Monday, September 29, 2014

జాతీయ ఉద్యమం తరహాలో భారత్ అభివృద్ధి...నరేంద్ర మోడీ


న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 28: దేశ ప్రజల ఆకాంక్షలు 100 శాతం నెరవేరుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతుందని.. అప్పటికల్లా ప్రతి భారతీయుడికీ ఇల్లు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం న్యూయార్క్ లోని ప్రఖ్యాత మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ప్రవాస భారతీయులను, భారత సంతతి అమెరికన్లను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. యూఎస్‌లోని భారతీయులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రవాస భారతీయుల కరతాళ ధ్వనుల మధ్య వేదిక వద్దకు చేరుకున్న మోదీ.. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతీయుల ఐటీ ప్రతిభ నుంచి ఇస్రో మామ్‌ ప్రయోగం దాకా పలు అంశాలను స్పృశిస్తూ దేశ గొప్పదనాన్ని పదేపదే గుర్తుచేశారు. ‘‘మన పూర్వీకులు పాముల్ని ఆడించేవాళ్లు, కానీ మనం (కంప్యూటర్‌)మౌస్‌తో ఆడుకుంటున్నాం. మన కుర్రాళ్లు మౌస్‌ను కదిలించి ప్రపంచాన్నే కలిపేస్తున్నారు’’ అని యువతను కొనియాడారు. 
‘‘ఎన్నికల్లో గెలవడం పదవి కోసమో కుర్చీ కోసమో కాదన్న ఆయన.. ప్రధాని పదవి చేపట్టాక తాను 15 నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకోలేదన్నారు. స్వాతంత్య్ర పోరాటం జాతీయ ఉద్యమంలా సాగినట్టే అభివృద్ధి సాధన కూడా జాతీయ ఉద్యమం కావాలన్నారు. దేశాభివృద్ధిని ప్రజా ఉద్యమంగా మలుస్తామని స్పష్టం చేశారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల్లో.. అక్కడ కలిగిన మార్పును చూసేందుకు విదేశాల్లో ఉన్న భారతీయులను దేశానికి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించానని, ఇప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పారు. ప్రవాస భారతీయులకు వరాలు ప్రకటించారు. ‘‘ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని నాకు బాగా తెలుసు. భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను’’ అన్నప్పుడు హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ వారిని మరింత ఉత్సాహపరిచేలా ప్రసంగించిన మోదీ.. ‘భారత్‌ మాతా కీ జై’ నినాదంతోనే ప్రసంగాన్ని ముగించారు! కొసమెరుపుగా.. కార్యక్రమం చివర్లో భారత జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగుల బెలూన్లను ఆడిటోరియం పై భాగం నుంచి కిందికి జారవిడువడంతో కేరింతలు మిన్ను ముట్టాయి. 
 స్వచ్ఛ భారతే మహాత్మునికి కానుక
దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం మహాత్ముడికి ఇష్టమైన మొదటి పని అయితే రెండో పని సఫాయి.. ఆయన ఎప్పుడు పరిశుభ్రత విషయంలో రాజీ పడలేదు. ఆయన 150వ జయంతి 2019లో వస్తోంది. ఆయన కోసం మనం ఏం చేశాం? ఆయనొచ్చి మీకు స్వాతంత్య్రం తెచ్చిపెట్టాను. మీరు నాకేమిస్తారు? అని అడిగితే ఏం చెబుతాం? ఆయన జయంతి నాటికి స్వచ్ఛ భారత్‌ను చేయలేమా? ఆయన పాదాలకు దానిని కానుకగా ఇవ్వలేమా? అది మన బాధ్యత కాదా? అందుకే 2019 నాటికి భారత్‌ను ‘స్వచ్ఛ భారత్‌’ను చేసేద్దాం. వినమ్రంగా ఆయన పాదాలకు ‘స్వచ్ఛ భారత్‌’ను కానుకగా ఇద్దాం. ఏం దానిని మనం చేయలేమా? చేసి చూపిద్దాం. పరిశుద్ధ భారత్‌గా దేశాన్ని తీర్చి దిద్దుదాం. దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం నా పనో కాదో నాకు తెలీదు. కానీ, ప్రతి ఇంటికీ టాయిలెట్‌ను నిర్మించాలి. నేనో చిన్న కుటుంబం నుంచి వచ్చాను. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాలను చేయడం నా బాధ్యత. 
 గంగ శుద్ధితో ఆర్థిక ప్రయోజనాలు
 గంగా నదిని శుద్ధి చేయడం ఎంత ము ఖ్యమో చెప్పారు. ఆ పని తమ ప్రభుత్వం చేపట్టాలని తాను నిర్ణయించినప్పుడు అది చాలా కష్టమని చాలా మంది నిరుత్సాహపరిచారని తెలిపారు. అయితే.. అలాంటి మాటలను తాను పట్టించుకోలేదన్నారు. కష్టమైన పనులను చేయడానికే తాను ఉన్నానని మోదీ చెప్పారు. భారత్‌లోని 40 శాతం జనాభా గంగపై ఆధారపడి ఉందని చెప్పిన ఆయన, ఆ నదిని శుద్ధి చేయడం ఆర్థికంగానూ ప్రయోజనకరమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐల సహకారాన్ని ఆయన అర్థించారు. అంతే కాక భారతీయులకు సంబంధించి తన కలను ఆయన వెల్లడించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి భారత్‌లో ఎవరూ ఉండడానికి ఇల్లు లేకుండా ఉండరాదన్నది తన కోరిక అని తెలిపారు. అప్పటికి భారతీయులందరికీ సొంతఇళ్లు సమకూరేలా తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు.
చట్టాలను చేయడమే కాదు..
తీయడమూ ముఖ్యమే

‘‘చట్టాలు చేయడమేనా.. తీయడం కూడా ముఖ్యమే’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏవేవో కొత్త చట్టాలు చేస్తామని చెప్పాయని గుర్తు చేశారు. తాను మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత, పనికిమాలిన చట్టాలను తీసేస్తున్నానని చెప్పారు. కాలదోషం పట్టిన చట్టాలను రోజుకొకటి తీసేస్తే, తనకు చాలా సంతోషమని స్పష్టం చేశారు. మోదీ ఈ మాట అన్నప్పుడు జనం నుంచి భారీగా స్పందన వచ్చింది. పనికిరాని చట్టాలను తీసేయడం తనకున్న ప్రాధాన్యతల్లో ఒకటని పేర్కొన్నారు.

