Monday, November 25, 2013

ఆరుషిని అమ్మా,నాన్నే చంపేశారు...

న్యూఢిల్లీ, నవంబర్ 25:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి, పని మనిషి  హేమ్‌రాజ్‌  హత్య కేసులో  ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది.  అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఈ  హత్య కేసులో తల్లిదండ్రులు డాక్టర్ రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్ లే కూతురు ఆరుషి, తమ వద్ద పని చేసే హేమరాజ్ ను హత్య చేశారని సి. బి.ఐ. ఛార్జీషీట్ లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 15 నెలల్లో 84 మంది సాక్షులను సీబీఐ విచారించింది.  ఈ రోజు తీర్పు వెలువరించిన కోర్టు -తల్వార్ దంపతులు హత్యతో పాటు సాక్ష్యాధారాలు కూడా వారు తారుమారు చేశారని తెలిపింది.  ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే16, 2008న 14 ఏళ్ల ఆరుషి హత్యకు గురైంది.  నిందితుడిగా అనుమానించిన హేమ్‌రాజ్‌ కూడా ఆ తరువాత  అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తల్లిదండ్రలు ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. 

టి.బిల్లుపై తొందర ప(పె)డుతున్న సోనియా...?

న్యూఢిల్లీ, నవంబర్ 25:  రాష్ట్ర విభజనపై   కసరత్తు చేసి తయారు చేసిన నివేదికను కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సోమవారం నాడు యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అందజేసింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జయరామ్, ఎకె ఆంటోనీ,  దిగ్విజయ్ సింగ్, చిదంబరం  పాల్గొన్నారు.గంటన్నరసేపు జరిగిన వీరి సమావేశం లో   హైదరాబాద్ పైనే  ప్రధానంగా చర్చ జరిగినట్టు సమచారం.  జిహెచ్ ఎంసి పరిధిని ఉమ్మడి రాజధానిగా చేస్తే సీమాంధ్రుల హక్కులకు రక్షణ లభిస్తుందని జిఓఎంలోని ఒక సభ్యుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 27న జిఓఎం తుది సమావేశం జరుగనుంది.  సోనియా గాంధీ  ఇచ్చిన సలహాల ఆధారంగా తుది నివేదిక రూపొందించే అవకాశం ఉంది.  తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రవేశపెట్టకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, మొదటికే మోసం వస్తుందని సోనియా గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ బిల్లును వాయిదా వేయడం వల్ల ఉపయోగం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఇంత దూరం వచ్చిన తర్వాత వెనకడుగు వేసినట్లు వాయిదా వేయడం మంచిది కాదని సోనియా  వాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ బిల్లుపై రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయం చెప్పడానికి కనీసం రెండు వారాలైనా సమయం ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  భావిస్తున్నారుట.

మూడేళ్ళు ముప్పతిప్పలు పడ్డా ముందుకే సాగా...సి.ఎం.

హైదరాబాద్,నవంబర్ 25:  రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా  ఒత్తిడి తెస్తున్నట్లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. సమైక్యం కోసం బయట మాట్లాడేది 30 శాతమే మాత్రమేనని, అంతకు మూడింతలు అధిష్టానం దగ్గర మాట్లాడానని తెలిపారు. విభజన అంశంపై గతంలో ఇందిరా గాంధీ మాట్లాడాన్ని ప్రసంగాన్ని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని తెలిపారు. అసెంబ్లీలో విభజనపై అన్ని విషయాలతో చర్చిస్తామన్నారు.  తాను వ్యక్తిగతంగా మాట్లాడడం లేదని, అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. తన మాటల్లో స్వార్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు ఎంతో మేలు చేశామని, ప్రభుత్వ కార్యక్రమాల వల్ల తెలంగాణకే ఎక్కువ మేలు జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు 14ఎఫ్ తొలగింపు కోసం ఆందోళన చేశారని చేశారని, దాన్ని తొలగించామని ఆయన అన్నారు.సమైక్యమా? కాంగ్రెస్ పార్టీనా అనేది రాకూడదనుకుంటున్నానని, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని కిరణ్ తెలిపారు. అసెంబ్లీకి డ్రాఫ్ట్ బిల్లు ఎప్పుడొస్తుందో తెలీదని, అసెంబ్లీ ప్రొరోగ్ విషయం చాలా చిన్న విషయమన్నారు. సీఎంగా   ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని అన్నారు. విద్యారంగంలో పారదర్శకతను తీసుకొచ్చామని, మీ సేవా ద్వారా 192 సేవలు తీసుకొచ్చామని తెలిపారు. ఎస్సీఎస్టీల కోసం చారిత్రకమైన చట్టం తెచ్చామని ఆయన చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకున్నామని ఆయన చెప్పారు.  

