెలుగు సినీ ప్రేమికుల హృదయంలో నవ్వుల రేడుగా నిలిపింది. నటుడుగా పద్మనాభం జీవితానికి గూడవల్లి రామబ్రహ్మం ఊపిరి పోస్తే, దిగ్ధర్శకుడు కేవీ రెడ్డి మెరుగులు దిద్దారు. షావుకారు తరువాత 'పాతాళభైరవి' సినిమాలోని డింగరీ పాత్ర పద్మనాభానికి స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. పొట్ట చేత పట్టుకుని సినిమాలో చేరాలనే కోరికతో మద్రాసు చేరుకున్న ఆయన తరువాత కాలంలో 80 మందికి పైగా దర్శకులతో 400 సినిమాలలో పనిచేశారు. నటుడుగా విజయవంతంగా ఎదిగిన ఆయన నిర్మాతగా కూడా పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. తొలి ప్రయత్నంగా ఎన్.టి.ఆర్. సావిత్రి జంటగా 'దేవత' చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం. రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై నాటకాలను ప్రదర్శించిన పద్మనాభం చిత్ర నిర్మాణ సంస్థకు కూడా అదే పేరు పెట్టుకున్నారు. 'దేవత' చిత్రంలో సావిత్రి ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా విజయం సాధించడంతో భమిడిపాటి రాధాకృష్ణ రాసిన 'ఇదేమిటి' నాటకం ఆధారంగా 'పొట్టి ప్లీడరు' చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం.ఈ సినిమాలో ఆయన టైటిల్ పాత్రను పోషించగా, శోభన్‌బాబు, గీతాంజలి జంటగా నటించారు. 1967లో పద్మనాభం నిర్మాతగా రూపొందిన 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఈ చిత్రం ద్వారా పద్మనాభం గాయకుడుగా తెలుగువారికి గర్వకారణమైన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు తొలి సినిమా అవకాశం ఇచ్చారు. ఈ మూడు చిత్రాలకు కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించగా, 'శ్రీరామకథ' సినిమాతో ఆయనే దర్శకుడిగా మారారు. 1969లో పద్మనాభం దర్శకత్వంలో నిర్మించిన 'కథానాయిక మొల్ల' చిత్రం రసజ్ఞులను మెప్పించడమే కాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అలాగే తుఫాను బాధితుల సహాయార్ధం హీరో కృష్ణ సారధ్యంలో 40 మంది నటీనటులు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం జరిగింది. ఆ కార్యక్రమాలను విక్రం స్టూడియోలో 'సినిమా వైభవం'గా చిత్రీకరించారు. కృష్ణ, విజయనిర్మల, ప్రభాకరరెడ్డి, జమున, చలం, శారద, రాజబాబు తదితరలు ఇందులో పాల్గొన్నారు. దీనిని ఆ తర్వాత థియేటర్లలో ప్రదర్శించినప్పుడు మంచి స్పందన లభించింది. ఆయన నిర్మించిన చివరి చిత్రం 'పెళ్లికాని తండ్రి' (1976). హిన్దీలో హాస్యనటుడు మహమ్మద్ నటించిన 'కువారా బాప్' చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో పద్మనాభం తనయుడు మురళి కూడా నటించారు. దేవత (1964), పొట్టి ప్లీడర్ (1966), శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967), శ్రీరామకథ (1969), కథానాయిక మొల్ల (1970) చిత్రాలతో పాటు 'జాతకరత్న మిడతంభొట్లు' చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. తెలుగులో ఎస్.వి. రంగారావు, కన్నడంలో నాగయ్య కోయదొరలుగా నటించారు. గుహనాథన్ రాసిన తమిళ నాటకం 'కాశీ యాత్ర' ఆధారంగా ఆయన నిర్మించిన 'ఆజన్మ బ్రహ్మచారి' చిత్రంలో నాగభూషణం టైటిల్ పాత్ర పోషించారు. రామకృష్ణ, గీతాంజలి ఇందులో జంటగా నటించారు. ఆ తర్వాత భానుమతి ప్రధాన పాత్రగా 'మాంగల్య భాగ్యం' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో పద్మనాభం, రమాప్రభ జంటగా నటించారు. అనేక రంగస్థల ప్రదర్శనలు ఇచ్చిన పద్మనాభం మిమిక్రీ చేయడంలో సిద్ధహస్తులు. సీనియర్ నటులను సెట్‌లో అనుకరిస్తూ ఇతరులకు వినోదం పంచేవారు. అలాగే ఆయన మంచి గాయకుడు కూడా. 'దేవత' సినిమాలో 'మా ఊరు మదరాసు.. నా పేరు రాందాసు' పాట పాడటమే కాకుండా కృష్ణ నటించిన తొలి చిత్రం 'తేనె మనసులు'లో ఆయనకి ప్లేబ్యాక్ పాడారు.

సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్, ఫిబ్రవరి 23 : నిషేధిత డ్రగ్స్ వాడకంతో సినీ రంగానికి సంబంధం ఉందని తేలడంతో తెలుగు చలనచిత్ర రంగంలో తీవ్ర కలకలం రేగింది. నిషేధిత 'ఎఫిడ్రిన్'ను సరఫరా చేస్తూ సినీ నిర్మాత పట్టుబడటమే కాక, ఈ రాకెట్‌తో కొందరు హీరోలకూ సంబంధం ఉందని, ఓ హీరోను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ప్రచారం జరగడంతో సినీ పరిశ్రమలో ఇది చర్చకు దారితీసింది. కానీ, ఇప్పటివరకు జరిపిన విచారణలో... ఈ వ్యవహారంతో సినీ పరిశ్రమకు చెందిన వేరెవ్వరికీ సంబంధాలున్నట్లు బయటపడలేదని మాదాపూర్ పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. కమలాపురి కాలనీలోని హిమగిరి అపార్ట్‌మెంట్ జి-1లో ఉండే కామినేని వెంకటేశ్వరరావు సినీ నిర్మాత. భోజరాజు శ్యామరాజు ఆయన స్నేహితుడు. తీసిన సినిమాలు ఆడకపోవడంతో ఇద్దరూ ఆర్థికసమస్యలలో కూరుకుపోయారు.పాత అప్పులు తీర్చడంతో పాటు, కొత్త సినిమాల నిర్మాణం కోసం అడ్డదారులు తొక్కి.. ఈ క్రమంలోనే ఎఫిడ్రిన్ స్మగ్లింగ్ మొదలుపెట్టారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలకు కిలో రూ. 2,200కే దొరికే ఈ డ్రగ్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ముంబై వాసులకూ సరఫరా చేస్తున్నారు. తాము తెచ్చిన వంద కిలోల్లో ఇప్పటికే 75 కిలోలు అమ్మేశారు. మిగిలిన 25 కిలోలను జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 మీదుగా ఆదివారం తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వీరు ముంబై పార్టీలతో పాటు నగరంలో కూడా అమ్మేవారని చెప్పారు. గతంలోలాగే.. ఆదివారం పట్టుబడినప్పుడు కూడా తాను సినిమా పనిమీద వెళ్తున్నట్లు చెప్పి వెంకటేశ్వరరావు తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. కానీ, కారు తనిఖీ చేయగా ఎఫిడ్రిన్, రూ.5 లక్షల నగదు దొరికాయన్నారు. వెంకటేశ్వరరావు, శ్యామరాజులకు చర్లపల్లి జైల్లో స్నేహం ఏర్పడినట్టు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. అప్పట్లో శ్యామరాజు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి ఐదేళ్ల జైలుశిక్ష అనుభవించినట్టు సమాచారం. చెక్‌బౌన్స్ కేసులో వెంకటేశ్వరరావు చర్లపల్లి జైలుకు వెళ్లినపుడు ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారిందని తెలిసింది. ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరు హీరోలు, ఓ నిర్మాత హస్తం కూడా ఉన్నట్టు జరిగిన ప్రచారం చలనచిత్ర రంగంలో కలకలం రేపింది.

