Sunday, June 26, 2011

సారీ...సైనా...

ఇండోనేషియా ఓపెన్‌లో ఓటమి 
జకార్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ నిలబెట్టుకోవడంలో సైనా నెహ్వాల్ విఫలమైంది. చైనా క్రీడాకారిణి యిహాన్‌వాంగ్ చేతిలో సైనా 21-12, 21-23, 14-21 తేడాతో  పరాజయం పాలయ్యింది. ఇంతకుముందు 2009, 2010 సంవత్సరాలలో సైనా నెహ్వాల్ ఇండోనేషియా ఓపెన్‌ను గెలుచుకుంది. గత ఏడాది సైనా ఇండోనేషియా ఓపెన్‌తో పాటు సింగపూర్ సిరీస్, ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్‌ గోల్డ్ కూడా గెలుచుకుంది.  ఆ తర్వాత కామన్వెల్తు, హాంగాకాంగ్ సూపర్ సిరీస్ కూడా గెల్చుకుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ మాత్రమే గెల్చుకున్న సైనా మలేషియా సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచింది. తాజాగా ఇండోనేషియా సిరీస్‌లో కూడా రన్నరప్‌గా నిలిచింది. 
మాంటీ ముస్లిముద్దీన్ సయ్యద్  అనే భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రూపొందించిన  ప్రపంచంలోనే అతి పెద్ద త్రివర్ణ పతాకం   

కెనడాలో రాజ్‌కపూర్ వీధి ...

బ్రాంప్టన్,జూన్ 26: బాలీవుడ్ ‘షో మ్యాన్’ రాజ్‌కపూర్‌కు కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాసియా సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే టొరంటో శివారు పట్టణం బ్రాంప్టన్‌లోని ఓ వీధికి రాజ్‌కపూర్ గౌరవార్థం ఆయన పేరు పెట్టారు.  ఈ కార్యక్రమానికి రాజ్‌కపూర్ సతీమణి కృష్ణ రాజ్‌కపూర్, కుమారులు రణధీర్ కపూర్, రిషీ కపూర్, రాజీవ్ కపూర్, కుటుంబసభ్యులు రీమా, రీతు, నీతు హాజరయ్యారు. బ్రాంప్టన్ మేయర్ సుశాన్ ఫెన్నెల్.. రాజ్‌కపూర్ పేరు ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రణధీర్‌కపూర్ మాట్లాడుతూ.. ‘‘ఈ మధుర జ్ఞాపకాన్ని మేం ఎన్నటికీ మర్చిపోలేం. మాతృదేశానికి కొన్ని వేల మైళ్ల దూరంలో మా తండ్రికి చాలా గొప్ప గౌరవం దక్కింది’’ అని పేర్కొన్నారు.

' బండ ' బాదుడు ఇంకా వుంది...

న్యూఢిల్లీ,జూన్ 26: : డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇంధనధరలను పెంచడం ద్వారా సామాన్యులపై యూపీఏ సర్కారు పెనుభారం మోపిందంటూ బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. యూపీఏ మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీలతో పాటు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సైతం ఇంధన ధరలు పెంచడాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఇంధన ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలంటూ కాంగ్రెస్ అధిష్టానం తమ పాలనలో ఉన్న రాష్ట్రాలను కోరింది. ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండు చేస్తూ శనివారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలంటూ వామపక్షాలు తమ శాఖలన్నింటికీ పిలుపునిచ్చాయి. డీజిల్ ధరలను పెంచడం ద్వారా రవాణాపై భారం పడుతుందని, దీనివల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతాయని సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ పేర్కొన్నాయి. 
మళ్ళి మంట...?
తాజాగా దీజిల్ ధరను లీటర్ రు.3.కిరోసిన్ ధరను రు.  లీటర్ 2,వంట గ్యాస్ ధరను రు. 50 పెంచినా కేంద్ర  దాహం ఇంకా తీరలేదు. వంటగ్యాస్, కిరోసిన్ ధరలను వీలైనంత త్వరలో మళ్లీ భారీగా పెంచే దిశగా పావులు కదుపుతోంది. ఈసారి గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.50, కిరోసిన్‌పై లీటరుకు ఏకంగా రూ.4 చొప్పున వడ్డించనున్నట్టు సమాచారం! పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కిరీట్ పారిఖ్ కమిటీ చేసిన సూచనలను కేంద్రం వరుసగా అమలు చేస్తున్న తీరును, 11వ పంచవర్ష ప్రణాళిక మధ్యంతర సమీక్ష నిర్ణయాలను చూసినా...  పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనించినా  తలసరి వ్యవసాయాదాయ వృద్ధి రేటు ఆధారంగా ఇకపై ఏటా క్రమం తప్పకుండా కిరోసిన్ ధరను పెంచనున్నారని తెలుస్తోంది. దాంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే కిరోసిన్ కోటాకు ప్రణాళికా సంఘం ‘సూచన’ల ప్రకారం 20 శాతం మేర కోత విధిస్తారని, లబ్ధిదారుల సంఖ్యను కూడా వీలైనంతగా కుదిస్తారని సమాచారం. నిజానికి వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 , కిరోసిన్‌పై లీటర్‌కు రూ.6 పెంచాలని గతేడాది 11వ పంచవర్ష ప్రణాళిక అమలు మధ్యంతర సమీక్ష సందర్భంగా గతంలోనే కేంద్రం నిర్ణయించింది. దాని అమలుకు అదను కోసం ప్రభుత్వం వేచి చూస్తూ వచ్చింది.  తాజాగా వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, కిరోసిన్‌పై లీటర్‌కు రూ.2 పెంచడం అందులో భాగమే. దానికి కొనసాగింపుగా బ్యాలెన్సు బాదుడు వీలైనంత త్వరలో ఉంటుందని తెలుస్తోంది. 

Friday, June 24, 2011

ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభించిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శులు నిరుపమారావ్, సల్మాన్ బషీర్ 

బీబీసీ హిందీ రేడియో కొనసాగింపు

లండన్  ,జూన్ 24 :  బీబీసీ హిందీ రేడియో మూసివేత ప్రమాదం  నుంచి బయటపడింది. ఈ రేడియోతోపాటు, బీబీసీ అరబిక్ రేడియోను ఇకముందూ కొనసాగించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్ ప్రకటించారు. విదేశీ, కామన్వెల్త్ ఆఫీస్ బడ్జెట్ నుంచి బీబీసీ వరల్డ్ సర్వీసుకు వచ్చే మూడేళ్లకు గాను ఏటా 22 లక్షల పౌండ్లు ఇస్తామని ఆయన పార్లమెంటు దిగువ సభ ‘హౌజ్ ఆఫ్ కామన్స్’లో ప్రకటించారు. అలాగే బీబీసీ ట్రస్టు ఈ సర్వీసు కోసం 90 లక్షల పౌండ్లను తిరిగి కేటాయించిందని వెల్లడించారు. ఖర్చుల తగ్గింపులో భాగంగా హిందీ సహా ఐదు భాషల రేడియో ప్రసారాలకు స్వస్తి పలకాలని బీబీసీ ఈ ఏడాది జనవరిలో నిర్ణయించింది. దీనిపై భారత్, బ్రిటన్‌లో నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో హిందీ, అరబిక్ ప్రసారాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

Thursday, June 23, 2011

తొలి టెస్టులో గెలుపు మనదే

కింగ్‌స్టన్ ,జూన్ 24 : తొలి టెస్టులో ధోని సేన 63 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 68.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటయింది. ఓవర్‌నైట్ స్కోరు (131/3)తో నాలుగో రోజు బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు... తొలి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్ మెన్  డారెన్ బ్రేవో (89 బంతుల్లో 41; 7 ఫోర్లు), చందర్‌పాల్ (73 బంతుల్లో 30; 4 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. అయితే ప్రవీణ్ కుమార్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ అవుట్ చేశాడు. లంచ్ విరామానికి ముందే తొమ్మిదో వికెట్‌ను కోల్పోయినా... ఎడ్వర్డ్స్ (54 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), బిషూ (33 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడటంతో మ్యాచ్ రెండో సెషన్ వరకూ సాగింది. పదో వికెట్‌కు ఎడ్వర్డ్స్‌తో కలిసి 39 పరుగులు జోడించాక బిషూ... రైనా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో భారత్ విజయం ఖరారయింది. ప్రవీణ్, ఇషాంత్ మూడేసి వికెట్లు తీసుకోగా.. మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన ద్రవిడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు మంగళవారం నుంచి బార్బడోస్‌లో జరుగుతుంది. 

సూరి హత్య కేసులో నిర్మాత సింగనమల రమేష్ ‌అరెస్ట్

చెన్నై,జూన్ 24 : మద్దెల చెరువు సూరి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గత అయిదు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న సినీ నిర్మాత సింగనమల రమేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రవారం  ఉదయం 4.30 గంటలకు రమేష్‌ను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   సూరి హత్యకేసులో నిందితుడు భానుకిరణ్‌తో కలిసి ఫైనాన్షియర్ వైజయంతిరెడ్డిని బెదిరించిన కేసులో నిందితుడైన రమేష్ పై  420, 406, 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

మంత్రివర్గాల విస్తరణపై మలాగుల్లాలు

న్యూఢిల్లీ, జూన్ 23: పాఠ్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే లోగానే కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 2న ఈ కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ప్రధాని మన్మోహన్ సింగ్ జూలై 3న లోక్‌పాల్ బిల్లుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినందున ఆ రోజు విస్తరణ జరిగే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలా కాని పక్షంలో జూలై 9న జరగవచ్చంటున్నారు. ఒక వైపు లోక్‌పాల్ బిల్లు గొడవ, మరోవైపు డిఎంకె ఎత్తుగడలు నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులను కొంత కాలం వాయిదా వేస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా కాంగ్రెస్ అధినాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఒక వేళ ప్రధాని మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే పక్షంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు సీనియర్ నాయకులు, ఇద్దరు లేదా ముగ్గురు జూనియర్ నాయకులకు మంత్రిపదవులు లభించే అవకాశాలున్నాయి. లోక్‌సభ సీనియర్ సభ్యులు కెఎస్ రావు, కిశోర్ చంద్రదేవ్‌లకు క్యాబినెట్ మంత్రి పదవులు లభించవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా పని చేస్తున్న డి.పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి పదోన్నతిని ఆశిస్తున్నారు. తమను ఇండిపెండెంట్ మంత్రులుగా నియమించాలని వారు కోరుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు, కెఎం ఖాన్, జెడి శీలం, లోక్‌సభ సభ్యులు సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్, హర్షకుమార్ తదితరులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వీరిలో పలువురు సోనియాను కలిసి తమ వాదనలు కూడా వినిపించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఇటీవలే విలీనమైన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి మంత్రివర్గంలో స్థానం లభించటం ఖాయమని భావిస్తున్నారు. చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే మొదట ఆయనను రాజ్యసభకు తీసుకురావలసి ఉంటుంది. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులపై కూడా దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. సోనియా గత మూడు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకుని రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పని తీరుతెన్నులు, మంత్రివర్గంలో చేయవలసిన మార్పులు చేర్పుల గురించి చర్చించినట్లు తెలిసింది. మంత్రివర్గం నుండి తొలగించవలసిన వారి పేర్లను కూడా ఖరారు చేస్తున్నారని అంటున్నారు. సమర్థంగా పని చేసే యువ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని సోనియా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయటం లేదని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెలాఖరులో తిరిగి వచ్చిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ తేదీని ఖరారు చేస్తారని చెబుతున్నారు.