Wednesday, November 20, 2013



బుధవారం  గోవాలో 44వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ...చిత్రోత్సవానికి హాజరవుతున్న నటి రేఖ, గాయని ఆషా భోన్సలే...  

హైదరాబాద్ లో  బుధవారం ముగిసిన అంతర్జాతీయ బాలల  చలన చిత్రోత్సవం ముగింపు ఉత్సవం లో ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్...
                      
హైదరాబాద్ లో  బుధవారం ముగిసిన అంతర్జాతీయ బాలల  చలన చిత్రోత్సవం ముగింపు ఉత్సవం లో ప్రసంగిస్తున్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి అరుణ..

ముగిసిన బాలల చిత్రోత్సవం

 హైదరాబాద్ ,నవంబర్ 20:  రాష్ట్ర రాజధానిలో వారం రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం బుధవారం ముగిసింది.   ఉత్తమ చిత్రంగా బ్రేకింగ్ ది సైలెన్స్, టమోటో చోర్ ను ఎంపిక చేశారు. షార్ట్ ఫిలిం డివిజన్ లో తొలి ఉత్తమ చిత్రంగా చింటి, రెండో ఉత్తమ చిత్రంగా ఓమోగియా నిలిచాయి. జ్యూరీ అవార్డు మై ష్యూస్ దక్కించుకోగా.. యానిమేషన్ విభాగంలో ఏమెస్ట్ సెల్సిలైన్, జరాఫా ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి.రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా టాలీవుడ్ హీరో పవన్ కల్యాన్, పలువురు సినీ ప్రముఖులు, రాష్ట్రమంత్రులు తదితరులు హాజర య్యారు.

నివేదికపై మంత్రుల మల్లగుల్లాలు....

న్యూఢిల్లీ, నవంబర్ 20: రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) నివేదిక ఇచ్చే విషయంలో  ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది.  రాష్ట్రాన్ని విభజించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదనే వాస్తవం వారికిప్పుడిప్పుడే అర్ధమవుత్రున్నట్టుంది.  హైదరాబాద్, భద్రాచలం, నదీజలాలు, శాంతిభద్రతలు, విద్య, వైద్యం, సీమాంధ్రుల భద్రత.... ఇలా అనేక కీలక  అంశాలకు సంబంధించి  ఇంకా పరిష్కారాలు దొరికినట్టులేదు.   మరో పక్క రాష్ట్రాన్ని విభజించాలంటే  రాజ్యంగంలోని 371(డి)ని తొలగించాల్సిందేనని అటార్నీ జనరల్ వాహనవతి స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ బిల్లుకు ముందు రాజ్యాంగ సవరణ చేయాలని, 371(డి) ఉండగా విభజన చేయడం కుదరదని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చారు.  విభజన జరిగితే రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక ప్రతిపత్తి ఉండదని  వాహనవతి  కేంద్రానికితెలిపారు. ఈ నేపధ్యంలో ఈరోజు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ కేంద్ర హొం శాఖ అధికారులతో  సమావేశమయ్యారు.  జిఓఎం తుది సమావేశం విషయమై సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు.  రేపటి జిఓఎం సమావేశం చివరిది కాదని షిండే విలేకరులకు చెప్పారు. మరికొన్ని సమావేశాలు జరుగుతాయని కూడా ఆయన తెలిపారు. జైరాం రమేష్ అందుకు భిన్నంగా చెప్పారు. రేపటి జిఓఎం సమావేశానికి  ఏడుగురు సభ్యులూ హాజరవుతారని, ఇదే తుది సమావేశమని  అన్నారు.    