‘జన్‌ధన్‌’కు రూపాయి వద్దన్నా 
ఒక్కరోజే 1500 కోట్లు వచ్చాయి
 భారతదేశానిది అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో పేదలకు భాగస్వామ్యం ఉండాలా? వద్దా? అందుకే ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టాను. పథకానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా జీరో ఖాతా తెరవమన్నా. కానీ, భారతీయులు ఎంత నిజాయితీ పరులంటే.. ఉచితంగా తీసుకోలేదు. అందుకు నిదర్శనం ఒక్కరోజే ఈ పథకం కింద 1500 కోట్లు ఖాతాలో జమ అయ్యాయని, ఇప్పటిదాకా నాలుగు కోట్ల మంది భాగస్వాములయ్యారని తెలిపారు. గ్రామీణ ప్రాం తాల్లోని పేదలకు పథకం ఫలాలు అందేలా చే యాలనుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్ని అమలు చేశాను.
 ఆటో ఖర్చు కన్నా తక్కువకే..
అంతరిక్షంలోకి..!
భారత అంతరిక్ష చరిత్ర సిగలో కలికితురాయిలా అమరిన ‘మార్స్‌’ విజయ యాత్రని అమెరికా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగ స్వరంతో గుర్తుచేసుకొన్నారు. భారత శాస్త్రవేత్తల విజయానికి గల అపురూపమైన విలువని అభిమానపూర్వకంగా ప్రస్తావించారు. ‘‘అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లో ఒక కిలోమీటర్‌ దూరానికి ఆటోవాళ్లు పది రూపాయలు వసూలు చేస్తారు. కానీ, అంతే దూరానికి కేవలం 7రూపాయల వంతున ఖర్చుతోనే అరుణ గ్రహం చేరాం. ఇది భారత్‌ శాస్త్రవేత్తల సమర్థత కాదా?’’ అని ప్రశ్నించారు. పైగా.. తొలి ప్రయత్నంలోనే అరుణగ్ర హాన్ని ముద్దాడిన దేశం కూడా భారతేనని గుర్తు చేశారు. ఇప్పటివరకు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లే అరుణగ్రహంపై అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఇప్పుడిక అమెరికా, భారత్‌లు భువిపైనే కాదు.. అరుణగ్రహం మాధ్యమంగా దివిలోనూ సంభాషించుకుంటాయి’ అని చమత్కరించారు. 
 భారతీయ సంతతికి శాశ్వత వీసాలు
- పీఐఓ, ఓసీఐ కార్డుల విలీనం
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారతీయులు ప్రపంచ యవనికపై భారత్‌ అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షను మీరు నెరవేరుస్తారన్న విశ్వాసం నాకుంది. మీరు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ప్రాజెక్టులో భాగస్వాములుకావడం ద్వారా దాన్ని నెరవేర్చండి.’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మీ వద్ద ఉన్న ఫోన్‌, లాప్‌టాప్‌ నుంచి ఝడజౌఠి.జీుఽ లోకి లాగిన్‌ అవ్వడం ద్వారా మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చు’ అని సూచించారు. 
‘మహాత్మాగాంధీ కూడా ప్రవాసభారతీయుడే. ఆయన 1915 జనవరిలో భారతదేశానికి తిరిగివచ్చారు... దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఆ అద్భుతఘట్టానికి వచ్చే ఏడాదితో వందేళ్లు నిండుతాయి. భారతీయ సంతతి(పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌- పీఐఓ) వారు స్వదేశానికి వచ్చి ఎక్కువ కాలం ఉండాలనుకుంటే పోలీసుస్టేషన్లు చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉందని, వారికి ఇకపై అలాంటి కష్టాలు ఉండబోవని హామీ ఇచ్చారు. పీఐఓ కార్డుదారులకు శాశ్వత వీసాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. 
పీఐఓ కార్డులను, ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డులను కలిపి ఒకే కార్డును అందించే ఆలోచన కూడా ఉందన్నారు. అమెరికన్‌ పర్యాటకులకు ‘వీసా ఆన్‌ అరైవల్‌’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎందరో ప్రవాసభారతీయులు భారత్‌కు వచ్చి, తన తరఫున ప్రచారంలో పాల్గొన్నారని, అప్పుడు వారికి ధన్యవాదాలు చెప్పలేకపోయానని గుర్తు చేసుకున్న మోదీ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌లోని వారి కంటే విదేశాల్లోని భారతీయులే ఫలితాల పట్ల ఎక్కువగా సంబరాలు చేసుకున్నారని అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్‌ సెల్వం ప్రమాణస్వీకారం

చెన్నై, సెప్టెంబర్‌ 29 : తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్‌ సెల్వం సోమవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య పన్నీర్‌తో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం సమయంలో భావోద్వేగానికిలోనైన పన్నీర్‌ సెల్వం కంటతడి పెట్టారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. పన్నీర్‌ సెల్వం తమిళనాడుకు 28వ సీఎం.
 
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలుకావడంతో ఆమె స్దానంలో  ఆమె సన్నిహితుడు, ప్రస్తుత  ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వంను తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా నియమించారు. పన్నీర్ సెల్వం 1951లో తేనీ జిల్లా పెరయకుళంలో జన్మించారు. తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించి టీ కొట్టుని నడిపారు. గతంలో ఆయన నడిపిన టీ కొట్టుని... ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యలు నడుపుతున్నారు. పన్నీర్ సెల్వం....స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితలకు  వీరాభిమాని.
 
ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. తనకు వీరాభిమానిగా ఉన్న పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే తేని జిల్లా కార్యదర్శిగా నియమించిన జయలలిత 1996లో పెరియకులం మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యేలా చేశారు. ఇక 2001లో పెరియకులం ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న పన్నీర్ సెల్వం, జయలలిత మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో అరెస్టయినప్పుదు కూడా జయ ఆయననే తాత్కాలిక సి. ఎం. గా నియమించారు. 

Saturday, September 27, 2014

జయ గణ మన......నాలుగేళ్ళ జైలు... 100 కోట్ల జరిమానా ...


బెంగళూరు, సెప్టెంబర్‌ 27 : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. జయలలిత 100 కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని కూడా కోర్టు తీర్పు చెప్పింది. జయలలితతో పాటు శశికళకు కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. 

అలాగే జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్‌, ఇలవరసిలకు కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. జయలలితతో పాటు శిక్షలు పడ్డ మిగిలిన ముగ్గురికీ తలా పది కోట్ల జరిమానాను కోర్టు విధించింది. అంటే ఈ కేసులో మొత్తం 130 కోట్ల రూపాయలను జరిమానాగా కట్టాలని కోర్టు ఆదేశించింది. భారత దేశంలో ఇంత పెద్ద ఎత్తున జరిమానా విధించిన కేసు మరొకటి లేదు. 
ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ డికున్హా ఈ శిక్షలను ప్రకటించారు. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరు ప్రత్యేక న్యాయ స్థానం సంచలనాత్మక తీర్పు ఇవ్వడంతో కోర్టు దరిదాపులలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. శిక్ష విధించిన వెంటనే జయలలితను బెంగుళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 



ఈ తీర్పును న్యాయస్థానం శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకే వెల్లడిస్తుందని తొలుత సంకేతాలు వెలువడ్డాయి. అయితే అప్పటికే కోర్టు చుట్టుపక్కల ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో తీర్పు ప్రకటన ఆలస్యమైంది. జయలలిత అనుయాయులు పెద్ద ఎత్తున కోర్టు సమీపానికి చేరుకోవడంతో పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్ల వల్ల ఆ ప్రాంతం మొత్తం కర్ఫ్యూ విధించినట్టుగా మారిపోయింది. 


నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో ఈ ప్రత్యేక న్యాయస్థానంలో జయలలిత బెయిలు పొందే అవకాశం లేదు. మూడేళ్ల లోపు జైలు శిక్ష గనక పడితే ఏ కోర్టు అయితే శిక్ష విధించిందో అదే కోర్టు బెయిలు కూడా మంజూరు చేయవచ్చు. అయితే ఈ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పడిందే ప్రత్యేక పరిస్థితులలో కాబట్టి జయ బెయిలుకు బెంగుళూరు హై కోర్టులో ప్రయత్నించవచ్చా, లేక సుప్రీం కోర్టుకు వెళ్లాలా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.  

