Monday, October 31, 2011

మాజీ ప్రధాని ఇందిరా గాంధి 27 వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆమె సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న  సోనియా, రాహుల్ 

ప్రపంచ జనాభా సోమవారం ఉదయం 7.22 కి పుట్టిన ఈ బేబీ తో 700 కోట్లకు చేరింది. లక్నో లోని మాల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వినీత అనే మహిళకు పుట్టిన ఈ ఆడ బిడ్డకు నర్గీస్ అని పేరు పెట్టారు.

గడ్డు స్థితిలో కిరణ్ సర్కార్...

హైదరాబాద్,అక్టోబర్ 31: రాష్ట్రంలో  కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ సర్కారు గడ్డు పరిస్థితి లో పడింది.   17 మంది పీఆర్పీ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ అసెంబ్లీలో బలం 175కి చేరినా, మారిన పరిస్థితుల్లో ఇప్పుడది ఒకేసారి  143 కు పడిపోయింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో కనీస మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148.  కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యే (మహబూబ్‌నగర్) రాజేశ్వరరెడ్డి మరణంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 293కు తగ్గింది. ఈ లెక్కన మెజారిటీకి కనీసం 147 మంది సభ్యుల మద్దతు అవసరం. అలా చూసినా కాంగ్రెస్‌కు నలుగురు సభ్యులు తక్కువవుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 26 మంది జగన్ వర్గం ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణపై కాంగ్రెస్  వైఖరి ని నిరసిస్తూ  ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య ఇటీవల శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు.  ఇప్పుడు  మరో ముగ్గురు  ఎమ్మెల్యేలు రాజయ్య (స్టేషన్ ఘన్‌పూర్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సోమారపు సత్యనారాయణ (రామగుండం) కూడా  కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో  పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి పెరిగింది. రాజేశ్వరరెడ్డి మరణంతో కాంగ్రెస్ కోల్పోయిన ఎమ్మెల్యేల సంఖ్య 32కు చేరింది.  అయితే ఎమ్మెల్యేల రాజినామాలు పెండింగ్ లో వున్నందున సర్కారు  మైనారిటీలో పడినట్టు కాదని రాజకీయ నిపుణుల అంటుంటే ,ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వానికి బహిరంగంగా రాజీనామాలు ప్రకటించాక నైతికంగా వారంతా పార్టీకి దూరమైనట్టేనని , అధికార పార్టీకి వారి మద్దతు లేనట్టే అవుతుందని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. 
బలనిరూపణ అవసరం లేదు: గవర్నర్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం శానససభలో బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం  ఢిల్లీలో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అవసరమైన బలం ఉందని  చెప్పారు. శాసనసభ్యుల రాజీనామాలు పెండింగులో ఉన్నాయని, ప్రభుత్వం మైనారిటీలో పడలేదని ఆయన అన్నారు.
ఎప్పుడు.. ఏమి చేయాలో తెలుసు: బాబు  
అధికారంలో కొనసాగే నైతిక హక్కును ప్రభుత్వం కోల్పోయిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వానికి నైతికత ఉంటే రాజీనామా సమర్పించి.. ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఎప్పుడూ.. ఏమి చేయాలో తమకు తెలుసని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నైతికంగా కాక.. సాంకేతికంగా కొనసాగుతోందని బాబు వ్యాఖ్యానించారు. 



అరుణాచల్ సి.ఎం. రాజీనామా

ఇటానగర్,అక్టోబర్ 31:  అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జార్బోమ్ గామ్లిన్ తన పదవికి రాజీనామా చేశారు.  ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. పార్టీలో గొడవలే ఆయన రాజీనామాకు కారణమని సమాచారం. కొత్త  నాయకుడిని ఎన్నుకోవడానికి కాంగ్రెసు శాసనసభా పక్షం సమావేశమవుతోంది.  నాయకత్వ అంశంపై పాలక కాంగ్రెసు పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లిన నేపథ్యంలో రాజీనామా చేయడానికి గామ్లిన్ రేండు రోజుల క్రితమే సిద్ధపడ్డారు.  మే 5వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ మరణించడంతో గామ్లిన్ ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

Sunday, October 30, 2011

టీఆర్‌ఎస్ లో చేరిన ముగ్గురు టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్,అక్టోబర్ 30: : తెలంగాణాకు  చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, టి. రాజయ్య, సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.  వీరు ముగ్గురికి టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు సాదరంగా, గులాబీ కండువలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. తమ రాజీనామాలతో అధిష్టానానికి పరిస్థితి అర్ధమవుతుందని భావిస్తున్నామని  అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో జనం పోటెత్తారు. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ముగ్గురితో పాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన జోగురామన్న, గంప గోవర్ధన్‌లతో కలిపి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంఖ్య 17కు పెరిగింది. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో జనం పోటెత్తారు. ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Saturday, October 29, 2011

కరువు ప్రాంతాలుగా 456 మండలాలు

హైదరాబాద్,అక్టోబర్ 30: రాష్ట్రంలో 15 జిల్లాల్లోని 456 మండలాలను  ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.  ‘‘15 జిల్లాల్లోని 782 మండలాలకుగాను 456 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న కలెక్టర్ల నివేదికల ఆధారంగా వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ తొలి దశలో నిర్ణయించామని , పంటకోత  పూర్తయ్యాక రెండో దశలో మరిన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ఉందని మంత్రివర్గ సమావేశం అనంతరం  సమాచార మంత్రి డి.కె.అరుణ తెలిపారు.  అనంతపురం జిల్లాలలో లో మొత్తం మండలాలను, అనంతరం అత్యధికంగా నల్లగొండలో 52 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోఅవతరణ ఉత్సవాలు
తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో ఈ ఏడాది రాష్ట్ర అవతరణ ఉత్సవాలను  జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో జరిగే అవతరణ ఉత్సవాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేస్తారు.  జిల్లాలలో మాత్రం కలెక్టర్లు రాష్ట్ర అవతర ఉత్సవాలలో పాల్గొంటారు. 
అజాద్...అదేమాట
తెలంగాణ అంశాన్ని పరిష్కరించడానికి నిర్దిష్ట గడువేమీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్  మరోసారి తెలిపారు. అయినప్పటికీ, త్వరగానే పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు.   



ఇంటర్, టెంత్ పరీక్షల తేదీలు ఖరారు

హైదరాబాద్ ,అక్టోబర్ 29:  పదవ తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలను విద్యాశాఖ శనివారం ప్రకటించింది. మార్చి 2 నుంచి మార్చి 21వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు, మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వ తేదీవరకూ పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ... పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి.

టి 20 గెలిచిన ఇంగ్లండ్

కోల్ కతా,అక్టోబర్ 29:  ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఏకైక టి 20 క్రికెట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 18.4 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. పఠాన్, జడేజా, రైనా, కోహ్లీ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Friday, October 28, 2011

ఇక తెలుగు లోనూ ' డాట్రీ ' పరీక్ష...!

న్యూఢిల్లీ,అక్టోబర్ 28:  ఆంధ్రప్రదేశ్ సహా మరో మూడు రాష్ట్రాల్లో వైద్య విద్య జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ను ప్రాంతీయ భాషలోనే నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ గురువారం  ప్రకటించారు. ఇది విద్యార్థులకు లాభిస్తుందని, వారు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ‘జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై భారత వైద్య మండలి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించగా తమిళనాడు మాత్రమే అభ్యంతరాలు తెలిపిందని అన్నారు. పండుగల నేపథ్యంలో తెలంగాణలో ఉద్యోగులు సమ్మె విరమించడం హర్షనీయమని ఆజాద్ అన్నారు. ‘తెలంగాణ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని, గతంలో చెప్పినట్టుగానే సత్వర పరిష్కారానికి కట్టుబడామని చెప్పారు.


నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

విశాఖపట్నం,అక్టోబర్ 28:  ప్రముఖ సాహితీవేత్త, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు అనారోగ్యంతో విశాఖలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను  చాటారు.  ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. అవసరాల మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.

దర్శకుడు దాసరికి భార్యా వియోగం

హైదరాబాద్,అక్టోబర్ 28:  ప్రముఖ దర్శక, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు సతీమణి పద్మ శుక్రవారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన పద్మను కుటుంబ సభ్యులు మంగళవారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం  తెల్లవారుజామున మరణించారు. దాసరి దర్శకత్వం వహించిన పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా పద్మ మరణవార్తను తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.

Tuesday, October 25, 2011

' వార్తాప్రపంచం ' వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు... 

పాలసీ రేట్లు పావు శాతం పెంపు

ముంబై,అక్టోబర్ 26: రెండంకెల స్థాయిలో ఆందోళన క లిగిస్తున్న  ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ మరోసారి పాలసీ రేట్లను పావుశాతం చొప్పున పెంచింది.  రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్రవ్యోల్బణం అదుపులోపెట్టేందుకు వృద్ధిరేటును కొంత పణంగా పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని ఆర్‌బీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. దీంతో గృహ, వాహన ఇతరత్రా అన్నిరకాల రుణాలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో పాటు నెలవారీ వాయిదా (ఈఎంఐ)లు కూడా భారమయ్యే అవకాశం ఉంది. 2010 మార్చి నుంచి ఇప్పటిదాకా గడిచిన 20 నెలల్లో ఆర్‌బీఐ వడ్డీరేటును పెంచడం ఇది 13వ సారి కావడం గమనార్హం. మరోపక్క, సేవింగ్స్ బ్యాంక్(ఎస్‌బీ) ఖాతాలపై డిపాజిట్‌రేట్లపై నియంత్రణను ఎత్తివేస్తూ ఆర్‌బీఐ అతి కీలకమైన పాలసీ నిర్ణయాన్ని కూడా ప్రకటించింది.ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇకనుంచి ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లను స్వేచ్ఛగా నిర్ణయించుకునే వెసులుబాటు లభిస్తుంది. దీనివల్ల ఖాతాదార్లకు తమ సొమ్ముపై మరింత రాబడిరావడంతో పాటు డిపాజిటర్లను ఆకర్షించేలా బ్యాంకుల మధ్య పోటీ కూడా పెరగనుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు ఇప్పుడున్న 8.25 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. రివర్స్‌రెపో రేటు ప్రస్తుతం 7.25 శాతం ఉండగా... ఇది 7.5 శాతానికి చేరింది. అయితే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.  

ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

కోల్‌కతా,అక్టోబర్ 25:  ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారమిక్కడ జరిగిన చివరివన్డేలోనూ  ఇంగ్లండ్‌ జట్టును 95 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. 5-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 37 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటయింది. క్వీస్‌వెటర్(63), కుక్(60) శుభారంభాన్ని అందినప్పటికీ మిడిలార్డర్ విఫలం కావడంతో ఇంగ్లండ్ ఓటమిపాలయింది. భారత బౌలర్లలో జడేజా 4, ఆశ్విన్ 3 వికెట్లు తీశారు. ఆరాన్, రైనా, తివారి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ధోనీ ఎంపికయ్యాడు.

డీఎస్‌ కు అందలం...!