Tuesday, November 19, 2013

మంగళవారం నాడు   ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీ లోని ఆమె సమాధి శక్తిస్థల్ వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న సోనియా, రాహుల్... 

మంగళవారం నాడు ముంబైలో తొలి భారతీయ మహిళా బ్యాంక్ ప్రారభోత్సవం సందర్భంగా మొట్టమొదటి ఖాతాదారుకు అకౌంట్ కిట్  అందిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్...

Monday, November 18, 2013

జీవోఎం ఎదుట సి.ఎం.' సమైక్య ' వాదన

న్యూఢిల్లీ, నవంబర్ 18: రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య తీవ్రమవుతుందని  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జీవోఎంతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీవోఎంకు రెండు పుస్తకాలు  అందించిన ఆయన, తాను నివేదించిన అంశాల గురించి వెల్లడించారు. ఆ అంశాలివీ..
    స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటికంటే తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది. పారిశ్రామికంగా హైదరాబాద్ ఎంతో ఎదిగింది. ముఖ్యంగా ఫార్మా, ఇతర భారీ పరిశ్రమలు చాలా ఏర్పడ్డాయి.    హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా విద్య, వైద్య పరమైన అవకాశాలు ఉన్నందున సీమాంధ్ర ప్రజలకు సమస్యలు ఏర్పడతాయి. సీమాంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు.
    గత పదేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య నక్సలిజమేనని ప్రధాని గతంలో కనీసం ఆరేడుసార్లు చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలంతా రాష్ట్రానికి చెందినవారే. నక్సలైట్లలో ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యులంతా ఏపీ వాళ్లే. విభజన వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య పెరుగుతుంది.   రాష్ట్రంలో ఉగ్రవాదుల నుంచి కూడా పెద్ద సవాల్ ఎదురవుతోంది. విభజన వల్ల పోలీస్ వ్యవస్థ బలహీనపడుతుంది. హైదరాబాద్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. గణేశ్ చవితి లాంటి పెద్ద పండగ ఏమైనా వస్తే జిల్లాల నుంచి 25 వేల మంది పోలీసులను హైదరాబాద్ కు తెస్తాం. అలాంటిది ఇప్పుడు విభజిస్తే అలాంటి పండుగల నిర్వహణే కష్టమైపోతుంది.
    హైదరాబాద్ లో శాంతియుత వాతావరణం ఉంది. ఇటీవల ఎన్నో ఉద్యమాలు జరిగినా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ మీదే ఆధారపడుతున్నారు. ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో ఎక్కువ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతికూల ప్రభావం పడుతుంది.
    విభజన వల్ల సాగునీటి సమస్య తీవ్రమవుతుంది. కృష్ణా నదీ జలాలపై ఇప్పటికే వివాదాలున్నాయి. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు వీటిని వాడుకుంటున్నారు. సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా రైతులు కృష్ణా జలాలతో సాగు చేస్తున్నారు. విభజన వల్ల ఇరు ప్రాంతాల రైతులు నష్టపోతారు.
    విద్యుత్ పంపిణీలో కూడా చాలా సమస్యలు తప్పవు. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్తును ఎవరెవరు ఎంతెంత పంచుకోవాలన్న సమస్య వస్తుంది. దాంతోపాటు విద్యుత్ ఇరు ప్రాంతాల మధ్య విద్యుత్ పంపిణీలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకే అజమాయిషీలో విద్యుత్ పంపిణీ ఉంటే పర్వాలేదు. కానీ రెండు రాష్ట్రాలైతే ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో ఉండే విద్యుత్ ప్రాజెక్టులకు విద్యుత్ ఎక్కడ నుంచి ఇవ్వాలి?
    ట్రిబ్యునళ్లు ఉండటం వల్ల సాగునీటి విషయంలో ఇప్పటికే చాలా వివాదాలున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో ఇప్పటికే గొడవలున్నాయి.
    16 శాతం ఉద్యోగాల కోసం, 53 శాతం వ్యాపారం కోసం, మిగిలినవారంతా చదువు కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నాయి.
    ప్రభుత్వోద్యోగాల్లో ప్రాంతాలవారీగా రిజర్వేషన్లుంటాయి. విభజన వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఇతర ప్రాంతాల ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. వాళ్లంతా ఎక్కడికెళ్లాలన్న సమస్య వస్తుంది. 


