Wednesday, March 26, 2014

అర ' చేతిలో ' వైకుంఠం ....

కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో ను విడుదల చేస్తున్న సోనియా, మన్మోహన్, రాహుల్...
న్యూఢిల్లీ,మార్చి 26:  సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ను వీడుదల చేసింది. మేనిఫెస్టో రూపకల్పనలో కొత్త పద్ధతులు అవలంభించామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. దేశంలోని పేదల శ్రేయస్సు, సంక్షేమమే లే లక్ష్యంగా  ఎన్నికల మేనిఫెస్టో రూపొందించామని ఆమె తెలిపారు.  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారని, వివిధ వర్గాల ప్రజలతో చర్చలు జరిపి, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారని, వాటికి  అనుగుణం గానే  మేనిఫెస్టో రూపొందించినట్లు సోనియా తెలిపారు.  ప్రజలందరికీ ఆరోగ్య హక్కు కల్పిస్తామని ,  ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టిస్తామని ,దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి హామీ కల్పిస్తామని సోనియా పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళిక తయారీకి చాలా కసరత్తు చేశామని, 2014 ఎన్నికలు కేవలం అభివృద్ధి కోసమే కాదని సోనియా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరిన్ని బాధ్యతలు ఉన్నాయని, రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని ఆమె అన్నారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని, లౌకిక భారతం కోసం పోరాడుతామని సోనియాగాంధీ పేర్కొన్నారు. రైతులు, వివాహిత మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతుమని.
దేశ ప్రజల గొంతుక
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దేశ ప్రజల గొంతుకని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజలతో చర్చించే మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు.  తమ పార్టీ అవినీతిపై పోరాటం చేస్తుందని, రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు సెక్టార్లలో కూడా రిజర్వేషన్లు అమలు జరిగేలా చట్టం తీసుకు వస్తామని రాహల్ తెలిపారు.  గత పదేళ్లలో దేశంలో పేదరిక నిర్మూలన కోసం... జరిగిన కృషిని మరింత వేగవంతం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
కాంగ్రెస్  మోడల్
సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు.  దేశాభివృద్ధిలో కాంగ్రెస్ ముందుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కొందరు గుజరాత్ మోడల్ అంటున్నారని, కానీ కాంగ్రెస్ విధానం...గుజరాత్ విధానానికి భిన్నమైనదని మన్మోహన్ తెలిపారు. దారిద్య్రరేఖ నుంచి అందరినీ పైకి తీసుకురావడమే కాంగ్రెస్ విధానమని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు.

తెలంగాణలో సీపీఎం ఫస్ట్ లిస్ట్... 3 లోక్ సభ, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

 హైదరాబాద్:,మార్చి 26:   తెలంగాణలో సీపీఎం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 3 లోక్ సభ, 5 శాసనసభ స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది.   ఖమ్మం  లోక్ సభ స్థానానికి సమీనా, నల్లగొండ   లోక్ సభ స్థానానికి నంద్యాల నరసింహారెడ్డి, భువనగిరి  లోక్ సభ స్థానానికి చెరుపల్లి సీతారాములు పోటీ చేస్తారు.
శాసనసభ మధిర స్థానానికి లింగల కమల్‌రాజు, పాలేరు - పోతినేని సుదర్శన్,  భద్రాచలం- సున్నం రాజయ్య,  ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి పేర్లను ప్రకటించారు.

బిజెపిలో నటుడు సురేష్

 హైదరాబాద్:,మార్చి 26:    సినీ నటుడు సురేష్ బిజెపిలో చేరారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వం నచ్చి తాను బిజెపిలో చేరినట్లు ఆయన తెలిపారు. గుజరాత్‌ను నరేంద్ర మోడీ  అభివృద్ధి చేశారని, భారతదేశమంతా గుజరాత్‌లా ఉంటే బాగుంతుందని  ఆయన మీడియా తో అన్నారు. తామేదో ఆస్తులు కాపాడుకోవడానికి వస్తున్నట్లు ప్రచారం సాగిస్తున్నారని, అది నిజం కాదని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేయాలని ముందుకు వచ్చినప్పుడు రాళ్లు పడడం మామూలేనని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. 

సిపిఐ, కాంగ్రెసు పొత్తులో ప్రతిష్టంభన

న్యూఢిల్లీ,మార్చి 26:   సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది.  తమకు పది అసెంబ్లీ సీట్లు కావాల్సిందేనని సిపిఐ పట్టుపడుతుండగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు మించి ఇవ్వద్దని కాంగ్రెస్ అధిష్టానం  ఆదేశించినట్లు తెలియవచ్చింది. తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ హైదరాబాదులో అన్నారు.