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం: 9 మంది ఆహుతి

బెంగళూరు, ఫిబ్రవరి 23 : ఐటీ హబ్ బెంగళూరులో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత విమానాశ్రయానికి వెళ్ళే ప్రధాన రహదారిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలో దావానలంలా వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని తొమ్మిది మంది సజీవ దహనం అయినట్లు అనధికారిక వర్గాలు వెల్లడించిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో మరో 80 మంది వరకూ గాయపడ్డారు.వీరిలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇంకా పదుల సంఖ్యలో ప్రజలు మంటల లోపల చిక్కుకుని సహాయం కోసం హాహాకారాలు చేస్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించి ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. దీనితో లోపల ఉన్నవారు అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు పదిహేను అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రక్షక బృందాలు రంగంలోకి దిగి కిటీకి అద్దాల గుండా ఒక్కొక్కరినే వెలికి తీస్తున్నాయి. అయినప్పటికీ ఓ తొమ్మిది మంది మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇంకా లోపల పదుల సంఖ్యలో ప్రజలు లోపల ఉన్నట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడిన వారు చెబుతున్నారు. అయితే మృతులపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రమాదం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది. చుట్టుపక్కల భవనాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.

Monday, February 15, 2010

రాష్ట్రపతి పాలన కోరదామా? కేబినెట్‌లో ముఖ్యమంత్రి రోశయ్య గరం

హైదరాబాద్,ఫిభ్రవరి 15: "ప్రభుత్వ నిర్వహణ అందరి బాధ్యత కాదా? సాధారణంగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి. గొడవ చేస్తాయి. కానీ.. అధికారపక్ష సభ్యులే ముందుగా గొడవ లేవనెత్తారు. వారిని నియంత్రించాలా వద్దా? ఇలా అయితే ఎలా? దీనికంటే సులువైన మార్గం అసెంబ్లీ రద్దు చేయడమే! రాష్ట్రపతి పాలన కోరదామా? ఈ విధంగా ప్రభుత్వాన్ని నడపడం కంటే రాష్ట్రాన్ని కేంద్రం చేతుల్లో ఉంచడమే సులువు'' అని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. సోమవారం సచివాలయంలో రోశయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్షం గొడవ చేస్తే నిరోధించాల్సిన అధికారపక్ష సభ్యులే ముందుగా రభస చేశారని ముఖ్యమంత్రి ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ విషయం కేంద్రం చేతుల్లో ఉందని గ్రహించాలని అన్నారు. ఈ సమయంలో మంత్రులంతా ఏం మాట్లాడలేదు. దీంతో.. మౌనం అర్ధాంగీకారం అనుకోవచ్చా? అని రోశయ్య మళ్లీ ప్రశ్నించారు. దీంతో ఉలిక్కిపడిన మంత్రులు ఒక్కసారిగా అబ్బే అదేమీ లేదంటూ సర్దుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్‌లు మాట్లాడుతూ.. శాసనసభ్యులంతా బాగానే ఉన్నారని.. మండలి సభ్యులే గొడవ చేశారని అన్నారు. ఒకరిద్దరు శాసనసభ్యులు లేచినా.. వారిని ఒప్పించగలిగామని చెప్పారు. అయితే.. ఎమ్మెల్సీల వరుసలో ఉన్న కూర్చున ఎమ్మెల్యేలు తప్పనిసరి స్థితిలో లేచి బయటకు వెళ్లారని వివరించారు. సున్నితమైన ప్రాంతీయ అంశాన్ని లేవనెత్తుతున్నప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తాము జోక్యం చేసుకోవడం తగదని ఊరుకున్నామని.. అప్పటికీ మంత్రి గీతారెడ్డి లేచి వెళ్లి వారిని సముదాయించే ప్రయత్నం చేశారని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలను వట్టి వసంతకుమార్ వారించారన్నారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డిలు కూడా సమష్టి బాధ్యతను తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమయంలో రఘువీరా రెడ్డి జోక్యం చేసుకుంటూ.. "ఇటీవల మీరు చేసిన సూచన మేరకు తెలంగాణ ప్రాంత మంత్రులంతా వారి బాధ్యత మేరకు పార్టీని ఐక్యంగా నడిపేందుకు కృషి చేస్తున్నారు'' అని వివరించారు. 'లక్ష్మణరేఖను ఎవరైనా దాటితే కఠిన చర్యలు తీసుకోండి' అని రఘువీరా చెప్పారు. మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. "సీఎంగారు చెప్పినట్లు అందరమూ సమష్టిగా బాధ్యతలు తీసుకుందాం'' అన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ అంశం చర్చకు వస్తున్న నేపథ్యంలో.. హైకోర్టు జడ్జిల నియామకంపై విమర్శలు వస్తున్నాయని వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబులు తెలిపారు. నలుగురు హైకోర్టు జడ్జిల ప్యానల్‌ను పంపితే.. వారంతా తెలంగాణేతరులేనని అన్నారు. దీనికి సీఎం స్పందిస్తూ.. జడ్జిల ప్యానల్‌ను సుప్రీంకోర్టు కమిటీ పరిశీలిస్తుందని, అయినా దీనిపై ఆలోచిద్దామని అన్నారు.