 

శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు :షిండే

న్యూఢిల్లీ, నవంబర్ 18:  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోం  మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.  ఈ నెల 21 కేంద్ర మంత్రి మండలి సమావేశమవుతుందని చెప్పారు.  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభమవుతాయి. శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాలంటే ఈ నెల 21న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలోనే తెలంగాణ బిల్లును ఆమోదించవలసి ఉంటుంది.  ఇలావుండగా  ఈ నెలఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం అవుతుందని కేంద్రమంత్రి  వీరప్ప మొయిలీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాగా,  మంత్రుల బృందం సోమవారం నాడు  సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులతో  సమావేశం  జరిపింది.  కేంద్ర మంత్రులు  పల్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు.

Saturday, November 16, 2013

సచిన్ చివరి మ్యాచ్: మూడో రోజే ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం

ముంబై, నవంబర్ 16: సచిన్ టెండూల్కర్ వీడ్కోలు టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. మంబై టెస్టులో మూడో రోజే విండీస్ ను ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో ఓడించింది.  దీంతో రెండు టెస్టుల సిరీస్ ను ధోనీసేన 2-0తో సొంతం చేసుకుంది. 43/3 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 187 పరుగులకు కుప్పకూలింది. భారత స్పిన్నర్లు ప్రజ్ఞాన్ ఓజా, అశ్విన్ విండీస్ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్ లో ఓజా ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం రాకపోవడంతో మళ్లీ బ్యాటింగ్ కు దిగని సచిన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి అభిమానులను అలరించాడు. 

