Saturday, June 29, 2013

పీఎస్‌ఎల్‌వీ సీ22 కౌంట్ డౌన్ ప్రారంభం

శ్రీహరికోట, జూన్ 29:   భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ)ను పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ సీ22) ద్వారా ప్రయోగించడానికి కౌంట్ డౌన్ మొదలైంది.  శనివారం ఉదయం 7.11 గంటలకు ప్రారంభమైన  కౌంట్‌డౌన్ 64.30 గంటల పాటు కొనసాగిన అనంతరం  .. జూలై1వ తేదీ సోమవారం రాత్రి 11.41 గంటలకు ప్రయోగం నిర్వహిస్తారు.  రాకెట్ ను  ప్రయోగించిన    20-25 నిముషాలలో  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేరుస్తుంది.

చెలరేగిన గేల్ ----శ్రీలంక పై విండీస్ గెలుపు

జమైకా, జూన్ 29:  ముక్కోణపు క్రికెట్ టోర్నిలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓపెనర్ క్రిస్ గేల్ సెంచరీ సాధించడంతో వెస్టిండీస్ జట్టు ఇంకా 73 బంతులుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ 100 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. చార్లెస్ 29, బ్రావో 27,శ్యామ్యూల్ 15 పరుగులు చేశాడు. కులశేఖర, హెరాత్ కు చెరో వికెట్ లభించింది. టాస్ గెలిచి వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను స్పిన్నర్ నరైన్ దెబ్బ తీశాడు. నరైన్ 4 వికెట్లతో టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. నరైన్ కు తోడు రాంపాల్ మూడు వికెట్లు, బ్రావో రెండు, శ్యామ్యూల్ ఒక వికెట్ పడగొట్టాడు. దాంతో శ్రీలంక జట్టు 48.3 ఓవర్లలోనే 208 పరుగులకు ఆలౌటైంది.  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా క్రిస్ గేల్ ఎంపికయ్యాడు.

Wednesday, June 26, 2013

ఉత్తర కాశీలో తాడు, నిచ్చెన సాయం తో వరద బాధితులను కాపాడుతున్న సైన్యం... .

పద్మావతీ ఎక్స్‌ప్రెస్ అన్ని కోచ్‌ల్లోనూ 'బయో టాయ్‌లెట్'లు ....

 హైదరాబాద్, జూన్ 26 : సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతీ ఎక్స్‌ప్రెస్ రైలు అన్ని కోచ్‌ల్లోనూ 'బయో టాయ్‌లెట్'లు ఏర్పాటు చేశారు.  ఇప్పటివరకు  హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో కొన్ని కోచ్‌ల్లో మాత్రం బయోటాయ్‌లెట్లను ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో జులై నాటికి మరి కొన్ని రైళ్ళలోని 32 కోచ్‌ల్లో 110 బయో టాయ్‌లెట్లు త్వరలో ఏర్పాటు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.  జులై నాటికి పూర్తవుతుందని తెలిపారు.  ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి మరి కొన్ని రైళ్ళలోని 192 కోచ్‌ల్లో బయోటాయ్‌లెట్లు ఏర్పాటు కానున్నాయి.

గుంటూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు జీవిత ఖైదు

గుంటూరు, జూన్ 26:  గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరు బాలికలపై జరిగిన రేప్ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇద్దరి నిందితులకు జీవితఖైదు, ఇద్దరికి 14ఏళ్లు, మరో ఇద్దరికి పదేళ్లు జైలుశిక్ష విధించింది. అంతేకాకుండా నిందితులకు వరుసగా 50వేలు, 75 వేలు, 50 వేల రూపాయల జరిమానా కోర్టు విధించింది.

116 మంది ఉత్తరాఖండ్‌ వరద బాధితులతో హైదరాబాద్ చేరుకున్న ప్రభుత్వ విమానం

హైదరాబాద్, జూన్ 26:  ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వరద బాధితుల తరలింపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానం బుధవారం సాయంత్రం డెహ్రాడూన్ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ప్రభుత్వ విమానంలో మొత్తం116 మంది ఉత్తరాఖండ్‌ వరద బాధితులు హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న 116 మందిలో 40మంది విశాఖకు చెందినవారు.  ఈ  40 మంది  టీడీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు.
ఉత్తరాఖండ్ లో వరద సహాయ చర్యలకు వినియోగిస్తున్న ఐ.ఎ.ఎఫ్. రక్షణ హెలికాప్టర్లు...

Sunday, June 23, 2013

భారత్ లో మూడు రోజుల పర్యటనకై ఆదివారం ఢిల్లీ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ...