గిన్నిస్ రికార్డు సృష్టించి మరీ.. పోయింది

రియో డీ జనీరో, జూన్ 23: ప్రపంచంలోకెల్లా జీవించి ఉన్న అత్యంత వృద్ధ వ్యక్తిగా గత నెల కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించిన మారియా గోమ్స్ వాలెంటిమ్ అనే 114 ఏళ్ల బ్రెజిల్ మహిళ ఆదివారం రియో డీ జనీరో నగరంలో కన్నుమూసింది. అంతకుముందు ఈ రికార్డు వాలెంటిమ్‌కన్నా 48 రోజుల తక్కువ వయసున్న అమెరికా మహిళ బెస్సీ కూపర్ పేరిట ఉండేది.

ద్రవిడ్ సెంచరీ; విండీస్ టార్గెట్ 326

కింగ్‌స్టన్,జూన్ 23: మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. ప్రత్యర్థి ముందు 326 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 91/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు బుధవారం ఆట కొనసాగించిన భారత్ 252 పరుగులకు ఆలౌటయింది. ద్రావిడ్ 112 (274 బంతులు, 10 ఫోర్లు, సిక్సర్) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టెస్ట్ లలో  ద్రావిడ్‌కిది 32వ సెంచరీ.ముకుంద్ 25, కొహ్లి 15, రైనా 27, ధోనీ 16, హర్భజన్ 5, మిశ్రా 18, ఇషాంత్ శర్మ 5 పరుగులు చేశారు. విజయ్, లక్ష్మణ్, ప్రవీణ్‌కుమార్ డకౌటయ్యారు. విండీస్ బౌలర్లలో స్యామీ, బిషూ నాలుగేసి వికెట్లు తీశారు. ఎడ్వార్డ్స్, రామ్‌పాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 326 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 80 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. భరత్ (38)ను ప్రవీణ్ కుమార్ అవుట్ చేశాడు. శర్వాణ్(0), సిమన్స్(27)లను ఇషాంత్‌శర్మ పెవిలియన్‌కు పంపాడు. 81/3 స్కోరుతో విండీస్ ఆట కొనసాగిస్తోంది. బ్రేవో(9), చందర్‌పాల్(1)లో క్రీజ్‌లో ఉన్నారు.

Wednesday, June 22, 2011

అమ్మ కాబోతున్న ఐశ్యర్యారాయ్

ముంబై,జూన్ 22: ఐశ్యర్యారాయ్ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని సూపర్ స్టార్, అభిషేక్ తండ్రి అయిన అమితాబ్ బచ్చన్ సంబరంగా చెప్పారు.  తాను తాతను కాబోతున్నానన్న ఆనందాన్ని ఆయన అందరితో పంచుకుంటున్నారు. ట్విట్టర్ లో అమితాబ్ ఈ విషయాన్ని ప్రకటించి తాను ఎంతో సంతోషంగానే ఉన్నానని  చెప్పారు. అయితే ఐశ్యర్య రాయ్ ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం మధూర్ బండార్కర్ దర్శకత్వంలో ' హీరోయిన్' అనే చిత్రం చేస్తోంది. ఇక కొంతకాలం పాటు కొత్త చిత్రాలు ఏమీ ఒప్పుకోదని,ఆల్రెడీ కమిటైనవి పూర్తి చేస్తుందని చెప్తున్నారు. అబిషేక్ బచ్చన్ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ లో ని కొందరు తన సన్నిహితులకు పార్టీ ఇవ్వటానికి సన్నాహాలు చేస్తున్నాడుట. .

రికార్డు కోసం ఇంత బరితెగింపా...!

లండన్,జూన్ 22: ఏకంగా నాలుగు వందల మంది స్త్రీ, పురుషులు 'వరల్డ్ స్కిన్నీ డిప్పింగ్' రికార్డు కోసం ప్రపంచం నలుమూలల నుంచి సౌత్ వేల్స్ చేరుకొని గౌవెర్ రోస్సీలీ బీచ్‌లో వంటి మీద నూలు పోగు లేకుండా సముద్రపు నీటిలో సమూహిక స్నానాలు చేశారు. గతంలో 250 స్త్రీ, పురుషులు నెలకొల్పిన పాత స్కిన్నీ డిప్పింగ్ రికార్డును వీరు బద్దలుకొట్టారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వీరంతా బట్టలు విప్పేసి జిల్ మనే సముద్రపు నీటిలో చిల్ అయ్యారు. ఈ రికార్డులో పాల్గొన్న ఓ స్కిన్నీ డిప్పర్ లిజ్జీ వైట్ మాట్లాడుతూ.. తాను ఆస్ట్రేలియా నుంచి వయా బ్రెజిల్ ద్వారా ఈ రికార్డులో పాల్గొనేందుకు సౌత్ వేల్స్ చేరుకున్నానని, ఇది తనకు థ్రిల్లింగ్‌గా వుందని చెప్పారు. హవ్వ...మరీ రికార్డు కోసం ఇంత బరితెగింపా...!

Tuesday, June 21, 2011

తెలంగాణ పై సోనియా చేతులెత్తేశారా...?

న్యూఢిల్లీ, జూన్ 21:  ప్రత్యేక తెలంగాణ  అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతులెత్తేశారా...? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం చాలా క్లిష్టమైనదని దానిపై తాను ఒక్క దానిని నిర్ణయం ఎలా తీసుకోగలనని మూడు రోజుల క్రితం జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంత జటిలమైన సమస్యపై నిర్ణయం తీసుకోవడం తన ఒక్కదాని వల్ల అవుతుందా అని ఆమె కోర్ కమిటిలోని సభ్యులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశంపై గత కొన్నాళ్లుగా   టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులతో పాటు, కేంద్రమంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, ప్రణబ్ ముఖర్జీ కూడా సోనియా గాంధీపైనే భారం మోపారు. ఇటీవల తమను కలిసిన టి-కాంగ్రెసుకు కూడా కేంద్రమంత్రులు అమ్మ చెబితేనే అవుతుందని తేల్చి చెప్పారు. విదేశీ పర్యటన ముగించుకుని  సోనియా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావించిన టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు సోనియా తన అశక్తత వ్యక్తం చేయడంతో  నీరుగారి పోయారు. ఇన్నాళ్లు వారు సోనియాపై నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో కూడా వారు అదే మాటను చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ సోనియా అనూహ్యంగా తన అశక్తత వ్యక్తం చేయటంతో వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేది కాదని కూడా కొందరు అర్థం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు తాము అధిష్టానానికి డెడ్ లైన్లు పెట్టలేదని చెప్పి తప్పించుకోవాలని చూడగా, మరికొందరు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టుగా అర్థమవుతోంది. జూన్ 30 వరకు తెలంగాణపై తేల్చకుంటే వచ్చే నెల 5 నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని, నిరాహార దీక్ష భగ్నం చేయాలని చూస్తే రాజీనామాలకు సిద్ధమని టి-కాంగ్రెసు చెప్పింది. కాగా,  ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఇటు తెలంగాణవాదులను, అటు తమ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కూల్ చేయడానికి అథిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ప్రత్యేకతెలంగాణకు వ్యతిరేకిని : మమతా బెనర్జీ

న్యూఢిల్లీ, జూన్ 21:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను బద్ధ వ్యతిరేకినని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ ప్రజలంటే తనకెంతో అభిమానమన్నారు. తాను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమనైనప్పటికీ.. ఆ ప్రాంత ప్రజల మన్నలు పొందడానికి  కృషి చేస్తానని ఢిల్లీలో  చెప్పారు.  తెలంగాణ ఇవ్వకుండా ప్రత్యామ్నాయం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకోనని ముక్తాయించారు. సున్నితమైన ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. 

తొలిరౌండ్­లోనే సానియా ఓటమి

లండన్, జూన్ 21:  వింబుల్డన్ టోర్నమెంట్ తొలి రౌండ్­లోనే భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జా ఓడిపోయింది. సానియాపై 7-6, 2-6, 6-3 తేడాతో ఫ్రాన్స్ కు ­కు చెందిన రజానో గెలుపొందింది.

టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కన్నుమూత

వరంగల్,జూన్ 21:  : తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (76) మంగళవారం ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.ప్రొఫెసర్ జయశంకర్ 1934లో ఆగస్టు 6న హన్మకొండలో జన్మించారు. బెనారస్, అలీగడ్ విశ్వవిద్యాలయాల నుంచి జయశంకర్ ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి ఆచార్యులుగా, ఉప కులపతిగా, సీఫెల్ రిజిష్ట్రార్‌గా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఆవిర్భావానికి ఆయన కీలకపాత్ర వహించారు. జయశంకర్ మృతివార్తను తెలుసుకున్న తెలంగాణవాదులు శోకసముద్రంలో మునిగి పోయారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు కంట కన్నీరు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితికి వెన్నుదన్నుగా నిలిచిన జయశంకర్ మృతి ఆ పార్టీతో పాటు.. తెలంగాణ ఉద్యమానికి తీరని లోటుగానే భావించాలి.  

తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 246 పరుగులకు ఆలౌట్

కింగ్‌స్టన్ , జూన్ 21: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 246 పరుగులకు ఆలౌటయింది. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రైనా( 80), హర్భజన్ సింగ్( 70) అర్థసెంచరీలతో ఆదుకున్నారు. ముకుంద్ 11, విజయ్ 8, ద్రావిడ్ 40, లక్ష్మణ్ 12, కొహ్లి 4, ప్రవీణ్‌కుమార్ 4, మిశ్రా 6 పరుగులు చేశారు. ధోనీ డకౌటయ్యాడు. విండీస్ బౌలర్లలో ఎడ్వార్డ్స్ 4, రామ్‌పాల్ 3, బిషూ 3 వికెట్లు తీశారు.

వీనస్,నాదల్ శుభారంభం

వింబుల్డన్, జూన్ 21: గాయాల కారణంగా ఇటీవల ఎక్కువ కాలం విశ్రాంతికే పరిమితమైన ప్రపంచ మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ సోమవారం ఇక్కడ అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఈమె ఉజ్బెకిస్థాన్ క్రీడాకారిణి అగ్‌కుల్ అమాన్మురడొవాను 6-3, 6-1 తేడాతో చిత్తుచేసింది.  కాగా, పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) తన ప్రత్యర్థి మైకెల్ రసెల్‌పై 6-4, 6-2, 6-3 తేడాతో సునాయాంగా గెలిచాడు. 

భారతీయ అమెరికన్ వైద్య దంపతుల దుర్మరణం

వాషింగ్టన్,జూన్ 21: : అమెరికాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో భారతీయ అమెరికన్ వైద్య దంపతులు దుర్మరణం చెందారు. న్యూజెర్సీలోని ఫ్రాంక్లిన్ లేక్స్ లో నివసించే డాక్టర్ విశ్వనాథన్ రాజారామన్ (54) నాడీశాస్త్ర నిపుణులుగా, ఆయన భార్య డాక్టర్ మేరీ జె. సుందరం (50) ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. వాషింగ్టన్‌లో ఉండే తమ కూతురు కావ్య విశ్వనాథన్‌ను కలిసిన వారిద్దరూ... శుక్రవారం సాయంత్రం కొలంబస్‌కు చేరుకున్నారు. ఆదివారం...రికెన్‌బేకర్ ఎయిర్‌పోర్ట్ లో వారు ప్రయాణిస్తున్న సిర్రస్ సీఆర్22 విమానంలో ఇంధనాన్ని నింపుకున్న అనంతరం టేకాఫ్ తీసుకున్నారు. కాగా కొద్దిసేపటికే ఒహాయోలోని మొక్కజొన్న తోటలో విమానం కూలిపోయి మంటలు చెలరేగాయనీ, ఈ దుర్ఘటనలో వైద్య దంపతులిద్దరూ చనిపోయారని ఒహాయో రాష్ట్ర హైవే పోలీసులు తెలిపారు.రాజారామన్‌కు న్యూజెర్సీలో బ్రెయిన్, స్పైన్ క్యాన్సర్ నిపుణుడిగా మంచి పేరుంది.  ప్రస్తుతం ఆయన హాకెన్‌సాక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో న్యూరో ఆంకాలజీలో కో-చీఫ్‌గా పనిచేస్తున్నారు. పైలట్ లెనైన్స్ కూడా కలిగి ఉన్న ఆయన ఒకే ఇంజన్ ఉన్న సీఆర్22 ను స్వయంగా నడిపారని వెల్లడించారు. చెన్నైకి చెందిన రాజారామన్ కుటుంబం 1990ల్లో అమెరికాలో స్థిరపడింది.

Monday, June 20, 2011

కనిమొళికి దొరకని బెయిల్

న్యూఢిల్లీ,జూన్ 20: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డీఎంకె ఎంపీ కనిమొళికి సుప్రీంకోర్టులోను చుక్కెదురు అయ్యింది. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ జీఎస్ సింఘ్వి సారధ్యంలోని డివిజన్ బెంచ్ సోమవారం కొట్టివేసింది. ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని ఉన్నత న్యాయస్థానం ఈసందర్భంగా కనిమొళికి సూచించింది. దాదాపు నెల రోజులుగా జైల్లో ఉన్న ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను తొలుత సీబీఐ కోర్టు, ఆతర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కలైంజర్ టీవీ ఎండీ శరత్‌కుమార్‌కు కూడా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.

Sunday, June 19, 2011

వంటా-వార్పు శాంతియుతం

హైదరాబాద్,జూన్ 19:   గల్లీ నుంచి మెయిన్ రోడ్డు దాకా గ్రేటర్ హైదరాబాద్ అంతటా తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడాయి. పార్టీలకు అతీతంగా నేతలు, పలు సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు స్వచ్ఛందంగా రోడ్లెక్కారు. ప్రతి రోడ్డు మీదా పొయ్యి పెట్టి, వండి వార్చి, భోజనాలు చేశారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా, ‘పట్నం రోడ్లమీద పొయ్యిపెడదాం’ అంటూ రాజకీయ జేఏసీ ఆదివారం నిర్వహించిన వంటావార్పు శాంతియుతంగా సాగింది. తెలంగాణ మాటాముచ్చట్లు, తెలంగాణ అమరుల త్యాగాలను కీర్తిస్తూ పోరాట స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కళారూపాలు, ఆటపాటలతో ప్రభుత్వాల తీరుపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు.   కెసిఆర్ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటనపై ఇప్పుడు మాట మారిస్తే దేశం పరవు పోతుందని సూచించారు. కొంతమంది కుహనా సమైక్యవాదులు చేస్తోన్న ప్రకటనలు శాంతియుతంగా సాగుతోన్న తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, వారి ప్రకటనలతో ఏవైనా తీవ్ర  పరిణామాలు తలెత్తితే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కెసిఆర్ హెచ్చరించారు.తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, నేతలు ఇకనైనా ఢిల్లీలో కాళ్ళబేరాలు, రాయబారాలు, పైరవీలు కట్టిపెట్టి హైదరాబాద్‌కు తిరిగి   వచ్చి సామూహికంగా రాజీనామాలు చేయాలని  అన్నారు.  ‘మీరు రాజీనామాలు చేసినా అవేమీ ఆమోదం పొందవు. మీ రాజకీయ భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. వాటిని ఒకవేళ ఆమోదించినా, నేను, జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రజల కాళ్లు మొక్కి అయినా లక్షలాది ఓట్ల మెజార్టితో గెలుపించుకుంటాం’ అని కెసిఆర్ హామీ ఇచ్చారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడలాంటే అదేమీ దీక్షలతో అయ్యే పనికాదు. త్యాగాలు చేయకతప్పదు. రాజీనామాలు చేస్తేనే ఢిల్లీ పీఠం కదులుతుంది’ అన్నారు. త్వరలోనే కాంగ్రెసు ఎంపిలతో భేటీ అయి, అన్ని విషయాలూ చర్చించి, తెలంగాణ రాష్ట్ర సాధనకు సమిష్టిగా కార్యాచరణ రూపొందిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్  కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.విష్ణువర్దన్ రెడ్డి హైటెక్ సిటీ వంటావార్పులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  తన తండ్రి పి.జనార్దన్ రెడ్డి తెలంగాణ కోసం, జివో 16 ఎత్తివేత కోసం, పోతిరెడ్డి పాడు పై అలుపెరగని పోరాటం చేశారని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
 

Saturday, June 18, 2011

అడుక్కుంటే తెలంగాణా వస్తదా...

హైదరాబాద్ , జూన్ 18:   తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు న్యూఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని బిచ్చమెత్తుకున్నట్టు అడిగితే ప్రత్యేక రాష్ట్రం రాదని టి-కాంగ్రెసు నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు  సూచించారు. ఆంధ్ర వారి పాలనలో ఉన్నన్నాళ్లు మన పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. అంధ్రాలో నేతలంతా ఒక్కటై తెలంగాణ అడ్డుకుంటున్నారని, అలాగే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక్కటై తెలంగాణ సాధించాలని సూచించారు. రాజీనామాలు చేయడం చేతకాని నేతలు ఆమరణ దీక్షలు చేసి ప్రాణాలు అర్పిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజక్టుల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శిలాఫలకాలు వేస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మొక్కలు నాటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో వారి ఆధ్వర్యంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.

తెలంగాణపై తేల్చని కాంగ్రెస్ కోర్ కమిటీ

న్యూఢిల్లీ, జూన్ 18:  శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ తెలంగాణపై ఏమీ తేల్చకుండా కేవలం ప్రస్తావనతోనే సరిపెట్టింది. రాష్ట్రంలోని పార్టీల వైఖరిపై తనకు నివేదిక ఇవ్వాలని నేతలను ఆదేశించిన మేడం సోనియా, వాటిని పరిశీలించాకే తెలంగాణపై ఏం చేయాలో నిర్ణయిద్దామన్నారు.  రెండు గంటల పాటు సమావేశమైన కోర్‌కమిటీ ప్రధానంగా జన్ లోక్‌పాల్ బిల్లు, అన్నాహజారే దీక్ష హెచ్చరికలపైనే దృష్టి సారించింది. సోనియాతో పాటు ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కేంద్రమంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, ఏకే ఆంటోనీ, చిదంబరం సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన కోసం ఆ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమతో జరిపిన చర్చల సారాంశాన్ని చిదంబరం, ప్రణబ్ సోనియా దృష్టికి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు... పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు రాకుంటే ఆగస్టు 16 నుంచి మళ్లీ నిరశన చేస్తానన్న హజారే హెచ్చరిక నేపథ్యంలో జూన్ 30 కల్లా ముసాయిదాను పూర్తి చేయడంపైనే దృష్టి పెడదామని సోనియా అన్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను కూడా పిలిపించి తెలంగాణపై తర్వాత విస్తృతంగా చర్చిద్దామని చెప్పారు. ఆలోగా రాష్ట్ర పార్టీల మనోగతం, అఖిలపక్ష భేటీకి వాటి సంసిద్ధతలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాటన్నింటినీ పరిశీలించాక తెలంగాణపై తదుపరి ఏం చేయాలో నిర్ణయిద్దామన్నారు. భేటీలో తెలంగాణపై చర్చించినట్టు విలేకరులకు చెప్పిన చిదంబరం, అహ్మద్‌పటేల్... అంతకు మించి మాట్లాడేందుకు నిరాకరించారు.

అమెరికా ‘వీసా’కు కొత్త రూల్

హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం వీసా దరఖాస్తుదారులను లోపలికి అనుమతించే విధానంలో స్వల్ప మార్పులు చేసింది. దరఖాస్తుదారులు వారికి సూచించిన సమయం కంటే 15 నిమిషాల ముందుగా వస్తేనే కార్యాలయంలోకి అనుమతిస్తామని పేర్కొంది. జూన్ 20 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకూ ముందుగా వచ్చిన వారిని కార్యాలయం లోనికి ముందుగా అనుమతించే విధానం అమలులోఉండగా, దీనివల్ల కాన్సులేట్ కార్యాలయం వెలుపల పెద్ద క్యూలైన్లు ఏర్పాటవుతుండటంతో దరఖాస్తుదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

Friday, June 17, 2011

కుప్పలు తెప్పలు గా నగదు,నగలు ...!

యజుర్వేదమందిరం లో 
బాబా సంపద 
పుట్టపర్తి,జూన్, 17: ప్రశాంతి నిలయం యజుర్వేద మందిరం పెద్ద ధనాగారాన్నే తలపిస్తోంది.  ఇందులో దేశవిదేశీ కరెన్సీతోపాటు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయి. నగదు 11 కోట్ల 56 లక్షల రూపాయలు ఉన్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. 98 కిలోల  బంగారు ఆభరణాలు, 307 కిలోల వెండి ఉన్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. మందిరాన్ని తెరిచే సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల కూడా ఉన్నట్లు తెలిపింది. బాబా వీలునామా ఏదీలేదని ట్రస్ట్ ప్రకటించింది. నగదు మొత్తాన్ని స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ తెలిపారు.  ఈ మందిరాన్ని గురువారం వుదయం  తెరిచి నగదు, ఆభరణాలను  36 గంటల పాటు లెక్కించారు. బంగారు ఆభరణాలను కూడా బ్యాంకు లాకర్­లో ఉంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, మందిరంలో దేవతా మూర్తుల 5 బంగారు విగ్రహాలు, సౌదీ రాజు బహూకరించిన వజ్రాలు ఉన్నట్లు సమాచారం. అమూల్యమైన వజ్ర వైఢూర్యాలతోపాటు విదేశీ కరెన్సీ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పెద్ద బ్యాంకునే నిర్వహించినట్లు తెలుస్తోంది. మందిరంలోని బాబా గది నిండా విలువైన వస్తువులు ఉన్నాయి. నగదు, నగలు కుప్పలుగా పడవేసి ఉన్నాయి. జూలై 15 నుంచి యజుర్వేద మందిరంలోకి భక్తులను అనుమతిస్తామని బాబా ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ చెప్పారు. జూలై 10 లోపల సమాధి నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్నారు. బాబా సమాధి వద్ద బంగారు విగ్రహం పెట్టాలన్న ఆలోచనలేదని చెప్పారు. త్వరలో బాబాకు చెందిన ముఖ్యమైన వస్తువులతో ఒక మ్యూజియంని ఏర్పాటు చేస్తామన్నారు.  