హైదరాబాద్, అక్టోబర్ 25:    శాసనమండలి స్థానానికి కాంగ్రస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఎంపిక రాష్ట్ర పార్టీలో రాజకీయంగా ఉత్కంఠ రేపింది. తెలంగాణకు చెందిన డీఎస్‌కు మున్ముందు ప్రభుత్వంలో కీలక పదవి  అప్పగించే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని  చర్చ జరుగుతోంది.   లోతైన కసరత్తు అనంతరం అధ్యక్షురాలు సోనియానే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మూడురోజులు ఢిల్లీలో మకాం వేసిన కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సలకు కనీస సమాచారమైనా ఇవ్వకుండానే డీఎస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. వారిద్దరూ హైదరాబాద్ తిరిగొచ్చాక, అదీ అర్ధరాత్రి సమయంలో డీఎస్ ఎంపికపై అధిష్టానం నుంచి సమాచారం రావడం  వారిద్దరికీ మింగుడు పడని విషయం. సోమవారం డీఎస్ నామినేషన్‌కు వీరిద్దరితో పాటు ఏకంగా 13 మంది మంత్రులు, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఆర్పీ నేతలు తరలిరావడం కూడా చిన్న విషయం ఏమీ కాదేమో.  ముఖ్యంగా డీఎస్ అభ్యర్థిత్వాన్ని తొలినుంచీ వ్యతిరేకిస్తున్న కిరణ్‌కు ఈ నిర్ణయంతో అధిష్టానం పెద్ద షాకే ఇచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి.  డీఎస్ నామినేషన్ పూర్తయ్యేదాకా ముఖ్యమంత్రి  ముభావంగానే కన్పించడం కొసమెరుపు.

అమర్‌సింగ్‌కు షరతులతో బెయిల్

న్యూఢిల్లీ,అక్టోబర్ 25:   ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్టు అయిన రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు  ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నామని  జస్టిస్ సురేష్ కైట్ తన  పేర్కొన్నారు. అయితే ఇందుకోసం రూ.50 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా దిగువ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయకూడదని స్పష్టంచేశారు. విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కోర్టులో హాజరుకావాలని సూచించారు. వీటిలో ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా, దర్యాప్తు అధికారులు అమర్‌సింగ్ బెయిల్ రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో సెప్టెంబర్ 6న అమర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. తర్వాత అనారోగ్యానికి గురికావడంతో 12న ఎయిమ్స్‌లో చేర్చారు. 15న దిగువ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. అనంతరం అమర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున మళ్లీ అరెస్టు చేయాలని గతనెల 28న ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
 కనిమొళి దీపావళి జైల్లోనే ...!
డీఎంకే ఎంపీ కనిమొళి జైల్లోనే దీపావళి జరుపుకోనున్నారు. 2జీ కేసులో ఆమెతోపాటు మరో నలుగురు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది. రెండ్రోజుల కిందటే ఈ కేసులో అభియోగాలు నమోదైన నేపథ్యంలో కనిమొళితోపాటు కలైంగర్ టీవీ చానల్ ఎండీ శరద్ కుమార్, కుసేగాన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డెరైక్టర్లు ఆసిఫ్ బల్వా, రాజీవ్ అగర్వాల్, బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీలు సోమవారం సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జడ్జి ఒ.పి.సైనీ విచారణ జరిపారు. న్యాయస్థానం తన విచక్షణ మేరకు వీరికి బెయిల్ మంజూరు చేస్తే తమకు అభ్యంతరమేమీ లేదని సీబీఐ ప్రత్యేక న్యాయవాది యు.యు.లలిత్ కోర్టుకు తెలిపారు.  2జీ కేసులో మే 20న అరెస్టయిన కనిమొళి అప్పట్నుంచీ కారాగారంలోనే ఉన్న సంగతి తెలిసిందే.

15 లక్షల వరకు గృహరుణాలపై ఒక శాతం వడ్డీ సబ్సిడీ

న్యూఢిల్లీ,అక్టోబర్ 25:   మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం   మరింత రాయితీ కల్పించనుంది.  ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు తీసుకున్న గృహరుణాలపై మాత్రమే ఒక శాతం వడ్డీ సబ్సిడీ కల్పిస్తున్న ప్రభుత్వం, ఇకపై రూ. 15 లక్షల వరకు తీసుకునే గృహరుణాలకు కూడా వడ్డీ సబ్సిడీని వర్తింపజేయనుంది.  అలాగే వడ్డీ రాయితీ పొందేందుకు అర్హమైన గృహనిర్మాణ వ్యయాన్ని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి. 

Monday, October 24, 2011

42 రోజుల సమ్మెను విరమించిన టి. ఉద్యోగులు

హైదరాబాద్,అక్టోబర్ 24:  తెలంగాణ ఉద్యోగ సంఘాలు  42 రోజుల సమ్మెను విరమించాయి. సోమవారం రోజంతా ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగ సంఘాలతో  జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమించడానికి వారు అంగీకరించారు.  మొత్తం 9 అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి జెఎసి నేతలకు మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం నుంచి విధులలో చేరేందుకు నేతలు అంగీకరించారు. ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య కుదిరిన  ఒప్పందం వివరాలు... 1. 610 జీవో అమలు పర్యవేక్షణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తితో న్యాయ కమిటీ ఏర్పాటు 2. సమ్మె కాలంలో ఎస్మా ప్రయోగం నిలిపివేత 3. ఉద్యోగులపై కేసులు ఎత్తివేత 4.177 జీవో అమలు సమ్మె కాలంలో నిలిపివేత 5. సమ్మె కాలంలో బదిలీలు, డిపుటేషన్లు రద్దు 6. నో వర్క్, నో పే అమల్లో ఉన్నా స్పెషల్ కేసుగా పరిగణిస్తూ మినహాయింపు 7. సమ్మెకాలంలో కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఆంక్షలు మినహాయింపు 8. సమ్మెకాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ హాఫ్ పే లీవు 9. మంగళవారం నుంచి విధుల్లో చేరేందుకు అంగీకారం. 

Sunday, October 23, 2011

టర్కీలో భారీ భూకంపం: 300 మందికి పైగా మృతి

అంకారా,అక్టోబర్ 23:  ఈశాన్య టర్కీలో సంభవించిన భారీ భూకంపం లో  300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వందలాదిమంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. భూకంప తీవ్రతకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.  టర్కీలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో ఇదే అతి పెద్దది. భూకంపం తర్వాతి ప్రకంపనలు ఇరాన్ సరిహద్దున ఉన్న వాన్‌ సిటీని తాకాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా కుర్దులుంటారు. కూలిపోయిన భవనాలను, వాహనాలను, ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది.

నాలుగో వన్డేలోనూ ధోనీసేన గెలుపు

ముంబై,అక్టోబర్ 23:  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సిరీస్‌లో 4-0 ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 40.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. కొహ్లి(86), రైనా(80) అర్థ సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ధోనీ 15, రహానే 20 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటయింది. రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.  

Friday, October 21, 2011

అమితాబ్ కు ఆస్ట్రేలియా డాక్టరేట్‌

బ్రిస్‌బేన్ , అక్టోబర్ 21: బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ( గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ప్రపంచ సినిమా రంగానికి అమితాబ్ చేసిన విశేష సేవలకుగానూ ఆయనకీ డాక్టరేట్‌ను ఇచ్చారు.  గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్‌ను స్వీకరించిన అనంతరం అమితాబ్ మాట్లాడుతూ.. ఈ గౌరవం పొందినందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తన తొలి హాలీవుడ్ చిత్రంషూటింగ్ కోసం సిడ్నీలో ఉన్న అమితాబ్ డాక్టరేట్ స్వీకరించేందుకు గురువారం ఉదయం బ్రిస్‌బేన్‌కు వచ్చారు.  రెండేళ్ల క్రితమే క్వీన్స్లాండ్ యూనివర్సిటీ  అమితాబ్ కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. అయితే, అప్పట్లో ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరిగిన జాతి వివక్ష దాడులకు నిరసనగా ఆయనీ డాక్టరేట్‌ను స్వీకరించలేదు.

హమ్మయ్య...సిరీస్ గెలిచేశాం...

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రహానే
మొహాలీ, అక్టోబర్ 21: ఇక్కడి  పీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మూడో వన్డేలో ధోనిసేన ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. 299 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రహానే (104 బంతుల్లో 91; 6 ఫోర్లు) ఓపికగా బ్యాటింగ్ చేసినా కొద్దిలో సంచరీ మిస్సయ్యాడు.   మరో ఓపెనర్ పార్థీవ్ (46 బంతుల్లో 38; 3 ఫోర్లు) రాణించాడు. రెండో వన్డేలో చెలరేగి ఆడిన గంభీర్ (60 బంతుల్లో 58; 3 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీ సాధించగా... కోహ్లి (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) చేశాడు.  ఆఖరి దశలో ధోని (31 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు) , జడేజా (24 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని ఖరారు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్, బ్రెస్నన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ కీస్వెట్టర్ (38 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మంచి ఆరంభాన్నిచ్చాడు. ట్రాట్ (116 బంతుల్లో 98 నాటౌట్; 8 ఫోర్లు) చివరి వరకూ నిలకడగా ఆడినా కొద్దిలో సెంచరీని మిస్ అయ్యాడు. పీటర్సన్ (61 బంతుల్లో 64; 9 ఫోర్లు) సొగసైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ చేశాడు. చివరి ఓవర్లలో సమిత్ పటేల్ (43 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపువేగంతో పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరు లభించింది. భారత బౌలర్లలో ప్రవీణ్, వినయ్, కోహ్లి, జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు. రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్ 3-0తో కైవసం చేసుకుంది. నాలుగో వన్డే ఆదివారం ముంబైలో జరుగుతుంది.  

రాజకీయ సుడిగుండంలో పోలవరం టెండర్ ...!

హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పోలవరం చుట్టు తిరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమ్మక్కై అర్హత లేని కంపెనీకి పోలవరం టెండర్ దక్కేలా చేశారని  టి.డి.పి. విరుచుకుపడుతోంది. టెండర్ ప్రైస్ బిడ్ ఓపెన్ చేయడానికి ముందు టీడీపీకి చెందిన సీనియర్ నేత సీఎం రమేష్ తనకే పనులు దక్కుతాయని గంపెడాశ పెట్టుకున్నారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు కాంగ్రెస్‌తో తమకేమీ సంబంధం లేదని అంటూనే పోలవరం టెండర్ తనకే దక్కుతుందని మీడియా ముందే ధీమా వ్యక్తం చేశారు. రహస్యంగా సాగే ఈ టెండర్ ప్రక్రియలో ఎవరెంత కోట్ చేశారన్నది బయటకు తెలిసే అవకాశం లేదు. అయితే తనకే టెండర్ దక్కుతుందని రమేష్ ఏ ధీమాతో చెప్పారో అంతుబట్టని వ్యవహారం. తానే ఎల్-1 గా వస్తానని రమేష్ చెప్పడంతో టీడీపీకి ప్రభుత్వంలో ముఖ్యులకు మధ్య ఏదైనా రహస్య ఒప్పందం జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తీరా బిడ్ ఓపెన్ చేస్తే అనూహ్యంగా ఎస్‌ఈడబ్ల్యూ (సూ) ఎల్-1 గా నిలిచింది. సహజంగానే ఈ పరిణామం టీడీపీకి మింగుడుపడలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వంతో పాటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. మొత్తమ్మీద రెండ్రోజులుగా సాగుతున్న పరిణామాలు గమనిస్తే పోలవరం ప్రాజెక్టు టెండర్‌కు రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో కాంగ్రెస్-టీడీపీ మధ్యే ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తే ఇప్పుడు ఆ వ్యవహారంలో టీఆర్‌ఎస్ చేరిందని తెలుగుదేశం ఆరోపణలు బట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం టెండర్ దక్కించుకున్న సూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన ఎల్.రాజం ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’ పత్రికను సొంతం చేసుకున్నారు. దసరా మరుసటి రోజు ఆయన ఆ పత్రిక చైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పుడు ఇది టీఆర్‌ఎస్‌కూ చుట్టుకుంది. సీఎం కిరణ్, కేసీఆర్ కుమ్మక్కై అర్హత లేని కంపెనీకి టెండర్ ఖరారు చేయించారన్నది టీడీపీ వాదన. మరి అంతకుముందు ఆ పార్టీకి చెందిన సీఎం రమేష్ తనకే టెండర్ వస్తుందని ఏ ధీమాతో చెప్పారని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్-టీడీపీ-టీఆర్‌ఎస్ చుట్టూ కేంద్రీకృతమైంది. విచిత్రమేమిటంటే.. వృథాగా పోతున్న వరదనీటిని తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగించేందుకు చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీఆర్‌ఎస్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. దీనివల్ల ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలు ముంపునకు గురవుతాయనే ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణకు నీటి కేటాయింపులో అన్యాయంపై తన గళం వినిపించే సీనియర్ ఇంజనీర్ ఆర్.విద్యాసాగర్‌రావు కూడా ఆది నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్థాపించిన ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ కంపెనీకి టెండర్ దక్కడం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అధికారవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

