తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: కె.సి.ఆర్.
హైదరాబాద్,జనవరి 18: లక్ష్య సాధన కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు యుద్ధానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. తెరాస కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ ఉద్యమానికి కార్యకర్తలు, ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేంద్రం వెనుకంజ వేయడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర వైఖరిలో మార్పురానంత వరకూ తమ వైఖరిలో మార్పు ఉండదని తేల్చి చెప్పారు. నివేదిక వ్యతిరేకంగా వస్తే రాజీనామా చేస్తామన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇపుడు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. రచ్చబండను రచ్చరచ్చ చేయాలని కోరారు. తెలంగాణ అంశం తేలేవరకు ప్రజల వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధుల భరతం పట్టాలని కోరారు.
Comments