ఈసారి జులై కో ప్రత్యేకత ... !

బెంగళూరు,జూన్ 17:  మన ముందు తరాలవరెవ్వరూ  చూడని జూలై మాసాన్ని మనం చూడబోతున్నాము. 823 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 5 శుక్ర, శని, ఆదివారాలు ఈ నెలలో రానుండడమే ఈ నెల ప్రత్యేకత. 1188లో ఈ విధంగా ఒకే నెలలో 5 శుక్ర, శని, ఆదివారాలు వచ్చాయి. ఎనిమిది శతాబ్దాల తరువాత మళ్లీ ఈ అద్భుత రోజులు వస్తున్నాయి. జూలై 1, 8, 15, 22, 29 తేదీల్లో 5 శుక్రవారాలు వస్తుండగా 2, 9, 16, 23, 30 తేదీల్లో 5 శనివారాలు, 3, 10, 17, 24, 31న ఐదు ఆదివారాలు రానున్నాయి.

Thursday, June 16, 2011

రాజీనామాలను సిద్ధం చేసుకుంటున్న తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు

న్యూఢిల్లీ ,జూన్ 16:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ కార్యాచరణను ఉధృతం చేశారు.  శానససభ్యుల రాజీనామా లేఖలను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కె. జానారెడ్డి సేకరిస్తుండగా, పార్లమెంటు సభ్యుల రాజీనామా లేఖలను పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 22 మంది తెలంగాణ శాసనసభ్యులు, ఆరుగురు రాష్ట్ర మంత్రులు, 12 మంది ఎమ్మెల్సీలు, ఆరుగురు పార్లమెంటు సభ్యులు తమ తమ రాజీనామా లేఖలు ఇచ్చారు. జులై 1వ తేదీ తర్వాత తమ రాజీనామా లేఖల కార్యాచరణను ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  ఈ నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి డెడ్‌లైన్ పెట్టారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి నిరాహార దీక్షకు దిగాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. 

నాగచైతన్య, అనుష్క నిశ్చితార్థం నిజం కాదట...

చెన్నై,జూన్ 16: ప్రముఖ సినీ హీరో నాగార్జున తనయుడు నాగచైతన్య, ప్రముఖ కథానాయిక అనుష్కను వివాహమాడబోతున్నట్లు, అందుకు నిశ్చితార్థం కూడా జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమ వర్గాలు   స్పష్టం చేశాయి. నాగచైతన్య, అనుష్కల నిశ్చితార్థం గురించి ముందుగా ఓ తమిళ పత్రికలో కథనం రావడం, దాని ఆధారంగా పలు వెబ్‌సైట్లు, చానెళ్లలో ఈ కథనం రావడం తెలుగు సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్తా కథనాలను సినీ పరిశ్రమ వర్గాలతోపాటు స్వయంగా కథానాయిక 'అనుష్క కూడా ఖండించారు.  ‘ నాగచైతన్య నాకంటే చాలా చిన్నవాడు. అతనితో నాకు పెళ్లేమిటీ ' అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది పూర్తిగా అవాస్తవం’ అని ఆమె అన్నారు. నాగచైతన్య ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన ‘దడ’ సినిమా షూటింగ్ నిమిత్తం యూరప్‌లో ఉన్నారు. 

Wednesday, June 15, 2011

మేమెరుగ...మేమెరుగ ...మేడం నడుగుదాం...!

న్యూఢిల్లీ, జూన్ 15: : తెలంగాణాపై తేల్చుకోవడానికి ఇదే చివరి పర్యటన అంటూ హస్తిన కు వెళ్ళిన కాంగ్రెస్ తెలంగాణా ప్రాంత ప్రతినిధులకు  కోర్ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు  చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ల నుంచి స్పష్టమైన హామీ యేదీ లభించలేదు. ఆల్ పార్టీ మీట్ జరిగితేనే ఏదైనా చెప్పగలమని , లేకుంటే మేడం దే తుది నిర్ణయమని  పెద్దలిద్దరూ తేల్చేశారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 55 మంది తెలంగాణ ప్రజాప్రతినిధులు మొదట చిదంబరం తోనూ, తర్వాత ప్రణబ్  తోనూ సమావేశమయ్యారు. చిదంబరం మాట్లాడుతూ ఈ విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అన్ని పార్టీలతో సమావేశం ముగిసిన తరువాతే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పైగా సీనియర్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ పై వత్తిడి తేవాలని తెలంగాణ నేతలకు చిదంబరం సూచన చేశారు. కేంద్ర ప్రభుత్వం, పార్టీ అధిష్టాన వర్గం సలహా పైనే తాను లోగడ తెలంగణా పై ప్రకటనలు చేశానని,  తనకు తానుగా నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని చిదంబరం తేల్చి చెప్పారు. ఇక ప్రణబ్ ముఖర్జీ  ప్రస్తుతం పర్యటనలో వున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి దేశ రాజధానికి చేరుకున్న తర్వాత తెలంగాణ ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేస్తామని తెలంగాణ ప్రాంత నాయకులకు  హమీ ఇచ్చినట్టు తెలిసింది. వీరిద్దరితో సమావేశం తర్వాత తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్యెల్యేలు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సానుకూల ప్రకటన రాకపోతే పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని తెలంగాణా ప్రజా ప్రతినిధులు మీడియాతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తమ వాదనను ప్రణబ్ అర్ధం చేసుకున్నారన్నారు.  త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రణబ్ వెల్లడించినట్టు తెలంగాణ నాయకులు తెలిపారు.      

కొత్తగా ఎనిమిది మున్సిపాలిటీలు

హైదరాబాద్,జూన్ 15: : రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నకిరేకల్,దేవరకొండ, నాగర్‌కర్నూల్,కొల్లాపూర్, పరకాల, జంగారెడ్డిగూడెం, పుట్టపర్తి, గుత్తి పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  

కడప కలెక్టర్ పై బదిలీ వేటు

హైదరాబాద్,జూన్ 15:  ఊహించినట్లే వైఎస్‌ఆర్  కడప జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్‌ పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బదిలీ వేటు వేశారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిం చినందున శశిబూషణ్‌కుమార్‌ను ప్రాధాన్యత లేని శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఎండీగా బదిలీ చేశారు.  లోగడ చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  అధికార పార్టీ అభ్యర్థికి సహకరించనందుకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్నను ప్రాధాన్యత లేని రైతుబజార్ సీఈఓగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఇప్పుడు కడప జిల్లా కలెక్టర్ శశిభూషణ్‌కుమార్‌ పై బదిలీ వేటు పడింది.  టీటీడీ ఈఓ కృష్ణారావును బదిలీ చేసి అక్కడ ఆర్థికశాఖలో పనిచేస్తున్న ఎల్.వి.సుబ్రహ్మణ్యంను  ఆ పదవి లో నియమించారు. సమాచార శాఖ  కమిషనర్‌గా  పార్థసారధి స్థానంలో బుర్రా వెంకటేశంను నియమించారు.

Tuesday, June 14, 2011

బొత్స సత్యనారాయణకు తొలి షాక్

సోనియాకు అమలాపురం ఎం.పి. లేఖాస్త్రం
న్యూఢిల్లీ, జూన్ 14:   పిసిసి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు  స్వీకరించిన బొత్స సత్యనారాయణకు తొలి షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా అమలాపురం పార్లమెంటు సభ్యుడు జి.వి.హర్షకుమార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖాస్త్రం సంధించారు. అత్యంత అవినీతిపరుడైన బొత్సను పీసీసీ అధ్యక్షుణ్ని చేయడం పార్టీకి ఏమాత్రం మేలు కాదంటూ  లేఖలో పేర్కొన్నారు.  బొత్స రాజకీయ జీవింతమంతా వివాదాస్పదమేనని, తప్పుడు దారుల్లో భారీగా డబ్బు గడించారని  శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు మద్యం సిండికేట్‌తో కుమ్మక్కయ్యారని , కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, సీబీఐ నిష్కళంకుడని చెప్పినా వోక్స్‌ వ్యాగన్‌ కుంభకోణంలో బొత్స చేయి ఉందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. బొత్స, ఆయన కుటుంబ సభ్యులకు జిల్లాలో భూకబ్జాకోరులుగా పేరుందని ఆరోపించారు. కోస్తా జిల్లాల్లో సాధారణంగా కాపులు-దళితులకు మధ్య సత్సంబంధాలు లేవని, బొత్స మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని,బొత్స సత్యనారాయణ కేవీపీ మద్దతుదారుడు కూడా నని , కాపు, తూర్పుకాపు, మున్నూరు కాపులంతా ఒక్కటేనని, పీసీసీ అధ్యక్షస్థానం ఎప్పుడూ వీరికే ఇస్తూ పోతే కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటుబ్యాంక్‌ అయిన దళితులు జగన్‌వైపు వెళ్లే ప్రమాదముందని ఆయన అన్నారు.

అంగారక గ్రహం శిలలపై గాంధీజీ రూపం

లండన్ ,జూన్ 14:  అంగారక గ్రహంపై ఉన్న శిలలపై గాంధీజీ రూపాన్ని గుర్తించినట్లు ఇటలీ అంతరిక్ష సంస్థ  ప్రకటించింది. 'ఐరోపా మార్స్  ఆర్బిటర్‌' ఇటీవల భూమికి పంపిన చిత్రాల్లో ఈ రూపం స్పష్టంగా కనిపించినట్లు 'మట్టేవో లన్నెవో' సంస్థ తెలిపింది. ఆంగారకుడిపై మనిషి ఆకారాన్ని గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 1976, జులైలో అమెరికాకు చెందిన వికింగ్‌-1 ఆర్బిటర్‌ తీసిన చిత్రాల్లోనే ఇది వెలుగు చూసింది. ధూళితో నిండిన అంగారకుడి ఉపరితలంపై ఓ శిల మనిషి ఆకారంలో ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతేడాది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) 'హై రైజ్‌' కెమెరా కూడా మానవ రూపాన్ని చిత్రీకరించింది. ఇది ఓ పెద్దశిలఅని స్పష్టం చేసింది.

బూడిద మేఘాల వల్ల ఆస్ట్రేలియా విమాన సర్వీసులకు అంతరాయం

సిడ్నీ,జూన్ 14:  చిలీ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న దట్టమైన బూడిద మేఘాల వల్ల ఆస్ట్రేలియా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 110 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సుమారు 20 వేల మంది ప్రయాణికులు ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రచండ గాలుల ప్రభావం వల్ల బూడిద మేఘాలు పలు దేశాలకు విస్తరించాయి. దీంతో విమాన సర్వీసుల్ని నిలిపివేసినట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. న్యూజిలాండ్, టాస్మానియా, బ్యూనస్ ఎయిర్స్, లాస్‌ఏంజెలిస్‌కు వెళ్లే విమాన సర్వీసుల్ని రద్దుచేశారు.