బరువెక్కిన వాంఖడే..భావోద్వేగంతో సచిన్ కు వీడ్కోలు

ముంబై, నవంబర్ 16:ముంబై వాంఖడే స్టేడియంలో శనివారం  అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది.  ఏ క్రికెటర్ కూ లభించని  గౌరవం క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు దక్కింది. తన చరిత్రాత్మక 200వ టెస్టు ఆడిన అనంతరం సచిన్ కెరీర్ కు ఘనమైన వీడ్కోలు పలికాడు. మాస్టర్ వీడ్కోలు సందేశం ప్రారంభించగానే స్టేడియంలో గంభీర వాతావరణం నెలకొంది.క్రికెట్ ఎప్పుడూ తన హృదయంలో నిలిచి ఉంటుందని, క్రికెట్‌పై తనకున్న అభిమానం ఇంతకాలం నడిపిందని సచిన్ టెండూల్కర్ అన్నారు.   విజయంతో టెస్టు ముగిసిన వెంటనే సచిన్ భావోద్వేగంతో కంటతడిపెట్టుకున్నారు. మైదానంలో అభిమానులకు అభివాదం చేశారు. చప్పట్లతో అభిమానులు సచిన్‌ను వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తాను ఎంతో భావోద్వేగంతో ఉన్నానని తెలిపారు. గత 24 ఏళ్లుగా క్రి కెట్‌ను ఆస్వాధించానని అభిమానులకు చెప్పారు. 22 గజాల పిచ్‌లో 24 ఏళ్లు గడపడం ఆనందంగా ఉందని సచిన్ తెలిపారు. వరల్ట్ కప్ సమయంలో తన తండ్రిని కోల్పోవడం చాలా బాధ కలిగించిందని, తన తండ్రి పోత్రాహం లేకపోతే తానీ స్థితిలో ఉండేవాడిని కాదని సచిన్ అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ సచిన్ కృతజ్ఞతలు తెలిపారు.తన గురించి అమ్మ ఎప్పుడూ ఆలోచించేందని, తనకోసం త్యాగాలు చేసిన అమ్మకు సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పుడు క్రీజ్‌లో ఉన్నా బాగా ఆడాలని అమ్మ ప్రార్థించేదని గుర్తు చేసుకున్నారు. తన ఆంటీ సొంత కొడుకులా చూసుకుందని, తనకు సోదరి తొలి బ్యాట్‌ను బహుమతిగా అందజేశారని చెప్పారు.  తన అన్న అజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయన చెప్పారు.  అంజలి సహాయ సహకారాలు లేకపోతే ఇంత సాధించే వాడిని కాదని, క్రికెట్ వల్ల తన కుటుంబ సభ్యులతో గడపలేకపోయానని, తన కుటుంబ బాధ్యతలను అంజలి చూసుకుందని సచిన్ తెలిపారు. ఈ క్రమంలో అంజలి టెండూల్కర్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. స్టేడియంలో ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. మాజీ క్రికెటర్లు, సహచరల క్రికెటర్లకు సచిన్ కృతజ్ఞతలు చెప్పారు. కుంబ్లే, గంగూలి, ద్రావిడ్, లక్షణ్ తన కుటుంబం అని సచిన్ అన్నారు.


 

ప్రముఖ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు 'భారతరత్న'

న్యూఢిల్లీ, నవంబర్ 16: సైన్స్ లో విశేష సేవలు చేసినందుకు  ప్రధాని సాంకేతిక సలహాదారుడు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్న పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది.  భారత క్రికెట్ కు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ తో కలిపి రావుకు  కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రావు పూర్తి పేరు  చింతామణి నాగేశ రామచంద్ర రావు. బెంగళూరులో జూన్ 30, 1934న  నాగేశ్వరరావు, నాగమ్మ దంపతులకు జన్మించిన  రావు  సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీ, మెటీరియల్‌ సైన్స్‌ రంగాలలో  ప్రముఖ శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యారు.  ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ గురించిన ఆయన పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు.మైసూర్ విశ్వవిద్యాలయంలో 1951లో డిగ్రీ పూర్తి చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీపూర్తి చేశారు. 1958లో ఫుర్డ్యూ యూనివర్సిటీలో పిహెచ్ డి అందుకున్నారు. కాన్పూరు ఐఐటిలో దాదాపు 13 ఏళ్లు రసాయశాస్త అధ్యాపడుకుడగా పని చేశారు. 84-94 మధ్య కాలంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు. ఆక్స్ ఫర్డ్, కేండ్రిడ్జి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేశారు. జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రిసెర్చ్ సంస్థకు గౌరవాధ్యక్షుడుగా పని చేశారు.60 ఏళ్ల పరిశోధనా ప్రస్థానం లో సి.ఎన్.ఆర్.రావు .  అనేక అవార్డులు  అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్‌ అవార్డులు అందజేసింది. దేశవిదేశాల నుంచి ఆయన 150కి పైగా పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ లు ఇచ్చాయి.2000 లో  రాయల్ సొసైటీ నుంచి హ్యూస్ మెడల్, 2004 లో భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు ,     2005 లో టెల్ అవివ్ యూనివర్సిటీ నుంచి డాన్ డేవిడ్ ప్రైజ్ అందుకున్నారు. ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ రాయల్ సొసైటీ (లండన్), ఫ్రెంచ్ అకాడమీ, జపాన్ అకాడమీ, పోంటిఫికల్ అకాడమీ అవార్డులు ఆయన అందుకున్నారు.  45కి పైగా పుస్తకాలు, 1500 పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు.