Tuesday, March 25, 2014

టాలీవుడ్ 'న.మో.'జపం... అమల కోసం నాగార్జున.... మోహన్ బాబు చూపూ మోడి వైపే...

హైదరాబాద్,మార్చి 25: నరేంద్ర మోడీ పట్ల,  ఆయన ప్రధాని అభ్యర్థిగా ఉన్న బీజేపీ పట్ల టాలీవుడ్ ప్రముఖుల్లో ఆసక్తి పెరుగుతోంది.  మొన్న పవన్ కల్యాణ్... నిన్న  నాగార్జున ఇలా  టాలీవుడ్‌లో 'న.మో.' జపం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు మరో హీరో  మోహన్ బాబు కూడా మోడీ తో సమావేశం కానున్నస్ట్టు సమాచారం. మోదడీ గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మోహన్‌బాబు తన కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారుడు విష్ణుతో పాటు ఆయనను  కలిశారు. ఇటీవల తిరుపతిలో మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాలకు సంబంధించి త్వరలో సంచలన ప్రకటన చేస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.  నిజానికి సినీ పరిశ్రమలో ఎక్కువమంది తెలుగుదేశం వైపో, కాంగ్రెస్‌వైపో ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 'చిత్రం' మారిపోయింది.  ఇక తెలుగుదేశానికి కొందరు సినీ ప్రముఖుల మద్దతు కొనసాగుతున్నా,  ఇప్పుడు కొత్తగా 'మోదీడీ హవా' మొదలైంది. 'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదడీ  నాయకత్వం అవసరం' అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇప్పుడు... మోదీని కలిసి వచ్చిన అనంతరం అక్కినేని నాగార్జున కూడా అదే మాట చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో... సీమాంధ్రలోనూ బీజేపీ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు గతంలో బీజేపీ టికెట్‌తో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీకి దూరమైన ఆయన... తిరిగి అదే గూటికి  చేరారు. నటి జీవిత ఈ మధ్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాగార్జున ఇప్పటికే వెంకయ్యనాయుడుని కలిసి,  తన సతీమణి అమలకు విజయవాడ పార్లమెంట్ సీటును ఇప్పించాల్సిందిగా కోరారనీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అందులో భాగంగానే మోడీని కలిసినట్లు తెలుస్తోంది. కాగా యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా లు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసే అవకాశాలు లేకపోలేదంటూ వస్తున్న వార్తలు కొసమెరుపు...


Friday, March 21, 2014

మోడీ కి జై కొట్టిన పవన్.....ఎన్నికలలో పోటీ పై ఇంకా అస్పష్టత

అహ్మదాబాద్, మార్చి 21 : దేశానికి నరేంద్రమోదీ లాంటి నాయకత్వం అవసరమని 'జనసేన' అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మోదీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం  మోదీ- పవన్ సమావేశమయ్యారు. సుమారు 40 నిముషాల పాటు వారి  మధ్య చర్చలు జరిగాయి, అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్లాల్లోని సమస్యలను మోదీకి వివరించానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని ఆయన అన్నారు. అదే మోదీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు.  మోదీ ప్రధాని అయితే రాష్ట్రానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో కూడా చెప్పానని ఆయన అన్నారు. తాను పదవుల కోసం రాజకీయంలోకి రాలేదని, పదవులపై వ్యామోహం లేదని పవన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ తెలిపారు. మోదీకి మద్దతు తెలపడం కోసమే అహ్మదాబాద్ వచ్చానని ఆయన అన్నారు. మోదీని ప్రధానిని చేయడానికి నేను, నా పార్టీ కృషి చేస్తామని పవన్ స్పష్టం చేశారు. 

Friday, March 14, 2014

కాంగ్రెస్ టార్గెట్ గా పవన్ జనసేన..