Thursday, June 20, 2013

ఉత్తరాఖండ్‌ వరదలలో ఆరుగురు ఆంధ్రుల మృతి...

డెహ్రాడూన్, జూన్ 20: ఉత్తరాఖండ్‌ వరదలలో  విశాఖపట్నంకు చెందిన ఐదుగురు, అనంతపురం జిల్లాకు కు చెందిన ఒకరు మరణించారు.   విశాఖకు చెందిన ఐదుగురు ఉత్తర కాశీలో మృతి చెందినట్లు ఉత్తరాఖండ్ అధికారులు సమాచారం అందించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అలాగే  అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలానికి  చెందిన వీరభద్రప్ప అనే యువకుడు మృతి చెందినట్టూ అధికారులు సమాచారం అందించారు.

డాలర్ తో రూపాయి విలువ 59.61....

ముంబై, జూన్ 20: : అడ్డూ, ఆపు లేకుండా రూపాయి పతనం కొనసాగుతోంది. 11 నెలల తర్వాత మళ్లీ 59.61పైసలకు రూపాయి పతనమై  జీవిత కాలపు కనిష్ట స్ధాయికి చేరింది. 2012 జూన్‌ 28న 57ను తాకిన తరువాత మళ్ళీ ఈ నెల జూన్‌ 11న 58.98పైసల కనిష్ట స్ధాయికి దిగజారింది. డాలర్లకు విపరీతంగా డిమాండ్‌ వస్తుండటంతో రూపాయి కుంగిపోతోంది.  ఈవారంలో రూపాయి 60ని కూడా తాకేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రూపాయి ఒక్క నెలలో దాదాపు ఐదురూపాయల దాకా పతనం అయ్యింది. రూపాయి పతనం వల్ల పెట్రోల్‌, డీజిల్‌, బంగారం, ఇతర దిగుమతి వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది.  ధరల పెరుగుదల తప్పదు. వడ్డీరేట్లు కూడా తగ్గవు. ఐటీ, ఫార్మా లాంటి ఒకటి రెండు రంగాలకు తప్పిస్తే మిగిలిన అన్ని రంగాలకు రూపాయి పతనం వల్ల నష్టం కలుగుతుంది. 

Tuesday, June 18, 2013

కొలువు తీరిన కొత్త మంత్రులు...




బాధ్యతలు స్వీకరించిన ఉపరితల రవాణా శాఖ  మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్, గృహనిర్మాణం-పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి  గిరిజా వ్యాస్, సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి మాణిక్ రావు గవిత్, వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నాచియప్పన్, కార్మిక ఉపాధి శాఖ  మంత్రి శీశ్ రాం ఓలా... 


భారీ వర్షాలు, వరదలకు కొట్టుకు పోయిన కేదార్నాథ్ ఆలయ ప్రహరీ  గోడ...

ఆరోపణలు రుజువు కాకుండా మంత్రులు కళంకితులు కారు...సి.ఎం.

హైదరాబాద్, జూన్ 18 : 26 వివాదాస్పద జీవోలకు సంబంధించి మిగిలిన మంత్రులు రాజీనామా చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ మంగళవారం శాసనసభలో పట్టుపట్టి, నిరసన వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా  స్పందించారు. మంత్రులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఎక్కడ రుజువు కాలేదన్నారు. ఛార్జీషీట్ వేసినందున ఇద్దరు మంత్రులు కాంగ్రెసు పార్టీ విధానాలకు అనుగుణంగా రాజీనామా చేశారని, అంతమాత్రాన వారు తప్పు చేసినట్లు కాదన్నారు. మిగిలిన మంత్రులపై సిబిఐ ఎలాంటి అభియోగాలు మోపలేదన్నారు. ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దీనిపై ఎక్కువ మాట్లాడటం సరికాదని ముఖ్యమంత్రి చెప్పారు. స్టే తెచ్చుకున్న వారు తమను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. టిడిపి హయాంలో తీసుకున్న నిర్ణయాలు కూడా పలు కోర్టులో ఉన్నాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెసు వారు మాత్రమే జైలుకెళ్లారా? టిడిపి నేతలు వెళ్లలేదా అని ప్రశ్నించారు. స్టాంప్ కుంభకోణంలో ఎన్నేళ్లు జైళ్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఆరోపణలు రుజువు కాకుండా మంత్రులను కళంకిత మంత్రులుగా పిలవడం విజ్ఞత కాదన్నారు...
 

Friday, June 14, 2013

మొయిలీని ఆయిల్ కంపెనీల లాబీలు బెదిరిస్తున్నాయట...