ఇపడు జయలలితకు బెయిలు రావాలన్నా కనీసం వారం పది రోజులు పట్టవచ్చునని న్యాయకోవిదులు అంచనా .దసరా కావడంతో ప్రస్తుతం కోర్టులకు సెలవులు. ఆ తర్వాత కూడా జయలలిత ఎలా బెయిలు కోసం యత్నించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 

అలాగే జయ సంపాదించిన ఆస్తులు 66 కోట్ల రూపాయలుగా అంచనా. అయితే ఇంతకుముందే అధికారులు బంగారు ఆభరణాలను, వెండి ఆభరణాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఇపడు కోర్టు విధించిన 100 కోట్ల రూపాయలను జయ ఏ ఖాతానుంచి తీసుకువచ్చి చెల్లిస్తారన్నది అస్పష్టంగా ఉన్నది. అలాగే జయతో పాటు మిగిలిన ముగ్గురు కూడా తలా పది కోట్లు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. వారు కూడా ఈ సొమ్మును ఎలా తీసుకువ స్తారన్నది సందేహమే. అంటే ఈ అక్రమాస్తుల కేసులో జరిమానాగా కట్టవలసిన మొత్తం రూ.130 కోట్లకు వీరంతా లెక్కలు చూపవలసి ఉంటుంది. అంటే బ్లాక్‌ మనీగా గాక వైట్‌ మనీగానే చూపాలి. ముఖ్యమంత్రిగా కేవలం ఒక్క రూపాయినే జీతంగా తీసుకుంటానని జయ ప్రకటించిన నేపథ్యంలో ఇంత మొత్తానికి లెక్కలు చూపడం సాధ్యమా అన్నది ఇపడు మరొక కీలకమైన ప్రశ్న.
 
1991 నుంచి 1996 వరకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో భారీ అక్రమాస్తులు సంపాదించినట్ల్లు 1997లో డీఎంకే పార్టీ జయలలితపై కోర్టులో ఫిర్యాదు చేసింది. జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్యస్మామి సైతం కోర్టులో, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జయలలిత నివాసంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించగా భారీగా బంగారం, వెండి, ఇతర కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 66.65 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. 
 
ఈ కేసుపై గత 17 సంవత్సరాలు విచారణ కొనసాగింది. ఈ కేసు అనేక మలపులు తిరిగిన అనంతరం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను బెంగుళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాలు బలమైన వాదనలు వినిపించారు. జయలలిత దోషి అని చెప్పడానికి పూర్తి ఆధారాలు లభించినమేరకు న్యాయమూర్తి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
జయలిలత ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈరోజు వెలువడిన తీర్పుకు ప్రాధాన్యత ఏర్పడింది. భారీ ఎత్తున చెన్నై నుంచి కార్యకర్తలు, కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఓ వ్యక్తికి జైలు శిక్ష పడటం, పదవికి రాజీనామా చేసే పరిస్థితి రావడం చాలా అరుదుగా జరుగనున్న తరుణంలో ఈ తీర్పుపై ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను  మొహరించారు. జయలలితకు ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించడంతో ఆమె తమ పదవికి ఏ క్షణాన్నయినా పదవికి రాజీనామా చేయవచ్చునని తెలుస్తున్నది. ఈ జైలుశిక్షతో ప్రజా ప్రతినిధిగా ఆమె అర్హత కోల్పోయినట్టయ్యింది. 

కోర్టు తీర్పు చెప్పడంతో జయ అభిమానులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. ముగ్గురు అభిమానులు జయ ఇంటిముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే వారి యత్నాలను సకాలంలో విరమింపజేశారు. 

చెన్నై వీధులలో తిరుగుతున్న బస్సులపై అన్నా డిఎంకె అభిమానులు రాళ్లు విసరడంతో కొన్ని బస్సులు దెబ్బతిన్నాయి. బస్సులపై అభిమానులు ప్రతాపం చూపడంతో కర్నాటకనుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలనుంచి కూడా తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. 

Friday, September 26, 2014

పెట్రేగిన షరీఫ్... కాశ్మీర్ పై ప్లెబిసైట్ కు డిమాండ్...

న్యూ యార్క్‌, సెప్టెంబర్‌ 26 : పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారంనాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌ను లక్ష్యం చేసుకుంటూ  కాశ్మీర్ విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారం పాకిస్తాన్‌కు చాలా చాలా కీలకమైనదని ఆయన అంటూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తెలియాలంటే ప్లెబిసైట్‌ నిర్వహించాలని 
ఆరు దశాబ్దాల క్రితం కాశ్మీర్ లో ప్లెబిసైట్‌ నిర్వహించాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించిందని, ఇప్పటికీ అది జరగలేదని ఆయన సమితిని తప్పు పట్టారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణమైన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి సమితి తమ తీర్మానాన్ని అమలు చేయాలని, అందుకు తాము కలిసికట్టుగా ముందుకు వ స్తామని ఆయన అన్నారు. కశ్మీరీలు దురాక్రమణలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 

భారత ప్రధాని న్యూ యార్క్‌ చేరుకున్న అరగంటకే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రసంగం ప్రారంభమైంది. ఇటీవల జరగవలసిన కీలకమైన సమావేశం జరగలేదని, ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం అనీ ఆయన భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ సమావేశం రద్దు కావడానికి భారత్‌దే బాధ్యత అని కూడా నవాజ్‌ అన్నారు. 

ఇరుగుపొరుగు దేశాలతో తమకు సత్సంబంధాలు కావాలని ఆయన పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితి కొత్తగా ఎవరికీ శాశ్వత సభ్యత్వం ఇవ్వరాదని, దానివల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని కూడా సమితిని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో సైతం తాము సత్సంబంధాలు, సహకారాలను కోరుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులపై తమ పోరాటం కొనసాగుతున్నదని ఆయన చెప్పారు.
 

న్యూయార్క్ చేరిన మోడీ...

న్యూ యార్క్‌, సెప్టెంబర్‌ 26 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు న్యూ యార్క్‌ చేరుకున్నారు. ఆయన అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూ యార్క్‌ చేరుకున్నారు. 

ప్రధాని విమానం నుంచి క్రిందికి దిగివచ్చి అధికారులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన అధికారిక వాహనంలో బస కు బయలుదేరారు. మోదీ ఐదు రోజులపాటు అమెరికాలో ఉంటారు. శనివారంనాడు ఆయన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. 

మోదీ ఆదివారంనాడు మేడిసన్‌లో ప్రసంగిస్తారు. మోదీ రెండు రోజులపాటు న్యూయార్క్  లో గడిపిన అనంతరం వాషింగ్టన్‌ వెళ్తారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో కీలకమైన చర్చలు జరుపుతారు. ఆయన ఒబామాతో రెండు సార్లు సమావేసమవుతారు. 

అమెరికా ప్రభుత్వం నుంచి ఈ పర్యటనలో భారత్‌కు పెద్దగా పెట్టుబడుల హామీలు రాకపోవచ్చు గాని, ప్రయివేటు కంపెనీలనుంచి మాత్రం పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే ఈ పెట్టుబడిదారులకు భారత్‌లో ప్రస్తుతం అధికార స్థాయిలో అమలులో ఉన్న పద్ధతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటి గురించే వారు ఎక్కువగా మోదీతో చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఎన్. సి.పి. మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో మహారాష్ట్ర సర్కార్....సి.ఎం. రాజీనామా

ముంబై , సెప్టెంబర్ 26: మరాఠా రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలు కావడం, నామినేషన్ల దాఖలుకు కూడా సమయం మరొక్కరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఎం చవాన్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది.

మహారాష్ట్రలో ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయనగా రెండు ప్రధాన కూటములలోను విభేదాలు వచ్చి రెండు కూటములు విడిపోయిన విషయం తెలిసిందే. అటు బీజేపీ - శివసేన, ఇటు కాంగ్రెస్ - ఎన్సీపీ రెండూ విడిపోయాయి. అదే తరుణంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్సీపీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో మైనారిటీలో పడిన ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం లేకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికీ వారే ....