ప్రజలను విభజిస్తే తాట తీస్తా..
కాంగ్రెస్ తప్ప ఎవరితోనైనా కలుస్తా... 
జంపర్లు, జోకర్లు నాకొద్దు.... అభిమానులే బలం.... 
వ్యక్తిగత ఆరోపణలు చేస్తే అయిపోతారంతే... 
అందరికీ సమాన చట్టాలు....బ్లాక్ మార్కెట్ బంద్...మహిళలకు కనీసం పగలైనా భద్రత....మెరుగైన వైద్యసేవలు... 
హైదరాబాద్, మార్చి 14: కాంగ్రెస్ హటావో నినాదంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్  జనసేన పార్టీ ఆవిర్భవించింది.  నొవాటెల్ హోటల్ లో పవన్ కల్యాణ్  దాదాపు రెండు గంటల సేపు అభిమానులను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకం కాదని ప్రసంగం మొదట్లోనే స్పష్టం చేసిన పవన్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణాకు తాను వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరు చాలా బాధాకరమని ఆయన తమ ప్రసంగంలో పదే పదే ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ సహా  చిదంబరం, షిండే, దిగ్విజయ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ జైరాం రమేష్ లను క్షమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒక్క జాతిగా మెలిగిన ప్రజలు ఆ ప్రాంతం వారు, ఈ ప్రాంతం వారు అని పిలుచుకునే  దౌర్భాగ్య పరిస్థితి ని కాంగ్రెస్  తెచ్చిపెట్టిందని మండిపడ్డారు. జాతీయ సమగ్రతకు  ఎవరు భంగం కలిగించినా తాట తీస్తానన్నారు. సమాజం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించే మొట్టమొదటి పిచ్చివాడిని తానే అంటూ దేశం నుంచి కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పవన్ కల్యాణ్  పిలుపు ఇచ్చారు. .సమాజంలో మార్పు తేవడమే ధ్యేయంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో తప్పా..ఏ పార్టీతోనైనా చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నానని  స్ఫష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఆ పార్టీపై పోరాటం ఆగదని తెలిపారు. ప్రస్తుతం తన పార్టీ నిర్మాణ దశలోనే ఉందని, పార్టీగా రూపాంతరం చెందడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా?లేదా? అని అంశంపై ఇంకా స్ఫష్టత లేదన్నారు.   ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అవ్వాలని లేదని, పదవులు తనకు చాలా తుచ్ఛమైనవని పవన్ పేర్కొన్నారు.  ' నేనున్న పరిస్థితి ఎలా ఉందంటే - ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం .. దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు,, కాని గుండెల నిండా ధైర్యం ఉంది' 'అంటూ గట్టిగా నినదిస్తూ అభిమానులను ఉత్తేజపరుస్తూ పవన్  తొలుత తన ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలలనుంచి వేలాదిగా  పవన్ అభిమానులు  ఈ సభకు తరలి వచ్చారు.

Thursday, March 13, 2014

పచ్చ టిక్కెట్ల కోసం టాలీవుడ్ ప్రముఖుల ప్రాకులాట...

హైదరాబాద్  , మార్చి 13:   హాస్య నటుడు అలీ తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాడు.  అలీ ఈ విషయాన్ని ఈప్పటికే టిడిపి అధినేత  చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తెచ్చాడుట. ఆల్లిని గుంటూరు 1 స్థానం నుండి బరిలోకి దింపే విషయమై పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని తెలుస్తోంది.  అలీ ఆది నుంచి టిడిపి సానుభూతిపరుడు. ఆయన గతంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ముస్లిం మైనారిటీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఆ సీటుకు ఆ వర్గాల నుంచి ఎవరినైనా నిలపాలని టిడిపి భావిస్తోంది. దివంగత టిడిపి నేత లాల్‌జాన్ బాషా సోదరుడు గతంలో ఆ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. కానీ, ఇప్పుడు  అలీని  ప్రత్యామ్నాయంగా టిడిపి భావి స్తోందిట. అలీతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు  టిడిపి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ప్రముఖ నటుడు సుమన్  రేపల్లె నుండి పోటీ చేయవచ్చునని వినికిడి. గుంటూరు-2 సీటుకు టిడిపి తరఫున తాజాగా నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు పేరు ప్రచారంలోకి వచ్చింది. గుంటూరు-2 సీటుకు నటి కవిత పేరు కూడా పరిశీలనలో ఉందట.

ఎన్నికల బరిలో నగ్మా...మీరట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ..

ఢిల్లీ , మార్చి 13:  లోకసభ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో కాంగ్రెసు రెండో జాబితాను విడుదల చేసింది.  సినిమా నటి నగ్మాకు కూడా టిక్కెట్ కేటాయించారు. .ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి నగ్మా పోటీ చేస్తుంది.  మరో సినీ నటుడు రాజ్ బబ్బర్ ఘజియాబాద్ నుంచి లోకసభకు పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ మొహమ్మద్ అజరుద్దీన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఈసారి లోకసభకు పోటీ చేయనున్నారు.