నాలుగో వన్డేలో భారత్ ఓటమి

ఆంటిగ్వా,జూన్ 14:  వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో సోమవారం జరిగిన నాలుగో వన్డేలో  103 పరుగుల తేడాతో భారత్ ఓటమి  పాలైంది.  తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఓపెనర్ సిమ్మన్స్ (78 బంతుల్లో 67; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. ఆరంభంలో వెస్టిండీస్ వేగంగా వికెట్లు కోల్పోయినా... సిమ్మన్స్‌తో పాటు పొలార్డ్ (72 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించడంతో కోలుకుంది. ఆఖరి ఓవర్లలో బాగ్ (57 బంతుల్లో 39; 3 ఫోర్లు), రస్సెల్ (14 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఆతిథ్య జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. భారత బౌలర్లలో ప్రవీణ్ కుమార్ మూడు వికెట్లు తీసుకోగా... అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్, అశ్విన్‌లకు ఒక్కో వికెట్ లభించింది.  తరువాత భారత్  39 ఓవర్లలోనే 146 పరుగులకు  భారత జట్టులో అత్యధికంగా రోహిత్ శర్మ 39 పరుగులు, పార్థీవ్ పటేల్ 26, కోహ్లి 22, బద్రీనాథ్ 12, అశ్విన్ 15, రైనా 10 పరుగులు చేశారు. విండీస్ జట్టులో మార్టిన్ 4, రస్సెల్ 3 వికెట్లు, సమ్మి 2, సిమ్మన్స్ 1 వికెట్ పడగొట్టారు. 

Monday, June 13, 2011

ప్రజారాజ్యం పార్టీ గల్లంతు

హైదరాబాద్,జూన్ 13: ఇక ప్రజారాజ్యం పార్టీ లేదు. చరిత్రలో కలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలుపడంతో ఆ పార్టీ ఉనికిని  కోల్పోయినట్లైంది. ఆ పార్టీ ఉదయించే సూర్యుని గుర్తు అస్తమించింది. విలీనం విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శాసనసభ స్పీకర్ కు ­కు తెలపనున్నారు.  సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా­గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు, ముఖ్యంగా అభిమానులు ఆశించారు. అవినీతికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం పోరాడతానని ఎన్నికల సమయంలో ఆయన ఆర్బాటంగా చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు ఆ పార్టీలోనే కలిసిపోవడంతో ఆయనపై ఆశలు పెట్టుకున్న వారందరూ నిరుత్సాహానికి గురైయ్యారు. ఆయన మెగాస్టార్ ఇమేజ్ కూడా దెబ్బతింది. చిత్రపరిశ్రమలో సంపాదించుకున్న పేరుని రాజకీయాలలో పోగొట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయనకు యేం కట్ట బెడుతుందో వేచి చూడాలి.

Sunday, June 12, 2011

రూ. 25.2 లక్షల విలువజేసే బంగారం, వజ్రాలతో అలంకరించిన శాలువాను షిరిడీ సాయిబాబాకు బహూకరించిన పుణే వృత్తి నిపుణులు. 

వన్డే సిరీస్ భారత్‌ కైవశం

ఆంటిగ్వా,జూన్ 12:    వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే లో భారత్  3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంది. విండీస్‌ విధించిన 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 46.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 86(91 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పటేల్‌ 46, హర్భజన్‌ 41, ప్రవీణ్‌కుమార్‌ 25, బద్రీనాథ్‌ 11, ధావన్‌ 4, రైనా 3 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో సమీ, బిషూ రెండేసీ, రస్సెల్‌, పోలార్డ్ తలో వికెట్‌ తీశారు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 92 పరుగులు చేసిన  విండీస్‌ బ్యాట్స్‌మన్‌ రస్సెల్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. 

మరోసారి కేసీఆర్ రాజీనామా ?

హైదరాబాద్ ,జూన్ 12: తెలంగాణపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులైలో జరిగే పార్లమెంటు సమావేశాలను ఆయన వేదికగా మార్చుకునే అవకాశాలున్నాయి. రాజీనామాలకు తెలంగాణ జెఎసి జూన్ 25వ తేదీ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది. కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు రాజీనామాలకు ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థితిలో తెలంగాణ కోసం రాజీనామా చేసే దమ్ము వారికి లేదని ధ్వజమెత్తుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా కేసీఆర్ రాజీనామాకు సిద్ధపడతారని సమాచారం.  ఇప్పటికే రెండుసార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన కేసీఆర్ మరోసారి రాజీనామా చేయడం ద్వారా తెలంగాణపై తమకే చిత్తశుద్ధి ఉందని ప్రచారం చేసుకోవడం ఈ వ్యూహం వెనుక ఉద్దేశం గా కనబడుతోంది.

పెషావర్‌లో పేలుళ్లు: 34 మంది మృతి

పెషావర్,జూన్ 12: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 34 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన అతి దారుణమైన పేలుళ్లు ఇవే. రాజకీయ నాయకులు, సైనికాధికురాలు నివాసం ఉండే పెషావర్‌ ప్రాంతంలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. సిఐఎ చీఫ్ పెనెట్టా పర్యటన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు.

దీక్ష విరమించిన రామ్‌దేవ్ బాబా

డెహ్రాడూన్,జూన్ 12: అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను యోగా గురు రామ్‌దేవ్ ఆదివారం విరమించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్ నెరపిన దౌత్యం తో  రామ్‌దేవ్ బాబా దీక్ష విరమించారు.  గత తొమ్మిది రోజులుగా బాబా రామ్‌దేవ్ దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో కూడా ఆయన దీక్షను కొనసాగించారు. వివిధ ఆధ్యాత్మిక, మత నాయకుల సమక్షంలో రామ్‌దేవ్ బాబా దీక్ష విరమించినట్లు రవిశంకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. బాబా రామ్‌దేవ్ దీక్ష విరమించారని, కానీ పోరాటాన్ని ఆపలేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రామ్‌దేవ్ ఉద్యమాన్ని కొనసాగిస్తారని ఆయన చెప్పారు.

Saturday, June 11, 2011

పీసీసీ పెత్తనం చేపట్టిన బొత్స

హైదరాబాద్,జూన్ 11:  : పీసీసీ అధ్యక్షుడుగా బొత్స సత్యనారాయణ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గాంధీభవన్‌లో ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఆయన పీసీసీ చీఫ్‌గా డీ శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ,మాజీ సీఎంలు నేదురుమల్లి జానారెడ్డి  , రోశయ్య, డీఎస్,మంత్రులు, ఎమ్మెల్యేలు, దాసరి నారాయణరావు, కేకే పలువురు నేతలు హాజరు అయ్యారు. ఢిల్లీ పెద్దలకు, రాష్ట్ర నాయకత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటానని  బొత్స సత్యనారాయణ  ఈ  సందర్భంగా తెలిపారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నూతనోత్తేజం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. పభుత్వ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలను భాగస్వాములను చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2014లో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీ మనుగడ కష్టమని సీఎం అన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్ మినహా జాతీయ పార్టీ అంటూ లేదని  అన్నారు.  జాతీయ ప్రాతినిథ్య రక్షణ కాంగ్రెస్ వల్లే సాధ్యమని పేర్కొన్నారు. తాము ప్రాంతీయ వాదులం కాదు, ఉప ప్రాంతీయ వాదులం కాదని జాతీయ వాదులమని అన్నారు. 

Friday, June 10, 2011

బాబు వెంటే బాలయ్య...?

హైదరాబాద్,జూన్ 11: తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తన సోదరుడు హరికృష్ణ ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ లను కౌంటర్ చేయడానికి సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబానికి ప్రాధాన్యం తగ్గిందనే వార్తలపై ఆయన శుక్రవారం తన జన్మదిన వేడుకల్లో స్పందించారు. ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యం తగ్గలేదని, వ్యవస్థలాంటి పార్టీలో అందరూ సమానమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో బాలకృష్ణ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో అంతర్గత పోరుకు శ్రీకారం చుట్టారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ మాహానాడులో హరికృష్ణ చంద్రబాబుపై అలక వహించిన సూచనలు స్పష్టంగా బయటపడ్డాయి. దానికితోడు, సినిమా షూటింగుల పేరు చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు డుమ్మా కొట్టారు. కాగా, చన్ద్రబాబుతో విభేదిస్తున్న హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు సహాయం అందించేందుకు బాలయ్య సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది. ఆయన తన బావ చంద్రబాబుకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధపడినట్లు, భవిష్యత్తులో ఆయన తన అల్లుడు నారా లోకేష్ రాజకీయ ప్రవేశానికి కూడా సహకరించే అవకాశాలు ఉన్నట్టు కనబడుతోంది.


క్షీణించిన రామ్‌దేవ్ బాబా ఆరోగ్యం

హరిద్వార్ ,జూన్ 11:  యోగా గురువు రామ్‌దేవ్ బాబా ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అధికారులు శుక్రవారం  బలవంతంగా డెహ్రాడూన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాబాకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఏడు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. 

ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహ

హైదరాబాద్,జూన్ 11: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ శుక్రవారం అధికారికంగా 313 జీవోను జారీ చేశారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణలో దామోదర రాజనర్సింహ రాష్ట్ర హోంమంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నటు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగా ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. 2007-09లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, రెండోవిడత మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామాతో వ్యవసాయ శాఖమంత్రిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. దళితుడైన తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వటం సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని రుజువు అయ్యిందన్నారు. తెలంగాణ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అధిష్టానానికి తెలియచేస్తానని తెలిపారు. జేఏసీ డెడ్‌లైన్‌తో తమకు సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Thursday, June 9, 2011

ఆస్తుల వివరాలు వెల్లడించిన ప్రధాని, పలువురు కేంద్ర మంత్ర్రులు

న్యూఢిల్లీ,జూన్ 9:   ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు గురువారం తమ ఆస్తులు వివరాలు వెల్లడించారు. ప్రధాని, పలువురు కెంద్ర మంత్ర్రులు  తమ ఆస్తులను ప్రకటించారు. ఆస్తుల వివరాలు : రూ. 2.7 కోట్ల ఫిక్సెడ్  డిపాజిట్లు, రూ.90 లక్షలు, రూ.88 లక్షలు విలువ చేసే రెండు ఇళ్లు ఉన్నట్లు ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. హోంమంత్రి చిదంబరం రూ.1.4 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. రూ.1.1 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, రూ.10 కోట్ల 6 లక్షలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, రూ.22కోట్ల 25 లక్షలు ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు.

ప్రధానితో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ

న్యూఢిల్లీ,జూన్ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ  ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయినవారిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ఉన్నారు. భేటీ అనంతరం  వారు మీడియా తో మాట్లాడుతూ, తెలంగాణ విషయంలో ఇక జాప్యం చేయవద్దని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కోరామని చెప్పారు.     కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజల్లోకి తిరగలేని పరిస్థితిని ప్రధానికి వివరించామన్నారు. ఈ విషయంలో జాప్యం చేస్తే పదవులకు రాజీనామాలు చేస్తామని చెప్పామన్నారు. తమకు పదవుల కంటే తెలంగాణయే ముఖ్యమని స్పష్టం చేశామన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి చెప్పారని  తెలిపారు. 