 

లిటిల్ మాస్టర్ కు 'భారతరత్న'

న్యూఢిల్లీ,నవంబర్ 16: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమానుల కోరిక ఫలించింది. క్రికెట్ లో భారతదేశ కీర్తిని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను  ప్రకటించింది.  ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సచిన్‌ స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడింది. ప్రపంచ క్రీడారంగంలో భారత బ్రాండ్‌ అంబాసిడర్‌ సచినే అని ఆ లేఖలో పేర్కొంది.  క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న లిటిల్ మాస్టర్ 'భారతరత్న' అందుకోవడంలో కూడా రికార్డు సృష్టించాడు. భారతరత్న అందుకోనున్న అతి చిన్న వయస్కుడు(40) సచిన్. ఈ అత్యున్నత పురస్కారం  అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా కూడా  చరిత్ర సృష్టించాడు.    ఈ అవార్డును తన తల్లి రజనీ టెండూల్కర్‌కు అంకితమిస్తున్నట్లు సచిన్‌ చెప్పాడు. రమేశ్ టెండూల్కర్, రజని దంపతుల
కు 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించిన  సచిన్ భారత క్రికెట్ కు 24 ఏళ్ల పాటు సేవలు అందించాడు. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా - అంతర్జాతీయ కెరీర్ లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ గా - టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా లిటిల్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు.  క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన సచిన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు.  1999లో పద్మశ్రీ,  1998లో క్రీడల్లో అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ఖేల్‌రత్న, 1994లో అర్జున అవార్డు, 2008లో పద్మవిభూషణ్‌ లను మాస్టర్‌ అందుకున్నాడు.  ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేసింది. ఇప్పుడు  దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా దక్కించుకొని క్రీడారంగంలో ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్ నిలిచాడు. 

Tuesday, November 12, 2013

విలీనం గిలీనం జాన్తా నై....

హైదరాబాద్, నవంబర్ 12: కాంగ్రెస్‌లో  టి. ఆర్. ఎస్. విలీనం ఉండదని ప్రజలకు గట్టిగా చెప్పాలంటూ పార్టీ నేతలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించారు. హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయని, అదే జరిగితే మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధంకండని  ఉద్భోదించారు. "కేంద్రంలో ఉన్నోళ్లకు మతి లేనట్టుంది. ఏం ఇచ్చినా తీసుకుంటారని అనుకుంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు చేస్తున్నారు. హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాలు కేంద్రం పరిధిలో ఉండటానికి టీ కాంగ్రెస్ నేతలు అంగీకరించి వచ్చారు. తెలంగాణ ప్రజలు అంత అసమర్థులా? శాంతిభద్రతలను స్వయంగా నిర్వహించుకోలేరా? ఇది అవమానించడం కాదా?'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌తో ఎలా కలుస్తామని ప్రశ్నించారు. "ఇదివరకు చెన్నారెడ్డి కాంగ్రెస్‌లో కలిస్తే అమ్ముడుపోయారన్నారు. తెలంగాణకు ద్రోహం చేశారని తిట్టిపోశారు. ఇప్పుడు మనం..ఆంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని అంగీకరిస్తే, ఇన్ని రోజులు చేసిన పోరాటం వృధా అవుతుంది. మనల్ని కూడా ద్రోహుల కింద జమకడతారు. ఇన్ని రోజులు పోరాడి.. చివరి నిమిషంలో ముఖానికి మసి ఎందుకు అంటించుకోవాలి? అందుకే షరతులు, ఆంక్షలులేని సంపూర్ణ తెలంగాణ కావాలని జీవోఎం ముందు కుండబద్ధలు కొడ్తాం. వింటే అదృష్టం.. లేకపోతే వాళ్ల ఖర్మ'' అని కేసీఆర్ అన్నారు.