Saturday, February 13, 2010

జె.ఎ.సి. కి చెలగాటం...కాంగ్రెస్ కు సంకటం

హైదరాబాద్,ఫిభ్రవరి 14: మళ్లీ రాజీనామాల పర్వం! తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు తీవ్ర ఇరకాటం! రాజీనామాలు చేయాలని కొందరు... వాటివల్ల లాభం లేదని మరికొందరు! కాంగ్రెస్ నేతలు నిట్టనిలువునా చీలిపోయారు. శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని తెలంగాణ జేఏసీ శనివారం ఉదయం నుంచే ఒత్తిడి ప్రారంభించింది. ప్రత్యేక తెలంగాణ కోరుకునే వారంతా తమ పదవులు వదులుకోవాలని రాత్రి జరిగిన జేఏసీ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాజీనామాలు చేయాలనుకునే వారు ఆదివారం ఉదయం 10 గంటలకు జేఏసీ కార్యాలయానికి రావాలని కన్వీనర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. అక్కడి నుంచే స్పీకర్ వద్దకు వెళ్లి రాజీనామాలు సమర్పించాలని సూచించారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆదివారం ఉదయం 11.30 గంటలకు రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించుకున్నారు. 'వైదొలిగేందుకు మేం కూడా సిద్ధం' అని టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే... కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురు రాజీనామా చేస్తే సరిపోదని, అందరూ తప్పుకొంటేనే కేంద్రం దిగి వస్తుందని మెలికపెట్టారు. ఇక బీజేపీ, ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు రాజీనామాలకు సై అన్నారు. మిగిలింది... కాంగ్రెస్ పార్టీయే! విధి విధానాలపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లే... రాజీనామాలపైనా తలోమాట మాట్లాడారు. అంతకు ముందే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ఎంపీలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. అంతా రాజీనామాలు చేయాల్సిందేనని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పట్టుబట్టారు. ఆ అవసరం లేదని మరో మాజీ మంత్రి జానారెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజీనామాలపై దామోదర్ రెడ్డి, జానారెడ్డి మధ్య మాటల యుద్ధమే జరిగింది. కమిటీ నిర్ణయం కోసం వేచి చూడటం మంచిదని కేఆర్ ఆమోస్, జగ్గారెడ్డి తదితరులు కూడా అభిప్రాయపడ్డారు. ఒత్తిడి పెంచేందుకు వీలుగా గవర్నర్ ప్రసంగాన్ని, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం, గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగడం వంటివి చేద్దామని కొందరు ప్రతిపాదించారు. మొత్తానికి ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. దామోదర్ రెడ్డి మాత్రం రుసరుసా బయటికి వచ్చి... తనతోపాటు ముత్యం రెడ్డి, నర్సారెడ్డి, బిక్షమయ్యగౌడ్, మోహన్‌రెడ్డి, రాజలింగం రాజీనామా చేస్తారని ప్రకటించారు. రాజలింగం మాత్రం దీనిని అప్పటికప్పుడు ఖండించారు. రాజీనామాలు పరిష్కారం కాదన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడమా, రాజీనామాలు చేయడమా... ఆదివారం నిర్ణయిస్తామని తెలిపారు.

పుణెలో బాంబు పేలుడు: 8 మంది మృతి

పుణె,ఫిభ్రవరి 14: మహారాష్ట్రలోని పూణెలో ఓషో ఆశ్రమం సమీపంలోని జర్మన్ బేకరీలో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా, 32 మంది వరకు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని ససూన్ ఆసుపత్రికి తరలించారు. విదేశీయులే లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగినట్లు భవిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు విదేశీయులు ఉండగా, నలుగురు విదేశీయులు గాయపడినట్లు తెలుస్తున్నది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించినా, అనంతరం మృతుల సంఖ్య పెరుగడంతో కేంద్ర హోంశాఖ దీనిని బాంబు పేలుడుగా ప్రకటించింది. పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగ్‌ను ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ బాంబు పేలుడుతో ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తమైంది. దేశ రాజధాని సహా హైదరాబాద్, బెంగుళూరు మరికొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలో మరిన్ని చోట్ల దాడులు జరిగే అవకాశం ఉండడంతో అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది ఉగ్రవాదుల పనేనని, పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీబీఐ బృందాలు మరొక అనుమానాస్పద బ్యాగు లభ్యం కావడంతో దానిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

అమెరికా వర్సిటీలో కాల్పులు : ఆంధ్రా ప్రొఫెసర్ మృతి


వాషింగ్టన్, ఫిబ్రవరి 13: అధ్యాపకురాలే ఉన్మాదిగా మారింది. చేతిలో పుస్తకం పట్టుకుని పాఠాలు చెప్పాల్సిన ఆ లేడీ టీచర్ రివాల్వర్‌తో చెలరేగిపోయింది. సహాధ్యాపకులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఆమె చేతిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొదిలి గోపీకృష్ణ అనే ప్రొఫెసర్‌తో సహాముగ్గురు మరణించారు. గోపీకృష్ణ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని అలబామా వర్సిటీ బయాలజీ విభాగం చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. హంట్స్‌విల్లెలోని అలబామా యూనివర్సిటలో శుక్రవారం సాయంత్రం బయాలజీ విభాగం అధ్యాపకుల సమావేశం ఏర్పాటు చేశారు. అమీ బిషప్ అనే అధ్యాపకురాలి పదవీకాలం పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడమే ఈ భేటీ అజెండా. గోపీ అధ్యక్షతన ఫ్యాకల్టీ మీటింగ్ జరిగింది. అమీ బిషప్ టెన్యూర్ పొడిగించరాదని ఈ సమావేశం నిర్ణయించింది. అంతే... ఆమెకు ఒక్కసారిగా కోపమొచ్చింది. తనను కాదనుకున్న వారందరిపైనా క క్ష పెంచుకుంది. అందరినీ హతమార్చాలనే ఉద్దేశం తో విచక్షణారక్షితంగా కాల్పులు జరిపింది. సమావేశ మందిరం రక్తసిక్తంగా మారింది. ప్రొఫెసర్ గోపీకృష్ణతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్లు మరి యా డే విస్, ఆడ్రియెల్ జాన్సన్‌లు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బయాలజీ విభాగం అధ్యాపకులే. కాల్పు లు జరిపిన అమీ బిషప్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఆమె భర్త జిమ్ అండర్సన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని స్కూళ్లు, యూనివర్సిటీలలో కా ల్పులు జరగడం ఇది కొత్త కాదు. 2007 ఏప్రిల్‌లో వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ఒక ఉన్మాది 32 మందిని చంపి తనూ కాల్చుకుని చనిపోయాడు. గతనెలలో వర్జీనియాలోనే జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. కాకపోతే... గతంలో విద్యార్థులే ఉన్మాదులుగా మారి కాల్పులు జరిపేవారు. అలబామా వర్సిటీలో మాత్రం అధ్యాపకురాలే దారుణానికి పాల్పడింది.

Friday, February 12, 2010

విధివిధానాలు నచ్చలేదుట...శనివారం మళ్ళీ బంద్ ట...

