సూరి హత్య కేసు: భాను ఇంకా పట్టుబడలేదు: పోలీసు కమిషనర్

హైదరాబాద్,జనవరి 29: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నలుగురు నిందితులను హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. భాను కిరణ్ గన్‌మన్ మన్మోహన్ సింగ్‌తో పాటు సుబ్బయ, ఆవుల వెంకటరమణ, బోయ వెంకట హరిబాబు అనే వ్యక్తులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అని, అతను పరారీలో ఉన్నాడని ఖాన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సూరిని భానుయే కాల్చి చంపాడని ఆయన చెప్పారు. భాను కోసం మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు.  ఆర్థిక లావాదేవీలు, భూ దందాలు, స్పర్థలు సూరి హత్యకు కారణమని అర్థమవుతోందని, భాను దొరికితే మరేదైనా కోణం వెలుగు చూస్తుందేమో చెప్పలేమని ఆయన అన్నారు. నిందితుల నుంచి సిమ్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సూరి హత్య కేసులో 30 మందిని విచారించామని, కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించామని ఆయన చెప్పారు. భాను, తదితరుల పేర్ల మీద 100కు పైగా ఆస్తులున్నాయని, భాను పేరు మీద 9 ఆస్తులున్నాయని ఆయన అన్నారు. వాటి నిగ్గు తేల్చడానికి సంబంధిత శాఖలకు, సంస్థలకు బాధ్యత  అప్పగించామని ఆయన చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు