Friday, January 21, 2011

దర్శకుడు ఇ.వి.వి. ఇకలేరు...

కామెడీ చిత్రాలను రూపొందించడంలో తనదైన ప్రత్యేకతను ఏర్పరుచుకున్న సినీ దర్శకుడు, కథా రచయిత ఈవీవీ సత్యనారాయణ (54)శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రిలో మరణించారు. ఆయన కొద్దికాలంగా గొంతు క్యాన్సర్‌తో భాదపడుతున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో 1956 జూన్ 10వ తేదిన జన్మించిన  ఇ.వి.వి. 42 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో అమితాబ్ నటించిన సూర్యవంశానికి కూడా దర్శకుడు ఈవీవీనే. ఈవీవీ  తనయులు ఆర్యన్ రాజేశ్, నరేశ్ ఇద్దరూ సినీ హీరోలే. 1990లో ‘చెవిలో ఫువ్వు’ సినిమాతో దర్శకత్వ అరంగేట్రం చేసిన ఈవీవీ... అదే ఏడాది ప్రేమ ఖైదీ చిత్రంతో మెగా హిట్‌ను దక్కించుకున్నారు. చివరిగా గతేడాది తనయుడు నరేశ్ హీరోగా కత్తి కాంతారావు సినిమా తీశారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు శిష్యుడిగా పేరొందారు.జంధ్యాల వద్ద కొన్నాళ్లు సహాయకుడిగా పనిచేసిన ఈవీవీ... జంధ్యాల కంటే కొంచెం ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి చిత్రాలు తీశారు. జంబలకిడి పంబ, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది లాంటి చిత్రాల తరువాత మహిళలు మెచ్చిన తాళి, ఆమె వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అగ్ర నటులైన చిరంజీవితో బావగారూ-బాగున్నారా,,  నాగార్జునతో ఆవిడా-మా ఆవిడే, వెంకటేష్‌తో ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు చిత్రాలు తీశారు. తరువాత తన కుమారులిద్దరినీ హీరోలుగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. రంభ, ఊహ, రవళి వంటి నటీమణులను ఈవీవీ తెలుగు తెరకు పరిచయం చేశారు. 22 సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసిన ఈవీవీ... చాలా బాగుంది, అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ వంటి హిట్ చిత్రాలతో సహా మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.  ‘ఇంద్రుడు-చంద్రుడు’ సినిమాలో పోలీస్ అధికారి క్యారెక్టర్ వేశారు. వెరైటీ టైటిల్స్ పెట్టినా, గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నిటినీ వరసపెట్టి ఒకే సినిమాలో చూపించినా... అవన్నీ ఈవీవీకే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్.. బెండు అప్పారావు ఆర్‌ఎంపీ.. తొట్టిగ్యాంగ్.. దొంగల బండి.. ఎవడి గోల వాడిది.. వీడెక్కడి మొగుడండీ.. అదిరింది అల్లుడూ.. కితకితలు.. ఇలాంటి టైటిల్స్ పెట్టడం ఈవీవీ స్టైల్.  .

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...