హైదరాబాద్,ఫిభ్రవరి 12: జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై ఉస్మానియా జేఏసీ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. శనివారంనాడు మరో సారి తెలంగాణ బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. బంద్ కు కాకతీయ వర్శిటీ జేఏసీ మద్దతు తెలిపింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేవని ఓయు జేఏసీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఉస్మానియా క్యాంపస్ లో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కమిటీ విధివిధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఓయు జేఏసీ అల్టిమేటమ్ ఇచ్చింది. తెలంగాణ సాధన కోసం మళ్ళీ పోరాటానికే ఓయు జేఏసీ మొగ్గుచూపుతోంది. తెలంగాణ ఏర్పాటులో కాలయాపన చేయడానికి శ్రీకృష్ణ కమిటీ అని ఓయు జేఏసీ నాయకులు తీవ్రం స్థాయిలో విమర్శించారు. ఓయు జేఏసీ ర్యాలీ నిర్ణయం సమాచారం తెలిసిన వెంటనే క్యాంపస్ లో పోలీసులు భారీ ఎత్తున మొహరించారు. విద్యార్థుల నుంచి ఎలాంటి అలాంఛనీయ సంఘటనలూ ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు ఉన్నతాధికారులు కూడా క్యాంపస్ కు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు నిరసనగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తెలంగాణ శ్రేణులు శుక్రవారం ఉదయం నుంచీ రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి విధులు, గడువు ఖరారు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : ఐదుగురు సభ్యులతో కూడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఏడు అంశాలతో కూడిన విధివిధానాలను శుక్రవారం కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఈ కమిటీ కాలపరిమితి డిసెంబర్ 31, 2010 గా నిర్ణయించారు. కమిటీ విధి విధానాలు ఇవి: * తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్ల పరిశీలన * రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన అభివృద్ధిపై సమీక్ష * అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణ.. అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీల అభిప్రాయ సేకరణ * ముఖ్యంగా మొదటి మూడు అంశాలపై పరిశీలన * పరిశ్రమలు, వ్యాపార, రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు * రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయ సేకరణ.. రాజకీయ పార్టీలు సూచించే పరిష్కారాల పరిగణన * రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన పరిణామాల ప్రభావంపై సమీక్ష... ఇతర అంశాలపై సమీక్ష. శ్రీ క్రిష్ణ కమిటీ తొలి సమావీశం శనివారం నాడు ఢిల్లీలో జరుగుతుంది. కమిటీ కార్యాలయాన్ని త్వరలో హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారు. కాగా కమిటీ విధివిధానాల పత్ల టీ.ఆర్. ఎస్., తెలంగాణా జె.ఎ.సి.,ఉస్మానియా జె.ఎ.. సి., బీ.జే.పీ. అసంత్రుప్తి వ్యక్తం చేశాయి. ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించాయి.

Thursday, February 11, 2010

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం


హైదరాబాద్, ఫిబ్రవరి 11 : ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ నివేదిక పేర్కొంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో వైఎస్ సహా అధికారుల మాటలేవీ రికార్డు కాలేదని, కేవలం పైలట్ల సంభాషణ మాత్రమే రికార్డయిందని కమిటి గురువారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. వైఎస్ హెలికాప్టర్ బయలుదేరే ముందు, హెలికాప్టర్ చేరవలసిన చిత్తూరులోనూ వాతావరణం బాగానే ఉన్నదని, మధ్యలో కమ్యులో నింబస్ మేఘాల కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని నివేదికలో వెల్లడించారు. ప్రమాదం వెనుక కుట్ర కారణం అంశంపై సిబిఐ లోతుగా విచారిస్తోందని, మిగిలిన వివరాలు వారు వెల్లడిస్తారని సచివాలయంలో రోశయ్యను కలిసి నివేదిక సమర్పించిన అనంతరం కమిటి సభ్యులు విలేకర్లకు వివరించారు.

శాసనసభ్యురాలిగా వై.ఎస్. విజయలక్ష్మి ప్రమాణస్వీకారం


హైదరాబాద్, ఫిబ్రవరి 11 : దివంగిత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి పులివెందుల శాసనసభ్యురాలిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఛాంబర్‌లో విజయలక్ష్మిచేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజశేఖర్‌రెడ్డి మృతితో పులివెందులలో డిసెంబర్ 5, 2009లో జరిగిన ఉప ఎన్నికలలో వై.ఎస్. విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, డి. శ్రీనివాస్, పలువురు మంత్రులు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సమయంలో విజయలక్ష్మి ఎంతో వుద్వేగానికి లోనయ్యారు.

Tuesday, February 9, 2010

బీ.టీ. వంకాయకు బ్రేక్


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశవ్యాప్తంగా ఎదురైన వ్యతిరేకతతో ప్రభుత్వం ఎట్టకేలకు బీటీ వంగపై వెనక్కి తగ్గింది. వ్యాపారాత్మకంగా బీటీ వంగ సాగును ప్రస్తుతానికి అంగీకరించకూడదని నిర్ణయించింది. శాస్త్రవేత్తలు, రైతులలో దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జైరాం రమేశ్ మంగళవారం ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటికిప్పుడు బీటీ వంగ సాగును ప్రవేశపెట్టాల్సిన అవసరమేమీ లేదని, దీర్ఘకాలంలో మానవుల ఆరోగ్యంపై ఇది చూపే ప్రభావం గురించి స్వతంత్ర శాస్త్రీయ పరిశధనలు జరిగి, వాటి ఫలితాలు తేలేవరకు వీటిని ఆమోదించబోమని తెలిపారు. ప్రస్తుత నిర్ణయం వంకాయకే పరిమితమని.. భవిష్యత్తులో బెండకాయ, క్యాబేజి, బియ్యం వంటి ఉత్పత్తులలో జన్యుపరివర్తిత పంటలపై ఈ నిషేధం ఉండబోదని జైరాం స్పష్టీకరించారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేయగా, ప్రతిచోటా ఆయనకు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్, కేరళ ముఖ్యమంత్రులు బీటీ వంగ సాగును వ్యతిరేకించగా, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, బీహార్‌లు మాత్రం 60 శాతం బీటీ వంగ సాగుచేసేందుకు ముందుకొచ్చాయన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలంతా బీటీ వంగను తీవ్ర గా వ్యతిరేకించారు. తాజాగా గుజరాత్ ప్రభుత్వం కూడా దేశంలో బీటీ వంగను అనుమతించొద్దని కేంద్రాన్ని కోరింది. ఈ రకం వంకాయలో పురుగులను అరికట్టేందుకు కొన్ని విష పదార్థాలుంటాయని, అవి మానవ ఆరోగ్యానికి హానికరమని కొందరు శాస్త్రవేత్తు కూడా చెబుతున్నారు. రాష్ట్రం లో గ్రీన్‌పీస్ సహా దేశవ్యాప్తంగా పలు సంస్థలు బీటీ వంగ ను వ్యతిరేకిస్తున్నాయి. బీటీ వంగను రాజకీయం చేయొద్దని, శాస్త్రీయ పరిశోధనల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని జాతీయ విత్తన ఉత్పత్తిదారుల సంఘం (ఎన్ఎస్ఏఐ) ప్రభుత్వాన్ని కోరింది. బీటీ వంగ సాగును ఎలాగైనా ప్రవేశపెట్టే ఉద్దేశంతోనే తమ శాస్త్రసాంకేతిక సలహాదారు నీనాపెడారాఫ్ భారత్ వచ్చారన్న ఆరోపణలను అమెరికా కొట్టి పారేసింది. బీటీ వంగసాగుతో ఆమె పర్యటనకు ఏ సంబంధం లేదని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఢిల్లీలో చెప్పారు.