తెలంగాణా జె.ఎ.సి. కొత్త డెడ్ లైన్

హైదరాబాద్,జూన్ 9:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధుల రాజీనామాలకు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈనెల 25 ను  డెడ్‌లైన్ గా విధించింది. ఈనెల 25 లోపు తెలంగాణపై తేల్చకుంటే ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ సమస్య క్లిష్టమైనదనటం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే క్లిష్టమంటే ఏమిటో తాము చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈనెల 19న హైదరాబాద్‌లో రోడ్లుపై వంటావార్పులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

వరి, పత్తి పంటలకుమద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ, జూన్ 9:   వరి, పత్తి పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది. వరికి క్వింటాలుకు రూ.80, పత్తికి క్వింటాలుకు రూ.300 పెంచుతున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. 2011-12 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి సామర్థ్యం పెంపుకు వీలుగా మద్దతు దర పెంచుతూ కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

వివాదస్పద చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ మృతి

లండన్ ,జూన్ 9: అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్నప్పటికీ  వివాదస్పదునిగా పేరు పొందిన భారతీయ చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ (మక్బుల్ ఫిదా హుస్సేన్) లండన్‌లో గుండెపోటుతో మరణించారు. భారతీయ పికాసోగా పేరున్న ఎమ్ ఎఫ్ హుస్సేన్ వయస్సు 95 సంవత్సరాలు. చిత్రకళను ఆరాధించే ప్రతి ఒక్కరికి ఆయన ‘ఎమ్‌ఎఫ్’గా సుపరిచితుడు. హుస్సేన్ మహారాష్ట్రలోని ఫండర్‌పూర్‌లో సెప్టెంబర్ 17 తేది 1915 లో జన్మించారు.  హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా చిత్రాలు గీసారన్న ఆరోపణలపై హరిద్వార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. కోర్డు ఆర్డర్లకు స్పందించకపోవడంతో  హుస్సేన్ ఆస్తుల్ని జప్తు చేసేందుకు నిర్ణయం తీసుకొని బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. పలు వివాదస్పద ఆరోపణల మధ్య  హుస్సేన్ స్వయంగా దేశ బహిష్కరణ విధించుకున్నారు.ప్రముఖ బాలీవుడ్ తారలు మాధురీ దీక్షిత్, టబులతో నిర్మించిన హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మాధురీ దీక్షిత్‌తో ‘గజగామిని’, టబుతో ‘మీనాక్షి- ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీ’ అనే చిత్రాలకు నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అంటే చెప్పలేనంత ఆకర్షణ అని పలు సందర్భాల్లో హుస్సేన్ వ్యాఖ్యానించారు.  1973 లో ఆయనకు పద్మభూషణ్ అవార్డును భారతప్రభుత్వం, రాజా రవివర్మ అవార్డును కేరళ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఆయన 1986లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.

రెండో వన్డేలో కూడా వెస్టిండీస్‌పై భారత్ విజయం

ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్,జూన్ 9: వరుసగా రెండో వన్డేలో కూడా  వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ను టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడించింది. మరో 21 బంతులు మిగులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలింగించడంతో టీమిండియా లక్ష్యాన్ని 37 ఓవర్లలో 183 పరుగులకు కుదించారు. కొహ్లి(81), పార్థీవ్ పటేల్(56) అర్థసెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.  కొహ్లికి ‘మ్యాన్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించింది.

Tuesday, June 7, 2011

సొంత గూటికి ఉమా భారతి


న్యూఢిల్లీ, జూన్ 7:    ఫైర్ బ్రాండ్ ఉమా భారతి తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సమక్షంలో ఆమె మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో అద్వానీతో విబేధించి బయటకువెళ్లిన ఉమా భారతి ఆరేళ్ల తర్వాత మళ్లీ పార్టీలో చేరారు. బీజేపీ ఉమాభారతికి ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.


వెస్టిండీస్‌పై బోణీ కొట్టిన భారత్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ,జూన్ 7:    తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 44.5 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఆరంభంలోనే పార్థీవ్ పటేల్ (13), విరాట్ కోహ్లి (2) నిష్ర్కమించినా... ఓపెనర్ శిఖర్ ధావన్ (76 బంతుల్లో 51, 1 సిక్స్, 3 ఫోర్లు) రాణించాడు. అనంతరం రోహిత్ శర్మ (75 బంతుల్లో 68 నాటౌట్, 1 సిక్స్, 3 ఫోర్లు), కెప్టెన్ సురేశ్ రైనా (50 బంతుల్లో 43, 4 ఫోర్లు)లు ఐదో వికెట్‌కి 80 పరుగులు జోడించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.

ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ మృతి

హైదరాబాద్,జూన్ 7:   ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నింస్ లో  చికిత్స పొందుతు మృతి చెందారు.  ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో 31 మార్చి, 1923 న జన్మించిన నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశారు.  కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి నాట్యంకోసం జీవితాన్ని అంకితం చేశారు.  ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నారు.  శ్రీ వేంకటేశ్వర కల్యాణం 'కుమార సంభవము మేఘ సందేశం మొదలైన నాట్య ప్రదర్శనలు ఇచారు. . నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర , ఆంధ్రులు - నాట్యకళారీతులు  విశేష ప్రజాదరణ పొందాయి.  ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కి  చైర్మన్‌గా పని చేసిన  నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపిస్తున్నారు. . ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన సాత్వికాభినయం  చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్ధండులు. భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్ద్ తో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి.

Monday, June 6, 2011

తెలంగాణ సమస్యను త్వరగా తేల్చలేం: గులాం నబీ ఆజాద్

న్యూఢిల్లీ,జూన్ 6: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్  తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమస్య చాలా సంక్లిష్టమైందని, అంత త్వరగా తేలేది కాదని ఆయన సోమవారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. ఇరు ప్రాంతాల ఎంపీలతో చర్చిస్తున్నామన్నారు. తెలంగాణపై అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని పార్టీ ప్రజాప్రతినిధులు హెచ్చరించడాన్ని ప్రస్తావించగా వారిని సముదాయిస్తున్నామని, ఎప్పటికప్పుడు వారికి సర్ది చెబుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్రను, తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారని, ఇటువంటి స్థితిలో సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదని ఆయన అన్నారు. ప్రజలు యువనాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశామని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందులున్న మాట వాస్తవమేనని, వాటిని కిరణ్ కుమార్ రెడ్డి అధిగమించగలరని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే విషయంపై ఆలోచన చేయలేదని ఆయన చెప్పారు. 

పిసిసి కొత్త చీఫ్ బొత్స

న్యూఢిల్లీ,జూన్ 6: పిసిసి అధ్యక్షునిగా డి.శ్రీనివాస్ స్థానంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు.  ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన నియామకాన్ని ఆమోదించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.  తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నేతలతో సత్సంబంధాలు ఉన్న బొత్స గతంలో బొబ్బిలి లోక్ సభ  సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు.

Sunday, June 5, 2011

బీభత్సంగా రాందేవ్ దీక్ష భగ్నం !

న్యూఢిల్లీ,జూన్ 5: అవినీతికి వ్యతిరేకంగా యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేపట్టిన నిరాహారదీక్షను శనివారం అర్థరాత్రి తర్వాత ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు దీక్షా ప్రాంగణాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. బాబా మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. పోలీసుల దాడిలో పెద్ద సంఖ్యలో బాబా రామ్‌దేవ్ మద్దతుదారులు గాయపడ్డారు. దీక్షా వేదిక పూర్తిగా ధ్వంసమయింది. రామ్‌దేవ్‌ను ఆదివారం ఉదయం హరిద్వార్ లోని ఆయన ఆశ్రమానికి తరలించారు. దేశరాజధానిలో 15 రోజులపాటు అడుగుపెట్టకుండా యోగా గురువు బాబా రాందేవ్‌పై ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. రామ్‌లీలా మైదానంలో భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ కార్యకర్తలకు యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుమతి ఉందని  పోలీసులు తెలిపారు.  ఆయనపై పోలీసులు దొమ్మీ కేసు నమోదు చేశారు. కాగా,ఆశ్రమంలోనే దీక్షని కొనసాగిస్తానని రాం దేవ్  ప్రకటించారు. తనను చంపడానికి యు.పి.ఎ. ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. నల్ల ధనవంతులు తనను ఢిల్లీ నుంచి గెంటివేశారని  ఆయన విమర్శించారు. 

Saturday, June 4, 2011

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత నాలీ

పారిస్ ,జూన్ 4 : ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ­ చైనా క్రీడాకారిణి నాలీ గెలుచుకున్నారు. 6-4, 7-6 తేడాతో షియావోన్ పై ­పై నాలీ సంచలన  విజయం సాధించింది. గ్రాండ్ శ్లాం  టైటిల్­ని తొలిసారిగా ఒక చైనా క్రీడాకారిణి గెలుచుకొని రికార్డు సృస్టించింది.

అసెంబ్లీ, కౌన్సిళ్ళకు కాంగ్రెస్ బాస్ లు

హైదరాబాద్,జూన్ 4 : అసెంబ్లీ స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్ ఎన్నికయ్యారు. డివిజన్ పద్ధతిలో జరిగిన ఎన్నికలో నాదెండ్ల మనోహర్ కు 158మంది సభ్యులు మద్దతు తెలపగా, టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తికి 90మంది మద్దతు పలికారు. శాసనసభ ఉప సభాపతిగా భట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. డివిజన్ పద్ధతి ద్వారా ఆయనను సభ్యులు ఎన్నుకున్నారు. భట్టి విక్రమార్కకు 164మంది సభ్యులు మద్దతు తెలిపారు. టీడీపీ అభ్యర్థి సుద్దాల దేవయ్యకు 88 ఓట్లు లభించాయి. కాగా, శాసన మండలి చైర్మన్ గా   చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ గా  నేతి విద్యాసాగర్­ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా తమ బలాన్ని నిరూపించుకున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులోలేక సభకు హాజరు కాలేకపోయారని ఆయన చెప్పారు. వారు కూడా వస్తే తమ బలం ఇంకా పెరిగేదన్నారు.  తెలుగుదేశం అవిశ్వాసంపై స్పీకర్ దే  తుది నిర్ణయం అని ముఖ్యమంత్రి చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనంతరం అవిశ్వాసంపై ప్రస్తావన లేకుండానే  సభ వాయిదా పడింది. దీనికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు.








Friday, June 3, 2011

మన్మోహనుడి తలనొ (బొ) ప్పులు ఇన్నిన్నికాదయా...

                                  సంకీర్ణ సారథికి తాజాగా రాందేవ్ బాబా దీక్ష తలనొప్పిగా మారింది...
                              శుక్రవారం సాయంత్రం రాష్త్రపతి ప్రతిభను కలసి కష్టాలు చెప్పుకుంటున్న ప్రధాని... 

జగన్ వెంట 34 మంది శానససభ్యులు...?