న్యూఢిల్లీ, జూన్ 14 : ఆయిల్ కంపెనీల లాబీల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే  ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగేది లేదని  తేల్చిచెప్పారు. రాబడులు బయటకు వెళ్లిపోవడం వల్ల    దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నా వారిని బెదిరిస్తున్నారని మొయిలీ చెప్పారు. దేశీయంగా చమురు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. ప్రజల ఆదాయం అంతా చమురు దిగుమతులకే వెళ్లిపోతుందన్నారు. ఇది దేశానికి మంచిదికాదని ఆయన పేర్కొన్నారు.

ఇండోనేషియా ఓపెన్ సెమీస్ లో సైనా

జకర్తా, జూన్ 14: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ మహిళల సింగిల్స్ చాంపియన్ టోర్నిలో భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ కు చెందిన కారోలినా మారిన్ పై 21-16,21-19 స్కోరుతో సైనా విజయం సాధించింది. కారోలినాతో మ్యాచ్ కేవలం 39 నిమిషాల్లో ముగిసింది. 

Thursday, June 13, 2013

వచ్చే ఎన్నికల బరిలో ఫెడరల్ ఫ్రంట్...!

న్యూఢిల్లీ,  జూన్ 13:  వచ్చే ఎన్నికల నాటికి 'ఫెడరల్ ఫ్రంట్' ఏర్పాటు దిశగా  జేడీయూ పావులు కదుపుతోంది.  బి.జె.పి.కి మోడీ సారధ్యం వల్ల ముస్లిం ఓట్లు పోతాయని భయపడుతున్న   జేడీయూ ఎన్డీయే తో తెగదెంపులు చేసుకుని కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ మధ్య చర్చలు జరిగాయి. మరిన్ని పార్టీలను కూటమిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే జేడీయూ నేత , బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తమ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగిని  మమతతో చర్చలకు  కోల్‌కతా పంపారు.  నితీశ్ సూచన మేరకు కోల్‌కతా వెళ్లిన త్యాగి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై మమతతో చర్చలు జరిపారు. అక్కడి నుంచే మమతా బెనర్జీ అటు నితీశ్‌తోనూ ఇటు ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా చర్చలు జరిపారు. వాస్తవానికి, బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ నితీశ్ కొంతకాలంగా డిమాం డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని మమత, ఒడిసాకు ప్రత్యేక హోదా కల్పించాలని నవీన్ పట్నాయక్ కూడా డిమాం డ్ చేస్తున్నారు. నవీన్ ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీకి నితీశ్ మద్దతు కూడా ఇచ్చారు. 'ప్రత్యేక హోదా' కోరుతున్న ముగ్గురు ముఖ్యమంత్రులు 'ఫెడరల్ ఫ్రంట్' పై ఏకమయ్యారు. కాగా ఫెడరల్ ఫ్రంట్‌కు రూపకల్పన జరిగితే తమ పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని బీజేడీ అధ్యక్షుడు, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. తాము లౌకిక వాదులమని, ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి వస్తే పరిశీలిస్తామని చెప్పారు.  మరోవైపు 2014 ఎన్నికల తర్వాత 'ఫ్రెండ్లీ ప్రభుత్వం' వస్తుందని తమిళనాడు సీఎం జయలలిత వ్యాఖ్యానించారు.

Wednesday, June 12, 2013

చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో టీమిండియా

లండన్, జూన్ 12: చాంపియన్స్ ట్రోఫీలో  టీమిండియా వరుసగా రెండు విజయాలతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ధోనిసేన ఫీల్డింగ్ ఎంచుకోగా... వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. జడేజాకు ఐదు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 39.1 ఓవర్లలో 2 వికెట్లకు 236 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (107 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్సర్)  సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మ (56 బంతుల్లో 52; 7 ఫోర్లు), కార్తీక్ (54 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అండగా నిలిచారు.

Tuesday, June 11, 2013

మృత్యువుతో పౌరాడి ఓడిన శుక్లా...

న్యూఢిల్లీ, జూన్ 11:  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా (84)కన్నుమూశారు. ఛత్తీస్ గఢ్ లో మే 25న మావోయిస్టుల దాడిలో గాయపడిన ఆయన వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మే 25న జరిగిన కాల్పుల్లో గాయపడిన శుక్లాను ముందు జగదల్‌పూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తరవాత మెరుగైన చికిత్స కోసం గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకు వచ్చారు. గత వారం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడినా, ఆ తర్వాత క్షీణించింది. శుక్లా మృతితో మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 29కి పెరిగింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన విద్యా చరణ్‌ శుక్లా, తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, చంద్రశేఖర్‌ కేబినెట్‌లో ఆయన కీలక శాఖలు నిర్వహించారు.