 ముంబై, సెప్టెంబర్ 26;
బీజేపీ - శివసేన, కాంగ్రెస్ - ఎన్సీపీ మధ్య పొత్తు  రద్దు కావడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బహుముఖ పోటీ అనివార్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ రెండు పార్టీల మధ్య పాతికేళ్ళ నాటి బంధం సీట్ల సర్దుబాటులో అవగాహన కుదరకపోవడం వల్ల తెగిపోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్సీపీకి మధ్య వున్న సుదీర్ఘమైన బంధం కూడా సీట్ల పొత్తు కుదరకపోవడం వల్ల తెగిపోయింది. ఇలా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా పోటీ చేయడం వల్ల నాలుగు పార్టీలకూ నష్టం జరిగే అవకాశం వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  అయితే నామినేషన్ల దాఖలు ఉపసంహరణ లోగా ఈ రెండు జట్ల మధ్య మళ్ళీ అవగాహన కుదిరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

వి.జి.టి.ఎం. పరిది లోనే ఎ.పి. రాజదాని... నాలుగు దశల్లో లక్ష ఎకరాలు సేకరణ...

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 : వచ్చే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి అవుతుందని ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లెరఘునాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాయంలో రాజధాని భూసేకరణపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమైంది. 
 
అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ తొలిదశలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, ఉద్యోగుల ఇళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాజధాని కోసం నాలుగు దశల్లో లక్ష ఎకరాల భూమి సేకరిస్తామని, ఆరునెలల్లో భూసేకరణను పూర్తిచేస్తామని తెలిపారు. వి. జి. టి. ఎం. పరిధిలోనే రాజధాని ఉంటుందని మంత్రులు స్పష్టం చేశారు. ఒక ఎకరా అభివృద్ధికి రూ. కోటి ఖర్చు అవుతుందని వారు తెలిపారు.
 
భూములు ఇచ్చేందుకు రైతులు ఉత్సాహంగా ఉన్నారన్నారు. భూయాజమానులకు అభివృద్ధి చేసిన భూమిలో 40 శాతం ఇస్తామని, భూములు ఇచ్చేవారికి ఎకరాకు ప్రతి ఏటా రూ.20 వేలు ఇస్తామని మంత్రులు తెలిపారు. వచ్చే నెల 6న మరోసారి రాజధాని కమిటీ భేటీ కానున్నట్లు చెప్పారు. ఆగిరిపల్లి, నూజివీడు రాజధానికి అనువైనదిగా భావించడం లేదని మంత్రులుఅభిప్రాయపడ్డారు.







Thursday, September 25, 2014

శివసేన, బీజేపీబాటలోనే కాంగ్రెస్, ఎన్.సి.పీ.

ముంబై, సెప్టెంబర్ 25:మహారాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు గందరగోళంగా మారాయి.. 25 ఏళ్లగా  శివసేనతో సాగుతున్న ఎన్నికల పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకోవడం సంచలనం రేపింది. శివసేన, బీజేపీల బాటలోనే కాంగ్రెస్, ఎన్సీపీ మైత్రికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. 
 
మహారాష్ట్ర ప్రభుత్వానికి రేపు మద్దతు ఉపసంహరణపై గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు లేఖ ఇవ్వనున్నట్టు ఎన్సీపీ నేతలు ఓ ప్రకటన చేశారు. మద్దతు ఉపసంహరణకు శుక్రవారం లేఖ ఇస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మీడియాకు వెల్లడించారు. 
 
సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ వల్లే పొత్తు కుదరడం లేదని పవార్ ఆరోపించారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లా చవాన్ వ్యవహరించడం లేదని అజిత్ పవార్ నిప్పులు చెరిగారు. 
 

నరేంద్ర మోడీ కలల పధకం ... మేక్ ఇన్ ఇండియా....కు శ్రీకారం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల పథకం ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ ప్రారంభ కార్యక్రమం గురువారం ఢిల్లీలో జరిగింది. ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారత్‌ను నిలపడమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ వెబ్‌ పోర్టల్‌ ప్రారంభ కార్యక్రమంలో దేశంలో పారిశ్రామిక, వాణిజ్యరంగ దిగ్గజాలు పాల్గొన్నారు.
 
‘‘మా దేశానికి రండి... ఇక్కడ ఉత్పత్తులు తయారుచేసుకోండి.. ప్రరంచమంతా విక్రయించుకోండి...’’ అనే నినాదంతో కేంద్రప్రభుత్వం ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.  రెడ్‌ టేపిజమ్‌, అవినీతి వంటి అవంతరాలు లేకుండా భారత్‌లో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ సులభంగా జరిగేందుకు ఈ పథకం ద్వారా వీలు కల్పిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, 
ఉపాధి అవకాశాలతో పాటే ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. అప్పుడే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ లేదా స్వదేశీ పెట్టుబడుదారులు ఎవరైనా పారిశ్రామిక అభివృద్ధిపైన... ఉత్పాదక రంగంమీద దృష్టి సారించకపోతే.. ఈ చక్రం ఎప్పటికీ పూర్తీ కాదని ఆయన అన్నారు.
 

ఇది ప్రారంభం మాత్రమేనని, డీలైసెన్సింగ్‌, డీ రెగ్యులేషన్‌ వంటి విప్లవాత్మక మార్పులకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 

మేక్‌ ఇన్‌ ఇండియా పథకం గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా బీరో డిఫెక్ట్‌, బీరో ఎఫెక్ట్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. విదేశీ పెట్టుబడుదారులు భారత్‌లో అడుగుపెట్టడానికి వీలుగా వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఇన్వెస్ట్‌ ఇండియా అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. వెబ్‌ పోర్టల్‌ ద్వారా వచ్చే ప్రశ్నలకు మూడు రోజులలోగా జవాబులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇక ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు 25 కీలక రంగాలను గుర్తించింది. 
 
ఈ కార్యక్రమం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో సేవల ఆధారిత అభివృద్ధి నుంచి ఉత్పత్తి ఆధారిత అభివృద్ధి దిశగా నడపాలనేది ప్రధాని వ్యూహం. ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఏటా కోటి ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమంలో భారత వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. రిలయన్స్‌ ఇండసీ్ట్రస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ మిసీ్త్ర, విప్రోగ్రూప్‌ ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా, ఐసీఐసీఐ సీఇఓ చందా కొచ్చార్‌ తదితరులు తమ తమ ఆలోచనలు పంచుకున్నారు. 500 లకు పైగా దేశ విదేశీయుల సీఈవోలు పాల్గొన్నారు. మొత్తం 3 వేల కంపెనీల ప్రతినిధలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

మహారాష్ట్రలో బి.జె.పి. శివసేన కటీఫ్... !

ముంబై, సెప్టెంబర్‌ 25: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు రద్దయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరలేదని రెండు వర్గాలు అంగీకరించాయి. విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. దీనికి బాధ్యత మీదంటే మీదనని ఇరు వర్గాలు దుమ్మెత్తి పోసుకున్నాయి. 
 
మహారాష్ట్రలో శివసేన-బీజేపీ  మధ్య గురువారం మరోసారి జరిగిన చర్చలలో బీజేపి అడిగిన 130 స్థానాలు ఇవ్వడానికి శివసేన ఒప్పుకుంది. 
 