మరో ఆరుగురు కూడితే సర్కార్ కూలినట్టే...! 
హైదరాబాద్,జూన్ 3: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట 34 మంది శానససభ్యులున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో ఆరుగురిని కూడగడితే ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే,  జగన్ శుక్రవారం సాయంత్రం ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి  పార్టీ శానససభ్యురాలు వైయస్ విజయమ్మ కాకుండా 22 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. కుంజా సత్యవతి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, సుచరిత, రామచంద్రా రెడ్డి, రవి, ఆదినారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కొండా సురేఖ, శేషారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ప్రసాద రాజు, బాలరాజు, కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాస్, బాబూరావు, శ్రీనివాసులు, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జయసుధ, శోభానాగి రెడ్డి, అమర్నాథ్ రెడ్డిసమావేశానికి హాజరయ్యారు. ఎప్పుడూ  జగన్ వెంట నడిచే బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశానికి రాలేదు. అయినా వీరిద్దరు, వారితో పాటు   ఆళ్ల నాని, జోగి రమేష్ తదితరులు  కూడా జగన్ వెంట ఉంటారని భావిస్తున్నారు. పలువురు శాసనసభ్యులతో జగన్ ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ ప్రమాణ స్వీకారానికి శుక్రవారం ఉదయం 13 మంది శాసనసభ్యులు వచ్చారు. సాయంత్రానికి ఆ సంఖ్య 22కి పెరిగింది. స్పీకర్ ఎన్నిక విషయంలో, అవిశ్వాస తీర్మానం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ శానససభ్యులతో విడివిడిగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన సంఖ్యను కూడగట్టేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యనేతల సమావేశానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి కూడా హాజరయ్యారు. 

హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్ మృతి

హిస్సార్ ,జూన్ 3: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ గుండెపోటుతో హిస్సార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. 1979-85, 1991-1996 కాలంలో హర్యానా రాష్ట్రానికి భజన్‌లాల్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజీవ్ గాంధి ప్రభుత్వంలో వ్యవసాయం, పర్యావరణం, అడవుల శాఖను భజన్‌లాల్ నిర్వహించారు.  హర్యానా రాజకీయాల్లో భూపిందర్ హుడాతో ఏర్పడిన విభేదాల కారణంగా హర్యానా జనహిత్ కాంగ్రెస్ పార్టీని భజన్‌లాల్ ఏర్పాటు చేశారు. 

ఫైనల్స్ లో ఓడిన సానియా జోడి

పారిస్ ,జూన్ 3:  ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్స్ లో సానియా-ఎలీనా జోడి ఓడిపోయింది. ఈ జోడీ పై 4-6, 3-6 తేడాతో హ్లవకోవా-హ్రాడెకా (చెక్) జోడీ విజయం సాధించింది. కాగా, పురుషుల సింగిల్స్ లె రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు ­­కు చేరాడు.  ఆండిముర్రే పై 6-4, 7-5, 6-4 పాయింట్లతో గెలిచి  ఆరోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు చేరాడు.

రాందేవ్‌తో ప్రభుత్వ చర్చలు విఫలం

న్యూఢిల్లీ,జూన్ 3: యోగా గురువు బాబా రాందేవ్‌ తో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  సుమారు 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు  ఓ కొలిక్కి రాలేదు. దీనితో  సత్యగ్రహం పేరుతో ఆమరణ దీక్ష యధావిధిగా జరుగుతుందని రాందేవ్‌ బాబా తెలిపారు.. దేశరాజధానిలోని ఓ హోటల్ బాబా, కేంద్రమంత్రి సిబాల్‌ల మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్న సిబాల్ నల్లధనంపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా వుందని తెలిపినట్టు సమాచారం.

Thursday, June 2, 2011

బాబు కు చెలగాటం...జగన్ కు సంకటం...కిరణ్ కు ఇరకాటం ...

హైదరాబాద్,జూన్ 2 :  అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు రావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నారు. వైయస్ జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు తెలుగుదేశం పార్టీ నోటీసు ఇవ్వడంతో వైయస్ జగన్ తన జెరూసలెం పర్యటనను రద్దు చేసుకున్నారు. జెరూసలేంకు ఆయన గురువారం రాత్రి బయలుదేరి వెళ్లి 11వ తేదీన తిరిగి రావాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ నోటీసు ఇవ్వడంతోనే జగన్ తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఈ స్థితిలో జగన్ సత్తా ఏమిటో చూపించడానికే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. జగన్‌కు బలం లేదు, సత్తా లేదని చూపించడానికే చంద్రబాబు ఈ పనికి పూనుకున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్ గురువారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తమ వైపు ఎంత శాసనసభ్యులు వస్తారనే విషయంపై జగన్ గురువారంనాటి సమావేశంలో చర్చించారు. శాసనసభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే జగన్ అవిశ్వాస తీర్మానం విషయంలో దెబ్బ తింటారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించే కాంగ్రెసు శాసనసభ్యులు ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. తమకు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక ఎమ్మెల్యే ఎక్కువే ఉన్నారని ఈ మధ్యనే వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. సందర్భం వస్తే తమ సత్తా ఏమిటో చూపుతామని కూడా జగన్ వర్గం శానససభ్యులు అంటూ వస్తున్నారు. వారివి గాలి మాటలేనని తేల్చేయడానికే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో మూడేళ్ల పాటు శాసనసభ్యులుగా కొనసాగడానికి అవకాశం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ముందుకు వస్తారా అనేది కూడా అనుమానమే. మొత్తంగా జగన్ రాజకీయ పరిపక్వతకు అవిశ్వాస తీర్మానం పరీక్ష పెట్టబోతోంది.  

చంద్రబాబు వ్యూహాత్మక ' అవిశ్వాసం '...?

హైదరాబాద్,జూన్ 2 :  ఈ నెల 4 లేదా 6వ తేదీన బలపరీక్షకు సిద్ధపడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు  అన్నట్టుగా చంద్రబాబు రిస్క్ చేసి రాష్ట్రప్రభుత్వం పై అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్రయోగించారు.  వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సవాల్ విసురుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా తానే పాచిక విసిరారు. విశ్వాస తీర్మానం ప్రతిపాదించి నెగ్గితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిలదొక్కుకుంటారని, ముఖ్యమంత్రి ప్రతిష్ట పెరుగుతుందని, కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం దక్కకుండా ముందుగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని చంద్రబాబు  భావించినట్టు కనబడుతోంది.  దీనివల్ల తాము కాంగ్రెసుతో కుమ్మక్కు అయినట్టు  వైయస్ జగన్  చేస్తున్న ఆరోపణలను తిప్పీకొట్టడం కూడా బాబు వ్యూహం గా కనబడుతోంది.  కాగా, స్పీకర్ పదవికి పోటీ పెట్టే  విషయంపై కూడా చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించారు. అయితే, స్పీకర్ పదవికి అభ్యర్థిని పెడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గానీ,  తెలంగాణ రాష్ట్ర సమితి ) గానీ మద్దతు ఇవ్వకపోవచ్చునని, అందువల్ల అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఆ రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన ఎంత మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారనేది ఓ సవాల్ అవుతుందని, వారు కాంగ్రెసు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే జగన్ కాంగ్రెసుతో కలిసి పనిచేస్తున్నారని విమర్సించి ఇరకాటంలో పెట్టడానికి వీలవుతుందన్నది  చంద్రబాబు ఆలోచనేమో... 

కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ పై టీపీడీ అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్,జూన్ 2 : కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ పై టీపీడీ  అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది.  అవిశ్వాస తీర్మానం నోటీసును అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు  టీపీడీ నేతలు అందించారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అందుబాటులో లేకపోవటంతో అసెంబ్లీ కార్యదర్శికి నోటీసును  అందచేశారు. అలాగే శాసనసభ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైనందునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా తాము ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అందువల్లే తప్పని పరిస్థితుల్లో రైతు సమస్యలపై అవిశ్వాసం పెడుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలైనా, పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని కొనకుండా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కి పోయిందన్నారు. అధికారం కోసం తాము అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని తెలిపారు.   మరోవైపు అవిశ్వాస తీర్మానానికి ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కాగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ తెలిపారు.  ఇలావుండగా కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎటువంటి ముప్పులేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష టీడీపీ ఏ విషయాలపై అయితే అవిశ్వాస తీర్మానం పెట్టిందో అవే విషయాలపై తమకు కూడా చర్చ అవసరమని అన్నారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాలు పడిపోయేది లేదు, ప్రతిపక్ష పార్టీలు బలపడేది లేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

తెలంగాణ పై అధిష్టానానికి కాంగ్రెస్ ఎంపీల డెడ్‌లైన్

హైదరాబాద్, ,జూన్ 2 : ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్టానానికి మరోసారి డెడ్‌లైన్ విధించారు. తెలంగాణ ఏర్పాటుపై  10 రోజుల్లోగా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జూలై 1 నుంచి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని, ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కె.కేశవరావు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, మధుయాష్కీ, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్‌లు సమావేశమయ్యారు.  హైకమాండ్ నాన్చుడు ధోరణిని అవలంబించడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎంపీ పదవుల్లో కొనసాగడం దండగనే అభిప్రాయం వ్యక్తమైంది. త్వరలోనే హైకమాండ్ పెద్దలను కలసి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసేలా ఒత్తిడి తేవాలని, లేనిపక్షంలో పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలని నిర్ణయించారు. 

దీక్ష పై వెనక్కు తగ్గేది లేదు:రాందేవ్

న్యూఢిల్లీ,జూన్ 2 : అవినీతి, నల్లడబ్బు సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్ష చేస్తానంటూ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రకటించడంతో గుబులు చెందిన ప్రభుత్వం, ఆయనను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. దీక్ష ఆలోచనను విరమింపజేసేందుకు ఏకంగా నలుగురు మంత్రులను రాయబారానికి పంపి, దాదాపు ఎర్రతివాచీ స్వాగతం పలికినా ఫలితం లేకపోయింది. తన డిమాండ్లకు ప్రభుత్వం వందశాతం అంగీకరిస్తే తప్ప దీక్ష యోచనను విరమించుకునే ప్రసక్తే లేదని రామ్‌దేవ్ తేల్చిచెప్పారు. నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ఢిల్లీ చేరుకున్న బాబా రామ్‌దేవ్‌కు కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, కపిల్ సిబల్, పవన్‌కుమార్ బన్సల్, సుబోధ్‌కాంత్ సహాయ్‌లు స్వాగతం పలికారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారు రామ్‌దేవ్‌కు ఎదురేగి, ప్రభుత్వం తరఫున ఆయనకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రుల వెంట కేబినెట్ కార్యదర్శి కె.ఎం.చంద్రశేఖర్ కూడా ఉన్నారు. విమానాశ్రయంలోనే వారు రామ్‌దేవ్‌తో దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. అవినీతి, నల్లడబ్బు సమస్యపై ఇప్పటికే అన్నా హజారే చేపట్టిన దీక్షతో ఇరకాటంలో పడ్డ కేంద్రం, ఈసారి అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. విదేశాల్లో పేరుకుపోయిన నల్లడబ్బును భారత్‌కు తిరిగి తెచ్చే విషయంలో హామీలు సరిపోవని, ప్రభుత్వం తన చేతల్లో నిరూపించుకోవాలని రామ్‌దేవ్ తనతో చర్చలకు వచ్చిన మంత్రులకు సూచించారు. కేవలం హామీలతో సంతృప్తి చెందబోమని, నల్లడబ్బును వెనక్కు తేవడంపై ఆధారాలు కావాలని ఆయన అన్నారు. అవినీతికి, నల్లడబ్బుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలోను, దేశవ్యాప్తంగా 624 జిల్లాల్లోను సత్యాగ్రహం (నిరాహార దీక్షలు) ప్రారంభమవుతుందని రామ్‌దేవ్ ప్రకటించారు. 