టీమిండియాకు గట్టి దెబ్బ


నాగపూర్,ఫిభ్రవరి 9: టెస్ట్ మ్యాచ్ లలో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకొనే విధంగా భారత్ పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో అతి తక్కువ పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా ఫాలో ఆన్ లోనూ ఆ గండం నుంచి గట్టెక్కలేకపోయింది. కనీసం దక్షిణాఫ్రికా ఒకే ఇన్నింగ్స్ లో చేసిన పరుగులను కూడా రెండు ఇన్నింగ్స్ లలోనూ కలిపి చేయలేక పోయింది. రెండో ఇన్నింగ్స్ లో 319 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 6 పరుగులతో ఓటమి భారాన్ని భుజానికెత్తుకుంది. తొలి ఇన్నింగ్స్ లో వీరేంద్ర సెహ్వాగ్, రెండో ఇన్నింగ్స్ లో సచిన్ టెండుల్కర్ మినహా మరెవ్వరూ సెంచరీ దరిదాపులకు కూడా స్కోరు చేయలేకపోయారు. కాస్త గుడ్డిలో మెల్ల అన్నట్లుగా తొలి ఇన్నింగ్స్ లో ఎస్. బద్రీనాథ్ అర్ధ సెంచరి (56 పరుగులు) చేయగలిగాడు. రెండు ఇన్నింగ్స్ లో మిగిలిన ఏ ఒక్కరూ అర్ధ సెంచరీ కూడా చేయలేక పోయారు. కాగా, భారత బౌలర్ల తీరు కూడా అలాగే వుంది. వికెట్లను తీయలేకపోయారు సరికదా దక్షిణాఫ్రికా జట్టు పరుగుల వరదనైనా భారత ఫీల్డర్లు నిలువరించలేకపోయారు. ఇలా అన్ని విభాగాల్లోనూ జావగారిపోయిన టీమిండియా ఇప్పుడు ఈ సీరీస్ లో 0 – 1 తేడాతో వెనుకబడి ఉంది. నాగ్‌పూర్ టెస్టులో ఎదురైన ఓటమి కెప్టెన్‌గా ధోనీకి మొదటిది. ఇప్పటివరకు ధోనీ సారథ్యం వహించిన 12 టెస్టుల్లో ఎనిమిది విజయాలు, ఒక్క ఓటమి (ప్రస్తుత మ్యాచ్), మూడు డ్రాలు దక్కాయి. రెండోఇన్నింగ్స్‌లో సెంచరీ ద్వారా సచిన్... టెస్టులాడే జట్లన్నింటిపైనా భారత గడ్డపై శతకాలు పూర్తిచేసిన బ్యాట్స్‌మన్ అయ్యాడు. అయితే ఈ ఫీట్‌ను ఇదివరకే ద్రావిడ్ సాధించాడు. అంతేకాదు ఈ సెంచరీతో దక్షిణాఫ్రికాపై నాలుగు సెంచరీలు పూర్తిచేసిన రికార్డును అజరుద్దీన్, సెహ్వాగ్‌లతో పంచుకున్నాడు. ఇది మాస్టర్‌కు వరుసగా మూడో టెస్టు సెంచరీ కూడా. 2000 తర్వాత సొంతగడ్డపై భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇది మూడోసారి. ఈ మూడుసార్లూ దక్షిణాఫ్రికా చేతిలోనే పరాజయం పాలైంది.

సంగీతం వినిపించే చీర


అనంతపురం,ఫిభ్రవరి 9: మహిళా సంగీత ప్రియులు సంగీతం వినడానికి చీరలోనే సంగీతాన్ని వినేలా వినూత్నమైన చీరను అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన డిజైనర్‌ మోహన్‌ రూపొందించారు. ఈ చీరను శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ చీరలో కంటికి కనిపించని వైరింగ్‌, మ్యూజిక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఆమర్చారు. రీచార్జ్‌ సౌకర్యం కూడా ఉన్న ఈ చీర కొంగుపై మ్యూజిక్‌ ఆపరేటింగ్‌ స్విచ్‌ను అమర్చారు. ఆరుదుగా లభించే స్వరాసఖి జాతిరాళ్లను చీరలో అమర్చినట్లు డిజైనర్‌ తెలిపారు. ఈ చీర ఖరీదు రూ. 25 వేలుగా నిర్ణయించారు.

హైకోర్టుకు మహిళా చీఫ్‌ జస్టిస్‌గా మీనా కుమారి

హైదరాబాద్,ఫిభ్రవరి 9: రాష్ట్ర హైకోర్ట్ తాత్కా లిక ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్‌ టి. మీనాకుమారి నియ మితులయ్యారు. 1951 ఆగస్టు 3న విశాఖపట్నం యలమంచిలి గ్రామం లో జన్మించిన ఆమె బీఎస్సీ విద్యతో పాటు ఉస్మానియా విశ్వ విద్యా లయంలో న్యాయవిద్యను అభ్య సించారు. 1976 అక్టోబర్‌ 7నుంచి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తు న్నారు. సీనియర్‌ న్యాయవాది పి.శివశంకర్‌ వద్ద మీనా కుమారి జూనియర్‌ న్యాయవాదిగా పని చేశారు. ఆమె భర్త తూమ్‌ భీమ్‌సేన్‌ కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తు న్నారు. 1981 నుంచి 1984 వరకు అసిస్టెంట్‌ ప్రభుత్వ ప్లీడర్‌గా, 1988- 89 మధ్య కాలంలో ఇన్‌ కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. 1990లో హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా మీనాకుమారి నియమితులయ్యారు. 1994 వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు. విద్య, పౌరసరఫరాలు, కాలుష్య నియంత్రణ, విద్యుత్‌ వంటి విభాగాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహ రించారు.