యు.పి.ఎ. 2 హయాం లోనే తెలంగాణా బిల్లు: షిండే

న్యూఢిల్లీ, నవంబర్ 12:  ప్రస్తుత యూపీఏ ప్రభుత్వ హయాం 2014లో ముగిసేలోగానే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. అయితే, ఈ బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతారా లేదా అనే అంశంపై ప్రశ్నలకు ఆయన స్పష్టంగా బదులివ్వలేదు. రాజ్యాంగం ప్రకారం బిల్లును పార్లమెంట్‌లో పెడతామని, అక్కడ ఆమోదం పొందే అంశంపై తానేం మాట్లాడలేనని అన్నారు.  విభజనపై కేబినెట్ తమకు అప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి మంత్రుల బృందం(జీవోఎం) ప్రయత్నిస్తోందని షిండే అన్నారు. ఎప్పటిలోగా బిల్లు అసెంబ్లీకి వెళ్తుందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘‘ప్రక్రియ నడుస్తోంది. ఇది కాగానే మేం కేబినెట్‌కు నివేదిస్తాం. అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి నుంచి బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వెళ్తుంది’’ అని చెప్పారు. హైదరాబాద్‌పై అనేక ప్రతిపాదనలు జీవోఎం ముందుకు వచ్చాయని, వాటన్నింటినీ జీవోఎం పరిశీలిస్తోందని షిండే చెప్పారు. ఆర్టికల్ 371డీ విషయంలో జీవోఎం సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వ చర్యలు ఉంటాయని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. హైదరాబాద్‌లో ఏ పరిధివరకు ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తారని ప్రశ్నించగా, రెవెన్యూ జిల్లావరకు పరిగణించాలని, కమిషనరేట్‌నే తీసుకోవాలని రకరకాల ప్రతిపాదనలు, అభిప్రాయాలు తమ ముందుకు వచ్చాయని, వాటిని తాము పరిశీలిస్తున్నామన్నారు.  కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులతో జీవోఎం పలు సమస్యలపై సవివరంగా చర్చిస్తోందని షిండే తెలిపారు. 

నాలుగో విడత కక్ష్య పొడిగింపు విఫలం

బెంగళూరు, నవంబర్ 12:  ‘మార్స్ ఆర్బిటర్’ ఉపగ్రహం కక్ష్యను నాలుగో సారి  పొడిగించేందుకు  సోమవారం చేపట్టిన ప్రక్రియ విఫలమైంది. భూమి నుంచి 71,623 కిలోమీటర్ల దూరంలోనున్న కక్ష్యను లక్ష కిలోమీటర్ల దూరానికి పొడిగించేందుకు ప్రక్రియను నిర్వహించగా, కేవలం 78,276 కిలోమీటర్ల దూరానికి మాత్రమే చేరుకోగలిగింది. లిక్విడ్ ఇంజన్‌కు ఇంధన ప్రవాహం నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కక్ష్య పొడిగింపు ప్రక్రియలో ‘మార్స్ ఆర్బిటర్’ వేగం సెకనుకు 130 మీటర్ల మేరకు పెరగాల్సి ఉండగా, కేవలం సెకనుకు 35 మీటర్ల వేగానికి మాత్రమే పరిమితం కావడంతో నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.  అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిందేమీ లేదని, ‘మార్స్ ఆర్బిటర్’ వందశాతం సురక్షితంగానే ఉందని ‘ఇస్రో’ ప్రతినిధి  తెలిపారు.  ‘మార్స్ ఆర్బిటర్’ కక్ష్య పొడిగింపు ప్రక్రియను ఈనెల 7 నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి మూడు విడతల్లో నిర్వహించిన కక్ష్య పొడిగింపు ప్రక్రియలు విజయవంతమయ్యాయని ‘ఇస్రో’ వెల్లడించింది.

Friday, November 8, 2013

హాస్య నటుడు ఏవీఎస్ ఇక లేరు...