పవన్ ' షట్చక్ర ' బంధంలో చిరు...

హైదరాబాద్, మార్చి 13: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సొంత పార్టీ ఏర్పాటు మెగా స్టార్ చిరంజీవి  కి సంకటంగా మారింది. మరో 24 గంటలలో పార్టీ ని  అధికారికంగా పవన్ ప్రకటించనున్న తరుణంలో చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా గల తమ అభిమాన సంఘాల నాయకులతో ఢిల్లీనుంచి టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్టు తెలుస్తున్నది. పవన్ కళ్యాన్  సమావేశానికి  వెళ్లరాద ని చిరు తన అభిమానులను ఆదేశించినట్టు,  కొంతమంది చిరు అభిమానులు దానిని ధిక్కరించినట్టు సమాచారం.  అనేక మంది అభిమానులు పవన్‌ను ఒంటరి చేయడం సరికాదని, తాము పవన్  సమావేశానికి వెళ్లితీరతామని చిరుకు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. చిరును నమ్ముకుని ప్రజారాజ్యం వెంట నడిస్తే చివరికి చిరు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు కొంతమంది ముక్కు సూటిగా వెళ్లే పవర్ స్టార్ వెంట నడిస్తేనే మంచిదని భావిస్తున్నామని  చిరుకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. కాగా, చిరంజీవి కుమారుడు రాం చరణ్ తేజ్ , చిరంజీవి సోదరుడు నాగబాబు   చిరంజీవి వెంటే ఉంటామని స్పష్టం చేయడంతో పవన్ ఒంటరి అయినట్టు కనబడుతోంది.  అయితే పవన్ ప్రస్తుతం కుటుంబ వ్యవహారం పై ఏమీ స్పందించడం లేదు. తన జనసేన పార్టీ  పేరును ఆయన శుక్రవారం నాడు అధికారికంగా ప్రకటించనున్నారు. పవన్ పార్టీ గుర్తు షట్చక్రం కాగా, నినాదం ఫైట్ ఫర్ ది రైట్స్ అని తెలుస్తోంది.
పవన్ ' షట్చక్ర '  బంధంలో చిరు...  

Monday, March 10, 2014

రోడ్డు ప్రమాదంలో పాక్ నటి సనా ఖాన్ మృతి

హైదరాబాద్,మార్చి 10: పాకిస్థాన్ లోని హైదరాబాద్ వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో పాక్ సినీ నటి సనా ఖాన్ మృతి చెందారు.  భర్త బాబర్ ఖాన్ తో కలిసి  ప్రయాణిస్తున్నకారు అదుపు తప్పడంతో ఆమె మరణించింది. తీవ్రంగా గాయపడిన  బాబర్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Saturday, March 8, 2014

 మహిళా దినోత్సవం సందర్భంగా  రాష్ట్రపతి నుంచి స్త్రీ శక్తి పురస్కారం అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన టి.రాధా కె. ప్రశాంతి.... 

సి.పి.ఎం. అంధ్ర, తెలంగాణా కమిటీలు సిద్ధం...

హైదరాబాద్, మార్చి 8 :   రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రెండు రాష్ట్రాలకు రెండు శాఖలను ఏర్పాటు చేసింది.  తెలంగాణ రాష్ట్ర కమిటీ  కార్యదర్శిగా ఖమ్మం జిల్లా సీనియర్ నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను నియమించారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కార్యదర్శిగా పార్టీ కేంద్ర కమిటి సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు పెనుమల్లి మధును నియమించారు.   రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు కమిటీలు నియమించిన మొట్టమొదటి పార్టీ సీపీఎం. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల కమిటీలకు కూడా సభ్యులను నియమించారు.మున్సిపల్ ఎన్నికల తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేత  రాఘవులు చెప్పారు. పొత్తులపై రెండు రాష్ట్ర కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని ఆయన చెప్పారు.