డాలస్‌లో 'వెండితెర వేదిక' ఆవిష్కరణ

డాలస్, ఫిబ్రవరి 9 : మొట్టమొదటిసారిగా ప్రవాసాంధ్రులు తెలుగు చలనచిత్రాలపై ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ వాసులు 'వెండితెర వేదిక' పేరుతో తెలుగు చలనచిత్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం మొదటి సమావేశం ఇటీవలే ఫన్ ఏషియా రిచర్డ్సన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వల కరుణాకర్ రావు తెలుగు సినిమా తొలిరోజుల గురించి ప్రస్తావించారు. మహాభారతంలోని కౌరవులు, పాండవులు ఒక్కరు కూడా లేకుండా మాయాబజారు సినిమా తీయడం విశేషమని ఆయన అన్నారు. డాక్టర్ జువ్వాడి రమణ తెలుగు సినిమాలలోని పద్యాల గురించి సోదాహరణంగా వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర నారాయణ్ దాసు తెలుగు హిందీ ప్రేక్షకుల అభిప్రాయ వ్యత్యాసాల గురించి ప్రస్తావించారు.

కాలిఫోర్నియాలో 'మనబడి' చిన్నారుల ప్రతిభ

సిలికానాంధ్ర, ఫిబ్రవరి 9 : సిలికానాంధ్ర మూడవ 'మనబడి' సాంస్కతికోత్సవం కాలిఫోర్నియాలోని సన్నీవేల్ హిందూదేవాలయంలో ఘనంగా జరిగింది. ఎనిమిది గంటల పాటు ఎంతో ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో 350 మంది పిల్లలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. వేదప్రవచనంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో ప్రవాసాంధ్రుల చిన్నారులు మధురమైన గీతాలు, పరమానందయ్య శిష్యుల కథలు, నీతి కథలు, నృత్యరూపకాలు, నీతి పద్యాల పఠనం, హాస్య నాటకాలను ప్రదర్శించారు. భువన విజయం నాటకంలో రాయల వారు, అష్టదిగ్గజాలు పద్యాలను వల్లించటం పిల్లలకు తెలుగు బాష పై ఉన్న పట్టుకు గీటురాయిగా నిలిచింది.సిలికానాంధ్ర చైర్మన్, వ్యవస్ధాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ, 13 కేంద్రాలతో ప్రారంభమైన 'మనబడి' మూడేళ్లలో 18 రాష్ట్రాలలో 785 విద్యార్ధుల వరకు ఎలా ఎదిగిందో వివరించారు. అలాగే ఈ సంవత్సరం నుండి 4నుండి 6 వయస్సు గల పిల్లలకోసం 'బాలబడి'ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రవేశం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అనే నాలుగు దశల్లో తెలుగు విద్యను సిలికానాంధ్ర మనబడి బోధిస్తున్నది. సిలికానాంధ్ర అధ్యక్షుడు చమర్తి రాజు మనబడికి స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ప్రశంసాపత్రాలతో సత్కరించారు.

Monday, February 8, 2010

ముస్లిం రిజర్వేషన్లను కొట్టివేసిన హైకోర్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ముస్లింలలో వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం హైకోర్టు కొట్టివేసింది.ఏడుగురు సభ్యులతో కూడిన థర్మాసనం ఈ రిజర్వేషన్ రాజ్యాంగ బద్ధంగా లేదని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం 90 రోజులలో పై కోర్టుకు వెళ్ళవచ్చునని కూడా పేర్కొంది.దివంగిత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే దీనిపై వీహెచ్‌పి నాయకుడు మురళీధర్ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో రిజర్వేషన్లు నిలిపివేస్తూ అప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. త ర్వాత దీనిపై కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా కోర్టుో ఫిటిషన్లు దాఖలు చేశారు.

Saturday, February 6, 2010

సుఖప్రసవానికి దానిమ్మ రసం


లండన్, ఫిభ్రవరి 7: తల్లికాబోతున్న మహిళలకు దా నిమ్మ రసం ఎంతో మేలు చే స్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో.. గర్భాశయం ముడుచుకుపోవడం ఎంతో కీలకం. ఈ ప్రక్రియ సాఫీగా సాగితేనే.. ఏ సమస్యా లేకుండా శిశువు బయటకు వస్తుంది. ఆక్సీటోసిన్ అనే హార్మోన్ గర్భాశయ కదలికలను నియంత్రిస్తుంది. ఈ కదలికలు లోపించినప్పుడు కాన్పు కష్టమవుతుంది. ఇలాంటి సం దర్భాల్లో పెద్దాపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తారు. దా నిమ్మ రసంలో ఉండే బీటా సైటోస్టెరాల్ ఆ అవసరం లేకుం డా చేస్తుందని సురనరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకుడు డాక్టర్ సజీరా కుపిట్టాయనంట్ వ్యాఖ్యానించారు. వీరు తమ పరిశోధనల్లో భాగంగా జంతువుల గర్భాశయ కండరాలపై దానిమ్మ రసం ప్రభావాలను పరిశీలించారు. దానిమ్మ ర సం ప్రయోగించిన తరువాత జంతువుల గర్భాశయ కండర నమూనాల్లో గణనీయమైన ప్రగతి కనిపించిందని సజీరా తెలిపారు. ఒక్క గర్భాశయ కండరాలు మాత్రమే కాదు..శరీరంలో ని ఏ కండరాలు ముడుచుకుపోవడానికైనా కాల్షియం అవస రం. కండరాలకు ఎంత ఎక్కువగా కాల్షియం అందితే.. అంత ఎక్కువగా ముడుచుకుపోతాయి. కండరాలకు అవసరమైనంత కాల్షియం అందించడంలో దానిమ్మ రసంలో ఉండే బీటా సై టోస్టెరాల్ కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.

చాట్ల శ్రీరాములుకు ఎన్టీఆర్ పురస్కారం


హైదరాబాద్,ఫిభ్రవరి 6: ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు చాట్ల శ్రీరాములుకు 2009 సంవత్సరానికి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలలో ఆదివారం నాడు ముగింపు సభలో చాట్ల శ్రీరాములుకు ఈ పురస్కారాన్ని అందచేస్తారు. ఈ అవార్డ్ కింద ఆయనకు లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం బహూకరిస్తారు.