అంతమైన లిబియా నియంత

ట్రిపోలీ,అక్టోబర్ 21: :  42 ఏళ్ల పాటు లిబియాను తుపాకీ గొట్టం సాయంతో శాసించిన మహమ్మద్ గడాఫీ, చివరికి అదే తుపాకీకి బలైపోయాడు. ఉవ్వెత్తున ఎగసిన ప్రజా తిరుగుబాటు దెబ్బకు ఆగస్టులో పలాయనం చిత్తగించిన ఈ మాజీ సైనిక పాలకుడు, గురువారం తన సొంత పట్టణం సిర్త్ లోనే తిరుగుబాటుదారుల చేతిలో దారుణంగా కాల్చివేతకు గురయ్యాడు. ఓ కల్వర్టులో దాగిన 69 ఏళ్ల గడాఫీని తిరుగుబాటు దళాలు చుట్టుముట్టాయి. ‘కాల్చొద్దు, కాల్చొద్దు’ అని వేడుకున్నా వరుసబెట్టి బులెట్ల వర్షం కురిపించాయి.పారిపోయేందుకు ప్రయత్నించడంతో తొలుత రెండు కాళ్లపై కాల్చారు.  తీవ్రంగా గాయపరిచి సజీవంగా పట్టుకున్నాయి. అనంతరం కారులో తరలిస్తుండగా  గడాఫీ తుదిశ్వాస వదిలినట్టు సమాచారం. గడాఫీ మరణ వార్తను తొలుత అరబ్ టీవీ చానల్ అల్ జజీరా బయట పెట్టింది. అనంతరం లిబియా ప్రధాని మహమ్మద్ జిబ్రిల్ హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ధ్రువీకరించారు. ఈ క్షణం కోసమే తామంతా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నామన్నారు. గడాఫీ మృతి వార్త తెలియగానే లిబియాలో సంబరాలు మిన్నంటాయి. దేశవాసులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పరస్పరం కౌగిలింతలు, జాతీయ గీతాలాపనలతో పండుగ చేసుకున్నారు. ‘అల్లా హో అక్బర్’ నినాదాలు, విజయసూచకంగా తిరుగుబాటుదారుల గాల్లోకి కాల్పులతో రాజధాని ట్రిపోలీ హోరెత్తిపోయింది. కార్ల హారన్లను తారస్థాయిలో మోగిస్తూ వారు నగరమంతటా కలియదిరిగారు. గడాఫీ కుమారుడు ముతస్సిమ్, అతని రక్షణ మంత్రి అబూ బకర్ యూనిస్ జబర్ కూడా తిరుగుబాటు దళాల చేతిలో మరణించారు. గడాఫీ మృతిని నియంతృత్వానికి శాశ్వతంగా తెర దించిన చరిత్రాత్మక క్షణంగా జాతీయ అధికార మార్పిడి మండలి (ఎన్టీసీ) అధికార ప్రతినిధి అబ్దుల్ హఫీజ్ గోజా అభివర్ణించారు. లిబియావాసుల విజయంగా దేశ సమాచార మంత్రి మహమ్మద్ షమామ్ పేర్కొన్నారు.
తొలుత సైన్యంలో కెప్టెన్‌గా పని చేసిన గడాఫీ, 1969లో రక్తపాతరహిత కుట్రతో రాజు ఇద్రిస్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పటికి అతని వయసు కేవలం 27 ఏళ్ళు.  విరోధులు, ప్రత్యర్థులు మొదలుకుని అసమ్మతి గళం విన్పించిన వారి దాకా... లెక్కలేనంత మందిని హతమారుస్తూ గడాఫీ 42 ఏళ్ల సుదీర్ఘ పాలనంతా రక్తసిక్తంగానే సాగింది. మానవత్వంపై కిరాతక నేరాలకు పాల్పడ్డాడంటూ అతన్ని విచారించేందుకు అంతర్జాతీయ న్యాయస్థానం చిరకాలంగా ప్రయత్నిస్తోంది. గడాఫీ నియంతృత్వంపై లిబియాలో పెల్లుబికిన ప్రజాగ్రహం గత ఫిబ్రవరిలో అంతర్యుద్ధానికి దారితీసింది. దాన్ని కొంతకాలం పాటు ఎదుర్కొన్న గడాఫీ, ఆగస్టు మధ్యలో ట్రిపోలీ వదిలి పారిపోయాడు. సిర్త్, మరో ఒకట్రెండు పట్టణాలు మినహా దేశమంతా తిరుగుబాటు దళాల అధీనంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ నాటో దళాల సాయంతో తిరుగుబాటు సైన్యాలు అతని కోసం తీవ్రంగా వేటాడుతున్నాయి. గురువారం గడాఫీని హతమార్చిన గంటలోపే సిర్త్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్టీసీ ప్రకటించింది.

Thursday, October 20, 2011

తెలంగాణపై తక్షణ నిర్ణయం కష్టం: ప్రధాని

న్యూఢిల్లీ, అక్టోబర్ 20:   తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోలేమని ప్రధాని మన్మోహన్‌సింగ్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్య నిర్ణయానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ అంశం పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడంలేదన్న విమర్శను ప్రధాని తోసిపుచ్చారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకొని ప్రధాని మన్మోహన్‌సింగ్ బుధవారం రాత్రి స్వదేశం చేరుకున్నారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో విలేకరులతో పలు అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కొత్తదేమీ కాదని, దానికి సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పారు. 1950ల నుంచి ఈ ఉద్యమం ఉందని అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం కష్టమని, ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. విస్తృత స్థాయిలో చర్చల ద్వారానే దీనికో పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని తెలిపారు. అందువల్ల తెలంగాణతో ముడిపడి ఉన్న అందరితో కేంద్రం విస్తృత స్థాయి సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ చర్చల ద్వారాఅందరికీ ఆమోదయోగ్య పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ తనపై పదేపదే విమర్శలు చేయడంపై  ప్రధాని స్పందించారు. విదేశీగడ్డపై ఓ జాతీయ నేతను విమర్శించనంటూనే అద్వానీ పరుష పదజాలం వాడరాదని అద్వానీకి సూచించారు. ఆయన చేపట్టిన జనచేతన యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

మొక్కులు తీర్చుకున్న రజని

హైదరాబాద్, అక్టోబర్ 20:  వైద్యుల సలహా మేరకు విశ్రాంతిలో ఉన్న తాను మరో రెండు, మూడు నెలల తర్వాత సినిమాల్లో నటిస్తానని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు సూపర్‌స్టార్ రజనీకాంత్ తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురై విదేశాల్లో చికిత్స పొందిన రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడింది.  బుధవారం రాత్రి  ఆయన సకుటుంబ సపరివార సమేతంగా  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.  భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం వల్ల ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. రా.వన్ సినిమాలో తాను అతిథి పాత్ర పోషిస్తున్నాననీ, అది యాక్షన్, కాస్ట్యూమ్ చిత్రమని చెప్పారు. 

తెలంగాణకు శాసనసభ తీర్మానం అవసరం లేదు; అద్వానీ

జనచేతన యాత్రలో భాగంగా తెలంగాణా పర్యటనలో తన రధం నుంచి ప్రజలకు అభివాదం చెస్తున్న అద్వానీ...


హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణకు రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుని పార్లమెంటులో బిల్లు పెడితే చాలునని మాజీ ఉపప్రధాని, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు లాల్‌క్రిష్ణ అద్వానీ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నాటకాలాడుతోందని విమర్శించారు. జనచేతన యాత్రలో భాగంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 38 నిమిషాలపాటు జరిగిన అద్వానీ ప్రసంగంలో దేశంలోని అవినీతి, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటులో సాధారణ మెజారిటీ తో రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చునని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లుపెడితే చాలునని, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనుకుని బిల్లుపెడితే భారతీయ జనతా పార్టీ మద్దతునిస్తుందని  అద్వానీ అన్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటుచేసినప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లోని ఇద్దరు సీఎంలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇంతకు ముందు తాను ఐదుసార్లు యాత్రలు చేశానని, ఈ జనచేతన యాత్రకు హాజరైన జనసందోహం, లభించిన మద్దతు ఎప్పుడూ చూడలేదని అద్వానీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కుంభకోణాల్లో కూరుకుపోయినా ప్రధానమంత్రి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తేవడమే లక్ష్యంగా పోరాడతామని స్పష్టంచేశారు. 

బెంగళూరులో మెట్రోరైలు పరుగులు

బెంగళూరు ,అక్టోబర్ 20:  దక్షిణాదిలో తొలిసారిగా బెంగళూరులో మెట్రోరైలు గురువారం నాడు  పట్టాలు ఎక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ సమక్షంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమలనాథ్, రైల్వే సహాయ మంత్రి దినేశ్ త్రివేదీ పచ్చ జెండా ఊపి  మెట్రోరైలును ప్రారంభించారు. తొలి దశలో మహాత్మా గాంధీ రోడ్డు నుంచి బయ్యప్పనహళ్లి వరకు ఏడు కిలోమీటర్ల దూరం మెట్రోరైలు ప్రయాణిస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రోజూ 91 ట్రిప్పులు మెట్రోరైళ్లు తిరుగుతాయి. ట్రిప్పుకు వెయ్యి మంది ప్రయాణించే వీలుంది.వై-ఫై సదుపాయం ఉన్నందున ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, మొబైల్ ఇంటర్‌నెట్‌లను వినియోగించుకోవచ్చు.

Wednesday, October 19, 2011

బాబుకు బాన్సువాడ దెబ్బ...

హైదరాబాద్ ,అక్టోబర్ 19:  బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మొహం చాటేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వారి ఉప ఎన్నికల ఫలితాల అంచనా తారుమారు కావడమే బాబును కలవక పోవడానికి కారణమని సమాచారం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బాన్సువాడలో తెదేపా తరఫున అభ్యర్థిని నిలపవద్దని చంద్రబాబును టిటిడిపి నేతలు పోటీకి ముందు విజ్ఞప్తి చేశారు. పోటీ చేయాలనే ఆలోచన బాబుకు ఉన్నప్పటికీ వారి సలహా మేరకు ఆయన అంతిమ నిర్ణయం బాధ్యత  వారికే అప్పగించారు.   2010 ఉప ఎన్నికల మాదిరి డిపాజిట్ కూడా దక్కక పోవచ్చుననే భావనతో టిటిడిపి ఫోరం నేతలు పార్టీ తరఫున అభ్యర్థిని దింపక పోవడమే మంచిదని భావించారు.  అదే సమయంలో కాంగ్రెసు మాత్రం పార్టీ క్యాడర్ కాపాడుకోవడానికి రంగంలోకి దిగింది. కాంగ్రెసు అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని అందరూ భావించారు. కానీ అనూహ్యం అతను 33వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దీంతో టిటిడిపి ఖంగు తిన్నది. పోటీలో ఉంటే డిపాజిట్ కూడా దక్కదనుకుంటే కాంగ్రెసుకు భారీ ఓట్లు రావడం వారిని పునరాలోచనలో పడేసింది. బాబు నిర్ణయం ప్రకారం పోటీకి దిగితే కనీసం క్యాడర్‌ను కాపాడుకునే వారమనే భావన వారిలో కలిగినట్లుగా కనిపిస్తోంది. ఉద్యమ ఉధృతంగా ఉన్న సమయంలో లక్ష మెజార్టీతో గెలుస్తాడని భావించిన తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం యాభై వేల మెజార్టీతో గెలుపొందటంతో బాబుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు మొహం చాటేస్తున్నట్లు కనిపిస్తోంది.