సీమాంధ్రకు న్యాయం కోసమే బీజేపీలో చేరా....పురందేశ్వరి

హైదరాబాద్, మార్చి 8 : స్వప్రయోజనాల కోసం తాను బీజేపీలో చేరలేదని దగ్గుబాటి  పురందేశ్వరి స్పష్టం చేశారు. తనకు  కృతజ్ఞత లేదంటూ  జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. తెలంగాణ బిల్లు విషయంలో తమ వాదనలను కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందన్న ఆవేదనతో పార్టీని వీడానన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ బీజేపీలో చేరినట్లు పురందేశ్వరి చెప్పారు. లోక్‌సభలో తాము అడిగినప్పుడే  ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్  స్పెషల్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.  బీజేపీ ఒత్తిడి మేరకే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్నారు. సీమాంధ్రకు జరగాల్సిన న్యాయం కోసమే తాను  బీజేపీలో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను గౌరవించిందనడంలో సందేహం లేదమి, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట బజారుకీడ్చే పనులు తాను చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను గౌరవించిందనడంలో సందేహం లేద న్నారు. రామాయపట్నం దగ్గర తనకు వెయ్యి ఎకరాలు ఉన్న మాట అవాస్తవమని పురందేశ్వరి తెలిపారు.

కొడుకుతో పాటు టి.డి.పి. లో చేరిన గల్లా అరుణ...

హైదరాబాద్, మార్చి 8 : మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి , ఆమె కుమారుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త  గల్లా జయదేవ్ టీడీపీలో చేరారు.  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిరువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. సీమాంధ్రుల మనోభావాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని,  ఈ పరిణామాల వల్ల సీమాంధ్రలో ఇక కాంగ్రెస్ లేనట్టేనని గల్లా అరుణ  అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు అతలాకుతలంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలగిన నాయకుని కోసం ఎదురు చూస్తున్నారని, అటువంటి నాయకత్వాన్ని  ఒక్క చంద్రబాబు మాత్రమే అందించగలరన్న విశ్వాసంతో తెలుగుదేశంలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.

239 మందితో సముద్రంలో కూలిన మలేసియా విమానం

 మృతులలో ఐదుగురు ఇండియన్లు...
కౌలాలంపూర్, మార్చి 8 : మలేషియా నుంచి బీజింగ్ వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శనివారం తెల్లవారుజామున సముద్రంలో కూలిపోయింది. వియాత్నంలో ఈ విమానం కుప్పకూలినట్లు అధికారులు ధృవీకరించారు. విమానంలో 227 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.   శుక్రవారం అర్థరాత్రి 12:41 గంటలకు కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన విమానంతో రెండు గంటల తర్వాత సంబంధాలు తెగిపోయాయి. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు, 152 మంది చైనీయులు, 30 మంది మలేషియన్లతో పాటు ఇండోనేషియన్లు, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్, న్యూజిల్యాండ్, ఉక్రేనియన్, కెనడా, రష్యా, ఇటలి, నెదర్లాండ్, తైవాన్, ఆస్ట్రియా దేశస్థులు ఉన్నారు. మలేషియా ఎయిర్‌లైన్ సిబ్బంది, సహాయక బృందాలు  గాలింపు చర్యలు చేపట్టాయి.

Wednesday, March 5, 2014

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మికి అంతర్జాతీయ పురస్కారం

వాషింగ్టన్, మార్చి 5 : యాసిడ్ దాడి బాధితురాలు, ఢిల్లీకి చెందిన లక్ష్మీకి అంతర్జాతీయ పురస్కారం లభించింది. బుధవారం అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రతిష్టాత్మక 'అంతర్జాతీయ ఉమెన్ ఆఫ్ కరేజ్' అవార్డును లక్ష్మీ స్వీకరించారు. అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఈ పురస్కారాన్ని లక్ష్మీకి అందజేశారు. 2005లో యాసిడ్ ఘటన చోటుచేసుకుంది. అప్పుడు లక్ష్మీకి 16 ఏళ్ల వయసు. లక్ష్మీ తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఆమె స్నేహితురాలి సోదరుడే లక్ష్మీపై యాసిడ్ దాడి చేశాడు. అయితే లక్ష్మీ మానసికంగా కృంగిపోలేదు. ఆమె చేసిన పోరాటం ఫలితంగానే మన దేశంలో యాసిడ్ అమ్మకాలను నియంత్రిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మీ ధైర్యానికి గుర్తింపుగా అంతర్జాతీయ ఉమెన్ ఆఫ్ కరేజ్ పురస్కారాన్ని ఆమెకు ప్రకటించారు.