కానీ ఇతర మిత్రపక్షాల్లో వాటాల నుంచి ఆ సీట్లు కేటాయించింది. ఆ సమీకరణానికి చిన్న పార్టీలు ఒప్పుకోవడంలేదు. వారికి ఇప్పుడు అదనపు సీట్లు ఎక్కడి నుంచి కేటాయించాలన్న అంశంపై బీజేపీ-శివసేప మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. రెండు పార్టీలు ఒక్క సీటు అయినా వదులుకోడానికి సిద్ధంగా లేవు. ఈ రగడ ముదిరి మొత్తానికి మైత్రీబంధానికే ముప్పు వాటిల్లే పరిస్థితి ఎదురైంది. మరోవైపు కాంగ్రెస్‌-ఎన్సీపీ మధ్య కూడా సయోధ్య కుదరడంలేదు. 

చంద్రబాబుపై అలిపిరి దాడి కేసులో తుది తీర్పు...ముగ్గురికి జైలు శిక్ష

తిరుపతి, సెప్టెంబర్‌ 25 : 2003లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో తాజాగా మరో ముగ్గురిని దోషులుగా నిర్థారిస్తూ తిరుపతి అదనపు సెషన్స్‌ కోర్టు గురువారం నాడు తీర్పు ఇచ్చింది. రామ్మోహన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రాలను దోషులుగా నిర్థారించిన కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో పాటు రూ. 500లు జరిమానా విధించింది. 
 
మొదటి దశ విచారణలో కింది కోర్టు నలుగురికి శిక్ష వేసింది. అయితే వీరు హైకోర్టుకు అపీల్‌ చేసుకున్నారు. సరైన ఆధారాలు లేవన్న న్యాయస్థానం సాగర్‌, గంగిరెడ్డిలను నిర్ధోషులుగా నిర్ణయించి విడుదల చేసింది. వీరిలో గంగిరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్‌. ఇటీవల తిరుమలలో పట్టుపడిన మావోయిస్టు దామోదరం కూడా అలిపిరి దాడి కేసు నిందితుడుగా ఉన్నాడు. ఈయనపై ప్రత్యేకంగా విచాచణ జరుగుతోంది. 
అయితే గత నాలుగేళ్లుగా జనజీవన స్రవంతిలో ఉన్నామని ఈ శిక్ష వల్ల సమాజానికి తప్పుడు సమచారం వెళ్లే అవకాశం ఉందని నిందితులు కోర్టుకు తెలిపారు. నిందుతుడు రామ్మోహన్‌రెడ్డి తాను గత ఏడేళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నానని, ఈ శిక్ష వల్ల తన జీవితం దెబ్బతింటుదని కోర్టుకు విజ్ఞప్తి చేయగా, దీనిపై స్పందించిన న్యాయమూర్తి ముందుగా అనుకున్న దాని కంటే శిక్షను తగ్గిస్తూ తీర్పునిచ్చారు. అలాగే నిందితులకు అప్పీలుకు వెళ్లే అవకాశాన్ని కూడా న్యాయమూర్తి కల్పించారు. 
 
ఈ కేసులో మొత్తం 33 మందిపై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. మొదటి తీర్పులో ఇద్దరు, రెండువ తీర్పులో ముగ్గురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులకు రామ్మోహన్‌ రెడ్డి ఆశ్రయం కల్పించారని, నర్సింహారెడ్డి, చంద్రాలు యాక్షన్‌ టీంకు జిలిటెన్‌స్టిక్స్‌ అందించినట్లు తెలుస్తోంది. 
 
2003 అక్టోబర్‌ 1న తిరుమల శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయం తెలిసందే. ఈ కేసులో దర్యాప్తు సంస్థ మొత్తం 33 మందిపై కేసులు నమోదు చేయగా వారిలో 29మంది మావోయిస్టులుగా పేర్కొంది. ఈ కేసులో మొత్తం 96 మంది సాక్షులను దర్యాప్తు సంస్థ విచారించింది. ఈ కేసుకు సంబంధించి 2012 ఆగష్టులో కోర్టు మొదటి విడత తీర్పును వెల్లడించింది. మొత్తం నలుగురు ముద్దాయిల్లో ఇద్దరికి కోర్టు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 

Wednesday, September 24, 2014

ఏపీ రాజధాని భూసేకరణకు మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ రాజధాని భూసేకరణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో మున్సిపల్‌, రెవెన్యూ, ఆర్థిక, ఇరిగేషన్‌ కార్యదర్శులను కూడా  కమిటిలో చేర్చారు . 

బొగ్గు స్కాం లో సంచలన తీర్పు ...214 క్షేత్రాల కేటాయింపులు రద్దు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 : బొగ్గు క్షేత్రాల కుంభకోణంకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. బుధవారం బొగ్గు కుంభకోణం కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగగా 1993 నుంచి 2011 వరకు కేటాయింపులు జరిగిన 218 బొగ్గు క్షేత్రాల్లో 214 బొగ్గు క్షేత్రాలను రద్దు చేస్తూ ఉన్నతన్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన నాలుగు మెగా పవర్‌ ప్రాజెక్టులకు మినహా 214 బొగ్గు క్షేత్రాలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. రద్దు చేసిన బొగ్గు క్షేత్రాలను తిరిగి వేలం వేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది.

ఆరునెలల్లోగా బొగ్గు క్షేత్రాలను వేలం వేసి ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా చూడాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గత నెల బొగ్గు క్షేత్రాల కేటాయింపు చట్టవిరుద్ధమని ఉన్నతన్యాయస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే. యధాలాపంగా జరిగిన బొగ్గు కేటాయింపుల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం 46 బొగ్గు క్షేత్రాలకు మినహాయింపు ఇవ్వాలని కోరగా అందుకు న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. బొగ్గు కేటాయింపుల్లో అవకతవకల వల్ల ఖజానాకు రూ.1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని కోర్టు గుర్తించింది.
 


నిర్దేశిత కక్ష్యలో మామ్...."

బెంగళూరు, సెప్టెంబర్‌ 24: భారత ఉపగ్రహం మామ్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు శుక్రవారం ఉదయం విజయవంతంగా నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టారు. శుక్రవారం ఉదయం భారత కాలమానం ప్రకారం సరిగ్గా 7.17 నిమిషాలకు మామ్‌ అంగారక కక్ష్యలో ప్రవేశించింది.

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రయోగం దిగ్విజయం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇదొక కలికితురాయిగా నిలిచిపోనుంది. ఇప్పటివరకూ ఆసియాలో మరే దేశమూ ఇటువంటి ప్రయోగం నిర్వహించలేదు. అందుకే ఈ మంగళయాన్‌ భారత్‌కు మంగళప్రదంగా శాశ్వతంగా నిలిచిపోనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌ అంతరిక్ష పరిశోధనలలో యూరోపియన్‌ యూనియన్‌ సరసన ఆత్మగౌరవంతో నిల్చునే అవకాశం దక్కింది. 

భారత ఉపగ్రహాన్ని అనుకున్న సమయానికి నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా భారత శాస్త్రవేత్తలు యావత్‌ భారత దేశానికే గర్వకారణంగా నిలిచారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారత్‌ అద్భుతమైన ప్రగతి సాధించిందనడానికి ఈ విజయమే తార్కాణంగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Tuesday, September 23, 2014

తెలంగాణాలో బడి సెలవుల్లో మార్పు..దసరాకు 15 రోజులు ......సంక్రాంతికి 2 రోజులే...



హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: తెలంగాణాలో బతుకమ్మ పండుగకు మరింత ప్రాముఖ్యతను కల్పిస్తూ దసరాకు పాఠశాలలకు 15 రోజులు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణాలో దసరా, బతుకమ్మ పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

అలాగే సంక్రాంతికి తెలంగాణాలో అంతగా ప్రాధాన్యం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతిని నిర్వహించినంతగా తెలంగాణాలో ఉండదు. అందుకే సంక్రాంతికి సెలవులను రెండు రోజులకే కుదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు.

ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఈ నూతన సెలవుల క్యాలండర్‌ను విధిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మెట్రో పై మెలిక...తొలి దశ అలైన్మెంట్ లో మార్పులకు కేంద్రం 'నో '

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 : హైదరాబాద్‌ మెట్రోపై కేంద్రం మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొదటి దశ అలైన్‌మెంట్‌లో మార్పులు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. 
 
రూట్‌ కారిడార్‌ 1, కారిడార్‌ 2, కారిడార్‌ 3. ఈ మూడు కారిడార్‌లపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ అధికారులు గెజిట్‌ నోటిపికేషన్‌ ఇచ్చారు. ఇందులో ఏమైనా అలైన్‌మెంట్‌ మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా మార్పులు చేయాలంటే కేంద్రం పార్లమెంట్‌లో చట్టం చేసిన తర్వాతే అలైన్‌మెంట్‌ను మార్చవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. వెలివేటెడ్‌ కారిడార్‌ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటుందని, కేసీఆర్‌ చెప్పినట్లుగా అసెంబ్లీ ముందు, సుల్తాన్‌ బజార్‌ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ మెట్రో లైన్‌ సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.

మొదటి  గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఇచ్చిన మ్యాప్‌ ప్రకారమే మెట్రో పనులు జరుగుతాయని, అలైన్‌మెంట్‌లో మార్పులు ఉండవని అధికారులు తేల్చి చెప్పారు. టీ.సీఎస్‌ రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు కూడా నిన్న ఢిల్లీ వచహోంశాఖ, పీఎంఓ అధికారులతో మెట్రోపై చర్చలు జరిపారు.  ఎల్‌ అండ్‌ టీ, తెలంగాణ ప్రభుత్వం మద్య వివాదం కారణంగానే కేంద్రం ఈ గెజిట్‌ నోటీసును విడుదల చేసినట్లుగా తెలియవచ్చింది. ఇక మెట్రో నిర్మాణం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోదలిస్తే కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని స్పష్టమవుతోంది. 

ఢిల్లీ జూ లో విద్యార్ధి ని చంపిన పులి..

న్యూ ఢిల్లీ ,సెప్టెంబర్ 23: White Tiger Attacks And Kills Man Who Fell Into Its Enclosure at Delhi Zoo
ఢిల్లీ జూ లో విద్యార్ధి ని చంపినా పులి.. ఢిల్లీ జూ లో విద్యార్ధి ని చంపినా పులి..ఢిల్లీలోని జంతు ప్రదర్శన శాలలో దారుణం జరిగింది. తెల్ల పులిని ఉంచిన  ఎంక్లోజర్ లో పడిపోయి విద్యార్థి మీద పులి దాడి చేసి చంపేసింది. హిమాంశు అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఈ దాడిలో చనిపోయాడు. తెల్లపులిని ఉంచిన ఎంక్లోజర్ చాలా కిందకు వుండటంతో విద్యార్థి లోపలకు పడిపోయాడని, దాంతో అందరూ చూస్తుండగానే పులి ఆ విద్యార్థి మీద దాడిచేసి చంపేసిందని తెలుస్తోంది.  ఈ సంఘటన జరిగిన సమయంలో పులి ఎంక్లోజర్ సమీపంలో భద్రతా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పులి నుంచి విద్యార్థిని కాపాడలేకపోయారు. విద్యార్థి పులి వున్న కంచె మీదకి ఎక్కి లోపలకి తొంగి చూస్తూ వుండగా లోపలకి పడిపోయాడని ఒక కథనం వినిపిస్తూ వుండగా, లోపలకి తొంగి చూస్తున్న విద్యార్థి మీద పులి దాడి చేసి లోపలకి లాగేసిందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. 

ఐఫోన్ 6 అదరహో....తొలి వారంలోనే కోటి పైగా అమ్మకం

న్యూయార్క్, సెప్టెంబర్ 23: మార్కెట్ లోకి విడుదలైన వారం రోజుల్లోనే భారీ సంఖ్యలో ఐఫోన్6 అమ్ముడైనట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. తొలి వారాంతంలో కోటి  పైగా ఐఫోన్లు అమ్ముడయ్యాయని వ్యాపార విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్టాక్ అందుబాటులో ఉంటే భారీ సంఖ్యలోనే ఐఫోన్ లు అమ్ముడయ్యే అవకాశం ఉండేదని ఆపిల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 తేది  నాటికి 40 లక్షల మంది వినియోగదారులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 
 
తాజా అమ్మకాల ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీ నాస్ డాక్ పై కూడా కనిపించింది. నాస్ డాక్ లో ఆపిల్ 100.58 డాలర్లుగా నమోదు చేసుకుంది. తొలి త్రైమాసికంలో ఆపిల్ కంపెనీ రెవెన్యూ 9 శాతం పెరిగడం కాకుండా వాల్ స్ట్రీట్ అంచనాలను మించిందని చెబుతున్నారు. 

ఎ.పి.లో నిరుద్యోగ వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

 విజయవాడ ,సెప్టెంబర్ 23; 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ నియామకం వయో పరిమితిని 34 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీ వో నెం 295 ప్రకారం ప్రభుత్వం త్వరలో వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. నిరుద్యోగ వయోపరిమితి పెంపు 2016, సెప్టెంబర్‌ 30 వరకు అమలు లో  ఉంటుంది. 





Monday, September 22, 2014

ఫాస్ట్ పధకం పై కె.సి.ఆర్. సర్కార్ కు చుక్కెదురు.

హైదరాబాద్, సెప్టెంబర్ 22;  తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి జారీ చేసిన ‘ఫాస్ట్’ పథకం జీవోను హైకోర్టు తప్పు పట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేయడం రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. జాతీయ సమగ్రతను దెబ్బ తీసేలా ఈ జీవో వుందని హైకోర్టు ఆగ్రహించింది. ఈ జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించింది. తెలంగాణ ఎక్కడో ప్రత్యేకంగా లేదని, తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వ ‘ఫాస్ట్’ జీవోను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు పితాని, డొక్కా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.కేసును ఆరు వారాల తర్వాతకి వాయిదా వేసింది.

తెలంగాణలో నెంబర్ ప్లేట్ల రీ రిజిస్టేషన్ల పై హైకోర్టు స్టే

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ ప్లేట్ల రీ రిజిస్టేషన్ల ప్రక్రియపై సోమవారం హైకోర్టు స్టే విధించింది. తెలంగాణలో వాహనాలకు రీరిజిస్ట్రేషన్ అంశంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణాశాఖకు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. రిజిస్టేషన్ల పేరిట పౌరులను ఎందుకు వేధిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. కొత్త చట్టాన్ని రూపొందించకుండా పాత రిజిస్టేషన్లు ఎలా మారుస్తారని ప్రశ్నించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. అధికారం ఉందని ఏమైనా చేయాలనుకుంటే సరికాదని హైకోర్టు ప్రభుత్వానికి చురకలంటించింది. 

Friday, September 19, 2014

ఆస్తులు ప్రకటించిన బాబు...