జానారెడ్డికి పొడుచుకొచ్చింది...

 హైదరాబాద్ ,అక్టోబర్ 19:   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు.   కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సమావేశంలో సహచరులంతా జనారెడ్డిని లక్ష్యం చేసుకుని విమర్శలు  చేశారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా కలత చెందిన జానా రెడ్డి రాజీనామాకు సిద్ధపడడమే కాకుండా సహచర తెలంగాణ మంత్రులతో చర్చలు జరిపేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జానా రెడ్డిని చర్చలకు ఆహ్వానించారు. దీంతో జానారెడ్డి బుధవారం ఉదయం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రాజీనామాలు చేసే విషయంలో తొందర పడవద్దని, ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి రాజీనామాలుచేస్తే ఇబ్బందుల ఎదురవుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జానా రెడ్డితో చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి జానారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా జానారెడ్డితో మాట్లాడారు. రాజీనామాలు చేసే విషయంలో తొందరపడవద్దని ఆయన జానారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.
తనపై వచ్చిన విమర్శలకు  జానారెడ్డి కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశనాంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.  తెలంగాణ సాధనే తన లక్ష్యమని ఆయన అన్నారు. తన రాజీనామా వల్ల మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని చెప్తే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మెను విరమించాలని తాను చేసిన విజ్ఞప్తిని కొంత మంది, శ్రేణులు, ప్రజా సంఘాలు అనుమానించాయని, తాను తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. సమ్మెకు విరామం ఇవ్వాలని మాత్రమే తాను భావించి ఆ ప్రకటన చేశానని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన అన్నారు.

అన్నా హజారే టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్‌ పై దాడి

న్యూఢిల్లీ,అక్టోబర్ 19:  అన్నా హజారే టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్‌ పై లక్నోలో మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. లక్నోలోని ఝలేలాల్ పార్క్ లో ఏర్పాటైన బహిరంగ సభలో ఈ దాడి జరిగింది. ఆయన పైకి బూటు విసిరి ఓ వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నించాడు. దాడి చేసిన వ్యక్తిని జులాన్‌కు చెందిన జితేంద్ర పాఠక్‌గా గుర్తించారు. ఆ వ్యక్తిని స్వచ్ఛంద సేవకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేజ్రీవాల్‌తో తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, అవినీతిపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆ వ్యక్తి అన్నాడు. తాను ఏ రాజకీయ పార్టీకీ చెందినవాడిని కానని అతను చెప్పాడు. కాగా అన్నా టీమ్  మరో సభ్యుడు ప్రశాంత్ భూషణ్‌పై జరిగిన దాడిని మరిచిపోక ముందే కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. కేజ్రీవాల్‌పై దాడిని ప్రస్తావిస్తూ తాము బెదిరిపోవడం లేదని, అవినీతిని అంతం చేయడానికి తాము బుల్లెట్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నా హజారే అన్నారు.

ఇఫీ-2011 కు ‘విరోధి’

న్యూఢిల్లీ,అక్టోబర్ 19:   ఈ ఏడాది గోవాలో నిర్వహించనున్న 42వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ-2011) లోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పనోరమ’ విభాగంలో ప్రదర్శనకు తెలుగు చిత్రం ‘విరోధి’ ఎంపికైంది. ఈ విభాగంలో మొత్తం 24 చిత్రాలను ప్రదర్శించనుండగా అందులో తెలుగు భాష నుంచి ఇదొక్కటే ఉండటం విశేషం. శ్రీకాంత్ పాత్రికేయుడిగా నటించిన ఈ చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకురాలు సాయి పరాంజపే సారథ్యంలోని న్యాయనిర్ణేతల బృందం మొత్తం 118 ఎంట్రీలను పరిశీలించి వాటిలోంచి భిన్న భాషలకు చెందిన 23 చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేసింది. 

కూలనున్న రోశాట్...

వాషింగ్టన్,అక్టోబర్ 19:  కాలంచెల్లిన జర్మన్ ఉపగ్రహం రోయింట్‌జెన్ శాటిలైట్ (రోశాట్) ఈ శని లేదా ఆదివారాల్లో భూమిపై కూలిపోయే అవకాశముందని జర్మనీ అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత నెలలో పసిఫిక్ సముద్రం ప్రాంతంలో నేలరాలిన అమెరికా ఉపగ్రహం ఆర్స్ మాదిరిగానే ఇది కూడా ఎక్కడ కూలిపోనుందన్న వివరాలు ముందస్తుగా తెలియడంలేదని వారు తెలిపారు. ఈ ఉపగ్రహ శకలాలు భూమిని తాకడానికి రెండు గంటల ముందు మాత్రమే  ఆ విషయం తెలుస్తుందన్నారు. వాస్తవానికి ఈ నెల 21, 25 తేదీల మధ్య భూవాతావరణంలోకి రోశాట్ ప్రవేశించవచ్చని ఇంతకుముందు అంచనావేశారు. రోశాట్ మొత్తం బరువు 2.4 టన్నుల బరువు కాగా, అది భూవాతావరణంలోకి ప్రవేశించి ముక్కలయ్యాక దాదాపు 1.7 టన్నుల గాజు, పింగాణీ శకలాలు భూమిని తాకవచ్చని భావిస్తున్నారు. రోశాట్‌కు చెందిన 30 పెద్ద సైజు శకలాలు ఉత్తర అమెరికాలోని కెనడా నుంచి దక్షిణ అమెరికా ప్రాంతం మధ్యలో పడే అవకాశముందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే సౌర గాలులు, వాతావరణ పరిస్థితులను బట్టి కూడా రోశాట్ కూలిపోయే సమయం ఆధారపడి ఉంటుందన్నారు. కాగా 1990లో ప్రయోగించిన రోశాట్‌లో సూర్యుడికి అభిముఖంగా ఉన్న కెమెరా పాడైపోవడంతో ఉపగ్రహం పనిచేయడం మానేసింది. దీంతో 1999లో జర్మనీ ఈ ఉపగ్ర హాన్ని స్తంభింపచేసింది. 

Tuesday, October 18, 2011

పార్టీ మారి సీటు నిలబెట్టుకున్న పోచారం...

హైదరాబాద్,అక్టోబర్ 18:    బాన్సువాడ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సంగెం శ్రీనివాసగౌడ్‌పై 49,889 ఓట్ల ఆధిక్యం సాధించారు. తెలంగాణ ఎజెండాగా సాగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ లభిస్తుందని, ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుందని భావించినా.. శ్రీనివాసగౌడ్ అంచనాలకు మించి ఓట్లు పొందగలిగారు. ఈ నెల 13న పోలింగ్ జరగ్గా సోమవారం కౌంటింగ్ జరిగింది. నియోజకవర్గంలో లక్షా 59 వేల పైచిలుకు ఓట్లుండగా, లక్షా 22 వేల 871 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పోచారం శ్రీనివాసరెడ్డికి 83,245 ఓట్లు రాగా, శ్రీనివాసగౌడ్ 33,356 ఓట్లు పొందారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు 6,270 ఓట్లు పొందారు. 2009 ఎన్నికల్లో తెలగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా పార్టీ వీడారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది. 

సింగరేణి సమ్మె కూడా ముగిసింది...

హైదరాబాద్,అక్టోబర్ 18:   సింగరేణి కార్మికులతో యాజమాన్యం చర్చలు ఫలించాయి.  తెలంగాణ సాధన కోసం గత 35 రోజులకు పైగా సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న సింగరేణి కార్మికులతో సోమవారం సాయంత్రం ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగాయి. కార్మికులు, ఉద్యోగులకు అడ్వాన్సుగా రూ.25 వేలు చెల్లించేందుకు అంగీకరించిన యాజమాన్యం.. వాటిని వెంటనే కాకుండా తొమ్మిదో వేతన సవరణ సంఘం ద్వారా వచ్చే వేతనాల్లో సర్దుబాటు చేసేందుకు కూడా సమ్మతించింది. సమ్మె కాలాన్ని కార్మికులకు ఉన్న సెలవులతో సర్దుబాటు చేసేందుకు కూడా అంగీకరించింది. అయితే ప్రత్యేక సెలవుగా పరిగణించడానికి నిరాకరించింది.  కాగా, మంగళవారం నుంచి  సింగరేణి కార్మికులు విధులకు హాజరవుతున్నారు.

తెలంగాణ లో తెరుచుకున్న బడులు

హైదరాబాద్,అక్టోబర్ 18:  సుమారు నెలరోజుల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం పాఠశాలలు, కళాశాలలు పునప్రారంభం అయ్యాయి. సకల జనుల సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు గత నెల 16వ తేదీ నుంచి బంద్ పాటించాయి. అయితే విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలు నడుపుతూనే ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించాయి. దాంతో నెలరోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు దూరంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు బడిబాట పట్టారు. 33 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న తర్వాత  సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు సోమవారం అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రితో జరిగిన చర్చల అనంతరం ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (టీజేఏసీ) ప్రకటించింది. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 17 దాకా టీచర్లు సమ్మెలో ఉన్న నేపథ్యంలో ఈ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు జేఏసీ నేతలు తెలిపారు. అయితే తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో పాటు సమ్మెను కొనసాగిస్తామని ఉన్నత విద్య జేఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ సమ్మెలో పాల్గొంటున్నారని ప్రభుత్వ కాలేజీల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం తెలిపింది.

Monday, October 17, 2011

ఆర్థిక- సామాజిక అంతరాలకు వ్యతిరేకంగా అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో వేలాది మంది ఆందోళనకారులు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం. ఈ సందర్భంగా పోలీసులు 88 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

తెలంగాణ జిల్లాల్లో బంద్

హైదరాబాద్ ,అక్టోబర్ 17:   రైలు రోకోలో నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు సోమవారం తెలంగాణ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా స్వచ్చంధంగా కొనసాగుతోంది. తెలంగాణలోని పది జిల్లాల్లో బస్సులు ఎక్కడికక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. బందుకు తెలంగాణ ఆటోల సంఘాలు కూడా మద్దతు పలకడంతో ఆటోలు కూడా రహదారులపై కనిపించలేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల్లో వ్యాపారులు అందరూ స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బందుకు మద్దతు తెలుపుతున్నారు. రాజధాని హైదరాబాదులో మాత్రం బస్సులు పాక్షికంగా తిరుగుతున్నాయి. పలుచోట్ల బస్సులు డిపోలు దాటి బయటకు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. లింగంపల్లి - నాంపల్లి రూట్లలో ఎంఎంటిఎస్ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బందు కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మనకే ఈ అలెర్జీ ...!