అలక వీడిన అద్వానీ...

న్యూఢిల్లీ, జూన్ 11: బిజెపిలో సంక్షోభం ముగిసింది. అద్వానీ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. అద్వానీతో పార్టీ సీనియర్ నేతల సమావేశం  అనంతరం అద్వానీ నివాసంలోనే రాజ్ నాథ్ విలేకరులతో మాట్లాడుతూ, ఆర్.ఎస్.ఎస్. అధినేత  మోహన్ భగవత్ సూచన మేరకే అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్వానీ చెప్పినట్లు తెలిపారు. పార్టీ పట్ల అద్వానీకి ఉన్న అభ్యంతరాలను వెంటనే పరిశీలిస్తామని చెప్పారు. త్వరలో బిజెపి పార్లమెంటరీ సమావేశం జరుగుతుందన్నారు. అద్వానీ చెప్పిన అంశాలను ఆ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. అయితే ఈ విలేకరుల సమావేశం తన నివాసంలో జరిగినప్పటికీ అద్వానీ హాజరుకాలేదు.

రూపాయి విలవిల...

ముంబయి,జూన్ 11 : రూపాయి పతనం కొనసాగుతోంది.  డాలర్‌ బలపడుతున్న కొద్దీ రూపాయి విలవిలలాడిపోతోంది. నిన్న జీవితకాల కనిష్టస్థాయిని తాకిన రూపాయి ఇవాళ మరో 20 పైసలు నష్టపోయింది. ఉదయం 58 రూపాయల 35 పైసలకు సమీపంలో ట్రేడయింది. గత ఏడాది జూన్‌లో రూపాయి 57 రూపాయల 32 పైసలను తాకి కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆ రికార్డును అధిగమించి తాజాగా  కొత్త కనిష్టస్థాయికి పడిపోయింది. డాలర్లకు భారీగా డిమాండ్‌ వస్తుండటంతో రూపాయిపై ఒత్తిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. 54 నుంచి శరవేగంగా 58కి పడిపోవడంతో దిగుమతి చేసుకునే కంపెనీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ రూపాయి క్షీణతపై మాట్లాడుతూ... తాము కరెన్సీ రేట్లలో జోక్యం చేసుకోబోమని, ఒక నిర్దిష్ట శ్రేణి లేదా స్థాయిలో రూపాయి విలువ ఉండాలనేమీ మేం లక్ష్యంగా పెట్టుకోలేదని తేల్చిచెప్పారు. అయితే, భారీగా హెచ్చుతగ్గులుంటే స్థిరీకరణ కోసం జోక్యంచేసుకుంటామని పేర్కొన్నారు.

Sunday, June 9, 2013

హమ్మ నల్లపిల్లా..

పారిస్,జూన్ 9: దశాబ్దకాల కాలం నిరీక్షణఫలించింది.  అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ 11 ఏళ్ళ తరువాత ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్ ను రెండవసారి గెలిచిహి సత్తా చాటుకుంది. గత ఏడాది తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన చోట మళ్లీ విజేతగా అవతరించింది. ఏడాదికాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న సెరెనా ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచి కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం  చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా 6-4, 6-4 తో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ మరియా షరపోవా (రష్యా)ను ఓడించింది. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో 31 ఏళ్ల సెరెనా 10 ఏస్‌లు సంధించడమే కాకుండా ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన 26 ఏళ్ల షరపోవా 2004 నుంచి సెరెనాపై విజయం సాధించలేదు. అదే ఆనవాయితీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ కొనసాగింది. విజేతగా నిలిచిన సెరెనాకు 15 లక్షల యూరోలు (రూ. 11 కోట్ల 31 లక్షలు); రన్నరప్ షరపోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 5 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

నెల్సన్ మండేలా పరిస్థితి విషమం

జోహన్నెస్‌బర్గ్, జూన్ 9: జాతివివక్ష వ్యతిరేకోద్యమ యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా
( 94)  ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రిటోరియా ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం నిలకడగానే ఉందని, వైద్యులు అవసరమైన చికిత్సలన్నీ చేస్తున్నారని దేశాధ్యక్షుడు జాకబ్ జుమా ప్రతినిధి  తెలిపారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ తిరగబెట్టడంతో మండేలాను ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు గత ఏడు నెలల్లో ఈ ఇన్‌ఫెక్షన్ రావడం ఇది మూడోసారి. గత ఏడాది డిసెంబర్‌లో ఇన్‌ఫెక్షన్‌కు 18 రోజులు చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో వైద్యులు ఆపరేషన్ చేసి పిత్తాశయంలోని రాళ్లను తొలగించారు. మండేలా కొన్ని దశాబ్దాల కిందట జైల్లో ఉన్నప్పుడు క్షయ సోకింది. అప్పటినుంచి ఆయన తరచూ ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. 