హైదరాబాద్, సెప్టెంబర్ 19; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాల్గో ఏడాది కూడా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే తన బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దిగా పెరిగిందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. తన ఆస్తులు రూ70.69 లక్షలు ఉండగా,  భార్య భువనేశ్వరి ఆస్తులు రూ.46 కోట్ల 88 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. అయితే భువనేశ్వరి పేరిట ఉన్న పీఎఫ్ తో పాటు బంగారం కూడా పెరిగిందని స్పష్టం చేశారు. తనకు జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంటి విలువ రూ.23.2 లక్షలు మాత్రమేనని చంద్రబాబు పేర్కొన్నారు. తనకున్న అంబాసిడర్ కారు విలువ లక్షా యాభై రెండు వేలని స్పష్టం చేశారు.
 
ఇదిలా ఉండగా లోకేష్ ఆస్తులు యథావిధిగా రూ.11కోట్ల నాలుగు లక్షలు మాత్రమేనని, కోడలు బ్రహ్మిణి ఆస్తులు రూ.5 కోట్ల రెండు లక్షలున్నాయన్నారు.  తాజాగా తమ ఖాతాలో ఒక వాహనం పెరిగిందన్నారు. ఈ ఆస్తుల వివరాలను ఎథిక్స్ కమిటీకి సమర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

మేందలిన్ శ్రీనివాస్ మృతి...

విజయవాడ, సెప్టెంబర్ 19: 
ప్రముఖ మేండలిన్ వాయిద్య విద్వాంసుడు మేండలిన్ శ్రీనివాస్ మరణించారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మేండలిన్ శ్రీనివాస్ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఉప్పలపు శ్రీనివాస్ మేండలిన్ విద్వాంసుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆయన మేండలిన్ ప్రదర్శనలు ఇచ్చారు. మేండలిన్తో జీవితం పెనవేసుకున్న ఆయన పేరు కూడా మేండలిన్ శ్రీనివాస్గా మారిపోయింది. బాల్యం నుంచే మేండలిన్ విద్వాంసుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆయన సంపాదించారు. ఆరు సంవత్సరాల వయసున్నప్పటి నుంచే ఆయన మేండలిన్ మీద స్వరాలు పలికించడం ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఆయనని 1998 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2010 సంవత్సరంలో ఆయనకు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. మేండలిన్ శ్రీనివాస్కి శ్రీ అనే యువతితో పెళ్ళయింది. అయితే ఆమె తనను మానసికంగా ఎంతో హింసిస్తోందని, ఆమె నుంచి తనకు విడాకులు కావాలని మేండలిన్ శ్రీనివాస్ కోర్టుకు ఎక్కారు. కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. 


Tuesday, September 16, 2014

నందిగామలో టీడీపీ ఘన విజయం...


విజయవాడ, సెప్టెంబర్‌ 16 : కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి బాబూరావుపై 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1,84,708 ఓట్లు కాగా 1,27,434 ఓట్లు పోలయ్యాయి.  టీడీపీకి 99,748 ఓట్లు, కాంగ్రెస్‌కు 24,921 ఓట్లతో డిపాజిట్‌ దక్కించుకుంది. నందిగామలో నోటాకు 11,77 ఓట్లు పోలైయ్యాయి. 

టి ఆర్ ఎస్ దే మెదక్ ...

మెదక్‌, సెప్టెంబర్‌ 16 : మెదక్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తప్రభాకర్‌రెడ్డి 3,61,277 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్‌, మూడవ స్థానంలో బీజేపీ పార్టీలు నిలిచాయి.
 
మొదటి నుంచి మెదక్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగింది. కౌంటింగ్‌ ప్రారంభం నుంచే ప్రతీ రౌండ్‌లోనూ 20 నుంచి 30వేల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ దూసుకెళ్తూ వచ్చింది. మెదక్‌లో మొత్తం 10,46,080 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 5,71,800, కాంగ్రెస్‌కు 2,10,523, బీజేపీకి 1,86,344ఓట్లు లభించాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Wednesday, September 10, 2014

ఢిల్లీకి కమలనాథన్ కమిటీ నివేదిక

హైదరాబాద్,సెప్టెంబర్ 10:  రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ నివేదిక ఢిల్లీకి చేరింది. నివేదికను మొదట ఈ మెయిల్ రూపంలో, తరువాత కొరియర్‌లో పంపించింది. సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నోటిఫై చేసిన తరువాత ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల కేడర్ సంఖ్యను నిర్దారించనున్నారు.ఇటీవల కమలనాథన్ కమిటీ ఇచ్చిన ఉద్యోగుల వివరాలు అప్పటి వరకు ప్రభుత్వం వివిధ సమయాల్లో మంజూరు చేసిన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలపైనే వివరించింది. రాష్ట్రస్థాయి కేడర్ అధికారులను విభజించడానికి ముందు కేడర్ సంఖ్య నిర్దారించాలని ఇది కొన్నింటికి సంబంధించి జనాభా నిష్పత్తిలో, మరికొన్ని భౌగోళిక పరిస్థితి ఆధారంగా నిర్దారించాలని నిర్ణయించారు. 

Tuesday, September 2, 2014

3-0 తో వన్డే సిరిస్ గెలిచిన ధోని సేన ...

బర్మింగ్ హాం, సెప్టెంబర్ 2; టెస్ట్ లలో  ఘోరంగా ఓడిన  టీమిండియా.. వన్డేల్లో విశేషంగా రాణించి ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ను కైవసం చేసుకుంది. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఆటగాళ్లు సరికొత్త చరిత్రను లిఖించారు. మంగళవారం ఇంగ్లండ్ తో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. వన్డేల్లో ప్రదర్శించిన ఊపునే కొనసాగించిన టీమిండియా ఆటగాళ్లు.. అదే విజయపరంపరను కొనసాగించి సిరీస్ 3-0 తేడాతో చేజిక్కించుకున్నారు. 207 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఓపెనర్లు రహానే, శిఖర్ థావన్ లు శుభారంభానిచ్చారు. రహానే (106), పరుగులు చేసి వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేయగా, మరో ఓపెనర్ శిఖర్ థావన్(97*) పరుగులతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచి ఇంగ్లండ్ పై విరుచుకుపడిన భారత్.. కేవలం 30.3 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఐదు వన్డేలకు గాను జరిగిన ఈ సిరీస్ లో ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే టీమిండియా సిరీస్ దక్కించుకోవడం విశేషం.
 
ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ను టీమిండియా బౌలర్లు మరోమారు స్వల్ప పరుగులకే కట్టడి చేశారు.  ఓపెనర్లు అలెస్టర్ కుక్(9),హేల్స్ (6)లను  భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే పెవిలియన్ కు పంపి ఇంగ్లండ్ కు షాకిచ్చాడు. అనంతరం బ్యాలెన్స్ (7) పరుగులకే పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లండ్ తేరుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు రూట్ (44), మహ్మద్ ఆలీ(67)పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 206 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీకి మూడు వికెట్లు లభించగా, జడేజా, భువనేశ్వర్ కుమార్ లకు తలో రెండు, అశ్విన్, రైనాలకు చెరో వికెట్టు లభించింది 

వినాయక్ దర్శకత్వంలో చిరు 150వ చిత్రం?

హైదరాబాద్,సెప్టెంబర్ 2: మెగా స్టార్ చిరు  150వ  చిత్రానికి రంగం సిద్దం అవుతోంది. ఈ సినిమాని వివి వినాయక్ డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. 
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్స్ ఎవరనే  విషయం లో  కూడా ఇంకా ఒక స్పష్టత లేదు.  ఎవరిని సంప్రదిస్తున్నారనే విషయం కూడా బయటకు రాలేదు. అయితే పలువురు హీరోయిన్లు చిరంజీవి సరసన నటించడానికి ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. చిరు సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ప్రణీత , శ్రీయ ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు.