న్యూఢిల్లీ,అక్టోబర్ 17:  భారత్‌లో  అలెర్జీ సంబంధ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 20 నుంచి 30 శాతం మంది భారతీయులు ఏదో ఓ అలె ర్జీతో బాధపడుతున్నారు. పారిశ్రామికీకరణ పెరగడం, వేగంగా మారిపోతున్న జీవవైవిధ్యాలకు శ్రమరహిత జీవనశైలి కూడా తోడవుతుండటం వల్లే భారతీయుల్లో ముఖ్యంగా పిల్లల్లో అలెర్జీలు అధికమవుతున్నాయని వరల్డ్ అలెర్జీ ఆర్గనైజేషన్  వెల్లడించిమి. అలెర్జీల బారినపడుతున్న భారతీయుల్లో అత్యధికులు ఉబ్బసం, చర్మ సమస్యలు, ఆహారం, ఔషధా లు పడకపోవడం, నంజురోగం వంటి సమస్యలతో బాధపడుతున్నారని  సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. 1964తో పోల్చితే ప్రస్తుతం దేశంలో అలెర్జీలు 10 శాతం వేగంతో వ్యాప్తిచెందున్నాయని  సంస్థ తెలిపింది.  2050 నాటికి 50 శాతం మంది భారతీయ చిన్నారులు అలెర్జీల బారినపడే ప్రమాదముందని టోక్యోలోని డబ్ల్యూఏఓ అధ్యక్షురాలు, భారతీయ వైద్యురాలు  రూబీ పవాంకర్ వెల్లడించారు. పట్టణీకరణ, కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరగడం కూడా అలెర్జీలకు కారణమవుతున్నాయి. అయితే మనం పీల్చుకునే గాలే మన ఆరోగ్యాన్ని శాసిస్తోందని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యుడు హేమంత్ తివారీ అన్నారు. ఇళ్లలోకి స్వచ్ఛమైన గాలి ప్రవేశించేందుకు వీల్లేకుండా పోయినందునే అలెర్జీలు పెరుగుతున్నాయన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడం, పొగ తాగడం మానడం, అలెర్జీ కారకాల నిర్మూలన తదితర ప్రమాణాలు పాటిస్తే అలెర్జీలకు చెక్‌పెట్టవచ్చని ఆయా దేశాలకు డబ్ల్యూఏ. ఓ సూచించింది. 

Saturday, October 15, 2011

' బంద్ ' ల కోదండరాం...!

హైదరాబాద్,అక్టోబర్ 16: తెలంగాణ ఉద్యమంపై పోలీసుల వైఖరి, అరెస్టులకు నిరసనగా సోమవారం   తెలంగాణ బంద్‌కు రాజకీయ  జేఏసీ పిలుపు ఇచ్చింది. రైల్‌రోకోకూడా కొనసాగుతుందని  జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలిపారు. సకల జనుల సమ్మె ఆగబోదని,  తెలంగాణ వచ్చేదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.  సకల జనులసమ్మెలో భాగంగా ఉద్యమ రూపాలను మారుస్తున్నామని,   జేఏసీ సమావ్రశంలో  చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కోదండ రాం చెప్పారు.

రోడ్డెక్కిన ఆర్.టి.సి.బస్సులు

హైదరాబాద్,అక్టోబర్ 16: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె వాయిదా పడింది. ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం కుదరడంతో  బస్సులు యథాతథంగా తిరగుతున్నాయి.  ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో గడచిన 27 రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు.  సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమిస్తున్నామని ఎన్‌ఎంయూ కొద్దిరోజుల ముందే ప్రకటించినా కార్మికులు ఎక్కువమంది విధులకు హాజరు కాలేదు. దీంతో రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ   తెలంగాణ ఎన్‌ఎంయూ ఫోరం, ఆర్టీసీ తెలంగాణ జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, కార్మికుల మిగతా డిమాండ్లన్నిటినీ పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. సీమాంధ్ర, తెలంగాణ డిపోల్లో బస్సుల సంఖ్యలో ఉన్న వ్యత్యాసాన్ని సరిదిద్దాలని, బస్‌భవన్‌లోఇతర ప్రాంతాల ఉద్యోగుల నిష్పత్తిలో కూడా సమతుల్యత పాటించాలని కార్మిక సంఘాలు చేసిన డిమాం డ్‌కు రవాణా మంత్రి సానుకూలంగా స్పందించారు. మోటారు వాహన పన్ను మినహాయింపు తదితర డిమాండ్లను పరిశీలించేందుకు అంగీకరించిన మంత్రి సమ్మె విరమణతోనే ఇవన్నీ సాధ్యపడతాయని తేల్చిచెప్పారు. సమ్మెతో తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, సంస్థ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినందున సమ్మెను విరమించాలని బొత్స కోరారు.  చర్చలు సానుకూలంగా జరిగాయని వెల్లడించిన ఆర్టీసీ తెలంగాణ జేఏసీ నేతలు ఆ తరువాతటీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంతో  చర్చించి  సమ్మె వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. కోదండరాం ఈ సందర్భంగా  మీడియా తో మాట్లాడుతూ సమ్మెనుంచి ఆర్టీసీని మినహాయిస్తున్నట్లు తెలిపారు. 

లోకాయుక్త కోర్టులో లొంగిపోయిన యడ్యూరప్ప

బెంగళూరు,అక్టోబర్ 15: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లోకాయుక్త కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఈ నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భూ కేటాయింపులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్ప అరెస్ట్ కు ఈ ఉదయం లోకాయుక్త కోర్టు వారెంట్ జారీ చేసింది.   ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనే వచ్చి  కోర్టులో లొంగిపోయారు.

పొన్నం , జీవన్‌రెడ్డిలకు 14 రోజుల రిమాండ్

కరీంనగర్,అక్టోబర్ 15: కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మాజీ మంత్రి జీవన్‌రెడ్డిలకు జిల్లా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రైల్‌రోకో సందర్భంగా ఈ ఇద్దరు నాయకులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కాగా  ప్రభుత్వ వ్యవహారశైలిని కోదండరామ్ ఖండించారు.  తెలంగాణ మంత్రుల వైఖరిని గర్హిస్తున్నామన్నారు. తెలంగాణవాదులు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించలేదన్నారు. అరెస్ట్ లకు నిరసనగా సోమవారం తెలంగాణ బంద్ పాటించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.

రైల్ రోకోలో అరెస్ట్ ల పర్వం

హైదరాబాద్,అక్టోబర్ 15:  : తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న రైల్ రోకో సందర్భంగా పోలీసులు శనివారం అరెస్ట్ ల పర్వం సాగించారు.  రైల్ రోకోలో  పాల్గొంటున్న నేతలను పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రామగుండం విద్యుత్ నగర్ వద్ద ఎంపీ వివేక్, బాసర రైల్వేస్టేషన్ లో ఎమ్మెల్యే వేణుగోపాలచారి, మహబూబ్ నగర్ లో మాజీఎంపీ జితేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా రాంపూర్ లో విజయ రామారావు, ఆలూరు రమేష్, మెదక్ జిల్లా బూరుగుపల్లి వద్ద హరీశ్ రావు, కరీంనగర్ జిల్లాలో ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ మౌలాలీలో కవిత, సీతాఫల్ మండీలో కేటీఆర్, ఖాజీపేటలో ఎంపీ రాజయ్య తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఓదెలు, కావేటి సమ్మయ్య, నాయిని నర్సింహారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు. నల్గొండ జిల్లా భువనగిరిలో రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, కేశవరావులను పోలీసులు  అరెస్ట్ చేశారు. రైల్ రోకో సందర్భంగా తెలంగాణ జిల్లాల్లోని రైల్వేస్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు. పక్క జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు జంక్షన్లుగా ఉండే రైల్వే స్టేషన్లను పోలీసులు పహరా కాస్తున్నారు. కాగా పలు ప్రాంతాలకు పగటి పూట రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు.

Thursday, October 13, 2011

కెసిఆర్ పై విజయ ' అశాంతి '

హైదరాబాద్,అక్టోబర్ 13:   తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి విభేదిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయంలో కాంగ్రెసును కెసిఆర్ విశ్వసించడాన్ని ఆమె పరోక్షంగా తప్పు పడుతున్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందనే విశ్వాసం తనకు లేదని, అందరూ కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను, కెసిఆర్ మాత్రమే కాకుండా ఉద్యోగులు, తదితర వర్గాలు కూడా మాట్లాడుకుని తదుపరి కార్యక్రమాన్ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందనే నమ్మకమైతే తనకు లేదని  అన్నారు. తమను కాంగ్రెసు పార్టీవారు అవమానిస్తున్నారని, తన పార్టీని, తన అధ్యక్షుడిని కాంగ్రెసు పార్టీవారు అవమానిస్తుంటే రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె అన్నారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ పై తనకు గౌవరం ఉందని, ఆద్వానీ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె చెప్పారు. తాను బిజెపిలో ఉన్నానని, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశానని, తెరాసలోకి వచ్చానని, తాను జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడుతున్నానని,  ఇలా ఎన్నాళ్లు కాంగ్రెసును నమ్ముకుంటూ పోతామని ఆమె అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ దాటవేసే పనినే పెట్టుకుందని, తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసుకు లేదని ఆమె అన్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. డిజిపి దినేష్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. దమ్ముంటే తెలంగాణ ఇస్తారో, లేదో కాంగ్రెసు నాయకత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తనకైతే కాంగ్రెసు నాయకులు మోసం చేస్తారనే అనిపిస్తోందని విజయశాంతి అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ కోసం ఢిల్లీ వెళ్లారని, వారు అవమానిస్తుంటే మనం ఎందుకు వారితో మాట్లాడాలని ఆమె అన్నారు. 

సమ్మె విరమిస్తేనే ఉద్యోగ సంఘాలతోచర్చలు: ప్రభుత్వం

హైదరాబాద్,అక్టోబర్ 13:  తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమిస్తేనే  చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రితో సమావేశమయిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలు విధించిన మూడు డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటే ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె విరమణ ప్రకటన చేయాలని పేర్కొంది. 

బాన్సువాడ లో 77.62 శాతం పోలింగ్

నిజామాబాద్,అక్టోబర్ 13:  నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ స్థానానికి గురువారం నాడు  ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 77.62 శాతం పోలింగ్ నమోదయింది. ఈనెల 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

పోర్ట్ లాండ్ హార్వెస్ట్ త్రో మీట్‌లో భారత్ కు బంగారు పతకం

న్యూఢిల్లీ,అక్టోబర్ 13:  భారత డిస్కస్ త్రో క్రీడాకారిణి పునియా అమెరికాలోని పోర్ట్ లాండ్ లో  జరిగిన హార్వెస్ట్ త్రో మీట్‌లో బంగారు పతకం సాధించింది. అయితే 2012లో లండన్‌లో జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో ఆమె విఫలమయింది. ఒలింపిక్స్ అర్హత సాధించాలంటే 59.50 మీటర్ల మార్క్ ను అందుకోవాలి. కానీ ఆమె 59.39 మీటర్లు దూరానికి మాత్రమే దిస్కస్ విసిరింది. అమెరికాలో జరగనున్న మరో రెండు ఈవెంట్‌లలో గెలిచి ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని  పునియా విశ్వాసం వ్యక్తం చేసింది.