Friday, February 5, 2010

డీజీపీ వ్యవహారంలో క్యాట్ తీర్పుపై హైకోర్ట్ స్టే

హైదరాబాద్, ఫిబ్రవరి 5 : డిజిపి పదోన్నతి వ్యవహారంపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం క్యాట్ తీర్పుపై స్టే విధించి ఆరు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. తనను డిజిపి పదవి నుంచి తొలగించి డిమోషన్ ఇవ్వడం, సీనియారిటీ ప్రాతిపాదిక లేకుండా గిరీష్‌కుమార్‌కు పదోన్నతి కల్పించడంపై యస్.యస్.పి. యాదవ్ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన క్యాట్ డిజిపిగా గిరీష్‌కుమార్ నియామకం చెల్లదని తీర్పు చెప్పింది. ఉన్నతస్థాయి కమిటి వేసి రెండు వారాల్లో ముగ్గురు సీనియర్లతో జాబితా రూపొందించి, కొత్త డిజిపిని నియమించాలని ఆదేశించింది. అలాగే యాదవ్‌కు తగ్గించిన వేతనాన్ని తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది.

రాహుల్ రూటే సెపరేటు...


ముంబై, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ శివసేన హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా తన పద్ధతిలో తాను వ్యవహరించారు. శుక్రవారం నాడు రాహుల్ ముంబైలో పర్యటించనున్న సందర్భంగా శివసేన నల్లజెండాలతో నిరసన ప్రదర్శన తలపెట్టింది. సేన ఆందోళన కార్యక్రమాలను పట్టించుకోని రాహుల్ తన చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని సైతం పట్టించుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ, స్వేచ్ఛగా అందరితోనూ కలిసి కలుపుగోలుగా వ్యవహించారు. మధ్యలో ఆయన రెండు లోకల్ సబర్బన్ రైళ్ళలో కూడా ప్రయాణించారు. ఆయన రెండవ తరగతిలో ప్రయాణించడంతో అప్పటికే రైలు పెట్టెలో ఉన్న ప్రయాణీకులు రాహుల్ దగ్గరకు వచ్చి కబుర్లు చెప్పారు. కొందరు ఆటోగ్రాఫ్ అడిగితే, రాహుల్ వారందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సమస్యలు ఏమిటో చెప్పమని అడిగి మరీ తెలుసుకున్నారు. ముంబైలో ఒక ోట రాహుల్ ఆగి ఎ.టి.ఎం.లో డబ్బులు 'డ్రా' చేశారు. ఒక చోట అంబేద్కర్ విగ్రహం కనిపిస్తే అక్కడ ఆగి నివాళి అర్పించారు. ఒక చోట యువకులతో మాట్లాడుతూ విదర్భకంటేనూ, తెలంగాణ కంటేనూ ముందు "మనమంతా భారతీయులం'' అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

లాస్ ఏంజెలెస్, ఫిబ్రవరి 5 : పశ్చిమ పస్‌పిక్ తీరప్రాంతం కేంద్రంగా సంభవించిన భూకంపం దాటికి ఉత్తర కాలిఫోర్నియా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదయినట్లు యుఎస్ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.

ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ భయం...పాస్ పోర్ట్ ల జారీ లో జాప్యం


హైదరాబాద్,ఫిభ్రవరి 5: హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలను ఔట్ సోర్సింగ్ విధానం కింద టాటా కన్సల్టెన్సీకు అప్పగిస్తున్నట్లు వార్తలు రావడంతో తమ ఉద్యోగాలపై భయంతో దక్షిణాది రాష్ట్రాలలోని కార్యాలయాలలోని ఉద్యోగులు పాస్‌ఫోర్టుల జారిలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో కూడా పోలీసు విచారణ పూర్తయిన తరువాత కూడా పాస్‌పోర్టులను జారీ చేయడం లేదని తెలుస్తోంది. ఈ రకంగా ఒక్క హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో సుమారు 70వేల పాస్‌పోర్టులను పెండింగ్‌లో పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గల్ఫ్ దేశాలలోని భారతీయ ఎంబసీలలో ఔట్ సోర్సింగ్ ద్వారా పాస్‌పోర్టుల జారీ, రెన్యువల్‌ను కేంద్ర ప్రభత్వం ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించారు. దీనితో దేశంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలను కూడా ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించడానికి రంగం సిద్ధమయింది. దీనితో ఉద్యోగులు భద్రత కొరవడి ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా పాస్‌పోర్టుల జారీలో జాప్యం చేస్తున్నట్లు చెబుతున్నారు.

నిర్మాణంలో ఉన్న భవనం కూలి 13మంది దుర్మరణం

హైదరాబాద్,ఫిభ్రవరి 5: నగరంలోని నారాయణగూడ ఫ్లై ఓవర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం శుక్రవారం కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, మరి పలువురు శిధిలాల కింద చిక్కుకుని వుంటారని అందోళన చెందుతున్నారు. భవనం పక్కనే ఉన్న బ్రిలియంట్‌ పాఠశాల పాఠశాల కాంపౌండ్‌ వాల్‌ పాక్షికంగా దెబ్బతింది. దీంతో ముందు జాగ్రత్తగా విద్యార్థులను బయటకు పంపించారు. భవనం కూలిన ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంభందించి ముగ్గురు మునిసిపల్ అధికారులను సస్పెండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రభుత్వం ప్రకటించింది.

అల్లు అర్జున్ సినిమా షూటింగ్ పై 'తెలంగాణా' దాడి


హైదరాబాద్,ఫిభ్రవరి5: అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా షూటింగ్ ను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. హైదరాబాద్ శివారు మూసాపేటలోని ట్రావెల్స్ రోడ్డులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా తెలంగాణ వాదులు కొందరు అక్కడికి తెలంగాణ నినాదాలు చేస్తూ చేరుకున్నారు. ఆ వెంటనే షూటింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. షూటింగ్ ప్రదేశంలో వారు అడ్డంగా నిలబడ్డారు. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులను చెదర కొట్టారు. అనంతరం షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినిమా నటులు, నిర్మాతల చిత్రాలను అడ్డుకుంటామని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇలా హైదరాబాద్ లో జరుగుతున్న పలు సినిమాల షూటింగ్ లను తెలంగాణ వాదులు అడ్డుకుంటున్నారు.

Thursday, February 4, 2010

శ్రీశైలం వద్ద లోయలో పడిన బస్సు

హైదరాబాద్,ఫిబ్రవరి 4: శ్రీశైలం చెక్‌పోస్టు వద్ద ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తోపాటు మరో మహిళ మృతి చెందింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏలూరు నుంచి బయలు దేరిన టూరిస్టు బస్సు శ్రీశైలం దగ్గరకు రాగానే ఘాట్‌ రోడ్డుపై మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Wednesday, February 3, 2010

మంత్రులకు మన్మోహన్ రూల్స్


నూఢిల్లీ,ఫిభ్రవరి 3: కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కఠిన నియమావళి విధించారు. కేంద్ర, రాష్ర్ట మంత్రులు ఆస్తులు, అప్పులు ప్రకటించాలని ప్రధాని ఆదేశించారు. బహుళ జాతి సంస్థల్లో మంత్రుల కుటుంబ సభ్యులు పనిచేస్తుంటే తప్పనిసరిగా అనుమతి పొందాలని చెప్పారు. ప్రభుత్వ లైసెన్సులు అవసరమైన వ్యాపార సంస్థల్లో చేరవద్దని మంత్రులను ఆదేశించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మంత్రులకు వాటాలు ఉంటే వాటి వివరాలను వెల్లడించాలని, కొత్త వ్యాపార సంస్థలను మంత్రులు ఎవరూ ప్రారంభించవద్దని ప్రధాని ఆదేశించారు.