సీనియర్ నటి టబు కూడా చిరు 150వ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.అయితే ఇందులో హీరోయిన్ అవకాశం ఎవరికి దక్కుతుందో ఊహించి చెప్పడం కష్టం.  టాలీవుడ్ లో ఎప్పుడు ఎక్కడ విన్నా ఈ చిత్రం గురించే వినిపిస్తోంది. ఇక అభిమానులు, ప్రేక్షకులు చిరు సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో వేరే చెప్పాలా... 

త్వరలో పవన్ పుతృని తెరంగేట్రం...

హైదరాబాద్,సెప్టెంబర్ 2: పవన్ కళ్యాణ్ అభిమానులకి  శుభ వార్త చెబుతానని లోగడ ప్రకటించిన రేణూ దేశాయ్ ఇప్పుడు ఆ విషయం వెల్లడించారు.పవన్ , రెణూదేశాయ్  గారాలబ్బాయి అకీరాను త్వరలో వెండితెరపై చూడవచ్చునని పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న రేణు దేశాయ్ స్వయంగా  వెల్లడించారు. 

రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ సినిమాలో అకీరా అతిథి పాత్రలో నటించాడు. అకీరా తెరంగేట్రం గురించి రేణు ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు. 'ఇష్క్ వాలా లవ్ చిత్రంలో అకీరా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. నేను దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న చిత్రంలో అకీరా వెండితెరకు పరిచయం కావడం ఓ తల్లిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది' అని రేణు ట్వీట్ చేశారు. అకీరా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలను రేణు గతంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. పవన్ తో విడిపోయినా రేణు అతణ్ని ప్రశంసిస్తూ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంటారు.
 

Monday, September 1, 2014

వ్యభిచారం కేసులో శ్వేతబసు...

హైదరాబాద్‌, సెప్టెంబర్ 1:   నటి శ్వేతబసు(కొత్త బంగారు లోకం) ను వ్యభిచారం కేసులో  పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. కోల్‌కతాకు చెందిన శ్వేత బసు పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఆదివారం రాత్రి నగరం లోని ఓ ప్రముఖ హోటల్‌ పై పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ  దాడిలో  శ్వేత బసును,  ఆమెతో పాటు ఉన్నఒక  పారిశ్రామిక వేత్త ను పట్టుకున్నట్టు సమాచారం.

చేతివ్రాతనే లిపిగా గుర్తింపు తెచుకున్న బాపు..

చేతివ్రాతనే ఒక లిపిగా గుర్తింపు తెచుకున్న బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన సత్తిరాజుని మహాత్ముడి స్ఫూర్తితోను, తన తండ్రి పేరు కలిసొచ్చేలా ‘బాపు’ అని ఆయన తల్లి ముద్దుగా పిలుచుకునేవారు. తరువాతి కాలంలో ఆ పేరే ఆయనకు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఏ పుస్తకంలో చూసిన బాపు చేతవ్రాత ఫాంట్‌లో అక్షరాలు తప్పక కనిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి  బాపు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని నిడమోలులోని అమ్మమ్మ ఇంట్లో   1933, డిసెంబర్‌ 15న జన్మించారు. తండ్రి వృత్తి రీత్యా మద్రాసుకి వచ్చిన బాపూ మద్రాసు విశ్వవిద్యాలయంలో 1955లో బీఎల్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే చిత్రకారుడిగా ప్రావీణ్యం సాధించిన బాపు 1945లో ‘ఆంధ్రపత్రిక’లో కార్టూనిస్ట్‌గా కూడా పనిచేశారు. హిందూ దేవతారూపాలను ఎక్కువగా చిత్రీకరించేవారు. బాపూ సినిమాల్లో కూడా అధిక శాతం హిందూ ఇతిహాసాలకు సంబంధించినవే. రామాయణంను తన సినిమాల ద్వారా సామాన్య ప్రజలకి చేరువ చేసిన ఘనుల్లో బాపూ కూడా ఒకరు.  1967లో ‘సాక్షి’ సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన బాపు తెలుగు, హిందీ, తమిళ భాషలతో కలిపి మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘బాంగారుపిచ్చిక’ (1978), బుద్ధిమంతుడు (1969), బాలరాజు కథ (1970), సంపూర్ణ రామాయణం (1971), అందాల రాముడు (1973), శ్రీరామాంజనేయ యుద్ధం (1974), ‘ముత్యాలముగ్గు’ (1975), ‘సీతాకల్యాణం’ (1976), భక్తకన్నప్ప (1976) ‘సీతాస్వయవరం’ (1976), ‘మనవూరి పాండవులు’ (1978), ‘తూర్పు వెళ్లే రైలు’ (1979), రాధాకల్యాణం (1981), ‘సీతమ్మ పెళ్లి’ (1984), ‘రామబంటు’ (1996), ‘రాధా గోపాలం’ (2005), ‘సుందరాకాండ’ (2008), ‘శ్రీరామరాజ్యం’ (2011)... బాపూ తెరకెక్కించిన దృశ్యకావ్యాల్లో కొన్ని. హిందీలో ‘హమ్‌ పాంచ్‌’ (1980), వో సాత్‌ దిన్‌ (1983), ‘మొహబ్బత్‌’ (1984), ‘ప్యారీ బెహ్న’ (1985) చిత్రాలు తీశారు. 
పురస్కారాలు...
1986లో రమణతో కలిసి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును, బాపు రెండు జాతీయ అవార్డులు, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. 2013లో పద్మశ్రీ పురస్కారం బాపూని వరించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీలతోపాటు పలు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా ఆయన పొందారు.  


బాపుకు తానా, నాట్స్‌ నివాళి...

బోస్టన్‌, సెప్టెంబర్‌ 1 :  దర్శక దిగ్గజం, చిత్రకారుడు బాపు మృతిపై ప్రవాస సంఘాలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. బాపు మృతికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించాయి. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటుగా తానా, నాట్స్‌ అభివర్ణించాయి. తానా తొలిరోజుల నుంచి బాపుగారికి తానాతో ప్రగాఢ అనుబంధం ఉందని తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని గుర్తు చేశారు. 1985లో లాస్‌ ఏంజెలెస్‌లో జరిగిన తానా మహాసభలలో  బాపు ను ముఖ్య అతిథిగా  గౌరవించినట్లు ఆయన చెప్పారు. బాపు బొమ్మ, రమణ రచనల మొదటి ప్రచరణల స్వర్ణోత్సవాన్ని 1995లో దశమ తానా మహాసభలలో (చికాగో) ఘనంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు.  ఆ సర్వోత్సవాల్లో భాగంగా బాపు-రమణలపై ప్రత్యేకంగా ప్రచురించిన బొమ్మ-బొరుసు అనే పుస్తకం బహుళ ప్రచారం పొందిందని ఆయన అన్నారు. తానా పత్రికకు ప్రత్యేకంగా బాపు రామాయణం, కృష్ణ లీలలు బొమ్మల సీరియల్స్‌ అందించారని ఆయన గుర్తు చేశారు. కాగా, బాపు మరణవార్త  అమెరికాలో ఉండే తెలుగు వారిని  కలచి వేసిందని నాట్స్‌ అధ్యక్షుడు గంగాధర్‌ దేసు అన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాపుకి జీవిత సాఫల్య పురస్కారంతో నాట్స్‌ సత్కరించుకున్న విషయాన్ని  నాట్స్‌ సభ్యులు గుర్తు చేసుకున్నారు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...