Monday, October 10, 2011

మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు మృతి

రాజమండ్రి, అక్టోబర్ 10:  రాష్ట్ర మాజీ మంత్రి   జక్కంపూడి రామ్మోహనరావు (58)  కన్నుమూశారు. జక్కంపూడి 2006 నుంచి ఎముకలకు సంబంధించిన ‘డయాబెటిక్ న్యూరోపతి’ వ్యాధితో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం స్వల్ప అనారోగ్యానికి గురైనప్పటికీ.. శనివారానికి కోలుకుని మామూలుగానే ఉన్నారు. ఆదివారం సాయంత్రం ధవళేశ్వరంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాల్సి ఉండగా.. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గదిలో నిద్రపోతున్న ఆయనను కుటుంబసభ్యులు మేల్కొలిపేందుకు ప్రయత్నిం చారు.ఆయన లేవకపోవడంతో కాసేపు ఆగి 3.50 గంటలకు మరోసారి నిద్రలేపే ప్రయత్నం చేశారు. శరీరం అచేతనంగా, చల్లగా ఉండడంతో ఆందోళన చెంది ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే తుదిశ్వాస విడిచినట్టు నిర్ధారించారు. జక్కంపూడి మృతికి సంతాపంగా సోమవారం రాజమండ్రిలోని వ్యాపారసంస్థలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు సెలవు ప్రకటించారు. జక్కంపూడి 1953 ఆగస్టు 6న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రులో జన్మించారు. తాటిపాకలో ప్రాథమిక విద్య, . 1970లో వీటీ జూనియర్ కాలేజి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నాటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1989లో కడియం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1999, 2004 సంవత్సరాల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతి పాత్రుడైన జక్కంపూడి 2004లో కేబినెట్ మంత్రిగా రోడ్డు, భవనాల శాఖ బాధ్యతలు స్వీకరించారు. 2007లో కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయనకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అప్పగించారు. దీనికి ఏడాది ముందు జక్కంపూడి కాస్త అనారోగ్యం పాలవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో వైద్యం చేయిం చారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తీసుకువెళ్లారు. అనంతరం బెంగళూరు, చెన్నైల్లో చికిత్స చేయించారు. అత్యున్నత వైద్యం చేయించినా ఆయన కొన్నేళ్లుగా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే స్థానానికి జక్కంపూడికి బదులు ఆయన భార్య విజయలక్ష్మి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.      

గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ మృతి

ముంబయ్,అక్టోబర్ 10:   ప్రముఖ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ (70)  కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతున్నారు. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగ్జీత్ సింగ్ సోమవారం ఉదయం 8గంటలకు మరణించారు. 1941 ఫిబ్రవరి 8న జన్మించిన ఆయన ఎన్నో మరపురాని మధుర గీతాలు, గజళ్లు పాడారు. జగ్జీత్ సింగ్ హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ , నేపాలీ భాషలలో పాడారు.  2003లో ఆయనను  కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. జగ్జీత్ సింగ్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖలు సంతాపం తెలిపారు. 

యథావిధిగా గ్రూపు-2 పరీక్షలు

హైదరాబాద్ .అక్టోబర్ 10:   గ్రూపు-2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈనెల 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.ఉద్యమ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న తెలంగాణ జేఏసీ విజ్ఞప్తిని సర్వీసు కమిషన్ తిరస్కరించింది. గ్రూపు-2 పరీక్షలకు సుమారు 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే దాదాపు 2 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.

పీఎస్‌ఎల్‌వీ- సీ 18 కౌంట్ డౌన్ ప్రారంభం

నెల్లూరు.అక్టోబర్ 10:  : శ్రీహరికోట నుంచి  పీఎస్‌ఎల్‌వీ- సీ 18  రాకెట్  ప్రయోగానికి సోమవారం ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్ 50 గంటల పాటు కొనసాఉతుంది. 12న  ఉదయం 11 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-18 ప్రయోగం జరపనున్నారు. ఈ ప్రయోగంలో ఇస్రో, ఫ్రెంచి అంతరిక్ష సంస్థ సంయుక్తంగా తయారు చేసిన మేఘా-ట్రోఫిక్స్ ఉపగ్రహంతో పాటు మరో మూడు చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 44.4 మీటర్లు పొడవు కలిగి 2.8 మీటర్లు వ్యాసార్థం కలిగిన పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహక నౌకను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఇందులో మొదటి దశలో ప్రపంచంలో వాడే అతి పెద్ద ఘన ఇంధన బూస్టర్లు సాయంతో ప్రయోగం ప్రారంభమవుతుంది. రెండోదశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగోదశలో ద్రవ ఇంధన సాయంతో వాహకనౌక పయనించి, ఉపగ్రహాలను రోదసీలోని నిర్ణీత కక్ష్యలలోకి ప్రవేశపెడుతుంది.

Friday, October 7, 2011

ముగ్గురు మహిళలకు నోబెల్ శాంతి

ఓస్లో,అక్టోబర్ 7:  2011 సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి  ముగ్గురు మహిళలు ఎంపికయ్యారు.  మహిళల హక్కులపై పోరాటం చేసిన లెబైరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్, లైబేరియా శాంతి ఉద్యమ కార్యకర్త లేమా, యెమెన్‌కు చెందిన తవక్కల్ కర్మాణ్‌లకు నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా ప్రకటించారు. అహింసా మార్గంలో మహిళ హక్కుల కోసం పోరాట చేసినందుకు వీరికి నోబెల్ శాంతి బహుమతిని ఇస్తున్నాట్టు  నార్వే నోబెల్ కమిటీ  తెలిపింది. ఆర్ధికశాస్త్రంలో హార్వర్డ్ నుంచి పట్టా పొందిన జాన్సన్ సర్లీఫ్ 2005 సంవత్సరంలో ప్రజాస్వామ్య బద్ధంగా తొలి ఆఫ్రికా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. లైబేరియా యుద్ధ నాయకులకు వ్యతిరేకంగా లేమా బోవీ పోరాటం సాగిస్తున్నారు. క్రిస్టియన్, ముస్లీ మహిళల సంఘాల ఆధ్వర్యంలో మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దులా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న తవక్కల్ కర్మాణ్ ఓ జర్నలిస్ట్. హ్యూమన్‌రైట్స్ గ్రూఫ్ ఫర్ జర్నలిస్ట్, ఇతర జర్నలిస్ట్ సంఘాలకు నేతృత్వం వహిస్తున్నారు.

వైభవంగా వేంకటేశ్వరుని చక్రస్నానం

తిరుమల.అక్టోబర్ 7:   కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలలో  చివరి ఘట్టం శుక్రవారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వరుని చక్రస్నానం వైభవంగా ముగిసింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, లక్షలాది మంది భక్తజన గోవిందన్మామ స్మరణల మధ్య అత్యంత వేడుకగా శ్రీవారి చక్రస్నానం సాగింది.  చక్రస్నానానికి ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  స్వామివారి ప్రధాన ఆలయం నుండి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా వరహా స్వామి ఆలయం వద్దకు చేర్చారు. సుదర్శన చక్రాన్ని స్వామివారి వెంట ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం వరాహాస్వామి పుష్కరిణి వద్ద వున్న నీటిలో సుదర్శన చక్రానికి పుణ్యస్నానం చేయించారు. ఈ దివ్య ముహూర్తం కోసం వేచివున్న భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ పుణ్యస్నానాల వలన సర్వరోగాలు, పాపాలు, రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. కాగా రాత్రికి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.  చక్రస్నానం వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. 

Thursday, October 6, 2011

వార్తాప్రపంచం వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు...

స్టీవ్ జాబ్స్ గురించి...

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: స్టీవ్ జాబ్స్ గా పేరొందిన  స్టీవెన్ పాల్ జాబ్స్ కంప్యూటర్. వినోదం పరిశ్రమలలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే  గొప్ప వ్యాపారవేత్తగా ఖ్యాతి గాంచారు. యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌ కు  సి.ఇ.ఒ. గా పనిచేశార్.  పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్‌కు కూడా కొద్దికాలం  సి.ఇ.ఒ. గా ఉన్నారు.  1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన కొద్ది రోజులకే ఆయనను పాల్ - క్లారా జాబ్స్ దంపతులు దత్తత తీసుకున్నారు. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ లాండ్ లో  రీడ్ కాలేజీలో చేరాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అయిన భారతదేశాన్ని సందర్శించడానికి అవసరమయిన డబ్బు కోసం ఒక వీడియో గేమ్స్ కంపెనీలో చేరాడు. కొన్నాళ్ళు అక్కడ పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత తన కాలేజ్ ఫ్రెండ్ అయిన డేనియల్‌తో కలసి భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత తిరిగి అదే కంపెనీలో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ తన చిరకాల మిత్రుడు అయిన స్టీవ్ వోజ్‌నైక్‌తో కలసి కంప్యూటర్ చిప్‌ల గురించి పనిచేసి కొత్త విషయాలు కనుగొన్నాడు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో  ఐ.పి.ఒ. వల్ల జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టిన  మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు. తాను ప్రారంభిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో నెక్స్ట్  అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు నెక్స్ట్  ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక  సి.ఇ.ఒ. గా గా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసాడు. ఆ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పనిలోనుండి తొలగించాడు. కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000లో పూర్తిస్థాయి  సి.ఇ.ఒ.  అయ్యాడు.
కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్ కు దక్కుతుంది. ఆపిల్ కంపెనీ  సి.ఇ.ఒ. గా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే సి.ఇ.ఒ. గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది.  2007 ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్థి విలువ 5.7 బిలియన్ డాలర్లు. 1986లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. ఈ కంపెనీ నిర్మించే చిత్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి, పంపిణీ చేయడానికి డిస్నీ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ వందల మిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్‌స్టర్స్.ఇన్‌క్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి. డిస్నీతో కాంట్రాక్టు పూర్తి అయిన తర్వాత యేర్పడిన మనస్పర్థలవల్ల పిక్సర్ మరో కాంట్రాక్టును వెతుక్కోవడం మొదలుపెట్టింది. అపుడు డిస్నీకి వచ్చిన కొత్త సి.ఇ.ఒ. గ పిక్సర్‌ను 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేసాడు. జాబ్స్ అందుకు ఒప్పుకొన్నాడు. అప్పటినుండి డిస్నీ-పిక్సర్ కలసి నిర్మిస్తున్న సినిమాల వ్యవహారాలు చూసే ఆరుగురు సభ్యుల కమిటీలో జాబ్స్ ఒకడుగా ఉంటున్నారు.

గడువులతో తేల్చలేం: అజాద్

న్యూఢిల్లీ, అక్టోబర్ 6:  తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించడం కుదరదని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ తేల్చిచెప్పారు. ‘‘ఇదొక చాలా ముఖ్యమైన సమస్య. నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఈ తరహా విషయాల్లో మనం నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించలేం’’ అని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఆజాద్ మీడియాతో మాట్లాడారు. సమ్మె విరమించడానికి జేఏసీ నాయకులు తెలంగాణపై కాలపరిమితితో కూడిన ప్రకటన కావాలంటున్నారు కదా.. అన్న ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక సభ్యుడు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరారు. ఇందుకు.. ‘‘ప్రణబ్‌దా మాట్లాడినదానిపైన నేను వివరణ ఇవ్వలేను. ఆయన ఏ సందర్భంలో ఆ మాటలన్నారో నాకు తెలీదు. అయితే నేను పదేపదే ఓ సంగతి చెబుతున్నా. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో మేం దాదాపు రెండు నెలలపాటు సంప్రదింపులు సాగించాం. ఆ దశ పూర్తయ్యింది. పండుగ సెలవులు ముగి సిన తర్వాత జాతీయ స్థాయిలో రెండోవిడత సంప్రదింపులు కొనసాగిస్తాం’’ అని ఆజాద్ వివరణ ఇచ్చారు. సంప్రదింపులు పూర్తి కాగానే నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అదీ పండుగ సీజన్‌లో వారికి కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాల్సిందిగా జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేశామని, అయితే తాము కోరినవిధంగా జరగలేదని చెప్పారు.