తొమ్మిది దశల్లో లోక్‌సభఎన్నికలు:ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7 సీమాంధ్రలో : మే 16న ఫలితాలు


న్యూఢిల్లీ, మార్చి 5 : 2014 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ బుధవారం  ప్రకటించారు. మే 16న దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 81.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా తిరస్కరణ ఓటు (నోటా)ను ప్రవేశపెట్టారు. షెడ్యూల్ విడుదల తో  దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 30న, మే 7న పోలింగ్ జరుగనుంది. తొలి పోలింగ్ .. ఏప్రిల్ 7వ తేదీ. ఆరోజు ఆరు , తదుపరి 9వ తేదీన   ఐదు రాష్ట్రాల్లో 7 పార్లమెంటరీ నియోజవకర్గాల్లోను,   10వ తేదీన 14 రాష్ట్రాల్లో 92 నియోజకవర్గాల్లోను,   12వ తేదీన మూడు రాష్ట్రాల్లోని  5 నియోజకవర్గాల్లో ను ,  17వ తేదీన 13 రాష్ట్రాల్లో 122 నియోజకవర్గాల్లో ను పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 24న ఆరో దశలో 12 రాష్ట్రాల్లోని 117 లోక్‌సభ స్థానాలకు, * ఏప్రిల్ 30న ఏడో దశలో 9 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.  మే 7న ఎనిమిదవ దశలో 7 రాష్ట్రాల్లోని 64లోక్‌సభ స్థానాలకు,  మే 12న తొమ్మిదవ దశలో 3 రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు, , 
ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7 సీమాంధ్రలో
 ఆంధ్రప్రదేశ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి.ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7 సీమాంధ్రలో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలకు, సీమాంధ్రలో 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
తెలంగాణలో :* ఏప్రిల్ 2న తెలంగాణలో నోటిఫికేషన్ విడుదల  * ఏప్రిల్ 9న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
* ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన* ఏప్రిల్ 12న నామినేషన్ల ఉపసంహరణ* ఏప్రిల్ 30 తెలంగాణలో ఎన్నికలు
సీమాంధ్రలో :* ఏప్రిల్ 12న సీమాంధ్రలో నోటిఫికేషన్ విడుదల* ఏప్రిల్ 19న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
* ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన* ఏప్రిల్ 23న నామినేషన్ల ఉపసంహరణ* మే 7న సీమాంధ్రలో ఎన్నికలు.





Saturday, March 1, 2014

రాహుల్‌ గాంధీకి ముద్దు పెట్టిన మహిళ సజీవ దహనం...!

న్యూఢిల్లీ  మార్చి 1: కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ముద్దు పెట్టిన పాపానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఫిబ్రవరి 26న అసోంలోని జోరత్‌లో  స్వయం సహాయక గ్రూపులతో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేయడానికి వచ్చిన పలువురు మహిళలు రాహుల్ కు మరింత చేరువగా వచ్చి హఠాత్తుగా చెంపలపైనా, నుదిటిపైనా ముద్దులు పెట్టారు.  కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు బోంటి...రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది.  పేపర్లు, టీవీ ఛానల్స్ లో ఈ వార్తను  పెద్ద ఎత్తున ప్రసారం చేయటంతో బోంటి భర్త తీవ్ర మనస్తాపానికి గురయిన బోంటి భర్త ఆమెను  సజీవ దహనం చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని  భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉందిట.....

41 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మరోమారు రాష్ట్రపతి పాలన

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కలిపితే... ఇది మూడోసారి అవుతుంది. మూడుసార్లూ ఇది  'రాష్ట్ర విభజన - ఆవిర్భావం'తో ముడిపడటం ఒక విశేషం. మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర  రాష్ట్రం ఏర్పడిన ఏడాదికి రాష్ట్రపతి పాలన విధించారు. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పై అప్పట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను పదవినుంచి దించేశారు. ప్రత్యామ్నాయమేదీ లేకపోవడంతో... 1954 నవంబర్ 15న ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించారు. ఇది... 1955 మార్చి 29 వరకు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన చాలా కాలానికి జై ఆంధ్రా ఉద్యమం నేపథ్యంలో 1973లో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అప్పట్లో చెలరేగుతున్న అల్లర్లను అదుపు చేయడానికి వీలుగా 1973లో జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. మళ్లీ... 41 ఏళ్ల తర్వాత రాష్ట్రం మరోమారు రాష్ట్రపతి పాలనలోకి వెళుతోంది. ఇప్పుడు రాష్ట్రవిభజనపై నిర్ణయం.. సీఎం రాజీనామా చేయడం.. మరో ముఖ్య మంత్రిని నియమించలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం గమనార్హం.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...