హైదరాబాద్, నవంబర్ 8 : హాస్య నటుడు, రచయిత, దర్శకుడు ఏవీఎస్ శుక్రవారం రాత్రి కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా లీవర్, మూత్పపిండాల వ్యాధితో బాధపడుతూ పది రోజుల నుంచి నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో
పొందుతుండగా,  పరిస్థితి విషమించిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఈ సాయంత్రం ఏవీఎస్‌ను ఆయన కుమారుడు ప్రదీప్ నివాసం ఉంటున్న మణికొండకు తీసుకు వచ్చారు. ఇంటికి తీసుకు వచ్చిన కొద్ది గంటలలోనే ఏవీఎస్ మృతి చెందారు. నాలుగు సంవత్సరాల క్రితం ఏవీఎస్ లీవర్ సమస్యతో బాధపడ్డారు. అప్పుడు ఆయన కుమార్తె దానం చేయడంవల్ల గ్లోబల్ ఆస్పత్రిలో లీవర్ టాన్స్‌ఫ్లాంటేషన్ జరిగింది. తిరిగి కోలుకుని, పలు చిత్రాల్లో నటించారు. ఏవీఎస్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం, గుంటూరు జిల్లా తెనాలిలో 1957 జనవరి రెండున ఆయన జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన ఏవీఎస్ మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఏవీఎస్ నటించిన ఆఖరి చిత్రం 'పవిత్ర'. మిస్టర్ పెళ్లాం సినిమాకు ఏవీఎస్‌కు నంది అవార్డు వచ్చింది. 19 ఏళ్లలో ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించారు. 'అంకుల్' సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. సూపర్ హీరోస్ చిత్రం ద్వారా దర్శకుడుగా మారిన ఏవీఎస్ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. 'మా' జనరల్ సెక్రటరీగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

Tuesday, November 5, 2013

పీఎస్ఎల్వీ-సీ25 ప్రయోగం సక్సెస్....కక్ష్యలో మార్స్ ఆర్బిటర్ మిషన్‌

హైదరాబాద్,నవంబర్ 5:   అంతరిక్ష రంగంలో భారత్  మరో విజయకేతనం ఎగురవేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరిన పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహకనౌక 44 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.ఈ ఉపగ్రహం 2014 సెప్టెంబర్ 24న అంగారకునిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయనుంది.  అంగారక గ్రహంపై జీవాన్వేషణ, వాతావరణం, ఖనిజాల పరిశోధన కోసం ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. తొమ్మిది నెలలపాటు ప్రయాణించి 2014, సెప్టెంబర్ 24న ఈ ఉపగ్రహం అంగారకునిపై కాలు మోపనుంది. అక్కడ నుంచి ఈ శాటిలైట్ ఎప్పటికప్పుడు ప్రయోగాలు నిర్వహిస్తూ ఫలితాలను భూమిపైకి పంపనుంది. ఇస్రో ఈప్రాజెక్టు కోసం రూ.450 కోట్లు వెచ్చించి మొదటిసారిగా అంగారకునిపైకి ఉపగ్రహాన్ని పంపించింది. 320 టన్నుల బరువు (ఉపగ్రహం బరువుతో కలసి), 44.4 మీటర్ల ఎత్తు కలిగిన పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్ 1,337 కిలోల మార్స్ ఉప గ్రహంతో రోదసీలోకి దూసుకుపోయింది.   24 పీఎస్ఎల్వీ ప్రయోగాలలో తొలి ప్రయోగం మినహా మిగిలిన 23 వరుస విజయాలను అందించిన పీఎస్ఎల్వీ సిరీఅ లో  25వ రాకెట్‌గా (సిల్వర్‌జుబ్లి రాకెట్) పీఎస్ఎల్వీ-సీ25ను ప్రయోగించారు..  భారత అంతరిక్ష ప్రయోగాల్లో మార్స్ మిషన్ కీలకమైనదని  మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అన్నారు. ఈ విజయం తొలి అడుగు అని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ రామకృష్ణన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి విజయమిదని షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...