Wednesday, October 5, 2011

కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం

హైదరాబాద్,అక్టోబర్ 5:  మంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ బుధవారం  ఆమోదించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సిఫారసు మేరకు కోమటిరెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయకుంటే రాజీనామా చేస్తానన్న గడువు సెప్టెంబర్ 30 తో ముగియడంతో అక్టోబర్ 1 న  కోమటిరెడ్డి రాజీనామా చేసిన విషయం  తెలిసిందే.

ప్రకటన వచ్చేంత వరకు సమ్మె: కోదండరాం

హైదరాబాద్,అక్టోబర్ 5:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ సమ్మె కొనసాగుతుందని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. రావణ దహనానికి బదులు దశ కంఠ కాంగ్రెస్ కటౌట్లను దహనం చేయాలని అన్నారు.   సమ్మె ను భగ్నం చేసేందుకు  ప్రయత్నిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనల్ని ఉధృతం చేస్తామన్నారు. సమ్మె ఉధృతం చేయడానికి 7, 8 తేదిల్లో వ్యూహ రచన చేస్తామని ఆయన తెలిపారు. 9,10 తేదిల్లో రైల్‌రోకో యథాతథంగా ఉంటుందన్నారు. తెలంగాణపై కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యల్ని కోదండరామ్ ఖండించారు. 

సోమాలియా రాజధానిలో భారీ పేలుడు

మొగదిషు,అక్టోబర్ 5:  సోమాలియా రాజధాని మొగదిషులో భారీ పేలుడు సంభవించి కనీసం 65 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రభుత్వ భవనాల్లో బాంబు పేలింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఆల్ షబాబ్ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. పరీక్షలు రాయడానికి మంగళవారం విద్యార్థులు గుమిగూడిన సమయంలో నాలుగు ప్రభుత్వ మంత్రిత్వ శాఖల గృహ సముదాయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడులో మరణించినవారి 65 మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 50 మంది దాకా గాయపడ్డారు.  తమ లక్ష్యం మంత్రులేనని ఆల్ షబాబ్ చెప్పింది. 

చంద్రబాబు తటస్థవాదం...!

హైదరాబాద్,అక్టోబర్ 5:  రాష్ట్రంలో అస్థిరత్వానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని, సమస్యకు పరిష్కారం చూపాల్సిన వ్యక్తులు చేష్టలుడిగి చోద్యం చూస్తుండటం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్ర విభజన విషయంలో తాము  తటస్థంగా ఉంటామని,  సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై  ఉందని,. ఆయా ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇరు ప్రాంతాల నేతలకు చెప్పానని ఆయన అన్నారు.  ''ప్రతిపక్ష పార్టీగా మహానాడులో మా వైఖరి స్పష్టం చేశాం. ఈ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. టీడీపీని దెబ్బతీయడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం శ్రీ కృష్ణ కమిటీని నియమించిన కేంద్రం.. ఆ కమిటీ నివేదిక అందాక ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్లే రాష్ట్రంలో రైతులు విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘45 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చారు. ముందే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రయత్నాలు ఏమీ జరిగినట్టు కనిపించడం లేదు.  ‘‘ప్రజల ఇబ్బందులకు కేసీఆర్, కోదండరాంలదే బాధ్యత అని సీఎం అనడం వేరే విషయం. ముందు బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఏమీ చేసిందో చెప్పాలి’’ అని నిలదీశారు. ‘‘సకల జనుల సమ్మెలో భాగంగా సామాన్య ప్రజానీకం ప్రయాణిస్తున్న బస్సులపై దాడులు చేయడం సరికాదు. ప్రజలేం నేరం చేశారు. ఈ దాడులను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది’’ అని పేర్కొన్నారు. 

తెలంగాణాకు పరిష్కారం అంత తేలిక కాదు:ప్రణబ్

కోల్‌కతా,అక్టోబర్ 5:  తెలంగాణ సమస్య సున్నితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. 50 ఏళ్ల నుంచి తెలంగాణ డిమాండ్ ఉందని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమస్యను నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించడం కష్టమని ఆయన చెప్పారు. పత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో మరిన్ని కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్‌లు వచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇంకా చర్చ జరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూస్తామని ప్రణబ్ అన్నారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ భవిష్యత్ నాయకుడు అని ప్రణబ్ ముఖర్జీ తేల్చి చెప్పారు. ‘కాంగ్రెస్‌కు ఎప్పుడూ కొత్త నాయకత్వం ఉంటుంది. రాహుల్ మా భవిష్యత్ నేత కానున్నారు’ అని ఆయన అన్నారు.

Tuesday, October 4, 2011

'వార్తాప్రపంచం ' వీక్షకులకు 'దుర్గాష్టమి'' శుభాకాంక్షలు...

వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

స్టాక్‌హోం(స్వీడన్), అక్టోబర్ 4:  వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు. రోగనిరోధక వ్యవస్థపై విశేష పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు బ్రూస్ బ్యూట్లర్ (అమెరికా), జూల్స్ హాఫ్‌మాన్ (లక్సెంబర్గ్), రాల్ఫ్ స్టైన్‌మాన్ (కెనడా) లను ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ బహుమతికి ఎంపికచేసినట్లు సోమవారం అవార్డు న్యాయనిర్ణేతల కమిటీ ప్రకటించింది. వీరిలో  కేన్సర్‌తో బాధపడుతున్న స్టైన్‌మాన్ మూడురోజుల క్రితమే చనిపోయారు. కేన్సర్, తదితర ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగేలా, రోగనిరోధక వ్యవ స్థకు సంబంధించిన కీలక ప్రక్రియలను వీరు కనుగొన్నారని జ్యూరీ ప్రశంసించింది. వీరి పరిశోధన ఫలితాల వల్ల కేన్సర్, అస్తమా, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, క్రోన్స్ తదితర వ్యాధులకు కొత్త చికిత్సలు, మందులు కనుగొనే అవకాశమేర్పడినట్లు పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థను చైతన్యపర్చే కీలక గ్రాహక ప్రొటీన్‌లను బ్యూట్లర్( 55), హఫ్‌మాన్(70) కనుగొన్నారని జ్యూరీ తెలిపింది. వీరిద్దరూ ఇటీవల హాంగ్‌కాంగ్‌లో ప్రసిద్ధ షా ప్రైజ్‌ను కూడా స్వీకరించారు. శరీరంలోకి ప్రవేశించే హానికారక క్రిములను రోగనిరోధక వ్యవస్థ గుర్తించి, హతమార్చేందుకు దోహదపడే డెండ్రైటిక్ కణాలను స్టైన్‌మాన్ కనుగొన్నారని పేర్కొంది.  నోబెల్ బహుమతి కింద ఇచ్చే నగదు మొత్తం కోటి స్వీడిష్ క్రోనార్లు( రూ.8.40 కోట్లు) కాగా అందులో బూట్లర్, హాఫ్‌మన్‌లకు సగం, స్టైన్‌మాన్‌కు సగం అందజేయనున్నట్లు జ్యూరీ ప్రకటించింది. అయితే స్టైన్‌మాన్ చనిపోయినందున ఆయనకు బహుమతి నగదు అంశంపై జ్యూరీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నోబెల్ అవార్డు వ్యవస్థాపకులు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోంలో వచ్చే డిసెంబరు 10న జరిగే కార్యక్రమంలో విజేతలకు అవార్డు ప్రదానం చేస్తారు. 

పండగ పూట ఉస్సురంటున్న పెన్షనర్లు...

హైదరాబాద్, అక్టోబర్ 4:  రిటైర్డ్  ఉద్యోగులపై సకల జనుల సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారి  జీవనాధారమైన పెన్షన్ చెల్లింపులు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. హైదరాబాద్ మినహా తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో పెన్షన్ చెల్లింపులు జరగకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు పండుగపూట ఉస్సురనే పరిస్థితి నెలకొంది.  తెలంగాణ వ్యాప్తంగా 2.5 లక్షల మంది పెన్షనర్లు ఉండగా, వారిలో హైదరాబాద్‌కు చెందిన లక్షమందికే చెల్లింపులు జరిగాయి. పెన్షన్ చెల్లింపుల కోసం జిల్లా కార్యాలయాల్లో బిల్లులు తయారుచేసే పనిలేకపోయినా ట్రెజరీ ఆఫీసుల్లో వాటిని పాస్‌చేసే సిబ్బంది లేకపోవడమే ఇందుకు కారణం. జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లోని సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో పాటు అక్కడక్కడా పనిచేస్తున్న వారిని కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా ఉద్యోగులకు జీతాల కింద ఇవ్వాల్సిన రూ. 800 కోట్ల చెల్లింపులు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. . 

ఆర్టీసీ ఇక ప్రైవేట్ పరం...?

 హైదరాబాద్, అక్టోబర్ 4:  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ని  ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక నష్టాలు, ఆందోళనలతో సతమతమవుతున్న ఆర్టీసీని ఇక గట్టెక్కించడం కష్టమని భావిస్తున్న సర్కారు, 40 శాతం వాటాను ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఒకవేళ ప్రైవేటీకరణపట్ల అభ్యంతరం వెల్లువెత్తిన పక్షంలో ఇతర రాష్ట్రాల తరహాలో ప్రాంతాల వారీగా ఆర్టీసీని ఐదు ముక్కలు (ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, మధ్య) గా విడగొట్టాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఈ అంశాలతోపాటు కొన్ని రూట్లను ప్రైవేట్ పరం (పీపీపీ) చేయాలనే అంశాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తోంది. సకల జనుల సమ్మె నేపథ్యంలో గడిచిన రెండు వారాలుగా తెలంగాణలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 210 డిపోలు, 24,000 బస్సులు ఉన్న ఆర్టీసీ ఇప్పటికే పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా సకల జనుల సమ్మె కారణంగా ఇప్పటివరకు రూ.106 కోట్ల న ష్టం వాటిల్లింది. రోజులు గడుస్తున్నా సమ్మె విరమణకు కార్మికులు ససేమిరా అనడంతో దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ కనీసం వెయ్యి బస్సులనైనా రోడ్డు మీదకు తేలేకపోయింది. రాష్ట్రంలో రోడ్డు రవాణా వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లుగా సీఎం నిర్ణయానికి వచ్చారు. దీంతో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆర్టీసీని కొంతైనా ప్రైవేటీకరిస్తేనే మేలనే అభిప్రాయానికి వచ్చిన ట్లు తెలిసింది. 

తమిళనాడుకూ సకల జనుల సమ్మె సెగ

చెన్నై,అక్టోబర్ 4:   తెలంగాణ లో జరుగుతున్న సకల జనుల సమ్మె సెగ తమిళనాడుకు తాకింది. తెలంగాణ నుంచి బొగ్గు, కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అక్కడ విద్యుత్ సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికే నగరాల్లో గంటపాటు కరెంటు కోత విధిస్తున్నారు. మరిన్ని కోతలు విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో సింగరేణి కార్మికుల సమ్మెతో తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌కు బొగ్గు సరఫరా కావడం లేదు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. రామగుండంలోని ఎన్‌టీపీసీ కేంద్రం నుంచి 1100 మెగా వాట్ల విద్యుత్ తమిళనాడుకు సరఫరా అయ్యేది. సమ్మె నేపథ్యంలో రామగుండం విద్యుత్ కేంద్రానికీ బొగ్గు సరఫరా నిలిచిపోయింది. అక్కడ ఉత్పత్తి తగ్గిపోవడంతో తమిళనాడుకు అందే విద్యుత్ సగానికి సగం తగ్గిపోయింది. మరోవైపు, తెలంగాణ సమ్మె కారణంగా చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోయాయి. ప్రైవేట్ బస్సులు ఉన్నా వాటిలో వెళ్లేందుకు ప్రయాణికులు ఇష్టపడడం లేదు. సకల జనుల సమ్మె కారణంగా హైదరాబాద్‌కు వెళ్లినా రోడ్లపై తిరిగే వీలుండదని భావిస్తున్నారు.