ఏడాది ముందే ఎమ్మెల్యే పదవులూడాయ్...

హైదరాబాద్,జూన్ 9; ఐదేళ్ల పదవీ కాలం నాలుగేళ్లకే ముగిసిపోయింది! కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఈ ఏడాది మార్చి 15వ తేదీన వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన ఎమ్మెల్యే పై వేటు పడింది. పార్టీల విప్‌ను ధిక్కరించి ఓటేసిన 15 మంది  ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ రద్దు చేశారు. వీరిలో తొమ్మిదిమంది కాంగ్రెస్ సభ్యులు కాగా.. ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. వేటు పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: రంగారావు(బొబ్బిలి), ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి(కాకినాడఅర్బన్), ఆళ్ల నాని(ఏలూరు), ఎం.రాజేశ్(చింతలపూడి), జోగి రమేశ్(పెడన), పేర్ని నాని(మచిలీపట్నం), శివప్రసాద రెడ్డి(దర్శి), జి.రవికుమార్(అద్దంకి), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు). కాగా టీడీపీ సభ్యులు: పి.సాయిరాజ్ (ఇచ్ఛాపురం), పి.వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), ఎ.ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), ఎన్.అమర్నాథ రెడ్డి (పలమనేరు) ల సభ్యత్వాలు రద్దయ్యాయి. 

ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండడంతో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. అనర్హత వేటు పడిన 15 అసెంబ్లీ స్థానాలతోపాటు కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతితో  కలిపి 16 స్థానాలకు ఇక ఖాళీ అయినట్టే. శాసనసభ్యులు లేరు. గతంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను ధిక్కరించినందుకు  19 మందిపై స్పీకర్ వేటు వేశారు. ఈసారి 15 మంది సభ్యత్వాలను రద్దు చేశారు. దీంతో, మొత్తం 34 మంది అనర్హులు అయినట్లయింది. ఒక శాసనసభ కాలంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది అనర్హతకు గురి కాలేదని స్పీకర్ మనోహర్ కూడా వివరించారు. కాగా,   టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు చిన్నం రామకోటయ్య, సముద్రాల వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్‌లను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణను పూర్తి చేసి స్పీకర్ తీర్పును వెలువరించాల్సి ఉంది.

సౌదీలో ఇదీ వరస...

దుబాయ్,జూన్ 9: సౌదీ అరేబియాలో దాదాపు రెండువందల మంది భారత కార్మికులు ఇద్దరు బంగ్లా రిక్రూట్‌మెంట్ ఏజెంట్ల చేతిలో మోసపోయారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలోని అధికారులకు, సామాజిక కార్యకర్తలకు తమ పరిస్థితిపై వారు ఫిర్యాదు చేయడంతో, బంగ్లా ఏజెంట్లు వారిపై దాడికి పాల్పడ్డారు. బంగ్లా ఏజెంట్లు ఐదుగురు కిరాయి మనుషుల చేత తమపై దాడి జరిపించారని బాధితులు ఆరోపించారు. పైగా, పనిలోకి రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు.  ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన దాదాపు రెండువందల మంది కార్మికులు ముంబైకి చెందిన లేబర్ ఏజెన్సీ ఫహాద్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల చొప్పున చెల్లించి సౌదీ వచ్చారు. వివిధ పారిశ్రామిక సంస్థల్లో వారిని చిల్లర పనుల్లో నియమించి, బలవంతంగా పనిచేయిస్తూ వచ్చారు. పనుల్లో చేరి రెండు నెలలైనా ఎలాంటి వేతనాలూ చెల్లించలేదు.
.

Saturday, June 8, 2013

అమెరికాలో ఆరుగురిని బలిగొన్న ఆగంతకుడు..

కాలిఫోర్నియా,జూన్ 8:  అమెరికా  కాలిఫోర్నియాలోని సాంటా మోనికాలో సాయుధుడైన ఆగంతకుడు ఆరుగురిని బలిగొన్నాడు.  నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి సాంటా మోనికా కళాశాలలోని లైబ్రరీలో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. కాల్పుల శబ్దాలు విన్న ఇతర విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు ఘటనా  స్థలానికి చేరుకుని దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని కాలిఫోర్నియా పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఆ ఆగంతకుడి వివరాలు ఇంకా తెలియ రాలేదు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...