తెలంగాణా కమిటీ రెడీ


హైదరాబాద్,ఫిభ్రవరి 3: తెలంగాణపై హోం శాఖ మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనల మేరకు జస్టిస్ వి.ఎన్. శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని యేర్పాటు చేశారు.కమిటీలో కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శి వినోద్ కె. దుగ్గల్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. న్యాయ, ఆర్థిక రంగాల్లో నిపుణులైన రణబీర్ సింగ్, అబూ సలే షరీఫ్, డాక్టర్ రవీందర్ కౌర్ ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజలతోనూ ఈ కమిటీ సంప్రతింపులు జరుపుతుందని, నెల రోజుల్లో తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని హోం శాఖ వెల్లడించింది. కమిటీ సభ్యులతో మాట్లాడి, కమిటీ విధివిధానాలను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది. అయితే, కమిటీ వెలువరించిన ప్రకటనలో ఎక్కడా ‘తెలంగాణ’ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్ లో సంప్రతింపుల కోసమే ఈ కమిటీ’ అంటూ ప్రకటనలో పేర్కొంది. కమిటీ సభ్యుల వివరాలు : 1) జస్టిస్ శ్రీకృష్ణ – కమిటీ చైర్మన్ – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి 2) వినోద్ కె. దుగ్గల్ – కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి 3) రణ్ బీర్ సింగ్ – నేషనల్ లా శ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ 4) డాక్టర్ రవీందర్ కౌర్ – ఢిల్లీ ఐఐటిలో సామాజిక శాస్త్రం అధ్యపకురాలు 5) అబు సలే షరీఫ్ – అంతర్జాతీయ ఆహార విధాన కమిటీ సభ్యుడు.

Tuesday, February 2, 2010

హైదరాబాద్‌ లో ‘పులి’


పవన్‌కళ్యాణ్‌ హీరోగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ‘పులి’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి’ చిత్రం పెద్ద హిట్‌ కావడంతో ఇపుడు ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రానికి పనిచేస్తున్న కెమెరామెన్‌ బినోద్‌ ప్రధాన్‌ఎన్నో విజయవంతమైన బాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన వ్యక్తి కావడంతో ‘పులి’ని తెరపై ఆవిష్కరంచడంలో తన విజువల్‌ మాయాజాలంతో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయగరని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్నం దిస్తున్న ఎఆర్‌ రెహమాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కనకరత్న మూవీస్‌ బ్యానర్‌పై శింగనమల రమేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన నిఖిషాపటేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ సంచలన నటి ఈ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నర్తిస్తుండటం ఈచిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ఈచ్రితం టాకీ పార్ట్‌ ముంబాయి, యుఎస్‌ఎ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇపుడు ఇన్ డోర్ సన్నివేశాలను హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ పూర్తవ్వగానే పాటల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు సమాచారం!

అమర్ సింగ్‌, జయప్రదపై బహిష్కరణ వేటు


లక్నో, ఫిభ్రవరి 2: సమాజ్ వాద్ పార్టీ నేత అమర్ సింగ్, ఎంపీ జయప్రదలపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను వీరిపై చర్య తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ ప్రకటించారు. వీరితో పాటు అమర్ సింగ్ అనుచరులుగా ముద్రపడిన మరో నలుగురు ఎమ్మెల్యేలు మదన్ చౌహాన్, సందీప్ అగర్వాల్, అశోక్ చందెల్, సర్వేష్ సింగ్ ల ప్రాథమిక సభ్యత్వాలను కూడా రద్దు చేశారు. ములాయం సింగ్ అధ్యక్షతన మంగళవారం ఇక్కడ సమావేశమైన సమాజ్ వాది పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి మోహన్ సింగ్ మీడియాకు తెలిపారు. కాగా, తమను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ములాయం చేసిన ప్రకటనపై అమర్ సింగ్ స్పందిస్తూ, ములాయం తనకు సోదరుడు వంటి వారని, పార్టీ కోసం తాను ఎంతో శ్రమించానని, అందుకు ప్రతిఫలంగానే తనకు ఇలాంటి గౌరవం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేసేది లేదని అమర్ సింగ్ స్పష్టం చేశారు. అమర్ సింగ్ ఇప్పటికే ఎస్పీకి రాజీనామా చేశారు. సుమారు నెల రోజులుగా వీరంతా సమాజ్ వాది పార్టీకి వ్యతిరేకంగా వరుసగా ప్రకటనలు చేస్తుండడంతో పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందని ప్రధాన కార్యదర్శి మోహన్ సింగ్ తెలిపారు.

బెజవాడ దారుణం లో పోలీస్ వైఫల్యం


హైదరాబాద్,ఫిబ్రవరి 2: దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విజయవాడ బాలిక 11 యేళ్ళ నాగవైష్ణవికి ,కూతురి మరణంతో గుండె ఆగిన ఆమె తండ్రి ప్రభాకర్కు యావత్ రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. మొత్తం ఈ ఉదంతం లో పోలీస్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కిడ్నాప్ చేసిన బాలికను దుండగులు తీసుకుపోయిన గుంటూరు బెజవాడ కు పట్టుమని గంట దూరం కూడా లేదు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా ఇక్కడ అప్రమత్తమైపోయే పోలీసులు బెజవాడ కు కనీసం ఆ పక్కనున్న ఏలూరు, ఈ పక్కనున్న గుంటూరు ను ఎలెర్ట్ చేయలేకపోవడం దురద్రుష్టకరం. కిడ్నాప్ లో బాలిక మేనమామల పాత్రపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ పోలీసులు ఆ దిశగా అడుగు వేసిన జాడే లేదు. సబితా ఇంద్రరెడ్డీ హయాంలో రాష్ట్ర హోం శాఖ, పోలీస్ యంత్రాంగం వీక్ అయిందన్న వాదనకు వైష్ణవి ఉదంతం అద్దం పడుతోంది. ఇలావుండగా, రాష్ట్రం మొత్తాన్ని విషాదంలో దాన్ని నింపిన నాగవైష్ణవి కిడ్నాప్‌, హత్య కేసులో త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులను శిక్షించేందుకు అవసరమైతే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. గతనెల 23నుంచి అన్నీ విషాదవార్తలే వింటున్నామని, వైష్ణవి హత్యతో ఇది పరాకాష్టకు చేరిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...