Monday, October 3, 2011

తిరుమల గరుడోత్సవంలో డప్పేసిన బాపిరాజు

తిరుపతి,సెప్టెంబర్ 3:  తిరుమల బ్రహ్మోత్సవాలలో ప్రధానమైన గరుడోత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది.    పూల దండలతో అద్భుతంగా అలంకరించిన గరుడ వాహనంపై స్వామివారిని  మాడ వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, అధికారులు నృత్యాలు చేశారు.  బాపిరాజు స్టెప్పులు వేయడంతోపాటు డప్పు కూడా మోగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.  

ప్రధాని హామీ ఇవ్వలేదు-సమ్మె ఆగదు : కె.సి.ఆర్.

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 3:  తెలంగాణపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. ప్రధానిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మెను  ఆపడం జరగదని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వమే సత్వర నిర్ణయం తీసుకొని సమస్యని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాని ప్రధానిని కోరామన్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని మాత్రమే ప్రధాని చెప్పారని, ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయిన య్యారు. కేసీఆర్ వెంట తెలంగాణ జేఏసీ నేతలు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, ఉద్యమ తీరును, సకల జనుల సమ్మెను ప్రధాని దృష్టికి తీసుకువచ్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

దుర్గమ్మకు సరస్వతీ అలంకారం

హైదరాబాద్,అక్టోబర్ 3:   దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సోమవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం   కావడంతో  అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది.   
బాసరలో బారీగా అక్షరాభ్యాసాలు 
ఆదిలాబాద్ జిల్లాలోని  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కూడా  సోమవారం  అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం  కావడంతో సర్వసతీదేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.  వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మూలా నక్షత్రం రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్త్తే చదువు బాగా అబ్బుతుందని భక్తుల విశ్వాసం. 
కాగా తిరుమల బ్రహ్మోత్సవాలలో సోమవారం నాడు ఉదయం స్వామి వారు మోహినీ రూపంలో భక్తులకు పారవశ్యం కలిగించారు.



ముందు రాజీనామాలు...తర్వాత తెగదెంపులు...

 భవిష్యత్తు కార్యాచరణ పై టి.కాంగ్రెస్ తర్జనభర్జన
హైదరాబాద్,అక్టోబర్ 3:   ఢిల్లీలో మకాం వేసి, అధిష్టానం పెద్దలను కలిసినా ఏ మాత్రం ఫలితం లభించకపోవడంతో కాంగ్రెసు తెలంగాణ ప్రజా ప్రతినిధులు భవిష్యత్తు కార్యాచరణ పై తర్జనభర్జనలు పడుతున్నారు. పార్టీ  ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ నివేదిక సమర్పించినప్పటికీ తెలంగాణపై అధిష్టానం తేల్చే పరిస్థితి లేకపోవడంతో  మొదట మంత్రి పదవులకు, శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేయాలని  భావిస్తున్నట్లు సమాచారం. అయితే,  ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసిన తర్వాత ప్రధాని స్పందనను బట్టి  కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నారుట.  నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయడంతో  తాము కూడా అదే బాట పట్టాలని వారు అనుకుంటున్నట్లు సమాచారం. తొలుత స్టీరింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న జానా రెడ్డి మంత్రి పదవికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, శాసనసభ్యులు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముందు జూపల్లి కృష్ణా రావు మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే....

‘రామ్ ధున్’ ఆలపించిన ప్రతిభాపాటిల్

జెనీవా ,అక్టోబర్ 3:   మహాత్ముని స్మృతి గీతాన్ని ముద్దుగా ఆలపించిన ప్రవాస చిన్నారులతో రాహ్ట్రపతి ప్రతిభాపాటిల్ శృతి కలిపారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ప్రతిభాపాటిల్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జెనీవా నగరంలోని ట్రాంక్విల్ ఏరియానా పార్కులో గల ‘శాంతి స్థలి’ లో మహాత్ముని విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన చిన్నారులతో కలిసి గాంధీకి ఇష్టమైన హిందీ గీతం ‘రామ్ ధున్’ ఆలపించారు. అనంతరం సాంప్రదాయరీతిలో పరిక్రమపాటించారు. తదుపరి చిన్నారులతో కాసేపు ముచ్చట్లాడారు.  భారత్- స్విస్ సంబంధాలకు 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 1997లో ఇక్కడ గాంధీ మహాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

తడిసి మోపెడవుతున్న పోలీసు బందోబస్తు ఖర్చు

హైదరాబాద్,,అక్టోబర్ 3:   రాష్ట్రంలో  ఉద్యమాల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఖర్చు తడిసి మోపెడవుతోంది. రాష్ట్ర పోలీసులనే కాకుండా కేంద్ర బలగాలను కూడా రప్పించి ఉద్యమాలు, ఆందోళనలకు బందోబస్తు కల్పిస్తున్నారు.  ఈ విధుల్లో పాల్గొంటున్న కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులకు ట్రావెలింగ్ అలవెన్స్, బత్తా, డ్యూటీ అలవెన్స్ తో పాటు వసతి, భోజన సౌకర్యం కోసం అదనంగా రూ.84 కోట్లు మంజూరు చేయాలని పోలీసు శాఖ కోరింది. ఆర్థిక శాఖ మాత్రం రూ.33 కోట్లే ఇచ్చింది. దీంతో మిగతా మొత్తాన్ని కూడా ఇవ్వాలని హోం శాఖ కోరుతోంది.

రెండు నెలల తర్వాత బయటకొచ్చిన సోనియా

న్యూఢిల్లీ,అక్టోబర్ 3: : కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ దాదాపు రెండు నెలల విరామం తర్వాత తొలిసారిగా బయటి ప్రపంచానికి కనిపించారు. జాతిపిత మహాత్మాగాంధీ 142వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన సమాధి రాజ్‌ఘాట్ వద్ద నిర్వహించిన ప్రార్థనకు ఆమె హాజరయ్యారు. సోనియా అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి. రాజ్‌ఘాట్ వద్ద ఆమె దాదాపు 20 నిమిషాలు గడిపారు. గులాబీ రేకులతో జాతిపిత సమాధి వద్ద పుష్పాంజలి అర్పించారు. తర్వాత కాసేపు కూర్చుని భజనలు విన్నారు.ఏ విధమైన అసౌకర్యాన్నీ ప్రదర్శించలేదు.  తర్వాత సోనియా పార్లమెంటు భవనంలో మరో బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అద్వానీ, మన్మోహన్, లోక్‌సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భం గా అద్వాని, సుష్మా సోనియాను  పలకరించారు. 

Saturday, October 1, 2011

ఇంకా టైం పడుద్ది..తెలంగాణాపై ఢిల్లీ మాట...

న్యూఢిల్లీ,అక్టోబర్ 2: తెలంగాణ సమస్యపై శనివారం వరుసగా రెండో రోజూ కూడా కాంగ్రెస్ సీనియర్లు  తీవ్రస్థాయిలో తర్జనభర్జన పడ్డారు. సామరస్యపూర్వక పరిష్కారానికి ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలపై మల్లగుల్లాలు పడ్డారు. కానీ ఎప్పట్లాగే ఓ నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. పలు వర్గాలతో మరిన్ని సంప్రదింపులు అవసరమని, కసరత్తు పూర్తవడానికి ‘కొంత సమయం’ పడుతుందని భేటీ అనంతరం ప్రణబ్ ప్రకటించగా, ఇప్పటిదాకా సాధించిన పురోగతి ఇదేనని ఆజాద్ అన్నారు. పరిస్థితి తీవ్రత గురించి తనకు తెలుసంటూ ప్రణబ్ ముక్తాయిస్తే, పరిష్కారం అంత తేలికేమీ కాదంటూ ఆజాద్ కుండబద్దలు కొట్టారు.తెలుగు మీడియాపై ఆజాద్ అసంతృప్తి వెలిబుచ్చారు. ‘‘ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఎవరికి తోచినట్టు వారు కథనాలిస్తున్నారు. కొన్ని చానళ్లలో వచ్చినట్టుగా తానెలాంటి ప్రతిపాదనలూ చేయలేదని’ అన్నారు. కాగా, కాంగ్రెస్ కోర్ కమిటీ ముఖ్యులంతా  ఆదివారం తలో చోటికి పయనమవుతున్నారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రణబ్ కోల్‌కతా వెళ్తున్నారు. 6, 7 తేదీల్లో ఆయన తిరిగి వస్తారని సమాచారం. ఆంటోనీ సోమవారం ఉదయయం మూడు రోజులపాటు రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఆదివారం ఆజాద్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉంది. ఈ సందర్భంగా సీఎం కిరణ్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర పరిస్థితిని సమీక్షిస్తారని, తదుపరి చర్యలపై సూచనలిస్తారని భావిస్తున్నారు.

నాగం గ్యాంగ్ హల్చల్

హైదరాబాద్,అక్టోబర్ 2:  తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు నాగం జనార్దన రెడ్డి, వేణుగోపాల చారి, హరీశ్వర రెడ్డి, జోగు రామన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ రాజీనామాలు ఆమోదించేవరకు కదిలేది లేదని వారు డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో తలుపులు గడియ పెట్టుకుని బైఠాయించిన  వారిని పోలీసులు శనివారం రాత్రి 11 గంటల తరువాత అరెస్ట్ చేశారు. పోలీసులు ఆ గది తలుపులు పగులగొట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని వదిలిపెట్టాలని కొందరు న్యాయవాదులు, తెలంగాణవాదులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఆ తరువాత టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వారి వారి ఇళ్లకు తరలించారు.

మంత్రి కోమటిరెడ్డి రాజీనామా

హైదరాబాద్,అక్టోబర్ 2:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. సంప్రదింపుల పేరుతో ఇన్నాళ్లుగా నాన్చిన కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరులకు నిరసనగా.. పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వేలాది మంది నాయకులు, అనుచరులతో కలిసి వచ్చిన కోమటిరెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. తెలంగాణ సాధన కోసమే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని, వెంటనే ఆమోదించాలని రాజీనామా పత్రంలో కోరారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ వద్దకు వచ్చి శాసనసభ కార్యదర్శి ఎస్.రాజసదారాంను కలిసి శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రూపొందించిన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. కోమటిరెడ్డితోపాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.  సెప్టెంబర్ నెలాఖరులోపు తెలంగాణపై తేల్చకుంటే తన పదవులకు రాజీనామా చేస్తానని మూడు నెలల కిందటే ప్రకటించానని.. ఆ మాటకు కట్టుబడే రాజీనామా చేశానని కోమటిరెడ్డి చెప్పారు. 
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం అన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చిన బెజవాడ కనకదుర్గ... 

తిరుమల బ్రహ్మోత్సవాలలో శనివారం ఉదయం సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు... జంతువులకు రాజైన సింహం సైతం తానేనని, మనుషులు తమలోని జంతు ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామి ఈ రూపంలో చాటుతారు.

అరసవల్లిలో అద్భుతం

 శ్రీకాకుళం,అక్టోబర్ 1:  శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అనివారం  ఉదయం సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ ను తాకాయి. భానుని కిరణాలు స్వామివారి పాదాలపై పడటంతో ఈ అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తులు పరవశించారు. అరుదుగా సంభవించే ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  ప్రతి ఏడాది మార్చి, అక్టోబర్ నెలల్లో సూర్య కిరణాలు మూలవిరాట్ ను తాకుతాయి. అయితే ఈసారి మాత్రం రెండేళ్ల తర్వాత ఈ అద్భుతం చోటుచేసుకుంది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...