మారన్ చుట్టూ బిగుస్తున్న 2జీ స్పెక్ట్రమ్ ఉచ్చు

న్యూఢిల్లీ,జూన్ 2 :  కేంద్ర జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్ చుట్టూ 2జీ స్పెక్ట్రమ్ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఆయన టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ఈ కుంభకోణంలో మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలు జైలుకెళ్లడానికి కారణమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల సంస్థ (సీపీఐఎల్) ఈ పిటిషన్ వేసింది. మరోవైపు.. తానే తప్పూ చేయలేదని మారన్ స్పష్టం చేశారు. 2005-07 మధ్య మారన్ టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు మలేసియాకు చెందిన మాక్సిస్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని సీపీఐఎల్ ఆరోపించింది. మారన్ ఎయిర్‌సెల్ కంపెనీకి యూఏఎస్ లెసైన్సులు ఇవ్వకుండా వేధించారని, దీంతో ఎయిర్‌సెల్‌ను ఆ కంపెనీ యజమాని శివశంకరన్ మలేసియాకు చెందిన ఆనందకృష్ణన్ యాజమాన్యంలోని మాక్సిస్‌కు అమ్మేశారని,  తర్వాత మూడునెలలలోపే మాక్సిస్(ఎయిల్‌సెల్) మారన్ కుటుంబ నేతృత్వంలోని సన్‌టీవీలో 20 శాతం షేర్లు కొనుక్కుని రూ.599 కోట్ల పెట్టుబడులు పెట్టిందని,  మరోవైపు.. మాక్సిస్ గ్రూప్ కూడా మారన్‌గ్రూప్‌కు చెందిన సౌత్ ఆసియా ఎఫ్‌ఎం కంపెనీలో రూ.111 కోట్ల పెట్టుబడులు పెట్టిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
 

తెలంగాణ పై " సాగ ' తీతే...!

న్యూఢిల్లీ,జూన్ 2 :  ప్రత్యేక తెలంగాణ అంశాన్ని వీలైనంతగా సాగదీసేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. శ్రీకష్ణ కమిటీ నివేదికపై రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో తలపెట్టిన రెండో అఖిలపక్ష సమావేశాన్ని మాళ్ళీ 8 పార్టీలూ హాజరైనప్పుడే  నిర్వహించే యోచనలో ఉన్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పడం ఈ సందేహానికి తావిస్తోంది. 8 పార్టీల నుంచీ స్పష్టమైన హామీ లభించినప్పుడే అఖిలపక్షం జరుగుతుందని కూడా  ఆయన దాదాపు స్పష్టం గానే  చెప్పారు. అఖిలపక్షానికి వెళ్లేందుకు పలు పార్టీలు ససేమిరా అంటుండటం, తెలంగాణపై కేంద్రమే తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. మలివిడత అఖిలపక్షంలో పార్టీలు వెలిబుచ్చే అభిప్రాయాల ఆధారంగానే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి చిదంబరం గతంలోనే ప్రకటించడం తెలిసిందే. అంటే, ఆ భేటీ జరగనంత కాలం దీనిపై కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోబోదని బోధపడుతోంది. మొత్తానికి కొరకరాని కొయ్యలా మారిన తెలంగాణ సమస్యను అఖిలపక్ష భేటీతో లంకె పెట్టి, దానిపై అంతర్గతంగా  ఓ నిర్ణయానికి రావడానికి సమయం తీసుకుంటోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.  కాగా తెలంగాణ అంశంపై ఏదో ఒకటి తేలిపోతుందని సర్వత్రా భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం తాజా ప్రకటన మరో గందరగోళానికి తెర లేపిందనే చెప్పాలి. చిదంబరం పాత పాటనే పాడారంటూ పార్టీలు, సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. అనిశ్చితిని పెంచేలానే ఆయన తీరుందని మండిపడుతున్నాయి.

Wednesday, June 1, 2011

‘ చింతన్ శిబిర్ ’లో తెలంగాణపై తేలుస్తారా...?

హైదరాబాద్ ,జూన్ 1:  తెలంగాణ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం జూన్ రెండోవారంలో ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ రెండోవారంలో రాజస్థాన్‌లోని మౌంటు అబు లో  నిర్వహించనున్న ‘ చింతన్ శిబిర్ ’లో తెలంగాణపై సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ వ్యవహారాన్ని ఇక నాన్చకూడదని, ఏదోకటి తేల్చాలంటూ సొంత పార్టీ నాయకుల నుంచే అధిష్ఠానవర్గంపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు సుమారు మూడు వందల మంది చింతన్ శిబిర్‌లో పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రధాన మంత్రి, ఎఐసిసి ఆఫీసు బేరర్లు, కోర్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధికారంలోలేని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు, పిసిసి అధ్యక్షులు తదితరులు ఇందులో పాల్గొంటారు. గతంలో ఇటువంటి సమావేశాలను 1998లో పంచ్‌మడిలోను, 2003లో సిమ్లాలోను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వహించింది.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఇటీవల రెండు రోజుల నగర పర్యటనకు వచ్చి రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ, సీమాంధ్ర నాయకుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చడం మంచిది కాదని, ఏదోక నిర్ణయాన్ని త్వరగా తీసుకోవడం మంచిదని అధిష్ఠానానికి అజాద్ తెలియజేశారు. కాగా, ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో ఆ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని, ఇందుకు రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజకీయ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అలాగే మహారాష్టల్రో ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. వీటన్నిటితో తెలంగాణ అంశాన్ని కూడా కలిపి రెండో ఎస్సార్సీ ఏర్పాటుకే అధిష్ఠానం నిర్ణయం తీసుకోచ్చన్న వాదన  వినిపిస్తోంది.


 

అందాల పోటీల్లో పాల్గొందని చంపిపారేశారు...!

ఉక్రెయిన్‌లో ఛాందసవాదుల దురాగతం
లండన్,జూన్ 1: అందాల పోటీల్లో పాల్గొని షరియా చట్టాన్ని ఉల్లంఘించిందంటూ ఓ ముస్లిం యువతిని ఛాందసవాద యువకులు రాళ్లతో కొట్టిచంపారు. ఉక్రెయిన్‌లో  ఈ దురాగతం జరిగింది.  ఇటీవల అందాల పోటీల్లో పాల్గొని ఏడో స్థానంలో నిలిచిన క్రిమియా ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన కతియా కోరెన్ (19) అనే యువతిని ముగ్గురు ముస్లిం యువకులు ఆమె ఇంటి సమీపంలో రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టారు. కోరెన్ మృతదేహం ఆమె అదృశ్యమైన వారం రోజులకు  అడవిలో లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు పాల్పడినవారిలో బిహాల్ ఘాజీవ్ (16)  అనే యువకుడిని అరెస్టుచేసినట్లు చెప్పారు. ‘ కోరెన్ షరియా చట్టాన్ని ఉల్లంఘించింది. అందుకే ఆమెను హతమార్చాం. అందుకు ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదు ’ అని బిహాల్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇస్లాం చట్టం ప్రకారం అపరాధులను రాళ్లతో కొట్టిచంపడం అనే శిక్షపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిని కొందరు ముస్లింలు వ్యతిరేకిస్తుండగా, మరి కొందరు సమర్థిస్తున్నారు. గత ఏడాది ఇరాన్‌లో షరియా చట్టాన్ని ఉల్లంఘించారంటూ 10 మంది మహిళలను, నలుగురు పురుషులను రాళ్లతో కొట్టిచంపారు. పాకిస్థాన్, నైజీరియాలలో కూడా ఇలాంటి శిక్షలు అమలవుతున్నాయి.

ఎటుపోతోంది ఈ సభ్య సమాజం...! ?


వరంగల్,జూన్ 1: సభ్య సమాజం తలదించుకునే  ఘటనలు ఈ ఆధునిక యుగంలో కూడా చోటు చేసుకుంటుం డడం మన దౌర్భాగ్యం. వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామంలో జరిగిన  ఘటన ఇందుకు నిదర్శనం. పట్టపగలు  ఎవరూ లేని సమయంలో ఒక ఇంట్లో చొరబడిన ఓ కీచకుడు  విద్యార్థిని పై అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని తలపై సుత్తితో కొట్టి.. హత్యాయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు  పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ  ఆగ్రహం చల్లారక  పోలీసుల ముందే  అతడిని సజీవ దహనం చేశారు. కామాంధుడి  దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నింస్ లో చికిత్స పొందుతోంది. రఘునాథపల్లికి చెందిన  మౌనిక (18) హన్మకొండ పింగిళి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. మంగళవారం ఉదయం ఉపాధి పనుల కోసం తల్లి బయటకు వెళ్లగా.. తండ్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వీరి ఇల్లు గ్రామం చివరన ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వర్ధన్నపేట మండలం పెరుమండ్లగూడెంకు చెందిన  బాబు అటుగా వెళ్తూ.. ఇంట్లో మౌనిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించాడు. మంచి నీళ్లు కావాలనే నెపంతో బలవంతంగా ఇంట్లో చొరబడ్డాడు. మౌనికపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడే ఉన్న సుత్తితో తలపై కొట్టి.. చంపడానికి యత్నించాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మౌనిక చనిపోయిందని భావించిన బాబు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ఆ సమయంలో మౌనిక ఇంటికి దగ్గర్లోనే ఉన్న పల్లెపు లక్ష్మి అనే మహిళ అతడిని గమనించి   వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు నిందితుడి కోసం గాలించి   గ్రామ శివారులో పట్టుకున్నారు.   తీవ్ర ఆగ్రహంతో అతడిపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు. అక్కడి నుంచి గ్రామంలోకి తీసుకువచ్చారు. అప్పటికే ఈ సమాచారం అందుకున్న జఫర్‌గఢ్ ఎస్సై జహీర్‌ఖాన్ పోలీసులతో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. మౌనికను 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామస్థులంతా తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసుల సమక్షంలోనే బాబును మళ్లీ చితకబాదారు. స్పృహ కోల్పోయిన నిందితుడిపై గడ్డి వేసి, కిరోసిన్ పోసి, నిప్పంటించారు. మంటల్లో కాలిపోయిన బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మౌనిక పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను ఎంజీఎం ఆస్పత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. తలపై కుడివైపున బలమైన గాయం కావడంతో సిటీ స్కాన్ నిర్వహించామని, అవసరమైతే శస్త్రచికిత్స చేస్తామని నిమ్స్ వైద్యులు తెలిపారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...